Tuesday, September 14, 2021


పై పోర్షను పోషణ

 

మానసికారోగ్యానికీ కార్యకుశలతకీ ప్రముఖ మోటివేషనల్ రచయిత, వక్త జిగ్ జిగ్లర్ చేసిన కొన్ని సూచనలు. 


ప్రతివాళ్ళూ తింటారు.  అదీ నిర్ణీత సమయానికి తినేలా ప్రణాళికలు వేసుకు మరీ తింటారు.  ఆ టైం అయేసరికి అది కడుపులో పడాల్సిందే.  ఎప్పుడైనా పని వత్తిడిలో ఏ బ్రేక్‌ఫాస్తో లంచో డిన్నరో మిస్సైపోతే, ఆ సంగతి చెప్పుకు మరీ బాధపడతారు వినేవాళ్ళుండాలే కాని.  నిన్న ఏమైందనుకుంటున్నావ్? 

పనిలో పడి లంచి చెయ్యడం మరిచిపోయేను. అని. వినేవాళ్ళకి ఆసక్తి లేకున్నా వెంటపడి మరీ చెప్పుకు బాధపడతారు ఎంతమందికి వీలైతే అంతమందికి తెలియాలి వారి త్యాగం.  

ఈ రోజు నేనేమీ తినలేదండీ అకలితో కడుపు నకనకలాడుతోంది.  ఏంచెయ్యాలో చెప్పగలరా అని ఎవరూ అనరు.  అందరికీ తెలుసు ఆకలేస్తే మేత పడాలి అని.  

అయితే ఈ మేత మెడ కింది పోర్షనుకి.  మెడ కింద ఎవరి విలువైనా పట్టించుకోనక్కరలేనంత స్వల్పం.  మనిషి విలువని నిర్ణయించేది మెడ పై పోర్షనే కదా.   దానికి బుద్ధిపూర్వకంగా మేత వేసి ఎంతకాలం అయింది అనీ యోచించుకోవాలి.  ఎందుకంటే కింది ఆకలి లాటిదే పై ఆకలీనూ.   విలువ తక్కువదాన్ని ఇంత శ్రద్ధగా వేళతప్పకుండా పోషించుకుంటున్న మనకి మనమంటే మన తలకాయేకదా అంత విలువైన దాని పోషణకి ఏ తిండి పెడుతున్నాం.  చాలామంది ఎప్పుడో ఏదో సందర్భంలోనో, చేసేందుకు మరేదీ లేనప్పుడే దానికి మేత వేస్తారు.  అదేం అంటే అంత టైం ఎవరికుందండీ అంటారు.  ఇదో హాస్యాస్పదమైన సాకు.  మన విలువలో వెయ్యోవంతుకూడా లేని దాన్ని మేపేందుకు అంత సమయం ఉన్నప్పుడు మన ప్రతిష్టా అస్తిత్వమే తనదైన దాన్ని పోషణకి టైం లేదంటే ఎలా నమ్మాలి.  ముఖ్యంగా నైరాశ్యంలో ఉన్నవారు, సమస్యలతో సతమతమయేవారు, ఎప్పుడూ ఏదో కుంగుబాటుతో బాధపడేవారికి ఇది ఉద్దేశించినది.   తమకి ఆకలి వేసినప్పుడు ఎటువంటి బయటి సహకారమూ కోరక కడుపు నింపుకునే వీరికి ఇన్ని వ్యధలు తమని కుంగదీసి నాశనం చేస్తుంటే దాని ఉపశమనం కోసం ఒక పుస్తకం చదవాలని, ఉత్తేజ భరిత ప్రసంగం వినాలని అనిపించకపోవడం బాధాకరం.   వీళ్ళు చెప్పే సాకులూ హాస్యాస్పదంగానే ఉంటాయి.  ఏమయ్య ఇంత నిరాశ నిస్పృహా ద్వేషమూ డల్లూ నీకు నీ స్నేహితుడు చూడు ఎంత ఉత్సాహంగా ఉషారుగా పనిచేసుకుంటున్నాడో అంటే, ఉంటాడండీ ఉంటాడు.  కోటి కూడబెట్టేడు కద.  నా బేంకు బేలన్సూ కోటి రూపాయలుంటే నేనూ ఉంటాను ఉత్సాహంగాను ఉషారుగాను.  అని.  అయ్యయ్యో కోటి వల్ల ఉత్సాహం రాదు బాబూ ఉత్సాహం వల్లనే కోటి వస్తుంది అంటే వినడు.      

ఏ రంగమైనా అంటే వైద్యమూ న్యాయవాదమూ బోధనా శిషణా సేల్సూ ఇలా ఏ వృత్తి తీసుకున్నా అందులో రాణిస్తున్నవారు మాత్రం ఈ విషయంలో అశ్రద్ధ చెయ్యక  అనుదినమూ ఉత్తేజ భరితమూ స్ఫూర్తిమంతమైన సాహిత్యాన్ని మెదటికి పోషకాహారంగా అందిస్తుంటారు.   ఇవి కొనేందుకు డబ్బు వెచ్చించాల్సి వచ్చినా వెనకాడరు.  క్రమం తప్పక అందే ఈ పోషకం బుద్ధిని చురుగ్గా ఉంచి వృత్తిలోనూ జీవితంలోనూ ఉత్తేజం నింపుతుంది.  

ఇప్పుడింకో ప్రశ్న. ఎందుకని విజేతలు పాజిటివ్‌గాను ఉత్సాహవంతులుగాను ఉంటారు?   లేదా, ఎందుకని పాజిటివ్‌గాను ఉత్సాహవంతులుగాను ఉన్నవారు విజేతలవుతారు?  ఎందుకంటే విజయానికి ఆ తత్వమే మూలమని తెలుసుకుని అది సజీవంగాను ఆరోగ్యవంతంగాను ఉంచుకుందుకు తగిన పోషణను అశ్రద్ధ చెయ్యక దానికిస్తారు కనక.   వేళకి బ్రేక్ఫాస్టనీ లంచనీ డిన్నరనీ ఎలా తీసుకుంటామో అంత శ్రద్ధగానూ ఇవ్వాలి ఈ మెదటి మేతని.  నిజానికి పై పోర్షనుకి క్రమబద్ధంగా పోషకాహారం అందినప్పుడు కింది పోర్షను గురించిన జాగ్రత్తలు అదే తీసుకుంటుంది.  ఏది తింటే ఆరోగ్యం అని, రేపన్నది ఎలా వుంటుందో అని, ఫలానా సమస్య తీరేదెలా అనే తరహా బాధలన్నిటినీ పరిష్కారాలు అది సూచిస్తుంది.   

మెదడుకి ఇలా క్రమం తప్పక మంచి స్ఫూర్తిని నింపుతూ ఉంటే  అది ఏ పరిస్థితికీ నీరుగారిపోక కర్తవ్యమేమిటని యోచించి పరిష్కరించుకునే చురుకుని కలిగిస్తుంది.  అన్ని పరిస్థితుల్లోనూ ఇలా ఉండటం సాధ్యమా అంటే పాజిటివ్ అలోచనాపరులకి సాధ్యం.    అభ్యాసం మీద ఆ స్వభావం అలవాటు చేసుకోవాలి.

మనం సంకల్పించి అనుకుంటూ నేర్చేది అసంకల్పితంగా జరిగే అలవాటైపోవాలి.  కారు డ్రైవింగులా.  నేర్చుకున్న కొత్తలో ఇప్పుడు క్లచ్చు నొక్కాలి, యాక్సెలెరేటరు అంత నొక్క కూడదు.  ఇప్పుడు బ్రేకు నెమ్మదిగా నొక్కాలి.  ఇండికేటరు ఇచ్చి సిగ్నల్ ఇచ్చి ఆటూ ఇటూ చూసుకు తిప్పాలి .. ఇవన్నీ అనుకుంటూ చేస్తాం.  ఒకసారి ఈ అనుకోవడం మన సబ్ కాన్షస్ లోకి చేరితే ఈ పనులన్నీ అంతకు ముందు కన్న కచ్చితంగా నిర్దుష్టంగా ప్రభావశీలంగా వాటికవే జరిగిపోతుంటాయి.  మనం మాట్లాడుకుంటున్నా పాటలు వింటున్నా.   డ్రైవింగు కౌశలం కాన్షస్ మైండులోంచి సబ్ కాన్షస్ మైండులోకి మారినందువల్ల కలిగిన ప్రయోజనం ఇది.  బహిశ్చైతన్యం లోంచి అంతశ్చైతన్యం లోకి. 

టైపు నేర్చుకుంటున్నప్పుడూ పియానో వంటి సంగీత వాద్యాలు నేర్చుకుంటున్నప్పుడూ మొదట్లో అనిపించిన శ్రమ అవి అలవాటయాక అనిపించదు.  కారణం వేళ్ళు ఎలా కదలాలన్నది అంతశ్చేతన చూసుకుంటుంది కనక.  నేర్చుకుంటున్న దశలో కర్ణకఠోరమనిపించిన ఆ వాయిద్యం అలవాటైనాక   శ్రావ్యమూ మనోరంజకమూ అవుతుంది.   

మన స్వభావానిదీ ఇదే సూత్రం.  కొందరు ప్రతి సమస్యలోనూ ఒక అవకాశం చూస్తారు.  ఇంకొందరు ప్రతి అవకాశంలోను సమస్యని చూస్తారు.  ఇది వారి వారి స్వభావం.  రోజులతరబడి చేసుకున్న అలవాటే మన స్వభావం. బుద్ధిపూర్వకంగా మొదట్లో ఓ నెల్లాళ్ళు చేస్తే కొన్నాళ్ళకి అది మన స్వభావంలో జీర్ణించుకుపోతుంది.   అలవాటైపోవడమంటే మన చర్యలూ ప్రతిచర్యలు కాన్షస్ మైండు నించి సబ్ కాన్షస్ మైండులోకి మారి అక్కడ భద్రపడిపోవడం.

అలవాటయాక మనం సమస్యలనూ పరిస్థితులనూ చూచే దృక్పథమూ మారుతుంది.   అనవసరమైన నైరాశ్యమూ ఆందోళనా దిగులూ వంటివాటికి మనసులో చోటుండదు.  ఉదాహరణకి  వరదలొచ్చి ఇళ్ళు సగం వరకు మునిగిపోతాయి.  పక్కింటివాళ్ళు పడవలేసుకొచ్చి ఎంత కష్టమొచ్చిందిరా జాన్ అంటే, కష్టమేకాని అంత కష్టం కాదులెండి సర్ అంటాడు జాన్.  ఇంకా ఎంత కావాలయ్యా అటుచూడు నీ కోళ్ళ బుట్ట మొత్తం కొట్టుకుపోతోంది.  అంటాడు పొరుగాయన.  కోళ్ళు పోతే బాతులు పెంచుదాం అవైతే ఈదగలవు అంటాడు జాన్. నీ పంటంతా ఊడ్చుకుపోయింది కదయ్యా అంటే, అవుననుకోండి, అప్పుడప్పుడూ నేలని బీడు పెడితే సారవంతమవుతుందన్నారు అగ్రికల్చర్ వాళ్ళు అంటాడు; సరేనయ్యా నీ ఇంటి సంగతో? కిటికీలవరకూ నీళ్ళొచ్చేసేయి చూసుకుంటున్నావా అంటే, చూసుకుంటున్నా ఎప్పణ్ణించో కడగాలనుకుంటున్నాను అదేదో వరుణదేవుడు చూసుకున్నాడు అంటాడు.  ఇతను  ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ వీడబోమని నిర్ణయించుకుని ఆచరిస్తున్న వాడు.  చేసుకుంటే అందరికీ ఈ  స్వభావం అలవాటవుతుంది.   

మెదడుకి పోషకాహారం అనుదినమూ ఎందుకివ్వాలంటే, మనం రోజులో మూడు నాలుగ్గంటలు న్యూస్ పేపరనీ టీవీ అనీ పిచ్చా పాటీ అని గడుపుతాం.  గాలి వార్తలూ గాసిప్పుల్లోని  మంచికన్న చెడు మెదటి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది.  రాత్రి నిద్రకుపక్రమించేసమయానికి నైరాశ్యమూ ఆందోళనా దిగులు భయమూ వంటి అన్ని అవలక్షణాలూ బుర్రని ఆక్రమించుకుంటాయి.  దానికి విరుగుడే ఒక క్రమ పద్ధతిన ఉత్సాహాన్నీ పాజిటివ్ తత్వాన్నీ అందించే పుస్తకాలూ ప్రసంగాల అనుసరణ.    

బుద్ధికి ప్రేరణ మూడు విధాలుగా లభిస్తుంది.  మొదటిది భయం నించి కలిగేది.  ఉదాహరణకి, రాత్రి పదకొండుకి ముందు గానీ నువ్వింటికి రాలేదూ అంటే రేపటి నించి నిన్ను బయటికి అడుగుపెట్టనివ్వను.  నీ సేల్సు ఇలానే ఉంటే ఉద్వాసన తప్పదు.  ఇలా.  భయం కొందరి విషయంలో మంచి ఫలితాలనే ఇస్తుంది కాని ఇంకొందరిలో వికటించి అసహనాన్నీ తిరుగుబాటు ధోరణినీ పెంచుతుంది.  రెండోరకం ప్రోత్సాహకం నించి కలిగేది.  కర్రకి క్యారెట్టు కట్టి గాడిదని ముందుకురికించే రకం ఇది.  పనిచేస్తే ప్రతిఫలం.  ఉదాహరణలు, మీ బాధ్యతలు సరిగా నెరవేరిస్తే ఒచ్చే జనవరిలో మారిషస్ ట్రిప్పు అని, అమ్మకాలు ఎంతశాతం పెరిగితే అంత శాతం బోనస్ అని, పనితీరు నిలకడగా బాగుంటే పర్మనెంటు చేస్తాం ఇటువంటివి.  స్వేఛ్ఛావాణిజ్య ప్రపంచంలో ప్రోత్సాహకాలు బాగానే పనిచేస్తాయి.  

కర్రకి క్యారెట్ట్ కట్టిన గాడిద బండిని లాగే ఫొటోలు చూస్తుంటాం.  క్యారట్టుకి ఆశపడి గాడిద అడుగులు ముందుకేసి బండీ కదులుతుంది.  అయితే ఈ తరహా ప్రేరణకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  క్యారెట్టు మరీ దూరంగా మరీ దగ్గరిగా కాక అందీ అందనట్టు కట్టాలి.  బండీ బరువు గాడిద మోయగలిగినంత ఉండాలి.  అప్పుడప్పుడూ గాడిదని ఒక చిన్న క్యారెట్టుని కొరకనిస్తుండాలి.  లేకుంటే ఇదో ఎండమావి పరుగే అనిపించి గాడిద మొరాయిస్తుంది.  గాడిద కడుపునిండినదైనప్పుడు క్యారెట్టుకి మరింత రుచికరం చెయ్యాలి.  దాన్ని ఇంకా అందుబాటులోకి తేవాలి.  బండీ బరువు ఇంకా తగ్గించాలి.  అయితే ఇది కలకాలం పనిచెయ్యదు.  కొన్నాళ్ళకి ప్రోత్సాహకాలు జనాలకి అలవాటైపోయి అవిచ్చే కొత్త ఉత్సాహమంటూ ఏదీ లేకుండా పోతుంది.     లేక ఇప్పటికి చాలు ఇంకా ఆశపడి అనవసరంగా కష్టపడకూడదని స్థిరపడిపోవచ్చు. లేదా ఎడా పెడా ఇచ్చిన ప్రోత్సాహకాలు లాభాలని తినేసి మొదటికే మోసం రావచ్చు.  

మూడో రకం ప్రేరణ, ఆశ రగిలించడం.  ఆ గాడిదని రేసుగుర్రం చెయ్యాలి.  నేను పరిగెత్తి తీరాలన్న తపన దానిలో రగిలించాలి.  భయమూ ప్రోత్సాహకమూ బయటినించి ఒచ్చేవి.  ఇది లోపలనించి కలిగేది.   లోపలనించి కలిగే ప్రేరణే నిజమైనది, నిలిచేది.  బయటి నించి వచ్చిందాన్ని ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తాం.  అది మనసుకు పట్టించుకోవాలని, ఆచరించాలన్న సంకల్పం లోనించి కలిగితే అప్పుడు దాని ప్రయోజనం.

కట్టెల మంట చూడండి, మండినంత సేపు మండుతుంది.  నివురు కప్పగానే వేడీ తగ్గిపోతుంది. అప్పుడేం చేస్తాం, మళ్ళీ కట్టెలు వెయ్యం మంటకోసం.  ఉన్న దానికే ఒక కుదుపు నిస్తాం.  ఓ పుల్ల తీసుకుని ఆ బూడిదకిందనున్న నిప్పులని అటూ ఇటూ కదిపితే వాటికి ఆక్సిజన్ అంది మళ్ళీ తేజరిల్లుతాయి.  

మెదటికి ఆవరించిన స్తబ్ధూ నిరుత్సాహమూ కూడా నిప్పుకి పట్టిన నివురులాటివే.  వాటిని కుదపడమే ఇప్పుడు అనుకుంటున్న మెదటి మేత కార్యక్రమం.    

వేడి అచ్చుతో ఎలాటి ముద్ర వేస్తే అలాటిది ముద్రించుకుపోయే ప్లాస్టిక్కు లాటిదే మన మెదడు కూడ.  మనము మారనూ గలం, మార్చనూ గలం.    జూస్ట్ ఏ మీర్లో అనే అతను రేప్ ఆఫ్ ది మైండ్ అని ఒక పుస్తకం రాసేడు.  ఉత్తర కొరియాలో జరిగిన ఒక యుద్ధానంతరం కొందరు అమెరికా సైనికులు స్వదేశానికి తిరిగి రాకుండా ఉత్తర కొరియాలోనే ఉండిపోవడమే కాకుండా అమెరికాకి వ్యతిరేకంగా కూడా ప్రచారమూ పనీ చేసేరు.  ఇలా మారిపోయిన వారి అనుభవాలు అతను పరిశోధించాడు.  యుద్ధ ఖైదీలైన అమెరికా సైనికులొక్కొక్కరికీ రోజుకి పన్నెండేసి గంటలచొప్పున ఒకరి తరవాత ఒకరు బ్రెయిన్‌వాష్ నిపుణులు తమ కమ్యూనిజం ఎంత ఎందుకు గొప్పదో అమెరికా స్వేఛ్ఛా విధానాలూ దైవభక్తీ వంటివి ఎంత పనికిమాలినవిధానాలో అని పట్టుబడ్డ యువకులను తిండికీ నిద్రకూ కూడా వదలకుండా ఊదరగొట్టేవారు.  కాలిన ఇనుము మీద ఒకటి తరవాత  ఒకటిగా పడే సమ్మెట పోటుల్లా ఈ ప్రబోధాలు ఒక వారం రోజుల పాటు నడిచేసరికి సైనికులు నిజమే మీరు చెప్పింది ఇన్నాళ్ళూ ఎంత అజ్ఞానంలో ఉన్నాం ఇకపై మీరెంత చెబితే అంత అన్న స్థితికి వచ్చేవారు అని.  ఇంత జరిగినా కూడా స్వభావంలో మార్పు రానివారు ఒకరో ఇద్దరో ఉండేవారు.  వారు అంత వరకూ తాము నమ్ముకున్న దైవం మీద భారం వేసి అన్నిటికీ నువ్వే ఉన్నావని పంటిబిగువున ఈ బాధని భరించి ఎదటి బోధలని నిరోధించుకోగలిగిన సమర్ధులని మీర్లో వివరిస్తాడు.   దైవకటాక్షంకోసం నిరీక్షించగలవారి శక్తి పునరుజ్జీవం పొందును.  గద్దలవలె ఎగిరే రెక్కలను ఎంత నడిచినా కూలబడని శక్తిని వారు పొందెదరు. అని వుంటుంది బైబిలులో.  శక్తి పునరుజ్జీవం అంటే ఇంగ్లీషులో రెన్యూవల్ అని వ్యవహరించే దీనికి హీబ్రూ లో చలాప్ అని అంటారు.  అంటే శక్తి మార్పిడి అని.  నీరసించి ఇగిరిపోయే మనశక్తికి మారుగా భగవంతుని శక్తిని గ్రహించి మళ్ళీ శక్తిమంతులమవడం. మనిషి శక్తికి పరిమితులుండవచ్చు కాని భగవంతునితో చేయి కలిపి నడిచేవారు సంపాదించుకున్న ఉమ్మడి శక్తికి అసాధ్యాలుండవు.   అచంచల విశ్వాసంతో కలిగే ప్రయోజనం ఇది.

పైన చెప్పుకున్న సైనికుల స్వభావం అంత సులభగా పరివర్తనం చెందలేదు.  తొలుత వారూ ప్రతిఘటించారు.  కాని అది ఖాళీ చేతులతో యుద్ధ ట్యాంకుని ఆపడం వంటి ప్రయత్నం అయింది.  చివరికి లొంగిపోయారు. అంటే స్వభావం మార్చుకుందుకు ఇష్టంలేకున్నా పైనించి ప్రేరణ ఇంత ఉధృతంగా  వచ్చిపడిపోయినప్పుడు విధిలేక మారిపోయేవి మన స్వభావాలు. అటువంటప్పుడు కావాలని ఇష్టపడి రగుల్చుకున్న ప్రేరణతో కావలసిన రీతిగా ఎందుకు మారం.  తప్పక మారుతాం.   .         

షినిచీ సుజుకీ అని జపాన్‌లో గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, సంగీతజ్ఞుడు.  అతనో విశేషమైన ప్రయోగం చేపట్టేరు.  రోజుల వయసున్న సుమారు వందమంది పురిటికందులని ఉంచిన హాలులో సన్నంగా శాస్త్రీయ వయోలిన్ సంగీతం ప్రతి రోజూ వినిపించేవారు.  ఇలా ఒకటి రెండు నెలలు గడిచేది.  శిశువుల చెవులకు ఇది అలవాటయేది.  వారు పరిసరాలు గమనించడం ఆరంభించాక వారి ముందు వారి తల్లులకు  వయోలిన్ సాధన చేయించేవారు.  తల్లుల చేతులు ఎలా కదులుతున్నాయో కళ్ళు పెద్దవి చేసుకు చూచేవారు శిశువులు.   పిల్లలకి ఒక యేడాది వయసొచ్చాక చేతికి బొమ్మ వయోలిన్లనిచ్చి విడతకి రెండు మూడు నిమిషాల పాటు కమాను కదిపించేవారు.  పిల్లల వయసు నెల నెలా పెరుగేకొద్దీ ఈ సాధన నిడివీ పెరిగేది.  మూడేళ్ళ వయసొచ్చేసరికల్లా పిల్లలకి వయొలిన్ మీద ఆ బవులను అటూ యిటూ రాయడం ప్రయాసగా కాక ఆటగాను అలవోకగాను ఉండేది.  క్రమక్రమంగా వారు ఈ కళలోని మెళకువలన్నీ నేర్చుకుని అసలు సాధనలోకి అడుగుపెట్టేవారు.   వెయ్యీ పదిహేనువందలమంది ఇటువంటి పిల్లలతో ప్రొఫెసర్ సుజుకీ గారు ఔరా అనదగ్గ సంగీత ప్రదర్శనలెన్నో ఇప్పించారు.  వారు వాయించినదీ దీ అల్లాటప్పా సంగీతం కాదు.  బీతోవెన్, మొజార్ట్, చాపిన్, వివాల్డి వంటి శాస్త్రీయ కళాసంపన్నుల సంగీత రచనలను.  అందరు పిల్లల సగటు వయసూ ఏడేళ్ళకి తక్కువే.      

ప్రొఫెసర్ సుజుకీ గారి ప్రకారం వీరిలో చాలా మంది పిల్లలకి గానీ వారి తల్లిదండ్రులకి గానీ సంగీత జ్ఞానం లేదు.  అయినా అందరు పలికేదీ వినీ వినీ పిల్లలు ఎలా మాటలు నేర్చుకుంటారో అదే సహజ ప్రక్రియని తానూ అవలంబించి వారికి లేని సంగీత పరిజ్ఞానాన్ని పిల్లలకి అందించగలిగేరు.     

అతి స్థూలంగా ఈ ప్రక్రియ రహస్యం పునశ్చరణ.  విన్నదే విని విని అన్నదే అని అని అలా వినేదీ అనేదీ క్రమక్రమంగా పెంచుకుంటూ పరిణతిసాధించే ప్రక్రియ.  మనం ఎలా తయారవుతామన్నది మన జన్మని బట్టి కాక స్వభావమూ ఆచరణల బట్టి ఉంటుంది.  అట్టి స్వభావమూ ఆచరణా మనం మననించీ బయటినించీ అనుమతించి స్వీకరించే ఆలోచనలూ అభిప్రాయాలూ వ్యాఖ్యానాల బట్టి ఉంటుంది.  ఎటువంటివాటిని అనుమతించాలన్నది మనదే నిర్ణయం.   

అయితే టైం దొరకటం లేదన్నది వినిపించే ముఖ్య వాదన.  ఒక అంచనా ప్రకారం తల ఉపరితలం అంటే గడ్డం, మీసం, పెదవులు, జుత్తు, చెవులు, చెంపలు ఇలా - వీటి సింగారం కోసం ఏడాదిలో కనీసం అయిదారు వందల గంటలు గడుపుతామని తేలింది.  మరి లోపలి వస్తువుకి అంతకన్న ఎక్కువ సమయం ఎందుకు కావద్దు?

పని వత్తిడీ సమయాభావమూ అనుకున్నవారు ఈ వ్యాపకం చేపట్టేందుకు సులభమూ ప్రముఖమూ అయిన మార్గమొకటి ఉంది.  అది, ఆడియో రికార్డింగులు వింటుండటం.  ఏరంగంలోనైనా విశిష్టత సాధించిన ప్రముఖులందరిలోనూ సామాన్యంగా కనిపించే అలవాటు ఇది.  దినచర్య సాగిస్తూనే స్ఫూర్తి పొందగల విశిష్ట మార్గం.  కాలిఫోర్నియా యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం రెండేళ్ళు యూనివర్సిటీలో చదివి సంపాదించే జ్ఞానానికి సమానమైనదాన్ని ఒక సగటు ఉద్యోగి డ్రైవింగ్ చేస్తూ సంపాదించవచ్చు.  ఈ వినే అలవాటు ద్వారా.  మంచి స్ఫూర్తిమంతమైన ఆడియోలు వినడం వ్యక్తి కీ బృందాలకూ కూడా ఎంతో ప్రయోజనకరం.  ఒకటే బండ గుర్తు.  స్థిరంగా కూచుని ఉన్నప్పుడు చదవాలి.  కదులుతూ ఉన్నప్పుడు వినాలి.  ఇది అలవాటైనవారికి జీవితంలో ఉత్తేజమూ కొత్త యోచనలూ పనిపట్ల అంకిత భావమూ మొత్తంగా ప్రపంచంపట్ల మన దృకథంలోనే సమూలమైన పరివర్తనమూ సమకూరుతాయి.  సమయం లేదనేది కుంటి సాకు.  చెయ్యకతప్పనిది చేస్తున్నాం. చెయ్యాలనుకుంటున్నది చేస్తున్నాం.  ఇప్పుదు చెయ్యవలసినది చెయ్యాలి.  అందుకు సమయం సమకూర్చుకోవాలి.  అవసరమైతే వదిలేసినా పర్వాలేదనుకున్నవి రెండో ఆలోచనలేక వదిలించుకోవాలి.  

ఎలెన్ బీన్ అమెరికన్ నేవీలో కెప్టెను, నాసా వ్యోమగామి.  అతను చంద్రగ్రహం మీద అడుగుపెట్టిన తొలితరం శాస్త్రవేత్త.  అతను రెండో స్కైల్యాబ్ స్పేస్ స్టేషన్ మిషన్ కి నాయకత్వమూ వహించారు. రష్యన్ శాస్త్రవేత్తలతో కలిసి అమెరికా రష్యా సమ్యుక్త అంతరిక్ష కార్యక్రమలలోనూ పాల్గొన్నారు.  ఇన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉంటూ ఉత్తేజాన్ని సడలనివ్వని అతని విజయరహస్యమేమిటని అడిగితే, అది చాలా మటుకు తాను డ్రైవింగ్ చేస్తూ విన్న స్ఫూర్తిదాయక ఆడియోల పుణ్యమేనంటాడతను.  

అంతరిక్ష పరిశోధకుల ఎంపికలో ఎన్నో బహుళదశల క్లిష్టతర పరీక్షలుంటాయన్నది తెలిసినదే.  అన్ని ఎంపికలకన్నా కష్టసాధ్యమైన విధానమిది.  పరీక్షలన్నీ జయించి ఎంపిక కావడం ఒక యెత్తయితే, ఎంపికయాక మిగతావారితో మెలగడం దగ్గర్నించి చేసే ప్రతి పని తీసుకునే ప్రతి నిర్ణయమూ ఒక సవాలే.  ఎంతో స్థైర్యమున్నవారికి కాని సాధ్యపడని కొలువులివి.  ఒకరూ ఇద్దరనీ కాక బృందం మొత్తం ఇదే తత్వాన్ని కలిగి యుండాలి. నిరాశా సంశయమూ భయమూ వంటివి కల్లో కూడా తలచకూడని లక్షణాలు.   ఏ సవాళ్ళకీ వెనుకంజ వెయ్యకుండా రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోయే కెప్టెన్ బీన్ ను ఇలా ఉండటం ఎలా సాధ్యం అని అడిగితే, తన విజయ రహస్యం క్రమం తప్పక స్ఫూర్తిభరిత ఆడియోలు వినడం అంటారు.  జీవితాన్ని అర్ధవంతంగాను ఉత్సాహవంతంగాను గడపాలని అభిలషించే ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయుక్తమైన సందేశం ఇది.  ఎందుకంటే ఎందరొ ప్రముఖుల ఉపన్యాసాలు ప్రసంగాలు రచనలు ఆడియో పుస్తకాల రూపంలో అందరికీ అందుబాటులో ఉన్నాయి.  ఏ శ్రమా లేకుండా అందిపుచుకుని సద్వినియోగపరుచుకోవీలున్న సాధనం ఇది.    

కెనడాలో వరల్డ్ వైడ్ హౌస్ వేర్ డిస్ట్రిబ్యూటర్స్ అని ఉంది ఆ వ్యాపారంలో కెనడాలోకెల్లా అతి పెద్ద సంస్థ అది.  వారి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ యేటికేడూ ఉత్తేజాన్నీ అమ్మకాలనూ అప్రతిహతంగా  పెంచుకుంటూ వస్తున్నారు. దానిక్కారణం మావాళ్ళు నిరంతరంగా స్ఫూర్తిమంత ఆడియోలు వింటూనే ఉంటారు అని గొప్పగా చెప్పుకుంటాడు వాళ్ళ ఎండీ. ఇంకా అంటాడు.  వాళ్ళు గొప్పవాళ్ళు కనక వినడం లేదు; వినడం వల్ల గొప్పవాళ్ళయేరు అని.  

అయితే డీలా పడినప్పుడు చూసుకుందామని ఉపేక్షించకూడదు. అప్పటికే అలవాటు కానిది అప్పటికప్పుడు అలవాటవదు.  యోచనలు, ఆలోచనలు, అనుభవాల సాగరంలోకి నిరంతరమూ కొత్తనీరు ప్రవహిస్తూనే ఉంటుంది.  ముందు చూపున్నవారు దాని సేవనంలో అలసత్వం చూపరు.  అదంతా చదవనైనా చదవాలి, విననైనా వినాలి. కడుపు నింపుకోవడం క్రమబద్ధమైన నిత్యకృత్యం అయిన విధంగానే మెదటినీ నింపుకోవడమూ అయిపోవాలి.  నిగూఢమూ కష్టమూ అనిపించినది మళ్ళీ మళ్ళీ చదవాలి, వినాలి.  అలా చేసిన ప్రతిసారీ అంతకు ముందు స్ఫురించని భావనలు వెల్లడవుతాయి.  ఆరంభం నెమ్మదిగా జరగచ్చు కాని వదలక అభ్యసిస్తే అలవాటవుతుంది. ఇది కొనసాగించే కొద్దీ మొదట  ఆనందిస్తాం.  తరవాత అర్ధం చేసుకుంటాం,   చివరికి అలవాటుచేసుకుని ఆచరిస్తాం.




No comments:

Post a Comment