Saturday, December 30, 2023

 Atomic habits

జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హేబిట్స్ 

అటామిక్ అంటే తనలో ఒక మహాశక్తిని కలిగినది అని, ఇక విభజించ వీలులేని అతి సూక్ష్మ కణం అని, హేబిట్ అంటే క్రమం తప్పని ఆచరణ.

రచయితకి స్కూల్లో బేస్ బాల్ ఆడేటప్పుడు బ్యాట్ తగిలి ముఖానికి కన్నుపోయేంత దెబ్బ తగులుతుంది.  పాపం చాలారోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది.  రికవరీలో భాగంగా తీసుకున్న విశ్రాంతి, పాటించవలసిన నియమాలు అతనికి క్రమబద్ధమైన అలవాట్ల విశిష్టతని ప్రబోధిస్తాయి.  ఫలితంగా క్రమం తప్పక చేసే ప్రతి చిన్న పనీ అలవాటుగా మారినప్పుడు మన జీవితం మన నియంత్రణలో ఉంటుందన్న వాస్తవం అవగతమవుతుంది.  ఒకసారి అలవాటు చేసుకున్నది మన నిశ్చయంతో నిమిత్తం లేకుండానే చేసుకుంటూ పోతామని తెలుసుకుని ఉపయుక్తమనిపించిన అలవాట్ల సమాహారాన్ని తయారుచేసుకుని ఆచరణలో పెట్టటం ద్వారా ప్రమాదం జరిగిన ఆరేళ్ళకి శక్తిమంతుడైన ఉత్తమ బేస్ బాల్ ప్లేయరుగా పేరు తెచ్చుకుంటాడు.  

***

  1. చిరు అలవాట్ల పెను ప్రభావం

సుమారు నూరేళ్ళ పాటు బ్రిటిష్ సైక్లింగ్ టీము సాదా సీదా మొక్కుబడి ప్రదర్శనకి ఉదాహరణ అయి ప్రతి పోటీకీ వెళ్ళడం పరాజయం పాలవడమే సాంప్రదాయంగా చేసుకుంది.  1908 నించి అంతవరకు ఒలింపిక్స్ లో వారికి ఒకే ఒక బంగారు పతకం లభించింది.  ఫ్రాన్స్ నిర్వహించే ప్రతిష్టాత్మకమైన టూర్ డి ఫ్రాన్స్ లో ఇంకా అవమానకరమైన ప్రదర్శనలిచ్చింది.  

రెండువేల మూడులో కొత్త పెర్ఫార్మెన్స్ డైరెటరుగా డేవ్ బ్రెయిల్స్ ఫోర్డ్ నియామకం జరిగింది.  చిరు మెరుగుల సమాహారం-  the aggregation of marginal gains  అన్నది అతని ప్రాతిపదిక.  దాని ప్రకారం సైక్లింగ్ అనే సాముదాయిక ప్రక్రియని వీలైనన్ని చిన్న ముక్కలుగా విడకొట్టి ప్రతిముక్కనూ కనీసం ఒక శాతం మెరుగుపరచడం.  ఫలితంగా సీకిళ్ళ సీటు డిజైన్ మార్చేరు.  టైర్లకి గ్రిప్ కోసం ఆల్కహాలు పూసేరు.  విమానం ఇంజన్లు టెస్టు చేసే వాయు సొరంగం - విండ్ టనెల్ లో రైడింగ్ ప్రాక్టీసు చేసి ఏ రకం బట్ట అయితే వాయు నిరోధాన్ని తగ్గిస్తుందో దానితో సిక్లిష్టుల డ్రస్సు తయారుచేసేరు.  దెబ్బల నించి త్వరితంగా కోలుకునే మసాజ్ బాం లు తయారుచేసేరు.  ఇటువంటి వందలాది సూక్ష్మాంశాలను గుర్తించి ప్రతిదాన్నీ మెరుగుపరిచేరు.   బ్రెయిల్స్‌ఫోర్డ్ చార్జి తీసుకున్న అయిదేళ్ళకి 2008 లో బీజింగ్ ఒలింపిక్స్ లో అరవై శాతం బంగారు పతకాలు బ్రిటిష్ టీం చేజిక్కించుకుంది.  తరవాత లండన్ ఒల్యంపిక్స్ లో కొత్త రికార్డులనూ ప్రమాణాలనూ నెలకొల్పారు.  టూర్ డి ఫ్రాన్స్ సహా ఎన్నో విజయాలతో సైక్లింగ్ ట్రాక్ కింగ్స్ గా నిలిచారు. 

బరువు తగ్గడం, వ్యాపారం వృద్ధి, పుస్తక రచన ఇలా మన ముందున్న లక్ష్యం ఏదైనా, అది సాధించడం అనే పెద్ద లక్ష్యానికి ప్రాముఖ్యమిచ్చి అందుకు అవసరమయే వేలాది చిన్న అంశాలు విస్మరిస్తాం.  ఫలితంగా పెద్ద లక్ష్యం చేదించాలనే గురుతర బాధ్యత మనమీద పడి తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది.  దానితో పోలిస్తే ఒక్క శాతం మాత్రమే మెరుగు పడటం అనేది అత్యంత అప్రధానమైన లక్ష్యంగా తోస్తుంది.  కాని వాస్తవానికి, మెరుగుపడ్డ అతి సూక్ష్మాంశాలు దీర్ఘకాలంలో ఇచ్చే ప్రయోజనం అపరిమితం.  రోజుకి ఒక శాతం చొప్పున మెరుగుపరిస్తే సంవత్సరాంతానికి మన  ప్రతిభ రెండింతలూ నాలుగింతలూ కాదు ముప్ఫై యేడింతలవుతుంది.   మన ప్రస్తుత స్థితి ఏమిటన్నది ప్రశ్న కాదు.  మనం మెరుగు పరుచుకునేది లక్ష్యం దిశగా ఉన్నదా లేదా అనే.   మెరుగుకీ తరుగుకీ కూడా ఇదే లెక్క.

అలవాట్లలోని అతి సూక్ష్మ మార్పుల ప్రభావం రోజూ గుర్తించలేం కూడా.  కానీ దీర్ఘకాలం కొనసాగిన అనంతరం ఒకానొక శుభ ముహూర్తాన బ్రేకింగ్ పోయింట్ అనే ముఖ్య పరిణామం కనిపిస్తుంది.  ఉదాహరణగా మంచుగడ్డ కరిగే ప్రక్రియ చూడండి.  సున్నా డిగ్రీల దగ్గర అది రాయిలా ఉంటుంది.  వేడి ఒక డిగ్రీ పెంచండి.  మంచు అలాగే ఉంటుంది. ఇంకో డిగ్రీ.  అంతే.  మరో డిగ్రీ.  ఊహూ.   ఇలా ఇరవై నాలుగు, ఇరవై అయిదు. ఏ మార్పూ కానరాదు.  ఇరవై ఆరు.  దాన్ని పెట్టిన స్టూలు కిందకి నీళ్ళు కారడం చూస్తాం.  ఇరవై ఆరో డిగ్రీలో బ్రేక్ థ్రూ వచ్చిందని అనిపిస్తుంది. కాని అంతకు ముందటి ప్రతి ఒక్క డిగ్రీ దాని ప్రస్తుత పరిణామానికి దోహదం చేసినవే. 

సడెన్‌గా అనుభవైకవేద్యమైన అన్ని ప్రక్రియలూ ఇంతే.  కాన్సర్ తన ప్రస్థానంలో మొదటి ఎనభై శాతం గుర్తించ వీల్లేనంత సామాన్యంగా కొనసాగి ఒక్కసారిగా ప్రాణాంతకమవుతుంది.  వెదురు మొక్క మొదటి అయిదు సంవత్సరాలూ పైకి మాత్రం ఎదుగూ బొదుగూ లేనట్టు అనిపిస్తూ వేళ్ళని మాత్రం పెంచుకుంటూ పోయి ఆరో యేటినించి క్షణ క్షణాభివృద్ధిని ప్రదర్శిస్తుంది.  క్రిటికల్ థ్రెషోల్డ్ అని చెప్పబడే ఒకానొక పుణ్యకాలం వచ్చేవరకు మన ప్రతి చిరు అలవాటు ప్రభావమూ ఇంతే.  ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనిపిస్తుంది.  నిరాశ పడకూడదు.  సుప్రతిష్టిత దీర్ఘకాలిక ఫలితాలకు నిరీక్షణ అత్యావశ్యకం.  

ఇందువల్లనే చిరకాలం కొనసాగే అలవాట్లు చేసుకొనడం కష్టం.  ఒక వారం రెండు వారాలు చూచి ఏ ప్రభావమూ కానక అబ్బే ఇది వేస్టు అని విరమించుకుంటాం.  ఒక వాంఛనీయ అలవాటు చేసుకోవడం లేదా అవాంఛనీయమైనదాన్ని వదులుకోవడం వల్ల ఏ ప్రయోజనమూ కనిపించనప్పుడు అదంతా వృధా ప్రయాసేమో, మనం సమర్ధులం కామేమో అనుకోకూడదు.  మన ప్రయత్నం వ్యర్ధ పడటం లేదు.  భద్రపడుతోంది.  ఇరవై ఆరో డిగ్రీకో ముప్ఫైయ్యో డిగ్రీకో దాని ప్రభావం ఆవిష్కృతమవుతుంది.  ఇతరులు మీది సడన్ ఓవర్ నైట్ సక్సెస్ - ఆకస్మిక అర్ధరాత్రి విజయం అనుకుంటారు.   మీలో వారు చూసిన పరివర్తన భూకంప తుల్యమైనది.  భూగర్భంలో టెక్టోనిక్ ప్లేట్లు వందల యేళ్ళుగా ఒకదానితో ఒకటి ఘర్షణపడుతుంటాయి.  క్రమక్రమంగా కూడిన ఒత్తిడి ఒకనాటికి తన విశ్వరూపాన్ని బహిర్గతపరుస్తుంది. 

కార్యసిద్ధికి ఓరిమి అవసరం.  ఒక ప్రముఖ కోచ్ నైరాశ్యం ఆవరించినప్పుడల్లా రాళ్ళ గనికి పోయి అక్కడి శ్రామికులు శిలను భేదించే క్రమాన్ని చూస్తాడు.  వజ్రసమానమైన పణుకు రాయిని పనివాడు సమ్మెటతో మోదుతుంటాడు.  సమ్మెట దెబ్బలు పది ఇరవై వంద ... అదో వట్టి నిరుపయోగ ప్రయాస అనిపుస్తుంది.  ఉన్నట్టుండి పాషాణం రెండు ముక్కలవుతుంది.  చూసేవాళ్ళకి ఆఖరి దెబ్బ గట్టిగా పడి పని సాధించిందనిపిస్తుంది కాని అంత క్రితపు ప్రతి దెబ్బా తనవంతుగా రాతిని కొద్ది కొద్దిగా బలహీనపరుస్తూ దాని విఛ్ఛిత్తికి కారణమయేయన్నది సత్యం.

మన అనుభవంలోని పెనుమార్పులన్నీ ఇంతే.  ఎప్పటినించో ఆ దిశగా వస్తూ ఒకనాటికి బహిర్గతమవుతాయి. 

  1. లక్ష్యాన్ని మరిచిపోండి; వ్యవస్థని స్థాపించండి.

అంటాడు ప్రముఖ కార్టూన్ కేరక్టర్ దిల్బర్ట్ సృష్టికర్త స్కాట్ ఏడమ్స్.  లక్ష్యం సాధ్యం - గోల్; అందుకైన రోజువారీ సాధన వ్యవస్థ.  సిస్టమ్.  forget about goals, focus on systems instead .  మీరో కోచ్ అయితే చాంపియన్షిప్ సాధించడం మీ లక్ష్యం.  అందుకోసం తగిన ఆటగాళ్ళను ఎంపిక చెయ్యడం, వారికి శిక్షణ ఇవ్వడం వంటి రోజువారీ కార్యాచరణ వ్యవస్థ.  జీవన సాఫల్యానికి ముఖ్యమైనది లక్ష్యాల సాధన కాదు.  క్రమశిక్షణాయుతమైన వ్యవస్థ రూపకల్పన, దాని ఆచరణ.   అలవాటుచేసుకున్న జీవన విధానం.  ఒకటి end ఇంకోటి means.  means perfectగా ఉంటే end అదే సాధ్యపడుతుంది.    end ను సాధించగానే ఇంకేం చెయ్యాలన్న శూన్య స్థితి ఏర్పడుతుంది.  అలవాటుచేసుకున్న means జీవనవిధానంలో అంతర్భాగమైపోయి ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుంది.    

ఉపయోగమైన కొత్త అలవాట్లు చేసుకొందుకు, ప్రమాదకరమైన పాతవాటిని వదులుకుందుకు మనకి కష్టమనిపిస్తోందంటే అది మన తప్పు కాదు.  మన వ్యవస్థది.  దానిలోని లోపాలు మార్పుకి అడ్డుపడుతున్నాయి.  

మనం మన లక్ష్యాలంత స్థాయికి ఎదగం; మన వ్యవస్థ స్థాయికి పడతాం.  అందుకని పటిష్ట వ్యవస్థ అభిలషణీయం.  మెరుగుపరుచుకున్న atomic habits తో అది సాధ్యం.  అవి మన దేహంలోని కణజాలం లాటివి.  అవన్నీ ఆరోగ్యంగా ఉంటే వాటి సాముదాయిక స్వరూపమైన దేహం తనంత అదే ఆరోగ్యంగా ఉంటుంది.  క్రమం తప్పక క్రమశిక్షణాయుతంగా ఆచరించుటే మనం చెయ్యవలసినది.   

  1. ఏది కావాలనుకోవాలి? ఫలితమా గుర్తింపా

ఫలితం - outcome గుర్తింపు identity.  కేవలం ఫలితం outcome ఆశించి చేసుకున్న అలవాట్లు నిలవవు.  ఒక బ్లాగు రాయటం మొదలుపెట్టాలి, బరువు తగ్గాలి, ఒక మాస్టర్స్ డిగ్రీ సాధించాలి అనుకుని ఆరంభించిన అలవాట్లు ఒకట్రెండు రోజులో మహా అయితే ఒక వారమో సాగి అప్పటికి వేడి చల్లారిపోయి ఆగిపోతాయి.

అదే, ఒక విలక్షణమైన గుర్తింపు కోసం చేసుకున్న అలవాట్లు శాశ్వతంగా మనతో నిలుస్తాయి.  ఉదాహరణకి నేను రాయడం మొదలుపెట్టాలనుకుంటున్నాను అంటే outcome based .  అదే, నేను రైటర్ ను అంటే అది identity.  వెళ్ళి వోట్ వెయ్యాలి అంటే అది outcome.  నేను వోటర్ ను అంటే అది identity.  నేను సిగరెట్టు తాగను outcome; నేను non smokerను. identity.  outcome based habits తాత్కాలికం identity based habits శాశ్వతం.  ఒక writer గా, ఒక voter గా, ఒక fit individual గా, ఒక social activist గా, మన identity కి మనం ఎంత విలువనిస్తే అందుకు మనం చేసే ప్రయత్నమూ అంత నిబద్ధతతో సాగుతుంది.  

అలవాటు అయేందుకు నాలుగు ముఖ్య సూత్రాలు అల.  అవి: స్పష్టంగా ఉండాలి; ఆకర్షణీయంగా ఉండాలి; సులభంగా ఉండాలి; సంతృప్తికరంగా ఉండాలి.

  1. స్పష్టత

విశేష అనుభవంతో మన మెదడు పరిసరాలనించి వచ్చే సంకేతాలు గ్రహించి రాబోయే పరిణామాలను గుర్తించే నేర్పుని కలిగి ఉంటుంది.  అనుభవజ్ఞురాలైన నర్సు ఒక వ్యక్తి ముఖాన్ని చూచి లోపలి రక్తప్రసారంలో ఏవో మార్పులు గ్రహించి అతనికి హార్ట్ ఎటాక్ రాబోతోందని చెప్పగలుగుతుంది.  museum curator వనవద్దకు తెచ్చే పాతవస్తువులు చూచి అవతలివారు చెప్పేది నిజమో టోపీ వ్యవహారమో గ్రహిస్తారు.  అన్నివిధాలా ఒకే రకంగా ఉండి ఎత్తున ఎగురుతున్న రెండు విమానాల్లో ఏది మనదో ఏది శత్రువుదో చెప్పగలిగే సైనికాధికారులుంటారు.  ఇలా చెప్పేందుకు వీరు తమ ఎదటి సమాచారాన్ని ఎక్కువ విశ్లేషించనక్కర్లేదు.   అలవాటు మీద అది లభిస్తుంది.  conscious effort బుద్ధిపూర్వక ప్రయత్నం ఏదీ చెయ్యకుండా అనుభవమ్మీదే ఫలితాలను అంచనా వెయ్యగలమనేందుకు ఎన్నో నిదర్శనాలున్నాయి.  ఆ శక్తి ప్రకృతి సిద్ధంగా మనకి లభించింది.  మన దేహవ్యాపారంలో సంభవించే గుండె లబ్బుడబ్బులు, ఆకలి, నిద్ర, జీర్ణప్రక్రియ, ఉఛ్చ్వాసనిశ్వాసాలు ఇవన్నీ పరిణామపరమైన అలవాటుమూలంగానే సంభవిస్తున్నాయి.  

ప్రయత్నం మీద ఈ సహజ అలవాట్లకి మరిన్నిటిని కూడా చేర్చుకుంటూ పోవచ్చు.  ఇదీ మనకి అనుభవమే.  అలారం లేకుండానే నిద్రలేవడం, లేవగానే దుప్పట్లు సర్దటం, రోజూ కొన్ని బట్టలు ఉతుక్కోవడం, నిర్ణీత సమయానికి పుస్తకం చేతిలోకి తీసుకోవడం, ఇటువంటివి.  ఇటువంటివి ఆరంభించేందుకు ప్రయత్నం కావాలి కాని రాను రాను ఇతర దేహకార్యకలాపాల్లాగే ఇవీ అలవోకగా సాగిపోతాయి.  

దీనిలో ఒక ప్రమాదం కూడా ఉంది.  అలవాట్లు చేసుకునే క్రమంలో బుద్ధిపూర్వకంగానే conscious mind జరుగుతుంది కాని అలవాటైనాక అబుద్ధిపూర్వకంగా unconscious mind పనులు జరిగిపోతుంటాయి.  ఉదాహరణకి నవ్వొచ్చినప్పుడు చెయ్యి నోటికి అడ్డం పెట్టుకోవడం, ఎవరికైనా ప్రశ్న వేయదలచినప్పుడు excuse me అనడం, మర్యడ కోసం అవతలి వారి వాక్యాలని మనం పూర్తిచెయ్యటం - ఇటువంటివి.  అన్ని సందర్భాలలోను ఇవి పనికి రావు.  వొదులుకోవాలన్నా మార్చుకోవాలన్నా బుద్ధి వినియోగించాలి.  ఒక స్టోర్ ఆఫర్ కార్డులు చింపే పని కోసం ఒకణ్ణి పెట్టుకుంది.  విజిటింగ్ కార్డ్ లాటి దాన్ని కత్తెరతో అడ్డంగా తెంపడం అతని పని.  కొన్నాళ్ళకి అతనికి ప్రమోషన్ వచ్చి cash counter లో పెట్టేరు.  మొదటి రెండు మూడు వారాల్లో అతను సుమారు ఐదారు డెబిట్ క్రెడిట్ కార్డ్లు అలవాటుకొద్ది ముక్కలు చేసి పారేశాడు.  అందుకనే  ప్రముఖ స్విస్ సైకాలజిస్టు కార్ల్ యున్ మాటల్లో: అప్రయత్నపూర్వకంగా జరిగిపోతున్నది అవాంఛనీయం అనిపించినప్పుడు దానిని ప్రయత్నంతో మార్చుకోవాలి.  లేకుంటే అది ఎటు యీడిస్తే అటు పోయి అది మన ఖర్మో తలరాతో అని బాధపడాల్సి వస్తుంది.  Until you make the unconscious conscious, it will direct your life and you will call it fate.

జపాన్ రైల్వే ఉద్యోగులు ట్రైన్ బయలుదేరే ముందు చేయిని ఎదటికి చాచి All clear అని ప్రకటిస్తారు.  ట్రైన్ డ్రైవర్ గార్డే కాక ప్లాట్ఫాం మీదివారు ఇది అనుసరిస్తారు. వారి సిగ్నల్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యాధునికం, అత్యుత్తమం.  అయినా వారు ఈ pointing and calling విధానాన్ని శ్రద్ధగా పాటిస్తారు.  ఆ సంకేతానికి అర్ధం, ట్రైన్ స్టార్ట్ అయే ముందు చెక్ చేసుకోవలసినవన్నీ చెక్ చేసేము, నిరభ్యంతరంగా సాగవచ్చు అని ప్రకటించడం.  దీనివల్ల తమ టెక్నాలజీ ఎంత అద్భుతమైనదైనా, గుడ్డిగా టెక్నాలజీ పైనే ఆధారపడితే కొన్నాళ్ళకి ఉద్యోగులు విలువైన సురక్షిత సమాచారాన్ని మర్చిపోయె ప్రమాదం ఉంది.  అందువల్ల unconscious state లోకి మారిపోయిన ఈ సమాచారాన్ని conscious state లోకి మార్చి విధిగా అనుసరిస్తున్నారు.  దీనివలన ప్రమాద నివారణ సామర్ధ్యం గణనీయంగా మెరుగుపడింది.  న్యూ యార్క్ మెట్రో వారూ ఈ విధానాన్ని అవలంబించి తమ ప్రమాదాల నివారణ సామర్ధ్యాన్ని ఎనభై ఐదు శాతం మెరుగుపరుచుకున్నారు.

మన అలవాట్లకూ ఈ pointing and calling అమలు చెయ్యచ్చు.  ఉదాహరణకి ఒక స్వీటు మన చేతిని తనవైపు లాగుతోందని తెలిసి బలవంతంగా తినే కోరికని అణచుకోవడమే కాకుండా, "ఈ స్వీటు నా బరువుని పెంచుతుందనే మానుకున్నాను.  ఎట్టి పరిస్థితిలోనూ ముట్టబోను" అని గట్టిగా మనసులో గానీ బయటికి గానీ మన సంకల్పాన్ని పునశ్చరించుకోవడం.   వదులుకునేవి కానీ అలవర్చుకొనేవి కానీ అలవాట్లగురించిన పూర్తి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం.  దురలవాట్లను గురించి పైకి తరచూ అనుకుంటూ వదులుకునే ప్రయత్నం కొనసాగిస్తే ఫలితం సత్వరమవుతుంది. 

  1. కొత్త అలవాటు చేసుకునే పద్ధతి

బ్రిటన్ లో ఒకసారి 248 మందిని మూడు గ్రూపులు చేసి వారి exercise routine గురించి అధ్యయనం చేసేరు.  మొదటి గ్రూపు పేరు control గ్రూప్.  వీరికి ఇచ్చిన సూచన: మీరు exercise చేసి దాని వివరాలు మాకు అడిగినప్పుడల్లా ఇస్తుండండి.  రెండవది motivation గ్రూప్.  వీరికి పై సూచనతో పాటు exercise లాభాలను గురించిన motivation material ఇచ్చేరు చదవమని.   మూడో గ్రూప్ వారికి ఈ రెంటితో పాటు అదనంగా ఒక ప్రశ్న ఇచ్చారు.  అది: నేను ప్రతి రోజూ -- గంటలకి -- exercise చేస్తాను.  ఒకవేళ ఆ టైం కి కుదరకపోతే -- గంటలకి చేస్తాను.  అని తెలిపే ప్లాను.

రెండు మూడు నెలల తరవాత చూసుకుంటే మొదటి రెండు గ్రూపుల వారిలో 30 - 35 శాతం మాత్రం వారానికి ఒకసారో రెండు సార్లో exercise చేసేరు.  కాని మూడో గ్రూప్ లో మాత్రం 90 శాతం పైచులుకు మంది నియమబద్ధంగా ప్రతి రోజూ ఆచరించేరు.  

వారి శ్రద్ధకి కారణం implementation intention అంటే ఆచరణ సంకల్పం స్పష్టంగా ఉండటం.  ఏ పనినైనా చేస్తామన్న ఉద్దేశానికి కాలమూ స్థలమూ కూడా నిర్దేశం అయితే దాని ఆచరణ తప్పక జరిగితీరుతుంది.  మొక్కుబడిగా చేస్తాను అన్నదానికి, రేపు -- గంటలకి -- (ఇది చెయ్యవలసిన పని) చేస్తాను అన్నప్పుడు సంకల్పానికి కార్యాచరణ తోడై పని జరుగుతుంది.  

అలాగే రేపు ఎలక్షన్ వోటు వేస్తున్నారా? అంటే అవునంటారు.  కాని వారు వేస్తారా అన్నది డౌటే.  సరే పోలింగు బూతుకి ఏ దారిన వెళతారు? ఎన్ని గంటలకి బయలుదేరుతారు అన్న ప్రశ్నలకి నిశితమైన సమాధానం వస్తే వారి వేలుకి చుక్క పడటం ఖాయం.  ఇదే implementation intention తో బలపడిన సంకల్పం.

చేసుకోబోయే ఆ అలవాటు కైనా ఇదే సూత్రం.  రోజూ ఆరు నించి అరగంట పాటు ధ్యానం చేస్తాను.  రాత్రి ఏడు నించి తొమ్మిది వరకు స్పానిష్ భాష చదువుతాను. .. ఇలా.

  1. habit stacking 

ఒక కొత్త అలవాటు ఆచరించాక ఇంకో కొత్త అలవాటు ఆచరించటమే habit stacking.  అంటే అలవాట్ల దొంతర అన్నమాట.  ఒక క్రమంలో వాటిని పేర్చి ఆచరణ కొనసాగిస్తే అది బహుళ ప్రయోజనకారి అవుతుంది.  ఎందుకంటే వాటి క్రమం నిర్ణయమైపోయింది కనక ఒకటి పూర్తవగానే ఇంకొకదాని ఆచరణ అలవాటుప్రకారం సాగిపోతుంది.  ఉదాహరణలు: ఆరునించి అరగంట సేపు meditation చేసి ఆరున్నర నించి గంటన్నర పాటు స్పానిష్ చదువుతాను.  ఇలా అలవాట్ల సమాహారం.

  1. ప్రేరణా పరిసరాలా?

కొత్త అలవాట్లు రూపొందడానికి మనలోపల కలిగిన ప్రేరణ కన్న పరిసరాలే ఎక్కువ ప్రభావశీలం అని కొన్ని అధ్యయనాలు ప్రయోగాల్లో నిరూపించారు.  ఉదాహరణకి office cafeteria లో మంచి నీళ్ళ సీసాల అమ్మకం తక్కువ, కోక్ డబ్బాలది ఎక్కువ అని గ్రహించిన ఒక మేనేజరు జనాలు ఎక్కువగా గుమిగూడే టేబిళ్ళను గుర్తించి అక్కడ కౌంటర్లలో విరివిగా నీళ్ళ సీసాలనుంచి మిగతా కూల్ డ్రింక్స్ ని చూపుకీ అందుబాటుకీ దూరంగా ఉంచింది.  ఆశ్చర్యకరంగా ఎవరూ ఇదేమిటని ప్రశ్నించలేదు.  అందుబాటులో ఉన్న నీళ్ళనే ఎక్కువ వినియోగించి వాటి అమ్మకాలు పెంచారు.  ఇదే విధంగా మనం డైనింగ్ టేబిల్ మీద చాక్లెట్ కుకీల డబ్బా అందుబాటులో ఉంచితే రోజుకో డబ్బా ఖాళీ అయిపోతుంది.  అది అందుకుందుకు కొంత ప్రయాస పడాల్సిన పరిస్థితి కల్పిస్తే అందరూ డైటింగ్ పాటిస్తారు.  ఇలా దృష్టిలో పడినదానినే ఎంచుకొందుకు కారణం, మన అయిదు జ్ఞానేంద్రియాలకీ కేంద్ర స్థానమైన నాడీవ్యవస్థ సేవల్లో అధిక భాగం దృష్టికోసమే వినియోగం అవుతుంది.  మనం మిగతా ఇంద్రియానుభవాలైన వినికిడి, స్పర్శ, రుచి, వాసనల కన్న కంటితో గ్రహించే వస్తువులకే ఎక్కువ ఆకర్షితులమవుతాం.

ఇలా ప్రభావం కలిగించే పరిసరాలు మనమూ కల్పించుకోవచ్చు.  amsterdam లోని ఒక శివారులో మిగతా ప్రాంతాలకన్న విద్యుత్ వినియోగం సుమారు ముప్ఫైశాతం తక్కువ ఉన్నట్టు తెలుసుకున్న ప్రభుత్వం కారణమేమిటని ఆరా తీస్తే, మిగతా ఇళ్ళల్లో విద్యుత్ మీటర్లు basement లోనో పోర్టికోలోనో ఉంటే, ఈ ఇళ్ళల్లో మాత్రం స్పష్టంగా కనిపించేలా హాల్లో ఉన్నాయి.  మీటర్ల పరుగుని ప్రత్యక్షంగా చూచిన గృహస్తులు జాగ్రత్తపడి దాని దూకుడు తగ్గించే ప్రయత్నంలో వినియోగం తగ్గించేరు.  ఈ ఉదాహరణ, ఇంతకు ముందు చెప్పినవీ కూడా role of visual cues in habit formation కి ఉదాహరణలు.  అంటే అలవాట్ల రూపకల్పనలో దృశ్య పరిసరాల ప్రభావం.  కళ్ళెదట కనబడేది మనని ఒక పనిని చేసేందుకో, మానేందుకో ప్రోత్సహించడం ఈ visual cues పని.  అందుకని, మందులు క్రమం తప్పక వేసుకోవాలనిపిస్తే వాటిని అందుబాటులో ఉంచుకోవాలి.  గిటారు రెగ్యులర్ గా సాధన చెయ్యాలంటే అదీ అందుబాటులో ఉండాలి.  ఈ cues అంటే ప్రేరకాలు ఎంత ప్రముఖంగా ఉంటే అలవాటు అంత బలంగా రూపొందుతుంది.  మన అలవాట్లకి ప్రేరణగా పరిసరాల రూపకల్పన చేసుకొనడం మన చేతిలోని పనే.  

అందుబాటుతనానికి తోడు సందర్భమూ మన అలవాటుని ప్రభావితం చేస్తుంది.  మామూలు రోజుల్లో మందుకొట్టను.  ఆదివారం ఒకే ఒక బీరు.  అని కొందరి నియమం.  వీళ్ళే ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు అది కొత్త సందర్భం అయిపోయింది కనక మిగతారూల్సన్నీ వెనక్కి పోయి అయిదారు సీసాలు కర్చైపోతాయి.  దీనిక్కారణం మారిపోయిన పరిసరాలు, సందర్భం.  గుడ్ న్యూస్ ఏమంటే, మనం ఒకానొక అలవాటుకి ఒకానొక సందర్భాన్ని పెట్టుకోవచ్చు.  నిద్రలేమితనంతో బాధపడేవారికి డాక్టర్లు ఒక సలహా ఇచ్చేరు.  అలిసిపోతే కని నిద్రకి ఉపక్రమించకూడదు.  నిద్ర రానప్పుడు మంచం మీద వాలకూడదు.  నిద్ర వచ్చేంతవరకు బెడ్రూం లోకి పోకూడదు.  అని.  దీనివల్ల ఆ గ్రూప్ వారికి నిద్రలేమి నివారణతో పాటు ఇంకొన్ని మంచి అలవాట్లు అయేయి.  అంతకు ముందు వారిలో చాలామంది మంచం మీద చాపుకు పడుకుని గంటలకొద్దీ టీవీ చూడటం, మొబైల్ బ్రౌజ్ చెయ్యడం, ఏదో ఒకటి తినడం చేసేవారు.  ఇప్పుడు అవి పోయేయి.  ఇంకో విశేషం.  నిద్ర పడగ్గదిలోనే వచ్చేది.  ఏ పుస్తకమో చదువుకోవలసినప్పుడు పడగ్గదిలో కాక వేరే చోట కూర్చుంటే కునుకు ఇబ్బంది పెట్టేది కాదు.  

కానీ మేముండేది ఒక సింగిల్ రూం అపార్ట్మెంటు.  ఇన్నెలా కుదురుతాయి అంటారా.  అదే రూం ని zone లుగా విభజించండి.  కుర్చీ మీద కూర్చుంటే చదవాల్సిందే.   మంచం మీదే నిద్ర.  పొయ్యి మూలకి పోతే వంట పనే.  ఇలా  changing place and context అంటే ఒక అలవాటుతో ముడిపడిన స్థలాన్నీ సందర్భాన్నీ మార్చుకొనడం.  ఫలానా సూపర్ మార్కెట్ బయట పానీపూరీ బాంటుంది.  అందుకని షాపింగ్ కి వెళ్ళినప్పుడల్లా పక్కవాళ్ళతో టప్పాలు కొడుతూ ఓ పాతిక గోల్ గప్పాలు చపాయించే అలవాటు తగులుకుంది.  ఇది మానుకోవాలంటే స్టోర్ మారిస్తే సరి.    ఇంకో అధ్యయనంలో, యుద్ధ సమయంలో శత్రు రాజ్య పరిసరాల్లో మత్తు పదార్ధాలకి బానిసలై నైరాశ్యమూ కుంగుబాట్లకి లోనైనసైనికులు ఇళ్ళకి రాగానే దానినించి బయటపడ్డారు.   

స్థలమూ సందర్భమూ స్థిరం అయితే వాటితో ముడిపడిన habit formation నిలకడగా జరుగుతుంది.  అవి మార్చుకుంటే వాటికి అనుబంధమైన అలవాటూ మారుతుంది.   

  1. self control పాత్ర

అలవాట్లను మార్చుకుందుకు స్థల సందర్భాలమీద ఆధారపడని వారు స్వీయ నియంత్రణ self control ఉన్నవాళ్ళు. వీరికి విల్ పవర్ ఉంటుంది.  లేనివారు నిపుణుల సలహాలు కోరవచ్చు.  నిజంగా విల్ పవర్ కలిగినవారు అది ఉపయోగించకుండా అలవాట్లను మార్చుకోగల సమర్ధులు.  ఉంది కదాని పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రంలా విల్ పవర్ ని ఉపయోగించరు.  అది ఉపయోగించే సందర్భం రాకుండా చూసుకుంటారు.  ఇదెలా అంటే, క్రమశిక్షణ స్పృహ కలిగి అవాంఛనీయ సందర్భాలు నివారించుకుంటారు. అంటే cues మార్చుకోవడం.  ఒకతనికి గుర్రపు స్వారీ చేసినప్పుడల్లా సిగరెట్టు ముట్టించడం అలవాటైంది.  స్వారీ మానేస్తే ఆ అలవాటు మనింది కాని కొన్నేళ్ళకి గుర్రమెక్కగానే సిగరెట్టు మీదకి మనసు లాగింది.   అంటే అలవాటు మనసులో ముద్రించుకుపోతే పూర్తిగా చెరిగిపోక, cues తటస్థించినప్పుడల్లా తలెత్తుతాయి.  

దుర్వ్యసనాల విషయంలో cues ఇంకో భయంకర పాత్ర పోషిస్తాయి.  తప్పించుకోవాలని చేసే ప్రయత్నమే దాన్ని తగిలించుకుంటుంది.  మనసు బాలేదని జంక్ ఫుడ్ తింటాం.  జంక్ ఫుడ్ తినడం మంచిది కాదని చెప్పి మనసు పాడు చేసుకుంటాం.  టీవీ చూస్తే బద్ధకం పెరిగిపోయి నీరసం ఆవహిస్తుంది.  నీరసంతో ఇంకేం చేసేందుకూ తోచక టీవీ ఇంకా చూస్తాం.  ఆరోగ్యాన్ని గురించిన బెంగతో సిగరెట్లు తాగుతాం.  సిగరెట్లవల్ల ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది.  స్మోకర్స్ ను భయపెట్టేందుకు సిగరెట్టు మీద భయంకరమైన ఫొటోలు ప్రింటు చేస్తున్నారు.  ఆ బొమ్మే ఇంకో సిగరెట్టు ముట్టించేందుకు ప్రేరేపించటం మొదలెట్టింది. ఇదో దిగలాగే సుడి downward spiral. 

అయితే ఒకసారి బ్రెయిన్లో ముద్రపడిపోయిన దురలవాటుని కొన్నేళ్ళపాటు మానెయ్యగలిగినా ఏదో సమయంలో దాని cue దానికి తారసపడినప్పుడు తిరిగి తలెత్తక మనదు.  అవరోధాలు నిండిన జీవితంలో జెన్ ప్రతిపాదిత నిగ్రహ సాధన బహు కష్టం.  ఒక negative environment లో ఉంటూ positive habits ఆచరించిన వారెవరూ నాకు తారసపడలేదు.  ఒకే మార్గం.  సాధ్యమైనంత వరకు ఆ అలవాట్లకు ప్రేరెపించే cues దృష్టిలోపడకుండా జాగ్రత్త పడటమే.  ఏ పనీ అవటంలేదనిపించినప్పుడు ఫోన్ ను ఇంకెక్కడో పెట్టడం.  ఇతరులతో పోల్చుకుని ఆత్మ న్యూనత అనిపిస్తే డభులూ గొప్పలూ ప్రకటించుకునే అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నించి బయటికి వచ్చెయ్యడం.  టీవీ మరీ ఎక్కువ చూస్తున్నామనుకుంటే దాని ప్లగ్ పీకి అటకకెక్కించడం.  ఇదే సూత్రం వీడియో గేం కన్సోల్స్ కి.     

ఆత్మ నిగ్రహం స్వల్పకాలానికే పనికొచ్చే ఉపకరణం.  దిగజారిపోతున్నామనిపించినప్పుడల్లా ఆత్మ నిగ్రహాన్ని పిలిపించుకుని అడ్డు పడమనలేము.  శ్రమపడి దానిమీద శ్రద్ధపెట్టి నిరాశ చెందే బదులు బలహీనతలను ప్రేరేపించే పరిసరాలను మార్పుచేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. 

  1. రెండో సూత్రం: అలవాటుని వదులుకోలెనంత ఆకర్షణీయం చెయ్యాలి

చిన్న pack లో ఎక్కువ కాలరీల జంక్ ఫుడ్, బయటి ప్రపంచపు స్పృహ లేకుండా లీనం చేసే video games, తక్కువ మోతాదులో ఎక్కువ కిక్కునిచ్చే మత్తు పదార్ధాలు - ఇవన్నీ అలవాటుని ఆకర్షణీయం చేసే ప్రక్రియలు.    ఈ మోహాన్నిమనలో కలిగించేది డోపమిన్ అనే రసాయనం.  జీవితాన్ని ఆసక్తికరం చేసేది, బతకాలనే      కోరికను మనలో కలిగించేది ఇదే.  Scientists ఎలకల బ్రెయిన్   లో electrodes పెట్టి డోపమిన్ ప్రసారాన్ని నిరోధించి చూసేరు.  ఆ ఎలకలు నోట్లో పంచదార పెడితే ఆనందంగా తిన్నాయి కానీ ఏదైనా కావాలనుకునే desire కోరిక వాటిలో చచ్చి పోయింది.  

అలవాట్లు డోపమిన్ చాలిత ఆచరణలు.   ఏ అనుభవమైతే తీవ్ర వ్యామోహం కలిగించి అలవాటుని కలిగిస్తుందో ఆ సందర్భంగా వారిలో డోపమిన్ విడుదల హెచ్చు స్థాయిలో ఉన్నట్టు.  ఇంకో విశేషం.  డోపమిన్ స్రావానికి అనుభవమే అక్కర్లేదు.  అనుభవానికైన ఎదురు చూపు కూడా.   ఎప్పటినించో కలవాలనుకుంటున్న ప్రియురాలు సమక్షంలో ఎంత బాగుంటుందో అన్న ఊహ చాలు డోపమిన్ ప్రవాహానికి.   తీరా ఆమె వచ్చాక అనుభవం అంత రసవత్తరంగా లేకపోయినా ఈ ఎదురుచూపే ఎక్కువ ఆత్రపెడుతుంది.     

అయితే కోరికలన్నీ నిరోధించుకుంటూ కాలం గడపలేము కనక ఒక బలహీనతకి ఒక పనికొచ్చే అలవాటుని జోడించే అలవాటు చేసుకోవాలి.  ఉదాహరణకి ప్రతిరోజూ ఉదయం ఏడుకి Netflix చూడటం ఒక వ్యసనమై పోయింది.  దానిని మన exercise routine కి అనుబంధం చేయాలి.  అంటే Netflix చూచినంత సేపు exercise చెయ్యాలి.    మనం చూస్తుంటాం.  పొద్దున్నే వ్యాయామమో ఇంకే సేవా కార్యక్రమమో చేసినవాళ్ళు  I earn my breakfast  అని తృప్తిగా తింటారు.    ఇలా rewarding గా అనిపించిన అలవాటు మానుకోవాలనిపించదు.                  

  1. అలవాట్లపై సమాజం ప్రభావం

మూడు రకాల గ్రూపులు మన అలవాట్లను ప్రభావితం చేస్తాయి.  1 దగ్గరివారు 2 అధిక సంఖ్యాకులు 3 గొప్పవారు

దగ్గరివారి ప్రభావం మన బాల్యకౌమారాల్లో పూర్తిగా ఉంటుంది.  నిజానికి ఆ దశలలో మనం చేసుకున్న అలవాట్లు పెద్దలను చూచి కాపీ కొట్టడమే.   తరవాత కూడా సన్నిహితుల అలవాట్లు మనవీ అవుతాయి.  ఇంటికి తాళంవేసేక ఒకటి రెండుసార్లు కప్పని లాగి చూసుకునే అలవాటు భార్యకి గాని భర్తకి గాని ఉంటే వారి సహచరులకూ అది ఆలవడుతుంది.    ఒకోసారి క్లోస్ ఫ్రెండ్ తాలూకా యాసని కూడా కాపీ కొడతాం వద్దనుకున్నా సరే.    ఇంకా, మామూలు బరువు వారు అధిక బరువు వారితో సన్నిహితంగా ఉంటే వారు వీరయే అవకాశం ఉంది.    peer pressure అని చెప్పి సహాధ్యాయుల ఒత్తిడి తప్పించుకోవడం కష్టం.   స్పాంజిలాగ మనం చుట్టూవారి అలవాట్లను వంటబట్టించుకుంటాం.    మనం కోరుకునే అలవాటు సామాన్య స్వభావంగా కలిగినవారి గ్రూపుల్లో కూడితే మనం కోరుకున్నది సులువుగా అలవాటవుతుంది.  ఉదాహరణకి ఒకరికి ఇంగ్లీషు మాటాడటం కోరిక.   పక్క కోలనీలో అన్ని  రాష్ట్రాలవాళ్ళూ ఉంటారు కనక అక్కడి పిల్లలు ఇంగ్లీషే మాటాడుకుంటారు.  అంటే మన ఆశయం అక్కడ అలవాటు.   ఆ గ్రూపులో చేరిక మన ఆశయాన్ని అలవాటు చేస్తుంది.   

మన మోటివేషన్ ని భావ సారూప్యం కలిగిన గ్రూపు నిలిపినట్టు ఇంకెవరూ నిలపలేరు.  ఒంటరిగా ఉన్నప్పటి మన ఆశయం గ్రూపులో చేరాక మనది అవుతుంది.   నేను రైటర్ని, నేను సంగీతవేత్తని, నేను cyclistని అనేది మేము రైటరులం, మేము సంగీతాజ్~నులం, మేము cyclists అనే shared identity అయి అది మన వైయక్తిక identity ని reinforce చేసి నిలుపుతుంది.     అలవాట్ల రూపకల్పనలో సన్నిహిత స్నేహ బృందాల ప్రభావం ఇంతా అంతా కాదు.

ఇంకోటి ఎక్కువమంది ఉన్న చోట వారిని అనుసరించి పోవడం.  మన స్వంత అభిప్రాయాలు ఎలా వున్నా నలుగురూ ఎలా ఉంటే అలా ఉండే అలవాటవుతుంది.  దీనివల్ల ఇబ్బంది కూడా ఉంది.    జీవితంలో ఎప్పుడూ మందు ముట్టకున్నా ఆ పండుగలో మందు సాంప్రదాయం అని చెప్పి కొంచం తీర్థం మనమూ  పుచ్చుకుని ఆ విధంగా దానిని అలవాటు చేసుకునే ప్రమాదం ఉంది. 

మరోటి గొప్పవారిని అనుకరించడం.  Seven habits of highly effective people చదివి ఆ గొప్పవారిని అనుకరిస్తూ వారి అలవాట్లే మనవిగా చేసుకోవడం.   మిగిలిన చుట్టం మనింటికి వచ్చినప్పుడు ఇల్లు ఒకలా ఉంచుతాం.  గొప్పవారు వచ్చినప్పుడు ఇంకోలా ఉంచుతాం.    ఆ విధంగా మన అలవాట్లకి "అవతల వాళ్ళు ఏమనుకుంటారు" అనే ఉపనిషద్ వాక్యం కారణం అవుతుంది.

  1. దురలవాట్లకి కారణాలు వాటి మరమ్మత్తు 

అలెన్ కార్ అనే రచయిత smoking దుర్వ్యసనాన్ని మానిపించే ఉపాయాలు తన రచన Easy way to stop smoking లో వివరించాడు.  ఆ రచన మంచి ఫలితాలు సాధించింది.   ఎందరో అది చదివి పొగ తాగుడు మానేశారు.  స్మోకింగ్ వదిలిపెడుతున్నామని, అది సోషల్ అని, నరాల ఒత్తిడిని తగ్గిస్తుందనే అపోహలు తప్పుడు భావనలని, నిజానికి అది మనది కానప్పుడు దాన్ని మనం వదులుకోవడం, అందరూ ముక్కు మూసుకునే పరిస్థితికి సోషల్ అనుక్కోవడం, నరాలని బలహీనపరిచేది ఒత్తిడిని ఎలా తగ్గిస్తుందని అంటాడు.   ఆ రచన చేసిన గొప్ప పని, మానుకోదగిన దురలవాటుని  సాధ్యమైనంత అందవిహీనంగా చేపట్టి దానిపట్ల ఏవగింపు కలిగించడం. 

బ్రెయిన్ ప్రోగ్రామ్ ను మార్చండిలా 

అలవాట్లు మంచివే అయినా ఆచరణ అప్పుడప్పుడు విధిలేక చేస్తున్నట్టనిపిస్తుంది.   అలా అనిపిస్తుంటే కొన్నాళ్ళకి వాటిని విడిచిపెట్టే ప్రమాదం ఉంది.  అందుకని ఉంచుకోవాలసిన అలవాట్లని ఆకర్షణీయం చేయాలి.   వాటి ఆచరణ ఒక positive experience గా ఉండాలి.   ఉదాహరణకి తెల్లారింది జిమ్ము కి పోవాలి అనుకొనే బదులు, ఒళ్ళు తేలికపడి గట్టి పడాలి.  కొంత condition లో పెట్టుకుని వస్తాను అనుకోండి.   ఇంకా డబ్బు save చేస్తున్నప్పుడు త్యాగం చేస్తున్నామనుకోకుండా రేపటి అవసరాలకోసం ఈ మాత్రం పొదుపు అవసరమే అనుకోండి.  Meditation చేసేటప్పుడు బయటి చప్పుళ్ళు విఘ్న కారకాలనిపించినప్పుడు మంచిది మంచిది ఎటో జారిపోతున్న మనసు శ్వాస మీదకి మళ్ళి మంచి పనే జరిగింది అనుకోండి.    స్థిరంగా  జీవితకాలం అంటిపెట్టుకోవాలనిపించిన ప్రతి అలవాటునీ ఇదే positive భావనతో చూడండి. 

  1. అలవాటుని సులభతరం చేయండి 

University of Florida ప్రొఫెసర్ గ్లెన్ తన ఫిల్మ్ ఫోటోగ్రఫీ విద్యార్ధులని రెండు గ్రూపులు చేసేడు.  ఒకరిది quantity రాశి గ్రూపు, రెండవది quality వాసి గ్రూప్.   ప్రస్తుత టెరము ముగిసేటప్పటికి రాశి వారు ఎన్ని వీలయితే అన్నీ ఫోటోలు తియ్యాలి.  సంఖ్య ప్రధానం.  వాసి వారు మాత్రం ఒకే ఒక ఫోటో తియ్యాలి అది అన్నీ విధాలా అత్యుత్తమ నాణ్యత కలిగి the best అయుండాలి.   టర్మ్ ముగిసింది ఫోటోల ప్రదర్శన జరిగింది.  అంతా అనుకున్నది వాసి వారి ఫోటో అత్యుత్తమ నాణ్యతతో ఉంటుందని.  కానీ ఆశ్చర్యకరంగా రాశి వారు వందలకొలది అత్యుత్తమ నాణ్యత కలిగిన ఫోటోలు ప్రదర్శిస్తే, వాసి వారి ఒక్క చిత్రమూ వాటిలో దేనితోనూ సరిపోలలేని నాసి రకంగా నిలిచింది.  

కారణం, రాశి వారు వేలకోలది చిత్రాలు తీసే పనిలో lighting, composition, dark room techniques, ఇలా అన్ని కోణాల నించి తమ పనితీరుని పరిశీలించుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఫోటో ఫోటోకీ తమ నాణ్యత పెంచుకుని కళాఖండాలు ఆవిష్కరించేరు.  వాసి వారు అత్యుత్తమం the best అంటే ఏమిటి దాని లక్షణములేవి అని చర్చోపచర్చలు చేసుకుని చివరికి ఒక దిష్టిబొమ్మని ఆవిష్కరించేరు. 

Voltaire అంటాడు: The best is the enemy of the good అని.  

పని తీరు రెండు రకాలు.   ఒకటి చలనం motion; రెండోది action క్రియ.  చలనం లో ఉంటూ మనం వ్యూహాలు ప్రణాళికలు రచించడం, కొత్త మార్గాలు అన్వేషించడం, కొత్త పాఠాలు నేర్చుకోవడం వంటివి చేస్తాం.  ఇవన్నీ మంచివే కానీ అవి ఏ ఫలితాన్నీ సృష్టించవు.   క్రియ action మాత్రమే ఫలితాన్ని ఇచ్చేది.    అలవాట్ల రూపకల్పనకి చలనం కన్నా క్రియే ముఖ్యం.   ఆదిని perfection అవసరం లేదు.   Repetition మళ్ళీ మళ్ళీ చేయడం అత్యవసరం.   Repetition అలవాటుని automatic చేయడంలో సహాయపడుతుంది.  ఒకే పనిని పదే పదే చేస్తూ ఉంటే   బ్రెయిన్ లోని న్యూరాన్స్ ఆ పనికి సంబంధించిన nerve cells బంధనాన్ని దృఢపరుస్తాయి.   ఎక్కువ సాధన చేసిన సంగీతకారులు, గణితవేత్తలు వారి రంగాలలో మకుటం లేని మహారాజులుగా రాణించడం నిర్విరామంగా వారు చేసిన సాధన ఫలితంగానే.    ప్రదర్శనల్లో వారు పెద్ద కష్టపడనక్కరలేకుండానే జనులను మెప్పిస్తారు.   

ఒక అలవాటుకి ఎన్నాళ్ళు పడుతుంది అని కాక ఎన్ని సార్లు చేస్తే అలవాటావుతుంది అని ప్రశ్నించుకోవాలి.   కొందరు అంటుంటారు ముప్ఫై రోజులు చేస్తేనో అరవై రోజులు ఆచరిస్తేనో అలవాటై పోతుంది అని.   కానీ ముఖ్యంగా పరిగణించవలసింది ఎన్ని సార్లు repeat చేసేము అన్నదే మన అలవాటు formation లో ముఖ్య భూమిక పోషిస్తుంది. 

  1. కనిష్ట ప్రయాస సూత్రం 

సహజంగా మనకి బద్ధకం ఎక్కువ.  వ్యవసాయపు అనుకూల్యత భూమి ఒకే అక్షాంశం మీద ఉన్నప్పుడు పెరుగుతుంది.   దీనిని బట్టి ఒకే రకం పంటలూ ఒకే మాదిరి వ్యవసాయాన్ని చేసుకుంటూ ఆసియా ఖండం తూర్పు నించి పడమరకి, అటువంటి సౌకర్యం లేక కొత్త విధానాలు అన్వేషించే అవసరం కలిగి అమెరికాలు ఉత్తరం నించి దక్షిణానికి ఎదిగి వాటి మ్యాపులు ఈనాడు మనం చూస్తున్నట్టు ఉన్నాయి.  ఆహార లభ్యత పెరిగి ఆసియా జనాభా, సైన్యాలు కూడా పెరిగాయి.   వేల యేళ్ళ పాటు రూపొందిన అలవాటు ఇది.   అని Guns, Germs and Steel అనే పుస్తకంలో రచయిత పేర్కొంటాడు.   

అలవాటు చేసుకోవడానికి ప్రేరణ/ motivation కన్నా ఎక్కువగా అదెంత సులభం అన్నదే ముఖ్యం.   శక్తి ప్రియమైనది కనుక దాన్ని వీలైనంత పొదుపు చేయాలని ఆలోచిస్తుంది మన మెదడు.  తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనమే ఆది నించి మన సిద్ధాంతం.  రోజుకి నూరు బస్కీలు తియ్యాలని పెట్టు కుంటే మహా అయితే రెండు రోజులు చేస్తాం కానీ రోజుకో రెండు తీస్తే చాలంటే రోజూ చేస్తాం.   తక్కువ శ్రమతో రూపొందిన అలవాట్లే కలకాలం మనతో ఉంటాయి.   అందుకే మాటి మాటికి మొబైల్ చూసుకోవడం, టీవీ, మెయిల్ చెక్ చేసుకోవడం మన జీవితంలో ముఖ్యమైపోయేయి.  

మనం కోరుకునేది అలవాట్లని కాదు.  వాటి ప్రయోజనాలని.   అందుకే  బరువు తగ్గడం ఇష్టం, డైటింగ్ కష్టం.   మనసు ప్రశాంతంగా ఉండటం ఇష్టం కానీ మెడిటేషన్ కష్టం.   చేయాలనిపించదు కానీ ప్రయోజనం మాత్రం కావాలి.   అందుకని అలవాట్లు సులభం చేసుకోవాలి.   మంచి అలవాట్ల కోసం మార్గం సుగమం చేసుకుని చెడు అలవాట్ల మార్గంలో ముళ్ళ కంప కొట్టండి.    ఇంకోలా చెప్పాలంటే మీకూ మంచి అలవాటుకీ మధ్యనున్న ఘర్షణ తగ్గించండి.  మీకూ దురాలవాటుకీ మధ్యనున్న ఘర్షణ పెంచండి.   ఆఫీసు దారిలోనే జిమ్ ఉంటే రోజూ వెళ్ళే మూడు వస్తుంది.   అదో మూలా ఇదో మూలా ఉంటే కుదరదు.   Diet ప్లాన్ కి పార్టీలు చేసుకునే ఫ్రెండ్స్ తో ఘర్షణ.   ప్రశాంతంగా ఒక రచన చేద్దామనుకుంటే ఇంట్లో రణగొణ ధ్వనులతో ఘర్షణ.   దేనిపైనైనా concentrate చేద్దామనుకుంటే smart phone తో ఘర్షణ.  ఈ ఘర్షణలు సవరించి నివారిస్తే ఈ అలవాట్లు కొనసాగుతాయి.   

1970 లలో జపాన్ యాంత్రిక ఉత్పాదన విధానాలను విప్లవాత్మకంగా మార్చుకున్నారు.   ప్రతి తయారీ దాని తరవాతి దశకి పోవడం, అక్కడి కార్మికులకి తమ వంతు చేసే పనిలో అతి తక్కువ ప్రయాస ఉండేలా చూసుకోవడం వంటివి.  దీనివల్ల పనికీ పనివారికీ మధ్య ఉన్న friction తగ్గించేరు.  వస్తువు తయారీ సమాయమూ నాణ్యత పెరిగి ఇతర దేశాలకి జపాన్ మార్గదర్శకమైంది.  

Income tax శాఖ వారు return filing విధానాన్ని సులభతరం చేయడం వల్ల return దాఖలా శాతం గణనీయంగా పెరిగిన సంగతి తెలిసినదే.  

దీనినే addition by subtraction అంటాడు రచయిత.  ఒకటి తగ్గించడం ద్వారా ఇంకోటి పెంచడం.   ప్రయాస తగ్గించి ప్రయోజనం పెంచడం.   ఉంచుకుందామనుకున్న అలవాట్లకి ఇదే సూత్రం.   

దీనికి ప్రతిగా వదులుకోగోరే అలవాట్లకి friction పెంచడం.  టీవీ వ్యసనానికి విరుగుడు నచ్చిన షో చూసేయగానే remote batteries తీసేసి TV plug పీకేసి వీలయితే TV ని పక్కరూమ్ లో దాచేయడం.   అలాగే పనిలో కూర్చున్నప్పుడు ఫోన్ మనవారికి ఇచ్చేసి రెండు గంటల తరవాత ఇవ్వమని చెప్పడం.  ఇలా ప్రతి వ్యసనానికి అవరోధాలు కల్పించాలి. 

  1. నిర్ణయాత్మక క్షణం   

విశేష ప్రఖ్యాతి కలిగిన ఒక నాట్య నటీమణి తన రొటీన్ గురించి ఇలా అంటుంది.  నేను అయిదుకి లేచి జిమ్ దుస్తులు ధరించి షూస్ వేసుకుని క్యాబ్ ని పిలిచి జిమ్ కి వెళ్ళి రెండు గంటల పాటు అవసరమైన exercises అన్నీ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి తగిన మోతాదులో కాలరీలు కలిగిన food తింటాను.   ఇదంతా చూసి అయ్యబాబోయ్ ఇంత క్రమశిక్షణా మా వల్ల కాదనేరు.  ఇంత కార్యాచరణకీ మూలం నేను క్యాబ్ ను పిలవడం.   దానికి ఒక నిమిషం చాలు.  ఆ routine కి ఫిక్స్ అయితే మిగతావన్నీ వాటంత అవే జరిగిపోతాయి. అని. 

మన అలవాట్లు ఒక ముఖ్య రహదారికి మనని తీసుకెళ్ళే దగ్గరి సందు లాటివి.   సందు దాటేందుకు  ఎక్కువ సమయం పట్టదు.  కానీ అది దారితీసే అసలు మార్గం మన జీవన గమ్యాన్ని నిర్దేశించేది.    మంచైనా చెడయినా.   ఫోన్ ఒక రెండు seconds మాత్రమే చూస్తామంటాము కానీ అది పెరిగి పెరిగి రెండు గంటల పాటు బ్రౌజ్ చేయించి ఆ రోజు చేయవలసిన అసలు పనికి నామం పెట్టించేస్తుంది.   నోరు ఆడించే అలవాటు ఫుల్ మీల్స్ చేసినా ఇంకా ఏ సమోసానో కబాబు నో స్వీటునో తినమని ప్రోత్సాహిస్తుంది.   పని మని ఫోను మీద వేలు పెట్టడం రెండే సేకన్లు.   భోజనమైనాక కాజా అందుకోవడం రెండే సేకన్లు.   అలవాటై పోయేయి కానీ అవి ముంచుతున్న కొంప చక్కదిద్దుకోవడానికి యేళ్ళు పడుతుంది.  

యోగా అనే దీర్ఘకాల అలవాటుకి చాప పరుచుకోవడం డ్రస్సు బిగించడం రెండే నిమిషాల అలవాటు.   ప్రయోజనకర రచనలు చేసే అలవాటుకి ప్రతి రోజూ నిర్ణీత సమయానికి కాగితాలూ కాలము అందుకుని కూర్చుండుకు రెండే నిమిషాలు.  మంచి అలవాట్లకి లాగే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు చెడ్డవాటివైపు లాగేవి కూడా రెండో అంతకన్నా తక్కువ నిమిషాలో.  కానీ వాటి ప్రభావం కలకాలం.  

అవసరమైన ప్రతి అలవాటుని రెండు నిమిషాలకి కుదించండి.  అప్పుడు ఆచరణకి వెనకంజ వెయ్యరు.  ఉదాహరణకి  ఇవాళ పుస్తకం చదవాలి బదులు ఇవాళ ఆ పుస్తకంలో ఒక పేజీ చదువుతా.  ముప్ఫై నిమిషాల యోగా చేస్తా బదులు యోగా డ్రస్సు వేసుకుని చాప పరుచుకుంటా.   క్లాసుకి ప్రిపేరవుతా బదులు నోట్స్ తిరగేస్తా.   మూడు మైళ్ళు పరిగెడతా బదులు running shoes తొడుగుతా.   అయిడియా ఏమంటే అలవాటుని అతి సులభమూ త్వరితమూ చేసుకోవడం.    అది వంటపడితే అసలు రాజ మార్గానికి అదే దారితీయిస్తుంది. 

  1. మంచివి అనివార్యం, కానివి అసంభవం

విక్టర్ హ్యూగో ఒకసారి ఒక పుస్తకం రాస్తానని ఒప్పుకుని అసలు మొదలే పెట్టక ఆ పనిమీదా ఈ పని మీదా తిరుగుతూ కాలం గడుపుతున్నాడు.   ఆఖరి పబ్లిషర్ అతనికి deadline నిర్దేశించాడు.   ఫలానా రోజుకల్లా ఇచ్చేవా సరి లేదంటే కుదరదు అని.  

ఎలాగైనా పూర్తి చేయాలని తీర్మానించుకున్న విక్టర్ ఇంట్లో తన బట్టాలన్నీ మూటగట్టి చుట్టాలయింటికి పంపేసి తనకోసం ఒక శాలువా మాత్రం ఉంచుకున్నాడు.  తొడుకునేందుకు ఏమి లేక ఇల్లు దాటి వెళ్ళే వీలు లేకపోయింది.  విధిలేక పట్టుబట్టి మరి అనుకున్న టయానికి పుస్తకం రాసి ఇచ్చాడు.   ఆ పుస్తకమే The Hunchback of Notre Dame.

ఒక్కొక్కప్పుడు success అంటే మంచి అలవాట్లను సులభతరం చేయడమే కాదు, చెడ్డవాటిని అసంభవం చేయడం కూడా.   ఇది అమలు చేసేందుకు సైకాలజిస్టులు commitment device అనేదాన్ని ప్రతిపాదించారు.   దాని పని, మనకి పనికి రాని అలవాట్లకు అడ్డుపడటం,  పనికొచ్చే వాటిని అనుమతించడం.  Commitment devices ఎన్నోరకాలుగా తయారుచేసుకోవచ్చు.  అనవసరంగా కాలక్షేపానికి junk food తినేస్తున్నామే అని బాధపడే క్రీడాకారులు ప్రాక్టీసుకి వెళ్ళేప్పుడు పర్సు ఇంట్లోనే వదిలేసి వెళ్ళడం, ఆ విధంగా జిహ్వాచాపల్య బలహీనతను కట్టడి చేయడం.   రచయిత Internet router కి ఒక adopter fix చేసుకున్నాడు।  అది రాత్రి పది అయేసరికల్లా ఇంటర్నెట్ కొళాయిని బందు చేసేస్తుంది.  అందరూ బ్రౌజింగ్ మానేసి పుస్తకం పట్టుకోవడమో పడుకోవడమో చేయాల్సిందే.  

ఒక చెడు అలవాటుని మానుకోవాలంటే అది చేయడం అసాధ్యం చేయడమే ఉత్తమ మార్గం.  Cashier అటూ ఇటూ వెళ్ళినప్పుడు రసీదులు తారుమారు చేసి చేతివాటం ప్రదర్శించే ఉద్యోగులకి ఎంత లెక్చర్ ఇచ్చినా వృధా.   కాష్ లోపలపడగానే లాక్ అయిపోయే cash registers రూపకల్పనకి ఈ సమస్యే కారణమయింది.   వాణిజ్యసంస్థల్లో చేతివాటపు సంఘటనలు కట్టడి అయేయి.  ముందుచూపుతో సంస్థలు అమలు పరచే చిన్న చిన్న మార్పులు శాశ్వత ప్రాతిపదికన అసంఖ్యాకులకు సంక్షేమకరంగా మారేయి.  ఉదాహరణకు ఉద్యోగులకి పొదుపు ఉపన్యాసాలు ఇవ్వడం మాని జీతం నించే కొంత మొత్తాన్ని ఉద్యోగం చివర్లో ఇచ్చే పథకాలు,  website blockers సహాయంతో అనవసర సైట్ల దర్శనానికి అడ్డుకట్ట వేయడం. 

ఇలా జీవితాన్ని వీలైనంత automate చేసుకుంటే ఆ విధంగా ఆదా అయిన సమయాన్ని ఇప్పటిమట్టుకు యంత్రాలు నిర్వహించలేని పనులనిమిత్తం వినియోగించవచ్చు.  ప్రముఖ గణిత శాస్త్రవేత్త Alfred North Whitehead మాటల్లో, “ఎన్ని కార్యకలాపాలు మన ఆలోచన అవసరం లేకుండా జరిగిపోతుంటాయో నాగరకత అంత వృధ్ధి అయినట్టు.”

కానీ technology కి మనం బానిస అయిపోయే ప్రమాదం ఉంది దీనివల్ల.   ఉబుసుపోక కాలక్షేపం అతి సులభమైపోయింది ఇప్పుడు.   ఇప్పుడు నాకో చిన్న బ్రేక్ అవసరం అని వేళ్ళని సోషల్ మీడియామీద కదపడం ఆరంభిస్తే అది మనని గంటలు గంటలు కట్టిపడేస్తుంది.  ఈ ఊబిలోకి జారిపోకుండా రచయిత ఒక చిట్కా అవలంబించేడు.  దాని ప్రకారం ప్రతి సోమవారం ఉదయం అతని అసిస్టెంటు అతని అన్నీ సోషల్ మీడియా passwordలు మార్చేస్తుంటాడు.  అవేమిటో  మంగళవారం చెప్తాడు.  దీనివల్ల కొంత కట్టడి జరుగుతుంది.  


  1. ఆచరణలో సంతృప్తి 

Stephen Luby అనే health worker పాకిస్థాన్ లోని Karachi లో కొంత కాలం పనిచేసేడు.  వెళ్ళిన కొత్తల్లో అతను గ్రహించినది, ఆ నగరం పొడిగా ఉంటే చెత్త, దుమ్ము.  ఓ వాన కురిస్తే చిత్తడి గుంటలు,  అంటువ్యాధులు.   జనుల ఆరోగ్యాలు దైవాధీనం అయిపోయేయి.  వాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుకుంటే రోగాలు నివారించవచ్చు. ఈ విషయం చెప్పి చూసేడు కానీ ఫలితం లేదు.  వాళ్ళకీ  చేతులు కడుక్కునే అలవాటు అయితే ఉంది.  కానీ అది శాస్త్రీయంగా లేదు.  కొళాయి కిందో బకెట్టు లోనో చేయి ముంచి అయిందనిపిస్తున్నారు.  ఆలోచించి అతను Procter and Gamble వారిని సంప్రదించి అందుబాటు ధరలో మంచి hand wash ను supply చేయించాడు.  అది సరసమైన ధర, చక్కని నురుగు, మెత్తని స్పర్శ, మంచి సువాసన, ఆకర్షణీయమైన రంగు తో మళ్ళీ మళ్ళీ కడుక్కోవాలనిపించేది.  అంతే.   జనాలని ఇట్టే కట్టి పడేసింది.  అంతా అది వాడనారంభించారు.  ఇంటింటానే కాక సంఘ సబ్బును కొందరు ఔదార్యం కలిగిన ఔత్సాహికులు ఏర్పాటు చేసేరు.  మొత్తం మీద Luby గారి ఆలోచన ఒక పెను పరివర్తన కలిగించింది.   నగరంలో రోగాలు అదుపులోకొచ్చాయి.     

అతని మాటల్లో, “జనులు కంటికీ వంటికీ ఇంపుగా ఉండే అలవాట్ల వైపు మొగ్గుతారు.  అవి కలిగించే ప్రయోజనాలు వారికి రెండవ పక్షం.  అని.   ఇది నిజం.   పళ్ళ శుభ్రం కన్న tooth paste mint taste, అది ఇచ్చే  నురుగు  ఎక్కువ జనాకర్షకం.    Chewing gum 1800 కన్నా ముందే పరిచయమైనా, దాని వినియోగం బహుళ విస్తృతమైనది wriggley వారు దాని పరిమళాన్ని రుచిని మెరుగుపరిచి పరిచయం చేసినాకే.   Feeling of pleasure అంటే సౌఖ్యానుభూతి అలవాటు రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహిస్తుందంటే అతిశయోక్తి కాదు.    బాగుంది ఏది ఇంకోసారి అని మనను ప్రోత్సహించి అలవాటుపడేలా చేస్తుంది.   వినియోగం సంతృప్తికరంగా ఉంటే repeat చేస్తాం.  లేకుంటే వెనక్కి తగ్గుతాం.       What is rewarded is repeated, what is punished is avoided అని నానుడి.   


  1. ఇప్పుడొచ్చే, ఎప్పుడో వచ్చే ప్రయోజనాల అంతరం 

తిండి తినగానే ఆకలి మాయమమవుతుంది.  నీరు తాగగానే దాహం తీరుతుంది.  ఇవి చేసిన పనికి కలిగిన తక్షణ ప్రయోజనాలు  immediate returns.   సిగరెట్టు మానేస్తే భవిష్యత్తులో క్యాన్సర్ రాదు.  రోజూ వ్యాయామం చేస్తే భవిష్యత్తులో ఊబకాయం రాదు.  ఇవాళ ఆఫీసులో పనిచేస్తే నెలాకరుకి జీతం వస్తుంది.  ఇవన్నీ ఎప్పుడో వచ్చే ప్రయోజనాలు.  Delayed returns.

మన Homo Sapiens జాతి మనుగడ రెండు లక్షల యేళ్ళ క్రితం ఆరంభమయింది.  జంతు ప్రపంచంలో మనకే సొంతమైన బ్రైన్ లోని neo cortex కారణంగా మనకి విశ్లేషణ, విచక్షణ, భాష, సంభాషణ, ప్లానింగ్, ముందుచూపు వంటివి సంప్రాప్తమయాయి.  మనకి  మేధో శక్తి అనే software ను కలిగియున్న ఈ brain అనే hardwre అప్పటి మన paleolithic పూర్వీకుల్లో ఎలా వుందో ఇప్పుడూ అలానే వుంది.    ఇతర జంతువుల మాదిరి మనదీ  immediate returns కే అలవాటు పడిన జాతి.  కానీ ఈ మధ్యనే అంటే సుమారు ఐదువందల యేళ్ళ నించి delayed returns వైపు మొగ్గనారంభించింది.   దాని ప్రభావం ఈ వంద యేళ్ళలో పరాకాష్టకు చేరుకుని మనకి విమాణాలనీ కారు లనీ టీవీలనీ ఇంటర్నెట్ అని కనీ విని ఎరుగని కొత్త ఆవిష్కరణలని మన ముందు పరిచింది.   

అయితే మన బ్రెయిన్ immediate, delayed returns మధ్య సమతూకానికి ప్రయాస పడుతూ ఉంటుంది.   అందువల్ల future ఎలాగైతే ఉండని, ఇప్పటి సుఖం ముఖ్యం అనే స్వభావం కొన్ని అలవాట్లను కలిగిస్తుంది.   అందుకని ఎప్పుడో ఊబకాయం వస్తుందని ఈ జీడిపప్పు ghee roast ని, ఎప్పుడో క్యాన్సర్ వస్తుందని ఈ కిక్కిచ్చే దమ్ముని, ఎప్పుడో సుఖవ్యాధి వస్తుందని ఈ సుందరాంగిని వదులుకొమ్మంటారా?  Sorry sir ఇలా ఉండనివ్వండి అని చెప్పి proceed అవమంటుంది.   

ప్రతి అలవాటూ విభిన్న భవిష్యత్ ఫలితాలనిస్తుంది.  మంచివాటివల్ల ఇప్పుడు శ్రమ, మున్ముందు సౌఖ్యం.    చెడ్డవాటి వల్ల ఇప్పుడు భోగం, ఆనక రోగం.   ఒకదాని మూల్యం ఇప్పుడు, రెండో దానిది  భవిష్యత్తులోనూ. 

దురదృష్టవశాత్తు మన brain దీర్ఘకాల ప్రయోజనం, తక్షణ సౌఖ్యం instant gratification లలో రెండో దానివైపే మొగ్గుతుంది. 

అందువల్ల తక్షణ సౌఖ్యం ఎంత హాయిగా అనిపిస్తే అంత serious గా మనం ప్రశ్నించుకోవాలి.  దీని దీర్ఘకాల ప్రయోజనం ఏమిటి అని.   

మన brain లోని hardware మనని ప్రోత్సహించే కారణంగా ప్రతి ఒక్కరమూ instant gratification కే ఉరుకులూ పరుగులూ పెడతాం.   ఇంతకు ముందే ప్రస్తావించుకున్నట్టు, What is immediately rewarded is repeated.   What is immediately punished is avoided.  Delayed returns కి పోయే రోడ్డు is always the road less traveled.  అది ఎప్పుడూ రద్దీ లేకుండా ఖాళీగా ఉంటుంది.  ఆ రోడ్డును అనుసరించే స్వభావం కలవారు అంటే instant gratification ను ఇష్టపూర్వకంగా వాయిదా వేసుకునే అలవాటున్నవారు వారి వారి రంగాలలో రాణిస్తారు.  

అయితే మంచి అలవాట్లనించి వెనక్కి మళ్ళిపోకుండా మనని track మీద ఉంచేందుకు కొన్ని instant gratifications అవసరం.  అవి మన అలవాట్లని కొనసాగనిస్తాయి.   delayed returns  background లో accumulate అవుతుంటాయి.  

అందుకోసం ఇప్పటి సుఖం అంత ముఖ్యం కాదనిపించే ఒక లక్ష్యాన్ని సృష్టించుకోవాలి.   ఉదాహరణకి iphone కొనేందుకు డబ్బు కావాలి.   అదిప్పుడు లేదు.  నిధిని స్థాపించాలి.  ఇప్పుడు వదులుకున్న ప్రతి gratification కి సత్కారం చేయాలి.  అంటే ఇవాళ Netflix చూచే కోరిక వాయిదా వేసేను.  బహుమానంగా iphone నిధిలో రెండువందలు జమ.  ఉదయం మూడో కాఫీ తాగాలని గులగుల పెట్టింది.  కానీ ఆపుకున్నాను.  ఇంకో రెండువందలు.  ఇదో రకంగా మీ విధేయతని గుర్తించి మిమ్మల్ని మీరు సత్కరించుకునే loyalty program.   ఒక జంటకి  చిలకాగోరింకల్లా కాపరం చేస్తూ వంట జంజాటం పెట్టుకోకుండా order చేసీ restaurant కి పోయి తినడం అలవాటైపోయింది.   ఇది మానుకుందుకు Europe trip నిధిని ప్రారంభించారు.   బయటి food కోరికని ఆపుకుని ఇంట్లో వంట చేసుకు తిన్నప్పుడల్లా అందులో వెయ్యి రూపాయలు జమ చేసేరు.   కొన్నాళ్ళకి ఆరోగ్యాలూ చక్కబడ్డాయి, యూరపూ వెళ్ళవచ్చారు. 

చెప్పవచ్చేదేమంటే, తక్షణం కలిగించుకునే మంచి మూడ్, శక్తి, stress తగ్గించే shower bath ఇవి ఎప్పుడో భవిష్యత్తులో లభించబోయే long term రివార్డ్ దూరాన్ని మనకి  గుర్తు చేయక ఇప్పటి కర్తవ్యానికే  ప్రోత్సహిస్తూ అలవాటుని నిలబెడతాయి.    ఉల్లాసం అనిపిస్తే మార్పు సులభ్యమవుతుంది.

ఏరోజుకారోజు అలవాటును  తాజాగా ఉంచుకునే విధానం 

1993 లో కెనడాలోని  ఒక బ్యాంక్ లో కొత్తగా ట్రెంట్ అని ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేరాడు.   ఉన్నవారితో పాటు ఇంకోకడు అనుకుంది యాజమాన్యం.  కానీ చేరిన రెండేళ్ళకి మహా మహా సీనియర్లని మించి డిపోజిట్లను పెద్ద ఖాతాలను సంపాదించిపెట్టేడు.   ఏమిటి నీ రహస్యం అనడిగితే తన టేబిల్ మీద రెండు సీసాలు ఉన్నాయి.  ఒక దానిలో నూరు పేపర్ clips ఉన్నాయి.    కొత్త ఖాతాదారులకి ఫోన్ కాల్ చేసినప్పుడల్లా ఒక క్లిప్ ఖాళీ సీసాలో వేస్తాడు.  అన్నీ క్లిప్ లు పక్క సీసాలో పడితేనే ఆరోజుకి ఇంటికెళ్ళటం. 

ట్రెంట్ లాగే ఎందరో తమ రోజువారీ అలవాటును క్రమం తప్పక పూర్తి చేసేమనేందుకు ఋజువుగా ఇటువంటి habit trackers రూపొందించుకుంటారు.  ఇంకొన్ని ఉదాహరణలు టేబల్ కాలెండర్ అంకెల మీద టిక్ పెట్టడం, లాగ్ షీట్ నింపడం వంటివి.  ఇవి మన నియమబద్ధతకి సూచీలు.   

అలవాటుని ఇలా track చేసుకోవడం ఇంకో అలవాటు.    ఈ ఆచరణలో పేరెన్నికగన్నవాడు Benjamin Franklin.  ఆహార విహారాదుల్లో ఎంతో ధర్మబద్ధంగా జీవించి ఉండిన అతను తనకు తాను 13 నియమాలు  విధించుకున్నాడు.  అవి: నిగ్రహం, నిశ్శబ్దం, క్రమం, సంకల్పం, పొదుపు, పరిశ్రమ, చిత్తశుద్ధి, న్యాయం, సంయమం, పరిశుభ్రత, ప్రశాంతత, పవిత్రత మరియు వినయం.   వీటిని అతిక్రమించకుండా ఉండేందుకు habit tracker లాగా ఒక నోట్ బుక్ ఎప్పుడూ దగ్గర ఉంచుకునేవాడు.   ప్రతి రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు వాటి ఆచరణ సక్రమంగా చేసి వుంటే దాని కింద ఒక టిక్ పెట్టేవాడు.  ఈ దినచర్య ను జీవితాంతం పాటించాడు.   Never break the chain అనే నియమంపెట్టుకుని Jerry Sienfeld అనే కమెడియన్ ప్రతిరోజూ కొన్ని జోకులు రాసేందుకు పెట్టుకున్నాడు.  జోక్ బాగున్నా లేకున్నా ప్రతి రోజు రాయాల్సిందే.   Never break the chain ఒక మంచి habit tracker.   Sales calls, gym work out, writing a journal or blog every day ఇలా అన్నీ రొటీన్ లకు వర్తించేది.   

Habit tracking ఉపయోగాలు:  పూర్తిచేసినది cue లాగా పనిచేసి తరవాతి దానికి ప్రోత్సహిస్తుంది.   మనం పురోగమిస్తున్నామనే సంతృప్తి ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది.   

అవరోధాల నిరోధం

ఎంత నిబద్ధతతో ఉన్న ఎవరం perfect కాము కనక ఒకోసారి habit మిస్ అవచ్చు.   అది తప్పు కాదు కానీ Never miss twice రూల్ పెట్టుకోవాలి.    ఒకసారి మిస్ అయితే పొరపాటు.   రెండోసారి అయితే కొత్త అలవాటు.    Missing, slipping అనేవాటి సంయుక్త ఫలితం compound result ఊహించినకన్నా ఎక్కువ.   ఉదాహరణకి 100 రూపాయాలని 50 శాతం హెచ్చిస్తే అది 150 అవుతుంది.  కానీ మళ్ళీ 100 కి పడిపోయేందుకు 50 అక్కర్లేదు. 33 శాతం చాలు.   అందువల్ల habit తాలూకు compound effect నిర్మాణ క్రమంలో breaks అలవాటు చేసుకోకండి.  Compounding ప్రక్రియకి  interruption ముఖ్య ప్రతిబంధకం.

Tracking వేటికి కావాలి, వేటికి అక్కర్లేదు 

Tracking మొక్కుబడి తంతు number game అయిపోతే అలవాటు యొక్క దీర్ఘకాలిక పరమార్ధం కుంటుబడుతుంది.  మన మెదడు “గెలుపు” ని కోరుకుంటుంది.  గేమ్ ఎంత చిన్నదైనా.   అందువల్ల ఆరోగ్యం కన్నా అనుకున్నన్ని  push ups తీయడం, విజ్ఞాన వికాసాల కన్నా మార్కులు సంపాదించడం ముఖ్యం అయిపోతాయి.   ఒక హోటల్లో రోజుకి ఎంతమంది లంచ్ చేస్తున్నారన్నది track చేసుకుని సరిపెట్టుకుంటే చాలదు.  చుట్టుపక్కల మరేవీ లేక విధిలేక వారంతా ఇక్కడికొస్తుండవచ్చు.   అది మన హోటల్ ముఖ్య ప్రామాణికాలైన food and service quality కి గుర్తింపు అనుకోలేము.  మనం  track చేసి measure చేసే ప్రాతిపదిక మన సంస్థ దీర్ఘకాలిక లక్ష్యాలకనుగుణంగా ఉండాలి.    ఇన్ని కిలోలు తగ్గేను అన్నది ఒక్కటే  మనం చేసే workout కి కొలమానం కాదు.   అసలు బరువు తగ్గకపోయినా చర్మపు కాంతి, రోజంతా ఉల్లాసం, పడకగదిలో ప్రతాపం ఇవన్నీ కూడా workout ఇచ్చే ప్రయోజనాలే.   ఏది track చేయాలి అన్నది అనుభవం మీద వస్తుంది కానీ ఆఖరుగా tracking ఒక మంచి అలవాటు.  అది మనం పురోగమిస్తున్నామని, లక్ష్యసాధకులం అవుతున్నామని సూచిస్తూ ప్రోత్సాహిస్తుంది.   

మన జవాబుదారీ భాగస్వామి పాత్ర  

రెండో ప్రపంచయుద్ధంలో పైలట్ గా పనిచేసిన అనంతరం రాబర్ట్ ఫిషర్ హార్వర్డ్ లా స్కూల్లో చదివి negotiation and conflict management సంధాన సంఘర్ష నిర్వహణ లో విశేషమైన అధ్యయనం చేసేరు.    1975 ప్రాంతాల్లో ఆధునిక యుద్ధ వ్యూహాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడికి ప్రపంచంలో ఏ దేశం మీదనయినా  అణుబాంబు వేయగల వీలు కల్పించారు.  అధ్యక్షుడు ఎవరైనా,  కొన్ని కంప్యూటర్ కమాండ్ కోడ్ లు టైప్ చేసి బటన్ నొక్కితే చాలు వేలాది మైళ్ళ దూరంలో ఉన్న దేశం భస్మీపటాలమైపోయి లక్షలాది జనులు మసయిపోతారు.   బుద్ధిమంతులందరికి ఇది అతి ప్రమాదకర, దారుణ సౌకర్యం అనిపించింది.  క్షణికావేశంలో మీట నొక్కే ప్రెసిడెంటుకి అవతల జరిగే విలయం కనబడే, వినబడే అవకాశం కూడా లేదు.   ప్యూను కోసం నొక్కినట్టు ఇదీ ఒక బటన్. అంతే.   ఇది నివారించాలంటే ప్రెసిడెంటుకి మనిషిని చంపడం అంటే ఏమిటో తెలియజెప్పాలి.  ఫిషర్ ఒక సూచన చేసేడు.   అణుబాంబ్ కంప్యూటర్ ఉన్న గదిలోకి ప్రెసిడెంట్ వెళ్ళినప్పుడల్లా ఒక పెద్ద కత్తి పట్టుకొని అనుచరుడొకరు అతన్ని అనుసరిస్తాడు.  మీట నొక్కుదామని ప్రెసిడెంటుకి దురద పెడితే అనుచరుడు కత్తి అతని చేతికిచ్చి దీనితో ఒక మనిషిని చంపమంటాడు.   చావుని ప్రత్యక్షంగా చూచిన ప్రెసిడెంట్ కి లక్షలాది చావుల దారుణం కళ్ళముందు మెదిలి స్పృహలోకి వస్తాడు.   ఫిషర్ సలహాని పెంటాగన్ పాటించినట్టే ఉంది. 

ప్రస్తుత విషయానికి సంబంధించి, మనం చేసే పనికి ప్రతిఫలం బాధ - pain - అయితే అది ఆ పనిని చేయనీవక మనని ఆపుతుంది.   రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లు రావడం మానేసి వేరే చోటికి పోతే  హోటల్ మ్యానేజ్మెంట్ తన ఫుడ్ క్వాలిటి ని సేవను మెరుగుపరుచుకుంటుంది. .  ఒక దాని బదులు మరో రక్త నాళాన్ని కోస్తే జరగబోయే పరిణామాలు ఒక సర్జన్ కు వృత్తిలో శ్రద్ధను కలిగిస్తాయి.   

చేయరాని పనిని పొరపాటున కూడా చేయనివ్వని ఈ pain లేదా punishment లేదా దుష్పరిణామం తక్షణమే కలగాలి.   ఇప్పటి పనికి ఎప్పుడో శిక్ష అంటే జనులు పొరపాట్లు చేసుకుంటూ పోతూనే ఉంటారు.    పొరపాటు పనికి పడే శిక్ష అది ఇంకోసారి చేయకుండా ఆపగలగాలి.    పని కన్నా దాన్ని వాయిదా వేస్తే చెల్లించుకోవలసిన మూల్యం ఎక్కువైనప్పుడు productivity పెరుగుతుంది.   వ్యాయామపు ప్రయోజనం కన్నా దాన్ని ఎగగొడితే కలిగే నష్టం ఎక్కువైనప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.    సిగరెట్టు దమ్ము లాగితే కలిగే కిక్కు కన్నా పబ్లిక్ గా తాగినందుకు లోపలేసి అయిదారువేలు ఫైన్ వేసినప్పుడు జనుల్లో పౌర స్పృహ ఇనుమడిస్తుంది.   

ఈ బాదరబంది లేకుండా habit contract ను ప్రతిపాదించారు.   అభిలషణీయమైన అలవాటు లో పొరపాటు జరిగినప్పుడు హెచ్చరికగా ఒక జవాబుదారీ భాగస్వామి ఉంటారు.  అది భార్య, భర్త పిల్లలు, లేక ఉద్యోగులు, కావచ్చు.  ఈ భాగస్వామి నిరంతరం మనమీద ఒక కన్నేసి ఉంచి తప్పటడుగు వేసినప్పుడు ఎత్తిచూపుతారు.   ఒకాయన దగ్గరి వారిమీద ఆధారపడకుండా తాను ఉదయం ఐదుకి లేవవలసిన బాధ్యతను విస్మరించినప్పుడల్లా twitter లో auto alert generate అయి మిత్రబృందం అందరికీ పోతుంది.  అందులో, “అయ్యా నేను లేవాల్సిన టైమ్ కి లేవక పొరపాటు చేసేను.    ఈ మెసేజి కి రిప్లయ్ చేయండి మీకు ఐదు డాలర్లు పంపుతాను” అని కమిట్ అయేడు.   

సమాజమూ ప్రపంచమూ మనని చూస్తున్నాయంటే జాగ్రత్త పడతాం.  మన అలంకరణ, నడక, నడత అన్నీ వాటికి అనుగుణంగానే.   ఇది ఒక రాయని habit contract అయి మన అలవాట్ల మీద పెట్టవలసిన శ్రద్ధను గురించి హెచ్చరిస్తుంటుంది. 

ముగింపు: మనిషి ప్రవర్తన పరిస్థితులకనుగుణంగా మారుతూనే ఉంటుంది. ఇప్పుడు అనుకున్నదంతా మనలో ఎప్పటికీ మారని, మనకి గుర్తింపుగా జీవితాంతం మనం ఆచరించగోరే  క్రమశిక్షణాయుత ప్రవర్తనా నియమావళి గురించి.   అవే మన అలవాట్లు.  అతి సాధారణంగా కనిపిస్తూ అసాధారణ సామర్ధ్యాన్ని కలిగి మనని ఎంత ఎత్తులో నిలబెట్టాలో ఎంత కిందకి పడగొట్టాలో నిర్ణయించే అణుమాత్రపు ఆచరణలు. 






 


 







ఇప్పుడు మంచి అలవాట్లకు చెడు అలవాట్లకు వర్తించే నాలుగేసి సూత్రాలు సంగ్రహంగా:

  1. మంచి అలవాట్లు చేసుకోవడం:

ఒకటి: అది స్పష్టంగా ఉండాలి. ఇప్పటి మీ అలవాట్లను అవలోకించి అవగాహన చేసుకోండి.  Implementation ప్లాన్ వేసుకోండి.  Habit stacking అంటే అలవాట్ల సమాహారం సిద్ధపరుచుకోండి.   సరైన ప్రేరకాలు cues ను, environment వాతావరణం లేదా పరిసరాలను సృష్టించుకోండి.

రెండు: అది ఆకర్షణీయంగా ఉండాలి.   ఆ అలవాటు ఆచరిస్తే మీకు మీరు ఇచ్చుకునే ప్రతిఫలం నిర్ణయించుకోండి.   మీ desirable behavior సర్వ సామాన్యం అయిన గ్రూపులకి సన్నిహితం అవండి.  

మూడు: అది సులువై ఉండాలి: అలవాటు ఆచరణలో friction లేకుండా చూడండి.  మీ చుట్టూ వాతావరణాన్ని అలవాటుకి అనుగుణంగా అనుకూలంగా మార్చండి.   ఒక చిన్న లేశమాత్రపు అలవాటు కలిగించబోయే బృహత్ ప్రయోజనాన్ని స్మృతి లో ఉంచుకుని దాన్ని సరళీకరించి విడవక ఆచరించండి.   అలవాటు automatic గా జరిగిపోయే ఏర్పాటు చేసుకోండి. 

నాలుగు: అది సంతృప్తి కరంగా ఉండాలి.  అది వదిలిపెట్టే ఆలోచన కలగకుండా ఆచరించే విధానాలనూ ప్రోత్సాహకాలను అనుసరించండి.  భవిష్యత్తు ఫలితం  అటుంచి దాని ఆచరణ ఇప్పుడు ఆనందదాయకం కావాలి.    

చెడు అలవాట్లు విడనాడటం:

ఒకటో సూత్రానికి వ్యతిరేకం: దాని ఉనికిని  నిరాకరించి దాన్ని అదృశ్యం చేయండి.  దాని వైపు దారి తీసే cues ను ignore చేసి వాటిని తొలగించండి. 

రెండో సూత్రానికి వ్యతిరేకం: దానిని ఆకర్షణ విహీనంగా చేయండి.  దానిని వదిలి పెడితే కలగబోయే సత్ఫలితాలను గురించిన పూర్తి అవగాహన కలిగియుండండి. 

మూడో సూత్రానికి వ్యతిరేకం: దాని ఆచరణను క్లిష్టతరం చేయండి.  Friction పెంచండి.  మీకు దానికి మధ్య అవరోధాలను పెంచండి.  

నాలుగో సూత్రానికి వ్యతిరేకం: దాని ఆచరణను అసంతృప్తికరం చేయండి.   దాని ఆచరణలో గడిపిన కాలమంతా వృధా అని స్థిరంగా నమ్మండి.