పన్నెండో సంవత్సరంలో, పంటకోతల ఈలూల్ మాసంలో ఏడో రోజున, ఏ కట్టడాల ఆవరణా లేని కొండ మీదికెక్కి సముద్రం దిశగా చూసి, దూరాన పొగమంచులోనుంచి పడవ రాకను గమనించాడు. అప్పుడతని హృదయ కవాటాలు తెరచుకొని ఆనందోత్సాహాలు సముద్రం లోనికి వెల్లువెత్తాయి. అతను కళ్ళు మూసుకొని నిశ్శబ్దాంతరంగంలో ప్రార్ధన చేశాడు. కొండ దిగటంతోనే మనసు వ్యాకులమై, ఈ విధంగా ఆలోచించాడు: ఏ దుఃఖమూ లేకుండా ప్రశాంతంగా ఇక్కడినించి ఎలా వెళ్ళడం? కాదు, ఆత్మకి ఏ గాయమూ కాకుండా ఈ నగరాన్ని విడిచి వెళ్ళలేను. ఇక్కడి గోడల మధ్య అనుభవించిన వేదనతో పగళ్ళు, ఒంటరితనంతో రాత్రులూ సుదీర్ఘంగా గడిచాయి; ఇంత సుదీర్ఘమైన వేదన నుంచీ, ఒంటరితనం నుంచీ ఏ పరితాపమూ పొందక ఎవరు నిష్క్రమించగలుగుతారు?
ఇన్నాళ్ళూ ఈ వీధులకి జీవం పోశాను, కొండలలో చెంగుచెంగున గెంతులు వేసే ఎందరో పిల్లలను వేచి వేచి మరీ చూసి ఆనందించేవాడిని; వీటినుంచి ఏ బరువూ బాధా లేకుండా వెనక్కి మరలిపోలేను. ఇది ఒంటి మీది బట్టని తీసివేస్తున్నట్లుగా కాక, నాచేత్తో నేనే నా చర్మాన్ని ఒలుచుకుంటున్నంత బాధగా ఉంది. నేను వదిలివేస్తున్నది ఒక జ్ఞాపకాన్ని కాదు, ఆకలిదప్పులతో మాధుర్యాన్నందిన హృదయాన్ని.
అయినా ఇలా ఎంతోకాలం ఉండలేను. అన్ని వస్తువులనూ తనలోనికి ఆహ్వానించే సాగరం నన్ను కూడా పిలుస్తోంది, నేను పడవనెక్కక తప్పదు. ఇక్కడ గంటలకి గంటలు రాత్రులలో కరిగిపోతున్నా, ఈ ప్రవాసం గడ్డకట్టిన కోశంలో నిశ్చేతనంగా పడియుండటం వంటిదే. నాతో పాటు ఇక్కడున్నదంతా తీసుకుపోవాలని ఉన్నా, ఎలా సాధ్యం? నోటినుంచి వచ్చిన మాట, తనకు రెక్కలనిచ్చిన పెదవులనీ నాలుకనీ తనతో పాటు తీసుకుపోగలుగుతోందా? అది ఒంటరిగా శూన్యంలో ప్రయాణించాల్సిందే. గద్ద తన గూటిని మోసుకుపోకుండానే సూర్యునికభిముఖంగా, ఒంటరిగానే ఎగురుతూ పోతుంది.
కొండ పాదాలు చేరిన అతడు మరొక్కసారి సముద్రం వంక తిరిగి, నౌకాశ్రయాన్ని చేరబోతున్న పడవనూ, దానిమీద అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్న తన ఊరి నావికులనూ చూశాడు. ఆత్మ వారికై ఘోషిస్తూండగా, అతనన్నాడు:
అంతరాత్మ వారి సాన్నిహిత్యానికై ఘోషిస్తుండగా, అతనన్నాడు: నా మూలపుటమ్మ ముద్దుబిడ్డలారా, సముద్ర తరంగాలపై స్వారీ చేస్తూ మీరు ఎన్నిసార్లు నా కలల్లోకి వచ్చారో. కాని ఇప్పుడు నా జాగ్రదవస్థలో వాస్తవికంగా మిమ్మల్ని చూస్తూన్నాను. నా కలలన్నింటిలో ప్రగాఢమైనది ఇదే. ఉత్సాహపు తెరచాపనెత్తి గాలివాటుకై ఎదురుచూస్తున్న నేను, బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంక ఈ స్థంభించిన గాలిని ఒక్కసారి పీల్చుకుని, వెనక్కి ఒక్క సారి ప్రేమగా చూసుకుని, నావికుల్లో నావికుడిగా మీ సరసన నించుంటాను. నదీనదాలకు స్వేచ్ఛనీ ప్రశాంతతనీ అనుగ్రహించే మహాసాగరమా, ఈ చిరునీటిపాయ ఇక్కడి పిల్లకాల్వలవెంబడి ఆఖరుసారిగా నీతో గుసగుసలాడుతుంది. తరవాత ఏ కట్టడీలేని ఈ బిందువు అనంత సాగరజలాలను చేరుతుంది.
అతను నడవబోతూ, అల్లంత దూరాన పొలమూ తోటల్లోని పనులు విడిచిపెట్టి పురుషులూ స్త్రీలూ నగర ద్వారం వైపు పరుగెత్తుకుంటూ రావటం గమనించాడు. పడవ వచ్చిన సంగతిని ఒకరికొకరు కేకలు వేసి చెప్పుకోవటం, తన పేరును బిగ్గరగా పిలవటమూ అతను విన్నాడు.
తనలో ఇలా అనుకున్నాడు: నా మహాభినిష్క్రమణం మహాజనసమ్మేళన దినమా? నా సాయంసంధ్య వాస్తవానికి నా తొలిసంధ్యా? దున్నుతున్న నాగలిని, నడుస్తున్న మరచక్రాన్నీ అలాగే వదిలేసి పరుగుపరుగున నన్ను చేరు వారికి నేను ఏమివ్వగలను? వారందరికీ కోసి పంచేందుకు నా హృదయం ఫలాలతో నిండిన మహావృక్షం కావాలా? వారి పాత్రలు నింపేందుకు నా కోరికలు ఊట బావిలా పొంగాలా? నేను మహాసత్వపు హస్తం మీటబోవు వీణనా, అతడు ఊపిరులూదు వేణువునా? సదా మౌనకాంక్షినైన నేను నా మౌనంలో ఏ నిధులు సముపార్జించాను, నిబ్బరంగా వీరికిచ్చేందుకు? ఈ దినం నా పంట చేతికొస్తుందనుకొంటే, ఏ క్షేత్రాల్లో నేను సేద్యం చేశాను, గుర్తుకురాని ఏ రుతువులలో? ఈ క్షణాన్న నేను నా చేతిలోని లాంతరునెత్తి చూసుకుంటే, అందులో వెలుగుతున్నది నా జ్వాల కాదే. ఖాళీ, నిస్తేజ దీపాన్ని మాత్రమే నేను ఎత్తితే, నిశీధి పాలకుడు దానిని చమురుతోనింపి వెలిగిస్తాడు కూడా.
వీటిని మాటలుగా అతను పలికాడు. కాని చెప్పవలసింది చాలా హృదయంలోనే ఉండిపోయింది. ఎందుకంటే తన నిగూఢ రహస్యాన్ని వెల్లడిచేయ అతడే ఆశక్యుడయ్యాడు.
అతను నగరంలో ప్రవేశించగానే ప్రజలందరూ అతనిని కలిసేందుకు వచ్చి, ఉద్వేగభరితంగా ఒకే గొంతుతో అన్నట్టు బిగ్గరగా ఏదో చెబుతున్నారు. నగర పెద్దలు అతనికెదురుగా నిలబడి అన్నారు: ‘మమ్ములను వీడిపోకు. మా సాయంసంజలో మిట్టమధ్యాహ్నపు తేజఃపుంజంలా ప్రవేశించావు, నీ యవ్వనోత్సాహం కనేందుకు మాకు కలలను ప్రసాదించింది’.
‘మాకు నీవు అపరిచితునివీ కావు, అతిథివీ కావు. అత్యంత ప్రియతముడవైన మా కుమారుడవు. నీ దర్శనాన్ని తిరస్కరించి మా కళ్ళకు బాధకలిగించకు.’
అక్కడి పూజారులూ పూజారిణులూ అన్నారు: సాగరతరంగాలు మానుంచి నిన్ను వేరుచేసి నీవు మాతో గడిపిన సంవత్సరాలను జ్ఞాపకాలుగా మార్చివేయనివ్వకు. ఒక చైతన్యమూర్తిలా మా మధ్య నడిచిన నీ నీడలో మా ముఖాలు ప్రకాశవంతమయ్యాయి. నిన్ను అంతగా ప్రేమించాము. మా ప్రేమ నిశ్శబ్దంగా ముసుగుల వెనక దాగి ఉంది ఇన్నాళ్ళూ. కానీ ఇప్పుడు వేయిగొంతులతో అది నీ కోసం ఘోషిస్తోంది, ఆచ్ఛాదనం నుండి బట్టబయలై నీ ముందు నిలుచుంది. ప్రేమ తన లోతును తాను తెలుసుకునేది ఎడబాటు సమయంలోనే కదా.
మిగతావారు కూడా వచ్చి అతడిని ప్రార్ధించారు. కాని అతను సమాధానమియ్యలేదు. తలవంచుకుని మాత్రమే నిలుచున్నాడు; అతనికి సమీపంలో నించొన్నవారు అతని కన్నీరు వక్షస్థలంపై జాలువారడం గమనించారు.
అప్పుడు అతనితో ప్రజలందరూ ఆలయ ప్రాంగణంలోని పెద్ద మైదానాన్ని చేరుకున్నారు. అంత ఆలయ మఠంలోనుంచి అల్-మిత్ర అనే స్త్రీ బయటకు వచ్చింది. ఆమె ఒక యోగిని. ఆమె వైపు అతను అత్యంత బేలగా చూశాడు, ఎందుకంటే అతను అక్కడికి వచ్చిన తొలిరోజే అతనిని గుర్తించి నాటి నుండి అతనిపట్ల పరిపూర్ణవిశ్వాసం కలిగియుందామె. ఆమె అతనిని ప్రస్తుతించి ఇలా అన్నది: దైవ ప్రవక్తా, మహదానందం కలిగించే నీ నావ రాకను నిరీక్షిస్తూ ఎంతెంతో దూరాలు నీవు ప్రయాణించావు. ఇప్పుడు అది వచ్చింది కనుక నీవు వెళ్ళవలసిందే. నీ జ్ఞాపకాలూ ఆకాంక్షల ఆవాసమయిన మాతృభూమికై నీ అపేక్ష ప్రగాఢమైనది. మా ఆశల బంధం గానీ అవసరాల నిర్బంధం కానీ నీకు ఉండవు.
అయితే మమ్ము విడిచి వెళ్ళేముందు నీ సత్యాన్ని వెల్లడించమని కోరుతున్నాము. దానిని మేము మా సంతానానికి, వారు వారి సంతానానికి ఇచ్చుకుంటూ, అది నశించకుండా కాపాడుకుంటాము. నీ ఏకాంతంలో మా పగటి వ్యాపకాలను గమనించావు, నిశిలో జాగరూకుడవై నిద్రావస్థలోని మా రోదనలు, నవ్వులను విన్నావు. కనుక ఇపుడు మాకు మమ్ములను తెల్లము చేసి, జనన మరణాల మధ్య దశలో నీవు చూసినదంతా మాకు వివరించు.
అతనీవిధంగా సమాధానమిచ్చాడు: ఆర్ఫలీస్ ప్రజలారా, ఈ క్షణంలో కూడా మీ అంతరాళాల్లో చైతన్యమై కదులుతున్న దానికంటే కొత్తగా మీకేమి చెప్పగలను?
ప్రేమ
అల్-మిత్ర అడిగింది, "ప్రేమ గురించి చెప్పండి"
అతను తలెత్తి జనం వంక చూసాడు. ఒక్కసారి అంతా నిశ్శబ్దమయింది. గంభీరమైన కంఠంతో అతనిట్లు అన్నాడు: ప్రేమ ఆహ్వానించినప్పుడు, క్లిష్టమైన, జారుడు మార్గాల్లో అయినా సరే, దానిని అనుసరించి పొండి. తన బాహువులు చాచినప్పుడు సమ్మతించి లొంగిపొండి - రెక్కల్లో దాగిన అతని కత్తి గుచ్చుకుంటున్నా సరే. అతను మాట్లాడినప్పుడు, ఆ గొంతు పుష్పఫలభరితమైన ఉద్యానాన్ని చెత్తకుప్పలా మార్చగలిగే ఉత్తరపు గాలి వంటి తీవ్రతగలదైనా, ఆ మాటలను విశ్వసించండి.
ఎందుకంటే ప్రేమ మీకు కిరీటమూ పెడతాడు, అలాగే శిలువా కొడతాడు. అతను మిమ్ము పెంచేవాడు, అదే చేత్తో తుంచేవాడు. సూర్య కాంతిలో మిలమిల మెరిసే మీ శిఖరాగ్ర తరుశాఖల పైని మృదుల హస్తంతో లాలించి, కిందికి దిగి మీ చుట్టు తవ్వి పీకి మీ వేళ్ళకంటిన మట్టిని దులుపుతాడు. జొన్న కంకుల్ని కట్ట కట్టినట్టు అతడు మిమ్మల్ని మీరుగా ఉంచేందుకు పోగు చేస్తాడు. మిమ్మల్ని దులిపి దులిపి దిగంబరంగా చేస్తాడు. రాలిన మీ నుంచి పొల్లును వేరు చేస్తాడు. మీరు స్వచ్ఛమైన తెల్లదనం పొందేలా విసరి విసరి పిండి చేస్తాడు. మీరు మృదువుగ, కోమలంగా అయ్యేలా మర్దిస్తాడు. అప్పుడు తన పవిత్రాగ్నిలో కాల్చి, భగవంతుని నివేదనకుగాను మిమ్మల్ని రొట్టెగా తయారుచేస్తాడు.
మీ హృదయ రహస్యాలను మీరు తెలుసుకొని, ఆ జ్ఞాన సహాయంతో విశ్వహృదయంలో మీరూ ఒక స్వల్పాంశమయ్యేందుకు, ప్రేమ ఇవన్నీ మీకు చేస్తాడు.
కాని, భయంచేత మీరు ప్రేమ యొక్క శాంతినీ సౌఖ్యాన్నీ మాత్రమే అభిలషిస్తే, అప్పుడు మీరు మీ నగ్నత్వాన్ని కప్పుకొని ప్రేమ మిమ్మల్ని దివ్యనివేదనకు సిద్ధంచేయకుండానే, ఏ ఋతుపరిమళమూ లేని ప్రపంచంలోకి నడచిపోవటం మంచిది. అక్కడ మీ నవ్వుల్లో హర్షోల్లాసాలుండవు, మీ దుఃఖంలో అశ్రువులు స్రవించవు.
ప్రేమ తననే ఇచ్చుకుంటుంది, తననుంచే తీసుకుంటుంది. దేనినీ స్వాధీనపరచుకోదు, తాను స్వాధీనం కాదు. ఎందుకంటే ప్రేమకు సాటి ప్రేమే.
మీరు ప్రేమిస్తున్నప్పుడు, "నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు" అని కాక, "నేను భగవంతుని హృదయంలో ఉన్నాను" అని చెప్పుకోవాలి. ఇంకా, ప్రేమకి దిశా నిర్దేశం చేయగలమని మీరు భావింపరాదు ఎందుకంటే, మీరు అర్హులనుకుంటే ప్రేమే మీకు దిశానిర్దేశం చేస్తుంది.
తనను తాను పరిపూర్ణం చేసుకోవలన్నది తప్పితే ప్రేమకు మరే కోరికలూ ఉండవు. కానీ మీరు ప్రేమిస్తూ, కోరికలు కూడా కలిగియుండాలనుకుంటే, ఆ కోరికలు ఇవి కావాలి: నిశ్శబ్దనిశిలో తన మధుర సంగీతాన్ని వినిపించే అమృతజలాల ఊటపాయలా కరిగి ప్రహించాలనీ. అత్యాహ్లాదకరమైన సౌకుమార్యంలోని కాఠిన్యాన్ని గ్రహించగలగాలనీ. ప్రేమవిషయమై మీకున్న అవగాహన వలన కలిగే గాయపు రక్తస్రావాన్ని, ఇష్టపడి, సంతోషంతో భరించాలనీ. ప్రతి ఉషోదయానికీ, కొంగ్రొత్త రెక్కలుతొడిగిన హృదయంతో, మరో రోజు ప్రేమించే అవకాశాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు చెప్పాలనీ. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునే గంట సేపూ ప్రేమలోని తన్మయత్వాన్ని ధ్యానిస్తూండాలనీ. సూర్యాస్తమయ వేళ కృతజ్ఞతలు నిండిన హృదయంతో ఇల్లు చేరాలనీ; మరియు రాత్రి, నీవు ప్రేమించేవారిని పెదవులు ప్రశంసిస్తూండగా, వారి యోగక్షేమాలకై ప్రార్ధిస్తూ నిద్రకుపక్రమించాలనీ.
వివాహం
అల్ మిత్రా మళ్ళీ అడిగింది, "వివాహం సంగతేమిటి ప్రభూ?"
సమాధానంగా అతడు చెప్పదొడగేడు: మీరు జతగా జన్మించారు, జతగానే ఉంటారు. తెల్లని రెక్కల మృత్యువు మీ సాన్నిహిత్యాన్ని చెదరగోట్టే వరకు జతగానే ఉండాలి. భగవద్ధ్యానపు మౌనంలో కూడా మీరు జతపడే ఉండాలి. కాని మీ సాన్నిహిత్యంలో ఎడం ఉంచండి. దాని గుండా దివ్యలోకాల మలయసమీరాలు యధేచ్ఛగా నర్తించనివ్వండి.
ఒకరినొకరు ప్రేమించండి, కాని పాశాలనల్లుకోకండి; ప్రేమ మీ ఇరు ఆత్మలనే సముద్రతీరాల మధ్య జీవోత్తుంగతరంగాలు ఎగిసిపడే సముద్రంలా ఉండాలి. ప్రేమామృతంతో ఒకరి పాత్రనొకరు నింపుకుంటూ ఉండండి, కాని ఒక్క పాత్రనించే దానిని తాగేయకండి.
ఒకరికొకరు ఆహారం ఇచ్చుకోండి, కానీ ఒకే పళ్ళెంలోనుంచి తీసుకుని తినేయకండి. పాడండి, ఆడండి, ఉల్లాసంగా ఉండండి, కాని ప్రతి ఒక్కరూ ఎకాంతంగా, వేరువేరుగా ఉండండి – అన్నీ కలిసి సుస్వర సంగీతం పలికించే వీణలోని తీవెలు దేనికదే వేరుగా ఉన్నట్టు.
హృదయాలను ఒకరికొకరు అర్పించుకోండి కానీ స్వాధీనపరుపకండి. ఎందుకంటే సృష్టి యొక్క దివ్య హస్తమే మీ హృదయాలను తన అధీనంలో ఉంచుకోగలట్టిది. మరీ దగ్గరగా కాక కలిసి నిలవండి: ఆలయ స్థంభాలు విడివిడిగానే మహోన్నతంగా నిలిచినట్లుగా, మరియు మహావృక్షాలు వేరువేరుగానే తప్ప ఒకదానినీడన మరొకటి మనని విధంగా.
సంతానం
అప్పుడు, వక్షానికి శిశువునదుముకున్న స్త్రీ ఒకామె అంది, "సంతానం గురించి మాకు చెప్పండి".
అతడు చెప్పాడు: మీ సంతానం మీది కారు - తన శాశ్వత మనుగడ కోసం ప్రగాఢంగా ఆరాటపడే జీవచైతన్యం యొక్క పుత్రులు, పుత్రికలూను. వారు మీ ద్వారా కాని మీ నుంచి వచ్చినవారు కారు, మరియు, మీతోనే నివసిస్తున్నప్పటికీ మీకు చెందిన వారు కారు.
వారికి మీరు ప్రేమనివ్వగలరు కాని ఆలోచనలను కాదు; వారి సొంత ఆలోచనలు వారికున్నాయి. మీ ఆశ్రయం పొందేవి వారి శరీరాలే కాని ఆత్మలు కావు, ఎందుకంటే వారి ఆత్మలు, మీరు కలలో కూడా దర్శించలేని భవిష్యత్తుని ఆశ్రయించుకుని ఉంటాయి. వారిలా ఉండేందుకు మీరు ప్రయాస పడండి కానీ మీలా ఉండమని వారిని కోరవద్దు. కారణం, బ్రతుకు వెనక్కి నడవదు, గతంతో అంటకాగదు. మీరు, సంతానమనే చైతన్యోల్లసితమైన శరాలను వెలువరించే ధనువులు మాత్రమే.
అధీశ్వరుడగు విలుకాడు అనంతవిశ్వంలో ఆనవాలును గుర్తించి తన శరాలు వాడిగా, సుదూరంగా దూసుకుపోయే విధంగా తన శక్తితో మిమ్ములను సంధించి వదలుతాడు. అట్టి మేటి విలుకాని చేతిలోని మీ వంపు శుభసంతోషాలనొసగాలి; ఎందుకంటే అతను పరువెత్తే అమ్ములనే కాక, వానిని వెలువరించే స్థిరమైన ధనువును కూడా ప్రేమిస్తాడు.
దానం
అప్పుడొక ధనికుడు అన్నాడు, "దానమివ్వడం గురించి చెప్పండి".
అతడిలా చెప్పాడు. నీ వస్తుసంపదలను ఇచ్చినప్పుడు నువ్వు అతి స్వల్పమైన దానం చేసినట్టు. నిన్ను నీవు పరిపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే నీవు నిజంగా ఇచ్చినవాడవవుతావు. ఎందుకంటే, రేపనే రోజున ఏమి అవసరం వస్తుందోనన్న బెంగతో కూడబెట్టి అహర్నిశలూ కాపలా కాచుకున్నది కాక వస్తుసంపదంటే మరేమిటి? తీర్థయాత్రలకు పోయే భక్తులను వెంబడిస్తూ, తిరిగి తీసుకుందామనే తమకంతో ఆనవాళ్ళు మిగలని దారిలో గుంట తవ్వి బొమికెను పాతిపెట్టుకున్న అతి జాగ్రత్తపరురాలైన కుక్కకు రేపనే రోజున ఏమిటి దక్కింది? దారిద్ర్యభయం కన్న దారిద్ర్యం ఏముంది? పుష్కలంగా త్రాగేనీరు ఉన్నప్పుడు కూడా దాహార్తిగురించి బెంగపడేవాడిది ఎన్నటికీ తీరనిదాహమే కదా? కొందరు, తమకున్న అధిక సంపదలోనుంచి కొంత భాగాన్ని నలుగురిలో పేరు ప్రతిష్టకోసం ఇచ్చినప్పుడు, దాచుకున్న ఈ కోరిక వలన ఆ దానంలో పరిపూర్ణత లేకుండా పోతుంది. మరికొందరు తమకున్నది స్వల్పమైనా, అంతా ఇచ్చివేస్తారు. ఇట్టివారు జీవితంపై పరిపూర్ణ విశ్వాసం కలిగియుండేవారు, మరియు వారి ఖజానా ఎప్పటికీ నిండుకోదు.
కొందరు ఇవ్వడంలో ఆనందం పొందుతారు, ఆ ఆనందమే వారిదానానికి ప్రతిఫలం. ఇంకొందరు బాధతో ఇస్తారు, వారికి ఆ బాధే ప్రాయశ్చిత్త స్నానం. మరికొందరు ఏ బాధా పడకుండ, ఎటువంటి ఆనందాన్ని కోరుకోకుండా, అదొక ధర్మకార్యమనే స్పృహ కూడా లేకుండా ఇచ్చివేస్తారు - నందనవనంలోని కదంబవృక్షం తన పరిసరాలను దివ్య సుగంధ పరిమళభరితం చేసినట్టు. అట్టివారి హస్తాలద్వారా పరమేశ్వరుడు పలుకుతాడు. వారి కన్నులవెనుకనించి మందహాసంతో సృష్టిని వీక్షిస్తూంటాడు.
అడిగినప్పుడు ఇవ్వటం మంచిదేకాని అడగకుండా, అర్ధంచేసుకుని ఇవ్వడం ఉత్తమమైనది; నిరంతర దానానురక్తుడైన ధర్మాత్మునికి ఇచ్చుటకన్న, అది స్వీకరించే వారికైన అన్వేషణ మరింత ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇవ్వక దేనిని దాచుకుందామని మీ ప్రయత్నం? ఏదో ఒకనాడు సర్వం ఇచ్చివేయవలసినదే; కనుక ఇప్పుడే ఇవ్వండి, అలా చేస్తే వాస్తవిక వర్తమానంలో ఇచ్చిన ఆనందం మీదే అవుతుంది, మీ వారసులది కాక.
తరచు మీరంటుంటారు, "నేను ఇస్తానుగానీ అర్హులకి మాత్రమే" నని. మీ ఉద్యానవనంలోని వృక్షాలు కానీ మీ పంటసీమల్లో విహరించే పశుపక్ష్యాదులు కాని అలా అనటంలేదే - కారణం, బతుకు పరమార్ధం ఇవ్వడమే, పోగుచేసుకోవటం పోగొట్టుకోడానికే. జీవించేందుకు పవళ్ళూ రాత్రులూ మాత్రమే కలిగిన వానికి, మిగిలినవన్నీ మీ నుంచి తీసుకునే అర్హత ఉన్నది. జీవన సాగరంలోని అమృతపానానికి అర్హుడైన ప్రతివాడు నీదైన అమృతధార నించి తన పాత్రను నింపుకొన అర్హుడే. దానస్వీకరణ యొక్క ధైర్యము, విశ్వాసము, ఇంకా చెప్పాలంటే ఉదారతలకన్న యోగ్యత ఏమున్నది? అట్టివారు తమ చొక్కాలను చింపి మీ పరిశీలనకోసం తమ యోగ్యతలనూ అభిమానాన్నీ నిర్లజ్జగా బట్టబయలు చేసుకోవాల్సిందని అడిగేందుకు మీరెవరు? ముందు మీరు దాతగానూ, ధర్మాచరణసాధనంగానూ అయేందుకు అర్హులో కాదో చూసుకోండి. వాస్తవానికి జీవితమే జీవితానికి దాత; కాగా మీరు, మీరే దాతనని భావించుకున్నప్పటికీ, ఈ మహాపవిత్ర సృష్టిప్రక్రియకు కేవలం ఒక సాక్షి మాత్రమే.
మరియు దానగ్రహీతలు - మీరంతా - ఏ రకమైన కృతజ్ఞతనూ కలిగియుండరాదు, అలా చేసిన పక్షంలో మీరు మీ మెడమీదే కాక దాత మెడ మీద కూడా బరువైన కాడిని వేసుకున్నట్టే. దానిబదులు, దాతతో సమానంగా, అతనిచ్చిన దానాలనే రెక్కలనధిరోహించినవానివలె, అతనితో సమానంగా వృద్ధినందండి; కారణం, స్వీకరించిన బహూకృతులను గురించి మీరేదో ఋణపడిపోయామని అదేపనిగా మనోవ్యాకులత చెందినప్పుడు, మీరు అత్యున్నత ఉదారశీలి అయిన భూమాతను తల్లిగాను, పరమాత్ముని తండ్రిగాను కలిగిన దాత యొక్క దాతృత్వాన్ని సందేహించినట్లవుతుంది.
ఆహారపానీయాలు
అప్పుడు పూటకూటింటి నిర్వాహకుడైన వృద్ధుడొకడు అన్నాడు, "ఆహార పానీయాల గురించి చెప్పండి."
అతనిలా అన్నాడు.
గరికమొక్కవలె మీరుకూడా భూమియొక్క సుగంధాన్ని, లేలేత సూర్యకిరణాలను మాత్రం గ్రహించి జీవించగలితే బాగానే ఉండేది. కాని మీ ఆకలితీర్చేందుకు ఇంకో ప్రాణం తియ్యాల్సి రావడం, దాహోపశమనానికి ఒక నవజాతశిశువు నోటిముందలి పాలను లాక్కుపోవలసి రావడం వల్ల, ఆ చర్యలను కూడా ఒక భగవదారాధనలా చేపట్టండి. మరియు ఒక పవిత్ర బలిపీఠంపై అరణ్యాలయందలి, మైదానాలయందలి అత్యంత అమాయకప్రాణులను, వానికన్న ఎన్నోరెట్లు పవిత్రము, అమాయకమూ అయి మానవుల హృదయస్థమైన దానికై బలిగావించండి.
పశుపక్ష్యాదులను తినాల్సి వచ్చే సందర్భాలలో, వానితో ఈ విధంగా హృదయంలో చెప్పండి: "నిన్ను సంహరిస్తున్న శక్తి చేతిలోనే నేను కూడా సంహరించబడతాను. నిన్ను నా హస్తగతం కావించిన న్యాయసూత్రమే నన్ను మరింత బలిష్టమైన హస్తపరం గావిస్తుంది. మనిద్దరి రక్తమూ దివ్యలోక మహావృక్షాలకు అమృతసారంగా మారుతుందేకాని వృధాపోదు.
మరియు, ఒక ఫలాన్ని పళ్ళతో కొరుకుతున్నప్పుడు, హృదయంలో ఈ విధంగా చెప్పండి: "నీ విత్తనాలు నా శరీరంలో జీవించియే ఉండుగాక, నీ ఱేపు నా హృదయంలో వికసించి అభివృద్ధిగాంచుగాక. నీ సుగంధం నా ఊపిరై, ఆ విధంగా మనిద్దరం అన్ని ఋతువులందూ ఆనందంతో జీవిస్తాముగాక.
ఆకురాలుకాలంలో, తోటలనుండి మద్యపు మరలో వేసి నలుగగొట్టేందుకు తెచ్చి పోగు చేసిన ద్రాక్షల కోసం, హృదయంలో ఈ విధంగా అనండి: "నేనూ ఒక ద్రాక్షతోటనే, మరియు రసం కోసం నా నుంచి కూడా ఫలాలు సేకరించబడతాయి, కొత్త మద్యంవలె నేనుకూడా అనశ్వరమైన పాత్రలలో నిక్షిప్తంచేయబడవలసినదే." చలికాలంలో, మధుపాత్రగైకొని భాండం లోంచి మధువును గైకొని సేవించేటప్పుడు, ప్రతి గుక్కకోసం హృదయంలో ఒక గేయాన్ని, శిశిరానికీ, ద్రాక్షతోటకూ మరియు మద్యపుమరకూ ఒక మధురజ్ఞాపకమై నిలిచేలా, ఆలపించండి.
శ్రమ
అప్పుడొక వ్యవసాయదారుడు అడిగిగాడు, "శ్రమ గురించి చెప్పండి."
అతను సమాధానమిచ్చాడు: ఎట్టి విరామమూలేక నిరంతరమూ పరిభ్రమిస్తున్న భూమి గమనాన్నీ, ఆత్మనూ అనుసరిస్తూ నీవు కూడా పనిచేస్తూ ఉండాలి. ఎందుకంటే సృష్టిచక్రంలో నిష్క్రియాపరులు దశాదిశాలేని అపరిచితులై, అనంతవిశ్వచైతన్యం ముందు గర్వంగా తలొంచి మౌనంగా, గంభీరంగా సాగే మహా జనప్రవాహంనుంచి వేరుపడిపోతారు.
పనిచేస్తున్నప్పుడు నీవే ఒక వేణువులా, నీహృదయం లోనుంచి మౌనంగా నడిచే పనిగంటలు దివ్యస్వరాలు పలికిస్తాయి. మిగతా అందరూ ముక్తకంఠంతో ఆలపిస్తూండగా కేవలం ఒక వాయిద్యపు మీటలా మూగగా, నిశ్శబ్దంగా మిగిలిపోయేందుకు మీలో ఎవరు సిద్ధం?
పని ఒక శాపమనీ, శ్రమ దౌర్భాగ్యమనీ అనటం మీరు వింటూ వచ్చారు. కానీ, శ్రమించి పనిచేసినప్పుడు మీరు సృష్టి యొక్క ప్రగాఢస్వప్నాన్ని సాకారంచేస్తున్నారని, ఆ స్వప్నం అంకురించిన క్షణమే మీకు కేటాయించబడిందనీ, మరియు నిరంతర శ్రమలో లీనమయ్యేవారు, జీవితాన్ని నిజంగా ప్రేమిస్తున్నవారనీ, శ్రమద్వారా జీవితాన్ని ప్రేమించడం అంటే అతిగుహ్యమైన సృష్టి రహస్యంతో సాన్నిహిత్యం కలిగియుండటమని నేనంటాను.
మీబాధలో, జననం ఒక ప్రారబ్ధమనీ, దేహనిర్వహణ నుదుటిపై వ్రాయబడ్డ శాపమనీ భావిస్తే, దానికి నా సమాధానం, నుదుటి రాతను సరిదిద్దగలిగేది ఆ నుదుటికి పట్టిన చెమటే.
జీవితమంటే అంధకారమని కూడా మీకు చెప్పారు; అలసటలో ఉన్న మీరు, అలసినవారి వాక్కులనే అప్పచెప్తారు. నేనంటున్నాను, పరమగమ్యం లేని జీవితం అంధకారం, జ్ఞానప్రకాశం కాని గమ్యం అంధం, శ్రమతోచేరని జ్ఞానం అనర్ధం, ప్రేమలేని శ్రమ అసంపూర్ణం. మీరు ప్రేమతో పనిచేసేటప్పుడు మీ నిజతత్వాలతోను, ఒకరికొకరితోను మరియు భగవంతునితోను అనుసంధానించుకుంటారు.
శ్రమను ప్రేమించటం అంటే? మీకు అత్యంత ప్రేమాస్పదులు ధరిస్తారని మీ హృదయతంత్రులనే దారప్పోగులుగా చేసి అపూర్వ వస్త్రాన్ని నేయటం, వారు ఉంటారని కడుజాగ్రత్తతో అత్యంతవాసయోగ్యమైన భవంతిని నిర్మించడం, వారు తింటారని అన్నిదశలలోనూ మెళకువ వహించి ఆహారాన్ని పండించి తెచ్చుకోవటం వంటి పనుల్లో మీరు చూపే శ్రద్ధ. మరియు గతించిన మహనీయులందరూ మన ప్రతికదలికనూ గమనిస్తున్నారనే స్పృహనూ అప్రమత్తతనూ కలిగి మీ ప్రతి దైనందిన చర్యనూ మొక్కుబడిలాకాక శ్రద్ధాపూర్వకమైన ఆత్మశక్తితో నిర్వహించటం.
తరచూ మీరు, నిద్రలో అన్నట్టుగా, అంటుండడం వింటాను, "పాలరాతి శిల్పి, తన ఆత్మస్వరూపాన్ని ఆ రాతిలో ఆవిష్కరించగలగడంవలన, అతడు భూమిని దున్నేవానికంటె అధికుడు, అలాగే ఇంద్రధనువులోని వర్ణసౌందర్యాన్ని ఒడిసిపట్టి వస్త్రం మీద పరచి మానవుల హృదయాన్ని చూరగొన్నవాడు, ఆ మానవుల పాదాలకు చెప్పులు తొడిగే వారికన్న అధికుడు" అని. నేనంటాను, అదిన్నీ నిద్రలో కాక, ప్రచండ మాధ్యాహ్నిక భానుతేజస్సమానమైన తెలివిడితో - వాసంత సమీరం మహావృక్షాలతో మాత్రం మధురంగా మాట్లాడి గరిక పోచలను చులకనగా చూడదు. అట్టి గాలి సామాన్య ప్రసారాన్ని తన ప్రేమతరంగాలతో సంగీతసంపన్నం చేసి మరింత వన్నెకలుగజేయువాడే గొప్పవాడు.
దృగ్గోచరంకాని ప్రేమకు దృశ్యరూపమే శ్రమ. మీ శ్రమలో ప్రేమకాక అయిష్టత మాత్రమే ఉంచగోరితే, మీరు అ పనిని విడిచిపెట్టి, నిరంతర ప్రేమానురక్తులతో పనిచేసుకునేవారి కార్యస్థలపు మెట్లమీద భిక్షమెత్తుకోవటం మేలు. ఎందుకంటే అయిష్టతతో వండిన ఆహారం రుచిహీనమై, ఆర్తుని అర్ధాకలిని మాత్రమే తీరుస్తుంది. మద్యపుమరలో ద్రాక్షాసవాన్ని తీస్తున్నప్పుడు మీ మనస్సులో ఈర్ష్యాద్వేషాల్లాంటివి ఉంటే అవి ఆ పానీయంలోకి విషంలా ప్రవేశిస్తాయి. మీరు సుస్వరంగా అప్సరాగానమే చేస్తున్నప్పటికీ, ఆ పనిని ప్రేమించని పక్షంలో, పగలూ రాత్రులలో కర్ణకఠోరంగా వినిపించే బయటి శబ్దాలకు మీ గానం కూడా తోడై వినేవారి చెవులను మెలిపెట్టివదులుతుంది.
సుఖదుఃఖాలు
ఒక స్త్రీ అడిగింది, "సుఖదుఃఖాల గురించి చెప్పండి"
అతడు సమాధానమిచ్చాడు: సుఖమని మీరు భావించేది అనాచ్ఛాదితమైన దుఃఖమే. ఏ బావినుండి అయితే మీ హర్షోల్లాసాలు ఉప్పొంగుతుంటాయో అట్టిది తరచుగా దుఃఖాశ్రువులతో నిండియున్నట్టిది. లేకుంటే ఎలా? దుఃఖం మీ హృదయాన్ని ఎంత లోతుకు తొలుస్తుందో అంత ఎక్కువ ఆనందాన్ని మీరు భరించగలుగుతారు. నేడు విలాసవంతమై మీచేతినలంకరించియున్న మధుపాత్ర ఒకప్పుడు కుమ్మరి కొలిమిలో దహించబడ్డ మన్నే కాదా? అమృతభరితమగు సంగీతాన్ని వీనులకు విందుచేసే వీణ పదునైన కత్తులతో తొలచబడ్డ చెక్క కాదా? అమితానందంగా ఉన్న క్షణాల్లో, ఒక్కసారి హృదయగాఢాంతరాళాల్లోకి తొంగి చూస్తే మీరే కనుక్కుంటారు మీకు ఒకప్పుడు దుఃఖాన్ని ఇచ్చిందే ఇప్పుడు హర్షాన్నిస్తున్నదని. అలాగే విషాదం కమ్మినప్పుడు కూడా చూస్తే మరల గ్రహిస్తారు ఇప్పుడు దేనికొరకైతే విలపిస్తున్నారో అదే మీకు ఒకప్పుడు మహదానందదాయకమయినదనీను.
మీలో కొందరంటారు, "సుఖదుఃఖాల్లో సుఖమే ఆధిక్యమైనదని, మరికొందరు, దుఃఖమే ఆధిక్యమైనదనీను.
నేను మీకు చెప్పేది, అవి రెండు పరస్పర అవిభాజ్యాలు. మీవద్దకు జతగానే వస్తాయి, ఒకరు వీధిఅరుగు మీద వేచియుంటే రెండవది మీ పడగ్గదిలో నిద్రిస్తూంటుంది.
రెంటి మధ్యా త్రాసులోని సిబ్బెలవలె తూగిసలాడేది మీరే. హృదయం ఏ భావాలూ లేక శూన్యమయిపోయినప్పుడు మాత్రమే త్రాసు తూగిసలేకుండా నిలకడగా ఉండేది. కోశాధికారి తన స్వర్ణరజతాలను తూచుకొనేందుకు మిమ్మల్ని కదుపుతూ పోతున్నప్పుడు, మీ ఆనందవిషాదాలు కూడా తదనుగుణంగా లేచి దిగుతూంటాయి.
ఇళ్ళు
ఒక మేస్త్రి ముందుకువచ్చి ఆడిగాడు, "మాకు ఇళ్ళగురించి చెప్పండి"
అతడు చెప్పాడు:
నగరం మధ్యలో ఇల్లుకట్టుకొనడానికి ముందుగా మీ ఊహాశక్తికి తగినట్టు నిర్జనాటవిలో ఒక ఆహ్లాదకరమైన పొదరింటిని అల్లుకోండి. సంజెవేళకి మీరు గూటికి చేరినట్లుగానే, నిలకడలేని, సుదూరాలకు ఒంటరి ప్రయాణాలు చేస్తూ పోయే మీ అంతరంగంలోని ఊహావిహారి కూడా ఒక గూడు చేరుకోవలిసి ఉంటుంది. మీ గృహం మీ స్థూల శరీరం. అది సూర్యగమనాన్ననుసరించి వృద్ధినందుతూ, నిశీధి నిశ్చలత్వంలో నిద్రపోతుంది; దానికి కలలుండవని అనుకోకండి. మీ గృహం కలలు కనదూ? కంటూ కంటూ నగరాన్ని వదలి ఉద్యానాలలోనో పర్వతాగ్రాలలోనో విహరించదూ?
నేను మీ ఇళ్ళనన్నింటిని గుప్పిట్లోకి తీసుకుని క్షేత్రజ్ఞుడు విత్తనాలు చల్లినట్టు వాటినన్నింటినీ అరణ్యాలలోకీ మైదానాలమీదికీ వెదజల్లగలిగితే; సువిశాలమైన లోయలే మీ వీధులై, కనుచూపుమేర విస్తరించే పచ్చికబయళ్ళే వాకిళ్ళై, నిత్యఫలభరితాలైన ద్రాక్షతోటల్లో మీరు ఇరుగూ పొరుగై, భూమిలోని సహజ సుగంధం మీ వస్త్రాలను పరిమళభరితంచేస్తూ ఉంటే ఎంతబాగుండేది. కాని ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి.
వారికుండే భయాలవలన మీ పూర్వీకులు మిమ్మల్ని మరీ దగ్గర దగ్గరగా కూడగట్టారు. ఆ భయం ఇంకొద్ది కాలం ఉండేలాగే ఉంది. అంతవరకు మీ పొలానికీ పొయ్యికీ మధ్య ఆడ్డుగోడలై నగర ప్రాకారాలు ఉండాల్సిందే.
చెప్పండి, ఆర్ఫలీస్ ప్రజలారా, ఈ ఇళ్ళల్లో మీకోసం ఉన్నవేమిటి? గడియలు బిగించి దేనిని రక్షించుకుంటున్నారు? మీ శక్తిని ప్రకటించే నిశ్శబ్దమైన కాంక్ష, శాంతి ఉన్నాయా? ఆత్యున్నతమైన ఆలోచనల శిఖరాగ్రాన ఆర్చీల్లా స్థిరంగా కూర్చుండే జ్ఞాపకాలున్నాయా? హృదయాన్ని కృత్రిమ దారుశిలా కట్టడాలమధ్యనించి పావననిశ్చలపర్వతాగ్రంవైపు నడిపించగలిగే సౌందర్యం ఉందా? చెప్పండి, మీ ఇళ్ళల్లో వీటిని మీరు కలిగియున్నారా? లేక ముందు అతిథిలా వచ్చి తరవాత గృహస్తుగామారి క్రమేపీ మీమీద పెత్తనం చెలాయించే యజమానిలా రూపాంతరంచెందే ఇంద్రియసుఖాలూ అవిచాలవని మరిన్నింటికోసం ఎదురుచూపులూ మాత్రమేనా?
గుర్తుంచుకోండి, అది కొరడానూ అంకుశాన్నీ చేబూని మహోదాత్తమైన మీ జీవితాశయాలను తాను ఎలా ఆడిస్తే అలా ఆడే కీలుబొమ్మల్లా మార్చేస్తుంది.
దాని చేతితొడుగులు పట్టువలె మృదువైనవైనా, హృదయం పాషాణం. శరీరసుఖమే పరమావధి అన్న భ్రమలో మిమ్మల్ని నిరంతరంగా ఉంచేందుకు అది నిద్రను మీకనుగ్రహిస్తుంది. సర్వసమృద్ధమైన మీ ఇంద్రియాలను అపహాస్యం చేసి అవి ఇంకే సవాళ్ళకూ నిలవలేనివిధంగా ముట్టుకుంటే పగిలిపోయే పచ్చిమట్టికుండల్లా చేసి వదిలేస్తుంది. విషయభోగేఛ్ఛ ఆత్మజిజ్ఞాసను పరిమార్చి ఉత్తరక్రియలుకూడా దగ్గరుండి జరిపించి మరీ అక్కడినుంచి నిష్క్రమిస్తుంది అన్నది నిస్సందేహం.
కానీ మహాకాశపు బిడ్డలారా, విశ్రాంతిలోకూడా వ్యాకులపడే మీరు, చిక్కుపడరాదు, లొంగదీయబడరాదు. గృహం జీవననౌకకు గమనాన్నిచ్చే తెరచాపకావాలి కాని బంధించే లంగరు కాకూడదు. అది ఒక పుండును కప్పిన పారదర్శకపు చర్మపుపొరలా కాక నేత్రాన్ని సంరక్షించే కనురెప్పవలె ఉండాలి. తలుపులకు కొట్టుకుంటాయన్న భయంతో చేతులు ముడుచుకొమ్మని, చూరుతగులుతుందని తలవంచుకు పొమ్మని, గోడలు బీటలిస్తాయని గట్టిగా ఊపిరి కూడా తియ్యనియ్యని గృహాలు మీకు తగనివి. జీవించియున్నవారికోసం గతించినవారు నిర్మించిన సమాధులవంటి గూళ్ళలో మీరు నివసింపకండి. ఎంత ఐశ్వర్యాడంబరాలతో ముచ్చటపడి కట్టుకున్నప్పటికీ, మీ గృహం మీ రహస్యాలను గానీ దానిపట్ల మీ వెర్రి అపేక్షను కాని సొంతంచేసుకోరాదు.
ఎందుకంటే పరిమితుల్లేని మీ అంతశ్శక్తి శాశ్వతనివాసం, ప్రభాతవీచికలు ద్వారాలుగా, నిశీధిలో తేలియాడే మధురగానాలూ మౌనకెరటాలూ గవాక్షాలుగా కలిగియున్న అనంతాకాశహర్మ్యంలో అని గ్రహించండి.
దుస్తులు
నేతపని నిపుణుడు అడిగాడు, "ధరించే దుస్తులగురించి చెప్పండి."
దానికతడు: మీరు ధరించు దుస్తులు మీ అందాన్ని చాలామటుకు కప్పగలిగినా, మీ అందవికారతను కప్పియుంచవు. దుస్తుల్లో మీరు వ్యక్తిగతగోప్యతను ఆనందిస్తారు కాని దుస్తులు మీకు తొడగబడ్డ గొలుసుల్లా, బరువైన గుర్రపుజీనులా ఉన్నట్టు కనుగొంటారు. మీరు సూర్యప్రకాశ వాయుప్రసారాలనుండి ఎక్కువప్రయోజనాన్ని బాహ్యవేషం నించికాక మీ సహజమైన చర్మంద్వారానే గ్రహించగలిగితే బాగుండును. కారణం, సృష్టి ప్రాణశక్తి సూర్యకాంతిలోను, క్రియాశక్తి గాలికెరటాల్లోను కదా ఉండేది.
మీలో కొందరంటారు, "మనదుస్తులను ఉత్తర గాలులే కదా నేసింది." అని. నేనంటాను, నిజమే అది ఉత్తర గాలులే, సిగ్గనే మగ్గం మీద, బిగితగ్గిన నరాలతో అతను వీటిని నేశాడు. పని పూర్తవ్వగానే అతను నిర్జనాటవిలో పరిహాసంగా నవ్వుకున్నాడు. పాతివ్రత్యసహజమైన లజ్జ దోషభూయిష్టమగు కళ్ళనుండి రక్షణకొరకేనని మరువకండి. మరియు అట్టి దోషమే లేనప్పుడు లజ్జ అంటే మనసుమీద పడవేసుకున్న శృంఖల, మనసుకు అంటిన మకిలే కద.
పుడమి ఆచ్చాదనలేని మీ పాదాలతోనూ, మలయపవనాలు తేలియాడే మీ కురులతోనూ ఆడుకోడానికి తహతహచెందుతాయని మాత్రం మరువకండి.
క్రయం - విక్రయం
ఒక వర్తకుడడిగాడు, "కొనుగోళ్ళూ అమ్మకాలగురించి కూడా చెప్పండి."
దానికాతడు సమాధానంగా అన్నాడు: భూమి తన ఫలాలను ఉదారంగా మీకొసగుతుంది. మీకు తెలిసిందల్లా వాటిని దోచుకోవటమే అయితే మాత్రం మీరు వాటిని కోరుకోవటం తగదు. భూమినుండి పొందిన ఒకదానికి సరి అయిన వేరొకటి మీరు ఇస్తున్నప్పుడే సృష్టిలో సమృద్ధిని పొంది సంతృప్తినందగలరు. అట్టి ఇచ్చిపుచ్చుకోవటంలో ప్రేమ, న్యాయం లోపిస్తే అది కొందరిని దురాశాపరులను చేసి కొందరిని ఆకలితో మాడుస్తుంది.
సముద్రంలో, పొలంలో, పండ్లతోటల్లో మీ శ్రమను ధారపోయువారా, మీరు నేతపనివారిని కుమ్మరిపనివారలను సుగంధద్రవ్యాలు సేకరించు వారిని సంతలో కలుసుకొన్నప్పుడు, సృష్టి అంతనూ నడిపించే ఆత్మశక్తిని మీ ఇరువురి మధ్యగల తూనిక త్రాసులలోనికి ఆహ్వానించి విలువకు సమానమైన విలువను ఇరువైపులవారికీ అనుగ్రహించాల్సిందిగా ప్రార్ధించండి. మరియు చేతిలో ఏసరుకూ లేకుండా, కేవలం మీ శ్రమను తమ మాటలలో శ్లాఘిం చు వారిని నొప్పించక, వారితో ఈ విధంగా అనండి:
"మాతో కలిసి చేలలోకి కానీ, మా సోదరులతో కలిసి సముద్రంలోనికి కాని రండి. పుడమీ కడలీ మాతో సమానంగా మిమ్ములను కూడా అనుగ్రహిస్తాయి."
ఇంకా, అక్కడికి పాడేవారు, ఆడేవారు, మురళివాయించు వారు వస్తే, వారు ఇచ్చేవి కూడా వారి నుండి తీసుకోండి. మీవలెనే వారు కూడా ఫలసౌరభాలను సేద్యంచేయువారే, మరియు, అవి కలలచే తయారైనవి అయినా, మీ జీవాత్మకు ఆహారాన్నీ అచ్ఛాదననూ ఇస్తాయి.
సంతను వదిలిపెట్టే ముందు, ఏ ఒక్కరూ ఉత్తచేతులతో ఇంటికి తిరిగిపోకుండా చూడండి. ఎందుకంటే మీలోని అతిరిక్తుల అవసరాలు తీరని పక్షంలో ఆ రాత్రి విశ్వాత్మ ప్రశాంతంగా విశ్రమించలేడని గుర్తుపెట్టుకోండి.
నేరము మరియు శిక్ష
ఒక న్యాయాధికారి లేచినుంచొని అన్నాడు, "నేరమూ శిక్షల గురించి చెప్పండి."
అతడు సమాధానంగా అన్నాడు: ఆత్మ మీమ్ములనొదిలి గాలిమీదకి షికారుపోయినప్పుడు, ఒంటరివారై మరియు రక్షణలేనివారై, ఇతరులకు, తద్వారా మీకుమీరు, చెడును ఒనరిస్తారు. అందుకు ప్రతిగా, పోయినరక్షణకోసం అది లభించే ఇంటి తలుపు తట్టి ఒకింతసేపు వేచియుండాల్సి ఉంటుంది.
మీలోని దివ్యాత్మ అనంతసాగరంవంటిది; అది ఎల్లకాలమూ అకలుషితమై ఉండగలుగుతుంది. ఆకాశంవలె అది ఎగిరేసామర్థ్యాన్నివ్వగలదు కాని అది రెక్కలుకలిగినవారికి మాత్రమే ఇస్తుంది. ఇంకా మీ దివ్యాత్మ సూర్యునివలె కూడా భాసిస్తుంది; దానికి చుంచు పోయే మార్గం గురించి కానీ విషసర్పపు కలుగుండే చోటుగురించి కూడా ఏమీ తెలియదు. అయితే మీ దివ్యాత్మ ఒక్కటే మీ శరీరంలో ప్రతిష్ఠితమై ఉండదు. మీలో చాలా మటుకు మనిషిగా తయారయినా, ఇంకా కొంతభాగం అపరిపక్వ దశలోనే ఉండి, దారి కానరాని దారులవెంబడి నిద్రలో నడుస్తూ తన పరిపూర్ణజాగృతికై నిరీక్షిస్తుంటుంది. వీనిలో, మనిషిగా రూపాంతరం చెందిన మీకు ఇది చెబుతున్నాను:
ఎందుకంటే అటు దివ్యాత్మగాను, ఇటు అపరిపక్వదశలో సంచరించువానిగాను కాక, మనిషిగా మారిన మీకే, ఈ నేరమూ శిక్షల గురించి తెలిసియుంటుంది.
తరచుగా మీరనుకోవడం విన్నాను, తప్పుచేసినవ్యక్తి మీలోనివాడు కాడనీ, మీ సత్ప్రపంచంలోకి చొరబడిన అపరిచితుడనీ. కాని నేనంటాను, ఎంతటి మహోన్నతులూ ధర్మాత్ములూ కూడా మీలో ప్రతివానిలోని అత్యున్నత దశకు ఎక్కలేనట్లే, ఎంతటి కపటులూ బలహీనులూ మీలో ప్రతివానిలోని అత్యధమ దశకు దిగజారలేరు. చెట్టు నిశ్శబ్దమైన ఎరుక లేకుండా దానిలోని ఒక్క ఆకుకూడా పచ్చబారనట్టు, మీలో ఏ ఒక్కడూ మీ అందరి అంతర్లీన సమిష్టి చిత్తసంకల్పం లేకుండా తప్పూ చేయలేడు. పెద్ద ఊరేగింపుగా మీరందరూ మీ మీ దివ్యాత్మదిశగా పోతున్నారు. మీరే మార్గము, మీరే మార్గాన్వేషకులూనూ. అట్టి ప్రస్థానంలో ఎవరైనా కాలుజారి పడ్డారంటే, అది వెనుక అనుసరించివచ్చేవారికి దారికడ్డంగా ఉన్న రాతిగురించిన ఒక హెచ్చరిక.
అలా పడినవారు, వడివడిగాను తొట్రుపాటూ లేకుండా పోగలుగుతున్నప్పటికీ, దారిలోని రాయిని గుర్తించి దానిని తొలగించాలనే బాధ్యతను విస్మరించి పోతున్న తన ముందువారికోసం, తాము పడ్డారన్నమాట.
ఇంకా గుండెకు బరువైనా, ఇది కూడా వినండి: హతుడు తన చావుకు తాను బాధ్యుడు కాకపోడు, సొమ్ముపోయినవానికి తనసొమ్ము దొంగలించిన పాపంలో భాగం ఉండకుండా ఉండదు. దుర్జనుల పాపకార్యాలలో సజ్జనులు పూర్తిగా నిరపరాధులుకారు, సత్పురుషుడు, పాతకుడొనరించిన పాపం ఏమీ అంటనంత పరిశుద్ధుడు కాడు. అవును, నేరగాడు తరచుగా తన బాధితుని బాధితుడే. మరీ తరచుగా, శిక్షపడ్డవాడు నిష్కళంకుల, నిర్దోషుల భారాన్నే మోస్తుంటాడు. మీరు అన్యాయం నించి న్యాయాన్ని, కుటిలతనించి మంచినీ వేరుచేయలేరు. తెలుపూ నలుపూ దారాల కలనేతలా అవి పగటివెలుగులో ఒకటిగా కలిసే నించుంటాయి.
వీటిలో నల్లదారం తెగిపోయినప్పుడే, నేతకారుడు మొత్తం వస్త్రాన్ని అవలోకించి మగ్గాన్ని పరీక్షించుకోవాలి.
మీరు కట్టుతప్పిన భార్యను న్యాయం ముందు నిలబెట్టాలనుకుంటే, అదే న్యాయపు తక్కెడలో ఆమె భర్త హృదయాన్నీ అంతరాత్మనూ కూడా నిశితంగా తూచండి. దోషిని కొరడాదెబ్బలు కొట్టేవాడిని ఆ దోషి ఆత్మలోనికి చూడనివ్వండి. ధర్మం పేరుతో పాపవృక్షాన్ని నరకసిద్ధపడినవారు, దాని వ్రేళ్ళను పరీక్షించండి; తప్పనిసరిగా వారు వ్రేళ్ళలోని మంచీ చెడులు, ఫలకారకములు మరియు ఫలనాశకములు అన్నీ భూహృదయపు నిశ్శబ్దక్షేత్రంలో ఒకదానితో ఒకటి అభేదంగా అల్లుకొని యుండటం గమనిస్తారు.
న్యాయబద్ధులగు న్యాయాధికారులారా. అంతరంగంలో చోరబుద్ధికలిగి బహిరంగంగా నిజాయితీపరుడైనవానికి మీరు వేయు శిక్ష ఏమిటి? బహిరంగంగా హత్యగావించి అంతరంగంలో అంతకు వెయ్యిరెట్లు హత్యగావించబడేవానికి మీరొసగే దండన ఏమిటి?
బహిరంగంలో వంచకుడూ నిరంకుశుడూ అయి, అంతరంగంలో బాధితుడూ బలాత్కృతుడూ అయిన వానిని మీరేవిధంగా విచారిస్తారు?
తమ పాపం కన్న అధికంగా పశ్చాత్తాపం పొందినవారిని మీరేవిధంగా దండిస్తారు? పశ్చాత్తాపమే కదా, మీరొసగే అన్ని శిక్షల పరమావధి? అట్టి పశ్చాతాపాన్ని నిందపడనివారికి కలిగించలేరు, నిందపడినవారి హృదయం నుండి తీసివేయలేరు.
ఎవరూ పిలవకుండా అది ఒక రాత్రప్పుడు వస్తుంది, మనుషులు మేల్కాంచి తమను తాము పరీక్షగా చూసుకొనేందుకు. చెయ్యబడ్డ పనులను పట్టపగటివెలుగులో చూడలేనప్పుడు మీకు న్యాయంగురించిన పూర్ణప్రజ్ఞ ఎలా సమకూరుతుంది? అలా చూడగలిగినప్పుడే మీకు తెలుస్తుంది, నిలబడ్డవారు కిందబడ్డవారూ కూడా మీలో ని దివ్యాత్మ మరియు మరుగుజ్జు దశల అల్లికగా నిలిచిన ఒకే వ్యక్తి అని, మరియు మీ మందిరపు మూలశిల దాని అట్టడుగు పునాదిరాయికంటె ఉన్నతమైనది కాదనీ.
న్యాయసూత్రాలు
ఒక న్యాయవాది అడిగాడు, "మేము రాసుకుంటున్న న్యాయసూత్రాల మాటేమిటి గురువర్యా?"
అతడు చెప్పాడు: మీకు న్యాయసూత్రాలు రాసుకోవడం సరదా, అయితే వాటిని అతిక్రమించటం ఇంకా సరదా. చిన్నపిల్లలు సముద్రం ఒడ్డున ఇసుకగూళ్ళు శ్రద్ధగా కాట్టీ మళ్ళీ వాటిని కేరింతలు కొడుతూ కూలద్రోసినట్లు. మీరు గూళ్ళు కడుతున్నంతసేపూ సముద్రం మీకు ఇసుకను ఇస్తూనే ఉంటుంది, కట్టినగూళ్ళను తొక్కి మీరు గెంతులు వేస్తున్నప్పుడు సముద్రం కూడా మీతోపాటే గంతులువేస్తుంది. సముద్రం అమాయకులతోనే కలిసి ఎప్పుడూ నవ్వుతుంటుంది.
కానీ ఎవరికైతే జీవితం సముద్రం కాక గట్టిశిలయో, మానవనిర్మిత న్యాయసూత్రాలు ఇసుకగూళ్ళు కాక ఉలితో కష్టపడి చెక్కుకున్న శిలాశాసనాలో, వారి సంగతి ఏమిటి? గెంతులువేసేవారిని ద్వేషించుకునే అవిటివ్యక్తి గురించి ఏమిటి? తన మెడమీది కాడినే ప్రేమిస్తూ స్వేచ్ఛగా చెంగుచెంగున ఎగిరే జింకనూ కణుజునూ చూసి ఊర ద్రిమ్మరులనుకునే ఎద్దు సంగతేమిటి?
వృద్ధాప్యంవల్ల తన కుబుసం విడువలేనిదై, అలాచేయు సర్పాలను చూసి లజ్జాహీనులూ దిగంబరులూ అని భావించే ముసలి పాము సంగతేమిటి? పెళ్ళివిందుకి అందరికంటే ముందుగా వచ్చి పొట్టపగిలేలా తిని భుక్తాయాసంతో ఇంటిదారిపట్టి ఈ విందులన్నీ ప్రకృతివిరుద్ధాలూ అవితినేవారు చట్టవ్యతిరేకులూ అని భావించువారి సంగతేమిటి?
ఇటువంటివారిగురించి ఏమని చెప్పాలి, వారుకూడా సూర్యకాంతిలోనే నుంచొన్నప్పటికీ, సూర్యునికి వీపునిచ్చి నిలబడ్డవారని కాకపోతే? వారు చూసేది తమ నీడలనే, మరియు తమ నీడలే వారి న్యాయసూత్రాలు. వారికి సూర్యుడు నీడలను సృష్టించువానిగానే కద కనబడేది? వారు న్యాయసూత్రాలను అనుసరించడమంటే ఏమిటి, నేలపై కూర్చుని నీడకోసం తడుముకోవడం కాక? అలాకాక సూర్యునికెదురుగా నడుస్తూ పోయే మీలోనివారిని ఏ చాయలు పట్టి బంధించగలవు? గాలితో ప్రయాణించే మీకు ఏ రేకుపుంజు చూపే గాలివాటపు అవసరం ఉంది? మనుషుల ఖైదు గోడలమీదికి మెడమీది కాడిని స్వేచ్ఛగా విసిరికొట్టిన మీకు ఏ మానవనిర్మిత సూత్రాలు వర్తిస్తాయి?
ఎవరి బంధనపు గొలుసులూ కాలికి తగలకుండా నర్తించు మీకు ఏ చట్టాలభయం ఉంటుంది? ఉడుపులను ఒడుపుగా ఒలిచి ఎవరిదారికీ అడ్డంరాని విధంగా పారవేసిన మీకు వ్యతిరేకంగా తీర్పెవరు చెప్పగలరు? ఆర్ఫలీస్ ప్రజలారా, మహా అయితే మీరు ఢంకా చర్మం ఊడదీయగలరు, వీణతీగలను వదులు చేయగలరు, కాని ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ దిగంతాలను తన సుమధురగానంతో సమ్మోహనపరచే కోయిల నోటికి తాళంవెయ్యగలరా?
స్వేచ్ఛ
ఒక వక్త అడిగాడు, "స్వేచ్ఛ గురించి మాకు చెప్పండి."
అతడు సమాధానమిచ్చాడు: ఇంట్లోనూ ఇంటిబయటా కూడా మీరు మీదైనదైన స్వేచ్ఛ ముందు మోకరిల్లడం నేను చూశాను, తమను అతడు సంహరించబోతున్నప్పటికీ ఒక నిరంకుశుని ముందు మోకరిల్లి ప్రస్తుతించే బానిసప్రజల్లా. దేవాలయగర్భంలోనూ కోటబుర్జు చాయల్లోనూ, మీలో అధికస్వేచ్ఛాజీవులమనుకొనేవారు, తమ స్వేచ్ఛను మెడమీది కాడిలా, సంకెలబంధనాల్లా పైన వేసుకోవడంకూడా చూశాను. అంతరాళాల్లో నా హృదయం రక్తాన్ని స్రవించింది; ఎందుకంటే స్వేచ్ఛ కావాలనుకొనే అభిలాషకూడా మదిలో ప్రవిశించనప్పుడే, స్వేచ్ఛను ఒక జీవిత లక్ష్యంగా, పరమావధిగా, మీరు భావించుట మానుకొన్నప్పుడు మాత్రమే నిజంగా మీరు స్వేచ్ఛను పొందినట్టు. పగటిసమయాల్లో దినం ఎలా గడుస్తుందని గానీ, రాత్రులలో తీరని కోరికలూ మూగే సమస్యలు అధిగమించటమెలా అనిగానీ ఇసుమంతైనా స్పృహ లేకుండా, నిజంగా ఈ రెండు కాలావస్థలలోనూ మిమ్మల్ని తీవ్ర ఆందోళనలో పడవేసే పరిస్థితులున్నప్పటికీ, వాటినుంచి ఏరోజుకారోజు స్వచ్ఛంగా, ఏ బంధనాలకూ కట్టుబడకుండా, నిశ్చింతగా, ఏ బాదరబందీ లేకుండా బయటికి రాగలిగిననాడు మీకు నిజంగా స్వేచ్ఛ లభించినట్లు.
అయితే జ్ఞానంప్రవేశించే దశలో మీకుమీరుగా తగిలించుకున్న సంకెళ్ళను మీరు ఛేదించనంతవరకు కబంధహస్తాల్లా ప్రత్యక్షమయ్యే దినాలనూ రాత్రులనూ దాటి పైకి రావడం ఎలా? నిజానికి, స్వేచ్ఛ అని మీరు అనుకొంటున్నదే అత్యంత బలమైన సంకెల, అది సూర్యకాంతిలో తళతళమెరుస్తూ కళ్ళకు మిరుమిట్లుగొల్పుతున్నప్పటికీ.
ఇంకా చెప్పాల్సివస్తే, స్వేచ్ఛ అంటే ఏమిటి, మిమ్ములనావరించి ఉన్న కృత్రిమత్వాన్ని శకలశకలాలుగా రాల్చుకోవడం తప్పిస్తే? అది నిర్మూలనార్హమగు ఒక న్యాయసూత్రం అనుకుంటే, దానిని మీకుమీరే మీ నుదిటిపై రాసుకున్నారు. ధర్మగ్రంథాలను దగ్ధంచేయటంద్వారాను, న్యాయాధికారుల నుదిటిని సముద్రజలాన్నంతటినీ వినియోగించి ప్రక్షాళించినా కూడాను, దానిని చెరిపివేయలేరు. దానిని ఒక నిరంకుశప్రభువుగా భావించి వానిని పడదోయాలని అనుకుంటే, ముందుగా వానికోసం మీ హృదయంలో ప్రతిష్టించుకున్న సింహాసనాన్ని కూలదొయ్యండి. ఒక దుష్టనిరంకుశుడు స్వతంత్రులనూ స్వాభిమానులనూ ఎలా అణగద్రొక్కుతాడు, వారి స్వేచ్ఛలో నిరంకుశత్వమూ వారి స్వాభిమానంలో మానహీనతా లేని పక్షంలో? ఇంకా, మీపై ఒకరికిగల అజమాయిషీ పోవాలని అభిలషిస్తే, అట్టి అజమాయిషీ మీమీద బలవంతంగా రుద్దబడినట్లు కాక, మీకుమీరుగా తగిలించుకున్నదని తెలుసుకోండి.
మరియు అది మీరు పటాపంచలుచేద్దామనుకొనే భయం అయితే, అట్టి భయానికి నివాసం మీ హృదయంలోనే ఉంది కాని భయపెట్టేవాడి చేతుల్లో కాదు. యదార్ధంగా, అన్ని విషయాలూ మీ అంతరాత్మలోనే రెండేసి అర్ధభాగాలై చెట్టపట్టాలేసుకు తిరుగుతుంటాయి - ప్రీతిగొల్పేది, భీతిగొల్పేది; ఆశించేవి, అసహ్యించుకునేవి; సాధించుకోవాలనుకొనేవి, వదిలించుకోవాలనుకునేవి. ఈ ద్వంద్వప్రవృత్తులు మీలోనే వెలుగూనీడల్లా పెనవేసుకు విహరిస్తూంటాయి. ఒక నీడ కరిగిపోయి మాయమైనప్పుడు అంతరంగాన్ని అంటిపెట్టుకున్న వెలుగు ఇంకో వెలుగుకు నీడగా మారుతుంది. ఈ విధంగా అన్ని బంధనాలనూ తెంచుకొన్న మీ స్వేచ్ఛ ఇంకా అధికమైన స్వేచ్ఛకు ప్రతిబంధకమవుతుంది.
వివేకము, ఆవేశము
యోగిని మళ్ళీ ఆడిగింది: "వివేకము, ఆవేశాల గురించి చెప్పండి."
అతను సమాధానమిచ్చాడు: మీ అంతరాత్మ తరచూ మోహావేశాలతో సంఘర్షించే బుద్ధీ, వివేకాల రణక్షేత్రంవంటిది. ఒక శాంతిప్రదాతగా నాకు శక్తి ఉంటే ఆ ఇరుపక్షాలను సమన్వయపరచి గుణాల సమరాన్ని సుస్వరమైన సంగీతంగా మార్చేవాడిని. కానీ మీ మటుకు మీరు శాంతికాముకులుకానప్పుడు, ఇంకాచెప్పాలంటే మీ అన్ని స్వభావాలను ఒక్కవిధంగా ప్రేమించలేనప్పుడు నాకది ఎలా సాధ్యం?
వివేకం మీ జీవననౌకకు చుక్కాని అయితే మోహావేశం తెరచాపవంటిది. రెంటిలో ఏది విరిగిపోయినా గమనం ఒడుదుడుకులతోనో, లేక సాగరమధ్యంలో నిలిచిపోవటమో జరుగుతుంది. కారణం, బుద్ధి ఒక్కటే శాసిస్తున్నప్పుడు అది మిమ్ము గీతదాటనీయని చెరవలె ఉండగా, అదుపులోలేని మోహావేశం ప్రచండ జ్వాలలతో స్వవినాశకరంగా పరిణమిస్తుంది. మోహావేశాలు ఎంత ఎత్తుకు ఎగిసిపడుతున్నాయో తన వివేకాన్ని కూడా ఆ స్థాయికి అంతరాత్మ ఎదగనిచ్చే పక్షంలో, అది ఎటువంటి ఆందోళనకూ లోనుకాక, ఆహ్లాదకరంగా పాడుకుంటుంది.
ప్రతిదినమూ పునరుజ్జీవితమవుతూ, ఫీనిక్ష్ పక్షి తనబూడిదనించి తానే ఆవిర్భవించి మరింత ఎత్తుకు ఎగిరినట్లు, మీ మోహావేశాలు కూడా వివేకం నడిపించినట్టు నడుస్తూ నిత్యనూతనం కావాలి.
మీ వివేచననూ ఆకాంక్షలనూ మీరు సరిసమానంగా ఇంట్లోని ఇద్దరు ప్రియ అతిథులనువలె గౌరవించాలి. ఏ ఒక్కరినీ మరియొకరికంటే ఎక్కువ మన్ననసేయరాదు; ఎందుకంటే, ఉన్న అపేక్షనంతనూ ఒక్కరిపైనే పెంచుకుంటే మీకు ఇరువురి అపేక్షా దూరమవుతుంది. పర్వత శిఖరం మీద మంచుకురిసి చల్లని నీడనిచ్చు చెట్లకింద కూర్చుని అక్కడి శాంతీ నిర్మలత్వాలతో దూరంగా పరిచిన తివాచీల్లాంటి పచ్చని మైదానాలను చూసినప్పుడు, మీ హృదయం "ఇది సృష్టికర్త వివేకపూర్ణానుగ్రహం" అని భావించాలి. అదే, తుపాను చెలరేగి పెనుగాలులు మీకునీడనిచ్చిన చెట్లను కూకటివేళ్ళతో పెళ్ళగించి ఉరుములూ మెరుపులూ ఆకాశపు ఆధిపత్యాన్ని ప్రళయభీకరంగా ప్రకటించేటప్పుడు, ఆశ్చర్యంతో మీ హృదయం "ఇది భగవంతుని ఆవేశభరిత నర్తనం " అని గ్రహించాలి. మరియు మీరు భగవంతుని సృష్టిశక్తిలో ఒక ఊపిరై, అతని అరణ్య మహావృక్షాల్లో ఒక ఆకై ఉండటంచేత, మీరుకూడా వివేకంలో విశ్రమిస్తూ ఆవేశంలో నర్తించాలి.
బాధ
ఒక స్త్రీ అడిగింది, "బాధ గురించి చెప్పండి."
అతడన్నాడు: మీ జ్ఞానాన్నావరించుకున్న ఆచ్ఛాదన విడువడటమే బాధ అంటే. శిలాసమానమైన ఫలహృదయం సూర్యకాంతిలో నిలిచేందుకు ఎలా పగులుతుందో అదే విధమైన అవస్థగా మీరు బాధను అర్ధంచేసుకోవాలి. ప్రతినిత్యమూ కలిగే అద్భుతాలను ఆశ్చర్యంతో తిలకించేందుకు మీ హృదయం సిద్ధంగా ఉన్నప్పుడు, బాధ కూడా ఆనందాలకు ఏవిధంగానూ తీసిపోనంత అద్భుతంగానూ అనిపిస్తుంది. పంటపొలాలకు సంబంధించినంతవరకు ఋతుచక్రాన్ని ఎంత సహజంగా ఆమోదిస్తారో, హృదయక్షేత్రపు ఋతుమార్పులను కూడా అంతే సహజంగా స్వీకరించండి. అప్పుడు మీ విషాదపు హేమంతాన్ని అత్యంత నిర్మలత్వంతో వీక్షిస్తారు. మీ బాధలో అధికభాగం మీరెంపికచేసుకున్నట్టిదే. అట్టి విషాదమనే చేదుమాత్రతోనే మీలోని వైద్యుడు మీ ఆత్మకు చికిత్సచేస్తాడు. కనుక అతనిని విశ్వసిస్తూ, అతడిచ్చే మందును నిశ్శబ్దంగా, ప్రశాంతంగా స్వీకరించండి: ఎందుకంటే అతని హస్తం కఠినతరమూ అతిభారమూ అయినప్పటికీ దానిని నడిపించేది మాత్రం అదృశ్యరూపంలోని అతి మృదువైన అమృతహస్తం.
అతడిచ్చిన మందుపాత్ర తాకగానే మీపెదవులు మండినా, దానిని రూపొందించిన మట్టిమాత్రం సృష్టికర్త పవిత్ర దివ్యాశ్రువులచే మెత్తబరచబడ్డట్టిది.
ఆత్మ జ్ఞానం
ఒక వ్యక్తి అడిగాడు, "మాకు ఆత్మ జ్ఞానం గురించి చెప్పండి."
అతడు చెప్పసాగాడు: మీ హృదయాలు అతి నిశ్శబ్దంగా దివారాత్రాల రహస్యాలను తెలుసుకుంటాయి. కాని మీ చెవులు ఆ హృదయపు జ్ఞానబోధకై రిక్కించుకుంటాయి. ఆలోచనలలో మీరెరిగినదానిని మాటలరూపంలో కూడా మీరు తెలుసుకోగలరు. మీ స్వప్నాల నగ్నశరీరాలను మీ వ్రేళ్ళతో స్పృశించనూగలరు.
ఇట్టి ఎరుక మంచిదే . ఆత్మలోంచి ఉప్పొంగు అది పొర్లి గుసగుసగా ప్రవహించి సముద్రాన్ని చేరవలసిందే; అప్పుడు మీలోని లోతుతెలియని అనంత అఖాతాలు మీ కళ్ళముందు ప్రదర్శితమవుతాయి. కాని అంతుపట్టని మీ అంతరాళపు లోతులను కొలిచేందుకు సాధనాలేమీ ఉండకూడదు. ఒక కొలబద్దతోనో శబ్దవేధక పరికరంతోనో దానిని కొలవప్రయత్నించకండి. కారణం, ఆత్మ పరిమితుల్లేని, కొలవసాధ్యంకాని మహాసముద్రం.
"నేను సత్యాన్ని తెలుసుకున్నాను" అనేబదులు, "ఒక నిజాన్ని తెలుసుకొన్నాను" అని మాత్రమే అనండి. అలాగే, "ఆత్మ యొక్క మార్గం కనుగొన్నాను" అనకుండా, "నా దారిలో ఆత్మ నడచిపోతుండగా కనుగొన్నాను" అనండి. కారణం, ఆత్మ అన్ని మార్గాల్లోనూ చరించగలదు. అది ఒక నిర్దుష్ట రేఖవెంబడి పోదు, ఒక రెల్లుమొక్క పెరిగినట్టు పెరగదు. దివ్యకమలం తన లెక్కలేనన్ని రేకులను ఒక్కొక్కటే విచ్చుకుంటున్నట్టు, ఆత్మ తనను తాను ఆవిష్కరించుకుంటుంది.
బోధన
అప్పుడొక ఉపాధ్యాయుడడిగాడు, "బోధన గురించి చెప్పండి."
అతడు చెప్పాడు: మీలోనే అర్ధనిమీలితంగా నిద్రిస్తూ మేల్కాంచుటకు సిద్ధంగా ఉన్నదానికంటే ఇతరమైన జ్ఞానాన్ని మీకెవరూ బోధించలేరు. మీ ప్రార్ధనామందిరాల నీడలలో తన శిష్యగణంతో సంచరిస్తూ ఉన్న గురువు, తనకున్న జ్ఞానాన్ని కాక, తన విశ్వాసాన్ని, ప్రేమను మాత్రమే మీకు బోధించగలడు. అతడే వివేకశాలి అయితే, మిమ్ములను తన జ్ఞానమందిరంలోకి ఆహ్వానించటానికి బదులుగా, మీస్వంత జ్ఞానమందిరపు వాకిట్లోకి తోడ్కొనివెళతాడు. ఒక ఖగోళశాస్త్రజ్ఞుడు రోదశి గురించి మీతో చెబుతాడే కాని తన జ్ఞానాన్ని మీకందించలేడు. ఒక సంగీతజ్ఞుడు విశ్వావరణపు సంగీతంలోని శృతిలయలను గానం చేస్తాడే గాని అట్టి లయను పట్టుకొనే చెవులనుగాని ఆ స్వరాన్ని ప్రతిధ్వనించు కంఠాన్ని కానీ మీకివ్వలేడు. అంకెలలో ప్రావీణ్యంకలిగినవాడు దూర భారాల మితులను వర్ణించగలడుకాని మీరుగా వాటినన్వయించుకోగల నైపుణ్యాన్ని ఇవ్వలేడు.
ఎందుకంటే ఒకరి భావనాశక్తి వేరొకరికి గమనాన్నియ్యలేదు.
మరియు భగవద్ జ్ఞానంలో మీరందరూ నిల్చొనియున్నా, ఎవరికివారే సృష్టికర్తగురించినట్టిగానీ, సృష్టిగురించినట్టిగానీ జ్ఞానంలో మీకు మీరుగా అర్ధంచేసుకున్న విధానంలో ఏకాకులు.
స్నేహం
ఒక యువకుడడిగాడు, "మాకు స్నేహం గురించి చెప్పండి."
అతడు సమాధానమిచ్చాడు: మీ అవసరాలకు లభించిన సమాధానమే మీ స్నేహితుడు. స్నేహక్షేత్రంలో ప్రేమను విత్తి సాగుచేస్తే కృతజ్ఞతార్పణములను ఫలములుగా పొందుతారు. అతడు మీ భోజనశాల, వంటగదిలోని అగ్నిహోత్రమూ. మీ ఆకలితీరేందుకు, శాంతిని పొందేందుకు అతన్ని మీరు ఆశ్రయిస్తారు.
మీ మిత్రుడు మాట్లాడుతున్నప్పుడు, మీ మదిలోని "కాదు, లేదు" ల గురించి న భయంగానీ, "అవును, సరే" లను దాచుకోవాల్సిన ఆవశ్యకతకానీ మీకు ఉండవు. అతడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడుకూడా అతని హృదయాన్ని మీ హృదయం ఆలకిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మాటల్లేని స్నేహంలో, అన్ని ఆలోచనలు, అభిలాషలు, ఆకాంక్షలు ఎవరూ కూడా నాదని చెప్పుకోని ఆనందానుభవంలో ఉద్భవిస్తాయి, పంచుకోబడతాయి. మిత్రునినుండి వేరుపడినప్పుడు శోకించకండి; ఎందుకంటే అతనిలో మీరు అత్యధికంగా ప్రేమించేది, అతని పరోక్షంలోనే, మైదానం నుంచి చూసినప్పుడు పర్వతారోహకునికి కొండ బాగా కనిపించినట్లు, మరింత స్పష్టంగా అగుపిస్తుంది.
ఇంకా, ఆత్మబంధాన్ని మరింత పటిష్టపరచుకోవడం మినహా స్నేహానికి మరే ఇతర పరమావధీ ఉండరాదు. ఎందుకంటే, తన అద్భుతాలను ఆవిష్కరించేది కాక ఇతరమేదైనా ప్రేమ కాదు; అది పన్నిన వల వంటిది, అందులో నిరర్ధకులే చిక్కుబడతారు.
మీరొసగగల అతి శ్రేష్ఠమైనవి మీ స్నేహితులకే చెందాలి. మీ తరంగాల క్షయాన్ని అతడు ఎరిగియుంటే, వాటి ఉధృతిని కూడా అతనికి చవిచూపండి. మిత్రులుండేది గంటలకు గంటలు కాలహరణంకోసం కాదు, వాటిలో జీవనోత్సాహం నింపడంకోసం. అతడు మీ అవసరాన్ని తీర్చేవాడే గాని, మీ శూన్యాన్ని భర్తీచేసేవాడు కాడు. స్నేహమాధుర్యం నవ్వులను విరబూయించాలి, సుఖాలను పంచుకోవాలి.
ఎందుకంటే చిన్న చిన్న ఆనందాల మంచుతుషారంలో హృదయం తన శుభోదయాన్ని చూసుకుని సాంత్వన పొందుతుంది.
సంభాషణ
ఒక పండితుడు అడిగాడు, "మాట్లాడటం గురించి చెప్పండి."
సమాధానంగా అతడన్నాడు: ఆలోచనలతో సమాధానపడలేనప్పుడు మీరు మాట్లాడుతారు. హృదయంయొక్క ఏకాంతపు ప్రశాంతతలో జీవించలేనప్పుడు, శబ్దం ఇచ్చే ఉబుసుపోక, కాలక్షేపాలకోసం పెదవుల ఆశ్రయం పొందుతారు. ఇంకా, చాలామటుకు సంభాషణలలో ఆలోచన సగం చస్తుంది. ఎందుకంటే ఆలోచన విశ్వాంతరాళంలో విహరించు విహంగం కాగా, మాటలపంజరంలో దానిని బందీ చేసినప్పుడు రెక్కలనల్లార్చుతుందే కాని ఎగరలేదు.
మీలో కొందరు, ఒంటరితనపు భయంతో మాటలపోగులను ఆశ్రయిస్తారు. ఏకాంతపు ప్రశాంతత వారి స్వస్వభావాలను వారికి వెల్లడిచేస్తుంది కాబట్టి దానినించి తప్పించుకుంటారు. ఇంకొందరు ఏవిధమైన జ్ఞానమూ పూర్వాలోచనాలేకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ, అవేమిటో తమకే అవగతంకాని సత్యాలను యథాలాపంగా జారవిడుస్తుంటారు. మరికొందరు, తమలో సత్యాన్ని కలిగియున్నా, మాటల్లో దానిని వ్యక్తపరచరు.
ఇట్టివారి ఆంతర్యాల్లో, జీశ్వాత్మ లయబద్ధమైన నిశ్శబ్దరూపంలో నిక్షిప్తమై ఉంటుంది.
దారిలోనో బజారులోనో మీ స్నేహితులను కలిసినప్పుడు, మీ అంతరాళాల్లోని జీవాత్మ మీ పెదవులకూ జిహ్వకూ ఏమాటలు పలకాలో నిర్దేశించాలి. మీ గొంతులోపలి గొంతు అతని చెవులలోని చెవులలో మాట్లాడాలి; ఎందుకంటే అతని ఆత్మ మీ హృదయంలోని సత్యాన్ని ఆట్టిపెట్టుకుంటుంది - రంగూ పాత్ర ఆకారం మదినించి చెరిగిపోయినా మధువు రుచి మాత్రం తలపులలో ముద్రించబడిపోయినట్లు.
కాలము
ఒక ఖగోళశాస్త్రజ్ఞుడడిగాడు, "గురువర్యా, కాలం మాటేమిటి?"
అతడు సమాధానమిచ్చాడు: కొలతలకందని, కొలవవీలులేని కాలాన్ని మీరు కొలవయత్నిస్తూంటారు. మీ నడవడిని, ఇంకా మీ ఆత్మగమ్యాన్నీ కూడా గంటలకూ ఋతువులకూ అనుగుణంగా సరిజేసుకుంటుంటారు. కాలాన్ని వాగులా పారించి ఒడ్డునకూర్చుని దాని ప్రవాహాన్ని గమనిస్తూంటారు.
కానీ మీలో నిత్యమూ శాశ్వతమూ అయి ఏదైతే ఉన్నదో, అది కాలపు నిత్యత్వం గురించిన ఎరుకను, ఇంకా వర్తమానానికి గతం జ్ఞాపకమూ, భవిష్యత్తు స్వప్నమూ అనే ఎరుకనూ కలిగియుంటుంది. మీలో గానం చేస్తున్నదీ, యోచనాసమర్ధమూ అయినదీ, ఇప్పటికీ నక్షత్రరాశులను విశ్వాంతరాళంలోకి చిమ్మిన తొట్టతొలి క్షణపు అవధులలోనే నివసిస్తోంది. మీ ప్రేమశక్తి అపరిమితమైనదైని అనుకొననివారు మీలో ఎవ్వరున్నారు? ఇంకా, అట్టి ప్రేమ, అవధుల్లేనిదైనా, ఒక ప్రేమయోచననించి వేరొక దానికి, అలాగే ఒక ప్రేమపూర్వక చేష్టనుంచి ఇంకోదానికీ గెంతులువేయకుండా మీ అస్తిత్వపు కేంద్రబిందువులోనే ఒదిగియున్నదని మీలో అనుకొననివారెవ్వరు? మరియు, కాలం కూడా ప్రేమ వలెనే అవిభాజ్యమూ గమనరహితమూ కదా?
కానీ మీ తలపులలో కాలాన్ని ఋతువులుగా కొలిచే పక్షంలో, అందలి ప్రతి ఒక్క ఋతువూ అట్టి ఋతువులనన్నింటినీ పరివేష్టించాలి. అలాగే వర్తమానపు పరిష్వంగంలో గతము జ్ఞాపకంగాను, భవిష్యత్తు ఆకాంక్షగాను ఒదిగిపోవాలి.
మంచి, చెడు
నగరపెద్దల్లో ఒకరడిగారు, "మంచీ చెడులగురించి చెప్పండి."
అతడు చెప్పాడు: మీలోని మంచిని గురించి మాట్లాడతాను కాని చెడు గురించి కాదు. ఎందుకంటే, చెడు అంటే ఏమిటి, ఆకలీ దప్పులచే బాధితమగు మంచి కాక? నిజమే, మంచి ఆకొన్నప్పుడు చీకటిగుహలలోని ఆహారాన్ని కూడా ఆవురావురుమంటూ తింటుంది, దప్పిగొన్నప్పుడు మృతజలాలనైనా తాగుతుంది.
మీరు మీ ఆత్మతో మమేకమయినప్పటి దశను, మంచి అని భావించాలి. కాని ఆవిధంగా కానప్పుడు అది చెడుమాత్రం కాదు. ఇంట్లోనివారిమధ్య పొరపొచ్చాలున్నంతమాత్రాన ఆ ఇంటిని దొంగల డేరాగా చెప్పము కదా; అది అభిప్రాయభేదాలతో చీలిన మనుషుల ఇల్లు; అంతే. అలాగే చుక్కానిలేని నావ దశాదిశా లేకుండ ఇష్టానుసారం ప్రమాదకర ద్వీపకల్పాల్లో చక్కర్లు కొట్టవచ్చుగాక కాని దానివల్ల పడవ మునిగిపోయి సముద్రపు అడుగుకు పోదు కదా. స్వార్ధపరిత్యాగం కోసం ప్రయాసపడినప్పుడు మీరు మంచి అనిపించుకుంటారు; అలాగని స్వార్ధప్రయోజనాలకోసం శ్రమించినప్పుడు అదె చెడు కానక్కర్లేదు.
మీ గమ్యం గురించి సాహసోపేతమగు కార్యసాధనసహాయంతో స్పష్టంగా మాట్లాడినప్పుడు అది మంచే. అయితే మీ ప్రయత్నం తడబాటుకలిగిన కుంటినడక అయితే, దాన్ని చెడుగా చెప్పనక్కరలేదు. కుంటుతూ పోయినా ముందుకేగాని వెనక్కిపోరుకద. కాని మీరు బలవంతులై చకచకా అడుగులు వేయసమర్ధులైనప్పుడు, నిజంగా కుంటివారైనవారి ముందు మీ అడుగులు తడబడకుండా చూసుకోవాలి. అది వారిపట్ల దయచూపినట్లవుతుంది.
మీరు మంచిగా ఉండేందుకు అనేక మార్గాలున్నాయి; అలా లేనంతమాత్రాన చెడుగా ఉన్నట్టనికాక, అలసత్వంతోను, దిశానిర్దేశంలేకను బాధపడుతున్నారని మాత్రమే గ్రహించాలి. అయితే దురదృష్టవశాత్తు జింకలు తాబేళ్ళకు వేగం నేర్పలేవు.
మీ ఆత్మయొక్క విరాడ్రూపసాక్షాత్కారం కోసం తపించటంలో మీ మంచి ఉంటుంది; ఆ తపన మీ అందరిలోనూ ఉంది. అయితే కొందరిలో అది పూర్తిధాటితో ప్రవహించి పర్వతసానువుల, అరణ్యజీవనరాగాల రహస్యాలను అమితమగు శక్తితో సముద్రానికి చేరవేస్తూండగా, ఇంకొందరిలో అదొక పిల్లకాలువలా ప్రవహించి మెలికలలోను మిట్టపల్లాలలోను వేగం క్షీణించటంతో బలహీనపడి సముద్రతీరం అంతదూరంలో ఉండగానే ఆర్చుకుపోతుంది. అయితే బలోద్ధతితో తపించువారు బలహీనులగు తమ సాటివారిని చూచి, "మీలో ఎక్కడ లోపం ఉంది? మీ నత్తనడకకు, అడుగడుక్కీ కూలబడిపోవటానికి కారణాలేమిటి?" అని అడగరాదు. ఎందుకంటే, వాస్తవికంగా మంచిని కలిగియుండేవారు ఒక నిర్వస్త్రుని చూచి "నీ బట్టలేవి?" అనికాని, ఇల్లూవాకిలీలేని దీనుని చూచి "నీ ఇల్లేమయింది?" అనికాని ప్రశ్నింపరు కదా.
ప్రార్ధన
ఒక పూజారిణి అడిగింది, "మాకు ప్రార్ధన గురించి చెప్పండి."
సమాధానంగా అతడన్నాడు: దుఃఖంలోనూ లేమిలోనూ మీరు ప్రార్ధిస్తారు; కాని మీరు ఆనందంగా ఉన్నప్పుడు, సిరిసంపదలతో తులతూగుతున్నప్పుడు కూడా ప్రార్ధించాలి.
మీ ఆత్మను విశ్వాత్మలోనికి విస్తరించుకోవటం కాక ప్రార్ధన అంటే మరేమిటి? సాంత్వన పొందేందుకు మీలోని చీకటిని మీరు విశ్వాత్మలో విలీనం చేస్తుంటారు. అదేవిధంగా మీ హృదయప్రకాశాన్ని కూడా చేస్తే అది మీకు పరమానందకరం కదా. ఆత్మ మిమ్ములను ప్రార్ధనకు ప్రేరేపించినప్పుడు మీకు దుఃఖం మాత్రమే వస్తుంటే, అది మరల మరల అందుకు ప్రేరేపిస్తూనే ఉంటుంది - మీ ఏడుపులు ఆగి నిర్మల హృదయంలోనుంచి నవ్వులు విరబూసేంతవరకు. మీరు ప్రార్ధన చేస్తున్నప్పుడు, సరిగా అదే సమయానికి తమ ప్రార్ధనలను కూడా విశ్వాత్మకు సమర్పించుకొనువారిని కలుసుకుంటారు. మహత్తరమైన ఇట్టి కలయిక ప్రార్ధనాసమయంలో తప్ప మరెన్నడూ సాధ్యపడదు. అందుకని, కంటికి కనబడని విశ్వాలయంలోనికి ఈ విధమైన పయనం తన్మయత్వం కోసం, మాటలకందని మధుర సాన్నిహిత్యంకోసం మాత్రమే సాగాలి. ఆ ఆలయంలోకి అభ్యర్ధనతో ప్రవేశిస్తేనే అడిగినవి ఇవ్వబడతాయి.
మరియు, అందులోనికి మీరు వినమ్రులు అయేందుకు ప్రవేశిస్తే మిమ్మల్నెవరూ బుజాలుపట్టిలేవదియ్యరు: లేక, ఎవరికోసమో భిక్షం కోరేందుకు ప్రవేశిస్తే మీరన్నదేదీ ఎవరూ వినరు. కేవలం అదృశ్యులుగా, నిశ్శబ్దంగా మీరు ప్రవేశిస్తే అంతే చాలును.
మాటల్లో ఎలా ప్రార్ధించాలో నేను మీకు చెప్పలేను. భగవంతుడు, తాను మీ పెదవులద్వారా పలికించు మాటలను తప్ప మీరు పలికే మరేదీ వినడు. నేను మీకు సముద్రాల, అరణ్యాల, పర్వతాల ప్రార్ధనలను కూడా బోధించలెను. కాని, పర్వతాల, అరణ్యాల, సాగరాల బిడ్డలైన మీరు, అవి చేయు ప్రార్ధనలను మీ మీ హృదయాలలో వింటారు. మీరు కనక నిశీధి నిశ్శబ్దంలో చెవిరిక్కించి వినగలిగితే, అవి ఈ విధంగా అనటం గ్రహిస్తారు: మాకు చలనరూపమైన పరమాత్మా, మేము సంకల్పించేది మాలో నీవు ఉంచిన నీ సంకల్పమే. మేము ఆకాంక్షించేది నీవు మాలో పొందుపరచిన నీ ఆకాంక్షయే. నీ ప్రేరేపణతోనే, నీవైన మా రాత్రులు, నీవే అయిన మా పగళ్ళుగా మారుతున్నాయి.
"దేనికొరకూ నిన్ను అడగము, ఎందుకంటే మా అవసరాలు ఏమిటో మాకు తెలియటానికి ముందే నీకు తెలుస్తాయి కదా.
"నీవు తక్క మాకు మరే అవసరమూ లేదు; నీ సాన్నిధ్యాన్ని మరి కొంచం అనుగ్రహిస్తే మాకు అవసరమయినవన్నీ మేము పొందినట్లే."
ఆనందము
ఏడాదికోమారు నగరానికి విచ్చేసే సాధుపుంగవుడొకాయన ముందుకొచ్చి ఆదిగాడు, "ఆనందం గురించి మాకు చెప్పండి."
అతడు సమాధానమిస్తూ చెప్పాడు: ఆనందం స్వేచ్ఛాగీతిక, కాని అచ్చంగా స్వేచ్ఛకాదు. అది పుష్పిస్తున్న మీ కోర్కెలను తెలియజేసేది కాని వాని ఫలం కాదు. అది ఒక ఎత్తును తనలోనికి ఆహ్వానించే ఒక లోతు; కాని తనకు తానుగా అది లోతూకాదు, ఎత్తైనదీ కాదు. అది రెక్కలుతొడుక్కొంటున్న పంజరంలోని ప్రాణం కాని విశ్వాంతరాళపు ఆవరణం కాదు. వాస్తవికంగా ఆనందం అనేది స్వేచ్ఛాగీతికయే. దానిని హృదయపూర్వకంగా ఆలపించుకోవలసిందని మిమ్ములను నేను కోరుతున్నాను. కానీ అట్టి గానపరవశంలో మీ హృదయాలను మీరు కోల్పోకూడదు.
మీలోని పడుచువారు కొంతమంది ఆనందమే సర్వస్వమని దాన్నే సదా అభిలషిస్తూంటారు, మిగతావారు వారిని తప్పుపట్టి మందలిస్తుంటారు. నేను వారిని తప్పుపట్టను, మందలించను. అన్వేషించుకొననిస్తాను. వారు ఆనందాన్ని తప్పక పొందాలి, కాని అదొక్కదాన్నే కాదు.
ఆనందానికి ఏడుగురు అక్కచెల్లెళ్ళు, కాని వారిలో అతిహీనమైనదికూడా ఆనందంకంటే సుందరమైనదే. కందమూలాలకోసం భూమిని తవ్వుతూ నిధినిక్షేపాలను పొందిన ఒకని గురించి మీరు వినియున్నారు కదా?
ఇంకా, మీలో వయోధికులు కొందరు ఆనందాలను తాగినమైకంలో ఒనరించిన తప్పిదాలుగా గుర్తుపెట్టుకుని బాధపడుతూంటారు. కాని బాధపడాల్సినది అజ్ఞానావృతమైన మనసు గురించే కాని అది వేసిన తప్పటడుగులను కాదు. వేసంగిలో చేతికొచ్చిన పంటని చూసుకున్నట్లు, వారు తమ ఆనందాలను కృతజ్ఞతతో గుర్తుంచుకోవాలి. ఒకవేళ వాటిని తలచుకొని బాధపడటంలో మీకు సాంత్వన లభిస్తే, అట్టి సాంత్వనలో సేదదీరండి.
మీలో మరికొందరు, ప్రగాఢకాంక్షను కలిగిన పడుచువారూ కారు, గుర్తుచేసుకుని బాధపడేవారూ కారు. కాంక్ష-పశ్చాత్తాపాల గురించిన భయంతో వారు ఆనందాలను తిరస్కరించుకుంటారు - రెండు దశలూ ఆత్మను నిరాకరించడమూ ఆత్మాపచారమూ అని భావించబట్టి. ఈ విధంగా వారికి కూడా ఏదో నిధి లభిస్తుంది - ఎందుకంటే వణికేచేతులతోనైనా వారుకూడా తవ్వుకుంటున్నారు కద.
కాని చెప్పండి, ఆత్మకు అపచారం ఎవరు ఒనరించగలరు? నిశీధిలో పాడే చకోరం నిశియొక్క నిశ్శబ్దతకు గానీ మెరిసే మిణుగురులు నింగిలోని తారలకుగానీ అపచారం చెయ్యగలుగుతాయా?
ఇంకా, మీరు వెలిగించే జ్వాలకానీ దాని పొగకానీ గాలికి భారమవుతాయా? ఆత్మ ఒక నిశ్చలమైన నీటిమడుగులాగా, చేతికర్రతో అందులో అలజడిని కలిగిస్తున్నట్టుగా మీరు అనుకొంటున్నారా? తరచుగా మీరు తిరస్కరించుకున్న కోర్కెలూ ఆనందాలూ మీ అస్తిత్వపు నిగూఢ అరలలోకి పోయి కూర్చుంటాయి. ఎవరు చెప్పగలరు నేడు వదులుకున్నది రేపు తగులుకోదని? మీ దేహానిక్కూడా దాని వారసత్వ, న్యాయబద్ధ హక్కుల గురించి తెలుసు, వాటిని నిరాకరించి దానిని మోసపుచ్చలేరు. కనిపించే దేహమనే వీణనుండే కనిపించని ఆత్మ పాడుతుంది; అది పలికించేది సుస్వర సంగీతాన్నా లేకా అపభ్రంశపు కఠోరశబ్దాలనా అన్నది నిర్ణయించుకోవలసినది మీరే.
ఇప్పుడు మదిలో ఈ ప్రశ్నవేసుకుంటారు, "ఆనందాల్లో మంచివాటిని చెడువాటినుండి వేరుచేయటమెలా?" అని. పొలాల్లోకీ ఉద్యానవనాల్లోకీ వెళ్ళండి, అక్కడ మీరు తెలుసుకుంటారు, పూలనుండి మకరందాన్ని గ్రోలటం తేనెటీగలకెలా ఆనందదాయకమో, వాటికి తమ మధువును తృప్తిగా తాగేందుకు ఇవ్వటం పూలకి కూడా అంతే ఆనందదాయకమనీ. తేనెటీగకు పుష్పం జీవధార అయితే, పుష్పానికి తేనెటీగ ప్రేమను మోసుకొచ్చే దేవదూత. పుచ్చుకోవడంలోని ఆనందం ఒకరి జీవితావవసరాన్ని తీరిస్తే ఇవ్వడంలోని ఆనందం ఇంకొకరికి ఆనందపారవశ్యాన్ని ప్రసాదిస్తుంది.
ఆర్ఫలీస్ ప్రజలారా, మీ ఆనందాలలో మీరు పూవూ తుమ్మెదలలా జీవించండి.
సౌందర్యము
ఒక కవి అడిగాడు, "సౌందర్యం గురించి మాకు చెప్పండి."
అతదు సమాధానమిచ్చాడు: సౌందర్యం తనకు తాను మీ మార్గదర్శనం చేస్తే తప్ప దానిని మీరు ఎక్కడని వెదుకుతారు, ఎక్కడ కనుగొంటారు? మరియు మీ మాటలను ఆమె అల్లకుంటే ఆమె గురించి మీరేమి మాట్లాడతారు? ఆర్తులు, క్షతగాత్రులు అంటారు, "సౌందర్యం దయాసౌకుమార్యాలను కలిగియున్నట్టిది. యౌవనవతి అయిన తల్లివలె ఆమె కొంత లజ్జాభారంతో, తనదైన దివ్యతేజస్సుతో మన మధ్య చరిస్తుంది." అని. ఉద్రిక్తహృదయులు మాత్రం, "కాదు, సౌందర్యం శక్తి కలిగి భీతిగొలిపేది. ప్రచండమైన ఉప్పెనలా ఆమె మన కాళ్ళకింది భూమిని శిరస్సుపైని ఆకాశాన్ని కకావికలుగావిస్తుంది" అని.
అలసి సొమ్మసిల్లినవారంటారు, "సౌందర్యం సన్నని గుసగుసలవంటిది. ఆమె మన ఆత్మలో సంభాషిస్తుంది. మన నిశ్శబ్దప్రపంచానికి లోబడి ఆమె గొంతు, నీడకు భయపడి వణికే సన్నని దీపశిఖలా మంద్రంగా పలుకుతుంది." కాని అశాంతిపరులు అంటారు, "ఆమె పర్వతసానువుల్లో బిగ్గరగా అరవటం మేము విన్నాము, ఆమె కేకలతో పాటే గుర్రపుడెక్కల శబ్దాలు, రెక్కలార్చిన సవ్వడులు, సింహగర్జనలూ కూడా వినవచ్చాయి," అని.
రాత్రులలో నగర కావలివారు అంటారు, "సౌందర్యం ఉదయం తూర్పున ఉదయిస్తుంది." అపరాహ్ణంవేళ చిరువ్యాపారులూ బాటసారులూ అంటారు, "ఆమె సూర్యాస్తమయపు గవాక్షాలనుంచి భూమి వైపు వంగటాన్ని మేం చూశాము" అని.
శీతాకాలంలో మంచుదారుల్లో పోయేవారు అంటారు, "ఆమె వసంతకాలంలో కొండకోనలను దాటుకుంటూ వస్తుంది." అని. వేసవి వేడిమిలో పంటకోసేవారంటారు, "ఆమె శిశిరంలో రాలే ఆకులతో కలిసి నర్తించటం మేము చూశాము, ఆమె కురులలో కొన్ని మంచు ధారలు కూడా ఉన్నాయి." అని. ఇన్నిరకాలుగానూ మీరు సౌందర్యం గురించి చెబుతూ వచ్చారు, కాని వాస్తవంలో మీరు చెప్పింది సౌందర్యంగురించి కాక తీరని కోరికలగురించి. సౌందర్యం ఒక జీవితావసరం కాదు. ఒక ఉద్వేగభరిత తన్మయత్వం. అది దాహార్తితో పిడచగట్టిన నోరూ కాదు, దేహీ అని చాచబడ్డ ఖాళీ చేయీ కాదు. అది ప్రచండ తేజస్సుతో జ్వలించే హృదయం, అమితానందభరితమైన ఆత్మాను.
అది మీరు కనులతో చూచే స్వరూపమూ కాదు, చెవులతో వినే గానమూ కాదు. కనులు మూసుకొన్నా చూడగలిగే స్వరూపమూ, చెవులు మూసుకున్నా వినగలిగే గానమూను. అలాగే అది మొక్కగాటునించి ఊరే రసమూ కాదు, తీక్షణమైన గోటికి అనుబంధంగా ఉన్న పక్షిరెక్కా కాదు. అది సదా వికసించి గుబాళించు ఉద్యానవనం, అలుపెరుగకుండా రెక్కలనార్చి ఎగురుతూ చరించే దేవతా సమూహం.
ఆర్ఫలీస్ ప్రజలారా, జీవితంలో సౌందర్యం వెల్లడయ్యేది జీవితం తన ముసుగును తొలగించి తన పవిత్రస్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు. అయితే మీరే జీవితమూ మీరే దాని ముఖాచ్ఛాదనమూ కూడా. సౌందర్యం అంటే అనంతశాశ్వతత్వం తనను తాను అద్దంలో చూచుకొనడం. మరియు మీరే అట్టి శాశ్వతత్వమూ, మీరే మిమ్ముచూచుకొను అద్దమూ కూడా.
మతధర్మము
ఒక వృద్ధ అర్చకుడు అడిగాడు, "మాకు మతం గురించీ చెప్పండి."
అతడు చెప్పాడు:
ఈరోజు మీతో నేను చెబుతున్నదంతా మరేమిటి? మతమంటే మనం బహిరంగంలో చేసే క్రియలూ అంతరంగంలో చేసే యోచనలే కదా? అలాగే అటు క్రియారూపం కాక, ఇటు యోచనారూపం కాక, ఒకపక్క చేతులు రాతిని చెక్కుతున్నా బట్టను నేస్తున్నా, మదిలో నిరంతరం పెల్లుబికే ఆశ్చర్యోత్సుకతలూ కదా. ఒకరి చర్యలనుండి విశ్వాసాన్ని, వారి వృత్తిపనులనుండి నమ్మకాలను వేరుచేయ ఎవరికి సాధ్యం? ఎవరు తమ కాలాన్ని ముందు పరచుకొని, "ఈ భాగం భగవంతునికి, ఇది నాకు; ఇది నా ఆత్మకు, ఇది శరీరానికి" అని పంపకాలు చేయగలరు? మీ ఘడియలన్నీ విశ్వంలోని ఒక ఆత్మ నుండి వేరొకదానికి ఎగురేందుకు కొట్టుకునే రెక్కలే. నైతికనియమాలను తన ఆచ్ఛాదనగా చేసి ధరించువాడు దిగంబరుడై ఉండుట మేలు. వాయువు కానీ సూర్యుడు కానీ అతని చర్మంలో రంధ్రాలను చెయ్యవు కద. ఎవరైతే తమ నడవడిని నీతిసూత్రాల ఆధారంగా నిర్వచించుకుంటాడో అతడు తన గానకోకిలను పంజరంలో బందీ చేసినట్టు. అత్యంత స్వేచ్ఛాపూర్వక గానం చువ్వల సందునుంచీ తీగల మధ్యనుంచీ రాదు.
ఇంకా, ఎవరైతే దేవతారాధనాన్ని కిటికీలా భావించి, ఇష్టానుసారం మూస్తూ తెరుస్తూ ఉంటారో, వారు, సూర్యోదయం నుంచీ సూర్యోదయం వరకు తెరచుకొనే ఉండే గవాక్షాలుకల తమ ఆత్మ మందిరాన్ని అసలు దర్శించనేలేదన్నమాట.
మీ దినచర్యే మీ మందిరమూ, మతమూను. అందులో ఎప్పుడు ప్రవేశించినా మీతో బాటు మీ సర్వస్వాన్నీ మోసుకుపొండి. మీ జీవనాధారాలైన కాడీ కొలిమీ సుత్తీ బాడిదలతో బాటు ఆహ్లాదకరమైన వీణియను కూడా తీసుకుపొండి. ఏకాంతంలో ప్రశంతమనస్కులైన మీరు మీరు సాధించిన విజయాలకంటె ఎత్తుకు గానీ చవిచూచిన వైఫల్యాలకంటే దిగువకు గానీ పోలేరు. ఇంకా, మీతో బాటు మీ సాటివారిని కూడా తోడుకుపొండి. ఎందుకంటే ఆరాధనలో మీరు వారి ఆశలకంటే ఎత్తుకు ఎగరలేరు, వారి నైరాశ్యం కంటే దిగువకు పతనం కాలేరు.
ఇంకా, మీరు భగవంతుని ఎరిగియుంటే, సమస్యాపూరణాల వంటి మీమాంసలతో కాలం వ్యర్ధంచెయ్యక, మిమ్మల్ని మీరు బాగా పరిశీలించి చూసుకొంటే, మీ పిల్లలతో ఆడుకునే సృష్టికర్తను సరిగ చూడగలుగుతారు.
అదే విధంగా తలెత్తి అనంత శూన్యంలోకి చూడండి; మేఘాల్లో అతడు నడుస్తూ కనిపిస్తాడు, చాచిన చేతులు విద్యుల్లతలు కాగా వర్షధారలతోపాటు నేలకు దిగుతూ. ఇంకా మీరు విచ్చుకొంటున్న పుష్పాల్లో నవ్వుతూనూ, వృక్షశాఖలలో చేతులు ఊపుతూనూ ఉన్న అతనిని తప్పక చూస్తారు.
మరణం
అప్పుడు అల్ మిత్ర అడిగింది, "ఇప్పుడు మరణం గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాము."
అతడు చెప్పాడు: మీరు మరణ రహస్యాన్ని తెలుసుకోవలసినదే.. అయితే జీవనహృదిలో అన్వేషించకుండా దానిని ఎక్కడని కనుగొంటారు? చీకటికి అలవాటుపడి పగటివేళలో గ్రుడ్డిదైన గుడ్లగూబ కన్నులు కాంతి రహస్యాన్ని వెల్లడిచేయలేవుకదా. మరణ రహస్యం గురించిన పరిపూర్ణ అవగాహన కలిగియుండాలంటే, మీ హృదయాన్ని జీవనపరిమాణమంత మేరా విస్తరింపచేయండి. ఎందుకంటే జీవన్మరణాలు నదీసాగరాల వలె ఒకదానినుంచి వేరొకటి అభేదాలు.
మీ ఆశల, అభిలాషల గంభీరతలో పరం గురించిన నిశ్శబ్ద జ్ఞానం నిగూఢమై ఉంటుంది. మంచుదిబ్బలకింద విత్తనాలు కలలుకంటున్నట్టు మీ హృదయం కూడా అట్టి జ్ఞానోద్భవం గురించి కలలు కంటుంది. కలలను విశ్వసించండి, ఎందుకంటే వాటిలోనే శాశ్వతత్వానికి దారులు దాగి దాగిఉంటాయి. మరణంగురించిన మీ భయం, తనను సన్మానించడానికై చేయిచాచిన భూమీశుని చూచి పశులకాపరి పిల్లవాడు భయపడటం వంటిదే.
ఆ కాపరి కుర్రవాని వణుకు కింద, తాను పొందే రాజసన్మానాన్ని గురించిన ఆనందం ఉంటుంది కదా? అలాగే తన వణుకు గురించిన స్పృహ కూడా అతనికి ఉంటుంది కదా?
ఎందుకంటే, మరణమనేది గాలికెరటాలమధ్య నగ్నంగా నిలబడి సూర్యునిలోకి కరిగిపోవడమే కదా? ఊపిరి ఒదిలెయ్యడమంటే, అప్పటివరకు అది అనుభవించిన వ్యాకులపూరిత ఆటుపోట్లనుండి విడుదలచేసి ఏ బాదరబందీలు లేకుండా స్వేచ్ఛగా భగవంతుని దిశగా సాగిపోనివ్వటమే కదా?
మీరు నిశ్శబ్దమనే నది నీరు త్రాగినప్పుడే నోటినుండి పాట బయటికి వస్తుంది. పర్వత శిఖరాగ్రాన్ని చేరినప్పుడే పర్వతారోహణం ప్రారంభిస్తారు. ప్రకృతి మీ అవయవాలనన్నింటినీ స్వాధీనం చేసుకుని తనలో కలిపేసుకున్నప్పుడే నిజంగా నర్తించగలరు.
వీడ్కోలు
సాయంత్రమయింది.
యోగిని అల్ మిత్ర అన్నది, "ఈ దినమూ ఈ ప్రదేశమూ కూడా మీ ఆత్మయొక్క దివ్యవాక్కులతో పవిత్రమయ్యాయి."
అతడన్నాడు: మాట్లాడటమేనా? నేను శ్రోతను కూడా కదా?
అతడు ఆలయ మెట్లు దిగి నడువగా ప్రజలు అతనిని అనుసరించారు. అతడు తన నౌకను చేరి దాని కప్పుమీద నిలుచున్నాడు. ప్రజలను చూస్తూ, అతడు గొంతుపెంచి మళ్ళీ ఇలా అన్నాడు: ఆర్ఫలీస్ ప్రజలారా, మిమ్ము విడిచి వెళ్ళవలసినదిగా గాలి నన్ను ప్రేరేపిస్తోంది. దానంత తొందర నాకు లేదుకాని, నేను వెళ్ళకతప్పదు. మనమంతా సంచారులం, ఏకాంత మార్గాన్ని అన్వేషించుకుంటూ పోతాం, ఏ ఒక్క దినాన్ని అంతకు ముందురోజు ముగించిన స్థానం నుంచి ప్రారంభించం. ఏ సూర్యోదయమూ దాని ముందటి సూర్యాస్తమయం వదిలిపెట్టిన స్థానంలో మనను కనుగొనలేదు. భూమి నిద్రిస్తున్నప్పుడు కూడా మన ప్రయాణం సాగుతూనే ఉంటుంది. మనమంతా ఒక మహావృక్షపు విత్తనాలం. హృదయం పరిపూర్ణమై పరిపక్వమైనప్పుడు గాలి మనలను సేకరించి అన్నిదిక్కులలోను వెదజల్లుతుంది.
బహు కొద్దికాలం నేను మీతో ఉన్నాను, బహుకొద్ది మాటలు మీతో పలికాను.
కాని నా గొంతు మీ చెవులలో సన్నగిల్లినప్పుడు, నా ప్రేమ మీ తలపులలో మాయమయినపుడు, నేను మళ్ళీ వస్తాను. వచ్చి మరింత ఉత్తమ హృదయంతో, ఆత్మకు చేరేంత స్పష్టంగా మాట్లాడగలిగిన పెదవులతో నేను మీతో మళ్ళీ సంభాషిస్తాను. అవును, సాగరకెరటాల మీదుగా నేను మళ్ళీ వస్తాను; మరణం నన్ను దాచేసినా, దాని అనంత నిశ్శబ్దం నన్నావరించినా, మీ వివేకజ్ఞానాన్ని వెతుక్కుంటూ వస్తాను. అట్టి నా అభిలాష వృధాకాదు. నేను సత్యం తప్ప మరేదీ ప్రవచించనట్టయితే, అట్టి సత్యం మరింత స్పష్టమైన కంఠస్వరంలో, మీ తలపులతో సాదృశ్యంకలిగిన మాటలలో తనను తాను వెల్లడి చేసుకుంటుంది.
ఆర్ఫలీస్ ప్రజలారా, నేను గాలితో పోతున్నాను కాని కింది నిరర్ధక శూన్యంలోకి కాదు. మీ అవసరాలనూ నా ప్రేమనూ ఈ రోజు సాకారం చేసియుండకపోతే అవి సాకారమయ్యేందుకు ఇంకొకరోజువరకు అది వాగ్దానమై నిలిచియుండాలి. మనిషి అవసరాలు మారవచ్చు కానీ అతని ప్రేమ కానీ, అట్టి ప్రేమ అతని అవసరాలను తీర్పగలదై ఉండాలనే అభిలాష కానీ మారవు. అందుకని, అనంత నిశ్శబ్దంలోనుంచి నేను మళ్ళీ వస్తానని గుర్తుపెట్టుకోండి.
అప్పటివరకు దుప్పటిలాపరచుకొన్న పొగమంచు, తొలిసంజరాకతో తుషారబిందువులను మాత్రం పొలాలకొదిలి తాను పైకెగిరి మేఘరూపాన్ని సంతరించుకుని వర్షంగా కురుస్తుంది. నేనుకూడా అటువంటి పొగమంచుకంటే భిన్నం కాను. నిశీధుల నిశ్శబ్దంలో నేను మీ వీధుల్లోబడి నడిచాను, నా ఆత్మ మీ ఇళ్ళలో ప్రవేశించగా, మీ హృదయస్పందనలు నావై, మీ ఊపిరులు నా ముఖానికి తాకుతూండగా, నేను మిమ్ములనందరినీ ఎరిగియున్నాను. అవును, నేను మీ ఆనందాలనూ తెలుసుకున్నాను, మీ బాధలనూ తెలుసుకున్నాను, నిద్రిస్తూ మీరుకన్న కలలనే నేనూ కన్నాను. అనేకసార్లు నేను పర్వతసానువులమధ్య సరస్సువలె మీ మధ్యన ఉండి మీ ఔన్నత్య శిఖరాలను, వంపులను వాలులను, గుంపులు గుంపులుగా ఎగిరే మీ తలపులబారులను, కోర్కెల సమూహాలను నాలో ప్రతిబింబించాను. నా నిశ్శబ్దంలోకి మీ చిన్నారుల బోసినవ్వుల పిల్లకాలువలు, పడుచువారి విరహోత్కంఠల నదీప్రవాహాలు పరవళ్ళు తొక్కాయి. నా అగాథాల్లో అవి నిండుతున్నప్పటికీ, వాటి కేరింతలు ఏమాత్రం తగ్గలేదు. కానీ ఈ నవ్వులకంటే మధురమైనవి, ప్రియనిరీక్షణలకంటె మిన్న అయినవి నాకు లభించాయి.
అవి, మీలో పరిమితులేవీ లేనట్టివి; ఎవరి విరాట్ వ్యక్తిలో మీరంతా జీవకణాలూ నాడీతంత్రులో, అతడు; ఎవరి మంత్రోచ్చారణలో మీ గానాలన్నీ శబ్దరహితంగా కొట్టుకుంటుంటాయో అతడు; అట్టి విరాట్పురుషునిలో ఉండుటవలన మీరు కూడా మహోన్నతులు; మరియు అతనిని తదేకంగా వీక్షించి ఆరాధించటం ద్వారా నేను మిమ్ములనందరనూ కూడా చూస్తూ ప్రేమించగలిగాను. ఆ మహావరణాన్ని అధిగమించి ప్రేమ చేరగలిగే దూరాలేమున్నాయి? ఏ కల్పనాశక్తులు, ఏ ప్రతీక్షలు, ఏ ఊహలు ఆ మహాగమనాన్ని దాటి ఎగరగలవి? నిండా ఫలపుష్పాల జీవచైతన్యంతో విలసిల్లే మహావృక్షంవలె ఆ విరాట్ పురుషుడు మీ అందరిలో ఉన్నాడు. అతని శక్తి మిమ్ములను భూమిపై నిలుపుతుంది, అతని దివ్యపరిమళం మిమ్ములను విశ్వాంతరాళంలో పరిభ్రమింపజేస్తుంది, అతని శాశ్వతత్వంలో మీరంతా అమరులౌతారు. మీరు గొలుసులోని బలహీనతమమైన లంకె అంతటి బలహీనులని మీతో ఎందరో చెప్పి ఉన్నారు; కాని ఇది సత్యంలో సగమే. మీరు అందులోని అతిబలమైన లంకె అంత బలవంతులు కూడా. మీ అత్యధమ చర్యల ప్రమాణంగా మిమ్మల్ని నిర్ణయించటమంటే మహాసముద్రపు శక్తిని దానిమీద తేలుతున్న నురగకణం ప్రమాణంగా నిర్ణయించటంవంటిదే.
మిమ్ములను మీ వైఫల్యాలప్రమాణంగా గణించడమంటే కాలానుగుణంగా వచ్చు మార్పులకు ఋతువులను నిందించటంవంటిదే.
ఇంకా, మీరు మహాసాగరంవంటివారు; ఒడ్డుననున్న భారీనౌకలు తాము కదిలేందుకు మీ అలలకోసం నిరీక్షిస్తున్నప్పటికీ, సముద్రంవలె మీరుకూడా మీ తరంగాలను తొందరపెట్టలేరు. అలాగే మీరు ఋతువులవలె, శీతాకాలంలో వసంతాన్ని రావద్దని కట్టడిచేసినా, వసంతం మీపై భరోసానుంచి ఏమాత్రం నొచ్చుకొనక తన నిద్రకళ్ళతో చిద్విలాసంగా నవ్వుతుంది. "అతడు మనను మెచ్చుకొన్నాడు. అతడు మనలోని మంచినే చూశాడు." అని మీరు ఒకరికొకరు చెప్పుకోవడంకోసం నేనీవిధంగా మాట్లాడానని అనుకోవద్దు. నేను మాటలలో వ్యక్తపరచినది మీ ఆలోచనలలో మీరెరిగినదే. పైగా, మాటలతోకూడిన జ్ఞానం అంటే ఏమిటి, మాటలులేని జ్ఞానపు నీడ కాక? మీ తలపులు, నా పలుకులు, మనిద్దరి గతాల స్మృతులను, పుడమికి మనగురించి కానీ తనగురించి కానీ ఎరుకలేని పాతరోజులను, దానికి ఎవేవో గందరగోళపు భావనలను కలిగించిన రాత్రులను నిక్షిప్తం చేసుకొన్న భోషాణప్పెట్టె నుండి వెలువడే తరంగాల మాలికలు.
తమ జ్ఞానసంపదను మీకు ప్రసాదించడానికి విజ్ఞులు ఇక్కడ అవతరించారు. మీ జ్ఞానసంపదను తీసుకుపోవడానికి నేను వచ్చాను. కానీ అట్టి జ్ఞానంకన్న అధికమైనదానిని నేను తెలుసుకున్నాను. అది మీలో ప్రజ్వలిస్తూ తననుంచి తాను నిరంతరంగా పెంపొందించుకుంటున్న ఆత్మజ్యోతి కాగా, దాని నిరంతర విస్తృతినెరుగక మీరు గతిస్తున్న మీ కాలాన్ని గురించి వగస్తున్నారు. అది, సమాధులకు భయపడుతున్న శరీరాల్లో ఉంటూ, తనను తాను అన్వేషించుకుంటున్న జీవచైతన్యం.
ఇక్కడ సమాధుల్లేవు. ఈ పర్వతసానువులు, మైదానాలు ఊయలలూ, ఉన్నతికి దోహదపడే సోపానాలూను. మీ పూర్వీకులను శాశ్వతవిశ్రాంతిలో ఉంచిన క్షేత్రాల పక్కనుండి పోతూ వాటిని పరీక్షగా చూచినట్టయితే, మీరూ మీ పిల్లలూ చేయిచేయి కలిపి నర్తించటాన్ని చూస్తారు. మీకు తెలీకుండానే మీరు ఉల్లాసకరమైన ప్రసన్నతను పొందుతారు.
ఇతరులు మీవద్దకు వచ్చి మీ విశ్వాసానికి ప్రతిగా బంగారు వాగ్దానాలు చేయగా, మీరు వారికి సంపదలను, అధికారాన్ని, కీర్తిని ఇచ్చారు. నేనిచ్చినది ఒక వాగ్దానం కంటే తక్కువే అయినా మీరు నాపట్ల విశేష దాతృత్వం చూపారు. మీరు నాకు జీవితంపట్ల ప్రగాఢమైన తృష్ణను కరుణించారు. నిజానికి, తన ఆకాంక్షలను తృష్ణతో పిడచగట్టుకుపోయిన పెదవులుగాను, జీవితాన్ని ఆ తృష్ణను తీర్చే నీటిబుగ్గగాను చెయ్యటం కంటే ఏ మనిషికీ విలువైన బహుమతి అంటూ ఏదీ ఉండదు. నాకు దక్కిన గౌరవం, లభించిన బహుమానమూ ఏమంటే, ఆ జలధారను గ్రోలేందుకు నేను ఎప్పుడు వచ్చినా నాకు ఆ జీవధారే దాహార్తితో ఉన్నట్టనిపించేది. నేను దానిని గ్రోలుతుండగా, అది నన్ను గ్రోలేది. నాకు గర్వమనీ, బహుమానాలు స్వీకరించడానికి వల్లమాలిన బిడియమనీ మీరు భావించారు. నిజమే గర్విష్టినైన నేను వేతనాలు అందుకోనేందుకు సిద్ధమే కాని బహుమతులను కాదు. మీరు నన్ను మీతో భోజనంచేసేందుకు ఆహ్వానించినా అక్కడక్కడా దొరికిన కాయకసరులనేరుకుని తిని, మహదానందంగా నాకాశ్రయమివ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నా ఆలయపు అరుగుమీద నిద్రించినప్పటికీ, నేను తిన్నది నా నోటికి హితవై, నా నిద్రలు మధుర కల్పనలతో సంపన్నమయ్యాయంటే దానిక్కారణం మీరు నా దివారాత్రాలు సాఫీగా గడవటంకోసం ప్రేమానురక్తులతో నిరంతరం యోచిస్తూండటం వల్లనే కదా?
దీనికిగాను మీకు నా ఆశీర్వాదాలు: మీరెంతో ఇచ్చినా, ఇచ్చామన్న స్పృహే మీకు లేదు. తనను తాను అద్దంలో చూసుకుని మెచ్చుకునే దాతృత్వం శిలాసదృశమవుతుంది; సత్కార్యానికి లభించిన ప్రశంశలు శాపాలాపాలకు జన్మనిస్తాయి.
మీలో కొందరు నన్ను ఏకాకినని, ఒంటరితనాన్నే ఆస్వాదిస్తూ గడుపుతానని, ఇంకా ఇలా అన్నారు: "అతడు చెట్టూ పుట్టలతో సమాలోచనలు చేస్తాడు కాని మనుషులతో కాదు." అని, "కొండకొమ్ముమీద కూర్చుని నగరం మీదకి చూస్తుంటాడు." అనీ. నిజమే నేను కొండలనెక్కాను, నిర్జనప్రదేశాల్లో సంచరించాను. సుదూరంనుంచి కాక మిమ్మల్ని స్పష్టంగా ఎలా చూడగలను? దూరస్థులు కానివారు దగ్గరవటమెలా? ఇంకొందరు నన్ను, మాటల్లో కాక, ఇలా అన్నారు:
"పరదేశీ, పరదేశీ, ఎక్కలేని ఎత్తులనెక్కుతూ, గ్రద్దలు గూళ్ళు కట్టుకునేచోట్లలో ఎందుకుంటావు? అందరానిదానికై ఎందుకు అర్రులుచాస్తావు? నీ వలలో ఏ తుపానులను ఒడిసిపట్టుకోవాలని, ఆకాశంలో ఏ అదృశ్యవిహంగాలను వేటాడుదామని? రా, వచ్చి మాలో ఒకడివికా. దిగి మా రొట్టెలతో నీ ఆకలినీ మా మధువుతో నీ దాహాన్నీ తీర్చుకో." తమ ఆత్మల ప్రశాంతతలో వారీవిధంగా అన్నారు. కాని వారి ప్రశాంతత మరింత ప్రగాఢమైనదైతే వారికి తెలిసేది - మీ ఆనందవిషాదాల రహస్యాలను నేను అన్వేషిస్తున్నానని, నింగిలో పయనించే మీ ఆత్మల విరాడ్రూపాలను నేను వెంబడించి వేటాడుతున్నానని. కాని వేటగాడు వేటాడబడతాడు కూడా; నా ధనువు వీడిన ఎన్నో శరాలకు నా వక్షమే గురి. ఇంకా, ఎగిరేవాడు ప్రాకేవాడు కూడా; ఎందుకంటే నా రెక్కలు సూర్యునికెదురుగా విప్పుకున్నప్పుడు భూమిమీద పడిన వాటి నీడ పాకే తాబేలులాగే అనిపించింది. అంతేకాక నేను విశ్వాసినీ సంశయాత్ముడినీ కూడా.
ఎందుకంటే మీపై నాకుగల విశ్వాసం, మీ గురించిన నా అవగాహన మరింత వృద్ధిచెందటంకోసం నా గాయాన్ని నావేలితోనే రేపుకుంటూ భరించేవాడిని. అట్టి విశ్వాసమూ అవగాహనలతో ఈ నాడు చెప్పగలుగుతున్నాను, మీరు మీ శరీరాలచే ఆవరించబడినవారు కాని, ఇళ్ళకూ పొలాలకూ పరిమితమైనవారు కాని కాదు. మీ నిజస్వభావం పర్వతాలకంటే ఎత్తుగా గాలిలో విహరించేది. అది వెచ్చదనం కోసం ఎండలోకి దేక్కుంటూ పోయేదీ కాదు, రక్షణకోసం గుంటతవ్వుకుని దాక్కునేది కూడా కాదు. అది పరిపూర్ణస్వేచ్ఛ కలదై, పుడమినంతనూ ఆవరించి ఆకాశంలో పరిభ్రమించేది.
నా యీ మాటలు అస్పష్టంగా ఉంటే, వాటిని విశదీకరించమని కోరకండి. విషయాలన్నీ ఆరంభంలో అస్పష్టంగా ఉంటాయి కాని ముగింపులో కాదు. నాగురించిన ఎరుకను ఆరంభంలో ఉన్నప్పటిదానిగా కలిగియుండకండి. జీవితం కానీ జీవులు కానీ పొగమంచు మసకలోనే ఆవిర్భవిస్తాయి కాని స్ఫటికపు స్పష్టతలో కాదు.
ఎవరెరుగుదురు స్ఫటికం పొగమంచు క్షీణదశ అని?
నన్ను జ్ఞాపకముంచుకొనేవారు ఈ విషయాన్ని జ్ఞాపకముంచుకోండి: మీలో దుర్బలమూ అగోచరమూ అని మీరనుకొనేది నిజానికి శక్తివంతమూ నిశ్చితమూను. మీ ఎముకలను స్థిరంగా సమున్నతంగా నిలిపేది మీ ఊపిరే కదా? ఇంకా, మీ నగరాన్ని నిర్మించినదీ దానిలోని సర్వస్వానికి రూపకల్పనచేసినదీ మీకే గుర్తులేని మీరుకన్న ఒకప్పటి స్వప్నమే కదా? ఆ ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చూడగలిగితే మీరు ఇకదేన్నీ చూడరు; మరియు ఆ స్వప్నపు గుసగుసను వినగలిగితే మరే శబ్దాన్నీ వినరు.
కానీ మీరు చూడలేరు, వినలేరు. అవును మరి. మీ కళ్ళను కప్పిన ముసుగును దానిని నేసినవారి హస్తమే పైకెత్తాలి; మరియు వినదగిన దానిని విననీకుండా మీ చెవులలో కుక్కబడిన బంకమట్టిని, దాన్ని అక్కడ మెత్తినవారే తవ్వి తొలగించాలి. అప్పుడే మీరు చూస్తారు, వింటారు.
అయినా మీరు ఇట్టి గ్రుడ్డితనాన్ని అసహ్యించుకోరాదు, ఇట్టి చెముడును తలచి వగవరాదు. అన్ని వస్తువుల అస్తిత్వపు పరమార్ధాన్ని మీరు ఎరిగినప్పుడు, మీరు కాంతిప్రకాశాన్ని ప్రశంసించినట్లుగానే, చీకటిచిక్కదనాన్ని కూడా కొనియాడతారు.
ఈ విషయాలు వారికి చెప్పి అతడు తన చుట్టూ చూశాడు. ఓడసరంగు నౌకాగ్రమ్మీదినుంచి పూర్తిగా ఎత్తబడిన తెరచాపలవంక, తదుపరి సుదూర సాగర మార్గం వంక చూస్తున్నాడు.
అతడు చెప్పాడు: ఓరిమి, విపరీతమైన ఓరిమి - నా పడవసరంగుకు. గాలి ధాటితో వీస్తోంది, తెరచాపలు అశాంతితో కొట్టుకుంటున్నాయి, చుక్కాని కూడా సరైన దిశకు తిప్పమని అభ్యర్ధిస్తోంది; అయినా నా సరంగు నా మౌనంకోసం నిరీక్షిస్తున్నాడు. ఎప్పుడూ మహాసాగరతరంగాల భీకరగానాన్నే వింటున్న మిగిలిన నావికులు కూడా నా వాక్యాలను ఓపికతో విన్నారు. ఇక వారు నిరీక్షించలేరు. నేను సిద్ధంగా ఉన్నాను.
వాగు సాగరాన్ని చేరింది, మరొక్కసారి ఆ చల్లని తల్లి తన కుమారుని హృదయానికి హత్తుకుంది.
ఆర్ఫలీస్ ప్రజలారా, మీకు శుభం కలుగుగాక. ఈ రోజు గడిచింది. కలువ తన రేపటికోసం ముడుచుకొంటున్నట్లు, అది కూడా మూసుకుంటోంది. ఇక్కడ మనకు లభించినదాన్ని మనం పరిరక్షించుకోవాలి, అది చాలదనిపిస్తే మనం మరల దగ్గరై ఒక్కుమ్మడిగా దానిని ప్రసాదించు దాతవైపు చేతులు చాచాలి. నేను మళ్ళీ వస్తానన్న విషయం మరువకండి. ఇంకొంతకాలం గడిస్తే నా అపేక్షలన్నీ మసిపట్టిపోయి ఇంకో దేహంలోకి పరుగులు పెడతాయి. ఇంకొద్ది కాలం నిరీక్షణ, శూన్యంలో కొంతకాలం ప్రతీక్ష అనంతరం నాకు ఇంకో స్త్రీమూర్తి తన గర్భంలో ఆశ్రయమిస్తుంది. మీకు, మీతో గడిపిన మధురక్షణాలకు ఇక వీడుకోలు. నిన్ననిన్ననే మనం స్వప్నంలో కలుసుకున్నట్టుంది. నా ఏకాంతంలో మీరు నాతో ఆడిపాడారు. మీకైన అపేక్షతో నేను ఆకాశంలో హర్మ్యాలు కట్టుకున్నాను. కాని ఆ నిద్ర చెదిరిపోయింది, స్వప్నం పూర్తయ్యింది, రాబోయేది ఇక తొలిపొద్దు కాదు.
అపరాహ్ణ పొద్దు మన నెత్తిమీదకొచ్చింది. మగతలో మనం సంజెజాము చేరాము. ఇక ఎడబాటు తప్పనిసరి. ఒకవేళ జ్ఞాపకాల సాయంసంధ్యలో మనం కలుసుకోవటమంటూ జరిగితే, అందరం మనసులు విప్పి మాట్లాడుకుందాం. అప్పుడు నాకోసం మీరు ఇంకా గంభీరమైన గానం చెయ్యాలి. మరో స్వప్నంలో మన చేతులు కలుసుకొంటే అందరం ఆకాశంలో ఇంకో పెద్ద సౌధాన్ని నిర్మించుకుందాం.
ఇలా చెప్పి అతడు నావికులకు సంజ్ఞ చేశాడు, వెంటనే వారు లంగరునెత్తి స్థంభాలకు కట్టిన ఓడ తాళ్ళను వదిలించి, తూర్పుదిశగా సాగిపోయారు. ఒక్కపెట్టున, ఒకే గొంతునుండి వచ్చినట్టు, ఒక రోదన అక్కడి ప్రజాసమూహం నుండి వెలువడింది. అది సాయంసంధ్యలో పైకి లేచి సాగరతలం మీద సుస్వరమైన భేరీనాదంలా ప్రతిధ్వనించింది. అల్ మిత్ర నిశ్శబ్దంగా నిలబడి నావ పొగమంచులో అదృశ్యమయేంతవరకు చూసింది. అంతా అక్కడినించి వెళ్ళిపోయాకకూడా ఆమె అక్కడే ఒంటరిగా నిలబడి సాగరకుడ్యాన్ని తదేకంగా చూస్తూ అతడు అన్న ఈ మాటలను హృదిలో మననం చేసుకుంది: "ఇంకొద్ది కాలం నిరీక్షణ, శూన్యంలో కొంతకాలం ప్రతీక్ష అనంతరం నాకు ఇంకో స్త్రీమూర్తి తన గర్భంలో ఆశ్రయమిస్తుంది.”
No comments:
Post a Comment