Friday, May 1, 2020

JF Kennedy Inaugural Address




 JF Kennedy Inaugural Address

ఉపాధ్యక్షులు జాన్సన్ గారికిస్పీకర్ మహాశయులకు, ప్రధాన న్యాయమూర్తివర్యులకు, అధ్యక్షులు ఐసెన్‌హవర్ గరికిఉపాధ్యక్షులు నిక్సన్ గారికి, అధ్యక్షులు ట్రూమన్ గారికి, మాన్యులైన మతాధికారులకు, నా సహ అమెరికా పౌరులకు:

నేడు మనం జరుపుకునేది రాజకీయ విజయాన్ని కాదు - స్వాతంత్ర్యోత్సవాన్ని.  ఒక ముగింపుకూ ఆరంభానికీ; ఒక పునఃసృష్టికీ మార్పుకూ సూచికగా.   సుమారు ఒకటీ ముప్పాతిక శతాబ్దం క్రిందటి మన పూర్వీకుల ప్రతిజ్ఞనే నేడు మీ సమక్షంలోనూ సర్వశక్తిమంతుడైన భగవంతుని సన్నిధిలోనూ నేను చేస్తున్నాను.    

నేటి ప్రపంచం ఎంతో భిన్నంగా ఉంది.  కారణం, మానవుల దారిద్ర్యాన్నే కాక, మానవతా భావననే నిర్మూలించగలిగే శక్తిని మనిషి తన చేతుల్లో పెట్టుకుని ఉన్నాడు. అయినా, మన పూర్వీకులు పోరాడి సాధించుకున్న విప్లవాత్మక విశ్వాసం -మనిషికి హక్కులు ప్రభుత్వాల ఔదార్యంవల్ల కాక, సృష్టికర్త ద్వారా ఇవ్వబడతాయన్నది - ఇంకా పరిష్కరించాల్సిన అంశంగా ప్రపంచమంతా విస్తరించి ఉంది.  

ఆ మొదటి విప్లవానికి మనం వారసులమనే విషయాన్ని విస్మరించే సాహసం చెయ్యలేము.  ఇక్కడి నించి, ఈ క్షణంనించి, మిత్రులకూ శతృవులకూ, ఒక్క విషయాన్ని ప్రకటించండి - ఈ శతాబ్దంలో పుట్టి, యుద్ధాలతో పదునెక్కి, కఠినమూ క్రూరమూ అయిన శాంతివలని క్రమశిక్షణతో, ప్రాచీన వారసత్వ సంపదవలని గర్వంతో, ఈ దేశం ఎప్పుడూ పాటిస్తున్న విధంగా, నేడు కూడాప్రపంచంలో ఏప్రాంతంలోనైనా సరే, మానవుని హక్కులను హరించే ఏ చిన్న ప్రయత్నాన్ని కూడా చూడడానికీ అనుమతించడానికీ సమ్మతించని ఒక కొత్త తరం చేతుల్లోకి ఆ మహాజ్యోతి ఇప్పుడు వచ్చిందని.

స్వేచ్ఛ యొక్క అస్తిత్వానికీ విజయానికీ హామీ ఇవ్వడంకోసం మనం ఎంతటి మూల్యాన్నైనా చెల్లిస్తాం, ఎట్టి భారాన్నైనా సహిస్తాం, ఏ కష్టాలనైనా ఎదుర్కొంటాం, మిత్రులెవరైనా సమర్ధిస్తాం, శత్రులెవరైనా వ్యతిరేకిస్తామన్న విషయాన్ని ప్రతి దేశం - అది మన వృద్ధిని కోరుకున్నదైనా, వినాశనాన్ని కోరుకున్నదైనా - గ్రహించుగాక.   

ఇదే మన ప్రతిజ్ఞ.  ఇంకా ..

మనతో సాంస్కృతిక, ఆధ్యాత్మిక మూలాలను పంచుకునే మన పాత మిత్రులకు నమ్మకస్తులైన స్నేహితులుగా కొనసాగుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.  కలిసి ఉండి సహకార వ్యవస్థద్వారా మనం చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. విడిపోయి చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు - ఎందుకంటే అసమానతలతో చీలిపోయి మనం శక్తివంతమైన సవాళ్ళను ఎదుర్కోలేము.          

స్వేచ్ఛా రాజ్యాల జాబితాలోకి కొత్తగా ప్రవేశిస్తున్న దేశాలకు, వలసవాద పాలన నించి వారు పొందిన విముక్తిని మరింత కఠినతరమైన నిరంకుశత్వం చేతుల్లోకి వెళ్ళిపోనీమని మాట ఇస్తున్నాం.  మన అభిప్రాయానికి వారు అన్నివేళలా మద్దతిస్తారని అనుకోము. కాని వారి స్వంత స్వేచ్ఛకు మాత్రం వారి మద్దతు ఉండాలని మనం ఎప్పుడూ ఆశిస్తాం - ఇది ఎప్పుడూ గుర్తుండేందుకు, గతంలో, పులి పైనెక్కి స్వారీ చెయ్యాలని ఉబలాటపడినవారి  జీవితాలు చివరికి దాని పొట్టలో ముగిశాయి.

మూకుమ్మడి బాధల చెరనుంచి విముక్తికోసం పోరాడుతూ, భూగోళం లో సగానికి విస్తరించి ఉన్న గుడిసెలూ పల్లెల్లోని వారికి, తమకు తాము సహాయపడే విధంగా వారికి  సహాయపడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం - దానికి ఎంతకాలం పట్టినా సరే.   కమ్యూనిష్టులు అలా చేసేరనీ కాదు, వారి వోట్లు మనకు కావాలనీ కాదు, అది సరైన పని కనుక.  ఒక స్వేచ్ఛా సమాజం అధిక సంఖ్యాకులైన సామాన్యులనాదుకొనడంలో విఫలమైతే, అది అల్ప సంఖ్యాకులైన సంపన్నులను రక్షించడంలో కూడా విఫలమవుతుంది.   

మన దక్షిణ సరిహద్దుల్లోని సోదరీ రాజ్యాలకోసం ఒక ప్రత్యేక ప్రతిజ్ఞ చేస్తున్నాం: మన మంచి మాటలను మంచి చేతలుగా మారుస్తామని, అభివృద్ధికొరకైన ఒక కొత్త కూటమిని నెలకొల్పుతామని, స్వేచ్ఛా జనులను, ప్రభుత్వాలను పేదరికపు సంకెలల నుంచి విముక్తులను గావిస్తామనీ.  అయితే ఈ ఆశావహమైన శాంతియుత విప్లవం, విద్వేష శక్తులకు ఎర కారాదు.   అమెరికాలలో ఎక్కడైనా సరే, దురాక్రమణ, విద్రోహాలను వ్యతిరేకిస్తామనీ మన పొరుగు రాజ్యాలు గ్రహిస్తాయి గాక.   భూమిలోని ఈ అర్ధగోళం, తన గృహయజమానిగా తానే ఉంటుందని మిగతా అన్ని రాజ్యాలూ గుర్తించును గాక.

యుద్ధ సాధనాలు శాంతి సాధనాలను మించిపోయిన ఈ ప్రపంచంలో మన ఆఖరి ఆశా కిరణం, స్వతంత్ర సార్వభౌమిక రాజ్యాల కూటమి అయిన ఐక్య రాజ్య సమితికిఅది తగవరులు చేరే రచ్చబండగా మిగలకుండా, బలహీనమైన కొత్త రాజ్యాలను పరిరక్షించే దాని కార్యాచరణకు సహకరిస్తామని, దాని మాట చెల్లుబాటయే పరిధిని ఇంకా విస్తృతం చేస్తామని మనం మన వత్తాసును పునరుద్ఘాటిస్తున్నాం.  

చివరగా, మనకు శత్రువులుగా తమను తాము ప్రకటించుకొనే దేశాలకు మనం ఒక ప్రతిజ్ఞను కాక, అభ్యర్ధనను మనవి చేస్తున్నాం.  విజ్ఞాన శాస్త్రం సృష్టించిన ఆత్మ వినాశ కారకాలైన  విధ్వంసకర ఆయుధాలు ప్రణాళికాబద్దంగా గానీ ప్రమాశదవశాత్తుగాని మానవజాతిని సమూలంగా తుడిచిపెట్టడానికి ముందే ఇరుపక్షాలూ శాంతి ప్రక్రియను పునః ప్రారంభించాలని.

మన బలహీనతతో వారిని పురిగొల్పే సాహసం మనం చెయ్యకూడదు. ఎందుకంటే నిస్సందేహంగా కావలసినన్ని ఆయుధాలను మనం సమకూర్చుకున్ననాడు మాత్రమే నిస్సందేహంగా వాటిని ప్రయోగింపబోమనే నిశ్చయం కలిగియుంటాము.

అలాగని, ఆధునిక ఆయుధాల ఖర్చు భరించలేక సతమతమవుతూ, విస్తరిస్తున్న అణుశక్తి కలిగించిన భీతితో భయకంపితులవుతూ, అయినా ఎదో విధంగా ఇప్పటివరకు సరిసమానంగా ఉన్న మానవజాతి ఆఖరి యుద్ధపు ఈ అనిశ్చిత భయానక తూకం తమపక్షంవైపు మొగ్గేందుకు సర్వశక్తులూ ఒడ్డి పరుగులు తీస్తున్న మహాశక్తివంతమైన దేశాల ఇరువర్గాలకు మన ప్రస్తుత విధానం సౌకర్యవంతంగా పరిణమించకూడదు.

కనుక నాగరిక స్వభావం బలహీనతకు చిహ్నం కాదనీ, నిజాయితీ నిరూపణకు సాక్ష్యాలు అవసరమన్న విషయాన్ని ఇరుపక్షాలూ గుర్తుంచుకొంటూ, తాజాగా ప్రారంభిద్దాం. భయంతో చర్చలు జరపవద్దు, అలాగని చర్చలకు భయపడవద్దు.

మన ఇరుపక్షాలూ మనను విడదీసే సమస్యల మీద శ్రమను ధారపోయక, కలిపియుంచగల సమస్యలను మాత్రమే గణించి పరిష్కారాలను శోధిద్దాము.

ఇరుపక్షాలమూ, ప్రప్రథమంగా, ఇతర దేశాలను నశింపజేసే పరిపూర్ణ శక్తిని అన్ని దేశాల పరిపూర్ణ అధీనంలో ఉంచే విధంగా, ఆయుధాల గణనకు, నియంత్రణకు నిబద్ధత కలిగిన, సూటియైన విధానాలను రూపొందించుకుందాము.

ఇరుపక్షాలూ విజ్ఞాన శాస్త్రం సృష్టించే భయోత్పాతాలను కాక, దాని అద్భుతాలను మాత్రమే ఆవిష్కరించుకుందాం.  ఉమ్మడిగా మనం నక్షత్రమండలాన్ని పరిశోధించి, ఎడారులను జయించి, వ్యాధులను నిర్మూలించి, సముద్రపు అడుగు భూతల్పాన్ని తట్టి, కళలనూ వాణిజ్యాన్నీ వృద్ధిపరచుకుందాం. 

నేల నలుచెరగులా, "పెనుభారాలను తొలగించి పీడితులకు స్వేచ్ఛ నొసగమ"ని చెప్పిన ఏసయ్య వాక్యాన్ని ఇరుపక్షాలూ ఏక మనస్సుతో గౌరవించి పాటిద్దాం.

చొచ్చుకువచ్చిన నౌకాతీరం అరణ్యభాగాన్ని తగ్గించినట్టు, ఇరుపక్షాల సహకారం మనలోని అనుమానాలను కొంత మేరకు తగ్గించినా, మనమిరువురం ఒక కొత్త కార్యాచరణను రూపొందిద్దాం - బలాబలాల్లో సమతౌల్యం కోసం కాక, బలవంతులు న్యాయమంతులైబలహీనులు సురక్షితులై, శాంతికి నెలవైన ఒక సరికొత్త న్యాయప్రపంచంకోసం. 

ఇది మొదటి వంద రోజుల్లో పూర్తయ్యేది కాదు.  మొదటి వెయ్యిరోజుల్లోనూ పూర్తికాదు; ఈ ప్రభుత్వ కాలంలోనూ కాకపోవచ్చు.  బహుశః ఈ భూమ్మీది మన జీవితకాలంలోనే కాదేమో.  అయినా ప్రారంభమంటూ చేద్దాం.

నా చేతిలో కంటే ఎక్కువగా, మీ చేతుల్లో, నా సహపౌరులారా, మన విధానాల సాఫల్యం గానీ వైఫల్యం గానీ ఉంచబడింది.   ఈ దేశం ఆవిర్భవించిన నాటి నుండి, అమెరికన్ల ప్రతీ ఒక్క తరం తన దేశాభిమానాన్ని వెల్లడించడానికై పిలువబడుతూ వస్తోంది.  అట్టి పిలుపునందుకుని సేవలో అసువులు బాసిన యువ అమెరికన్ల సమాధులు భూగోళంలో అన్నివైపులా ఉన్నాయి.  

ఇప్పుడు మళ్ళీ ఆ పిలుపు యొక్క భేరీ వాద్యం వినవస్తోంది - ఆయుధాలు పట్టమనీ కాదు, మనకు ఆయుధాల అవసరం ఉన్నా -- యుద్ధానికి కాదు, మనం యుద్ధ సన్నద్ధులమై ఉన్నా -- మరి, తరిమికొట్టే క్రీడకు - ఏ యేటి కా యేడు, "ఆశలలో ఆనందిస్తూ; ఆపదలలో ఓర్పువహిస్తూ" మానవాళిని పట్టి పీడించే సామాన్య శత్రువులైన నిరంకుశత్వం, పేదరికం, రోగాలను.

ఈ ఉమ్మడి శత్రువులపై మనమందరం - ఉత్తర దక్షిణాలూ తూర్పూ పడమరలూ కలిసి, మానవాళి అంతకూ ఫలవంతమైన ఒక జీవితాన్ని అందించగల ఒక మహా కూటమిని స్థాపించగలమా? ఆ చారిత్రాత్మక ప్రయత్నంలో మీరు పాలు పంచుకొంటారా?

సుదీర్ఘమైన ప్రపంచ చరిత్రలో, కొన్ని తరాలు మాత్రమే దేశ స్వాతంత్ర్యాన్ని, అది ప్రమాదకర పరిస్థితుల్లో పడ్డప్పుడు, దానిని పరిరక్షించే బృహత్తర బాధ్యతను అందుకొన్నాయి.  ఈ బాధ్యతనుంచి నేను తప్పుకోను - దానిని స్వాగతిస్తాను.   

మనలో ఏ ఒక్కరూ కూడా మన ప్రస్తుత స్థానాలను మరి ఏ ఇతర వ్యక్తుల, లేదా తరాల స్థానాలతో మార్పిడి చేసుకోనిచ్చగిస్తామని నేననుకోను.  ఈ ప్రయత్నానికి మనం సమకూరుస్తున్న శక్తి మరియు విశ్వాసం మన దేశాన్ని, దాని సేవలో నిమగ్నులైన అందరినీ ప్రకాశమంతం చేస్తుంది.  ఈ దివ్య ప్రకాశం మిగతా ప్రపంచం యావత్తుకూ తన వెలుగులు విరజిమ్ముతుంది.

కాబట్టి నా సహ అమెరికాపౌరులారా, మీ దేశం మీకేమి చేయగలదని ప్రశ్నించకండి; మీ దేశానికి మీరేమి చేయగలరో ప్రశ్నించుకోండి. 

నా సహ ప్రపంచ పౌరులారా, అమెరికా మీకేమి చెయ్యగలదని కాక, మానవజాతి స్వేచ్ఛ కోసం మనందరం కలిసి ఏమి చెయ్యగలమో ప్రశ్నించండి.

చివరగా, మీరు అమెరికా పౌరులైనా ప్రపంచ పౌరులైనా, మేము మీనుంచి ఆశించే అత్యున్నత స్థాయి శక్తియుక్తులను, త్యాగ సంపదను మా నుంచి కూడా మీరు ఆశించండి.  స్వచ్ఛమైన వివేక జ్ఞానమే మనకు బహుమతిగా, చరిత్రయే మన కార్యాలకు అంతిమ న్యాయమూర్తిగా, ఆతని ఆశీస్సులనూ సహాయాన్నీ అర్ధిస్తూ, భూమ్మీద భగవంతునిదిగా చెప్పబడే ప్రతి పనీ వాస్తవానికి మన సొంతమే అన్న పరిపూర్ణ జ్ఞానంతో, మనం ప్రేమించే నేలకు సారధ్యం వహింప తరలిరండి.


No comments:

Post a Comment