కాలపు ఱెక్కలు నలుపూ తెలుపూ - చెఱియొకవైపున రేయీ పవలూ
పర్వతమెత్తుగ అంబుధి లోతుగ - నిలుపును తూనిక సరి సమానముగ
చంద్రకళలను ఆటుపోటులను - మెరయును కలహము కలిమిలేములై
అంతరాళమున ఎక్కువ తక్కువ కొలతను చూపును తారా-కిరణము
నిరంతరముగా పరువిడు బంతుల నడుమ ఒంటరిగ నడచును పుడమి
శూన్య క్షేత్రమున ఎగిరెడు శిలలు - అంతరిక్షమున ఉల్కపాటులు
కటికచీకటికి పరిహారముగా - వెలుగును మెరుపుల విద్యుల్లతలు
నరుడను తరువున బలమగు తీవెల అల్లును లతలై తరగని సిరులు
అల్లెడు తీవెలు అలసినగానీ - కలుగదు క్లేశము స్థిరమగు లతకు
అశక్తులైనను భయపడవలదు - క్రిములను సైతము కాచును దైవము
వృక్షములడవిని కప్పినయట్లే - బలము శ్రామికుని అండన యుండును
నీ భాగము నిను చేరెను కాదా? ఱెక్కలు కట్టుకు వాలును త్వరలో
సర్వము ప్రకృతి నీకై యుంచెను - గాలి తెరలలో ఱాతి పొరలలో
కొండలనెక్కుచు సంద్రమునీదుచు నీడవలెను నీ తోడనె వచ్చును
నేను చిన్న బాలునిగా ఉన్న నాటినుంచి, 'పరిహారం' అనే అంశంపై ఒక వ్యాసం వ్రాద్దామనుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే నాకు అప్పుడే అనిపించేది - ఈ అంశంపై తత్వశాస్త్రం కంటే నిజ జీవితానికే ఎక్కువ అవగాహన ఉందని. ప్రజలకే ప్రబోధకుల కంటే ఎక్కువ తెలుసనీ. ఏ గ్రంథాల నుంచయితే ఈ అంశంపై ఒక నిర్దిష్టమైన సిద్ధాంతాన్ని చేయ వీలవుతుందో, అవి, తమ విభిన్న పాఠభేదాలతో నాకు మరింత ఉల్లాసపరిచేవి - నిద్రలో కూడా మది నించి చెరిగిపోక. చేతనున్న పని సామగ్రి, బుట్టలో రొట్టె, వీధిలో, పొలంలో, ఇంటిలో జరుపుకునే నిత్యకృత్యాలు, పలకరింపులు, పరిచయాలు, జమాకర్చులు, నడత, మనుషుల ప్రకృతి, యోగ్యతలూ ఇత్యాదుల వలె మన దైనందిన జీవనాన్ననుసరిస్తూ. ఈ ప్రపంచ మూల స్వభావం యొక్క పనితీరు, సాంప్రదాయాల చిహ్నాలనేవి లేని, శాశ్వతమైన ప్రేమ సముద్రంలో మనుషులనోలలాడిస్తూ, ఉన్నదీ, ఉంటున్నదీ, ఎప్పుడూ ఉండేదీ అయిన దానితో స్పష్టంగా సంభాషించే మార్గాన్ని ఒక దివ్య కాంతి రేఖ ద్వారా మనుషులకు చూపుతుందనీ కూడా నాకు అనిపించేది. ఎందుకంటే అది సత్యమైన ఈ వర్తమాన క్షణం. పైగా, ఈ సిద్ధాంతాన్ని, ఇప్పటికే జనసామాన్యానికి సత్య ప్రబోధకాలయిన దివ్య గ్రంథాల, సమాజాల కోణంనించి గాని, వాటి పోలికగా గాని వ్యక్త పరిస్తే కనుక, ఎన్నో చీకటి క్షణాలలో దారి తప్పి వక్ర మార్గంలో పడిపోకుండా మనకు మార్గదర్శకమగు తారకయై భాసిస్తుందని కూడా నాకు తోచింది.
నా ఈ తలంపు నిజమేనని, ఈ మధ్య ఒక చర్చిలో వినబడిన మతప్రసంగం వలన తెలిసింది. సదాచార సంపన్నునిగా ప్రసిద్ధుడైన అచటి ప్రబోధకుడు, అంతిమతీర్పు సిద్ధాంతాన్ని సామాన్య జనావళికి అర్ధమయ్యే రీతిలో వివరిస్తూ వున్నాడు. అతని ప్రకారం, తీర్పు ఈ ప్రపంచంలో సరిగా అమలుజేయబడలేదు. మోసగాళ్ళు విజయం సాధిస్తున్నారు. సజ్జనులు క్లేశాలననుభవిస్తున్నారు. అని అంటూ, వివేకం, శాస్త్రజ్ఞానం మిళాయించి ఈ రెండు తరగతులవారికీ రాబోయే జన్మలో తగిన పరిహారమొసగమని వేడుకొన్నాడు. ఈ నూతన సిద్ధాంతాన్ని అక్కడి ప్రార్ధనా సమూహం కూడా తప్పు పట్టలేదు. నేను గమనించినంత వరకు, సమావేశం ముగియగానే ఏ వ్యాఖ్యలూ చెయ్యకుండానే అందరూ ఎవరి దారిన వారు పోయేరు.
కానీ ఈ ప్రబోధ అంతరార్ధం ఏమై ఉంటుంది? మంచివారు ఈ జీవితంలో క్లేశగ్రస్తులై ఉన్నారన్న వ్యాఖ్యాత మాటల్లో ఉద్దేశ్యం ఏమిటి? ఇళ్ళు, భూములు, వ్యాపారాలు, మద్యం, గుఱ్ఱాలు, ఖరీదైన దుస్తులు, విలాసాలు మొదలైనవి నీతిబాహ్యులు అనుభవిస్తూండగా, సత్పురుషులు పేదరికంలోను, అసహ్యకర పరిస్థితుల్లోను జీవిస్తున్నారనా? మరియు వీరికి ఇకపై - ఈ భోగాలకు సమానమైన పరిహారం - బ్యాంకు వాటాలు, నిలువెత్తు బంగారం, వేటమాంసం, ఖరీదైన మద్యాలతో విందుభోజనాలూ ఏర్పరచాలనా? దీనినే "పరిహారం" అని అనుకొని ఉంటుండవచ్చు. కాక మరేమిటి? ఇకపై వారు ప్రార్ధనలనూ ఆశీర్వచనాలనూ విడవాల్సిందనా? మానవాళిని ప్రేమించడం, సేవించడం మానమనా? ఏమి, అది వారిప్పుడు చేయనే గలరు. ఏ వినయభూషణుడైన విద్యార్ధి అయినా ఠక్కుమని గ్రహించే సారాంశమిదే : "మనం కూడా పాపుల మాదిరే ఆ వైభవాలనన్నింటినీ పొందాలి"; ఇంకా ముందుకి వెళితే, "సరే ఇవాళ మీరు పాపాలు చేసుకోండి; మా సమయం వచ్చినప్పుడు మేమూ చేసుకొంటాం; అసలు చేయగలిగితే అదేదో ఈ రోజే చేసేవారం, కానీ చేతకాక పోవడం మూలాన్న, రేపో ఇంకో రోజో చేద్దామనుకుంటున్నాం."
అసలు భ్రాంతి - చెడ్డవారే విజయం సాధిస్తారని, తగిన న్యాయం సత్వరం, ప్రస్తుతం జరగడంలేదన్న నమ్మికలో ఉంది. సదరు వ్యాఖ్యాత అంధత్వం, సత్యాచరణ మార్గంలో ప్రపంచాన్ని ఎదుర్కొని, సత్యవ్యతిరేకతను దోషిగా నిలబెట్టటం, విశ్వాత్మ ఉనికిని ఎల్లెడల చాటడం, మనస్సంకల్పం యొక్క సర్వశక్తిమంతం గురించి, తద్వారా మంచి-చెడు, విజయం-మోసం ల ప్రామాణికాన్ని నిరూపించడం లో కాక, జన సామాన్యం దేన్నైతే మగటిమి కలిగిన విజయం అని భావిస్తుందో, దానినే విశ్వసించడంలో ప్రస్ఫుటమవుతోంది.
ఇదే తరహా నీచమైన వరస చాలా మట్టుకు ప్రాచుర్యంలో ఉన్న మతసంబంధమైన గ్రంథాలలోను, వాటిలోని వాక్యాలనే కొందరు విద్యావంతులు ఆ విషయకమైన చర్చలు వచ్చినప్పుడల్లా ఉదహరించడమూ గమనిస్తూంటాను. నాకనిపించేది ఏమంటే, బహుళవ్యాప్తిలో ఉన్న మన తత్వగ్రంథాలు, తాము నిర్మూలించదలచిన అంధవిశ్వాసాల స్థానంలో కొంత వ్యావహారికమైన సరళత్వాన్ని సాధించినా, ప్రపంచం ఏ భేదంలేకుండా ఆచరించవలసిన మూల నియమాలను విస్మరించట్లగపడుతుంది. కాని మనుష్యులు ఈ తత్వశాస్త్రాల కంటే అధికులు. వారి దైనందిన జీవితాలలోనే ఈ శాస్త్రాల డొల్లతనాన్ని వారు కనుక్కుంటారు. నిష్కళంకులు, సత్యాన్వేషకులు తమ అనుభవంలో నిబంధనలను వెనకపెడతారు; మరియు ప్రతి ఒక్కరూ ఎదో ఒకప్పుడు కొన్ని తప్పులను కనిపెడుతున్నప్పటికీ, ప్రకటించ మొహమాటపడుతూంటారు. ఎందుకంటే వారు తమకు తెలిసిన దానికంటే తెలివైనవారు. పాఠశాలల్లోను, ప్రవచనాల్లోను బోధించినదాన్ని అప్పటికి వేరే పునరాలోచన లేకుండా విని ఊరుకున్నా, అవే అంశాలు సంభాషణల్లోకి వస్తే తమ మౌనంతోనైనా వాటిని ప్రశ్నించి తీరుతారు. ఎవరయినా వ్యక్తి మిశ్రమ అభిప్రాయాలు కలిగినవారి సమూహం మధ్యలో కూర్చుని దైవానుగ్రహం గురించి, దైవ సంబంధమైన న్యాయసూత్రాలను గురించి కొన్ని దురభిమానపూర్వక పిడివాదనలు చేసినా, అతనికి సమాధానమా అన్నట్టు శ్రోతలు మౌనం దాలుస్తారు; అది వారి అసంతృప్తినీ, దాన్ని వెళ్ళగక్కలేని వారి నిస్సహాయతనీ చూపరులకు ప్రకటిస్తుంది.
దీనిలోను, దీని తరవాతి అధ్యాయంలోను పరిహారన్యాయం గురించిన వాస్తవాలను కొన్నింటిని పొందుపరుస్తాను; ఆ మహావృత్తంలోని ఒక చిన్న చాపాంశాన్ని ఆవిష్కరించినా నేను ఎదురుచూసినదానికంటే ఎక్కువ ఆనందం పొందుతాను.
ధ్రువశీలత (polarity), అంటే క్రియ-ప్రతిక్రియలు మనకి ప్రకృతిలోని అన్ని విభాగాలలోను కనబడతాయి; చీకటి, వెలుతురు; వేడిమి, చల్లదనం; నీటి ఆటు, పోటు; మగ, ఆడ; వృక్ష జంతుజాలాల విషయంలో ఊపిరి పోసుకోవడం, ఊపిరి ఆగిపోవడం; జంతువుల శరీరమందలి ద్రవాల రాశి, వాసి; హృదయ కోశపు సంకోచం, వ్యాకోచం; ద్రవ తరంగాలలోను, శబ్ద తరంగాలలోను; గురుత్వాకర్షకశక్తి యొక్క కేంద్రపరాన్ముఖత్వం, కేంద్రోన్ముఖత్వం; విద్యుచ్చక్తియందలి ప్రవాహము, ఆకర్షణ. సూచిక యొక్క ఒక వైపున అయస్కాంతశక్తిని కలిగిస్తే రెండో వైపున దాని వ్యతిరేక ధ్రువశక్తి జనిస్తుంది. దక్షిణం ఆకర్షిస్తుంది, ఉత్తరం వికర్షిస్తుంది. ఇక్కడ ఒంపాలంటే, అక్కడ నింపాలి. తప్పనిసరి అయిన ద్వంద్వత్వం ప్రకృతిని విడదీస్తోంది. ఒక భాగం అసంపూర్తి సగంగా ఉండి అది పూర్తి కావడానికి రెండో సగం అవసరం కలుగుతుంది. ప్రాణము, పదార్ధము; పురుషుడు, స్త్రీ; బేసి, సరి; స్థూల, సూక్ష్మ; లోపల, వెలుపల; పైన, కింద; చలనం, విశ్రమం; అవును, కాదు.
ప్రపంచం ఈ విధంగా ద్వంద్వమై ఉండగా, దానిలోని ప్రతి యొక్క భాగం కూడా అలానే ఉంది. వస్తువులోని ప్రతి అణువు ఆ వస్తువు పూర్తి స్వభావాన్ని కలిగియుంటుంది. కొంతవరకు ఇది సముద్రపు ఆటుపోట్లు, రేయింబవళ్ళు, స్త్రీపురుషులు, చెట్టు ఆకు, ఒక ధాన్యపు గింజ, పశుప్రపంచంలోని ప్రతి ఒక్క జంతువు - లను పోలియుంటుంది. వీటి మూల ప్రకృతి యొక్క ఘనమైన ప్రతిక్రియ, వాటి సూక్ష్మ రూపాల్లో కూడా తిరిగి ఆచరించబడుతుంది. ఉదాహరణకు, జంతుప్రపంచంలో ఏ ప్రాణీ కూడా ప్రత్యేకాభిమానపాత్రం కాదనీ, ఒక నిర్దిష్ట పరిహార సూత్రం ప్రతి వరాన్నీ ప్రతి బలహీనతనీ కూడా సమ తూకంలో ఉంచుతుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఒకే రకం ప్రాణిలో, ఒక అవయవంలోని ఆధిక్యతకీ మరొక అవయవంలోని బలహీనతకీ చెల్లు. తల, మెడ పెద్దవైతే మొండెం, పృష్టభాగాలు కుదించబడతాయి. యంత్రశక్తులకు సంబంధిన సిద్ధాంతం మరొక ఉదాహరణ. శక్తిలో పొందినది కాలంలో కోల్పోవడం జరుగుతుంది. అలాగే దాని వ్యతిరేక భావనలో కూడా. కాలక్రమానుగతమైన గ్రహాల సవ్యాపసవ్య చలనాలు ఇంకో ఉదాహరణ. రాజకీయాల మీద వాతావరణం, నేల యొక్క ప్రభావం మరొకటి. చల్లని వాతావరణం ఉత్తేజం కలిగిస్తుంది. బంజరు క్షేత్రాల్లో బీవర్లు, మొసళ్ళు, పులులు, తేళ్ళ వంటి జాతులు మనలేవు.
మనుష్య స్వభావంలో కూడా ఈ ద్వంద్వత్వం అంతర్లీనమై ఉంది. ఒక విషయంలోని అధిక్యత మరొక విషయంలో లోపాన్ని కలిగిస్తుంది. అలాగే ఒక విషయంలో లోపం మరొక అంశంలో ఆధిక్యతను. ప్రతి తీపిలో పులుపు. ప్రతి కీడులో మేలు. ఇంద్రియాలకు సౌఖ్యం కలిగించే ప్రతి ఒక్క పనీ, దుర్వినియోగం చేసిన పక్షంలో అదే స్థాయిలో బాధనూ కలిగిస్తుంది. దానిలోని జీవమే దాని పరిమిత ఆచరణను సమర్ధిస్తుంది. వడ్లగింజ యెత్తు చాతుర్య ప్రదర్శనకు ఏ మాత్రం తీసిపోకుండా అంతే పరిమాణం బుద్ధితక్కువ ప్రదర్శన చేస్తాం. వదులుకున్న ప్రతీ దానికి బదులుగా వేరొకటి పొందుతాం; అదే విధంగా పొందినదానికి దీటుగా పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. సంపదలు వృద్ధిచెందేయంటే అవి కర్చు చేయడానికి కూడా ఏర్పాట్లు జరిగిపోయాయన్నమాటే. పోగుచేసుకోవడమే పనిగా పోగుచేసుకొనేవాడి నించి ప్రకృతి తాను వాని జేబుల్లో కుక్కినదానికి సరైన వేరొక ముఖ్యమైనదాన్ని అతడినుంచి తీసుకొంటుంది. ఆస్తి పెంపు, ఖామందు ముంపు. ప్రకృతికి గుత్తాధిపత్యాలూ మినహాయింపులూ గిట్టవు. ఇలా ప్రతి స్థితినీ హెచ్చుతగ్గులు సమం చేయటమనేది, కిందపడి వెంటనే ఉప్పొంగే సముద్ర తరంగాల వడితో సాటిరాగలటువంటిది. ఇటువంటి చదునుచేసే ప్రకృతి న్యాయమే, అహంకారపూరితులనీ, బలిష్టులనీ, ధనవంతులనీ, భాగ్యశాలురనూ ఇతర సామాన్యుల సరసన నిలబెడుతుంది. ఒక మనిషి మరీ బలవంతుడై లోకకంటకుడిగా తయారయితే, ప్రకృతి అతనికి ముద్దులు మూటగట్టే పాపాయిలని సంతానంగా అనుగ్రహించి, వారు బుడి బుడి అడుగులతో పాఠశాలకి వెళ్ళి అమ్మగారు చెప్పిన నీతి పాఠాలు నేర్చుకుని వల్లేవేస్తూ ఉంటే, వారి పట్ల అతని ప్రేమాపేక్షలచే అతని కర్కశత్వాన్ని మెత్తబరచి మర్యాదస్తుడుగా మారుస్తుంది. ఈ విధమైన యుక్తితో అది నల్లశేనాపరాయినీ చంద్రకాంతశిలనూ పొడిచేసి, క్రూరమైన అడవిపందిని బయటికి లాగి ఆ స్థానంలో మేకపిల్లనుంచి, తద్వారా తన సమతూకాన్ని సాధిస్తుంది.
కృషీవలుడు శక్తీ, క్షేత్రం సులభ సాధ్యాలు అని విశ్వసిస్తూంటే, దేశాధ్యక్షుడు తన శ్వేతసౌధంకోసం కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. దానికోసం అతని శాంతియావత్తూ కరిగిపోవడమే కాకుండా అతని పురుషసహజమైన శుభలక్షణాలు కూడా వన్నెకోల్పోతాయి. ప్రపంచం ముందు కొద్ది కాలంపాటు ఒక ఆడంబరాన్ని ప్రదర్శించడంకోసం, ధీశక్తిసంపన్నులయిన గురుశ్రేష్టులు తన సింహాసనం వెనక నిల్చొని యుండగా, వారి ముందు అతడు మట్టి బొక్కుతూ ఉంటాడు. లేక మనుషులు అనల్పమైన, శాశ్వతమైన జ్ఞానం యొక్క తేజస్సును అభిలషిస్తారా? అది కూడ ఒనగూరుతుందని ఢంకా బజాయించి చెప్పలేము. తన ధీశక్తి, ఆలోచనాబలాలవల్ల గొప్పవాడని వేలమంది నించి కీర్తిప్రతిష్టలనందుతూ ఉన్నవ్యక్తి దాని మూల్యాన్ని విస్మరించడానికి లేదు. లోనికి ప్రసరించే కాంతిప్రవాహాన్ని ప్రమాదసూచికలు వెంబడించే ఉంటాయి. ఎవరికైనా జ్ఞాన ప్రబోధ చేత సంతృప్తుడై ఉన్నాడా? అయితే అతడు అట్టి సంతృప్తికి కారణం కనుగొని దానిని అనుక్షణం సూక్ష్మదృష్టితో గమనిస్తూ, తన శీలసంపదను వాడితగ్గనీక, తనలోనే ఉండే విశ్వాత్మ యొక్క దివ్య వాక్యాలను వినడానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడై ఉండాలి. ఆత్మ స్వయం పరిపూర్ణతతో అతడు తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను ద్వేషించేవాడిగా కూడా కనిపించవచ్చు. ప్రపంచం యావత్తు శ్లాఘించే సంపత్తిని అతడు స్వంతం చేసుకొని ఉన్నాడా? ఆ మెచ్చుకోళ్ళను నిరాదరించి, తన సత్యంపట్ల సడలని విశ్వాసంతో, ఎప్పుడో ఎవరో చెప్పిన సామెతలా, వినబడీ వినబడనట్టున్న గుసగుసలా సాగిపోవాలి.
ఈ సూత్రమే దేశాలయొక్క, నగరాలయొక్క మార్గదర్శకాలను లిఖిస్తుంది. దానికి అనుబంధంగానో, సమానంగానో, జతపరిచో ఉండే వినూత్న సిద్ధాంతాలను చేయ వీలులేదు. పరిస్థితులను ఎక్కువకాలం దుర్నిర్వహణ చేయలేము (Res nolunt diu male administrari). కొత్త కొత్త దుష్కర్మలు ఏ విఘ్నాలూ లేక సాగిపోతున్నప్పటికీ, ఏ విఘ్నాలూ లేవని చెప్పడానికి లేదు; సరైన సమయంలో అవి తప్పక కనిపిస్తాయి. ప్రభుత్వం క్రూరమైనదంటే, ప్రభువు క్షేమంగా జీవించజాలడు. పన్ను వసూళ్ళు మరీ ఎక్కువైతే అట్టి వసూళ్ళనుపయోగించి చేపట్టగలిగే పనులే కనబడవు. శిక్షాస్మృతి క్రూరమై ఉంటే న్యాయాధికారులకు దోషులెవ్వరూ కనబడరు. అది మరీ మెతకగా ఉంటే వ్యక్తిగత ద్వేషాలు పెల్లుబుకుతాయి. అపరిమితమైన ప్రజాస్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్య రాజ్యంలో ఎలాంటి అణచివేత చర్యనయినా పౌరులు మహోత్తేజంతో ప్రతిఘటిస్తారు, అక్కడ జీవన జ్యోతి ప్రచండ తీక్ష్ణతతో వెలుగుతూ ఉంటుంది. మనిషి నిజ జీవితం, పొందే సంతృప్తులు పరిస్థితులు కల్పించే కఠినపరీక్షలను, లేదా ఆనందకర క్షణాలను తప్పించుకుంటూ, తమను తాము అన్ని రకాల పరిస్థితులలోను సుస్థిరంగా స్థాపించుకొనే లక్షణం కలిగి యుంటాయని అనిపిస్తుంది. ఏ రకమైన ప్రభుత్వంలోనైనా వ్యక్తి శీలం యొక్క ప్రభావం ఒకేలా ఉంటుంది - టర్కీలో తీసుకోండి, లేదా న్యూ ఇంగ్లాండులో తీసుకోండి. ఈజిప్టు దేశపు ప్రాచీన నిరంకుశ ప్రభువుల పాలనలో కూడా చరిత్ర ప్రకటించిన అంశం, మనిషి తన సంస్కృతి, నాగరకతలు తనకు నేర్పిన మేరకు స్వేచ్ఛగా ఉండగలడని.
పైన తెలిపినలాంటి అంశం, విశ్వం తన లోని ప్రతి యొక్క అణువులోను వ్యక్తమవుతూంటుందనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. ప్రకృతిలోని ప్రతీ వస్తువు ప్రకృతియొక్క అన్ని శక్తులను కలిగి యుంటుంది. ప్రతీ వస్తువు ఒక రహస్య పదార్ధంతో సృజించబడింది; ప్రతి పరిణామక్రియలోనూ ప్రకృతిశాస్త్రజ్ఞుడు ఒక నిర్దిష్ట సామ్యతను గుర్తించి గుర్రాన్ని పరిగెత్తే మనిషిగాను, చేపను ఈదే మనిషిగాను, పక్షిని ఎగిరే మనిషిగాను, చెట్టును వేళ్ళూనుకున్న మనిషిగాను భావిస్తాడు. ప్రతి నూతన సృష్టీ దాని వర్గలక్షణాన్ని పునశ్చరించటమే కాక, దాని వివరాలు, లక్ష్యాలు, అనుకూలతలు, ప్రతికూలతలు, శక్తులు మున్నగు అంశాలలో మక్కికి మక్కి దానితో బాటే ఉండే ఆ వర్గంలోని ఇతర భాగాలలానే వ్యవహరిస్తుంది. ప్రతి వృత్తి, వర్తక విధానం, కళారూపం, దైనందిన లావాదేవీ కూడా ప్రపంచం యొక్క సంగ్రహ రూపం, ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగియుండేవి. ప్రతి ఒక్కటీ మానవ జీవితానికి ప్రతీక; దానిలోని మంచికీ చెడుకూ, కష్టనష్టాలకూ, శత్రువర్గాలకూ, ఆదికీ, అంతానికీ, ప్రతీక. ప్రతి ఒక్కటి ఎదో విధంగా మనిషిని అతని పరమ గమ్యాన్నీ ప్రతిబింబిస్తాయి.
ప్రపంచం ఒక నీటి బిందువులో ఒదిగి గోళాకారాన్ని సంతరించుకుంటుంది. అతి చిన్న ప్రాణి, ప్రయోగశాలలోని సూక్ష్మదర్శిని దృష్టికి ఆననంత చిన్ననైనది. అనంతకాలాన్ని స్వాధీనపరచుకోగలిగే కళ్ళు, చెవులు, రుచిగ్రహణం, చలనం, నిరోధం, ఆకలి మరియు పునరుత్పత్యవయవాలు అన్నీ ఆ సూక్ష్మజీవి కలిగియుంటుంది. కనుక మన ప్రతి చర్య మన పూర్తి జీవితాన్ని ప్రతిఫలిస్తుంది. సర్వ వ్యాపకత్వానికి సరైన సిద్ధాంతరూపం, భగవంతుడు తన పరిపూర్ణ లక్షణాలతో ప్రతి సూక్ష్మ వృక్ష జంతు రూపాల్లోనూ పునర్దర్శనమిస్తూంటాడనేది. విశ్వం యొక్క పూర్తి విలువ తన ప్రతి సూక్ష్మాంగంలోను వ్యక్తమవుతుంది. మంచి ఉన్నచోటనే చెడు, దోషం ఉంటాయి.; ఆకర్షణ ఉన్నచోటనే వికర్షణ; బలం ఉన్నచోటనే బలహీనత.
విశ్వజీవనం ఈ విధంగా సాగుతోంది. అన్ని విషయాలూ న్యాయబద్ధమైనవే. అంతరంగంలో విశ్వాసమైనది, బహిరంగంలో న్యాయసూత్రం. అంతర్గతంగా దాని ఉత్తేజాన్ని మనం అనుభూతి చెందుతాము, దాని భయానకమైన శక్తిని బయటి ప్రపంచంలో కనుగొంటాము. "అది ప్రపంచంలో ఉంది, ప్రపంచం దానిచే నిర్మించబడ్డది". న్యాయం వాయిదా పడదు. ఒక నిక్కచ్చి అయిన సమత్వం, అన్ని అంశాలలోను తన తూనిక రెండువైపులా సరిగాఉండేందుకు నిరంతరాయంగా బరువులను సర్దుబాటు చేస్తూనే ఉంటుంది. భగవంతుని చేతిలోని పాచికలు ఎల్లప్పుడూ ఎన్ని కళ్ళు పడాలో అన్నే పడేలా చేతిలో సిద్ధంగా ఉంటాయి. ప్రపంచం ఒక ఎక్కంలా, గణిత సమీకరణంలా కనిపిస్తూ, మీరేవిధంగా తిప్పి మార్చుకున్నా రెండు వైపులా సమానంగా మారుతుంది. ఏ అంకెనైతే తీసుకోండి, దాని సరైన విలువ, ఎక్కువతక్కువలు లేకుండా మీవద్దకు తిరిగివస్తుంది. ప్రతీ రహస్యం వెల్లడవుతుంది; ప్రతి నేరం శిక్షననుభవిస్తుంది; ప్రతి ధర్మనిర్వహణా బహూకృతిని అందుకుంటుంది, ప్రతి తప్పు సరిదిద్దబడుతుంది - నిశ్శబ్దంగా, నిస్సందేహంగా. మనం దేనినయితే ప్రాయశ్చిత్తంగా విధించే దండన అని వ్యవహరిస్తామో, అది, తన అణువణువులోను తన సంపూర్ణత్వాన్ని ప్రతిబింబించే విశ్వం యొక్క అవసరం. పొగ కనిపించిందంటే నిప్పు ఉండి ఉండాలి. చెయ్యో కాలో కనిపిస్తే వాటిని కలిగియుండే మొండెం వెనక ఉండాలి. ప్రతీ చర్యా దానికదే బహుమానం. ఇంకో మాటలో చెప్పాలంటే, తనను తాను రెండు రకాలుగా ఏకీకృతం చేసుకుంటుంది; ఒకటి, దాని వాస్తవ స్వరూపంలో; రెండవది, పరిస్థితుల రూపంలో, లేక ఇతరులచేత అది భావించబడే రూపంలో. మనుష్యులు పరిస్థితులను ప్రాయశ్చిత్తంగా అభివర్ణిస్తారు. కారణరూపంలో ఉండే ప్రాయశ్చిత్తం అది కలిగించే వస్తువులోనే ఉండి, అంతరాత్మకు కనబడుతుంది. పరిస్థితుల రూపంలో ఉండే ప్రాయశ్చిత్తం వాటినర్ధంచేసుకొనేటప్పుడు భావించబడుతుంది. అది తన వస్తువునించి వేరుచేయవీలులేనిది; కాని అది దీర్ఘకాలానికి విస్తరించి ఉండడం వలన, ఎన్నో సంవత్సరాల తరవాత గాని దాని స్పష్టత కానరాదు. సాక్ష్యానికి ఉపకరించే గుర్తులు తప్పు జరిగిన ఎంతో కాలానికి కనిపించవచ్చు. అవి దానిని తప్పక అనుసరిస్తాయి - కారణం అవి దానితోనే, దానిలోనే ఉంటాయి కనుక. నేరమూ శిక్షా ఒకే కాండపు రెండు కొమ్మలు. శిక్ష, దాని మూలకారణం తాలూకు తాత్కాలిక సుఖసంతోషాలనే పుష్పంలో ఫలదీకరణం చెందుతూ, దానిని కనుగొనే స్పృహలేనప్పుడు కనిపించదే కాని లేనిది కాదు. కారణమూ కార్యమూ, సాధనమూ లక్ష్యమూ, విత్తనమూ ఫలమూ, ఒకదానినించి వేరొకటి వేరుచేయజాలనటువంటివి. ఎందుకంటే ఫలితం కారణంతో పాటే పుష్పించనారంభిస్తుంది; సాధనంలోనే లక్ష్యం, విత్తనంలోనే ఫలం ఉంటాయి.
మొత్తం ప్రపంచం ఈ విధంగా పరిపూర్ణమై, అభిన్నమై ఉండగా, మనం మాత్రం పాక్షికంగా, వేరు వేరుగా, వాటాలు వేసుకుని జీవించగోరుతున్నాం. ఉదాహరణకు - మనం ఇంద్రియాలను సంతోషపెట్టేందుకు ఇంద్రియాల ఆనందాన్ని శీలం యొక్క అవసరాలనించి వేరుచేస్తాం. మనిషి బుద్ధికుశలత ఎప్పుడూ ఒకే ఒక సమస్య పరిష్కారానికి అంకితమైఉంటుంది - శారీరక మాధుర్యం, శారీరక శక్తి, శారీరక తేజస్సు లను నైతిక మాధుర్యం, నైతిక నైర్మల్యం, నైతిక సమతల నుంచి ఏ విధంగా వేరుచేసి పని జరుపుకోవాలా అని. మరల, ఈ ఉపరితలాన్ని వీలైనంత పలుచనచేసి చెక్కెస్తే పట్టించుకోవాల్సిన అడుగుభాగం అంటూ ఏమీ లేని విధంగా. అంటే ఏ విషయాన్నైనా ఒకవైపును మాత్రమే పొంది, రెండో వైపును పొందనిరాకరించడం. ఆత్మ అంటుంది తిను అని; శరీరం పొట్టపగిలేలా విందుభోజనం ఆరగిస్తుంది. ఆత్మ అంటుంది స్త్రీపురుషులిరువురూ ఒకే రక్తమాంసాదులు కలిగి, ఒకే ఆత్మగా జతపడి జీవించాలని. శరీరం ఇరువురి రక్తమాంసాదులను మాత్రమే జతపరుచుకుంటుంది. ఆత్మ అంటుంది - ధర్మ ప్రతిస్థాపనకై అన్ని అంశాలపై తగిన అధికారాన్ని కలిగియుండమని; శరీరం తన స్వార్ధానికి తగిన విధంగా శక్తినీ అధికారాన్నీ పెంచుకుంటుంది.
ఆత్మ అన్ని విషయాల ద్వారాను పూర్తి శక్తితో జీవించాలని, పనిచెయ్యాలని ఆరాటపడుతుంది. అదొక్కటే వాస్తవం. అన్నివిషయాలూ దానికి జతపడాలి - అధికారం, ఆనందం, జ్ఞానం, సౌందర్యం - ఇలా. ఒక వ్యక్తికి గుర్తింపు కావాలి; తనకంటూ ఓ గౌరవం లభించాలి; ఎన్ని ఆపసోపాలు పడో పీకుబేరాలాడో నలుగురికీ ఉపయోగపడుతుందని ఒక పని చేస్తాడు; నిజానికి, తనకి వాహనయోగం కలగడం కోసం, ఇతరులను అటూ ఇటూ చేరవేసే పని పెట్టుకుంటాడు; తనకి మంచి వస్త్రాలు కావాలి కాబట్టి బయటివారికి బట్టలు పెడతాడు; తన భోజనానికై, వారికి భోజనం పెడతాడు; నలుగురి మెచ్చుకోళ్ళకోసం అధికారం, రాజ్యపాలన కూడా చేస్తాడు. మనుష్య ప్రకృతి, వారు గొప్పవారు అనిపించుకోవాలి; వారికి వ్యాపారాలు, సంపద, అధికారం, కీర్తి కావాలి. గొప్పతనాన్ని పొందడమంటే ప్రకృతిలోని ఒక భాగాన్ని సొంతం చేసుకుంటే చాలనుకుంటారు - తియ్యని భాగాన్ని - అవతలి చేదు భాగాన్ని వదలేసి.
ఈ రకమైన విభజన, వేర్పాటు హెచ్చుతగ్గులు లేకుండా భంగపాటును పొందుతాయి. ఈ రోజు వరకు, ఈ విషయంలో ఒక్క యుక్తిపరుడి ప్రయత్నం కూడా ఫలించలేదు. చీల్చబడ్డ నీరు మన చెయ్యి వెనకే కలిసిపోతుంటుంది. ఆహ్లాదకర విషయాల్లోంచి ఆనందం, లాభసాటి విషయాల్లోంచి లాభం, శక్తిమయ విషయాల్లోంచి శక్తి, మనం వాటి పరిపూర్ణతను విభజించగోరినప్పుడు, మటుమాయమైపోతాయి. వస్తువు బాహ్యం నించి అంతర్గతం, నీడ నించి కాంతి ఏవిధంగా వేరుపడవో, అదే విధంగా విషయాలను విభజించడం ద్వారా ఇంద్రియానందం పొందగోరడం కూడా జరగదు. "ప్రకృతిని ముల్లగరిటెకి గుచ్చి అవతల పారెయ్యండి, అది పరిగెత్తుకుంటూ చక్కా తిరిగివస్తుంది."
తప్పించుకొనలేని పరిస్థితులు జీవితంలో ఒక భాగం. అజ్ఞానముచే కొందరు వానిని తప్పించుకొంటూ, ఒండొరులకు అసలు వాటి గురించి తెలియనే తెలియదని, అవి తమను తాకజాలవని ప్రగల్భాలు పలుకుతారు - కాని అట్టి ప్రగల్భాలు పెదవులపైన మాత్రమే; అసలు పరిస్థితులు ఆత్మలో ఉంటాయి. అతడు ఒక దశలో వాటిని తప్పించుకొనజూస్తే, వేరొక ముఖ్యమైన దశలో అవి అతనిపై దాడి చేస్తాయి. వాటిని స్వరూపస్వభావాలుగా అతడు తప్పించుకొన్నాడంటే అర్ధం, అతడు తన జీవితాన్ని జీవించ నిరాకరించినట్టే, మరియు తననుంచి తాను పారిపోయినట్టే; దానికి ప్రతిఫలంగా ఒసగబడే దండన మరణంతో సమానం. అదే విధంగా చెడులో మంచిని వేరుచేసి చూచే ప్రయత్నాల్లోని వైఫల్యం, లేదా అసలు ప్రయత్నమే చెయ్యకపోవడం - ఎందుకంటే ప్రయత్నించటం ఒక పిచ్చి పని అని తలవబట్టి; - కాని పరిస్థితుల విషయంలో, తిరుగుబాటు, వేర్పాటు తాలుకు జాడ్యం మదిలో మొదలైతే అది బుద్ధికి కూడా అంటుకుని, ఆ మనిషి విషయాలను పరిపూర్ణ భగవత్స్వరూపాలుగా కాక విషయేచ్ఛాప్రదాతలుగా భావిస్తూ, అట్టి ఇంద్రియసుఖాల వలన రాబోయే బాధను గమనించడు; మత్స్యకన్యక సుందర వదనాన్నే కాని మహాసర్పపు తోకను కానడు; ఇంకా తాను కావలసినదాన్ని మాత్రమే తీసుకుని అక్కరలేనిదానిని తిరస్కరించగలనని భావిస్తాడు. “అత్యున్నతమైన స్వర్గలోకాలలో మౌనివై యుండే ఓ ఏకైక మహాదేవా, అదుపులేని కోర్కెలతో క్రమం లేని జీవనం గడుపువారిపై అనుగ్రహపూర్వకంగా కొన్ని అపరాధ అంధత్వ లక్షణాలను నిరంతరంగా కలుగజేయు నీ లీలలు ఎంతటి నిగూఢములు!”
ఈ విషయం పట్ల మానవ ప్రకృతి నిజాయితీ కథలనల్లడం, చరిత్ర వ్రాయడం, న్యాయసూత్రాలు రూపొందించడం, సామెతలను సృష్టించడం, సంభాషణలు ఇత్యాదులలో కానవస్తుంది. తెలియకుండానే అది తన వాక్కును సాహిత్యంలో చెల్లుబాటు చేస్తూ వస్తోంది. గ్రీకులు జూపిటర్‌ను పరమోత్కృష్ట బుద్ధిశాలి అని అభివర్ణించారు; కాని నిత్యవ్యవహారశైలిలో అతనిపై చాలా క్షుద్ర కార్యాల అభియోగాన్ని మోపటంద్వారా, వారు హేతువుకు కొన్ని మార్పులు చేసి ఆ చెడు లక్షణాల దేవుని చేతులను పైకి కట్టేశారు. అతడు ఒక నిష్క్రియాపరుడైన ఇంగ్లాండు రాజు మాదిరి అయిపోయాడు. ప్రొమెథ్యూస్ వద్ద జోవేకి అవసరమైన ఒక రహస్యం ఉన్నది; మినర్వా వద్ద ఇంకొకటి ఉన్నది. తన సొంతంగా అతడు గర్జించలేడు; మినర్వా వద్ద వాటి రహస్యం ఉండిపోయింది.
“దేవతలందరిలోను, నాకు అతని మహాగర్జన నిద్రించే నేలమాళిగను కలిగిన గది బలమైన తలుపులను తెరిచే తాళపుచెవి మాత్రమే నాకు తెలుసు.”
ఇది అందరి అంతరంగ వ్యవహారశైలి, దాని నైతిక లక్ష్యాల గురించిన నిజాయితీ ఒప్పుకోలు.
భారతీయ పురాణేతిహాసాలు కూడా ఈ నీతిసూత్రాలతోనే ముగుస్తాయి. ఆ మాటకొస్తే నైతికత ప్రతిబింబించని ఏ కథకైనా జనామోదం లభించడం దుర్లభం. అరోరా తన ప్రియునికి యౌవనం అడగడం మర్చిపోయింది, అందువల్ల టిథోనస్ చిరంజీవి అయినప్పటికీ, అతడు వృద్ధుడు. అకిల్లీస్ అంత దుర్బలుడు కాదు; థేటిస్ పట్టుకొన్న మడమ భాగాన్ని పవిత్ర జలాలు ప్రక్షాళించలేదు. నిబెలన్‌జెన్ లోని సీగ్‌ఫ్రైడ్ అంత చిరంజీవి కాడు; అతడు డ్రాగన్ రక్తంలో స్నానమాచరిస్తున్నప్పుడు ఒక ఆకు అతని వీపు మీద పడుతుంది, ఆ ఆకు కప్పిన ప్రదేశం మాత్రం నశ్వరమవుతుంది. అలా జరగాల్సిందే. భగవంతుడు సృజించిన ప్రతి వస్తువులోనూ ఒక పగులు ఉంది. దానిలోకి, ఎప్పుడూ ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే, ఏ పాత నియమాలూ అంటని, ప్రాణాంతకమైన, ఒక న్యాయం, ఏమరుపాటుగా ఉన్నప్పుడు చొరబడుతుందని, ప్రకృతిలో ఏదీ “ఇవ్వబడ”దనీ, అన్నీ “అమ్మబడ”తాయనీని అనిపిస్తూంటుంది.
ఇదే, సదా విశ్వపు పోకడలను గమనిస్తూ, చేసిన ఏ తప్పూ శిక్షనించి తప్పించుకోలేదని ప్రవచించే ప్రాచీనమైన నెమెసిస్ సిద్ధాంతం. ఇంకా, ఫ్యూరీస్ న్యాయపాలకులని, స్వర్గలోకంలోని సూర్యుడు తన దారిని ఏమాత్రం తప్పినా అతనిని వారు శిక్షిస్తారని కూడా చెప్పబడింది. ఱాతి గోడలు, ఇనుప ఖడ్గాలు, తోలు పటకాలు తమను ధరించిన వారు చేయు తప్పుల పట్ల సానుభూతితో ఉంటాయని, అజాక్స్ హెక్టార్‌కు ఇచ్చిన తోలు పటకా ఆ ట్రోజన్ నాయకుడిని యుద్ధ భూమిలో అకిల్లీస్ రథచక్రాల దగ్గరకు లాగగా, హెక్టార్‌కు అజాక్స్ ఇచ్చిన ఖడ్గంతోనే అజాక్స్ నేల కూలాడనీ కవులు విశ్లేషించారు. వారు గ్రంథస్థం చేసినట్లు, థాసియన్‌లు క్రీడలలో విజయం సాధించిన థియాజెనెస్ విగ్రహాన్ని ప్రతిష్టించినప్పుడు, అతని ప్రత్యర్ధుల్లో ఒకడు నిశిరాత్రి ఆ విగ్రహం వద్దకు వెళ్ళీ దానిని ముష్టిఘాతాలతో నుగ్గు నుగ్గు చేశాడు; ఆఖరుగా అతడు విగ్రహపీఠాన్ని కూడా పెళ్ళగించే ప్రయత్నంలో దానికిందే పడి మృతి చెందాడు.
ఈ నీతి కథలోని స్వరం ఒక రకమైన దివ్యత్వాన్ని కలిగిఉంటుంది. అది దాని రచయిత మనఃశక్తి కన్న అధికస్థాయిలోని ఆలోచనల నుండి వచ్చింది. అదే ప్రతి రచయితలోను కనబడే, ఏ మాత్రం వ్యక్తిగతం కానట్టి ఉత్తమ లక్షణం. దాని గురించి అతనికంతగా తెలియదు. అది అతని శరీరస్వభావం నుంచే ఆవిర్భవించినా, అతని ఉత్తేజభరిత కాల్పనికశక్తి నుండి కాదు; ఏ విషయాన్నయితే మీరు ఒక కళాకారుని అధ్యయనం చేసి తెలుసుకొనలేరో, కాని అనేకమంది కళాకారుల అధ్యయనం వల్ల తెలుసుకోగలుగుతారో, ఆ లక్షణాన్ని అందరు కళాకారులకూ ఆపాదిస్తారు.
అన్ని దేశాల సామెతలలో ఈ వాస్తవపు ప్రకటన ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది; సామెతలు తర్కబద్ధమైన సాహిత్యరూపాలు, ఏ రకమైన వివరణా అవసరంలేని పరమ సత్య వాక్యాలు. పవిత్ర గ్రంథాలవలె సామెతలు కూడా ప్రతి దేశం యొక్క సహజ జ్ఞానపు భాండాగారమని చెప్పవచ్చు. బద్ధకముతోను, వేషభాషలను మాత్రమే నమ్ముతూ, వాటికి కట్టుబడే ఈ ప్రపంచం, సత్యం వచించే జ్ఞానుల మనసులోని ఆలోచనలను వెల్లడి చేయడానికి అనుమతింపక, ఎటువంటి ఆక్షేపణా రాని విధంగా సామెతల రూపంలో పలుకమని నిర్బంధిస్తుంది. మరియూ నీతికే నీతి వంటి ఈ విషయాలను దైవజ్ఞాన ప్రబోధక పీఠాలు, చట్టసభలు, విద్యాలయాలూ వచింప నిరాకరిస్తే, ప్రతీ నిమిషమూ అన్ని మార్కెట్లలోను, కర్మాగారాలలోను వందలాది సామెతలు ఉపయోగింపబడుతూంటాయి. దాని బోధన పక్షి కీటక ప్రపంచం వలె సర్వవ్యాపకం.
అన్ని విషయాలూ జంటలు - ఒక దానికి ప్రతిగా మరొకటి - కుక్క కాటుకు చెప్పు దెబ్బ; కంటికి కన్ను పంటికి పన్ను; రక్తానికి రక్తం; తూకానికి సరి తూకం; ప్రేమకు ప్రేమ. నీవు ఇస్తే అది నీకు ఇవ్వబడుతుంది. నీరుపోసినవాడికి నీరు లభిస్తుంది. భగవద్వాక్యం వలె- నీదగ్గరేమి ఉంది? చెల్లించి దాన్ని పొందు - నీవు ఎంత చేస్తే అంతే. ఎక్కువా లేదు, తక్కువా లెదు. పని చెయ్యని వాడు తిన కూడదు. ఎలకని ముంచిన కప్ప గద్ద నోట చిక్కింది. శపించిన మరుక్షణమే వాడి శాపం వాడి నెత్తినే చుట్టవిడనారంభిస్తుంది. బానిస పీకకు గొలుసు బిగించిన కొద్దీ దాని రెండో కొస నీపీకకు బిగుసుకోసాగుతుంది. తప్పుడు సలహాలు అవి ఇచ్చినవాడిని ఎక్కువ గందరగోళపరుస్తాయి. తాను భూతాన్నని భయపెట్టింది కాస్తా అడ్డగాడిదనని గ్రహిస్తుంది.
ఈ విధంగా అది లిఖించబడింది, ఎందుకంటే జీవితం అలాంటిదే కనుక. మనం చేసే పని యొక్క ఫలితాన్ని మన మనఃశక్తి కంటే మిక్కుటంగా ప్రకృతి న్యాయం నిర్ణయిస్తుంది. లోకకల్యాణానికి ఉద్దేశించని పనులను క్షుద్రమైన కోరికలతో మనం చేస్తాం గాని మనపనే తనను తాను సరైన గాడిలో పెట్టుకొంటుంది - అయస్కాంత ధృవాలకనుగుణంగా ఆకర్షక వస్తువులు సర్దుకుపోయినట్లు.
మనిషి మాట్లాడలేకపోయినా తన నాణ్యపరీక్ష తాను చేసుకోగలసమర్ధుడు. మనఃపూర్వకంగా గాని, మనఃవ్యతిరేకంగా గాని ఇతరుల ముందు తన అంతః చిత్రాన్ని స్పష్టంగా గీసి చూపిస్తాడు. ఒకరు వెలిబుచ్చే అభిప్రాయం అది వెలిబుచ్చేవారిపైకి తిరిగి మళ్ళుతుంది. అది దారపు ఉండను గురి వైపు విసిరినట్టు; దాని రెండో కొస మన సంచీలోనే ఉంటుంది. లేదా, చేపలవేటలో విసిరే పంట్రకోల (harpoon) లాంటిది - అది చేపదిశగా దూసుకుపోతున్నకొలది పడవలో చుట్టువిడుతూ పోతుంది. పంట్రకోల సరైనది కాకపోతే, లేక సరిగా విసరకపోతే, దాని తాడు విసిరినవాడిని రెండు ముక్కలు చేయడమో, పడవని బోల్తాకొట్టించడమో చేస్తుంది.
తప్పుచేసి ఫలితపు బాధననుభవించక ఉండలేము. బర్క్ చెప్పినట్టు, "ఏ మనిషీ తనకు హాని కలిగించని గర్వాంశాన్ని కలిగియుండలేడు." విలాసవంతమైన జీవనాన్ని అభిలషించేవానికి విలాసపు ఆనందం లభిస్తుందే కాని, ఆ ఆనందం నుండి తాను వెలివేయబడుతాడు. దైవసంబంధ మతసిద్ధాంత వ్యతిరేకి, స్వర్గ ద్వారాలనేవి ఉండవని నమ్ముతూ తన సిద్ధాంతాన్ని విశ్వసించేవారికి అవి లేకుండా చేస్తున్నానని భ్రమ పడతాడు కాని అవి తనకు మాత్రమే లేకుండా చేసుకొంటాడు. ఇతరులను గడ్డిపోచల్లాగ, నీ ఆటలో పావుల్లాగ ఉపయోగించున్నానని నీవు అనుకుంటే, వారు అనుభవించే బాధను నీవు కూడా అనుభవించాల్సిందే. వారి హృదయాలను నీవు పరిగణనలోకి తీసుకోకుంటే, నీ హృదయానికి కూడా నీవు దూరమవుతావు. ఇంద్రియానుభవం అందరికీ ఒకటే; స్త్రీలకు, పసివారికీ, పేదలకూ కూడా. "నేను వాడి సంచీలోనుంచి తీసుకోలేని పక్షంలో వాడి చర్మం నుండి లాక్కుంటాను" అని అర్ధం వచ్చే ముతక సామెత నిజంగా ఒక వేదాంత సూత్రమే.
మన సామాజిక సంబంధాలలోని ప్రేమ, సమన్యాయాల విషయంలో మనం చేసే తప్పిదాలు త్వరితంగా శిక్షింపబడతాయి. అవి భయం చేత శిక్షింపబడతాయి. నేను నా సాటివారితో సామాన్యమైన సంబంధాలను కలిగియుంటే, వారిని కలిసినప్పుడు నాకేమీ అసౌకర్యం కలగదు. పరిపూర్ణమైన ప్రకృతిసిద్ధ వ్యాప్తిచే, నీరు నీటిని కలిసినట్టు, రెండు గాలి కెరటాలు కలిసిపోయినట్టు. కాని ఎప్పుడైతే సంబంధాల్లో సరళత్వం లోపించి అరకొరతనాన్ని, నాకు మాత్రమే మంచి జరిగి అవతలవాడు ఏమైపోయినా ఫర్వాలేదనే తత్వం పొడసూపుతుందో, నా పొరుగువాడు అందులోని తప్పుడుతనాన్ని తప్పక గ్రహిస్తాడు. అతని నుంచి నేను ఎలా ముడుచుకుంటానో తాను నానుంచి అలానే ముడుచుకుంటాడు. అతని కళ్ళు నా కళ్ళను చూడవు; మా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది; అతనిలో ద్వేషం, నాలో భయం మొదలవుతాయి.
సంఘంలో అనూచానంగా మనం వాడే తిట్లూ శాపనార్ధాలు, అవి ఒక వ్యక్తినుద్దేశించినవైనా లేకా మొత్తం సంఘానికి పెట్టినవైనా, ఇంకా అక్రమంగా ఆర్జించిన సంపదలూ అధికారాలూ, వాటి కర్తలకు అదే క్రమంలో శాస్తి చేసి తీరుతాయి. భయం విచక్షణను ప్రబోధిస్తూ, ప్రతీ విప్లవానికీ దూతవలె ఉంటుంది. అది ప్రబోధించే అతి సామాన్య సూత్రం, అది ప్రత్యక్షమయిన చోట సంఘం కుళ్ళిఉన్నదనేది. అది మృతకళేబరాలకోసం తిరుగుతూ అరిచే కాకిలాగ, దాని అఱపును మనం అర్ధంచేసుకోలేము కాని సమీపంలో ఎక్కడో ఒక చావు సంభవించిందని గ్రహించాలి. మన సంపదలు, చట్టసూత్రాలు, నాగరక వర్గీకరణలూ పిరికి లక్షణాలు కలిగినటువంటివి. తరతరాలుగా భయమే ప్రభుత్వాలనూ ఆస్తిపాస్తులనూ నిర్దేశిస్తూ, నేలరాస్తూ వస్తోంది. ఆ వికృత పక్షి అకారణంగా ఇక్కడ లేదు. దాని ఉనికి పెద్ద పెద్ద తప్పులను, వాటిని సరిదిద్దాల్సిన ఆవశ్యకతను సూచిస్తుంది.
ఇదే కోవకి చెందినది - మార్పుగురించిన మన అభిలాష - అందులో మన ప్రమేయం, భాగస్వామ్యాలను మాత్రం నిరాకరిస్తూ. మబ్బుల్లేని మధ్యాహ్నం కలిగించే భీతి, పాలిక్రటీస్ యొక్క మరకతం, మిక్కుటమైన సంపద వలని విస్మయం, దయార్ద్రహృదయులను అసంకల్పితంగానే లోకహిత సత్కార్యాలకు పురిగొల్పడం - విశ్వ న్యాయసూత్రపు తూనిక మనిషి హృదయం మరియు బుద్ధుల ద్వారా సమం అయేందుకు చూపే ఒక సన్నని వణుకులాంటివి.
అనుభవజ్ఞులు చాల స్పష్టంగా తెలుసుకుంటారు - తాము సాగిపోయే దోవలో చేయదగ్గ చెల్లింపులను ప్రశ్నించకుండా చెల్లించుకోవాలని; తరచుగా మనుష్యులు ఒక చిన్నపాటి పిసినారితనానికి భారీ మూల్యం చెల్లించుకుంటూ ఉంటారు. అప్పులు చేస్తూ పోయేవాడు వాటిలో కూరుకుపోతాడు. ఎవరైనా, వంద సహాయ సహకారాలను పొంది ప్రతిఫలం చెల్లించకుండా బతికి బాగుపడ్డాడా? మూర్ఖత్వంతోనో, మోసంతోనో, తన పొరుగువాని సామాను, గుర్రాలు, ధనాలను అపహరించినవాడు ఏమైనా వెనకేసుకోగలిగేడా? పత్రం మీద ఒకవైపు తక్షణావసరనిమిత్తం పొందిన లాభాన్ని నమోదు చెయ్యగానే, రెండో వైపు దాని బాకి అంతే మొత్తంలో నమోదవుతుంది. ఒక వైపు ఘనత, ఇంకో వైపు న్యూనత. ఆ లావాదేవీ అతని, మరియు అతని పొరుగువాని మదిలో ఉండిపోతుంది. ప్రతీ కొత్త లావాదేవీ, దాని తత్వాన్ననుసరించి, వారిద్దరి మధ్య గల సంబంధాన్ని మార్పు చేస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి అతడు ఒక నిశ్చయానికి వస్తాడు: తన పొరుగువాని వాహనంలో ప్రయాణించడం వల్ల కలిగిన బాధ కంటే తన ఎముకలను నుగ్గునుగ్గు చేసుకొన్నప్పుడు వచ్చే బాధే మేలని; మరియు ఒక వస్తువుకు చెల్లించాల్సిన అత్యధిక మూల్యం దానికై దేబిరించాల్సి రావడమేననీ.
వివేకవంతుడు ఈ పాఠాన్ని జీవితపు అన్ని విభాగాలలోకి విస్తరిస్తాడు, మరియు విజ్ఞతతో ప్రతి హక్కుదారును ఎదుర్కొనడం, న్యాయబద్ధంగా వారికివ్వవలసినది వారికి సకాలంలో ఇవ్వటం - ధన రూపేణా, కాల రూపేణా, కౌశల రూపేణా. ఎప్పుడూ నీవంతు నీవు బాకీ లేకుండా చెల్లించు; ఎందుకంటే ఆరంభంలో గాని, చివర్లో గాని నీవు నీ బాకీ అంతా తీర్చివెయ్యాల్సిందే. నీకూ విశ్వ న్యాయానికీ మధ్య వ్యక్తులూ సంఘటనలూ తాత్కాలికంగా నిలవవచ్చు గాక కాని అది నీ ధర్మనిర్వహణకు వాయిదా మాత్రమే. చివరకు నీవు చెల్లించవలసిన బాకీని చెల్లించి తీర్చాల్సిందే. నీవు వివేకవంతుడవైతే, అకస్మాత్తుగా కలిసివచ్చే భాగ్యాన్ని చూసి భీతిచెందుతావు - అది మరింత బరువై పరిణమిస్తుంది కనుక. ఫలం ప్రకృతి ఆఖరు. నీవు పొందే ప్రతీ ఫలానికీ పన్ను ఉంటుంది. ఎక్కువ ఫలాలనొసగువాడు గొప్ప; ఫలాలను స్వీకరించి ఏమీ ఒసగని వాడు హీనుడు. మనకు ఉపకారం చేసినవారికి ప్రకృతిన్యాయ ప్రకారం మనం సహాయం చెయ్యలేము; చేసినా బహు అరుదుగా చేస్తాం. కాని మనం స్వీకరించే ఫలాన్ని ఎవరో ఒకరికి మనం కూడా కలగజేయాలి - క్రియకి క్రియ, మాటకి మాట, పైసకి పైస. మీ చేతిలో కూడుకొంటున్న మంచిని గురించి జాగరూకతతో ఉండండి. అది త్వరితంగా కుళ్ళి పురుగులు పడుతుంది. ఎదో విధంగా దానిని తిరిగి చెల్లించండి.
శ్రమను కూడా ఇదే విధమైన కఠిన న్యాయసూత్రాలు నిర్దేశిస్తూంటాయి. అతి చౌకగా లభించే శ్రమ, వివేకవంతుల ప్రకారం, అతి ప్రియమైనది. ఒక చీపురులో, ఒక చాపలో, ఒక సామాను చక్రాల బండిలో, ఒక కూరలకత్తిలో, మనం కొనుగోలుచేసేది జన సామాన్య వినియోగం కోసం చేసిన మంచి ఆలోచనను. పనిమంతుడైన తోటపనివానికి చేసే చెల్లింపు తోటపనికవసరమైన ఉత్తమ జ్ఞాన నిమిత్తం. నావికునికి చేసేది, నౌకాయానంలో పనికివచ్చే మేలురకపు కౌశలం నిమిత్తం. ఇంటికై వెచ్చించేది, వంట పని, కుట్టు పని, వడ్డింపు మొదలైన వాటికి గాను. నీ ఉద్యోగికి చేసేది, ఖాతాలు మరియు వ్యవహారాల సక్రమ నిర్వహణకు గాను. ఈ విధంగా నీవు నీ ఉనికిని నీ వ్యవస్థ యొక్క అన్ని దెసలలో విస్తరించుకుంటావు. కాని విషయాలలో ఉండే జంటతనం కారణంగా, శ్రమలో గాని, జీవితంలో గాని మోసం ఉండకూడదు. దొంగ తననుండి తానే దొంగిలిస్తాడు. దొంగ లెక్కలతో అపహరించేవాడు తనది తానే అపహరించుకుంటాడు. శ్రమకు సరైన మూల్యం సంపదా ఋణమూ సూచికలుగా కలిగిన జ్ఞానం మరియు ధర్మం. ఈ సూచికలు, కాగితపు ధనం వలె, నకిలీ సృష్టికి, లేదా దొంగతనానికి గురవుతాయి - కాని అవి ప్రాతినిధ్యం వహించే జ్ఞానం, ధర్మం నకిలీ కాబడవు, దొంగిలబడవు. నిర్మలాంతఃకరణల ప్రాశస్త్యాన్నెరిగి వాటికి విధేయులమై స్వయంగా బుద్ధినుపయోగించి శ్రమ తీసుకుంటే తప్ప శ్రమ యొక్క ఫలితం వివరింపజాలనట్టిది. సంపద సముపార్జనలో వినియోగించిన శక్తి, శ్రద్ధాపూర్వక శ్రమ వల్ల కలిగిన భౌతిక, లేదా నైతిక జ్ఞానాన్ని మోసగాడు, ఎగవేతదారుడు, జూదరి హరింపజాలరు. ప్రకృతి న్యాయమేమనగా, శ్రామికుడే శక్తిమంతుడు. శ్రమహీనుడు శక్తిహీనుడు.
మానవ శ్రమ, తన అన్ని రూపాలలోను, ఒక మేకును సూదిగా సానపెట్టటం దగ్గరనించి ఒక నగరాన్నో ప్రబంధాన్నో నిర్మించడం వరకు, విశ్వ పరిహారసూత్రానికి మహోన్నతమైన ఉదాహరణ. ఇచ్చి-పుచ్చుకొనుటలోని పరిపూర్ణమైన సమతూకం, ప్రతిదానికి దాని మూల్యం ఉంటుందని, మూల్యం చెల్లించకపోతే అది కాక వేరొకటి పొందాల్సి వస్తుందని, మూల్యం చెల్లిస్తేనే తప్ప దేనినీ పొందజాలమని తెలిపే సిద్ధాంతం, చిట్టా లెక్కల పుస్తకాలలోని కుడి ఎడమల సంఖ్యల, లేదా చట్టసభలు రూపొందించే బడ్జెట్ లెక్కలకూ, కాంతి ప్రకాశక, అంధకార సూత్రాలకూ, మరియు ప్రకృతిలోని అన్ని చర్య-ప్రతిచర్యలను విశ్లేషించే సిద్ధాంతాలకూ ఏ విధంగా తీసిపోని కచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. ప్రతి వ్యక్తికీ, తనకు తెలిసిన పనిని చేసుకొనేందుకు మార్గనిర్దేశనం చేస్తూ, తన ఉలి మొనన మెరిసే, తన వడంబం, కొలబద్దల సాయంతో కొలవగలిగే, ప్రపంచ చరిత్రలలో అగపడినట్లు, స్పష్టంగా తన రోజువారి పద్దులెక్కల్లో కూడా అగపడే కఠిన న్యాయసూత్రాలు - అతనికి తను ఎంచుకోవలసిన కార్యరంగాన్ని కళ్ళకుకట్టినట్టు నిర్దేశిస్తాయి - అదేమిటన్నదాన్ని ప్రత్యేకించి పేరుపెట్టి వ్యవహరించకపోయినా.
ధర్మానికీ ప్రకృతికీ మధ్యన ఉండే కట్టుబాటు, ధర్మవ్యతిరేకమైనదానిని ప్రతిఘటించే అన్ని విషయాలను ప్రోత్సహిస్తుంది. సుందరమైన న్యాయసూత్రాలు, వాటి సారాలు వంచకులను వెంటాడి మరీ కొరడాలతో కొడతాయి. అతనికి అర్ధమవుతుంది - ప్రపంచ వస్తువులన్నీ సత్యానికీ పరస్పర ప్రయోజనానికీ అమర్చబడి ఉన్నాయనీ, ఒక దుష్టుడిని దాచడానికి మాత్రం ఇంత ప్రపంచంలోనూ ఒక చిన్న కలుగు కూడా లేదనీ. ఒక నేరం చెయ్యండి, ప్రపంచం స్వచ్ఛమైన గాజు గోళంలా మారిపోతుంది. ఒక నేరం చెయ్యండి, భూమి నిండా మంచు తుషారం మందంగా ఏర్పడిపోతుంది - దానిపై అడుగుపెట్టిన నక్క, తిత్తిరిపిట్ట, ఉడత లేదా చుంచు యొక్క పాదపు గుర్తులు స్పష్టంగా పడేందుకు వీలుగా. ఆచూకీ లభించకుండా చేసేందుకు ఆడిన మాటను వెనక్కు తీసుకోలేము, పడిన పాద చిహ్నాన్ని చెరిపివేయలేము, వేసిన నిచ్చెనను లాగివేయలేము. ఒక ముదనష్టపు తప్పటడుగు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది - పొడసూపి పట్టిచ్చేందుకు. ప్రపంచాన్ని ఆవరించే న్యాయసూత్రాలు, పంచభూతాలు నేరగానికి దండనగా మారిపోతాయి.
ఇంకో వైపు, అదే న్యాయం, చేసిన సత్కార్యాల పట్ల కూడా అంతే కచ్చితత్వాన్ని ప్రదర్శిస్తుంది. ప్రేమిస్తే ప్రేమను పొందుతారు. ప్రేమసూత్రమూ బీజగణిత సూత్రం వలె సమీకరణానికి రెండు వైపులా సమానంగా ఉంటుంది. సత్పురుషునికి నిర్మలమైన అతని మంచితనమే అండగా ఉంటూ, అతనికి హాని తలపెట్టబోయినవారినుండి రక్షణ కల్పిస్తుంది. నెపోలియన్ మీదకి దండు వెడలిన సైనిక పటాలాలు అతనిని సమీపించగానే తమ రంగులను విడిచిపెట్టి శత్రువులందరూ మిత్రులుగా మారిపోయినట్టు, అనారోగ్యం, నేరప్రవృత్తి, పేదరికం వంటి అన్ని విపత్తులూ ఉపకారులుగా మారిపోతాయి.
వీచే గాలీ పారే జలమూ - విడివిడిగా తామల్పములయినను –
ప్రతాపవంతులకొసగును మిక్కిలి బలమూ శక్తీ దైవత్వములను.
బలహీనతలూ లోటుపాట్లూ కూడా మంచివారికి ఉపయోగకారక స్నేహితులౌతాయి. ఏ వ్యక్తికీ, తనకు హాని చేయని గర్వాంశం అంటూ లేనట్టే, తనకు మంచి చేయని దోషం కూడా ఉండదు. తన కొమ్ముల సౌందర్యాన్ని చూసి మురుస్తూ అందవికారమైన కాళ్ళను నిందించిన నీతి కథలోని దుప్పి, వేటగాడు తరిమినప్పుడు ఆ కాళ్ళే తనను రక్షిస్తూండగా, కొమ్ముల కారణంగా పొదలో చిక్కి చనిపోతుంది. ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తన లోటుపాట్లకు ధన్యవాదాలు చెప్పాలి. తాను ముఖాముఖీ ఎదిరించక ఏ వ్యక్తీ సత్యాన్ని గ్రహించలేకపోయినట్లు, ఏదైనా గుణం లేదా దోషం తనలో లేకపోవడం, దాని వలన తాను బాధపడడం జరిగినప్పుడు మాత్రమే, వాటిని కలిగిన అవతలివారు వాని సాయంతో తనపై సాధించిన విజయాలను గ్రహించి సదరు అంశాలను గురించిన పరిపూర్ణ జ్ఞానాన్ని సాధిస్తాడు. తన క్షణికావేశం వల్ల తాను సంఘంలో జీవించలేకపోతున్నాడా? ఆ కారణంగా తనతో తాను ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతూ స్వియసహాయకారకమయిన అలవాట్లను పెంపొందించుకుంటున్నాడు - గాయపడిన ఆల్చిప్ప పురుగు మౌక్తిక పదార్ధంతో తన పెంకును పునర్నిర్మించుకున్నట్లు.
మన బలాలు మన బలహీనతలనుంచి ఉద్భవిస్తాయి. రోషం కలిగి దాని నుంచి మన నిగూఢ శక్తులు మేలుకొనాలంటే మనం దెప్పులను, అవమానాలను పరుష వచనాలను ఎదుర్కోవాలి. గొప్పవాడెప్పుడూ చిన్నబుచ్చబడ సంసిద్ధుడై ఉంటాడు. సదుపాయాల తల్పం మీద ఆసీనుడైతే నిద్రలోకి జారుకుంటాడు. దాన్నుంచి తోసివేయబడి, అవమానపరచబడి, ఓడించబడినప్పుడే కొత్తగా ఏదైనా నేర్చుకొన వీలుంటుంది. ఆ సమయాల్లో తాను తన మగటిమి, చాతుర్యాల ఊతంగా మాత్రమే నిలదొక్కుకుంటాడు. వాస్తవాల అవగాహన కలుగుతుంది; తన అజ్ఞానాన్ని గ్రహిస్తాడు; దురహంకారపు భ్రాంతి నుండి విముక్తుడౌతాడు; వివేచన కలిగి అచ్చమైన, అక్కరకొచ్చే ప్రావీణ్యతనందుకుంటాడు. వివేకశాలి తనను తాను వైరిపక్షం దిశగా పడవేసుకుంటాడు. తన బలహీనతల గురించి వారి కంటే తనకు తెలియడమే అతనికి ముఖ్యం. వారినుంచి తనకు కలిగిన గాయం ఎండిపోయి మృత చర్మంలా రాలిపొతుంది; అది తమ విజయంగా వారు గంతులు వేస్తూంటే, అతడు అభేద్యుడుగా నిరూపించుకొంటాడు. స్తుతి కన్న నిందయే క్షేమకరం. ఒక వార్తాపత్రిక నన్ను సమర్ధించే విధంగా రాయడం నాకు నచ్చదు. నాగురించి చెప్పవలసినదంతా నాకు వ్యతిరేకంగా చెప్పినప్పుడు మాత్రమే నా విజయానికి భరోసా లభించినట్లు భావిస్తాను. తేనెపూసినట్టుండే ప్రశంసా వాక్యాలు నన్ను గూర్చి చెప్పినప్పుడు, విరోధుల ఎదుట ఏ రక్షణా లేకుండా ఒంటరిగా నిలబడినట్టు అనిపిస్తుంది. సామాన్యంగా, మనను నాశనం చేయని మన దోషాలన్నీ మనకు ఉపకారులే. తాము సంహరించిన తమ శత్రువు శక్తులు తమకు ప్రాప్తిస్తాయని విశ్వసించే స్యాండ్‌విచ్ దీవుల్లోని ఒక తెగ వారికిలాగే, మనకు కూడా మనచే నిరోధించబడ్డ మనోవికారాల శక్తులు అధీనమవుతాయి.
మనను విపత్తుల, లోపాల, శత్రుభావాల నుండి కాపాడే రక్షకులే మనను, నిజంగా మనం కోరుకుంటే, స్వార్ధపరత్వం, వంచనల నుండి కూడా కాపాడుతాయి. నిర్మించిన వ్యవస్థ అంటే దూలాలూ సీలలూ కానట్టే, అలాగే వ్యాపారంలో ప్రదర్శించే లౌక్యం కూడా జ్ఞానం కాదు. తాము మోసగించబడతారేమోనన్న మూఢవిశ్వాసపు భావనతోనే మనుషులు జీవితాంతం బాధచెందుతారు. కాని ఎవరికైనా తనచేత తప్ప వేరెవరిచేత వంచింపబడడం సాధ్యం కాదు - ఒక వస్తువు ఉండటం, లేకపోవడం ఒకే సమయంలో సాధ్యం కానట్లు. మన బేరసారాలన్నింటిలోను ఒక మూడవ పక్షం, నిశ్శబ్దంగా ఉంటూ వస్తుంది. నిజాయితీతో కూడిన లావాదేవీలు చెడిపోకుండా ఉండే స్పష్టమైన హామీని, ఆ యా లావాదేవీల స్వభావం, ఉద్దేశ్యాలే ఇస్తాయి. కృతఘ్నుడైన యజమానిని సేవించవలసివచ్చినప్పుడు, మరిన్ని ఎక్కువ సేవలందించండి. మీ బాకీలో భగవంతుని పేరుని కూడా జోడించండి. పనిచేసేందుకైన ప్రతీ కదలికకీ ప్రతిఫలం లభిస్తుంది. రావలసిన వేతనం ఎంతకాలం తొక్కిపెట్టబడితే మీకు అంత లాభం; ఈ కోశాగారంనుంచి చక్రవడ్డీ మీద చక్రవడ్డీ లెక్కగట్టి మరీ మీకందించబడుతుంది.
మతవిద్వేషాలతో పీడించుకుతిన్న వారి చరిత్ర అంటే ప్రకృతిని వంచించడానికి చేసిన విఫలప్రయత్నాల చరిత్ర, నీటిని ఎత్తుదిశలో మళ్ళించడానికి, ఇసుకతో తాడు పేనడానికి చేసిన విఫల ప్రయత్నాల వలె. ఆ నాటకంలోని నటులు అనేకులా ఒక్కరా, ఒక నిరంకుశుడా లేదా ఒక క్రూరుల గుంపా అనేది గణింపనక్కరలేదు. ఒక గుంపు అనేది, హేతువుకు దూరంగా, దాని నియమాలను అతిక్రమించి పోవడానికి నిశ్చయించుకున్న వ్యక్తుల సంఘం. అది మనిషి పశువులాగా ప్రవర్తించేందుకు స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయఫలితం. దానికి అనువైన సమయం నిశిరాత్రి. దాని బాహ్య నిర్మాణం లాగే దాని చేష్టలు కూడా వివేకహీనమై ఉంటాయి. అది ఒక నిబంధనను కాలరాస్తుంది; ఒక హక్కుపై కొరడా ఝళిపిస్తుంది; న్యాయానికి గుండుగీసి నల్లరంగు పట్టిస్తుంది - వీటిని కలిగిన వారిపైనా వారి ఇండ్లపైనా విద్వేషాన్నీ నిప్పులనూ వెళ్ళకక్కడంద్వారా. అది, రక్తవర్ణ ధగధగలతో నక్షత్రమండలాన్ని ప్రదీప్తంచేసే అరుణతార జ్యోతినార్పడానికి అగ్నిమాపకయంత్రాన్ని దోలుకుపోయే కుర్రవాళ్ళ పిచ్చి చేష్ట వంటిది. చెఱపవీలులేని అనంతాత్మ అట్టి ముష్కరుల ప్రయత్నాలను వారికే తిప్పికొడుతుంది. అమరవీరుడు అవమానపరుపజాలడు. వానిని గూర్చి చేసే ప్రతి దుర్విమర్శా ఒక అగ్నికీల; వారలంకరించిన ప్రతి కారాగారం, దివ్యంగా అలంకృతమైన ఆలయం; అగ్నికి ఆహుతి అయిన ప్రతి పుస్తకం, వ్యవస్థ ప్రపంచాన్ని మరింత జ్ఞానప్రకాశవంతం చేస్తాయి. అణగదొక్కబడిన, నిషేధించబడిన ప్రతి మాట భూమండలమంతా ప్రతిధ్వనిస్తుంది. వివేకమూ ప్రతిఫలమూ ఎప్పుడూ వ్యక్తుల, సంఘాల దిశగా ప్రయాణిస్తూ, సత్యదర్శనమైన వెంటనే అట్టి దర్శకులకూ, అమరవీరులకూ తమ యోగ్యతకు తగు గౌరవాన్ని ప్రసాదిస్తాయి.
ఈ విధంగా, చోటుచేసుకునే సంఘటనలన్నీ పరిస్థితుల తటస్థత్వాన్ని చాటిచెబుతూంటాయి. మనిషే సర్వస్వం. ప్రతి విషయానికి రెండు ముఖాలుంటాయి - ఒక మంచి, ఒక చెడు. ప్రయోజనానికి పన్ను తప్పనిసరి. కాని పరిహార సిద్ధాంతం తటస్తత్వ సిద్దాంతం కాదు. కాని ఇంతకు మునుపు చెప్పినవి విన్నవారు మూర్ఖంగా ఇలా అంటారు – “మంచి చెయ్యడం వలని ప్రయోజనమేమిటి? సరే మంచీ చెడూ రెండూ ఉన్నాయి; నేను మంచిని స్వీకరించి మూల్యం చెల్లించాల్సివస్తే చెల్లిస్తాను. ఒక మంచిని పొందలేనప్పుడు వేరొక దాన్ని తప్ప పొందుతాను; అన్ని చర్యలూ తటస్థమే” అని.
అయితే విశ్వాత్మలో పరిహార సిద్దాంతమే కాకుండా ఇంకొక అతి నిగూఢ సత్యం, వివేకబుద్ధికి తోచేది, ఉంది - అది, దాని స్వస్వభావం. ఆత్మ ఒక పరిహారం కాదు, ఒక జీవనం. ఆత్మ - ఉన్నది. అంతే. నిరంతరంగా, సరితూకంకలిగిన ఆటు పోటులతో నిండియుండి పరువులెత్తే ఈ పరిస్థితులనబడే నీటి ప్రవాహం మధ్య, పరమ సత్యస్వరూప అనాది తత్వం యొక్క అగాధం ఉంది. సత్యసారం, దైవం, అనేవి దేనికో సంబంధించినవో, దేనిలోనో భాగమో కాదు; అవి వాటికవే పరిపూర్ణత కలిగినవి. ఈ తత్వం వ్యతిరేకార్ధ రహితమైన భావార్ధకమూ, స్వయం సమత్వ సమర్ధమూ అయి వుండి, అన్ని అన్వయాలనూ, భాగాంశాలను, కాలాంశాలనూ తనలో ఇముడ్చుకున్నటువంటిది. ప్రకృతి, సత్యం, ధర్మం అనేవి దీనినుంచి ఉద్భవించినటువంటివి. అధర్మం అది లేని, లేక వెడలిపోయిన స్థితికి నిదర్శనం. శూన్యత, దోషస్వభావం వంటివి కొద్దికాలంపాటు రాత్రి, ఛాయల వలె, నిలవవచ్చుగాక, దానిమీద ప్రస్తుత విశ్వం తనను తాను చిత్రీకరించుకోవచ్చునూ గాక; కాని ఏ వాస్తవమూ దానికి చిక్కదు; అది కార్యకుశలత లోపించినదై ఉంటుంది - ఎందుకంటే, అది లేనిది కనుక. దాని నుంచి ఏ మంచీ జరుగదు; హానీ జరుగదు; అస్తిత్వం కంటె నాస్తిత్వం హానికరం కనుక అదే హాని.
మన దుష్కార్యాలకు దండన విధించబడినప్పుడు మోసం జరిగిందని భావిస్తూంటాం ఎందుకంటే నేరస్తుడు తన అధర్మకార్యాలకూ నియమోల్లంఘనలకే కట్టుబడి ప్రవర్తిస్తాడు తప్ప కనిపించే ప్రకృతిలోని సంక్షోభాలు, న్యాయాలను పరిగణించడు. వాని ప్రవర్తనను కూడా పెద్దగా ఆక్షేపించినవారు కనబడరు. అయితే అతడు న్యాయాన్నించి తెలివిగా తప్పించుకోగలిగేడా? అతడు తన వంచకత్వాన్నీ అసత్యాన్ని తనతో మోసుకుపోతున్నంతకాలం ప్రకృతి యొక్క న్యాయసూత్రాలను గ్రహించలేని రోగిగా జీవిస్తాడు. అర్ధంచేసుకున్న వివేకవంతులకు కూడా దోషం ఎక్కడుందో ఎదో ఒక విధంగా కనిపిస్తుంది. కాని పరిశీలనగా చూస్తే వీటి వ్యత్యస్తత శాశ్వత కాలక్రమంలో చెల్లువేయబడుతుంది.
న్యాయవర్తనాన్ని పొందాలంటే దేన్నో నష్టపోవాలనే నిబంధన కూడా లేదు. ధర్మానికి దండన ఉండదు. అదేవిధంగా జ్ఞానానికి; అవి వ్యక్తి అస్తిత్వానికి సహజ భూషణాలు. ఒక ధర్మ కార్యం ఆచరించినప్పుడు, నేను నా సహజ, శుద్ధ ప్రకృతిని. ఒక ధర్మకార్య నిర్వహణలో, నేను ప్రపంచంలో ఒక ముఖ్యభాగమవుతాను. అయోమయం, శూన్యత ఆవరించిన బీడు భూమిలో పచ్చని మొక్కలు నాటుతూ, ఆ ప్రదేశాన్ని ఆవరించిన దట్టమైన చీకట్లు దిగంతాలకావల పలుచనై మాయమవడం గమనిస్తాను. ప్రేమకు మితిలేదు; అలాగే జ్ఞానానికి, సౌందర్యానికి - ఈ అంశాలను వాటి అతి పవిత్ర భావనలో మనం పరిశీలించినప్పుడు. ఆత్మ పరిమితులను నిరాకరిస్తూ, నిరాశావాదాన్ని దరిచేరనీయక, ఆశావహ దృక్పథాన్నే ధ్రువపరుస్తుంది.
ఆతని జీవితం సదా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగిపోయేదే కాని స్థిర స్థానం కాదు. పరిపూర్ణ విశ్వాసం అతని సహజగుణం. మనిషిని గూర్చి చెప్పేటప్పుడు మన సహజ గుణం "ఎక్కువ" మరియు "తక్కువ" లను పరిగణనలోకి తీసుకుని వర్ణిస్తుంది - అంటే ఆత్మ ప్రత్యక్షతనే గాని దాని పరోక్షతను కాదు. ధైర్యవంతుడు పిరికివాని కన్న గొప్పవాడు; సత్యవంతుడు, ఉదారశీలి, జ్ఞాని మూర్ఖుల కంటే, అజ్ఞానులకంటే ఎక్కువే కాని తక్కువ కాదు. ధర్మం లోని మంచితనానికి అపరాధ రుసుము లేదు; ఎందుకంటే అది సాక్షాత్తు భగవత్ప్రసాదితము, మరి దేనితోను పోల్చదగని పరిపూర్ణ అస్తిత్వం. ప్రాపంచిక అవసరాలకైన మంచికి మాత్రం రుసుము ఉంటుంది; ఇంకా అది యోగ్యమూ లేదా నా స్వేదపూర్వక పరిశ్రమతో వచ్చియుండకపోతే, దానికీ నాకూ ఏ అనుబంధం ఉండదు, తరవాత వచ్చే గాలి కెరటంలో అది నామరూపాల్లేకుండా కొట్టుకుపోతుంది. కానీ ప్రకృతిలోని మంచి అంతా ఆత్మకు చెంది ఉండి, ప్రకృతి సూత్రాలకనుగుణమైన ఖరీదుని - అంటే బుద్ధినీ హృదయాన్నీ ఏకాగ్రం చేసి వెచ్చించిన శ్రమ రూపంలో చెల్లించినట్టయితే దాన్ని మనం శాశ్వతంగా మనం పొందవచ్చు. నేను సముపార్జించని మంచిని నేనిక కోరను - ఉదాహరణకు, బంగారు నాణేల లంకె బిందెలు - ఎందుకంటే నాకు తెలుసు - అది కొత్త బరువులను నాపై పడవేస్తుందని. నాకు మరే భౌతిక వాంచలూ లేవు - ఆస్తిపాస్తులు, సన్మానాలు, అధికారం, వ్యక్తులు ఇత్యాదులలో పొందే లాభం స్పష్టం; దానికై పడే పన్నుకూడా నిశ్చయం. కానీ ప్రకృతి యొక్క పరిహార సిద్ధాంతపు అస్తిత్వాన్ని గుర్తించగలిగేందుకు ఏ చెల్లింపూ అవసరం లేదు, దానిని గురించి విశేష పరిశోధనలు జరపడం కూడా అభిలషణీయం కాదు. ఇప్పుడు నేను ఒక అలౌకిక, అత్యంత నిర్మల మైన శాంతిని అనుభూతి చెంది ఆనందిస్తున్నాను. ఏ మాత్రం తుంటరికార్యాలకవకాశం లేకుండ అన్ని దారులను కుచించివేస్తున్నాను. బెర్నార్డ్ ఋషి చెప్పినట్టు, "నాకు నేను తప్ప మరేదీ హాని కలుగజేయజాలదు; నేను పొందవీలున్న హానిని నాతో బాటే మోసుకువెళ్తున్నా, నా తప్పిదం లేకుండా ఏ హానియొక్క బాధనూ అనుభవించను".
ఆత్మయొక్క ప్రకృతిలోనే పరిస్థితుల యొక్క అసమానతలకైన పరిహారం సిద్ధాంతం ఉన్నది. ప్రకృతిలోని తీవ్ర కష్టనష్టాలు ఈ న్యాయంలోని హెచ్చు తగ్గులని భావించవలసి ఉంది. తక్కువతనం బాధను అనుభవించకుండా ఎలా ఉంటుంది; ఎక్కువతనం పట్ల పగతోనూ శత్రుత్వంతోనూ అది వ్యవహరించకుండా ఎలా ఉంటుంది? బయటివారు అశక్తులను గమనించినప్పుడు వారికి విచారం కలుగుతుంది కానీ ఏం చెయ్యాలో తోచదు. అతడు వారిచూపులకు దొరకకుండా తప్పించుకొంటాడు; వారు గేలిచేస్తారని అతడు భయం చెందుతాడు. వారేం చెయ్యాలి? చూసినవారికి ఇది ప్రకృతిపరమైన అన్యాయమేననిపిస్తుంది. కాని వాస్తవాలను దగ్గరగా పరిశీలిస్తే, పర్వతసమానమైన ఈ అసమానతలు అదృశ్యమవుతాయి. ప్రేమ ఈ రకమైన భావ దౌర్బల్యాలను తగ్గిస్తుంది - సముద్రంలోని మంచుదిబ్బలను సూర్యకిరణాలు తగ్గించివేసినట్లు. అందరు మనుష్యుల హృదయాలూ ఆత్మా ఒకటే కావడం మూలాన, వానిది-నాది అనే మనో వికారాలు సమసిపోతాయి. అతనిది నాదే. నేనే నాకు సోదరుడిని, నా సోదరుడే నేను. నా పొరుగువారు నన్ను మించిన హోదాలూ దర్పాలుకలిగిన గర్వాతిశయంతో వ్యవహరిస్తున్నా, నేను మాత్రం వారిని ప్రేమిస్తూండగలను. ప్రేమను పొందనూగలను; మరియు ప్రేమించేవానికి ఆనందాన్ని, వైభవాన్ని తన ప్రేమయే ప్రసాదిస్తుంది. తద్వారా నేను, నా సోదరుడే నాకు పాలకుడనీ, అతడు అత్యంత స్నేహపూర్వకంగా ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నాడనీ, ఇంతకాలం నేను ప్రశంసించి అసూయపడ్డ అతని సంపద నిజానికి నాదేననీ కనుగొంటాను. ఆత్మ యొక్క ప్రకృతి ఈ విధంగా అన్నివిషయాలను సమతూకంతో పంపిణీచేస్తూంటుంది. జీసస్, షేక్‌స్పియర్ ఆ విశ్వాత్మయొక్క అంశాలు, మరియు నా ప్రేమచే నేను వారిని జయించి వారిని నా జ్ఞాన సామ్రాజ్యంలో ప్రతిష్టించుకొంటాను. అతని ధర్మం - అది నాది కాదా? అతని చతురత - అది నాదిగా చేసుకొనవీలులేకపోతే, అది చతురత కాదన్నమాట.
ఇట్టిదే, విపత్తు యొక్క సహజ చరిత్ర కూడా. కన్నుమూసి తెరిచేలోగా మానవుల సంపదను బుగ్గిపాలు చేసే మార్పులు, ఎదుగుదలయే ప్రాతిపదికగా వర్తించే ప్రకృతి సూత్రపు ప్రకటన. ప్రతి అత్మ, ఈ అనివార్యమైన ఆవశ్యకతవలన, తాను అంతవరకు అలవాటుపడిన పరిస్థితులు, స్నేహితులు, ఇల్లు, ఆచరించే నీతిసూత్రాలు, మతవిశ్వాసం వంటి వాటిని వదిలిపెట్టాల్సి వస్తుంది - శంఖపు చేప తన అందమైన, సురక్షితమైన కర్పరపు ఆచ్చాదన నుంచి, ఎందుకంటే తన తదుపరి ఎదుగుదలను అది నిరోధిస్తున్నందున, బయటికి వచ్చి నూతన గృహాన్ని ఏర్పాటుచేసుకొన్నట్లు.
వ్యక్తి ఉత్తేజ స్థాయిని బట్టి ఈ రకపు విప్లవాలు తరచుగా సంభవిస్తూంటాయి. ఒక ఆనందం నిండిన వ్యక్తి మనస్సులో అవి ధారాళంగా సంభవిస్తూండటంచేత, మరియు ప్రాపంచిక సంబంధాలు వానిని ఏమంత బలంగా బంధించకపోవడంచేత, అతడు ప్రపంచాన్నీ దాని మార్పులను ఒక పలుచని పారదర్శకమైన ద్రవపు పొర నుంచి లోపల కదిలే జీవ పిండాన్ని చూచినట్లు చూడగలుగుతాడు, అంతేకాని, చాల మంది వ్యక్తులలో వలె, ఘనీభవించిన, చలనంలేని విభిన్నాంశాల సంకరత్వంతో అల్లిన వస్త్రంవలె, ఏవేవో తేదీలను గుర్తుపెట్టుకొంటూ, ఒక ఇతమిత్థం కాని శీలంలో బంధించబడిన మనిషివలె కాదు. అప్పుడే పెరుగుదల సంభవించి, నేటి మనిషి నిన్నటి తనను గుర్తించనంతగా ఎదుగుతాడు. కాలప్రమాణంలో మనిషి జీవిత చరిత్ర ఈ విధంగా నడుస్తుండాలి; మృత విషయాలను ఏరోజుకారోజు పక్కకు నెడుతూ; అతడు తన వస్త్రాలను ప్రతిరోజూ కొత్తవి ధరిస్తాడు. కాని, కాలదోషం పట్టిన ఆస్తివ్యవహారాలతో, సదా ఒకే పరిస్థితులలో గడుపుతూ, పురోగతిలేక, ఎప్పుడూ మార్పును ప్రతిఘటిస్తూ, విశ్వ సహజమైన దివ్య వ్యాప్తికి సహకరించకుండా ఉన్నవారికి, ఈ అభివృద్ధి అదురూ బెదురులుగా ఉంటుంది.
మనం స్నేహితులనొదులుకోలేము. మన దేవతలను చేజారనివ్వము. అవి వెళ్ళి ప్రధాన దేవదూతలను మన ఇంటికి పంపిస్తాయన్న విషయాన్ని మనం గ్రహించము. మనది పాత తాలూకు విగ్రహాన్ని ఆరాధిస్తూ కాలం వెళ్ళబుచ్చే తత్వం. ఆత్మయొక్క ఐశ్వర్యాన్ని, దాని నిత్యత్వాన్ని, సర్వ వ్యాపకత్వాన్ని విశ్వసించము. అందమైన నిన్నటి రోజును అదే, లేక అంతకు మించిన శోభతో పునర్నిర్మించగల శక్తి నేడు ఒకటి ఉందనే నమ్మకం మనకు లేదు. మనం, ఇదివరకు మనకు కూడును గూడును జవసత్వాలను ప్రసాదించిన పాత డేరా శిధిలాలలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతామే కాని విశ్వచైతన్యం మనకు అదే విధమైన గ్రాస నివాస జీవశక్తులను నేడు కూడా ఒసగగలదని అనుకొనము. గతించిన అంత ప్రేమాస్పదమైన, మనోహరమైన, సౌభాగ్యవంతమైనదానిని తిరిగి పొందజాలమని తెలుసు; అయినా నిష్ఫలంగా కన్నీరు విడుస్తూ కాలక్షేపం చేస్తాం. భగవంతుని గంభీరమైన ఆదేశం ఈవిధంగా ఉంది: "లేవండి, లేచి ముందుకి సదా సాగిపోతూనే ఉండండి!" అని. మనం శిధిలాల మధ్య చలన రహితులమై ఉండలేము. అలాగని నూత్నత్వం పైన విశ్వాసమూ లేదు; కనుకనే మనం వెనక్కి వెనక్కి చూస్తూ నడుస్తూ ముందుకు పోతాము - అవేవో వెనక కళ్ళ భూతాల్లాగా.
విపత్తుల పరిహారాలు విజ్ఞులకి కూడా స్పష్టంగానే అగుపిస్తాయి, చాలా కాలం తరవాత కూడా. ఒక జబ్బు, ఒక అంగ వైకల్యం, ఒక క్రూరమైన నిరుత్సాహం, ఒక ఆస్తి నష్టం, ఒక మిత్ర నష్టం, ఆ క్షణానికి పరిహారం చెల్లింపు జరగని నష్టంగాను, ఎప్పుడూ ఆ పరిహారం లభించదని కూడా అనిపిస్తుంది. కాని రాబోయే సంవత్సరాలలో ఈ విపత్తులకు విరుగుడు చేసే, అన్ని పరిస్థితులకూ వర్తించే, శక్తులు ఉంటాయి. అత్యంత శూన్యతగా అనిపించే ఒక మిత్రుడు, భార్య, సోదరుడు, ప్రేమించిన వ్యక్తి యొక్క మరణం, తదుపరి కాలంలో ఏదో ఒక విధంగా ఒక మార్గదర్శిగాను, జ్ఞానదాతగాను నిరూపించబడుతుంది. ఎందుకంటే ఆ శక్తి మనందరి జీవితాలలోను సంభవించే ఊహించని మార్పులను నడిపిస్తుంది - ఎదురుచూస్తున్న శైశవ లేదా కౌమార దశకు ముగింపు, వదిలిపోతే చాలనేటటువంటి వృత్తి పని, గృహస్థ జీవితం, లేదా జీవన విధానం; మరియు వాటి స్థానంలో కొత్త వాటిని, వ్యక్తి శీలానికనువైన వాటిని, రూపొందించుకొన వీలు కల్పిస్తుంది. అది అవసరాన్ని బట్టి కొత్త పరిచయాలను ప్రోత్సహిస్తుంది, లేదా నిరోధిస్తుంది; మరియు రాబోవు సంవత్సరాలలో అధిక ప్రాముఖ్యం కలిగియుండవలసిన అంశాలకే మనం ప్రభావితులమై ఉండేలా పరిస్థితులను నడిపిస్తుంది. మిక్కుటమైన సూర్యరశ్మి పైనుంచి ప్రసరిస్తుండగా, వేళ్ళూనుకొను స్థలం లేని ఇంటిలో తోటమాలి నిర్లక్ష్యం చేతనో, పైన కూలిన గోడవల్లనో ఆ పరిమిత జీవనానికి స్వస్తి చెప్పిన తోటలోని పూలమొక్కల్లాటి పురుషుడు లేదా స్త్రీ, ఈ ప్రాకృతిక ప్రభావంతో పునరుజ్జీవం పొంది, అరణ్యంలోని మహా మఱ్ఱివృక్షం వలె వేళ్ళను భూగర్భానికి అన్ని వైపులా ప్రసరించి అదే స్థాయిలో ఉపరితలం పైన కూడా శాఖోపశాఖలుగా విస్తరించి ఎందరికో నీడను, మరెన్నో జీవులకు గ్రాసావాసాలను కల్పించు విధంగా, సర్వ సమర్ధులుగా రూపుదిద్దుకుంటారు.
No comments:
Post a Comment