Sunday, December 13, 2015

తలపులే మన తలరాత (As a Man Thinketh by James Allen)

 

“నీ ఆలోచనల్లాగే నీ జీవితం కూడా ఉంటుంది” అన్నది పెద్దల వాక్కు.  ఈ వాక్యం మనిషి మనుగడని సంపూర్ణంగా విశ్లేషించడమే కాదు, మనిషి అనుభవించబోయే జీవితాన్ని, నిత్య జీవితంలో సంభవించే పరిస్థితుల గురించి కూడా వివరిస్తుంది.  మనం దేని గురించి ఐతే ఆలోచిస్తుంటామో, ఆ ఆలోచనల సమగ్ర రూపమే మన జీవితం.

విత్తనం లేకుండా మొక్క ఉనికి లేనట్టే, మన అంతరాళాల్లోని ఆలోచనలు లేకుండా మన చర్యలూ లేవు – సదరు చర్యలు ఏవైనా సరే – అనుకోకుండా పొరపాటునో గ్రహపాటునో చేసినవీ, అనుకుని సంకల్పించి చేసినవీనీ.

ఆలోచనలు చర్యల రూపంలో పుష్పించి సుఖ దుఖాల రూపంలో ఫలిస్తాయి.  జీవితంలో మనం అనుభవించే తీపి, చేదు ఫలాలు మనకు మనంగా సాగుచేసుకున్న ఆలోచనల తోట లో నుంచి వచ్చినవే.

ప్రతీ ఫలితానికీ ఒక కారణం ఉంటుందన్న సూత్రం మన దైనందిన జీవితంలో ఎంత సత్యమో, “మనిషి భూమ్మీదకొచ్చేటప్పుడు ఏమీ కాడనీ, ఏమిగా తయారయినా అది తాను నిరంతరంగా చేసే ఆలోచనల కారణంగానే” నన్నది కూడా అంతే సత్యం.  దైవాంశసంభూతులూ, మహనీయులూ అని మనం ప్రస్తుతించే వారు తమ నిరంతరమైన సచ్చింతల కారణంగాను, దేవునితో సమానంగా లోక కల్యాణాన్ని కాంక్షించడం ద్వారాను పరిణతి చెందినవారే గాని ఎవరు ఒనరించిన ఉపకారం వల్లనో, అదృష్టం వల్లనో కాదు.  దీనికి వ్యతిరేకంగా దురాలోచనలు, ద్వేష భావం ఆలోచనల్లో కలిగిన వారు జంతు స్వభావంతో అసహ్యకరమైన జీవితాన్ని సాగిస్తారు.

మన ఉన్నతి, పతనాలకి మనమే కారణం అన్నది గ్రహించవలిసింది.  మన వద్ద గల ఆలోచనల కర్మాగారంలో మనని అన్ని విధాలుగా సర్వ నాశనం చేసే విధ్వంసకర ఆయుధాలని తయారు చేసుకోవచ్చు, లేదా సుఖ సంతోషాల తోను, శక్తి సామర్థ్యాల తో నిండిన మహోత్కృష్టమైన జీవితాన్ని నిర్మించ వీలు గల ఉపయోగకర పనిముట్లనీ తయారు చేసుకోవచ్చు.  సక్రమమైన, ఆరోగ్యకరమైన ఆలోచనల ద్వారా మనం దేవునితో సమానమైన పరిణతి సాధించగలం. తద్విరుద్ధంగా నీచమైన ఆలోచనల ద్వారా జంతువుల కన్న అధోగతికి దిగజారనూగలం.  మన నడవడిలోని అంతరాలు ఈ రెండు వైరుధ్యాల మధ్య లోనివే. వాటికి మనమే కర్తలం.

మన ఆలోచనలకి మనమే యజమానులం; మన నడవడికి  మనమే రూపశిల్పులం; మన చుట్టూ సంభవించే పరిస్థితులకి మనమే నిర్ణాయకులం అన్న సత్యం, సృష్టిలో ఇంతవరకు ఆవిష్కృతమైన సత్యాలన్నింటిలోను ఎంత మధురమైనది! అది మనకి ఎంత మనో నిబ్బరాన్ని కలిగిస్తుంది!

శక్తి, విచక్షణా జ్ఞానం, ప్రేమ, ఆలోచనలపై సంపూర్ణాధికారం కలిగి యుండడం ద్వారా మన చుట్టూ సంభవించే పరిస్థితులని మనం నిర్దేశించుకోగలం – మనకనుగుణంగా వాటిని మలచుకోగలం.

అత్యంత దయనీయమైన, పతనావస్థలో కూడా మన ఆలోచనలపై మనకు గల సర్వాధికారం పోదు.  అట్టి పరిస్థితులు మనం సదరు అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల సంభవించినవని అర్ధం చేసుకోవాలి.  ఆ పరిస్థితుల్లో మనం అంతర్ముఖులమై, మన దీనావస్థకి కారణాలనన్వేషించి విశ్లేషించుకోవాలి.  ఈ విశ్లేషణ మనకి పరిష్కారాలని సూచిస్తుంది.  అప్పుడు మనం మన సర్వ శక్తులను ఆలోచనలతో ఏకీకృతం చేసి మళ్ళీ పునర్వైభవాన్ని పొందగలం.  ఈ రకమైన చైతన్యం రావాలంటే మన ఆలోచనల శక్తి పట్ల మన విశ్వాసం ఇనుమడించాలి.  ఆచరణ, స్వయంవిశ్లేషణ, అనుభవాల ద్వారా ఇది సాధ్యం.

బంగారం, వజ్రాల వెలికితియ్యాలంటే అన్వేషణ, తవ్వకం ఎంత అవసరమో మన జీవితానికి సంబంధించిన ప్రతీ అంశం అవగతమయ్యేందుకు మన అంతరాళాలని తరచి తరచి విశ్లేషించుకొనడం అంతే అవసరం.  ముందే చెప్పినట్టు మనమే మన వ్యక్తిత్వ రూప శిల్పులం, జీవిత గమన నిర్దేశకులం, భవిష్య నిర్మాతలం అవడం వలన, నిరంతరాయంగా మన ఆలోచనలను గమనించి, నియంత్రించి, అవసరమైన చోట్ల మార్చుకొనడం ద్వారా మన చుట్టూ ఉండే పరిస్థితులను మార్చుకొనగలుగుతాం.  కారణం మరియు ఫలితాల మధ్య ఉన్న లంకె స్పష్టంగా చూడగలుగుతాం.

ఓపిక, నిరంతర శోధనల ద్వారా, ఫలితాలకి గల కారణాలు ప్రస్ఫుటమౌతాయి.  ఈ అభ్యాసం కోసం మనం నిత్యజీవితం లోని ప్రతీ చిన్న సంఘటననీ ఉపయోగించుకోవచ్చు.  ఈ క్రమంలో “అన్వేషిస్తున్నదానిని పొందగలరు; తట్టబడిన తలుపులు తెరుచుకొని తీరును” అన్న వాక్యాలు అక్షర సత్యాలుగా ఇంకోసారి నిరూపితమవుతాయి.  ఓపిక, నిరంతర అభ్యాసాల ద్వారా మనం దైవాంశ సంభూతులం కావడం అసాధ్యం కాదు.

పరిస్థితులపై ఆలోచనల ప్రభావం

మన మనస్సు ఒక వ్యవసాయ క్షేత్రం.  దాన్ని శ్రద్ధగా సాగు చేసుకోవచ్చు, లేదా అలాగే వదిలేయొచ్చు.  సాగు చేసుకున్నా వదిలివేసినా ఫలసాయం అంటూ దక్కక పోదు.  పనికొచ్చే విత్తనాలు వేసి సరైన రీతిలో సాగు చెయ్యకపోతే పనికిమాలిన, ప్రమాదకరమైన కలుపు అందులో వేళ్ళూనుకుంటుంది, అందుకు అనుగుణమైన “దిగుబడి”ని అందిస్తుంది.

అందువల్ల మనం మనోవనంలో అత్యంత ప్రయోజనకరమైన, నిర్మలమైన ఆలోచనలనే పెంపు చేస్తూ, అందుకు విరుద్ధమైన కలుపుని జాగరూకతతో గుర్తించి ఏరివేస్తూండాలి.  ఈ మనోసేద్యాన్ని క్రమం తప్పకుండా, నిరంతరంగా పాటించిననాడు, అందులో ప్రావీణ్యం సాధిస్తాం, మన జీవన గమనానికి మనమే ఉత్తమ దిశా నిర్దేశకులమౌతాం.  పరిశ్రమ అధికమయినకొద్దీ మన ఆలోచనలలోని లోపాలు విస్పష్టంగా గోచరించి, ఏయే ఆలోచనల ద్వారా ఏయే ఫలితాలు కలుగుతున్నాయో, మన వ్యక్తిత్వం, మన చుట్టూ ఉండే పరిస్థితులు, మన జీవన గమ్యం ఏ దిశగా పయనిస్తున్నాయో ప్రస్ఫుటమౌతాయి.

మన చుట్టూ ఉండే వాతావరణం, పరిస్థితులు మన నడవడికని  ప్రభావం చేస్తాయి.  శ్రద్ధగా పరిశిలిస్తె, బాహ్య పరిస్థితుల ప్రభావం మన మన:స్థితికి అనుగుణంగా ప్రతిస్పందిస్తున్నట్టు గమనించవచ్చు.  ఇక్కడ చెప్పబోయేది మన చుట్టూ ఉండే పరిస్థితులు మన నడవడికని పూర్తిగా ప్రతిబింబిస్తున్నాయని కాదు గానీ, వాటికి, మన మనస్సులోని ఆలోచనా ధోరణికి ఎదో గట్టి బంధమే ఉన్నదన్నది మాత్రమే.

మన యొక్క ప్రస్తుత దశ మన మనుగడకి సంబంధించిన ఒక సూత్రంపై ఆధారపడి ఉన్నది.  ఆలోచనలతో మనం నిర్మించుకున్న మన నడవడికే మనలను ఇక్కడికి తెచ్చింది.  ఇందులో పొరపాటు జరగడానికి ఆస్కారమే లేదు.  పరిస్థితులలో ఇమడలేని వారి విషయంలోనూ, అదే పరిస్థితులతో సంతృప్తి చెందుతున్న వారి విషయంలోనూ కూడా ఇది వర్తిస్తుంది.

మన జీవనం మన చుట్టూ ఉండే పరిస్థితులపై ఆధారపడి ఉన్నదని నమ్మినంత కాలం, మనం పరిస్థితులకి బానిసలం కాక తప్పదు.  ఎప్పుడైతే అనూహ్యమైన సృజనాత్మకత మనకు సొంతమని, మన చుట్టూ సంభవించే పరిస్థితులను నియంత్రించగల ఆలోచనా శక్తి మన అదుపాజ్ఞలలకి లోబడి ఉంటుందని గ్రహిస్తామో, ఆ క్షణమే మనకు మనం సరైన యజమానులమవుతాం.

మన చుట్టూ ఉండే పరిస్థితులు మన ఆలోచనలకనుగుణంగా ప్రతిస్పందిస్తాయన్న విషయాన్ని కనీసం కొద్ది కాలం పాటు ఆత్మ శుద్ధినీ, మనో నిగ్రహాన్నీ అభ్యాసం చేసిన ప్రతివారూ గ్రహిస్తారు.  ఎప్పుడైతే నిరంతర అభ్యాసంతో ఆలోచనా స్రవంతిని సక్రమ మార్గంలో మళ్ళిస్తూ మన నడవడికలోని లోపాల్ని సరిదిద్దుకోగలుగుతామో, అదే అభ్యాసాన్ని కొనసాగించడం ద్వారా మరిన్ని అత్యున్నత శిఖరాలనధిరోహిస్తాం.

మనసు రహస్యంగా దేన్నైతే ధ్యానిస్తూంటుందో దానినే ఆకర్షించుకుంటుంది.  ఆమితంగా ప్రేమించే విషయాలూ, అతిగా  ద్వేషించేవీ కూడా ఇందులోకి వస్తాయి. సాధించదగిన విజయాల నిరంతర స్మరణ ఉన్నత శిఖరాలకు చేరుస్తే, కలలో కూడా స్మరింపకూడని క్షుద్రమైన కోరికల చింతన అథ:పాతాళానికి తొక్కుతుంది.

మనోక్షేత్రంలో విత్తిన “ఆలోచన” అనే ప్రతి విత్తనం అంకురించి, వేళ్ళూనుకుని, ఎదో ఒకనాడు “ఫలసాయాన్ని” అందించక మానదు.  సచ్చింతలు అమృత ఫలాలనిస్తే, తద్భిన్నమైనవి విష ఫలాలనిస్తాయి.

బాహ్య పరిస్థితులు మన ఆలోచనలకనుగుణంగా ప్రతిఫలిస్తాయి కాబట్టి, మనకి కలిగే మధురానుభూతులూ, చేదు అనుభవాలూ కూడా చివరికి మన మంచికే దోహద పడతాయి.  ఈ సేద్యంలో ఆరితేరిన కొద్దీ ఆనందం విషాదం అనే పంటల గురించిన క్షుణ్ణమైన అవగాహన మనకి లభిస్తుంది.

మనసులో అలజడి రేపే కోరికలు, క్షుద్రాశయాలు, ఆలోచనలను  అదే పనిగా అనుసరిస్తూ పోయి వాటికి మనం బానిసలుగా మారిపోయినప్పుడు వాటికి పరాకాష్ఠనదగ్గ పరిస్థితులు అనతికాలంలోనే మనకు అనుభవంలోకి వస్తాయి.  ఈ సూత్రానికి మినహాయింపే లేదు.

భిక్షమెత్తుకోవలసిరావడం, కారాగృహంలో మ్రగ్గి క్షోభననుభవించడం వంటి క్లేశాలకు కారణం తలరాతో, శనిగ్రహావేశమో కానే కావు.  పెడ దారి పట్టిన బుద్ధి, నీచమైన ఆలోచనలు, క్షుద్రమైన కోరికలే అసలు కారణం.  మనం చూస్తూంటాం వింటూంటాం – ఓ ధర్మాత్ముడు ఖర్మ కాలి తన తత్వానికి విరుద్ధంగా ఏదో నేరం చేసి శిక్షననుభవించేడనీ.  దీని కారణం కూడా కనబడని ఏ మానవాతీత శక్తో కాదు.  నేరపూరిత స్వభావానుగుణమైన తలపులు అతని మనస్సులో ఎప్పటినించో నిరంతరాయంగా పెంచి పోషింపబడుతున్నాయి.  ఆ ఖర్మ ఎదో కాలిపోయే సమయం ఆసన్నమయే క్షణానికి ఆ తలపులు పరిస్థితుల రూపంలో బహిర్గతమయ్యేయి.

పరిస్థితులు మనలను తయారు చెయ్యవు.  అవి మనని మనకు అద్దంలో చూపెడతాయంతే.  దీర్ఘకాలంగా తలచిన చెడు తలపులు తప్ప మన పతనానికి వేరే కారణాలేమీ లేవు; అలాగే అకుంఠిత దీక్ష, మనోనిగ్రహం వంటి సాధన సంపత్తితో నిర్మించుకున్న సచ్చింతనామృతం మినహా మనకు ఉన్నతిని, సుఖసంతోషాలను ప్రసాదించగల దివ్యౌషధమూ లేదు. ఈ రహస్యాన్ని గ్రహిస్తే తగు అభ్యాసంతో మన “రాతని” మనమే వ్రాసుకోగలం.  అందరి పుట్టుకా ఒకలాగే ఉన్నప్పటికీ, జీవితమనే తీర్థయాత్రలో మనకు ఎప్పటికప్పుడు తారసపడే ఇతర యాత్రికుల సాంగత్యం నించి పవిత్ర, లేదా అపవిత్ర భావనలనూ, అలాగే శక్తులు లేదా బలహీనతలను పోగు చేసుకుని మనలను మనం తయారుచేసుకుంటాం.  మనం పొందేవి మనం కోరుకున్నవి కావు.  “మనకి మనమే లభిస్తాం”.  ఇష్టారాజ్యంగా పెంచి పోషించుకున్న వింతవింత కోరికలు, ఆశయాలు ఎక్కడికక్కడే త్రుంచివేయబడుతున్నా, లోపలి ఆలోచనాగ్ని ఆరిపోక, ఏ మూలో దాగియున్న కోరికలనూ ఆశయాలను – అవి ఉన్నతమైనవైనా క్షుద్రమైనవైనా – ఆహరిస్తూ జ్వలిస్తూనే ఉంటుంది.  ఆలోచనలు, చేతలు నీచమైనవైనప్పుడు మనలను మార్గాంతరం కనబడని చక్రవ్యూహంలో బంధిస్తాయి; ఉత్కృష్టమైనవైనప్పుడు తేజస్సును, యశస్సును, స్వేచ్చను ప్రసాదిస్తాయి. భగవంతుడు మన ప్రార్ధనలలో కోరుకున్నవాటిని మనకు ప్రసాదించక, మనం ఏ ఫలితానికి న్యాయబద్ధంగా అర్హులమో దానినే అనుగ్రహిస్తాడు.  మనసులోని ఆలోచనలు నాణ్యత కలిగియున్నప్పుడు, వాటితో మనం చేస్తున్న ఫ్రార్ధనలకు పొంతన కుదిరినప్పుడే ప్రార్ధనలు దేవుని చెవినబడతాయి.

అలాంటప్పుడు కొందరు “పరిస్థితులతో పోరాడుతున్నాం” అంటారే?   వ్యక్తికీ పరిస్థితులకీ పోరాటం ఎలా సంభవిస్తుంది?  ఇక్కడ గ్రహించాల్సిందేమిటంటే, బయటి పరిస్థితులతో పోరాడుతూనే ఉంటాం. అంటే ఫలితం పిలకూడదియ్యడానికి సిద్ధపడతాం గాని అందుక్కారణమైన ఆలోచనలను మాత్రం మదినుండి బహిష్కరించం.  సదరు కారణం, తెలిసి కూడా వదలబుద్ధికాని దురభ్యాసం కావచ్చు; లేదా ‘అది అంటూ ఒకటుందని ‘ మనకే తెలియని మనల్ని ఆవహించిన బలహీనత అయినా కావచ్చు.  ఏదైనా సరే, అది పరిస్థితులతో పోరాటం విజయవంతం కాకుండా ప్రతిఘటిస్తూంటుంది.  అందువల్ల ఈ పోరాటానికి అంతం అన్నది కనిపించదు.

మనం పరిస్థితులను మార్చెయ్యడానికి మొగ్గు చూపుతాం కాని ఒక వ్యక్తిగా మనని మనం సంస్కరించుకోడానికి అంత ఉత్సుకత చూపం.  అవసరమైతే ‘తనకు తాను సిలువ వేసుకోవడానిక్కూడా’ వెనుకంజ వేయని వ్యక్తి తను సంకల్పించి చేపట్టిన ఏ కార్యంలోనూ విఫలం కాబోడు.  భౌతిక ప్రపంచానికీ ఆధ్యాత్మిక ప్రపంచానికీ కూడా ఈ సత్యం వర్తిస్తుంది.    కేవల ధనార్జనే ఆశయంగా కలిగిన వ్యక్తి కూడా ఆశయ సిద్ధి కోసం వ్యక్తిగత జీవితంలో అనేక త్యాగాలు చెయ్యాల్సుంటుంది;  అటువంటిది, అనన్యసామాన్యమయిన శక్తిసంపన్నతలు, సుఖశాంతులతో పరిపూర్ణమై, దేవుని ముందు కూడా తలదించుకుని నిలబడాల్సిన అవసరంలేనటువంటి నిష్కళంక జీవనమే ఆశయంగా కలిగిన మహనీయుల విషయం చెప్పేదేముంది.

“ధర్మాత్ముడి జీవితంలో అన్నీ కష్టాలే” అని ఒక విశ్వజనీనమైన సూత్రీకరణ చేసిపారేస్తాం.  ఇటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించేముందు ఆ యొక్క ధర్మాత్ముడి జీవన విధానాన్ని అతి చేరువనించి గమనించడం అంటూ జరిగితే, అతని కష్టాలకు కారణం నలుగురికీ కనిపించే అతని “ధర్మం” కాదనీ, అతని చీకటి పార్శ్వంలోని చెడుతలపులేనని అర్ధం అవుతుంది.  ఎప్పుడో ఒకప్పుడు “దశ తిరిగి”, పశ్చాత్తాపం తోనో ప్రయోగాత్మకం గానో అతడు సుదీర్ఘ అభ్యాసానంతరం దురాలోచనల మురికిని వదిలించుకుని తేటయై తేజస్వంతమైన సచ్చింతలతో పరిశుద్ధుడైననాడు తనకు తానుగానే తన పూర్వాశ్రమంలోని క్లేశాలక్కారణం అవగతం చేసుకొనగలుగుతాడు.  “మంచివాళ్ళకెప్పుడూ కష్టాలే, చెడ్డవాళ్ళకే భోగాలు” అని ప్రాచుర్యంలో ఉన్న సూత్రం నిజం కాదని గ్రహిస్తాడు.  వెనుదిరిగి చూసుకుని తన గతజీవితాన్ని విశ్లేషించుకున్నకొద్దీ, జీవితంలో అంతా సక్రమమేననీ, అయోమయానికీ అస్తవ్యస్తతకీ తావే లేదనీ, గతం లోని తన ధుఖానుభవాలు కారణం లేకుండా కలిగినవి కావనీ తెలుసుకుంటాడు.

మంచి ఆలోచనలు చెడు ఫలితాలనియ్యవు.  దురాలోచనలు మంచి ఫలితాలనియ్యవు.  ధాన్యం కంకులనించి ధాన్యమే వస్తుంది; నువ్వు కంకులనుంచి నువ్వులే వస్తాయి.  భౌతిక ప్రపంచంలో ఈ విషయాన్ని అందరూ గ్రహిస్తారు; అయితే ఏ కొద్ది మందో మాత్రమే ఆంతరంగిక, మనో ప్రపంచంలో కూడా ఈ సూత్రం నూటికి నూరు పాళ్ళు నిజమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.

క్లేశం ఏదో ఒక దశలో తలచిన చెడు తలపుల ఫలితమే.  ఆ పరిస్థితుల్లో మనం మన సహజ నైజానికి భిన్నంగా ఉన్నామని గ్రహించాలి.  దు:ఖం అంతరంగాన్ని శుద్ధిచేస్తుంది.  దు:ఖ ప్రయోజనం అదే – మదిలోని కుళ్ళును దహించివెయ్యడం.  శుద్ధీకరణ ప్రక్రియ పూర్తయిన వారికి ఇక దు:ఖాలంటూ ఉండవు.  పుటంలో బంగారాన్ని ఆవరించుకున్న మాలిన్యాలు దహించుకొనిపోయి ఇక మిగిలిన పుత్తడిని అగ్ని ఏ విధంగా దహించలేదో, అట్లే మనో మాలిన్యాల నుండి ముక్తుడైన వారిని ఏ కష్టాలూ దరిచేరవు.

సుఖ సంతోషకర పరిస్థితులు సుస్వర రాగరంజితం వంటి మానసిక స్థితిని ప్రతిబింబిస్తే, దు:ఖకారక పరిస్థితులు అపస్వరభూయిష్టమైన సంగీతప్రయోగంవంటి మన:స్థితిని సూచిస్తాయి.  మంచిఆలోచనలను కానీ మురికితలపులను కానీ బేరీజు వేసేటప్పుడు ఒక వ్యక్తి సర్వతోముఖ సంతుష్టాంతరంగుడా లేక శీలభ్రష్టత్వం పొందిన క్షుద్రుడా అనేదే చూడాలి గాని అతని ఆలోచనలను అతను కూడాపెట్టిన ధనరాశులతో ముడిపెట్ట రాదు.  శీలసంపన్నుడు నిరుపేద కావచ్చు; శీలహీనుడు ఐశ్వర్యంతో తులతూగవచ్చు.  ధనవంతుడు తన ధనాన్ని సర్వజనహితం కోసం వినియోగించినప్పుడు మాత్రమే అతని ఐశ్వర్యానికి ధార్మికత చేకూరినట్టు.  తను అనుభవిస్తున్న పేదరికం అన్యాయంగా తనమీద రుద్దబడిందని భావించినప్పుడు మాత్రమే నిరుపేద ధనహీనతతో పాటు శీలహీనతను కూడా పొందుతాడు.

దారిద్ర్యం, కోరికల విశృంఖలత్వం శీలభ్రష్టత్వానికి రెండు పార్శ్వాలు.  రెండూ మానవ ప్రకృతికి విరుద్ధమైనవీ, పెడదారిపట్టిన మన:స్థితిని సూచించేవీనీ.  ఆయురారోగ్యైశ్వర్యాలు మనకు ఆనందకారకాలు.  మన బాహ్య – అంతర స్వభావాల మధ్య క్రమబద్ధమైన సారూప్యత ఉన్నప్పుడే అవి మనకు సిద్ధిస్తాయి.

“నాకు ఏమీ లేదు, నేనిలాగే ఉండిపోయి మిగతావాళ్ళందరూ బాగుపడిపోతున్నారు” అనే ఏడుపుగొట్టు స్వభావాన్ని వదలివేసి మన పరిస్థితులకి కారణాలను మనలోనే భాగమైన సృష్టిన్యాయసూత్రాలనుంచి విశ్లేషించుకోవాలి.  పరనిందకు పాల్పడక, ఉత్కృష్టమైన ఆలోచనావిధానాన్ని అభ్యసించి తదనుగుణంగా చేతలను మార్చుకోవాలి. పరిస్థితులపై పోరాటం చేయక, ఆ పరిస్థితులనే మార్గదర్శకాలుగా ఉపయోగించుకుంటే ఇంకా త్వరితగతిని అభివృద్ధి చెందడం సాధ్యపడుతుంది.

అయోమయానికి తావులేని ఒక సుస్పష్టమైన న్యాయ సూత్రమే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నది.  జీవితంలో జరిగేవన్నీ న్యాయబద్ధమే.  సచ్ఛీలమే మానసిక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నడిపించగలదు కాని అవినీతి కాదు.  ప్రపంచం అనుసరించే మార్గం సరైనదే అని గ్రహించడానికి మనం అనుసరించే మార్గం కూడా సరి అయినదే కావాలి.  ఈ విధంగా పరివర్తన చెందే క్రమంలో మనం ఇతరుల పట్ల, పరిస్థితులపట్ల మన ఆలోచనలను మార్చుకుంటాం.  ఫలితంగా ఇతరులూ, పరిస్థితులు మనకు అనుగుణంగా మారుతారు.

ఎవరైనా సరే ఈ సత్యాన్ని సమర్ధవంతంగా రుజువు చేయవచ్చును.  చిత్తశుద్ధితో ఆలోచనలను పూర్తిగా మార్చుకుని చూడండి, మీ చుట్టూ ఉండే పరిస్థితులు కూడా తదనుగుణంగా మారిపోవడం చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది.  ఆలోచనలు రహస్యంగా ఉంచుతున్నాం అని మనం అనుకుంటుంటాం;  కాని అది భ్రమ.  అదృశ్యరూపం లోని ఆలోచన అలవాటుగా దృశ్యరూపాన్ని సంతరించుకొని, తదుపరి పరిస్థితుల రూపంలో ఘనీభవిస్తుంది.  ఆలోచనల నాణ్యతని బట్టి పరిస్థితుల సౌందర్యం.   తలపుల్లోని పశువాంఛలు మత్తు, ఉన్మాదం అనే అలవాట్లుగా మారి  వ్యాధి, వేదన అనే పరిస్థితులను సృష్టిస్తాయి.  అపవిత్రపు ఆలోచనలు అయోమయం, పరాకు అనే అలవాట్లుగా మారి, అన్నింటా వైఫల్యం అనే పరిస్థితులను సృష్టిస్తాయి.  భయం, సంశయం, అనిశ్చితి నిండిన ఆలోచనలు బలహీనత, నపుంసకత్వం అనే అలవాట్లుగా మారి దారిద్ర్యం, బానిసత్వం అనే పరిస్థితులను సృష్టిస్తాయి.   ఆలోచనల్లో అలసత్వం అపరిశుభ్రత, అవినీతి అనే అలవాట్లుగా మారి అవమానకరంగా ఒకరి మోచేతికింద నీళ్ళు తాగవలసిన పరిస్థితులను కల్పిస్తుంది.    ద్వేషపూరిత, పరనిందాత్మక ఆలోచనలు దూషణ, హింస అనే అలవాట్లుగా మారి, పరస్పర హననం అనే పరిస్థితిని సృష్టిస్తాయి.  స్వార్ధపూరిత ఆలోచనలు ఏ రకానికి చెందినవైనా సరే, స్వలాభాపేక్ష అనే అలవాటుగా మారి, విషాదకర పరిస్థితులను సృష్టిస్తాయి.

దీనికి భిన్నంగా, ఉన్నతమైన ఆలోచనలు దయ, హుందాతనం అనే అలవాట్లుగా మారి, సౌభ్రాతృత్వం, సౌహార్దత అనే పరిస్థితులను సృష్టిస్తాయి.  స్వచ్ఛమైన ఆలోచనలు నిగ్రహం అనే అలవాటుగా మారి అలౌకిక శాంతి అనే పరిస్థితిని సృష్టిస్తాయి.  ధైర్యం, స్వాధికారం నిండిన ఆలోచనలు ధీరత్వమనే అలవాటుగా మారి విజయం, స్వేచ్ఛ అనే పరిస్థితులను సృష్టిస్తాయి.  శక్తిని నింపుకున్న ఆలోచనలు శుద్ధి, పరిశ్రమ అనే అలవాట్లుగా మారి ఆహ్లాదకర పరిస్థితులుగా రూపుదాలుస్తాయి.  క్షమ, సౌమ్యత కలిగిన ఆలోచనలు నిదానత్వమనే అలవాటుగా మారి భద్రతను, రక్షణను పరిస్థితులుగా సృష్టిస్తాయి.  ప్రేమ, స్వార్ధరహిత ఆలోచనలు తరగని నిజమైన సంపదలను పరిస్థితులుగా సృష్టిస్తాయి.

దీర్ఘకాలంపాటు సాధన చేసిన ఆలోచనావిధానం ఏదీ కూడా నడవడికను, తద్వారా పరిస్థితులను ఫలితాలుగా తయారుచేయక మానదు.  మనం మన చుట్టూ ఉండే పరిస్థితులను ఎన్నుకోలేము.  కాని మన ఆలోచనలను ఎన్నుకోగలము.  మన ఆలోచనల పూర్తి ఫలాలను మనకు ఒసగడానికి ప్రకృతి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.  ఆ ఆలోచనల సాకారానికి వలసిన పరిస్థితులను అది సృష్టించి మన చుట్టూ పరుస్తుంది.

పాపచింతనలను పూర్తిగా వదలివేసిన అనతికాలం లోనే మన చుట్టూ ఉన్న ప్రపంచం విచిత్రంగా, మృదువుగా, మనకు సహాయపడేనిమిత్తం సిద్ధపడిపోతుంది.  బలహీన, వ్యాధిగ్రస్తమైన ఆలోచనలను వదలివేసిన అనతికాలం లోనే మనకు అందుబాటులోకి ఊహించనన్ని అవకాశాలు వృద్ధిచెందుతాయి.  సర్వజన ప్రయోజనకరమైన ఆలోచనలు పెంపు చేసుకున్న అనతికాలం లోనే దురదృష్టం మనను వెన్నంటడం మానివేస్తుంది, లజ్జాకర భ్రష్ట జీవితం నుంచి విముక్తి లభిస్తుంది.  ఈ ప్రపంచం ఒక సర్వవర్ణశోభితమైన కెలీడోస్కోపు వంటిది.  మన ఆలోచనలలో మార్పు అనే ప్రతి కదలికా ఒక వినూతన వర్ణచిత్రాన్ని పరిస్థితుల రూపంలో ఆవిష్కరిస్తుంది.

దేహంఆరోగ్యాలపై ఆలోచనల ప్రభావం

దేహం మనస్సుకు బానిస.  అది మనోజనితమైన చర్యలకనుగుణంగా ప్రవర్తించక తప్పదు – అసంకల్పితమైనవైనా సంకల్పించినవైనా.  నష్టకారక, ప్రకృతివిరుద్ధమైన ఆలోచనలు కలిగినప్పుడు అది వ్యాధిగ్రస్తమై కుచించుకుపోతుంది.  ఆరోగ్యకరమైన, సర్వజనప్రయోజనకరమైన ఆలోచనలు కలిగినప్పుడు అది యౌవనాన్ని, సౌందర్యాన్ని సంతరించుకుంటుంది.

ఆరోగ్యం, అనారోగ్యం – రెంటి మూలం అలోచనే.  వ్యాధిగ్రస్త ఆలోచనలు దేహాన్ని అస్వస్థపరుస్తాయి.  మనస్సులో గూడు కట్టుకున్న నిరంతర భీతిపూర్వక ఆలోచనలు తుపాకీ గుండంత సూటియైన గురితో వ్యక్తిని సంహరింప సమర్ధత గలవిగా ఉంటాయి.    వ్యాధిగురించిన నిరంతర భీతి వ్యాధిని తప్పక ప్రసాదిస్తుంది.  ఆందోళన దేహాన్ని నీరసపరుస్తుంది, తద్వారా వ్యాధి ప్రవేశానికి తలుపులు బార్లాతెరుస్తుంది.  ఆచరణలో పెట్టకపోయినా కలుషిత ఆలోచనలు నాడీవ్యవస్థను చిన్నాభిన్నం చేస్తాయి.

శక్తియుతమైన, పరిశుద్ధ, సంతోషకర ఆలోచనలు శరీరాన్ని ఉత్తేజంతోను, ఠీవి తోనూ పరిపూర్ణం చేస్తాయి.  శరీరం మృదులంగా ఉండే ప్లాస్టిక్ సాధనం.  ఆలోచనల వేడి ముద్రలు దానిపై సునాయాసంగాను, నిర్దుష్టంగాను పడతాయి.

ఆలోచనల్లోని కాలుష్యం రక్తాన్ని కలుషితం గాను, విషపూరితం గాను చేస్తుంది.  నిర్మల హృదయం నిర్మలమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇస్తుంది.  పెడదారిపట్టిన మనస్సు వ్యాధిని, దేహ శైధిల్యాన్ని కల్గిస్తుంది.  మనస్సు ఆలోచనల ఫౌంటెయిన్ పరికరం.  శరీరం పైకి చిమ్మబడే ఫౌంటెయిన్ జలం.  లోపలి జలం స్వచ్చతే బయటికి ప్రసరిస్తుంది.

ఆలోచనలను మార్చుకొన సిద్దపడని వానికి, ఆహారంలో మార్పుచేసుకున్నంత మాత్రాన ఆరోగ్యంలో మార్పు సాధ్యపడదు.  ఆలోచనలను శుద్ధిచేసుకున్నవారు అపరిశుద్ధ ఆహారాన్ని కోరుకొనరు.

ఆలోచనలలోని శుద్ధతే అలవాట్లలోని శుద్ధత.  స్నానాది దేహావసరాలను పరిత్యజించిన సన్యాసి ఋషి కాబోడు.  ఆలోచనలలో దృఢత్వం, శుద్ధి కలిగిన వాడు దుష్టసాంగత్యాన్ని పట్టించుకోడు.

కనుక చెక్కుచెదరని దేహారోగ్యం అభిలషించేవారు ఆలోచనలను నిరంతరం విశ్లేషించుకుంటూ సంస్కరించుకుంటూండాలి.  ఆలోచనల్లోని ద్వేషం, అసూయ, నిరుత్సాహం, నిర్వేదం దేహారోగ్యాన్ని భ్రష్టుపట్టిస్తాయి.  ఏడుపుగొట్టు మొహాలు శరీరతత్వాన్నిబట్టి కాక, మనస్తత్వాన్ని బట్టి తయారవుతాయి.  ముఖసౌందర్యాన్ని హరించే ముడుతలు మదం, తరగని అనురక్తి, గర్వాతిశయాల వల్ల ఏర్పడుతాయి.

నాకు తెలిసిన ఒక తొంభై ఆరేళ్ళ మహిళ ముఖంలో చిన్నారి బాలికలకుండే స్వచ్ఛత, తేజం, అమాయకత్వం కనిపించేవి.  నిండా నలభై ఏళ్ళు కూడా లేని ఇంకో పెద్ద మనిషి ముఖం అందరూ జడుసుకునేలా ముడుతలు, అసహజమైన వక్ర రేఖలతో భాసిల్లేది.  ఒకటి హృదయ నైర్మల్యానికి, రెండవది మోహాసంతృప్తులకు ప్రతిబింబాలు.

గృహం వాసయోగ్యం కావాలంటే దాని కిటికీలగుండా స్వచ్ఛమైన గాలీ వెలుతురు ప్రసారం నిరంతరంగా కొనసాగుతుండాలి.  దేహమనే గృహానికి మనసు కిటికి, ఆలోచనలు గాలీ వెలుతురూనూ.  ఆలోచనలు ఉత్సాహవంతంగా, ప్రశాంతంగా, క్షేమకరంగా ఉంటే శరీరారోగ్యం సిద్ధిస్తుంది.

ముఖసౌందర్యాన్ని హరించే ముడుతలు వృద్ధాప్యంవల్లనైనా వస్తాయి, లేదా ఎడతెగకుండా పెంచి పోషించుకుంటున్న మోహావేశపూరిత ఆలోచనల వల్ల కలుగుతాయి.  రెంటి మధ్య తేడాను కనిపెట్టడం సులభం.  జీవితాన్ని సత్యసంధతతో, సచ్చింతనతో గడిపినప్పుడు వృద్ధాప్యం కూడా పరిపక్వమై ప్రశాంతంగా అస్తమిస్తున్న సూర్యుని మాదిరి, తీరని కోరికల వలన కలిగే అసంతృప్తి అనేది లేకుండా గడచిపోతుంది.  మరణశయ్య పై ఆఖరిపిలుపుకోసం ఎదురుచూస్తున్న ఒక సర్వసంగపరిత్యాగిని నేను దర్శించాను.  అతని ముఖంలో వృద్ధాప్యం కేవలం గతించిన సంవత్సరాల రూపంలోనే గాని వేరెందులోనూ నాకు కనిపించలేదు. అతని జీవనం సాగిన విధంగానే మరణం కూడా ప్రశాంతంగా, ప్రసన్నంగా అతనిని అనుగ్రహించింది.

ఉల్లాసకరమైన ఆలోచన తప్ప దేహ రుగ్మతలను హరింపగల వైద్యం వేరే ఎదీ లేదు.  అంతరంగంలోని మంచితనం తప్ప దు:ఖ విషాదాలను పారద్రోలగల సాధనం లేదు.  ద్వేషం, వక్రత, అనుమానం, అసూయ లాంటి అవగుణాలను ఆలోచనల్లో పెంచి పోషించడమంటే మనకు మనంగా గాలిచొరని కుక్కగుంటను తవ్వుకుని అందులో నివసిస్తున్నట్టే.  కాక అందరి మంచి గురించి ఆలోచిస్తూ, అందరితోనూ ఉత్సాహంగా మెలగుతూ, ప్రతీవారిలోని మంచితనాన్ని ఓపిగ్గా పరిశిలించి గ్రహిస్తూ స్వార్ధరహితమైన ఆలోచనలు కలిగియున్నవారి జీవితం స్వర్గతుల్యం.

ఆలోచన  పరమార్ధం

ఆలోచనను జీవితాశయానికి అనుసంధించినప్పుడే వివేకసిద్ధి.  దురదృష్టవశాత్తు మనలో అనేకుల ఆలోచన అనే చిరునావ “సంసారసాగర” అలల ఉధృతికి కొట్టుకుపోతుంది.  గమ్యంలేకపోవడం కూడా ఒక వ్యసనమే.  విపత్తులను ఆపదలను సమర్ధంగా ఎదుర్కుని జీవితంలో నిలదొక్కుకున్నవారెవరూ గమ్యరహితంగా ఎక్కువకాలం ఉండరాదు.

జీవితంలో ముఖ్యోద్దేశం అంటూ ఏమీలేనివారు నిత్యజీవితంలో సంభవించే చిన్నచిన్న ఒడిదుడుకులకు అతిగా స్పందించి భయం, ఖేదం, సెల్ఫ్-పిటీలకు సులభంగా లోనవుతారు.  ఇవన్నీ బలహీనతలే. వీటి దుష్ప్రభావం కూడా సంకల్పించి ఒడిగట్టే పాపకార్యాల దుష్ప్రభావం కన్న తక్కువేమీ కాదు.  శక్తి సామర్ధ్యాలను ఏ క్షణానికక్షణం వృద్ధి చేసుకుని తేజస్సంపన్నతతో ఉరుకులెత్తుతూ పురోగమించే నేటి ప్రపంచంలో ఈ విధమైన మానసిక రుగ్మతలు అస్వాభావికం.

మనలోని ప్రతి ఒక్కరు హృదయంలో ఒక అర్ధవంతమైన, ప్రయోజనకారి అయిన జీవితాశయాన్ని దృఢంగా సంకల్పించుకొని తత్ సాధన దిశగా పురోగమించాలి.  ఆలోచనలనిండా ఎల్లప్పుడూ ఆ ఆశయమే ఉండాలి.  దాని సాధనే జీవిత పరమార్ధం కావాలి.  అది ఆధ్యాతిక పరిపక్వత కావచ్చు, లేక ఏదైన ప్రాపంచిక ప్రయోజనం కావచ్చు – దానిని నిర్ణయించే సమయానికి మన మన:స్థితినిబట్టి, విజ్ఞతననుసరించి.  ఏదైనా, మన ఆలోచనలన్నీ దానిపైనే కేంద్రీకృతం కావాలి.  దానిచుట్టూ పరిభ్రమిస్తూండాలి.

ఆ పరమార్ధసాధనే ధ్యేయంగా సర్వశక్తులూ వినియోగించాలి.  ఆ బాటలో ఎదురయ్యే చిన్నచిన్న అవరోధాలను (అంటే నిత్యం ఎదురయ్యే సామాన్యమైన కష్టాలు) రహదారికడ్డంగా ఉన్న ముళ్ళకంచెలను తొలగించినట్లు తొలగించుకుంటూ దీక్షను అవిరళంగా కొనసాగించాలి.  అప్రధానమైన ఆందోళనలు, భయాలు,  కోరికలు, భ్రాంతులను నియంత్రించుకుంటూ మనశ్శక్తిని ఆశయంపై కేంద్రీకరించాలి.  ఈ క్రమంలో ఎన్నిసార్లు విఫలమైనా, (బలహీనతలున్నంతవరకు వైఫల్యం వెన్నంటే ఉంటుంది కనుక) మరల మరల ప్రయత్నం నిరాఘాటంగా కొనసాగించాలి.  మన నడవడిలోను, యోగ్యత లోను ప్రత్యక్షంగా కనిపించే పరిణామమే ఈ ప్రయాణంలో మనం అంచెలంచెలుగా దాటుతున్న మైలురాళ్ళకు సంకేతం.   భవిష్యత్తులో మన సొంతం కాబోయే శక్తియుక్తులకు, విజయానికి ఇవే పునాదిరాళ్ళు.

అయితే ఆలోచనలు నడవడి యోగ్యమైనవిగా కలిగి ఆదర్శవంతమైన జీవనం నిర్వహిస్తున్నప్పటికీ ఒక “స్థిరమైన జీవితాశయం” అన్నది అందరికీ స్ఫురించదు. అటువంటి వారు తమ నిత్యకర్మలనే, అవెంత సామాన్యమైనవైనప్పటికీ, పరిపూర్ణమైన శ్రద్ధతో నిర్వహించాలి.  ఆలోచనలు అన్నీ ఒక దిశలో కేంద్రీకృతం కావడానికి ఇది దోహదపడుతుంది.  యోగ్యమైన ఆలోచనలు కేంద్రికృతమైనప్పుడు వాటిని ఏ కార్యం మీదికి మళ్ళిస్తే ఆ కార్యసాఫల్యం అతి సునాయాసమౌతుంది.

తమ బలహీనతల గురించి అవగాహన ఉన్నవారు నిరంతర అభ్యాస ప్రయత్నాల వలననే బలసిద్ధి కలుగుతుందన్న సత్యాన్ని నిస్సందేహంగా నమ్మిన అనతికాలంలోనే, వేడితగిలినప్పుడు రాతివిగ్రహాన్ని ఆవరించుకున్న మైనపుపొరలు కరిగిపోయినట్టుగా తమలోని బలహీనతలు నెమ్మదినెమ్మదిగా కరిగిపోవడం ఆరంభిస్తాయి.  ప్రయత్నంపై ప్రయత్నం, ఓపికపై ఓపిక, శక్తిపై శక్తి కూర్చి అభ్యసించినవారు అతి శీఘ్రంగా సర్వతోముఖాభివృద్ధి చెంది దివ్యశక్తిసంపన్నులు కావడం ఖాయం.

బలహీన శరీరులు నిరంతర దేహదార్ఢ్య పరిశ్రమతో బలసంపన్నులు అయినట్లుగానే బలహీన మనస్కులు శక్తియుత, ఆశావహ, ఉత్సాహభరితమైన ఆలోచనలను సాధన చేస్తే మనశ్శక్తి సొంతమవుతుంది.

బలహీనతలను, గమ్యలేమిని త్రోసిపుచ్చి ఉన్నతాశయం దిశగా ఆలోచనలను కేంద్రీకరించే ప్రయత్నాలు ప్రారంభించడమంటే “విజయం దిశగా తీసుకెళ్ళే మార్గాల్లో వైఫల్యం కూడా ఒకటి” అని త్రికరణశుద్ధిగా విశ్వసించే  స్ఫూర్తియుత ధీరుల జాబితాలో చోటు సంపాదించుకున్నట్టే.  పరిస్థితులు వారికి బానిసలు; వారి ఆలోచనలు శక్తిమంతమైనవి, వారి అభ్యాస ప్రయత్నాలలో భయసందేహాలు మచ్చుకైనా కనిపించవు; విజయం వారికి అతి సాధారణం.

జీవితాశయాన్ని నిర్ణయించున్నవారు దాని సాధనకు అనుసరించబోయే వ్యూహాచిత్రాన్ని తమ మనోఫలకంపై స్థిరంగా ముద్రించుకొని తదనుగుణంగా కార్యాచరణ చేపట్టాలి. ఆ ప్రయాణంలో చూపు ముందేకాని మరేదిశగా ఉండరాదు.  భయసందేహాలను నిర్దాక్షిణ్యంగా త్రుంచివేయాలి.  ఎందుకంటే అవి కర్తవ్యనాశన కారకాలు.  వాటీ వల్ల మరో వైఫల్యమే గాని ఒనగూరిన ప్రయోజనం అంటూ సృష్టిలో ఇంతవరకూ ఎక్కడా లేదు. శక్తియుక్తులు, నిశ్చయం, దూరదృష్టి అని శాఖోపశాఖలుగ శోభించే వ్యక్తిత్వ  మహావృక్షానికి భయ సందేహాలు వేరు మరియు చీడపురుగులు.

ఏదైనా చెయ్యాలనే కృతనిశ్చయం అది చెయ్యగలమనే ప్రగాఢ నమ్మకం నుంచి ఉత్పన్నమవుతుంది.  అట్టి నమ్మకానికి భయం, సంశయం ప్రమాదకరమైన శతృవులు.  వాటిని త్రుంచివెయ్యని వారికి అవి అడుగడుగునా అడ్డుతగిలి సంకల్పాన్ని నిర్వీర్యం చేస్తాయి.

భయ, సంశయాలను జయించినవాడు వైఫల్యాన్ని జయించినట్టే.  అతని అలోచనలు ధైర్యజనితాలై, అవరోధాలను అవలీలగా అధిగమిస్తాయి.  అతని సంకల్పం చదును చేయబడ్డ సారవంతమైన నేలలో విత్తబడిన విత్తనం వలె అనుకున్నరీతిలో సకాలంలోనే పెరిగి పుష్పించి కోరుకున్న ఫలాలను అందిస్తుంది – బీడు భూమిలో పడిన విత్తనంవలె నిష్ప్రయోజనమైపోకుండా.

సంకల్పానికి భయరహిత ఆలోచనలను అనుసంధించినప్పుడు సృజనాత్మక శక్తి ఉద్భవిస్తుంది.  ఈ సత్యాన్ని గ్రహించినవారు  తాము అనుకున్న రంగంలో ఒక బలీయమైనశక్తిగా ఎదగడానికి తయారుగా ఉంటారు.  తమ మనశ్శక్తి పట్ల, దానిని వినియోగించుకునే విధానాల పట్ల స్పష్టమైన జ్ఞానం కల్గియుంటారు.

కార్యసాధనలో ఆలోచనల పాత్ర

మనం సాధించినవీ సాధించలేకపోయినవీ మన ఆలోచనల కారణంగానే.  క్రమబద్ధమైన ఈ విశ్వభ్రమణచక్రంలో భాగమైన మనం స్థితప్రజ్ఞతను కోల్పోవడం వినాశకరం అయినందువల్ల, ఎవరి మనుగడ వారు నిర్వర్తింపవలసిన వ్యక్తిగత బాధ్యతలో చూపుతున్న చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంది.  మన బలం – బలహీనత, పరిశుద్ధత – కల్మషాలకు  మనమే కాని వేరెవరూ బాధ్యులు కాబోరు.  కనుక పరివర్తన అంటూ కలగవలసివస్తే ప్రతి ఒక్కరి వ్యక్తిగతస్థాయిలోనే కలగాలి.  మన వ్యక్తిగత స్థితి కూడా మన సొంతమే.  సుఖదు:ఖాలకు కారణం మన అంతరంగంలోనే ఉన్నది.  ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగానే జీవిస్తాం.  ఆలోచనలలో మార్పు రానంతకాలం అదే జీవనాన్ని కొనసాగిస్తాం.

బలహీనుడు సహాయం పొందడానికి తయారుగా లేనప్పుడు బలవంతుడు అతనికి సహాయపడలేడు.  అంటే సహాయం పొందడానిక్కూడా బలహీనుడు బలవంతుడు కావాలి.  ఇతరుల్లో తను ప్రశంసించే సద్గుణాలను తనకు తానుగా తనలో వృద్ధిచేసుకోవాలి.  తన స్థితి మార్పగలవారు తానే కాని వేరెవరూ కారు.

“ఇంతమంది బానిసలున్నారంటే అందుక్కారణం కొందరు దుర్మార్గులు వారిని అణగద్రొక్కడమే.  కనుక అణగద్రొక్కేవారిని నిర్ద్వంద్వంగా ద్వేషించండి” అని  కొందరు పిలుపునిస్తే, “కొందరు దుర్మార్గులు ప్రజాకంటకులై అణగద్రొక్కుతున్నారంటే అందుక్కారణం తమను అణగద్రొక్కేందుకు బానిసలు అనుమతించడమే.  కనుక బానిసలను నిర్ద్వంద్వంగా ద్వేషించండి” అని ఇంకొందరు సరిదిద్దుతారు.

సత్యమేమంటే, కౄరులూ వారి బాధితులూ కూడా ఇద్దరిలోనూ ఒకే స్థాయిలో ఉన్న అజ్ఞానానికి ప్రతీకలు.  ఒకరిస్థితికి వేరొకరు కారణం కాక, ఎవరిస్థితికి వారే కారణం.  పరిపూర్ణమైన జ్ఞానం ఇద్దరిలోనూ కలిగినప్పుడు ఇద్దరూ కూడా బానిసలలోని బలహీనతలను, దౌర్జన్యకారుల్లోని దుష్ప్రయోజనమవుతున్న బలాన్ని చూడగలుగుతారు.  ఈ రెండు భిన్న అవస్థలూ దు:ఖదాయకాలే అని గ్రహించిన పరిపూర్ణమైన ప్రేమ ఏ ఒక్క వర్గాన్నీ దూషించదు.  ఇద్దరి పట్లా ఒకే వాత్సల్యాన్ని ప్రదర్శించి హృదయానికి హత్తుకుంటుంది.  అన్ని బలహీనతలను స్వార్ధచింతనను వదలివేసినవారు ఈ రెండు వర్గాల్లో దేని పట్లా మొగ్గరు.  వారు స్వేచ్చాజీవులు.

మన ఆలోచనలు ఉన్నతస్థితికి చేరినప్పుడు మాత్రమే మనం సగర్వంగా నిలద్రొక్కుకుని, పరిస్థితులను జయించి విజయులమవుతాం.  ఆలోచనలను సంస్కరించుకొన ఇచ్చగింపనిపక్షంలో బలహీనులుగా, అతిరిక్తులుగా మిగిలిపోతాం.

ప్రాపంచిక విషయ సాధనలో కూడా ఆలోచనలను ఉన్నతస్థాయికి తీసుకెళ్ళడం, క్షుద్రమైన పశువాంఛలను వర్జించడం ఆవశ్యకం.  శారీరకమైన అన్నికోరికలను త్యజించడం సాధ్యం కాకపోవచ్చు కాని ఆశయసాధన కోసం కనీసం కొన్నింటినైనా వదులుకోవలసి ఉంటుంది.  అయితే ఎవరి ఆలోచనల్లో ప్రాధమ్యం క్షుద్రమయిన కోరికలకు ఇవ్వబడుతుందో, వారు ఏ పనినీ ప్రణాళికాబద్ధంగా చేయలేరు, ఉన్నతంగా ఆలోచించలేరు.  తమలో నిబిడీకృతమైన ఆత్మశక్తిని గ్రహించుకోలేరు, తత్కారణంగా అన్నింటా విఫలులౌతారు.  ధైర్యస్థైర్యాలతో కోరికలను పకడ్బందీగా నిగ్రహించుకోలేనివారు ఉన్నతమైన సవాళ్ళను ఎదుర్కోలేరు,  బాధ్యతలను స్వీకరించలేరు.  ఒంటరిగా వారు నిభాయించగల బృహత్కార్యాలేమీ ఉండవు.  తమ పరిధి తాము ఎంపిక చేసుకున్న ఆలోచనలకు అధీనమై ఉంటుంది.

స్వార్ధపరిత్యాగం  లేకుండా ఏ విజయసాధనా సాధ్యం కాదు.  ఈ ప్రపంచంలో మన మనుగడ యొక్క సార్ధకత మనం ఎన్ని పశుత్వ క్షుద్ర వాంచలను జీవితాశయ సాధన నిమిత్తం త్యాగం చేసి మనశ్శక్తిని ఆ బృహత్కార్యంపై కేంద్రీకరించి సంకల్ప, స్వావలంబన శక్తులను దృఢపరచుకున్నామో అన్న దానిని బట్టి నిర్ణయింపబడుతుంది.  ఆలోచనలను ఎంత ఎత్తుకు తీసుకెళ్ళగలిగితే అంత ఉత్కృష్టమైన విజయం మనకు లభిస్తుంది.

ప్రకృతి అత్యాశాపరులకు, అవినీతిపరులకు, దుర్మార్గులకు సహకరించదు – స్థూలంగా పరికించినప్పుడు అలా జరుగుతున్నట్లు అనిపించినా.  అది నిజాయితీపరుల, విశాలహృదయుల, సద్గుణసంపన్నుల పక్షానే సదా నిలుస్తుంది.  జగద్గురువులు వివిధ సందర్భాల్లో వివిధ యుగాల్లో ఈ సత్యాన్ని రూఢిగా ప్రవచించేరు.  ఎవరైనా దీనిని పరీక్షింపదలచుకుంటే ఆచరణ, అభ్యాసాల ద్వారా ఆలోచనాశక్తిని ఉత్కృష్టపరుచుకొని యోగ్యమైన జీవనం అలవాటుచేసుకుని చూడండి.

ఆలోచనలను జ్ఞానసిద్ధి, ఆత్మసౌందర్యం పై కేంద్రీకరించినప్పుడు మేథోపరమైన శక్తియుక్తులు అలవడుతాయి.  ఈ మేధోశక్తి దీర్ఘకాల అభ్యాసానంతరం లభించినందువల్ల, అహంకారపూరిత వాదవివాదశక్తుల కంటె పరమోత్కృష్టమైనది.

భగవదర్పితమైన మతవిషయక ఆశయాలను అభ్యసిస్తే ఆధ్యాత్మిక పరమైన సిద్ధులు లభిస్తాయి.  సత్వగుణ సంపన్నులై మనస్సును దివ్యకాంతితేజోమయమూ సకలలోకరక్షకమూ అయిన పరమేశ్వరతత్వ చింతనలో లయించినవారు మధ్యాహ్నపు ప్రచండ భానునితో, పూర్ణచంద్రునితో సమానంగా భాసించే జ్ఞాన శీల సంపదతో పరిపూర్ణులై ధన్యజీవనం సాగిస్తారు.

కార్యసిద్ధియే ప్రయత్నానికి అంతిమంగా లభించే అపూర్వమైన మణిమకుటం వంటి కానుక.  ఆత్మనిగ్రహం, దృఢనిశ్చయం, హృదయశుద్ధి, సత్యసంధత మరియు నిర్దిష్టమైన ఆలోచనలు కలిగినవారు జీవితంలో అత్యున్నత శిఖరాలనధిరోహిస్తారు.  జంతుసహజమైన తామసం, సోమరితనం, అశుచి, నీతిబాహ్యత,  సంశయం కలిగినవారు అధోగతిని పొందుతారు.

మిక్కిలి ఐశ్వర్యవంతులై సమాజంలో అత్యున్నత గౌరవాన్ని అనుభవిస్తున్నవారైనా, దీర్ఘకాలం ఆధ్యాత్మిక చింతనతో దివ్యశక్తి సంపన్నులైనా మనస్సులో అహంభావం, స్వార్ధపూరిత, నీతిబాహ్య ఆలోచనలకి ప్రవేశం కల్పించినప్పుడు అతి శీఘ్రంగా సర్వభ్రష్టత్వం పొందుతారు.

సక్రమమైన ఆలోచనాక్రమం ద్వారా సిద్ధించిన సత్ఫలితాలను జాగరూకతతో కాపాడుకోవాలి.  విజయశిఖరాలపైకి చేరినమరుక్షణమే చాలామంది తమనక్కడికి చేర్చిన సద్గుణసంపదను విస్మరించి అహంకారాంధకారబద్ధులై పతన పాతాళంలోకి జారిపోతారు.

వ్యాపారంలో గానీ, మేధాసంపత్తిలో గానీ, ఆధ్యాత్మిక ప్రపంచంలో గానీ, విజయం సాధించాలంటే భయసంశయరహితమైన ఆలోచనలు నిండిన స్థిర చిత్తమే కారణం.  తాము నిర్ణయించుకొన్న గమ్యాలే వేరు కాని వాటి సాధనకు అనుసరించిన మార్గం అందరిదీ ఒకటే.

ఏదీ సాధించాలనే కోరికలేనివారు ఏ రకమైన త్యాగం చెయ్యనవసరం లేదు.  సాధించవలసింది చాలా ఉందని గ్రహించినవారు చెయ్యవలసిన త్యాగాలు కూడా ఎక్కువే మరి.  ఎంత త్యాగానికి అంత విజయం.

దార్శనికత  ఆదర్శాలు

స్వాప్నికులు ప్రపంచ రక్షకులు.  కనిపించే ప్రపంచవ్యవహారాలన్నీ అగోచరమైన దివ్యశక్తికి అధీనంలో ఉన్నట్లుగానే, మన యత్నాలు, పొరపాట్లు, వ్యాపారాలకు మన కలలు తగు పౌష్టికతను ఇస్తాయి.   మానవజాతి తన స్వాప్నికులను విస్మరించరాదు.  వారి ఆశయాలు మసకబారి నశింపనీయరాదు.  కారణం ఆ స్వప్నాలే వాస్తవరూపం దాల్చడం మనం చూస్తాం, గ్రహిస్తాం.

సంగీతకారుడు, శిల్పి, చిత్రకారుడు, కవి, ఆధ్యాత్మికగురువు, సాధుపుంగవుడు – వీరందరూ భూతలస్వర్గ సృష్టికర్తలు.  ప్రపంచ సౌందర్యం వారి ఉనికి వల్లనే సాధ్యపడింది.  వారు లేని పక్షంలో చెమడోట్చి కష్టించే శ్రమైకజీవులు కాయకష్టపు తీవ్రతను తగ్గించే హృదయాహ్లాదం లేక నశిస్తారు.

ఎవరైతే హృదయంలో ఒక ఉన్నతాశయాన్ని ప్రతిష్టించుకుని తత్సాధనకై కృషి చేస్తూ నిరంతరం దానిగురించిన తియ్యని కలలు కంటారో ఆ కలలు తప్పక సాకారమవుతాయి.  కొలంబస్ మరోప్రపంచం గురించి అదేపనిగా కన్న కలలు నిజమయ్యాయి.  కోపర్నికస్ తాను నివసిస్తున్న ప్రపంచం ఒకటే కాదనీ, అనంతమైన సృష్టి భూమికావల ఉండే ఉంటుందని ఒక విశాల విశ్వాన్ని గూర్చి స్వాప్నికజగత్తులో దర్శించిన అద్భుతాలు కల్లలు కావని నిరూపించేడు.  గౌతమబుద్ధుడు ఏ భేషజం, పడికట్టు సూత్రాల జంఝాటం లేని దివ్యమైన శాంతిని ప్రసాదించే పరమార్ధసాధనాన్ని గురించి రేయింబవళ్ళు కన్నకలలు అతనిని ఆ ఆదర్శమార్గంలోకి చేర్చేయి.

మీలో ఉండే దార్శనికతను, ఆశయాలను వృద్ధిచేయండి.  హృదయతంత్రులను మీటి ఉత్తేజం కలిగించే సంగీతాన్ని, మదిలో సుస్థిరంగా కలకాలం నిలిచిపోయే సౌందర్యాన్ని, పవిత్రమైన ఆలోచనలకు పట్టుపరదావంటి ప్రేమతత్వాన్ని మిక్కుటంగా అభిలషించండి.  ఇవే స్వర్గతుల్యమైన పరిసరాలను  ఆనందకరమైన పరిస్థితులను సృష్టిస్తాయి.  వీటిపై మన దృష్టి సత్యమైతే వాటిలోని ఆదర్శప్రపంచం సాకారమై నిలుస్తుంది.

కోరుకొనటమంటే పొందడమే.  అభిలషించటమంటే సాధించడమే.  క్షుద్రమైన కోరికలు ఫలించినప్పుడు ఉన్నతమైన ఆశయాల సాఫల్యం అసాధ్యమవుతుందా?  కానేకాదు.  ఎందుకంటే “అర్ధించినది పొందగలవు” అన్న విశ్వసూత్రానికి అది వ్యతిరేకం.

మహోన్నతమైన కలలు కనండి.  మనం కలకాలం కనే కలల ప్రకారమే తీర్చిదిద్దబడతాం.  భవిష్యత్తులోకి నిలిపిన చూపే మనం ఏ విధంగా పరిణామం చెందుతామో అన్నది నిర్దేశిస్తుంది.  మన గురించి ముందే వెల్లడించబడే భవిష్యవాణి మన ఆశయాలే.

సాధించబడ్డ ప్రతీ గొప్ప కార్యం ప్రారంభంలో, ఎదో ఒకనాడు, స్వప్నమే.  సరైన సమయం వచ్చేవరకు మహావటవృక్షం కంటికి కనబడనంతటి సూక్ష్మమైన విత్తనంలోనే ఒదిగి ఉంటుంది.  పక్షి గుడ్డులోనే నిద్రిస్తుంటుంది.  కార్య సాధకుని కలల్లో ఆశయం పట్ల తీక్ష్ణత, నిశిత దృష్టి పరాకాష్టకి చేరుకొనే సమయానికి,  చేతలకు ప్రేరేపించే అలజడి ప్రారంభమై, మహాకార్యనిర్వహణలో తొలి అడుగు పడుతుంది.  వాస్తవమనే మహావృక్షానికి కలలు విత్తనరూపం.

మనచుట్టూ ఉండే పరిస్థితులు తాత్కాలికంగా అనుకూలంగా లేకపోవచ్చు.  కాని అవి కలకాలం అలాగే ఉండాల్సిన అవసరం లేదు – ఒక ఉన్నతాశయం మదిలో ప్రతిష్టించుకుని తత్సాధనకు చిత్తశుద్ధితో కృషిచేసినప్పుడు.  ఆలోచనల, ఆశయాల అలజడి మన అంతరాళాల్లో వేగవంతంగా ప్రయాణిస్తున్నప్పుడు బాహ్యంగా మనం నిష్క్రియాపరులుగా ఉండడం వీలుపడదు.  ఈ యువకుడి సంగతి చూడండి.  పేదరికం, అంతులేని శారీరకశ్రమ అతన్ని సహజ కవచకుండలాల్లా ఎల్లప్పుడూ అంటిపెట్టుకునే ఉంటాయి.  అపరిశుభ్రమైన కర్మాగారంలో గంటలకొద్దీ పనిచెయ్యాల్సిరావడం.  చదువుకునే అవకాశాలు లేవు, మనోల్లాసకరమైన కళాప్రదర్శనలు అతనికి అందుబాటులో లేని బ్రహ్మపదార్ధాలు.  ఇంత నిరాశాజనక దినచర్యలో నమ్మదగిన ఒకే ఒక నేస్తం – అతని కలలు.  గొప్ప గొప్ప, మంచి మంచి కలలు.  మనకు లేనివాటిగురించి కలలు కనడం మానవ నైజం కనుక మనవాడు ఎప్పుడూ జ్ఞానం, ఆత్మశుద్ధి, వివేకం,  నిజమైన సౌందర్యం వంటి అనుభూతులగురించి కలలు కనేవాడు.  మొదట్లో గుర్తింపులేని గొడ్డుచాకిరీ యొక్క నిస్పృహ నించి తప్పించుకొనేందుకు గాను ప్రారంభమైన ఈ కాలక్షేపం, క్రమేపి మానుకోలేనంత అలవాటుగా మారింది.  స్వప్నలోకం అంతులేనంత విశాలమైనది, ఆ ‘రాజ్యంలో’ తాను సర్వస్వతంత్రుడు అయినందువల్ల కలలు నిరాఘాటంగా కొనసాగి కొనసాగి ఒక ఆదర్శవంతమైన, ఆనందకరమైన జీవన విధానానికి రూపకల్పన జరిగింది (కలల్లోనే అనుకోండి).  అయితే సదా వాటిలోనే నిమగ్నమైన మనస్సు ఈ అంతర్గత చైతన్యాన్ని ఇంక లోపల అణచి ఉంచడం సాధ్యపడక, ప్రత్యక్షచర్యలకు స్ఫూర్తినొసగింది.  దీంతో అతను దొరికిన ప్రతి ఖాళీ నిముషాన్ని తనలో నిగూఢంగా సుషుప్తావస్థలోనున్న ఇతరవిద్యల్లో ప్రావీణ్యం సంపాదించడానికి అహర్నిశలూ వినియోగించాడు.  క్రమేపీ అతను రోజూ ఒళ్ళుహూనంచేసుకుంటున్న చీకటి దుకాణం అతని మనస్సంఘర్షణ యొక్క ధాటిని నిలువరించలేకపోయింది.  మనస్సులోని ఔన్నత్యంతో పోలిస్తే అతను పడుతున్న శారీరక శ్రమ, పరిస్థితులు రాజసం ఉట్టిపడే తేజస్వంతమైన శరిరాన్ని అంటిపెట్టుకోవడానికి తహతహలాడే మురికి చింకి పాతలాగ అనిపించసాగేయి.  పెరిగిన మనశ్శక్తి అవకాశాలను సృష్టించింది.  అనతికాలంలోనే ఊరూ పేరు, చదువు సంధ్యా లేని నిరుపేద యువకుడు స్వాధికారత,  ఆత్మవిశ్వాసాల సౌరభాలతో శోభించే ఐశ్వర్యవంతునిగా పరిణామం చెందేడు.    మనస్సులోని కొన్ని శక్తులపై సంపూర్ణమైన అధికారం సాధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎదురులేని శక్తిగా ఎదిగాడు.  భుజస్కంధాలపై బ్రహ్మాండమైన బాధ్యతలను మోస్తాడు.  అతను మాట్లాడితే చాలు జీవితాలే మారిపోతాయి.  తనతో కాసేపు సంభాషించిన స్త్రీలైనా పురుషులైనా వ్యక్తిత్వాలను, నడవడికను మార్చుకొంటారు.  సూర్యునిలా ప్రకాశిస్తున్న అతను కేంద్రబిందువుగా ఎందరి భాగ్యరేఖలో పునర్లిఖించబడతాయి.  అతని ఇప్పటి దశ కొద్దిసంవత్సరాల క్రితం అతను కన్న కలల రూపాంతరం.    ఆశయమే తానుగా పరిణామం చెందేడు.

హృదయంలో యవ్వనం తొణికిసలాడే చదువరీ!  నీ మదిలోని ఆకాంక్షలు కూడా (కేవలం తాత్కాలికంగా ‘ఇలా జరిగితే బాగుణ్ణు’ అనుకునేవి మాత్రమే కాకుండా) తప్పక నెరవేరతాయి – అవి సౌందర్యవంతమైనవైనా అందవిహీనమైనవైనా  రెంటి మిశ్రమైనా.  ఎందుకంటే నీవు రహస్యంగా, అతిగా ప్రేమించే అంశాలు తమవైపు నిన్ను బలంగా ఆకర్షించుకుంటాయి.  నీ స్వంత ఆలోచనల ఫలితాలు నీ చేతిలో ఉంచబడతాయి.  నీవు ఏమి ఆర్జిస్తావో అది నీకు అందుతుంది;  ఎక్కువ తక్కువలు లేకుండా.  నీవుండే ప్రస్తుత వాతావరణం ఏదైనా, నీ ఆలోచనలు, భవిష్య దృష్టి, ఆశయాలు నిన్ను పతనంలో పడదొయ్యటమో, యథాస్థితిలోనే ఉంచడమో, ఉన్నతశిఖరాలపైకి తీసుకొనిపోవడమో చేస్తాయి.  నిన్ను స్వాధీనపర్చుకున్న క్షుద్రమైన కోరిక అంత చిన్నవాడివైనా అవుతావు; లేక ప్రబల తేజశ్శక్తిసంపన్నమైన ఆశయమంతటి గొప్పవాడివైనా అవుతావు.

ఆలోచనారహితులు, అజ్ఞానులు, ఒళ్ళువంగని సోమరులు కేవలం పైకి కనిపించే ఫలితాలనే చూస్తూ వాటి కారణాలను గ్రహించే ప్రయత్నం చేయక అదృష్టం, భాగ్యం, ప్రాప్తం వంటి మాటలతో కాలక్షేపం చేస్తారు.  ఐశ్వర్యవంతుడిని చూసి “ఎంత అదృష్టవంతుడు!” అని, విద్యా కౌశల సంపన్నునిని చూసి “అబ్బ వీడు పెట్టి పుట్టేడ్రా!” అని, సమాజంలో సద్గుణపరిపూర్ణ సజ్జనునికి సహజంగానే లభించే విశేషగౌరవం చూసి “అబ్బ వాడికి అన్నీ ఎలా కలిసి వస్తున్నాయో!” అని వ్యాఖ్యలు విసురుతారు.  అటువంటి ఉన్నతదశకు చేరుకోడానికి వారంతా ఎదుర్కొన్న క్లేశాలు, వైఫల్యాలు, అంతస్సంఘర్షణలను తెలుసుకొనే ప్రయత్నం చేయరు.  హృదయంలో ప్రతిష్టించుకున్న ఆశయం వాస్తవరూపం దాల్చడంకోసం వారు ఒనరించిన త్యాగాలు, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో వారు అవరోధాలనేవిధంగా అధిగమించిందీ గమనించరు.  కార్యసాధకుల రెండు పార్శ్వాల్లోని చీకటి, వేదనలను విస్మరించి కేవలం వెలుగు, సంతోషాలనే చూస్తూ, దానికి “అదృష్టం” అని పేరు పెడతారు.   పయనించిన బహుదూరపు ముళ్ళబాట వైపు ముఖం తిప్పక, చేరిన ఆహ్లాదకరమైన గమ్యాన్నే లెక్కలోకి తీసుకుని “ఎంత భాగ్యం” అని ఆశ్చర్యపోతారు.   ప్రయోగ దశలను గమనించక ఫలితాన్ని మాత్రం పట్టుకుని “యోగబలం” అని దులిపేసుకుంటారు.

మన అన్ని చర్యల్లోనూ ప్రయత్నాలూ ఉన్నాయి, ఫలితాలూ ఉన్నాయి.  ప్రయత్నబలమే ఫలితానికి కొలమానం.    బహుమానాలు, అధికారాలు మరియు భౌతిక, వివేకసంబంధమైన, ఆధ్యాత్మికపరమైన అనుభవాలన్నీ మన ప్రయత్నాల ఫలితమే.  అవి పరిపూర్ణతనందిన ఆలోచనలు, సాధించబడిన లక్ష్యం,  సాకారత పొందిన ఆశయాలే.

నిర్మలత్వం

జ్ఞానం వలన లభించే ప్రయోజనాల్లో ఆణిముత్యం వంటిది మన: ప్రశాంతత.  ఇది దీర్ఘకాలంపాటు ఓపికతో ఆచరించిన ఆత్మనిగ్రహ అభ్యాస ఫలితం.  అనుభవ పరిపక్వతను, అసాధారణ ఆలోచనాశక్తిని ఇది సూచిస్తుంది.

మనం మన ఆలోచనల ఫలితమని ఎంత స్పష్టతతో తెలుసుకొంటే అంత మానసిక ప్రశాంతత మనకు లభిస్తుంది.  అట్టి జ్ఞానం పొందాలంటే మనం ఇతరులనర్ధం చేసుకునే విధానం మన ఆలోచనలననుసరించే ఉంటుందని తెలుసుకోవాలి. సక్రమమైన ఆలోచనావిధానం అభివృద్ధి చేసుకుని నిత్యం సంభవించే సంఘటనలోని కారణ – ఫలితాల మధ్యగల సంబంధాన్ని మరింత సునిశితంగా గ్రహించగలిగినకొద్దీ అనవసర భయాందోళనలు తొలగిపోతాయి.   అట్టి జ్ఞానం అలవడినవారు దృఢచిత్తత, సునిశితదృష్టి, చెక్కుచెదరని మన:ప్రశాంతత కలిగియుంటారు.

ప్రశాంతతను సాధించినవారు తమగురించిన సుస్పష్టమైన అవగాహన కలిగియుండటంచేత, ఇతరుల పట్ల తమ ప్రవర్తనను పరిస్థితులకనుగుణంగా మార్చుకొనగలుగుతారు.  తమ ఆత్మజ్ఞానం ఇతరుల గౌరవాన్ని పొందుతుంది.  వారినుంచి నేర్చుకోవలసినది ఎంతైనా ఉన్నదని ఇతరులు విశ్వసిస్తారు.  మనస్సు ఎంత నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుందో, మన విజయావకాశాలు, ఇతరులపై మన ప్రభావం, అందరికీ మంచి చేయగల శక్తియుక్తులూ మనకు అంతగా అలవడతాయి.  ప్రశాంతమైన మనస్సు, ఆత్మనిగ్రహం, సద్వర్తన తాను అభివృద్ధి చేసుకున్నకొద్దీ తన వ్యాపారం అభివృద్ధి చెందుతుండడాన్ని చిరువ్యాపారి కూడా గ్రహిస్తాడు.  ఎందుకంటే వినియోగదారులు కల్మషంలేని నిజాయితీ పట్ల ఆకర్షితులవుతారు.

ప్రశాంత స్వభావులైన శక్తిమంతులు అందరి గౌరవాన్ని పొందుతారు.  వారు దహించివేసే ఎడారిభూమిలో చల్లని నీడనిచ్చే వృక్షంలా, ఉప్పెనలో తలదాచుకొన ఏర్పడిన మహాశిలలాంటివారు.  నిర్మలమైన, నిష్కల్మషమైన, సర్వజనసమత్వం కలిగిన హృదయాన్ని ఆరాధించనిదెవరు?  ఈ సద్గుణసంపద సొంతమైనప్పుడు వీరి సమీపంలో ప్రకృతి వర్షిస్తున్నా, ఎండకాస్తున్నా, మరేవిధమైన మార్పులు సంభవించినా దేని గురించిన దిగులూ అక్కర్లేదు. ఎటువంటి పరిస్థితులలోనైనా వారు ప్రశాంతతను, నైర్మల్యాన్ని కోల్పోరు.  నిర్మలత్వం అని మనం వ్యవహరించే ఈ అత్యుత్తమ మన: స్థితి నాగరకజీవనం మనకు నేర్పే ఆఖరి పాఠం.  అది సౌరభ పరాగభరితమైన నందవనంవంటి జీవితాన్ని, ఫలీకృతం చెందిన ఆత్మస్థితిని ప్రతిబింబిస్తుంది.  జ్ఞానసంపద వలె, స్వర్ణసంపద కంటే వేలరెట్లు అమూల్యమైన, అపూర్వమైన, సర్వదా అభిలషణీయమైన సంపద ఇది.  ఇట్టి అమోఘ జీవనంతో పోలిస్తే ధనకనకాది సంపదల వెనక పరువులెత్తడం ఎంతటి వివేకహీనత!  సత్యమనే సాగర గర్భంలో ప్రతిష్టించుకోబడిన,  అలజడి కారకాలైన అలల అలికిడేలేని ప్రశాంతత నడుమ,  ఉప్పెనలకు, వరదలకు చలించనవసరంలేనంత దూరంలో ప్రకాశించే దివ్య జీవన విధానమది!

అయినా ఎంతమంది తమ విస్ఫోటక మన:స్థితితోను, పరస్పర ద్వేషాలతోను తమ రక్తాన్ని కలుషితపరుచుకొని దుశ్శీలురై జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు!  ప్రజల్లో అధికులు తమ ఆత్మనిగ్రహరాహిత్యం ద్వారా ఉనికిని ఆందోళనభరితం చేసుకుని సుఖసంతోషాలకు దూరం కాకుండా ఉండగలరా అన్నది ప్రశ్న.  మనకు తారసపడే అనేకుల్లో కొందరు నిగ్రహం, మనోనిర్మలత్వం వంటి సద్గుణశోభితులై ఎంత ఆదర్శవంతంగా జీవిస్తున్నారో కదా!

నిజమే. మానవప్రపంచం నిగ్రహించుకోలేని కోరికలు, తొలగని భయ సంశయాలు కలిగించిన తీవ్ర మనోవేదననుభవిస్తున్నది.  జ్ఞానులు మాత్రమే, ఆలోచనలను క్రమబద్ధం చేసుకుని పరిశుద్ధంచేసుకొనడం ద్వారా మనోజనితమైన తుపాను వంటి ఇట్టి విపరీతాలను సమర్ధవంతంగా నివారించుకొనగలుగుతున్నారు.

ఉప్పెనవలె అతలాకుతలమైన మన:స్థితితో అవస్థపడే జనులారా, మీరెచట ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నివసిస్తున్నా, ఈ విషయం తెలుసుకోండి:  జీవితమనే మహాసాగరంలో మీకు సేదదీర్చి సుఖ సంతోషాలనొసగే స్వర్గధామములవంటి ద్వీపకల్పాలు ఉన్నాయి,  అవి మీ రాక కోసం నిరీక్షిస్తున్నాయి.  సర్వశక్తులను మీ ఆలోచనపైనే కేంద్రీకరించండి.  దివ్యశక్తిసంపన్నుడైన సర్వాధికారి మీ హృదయకుహరాల్లో నిద్రిస్తున్నాడు.  అది నిద్ర మాత్రమే.   తనను మేల్కొలపండి.  ఆత్మనిగ్రహమే బలసంపద.  సక్రమమైన ఆలోచనే సార్వభౌమత్వం.  మన:ప్రశాంతతే అపరిమిత శక్తి.  నిరంతరం మనస్సుకు సూచిస్తుండండి – “ఓం శాంతి: శాంతి: శాంతి:” అని.

అందరికీ శుభం కలుగు గాక !!!

No comments:

Post a Comment