మనిషి తనకు తానే ధృవతార;
తనను తాను నిజాయితీపరునిగ, పరిపూర్ణునిగ చేసికొనిన వ్యక్తి
ప్రకాశాన్ని, ప్రభావాన్ని, ప్రారబ్ధాన్ని నిర్దేశించగలుగును.
అతనికి అన్నీ మరీ ముందు కాకుండా, మరీ అలస్యం కాకుండా సకాలంలో అమరును.***
కొద్ది రోజులక్రితం, ఒక చిత్రకారుడు తనకు తోచిన విధంగా, సంప్రదాయంతో నిమిత్తం లేకుండా, వ్రాసిన కొన్ని పదాలను నేను చదివాను. ఏ అంశం పై వ్రాసేరన్న దానితో సంబంధం లేకుండా, అలాంటి రచనలు చదువుతున్నప్పుడు మనసుకి ఏదో బోధ లభిస్తుంది. ఆ రచన వెనుక గల అంతరార్థం ఏమిటన్న దానికన్న, అది కలిగించే భావోద్వేగం ఎక్కువ ప్రయోజనకరమైనది. మీ మనోజనితమైన ఆలోచనలనే స్థిరంగా విశ్వసించుట, మీ హృదయానికి సత్యమని అనిపించినది మిగిలిన అందరికీ సత్యమగునని నమ్ముట - బుద్ధి కుశలత అనగా ఇది. మొక్కవోని నిశ్చయంతో దేన్నయితే విశ్వసిస్తారో దాన్నే వ్యక్తపరచండి - అది విశ్వానికంతకీ వర్తించేదవుతుంది. ఎందుకంటే అంతరంగం కొద్ది కాలంలో బహిరంగమవుతుంది. ఇంకా మన మదిలోని మొదటి రహస్యపు ఆలోచన భేరీ మృదంగాలతో మనకి వినబడుతుంది. మోజెస్, ప్లేటో, మిల్టన్ వంటి మహనీయులకి మనం ఇచ్చే గుర్తింపు వారి రచనలకి గానీ పాటించిన సంప్రదాయాలకి గానీ కాక, వారి ఆలోచనలకు మాత్రమే ఇస్తున్నటువంటిది. ప్రతి వ్యక్తీ, సాధుసంతుల ప్రవచనాల్లోని సౌందర్యాని కన్న, తన మదిలో తళుక్కున మెరిసే ఆలోచనయొక్క కాంతిప్రకాశాన్ని గుర్తించే కౌశలాన్ని సాధించాలి. కానీ అతడు అట్టి ఆలోచన మదిలో మెరిసినప్పుడు దానిని నిర్లక్ష్యం చేస్తాడు ఎందుకంటే అది తన స్వంతం కనుక. ఇతరులకు ప్రశంసలు అందజేసే బుద్ధికౌశల విన్యాసాలు ఏదో సందర్భంలో ఈ విధంగా మనం తిరస్కరించుకున్న మన ఆలోచనలే. అవే తిరిగి కొంత రాజసాన్ని సంతరించుకుని మళ్ళీ మనకి సాక్షాత్కరిస్తాయి. కళ్ళు చెదిరే గొప్ప గొప్ప కళాఖండాలు కూడా ఇటువంటి పాఠాన్నే మనకి బోధిస్తాయి. అవి చెప్పేదేమంటే - మదిలో తళుక్కుమని మెరిసే మన స్వంత ఆలోచనను జారిపోవనివ్వకుండా, నిర్లక్ష్యం చెయ్యకుండా మనం దానికి కట్టుబడి ఉండాలి - మిగతా ప్రపంచం వెయ్యి గొంతుకలతో వేరే విధంగా అరుస్తున్నా సరే. లేదంటే, మన మనస్సులోని మన స్వంత ఆలోచననే రేపు ఎవరో ఒక అపరిచితుడు కొంత నేర్పుని జోడించి మనం ఆశ్చర్యపడేలా మనకే చెబుతాడు; అప్పుడు మనం మన అభిప్రాయాన్నే వేరొకరినించి వెర్రిమొహం వేసుకుని స్వీకరించాల్సి వస్తుంది.
ప్రతి వ్యక్తి తన విద్యాభ్యాస దశలో ఎదో ఒకప్పుడు, అసూయ అజ్ఞానమని, అనుకరణ ఆత్మహత్య యని, మంచికైనా చెడుకయినా తన మనుగడకు తానే బాధ్యుడనని, విశ్వమంతా మంచితనంతో సుసంపన్నమయినప్పటికీ, తనకుగాను ఒసగబడిన భూమిని తాను స్వయంగా సాగుచేసి పండించుకొనినది తప్ప లవలేశమయినా బయటి నుంచి తనకు లభించదనీ గ్రహిస్తాడు. తనలో అంతర్లీనంగా ఉండే శక్తి బయటి ప్రకృతికి కొత్త; ఆ శక్తి తనకు మాత్రమే తెలుస్తుంది; అదిన్నీ స్వప్రయత్నం తోనే. తొలి పరిచయంలోనే ఒక ముఖం, ఒక అక్షరం, ఒక విషయం తన మదిలో చెరగని ముద్రవేయడం, మరికొన్ని కన్న, విన్న మరుక్షణమే స్మృతిపథంలోంచి చెరిగిపోవడం అనేది అకారణం కాదు. మనోఫలకం మీద చెక్కబడే ఈ శిల్పసంపద అదివరకే అమరిన సామరస్యం లేనిదే సాధ్యపడదు.
తాను గుర్తించగలిగిన కాంతికిరణం పైననే కంటి దృష్టి సారింపబడుతుంది. మనని మనం వ్యక్తపరచుకోగలిగే దానిలో సగమే మనం ప్రకటించుకుంటున్నాం, ఆ దైవదత్తమైన కౌశల ప్రదర్శనకి కుడా సిగ్గుపడిపోతున్నాం. మనలో ఉండే ఆ నైపుణ్యాన్ని మనం పూర్తిగా విశ్వసించవచ్చు, ఆచరించవచ్చు; అయితే దేవుడు తన పనిని పిరికివారి ద్వారా ప్రకటించడు. మనిషి తాను చేయగలిగిన పనిని పూర్తి హృదయ సమర్పణతో నిర్వర్తించినప్పుడే తృప్తినీ ఆనందాన్ని ఉపశమనాన్నీ పొందుతాడు. తద్వ్యతిరేకంగా ఆచరించినప్పుడు అశాంతికి లోనవుతాడు. అది ఉపయోగపడని వరం లాంటిది. అట్టి నిష్ప్రయోజన కార్యాచరణలో అతని మేధస్సు అతడిని విడిచిపెట్టిపోతుంది. ఏ వరదేవతా కరుణించదు; కల్పనాచమత్కృతి లేదు, అది కలుగునను ఆశా ఉండదు.
నిన్నే నీవు నమ్ముకో; ప్రతి హృదయం ఆ ప్రకంపనకు స్పందిస్తుంది.. నీకు దైవదత్తంగా అనుగ్రహించబడిన స్థలాన్ని, చుట్టు ఉండే సమకాలీన సమాజాన్ని, వానికి అనుబంధంగా చోటుచేసుకునే సంఘటనలనీ అరమరికల్లేకుండా స్వీకరించు; గొప్ప గొప్ప వారందరూ ఇదే ఆచరించారు. ఆచరించడమే కాదు, చిన్నపిల్లల్లా తమ కాలానికి అనుగుణంగా వర్తించారు - తాము అత్యధికంగా విశ్వసించదగిన అంశం తమ హృదయాల్లోనే స్థిరంగా ఉన్నదనీ, తమ చేతలన్నీ దానిని అనుసరించే జరుగుతున్నాయన్న సత్యాన్ని గుర్తెరిగి వర్తిస్తూ. పరిణతి లేనివారు, పరాన్నభుక్కులు, విప్లవాగమనానికి ముందే పరిగెత్తిపోయే పిరికివారు కాక, మార్గదర్శకులు, విమోచకులు, దాతలమయిన మనవంటి వారు, భగవానుని నిర్దేశానికి విధేయులమై, అంతరంగంలో దేదీప్యమానంగా ప్రకాశించే ఆ శక్తిని గుర్తించి, గందరగోళం, కారుచీకట్లలోనుంచీ ముందుకు సాగాలి.
శిశువుల మరియు చిన్న పిల్లల ముఖాలలో, ప్రవర్తనలో, ఈ ప్రకృతి ఎంత దివ్యమైన వాణిని పలికిస్తుంది! నిరంతర అంచనాలు లెక్ఖలు ప్రణాళికలే మన నడవడిని నిర్దేశించేవని భావిస్తూ, వాటిని పట్టుకుని జీవనపరమార్ధానికి వ్యతిరేక దిశలో పనిచేస్తూ భిన్నధృవాల్లో చరించే మనోవైకల్యాలు వారిలో లేవు మరి. వారి బుద్ధి పరిపూర్ణమూ, వారి దృష్టి అపరాజితమూ అయినందువలన, మనం వారి ముఖాల్లోకి చూసినప్పుడు కలవరపాటు చెందుతాము. శైశవం ఎవరికీ అధీనం కాదు. అందరూ దానికి అధీనులు. ఈ కారణంగా ఒక శిశువు నలుగురైదుగురు పెద్దలను మురిపిస్తుంది, ముచ్చట్లాడిస్తుంది. ఇదే విధంగా కౌమారులకు, యౌవనులకు కూడా భగవంతుడు ఇందుకు తీసిపోని రీతిలో తగినంత చురుకుదనాన్ని, శోభని పొందుపరచాడు. తమకు స్వాభావికమైన ప్రకృతిని అనుసరించే పక్షంలో వీరు కూడ అదే ఆరాధననూ ఆకర్షణనూ అందుకుంటారు. మీతో, నాతో, మాట్లాడలేనంత మాత్రాన ఒక యువకుడు సత్తువ లేనివాడని భావించవద్దు. వినండి! పక్క గదిలో అతని కంఠం అతి స్పష్టంగా వినవస్తూంది. అతని సమ వుజ్జీలతో ఏ విధంగా మాట్లాడవలెనో అతడు పరిపూర్ణంగా తెలుసుకున్నట్లు అగపడుతోంది. తను ఏ రకమైన పద్ధతిలో సాగుతున్నా, మనబోటి వయోధికుల అవసరం మాత్రం వారికి లేదని మాత్రం బోధపడుతోంది.
తమ భోజనానికి ఢోకాలేదనే నిబ్బరం కలిగినప్పుడు, రాజును కూడా లక్ష్యపెట్టని పిల్లల మనస్తత్వం మానవ ప్రకృతి సహజమూ, ఆరోగ్యకరమూనూ. కచేరిసావడిలో కూర్చొని ఉన్న కుర్రాడు, పందెంకోడిపుంజు తన పందెపుగుంట నించి జనాల్ని గమనిస్తునట్టు కనిపించిన వారిని, జరుగుతున్న సంఘటనలని క్రీగంట గమనిస్తూ తన చిత్తానికి తోచినవిధంగా మంచివాడు, చెడ్డవాడు, వింతప్రకృతి వాడు, వెర్రి వాడు, మాటకారి, ఇబ్బందిపెట్టేవాడు - అంటూ తీర్పులిచ్చేస్తాడు. వాడికి తన తీర్పుయొక్క పర్యవసానం గురించి గానీ, ఇతరుల ఇష్టాయిష్టాలతో గానీ పనిలేదు. స్వతంత్రమైన, స్వచ్చమైన తీర్పునిచ్చేస్తాడు అంతే. మీరువాడిని అనుసరించాల్సిందే. అతను మిమ్మల్ని అనుసరించడు. తాను వివేకముతో మాట్లాడిన కారణానికి అతను కారాగారబద్ధుడవుతాడు. అదే అతను వరస మార్చి ప్రశంశాత్మక చేష్టలు, మాటలు మాట్లాడిన పక్షంలో వందలకొద్దీ అభిమానులు కలుగుతారు, వారి అభిమానం అతని ఖాతాకు జమ అవుతుంది. దీనివల్ల అతడు తటస్థుడవాల్సి వస్తుంది. ఎవరయితే ఈ ప్రశంశలను నిరాకరించబూనుతారో, అట్టి ప్రతిజ్ఞాపాలనను వ్యాకులం లేకుండ, పక్షపాతరహితమైనట్టి అమాయకత్వంతో ఆచరిస్తారో, అతను కపటంలేని ధీశక్తి కలిగియుండాలి. జరిగే వ్యవహారాలన్నిటిపై అతడు తీర్పునివ్వాలి, వ్యాఖ్యానించాలి; అట్టి తీర్పులు వ్యాఖ్యానాలు సంకుచితం కానట్టివి, నిస్వార్ధమైనట్టివి, ముఖ్యంగా సమాజానికి అత్యవసరమయినట్టివి అయివుండి వినేవారి చెవులలో బాణాల్లా నాటుకుని వారికి భయాన్ని కలిగిస్తాయి.
ఈ రకం వ్యాఖ్యానాలు మనం ఏకాంతంలో వింటూనే వుంటాం. అయితే సమాజంలో అడుగుపెట్టేటప్పటికి అవి నీరసించి, వినబడకుండా అయిపోతాయి. ప్రతిచోటా సమాజం తన సభ్యుల యొక్క స్వతంత్రత, పరాక్రమాలకు వ్యతిరేకంగా గూఢచర్యం చేస్తూనే వుంటుంది. సమాజం ఒక ఉమ్మడి వాటాదారుల వ్యాపారసంస్థ లాంటిది; తమకు సమాజాన్నుంచి లభిస్తున్న భత్యానికి ప్రతిఫలంగా తమ స్వేచ్చా సంస్కృతులను అర్పిస్తారు దాని వాటాదారులు. తనను గుడ్డిగా అనుసరించేవారు దానికి ప్రీతిపాత్రులు; స్వావలంబన కలిగినవారు దానికి అనిష్టులు. వాస్తవికతను సృజనాత్మకతను కాక, పేర్లను ఆచారాలను అది ప్రేమిస్తుంది.
ధీమంతునిగ జీవించగోరేవారు కట్టుబాట్లను లెక్కజేయకూడదు. మంచితనం వల్ల ఒనగూరే అమృత ఫలాలనందగోరే వారు 'మంచితన ' మనే పడికట్టు పదాన్ని స్మరించడంతో సరిపెట్టుకోక, అది నిజంగా మంచితనమేనా అని శోధించాలి. అంతిమంగా అతి పవిత్రమైనదేదయినా ఉందంటే అది మనిషి నిజాయితీ మాత్రమే. మనిషి తనను తనకు పరిపూర్ణంగా సమర్పించుకొనిననాడు, లోకమంతా అందుకు సమ్మతిస్తుంది. నా చిన్నతనంలో నేను ఒక అత్యంత నిష్టాగరిష్ఠుడు, సకల శాస్త్రకోవిదుడు, పరమభక్తుడూ అయిన ఒక శ్రేయోభిలాషితో అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. “కల్మషంలేని హృదయం కలిగిన నేను నా అంతరంగమందలి ప్రేరణతోనే జీవించనిచ్చగిస్తాను గాని ఆచారవ్యవహారాల పవిత్రతతో నాకేం పని?” అని అన్న నా మాటకి అతడు, "కాని ఆ ప్రేరణ లోపల పుట్టినదే గాని పైనించి వచ్చినది కాదురా అబ్బాయ్" అనగానే నేను మళ్ళీ ఇలా అన్నాను: "నాకైతే అలా ఏం అనిపించటంలేదు. కానివ్వండి నేను రాక్షసుని కుమారుడినయితే ఆ రాక్షసాంశతోనే జీవించగోరతాను". నా స్వీయప్రకృతి కంటే నాకు మరే ధర్మశాస్త్రం అధికం కాదు. మంచీ చెడూ లిప్తపాటులో అట్నించి ఇటు తారుమారుకాగలటువంటివి. నా తత్వానికి సరిపడేదేదైనా నాకు మంచే; తద్వ్యతిరేకమయినది నాకు చెడు. ప్రతివ్యక్తీ ప్రపంచమంతా వెల్లువెత్తే వ్యతిరేకతమధ్యకూడా తనను తాను స్థిరంగా నడిపించుకుంటూ ముందుకు సాగాలి - ఎదట వ్యక్తమయ్యే తిరస్కారం యావత్తూ నామమాత్రమూ, బుద్బుదప్రాయమూనన్న అచంచల విశ్వాసంతో. చిహ్నాలకూ, పేర్లకూ, పెద్ద పెద్ద సమాజాలకూ, మృతినొందిన నిబంధనలకూ మనం ఎంత సులభంగా మోకరిల్లి దాసులమైపోతామో తలచుకొంటుంటేనే నాకు సిగ్గు కలుగుతుంది. గోటూ, పద్ధతీ, మాటకారితనం కలిగిన ప్రతివ్యక్తీ నన్ను ఆకర్షిస్తాడు. నేను నిటారుగ, పూర్తి జవసత్వాలతో అతనిని సమీపించి మాట్లాడదలచుకొన్నదేదో స్పష్టంగా, నిర్భయంగా కుండబద్దలుకొట్టాల్సిందే. లోకోపకారం ముసుగులో మాత్సర్యం, డాంబికం చలామణీ అయిపోతుంటే అది చెల్లిపోవలసిందేనా? క్రోధోన్మత్తుడైన ఒక మూర్ఖశిఖామణి ఎక్కడో బార్బడోస్ నించి వచ్చిన ఒక వార్తని పట్టుకుని పేదరికనిర్మూలనా అదీ ఇదీ అంటూ నానా యాగీ చేస్తూ ఉంటే నేను అతనితో "చూడు బాబూ, నీ పిల్లల మీద ప్రేమ కురిపించు; నీ ఇంటి పనివాళ్ళ మీద ప్రేమ కురిపించు; అందరితోనూ సరళంగా, సాత్వికంగా, సౌమ్యంగా మెలగు; అలాంటీ సౌజన్యంతో లభించే ఠీవీ దర్పం ధరించి తలెత్తుకు జీవించు; అంతేగాని నువు కష్టపడి సంపాదించిన డబ్బుని ఎక్కడో వేల మైళ్ళదూరంలో ఉండే నల్లవాడినుద్ధరించాడికి వృధా చేయకు; ఉన్న కాస్తంత ప్రేమనీ కనిపించని సుదూర తీరాల వైపుకి జల్లివేస్తే నీ ఇంట్లో అది నిండుకుంటుంది" అని ఎందుకు అనకూడదు? నా సూచన కటువుగా, కర్కశంగా అనిపించవచ్చు; కాని కపటప్రేమ కంటే సత్యం సుందరమైనది. నీ మంచితనానికి తగు మాత్రం పదును ఉండాలి. లేకపోతే అది లేనట్టే. ముక్కుతూ మూలుగుతూ ప్రేమని ప్రదర్శించేకన్న కరాఖండిగా ద్వేషాన్ని ప్రకటించడమే మేలు. నా స్వభావానికి వ్యతిరేకమనుకొన్నప్పుడు తల్లితండ్రులూ భార్యాబిడ్డలూ సోదరీసోదరులూ ఎవరూ నాకు అక్కర్లేదు. "ఇది నా చాదస్తం అంతే" అని రాసిన పలకని నా తలుపుకి తగిలించి నిశ్చింతగా కూర్చుంటాను. అంతేగాని నా చాదస్తాన్ని చివరివరకూ దాచుకుని భరిస్తూ ఆఖర్లో వెల్లడి అయిపోయినప్పుడు వివరణలు ఇచ్చుకొంటూ గడపను. సాహచర్యాన్ని గాని, ఏకాంతాన్ని గాని ఎప్పుడెప్పుడు, ఎందుకెందుకు కోరుకుంటానో సంజాయిషీ నన్నడగవద్దు. అలాగే ఇందాకటి పెద్దమనిషి చేసినట్టు, ప్రపంచంలోని పేదలందరినీ బాగుచేసే బాధ్యత నామీద పెట్టవద్దు. వారు నా పేదలా? ఓ మూర్ఖ సమాజసేవకా! నాకు ఏమీ కాని, వారికి నేను ఏమీ కాని - వారి కోసం నేను ఇచ్చే రూపాయైనా అణా అయినా దమ్మిడీ అయినా - నేను ఏడుస్తూ మాత్రమే ఇస్తాను. తత్వతః నేను ఒక తరహా వ్యక్తులకే దగ్గరవుతాను, వారితోనే నా బాధ్యతలు ముడిపడివుంటాయి; వారికోసం అవసరమయితే కారాగృహానికికూడా వెళ్ళడానికి నేను సిద్ధం; కాని నీవు నెత్తికెత్తుకుంటున్న అమాంబాపతు ధర్మకార్యాలు - మూర్ఖులకి విద్యాలయాల్లో విద్యాసౌకర్యం; ఇప్పటికే నిరుపయోగంగా పడివున్న వాటికి అదనంగా సభాలయాల నిర్మాణం; తాగుబోతులకి అన్నదానాలు; ఒకర్ని చూసి ఇంకొకరు - ఇలా వేల కొద్దీ ధార్మిక సంస్థలు; నిజమే - అప్పుడప్పుడు బలవంతమ్మీద నేను కూడా తృణమో పణమో ఇచ్చి వున్నానని ఒప్పుకుంటున్నా, అది ఏ రకమైన సద్గతీ పొందని తృణం, పణం; మరియు దాన్ని ఆయా సందర్భాల్లో ఇవ్వ నిరాకరించడానికి తగిన మగటిమిని నేను చూపించనందుకు అది గుర్తొచ్చినప్పుడల్లా నేను బాధపడుతుంటాను.
ధర్మాలు, చాలా సందర్భాల్లో, విద్యుక్తవిధులుగా కంటే మొక్కుబడికార్యాలుగా ఆచరించబడుతుంటాయి. మనిషి - ఇంకా అతని ధర్మాలు. మనిషి కొన్ని ధర్మ కార్యాలని సాహసాలుగానో పరోపకారాలు గానో ఆచరిస్తాడు - హాజరు కావలసిన కవాతుని ఎగవేసినప్పుడు చెల్లించే అపరాధరుసుములా. వారి చర్యలు ఈ ప్రపంచంలో జీవించడం అనే పొరపాటుపనికి పరిహారాల్లా, అనర్హుడు పేరుమోసిన విద్యాలయంలో ప్రవేశించేందుకు చెల్లించే అదనపు రుసుముల్లా ఉంటాయి. వారి ధర్మాచరణం ప్రాయశ్చిత్తకర్మ. నేను జీవించాలనుకొంటున్నానే గాని ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకోవడం లేదు. నేను జీవించేది నా స్వంతానికేగాని చూసేవారి వేడుకకోసంకాదు. అది నిజాయితీనీ సమత్వాన్నీ ప్రతిఫలించేందుకు వీలైనంత సునాయాసంగా, నిలకడగా ఉండాలని కోరుకుంటానే గాని తళుకుబెళుకుల ఒడిదుడుకుల సమాహారంగా కాదు. అది ఆరోగ్యంగాను, మధురంగాను ఉండాలి; ఉపవాసాల, రక్తస్రావాల అవసరం దానికుండకూడదు. ఒక మనిషిని గుర్తించేందుకు అవసరమయ్యే ప్రాథమిక సాక్ష్యం చాలే గాని దాన్ని నిరూపించేందుకు అతను చేసిన ఘనకార్యాల చిట్టా నాకక్కరలేదు. నాకునేనుగా ఆ విషయాన్ని గ్రహించగలను; సదరు వ్యక్తి ఘనకార్యాలను నేను ఆమోదించానా తృణీకరించానా అనే విషయం అప్రస్తుతం. నాకు జన్మతః సంక్రమించిన హక్కు నిమిత్తం ఏ చెల్లింపూ చెయ్యడానికి నేను సిద్ధంగాలేను. నా శక్తియుక్తులు కొద్ది మొత్తమే కావచ్చు, హీనమయినవియే కావచ్చు కాని నేను స్వతంత్రుడిని, నాగురించి నానుంచి గాని వేరేవారినుంచి గాని ఏ హామీలూ వాఙ్మూలాలూ నాకవసరం లేదు.
నేను చేయు పనులు కేవలం నాకుగా నేను నాకోసం చేద్దామనుకొంటున్నవే కాని ఇతరులు నానుంచి ఆశించేవి కావు. ఈ నిబంధన, లౌకిక, పారమార్ధిక వ్యవహారాలన్నింటికి వర్తించేది, మరియు నీచత్వ ఉత్కృష్టతల మధ్యగల సామ్యాన్ని వేరుపరచేది. ఇది కష్టసాధ్యమైనది, ఎందుకంటే మనమేం చెయ్యాలో మనకంటే వారికే ఎక్కువ తెలిసినట్టు వ్యవహరించేవారు మనకి ప్రతిదినం తారసపడుతుంటారు. ప్రపంచం ఇష్టాయిష్టాల ప్రకారం జీవించడం సులభం. మనం అనుకున్నవిధంగా జీవించటం ఏకాంతంలోనే సాధ్యం. అయితే ప్రపంచపు గందరగోళం మధ్యలో ఏకాంతపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తమ అభిమతానికనుగుణంగా జీవించేవారు ధన్యులు.
నీవు మృతప్రాయంగా భావించే పద్ధతులను ఎందుకు తిరస్కరించాలంటే, వాటి ఆచరణ నీకున్న పరిమిత శక్తిని చెదరగొట్టి నిన్ను బలహీనపరుస్తుంది. నీ ప్రస్తుత స్థితిని అయోమయంగాను నీ నిజతత్వాన్ని మసకబారుస్తుంది. నీవు ఏనాడో శిధిలమైన చర్చిని నిర్వహిస్తూ, మృతావశేషమైన బైబిల్ సంఘాన్ని పోషిస్తూ, ప్రభుత్వానిదో దాని వ్యతిరేకులదో ఒక రాజకీయపక్షానికి కొమ్ముకాస్తూ, నిరంతరం బుర్రనీ పనిస్థలాన్నీ పారిశుద్ధకార్మికుల సామానుగదిలాగ అస్తవ్యస్తంగా ఉంచుకుంటున్నప్పుడు, ఈ రంగురంగుల తెరలలోనుంచి నీ నిజస్వరూపాన్ని అర్ధం చేసుకోవడానికి నేను చాల కష్టపడాలి. అంతేకాక నీ శక్తి చాలామట్టుకి ఈ పనులకింద ఖర్చైపోతోంది. నీ పనిని మాత్రం నువ్వు చెయ్యి, అదిచాలు నాకు నీవెవరో తెలియడానికి; దానివల్ల నీ శక్తి ద్విగుణీకృతమవుతుంది. 'నలుగురితో పాటు ' అని ఎదోరకంగా సాగిపోవడం ఎలాంటి గుడ్డిగుర్రం తోపు వాటమో ప్రతివారూ గ్రహించాలి. నీ మతమేదో నాకు తెలిస్తే నీ వాదనని నేను ఊహించగలను. ఒక మతాధికారి తన తదుపరి ప్రసంగంలో ఫలానా చర్చి యొక్క వ్యవస్థ గురించి ఉపన్యసించబోతున్నానని ప్రకటించేడనుకోండి. తను కొత్తవిగానీ, స్వంతానివిగానీ పదాలు ఏవీ ప్రయోగించబోవటంలేదన్న సంగతి నాకు ముందే తెలియదా? తను ఒక్కదిశగా మాత్రమే చూడాలన్న నిబంధనకు కట్టుబడ్డాడనీ, అదిన్నీ ' ఆమోదించబడిన ' దిశ అనీ, ఒక మనిషిగా కాక ఒక మతాధికారిగా మాత్రమే జీవించడమన్న ప్రతిజ్ఞకి అతడు బద్ధుడై ఉంటాడని నేను గ్రహించలేనా? ఇదిలా వుండగా, చాలామంది తమ ఒక కంటికి, ఇంకా చాలామంది రెండుకళ్ళకీ కూడా గంతలు కట్టేసుకుని ఇలాంటివారు సారధ్యంచేస్తున్న ఎదో ఒక సంఘాన్ని దాని భావజాలాన్ని అనుసరించిపోతున్నారు. నిజమేలెండి ఇలా గుడ్డిగా అనుసరిస్తూ పోతే అప్పుడప్పుడూ కొన్ని తప్పులు చెయ్యడం కొన్ని అసత్యాలాడే అగత్యం వస్తుందంటారా - నేనొప్పుకోను - అన్నీ తప్పులే చేస్తారు, ఎప్పుడూ అసత్యాలే ఆడుతారు. వారి నిజాలు నిజాలు కావు. వారి రెండు రెండు కాదు; నాలుగు నాలుగు కాదు; వారు చెప్పే ప్రతి మాటా మనకి కంటగింపూ ఏవగింపూ కలిగించి, వారిని ఎక్కడినించి సరిదిద్దాలో మనకర్ధం కాదు. మనం ఇలాంటి గుంపుతో అంటకాగుతున్నాంకదాని కాలం మనకి వారి దుస్తుల్లాంటివే తొడిగి మనతో పాటే పెళ్ళినడకలు నడుస్తూ ఉండక మిక్కిలివేగంతో పరుగెత్తిపోతుంది. ఒక అరువుమొహం తగిలించుకోవడం, ఒక ఎరువుపద్ధతిని పాటించడం - ఇలా చేయడం కొనసాగిస్తే అంచెలంచెలుగా మనలో గాడిదెజాతి సహజ లక్షణాలు పొడసూపి బుర్రొంచుకు పొయ్యే స్వభావం పెంపొందుతుంది. సాధారణవిషయాలేగదాని ఉదాసీనంగా అలవాటుచేసుకుంటూ పోతే అవి ఒకనాటికి బహిరంగమై బట్టబయలు కాకతప్పదు. నేను చెప్పేది " వెర్రి మొహపు పొగడ్తల " గురించి - మనకి నచ్చని మనుషులతో, మనకిష్టంలేని సంభాషణలలో పాల్గొనేప్పుడు బలవంతమ్మీద మొహానికి తగిలుంచుకొంటామే, ఆముదం తాగిన హావభావంతోటి ఏడుపులాంటి చిరునవ్వు – దాని గురించి. ఈ మొహమాటపు నవ్వులకోసం ముఖ కండరాలు బలవంతంగా కదిలి వంకర్లు తిరిగి నవ్వునిపుట్టించే ప్రయత్నంలో విఫలమై ముఖానికి ఒక వికృతరూపాన్ని ప్రసాదిస్తాయి.
తనను అనుసరించనివారిపట్ల సమాజం కొరడా ఝళిపిస్తుంది - అయిష్టతని చూపులద్వారా వ్యక్తపరుస్తూ. అందుకని ప్రతివారూ ఎదటివారి చూపులలోని అసంతృప్తిని అంచనావేయడం నేర్చుకోవాలి. ఏ దుకాణంలోనో, మరియే మిత్రుడి గృహంలోనో, ఒక వ్యక్తిని వేరొకడు క్రీగంట చూస్తాడు. ఆ చూపులో భావాన్ని తన మదిలో ఉన్న ద్వేషంతోనో అసూయతోనో ముడిపెట్టి ఆ కోణంలో అర్ధంచేసుకుంటే, అతను విచారగ్రస్తుడై ఇంటికి చేరుతాడు. అయితే ఇలాంటి అయిష్టపు చూపులలో, ఆప్యాయపు చూపుల్లోలాగే, పెద్ద అర్ధం కోసం వెదకాల్సిన పనిలేదు. అవి తరచుగా మారిపోతుంటాయి. గాలివాటానికి ఎగిరిపోయే కాగితంలా. అయితే అసంతృప్తి అన్నివైపులనించి వెల్వడుతుంటే మాత్రం దాని శక్తి ప్రభుత్వాల శక్తి కంటే మిక్కుటమని చెప్పవచ్చు. ధీమంతుడు, ఈ తరహా నాగరికుల అసహనప్రదర్శను సమర్ధంగా భరించగలడు. వారి మండిపాటు కూడా నాగరకంగాను, అలంకారప్రాయంగానే వుంటుంది - ఎందుకంటే వారూ బలహీనులే కావడం మూలాన. కానీ ఎప్పుడైతే ఈ నంగి నంగి రోషాలకి ఇతరులు కూడా ఆజ్యంపోస్తారో, మూర్ఖులూ బలహీనులూ ఉద్రిక్తులవుతారో, సమాజంలోని అట్టడుగు స్థాయినించి విచక్షణారహితమైన పశుబలం తోడవుతుందో, ఇవన్నీ పెద్ద పట్టించుకోనక్కరలేని అంశాలని భావించడానికి విశాలహృదయం, మతవిశ్వాసం అవసరమవుతాయి.
నిలకడకోసం మనం పడే ఆరాటం మన ఆత్మవిశ్వాసాన్ని హరిస్తుంది. ఎప్పుడెప్పుడో గతంలో మనం చేసిన ఘనకార్యాలే మన నడవడికి ప్రమాణాలని మనం భావిస్తుంటాం. ఇతరులుకూడా మనని అంచనావెయ్యడానికి మన గత చరిత్రనే ఆధారంగా తీసుకొంటారు, మరియు మనం వారిని నిరుత్సాహపరచకుండా ఉండటంకోసం గతాన్ని పట్టుకు ప్రాకులాడటానికే మొగ్గుచూపుతాం.
కాని వెనక్కిచూసుకుంటూ ముందుకు నడవడం దేనికి? గతంలో ఎదో అని ఇప్పుడు దానికి భిన్నంగా అంటే ఎవరేమనుకుంటారో అన్న భయంతో గతస్మృతుల శవాన్ని భుజమ్మీద వేసుకు తిరగడమెందుకు? సరే; గతంలో ఒకటి అన్నారు; ఇప్పుడు వేరొకటి అంటున్నారు. అయితే ఏమిటట? మీ జ్ఞాపకశక్తిని కాదని, చుట్టూ వున్న సమాజం మిమ్మల్ని వెయ్యికళ్ళతో గమనిస్తున్నందున, లోగడ చెప్పినదే తు.చ. తప్పకుండ ఇప్పుడూ చెప్తేనే జ్ఞానమని అనుకుంటున్నాం. మీ ఆరాధనలో విగ్రహానికి వ్యక్తిత్వాన్ని ఆపాదించరు. కానీ అధికమయిన తన్మయత్వంలో నిజంగా భగవంతుడే సాక్షాత్కరించినట్టు మీ అంతరంగం భావిస్తే, మనస్సునీ హృదయాన్ని మరే శంకలూ లేకుండా ఆ అనుభూతిని విశ్వసించనివ్వండి; అవసరమయితే అట్టి సాక్షాత్కారానికి మనుష్యరూపం ఇవ్వండి, మీరిష్టపడే వస్త్రాలంకరణలతో సహా. మిగతా అన్నిసిద్ధాంతాలనీ విడిచిపెట్టండి - జోసెఫ్ తన చొక్కాని పిచ్చివాడికొదిలి పరిగెత్తినట్టు.
నిలకడగా పొయ్యేతత్వం అల్పబుద్ధులకి ఒక భూతంలా పట్టుకుంటుంది; అదేస్థాయి ఆలోచనలుకలిగిన కొందరు అధికారగణం, తత్వవేత్తలు, ఆధ్యాత్మికపరులు దాన్ని మెచ్చుకుంటారు కూడా. గొప్ప ఆలోచనాశక్తి ఉన్నవానికి నిలకడ తత్వాన్ని అలవరచుకుంటే చేయడానికి పనేం ఉండదు. గోడమీది తన నీడతో తను సంభాషించుకున్నట్టే ఇదీ కూడా. అనదలచుకున్నదేదో స్పష్టంగా, ధాటీగా, ఈ రోజు అను. రేపు ఏమి మాట్లాడాలని అనిపిస్తే అదీ కూడా అంతే ధాటీగా, స్పష్టంగా మాట్లాడు. అది ఇవాళ మాట్టాడినదానికి పూర్తి భిన్నమైనదైనా సరే. 'ఇలా అయితే మనని అపార్ధం చేసుకోరూ?' అంటారా - ఏం, అపార్ధం చేసుకోబడకూడదా? పైథాగరస్ ని అపార్ధం చేసుకున్నారు; సోక్రటీస్, లూథర్, జీసస్, న్యూటన్, కోపర్నికస్, గెలీలియో - రక్తమాంసాలు ధరించిన ప్రతీ ఒక్క చైతన్యస్వరూపాన్ని అపార్ధం చేసుకున్నారు. గొప్పతనం అపార్ధం చేసుకోబడటంలోనే ఉంది.
నా మట్టుకు నేను ఏవ్యక్తీ తన సహజ తత్వాన్ని ఉల్లంఘించలేడంటాను. భూగోళ మహా వర్తులంలో ఆండిస్, హిమాలయాల ఎత్తుల్లోని హెచ్చుతగ్గులు కూడా కలిసిపోయినట్టు, ఒక వ్యక్తి సంపూర్ణ తత్వంలో అతని ప్రవర్తనలో బయటపడే గుణదోషాలు కనబడని భాగమయిపోతాయి. అతనిని నీవు ఏవిధంగా గణిస్తావో, పరిశీలిస్తావో కూడా ముఖ్యం కాదు. భగవంతుడు నాకు ప్రసాదించిన ఈ ముచ్చటైన, పశ్చాత్తాపానికి అవకాశమున్నట్టి, ప్రపంచమనే సుందర అటవిక జీవనగమనంలో, ప్రతి రోజు, అత్యంత నిజాయితీగా, నా నిర్మల హృదయంలో కలిగే ఆలోచనలను పొందుపరుస్తాను - గతించిన, రాబోయే పరిస్థితులతో సంబంధం లేకుండా. నాకు తెలుసు అవి అన్నీ ఒకదానితోఒకటి సామరస్యం, సారూప్యంకలిగి వుంటాయి; అలా ఉండాలని నేను భావించకపోయినా, అది గమనించకపోయినా సరే. నా పుస్తకం దేవదారు వృక్షపరిమళం, వనంలో చరించే కీటకాల ఝుంకారంతో నిండియుండాలి. నా కిటికీమీద వాలే చిన్నారి పికిలిపిట్ట గూడుకోసం తన ముక్కునకరచుకున్న గడ్డిపోచతో నా బ్రతుకు గూడుని కూడా అల్లాలి. మనం స్వతస్సిద్ధంగా ఏమిటో, దానిగానే చెల్లుబాటవుతాము. మనం మనల్ని మన చర్యలద్వారాకాక మన శీలంద్వారానే వ్యక్తపరచుకుంటాం. అందరూ అనుకుంటారు - వారి గుణదోషాలు వారి చర్యల వల్ల వెల్లడి అవుతాయని - కానీ గుణాలూ దోషాలూ కూడా వారి ఊపిరితోబాటే వారిని వెల్లడిచేస్తున్నాయని వారు గ్రహించాలి.
మనం చేసే పనులు - ఒకానొకప్పటి కాలమానపరిస్థితుల ప్రకారం ఒక నిర్దిష్ట దూరం నించి చూస్తే అన్నీ సారూప్యతతో, సామరస్యంగానే కనిపిస్తాయి - విడివిడిగా అవి ఎన్ని భిన్నరకాలుగాను, ఒకదానినించి మరొకటి ఎంతటి వ్యత్యస్తం కలిగి యున్నప్పటికీ. వాటిని పరిశీలించే ఆలోచన 'ఎత్తు' ని కొంచం పెంచితే ఈ రకాలూ అసమానతలూ అన్నీ తిన్నబడి కనిపిస్తాయి. నిర్దిష్టమైన ఒక 'నైజం' ఈ సారళ్యాన్ని సాధిస్తుంది. సమర్ధవంతమైన నౌకాయానం వేలకొద్ది వంకరటింకరల మార్గం; ఆ మార్గాన్నే కొంత ఎత్తు పైనించి చూడండి, అది ఒక సరళరేఖవలె కనిపిస్తుంది. నిజాయితీతో మీరు ఆచరించే పనులే ఆ పనుల అంతరార్ధాన్ని వివరిస్తాయి. అంతేకాదు, మీరొనరించే ఇతర పనుల అంతరార్ధాన్ని కూడా వెల్లడిస్తాయి. మీ అనుకరణ మాత్రం దేనినీ వెల్లడి చెయ్యదు. నిజాయితీగా, ఒంటరిగా పనిచెయ్యి. ఇంతకుముందు నీవు ఇదేవిధంగా ఆచరించిన కార్యాలు ఇప్పటి నీ నిజ నైజాన్ని వివరిస్తాయి. గొప్పతనం భవిష్యత్తులో ప్రతిఫలిస్తుంది. ఈరోజు నేను స్థిరంగా నిలిచి పూర్తి నమ్మకంతో నా మనసుకు నచ్చిన పనిని, ఇతరుల తిరస్కారపు చూపుల మధ్య కూడా చెయ్యగలుగుతున్నానంటే అందుక్కారణం, నన్ను ఈ రోజు అన్ని ప్రతికూలతలనుండి కాపాడగల గొప్పతనం నేను గతంలో ఇప్పటిలాంటిదే అయిన నిజాయితీతో, నిలకడతో, నమ్మికతో చేసిన పనుల ఫలితమే. ఎలాగయితేకానీ, తక్షణమే చెయ్యి. అవహేళనలను అసలు పట్టించుకోకు. శీలం యొక్క శక్తి సంచితం - క్రమేపి వృద్ధిని పొందుతుంది. గతంలో ఒనరించిన మంచిపనుల శక్తి దీనికి జత అవుతుంటుంది. మన భావనల నిండియున్న మహనీయుల, మహానాయకుల గొప్పతనం ఏ విధంగా ఒచ్చిందంటారు? వారి గతాన్ని పరిపుష్టంచేసిన సత్కార్యాల సమిష్టి చైతన్యమే. తమదిశగా వస్తున్న నటుడిపైన వారు ఏకీకృతమైన, సామరస్యపూరితమైన కాంతికిరణాలను ప్రసరింపజేశారు. ఆ కాంతిలో అతనిని పరివేష్టించియున్న దైవస్వరూపాలు కానవచ్చాయి. చాతం కు వాగ్ధాటిని, వాషింగ్టన్ వైఖరికి హుందాతనాన్ని, ఆడంసు కన్నులముందు అమెరికాను సాక్షాత్కరింపజేసిన పిడుగుపాటు వంటి శక్తి అది. ప్రతిష్టాత్మకమైన గౌరవం మనకు ఆరాధ్యం - ఎందుకంటే దానిని ప్రేమిస్తాం, అంజలులు ఘటిస్తాం; కాని అది మన అంజలులకూ ప్రేమకూ లొంగదు; స్వంతంత్రంగా నిలబడేది, స్వావలంబన కలిగినటువంటిది. నిష్కళంకమైన పురాతన చరిత్రకలిగినటువంటిది - వయసులో పిన్నవారిపట్ల చూపినా సరే.
ఈ నిలకడతనం, నలుగురితోపాటుతనం అనే మాటలను ఇక వినకూడదనుకుంటున్నాను. ఆ పదాలు గ్రంధస్థమై ఇకపై హాస్యాస్పదమైపోవాలి. భోజనాల కోసం వినబడే గంట కాకుండా పవిత్రజీవనానికోసం పిలిచే సన్నని మనోహరమైన ఈల వినబడాలి. ఇకపై వంగి వంగి దండాలు, క్షమాపణలు మానేద్దాం. ఒక గొప్ప వ్యక్తి నా ఇంటికి భోజనానికి వస్తాడు. నా ప్రవర్తన అతడికి నచ్చాలని నేననుకోను గాని అతడు మాత్రం తన ప్రవర్తన నాకు నచ్చాలనుకోవాలనుకొని, ఆ విధంగ ప్రవర్తించాలని నా కోరిక. నేనున్నది ఒక పరిపూర్ణ మనుష్యునిగా జీవించడంకోసం. ఆ పాత్రని సమర్ధంగా నిర్వహించడం కోసం నేను దయనుచూపవలసివచ్చినా, అది వాస్తవికంగా, నిజాయితీగా ఉంటుంది. పరిస్థితులతో తృప్తి చెందడమనే అతి సామాన్యమైన, అసహ్యకరమైన దుర్లక్షణాన్ని ఈ క్షణమే విడిచిపెట్టి, మనిషి పనిచేసే ప్రతిచోటా అత్యంత బాధ్యతాయుతుడైన ఆలోచనాపరుడు, కార్యశూరుడు ఉంటాడనే ప్రపంచ చరిత్ర యావత్తూ గుర్తించి లిఖించిన ఒక గొప్ప సత్యాన్ని కట్టుబాట్లు, వ్యవహారాలమీదికి విసిరికొట్టండి. నిజమైన మానవుడు ఏ దేశకాలాలకూ చెందడు కాని అన్ని పరిస్థితులకీ కేంద్రబిందువుగా ఉంటాడు. అతనున్నచోటే ప్రకృతి ఉంటుంది. అతడు మిమ్మల్నీ ఇతరులందర్నీ, అన్ని పరిస్థితులనీ గణిస్తాడు. సాధారణంగా సమాజంలో ప్రతి ఒక్కరూ తమ ఉనికిచే ఎదో ఇతర వస్తువునో, ఎవరో ఇతర వ్యక్తినో గుర్తుకు తెస్తారు. శీలమూ యదార్ధమూ దేనిని గుర్తుకు తేవు. సృష్టి అంతటా ఇది సంభవిస్తుంది. ఎలాంటి పరిస్థితులనైనా నిష్పాక్షికం, తటస్థం చేయగలిగే స్థాయికి మనిషి ఎదగాలి. ప్రతి వ్యక్తీ ఒక గమ్యాన్ని కలిగియుండీ, ఒక దేశానికీ, ఒక కాలానికీ చెందియుంటాడు. ప్రతి వ్యక్తీ ఒక హేతువు, ఒక దేశం, ఒక యుగం. తన యోచనలను సాకారంచేసుకోడానికి అత్యధికపరిమాణంలో స్థల కాలాదులు, కార్యార్ధులై అతని మార్గంలో నడిచే సంఘబలం కావాలి. సీజర్ అనేవ్యక్తి జనించాడు, వెనువెంట అనేక శతాబ్దాలుగా రోమన్ సామ్రాజ్యం మనకు లభించింది; క్రీస్తు జనించాడు, ధర్మశక్తికి ఆత్మోన్నతికి అతనే ప్రతీక అని విశ్వసించే కోట్లకొలది జనులు అతని బుద్ధికుశలతను ఆరాధిస్తున్నారు. వ్యవస్థ వ్యక్తి యొక్క సుదీర్ఘమైన నీడ. ఇదే విధంగా ఆంథొనీ ఋషి యొక్క సన్యాస వృత్తిమార్గం; లూథర్ ప్రారంభించిన పునరుథ్థాన విధానం; గమనిస్తే చరిత్ర అంతా దృఢచిత్తం, చిత్తశుద్ధి, ఏకాగ్రత గల కొద్ది వ్యక్తుల జీవితచరిత్రల చుట్టూనే తిరుగుతుంది.
మనిషి తన విలువేంటో స్పష్టంగా గ్రహించాలి; తద్వారా పరిస్థితులను తన అదుపులో ఉంచుకోవాలి. అనాధలు, పరభాగ్యోపజీవుల తో బాటు వంగి వంగి, దొంగిలి, పరధనాన్ని ఆశించరాదు. వీధినపోయే నిరాశాపరుడు, తనకెదురుగా కనిపించే అంబరాన్నంటే, పాలరాయి, బంగారపు జిలుగులతో విలసిల్లే అద్భుతకళాసంపన్నమైన మహోన్నత భవనాన్ని చూచినప్పుడు తన పేదరికాన్నే తలచుకుని మరింత నైరాశ్యం చెందుతాడు తప్ప అట్టి మహానిర్మాణాన్ని సృజించినవారికీ తనకూ ప్రకృతిసిద్ధంగా భేదమేమీ లేదని గ్రహించడు. అట్టివానికి, ఒక ఇంద్రభవనం, ఒక అద్భుతశిల్పం, ఒక మహాగ్రంథం తనను కొత్తగాను, వింతగాను పరికిస్తున్నట్టు, 'ఎవరండీ మీరు?' అని మిత్రతలోపించి ప్రశ్నించినట్టు అనిపిస్తాయి. కాని అతడనుకొంటున్నట్టు గాక, అవి అన్నీ తమను సొంతంచేసుకొమ్మని అతనిని కోరుతున్నట్టివే. ఒక సుందర చిత్రం నా తీర్పునకై ఎదురుచూస్తుంటుంది. అది నన్ను ఆజ్ఞాపించేదిగా కాక, తను ఆశించే ప్రశంశలు తనకు లభించేందుకు నా సహాయాన్ని ఆశిస్తుంది. పాత కథ ఒకటుంది: ఒకడు చెడతాగి ఒళ్ళూ దుస్తులూ మట్టికొట్టుకుపోయి వీధికడ్డంగా పడుకునివుంటాడు. రాజ భటులు వాడిని రాజభవనానికి తీసుకునిపోయి సకలోపచారాలూ చేసి రాజోచిత దుస్తులు ధరింపజేసి సింహాసనం మీద కూర్చుండజేస్తారు. అప్పుడు వాడు రాజసభలో విధేయులై తనను పరివేష్టించియున్న సకలజనులను అవలోకించినవాడై, తనకు తాత్కాలికంగా చిత్తచాంచల్యం కలిగినట్టు, మేల్కాంచగానే తన సహజ రాజత్వాన్ని తను పొందినట్టు గ్రహిస్తాడు. అదే సమయంలో - ప్రతివ్యక్తీ చక్రవర్తిసమానుడేననీ, అప్పుడప్పుడు కలిగే చిత్త చాంచల్యం వల్ల హేతుసహితంగా ఆలోచించక, హీనమైన జీవనాన్ని గడుపుతూంటాడనే ఒక సత్యాన్ని కూడా ఆవిష్కరిస్తాడు.
మన చదువులు భిక్షాటనలాగ, ఇతరుల ప్రాపకం కోసం చేసే స్తోత్రపాఠాల్లాగ ఉన్నాయి. చరిత్రలో మన సృజనాత్మకత విఫలమైనట్టు కనబడుతుంది. ప్రభువు, రాజ్యము, అధికారం, సంపద - జాన్, ఎడ్వర్డ్, వాళ్ళ రోజువారి పనులు, వారి చిన్న ఇల్లు - వీటితో పోలిస్తే క్లిష్టపదాలు. కానీ జీవనవిధానం రెండుసందర్భాల్లోనూ ఒకటే. రెంటి మొత్తం ఆఖరికి ఒకటే. ఆల్ఫ్రెడ్, గుస్టావస్, స్కాండర్ బర్గ్ - వీరంటే ఎందుకంత భక్తి? వారు ధార్మికులని కావచ్చు. కాని వారు ధార్మికతను చివరికంటా విడువక ధరించి తిరిగేరా? వారు బహిరంగంగా చేసిన కార్యాలు, నీవు వైయక్తికంగా ఆచరించే పనులూ ప్రాముఖ్యతలో ఒకటే. సామాన్యుడు తన పూర్తి మనస్సుతో పనిచేసినప్పుడు చక్రవర్తి చేసిన పనిలో వుండేటటువంటి ప్రకాశం అతనిని, అతని చర్యలను కూడా తేజోమయం చేస్తుంది.
అన్నిదేశాల దృష్టి తమపై లగ్నంకాగా, రాజులు తమ రాజ్యాలను పాలించారు. మనుషుల మధ్య వుండే పరస్పర ఆరాధనాభావం యొక్క ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుంది. ప్రభువులను, అధిపతులను, సంపన్నులను ప్రజలు గుడ్డిగా ఆరాధిస్తున్నారంటే అందులోని గూఢార్ధాన్ని మనం గ్రహించాలి. అట్టి ఆరాధ్యులు వారికి తోచిన న్యాయమే ప్రజలందరి న్యాయమని నమ్మించడంలో కృతకృత్యులయ్యారని; మరియు ప్రజలు ధన రూపేణా కాకుండా వీరికి తమ మానాభిమానాలు సమర్పించుకుని ఆరాధించుకుంటారని.
స్వచ్చందంగా నిజాయితీతో ఒనరించే చర్యల్లోని ఆకర్షకశక్తి తెలియాలంటే మనం ఆత్మవిశ్వాసం యొక్క మహిమను తెలుసుకోవాలి. ఈ విశ్వాసపు మూలప్రకృతికి ధర్మకర్త ఎవరు? విశ్వమంతా విశ్వసింపగల ఆ అనాది తత్వమేది? దృష్టివిక్షేపం లేకుండా, లెక్కలు కట్టే అవసరంలేకుండా, లేశమాత్రమైనా స్వతంత్రత ఉంటేచాలు మన చర్యల్లో - అవి ఎంత అప్రధానమైనవైనా, అపవిత్రమైనవైనా, వాటిలోకి ఒక అందమైన సౌందర్య కిరణాన్ని ప్రసరించే, శాస్త్రీయతను బురిడీకొట్టించే ఈ ధృవతార యొక్క తత్వం ఏమిటి? ఈ శోధన మనను మనం సాధారణంగా వ్యవహరించే 'అసంకల్పిత, యధేచ్ఛ' అనే పదాల యొక్క కౌశలం, ధర్మగుణం మరియు జీవం యొక్క మూలాల్లోకి తీసుకువెళుతుంది. ఈ ప్రాథమికస్థాయి వివేకాన్ని సహజ జ్ఞానమని (intuition), తదుపరి నేర్చుకున్నవన్నింటినీ శిక్షణ (tuition) అని వ్యవహరిస్తారు. విశ్లేషణాశక్తి మరి చొరరానంతటి అట్టి నిగూఢ సారంలో అన్ని విషయాలు తమ సామాన్య మూలాధారాన్ని కనుగొంటాయి. ఎందుకంటే ప్రశాంత సమయాల్లో మన ఉనికిని గురించిన దీర్ఘాలోచనలో మన సహజ తత్వం ఆకాశం, కాలం, మనిషి వంటి ప్రకృతుల కన్న భిన్నం కాదని, వాటి అన్నింటి జీవానికి ఉనికికి కారణభూతమైన మూలస్థానం నించే అది కూడా ఉత్పన్నమైనదని గ్రహిస్తాము. ముందుగా మనం జీవరాశుల ఉనికికి మూలమైన ప్రాణశక్తిని పంచుకుంటాం. తరువాత వాటిని ప్రకృతిలో కనబడే వస్తువులుగా పరిగణిస్తాం, కాని వాటి మూలశక్తినే మనం కూడా పంచుకుంటున్నామనే సత్యాన్ని విస్మరిస్తాం. ఇదే చింతనకు, కార్యాచరణకు జన్మస్థానం. మనిషికి జ్ఞానప్రదాతవంటి స్ఫూర్తిశక్తికి ఇది ఊపిరితిత్తులవంటిది; నాస్తికులూ పాపచింతకులూ మాత్రమే దీనిని నిరాకరించగలరు. అక్షయమైన జ్ఞానరాశి ఒడిలో మనం సేదదీరుతున్నాము. తన కార్యకుశలతకు అంగములుగాను, తన సత్యప్రకాశానికి వారసులుగాను అది మనను అనుగ్రహిస్తుంది. సత్యసంధతను, సమన్యాయాన్ని మనం వివేచించినప్పుడు మనకు మనంగా ఏమీ చెయ్యటంలేదనీ, ఆ జ్ఞానరాశి యొక్క అనంత తేజోమయ కాంతినిలయం నుండి కొన్ని కిరణాలు మనమీద పడే వీలు కలిగించుకుంటున్నామని మాత్రమే గ్రహించాలి. అది ఎచటనుండి వస్తోందో, దానిని ప్రసరిస్తున్న మహా~త్మస్వరూపం ఏదో పరిశోధించబూనితే వేదాంతం అంతా నిష్ఫలమైనట్లే. అది ఉన్నదా, లేదా అన్నది మాత్రమే మనం చెప్పగలిగేది. ప్రతీవ్యక్తి తన మదిలో వెల్లువెత్తే స్వచ్చంద ఆలోచనలకీ, అప్రయత్నంగా కలిగే భావనలకీ గల భేదాన్ని గమనించినప్పుడు, తన అప్రయత్న భావనలలో పరిపూర్ణవిశ్వాసమనే ముఖ్యాంశం లోపించిందని గ్రహిస్తాడు. అట్టి గ్రహింపుని వ్యక్తపరచడంలో అతడు కృతకృత్యుడు కాలేకపోవచ్చు; కానీ ఇవి రెండూ పగలూ రేయీ వంటివనీ, అందులో వివాదానికి తావులేదనీ మాత్రం స్పష్టంగా తెలుసుకుంటాడు. మనః పూర్వకంగా నేనొనరించే ఆలోచనలూ కార్యాలూ ఆగకుండా తిరుగాడుతుంటాయి. కానీ నిశ్చలంగా నాలోనేను స్వచ్చందంగా తలచిన తలపు నా ఉత్సుకతను ఉద్దేశ్యాన్ని ఆకర్షిస్తుంది. అసంకల్పితంగా మదిలో కలిగే భావనలనే అభిప్రాయాలుగా గణిస్తారు ఆలోచనారహితులు; వాటి మధ్య గల తారతమ్యాన్ని వారు గ్రహించరు. నేను చూచే వస్తువులను ఎంపికచేసుకుని చూస్తానని వారు భావిస్తూంటారు. కాని భావన (perception) చపలమైనదికాదు, హానికరమైనది. ఒక లక్షణాన్ని నేను దర్శించానంటే నా తరవాత నా బిడ్డలు కూడా దాన్నే దర్శిస్తారు; క్రమేపి మానవాళి అంతా కూడా, అంతకు ముందు తాము స్వయంగా చూసివుండకపోయినా, ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. నా భావనే సూర్యుడంతటి సత్యంగా పరిగణింపబడుతుంది.
మన ఆత్మకీ పరమాత్మకీ ఎంతటి పవిత్రమైన అవినాభావసంబంధమంటే, దానినుంచి మనకు లభించే సహాయాలను నిరాకరించడం అపచారం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఒకటో రెండో విషయాలు మాత్రమే మాట్లాడడు; అన్ని విషయాలూ మాట్లాడుతాడు. అతని గంభీరమైన కంఠధ్వని విశ్వం యావత్తూ నిండిపోతుంది. వెలుగునూ, సహజతత్వాన్నీ, కాలాన్నీ, ఆత్మస్వరూపాన్నీ, ప్రస్తుత ఆలోచనాకేంద్రకం నుంచి అన్ని మూలలకూ వెదజల్లుతాడు. ఒక పరిపూర్ణత నిండిన దినారంభంగా అది భాసిల్లుతుంది. మనస్సు సరళంగా, నిర్మలంగా, గజిబిజిలేకుండా ఉండి, దివ్యజ్ఞానాన్ని స్వీకరించినపుడు, ప్రబోధకులు, గ్రంధాలు, దేవాలయాలవంటి పాత విషయాలన్నీ మూలపడాల్సిందే. అది ప్రస్తుత క్షణాన్ని పూర్తి జీవంతో నింపుతుంది; భూతభవిష్యత్కాలాలు అందులో కలిసిపోతాయి. దానికి సంబంధించిన అన్నివిషయాలూ పవిత్రతను సంతరించుకుంటాయి - ఒకదానిని మించి వేరొకటి. అన్నివిషయాలూ తమ మూలకేంద్రకంలో విలీనమైపోతాయి. విశ్వాద్భుతంలో ఇతర సాధారణ అద్భుతసంఘటనలు మటుమాయమవుతాయి. అందువల్ల, దేవునితోను, దేవునిగురించి సంభాషింపగలనని, తన సంక్లిష్టపదాల మాయాజాలానికి అలవాటుపడిన ఒక దేశం నించి వేరొక కొత్త దేశానికి వాటిని పరిచయంచేస్తూ ప్రబోధచేసేవారి మాటలు నమ్మకండి. విత్తనం సంపూర్ణంగా అభివృద్ధి చెందిన వృక్షం కంటే అధికమైనదా? తమ జీవసత్వాన్ని ధరించి జన్మించిన శిశువుకంటె అతని తలిదండ్రులు అధికులా? అలాంటప్పుడు గతించిపోయినవాటిని ఆరాధించడం ఎక్కడినించి వచ్చింది? గడచిపోయిన శతాబ్దాలు అత్మయొక్క స్వాధికారానికి, బుద్ధికుశలతకు వ్యతిరేకంగా కుట్రచేస్తుంటాయి. కాలం, స్థలం అనేవి దృగ్గోచరమయ్యే భౌతికాంశాలు; కాని ఆత్మ తేజోమయం. అది ఉన్నసమయమే పగలు. అది గడచిపోయిన సమయం రాత్రి. ఇతిహాసమూ, చరిత్రా, నా వ్యక్తిగత అస్తిత్వానికి, యోగ్యతలకు అన్వయించుకొనవీలులేని పక్షంలో, నాకు అసంబద్ధంగాను, అభూతకల్పన గానే అనిపిస్తుంది.
మనిషి ఇప్పుడు పిరికివాడుగాను, క్షమార్ధిగాను ఉన్నాడు. అతనిలో నిటారుతనం, న్యాయబధ్ధత తగ్గిపోయాయి. "నా ప్రకారం" లేదా "నా ఆలోచన రీత్యా" అనడానికి బదులు ఎవరో పాతకాలపు ఋషివాక్యాన్ని అతను ఎరువుతెచ్చుకుంటున్నాడు. ఒక గడ్డిపోచ లేదా ఒక గులాబీ పువ్వు ముందు అతడు సిగ్గుతో తలదించుకోవల్సి వస్తోంది. నా గవాక్షంలో నిండుగా విరబూసి కనువిందుచేసే నా గులాబీలు తమకు ముందు విరిసిన గులాబీల సొగసును పట్టించుకొనవు. అవి ఈ నాడు పుష్పించాయి; గుబాళిస్తున్నాయి. భగవంతునితో కలసి అలరిస్తున్నాయి. కాలంతో వాటికి నిమిత్తం లేదు. అది, అతి సరళమైన వ్యావహారికంలో, ఒక గులాబీ; అంతే. తన ఉనికి యున్న ప్రతీక్షణం అది పరిపూర్ణమై విలసిల్లుతుంది. పుష్పంగా మారేముందు మొగ్గ సంపూర్ణమైన జీవేచ్చతో, జీవశక్తితో నిండియుంటుంది. పూర్తిగా వికసించిన పూవులో ఆ శక్తి ఎక్కువా ఉండదు, ఆకులు లేని వేరుభాగంలో తక్కువా ఉండదు. అవి తమ ఉనికి ద్వారా తమ స్వకీయ ప్రకృతిని, బాహ్య ప్రకృతిని కూడా సంతృప్తినొనరిస్తాయి - ఉనికిలో ఉండే ప్రతీ క్షణమూ ఒకే విధంగా. కాని మనిషి అలాచేయక జీవితాన్ని వాయిదావేస్తూనో, జ్ఞప్తికి తెచ్చుకుంటునో కాలం గడుపుతాడు. ప్రస్తుత పరిస్థితిలో జీవించక, కనుగుడ్లను వెనక్కితిప్పుకుని గతాన్ని తవ్వుకుని విలపిస్తూంటాడు. లేదా, ఈ క్షణం అందుబాటులో తన చుట్టు ఉన్న సంపదలను గుర్తించక, మునివేళ్ళ మీద నుంచొని భవిష్యత్తులోకి చూస్తూ గడుపుతాడు. అతడు కాలానికతీతంగా, ప్రస్తుత స్థితిలోనే ప్రకృతితో సమంగా జీవించడం నేర్చుకొనని పక్షంలో ఆనందంగాను, శక్తిమంతుడు గాను ఉండబోడు.
అంతా సరళంగా, సులభగ్రాహ్యంగా ఉండాలి. చూడండి భగవంతుడు జెరెమియ్య, పాల్, దావీదు వంటి భక్తుల భాషలో మాట్టాడకపోతే మహా మహా పండితులుకూడా భగవద్వాక్యాన్ని అర్ధంచేసుకొనియుండేవారు కాదు. ఎల్లకాలం మనం కొన్ని పుస్తకాలమీద, కొందరు వ్యక్తుల పైన మాత్రమే ఆధారపడి యుండలేము. చిన్నతనంలో మనం పెద్దలు, గురువులు చెప్పిన వాక్యాల్ని, పెద్దయ్యాక మనం చూసిన, కలుసుకున్న ఇతర గొప్ప వ్యక్తుల వాక్యాలని, అక్షరం పొల్లుపోకుండా ఉన్నదున్నట్టు పలకడంకోసం పదే పదే జ్ఞప్తికి తెచ్చుకుంటూ, వొప్పగిస్తూ, కాలక్రమేణా ఈ వాక్యాల అర్ధం తెలిసి, అవి ఏమంత ప్రయోజనకరం కావని గ్రహించి వాటిని మరిచిపోయే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే, సందర్భం వస్తే మనం కూడా అంతే అర్ధవంతమైన వాక్యాలని ప్రయోగింపగల సామర్ధ్యం కలిగియున్నవారం కాబట్టి. నిష్కపటంగా జీవింపదలస్తే నిష్కపటంగా చూడటం నేర్చుకోవాలి. బలవంతుడు బలవంతునిగాను, బలహీనుడు బలహీనుని గాను జీవించడం సులభమే. మదిలో స్వచ్చందంగా కొంగ్రొత్త ఆలోచన కలిగినప్పుడు మదిలో దానికి వ్యతిరేకమైన పాత తలపుల బరువును వదిలివేయాలి. భగవంతునితో కలిసి సహజీవనం చేయు వ్యక్తి కంఠస్వరం సెలయేటి గలగలల వలె, పైరు కంకులు గాలికిచేసే ధ్వనివలె, శ్రవణపేయంగా, మృదుమధురంగా వుంటుంది.
ఇంతకీ ఈ విషయం లోపలి గొప్ప సత్యం ఇంతవరకు చెప్పనేలేదు. చెప్పవీలులేదేమో. ఎందుకంటే మనం చెప్పగలిగేది జ్ఞాపకాల్లో ఏ లేశమాత్రమో మిగిలిన మన సహజ జ్ఞానాంశాన్నే. వీలయినంత వరకు ఆ ఆలోచనని ఇప్పుడు చెప్ప యత్నిస్తాను. మంచి నీ సమీపంలో ఉన్నప్పుడు, నీవు పూర్ణ జీవశక్తితో నిండియున్నప్పుడు, అది సుపరిచితమైన, అలవాటుపడిన, తెలిసిన మార్గంలో కాదు. ఆ మార్గంలో నీవు ఎరిగినవారి అడుగుజాడలు నీకు అగపడవు. మనిషి ముఖాన్నే నీవు చూడవు. ఏ పేరూ నీకు వినబడదు. ఆ మార్గం, ఆ విధానం, ఆ మంచి పూర్తిగా కొత్తదీ, అపరిచితమైనదీను. అది ఉదాహరణలనూ, పూర్వానుభవాలనూ గణించదు. మనిషి నించి నీవు మార్గాన్ని తెలిసికొనవచ్చుగాక. కాని మార్గానికి గమ్యం మనిషి కాడు. గతించిపోయినవారందరినీ అది మరిచిపోయిన మంత్రులుగా పరిగణిస్తుంది. అదే కోవలో భయం, ఆశా కూడా చేరి యుంటాయి. ఆశ ఇంకా కింది స్థాయిది. స్పష్టమైన సృజనాత్మక జ్ఞానదృష్టి సంభవించినప్పుడు కృతజ్ఞతా, ఆనందమూ అనే భావనలుండవు. క్షుద్రమైన ఉద్వేగాలను అధిగమించిన ఆత్మస్వరూపం బాహ్యంతర ప్రకృతులను అధీనంలోకి తెచ్చుకొని సత్య, ధర్మ భావనల స్వచ్చందమైన ఉనికిని గుర్తెరిగి, తన చుట్టూ సంభవించేవన్నీ సక్రమమే అనే విశ్వాసబలంతో పరిపూర్ణ ప్రశాంతతను అనుభవిస్తుంది. ప్రకృతిలో గొప్ప విస్తీర్ణం కలిగిన, అట్లాంటిక్, దక్షిణ మహాసముద్రాలు, దీర్ఘమైన నిడివికలిగిన కాల ప్రమాణాలు, సంవత్సరాలు, శతాబ్దాలు - ఇవేవీ లెక్కకు రావు. ఈ నా తలపులు, అనుభూతి, గడచిన నా అన్ని ప్రకృతులకు, పరిస్థితులకు, ఇప్పటి నా ప్రస్తుత స్థితికి, జీవ, మృత్యు స్థితులన్నింటిలోను సమానంగా వర్తిస్తాయి.
సమగ్ర జీవితమే ముఖ్యం గాని ఎలా జీవించామన్నది కాదు. కనురెప్పపాటులో శక్తి చేయిదాటిపోతుంది. గురికి అభిముఖంగా వేగంగాపోతున్న ఈటె గమనంలో, దాటిపోయిన దశనుంచి నూతనంగా పొందిన వర్తమాన దశలో అది ఉంటుంది. ఆత్మకూడా ఇదే విధంగా "రూపొందుతూ" ఉంటుంది. అయితే ప్రపంచానికి ఈ వాస్తవం రుచించదు. ఎందుకంటే అది చరిత్రపుటలను శిధిలం చేస్తుంది; సంపన్నులు దరిద్రులవుతారు; ఘనకీర్తి పోయి అవమానం మిగులుతుంది. మహర్షులూ ధూర్తులూ ఒకే పంచన చేరుతారు; జీసస్, జుదాస్ ఒకే పంక్తిలో నిలుస్తారు. మరి మనం "స్వావలంబన" గురించి ఎందుకు మొత్తుకుంటున్నట్టు? ఆత్మ ఉన్నంతవరకు, శక్తి ఉంటుంది - అదీ విశ్వాసపాత్రుడైన బంటులాగ కాక, స్వతంత్రంగా వ్యవహరించే కార్యకర్తలా. నిజానికి స్వావలంబన గూర్చి మాట్టాడటమంటే రసహీనంగా, నిస్సారంగా మాట్టాడినట్టే. దానికి బదులు "విశ్వసించే" శక్తిని గురించి మాట్టాడండి; అది సర్వదా క్రియాశీలకంగా ఉంటుంది. నాకంటే ఎక్కువ వినయసంపన్నుడు నన్ను నియంత్రించగల సమర్ధుడై ఉంటాడు - ఏ సందర్భంలోనూ నన్ను వేలెత్తి చూపించకపోయినా. అంతశ్శక్తుల ప్రభావంచేత అతని చుట్టూ నేను తిరుగాడుతూ ఉండాల్సిందే. ధార్మిక గుణ సంపత్తి గురించి మనం ఎక్కువ అలంకారికంగా వర్ణిస్తాం. ధర్మం అత్యున్నతమైన గుణం, మరియు నీతి నియమాలననుష్టించేవారు కాని, అట్టి సూత్రాలకు బద్ధులు కానివారు కానీ, దాని శక్తి చేత అన్ని నగరాలను, దేశాలను, చక్రవర్తులను, సంపన్నులను, కవీశ్వరులనందరను గెలవగలరు - వీటిలో ఏవీ దాని ఔన్నత్యానికి సాటిరానట్టివి.
ఈ వాస్తవం వద్దకే మనం అంతిమంగా చేరేది - చర్చించే విషయం ఏదైనా, అన్నింటినీ విశదపరిచేది ఒకే ఒక మౌలిక దివ్యాంశం. ఆత్మయొక్క ఉనికి, చరాచర జగత్తుయొక్క సకల చర్యలను వివరింప సమర్ధమైన సర్వశ్రేష్ఠకారణం యొక్క ముఖ్య లక్షణాల్లో ఒకటి. అది మంచితనాన్ని నిర్వచించేటప్పుడు అత్యంత దిగువస్థాయి చేష్టలలో అట్టి మంచి ఏ విధంగా పొందుపడి యుంటుందో, దానిని ప్రామాణికంగా తీసుకుని విశ్లేషిస్తుంది. ఏ విషయమైనా అది ఎంత వాస్తవమనేది, దానిలోని సద్గుణ, స్వచ్ఛతలకనుగుణంగా ఉంటుంది. వాణిజ్యం, వ్యవసాయం, భూమి మరియు జలాల్లోని వేట, యుద్ధాలు, వక్తృత్వం, ఇతరత్రా సముపార్జించుకున్న వ్యక్తిగత గౌరవం - ఇత్యాదులమీద, అవి క్షుద్రాలని భావిస్తూనే, అవి కూడా ఈ దివ్య ప్రభావాన్ని కలిగియున్నవనే కారణంచేత వాటిని నేను గౌరవిస్తాను. ఈ సమన్యాయమే ప్రకృతి పరిరక్షణలోను, వృద్ధిలోను కూడా నాకగపడతాయి. తమను తాము పరిరక్షించుకోలేనట్టివి తన రాజ్యంలో ఉన్నా ప్రకృతికి వాటి వల్ల నష్టమేమీ లేదు. ఒక గ్రహం యొక్క ఆవిర్భావం, పరిణతి, కక్ష్యకు లోబడిమాత్రమే సాగే దాని గమనం లోని స్థిరత్వం, పెనుగాలులకు తలవంచిన వృక్షాలు తిరిగి నిలదొక్కుకునే నైజం, వృక్షజంతుజాలాల్లోని ప్రాణశక్తి, విశ్వాత్మలోని అణువణువుయొక్క స్వశక్తి, స్వావలంబనలను వెల్లడిస్తున్నాయి.
ఈ విధంగా అన్నీ ఒక కేంద్రీకృత సత్యానికి అధీనమై ఉన్నాయి. మన వాద సంచారమిక ఆపవచ్చు. ఎవరి ఇండ్లలో వారు విశ్వకారణ సహితంగా కూర్చోవచ్చు. ఈ దివ్య వాస్తవ శక్తిసహాయంతో పుంఖానుపుంఖాలైన గ్రంథాలని, సంస్థలని, వ్యక్తుల భిన్నవాదనలని నిరసిద్దాం రండి. దాడి చేసే వారిని పాదరక్షలు విడిచి పరిశుద్ధులై నిలువవలసిందని ఆదేశించండి. ఎందుకంటే పరమాత్మ ఇక్కడే, మన హృదయంలోనే ఉన్నాడు కనుక. నిష్కపటమైన సరళత్వంతో వారి గుణగణాలను నిర్ణయిద్దాం రండి. మరియు మనలోనే అంతఃస్థితంగా ఉన్న ఈ విశ్వన్యాయం పట్ల మన వినయసంపన్నత ముందు ప్రకృతి, భాగ్య సంపత్తి దిగదుడుపేనని చాటండి.
కానీ మనం గుంపులో గోవిందయ్యలమయ్యాం. మన స్వశక్తిని గ్రహించక, నేలవిడిచి సాము చేస్తూ మన లోనే అమృతజలభరితమైన అంతఃశక్తిసముద్రాన్ని విస్మరించి ఒక చిన్న డొక్కు తీసుకుని ఇతరుల కుండలలోని నీటికై అర్ధిస్తున్నాం. మన ప్రయాణం ఒంటరిగా సాగాలి. అన్ని ప్రబోధనల కన్న, వాటి ప్రారంభానికి ముందు ప్రశాంతంగా ఉండే దేవాలయంలో ఒంటరిగా గడపడం నాకిష్టం. ఏకాంత ప్రదేశంలో, ప్రశాంత ఆవరణ, ఆశ్రయాలలో ప్రతి ఒక్కరు బాహ్యప్రపంచానికి దూరంగా, ఎంత ప్రసన్నంగా, పవిత్రంగా కనిపిస్తారు! కనుక మనం అటువంటి వాతావరణంలో ఎల్లప్పుడూ కూర్చోవాలి. వారు కూడా నాతో పాటే ఇక్కడ కూర్చొన్నారనే కారణంచేత నా మిత్రుల యొక్క లేదా భార్య యొక్క, లేదా తలిదండ్రుల యొక్క, లేదా పిల్లల యొక్క తప్పులను ఎందుకు నేనూ పైన వేసుకొని వారిలాగే ఎందుకు ప్రవర్తించాలి? అందరిలోనూ నాలో ఉండే రక్తమే ఉంది; నాలో అందరిలోనూ ఉండే రక్తమే ఉంది. అయితే ఆ కారణంచేత వారి బలహీనతలనూ, తప్పులనూ, కనీసం 'ఇలా ఉండకూడదు' అనే మిష మీద కూడా ఎందుకు స్మరించాలి? మీ ఏకాంతం యాంత్రికంగా కాక, ఆధ్యాత్మికోన్నతిని కలిగించాలి. అప్పుడప్పుడు ప్రపంచం యావత్తూ తన రూపొందించుకొన్న హేతురహితమైన నిబంధనలతోను, నియమాలతోను మిమ్మల్ని ప్రభావితం చేయ యత్నిస్తూంటుంది. మిత్రుడు, ఖాతాదారుడు, పిల్లవాడు, రోగం, భయం, కోరిక, ధర్మం - అన్నీ నీ తలుపును తట్టి, 'పద మాతో' అని ఆహ్వానిస్తూంటారు. కానీ నీ సహజ తత్వాన్ని, స్థితిని వదులుకోవద్దు. వారి గందరగోళంలోకి అడుగిడవద్దు. నన్ను విసిగించే శక్తి ఇతరులకుంటే, వారి పట్ల ఉదాశీనత కనబర్చడంద్వారా వారిని తిరస్కరించే సమర్ధత నాకూ ఉంది. నా ప్రమేయం లేక నన్నెవరూ సమీపింపబోరు. మనకు కలిగినదానిని మనం ప్రేమిస్తాం; కాని తృష్ణచే, పేరాసచే, ఆ ప్రేమను మనం దూరం చేసుకుంటాం.
ఒక్కసారిగా వినయ, విశ్వాస గుణాల పవిత్రతనంద శక్యం కాకపోతే, ఆకర్షణలను అదుపుచేసుకోనారంభించాలి. యుద్ధోద్యుక్తులమై - థోర్, వోడెన్లను వలె, ధైర్యాన్నీ దృఢత్వాన్నీ మేల్కొలపండి. నిత్యవ్యవహారాల్లో సత్యవచన దీక్షా పాలన ద్వారా ఇది ఒనగూరుతుంది. అబద్ధపు మర్యాదలు, మొక్కుబడి అభిమానాలను గమనిస్తూండండి. మన నిత్యవ్యవహారాలలో తారసపడే ఇట్టి మోసగించే, మోసపొయ్యే వారి నించి ఏమీ ఆశించకండి. వారితో ఈ విధంగా పలకండి - ఓ తండ్రీ, ఓ తల్లీ, ఓ ధర్మపత్నీ, ఓ సోదరా, ఓ మిత్రుడా, నేను ఇంతవరకు మీ బాహ్యస్వరూప, ప్రకృతులను బట్టి వర్తించాను. ఇకపై నేను సత్యానువర్తిని మాత్రమే. ఆ నిత్యసత్య న్యాయనిబంధనలు తప్ప మరేవీ నాకు వర్తించవని మీరు గ్రహింతురు గాక. నాకిక ఎవ్వరితోను ఏ విధమైన ఒడంబడికలూ లేవు; ఉన్నది సాన్నిహిత్యం మాత్రమే. నా తల్లిదండ్రులను పోషించుట, కుటుంబావసరమైన బాధ్యతలను నెరవేర్చుట, నా భార్యకు నిష్కళంకుడైన భర్తగా జీవించుట అనే కర్తవ్యాలను తప్పక నిర్వహిస్తాను - కాని ఇంతమున్నెన్నడెరుగని ఒక విభిన్న రీతిలో. మీ కట్టుబాట్లనించి నాకు విముక్తినివ్వండి. నేను నేనుగానే కొనసాగుతాను. మీరుగా గాని, మీకొరకుగాని జీవించే నిమిత్తం నన్ను నేను అతిక్రమించలేను. నన్ను నన్నుగా మీరు ప్రేమించగలిగితే మనమిరువురం ఆనందంగా ఉండగలము. కానిపక్షంలో కూడ, మీరు ఆ విధంగానే నాతో మెలగవలెనని ఆశించే హక్కు నాకున్నది. నా ఇష్టాయిష్టాలను నేను దాచుకోను. అంతరంగంలోని పవిత్రతను నేనెంతగా విశ్వసిస్తానంటే, హృదయానికి ఆనందమైనదని అనిపించిన ఏ పనైనా సూర్యచంద్రుల సాక్షిగా నేను ఆచరించడానికి సిద్ధం. నీవు ఉదారుడవైతే నిన్ను నేను ప్రేమిస్తాను. నీవట్టివాడవు కాకపోతే నేను నా నయవంచక మెచ్చుకోళ్ళతో నిన్నూ నన్నూ కూడా గాయపర్చలేను. నీమటుకు నీవు సత్యాచరణపరుడవై, అది నేను విశ్వసించే సత్యం కాకపోయినట్లయితే, నీ అనుయాయులను నీవు వెదుక్కోవడం మేలు; నేను నాకు తగ్గ వారిని చూసుకొంటాను. అది నేను స్వార్ధంతో కాక, వినయంతో, నిజాయితీతో చేస్తాను. అది నీకూ, నాకూ, మిగతా అందరికీనీ, మనమందరం సత్యసంధతతో జీవించియున్నంతవరకు, ప్రయోజనకారి. ఈనాడు ఇది కరకుగా అనిపిస్తోందా? త్వరలోనే ప్రకృతి, మరియు నేను, నేర్పే ఈ పాఠాలను నీవు కూడా ప్రేమించనారంభిస్తావు, ఆ సత్యాన్ని మనం ఆచరించినట్లయితే అది మనను సురక్షితమైన తీరానికి చేరుస్తుంది. మిత్రుల మనోభావాలు తాత్కాలికంగా గాయపడి యుండవచ్చుగాక. కాని వారి భావోద్వేగాలను సంతృప్తిపర్చడానికి నేను నా స్వేచ్చనీ శక్తినీ ధారపోయలేను. మరియు, ప్రతివ్యక్తి జీవితంలోనూ ఒకప్పుడు యదార్థాన్ని గ్రహించే క్షణం వస్తుంది. ఆ సమయంలో వారు అతి దివ్యమైన సత్యాన్ని స్పష్టంగా గ్రహిస్తారు, అప్పుడు నన్ను పరిపూర్ణంగా అర్ధంచేసుకుని నా మార్గాన్నే వారూ అనుసరిస్తారు.
నలుగురూ పాటించే నియమాలను లెక్కచెయ్యకపోవడమంటే అసలు ఏ నియమాలూ లేకపోవడమని, రెటమతమని, ఒక విశ్వాసాన్ని పట్టుకువేళ్ళాడుతూ అన్ని కట్టుబాట్లనూ నిరసించడమని జనసామాన్యం భావిస్తారు. ఇంద్రియలోలుడు తన తప్పిదాలను మతం మరుగున దాచిపెడుతూంటాడు. జ్ఞాన సూత్రాలు మాత్రం ఎల్లప్పుడూ నిలకడగా ఉండేవి. మన తప్పులనొప్పుకోవడానికి రెండు గదులు ఉన్నాయి - ఎదో ఒక దానిలో మనం నిజాయితీగా ఉండక తప్పదు. ప్రత్యక్ష మార్గంలో సూటిగా మన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చని పక్షంలో, పరోక్ష మార్గంలో, ప్రతిక్రియా రూపంలో దానిని మనం నెరవేర్చవలసి యుంటుంది. తండ్రి, తల్లి, చుట్టం, పొరుగువారు, ఉన్న ఊరు, పెంపుడు పిల్లి, కుక్క; వీటన్నిటిపట్ల మీ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చేరా, లేదా వీరిలో ఎవరైనా ఈ విషయంలో మిమ్మల్ని తప్పుపడుతున్నారా అన్నది ఆలోచించండి. నేనైతే ఇట్టి ప్రతిస్పందనలని లక్ష్యపెట్టక, నాకు నేనే అన్నట్లు ప్రవర్తిస్తాను. నా యోగ్యతలు నాకున్నాయి, నా వర్గం నాకున్నది. విద్యుక్తధర్మాలని సామాన్యంగా పేర్కొనబడేవేవీ ఇక్కడ ధర్మాలుగా పరిగణించబడవు. కానీ దాని బాకీని నేను చెల్లిస్తే అది నాకు తన న్యాయకోశపు పరిధిలోనుంచి మినహాయింపునిస్తుంది. ఎవరికైనా ఈ న్యాయం బలహీనమైనదని తోస్తే ఒక రోజు దాని శాసనాన్ని ఆచరించి చూడండి.
ఏమాటకామాటే - మానవనిర్మిత సామాజిక నియమాలను ధిక్కరించి స్వాధికారాన్ని ప్రకటించి స్వశక్తిపై అచంచల విశ్వాసం కలిగియుండాలంటే దైవాంశ మనలో ఉండాల్సిందే. అట్టి వ్యక్తి హృదయం అత్యున్నతం, మనఃశక్తి విశ్వసనీయం, దృష్టి దోషరహితం అయి వుండి, అతడే, తనకు తానుగా ఒక దివ్యోపదేశం, సమాజం, చట్టంగా తేజరిల్లుతూ, జన సామాన్యం అతి క్లిష్టమూ, కఠినతరమూ అని భావించే ధర్మపరిపాలనను అతడు అతి మామూలుగా, సునాయాసంగా ఆచరిస్తాడు.
సమాజపోకడను ప్రముఖంగా గణించే వారికి అది విధించిన నీతిసూత్రాల అవసరం బలీయంగా ఉంటుంది. హృదయాలూ నరాలూ పీకివేయబడ్డవా అన్నట్టు ఎటుచూసినా పిరికితనం, నిరాశల మూలుగులే వినవస్తున్నాయి. మనకి నిజమంటే భయం, విధి అంటే భయం, చావంటే భయం, ఒకరినిచూస్తే ఇంకొకరికి భయం. మనయుగం గొప్పవారిని, ఉత్తములని తయారుచెయ్యలేదు. మన జీవనవిధానాన్ని ఆధునీకరించి మన సామాజిక హోదాని పెంచే స్త్రీ పురుషులకోసం వెదికే పనిలో మనం ఉండగా, మనకు తారసపడుతున్నది తమ సహజ ప్రకృతిని ఎప్పుడో కోల్పోయినవారు, తమ వాంఛలను తామే తృప్తి పరచుకోలేనివారు, తమ శక్తిసామర్ధ్యాలకు అసంభవమైన ఆశయాలను కలిగియున్నవారు, రేయింబవళ్ళు కుంటుతూ దేబిరించేవాళ్ళూను. మన కాపురాలు బైరాగిమఠాల్లా ఉంటే, మన కళలు, వృత్తులు, వివాహాలు, ధర్మాలు సమాజం మనకోసం ఏర్పరచినట్టివి. మనం వంటింటి సైనికులం. విధికీ మనకీ కఠిన పోరాటం జరిగే యుద్ధభూమిలో మనకు విశేషంగా శక్తి లభించాల్సి ఉండగా, దానికి వెన్నిచ్చి మనం పారిపోతున్నాం.
మన యువ ఔత్సాహికులు ప్రథమ పరాజయంతోనే డీలా పడిపోతున్నారు. ఒక కుర్ర వ్యాపారి నష్టపోతే, 'వాడు నాశనమైపోయేడం' టాం. మన కళాశాలలో చదువు పూర్తిచేసుకున్న మెరుగైన విద్యార్ధి ఏడాది తిరిగేలోగా బోస్టన్‌లోనో న్యూయార్క్ లోనో ఉన్న ఎదో ఒక పేరొందిన కార్యాలయంలో ఉద్యోగం సంపాదించలేకపోతే అతనికీ అతని మిత్రులకీ కూడా అతను మనసు విరిచేసుకోవడం, ఆజన్మాంతం దీన్ని తలచుకుని దుఃఖించడం సరైన పనిగానే అనిపిస్తుంది. వేరొక గట్టి యువకుడు, ఇదీ అదీ అనక చేతనైన అన్ని రకాల జీవనోపాధి వృత్తుల లోనూ శ్రమించి, జతకట్టి, సాగుచేసి, వీపుపై మోసుకు తిరిగి, పాఠశాల స్థాపించడం, బోధనలు చేయడం, వార్తాపత్రిక నిర్వహించడం, రాజకీయరంగం వైపు కూడా ఓ కన్నేసి నాయకుడై చట్టసభలో అడుగుపెట్టడం, బస్తీని సొంతంచేసుకోవడం లాంటి విభిన్న రకాల విజయాలను చవిచూసి, తదుపరి సంవత్సరాలలో క్రమక్రమంగా విహారాలు తగ్గి తన సొంత పాదాల మీద, పై నించి పడే పిల్లి మాదిరిగా సురక్షితంగా నిలదొక్కుకుని, పైన చెప్పిన వందలాది మంది పట్నపు బొమ్మల కన్న వెయ్యి రెట్లు సమర్ధుడుగా నిరూపించుకుంటాడు. అతడు కాలాన్ని అధిగమించి దూసుకెళ్తూ, సాటి ఇతర యువకుల్లాగా సాంకేతిక విద్యను శాస్త్రోక్తంగా అభ్యసించలేదని బిడియపడక, తద్వారా జీవితాన్ని వాయిదా వేసుకోవడం మాని పరిపూర్ణమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ఎప్పటికప్పుడు అనుభవిస్తూంటాడు. అతనికి అవకాశం ఒకటి కాదు - వందలు. జీవిత పరమార్ధాన్ని సంపూర్ణంగా ఎరిగిన సర్వసంగపరిత్యాగి ఎవరైనా, మనం వృక్షాలమీద వాలిపోయే పాదులమాదిరిగా జీవించడానికి సృజించబడలేదని, బయటినించే వచ్చే సహాయాలనర్ధించక, అన్ని ఆసరాలనుండి విడువడవలసిందని, ఆత్మవిశ్వాసాన్ని విడువక సాధన చేస్తే నూతన శక్తులు లభిస్తాయని, మనిషి అంటే రక్తమాంసాదులతో నిర్మించబడిన శబ్దశక్తి అని, అతడు ప్రపంచముఖం నుంచి దుఃఖాన్ని తీసివేయగల సమర్ధుడని, ఇంతకాలం పరుల దయాభిక్షకై ఎదురుచూసినందుకు సిగ్గుపడవలసిందని, అన్ని గ్రంథాలు, పూజా విధులు, కట్టుబాట్లను కిటికీగుండా బయటికి తోసేసి తాను తానుగా జీవించనారంభించినప్పుడు అతనికి ఎవరి దయా అవసరం లేదని, పైగా అతడు సకల జనులకూ ఆరాధ్యుడవుతాడనే వాస్తవాన్ని వివరించి, మనిషి పూర్వవైభవాన్ని తిరిగి పునఃప్రతిష్టించి ప్రపంచ చరిత్రలో అతని కీర్తిని శోభిల్లజేయాలి.
ఆత్మవిశ్వాసాన్ని విశేషంగా అభ్యసించినవారికి దాని ప్రభావం వారి అన్ని దైనందిన వ్యాపారాలలోను - అంటే తన ఉపాధివృత్తి, ఇతరులతో తన సంబంధాలు, ధర్మాచరణ, విద్యాభ్యాసం, నూత్న యత్నాలు, జీవన విధానం, సంఘజీవనం, సంపద, మరియు అభిప్రాయసరళి - ఇత్యాదులలో ప్రకాశిస్తూంటుంది.
(1) మనుషులు ఎటువంటి ప్రార్ధనలు చేస్తూంటారు !! వారు దివ్యమని, పవిత్రమని భావించే ప్రార్ధనాలయం ఏమంత ధైర్యస్థైర్యాలు కలిగినది కాదు. ప్రార్ధన ఎప్పుడూ పైకి చూస్తూ ఎవరో అపరిచిత శక్తులకు ఎవేవో అస్పష్టమైన కోరికలను నివేదించుకుంటూ, ప్రకృతిసిద్ధమూ ప్రకృతిబాహ్యమూ అయిన విషయచింతనల గందరగోళంలో తనను తాను కోల్పోతూ, మధ్యేమార్గాన్ని అవలంబించి ఎప్పటికైనా ఎవో అద్భుతాలు జరగకపోతాయా అని ఎదురుచూస్తూ గడచిపోతుంది. లోకకల్యాణంకోసం తప్ప వేరే కోరికలతో చేసే ప్రార్ధన ఏదైనా క్షుద్రమూ దోషభూయిష్టమూనూ. ప్రార్ధన అంటే జీవిత వాస్తవాలను ఉన్నత స్థాయి దృక్కోణం నించి ధ్యానించడం. అది ఉల్లాసకర హృదయంతో వీక్షకుడు అంతర్గతంగా మాట్లాడుకునే స్వగతం. ఒక దివ్యచైతన్యం భగవంతుని లీలలలోని శ్రేష్ఠతను వివరించే ప్రకటన. అంతేకాని ఒక స్వార్ధప్రయోజనాన్నాశించి చేసే ప్రార్ధన దొంగతనమూ, నీచకార్యమూ అనిపించుకుంటుంది. అది ప్రకృతి చైతన్యంతో ఐక్యతను సాధించడానికిమారుగా, అగమ్యగోచరమైన ద్వంద్వతను కలిగిస్తుంది. సృష్తికర్తతో ఐక్యతనొందినవారు భిక్షమెత్తనక్కర్లేదు. వారికి తాము ఆచరించే ప్రతి పనీ ప్రార్ధనే. కలుపుతియ్యడానికి పొలంలో వ్యవసాయదారుడు, తెప్ప ముందుకు సాగేందుకు తెడ్డును లాగేందుకు పడవవాడూ మోకరిల్లి చేసెవి ప్రార్ధనలే - అయితే అల్ప ప్రయోజనార్ధమేననుకోండి. ఫ్లెచర్ రాసిన ఒక నాటకంలో పాత్రధారి ఆధ్యాత్మికచింతనలో జీవించవలసిందని తనను ఎవరో మందలించినప్పుడు ఇలా చెప్తాడు - "ఆతడుద్దేశించిన గూఢార్ధం మన నిత్య కార్యాల్లోనే ఉంది. మన శౌర్య ప్రతాపాలే మన దైవాలు".
ఇంకోరకం దోషభూయిష్ట ప్రార్ధనకు ఉదాహరణ మన చింత, వ్యాకులత. అసంతృప్తి ఉన్నచోట ఆత్మవిశ్వాసం కొరవడినదని అర్ధం. దుస్సంఘటనల గురించి దుఃఖించండి - మీ దుఃఖం బాధితుల బాధను తొలగిస్తుందని మీకు నమ్మకం ఉన్నఫ్ఫుడు. లేదా, మీ పనులలో మీరు నిమగ్నులు కండి. బాధ అప్పటికే మానడం ఆరంభిస్తుంది. మన పరామర్శలూ మొసలికన్నీళ్ళ వల్ల ఆట్టే ప్రయోజనం లేదు. అజ్ఞానంతోనో, ఉద్వేగంతోనొ దుఃఖిస్తున్నవారివద్దకు మనం చేరి, పరుషమైనా సరే సత్యవచనాలతో వాస్తవాన్ని వారికి బోధించి, వారి సహజ లక్షణాలయిన హేతుశోధన, యుక్తాయుక్తవివేచనను తిరిగి వారి ఆలోచనలతో సంధించి వారిని ఆరోగ్యవంతులుగాను, శక్తిమంతులుగాను చేయుటకు మారుగా, తోడుకోసమా అన్నట్టు యుగళశోకం ప్రారంభిస్తాం. మన వశంలో ఉన్న ఆనందమే మన భాగ్యం. తనకు తాను సహాయపడు వ్యక్తి ఎల్లప్పుడు దేవతలను, సాటిమనుషులను ఆకర్షిస్తూ, ఆహ్వానిస్తూ ఉంటాడు. అతనికి అన్ని వైపులనుంచీ బార్లా తెరవబడిన తలుపులతో ఆహ్వానాలు అందుతూంటాయి. అన్ని నోళ్ళు అతనిని అభిమానంగా పలకరిస్తూంటాయి; ఎక్కడికెళ్ళినా సన్మాన మకుటాలు అతని శిరస్సునలంకరిస్తూంటాయి. తహతహతో అన్ని కన్నులు అతనిననుసరిస్తూంటాయి. మనందరి ప్రేమ అతడిని చేరి అతడిని ముంచివేస్తుంది - ఎందుకంటే అతనికి అది అక్కరలేదు కనుక. మనం అత్యంత గౌరవాభిమానాలతో అతడిని అనుసరిస్తూ కొనియాడుతూంటాం, ఎందుకంటే అతడు మనల్ని అతడిపట్ల మన అనంగీకృతులనూ అసలు లక్కచెయ్యకుండా తన మార్గంలో తాను సూటిగా, పరిపూర్ణ శ్రద్ధ మరియు విశ్వాసాలతో నడచిపోతుంటాడు. మనుష్యులు అతడిని అసూయతో ద్వేషిస్తారు కనుక భగవంతుడు అతనిని ప్రేమిస్తాడు. జొరాస్టర్ అన్నట్టు, "పట్టువదలని నశ్వరుడైన మానవుడికి అనుగ్రహప్రదాతలు, అనశ్వరులు అయిన దేవతలు సులభ సాధ్యులు".
ప్రార్ధనలు ఎలాగయితే చిత్తశక్తికి పట్టిన జాడ్యమో, మతవిశ్వాసాలు బుద్ధికి పట్టిన చీడ అని చెప్పుకోవచ్చు. వారు ఇజ్రాయీలతో అన్నారు కదా - "భగవంతుడు మాతో మాట్లాడవద్దు. మాట్లాడితే మసైపోతాం. మీవంటి మనుషులు, లేదా ఎవరైనా సరే - మాట్లాడండి, మీరు చెప్పినట్టు వింటాం" అని. ప్రతిచోటా నేను నా సోదరునిలో భగవంతుని చూద్దామనుకుని చూడలేకపోతున్నాను. ఎందుకంటే అతడు తన హృదయ ద్వారాలు మూసేసుకుని తన సోదరునివో, తన సోదరుని సోదరునివో అయిన ప్రార్ధన వాక్యాలు వల్లె వేస్తూంటాడు. ప్రతి కొత్త మేధస్సూ ఒక కొత్త వర్గం. దానికి ఒక లాకె, లెవోయిజర్, హటన్, బెంథం, ఫరియర్ లకు వలె అసాధారణ ప్రజ్ఞా, చైతన్యం, శక్తి తోడయ్యాయంటే తన వర్గలక్షణాన్ని ఇతర వ్యక్తులకూ బదిలీ చేస్తుంది, ఇక చూడండి ! ఒక కొత్త వ్యవస్థ. వ్యక్తి ఆలోచనా శక్తి ఎంత లోతుకు పోగలుగుతుందో, ఎన్నెన్ని రకాల విషయవస్తువులను తన కనుగుడ్ల పరిధిలోనికి తెచ్చుకుంటుందో, స్పృశిస్తుందో, అతని కృతార్ధత అంత ఉన్నతం. ఇది ముఖ్యంగా దేవాలయవ్యవస్థలలోను మతవిశ్వాసాలలోను కనిపిస్తుంటుంది. ఒక ప్రభావవంతమైన బుద్ధి విశేషం మనిషి యొక్క కర్తవ్యం, పరమాత్మతో అతని బాంధవ్యం, మరియు జీవితసత్యాల పైన తదేకంగా నిమగ్నం చేసిన చింతన ఈ రకం వర్గసమూహకర్తలను సృజిస్తుంది. ఉదాహరణకు కాల్వినిజం, క్వేకరిజం, స్వీడెన్ బోర్గిజం వంటివి. ప్రారంభదశ విద్యార్ధులు తమ చుట్టూ కనిపించే అన్నివిషయాలను తాము కొత్తగా అక్కునచేర్చుకున్న ఈ వినూత్న సిద్ధాంతకోణం నుంచి చూడనారంభిస్తారు - వృక్షశాస్త్రంలో కొత్త పాఠాలు నేర్చుకున్న అమ్మాయి ఈ భూమిని, తన పరిసరాలలోని చెట్టుచేమలను, ఋతువులలోని మార్పులను తొలిసారి అర్ధంచేసుకుని ఆశ్చర్యకరంగా అవగతంచేసుకున్నట్లు. కొన్ని సందర్భాలలో ఆ విద్యార్ధికి తాను అవలంబించే కొత్త తాత్వికత ప్రారంభంలో ఒకానొక జిజ్ఞాసువు మనస్సులో చిగురించిన ఆలోచనాంకురం అని తెలుస్తుంది. కాని నిలకడలేని బుద్ధులు కలిగిన జనసామాన్యం, ఇట్టి వినూత్న ఆలోచనావిశేషాన్ని దిగంతాలకావల శోభించే పరంజ్యోతిని దర్శించుటకవసరమైన దివ్యదృష్టిని ఒసగే సాధనంగా ఎరుగక, దానినే పరమావధిగా భావిస్తూ, దానికి విగ్రహరూపకల్పనలూ ఆరాధనలూ చేస్తూ కాలం గడుపుతారు. వారు స్వర్గం లోని స్వయంప్రకాశక తేజోరూపాలు తమ నాయకుడు తన ఇంటి కోటగుమ్మానికి తగిలించిన అలంకరణలుగా భావిస్తారు. "ఇంత ప్రకాశం మీకెలా వచ్చింది? మీరు మా వర్గం నించి దాన్ని సంగ్రహించి యుంటారు" అని ఆ కాంతిస్వరూపాలతో వారు పోట్లాడతారు. ఒక నిర్దిష్ట పద్ధతి అంటూలేని, ఏ విధమైన అడ్డంకులను లెక్కజేయని ఆ తేజస్సు చొరరాని ప్రదేశం అంటూ ఏదీ లేదని, అది తమ ఇండ్లను కూడా ప్రకాశవంతం చేయగలదనే సత్యాన్ని వారు గ్రహించరు. సరే కొంతసేపు వారినలాగే కిచకిచలాడనిచ్చి అది వారిదేనని అనుకోనివ్వండి. వారే గనక నిజాయితీ, నిబద్ధతలతో సాధన చేస్తే ప్రస్తుతం వారిది అనుకొంటున్న ఈ కొట్టం ఇరుకుదై, సన్ననిదై, పగుళ్ళిచ్చి, ఒరిగిపోయి, శిధిలమై, మాయమైపోయి, దాని స్థానంలో శాశ్వతమైన, మహాప్రకాశవంతమైన కాంతిపుంజం, దివ్యోల్లాసాన్ని కలిగించే నూత్నత్వంతో, విశ్వం యావత్తూ వ్యాపించి శతకోటి కిరణాలతో, సహస్రకోటి వర్ణమిశ్రమాలతో తొలిపొద్దు సూర్యకిరణాల మాదిరిగా సృష్టినంతటనూ వెలుగులతో నింపుతుంది.
(2) ఆత్మ సంస్కారం కొరవడిన కారణంచేత పర్యటన అనే మూఢవిశ్వాసం ప్రబలి ఈటలీ, ఇంగ్లాండు, ఈజిప్టు వంటి స్థలాలు మన అమెరికన్ విద్యావంతులను మురిపిస్తున్నాయి. ఊహలలో ఇటలీ, ఇంగ్లండు, గ్రీసు లను ఆరాధ్యప్రదేశాలుగా నిలిపినవారు భూమి యొక్క అక్షం వలె తాము ఉన్నచోటినుంచి కించిత్తుకూడా కదలకుండా స్థిరంగా ఉండి ఈ విధమైన రూపకల్పనలు చేశారు. వీరోచిత సమయాల్లో కార్యస్థలమే మనకు దర్శనీయమని మనం భావిస్తాం. మన అంతరాత్మ ప్రయాణీకుడు కాదు. విజ్ఞుడైన వ్యక్తి ఇంటనే ఉండి అవసరమో, కర్తవ్యమో బయటకు వెళ్ళవలసిన పరిస్థితి కలిగించినప్పుడు, బయటకు వెళ్ళి కూడా ఇంటివద్దనే ఉన్నట్టుగా, తన కనుసైగలద్వారా, భావప్రకటన ద్వారా తనపట్ల బయటివారు సహృదయతో ప్రవర్తించుతూండగా, తన ధర్మ, జ్ఞాన సంపదలు తోడురాగా, ఒక సార్వభౌమునివలె నగరాలను దర్శిస్తాడే తప్ప నక్కి నక్కి బెరుకు బెరుకుగా సంచరించే అతిక్రమణదారుడిలాగో, యజమాని వెంట నడిచే నౌకరులాగో కాదు.
భూప్రదక్షిణను మరీ మోటుగా, అడ్డగోలుగా వ్యతిరేకించే ఉద్దేశం నాకులేదు. కళాభిరుచి, జ్ఞానసముపార్జన, ధర్మకార్యాదులు వంటి నిర్దిష్ట ప్రయోజనాలకోసం, మరియు కేవలం కొత్తప్రదేశం కావడం వలన తనకు తెలియని గొప్ప విషయాలేవేవో తెలిసిపోతాయన్న భ్రమతో ప్రయాణం కట్టేకన్న, ముందు అట్టి ప్రదేశాల సమాచారంతో వాటిని మచ్చిక చేసుకొని మరీ చేసే పర్యటనలు అర్ధవంతమయినవి. వినోదోల్లాసాలకోసం, తనకు అప్పటికే తెలియని దానిని తెలుసుకొనే నిమిత్తం ప్రయాణాలు చేసేవాడు ముందుగా తననించి తానే దూరంగ ప్రయాణించి, యౌవనదశలోనే ముసలితనాన్ని పొందుతాడు. థిబిస్, పాల్మైరా వంటి పురాతన స్థలాల వలె తన బుద్ధీ హృదయం కూడా పాతబడి పాడుబడతాయి. ఆ విధంగా అతడు శిధిలాల వద్దకు శిధిలాలను తీసుకువెళతాడు.
నిరంతర సంచారం మూర్ఖుల స్వర్గం. మన తొలి ప్రయాణాల వల్లనే మనకు తెలుస్తుంది - ఆ ప్రదేశాలకు వాటిని దర్శించేవారిపై ఏమాత్రం అపేక్షలేదు సరిగదా, వారిపట్ల ఉదాశీనత కనబరుస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడు నేపుల్స్, రోము వంటి నగరాలు తమ సౌందర్యశోభతో నన్ను మైమరపింపజేస్తాయని, అక్కడ నా విచారమంతా మాయమయిపోతుందనీ అనుకుని నా రేకుపెట్టే బేడా సర్దుకుని, సాగనంపే మిత్రుల ఆలింగనాలు, ఎగసిపడే సాగర తరంగాలమధ్య ఊయలలూగే ఓడనెక్కి నేపుల్సులో మేల్కాంచి చూద్దును గదా - నా పక్కనే తిష్టవేసుక్కూర్చుంటుందొక నిష్టుర సత్యం, విచారగ్రస్త అంతరాత్మ, నన్ను విడువక, నేను దేన్నుంచయితే పారిపోయివచ్చానో సరిగ్గా దానిలాంటిదేను. నేను వ్యాటికన్ ను, దాని రాజభవనాలను చూడనభిలషిస్తాను. వినూత్న దృశ్యాలు, కొంగ్రొత్త ఆలోచనల ఆనందం నాకు మైమరపు కలిగిస్తుందని నేను ఆశిస్తాను గానీ నాకలాంటి మత్తేమీ కలగదు. నా దయ్యం నేనెక్కడికి వెళితే అక్కడికే వచ్చి చస్తుంది.
(3) కాని ఈ ప్రయాణోన్మాదం అనేది మేధాశక్తిలో నిగూఢంగా ఉండే అనారోగ్యానికి సూచన. అసలు బుద్ధియే దేశద్రిమ్మరి వలె నిరంతర సంచారం చేస్తూంటుండగా, మన విద్యావిధానం ఆశాంతిని, అలజడినీ ఎగదోస్తూంటుంది. విధిలేక మన దేహాలు ఇంట్లో పడి ఉంటే, మన మనస్సులు విచ్చలవిడిగా ఎక్కడెక్కడికో చక్కర్లు కొడుతూంటాయి. మనం అనుకరిస్తూంటాం; అనుకరణ అంటే మనస్సు చేసే ప్రయాణమే కదా? మన గృహాలు పరదేశీయ పోకడలతో నిర్మించుకుంటాం. ఇంటిలో గూళ్ళనిండా విదేశీయ వస్తువులను అలంకరణగా అమర్చుకుంటాం. మన అభిప్రాయాలు, అభిరుచులు, మన శక్తిసామర్ధ్యాలు ఎన్నడో గతించిన వాటిని, సుదూర తీరాల కావలనున్న వాటిని ఆసరాగా చేసుకుని సాగుతూంటాయి. కళలు, అవి ఎక్కడయితే దేదీప్యమానంగా పరిఢవిల్లుతాయో అక్కడ సృష్టించబడతాయి. కళాకారుడు సృజించబోయే కళారూపం ప్రప్రథమంగా అతని మనస్సులో రూపుదిద్దుకుంటుంది. తన ఆలోచనలను తను చేపట్టబోయే సృజనపైన, దాని దశలవారీ రూపాంతరం పైన కేంద్రీకరిస్తాడు. మనం గోథిక్, డోరిక్ లేదా మరేదో నమూనాలనెందుకు అనుకరించాలి? సౌందర్యం, వెసులుబాటు, ఆలోచనలయొక్క శోభ, భావవ్యక్తీకరణలో చమత్కారం మిగతా అందరికిలాగే మనకి కూడా చాలా అందుబాటులో ఉంటాయి. మన అమెరికన్ కళాకారుడు, అప్పటి వర్తమానంలో తనకందుబాటులో ఉన్న మట్టి, వాతావరణం, ప్రజల అభిరుచులు, చేతిలో ఉన్న సమయం, పాలకుల వ్యవహారశైలి మున్నగు అంశాలను దృష్టిలో ఉంచుకుని తను చేయబోయే పనిని నమ్మికతోను, ప్రేమతోను అధ్యయనం చేస్తే, తాను కూడా అన్నివిధాలుగా అనుకూలం, వాసయోగ్యమైన చక్కని గృహాన్ని నిర్మించగలడు, మరియు అతని అభిరుచి, మనోభావం కూడా సంతృప్తిచెందుతాయి.
పట్టుబట్టి మరీ మీరు మీలాగ జీవించండి కాని అనుకరణ వద్దు. మీ స్వంత ప్రజ్ఞను మీరు అనుక్షణం బ్రహ్మాండంగా ప్రదర్శించగలరు, చిరకాల పరిశ్రమఫలితంగా సంచితమైన కౌశలంతో సహా. కాని ఎవరి వద్దనించో ఎరువు తెచ్చుకున్న ప్రతిభ మీద మీకు ఎదో కొంత ఆశుమాత్రం, అరకొర ప్రమాణపు స్వాధీనం మాత్రమే ఉంటుంది. మీరు ఏది బాగా చెయ్యగలరో మీ సృష్టికర్త మాత్రమే నిర్ణయిస్తాడు. అదేమిటన్నది సదరు వ్యక్తి ప్రదర్శిస్తే తప్ప ఎవరూ తెలుసుకోలేరు. షేక్‌స్పియర్ కు బోధించిన గురువు ఎవరై ఉంటారు? అదేవిధంగా ఫ్రాంక్లిన్, న్యూటన్, బేకన్, వాషింగ్టన్లకు విద్యాబుద్ధులు నేర్పిన వారెవరు? ప్రతి గొప్ప వ్యక్తీ అద్వితీయుడే. సిపియో తన "సిపియోనిత్వా" న్ని మాత్రం వేరే వారివద్దనించి ఎరువు తెచ్చుకొనలేడు. షేక్‌స్పియర్ రచనలను చదివి షేక్‌స్పియర్ తయారవలేడు. మీకై నిర్దేశించబడినదానిని, పెద్దగా ఆశ లేకపోయినా, ధైర్యం లేకపోయినా సరే, ఆచరించుట ప్రారంభించండి. ఆ క్షణంలో మీకు ఒక ధీరోదాత్తమైన మహా వాక్యం వినవస్తుంది - ప్రముఖ శిల్పి ఫిడియాస్ ఉలి శబ్దంలా, ఈజిప్షియన్ల నిర్మాణంలో ప్రముఖమైన తాపీ ధ్వనిలా, మోజెస్ లేదా డాంటే కలం లా, కానీ వీటన్నింటికంటె విభిన్నంగా. అయితే అతి ఘనంగా, చతురంగా, వేయినాలుకలతో అంతరాత్మ ప్రతిసారి తనను తాను ప్రకటించుకోకపోవచ్చు; కాని మీకు పెద్దల మాటలు వినబడడం అంటూ జరిగితే, అదే స్థాయిలో వారికి మీరు సమాధానమివ్వగలరు. ఎందుకంటే నాలుక, చెవి రెండూ ఒకే స్వభావం కలిగిన ఇంద్రియాలు. మీ జీవితంలోని సరళమైన, ధార్మికమైన అంశాలలో నిరంతరం వసించండి, మీ హృదయానికి విధేయులుగా ఉండండి, మీరు విశ్వాన్ని పునః సృష్టిచెయ్యగలరు.
(4) మన మతధర్మం, విద్య, కళ పరప్రాంత దిశగా చూస్తుంటే, మన సామాజిక స్పృహ కూడా అదే చేస్తుంది. అందరూ సమాజం పురోభివృద్ధి చెందితే తద్వారా తాము బాగుపడదామని చూస్తున్నారు గాని గాని ఎవరూ బాగుపడట్లేదు.
సమాజం ఎప్పుడూ పురోగతి చెందదు. ఓ వైపునించి ఎంత త్వరగా అభివృద్ధిచెందుతూంటుందో అదే వేగంతో వేరేవైపునించి క్షీణిస్తూంటుంది. అది నిరంతరంగా మార్పు చెందుతూనే ఉంటుంది. అది క్రూరమైనది, నాగరకమైనది, మతావలంబిని, సంపన్నమైనది, శాస్త్రీయ దృక్పథం కలిగినది. కానీ ఈ మార్పు ఉపశమనం కాదు. ఇవ్వబడిన ప్రతిదానికి ఎదో కొంత తీసుకోబడుతుంది. సంఘం కొత్త కళలు నేర్చుకుంటూ, ప్రాచీనమైన సహజ ప్రకృతిని కోల్పోతూంటుంది. ఎంత తేడానో గమనించండి - డాబుసరి దుస్తులు, చదవడం, రాయడం, ఆలోచించడం చక్కగా తెలిసి, గడియారం, పెన్సిలు, జేబులో చెక్కుపుస్తకం ధరించిన అమెరికన్ పౌరుడికీ, దిగంబర స్వరూపం, ఒక దుడ్డు కర్ర, బల్లెం, ఒక చాప, పడుకోడానికి పాత గుడిసెలో అవిభాజ్యమైన ఇరవయ్యోవంతు స్థలం మాత్రమే ఆస్తిపాస్తులుగా కలిగిన న్యూజీలాండ్ ఆటకివికుడికీనీ! కాని ఇరువురి ఆరోగ్యాలూ పోలిస్తే శ్వేతజాతీయుడు తన సహజ స్వాభావిక లక్షణాలను కోల్పోయినట్లు గమనిస్తారు. ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పినట్లు, ఆ ఆటవికుడిని బలంగా పెద్ద గొడ్డలితో ఒక్క దెబ్బ కొట్టండి, తారు ముద్ద మీద కొట్టినట్టు ఒకట్రెండు రోజుల్లో కండ దగ్గరపడి గాయం మాయమైపోతుంది; అదే దెబ్బ శ్వేతజాతీయుడిని సమాధిలో పడుకోబెట్టేస్తుంది. నాగరికుడు నాలుగుచక్రాలతో నడిచే బగ్గీలు సృష్టించుకున్నాడు గానీ తన పాదాల ఉపయోగాన్ని మర్చిపోయేడు. ఎదోలా నిలబడగలుగుతున్నాడే కాని, అది కండబలిమితో కాదు. విలాసవంతమైన జెనీవా గడియారం సంపాదించుకున్నాడు గాని సూర్యభగవానుని గమనాన్ని బట్టి కాలాన్ని లెక్క కట్టడం మర్చిపోయేడు. తన చేతిలో ఒక గ్రీన్‌విచ్ కాలనిర్ణయ పంచాంగాన్ని కలిగి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తనకి కాల గమనాన్ని తెలుపుతోందని మురిసిపోతాడే కాని ఆకాశంలో ఒక్క నక్షత్రం గురించి కూడా అతనికి తెలియదు. ఉత్తరాయణం, దక్షిణాయణాలనేవి ఏమిటో కూడా అతనికి తెలీదు. కాని పూర్తి సంవత్సర కాలానికి లెక్కగట్టి ఉంచిన తారీఖుల పట్టీ యావత్తూ అతని బుర్రలో నిక్షిప్తమై ఉంది. అతని నోటు పుస్తకాలు అతని ఆలోచనాశక్తిని కుంటు పరిచాయి. గ్రంథాలయాలు అతని చమత్కారం, వివేకాల మీద పెను భారమై కూర్చున్నాయి. అతని బీమా సంస్థ ప్రమాదాల సంఖ్యని పెంచింది. కొత్త కొత్త యంత్రాల వలన ఇబ్బందులుంటాయా ఉండవా అన్నది ప్రశ్న; అతి సుకుమారంవల్ల కొంత శక్తిని మనం కోల్పోయామా లేదా అన్నది ప్రశ్న; వ్యవస్థల్లోకీ రూపాల్లోకీ చొచ్చుకువచ్చిన మతం కొంత ఆటవిక ధర్మం తాలూకూ చురుకుదనాన్ని జొప్పించిందా లేదా అన్నది ఇంకో ప్రశ్న. బైరాగితత్వంలో బైరాగి కనబడుతూనే ఉన్నాడు గాని అశేష భక్తజన సమూహంలో నిజమైన భక్తులెవరు?
నైతిక ప్రమాణాల్లో కనబడే హెచ్చుతగ్గులు ఒడ్డూ పొడుగుల్లో కనబడే హెచ్చుతగ్గులకంటే అధికం కావు. ఇప్పుడు జీవించియున్న మహనీయులు ఇంతకు ముందు కాలంలో నివసించిన వారికంటే అధికులు కారు. అతి ప్రాచీన యుగంలోను, అత్యాధునిక కాలంలోను సంచరిస్తున్న గొప్ప వ్యక్తుల్లో ఒక సామాన్య సమానత్వం గోచరిస్తుంది. ఈ శతాబ్దంలో విరాజిల్లే కళలు, శాస్త్రవిజ్ఞానం, మతవిశ్వాసం, తాత్విక చింతన కొన్ని శతాబ్దాల కిందట నివసించిన గొప్ప వ్యక్తులకంటె గొప్పవారిని తయారుచెయ్యలేవు. కాలం పరంగా చూసినా కూడా ఈ పోటీ ముందుకు పోవడం లేదు. ఫోసియన్, సోక్రటీస్, అనక్సగోరస్, డయాగొనీస్ వంటి తత్వవేత్తలు తమదంటూ ఒక వర్గాన్ని తయారుచేసి విడవలేదు. ఒకవేళ ఎవరైనా వారి వర్గానికి చెందినవాడైనా అతను వారి పేరుతో పిలువబడక, తనకు తానే చెంది యుండి, తనద్వారా ఇంకొక వర్గాన్ని సృష్టించగల సమర్ధుడు. ఏ యుగానివైనా కళలు, ఆవిష్కరణలు దానికి అలంకరణ దుస్తులుగా ఉంటాయే తప్ప మనుష్యులను ఉత్తేజపరుపలేవు. మెరుగుగా తయారయే యంత్రాలు చేసే హాని, వాటి వలన కలిగే ప్రయోజనాలకు పరిహారం. హడ్సన్ మరియు బెహ్రింగ్ చేపల పడవల తయారీలో చాలా పురోగతి సాధించి, ప్యారీ, ఫ్రాంక్లిన్ వంటివారిని అబ్బురపరచేరు. వారి యంత్రసామగ్రి శాస్త్ర, కళా రంగాల వనరులను హరించాయి. గెలీలియో ఒక మెరుగుటద్దంలోంచి అంతకు ముందూ ఎవరికీ తెలియని అలౌకికాద్భుత గ్రహచక్రగమనాన్ని దర్శించాడు. కొలంబస్ నాటుపడవ మీదనించే ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. కొద్ది సంవత్సరాల, లేదా కొన్ని శతాబ్దాల క్రితం ఎంతో సంబరంగా పరిచయం చేసుకున్న యంత్ర సామగ్రి ఒక నిర్ణీత సమయం తరవాత వినియోగంలోంచి తొలగించడం లేదా పాడైపోవడం ఆసక్తి కలిగించే విషయం. గొప్పదైన జ్ఞానం సమర్ధత కలిగిన వ్యక్తి వద్దకు తిరిగి చేరుతుంది. మనం యుద్ధ రంగంలో జరిగిన ఆవిష్కరణలను శాస్త్ర విజ్ఞానం యొక్క విజయంగా చెప్పుకుంటాం గాని, నెపోలియన్ యూరోప్‌ను పెద్ద ఆయుధసంపత్తిలేకుండా, కేవలం కొద్దిపాటి సైన్యం తోను, భుజబల పరాక్రమంతోనే గెలిచాడు. లాస్ కెసాస్ మాటల్లో, "ఆయుధాలను, తుపాకీమందు గిడ్డంగులను, వండిపెట్టేవారిని, రధాలను విడిచి, ప్రతి సైనికుడూ రోమన్ సాంప్రదాయానుసారం తనకు లెక్క ప్రకారం ఇవ్వబడిన ధాన్యాన్ని తన చేతులతోనే పిండి కొట్టి, స్వయంగా రొట్టె కాల్చుకుని మాత్రమే తినే అలవాటు చేసుకుంటే తప్ప" ఒక క్రమశిక్షణాయుతమైన సైన్యాన్ని తయారుచేసుకోవడం అసంభవంగా తలచాడా చక్రవర్తి.
సంఘం ఒక కెరటం. కెరటమే ముందుకీ వెనక్కీ కదులుతుంది గానీ దానిలోని నీరు కాదు. అదే అణువు లోయనించి శిఖరాగ్రానికి చేరుకోలేదు. దాని ఏకత్వం విలక్షణం. ఈరోజు ఒక రాజ్యాన్ని తయారుచేసినవారు వచ్చే సంవత్సరం మరణిస్తారు; వారితో పాటే వారి అనుభవం కూడా. అందుకే, సంపదల మీద, ప్రభుత్వాల మీద ఆధారపడే స్వభావం, లోపించిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. మనుష్యులు తమ దృష్టిని తమమీదినించి మళ్ళించి సంపదలనెంతగా ఆరాధిస్తున్నారంటే, మతగురువులను, విద్యావంతులను, నియమనిబంధనలను తమ ఆస్తుల సంరక్షకులుగా భావిస్తూ, వారిని ఎవరైనా విమర్శిస్తే అది తమ సంపదల పట్ల జరిగిన అపచారంగా భావిస్తారు. వారు అవతలివారి విలువను, వారేమిటన్నదానికంటె, వారెంత కలిగినవారనే దాన్ని బట్టి నిర్ణయిస్తారు. కాని పరిణతి కలిగిన వ్యక్తి, తన సహజ తత్వం పట్ల కలిగిన గౌరవభావంతో, తన సంపదలను చూచి సిగ్గుపడతాడు. ముఖ్యంగా అతనికి ఎక్కువ అసహ్యం కలిగించేది - ప్రమాదవశాత్తు, దానంగా, లేదా నేరప్రవృత్తి ద్వారా సంక్రమించిన సిరులను. అవి ఉండీ అతనికి లేనట్టే. అవేవీ అతనికి చెందినవి కావు. అతనిని బద్ధుని చేయలేవు. అవి అక్కడే పడుంటాయి ఎందుకంటే ఏ తిరుగుబాటుదారుడూ, చోరుడూ వాటిని తీసుకుపోవనిచ్చగించడు. కానీ ఏ సంపదనైతే మనిషి అవసరార్ధం కష్టపడి సముపార్జించుకుంటాడో, అది నిజమైన జీవం కలిగిన సంపద. అది ఏ ప్రభుత్వం, దొంగలు, గుంపులు, తిరుగుబాట్లు, అగ్ని, తుపాను, దివాలాల వంటి భయాలేవీ తన యజమానికి కలిగించకుండా, అతని ఊపిరి ఉన్నంతవరకు వృద్ధిచెందుతూనే ఉంటుంది. కాలిఫ్ ఆలీ అన్నట్టు "జీవితంలో నీ వంతు, లేదా భాగ్యం ఏదన్నా ఉంటే అది నీ నిజ తత్వాన్వేషణ మాత్రమే; కనుక నిరంతరం ఆ ప్రయత్నంలో ఉంటూ, నిశ్చింతగా గడపు". బయటి నుండి వచ్చే వస్తువులకై మన అపేక్ష మనను వాటి కూడికలకు బానిసలుగా మారుస్తుంది. రాజకీయ పక్షాలు వివిధ సమావేశాలు జరుపుకుంటుంటాయి. ఆ సమూహం పెద్దదై, ‘ఎసెక్స్ నుంచి వచ్చిన ప్రతినిధులు!’ ‘న్యూ హాంప్‌షైర్ ప్రజాస్వామ్యవాదులు!’ ‘మెయిన్ ప్రాంతపు స్వేచ్చాప్రియులు!’ అని వినవస్తున్న కేరింతలను విన్న యువ దేశభక్తుని గుండె ఉప్పొంగిపోయి, వేలకొలదీ కళ్ళు, చేతుల శక్తిచే మున్నెన్నడూ లేనంత శక్తిమంతునిగా తనను ఊహించుకుంటాడు. అదే విధంగా సంస్కరణవాదులు సమావేశాలు నిర్వహించి ఎన్నికలూ పరిష్కారాలూ ప్రకటించుకుంటారు. కాని స్నేహితులారా, భగవంతుని పనితీరు ఈ విధంగా ఉండదు - అది దీనికి పూర్తి భిన్నం. ఎప్పుడయితే మనిషి తనకు తానుగా నిటారుగా, ఒంటరిగా నిలబడి, బయటినించి వచ్చే సహాయాన్ని తృణీకరించి సాగుతాడో, అతనినే నేను శక్తిమంతునిగ భావిస్తాను. ఇతర పతాక ధారుల దృష్టిలో అతను బలహీనుడు. కాని ఊరు కంటె వ్యక్తి నయం కాదా? మనిషి నించి ఏమీ ఆశించవద్ధు; నిరంతరంగా మార్పుచెందుతూ ఉందే ప్రపంచంలో, నీ స్వయంప్రకటిత ధీశక్తి, ఆత్మ విశ్వాసమే నీకు కొండంత అండ. ఎవరయితే ఆ శక్తి స్వయంసిద్ధమని ప్రగాఢంగా విశ్వసిస్తారో, తాను మంచిని తననుంచి కాక బయటినించి ఆశించడమే తన బలహీనత అని గ్రహిస్తాడో, ఆ భావనా బలంతో, ఎట్టి సంకోచాలూ లేకుండా దృష్టిని తన అంతర్గత శక్తిపై కేంద్రీకరిస్తాడో, ఆ క్షణమే అతను తనను సరిదిద్దుకున్నట్లు; అతను బోరవిరుచుకుని నిటారుగా నిలబడి, అవయవాలను, ఇంద్రియాలను సక్రమంగా నియంత్రించి అద్భుతాలను సృష్టిస్తాడు - కాళ్ళమీద నిలబడే వ్యక్తి తలమీద నిలబడే వాని కంటే బలవంతుడే కదా.
కనుక విధిని ఉపయోగించుకో. చాలా మంది విధితో జూదమాడి ఎంతో గెలిచి దాని చక్రభ్రమణంలో అంతా పోగొట్టుకుంటారు. కానీ నీవు అప్రయత్నంగా నీ మీద కురిసే భోగభాగ్యాలనసలు లక్ష్యపెట్టక, భగవంతుని ప్రతినిధులైన కారణ-కార్యాల (cause and effect) గొప్పదనాన్ని విశ్వసించి అచరించు. నీ స్వేచ్ఛా సంకల్పాలను నమ్మి పనిచేసే నీవు, భాగ్య చక్రానికి సంకెళ్ళు వేయగలవు; దాని భ్రమణాలు, ఒడిదుడుకుల అనిశ్చితి నించి విముక్తుడవై నిశ్చింతగా జీవిస్తావు. ఒక రాజకీయ విజయం, బాడుగలలో వృద్ధి, తగ్గిన జబ్బు, తప్పిపోయాడనుకున్న మిత్రుని పునరాగమనం, లేదా ఇంకేదో ఆహ్లాదకర సన్నివేశం అంతరంగాన్ని ఉత్తేజపరస్తాయి. దాంతో రాబోయేవన్నీ మంచి రోజులేననే తలంపు మదిలో మెదులుతుంది. అది నమ్మకు. నీవు తప్ప నీకు శాంతినొసగేవారు ఎవ్వరూ లేరు. నీ నిజ తత్వాన్నించి ఆవిర్భవించి నీవాచరించే ప్రాథమిక నియమాలే నీకు శాంతిని కలిగిస్తాయి.
-----------
No comments:
Post a Comment