ప్రతిరోజూ పద్మవ్యూహపురం దార్లన్నీ వెదకడం, ఆహారం వెదుక్కోవడం - ఇదీ వాళ్ళ దిన చర్య.
పరిమాణంలో చిన్నవి కావడంవల్ల, పద్మవ్యూహపురం లో ఈ నాలుగు జీవాలూ ఏం చేస్తున్నాయో కనిపెట్టటం కొంత కష్టమే కాని కాస్త సూక్ష్మంగా పరికిస్తే బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు!
ప్రతిరోజూ ఈ నలుగురూ తమకిష్టమైన ఆహారాన్నన్వేషించుకుంటూ వీధులన్నీ తిరుగాడుతుండేవి.
చుంచయ్య, చిట్టెయ్యలు చిన్న చిన్న ఎలుక బుర్రలనే గాక పశువులకుండే సహజమైన కొన్ని స్వాభావిక గుణాలు, అంత: ప్రవృత్తులు కూడా కలిగి యుండేవి. వీటి వల్ల ఆహారం వెదుక్కోవడం దానిని ఫలహారం చేయడం వాటికి సులభమయ్యేది – అన్ని ఎలుకల్లాగే.
అలసయ్య , చింతయ్య లకి అదనంగా అధిక మేధస్సు, దానినిండా ఆలోచనలు, పథకాలు, నియమాలు. అందువల్ల వారు ఆహార నాణ్యత విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు. అలాంటిలాంటి పదార్ధాలు వారికి నచ్చేవి కావు. తమ బుద్ధికి నచ్చిన ఆహారం మాత్రమే తమకు ఆనందం కలిగిస్తుందని బలంగా నమ్మేవాళ్ళు.
జాతులు, బుద్ధి స్థాయులు, అభిరుచులు వేరైనా ఈ నలుగురి దినచర్యా ఒకేలా ఉండేది. ప్రతిరోజు బయటికెళ్ళేటప్పుడు, సులువుగా పరిగెత్తేందుకు వీలుగా ఉండే దుస్తులు, బూట్లు అందరూ ధరించేవారు. ఆ రకమైన బందోబస్తుతో పద్మవ్యూహపురం నలుదిక్కులా ఆహారాన్ని అన్వేషించేవారు.
పేరుకు తగినట్టే పద్మవ్యూహపురం నిజంగానే పద్మవ్యూహం. దానిలో ఎన్నో మార్గాలు, అరలు, గదులు. కొన్నింటిలో ఆహారం దొరికేది. కొన్ని మాత్రం చీకటి గదులు, అంధకారబంధుర, సుదీర్ఘ మార్గాలు. వీటి గుండా పోయేవారెటువంటివారైనా దారి తప్పాల్సిందే.
అయితే తమ మార్గమెటో తెలుసుకుని జాగ్రత్తగా పోయే వాళ్ళకోసం పద్మవ్యూహపురం కొన్ని రహస్య బహుమతులిచ్చేది – వారి ఆనందం కోసం.
చుంచయ్య, చిట్టెయ్య తమకి తెలిసిన “ప్రయత్నం-పొరబాటు” అనే ఒకే ఒక మార్గాన్ననుసరించుకుని పోయేవి. ఒక వరండా గుండా పరిగెత్తడం, దానిలో ఏదీ దొరకనప్పుడు వేరే దానిగుండా పరిగెత్తడం – ఎదో ఒకటి దొరికేవరకు ఇదే తంతు.
తనకు గల అమోఘమైన ఘ్రాణశక్తితో చిట్టెయ్య ఆహారం ఏ దిశలో ఉందో సూచించేది. సూచించిందే తడవుగా చుంచయ్య పరుగులెత్తేది, చిట్టెయ్య అనుసరించగా. మీరూహించిన విధంగానే అవి రెండూ దారి తప్పడమో, ముక్కులు ఎదో గోడకు గుద్దుకోవడమో జరిగేది.
అలసయ్య , చింతయ్య ల విధానం వేరేగా ఉండేది. వారికి మేధాశక్తి ఎక్కువ కావడం వల్ల, ప్రతీ అడుగుకి ముందు సుదీర్ఘంగా ఆలోచించేవారు – దాని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉండబోతుందో తమ పూర్వానుభవాల నుండి విశ్లేషించుకునీ గాని అడుగు ముందుకేసేవారు కాదు. విపరీతమైన ఆలోచనలు, విశ్లేషణల వల్ల అప్పుడప్పుడు కొంత అయోమయ పరిస్థితి కూడ కలిగేది.
ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించి పద్మవ్యూహపురం విందుపేటలో తగుమాత్రం భోజనం లభించింది – అందరికీ సరిపడాను, వారివారి రుచికి తగ్గట్టుగాను.
అప్పట్నించి ప్రతి ఉదయం డ్రస్సులూ బూట్లూ బిగించుకోవడం, విందుపేట వైపు పరుగులు తియ్యడం - ఇదీ వారి దినచర్య.
చిట్టెయ్య, చుంచయ్యలు కాస్త పెందరాడే తెమిలి బయలుదేరి రోజూ ఒకే త్రోవంట విందుపేటకి చేరుకునేవి. గమ్యం చేరగానే బూట్లు విప్పి తాళ్ళు ముడివేసి మెడకి తగిలించుకొనేవి – ఏ క్షణాన వాటి అవసరం కలిగినా గబగబ వేసుకుని పరుగులెత్తేందుకు సిద్ధంగా. అలా చేసిన తరవాతే వాటికి భోజనం రుచించేది.
అలసయ్య , చింతయ్య లు మొదట్లో పెందరాడే లేచినా, వెళ్ళబోయే త్రోవ, చేరాల్సిన గమ్యం అలవాటైపోవడంతో వాళ్ళకి నింపాదితనం పెరిగింది. దుస్తులు ధరించడం, బూట్లు తొడుక్కోవడం ఇంతకు ముందున్నంత హుషారుగాకాక తీరుబడిగా చేస్తూ, విందుపేటకి పరుగు కాక నెమ్మది అడుగుల నడకతో చేరుకునేవారు. తొందర పడే అవసరమేమొచ్చింది, తెలిసిన రూటు, తిన్నంత ఫుడ్డు.
ఆ ఆహారం అక్కడకెలా వస్తుందో, ఎవరు అక్కడ పెడుతున్నారో ఆలోచించే ప్రయాస కూడా పడదలచుకోలేదు వారు. “అది అక్కడ ఉంటుంది, మనం వెళ్ళి తినడమే”. అంత నమ్మకం వారికి.
అంతే కాక, విందుపేట చేరుకోగానే పరుగు బూట్లనవతల పారేసి, కులాసా చెప్పుల్ని ధరించేవారు. విందుపేట ఇప్పుడు వారికి అన్నీ అమర్చి పెట్టిన సొంత ఇల్లులా మారిపోయింది. “కూర్చుని తరతరాలు తిన్నా తరగని ఆహారం, రేపటి గురించిన చింతే అవసరంలేని జీవితం. ఇంతకన్నా మనకేం కావాలి చెప్పు” అని భోజనాల మధ్యలో “స్వీయభాగ్యప్రస్తుతి” కూడా చేసుకునేవాళ్ళు.
తమకి ఇంకే ఢోకా లేదని గ్రహించి అలసయ్య , చింతయ్య లు తమ నివాసాలను విందుపేట దగ్గరగా ఏర్పాటు చేసుకుని అక్కడే కాపురాలు కొనసాగించసాగేరు. మనసు మరీ ఆనందంతో పురివిప్పినప్పుడల్లా విందుపేట గోడలమీడ తాము తృప్తిగా భోంచేస్తున్న బొమ్మలు గీసుకుని వాటి కింద చక్కని వ్యాఖ్యానాలు రాసేవారు – “ఇంత చక్కని విందు దొరకునా వేరెందు” అని.
అప్పుడప్పుడు అలసయ్య చింతయ్య లు తమ స్నేహితులని విందుకు ఆహ్వానించి పనిలో పనిగా విందుపేట చుట్టూ వారిని తిప్పి అందులో గల ఆహార నిల్వల్ని చూపించేవారు. చూపించిన ప్రతి సారీ “అద్భుతంగా ఉంది కదూ?” అని ఆశ్చర్యాన్ని ప్రకటించి అన్యాపదేశంగా తమ గొప్పను ప్రదర్శించడం అదో సరదా.
ఎక్కడ మిత్రులు “ఇది అమాంబాపతు సరుకని నాకు తెలుసోయ్” అనుకుంటారోనని అలసయ్య , “కాని ఇది కనుక్కోవడానికి ఎంతలా కాళ్ళరిగేలా తిరిగామని!” అనేవాడు. అంటూ, ఓ జిలేబీ ముక్క తుంపి నోట్లో వేసుకొంటే మరింత రుచిగా, తృప్తిగా అనిపించేది.
సుష్టుగా భోంచెయ్యగానే ఓ కునుకు తియ్యడం కూడా అలవాటు అలసయ్య చింతయ్య లకి.
ప్రతీ రోజు ఖాళీ చేతులతో క్షేత్రానికెళ్ళడం, తిరిగి ఇంటికెళ్ళేటప్పుడు చేతికందినంత ఆహారాన్ని పట్టుకు వెళ్ళడం – ఇదీ వారి రోజువారీ వ్యవహారం.
ఇలా కొంతకాలం గడిచింది.
కాలం గడుస్తున్నకొద్దీ అలసయ్య , చింతయ్య ల ధీమా అహంభావంగా రూపాంతరం చెందింది. అది తెచ్చిన దృష్టి దోషం వలన చుట్టూ జరుగుతున్న మార్పులను వారు పట్టించుకొనేవారు కాదు.
చిట్టెయ్య , చుంచయ్యల దినచర్యలో మార్పేమీ లేదు. అవి ప్రతి దినం పెందరాళే విందుపేటకి రావడం, ముందురోజుకంటే ఆ రోజు అక్కడ జరుగుతున్న మార్పులను తెలుసుకోవడానికి చుట్టూ వాసన చూడటం, గోళ్ళతో బక్కరడం చేస్తుండేవి. అనంతరం అక్కడ ఉన్న ఆహారాన్ని కుసింత తినేవి.
ఇలా ఉండగా ఒక రోజు అవి విందుపేటకి వచ్చి అక్కడ ఆహారం ఏమీ లేకపోవడం గమనించాయి.
అవి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే నిల్వలు రోజు రోజుకూ తగ్గడం గమనించినప్పుడే ఈ పరిస్థితి రాబోతుందని గ్రహించి, అందుకు తామేం చెయ్యాల్సిందో తమకున్న సహజ జ్ఞానంతో ముందుగానే అనుకున్నాయి.
అనుకున్నదే తడవుగా కూడబలుక్కుని మెడకి తగిలించుకున్న పరుగు బూట్లని తీసి కాళ్ళకి తొడుక్కుని తాళ్ళని బిగించాయి.
ఆ మూషికాలు పరిస్థితులని అతిగా విశ్లేషించలేదు. పైగా వాటికి మిక్కుటమైన నమ్మకాలూ సూత్రాల బెడద కూడా లేదు.
ఆ మూషికాలకి సమస్యా పరిష్కారం కూడా సుస్పష్టం. విందుపేటలో పరిస్థితి మారుతోంది కనక తామూ మారాలి.
అవి ఒక్క సారి చుట్టూ ఉన్న రావణకోట లోకి చూసాయి. చిట్టెయ్య ఒక సారి ముక్కును ఎత్తి మూచూసి చుంచయ్య వైపు తల పంకించగా, అది ఒక్క గెంతుతో ఆ గహ్వరంలోకి కాలి సత్తువ కొద్దీ పరిగెత్తనారంభించింది చిట్టెయ్య వెనకే అనుసరించగా.
కొత్త అవకాశాల అన్వేషణలో వారి పరుగు ప్రారంభం.
బారెడు పొద్దెక్కేసరికి అలసయ్యా చింతయ్య లు కూడ అక్కడికి వచ్చేరు. వారు ప్రతిదినం అక్కడ చోటుచేసుకుంటున్న చిన్న చిన్న మార్పులను గమనించనందువల్ల, తామొచ్చేసరికి ఎప్పటిలాగే ఆహారం తమకోసం ఎదురు చూస్తూంటుందని భావించారు.
ఎదట కనిపించేది చూడ్డానికి వారు సిద్ధంగా లేరు.
"ఇదేమిటి? తినడానికేమీ లేదే?" అని అరిచేడు అలసయ్య . "లేదూ? లేదూ?" అంటూ పూనకం వచ్చినవాడిలా ఊగిపోతూ - అలా అరిస్తే ఎవరో వచ్చి మళ్ళీ గంగాళాలన్నీ నింపి వెళ్ళిపోతారన్నట్టు.
"మా ఆహారాన్ని ఎవరు మార్చేరు? ఎక్కడికి?" అని గొంతెత్తి అడిగేడు.
చివరికి రెండు చేతులనీ నడుమ్మీద ఉంచి, ఎరుపెక్కిన మొహంతో, గొంతు చించుకుని ఆక్రోశించేడు - "ఇదేం పద్ధతి, చండాలం!"
ఇదంతా నమ్మబుద్ధి కావడం లేదు. ఇక్కడ తిండి దొరకడం తధ్యమని తన ప్రగాఢ విశ్వాసం. దిగ్భ్రాంతితో అలాగే నిల్చున్నచోటినుండి కదలకుండా కొయ్యబారిపోయేడు. ఈ ఉత్పాతానికి అతడు సిద్ధంగా లేడు.
అలసయ్య ఇంకా అరుస్తూనే ఉన్నాడు కాని చింతయ్య కి వినబుద్ధి కాలేదు. అతనికి ఈ విపత్కర పరిస్థితులని కెలికి చేతులు కాల్చుకోవడం, ఈ జంఝాటంతో బుర్ర పాడు చేసుకోవడం ఇష్టంలేదు.
వారి ప్రవర్తన అంత ఆకర్షణీయమూ ఫలవంతమూ అని చెప్పలేము గానీ అర్ధం మాత్రం చేసుకోదగిందే.
తిండిని వెదుక్కోవడం సులభం కాదు; ముఖ్యంగా తినగలిగినంత తినడం అలవాటుపడిన ఆ అల్పజీవులకి.
ఆనందంగా ఉండడాలంటే ఆహారాన్ని అన్వేషించాలన్నది ఆ అల్పజీవుల అభిప్రాయం. ఆహారమంటే ఏమిటో వారి వారి అభిప్రాయాలు వారికున్నాయి - అభిరుచులనుబట్టి.
కొందరికి ఆహారం అంటే ధనార్జన చెయ్యడం. ఇంకొందరికి అది మంచి ఆరోగ్యంతో తొణికిసలాడడం, లేదా ఆధ్యాత్మికానందం పొందడం.
చింతయ్య కి ఆహారం అంటే ఏ చీకూ చింతా లేకుండా అనుకూలమైన కుటుంబంతో చాదర్ వీధిలో సౌకర్యవంతమైన కుటీరంలో కాలం గడిపెయ్యడం.
అలసయ్య కి మాత్రం ఆహారం అంటే అందరి మీదా కర్ర పెత్తనం చేస్తూ దర్జాగా కేమెబెర్ట్ కొండమహల్లో విలాసవంతమైన జీవితాన్ని గడపడం.
ఆహారం వారికి అంత ముఖ్యమైంది కాబట్టి, వాళ్ళిద్దరూ ఏం చెయ్యాలా అని అనుకుంటూ చాలా సేపు గడిపేరు. ఆలోచనంతా ఏమి నిర్ణయం తీసుకోవాలా అనే. ఇంతా చేసి వారి ఆలోచన ఇంకొక్క సారి విందుపేట చుట్టూ చూసి నిజంగా ఆహారం అక్కడినించి పోయినట్టేనా అనే దానితోనే గడిచింది.
పరిస్థితిని గ్రహించిన తక్షణమే చిట్టెయ్యా చుంచమ్మా పరుగు తియ్యడం ప్రారంభిస్తే, అలసయ్యా అలసయ్యా మాత్రం చింతిస్తూ ఆవులిస్తూ కూర్చున్నారు.
వాళ్ళు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఆక్రోశించి ఎవెవో పిచ్చి పిచ్చిగా వాగేరు. చింతయ్య స్తబ్ధుడై చతికిలబడిపోయేడు. రేపు కూడా ఆహారం లేకపోతే ఎం చెయ్యాలి? దీన్ని నమ్ముకుని తాను చాలా పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకున్నాడు. ఇదంతా వారికి నమ్మశక్యం కాకుంది. ఇది ఎలా జరిగుంటుంది? దీని గురించి ముందస్తుగా ఎవరూ హెచ్చరించలేదు కూడా. ఏమైనా ఇది మాత్రం సరి కాదు. పరిస్థితులు ఈ విధంగా మారిపోవడం సరికాదు.
ఆరాత్రి అలసయ్యా అలసయ్యా ఏమీ తినకుండానే నిస్సత్తువతోనూ నిరుత్సాహంతోనూ ఇళ్ళకి పోయేరు. వెళ్ళేముందు చింతయ్య గోడ మీద ఈ విధంగా రాశాడు.
“నాది నాది అను అపేక్ష పెరిగితె అంటిపెట్టుకుని పడి వుందువురా ”
మర్నాడు అలసయ్యా అలసయ్యా ఇళ్ళనొదిలి విందుపేటకి మళ్ళీ వచ్చారు - నిన్న చూసింది కల కాకూడదా అన్న ఆశతో.
పరిస్థితిలో మార్పేంలేదు, ఆహారపు తునక కూడా లేదు. వాళ్ళిద్దరికీ ఏంచెయ్యాలో పాలుపోలేదు. ఱాతి బొమ్మల్లా నిలుచుండిపోయేరు.
చింతయ్య రెండు చెవులనూ అరచేతులతో అదుముకొని కళ్ళని గట్టిగా మూసుకున్నాడు. బుర్రలోకి ఏ ఆలోచననూ చొరనీయదలచుకోలేదు. ఆహారం రోజు రోజుకూ కొద్దికొద్దిగా తగ్గిందనేదాన్ని అంగీకరించబోవక, ఒక్కసారిగా మాయమయిందనే అనుకోడానికి ఇష్టపడ్డాడు.
అలసయ్య పరిస్థితిని మళ్ళీ మళ్ళీ విశ్లేషణ చేస్తూ పోయేసరికి, సిద్ధాంతాలూ విశ్వాసాలతో నిండిపోయిన అతని మెదడు అతడిని పూర్తిగా స్వాధీనపరుచుకుంది. "నాకే యెందుకిలా?" అని దబాయించి అడిగేడు. "ఏం జరుగుతోందిక్కడ?"
ఎట్టకేలకు చింతయ్య కన్నులు తెరిచి చుట్టూ పరికించి అన్నాడు, "ఇంతకీ చిట్టెయ్యా చుంచయ్యలు ఏరీ? మనకి తెలియంది వాళ్ళకేమైనా తెలుసునంటావా?"
అలసయ్య కొట్టిపారేశాడు. " ఏమిటి వాళ్ళకి తెలిసేది?"
అతడు కొనసాగించేడు. "వాళ్ళు కేవలం సామాన్యమైన చిట్టెలుకలు. ఎదైనా జరగ్గానే స్పందిస్తారు. మనం మానవులం. మనం ప్రత్యేకం. దీన్నెలాగైనా ఛేదించాలి. దేన్లోనైనా సింహ భాగం మనకే దక్కాలి. అది మన అర్హతా, హక్కూను. "
“…”
"ఇది మనకి జరిగి ఉండకూదదు, ఒకవేళ జరిగినా దాన్లో కూడా మనకి ఎంతో కొంత లాభం ఉండాలి."
"మనకెందుకుట లాభం?" అని అడిగేడు చింతయ్య .
"ఎందుకంటే మనం అర్హులం అంతే," అని హక్కు ప్రకటించేడు అలసయ్య .
"దేనికి అర్హులం?"
"మన ఆహారానికి మనం అర్హులం"
"ఎందుకని?"
"ఎందుకంటే ఈ సమస్య తెచ్చిపెట్టింది మనం కాదు," అన్నాడు అలసయ్య . "ఎవరో చేసేరు కనుక మనకి అందులో ఎంతో కొంత దక్కాలి."
చింతయ్య సూచించేడు "మనం ఈ అనవసర విశ్లేషణలు ఆపి తిండి వెదుక్కోవడం మంచిదని నాకనిపిస్తుంది."
"వీల్లేదు," అలసయ్య పిడివాదానికి దిగేడు. "దీని అంతేమిటో నేను చూడాల్సిందే."
వీళ్ళిద్దరూ ఏం చేయాలా అని ఇక్కడ తర్జన భర్జనలు పడుతూ వుంటే, చిట్టెయ్యా చుంచయ్యలు వాటి ప్రయాణంలో అవి ఉన్నాయి. అవి ఆ గజిబిజి సందుల్లోకి, పైనా కిందనా ఉన్న వరండాలలోకి పరుగులు తీస్తూనే ఉన్నాయి ఆహారం కోసం.
ఆహారాన్ని కనుక్కోవడం ఒకటే వాటి ఆలోచన. కొంత సమయం వరకూ వాటికేమీ దొరకలేదు. అంతట, ఆ పరుగులో ఇంతకు మున్నెన్నడూ చూడని పసందుపాలెం చేరుకుని అక్కడ రాశులుగా ఉన్న ఆహారాన్ని అవి చూసేయి.
అవి ఆనందంతో కిచకిచలాడేయి. అవి ఎంతగానో ఎదురుచూస్తున్న అమితమైన ఆహారపు రాశులను కనుగొన్నాయి.
తమ కళ్ళను తామే నమ్మలేకపోయేయవి. తాము ఇంతకు మున్నెన్నడూ చూడనంత ఆహారపు నిల్వలు ఎదట కనబడుతున్నాయి.
అలసయ్యా చింతయ్య లు మాత్రం ఇంకా విందుపేటలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏమీ తినకపోవడం వలని దుష్ఫలితాలకు వారు గురయ్యారు. ఆక్రోశమూ ఆగ్రహాలతో దీనిక్కారణం నువ్వంటే నువ్వని పరస్పరం నిందించుకొన్నారు.
ఉండుండి చింతయ్య తమ మిత్ర మూషికాలు చిట్టెయ్యా చుంచయ్యలను తలచుకొని వాటికి ఎక్కడైనా ఆహారం దొరికిందో లేదోననే ఆలోచనలలో పడ్డాడు. అవి కష్టపడుతూ ఉండి ఉండాలి, ఎందుకంటే ఆ గజిబిజి సందుల్లో అదేపనిగా పరిగెత్తడమంటే మాటలు కాదు, పైగా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే అటువంటి ఇబ్బందులు కొద్ది క్షణాలే ఉంటాయని కూడా అతనికి తెలుసు.
ఇంకో సారి చింతయ్య , చిట్టెయ్యా చుంచయ్యలు కొత్త ఆహారాన్ని కనుక్కొన్నట్టూ ఆనందంతో ఆరగిస్తున్నట్టూ కూడా కల్పనచేసుకున్నాడు. తాను కూడా ఆ గజిబిజి వీధుల్లో సాహస యాత్ర చేసి ఆహారాన్ని కనుగొంటే ఎంత బాగుంటుందో కదాని అనిపించింది. అతని నోట్లో నీళ్ళూరాయి.
కొత్త ఆహార క్షేత్రాన్ని కనుగొని ఆరగిస్తున్నట్టు కలలు ఎక్కువైన కొద్దీ అతనికి విందుపేట విడిచి వెళ్ళే ఊహలు అధికమయ్యాయి.
"పద పోదాం!" ఉన్నట్టుండి కేకేసాడు.
"వీల్లేదు," అలసయ్య కరాఖండీగా చెప్పేడు. "నాకిక్కడే బాగుంది. సౌకర్యంగా ఉంది. నాకు తెలిసింది ఇదే. పైగా బయట ప్రమాదాలూ పొంచి ఉంటాయి."
"అదేం కాదు," అన్నాడు చింతయ్య . "మనం ఇంతకు ముందు ఇక్కడి సందులన్నింటిలో చాలా సార్లు పరిగెత్తేము, ఇప్పుడు కూడా అలా చెయ్యగలం.
"అందుకిప్పుడు నాకు వయసు మీరిపోతోంది," అన్నాడు అలసయ్య . "అదీ కాక పరిగెత్తి దారి తప్పిపోయి మూర్ఖపు పని చేసేనని తరవాత బాధపడటం నాకిష్టంలేదు. నీ సంగతి ఏమిటి?" అని అడిగేడు.
దానితో చింతయ్య కి తన ఓటమి తాలూకు భయం తిరిగి పట్టుకొని కొత్త ఆహారపు ఆశ మసకబారింది.
ఈ విధంగా ప్రతిరోజు ఆ అల్ప మానవులిద్దరూ ఇంతకు ముందు చేసినట్టుగానే విందుపేటకి రావడం, ఆహారం కనబడకపోవడం, తమతో పాటు తమ దిగులునూ నైరాశ్యాన్నీ కూడబెట్టుకుని నిరాశతో ఇల్లు చేరడం.
జరిగిందాన్ని జరిగిందని అంగీకరించడానికి మనసొప్పక కొన్నాళ్ళిలా గడిపినా, కొంత కాలానికి అది కష్టమనిపించేది, మర్నాటికి శక్తి మరింత క్షీణించి విసుగుదనం ఆవరించగా.
ఇళ్ళల్లో కూడా ఇదివరకట్లా పోషణ అందడంలేదు.
నిద్ర పట్టడం లేదు, ఇక ఆహారమే దొరకనట్టు పీడకలలు వస్తున్నాయి.
అయినాసరే అలసయ్యా చింతయ్య లు విందుపేటకి రోజూ రావడం, వేచి చూడడం, వెనుదిరగడం.
అలసయ్య ఓసారి అన్నాడు, "నీకు తెలుసా, మనం ఇంకొంచెం కష్టపడితే అసలు ఇక్కడ పెద్ద మార్పేమీ జరగలేదని తెలుసుకుంటాం. ఆహారం ఇక్కడే దగ్గర్లో ఎక్కడో ఉండుంటుంది. బహుశః ఆ గోడ వెనక పెట్టి వెళ్ళారేమో."
మర్నాడు అలసయ్యా చింతయ్య లు పనిముట్లతో వచ్చేరు. అలసయ్య ఉలిని గోడమీద పెట్టి పట్టుకొని, చింతయ్య దానిమీద సుత్తితో బాదగా బాదగా విందుపేట గోడకి కన్నం పడింది. దానిలోనుంచి లోపలికి చూసేరిద్దరూ, కాని ఆహారమేమీ కనబడలేదు.
వారు నిరుత్సాహం చెందినా ఎలాగో ఈ సమస్యని ఛేదించి తీరగలమనే గట్టి నమ్మకంతో ఉన్నారు. నాటినించి ఇంకా పెందరాళే రావడం, ఎక్కువసేపు అక్కడ గడపడం, కష్టపడి పనిచెయ్యడం. ఇలా చెయ్యగా చెయ్యగా గోడలో ఇంకో పెద్ద కన్నం పడింది.
ఉత్తుత్తి ప్రయాసకీ ఉత్పాదకతకీ తేడా అర్ధమవుతోంది చింతయ్యకి.
"ఏమో," అలసయ్య అన్నాడు, "మనం ఇక్కడ కాసేపు మెదలకుండా కూర్చుని గమనిద్దాం ఏం జరుగుతుందో. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఆహారాన్నిక్కడ మళ్ళీ పెట్టి పోతారు".
చింతయ్య అది నమ్మి, ప్రతిరోజూ పడుకొనేందుకు ఇంటికి వెళ్ళి మర్నాడు తిరిగి అలసయ్య తో పాటు అయిష్టంగా విందుపేటకి రాసాగేడు. పోయిన ఆహారం మాత్రం కనబడింది లేదు.
ఈ సరికి వాళ్ళిద్దరూ ఆకలివల్లా ఒత్తిడి వల్లా బాగా నీరసపడిపోతున్నారు. చింతయ్య అయితే పరిస్థితి ఎప్పటికైనా మెరుగుపడుతుందని ఎదురుచూసి చూసి అలసిపోతున్నాడు. అతనికి తెలుస్తోంది - ఈ నిరాహార ప్రాంతంలో ఎంత ఎక్కువ సేపుంటే తమ పరిస్థితి అంత క్షీణిస్తుందని.
తమ పటిమ కూడా సన్నగిల్లిపోతుండడం అతనికి తెలుస్తోంది.
ఆఖరికి ఒక రోజు తన స్థితి తల్చుకుని నవ్వొచ్చింది చింతయ్య కి. "హా హా, నన్ను చూడు. చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను, అయినా పరిస్థితి చక్కబడటంలేదేమని ఆశ్చర్యపోతున్నాను. ఇది హాస్యాస్పదం కాకుండి ఉంటే మరింత వినోదం కలిగేది."
చింతయ్య కి ఇంకో సారి ఆ సందుగొందుల వెంటపడి పరిగెత్తాలనే ఆలోచన నచ్చలేదు, ఎందుకంటే తనకి తెలుసు తాను దారి తప్పిపోతాడని, ఆహారపు ఆచూకీ తెలియదనీ. అయినా భయం తనకి చేస్తున్నది చూస్తుంటే తన వెర్రితనానికి మళ్ళీ నవ్వోచ్చింది.
అతను అలసయ్య ని అడిగేడు, "మన పరుగు బూట్లు ఆట దుస్తులు ఎక్కడ పెట్టేం?"
వాటిని వెదకడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే విందుపేటలో ఆహారపు రాశులు దొరికినప్పట్నించీ మిగతా అన్ని సంబారాలనీ అవతలపడేశారు వాటి అవసరం తమకి మరింకెప్పుడూ ఉండదని అనుకుంటూ.
తన మిత్రుడు పరుగుకోసం అన్నీ బిగించుకోవడం చూసి అలసయ్య అడిగేడు, "కొంపదీసి నువ్వు నిజంగా మళ్ళీ ఆ సందుగొందుల్లోకి పరుగులు తీస్తావా ఏమిటి? వాళ్ళు వచ్చి ఆహారాన్ని ఇక్కడ పెట్టి వెళ్ళేదాకా ఆగలేవూ?"
"అది దొరకదు," అన్నాడు చింతయ్య, "నాకు కూడా దాన్ని చూడాలని లేదు, పైగా వాళ్ళు ఆ పాత భోజనాన్ని ఇక్కడ పెట్టనే పెట్టరని ఇప్పుడు గ్రహించాను. అది నిన్నటి కూడు. కొత్త దాన్ని అన్వేషించడానికి ఇదే సమయం."
అలసయ్య మళ్ళీ వాడులాటకి దిగాడు, "సరే అనుకో, వేరెక్కడా కూడా అది లేకపోతేనో, ఉన్నా అది నీకు కనిపించకపోతేనో?"
"నాకు తెలీదు," అన్నాడు చింతయ్య . అవే ప్రశ్నలను తనకు తాను చాలా మార్లు వేసుకున్నాడు, వేసుకున్న ప్రతిసారీ తనను ఇక్కడినించి కదలనివ్వకుండా అడ్డుతున్న భయాలు ఆవహిస్తున్నాయి.
ఇలాక్కాదని అతను తన ఆలోచనలను కొత్త ఆహారపు నిల్వలను కనిపెట్టడం, దానితో పాటు మంచి రోజులన్నీ తిరిగిరావడం వంటి వాటి మీదకి మళ్ళించినప్పుడు ధైర్యం కూడుతోంది.
"కొన్ని సార్లు," చింతయ్య అన్నాడు, "పరిస్థితులు మారిపోతాయి, పూర్వస్థితికి ఎన్నడూ రావు. ఇప్పటి మన సంగతి కూడా అలాంటిదే అలసయ్యా. అదే జీవితం. అది సాగుతూ పోతుంది. దానితో బాటే మనమూనూ."
చింతయ్య నీరసించిపోయిన తన మిత్రుడి వైపు చూసి అతనికి కాస్త వివేకబోధ చేయదలచాడు కాని అలసయ్య భయం ఆగ్రహంగా మారి వినే స్థితిలో లేడు.
తన మిత్రుడిని అవమానించడం కాదు గానీ, తమ వేషాలూ తెలివిలేమీ చూస్తుంటే అతనికి నవ్వాగడం లేదు.
తన బుద్ధిలేనితనాన్ని చూసి ఏ భేషజాలూ లేకుండా తాను నవ్వుకోగలననీ అక్కడినించి బయటపడి పరుగుదీయబోతున్నాననీ గ్రహించి బయలుదేరడానికి సిద్ధమవడంతోనే చింతయ్య కి జవసత్వాలు పుంజుకున్నాయి.
"పరుగు సమయం" అని ప్రకటించేడు.
అలసయ్య నవ్వలేదు, అతనిలో ఏ స్పందనా లేదు.
చింతయ్య ఒక సూదిమొన ఉన్న రాయిని తీసుకుని అలసయ్య లో ఆలోచన రేకెత్తించడంకోసం ఎదటి గోడ మీద ఒక గంభీరమైన వాక్యం రాశాడు. అలవాటు ప్రకారం దాని చుట్టూ నోరూరించే తినుబండారం కూడా చిత్రించాడు - అదైనా అలసయ్య ముఖంలో చిరునవ్వు తెస్తుందని, వాతావరణాన్ని తేలికపరుస్తుందని, అనంతరం కొత్త ఆహార అన్వేషణకు పురిగొల్పుతుందనీను. కాని అలసయ్య దాన్ని చూడడానికి ఇష్టపడలేదు. ఆ వాక్యం :
“నీవు మారని యెడల, కనుమరుగు కాగలవు.”
అప్పుడు చింతయ్య మెడ ముందుకి చాచి ఎదటి గందరగోళపు సందులలో ఏముందో ఆసక్తిగా చూసేడు. తను ఈ నిరాహార దశకి ఎలా చేరుకున్నాడా అన్న విషయం గురించి ఆలోచిస్తూ.
ఆ లెక్కలేని సందుల్లో ఆహారం ఉండదని, ఉన్నా అది తనకు దొరకదని ఇన్నాళ్ళూ అతను భావించేడు. ఆ భయానక ఆలోచనలే అతని నిష్క్రియాపరునిగ చేసి చంపుతున్నాయి.
చింతయ్య చిరునవ్వు నవ్వేడు. అతనికి తెలుసు అలసయ్య ఆశ్చర్యపోతూంటాడు, "నా ఆహారాన్ని ఇక్కడినించెవరు మార్చేరు?" అని. కాని చింతయ్య అనుకుంటున్నది, "నేను ఎందుకు ముందుగా మేల్కొని ఆహారంతోపాటు ఇక్కడినించి ఎందుకు కదిలిపోలేద"ని.
అతను ఆ వ్యూహపు దారులంబడి సాగడానికి ముందు ఒక్కసారి వెనక్కి చూసి తను బయల్దేరిన చోటును, అది కలిగించిన సౌకర్యవంతమైన భావనను తలచుకున్నాడు. అతనిక్కూడా ఆ పరిచిత ప్రదేశం వెనక్కి ఆహ్వానిస్తున్నట్టే అనిపించింది - కొద్దిరోజులై తినడానికి అక్కడా ఏమీ లేకపోయినా.
అతనికి ఒక కలవరం లాటిది కలిగి నిజంగా పోవలసిందేనా అన్న సంశయం కలిగింది. ఎదటి గోడమీద ఒక సుపరిచితమైన వాక్యాన్ని ఈ విధంగా రాసి దానివైపు కొద్ది సేపు కన్నార్పకుండా చూశేడు.
“భయమనేదె లేకపోతె ఏమేమిటి చెయ్యగలవు?”
దాని గురించి కొద్ది సేపు యోజించాడు.
అతనికి తెలుసు కొన్ని సమయాల్లో కొంత భయం అనేది మంచిదేనని. చేతులు కట్టుక్కూచోవడం వలన పరిస్థితులు చేజారిపోతున్నాయనే భయం మనల్ని కార్యోన్ముఖుల్ని చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కాని కాళ్ళూ చేతులూ ఆడనివ్వక, ఏ పనీ చెయ్యనివ్వక, అడుగడుక్కీ అడ్డుపడే భయం అన్నివిధాలా దులపరించుకోదగినదే.
అతను కుడివైపు, ఇంతవరకు తాను పోని దిశగా చూసి అది కలిగించిన భయాన్ని పొందాడు.
తరవాత ఒక దీర్ఘ శ్వాస తీసుకుని, కుడివైపుకే తిరిగి పరుగు ప్రారంభించాడు తెలియని కొత్త ప్రాంతాల్లోకి.
దారి వెదుక్కుంటూ ముందుకు సాగుతున్న చింతయ్య , తాను విందుపేటలో అనవసరంగా ఎక్కువసేపు వేచి ఉండి కాలం వృధా చేసేనేమో అని బాధ పడ్డాడు. చాలాకాలం ఆహారం లేక నీరసించిపోయేడు. దానివల్ల సందుల్లో పడి పరిగెత్తడం మామూలుకన్న బాధగా అనిపించి సమయం కూడా ఎక్కువ తీసుకుంటోంది. అతను నిశ్చయించుకున్నాడు - అవకాశమంటూ మళ్ళీ వస్తే ఇప్పటి కన్న త్వరగానే మారతాడు. అది మార్గాన్ని సుగమం చేస్తుంది..
అప్పుడతను నీరసంగా నవ్వి ఇలా ఆలోచించాడు, "అసలు పోకపోవడం కన్న పొద్దెక్కి పోవడం కొంత మిన్న".
ఆ తర్వాత కొద్దిరోజులు చింతయ్య కి అక్కడో కొంత ఇక్కడో కొంత ఆహారం లభించింది కాని అది సరిపడ్డంత కాదు. తగుమాత్రం దొరికితే కొంత అలసయ్య కోసం తీసుకెళ్ళి ఇస్తే కనీసం ఆ స్ఫూర్తితోనన్నా తను కూడా ఈ అన్వేషణకి సిద్ధపడొచ్చేమోనని అతని ఆశ.
అయితే చింతయ్య కి ఇంకా ఆత్మవిశ్వాసం పూర్తిగా కలగలేదు. నిజానికి ఆ చిక్కులదారిలో అంతా అయోమయంగానే అనిపిస్తోందతడికి. తను క్రితంసారి వచ్చినప్పుడు కన్న అన్నీ మారిపోయినట్టుగా ఉన్నాయి.
ఫరవాలేదు బాగానే ముందుకు పోతున్నాం అనుకొనేలోగానే ఎదో సందులో దారితప్పిపోయేవాడు. రెండడుగులు ముందుకీ ఒకడుగు వెనక్కీ అన్నట్టుగా ఉంది అతని ప్రయాణ పురోగతి. నిస్సందేహంగా అదొక సవాలే అయినా ఆ గజిబిజి దారుల్లో తిండిని వెదుక్కొనే ప్రయాస తాను భయపడినంతగా లేదని మాత్రం చెప్పగలడు.
ఆ పరుగులో కాలం అలా గడుస్తుండగా, నిజంగా ఆహారం దొరుకుతుందనే తన ఆశ సమంజసమైనదేనా అనే సంశయం కూడా కలుగుతోందతడికి. నమలగలిగిన దానికన్న ఎక్కువ కొరికేనా అని కూడా అనిపిస్తోంది. నవ్వుకున్నాడు - ఇప్పుడు నమలడానికంటూ ఏముందని. నిరుత్సాహం కలిగినప్పుడల్లా తను ప్రస్తుతం చేస్తున్నది, ఇప్పటికి అసౌకర్యంగానే అనిపిస్తున్నా, వాస్తవానికి తినడానికేమీ లేని విందుపేటలో చేతులు ముడుచుక్కూర్చున్నప్పటి అసౌకర్యం కంటె మాత్రం మెరుగని సర్దుకుపోతున్నాడు. పరిస్థితుల పగ్గాలొక్కొక్కటే చేతిలోకి తీసుకుంటున్నాడు, వాటిని ఇష్టానుసారం తనను చుట్టుముట్టనివ్వకుండా.
ఆ మీదట ధైర్యం చెప్పుకుంటున్నాడు, చిట్టెయ్య చుంచయ్యలతో పాటే తనూను. వాళ్ళకి సాగినట్టే తనకూను.
తరవాత, జరిగినదాన్ని నెమరేసుకుంటే చింతయ్య కు అర్ధమైంది, తాను ఇంతవరకు గగ్గోలు పెట్టినట్టుగా, విందుపేటలో నిల్వలు ఒక్కసారి మాయమైపోలేదని, మొదటినించి చివరిదాకా ఉన్నవన్నీ క్రమేపి తగ్గుతూ వచ్చేయని, ఆఖరికి మిగిలినది కూడా రుచీ పచీ లేకుండ పాచిపోయిందని.
తను గమనించలేదు కానీ, అది బూజుపట్టిపోయి కూడా ఉండి ఉండవచ్చు. ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, తలచుకుంటే రాబోతున్నదాన్ని తాను స్పష్టంగా గ్రహించగలిగి ఉండేవాడే. అతనది చెయ్యలేదు.
రోజూ కలుగుతున్న మార్పులను గాని తను సరిగా గుర్తించి ఉండి వుంటే జరగబోయేది ముందే తెలుసుకోగలగడం వల్ల, ఇప్పుడు కలిగిన మార్పు తనకు అంత ఆశ్చర్యం కలిగించి ఉండేది కాదని చింతయ్య ఇప్పటికి గ్రహించాడు. బహుశః చుంచయ్య చిట్టెయ్య లు కూడా అదే చేస్తూండి ఉంటారు. అతను ఒకచోట సేద తీరటానికి ఆగి అక్కడి గోడ మీద ఇలా రాశాడు.
“మూతికి ముందర ముక్కును వాడిన, మురిగే విషయం ముందే తెలియును.”
కొద్ది కాలం తరవాత, తిండి ముఖం చూసి యుగాలైందే అని అనిపించిన తరుణంలో, చింతయ్య కి ఆశ పుట్టించే గది ఒకటి కనిపించింది. కానీ అతడు లోనికెళ్ళి చూడబోతే అది ఖాళీగా కనబడి మళ్ళీ నిరుత్సాహం ఆవరించింది.
"అన్నిదిక్కులూ ఖాళీఖాళీఖాళీ," అన్న భావన తరచూ వెక్కిరిస్తూండగా ఇక అన్ని ప్రయత్నాలకీ నీళ్ళొదులుకోవాలేమో అనిపించింది.
చింతయ్య ఒంటి సత్తువ కోల్పోతున్నాడు. దారితప్పిపోయేననిపించింది. ఇక బతకడేమోననుకున్నాడు. ఒక సారైతే వెనక్కి తిరిగి విందుపేట వైపు పోదామని అనిపించిది. కనీసం అక్కడయితే అలసయ్య కూడా ఉంటాడు కాబట్టి తనకి ఒంటరితనం ఉండదు. కానీ తను తరచూ వేసుకునే ప్రశ్ననే మళ్ళీ వేసుకున్నాడు: "భయమే గాని లేనట్టయితే నేను ఏమి చేసి ఉండేవాడిని?"
తాను ఒప్పుకుంటున్న దానికంటే ఎక్కువగానే భయపడుతున్నాడనిపించింది. భయకారణం ఎప్పుడూ అంతుపట్టేది కాదు గాని, ఈ నీరసంలో, ఇప్పటికి తెలిసొచ్చింది తన భయమల్లా ఒంటరి ప్రయాణం కారణంగానేనని. చింతయ్య కు తెలీదు భయం భావనల బరువే తన వేగాన్ని తగ్గించి పరుగులో వెనకబడేలా చేస్తోందని.
చింతయ్య తన నేస్తం అలసయ్య గురించి ఆలోచించాడు తను ఇప్పటికేనా కదిలేడా లేదా భయం ఇంకా అతడిని కదలనివ్వక నొక్కిపట్టే ఉంచిందా అని. తరవాత పద్మవ్యూహపురం లో తనకు ఆనందం కలిగించే క్షణాలేవి ఉన్నాయా అని జ్ఞాపకం చేసుకుంటే, అవన్నీ తాను శ్రమలో గడిపినవేనని తెలియవచ్చింది.
అప్పుడు, తన గుర్తు కోసం, ఇంకా ఒక వేళ తన నేస్తం గాని అటుగా వస్తే అతనికి హెచ్చరికగా ఉంటుందని ఆశించి గోడ మీద ఇలా రాశాడు:
“మూతికి ముందర ముక్కును వాడిన, మురిగే విషయం ముందే తెలియును.”
చింతయ్య ఆ కటిక చీకటి దారి లోకి చూసి తన భయాన్ని మరోసారి తలుచుకున్నాడు. ఎదట ఏమి పొంచి వుంది? అదంతా ఖాళీయేనా? ఇంకా భయానక ప్రమాదాలుంటాయా? తనకు జరగ గల అన్ని భయంకర సంఘటనలనూ అతనూహించుకుంటున్నాడు. తనను చచ్చేంత భయపెట్టుకుంటున్నాడు.
నవ్వొచ్చింది. భయం పరిస్థితులని ఇంకా భయంకరం చేస్తోందని గ్రహించాడు. తనకే గాని భయం లేకపోతే ఏమి చేయగలడో అదే చేయ నిశ్చయించాడు. ఒక కొత్త దిశగా తన పయనం సాగించాడు.
ఆ కటికచీకటి మార్గంలో పరుగిడుతూ మందహాసం చేశాడు. చింతయ్య కి ఇంకా తట్టలేదు గానీ, తను ఉత్తేజంతో హుషారుగా ఉండటానికి కారణమేమిటో మెల్లమెల్లగా గ్రహిస్తున్నాడు. అదేమిటన్నది స్పష్టంగా అగుపించనప్పటికీ, జరగబోయే దాన్ని నమ్ముకుని ఆగకుండా పరుగెత్తసాగాడు.
అతనికి ఆశ్చర్యం గొలుపుతూ, తనకి తనవల్లే మహోత్సాహం కలుగుతున్నది. 'ఇంత పరవశం ఎందుకబ్బా ' అనిపించింది. 'ఎటుపోతున్నానో, అక్కడ తిండి ఉంటుందో లేదో తెలీనప్పటికీనీ'.
కొద్ది సేపటికే తన ఆనందానిక్కారణం అతనికి తెలియవచ్చింది. హుషారుగా గోడ మీద ఇలా రాశాడు.
‘భయమును జయించి ముందుకు సాగిన, ఈ ప్రపంచమే సొంతమవ్వదా’
ఇన్నాళ్ళూ తన భయానికే తాను బందీ అయి ఉన్నానని, దాన్ని అధిగమించి ఒక కొత్త దారిలో పయనం వలన స్వాతంత్ర్యం తిరిగి వచ్చిందని గ్రహించాడు చింతయ్య .
ఎదటి చిక్కు మార్గం లోనుంచి ఆహ్లాదకరమైన చల్లని మలయమారుతం అతని ముఖాన్ని తాకి మనోహరోత్తేజాన్ని కలిగించింది. నాలుగైదు దీర్ఘశ్వాసలు పరిగెడుతూనే తీసుకుని ఆ జీవశక్తిని అణువణువునా నింపుకున్నాడు. భయాన్ని పూర్తిగా వదిలిపెట్టిన అతడికి ఇప్పుడు తన పరిసరాలు ముందు అనుకున్నట్లుగా కాక, నిజానికి ఎంతో ఉత్తేజాన్నిచ్చేవని గ్రహించాడు.
ఇటువంటి అనుభూతి మున్నెన్నడూ కలగలేదతనికి. ఇంతటి వినోదాన్ని తన జ్ఞాపకమున్నంతవరకు పొంది ఎరగడు.
మరింత ఉత్తేజం కోసం, మనోఫలకం మీద తన చిత్రాన్ని రూపొందించుకున్నాడు. అతి స్పష్టంగా గీసుకున్న ఆ వర్ణచిత్రంలో, నాణ్యతకి పేరొందిన తయారీదారులు చేసిన తనకిష్టమైన మధుర తినుబండారాలు తన చుట్టూ అమర్చి ఉన్నాయి! కనువిందు చేస్తూ కవ్వించిన వాటి నించి కావలసినంత కడుపారా భుజిస్తున్న తలంపు అతని ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఆ అద్భుత రుచులనన్నిటినీ గుటుక్కుమనిపించినప్పుడు తను ఇంకెంత ఆమరసౌఖ్యాన్ని ఆస్వాదించగలడో తలచుకొని పులకించిపోయేడు.
కొత్త తినుబండారాల గురించిన ఆలోచనలు ఎక్కువయ్యేకొద్దీ ఆ పదార్ధాలు వాస్తవంగా రూపుదిద్దుకుంటున్నట్టు, వాటి రుచిని తను మెల్ల మెల్లగా ఆఘ్రాణిస్తూ వాటి దిశగా సాగిపోతున్నట్టు భావించాడు. అప్పుడు ఈ విధంగా రాశాడు.
“కనుగొనకనే విందు కడుపార తినినట్లు కలుగు నా తలపులే నన్నటకు జేర్చు”
ఇది నేను ముందే ఎందుకు చెయ్యలేదు చెప్మా అనిపించింది.
ఉత్సాహమూ ఉత్తేజమూ నింపుకుని రివ్వున ఆ చిక్కు దారుల్లో పడి తిండి వేట మొదలెట్టాడు. త్వరలోనే ఒక గది, అది పలహారశాల అనేందుకు ఆనవాలుగా వాకిట్ట్లో కొన్ని భక్ష్యాల తునకలు అక్కడక్కడా పడి కనిపించేసరికి శక్తి రెట్టింపైంది. మున్నెన్నడూ చూడని పదార్ధాలవి. కొన్నింటిని తీసి రుచి చూసేడు. ఎంతో మధురమనిపించి కొన్నింటిని నోట్లోను, కొన్నింటిని అలసయ్య కి చూపేందుకు జేబులోనూ వేసుకున్నాడు.
ఎంతో ఆశతో లోనికి అడుగుపెట్టేడు గాని అది ఖాలీగా కనిపించి నిరుత్సాహపడ్డాడు. అంటే తనకన్న ముందు ఎవరో ఉన్నదంతా స్వాహా చేసేసేరన్నమాట. మీనమేషాల్లెక్కెట్టకుండా వచ్చుంటే తనకీ కడుపునిండా కూడు దొరికేది.
ఇప్పుడు మళ్ళీ వెనక్కెళ్ళి అలసయ్య తనతో వస్తాడో రాడో అడగాలి.
వెళ్తూ ఎదో గుర్తొచ్చి గోడ మీద ఇలా రాశేడు:
పాడు పడ్డ పాచి కూడు త్వర త్వరగా విడిచినపుడే, పసందైన పంచభక్ష్య పరమాన్నపు విందు నీకు.
ఏరుకొచ్చిన కొన్నింటిని అలసయ్యకి పెట్టేడు. అతను మెచ్చుకున్నాడు కాని అది సయించలేదుట. ఇన్నాళ్ళూ తిన్నదే అలవాటై ఇంకేదీ నాకు నచ్చదు. కొత్త అలవాట్లు చేసుకోవడం నా వల్ల కాదు అన్నాడు.
నిరాశతో తల అడ్డంగా వూపి చింతయ్య బయటికి నడిచి తన ఒంటరి ప్రయాణం సాగించాడు. చెలికాడు చెంతలేడనే దిగులు తప్ప ఈ కొత్త ప్రయాణం ఎంతో హుషారుగా అనిపిస్తోంది. ఇంతవరకు తినేందుకేమీ దొరక్కపోయినా ఆలోచిస్తూంటే అనిపించింది - తన ఉత్సాహానికీ ఉత్తేజానికీ కారణం దొరకబోయే తిండి మాత్రమే కాదని.
ఇన్నాళ్ళకి తాను తన భయం నడిపించినట్టు కాక, సొంతంగా నడుస్తున్నాడు. పోను పోను ఈ మార్గం ఎంతో నచ్చుతోంది కూడా.
అలసయ్య కి ఒకటి అర్ధమైంది. ఇప్పటిలాగే ఇంతకుముందు విందుపేటకి వెళ్ళినప్పుడూ తిండి దొరకలేదు. కాని అప్పుడు కలిగిన నిరాశా అలసటా ఇప్పుడు లేవు. కారణం అప్పుడు భయం తనని నడిపించింది. ఇప్పుడు భయం దాపుల్లోకి రాకుండా తను జాగ్రత్తపడ్డాడు. ఆశ్చర్యం,ఇప్పుడు అడుగడుక్కీ కొత్త శక్తీ ఉత్తేజమూ కలుగుతున్నాయి.
తనకేది అవసరమో అది దొరికడం ఖాయం. కొద్ది సమయం పట్టచ్చు అంతే. అసలు దొరికేసినట్లే అనిపిస్తోందే. చిరునవ్వు నవ్వుతూ ఇలా అనుకున్నాడు:
లేదు లేదని నీవు ఈడిగిలపడకుండ దీక్షతో ధరనెల్ల గాలింపవలయు.
తనకనిపించింది - ఏ పరిస్థితులూ మనం ఊహించుకున్నంత చెడ్డవ కావు. అసలు పరిస్థితి కంటె ప్రమాదకరమైనది మన భయం. మనకు మనంగా పెంచి పోషించుకునే భయం. ఇలాగే ఇంతకుముందు కూడా ఓమారు అనిపించింది.
అసలేమీ దొరకకపోతే ఎలా అనే భయంతో ఇన్నాళ్ళూ గడిచేయి. ఆ భయమే కదలనివ్వకుండా తన్ని కట్టి పడేసింది. కానీ తెగించి అడుగేసి ప్రయాణం సాగించినకొద్దీ ప్రోత్సాహానికా అన్నట్టు దారిపొడవునా ఎదో దొరుకుతూనే వుంది - మరింత ఉత్సాహంతో ఉరకలు పెట్టిస్తూ. అసలు దేనికో అయిన ఈ ప్రయాణంలోనే వున్నాయి నిజమైన ఉత్తేజమూ ఉత్సాహమూ.
ఇన్నాళ్ళూ తన ఆలోచనలను దిగులూ భయమూ ఆక్రమించి వుండేవి. అసలేమీ దొరకదనో, దొరికినా సరిపడేంత ఉండదనో అనే భయమూ దిగులూ అవి. ఊహల నిండా ఎప్పుడూ సాఫల్యపు సంబరం కాకుండా వైఫల్యపు వగపే.
ఆ విందుపేట పాత పలహార మందిరం వదిలేసినప్పటినించి అంతా మారిపోయింది.
ఎక్కడున్న ఆహారం అక్కడే ఉంచాలనీ, మార్చకూడదనీ, అసలు జీవితంలో మార్పుకి తావుండకూడదనీ ఇన్నాళ్ళూ అనుకున్నాడు.
ఇప్పుడర్ధమయింది - నిరంతరమైన మార్పు ప్రకృతి సహజం; మన ఇష్టాయిష్టాలతో దానికి పనిలేదు. దానికి మనం సిద్ధపడిలేనప్పుడు, ఎదురుచూడనప్పుడూ మాత్రమే దాని రాక మనకి ఆశ్చర్యం గొలుపుతుంది.
తన పాత భావాలను దులిపేసుకున్నట్టు అనిపించగానే గోడమీద ఇలా రాసేడు.
పాత బూజు దులపవలెను; కొత్త చీజు దొరుకవలెను.
చింతయ్య కి ఇంకా ఏమీ దొరకలేదు. కానీ తన పరుగులో స్ఫురించిన కొత్త తలపులను సింహావలోకనం చేసుకున్నాడు.
మారిన ఆలోచనలతో తన వైఖరిలో కూడా మార్పు వస్తోన్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఏమీ దొరకదని తెలిసినా నీరసంగా గానుగెద్దులా వెళ్ళినచోటకే వెళ్ళి నిస్పృహకి గురైన వైఖరికి ఇది భిన్నం.
నమ్మకాలు మార్చుకుంటే వైఖరీ చేతలూ మారుతాయని తెలిసింది.
ఒక మార్పు మనకి హానికరమేమోనని భావించి ప్రతిఘటించావచ్చు; వెదికుతున్న ఆహారం దొరుకుతోంది కనక మార్పు ప్రయోజనకరమని అనుసరించా వచ్చు.
అంతా మన విశ్వాసంలో ఉంది. అతను గోడ మీద ఇలా రాసేడు:
మృష్టాన్న భోజనము నా సొంతమగుచుండ, గతిని మార్చుకొనుట కేల వెఱపు?
ఈ మార్పునే తను ఇంకా ముందు స్వీకరించి విందుపేట ని వదిలి పరుగు సాగించి ఉంటే తన స్థితి ఇంకా బాగుండేదనిపించింది. ఆసక్తికరమైన ఆ అన్వేషణ తన దేహాన్నీ మనసునీ దృఢపరచి లక్ష్యం ముందరి సవాళ్ళను ఇంకా సమర్ధంగా అధిగమించి వుండేది. నిజానికి తనే కనక మార్పుని గుర్తించేందుకు నిరాకరిస్తూ వృధా కాలయాపన చెయ్యక దానిని ముందే ఊహించి అంగీకరించి వుంటే ఈ సరికి తన లక్ష్యం నెరవేరేది.
బలపడిన సంకల్పంతో అతను మున్నెన్నడూ చూడని కొత్త కొత్త ప్రదేశాల్లోకి అడుగులు పెట్టాడు. తన దీక్షనీ శక్తినీ విశ్వాసాన్నీ నిలిపి వుంచేందుకా అన్నట్టు ప్రతిచోటా స్వల్ప మొత్తాల్లో కొంత ఆహారాన్ని కనుగొంటూనే వున్నాడు.
ఆ పరుగుల మధ్య అప్పుడప్పుడూ తాను వదిలి వచ్చిన విందుపేట జ్ఞాపకానికొస్తూనే వుంది. వీలైనప్పుడల్లా గోడ మీద తన ఆలోచనలు రాసుకుంటూనే వున్నాడు - ఒకవేళ తన నేస్తం అలసయ్య మనసు మార్చుకుని బయటపడేందుకు సిద్ధపడితే అతనికి మార్గనిర్దేశనంలాగ.
తన మార్గం సరైనదేనని ఆశించాడు. అలసయ్య కూడా త్వరలోనే తనననుసరించి ఇటువస్తాడని భావించి అతని కోసం గోడ మీద ఇలా రాశాడు. అసలు ఇది ఎప్పట్నించో తన మదిలో వుంది:
చిరు చిరు మార్పులు గమనిస్తూ
తమ గతి సర్దుకు నడిచేవారికి
పెను మార్పులు భయపెట్ట జాలక
అలవాటవ్వును అతి సహజముగా
ఈ సరికి చింతయ్య తలపుల్లోంచి గతాన్ని తరిమి భవిష్యత్తుకి అనుకూలంగా తనను తాను సర్దుబాటు చేసుకుంటున్నాడు.
అలా అలా కొత్త దారుల్లో పరుగు కొనసాగింది అంతకంతకు బలమూ వేగమూ వృద్ధి చెందుతూ. ఉన్నట్టుండి-
ఇదొక అంతులేని పయనమే సుమా అనుకుని పరుగాపక పయనిస్తున్న అతని ప్రస్థానం ఆగింది - త్వరగా, సంతోషంగా.
అక్కడ, వెలుగుల జిలుగుల మధ్యన, పసందుపాలెంలో, అతను కనుగొన్నాడు - సమృద్ధిగా పంచభక్ష్య పరమాన్నాలు.
ఉల్లాసంగా లోనికి అడుగుపెట్టాడు. కళ్ళు చెదిరేలా పొగలు కక్కుతూ, మనోహర పరిమళాలు విరజిమ్ముతూ, వేడి వేడి భోజన విశేషాలు అన్ని వైపులా కుదురుగా పేర్చి కూర్చి. మున్నెన్నడూ చూడని, చవిచూడని అపురూప భక్ష్య విశేషాలవి!
ఇదంతా కలా నిజమా, అచ్చమా దుస్తంత్రమా అని సందేహించాడు! కాని అంతలోనే అతని సందేహాలు పటా పంచలయ్యాయి - ఓ పక్క తీరుబాటుగా ఆరగింపు దీక్షలో ఆదమరచి వున్నారు తమ పాత స్నేహితులు చిట్టెయ్యా చుంచయ్యా.
తమ నేస్తాన్ని చూసి పలకరింపుగా చిట్టెయ్య ముందరి కాలు ఊపాడు. చుంచయ్య తల పంకించాడు. ఇద్దరూ బొద్దుగా తయారయేరు - పొట్టలు కూడా వచ్చేయి. ఇక్కడే చాలా రోజులుగా ఉన్నట్టున్నారు.
చుంచయ్య పలకరింపులు హడావిడిగా ముగించి తిరిగి తనకి నచ్చినవి ఒక్కొక్కటే తినే పనిలో పడ్డాడు. తన క్రీడా దుస్తులూ బూట్లూ శుభ్రం చేసుకుని ఓ మూల శ్రద్ధగా పెట్టుకున్నాడు - ఎప్పుడవసరమైతే అప్పుడు తొడుక్కుని పరిగెత్తేందుకు సిద్ధంగా. ఇంకొంచెం సేపు తిన్నాక ఓ తాజా జున్ను ముక్కనెత్తి అలసయ్య కేసి ఊపుతూ అన్నాదు: "మార్పుకి మంగిడీలు" అని.
వారికెదురుగా కూర్చుని తనూ విందారగిస్తూ తాను నేర్చిన పాఠాన్ని మననం చేసుకోసాగాడు చింతయ్య.
తనకి జ్ఞాపకం వచ్చింది - మార్పుకి భయపడినన్నాళ్ళు తమకి కొన్నాళ్ళపాటు లభ్యమై తరవాత కనబడకుండా పోయిన పాత పాచి మెతుకులే పరమాన్నంగా భావించి దానికై ఊహల్లో ఊగిసలాడేరు తాము.
తనలోని ఈ మార్పుకి కారణమేమిటి? ఆకలితో చనిపోతానన్న భయమా? కావచ్చుననిపించింది ఓ క్షణం పాటు.
ఇంకా లోతుకి ఆలోచించినప్పుడనిపించింది - ఎప్పుడైతే చేస్తున్న పొరపాటు తెలుసుకుని తన్ని చూసి తనే నవ్వుకోవడం ప్రారంభించాడో అప్పుడే తన మార్పుకి శ్రీకారం చుట్టుకుందని. మన మూర్ఖత్వాన్ని చూసి మనమే నవ్వుకునే పరిస్థితి వచ్చినప్పుడు మనలో మార్పు తప్పకుండా వస్తుంది - అంతవరకు ఉన్న మన వైఖరిని దులపరించుకుని కొత్త దారిలో నడిచేవిధంగా.
పైగా, తన మిత్రులు చిట్టెయ్యా చుంచయ్యల సాహచర్యంలో తాను ఇంకోటి కూడా తెలుసుకున్నాడు. వారి జీవితాలు అతి సామాన్యమూ సరళమూ. వారు ప్రతి విషయాన్నీ అతిగా విశ్లేషించుకుని సంక్లిష్టపరుచుకోరు. పరిస్థితి మారింది, ఆహారం ఉన్నచోటినించి తరలిపోయిందీ అని తెలియగానే సూటూ బూటూ బిగించుకుని పరుగుకి సిద్ధమవుతారు - ఆహారాన్ని అనుసరిస్తూ. తనకిది జీవితాంతమూ గుర్తుంటుంది.
అప్పుడు చింతయ్య, మూషికాల కన్న మనుషులకి అదనంగా ఉండే బుద్ధికుశలతతో ఇంకా ఈలా గ్రహించుకున్నాడు:
గతంలోని తన పొరపాట్లన్నిటినీ సమీక్షించుకుని వాటిని అధిగమించడం ద్వారా భవిష్యత్తుకి ప్రణాలిక రచించగలదు తన జాతి.
ఈ విధంగా మార్పుని సంబాళంచుకోనే నేర్పుని మనం సాధిస్తాం. విషయాలను సరళంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తాం, అవసరమైతే వైఖరి మార్చుకుంటాం, త్వరత్వరగా స్పందిస్తాం.
ఏ విషయాన్నీ అతిగా భూతద్దంలో చూసుకుని క్లిష్టపరచుకుని భయపెట్టే నమ్మకాలతో గందరగోళపడం.
చుట్టూ సంభవించే ప్రతి చిన్న మార్పునీ గమనిస్తూ వాటికి అనుగుణంగాను అనుకూలంగాను స్పందించే లాగ పరివర్తన చెందుతూ, పెను మార్పులు సంభవించినప్పుడు తొణక్కుండా బెణక్కుండా సహజంగాను సామరస్యంగాను సర్దుకుంటాం.
ఇంకా, మార్పుకు అనుగుణంగా మనమూ మారాలి. అదీ సకాలంలో జరగాలి. సకాలంలో మనం మారలేదంటే మనం ఎప్పటికీ మారం.
ఒకటి అంగీకరించాలి. మనం మారట్లేదంటే అందుక్కారణం మనలోనే వుంటుంది మార్పుని ప్రతిఘటిస్తూ. మనం మారేందుకు సిద్ధంగా లేకుంటే పరిస్థితులు బాగాలేవని నిందించి ప్రయోజనం లేదు.
అన్నిటికన్న ముఖ్యంగా తను గ్రహించింది ఇది: ఎక్కడ ఏమిటి అన్నది ఇప్పటికి అనూహ్యమైనా మనకి సరిపడా ఆహారావకాశం ఎక్కడో అక్కడ ఉండి తీరుతుంది. మనం చెయ్యాల్సింది, భయాన్ని పక్కకి నెట్టి ప్రయాణపు సాహసకార్యాన్ని ఆస్వాదిస్తూ సాగిపోవడమే.
అయితే, నిజమైన ప్రమాదాల నించి రక్షించుకునేందుకు, కొన్ని భయాలను గౌరవించాల్సిందే. కానీ మన భయాలు చాలావరకు అహేతుకమైనవీ, మనలోని మార్పుని ప్రతిఘటించేవిన్నీ. వీటిని నిర్దాక్షిణ్యంగా తరిమి కొట్టాల్సిందే.
తొలుత తనిష్టపడలేదు కాని తనలో కలిగిన మార్పే కద ఇప్పుడు తనున్న స్వర్గధామానికి తొలి మెట్టు. ఇంకా ఇలాటివెన్నిటినో పొందగల అవకాశం ఆ మార్పుతోనే కద సంభవం.
తిండి కోసమే ప్రారంభమైనా, తన అన్వేషణ తనలోని ఇంకో మహోన్నత కోణాన్ని ఆవిష్కరించింది.
తన నేస్తం అలసయ్య గుర్తుకొచ్చాడు. విందుపేట మొదలుకుని దారి పొడుగూ తాను రాసిన వాక్యాలేవైనా అతను చదివి వుంటాడా?
ఇంతకీ అతను ఏదైతే అయింది, ఇక చాలు అనుకుని లేచి బయలుదేరేడా? రహదారిలో ప్రవేశించి తన జీవితానికి వెలుగు ప్రసాదించగల ప్రయాణానికి శ్రీకారం చుట్టాడా?
ఒకసారి విందుపేటకు తనే పోయి అలసయ్య ని చూద్దామా అనిపించింది - తనే గనక ఇన్ని చిక్కు దారులగుండా వెనక్కి వెళ్ళగలిగితే. అతను కనబడితే, ఇదంతా వివరించి మత్తు వదిలించి అతణ్ణి కూడా కార్యోన్ముఖుణ్ణి చెయ్యవచ్చు. అప్పుడు గుర్తొచ్చింది. ఒకసారి ఆ ప్రయత్నమూ జరిగింది కదా.
అలసయ్య తన బద్ధకాన్నీ సుఖావరణనీ వదిలి తనంత తాను మార్గం వెదుక్కోవల్సిందే. ఇంకెవరూ అది చెయ్యలేరు, చెయ్యమని చెప్పాలేరు. తనకి మార్పెంత అవసరమో ప్రయోజనకరమో తనే గ్రహించుకోవాలి.
తన వంతుగా అలసయ్య అనుసరించేందుకు జాడలు వదిలి వచ్చాడు - మార్గ నిర్దేశనం కూడా చేశాడు - గోడల మీది రాతలనతను చదువుకోగలిగితే.
అప్పటివరకు తాను నేర్చుకున్న పాఠాలను అక్కడి ఓ పెద్ద గోడ మీద సంగ్రహ పరచాడు.
మార్పు తధ్యం.
దాంతో పాటే మన ఆహారం ఇంకోచోటుకు తరలిపోవడమూ తధ్యం.
మార్పును ముందే ఊహించు.
ఆహారం తరలిపోవడాన్నీ ఊహించి సిద్ధంగా ఉండు.
మార్పుపై నిఘా వుంచు.
ఆహార నాణ్యతని పరిశీలిస్తూండు; పాతబడి పాచిబడి పోవడం గుర్తించు.
మార్పుకు అనుకూలంగా ఇమిడిపోయి సర్దుకుపో.
పాడుపడ్డ పాత తిండిని ఎంత త్వరగా వదులుకుని వేట మొదలేడితే అంత త్వరగా తాజా కొత్త భక్ష్యాలనారగిస్తావు.
మారు
తరిలిపోయే ఆహారాన్ననుసరించి పో
మార్పును ఆనందించు
అందుకైన సాహస పయనాన్ని ఆస్వాదిస్తూ అన్వేషణ ఫలించినప్పుడు ఫలాల్ని తనివితీరా అనుభవించు
మళ్ళీ మార్పు తప్పనిసరి అయితే అందుకూ సిద్ధపడు; ఇంకో సారి ఆనందభోగాలను ఆస్వాదించు.
ఆహారం మాత్రం ఒకచోటునుంచి ఇంకోచోటుకి మారుతూనే వుంటుంది.
విందుపేటను వదిలాక తనెంత ఎత్తుకి ఎదిగాడో తలచుకుంటే చింతయ్యకి ఎంతో ఉద్వేగంగా వుంది. కాని ఈ సౌఖ్య లాలసతో అలసత్వం పెంచుకుంటే అధిగమించిన అగాధాల్లోకి మళ్ళీ జారిపోవడం ఖాయం. అందుకే ప్రతి రోజు తను తినే ఆహార నాణ్యతని పరిశీలించడం విస్మరించడు. సంభవించక తప్పని మార్పు తనని ఆకస్మిక దిగ్భ్రాంతికి గురిచేయకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రయాణం కట్టేందుకు తనిప్పుడు సర్వ సన్నద్ధుడై వున్నాడు.
తనున్న చోట ఆహారం తగినంత వున్నా, ప్రతి రోజూ చుట్టు పక్కల మార్గాలు పరిశీలిస్తూ అనుదినమూ సంభవించే మార్పును నిశితంగా గుర్తిస్తాడు. తను క్షేమంగా వుండేది ఇప్పుడున్న సౌఖ్యావరణంలో కాదు - తనకి ముందున్న అవకాశాల మీద పూర్తి అవగాహన కలిగియున్నప్పుడే.
ఇంతలో బయట ఎదో అలికిడి వినవచ్చింది. ఎవరో వస్తున్నట్టున్నారు.
అది తన నేస్తం అలసయ్యా?
గతంలో ఎన్నో మార్లు చేసినట్టు దీర్ఘంగా ఒక శ్వాస తీసి ప్రార్ధించాడు - ఎట్టకేలకు తన నేస్తం కూడా ఆహార గమనాన్ననుసరించి పోయి సుఖపడాలని.
No comments:
Post a Comment