Saturday, October 5, 2019

అభ్యుదయ మార్గము (Path of Prosperity by James Allen)

 


అభ్యుదయ మార్గము : ప్రథమ భాగము:

1. చెడు నేర్పే పాఠం

అశాంతి, బాధ, దుఃఖం అనేవి జీవితాన్ని నీడలా వెంటాడుతాయి. మొత్తం ప్రపంచంలో బాధ కాటు తిననిహృదయం కాని, కష్టాల కడలిలో పడి కొట్టుకోని మనస్సుకాని, చెప్పుకోలేని వేదనతో ఆశ్రువులు వర్షించని కన్నులుకాని లేవు.

మహావినాశనకారులై హృదయాలను వేరుచేసి దుఃఖమనే చీకటిని ఇంట్లో కుమ్మరించే వ్యాధి చావూ అనేవి పరిచయంలేని కుటుంబాలు ఏవీ లేవు.  అతిబలవంతమూ, అవినాశకరమూ అయిన కష్టాల వలలో అందరు కాస్త అటూఇటూగా చిక్కుకుని అదనుకోసం పొంచియున్న బాధ, విషాదం, దురదృష్టాల బారినపడుతూంటారు.

తప్పించుకొనే లక్ష్యంతోనో, ఎదో ఒకటి చేసి కమ్ముకుంటున్న ఈ బాధల తీవ్రతను తగ్గించడానికో, స్త్రీలూ పురుషులూ  అసంఖ్యాకమైన సాధనాలను, మార్గాలను సృష్టించుకుని వాటి సహాయంతో శాశ్వతమైన ఆనందధామాలు చేరుకుదామనుకుంటుంటారు.

ఇటువంటివారే, ఇంద్రియసుఖాలలో క్రీడించే మద్యపాన, వ్యభిచారానురక్తులు; ప్రపంచ కష్టాలు కనబడకుండా తలుపులు బిగించుకొని తన భోగ మందిరానికి పరిమితమై మిక్కుటమైన భోగేచ్ఛ కలిగిన సౌందర్యారాధకులు; సంపదనూ ప్రతిష్టనూ ఆశించి, వాని అన్వేషణలో పడి మిగతా అన్నివిషయాలను నిర్లక్ష్యంచేసే కీర్తికాముకులు; భక్తీ మతాచారంపేరుతో తత్సంబంధమైన కర్మకాండలలో ఉపశమనం పొందుదామనుకునేవారు.

వీరందరికి కోరుకున్న ఆనందం, జీవితానికి ఒక్కసారి సుమధురభరిత రక్షణ లభించినట్టు, ఆ మత్తులో దుఃఖం మటుమాయమయినట్టు అనిపిస్తుంది; కాని తిరగబెట్టిన వ్యాధిలా, ఒకనాటికి మరింత ఎక్కువ దుఃఖం, మనోవికారం, దురదృష్టం, ఏ విధమైన రక్షణాలేని ఆ జీవితంపై ముప్పేటదాడి చేసి, ఆనందమని తను భ్రాంతిపడుతున్న తళుకుబెళుకులను చీలికపేలికలు చేస్తుంది.  

కనుక, ప్రతి వ్యక్తిగతమైన ఆనందం నెత్తిమీద, ఇహలోక సౌఖ్యాలు అశాశ్వతాలని గుర్తుచేసే దుఃఖమనే డెమోక్లీస్ కత్తి వేలాడుతూ, ఏ క్షణంలోనైనా తెగిపడి జ్ఞానసంపన్నం కాని ఆత్మను నుజ్జు నుజ్జు చేసేందుకు సిద్ధంగా ఉంటుంది.

బాలలు పురుషులుగాను, స్త్రీలుగాను ఎంతవేగం ఎదిగిపోతామా అని తపిస్తారు; స్త్రీలూ ఫురుషులూ పోగొట్టుకున్న బాల్యపు మధురక్షణాలను తలచుకొని నిట్టూరుస్తుంటారు.  నిరుపేద తనను బద్ధునిచేసిన దారిద్ర్యపు సంకెలలను తలచుకొని వగస్తే, సంపన్నుడు ఎప్పుడు తనకున్నదంతాపోయి తాను దరిద్రుడనవుతానో అనే భయంలో జీవిస్తూ, చేతికిచిక్కకుండా కవ్వించి పారిపోయే ఆనందమనే నీడను చేజిక్కించుకుందామని ప్రపంచమంతటా పరుగులు తీస్తుంటాడు.

ఒక్కోసారి, ఒకానొక మతధర్మాచరణంలోనో, ఒక సైద్ధాంతిక తత్వజ్ఞానాన్ని అనుసరించడంలోనో, ఒక ఆశయప్రతిష్టాపనలోనో కళాసృష్టిలోనో తాము కోరుకున్న రక్షణ, ఆనందం లభించినట్టే అనిపిస్తుంది.; కాని ఒక ప్రబలమైన వ్యసనమో, దుష్కృత్యమో, ఆ మతధర్మం అసమగ్రమూ అల్పమూ అని; ఆ సైద్ధాంతిక తత్వజ్ఞానం పుచ్చి నిరుపయోగమైన ఊతమనీ రుజువు చేస్తాయిలేక, ఒక్క క్షణంలో తాను ఏళ్ళతరబడి ఆరాధించు దేవతావిగ్రహం తన కాళ్ళముందే పడి ముక్కలవుతుంది.

అయితే బాధనుండి, దుఃఖం నుండి తప్పించుకునే మార్గం లేదాకష్టాలకట్లను తెంచే సాధనం లేదా? శాశ్వతమైన ఆనందం, సురక్షితమైన సంపద, స్థిరమైన శాంతి అనేవి వెర్రి కలలేనా?

లేదు, ఒక మార్గం ఉన్నది; కష్టాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆ మార్గంగురించి సంతోషంగా చెబుతాను; వ్యాధులు, దారిద్ర్యం, లేక ఏ ఇతర ఈతిబాధనూ పరిస్థితులనూ కూడా మరెన్నడు మనదారికడ్డురానివిధంగా పక్కకు నెట్టేసే విధానమొకటుంది; లేమి తిరిగొస్తుందనే చీకూచింతా లేని, నిత్యసత్యమైన భాగ్యసంపద సొంతమయ్యే పద్ధతొకటుంది; మరియు తరగని శాంతీ సౌఖ్యాలు పొంది అనుభవించేందుకు సాధనం ఒకటుంది.

ఈ దివ్యానుభవ సాధనకుగాను, మొదట చెడు తత్వాన్ని గురించి సరిగా అర్ధంచేసుకోవడం అవసరం.

చెడు యొక్క ఉనికిని ఖండించడం వల్ల కాని, విస్మరించడం వల్ల కాని ఉపయోగం లేదు.; దానిని అర్ధం చేసుకోవాలి. చెడును తొలగించవలసిందని భగవంతుని ప్రార్ధనచేస్తే చాలదు; అసలది ఎందుకున్నదో, మీకు ఏపాఠం నేర్పడానికి ఉన్నదో, కనుగొనాలి.  మిమ్ము బంధించిన శృంఖలాల గురించి చిరుబురులాడటం, ఉద్రేకపడటం, విసుక్కోవడం వలన లాభం లేదు; మీరెందుకు బంధింపబడ్డారో తెలుసుకోవాలి.  కనుక శ్రోతలారా, మీరు మీనుండి బయటికి వచ్చి మిమ్ములను మీరు నిశితంగా పరిశీలించుకోవాలి.

మీరు అనుభవమనే బడిలో తిరుగుబాటు స్వభావం కలిగిన మొండి కుర్రవానిలా ఉండటం మాని, వినయంతోను ఓరిమి తోను మీ ఆత్మోన్నతి, పరిపూర్ణతల నిమిత్తం అక్కడ లభించే పాఠాలను నేర్చుకోవడం ప్రారంభించాలిఎందుకంటే, సరిగా అర్ధంచేసుకొన్నప్పుడు మీకు తెలుస్తుంది, చెడు అనేది విశ్వంలో ఒక  అంతులేని శక్తి లేదా అధిగమించరాని న్యాయసూత్రం కాదనీజీవితానుభవంలో ఒక క్షణభంగురమైన దశ అనీ, కనుక నేర్చుకొను ఆసక్తి ఉన్నవారికి గురువై ఉపయుక్తమైన పాఠాలను బోధిస్తుందనీ. 

చెడు మీ బాహ్యప్రపంచంలో ఉండి అర్ధంచేసుకోలేని బ్రహ్మపదార్ధం కాదు; అది అనుభవరూపంలో మీ హృదయంలో ఉన్నట్టిది, మరియు మీ హృదయాన్ని సహనంతో పరిశీలనచేసుకొని సరిదిద్దుకుంటున్నప్పుడు దాని మూలాల్లోకి మీకు దారి చూపుతుంది; దానిని పూర్తిగా నిర్ములించేందుకు మీరాదారివెంబడి పోవాల్సి ఉంటుంది. 

సంభవించే చెడు అంతా సంస్కరించే మరియు స్వస్థపరిచే స్వభావం కలది కనుక, శాశ్వతం కానిదిగ ఉంటుంది. అది అజ్ఞానంలో పాదుకొని, విషయాల నిజస్వభావసంబంధాలగురించిన అవగానలోపించినదవటంవలన, మనం ఆ అజ్ఞానస్థితిలో ఉన్నంతవరకు చెడు ఒనరించు దుష్ఫలితాలనే అనుభవిస్తాము.

విశ్వంలో అజ్ఞానజనితం కానిదీ, మనం దాని పాఠాన్ని నేర్చుకునేందుకు సిద్ధపడి అంగీకరించినప్పుడు మనకు ఉన్నతమైన జ్ఞానబోధచేసి తాను మాయంకానిదీ అయిన చెడు ఏదీ లేదు.  కానీ మనుషులు అది బోధించదలచిన గుణపాఠాలను నేర్వ నిరాకరించో, సంసిద్ధులుకాకో, వారి జీవితాలనుంచి చెడు తొలగిపోక, దానిలోనే కలకాలం జీవిస్తారు.

నాకుతెలిసినవారి ఇంటిలోని బిడ్డ, ప్రతి రాత్రి వాళ్ళమ్మ తనను పడుకోబెట్టే సమయంలో, గదిలో వెలుగుతున్న కొవ్వొత్తితో ఆడుకోనివ్వాలని మారాం చేసేది; ఒక రాత్రి, అమ్మ సమీపంలో లేని సమయంలో, వెలిగే కొవ్వొత్తిని అందిపుచ్చుకుంది; జరగాల్సినది జరిగిపోయింది, ఆ చిన్నారి కొవ్వొత్తి పట్టుకుని ఆడాలని మరెన్నడూ కోరుకోలేదు.

తన ఒక్క మూర్ఖపు చేష్టవల్ల ఆ చిన్నారి వినయమనే పాఠాన్ని సమగ్రంగా నేర్చుకుని మంటను తాకితే కాలుతుందనే జ్ఞానాన్ని సంపాదించింది.  ఈ చిన్న సంఘటనే, పాపము, చెడుల  స్వభావం, అంతిమ ఫలితాలగురించిన ఒక ఉదాహరణ.

ఒక బిడ్డ తన అజ్ఞానంతో బాధననుభవించి అగ్ని యొక్క స్వభావాన్ని తెలుసుకున్నట్టు, వయసులో పెద్దవారైన బిడ్డలు కూడా, వగచి మక్కువతో కాంక్షించి, తీరా సొంతమయినప్పుడు హానికారకంగా తయారయ్యే విషయాల స్వభావాన్నిగురించిన అజ్ఞానంతో తాము బాధననుభవిస్తారురెండు సందర్భాల్లో తేడా ఏమంటే, రెండవదానిలో అజ్ఞానం, చెడూ మరీ ప్రగాఢంగాను, నిగూఢంగాను ఉంటాయి. 

చీకటి చెడుకు, వెలుగు మంచికీ ప్రతీకలుగా చెబుతారు; ఈ ప్రతీకలోనే వాస్తవికమై, సమగ్రమైన వివరణ ఉంది; ఎలాగంటే, వెలుగు విశ్వాన్నంతనూ ఆవరించేదిగా ఉంటే, దాని కొన్ని కిరణాలమార్గంలో అడ్డువచ్చిన ఎదో వస్తువు నీడగాను, ఒక మచ్చలాగాను చీకటి ఉంటుంది.   అమోఘమైన మంచి యొక్క కాంతి స్థిరమూ నిశ్చితమూ అయి విశ్వానికి జీవనాధారమైన ప్రకాశాన్నిస్తూండగా, తీక్ష్ణ గమనంతోడి దాని ప్రవేశాన్ని నిరోధించేందుకు దారిలో నించొన్న వస్తువు యొక్క అల్పమూ నిరర్ధకమూ అయిన నీడగా చెడు మిగిలిపోతుంది.

రాత్రి, ప్రపంచాన్ని చొరవీలులేని కాటుకలాంటి తన నల్లదనంతో ఆవరించినప్పుడు, ఆ చీకటి ఎంత నల్లనిదైనా, అది మన చిరు గ్రహాన్ని ఒక అర్ధభాగం మాత్రమే ఆవరించగా, మిగతా విశ్వం యావత్తూ జీవచైతన్యం ప్రజ్వలించే ప్రకాశంతో ధగధగా వెలుగుతూనే ఉంటుంది; మరియు ప్రతి ప్రాణికీ తెలుసు తను ఉదయపు వెలుగులోనే మేల్కాంచగలనని.

కనుక, ఎప్పుడైనా దుఃఖము, బాధ లేదా దురదృష్టం మీ మీద ముప్పిరికొన్నప్పుడు, మీరు డస్సి గమ్యంతోచక అడుగులు తడబడుతున్నప్పుడు, మీరు మీకు, దివ్యప్రకాశంకలిగి అనంతమూ శాశ్వతమూ అయిన  బ్రహ్మానందానికి మధ్య మీ వ్యక్తిగత క్షుద్రవాంచలను అడ్డంగా వుంచుతున్నారు, మరియు మీరుచూచే చిమ్మచీకటినీడ మీకు మీరుగా సృష్టించుకొన్నదే కాని వేరు కాదు. 

ఇంకా, బహిరంగంలో ఉండే చీకటి, వెలుగుకు అడ్డమైన వస్తునీడ, నిరాధారమూ, అవాస్తవికమూ, అగమ్యమూ, ఉనికిలేనిదీ అయి ఎలాగున్నదో, అంతరంగంలో ఉండే చీకటికూడ నిరంతర ప్రవర్ధమానమూ, ప్రకాశజనితమూ అయిన ఆత్మ మిద తాత్కాలికంగా పడే నిలువశక్తిలేని ఒక నీడ.

కాని, ఎవరో అంటున్నారు, అసలెందుకు ఈ చెడు యొక్క చీకటిగుండా ప్రయాణించడం? అని..  ఎందుకంటే, అజ్ఞానంతో మీరు దానినెంచుకున్నారు మరియు, అలా చేయడం ద్వారా మీరు మంచి చెడుల వ్యత్యాసాన్ని అర్ధంచేసుకొనగలుగుతారు, చీకటిలోనుంచి నడిచిన అనుభవంతో వెలుగు యొక్క గొప్పతనాన్ని బాగా గ్రహిస్తారు. 

చెడు అజ్ఞానజనితమైన కారణంగా, చెడు నేర్పే గుణపాఠాలను క్షుణ్ణంగా అభ్యసించినవారికి అజ్ఞానం తొలిగిపోయి ఆ స్థానంలో వివేకం ఉదయిస్తుంది.  కాని అవిధేయుడైన పిల్లవాడు బడిలో పాఠాలు నేర్వ నిరాకరించినట్టు, ఇక్కడ కూడా అనుభవపు పాఠాలు నేర్వనిరాకరించే అవకాశం ఉంది; అప్పుడు ఆ జీవితం ఇంకా ఆ చీకటిలోనే కొనసాగుతూ, మరల మరల తగిలే దాని శిక్షలైన వ్యధి, నైరాశ్యం, ఖేదం వంటి శిక్షలను అనుభవిస్తూనే ఉండాల్సివస్తుంది.

కాబట్టి ఎవరైతే తనననావరించి ఉన్న చెడునుండి స్వేచ్ఛనందగోరుతారో, వారు పాఠాలు నేర్వ సంసిద్ధులై అది నిర్దేశించు క్రమశిక్షణా ప్రక్రియను ఆచరించని పక్షంలో, ఒక లేశమైనా జ్ఞానసిద్ధి కానీ, శాశ్వతంగా నిలిచే ఆనందం కానీ, శాంతి కాని పొందవీలులేదు.

ఒక వ్యక్తి తనను తాను చీకటి గదిలో బంధించుకుని వెలుతురనేదే లేదని బుకాయించినా, వాస్తవానికి వెలుతురు బయటిప్రపంచమంతా నిండియుండగా, చీకటి మాత్రం అతని ఇరుకుగదికే పరిమితమై ఉంటుంది.

కాబట్టి మీరు నిత్యసత్యమైన వెలుతురును నిరసించి తలుపులు మూసుకోవచ్చు, లేక దురభిమానం, స్వార్ధపరత్వం, పొరపాటు అనే అడ్డుగోడలను నేలమట్టంచేసి సర్వవ్యాపకమైన దివ్య ప్రకాశాన్ని లోనికాహ్వానించనూ వచ్చు.

చిత్తశుద్ధితో ఆత్మపరిశీలనచేసుకొని, కేవలం మాటల్లోకాకుండా, చెడు అనేది ఒక దాటిపోయే దశ అని, మీకు మీరే కల్పించుకున్న నీడ అని; మీ బాధలు, దుఃఖాలు, విపత్తులు ఒక గతితప్పని, నిక్కచ్చి అయిన విశ్వన్యాయానుసారమే కలిగినవని; మీరు వాటికి అర్హులూ, మరియు అవి మీకవసరమూ అని, తొలుత వాటిని భరించి తరువాత సమగ్రంగా అర్ధంచేసుకుంటే, మీరు మరింత శక్తిసంపన్నులుగాను, జ్ఞానవంతులుగాను, ఉత్తములుగాను తయారవగలరని ప్రగాఢంగా విశ్వసించండి. 

ఈ విధమైన ఎరుకలో మీరు పరిపూర్ణులైననాడు, మీ పరిస్థితులను మీరే సరిదిద్దుకోగలుగుతారు, చెడునంతనూ మంచిగా రూపుమార్చి, అత్యుత్తమ ప్రావీణ్యం కలిగిన హస్తంతో మీ విధిని మీరే లిఖించుకోగలుగుతారు.

2. మనఃస్థితుల ప్రతిబింబమే ప్రపంచం

మీరెలా ఉంటారో, మీ ప్రపంచం కూడా అలానే ఉంటుంది.  విశ్వం యావత్తు అంతరంగంలోని మీ అనుభవమై ఒదిగియుంటుంది.  బహిరంగప్రపంచం అంతరంగ చైతన్యపు ప్రతిబింబమే కాబట్టి దానిని గణించటం అంత ఆవశ్యకమైన అంశం కాదు.  

కాని లోపల మీరెలా ఉంటారన్నది మాత్రం అత్యావశ్యకంగా పరిగణింపదగినది, ఎందుకంటే దానిననుసరించే బహిః ప్రపంచపు ప్రతిబింబపు స్వరూపస్వభావాలు మారుతుంటాయి కనుక.

మీకు తెలిసినదంతా మీ స్వానుభవంలో నిక్షిప్తమై ఉంటుంది; మీరు తెలుసుకొనబోయేది కూడా స్వానుభవమనే సింహద్వారం గుండానే పయనించి తద్వారా మీలో ఒక భాగం అవుతుంది.  

మీ ప్రపంచం అంటే మీ ఆలోచనలు, వాంఛలు, ఆకాంక్షలే; మరియు, మీకు విశ్వంలో సుందరమూ, ఆనందమూ సౌఖ్యమూ అనిపించినవైనా, వికారమూ దుఖమూ బాధా అనిపించినవైనా మీ స్వస్వభావంలోనే అంతర్భూతమై ఉంటాయి.

మీ ఆలోచనలద్వారానే మీరు మీ జీవితాన్ని, మీ ప్రపంచాన్ని, విశ్వాన్నీ కూడా నిర్మించుకోనూగలరు, కూలద్రోసుకోనూగలరు; ఆలోచనాశక్తితో అంతరంగంలో నిర్మించుకుంటున్నదానికనుగుణంగా బహిః ప్రపంచమూ దాని పరిస్థితులూ రూపుదిద్దుకుంటుంటాయి.

మీ హృదయ నిగూఢ కుహరాల్లో పెంచిపోషించుకుంటున్నదే, ఒకనాటికి, తప్పించుకొనలేని ఆకర్షకన్యాయానుసారం, మీ బయటి ప్రపంచపరిస్థితుల రూపంలో ఆవిష్కృతమవుతుంది.  

ఆత్మ పాపిష్టిది, నీచమైనది, స్వార్ధపూరితమైనదీ అయితే, పొరపాటుకు వీలులేని నిర్దుష్ట గతితో  ఆపదలను, స్వవినాశనాన్ని ఆకర్షించుకుంటుంది; అదే స్వచ్ఛమైనది, నిస్వార్ధమైనది, ఉదారమైనది అయితే అదే గతితో ఆనంద సౌభాగ్యాలను ఆకర్షించుకుంటుంది.

ప్రతి ఆత్మా తనకు సంబంధించినదాన్ని, అర్హమైనదాన్నే ఆకర్షించుకుంటుంది కాని తనకు సంబంధంలేనిదేదీ తనను సమీపింపదు.  ఈ సత్యాన్ని గ్రహించుటయే మహాపవిత్ర దివ్య న్యాయపు విశ్వవ్యాపకతను గ్రహించడం.

మనిషి జీవితాన్ని బాగుచేసే లేదా పాడుచేసే రోజువారి సంఘటనలను, దాని అంతః ప్రపంచంలోని ఆలోచనల నాణ్యత మరియు శక్తులే దానివైపుకు ఆకర్షిస్తాయి.  ఆలోచనల, అనుభవాల సంక్లిష్ట సమూహమే ఆత్మదాని ఆవిష్కరణకుగాను సృజనాత్మకంగా తయారుచెయ్యబడ్డ వాహనమే శరీరం.

కనుక నిజమగు మీ ఆత్మ అంటే, మీ అలోచనలే; మీచుట్టు ఉండే చరాచర ప్రపంచం మీ ఆలోచనలు దానినే దుస్తుల్లో చూడాలనుకుంటాయో వాటినే ధరించి మీకు సాక్షాత్కరిస్తుంది.

"మనం ఇంతవరకు చేసిన ఆలోచనల ఫలితమే మనముండే నేటి స్థితి.  అది మన తలపుల పునాదులమీద, తలపులతోనే నిర్మించబడినటువంటిది" అంటారు బుద్ధభగవానుడు; కాబట్టి ఒక మనిషి ఆనందంగా ఉన్నాడంటే కారణం అతడు ఉత్సాహపూరిత, ఆనందకరమైన ఆలోచనలు చేస్తాడని; దుఃఖభాగుడై ఉన్నాడంటే, అతడు నిరాశాజనక, నీరుగార్చు ఆలోచనలలో నిమగ్నమై ఉంటాడని. 

ఒకరు భయస్తులైనా ధైర్యస్తులైనా, అవివేకులైనా వివేకులైనా, అశాంతిగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నా, ఆ దశలకు మూలకారణం అతని ఆత్మలోనే ఉంటుంది కాని బయటి ప్రపంచంలో కాదు.  ఎవరో అంటున్నారు - అయితే మీరంటున్నది బయటి పరిస్థితులు మన మనస్సును ప్రభావితమే చెయ్యవా? అని.  నేనలా అనను కాని, పరమసత్యమను పరిపూర్ణ నమ్మికతో ఇలా అంటాను, పరిస్థితులు మీరు వాటిని అనుమతించినంతమేరకు మాత్రమే మిమ్ములను ప్రభావితం చెయ్యగలవని.

మీరు పరిస్థితుల తాకిడికి అవి ఎటు తోస్తే అటు పోతున్నారంటే కారణం, మీకు మీ ఆలోచనల స్వభావం, వినియోగం మరియు శక్తి గురించి సరైన అవగాహన లేకపోవడమే.

మీ నమ్మకమేమంటే (ఈ నమ్మకమనే చిన్న పదం మీదే కద మన కష్టసుఖాలు ఊగిసలాడేది) బయటి పరిస్థితులు మనలను పొంగించనూగలవు, కుంగించనూగలవని.  అలా అనుకుంటూనే మీరు బయటి విషయాలకు విధేయులై లొంగిపోయి, వాటికి మీరు బానిసలూ, అవి బేషరతుగా మీ యజమాని అని స్థిరపడిపోతారు; ఇలాచేయటంద్వారా, అంతవరకు వాటికిలేని శక్తిని మీరే వాటికి దఖలుపరచి, అట్టి పరిస్థితులకే కాక, మీ మనఃస్థితి వాటి చుట్టు అల్లిన మోద-ఖేదాలు, ఆశా-వ్యాకులతలు, దార్ఢ్య-దౌర్బల్యాలు వంటి ద్వంద్వాలకు కూడా దాసోహమంటూ కాలం గడుపుతారు.

యుక్తవయస్సులో కూడబెట్టినదంతా ఒక్కసారి కోల్పోయిన ఇద్దరిని నేనెరుగుదును.  ఒకరు ఈ పరిణామంతో అథః పాతాళానికి కుంగిపోయి, అక్కడినించి నిరుత్సాహం, దిగులు, నిర్వేదాలతోనే జీవిస్తున్నాడు. 

రెండోవ్యక్తి, పొద్దున్నే పత్రికలో తన బ్యాంకు దివాలాతీసిందనే వార్త చదివి ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయిందనే విషయాన్ని గ్రహించిన కొద్దికాలానికే తెప్పరిల్లి అన్నాడు - "సరే, పోయిందేదో పోయింది, నేను విచారిస్తూ దిగులుపడితే అది తిరిగొస్తుందా, కష్టించి పనిచేస్తే వస్తుంది గాని." అని. 

అతడు రెట్టించిన ఉత్సాహంతో కష్టపడి అనతికాలంలోనే సంపన్నుడయాడు.  కాని మొదటి వ్యక్తి ఇంకా చింతను విడవక, పోయిన ధనంగురించే శోకిస్తూ, తన దురదృష్టాన్ని నిందిస్తూ, ఆ తరవాత కూడా సంభవించే విపత్కర పరిస్థితులవాస్తవానికి తన బానిసత్వపుటాలోచనల సుడిగాలుల వడి ఎటు విసిరితే అటు ఎగిరిపడే ఎండుటాకులా మిగిలిపోయాడు.

తన బలహీన, నిరాశాజనక తలపుల తడిగుడ్డలో చుట్టి కావిలించుకుని విడవలేకపోతున్నవానికి ఆ ధననష్ట సంఘటన శాపంగా పరిణమిస్తే, బలవర్ధక, ఆశాజనక, సాహసోపేతమైన ఆలోచనలు నిండినవానికి అది వరమై అనుగ్రహించింది.

మేలునో కీడునో కలిగించగల సామర్ధ్యమే పరిస్థితులకుంటే ఆ మేలూ కూడూ అందరికీ సమానంగానే కలగాలికద; కాని వాస్తవానికి అదే పరిస్థితులు కొందరికి వరంగాను, ఇంకొందరికి శాపంగాను పరిణమిస్తున్నాయంటే అర్ధం, ఆ విధంగా కలిగే మంచి చెడులు పరిస్థితులలో కాక వాటినెదుర్కొంటున్న  వ్యక్తుల మనస్తత్వాల్లో ఉంటుందన్నది స్పష్టం.

ఇది గ్రహిస్తే మీరు మీ ఆలోచనలను నియంత్రించుకోనారంభిస్తారు, మీ మనసును క్రమబద్ధీకరించి క్రమశిక్షణలో పెడతారు, పనికిమాలిన, నిష్ప్రయోజనకరమైన విషయాలను వెలికిదోసి కేవలం ఆనందకారకాలు, నిర్మలమైనవి, శక్తినీ చైతన్యాన్నీ ప్రసాదించేవి, దయనూ ప్రేమనూ ప్రకటించేవి, సౌందర్యభరిత, అనశ్వరచైతన్యశోభితాలైన ఆలోచనలతో అంతరంగంలోని మీ ఆత్మ మందిరాన్ని పునర్నిర్మించుకుంటారు. 

ఇంకా, సంభవించే సంఘటనలను మన ఆలోచనలతో ఆచ్ఛాదించిన రీతిలోనే, మన చుట్టూ ఉండే చరాచర ప్రపంచాన్ని కూడా అలంకరించగలుగుతాము; ఫలితంగా, ఇంకొకరు అసహ్యభరితమైన అందవికారతను చూచినచోట మనం సామరస్యాన్నీ సౌందర్యాన్నీ దర్శించగలుగుతాము.

ఉత్సాహవంతుడైన ఒక ప్రకృతిశోధకుడు పల్లెలోని పంటకాల్వవెంబడి నడుస్తూ, ఒక చవిటి ప్రాంతంలో ఉన్న నీటిగుంట తన దృష్టినాకర్షించగా, ఆ గుంటలోకి ఆసక్తిగా చూశాడు.

అందులోని నీటిని తను తెచ్చుకున్న సీసాలో నింపుకుని దానిని తన ప్రయోగశాలలోని సూక్ష్మదర్శినికింద చూసి తెలుసుకోబోయే కొత్త విషయాలను తలచుకొని, తననే గమనిస్తున్న నిరక్షరాస్యుడైన ఒక నాగటి పుత్రునికి అందులో దాగున్న అసంఖ్యాకాలైన అద్భుతాలను ఉద్వేగంతోను, వివరణాత్మకంగాను వివరించి, ఆఖరుగా అన్నాడు, "చూశావా మిత్రమా, ఈ చిన్న గుంటలో ఒక వంద, కాదు కొన్ని కోట్ల విశ్వాలు కనిపిస్తాయి సుమా, మనకే కాని వానిని దర్శించగల జ్ఞానమూ సాధనమూ ఉన్నప్పుడు" అని.  అయితే శాస్త్రజ్ఞానాభావుడైన ఆ పల్లెరైతు ఇవేమీ పట్టించుకోకుండా తన అభిప్రాయం ఇలా చెప్పాడు, "నాకు తెలుసు బాబూ, ఆ గుంటనిండా చిరుకప్పలే, కాని దిగేమంటే ఇట్టే దొరికిపోతాయి". అని.

ప్రకృతి జ్ఞానంతో పరిపూర్ణమైన శాస్త్రజ్ఞుని మనస్సు సౌందర్యాన్ని, సామరస్యాన్ని, నిగూఢమైన సృష్టి రహస్యాలనూ చూసినచోట, అట్టి సంపర్కమే ఎరగని వాని మనసు మాత్రం ఉపద్రవమైన బురదగుంటను చూసింది. 

ఒక సాధారణ పాదచారి నిర్లక్ష్యంగా తొక్కి వదిలేసే వనకుసుమం, తత్వచింతనాపరుడైన కవిపుంగవునికి దృగ్గోచరంకాని దివ్యలోకాలు పంపిన దేవదూతవలె కనిపిస్తుంది.

అనేకులకు, సముద్రమంటే అప్పుడప్పుడూ పడవలు ఛిన్నాభిన్నమై మునిగిపోతూ ఉండే అవధుల్లేని భయానక జలాశయం; కాని ఒక సంగీతకళాకారునికి అది జీవచైతన్యం కలదై, అతను చెవియొగ్గి విన్నప్పుడు తన అన్ని రసభావాలను దివ్య స్వర మాధుర్యంతో వినిపిస్తుంది.

సామాన్య బుద్ధికి వినాశనమూ గందరగోళమూ తోచిన సందర్భాలలో ఒక తత్వజ్ఞునికి మాత్రం నిర్దుష్టమూ, క్రమబద్ధమూ అయిన కారణ-కార్యాల సమన్వయం కానవస్తుంది; అలాగే భౌతికవాదికి ఎటుచూసినా చావూ వినాశనమూ కనబడుతుండగా, జ్ఞానవిదునికి మాత్రం సదా చలిస్తూండే శాశ్వత జీవ చైతన్యం గోచరిస్తుంది.    

మరియు, సంఘటనలకూ వస్తువులకూ ఏ విధంగా మన ఆలోచనలనే వస్త్రాలను తొడిగి విమర్శనచేస్తామో, అదే విధంగా ఇతరుల ఆంతరంగాలకు కూడా మన ఆలోచనలను ధరింపజేసి తదనుగుణంగా వారిని గణిస్తాము.

అనుమాన పిశాచులకి ప్రతిదీ అనుమానాస్పదమే; సృష్టిమొత్తమ్మీద సత్యశీలి అనబడే ప్రాణివిశేషం ఒకటుంటుందంటే నమ్మేంత వెర్రివాడు తాను కాడని ఒక అబద్ధాలకోరు నిబ్బరం.  ద్వేషపూరితునికి ఎదుటివారందరూ ద్వేషిస్తున్నట్టుగానే కానవస్తారు.  అందరూ తన సొమ్ము లాక్కుందామని చూసేవారేనని పిసినారి అభిప్రాయం; వివేకాన్నీ అంతఃకరణనూ పణంగా పెట్టి సంపద కూడబెట్టినవానికి తలగడకింద పిస్తోలు లేందే నిద్రపట్టదు, ఎందుకంటే ప్రపంచమంతా తనబోటి అధర్మపరులతోనే నిండియుంది కనక తాను చేసినట్టే వారు కూడా తనను దోపిడీ చెయ్యడం తధ్యం అని అతని భ్రమ; మరియు సర్వభ్రష్టుడైన విషయభోగేచ్ఛాపరునికి ఒక సాధుపుంగవుడు ఆత్మవంచకునిలా కనిపిస్తాడు.

దీనికి భిన్నంగా, ఆలోచనలనిండా ప్రేమభావననే సదా కలిగియుండువారికి, తమచుట్టూ ఉన్న ప్రపంచమంతా తన ప్రేమనూ దయనూ కోరుతున్నట్టు అనిపిస్తుంది; పూర్ణ విశ్వాసమూ, నిజాయితీ కలిగినవానికి ఎవరినీ అనుమానించాల్సిన అవసరం ఉండదు; సచ్ఛీలుడూ, పరోపకారీ, ఇతరుల వృద్ధిని చూసి పరమానందమందేవాడు అయినవానికి ద్వేషమనే భావన ఒకటుంటుందని తెలియదు; తన అంతరంగంలోని దివ్యాత్మను గ్రహించినవాడు సకల ప్రాణులందూ దానిని గుర్తించి వాటిపట్ల ప్రేమాభిమానాలు కలిగియుంటాడు.

ఇంకా, కారణ-కార్య సిద్ధాంతాన్ననుసరించి వారు మనసావాచా వ్యక్తీకరించినటువంటిదే వారివద్దకు ఆకర్షించబడి తమతో సారూప్యం కలిగిన వారికి చేరువ చేస్తుందని గ్రహించిన పురుషులూ స్త్రీలూ తమకు సదుపాయంగా ఉండే ఆలోచనావిధానానికి అలవాటుపడతారు.

బహిరంగ వ్యాపారాలలాగే అంతరంగ ప్రపంచంలోని భావసారూప్యమే మనుషులను దగ్గరచేస్తుందన్న సత్యమే "ఓగునోగుమెచ్చు" అన్న నానుడికి వాడుకలోనున్నదానికన్న నిగూఢమైన అర్ధాన్నిస్తుంది.  

దయనపేక్షిస్తున్నారా? దయకలిగియుండండి.  సత్యాన్నే కోరుకుంటారా? సత్యశీలురై ఉండండి.  మీరిచ్చేదే మీకు తారసపడుతుంది; ప్రపంచం మీ ప్రతిబింబమే.

జీవితాంతమూ, మరణానంతరమూ కూడా ఆనందదాయకమైన ప్రపంచంలో ఉండాలని ప్రార్ధిస్తూ ఎదురుచూస్తూ ఉండేవారికి ఒక శుభవార్త ఏమంటే, మీరు అట్టి ఆనందోల్లసిత ప్రపంచంలో ఈ క్షణమే అడుగిడవచ్చు; అది విశ్వాన్నంతనూ ఆవరించేది, మీ అంతరంగంలో ఉండేది, మీరు తనను కనుగొని, స్వీకరించి, సొంతంచేసుకుంటారని ఎదురుచూస్తున్నదీ.  అంతరాత్మ శాశ్వత న్యాయసూత్రాల విశేషపరిజ్ఞానం కలిగిన ఒకరు ఇలా అన్నారు:

"ఇటురా, అటుపో, అంటూ మీకు నిర్దేశించువారి వెంబడి పోవద్దు; భగవంతుని సామ్రాజ్యం బయటెక్కడనో కాక, మీ హృదిలోనే ఉంది." అని.

మీరు చెయ్యాల్సిందల్లా, సంశయమేఘాలు లేని స్వచ్ఛమైన మనస్సుతో ఈ సత్యాన్ని విశ్వసిస్తూ, దానిగురించిన సంపూర్ణ జ్ఞానం కలిగేంతవరకు నిరంతరం దానిని ధ్యానిస్తూండడమే.

అప్పుడు మీరు మీ అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకుని పునర్నిర్మించుకొననారంభిస్తారు, అలా సాగుతున్నకొద్దీ, జీవనసత్యాలు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతూ, వివేకజ్ఞానం క్రమక్రమంగా అభివృద్ధినందుతూ, మీకు ప్రాపంచికవిషయాల దౌర్బల్యం తేటతెల్లమై, ఆత్మస్వీయనియంత్రణ  యొక్క  నిగూఢ సామర్ధ్యం కరతలామలకమవుతుంది.   

3. వద్దనుకునే పరిస్థితులనుంచి బయటపడే మార్గం

శాశ్వతమూ ప్రకాశవంతమూ అయినది మంచిమాత్రమేనని, చెడు దాని తేజోమార్గంగుండా సాగిపోతున్న మబ్బుతునకవంటి అశాశ్వతమూ అజ్ఞానస్వరూపమూ అయిన నీడ అని, ప్రపంచమనే అద్దంలో ప్రతి ఒక్కరు చూచేది తమ ప్రతిబింబం మాత్రమేనని గ్రహించిన తరువాత, మనం సుదృఢమూ సునాయాసమూ అయిన అడుగులతో విశ్వన్యాయాన్ని దర్శించగల భావనాతలం పైకి చేరుకుంటాము.

ఈ ఎరుకతోబాటే, విషయాలన్నీ  కారణ-కార్య న్యాయానికి (cause and effect) లోబడే తప్ప ఇంకోవిధంగా సంభవించవనే గ్రహింపు కూడా కలుగుతుంది.

మనిషియొక్క అతి సామాన్యమైన ఆలోచన, మాట లేదా చేష్ట నుండి అంతరిక్షంలోని గ్రహకూటముల వరకు, ఈ న్యాయానికి అనుగుణంగానే సంభవిస్తున్నాయి.  దీనిని అతిక్రమించే సూత్రం ఏదైనా ఈ న్యాయాన్ని తిరస్కరించేదీ, రూపుమాపేదీ కాబట్టి ఒక్క క్షణకాలంపాటు కూడా అట్టిది నిలువదు.

కనుక జీవితంలోని ప్రతి సంఘటన ఒక క్రమబద్ధము, సరళమూ అయిన పద్ధతి ప్రకారమే సంభవిస్తూ, ప్రతి సంఘటనయొక్క రహస్యమూ కారణమూ ఆ సంఘటనలోనే నిక్షిప్తమై ఉండి, ఎవరూ కాదనలేని, మోసగింపలేని, అతిక్రమించలేని, "నీవు విత్తినదే నీకు పండుతుంది" అనే నానుడి ప్రపంచానికి శాశ్వతంగా వర్తించేవిధంగా జ్వలించే సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంది.

మంటలో చేయిపెట్టిన వ్యక్తి ఆ మంట చల్లారిపోయేంతవరకు కాలుతున్న బాధను భరించాల్సిందే, మరియు ప్రార్ధనలుకాని శాపనార్ధాలుకాని ఆ పరిస్థితిని ఏవిధంగాను మార్చలేవు.

అదే సూత్రం మనసుకీ వర్తిస్తుంది.  కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే మంటలను లోపల రాజేసుకున్నవారు అవి కలిగించే దారుణమైన వేదనను అనుభవించాల్సిందే.  


ఇట్టి మనోవైకల్యాలకు "చెడు" అని సరైన పేరునే ఉంచారు.  ఎందుకంటే అవి విశ్వన్యాయాన్ని అతిక్రమించేందుకు అజ్ఞానపూరితమగు ఆత్మ చేస్తున్న ప్రయత్నాలు. తత్ఫలితంగా అవి అంతరంగంలో గందరగోళాన్ని, అలజడినీ రేపుతూ, అనతికాలంలోనే బహిరంగమై వ్యాధి, పరాజయం, దురదృష్టం గా బయలుపడి తద్వారా శోకాన్ని, వేదనను, నిర్వేదాన్ని కలిగిస్తాయి. 

తద్విరుద్ధంగా ప్రేమ, నెమ్మదితనం, మంచితనం, పవిత్రత అనేవి, విశ్వన్యాయానికి అనుగుణమైన లక్షణాలు కనుక, అవి అశాంతితో రగిలిపోయే అంతరాత్మపైకి చల్లని మలయసమీరాలను ప్రసరింపజేసి దానిని ఆహ్లాదపరుస్తూ, అనతికాలంలో తదనుగుణమైన ఆరోగ్యం, శాంతియుత వాతావరణం, విజయపరంపర, సిరిసంపదల రూపంలో బహిరంగమవుతాయి.

విశ్వాన్ని నడిపించే ఈ న్యాయసూత్రాన్ని పరిపూర్ణంగా అర్ధంచేసుకోవడమంటే ఆ న్యాయసూత్రం పట్ల విధేయత కలిగియుండటం.

ఈ విశ్వంలో న్యాయబద్ధత, సామరస్యం, ప్రేమ సర్వశ్రేష్టమైన భావనలని గ్రహించటమంటే, అన్ని ప్రతికూల, వేదనాభరిత పరిస్థితులు ఆ విశ్వన్యాయంపట్ల మన అవిధేయతకు ఫలితమని గ్రహించడం.  అట్టి ఎరుక వలన శక్తీ ఆత్మబలమూ ఒనగూడుతాయి, మరియు అట్టి జ్ఞానసంపత్తియే అర్ధవంతమైన జీవనానికీ కలకాలం నిలిచే విజయ ఆనందాలకూ మూలాధారమై ఉంటుంది.

ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓరిమీ సంయమనం కలిగియుండి సంభవించే ప్రతి సంఘటనా జీవితం మనకిచ్చే శిక్షణలో భాగమేనని దృఢంగా నమ్మినప్పుడు, బాధను కలిగించే పరిస్థితుల ధాటికి కొట్టుకుపోయి మునిగిపోకుండా నిలదొక్కుకొని, వాటిని మరే సందేహమూ లేకుండాను, అవి తిరిగొస్తాయనే భయం లేకుండాను అధిగమిస్తాం; ఎందుకంటే విశ్వన్యాయం పట్ల మన విధేయతే అన్ని ప్రతికూల పరిస్థితులను చక్కదిద్దుతుంది.

అట్టి విధేయుడు విశ్వన్యాయంతో సామరస్యం కలిగి పనిచేస్తూ, తాను దానిలో మమేకమై ప్రవర్తించినప్పుడు, అతను జయించినవి అతనిని వీడిపోవు, అతను నెలకొల్పినట్టివి ఎన్నటికీ శిధిలం కావు.

అన్ని శక్తుల, బలహీనతల మూలకారణం అంతరంగంలోనే ఉంటుంది; అలాగే అపరిమిత ఆనందాల, అంతులేని వ్యధల రహస్యం కూడా అంతరంగంలోనే నిగూఢమై ఉంటుంది

అంతరంగ వికాసాన్ని మించిన పురోగతి కాని, క్రమబద్ధంగా వృద్ధినందు అట్టి జ్ఞానసిద్ధి కన్న పొందదగిన భాగ్యం కానీ శాంతి కాని ఉండవు. 

పరిస్థితుల సంకెలలలో బందీలమయ్యామని, మెరుగైన అవకాశాలకోసం, శ్రేష్టమైన సామాజిక మనుగడ కోసం తపిస్తూ, వాటిని సాధించనియ్యకుండా మీ కాళ్లూ చేతులను కట్టి ఉంచిన దురదృష్టాన్ని లోలోపల తిట్టుకుంటున్నవారు మీలో ఉన్నారు.

అట్టి మీకోసమే నేను రాసేది; మీకే నేను చెప్పేది.  నా వాక్యాలు మీ హృదయఫలకాలమీద శాశ్వతంగా లిఖించబడనియ్యండి, ఎందుకంటే అది సత్యం కనుక.  

మీరు మొక్కవోని సంకల్పంతో మీ అంతరంగాన్ని మెరుగుపర్చుకొంటే కనుక, మీరు కోరుకుంటున్న మెరుగైన పరిస్థితులు మీ ముందు పరుచుకుంటాయి.

ఆరంభంలో ఈ మార్గం శూన్యంగా, ఉత్సాహరహితంగా అనిపిస్తుంది-సత్యమెప్పుడూ అంతే, మహోల్లాసంగా మనకి ఆహ్వానం పలికేవి పొరపాటూ భ్రాంతే కద.  కాని నిరుత్సాహపడక ఆ మార్గాన్నే అనుసరింప నిశ్చయించుకుని, మనసును సదా క్రమశిక్షణలో ఉంచి, బలహీనతలను దరిజేరనీయక, మనోబలమూ ఆధ్యాత్మిక శక్తులూ వెల్లడి అయినప్పుడు, మీ బాహ్యప్రపంచంలో చోటుచేసుకుంటున్న అద్భుత పరిణామాలు చూసి మీకు అమితాశ్చర్యం కలుగుతుంది.  

మీరు సాగిపోతున్నకొద్దీ బంగారు అవకాశాలు మీ మార్గంలో పరుచుకుంటుంటాయి, ఇంకా వాటిని ఉపయోగించుకొనే శక్తీ వివేచనా మీలో ఉప్పొంగుతాయి.  సహృదయులైన స్నేహితులు మీరు కోరకుండానే మీ చుట్టూ చేరుతారు; అయస్కాంతానికి ఆకర్షించబడే సూదిలా సానుభూతిపరులగు ఆత్మబంధువులు జతగూడుతారు; మీకు అవసరమయే పుస్తకాలూ ఇతర సాధనాలు తలవకనే మీ దరిజేరుతాయి. 

లేమి బరువైన ఇనుప గొలుసులు మీ మీద పెనుభారమై, నా అనేవారెవరూ లేని ఒంటరితనం శాపమై, అట్టి దుర్భర పరిస్థితులనుండి బయటపడేందుకు మీరు విలవిలలాడుతూండవచ్చు; కాని ఆ బరువూ శాపమూ తీవ్రతరమై మీచుట్టు ఉన్న అంధకారం మరింత చిక్కబడి దారీ తెన్నూ తోచక మరింత అయోమయానికి గురౌతుండవచ్చు. 

మీరు మీ ప్రస్తుత స్థితిని ఏవగించుకుంటూ, మీ ఉనికిని, తల్లిదండ్రులను, యజమానిని, ఇంకా మీకు దారిద్ర్యాన్నీ కష్టాలనూ ఇచ్చి ఇంకొకరికి సంపదనూ సుఖభోగాలనూ ఇచ్చే విధినీ నిందించుకుంటూండవచ్చు.

మొట్టమొదట మీ స్థితిని గురించి చెప్పుకోవడమూ వ్యాకులపడడమూ ఆపండి.  మీ దురదృష్టకర పరిస్థితికి కారణం మీరనుకుంటున్నట్టు బయట ఎక్కడో లేదు; అవి మీలోనే ఉంది; ఆ కారణమున్నచోటే దాని పరిష్కారం కూడా ఉంది.

మీ స్థితిగురించి అదే పనిగా కుములుతూ అందరిదగ్గరా వాపోతున్నప్పుడే గ్రహించండి; అలా కుములుతూ వాపోయే తత్వమే మీకీ స్థితిని తెచ్చిందనీ, మహత్తరమైన బృహత్ప్రయత్నంద్వారా మీరు సాధించగల వృద్ధికి మూలం మీలోనే ఉన్నదనే ఆత్మవిశ్వాసం మీలో కొరవడిందనీ.

ధర్మయుతమైన విశ్వంలో దిగులుచెంది దుఃఖించేవారికి చోటులేదు; దిగులు ఆత్మహత్యాసదృశం.  మీ మనస్సుయొక్క ఈ నైజంతోనే మిమ్మల్ని మరింత చీకటిలోనికి లాక్కుపోయే శృంఖలాలను మరింత దృఢం చేసుకుంటున్నారు.  

జీవితం పట్ల మీ దృక్పథం మార్చుకుంటే జీవితం కూడా మారుతుంది.

ఆత్మవిశ్వాసంతోను, జ్ఞానంతోను మిమ్ములను మీరు నిర్మించుకొన్నప్పుడు, మెరుగైన పరిసరాలకు, విస్తృతమైన అవకాశాలకు మిమ్ములను మీరు అర్హులుగా చేసుకొన్నవారవుతారు.  ముందుగా మీ అందుబాటులోనున్న దానిని సంపూర్ణంగా సద్వినియోగపరచుకోండి.  

చిన్న చిన్న పనులను, వాటివల్ల కలిగే ప్రయోజనాలను చిన్నచూపుచూసి బృహత్తరమైన వాటికోసం ప్రయత్నించి సాధించగలమని భ్రమపడకండి, ఒకవేళ అలా సాధించడం జరిగినా, ఆ ఫలం అశాశ్వతమై, త్వరలోనే మిమ్మల్ని విడిచిపెట్టి పోవడం, అశ్రద్ధ చేసిన విషయాలను ఆచరించేందుకోసం మీరు మళ్ళీ వెనకటి స్థితిలోకి జారిపోవడం ఖాయం.

బడిలోని బాలలు పైతరగతిలోకి పోయేందుకు ముందు కిందితరగతిలో ఉత్తీర్ణతకావడం తప్పనిసరి అయినవిధంగానే, మీరుకూడా, ఒక గురుతరమైన ప్రయోజన సాధనకు ముందు అందుబాటులోన్న సాధనాలతో పొందగలిగే స్వల్ప ప్రయోజనాలను ముందుగా సాధించాలి. 

నీతికథ ఒకటి బైబిల్ లో ఉంది: ఒక యజమాని ప్రయాణమౌతూ తన ముగ్గురు సేవకుల్లో మొదటివానికి ఐదు, రెండవ వానికి రెండు, మూడవవానికి ఒకటీ నైపుణ్యాలను బోధించి తన సంపదను వాళ్ళకి అప్పజెప్పి వెళ్తాడు.  మొదటి ఇద్దరూ తమకు కలిగిన నైపుణ్యాలను రెండింతలు చేసుకుని యజమాని సంపదను వృద్ధిచేయగా, మూడవవాడు మాత్రం తనకీయబడిన కౌశలాన్ని పట్టించుకోక యజమానిచ్చిన ధనాన్ని మాత్రం భూమిలో పాతిపెట్టి యజమాని రాగానే మిగతా ఇద్దరితో పాటు అప్పజెప్తాడు. విషయం గ్రహించిన యజమాని, తనకు అందుబాటులోనున్న నైపుణ్యాన్ని అశ్రద్ధచేసి అలసత్వంతో కాలం వెళ్ళబుచ్చిన అతడిని చెడతిట్టి అతని కౌశలాన్ని కూడా లాక్కుని శ్రద్ధగా, సక్రమంగా పెంపుచేసుకునే నైజం కలిగిన మొదటివాడికే ఇచ్చి వాడిని వెళ్ళగొడతాడు.  ఎంత అల్పములూ స్వల్పములూ అయినవైనా, మనకు కలిగిన వనరులను దుర్వినియోగం, ఆశ్రద్ధ, నాశనం చేసుకొనే మన ప్రవర్తనద్వారా ఆ లేశమాత్రానికి కూడా మనం అనర్హులమవుతాం కనుక ఆ కొద్దిమాత్రం కూడా మన నుండి తీసివేయబడుతుందని తెలిపే మంచి కథ ఇది.

అనారోగ్యకర, అనర్ధదాయక ప్రభావాలు చుట్టుముట్టిన ఒక గుడిసెలో మీరు జీవిస్తూ ఉండవచ్చు.  

విశాలమైన, ఆరోగ్యకరమైన నివాసాన్ని మీరు కోరుకుంటూండవచ్చు.  దానికోసం, ముందుగా శాయశక్తులా ప్రయత్నించి మీ ప్రస్తుత నివాసాన్ని ఒక చిన్న స్వర్గధామంలా మార్చుకోవడం ద్వారా ముందు దానికి అర్హులమని నిరూపించుకోవాలి.  దానిని మచ్చలేనంత పరిశుభ్రం గా ఉంచుకోవాలి.  మీ వనరులు అనుమతించినంతవరకు దానిని సుందరంగాను, ఆహ్లాదకరంగాను తీర్చిదిద్దాలి.  సామాన్యమైనదే అయినా ఆహారాన్ని రుచి, ఆరోగ్యం, శక్తి కలిగించేలా శ్రద్ధగా వండుకొని భోజనాల బల్లని అభిరుచికి తగినట్లుగా అందంగా అలంకరించుకోవాలి.

ఇంట్లో పరిచేందుకు తివాచీ కొనే స్తోమతలేనప్పుడు, మీ గదులనిండా స్వచ్ఛమైన చిరునవ్వులను, ఆహ్వానాలను పరచి దయకలిగిన తీయని మాటలనే మేకులను ఓరిమి అనే సుత్తితో కొట్టి బిగించండి.   ఎండకి రంగుకోల్పోవడం, అధికవాడకం వల్ల అరిగి చిరిగిపోవడం అనే ఇబ్బందులేవీ ఈ తివాచీకి ఉండవు.

మీ ప్రస్తుత పరిసరాలకు ఇట్టి గౌరవం కల్పించినప్పుడు మీరు వాటిని, వాటి అవసరాన్ని అధిగమించగలుగుతారు, సరైన సమయం వచ్చినప్పుడు అంతవరకు మీరాకకోసం వేచిచూస్తున్నవి, మీరు అన్నివిధాలా అర్హతనందినవీ అయిన మెరుగైన నివాసంలోకి, పరిసరాల్లోకి మీరు అడుగుపెడతారు.  

ఇప్పుడున్న పనిగంటలు దీర్ఘమూ, కష్టతరమూ అయి, మరింత ఉన్నతికోసం చేయాల్సిన ఆలోచనకూ ప్రయత్నానికి మరింత సమయాన్ని మీరు కోరుకుంటూండవచ్చు.  అందుకోసం ఇప్పుడు మిగిలిన కొద్ది క్షణాలనైనా సరే ఏ మాత్రం వృధా కానీయక సద్వినియోగం చేసుకోండి.   ఇప్పటికే మీ చేతిలో ఉన్న సమయాన్ని కనుక మీరు వృధాచేసి  దుర్వినియోగ పరుస్తున్న పక్షంలో, అది చాలటంలేదని మరింత కోరుకోవడం నిష్ప్రయోజనం. దానివల్ల మీరు మరింత బద్ధకస్తులుగాను, ఉదాశీనులుగాను తయారవుతారు.  

లేమీ, కాలాభావమూ మీరూహించుకుంటున్నంత ఉపద్రవాలేమీ కావు, అవి మీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మీకనిపిస్తే దానర్ధం, వాటిని మీరు మీ బలహీనతలతో కప్పియుంచేరనీ, ఇంకా మీ కష్టాల మూలకారణం మీలోనే ఉన్నట్టిదనీ.  మనసును సరైన రీతిలో మలచుకొనే సామర్ధ్యం కలిగిన మీరు మీ భవితవ్యాన్ని కూడా అంతే సామర్ధ్యంతో తీర్చిదిద్దుకోగలరనీ, కావలసిన విధంగా తయారుకాగలిగే స్వయం శిక్షణతో మీరీ సత్యాన్ని మరింత స్పష్టంగా తెలుసుకొని, ఇప్పుడనుకుంటున్న ఈ శాపాలన్నీ వరాలుగా చేయవీలున్నవేనని గ్రహిస్తారు.

అప్పుడు మీరు మీ పేదరికాన్ని ఓరిమి, ఆశావహ దృక్పథం, ధైర్యాల పెంపుకోసం, మీ చేత చిక్కిన మీ అధీనంలోని అతి తక్కువ సమయంలోని ప్రతి అమూల్యమైన క్షణాన్ని విధుల్లో సయపాలన, మనసుకు సంకల్పశక్తి కోసం సద్వినియోగపరుస్తారు.

అతి జుగుప్సాకరమైన బురదలో అతి సుందర మనోహర పుష్పాలు వెల్లివిరిసినట్లు, లేమి అనే మురికి నేలలోనించి మానవాళి ఎంపిక చేసుకున్న సుగంధభరిత సుందర సుమాలు విరబూస్తాయి.

సహించేందుకు కష్టాలు, అసంతృప్తికరమైన పరిస్థితులు ఉన్నప్పుడే మనిషిలోని ధర్మం వికాసం చెంది తన ప్రతిష్టను ప్రకటిస్తుందనేందుకు దృష్టాంతాలు అనేకం.

మీరు నిరంకుశులైన  యజమానుల కొలువులో పనిచేస్తుండవచ్చు, వారు మిమ్ములను పీడిస్తున్నారని భావించవచ్చు.  మీ శిక్షణలో ఇది కూడా ఒక ఆవశ్యకభాగమనే చూడండి.  యజమాని నిర్దయకు బదులుగా వారి పట్ల సౌమ్యతను, క్షమను ప్రదర్శించండి.  

నిరంతరాయంగా ఓరిమిని, స్వీయనియంత్రణను అభ్యసించండి.  ప్రతి ప్రతికూలతను మానసిక, ఆధ్యాత్మిక శక్తిసాధనకోసం సద్వినియోగం చెయ్యండి.  మీ జీవితమే ఒక నిశ్శబ్దమైన దృష్టాంతంగా, ప్రభావకారకంగా మారి మీ యజమానికి కూడా ఒక గుణపాఠమై, అతడు తన వైఖరిపట్ల సిగ్గుపడి పరివర్తన దిశగా అడుగులు వేస్తూండగా, మీరు అదే సమయంలో మీ అనుభవాలతో మరింత ఉన్నతమూ ఉత్కృష్టమూ ఐన ఆధ్యాత్మిక, మానసిక శక్తిని సంతరించుకొని తగిన సమయం ఆసన్నమైనప్పుడు అక్కడినించి మరింత స్నేహపూరితమగు వాతావరణంలోకి అడుగుపెడతారు.

మీది బానిసబతుకైపోయిందని పితూరీలు చెయ్యకండి, సరళమైన స్వభావంతో బానిసభావనలనుండి మిమ్ము మీరు పైకి లాక్కోండి.  ఎవరికో బానిసలమని నెత్తీ నోరూ కొట్టుకోవడానికి ముందు, మీ బలహీనతలకు మీరు బానిసలు కాకుండా జాగ్రత్తపడండి.

అంతరంగంలోనికి దృష్టిని పరుపండి; మీపై మీకుగల జాలినీ సానుభూతినీ విడిచిపెట్టి సవిమర్శనాత్మకంగా ఆత్మశోధన చేసుకోండిఎవరు చెప్పగలరు అక్కడ మీకు బానిసత్వపుటాలోచనలు, బానిసత్వపుటాకాంక్షలు ఇంకా మీ దైనందిన ప్రవర్తనలో బానిసత్వపుటలవాట్లూ గోచరించవచ్చు.  వాటినన్నింటినీ జయించి పైచేయి సాధించండి; మనసుకు బానిసకాని మిమ్మల్ని బానిసగా చేయు శక్తి ఎవరికీ ఉండదు.  మనసును వశమొనర్చుకొన్న మీరు అన్ని ప్రతికూలతలను అధిగమిస్తారు, అన్ని ప్రతిబంధకాలు మీ ముందు వీగిపోతాయి.

సంపన్నులు మిమ్మల్ని తొక్కేస్తున్నారని గొడవ చెయ్యకండి.  సంపదలు కలిగితే ఆ స్వభావం మీకు రాదని చెప్పగలరా

శాశ్వతమూ, పరిపూర్ణ న్యాయబద్ధమూ అయిన విశ్వన్యాయసూత్రం ఒకటుందని, ఈరోజు వేరొకరిని అణగద్రొక్కేవాడు రేపటిరోజున అణచివెయ్యబడతాడని, ఎవరూ దీనినించి తప్పించుకోలేరనీ మాత్రం ఎప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకోండి.

గతంలోనో, గతజన్మలోనో, మీరు కూడా సంపన్నులై ఇతరులను బాధించియుండవచ్చు, ప్రస్తుతం ఆ బాకీని న్యాయబద్ధంగా చెల్లిస్తూండవచ్చు.  అందువలన, మనో నిగ్రహాన్నీ ఆత్మ విశ్వాసాన్నీ విడువక సాధన చెయ్యండి.

మనసునెల్లప్పుడూ శాశ్వతమైన న్యాయం మీద, శాశ్వతమైన హితం మీద లగ్నం చేయండి. వ్యక్తిగతమూ చంచలమూ అయినదానినుండి సార్వజనీనమూ శాశ్వతమూ అయినదానిదిశగా వృద్ధినందేందుకు శ్రమించండి.

ఎవరో బయటివారి కారణంగా మీరు బాధనూ అణచివేతనూ అనుభవిస్తున్నామనే భ్రాంతిని విదిలించి అతి నిగూఢమైన మీ అంతః ప్రపంచాన్ని, దానిని నడిపించే న్యాయసూత్రాలను, అలాగే మీ బాధలకు కారణం మీ అంతరంగంలోనే ఉంటుందనే వాస్తవాన్నీ అవగతం చేసుకోండి.  మీమీద మీరే జాలీ కరుణా చూపుకోవడం దిగజారుడుతనమూ భ్రష్టత్వమూ ఆవ్మవినాశకరమూ అని గుర్తుపెట్టుకోండి.

దానిని మీ స్వభావం నుంచి బహిష్కరించండి.  దానిలాంటి విషక్రిమి మీ హృదయంలో ఉన్నంతకాలం మీరు ఎదిగి సమగ్రమైన, పరిపూర్ణమైన జీవనాన్ని గడపలేరు.

పరనిందను పూర్తిగా మానెయ్యండి, నింద తప్పదనుకుంటున్నప్పుడు దాన్ని మీ వైపే తిప్పుకోండి. మచ్చలేని పవిత్రత, పాపపంకిలం కాని మంచితనంతో సరితూగని మీ చర్యలు, ఆకాంక్షలు, ఆలోచనలు వేనినీ ఉపేక్షించవద్దు.

ఇలా చేసినప్పుడు మీ జీవనసౌధాన్ని శాశ్వతంగా నిలిచియుండే శీల సంపన్నమైన పునాదుల మీద నిర్మించుకొనగలుగుతారు, మరియు మీ ఆనందానికి శ్రేయస్సుకు అవసరమైన ప్రతిదీ సమయానుకూలంగా మీ దరిచేరుతుంది.

అంతరంగంలోని స్వార్ధం, నైరాశ్యం, ద్వేషం వంటి మానసికావస్థలను నిశ్శేషంగా నిర్మూలించడం ఒక్కటే దారిద్ర్యం మొదలైన అవాంఛనీయ స్థితులను చక్కబరచే మార్గం.  ఎందుకంటే రెండో స్థితి మొదటి దాని ప్రతిబింబమై, మొదటిది ఉన్నంతవరకూ అదీ ఉంటుంది.

నిష్కళంకమైన ధర్మాచరణతో అంతరాత్మను సుసంపన్నం చేసుకోవడంవల్లనే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి.  స్వచ్ఛమైన ధర్మాచరణను సదా కలిగియుండే పవిత్ర అంతరంగం కంటె భాగ్యవంతము, శక్తివంతమూ అయినది దాని బయట ఉండదు; అలా కనిపించేవన్నీ అంతరంగంలోని పవిత్ర స్థితికి ప్రతిరూపాలే.  అయితే అంతరంగంలో ధర్మలేశమైనా లేక, దాని విషయమే స్మరింపని వారు సంపదలను కూడబెట్టడం నేనెరుగుదును; అలా కూడబెట్టినది నిజమైన సంపద కాదు, మరియు అది అశాశ్వతమూ, లోపభూయిష్టమూ.  

దావీదు వాక్యాలను వినండి:  “దుష్టులు కూడబెట్టిన సంపదలు చూచి ఎంతో అసూయచెందేవాడిని... కొవ్వెక్కిన శరీరాలు, పొడుచుకొచ్చిన కళ్ళు; మదిలోని కోరికలను మించిన ఐశ్వర్యం వారిది...  నిశ్చయంగా హృదయ శుద్ధతనంది, చేతులను నిష్కాపట్యంతో శుద్ధిచేసుకున్న నేను, ఈ బాధను భరించలేక .. భగవత్సన్నిధిలో మోకరిల్లిన క్షణంలో గ్రహించాను ఈ పరుగులో వారు అంతిమంగా సాధించాలనుకుంటున్నది నేనున్న స్థితినేననీ” ‖

నీచుల సంపదలు దావీదుకి గొప్ప సమస్యగా అనిపించేయి అతడు దైవసన్నిధిలో కూర్చొని వారి గమ్యమేదో తెలుసుకునేంతవరకు.

అట్టి సన్నిధిలోకి మీరు కూడా ప్రవేశించవచ్చు.  అది మీలోనే ఉంది.  క్షుద్రమూ, స్వార్ధభూయిష్టము, అశాశ్వతమూ అయిన స్థితినుండి పైకెక్కి  విశ్వజనీనమూ, శాశ్వతమూ అయిన మూలతత్వాన్ని తెలుసుకొన్నప్పటి మనఃస్థితియే అది.  

అది దైవాంశసంభూతమైన జ్ఞాన స్థితి; అత్యున్నత జ్ఞానశక్తి యొక్క ధ్యానమందిరం.  అశాంతినిండిన అంతరంగాన్ని క్రమశిక్షణాయుతం చేసి మీరు అట్టి మందిరద్వారాన్ని సమీపింపగల్గితే, ఏ అవరోధాలూ లేని దృష్టితో, సకల మానవాళి తలపుల, చర్యల అంతిమ గమ్యాన్ని, అది మంచైనా చెడైనా, సులభంగా గ్రహిస్తారు.

అట్టి స్థితిని చేరినప్పుడు మీరు నీతిబాహ్యుల వశమయ్యే సంపదలగురించి అసూయపడి విశ్వన్యాయం పట్ల మీ విశ్వాసాన్ని సడలించరు, ఎందుకంటే అలా సంపాదించినది వారిని వీడిపోవటం, వారు దరిద్రులై పతనమవడం తప్పనిసరి అని మీకు తెలుసు కనక.

అధర్మపరుడైన సంపన్నుడు వాస్తవానికి నిరుపేదయే; నదిలోని నీరు నది మధ్యంలోనుంచే వడివడిగా సముద్రం దిశగా ప్రవహించిపోయినట్లు, అన్ని సంపదల మధ్యనుంచి, అతడు పేదరికమూ, కష్టాల దిశగా జారిపోతుంటాడు; మరియు అతడు సంపన్నునిగానే మరణించినా, తన అధర్మ ఫలాలననుభవించేందుకు అతడు భూమిపై మళ్ళీ పడాల్సిందే.

ఇంకా అతడెన్నిసారులు సంపన్నుడుగా మారుతున్నా, అన్ని సార్లు అతడు పేదరికంలోకి విసిరివేయబడతాడు, సుదీర్ఘమైన అనుభవం, వేదనల సహాయంతో అతను తన అంతరంగంలోని పేదరికాన్ని జయించేంతవరకు.

కాని ఎవరైతే బాహ్యంగా నిరుపేద అయినా అంతరంగంలో ఉత్కృష్టమైన నైతికతను ధర్మాన్ని కలిగియుంటాడో, అతడు తన లేమి మధ్యనుంచి తప్పక భాగ్యదశవైపు ప్రయాణిస్తాడు; అపరిమితమైన ఆనందమూ సౌఖ్యమూ అతనికై వేచియుంటాయి.  మీరు శాశ్వతంగా సౌభాగ్యవంతులై ఉండాలని అభిలషిస్తే, ధర్మపరాయణులై ఉండటం తప్పనిసరి.

అందువలన నేరుగా సంపదలను సాధించేందుకు పరుగులుపెట్టటం, అదే జీవితాశయంగా కలిగియుండటం, దురాశతో దాన్ని కైవసం చేసుకొన యత్నించడం, అవివేకమూ, ఆత్మపరాభవమూ.

దానిబదులు మొదట ఆత్మపరిపక్వత దిశగా సాగండి, ప్రయోజనకరమూ స్వార్ధరహితమూ అయిన సేవను మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి, పరమగమ్యమూ నిర్వికల్పమూ అయిన లోకకల్యాణానికై ఎల్లప్పుడూ చేతులు చాచి పరిపూర్ణ విశ్వాసంతో పనిచేయండి.

మీరు సంపదను మీకై కాక, జనహితానికి, ఇతరులను అనుగ్రహించేందుకు అని చెప్తుంటారు.  అదేగనక సత్యమైన మీ లక్ష్యమైతే అందుకై కోరుకున్న సంపద తప్పక మిమ్ము వరిస్తుంది; ఎందుకంటే, తరగని సిరుల మధ్యలో ఉన్న మీరు, ఉత్సాహవంతులై స్వార్ధరహితులై, మిమ్ములను వాటి యజమానిగా కాక వాటిని లోకకల్యాణార్ధం వినియోగపరచేందుకు పనిచేస్తున్న సామాన్యోద్యోగిగా మాత్రమే భావిస్తున్నందుకు.

అయితే మీ ఉద్దేశ్యాన్ని బాగా పరిశీలించుకోండి, ఎందుకంటే చాల దృష్టాంతాల్లో సంపదను పరహితంకోసమని సంపాదిస్తున్నప్పటికీ, అంతరంగంలో మటుకు అట్టి సేవద్వారా వచ్చే ప్రతిష్ట, మానవతావాదిగా, సంస్కర్తగా నలుగురూ ఇచ్చే గుర్తింపు వారి అభిమతమై ఉంటుంది.

చేయదలచుకున్న మంచేదో మీవద్ద ప్రస్తుతం ఉన్నదానితో చేయకుండా మరెంతో ఒచ్చినప్పుడు చేస్తామని చెప్పడం మీ స్వార్ధపరత్వాన్ని మరింత పెంచుకోవడమే, మరియు అదొచ్చేవరకు ఆగి చేసేది మంచి కాక, ఆత్మతృప్తికై మీరు చెల్లించుకుంటున్న మొక్కుబడి మాత్రమే.

మంచినొనరించటం నిజంగానే మీ ఆకాంక్ష అయితే, మరింత ధనం ఒచ్చేవరకు మీరు ఆగనవసరం లేదు; ఇప్పుడే, ఈ క్షణమే, మీరున్నచోటినుండే దానినాచరించవచ్చు.  మీరు మిమ్ము భావించుకొనేంతటి నిస్వార్ధపరులే అయితే, అన్యులకోసమైన ఆత్మ పరిత్యాగంద్వారా ఆ విషయాన్ని ఇప్పుడే నిరూపించగలరు.

ఎంత పేదవారికి కూడా ఆత్మ పరిత్యాగానికి అవకాశం ఉంటుంది; బైబిల్ కథలలోని నిరుపేద వితంతువు తనకున్నదంతా ధర్మకోశంలో జమచేయలేదా?

మేలుచేయు సంకల్పం ఉన్న హృదయం తగినంత సొమ్ము చేతిలో పడేంతవరకు ఆగక, సంకల్పించినదే తడవుగా త్యాగపీఠాన్ని చేరి ఏమూలనో తననంటిపెట్టుకున్న స్వార్ధ స్వలాభాపేక్షలను  పూర్తిగా దులిపివేసి ఆత్మీయులూ అపరిచితులూ, హితులూ విరోధులూ అనే భేదభావం లేకుండా, శ్వాసనిండా సర్వజన సౌభాగ్యాకాంక్ష ప్రసరిస్తూండగా, పరహితేచ్ఛతో పరుగులిడుతుంది.

ఫలితం దాని కారణాన్ని వివరిస్తుందిభాగ్యమూ బలమూ అంతరంగం లోని మంచినీ, దారిద్ర్యమూ దౌర్బల్యమూ దాని లోని చెడునూ వివరిస్తాయి.

నిజమైన సంపద అంటే ధనరాశులు, అంగ,అర్ధ బలాలు కావు.  అవే అనే భావనలో జీవించడం, పారుతున్న నదిలో జారుడు మెట్లమీద నిలబడి స్థిరంగా ఉన్నామని అనుకోవడమే.

మీ నైతిక ధార్మిక సంపదే మీకుగల ఆస్తిపాస్తులు; మరియు అట్టి సంపదను వినియోగపరచుటయే మీకున్న శక్తి.  అంతరంగాన్ని సరిదిద్దుకుంటే జీవితాన్ని సక్రమ మార్గంలో ఉంచుకున్నట్టే.  కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, భోగలాలసత, స్వార్ధపరాయణత్వం, మూర్ఖపు పట్టు - ఇవే దారిద్ర్య, దౌర్బల్యాలు కాగా ప్రేమ, స్వచ్ఛత, సౌమ్యత, వినమ్రత, దయ, దాతృత్వం, ఆత్మపరాఙ్ముఖత్వం, స్వార్ధపరిత్యాగం - ఇవే భాగ్య బల సంపత్తి.

అట్టి దారిద్ర్య దౌర్బల్య లక్షణాలు పూర్తిగా జయించి సద్గుణభాగ్యబలసంపత్తిని కలిగిన సద్ధర్మాచరణపరాయణుల అంతరంగ శక్తి ప్రబలమూ, జయింపశక్యం కానిదీ అయి, వారికి ప్రపంచమంతా స్వాధీనమయినట్లే.

కాని ధనవంతులు, ధనహీనులమాదిరే, అవాంఛనీయ పరిస్థితులలో కొట్టుమిట్టాడుతూ, ధనహీనుల కన్నా ఎక్కువగా ఆనందానికి దూరమవుతారు. కారణం, ఆనందం మనం పోగుచేసుకునే వస్తుసంచయాన్ని కాక, అంతరంగంలోని సద్గుణసంపత్తిననుసరించి ఉంటుంది. 

మీ యాజమాన్యంలో కొందరు ఉద్యోగులు పనిచేస్తుండవచ్చు, ఉన్నవారితో మీ తలనొప్పి దైనందిన వ్యవహారం కాగా, కొత్తవారు మంచివారు కష్టపడే తత్వమూ ఉన్నవారు మీ కొలువును త్వరగా విడిచిపెట్టిపోతూండవచ్చు.  ఈ విధమైన పరిస్థితుల మధ్య మీకు మానవ స్వభావసంబంధాలపైనే విశ్వాసం పూర్తిగా పోతుంది.  అధిక వేతనాలివ్వడం, కొన్ని వెసులుబాట్లు కల్పించడంద్వారా వారి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం మీరు చేస్తారు, కాని ఫలితం శూన్యం.  నేను మీకు చెప్పేది:

మీ ఇబ్బందికి కారణం మీ పనివారిలో కాక, మీలోనే ఉంది; పొరపాటుని కనుగొని సమూలంగా సరిదిద్దే సదుద్దేశంతో ఒక్కసారి అంతరంగాన్ని పరిశీలించుకుంటే మీకు అనతికాలంలోనె అక్కడ మీ చింతకు హేతువు కనబడుతుంది.

అది అంతరంగంలోని స్వార్ధపూరితమైన వాంఛ, అనుమానించే స్వభావం, దయారాహిత్యం లేక అటువంటి ఇతరమైన వైకల్యం కావచ్చు, దాని విషప్రభావం మీ చుట్టూ ఉన్నవారిపై ప్రసరించి చుట్టు తిరిగి మీ మీదే పడుతుంది; అయితే అంతరంగంలోని ఈ దుర్వృత్తి మీ మాటలలో కాని నడవడిలో కాని మీరు ప్రదర్శించకపోవచ్చు.

పనివారిని దయతో చూడండి, ఇరువురి పరిస్థితి తారుమారు అయినట్లు ఊహించుకుని వారు మిమ్ములనిప్పుడు సేవిస్తుండిన దానికంటె మిన్నగా మీరు వారిని సేవింపలేననే ఎరుక కలిగి ఆ విధంగా వారి సేవలలోని ఔన్నత్యాన్ని గౌరవించండి.

తనను మరచి యజమాని శ్రేయస్సుకై పాటుపడే సేవకుని విధేయత అపూర్వము, ప్రశస్తమూఅంతకన్న అపూర్వమూ దివ్యమూ అయినది, తన శ్రేయాన్ని లెక్కచెయ్యక తన యాజమాన్యంలో ఉంటూ తమ జీవయాత్రకు తనపై ఆధారపడియున్న వారందరి శ్రేయోభివృద్ధులే లక్ష్యంగా జీవించే ధన్యాత్ముని అంతరంగం.

అట్టివాని ఆనందం వేయింతలవగా, అతనికి తన కొలువులో ఉన్న ఎవరి పైనా చెప్పుకోదగిన ఏవిధమగు అనిష్టతా ఉండదు.  అనేకమంది పనివారిని కొలువులో కలిగి, ఒక్కరిని కూడా  తొలగించాల్సిన అవసరం పడని యజమాని అన్నదిది: "నా ఉద్యోగులందరూ నాకు మహదానందకారకులే.  అదెలా సాధ్యమయిందని అడిగితే, నేను చెప్పగలిగేది ఒక్కటే, వారినుండి నేనాశించిన నిబద్ధతను ముందుగా వారిపట్ల నేను చూపడమే." అభిలషణీయమైన అన్ని పరిస్థితులను సాధించే, అవాంఛనీయమైన అన్ని పరిస్థితులను నివారించే రహస్యమూ ఇది.    

మీరు ఏకాకి అయి, ఎవరి ప్రేమకూ నోచుకోలేదని, ఇంత ప్రపంచంలో మీకంటూ చెప్పుకొందుకు ఒక్క మిత్రుడూ లేడని వాపోతున్నారా? అయితే మీకు నా సవినయపూర్వక విజ్ఞాపనం, దయచేసి మిమ్ములను తప్ప మరెవ్వరినీ నిందించకండి.

అందరిపట్ల స్నేహభావం కలిగియుంటే స్నేహితులు మీ చుట్టూ కూడతారు.  మిమ్ము మీరు పరిశుద్ధులుగాను, ప్రేమాస్పదులుగాను చేసుకొన్నప్పుడు అందరూ మిమ్ము ప్రేమిస్తారు.

ఏ పరిస్థితులవలన జీవితం భారమని తోస్తోందో, వాటినుండి బయటపడి ఉత్కృష్ట స్థాయికి మిమ్ములను చేర్చేది, పరిశుద్ధపరచుకొని అధీనంలో ఉంచుకొన్న మీ అంతరంగపు పరివర్తన శక్తియే.

అది భరింపరాని పేదరికం కావచ్చు – (ఇక్కడ పేదరికం అంటే దుఃఖకారణమగు దారిద్ర్యం అని, ఆత్మోన్నతి పొందిన ధన్యాత్ములు స్వచ్ఛందంగా కోరి విధించుకున్న లేమి కాదు) లేక బ్రతుకుకు భయకారణాలైన అధికసంపదలవలని దుస్సహ భారం, ఇతర దురదృష్టాలు, వ్యాకులతలు, చికాకులు కలిగించే గాఢాంధకారం కావచ్చు, అన్నింటిని సమర్ధంగా సరిదిద్దేది, వాటికి జవసత్వాలనిచ్చే మీ అంతరంగంలోని స్వార్ధపూరిత తలపులను గుర్తించి విడిచిపెట్టడమే.

సర్వకాలీనమగు ఈ న్యాయానుసారం, గతంలోని మన ఆలోచనలవలని దుష్ఫలితాల నివారణకోసం ముందు మనం పనిచెయ్యాల్సి, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుందనీ దిగాలుపడనక్కరలేదు, ఎందుకంటే అదే న్యాయానుసారం, మన ఇప్పటి పరిస్థితిలో, ప్రతి క్షణం, తాజా ఆలోచనలనూ క్రియలనూ కొనసాగిస్తూనే ఉన్నాము, తదనుగుణమైనది, మంచిదో చెడుదో అయిన భవిష్యత్తును రచించుకుంటున్నాం కూడా.

అలాగే, గతంలో నాటిన తలపులూ క్రియలూ అనే విత్తనాలకు ఫలితంగా, ఇప్పుడు సంపదని హోదానీ కోల్పోవలసిరావటమనే పంటను దిగుబడిగా పొందుతున్నంత మాత్రాన, ఎలాగూ వచ్చేది కష్టకాలమే కదాని వారు మనోనిగ్రహాన్నీ సత్ప్రవర్తననీ విడిచిపెట్టరాదు, ఎందుకంటే మున్ముందు రాబోయే పంటకు ఇప్పుడు నాటే విత్తనాలే కద మూలాధారం, మరియు ఇప్పటి మనోవాక్కాయకర్మల నాణ్యతననుసరించి భవిష్యత్తులో పొందనగు సంపదలూ ఆనందమూ శక్తియుక్తులూ ఉంటాయి.  ఇది గ్రహించక స్వార్ధమే పరమావధిగా ఉండేవారికి చుట్టుముట్టే బయటి శత్రువులకు తోడు తాము కూడా తమకి శత్రువులవుతారు.

స్వార్ధాన్ని త్యజించినవారు తామే తమ ఉద్ధారకులు; వారి చుట్టు సహాయకారులయిన మిత్రులు రక్షణకవచంవలె ఎప్పుడూ పరివేష్టించి ఉంటారు.  

స్వార్ధాన్ని విడనాడినవారు తమకు తామే రక్షకులు; వారిచుట్టు అనేకమంది సుహృన్మిత్రులు చేరి రక్షణకవచమై కాపాడుతుంటారు.  పవిత్ర హృదయపు దివ్య ప్రకాశం ముందు అజ్ఞానాంధకారమంతా నశించి, విషాదమేఘాలు చెల్లాచెదరైపోతాయి; తనను తాను జయించుకున్నవాడు విశ్వాన్నంతనూ స్వాధీనపరచుకుంటాడు.

దారిద్ర్యమూ, బాధ, కష్టాలు, నిట్టూర్పులు, దూషణలు, హృదయవేదన, ఒంటరితనాల బంధనాలనుండి బయల్వెడలి రండి, అంతరంగంలోని స్వార్ధస్వభావాన్నించి విడివడడం ద్వారా.  

ఇంతవరకు మీరు ధరించిన సంకుచిత స్వార్ధపరత్వమనే చింకిగుడ్డను జారిపోనిచ్చి విశ్వప్రేమమనే నూతన వస్త్రాలనలంకరించుకోండి.  పైనెక్కడో కాక మీ అంతరంగంలోనే ఉన్న స్వర్గధామం మీ ముందు ఆవిష్కృతమై, మీ బయటి ప్రపంచాన్ని మీకనుకూలం చేస్తుంది.

ఆత్మనియంత్రణ అనే మొదటి అడుగుతో, విశ్వాసమనే అధికారదండాన్ని చేబూని స్వార్ధపరిత్యాగమనే రాజమార్గంగుండా చరించేవారు అత్యుత్కృష్ట సౌభాగ్యసంపదలు స్వంతంచేసుకొన్నవారై, కలకాలంపాటు ఆనందోత్సాహాత్మసంతృప్తికరమైన జీవనాన్ని సాగిస్తారు.

4. ఆలోచనల నిశ్శబ్ద శక్తి: దాని నియంత్రణ, వినియోగము

విశ్వశక్తులన్నిటిలోను బలీయమైనవి నిశ్శబ్దస్థితిలో ఉన్నట్టివే; శక్తి తీవ్రతను బట్టి దాని సద్వినియోగం ఉపయోగకరంగాను, తద్వ్యతిరేకమైనది హానికరంగాను పరిణమిస్తాయి.

ఆవిరి, విద్యుత్తు వంటి యాంత్రిక శక్తులకు సంబంధినంతవరకు ఇది సార్వజనీనమైన విజ్ఞానమే, కాని దీనిని, నిరంతరాయంగా ఆలోచనలను విద్యుత్తరంగాలవలె ప్రసరించి సంక్షేమాన్నో వినాశనాన్నో కలిగించే మనఃశక్తికి అన్వయించి తెలియబరచేవారు అరుదనే చెప్పాలి.

తన పరిణామదశలో, మానవునికి ఈ శక్తులు సంక్రమించాయి, మరియు నాటినుంచి వర్తమానదశలో మనం చూచే అభివృద్ధికంతకూ మనిషి తన సామర్ధ్యంతో స్వాధీనంలో ఉంచుకొన్న ఆ శక్తియే కారణం.  ఈ భౌతిక ప్రపంచంలో పొందవీలయ్యే జ్ఞానం యావత్తూ సక్రమంగా నియంత్రించబడ్డ మనఃశ్శక్తి లోనే ఉంటుంది; "నీ పొరుగువారిని ప్రేమించు" అనే ఆదేశవాక్యం, బలహీనములై బానిసలై స్వార్ధపరత్వమనే ప్రవాహగతిలో గడ్డిపోచల్లా కొట్టుకుపోతున్న తమ మనఃశక్తులను ఒడిసిపట్టి, నిగ్రహించి, స్వాధీనమొనర్చుకుని పరివర్తన గావించుకొమ్మని మానవాళికి ఉద్బోధించే హెచ్చరికవలె ప్రపంచమంతటా ధ్వనిస్తుంది.  

సర్వోత్కృష్ట విశ్వన్యాయపు పరిపూర్ణ ప్రజ్ఞానిధులగు హీబ్రూ ప్రవక్తలు ఎల్లప్పుడూ బహిరంగంగా చోటుచేసుకునే సంఘటనలను అంతరంగంలోని ఆలోచనలకు అన్వయించి, జాతీయ విపత్తు కానీ సౌభాగ్యం కానీ ఆ కాలానికి ప్రబలమై ఉండిన ప్రజల ఆలోచనలకు ప్రతిబింబంగా అనువర్తింపజేయగలిగేవారు.

ఆలోచనయొక్క ప్రేరణాశక్తిగురించిన ఎరుకయే నిజమైన జ్ఞానమూ శక్తుల మూలాధారం కనుక, వారి అన్ని జోస్యాలకూ పునాది కూడా అదే.  జాతీయ సంఘటనలు కేవలం జాతి సమిష్టి మనఃశక్తుల భౌతిక అభివ్యక్తియే. 

యుద్ధాలు, రోగాలు, క్షామాలు మొదలైనవి, తప్పుదారిపట్టిన జాతియొక్క ఆలోచనాశక్తి, మరియు వాటి దుష్ఫలితాన్ని ప్రసాదించేందుకు విశ్వన్యాయపు ప్రతినిధిలా రంగంలోకి దిగిన వినాశకశక్తి, పరస్పరం కలుసుకునే సందర్భాలు.

యుద్ధకారణాన్ని ఒక వ్యక్తికో, వ్యక్తుల గుంపుకో, ఆపాదించడం తెలివితక్కువతనం.  అది పరాకాష్టకు చేరిన జాతి స్వార్ధపరత్వం తాలుకు భయంకరావస్థ.  నిశ్శబ్దములూ అజేయాలైన తలపుల శక్తులే  భౌతికపరిస్థితులుగా వ్యక్తమవుతాయి.

విశ్వం ఆలోచననుంచే రూపుసంతరించుకుని వృద్ధినందుతోంది.  లోతుగా విశ్లేషించుకుంటూ వెళితే పదార్ధం రూపాన్ని సంతరించుకున్న ఆలోచనేనని తేలుతుంది.  మానవుడు ఆవిష్కరించిన సమస్తమూ మొదట ఆలోచనగా ఆరంభమై అటనుంచి క్రమక్రమంగా వస్తురూపాన్ని సంతరించుకున్నట్టివి.

కవి, ఆవిష్కర్త, శిల్పి, తమ సృజనను తొలుత మదిలో ఊహిస్తారు, వివిధ భాగాలుగా స్పష్టత సంతరించుకున్న అది సమగ్ర సారూప్యతలు కలిగిన పూర్ణవస్తువుగా మనో ఫలకం మీద తయారవుతుంది.  పిమ్మట అతడు దానికి మిగతా ప్రపంచానుభవం నిమిత్తం భౌతిక రూపాన్నిస్తాడు.

మదిలోని ఈ ఆలోచనా శక్తులు సార్వజనీనమైన విశ్వన్యాయానికి అనుగుణంగా ఉన్నప్పుడు వాని ఫలితం నిర్మాణాత్మకము, లోకరక్షకమూ అయి, అలా లేనప్పుడు విచ్ఛిన్నకరము, విధ్వంసకరమూ అవుతుంది.

మంచి యొక్క సర్వశక్తిమత్వ, పరమోత్కృష్టతలకు అనుగుణంగా మీ ఆలోచనలను మొక్కవోని పరిపూర్ణవిశ్వాసంతో జతపరచటమంటే, ఆ స్వభావపు శక్తితో సహకరించడం, ఇంకా చెడు నిర్మూలనకు పరిష్కారం మీ అంతరంగంలోనే ఉన్నట్లు కనుగొనడం.  పరిపూర్ణ విశ్వాసమే జీవితానికి ఆధారం.

ముక్తికి నిజమైన అర్ధం ఇదే; మంచియొక్క శాశ్వతత్వాన్ని గ్రహించి ఆ దివ్యప్రకాశంలోకి అడుగిడడం ద్వారా చెడుయొక్క అంధకారం, దాని దుష్ఫలితాలనుండి విడివడటం. 

సత్యాన్ని గురించిన జ్ఞానం, విశ్వాసం లేనిచోట భయం, దిగులు, వ్యాకులత, సంశయం, చింత, మనస్తాపం, నిరుత్సాహం కమ్ముకుంటాయి.

ఇట్టి మానసిక రుగ్మతలు స్వార్ధపరత్వానికి, చెడు యొక్క బలిమిపైన, శక్తిపైన ఉంచుకున్న నమ్మకానికి ప్రత్యక్ష నిదర్శనాలు. అదొక తరహా నాస్తికత్వమని చెప్పవచ్చు.  వాని ఆచరణ, వాటికి లోబడి వర్తించడమే నాస్తికత్వం.

వానినుండి మానవాళికి ముక్తి లభించాలి, మరియు వాని ప్రభావంలో జీవించేవారు ముక్తిని గురించి, సద్గతి గురించి మాట్లాడటం నిష్ప్రయోజనం.

భయ సంశయాలు కూడా ద్వేషంతో సమానమైన పాప లక్షణాలే, కారణం, అంతరంగంలో శాశ్వతమైన విశ్వ న్యాయాన్ని, సర్వోత్కృష్టమగు మంచిని, అమితమైన ప్రేమను కలిగియుండేవారి హృదయాల్లో భయం, దిగులు వంటివాటికి చోటెక్కడుంటుంది? కనుక భయం, దిగులు చెందటం, సంశయించడం, అంటే న్యాయ తిరస్కారం, దానిపట్ల విశ్వాసరాహిత్యం.

మనసునుండి అన్ని బలహీనతలు, వైఫల్యాలు ఉద్భవించేది శక్తికారకాలు, ప్రయోజనకారులు అగు మనఃశక్తులను నిర్వీర్యమూ విచ్ఛిన్నమూ చేసే ఇట్టి మనఃస్థితులనుండే.

ఈ వ్యతిరేక శక్తుల ప్రభావం నుండి బయటపడటమంటే శక్తిభరితమైన జీవితంలోకి ఆదుగుపెట్టడం, బానిసత్వానికి స్వస్తిచెప్పడం, తమకు తామే యజమానిగా మారటం.   ఈ బలహీనతలను అధిగమించేందుకు ఉన్న ఒకే ఒక మార్గం, నిరవధిక, దృఢ దీక్షతో అభివృద్ధిచేసుకున్న అంతరంగాన్ని గురించిన జ్ఞానం.

చెడును మానసికంగా నిరసించడం ఒక్కటే సరిపోదు; అనునిత్యం అభ్యాసం ద్వారా దానినుండి క్రమక్రమంగా ఎదుగుతూ, దాని స్వభావాన్ని పూర్తిగా అవగతం చేసుకోవాలి.  అలాగే మంచిని మనసులో ప్రశంశించడం కూడా సరిపోదు; నిర్భిన్నమగు కృషితో, దానిలో ప్రవేశించి దాని సత్ప్రభావాన్ని జీర్ణించుకోవాలి.

వివేకవంతంగా ఆత్మనిగ్రహాన్ని అభ్యసించినప్పుడు, అంతరంగంలోని ఆలోచనల అపూర్వ శక్తులగురించిన అవగాహన కలిగి, తదుపరి, అట్టి శక్తులను సరైన దిశలో సర్వజనాభ్యున్నతికీ వినియోగించగల శక్తి కూడా లభిస్తుంది.

ఆత్మనిగ్రహాన్ని ఎంత ఎక్కువ అలవరచుకుంటే మానసిక శక్తుల పైన అంత నియంత్రణ కలిగి, వాటికి అధీనులమై బ్రతికే అవసరం తప్పుతుంది, అదే స్థాయిలో బాహ్య పరిస్థితులూ సంఘటనలూ కూడా మన అధీనంలో ఉంటాయి.

తాను తాకినంతమాత్రానే అన్నీ కుప్పకూలి సర్వనాశనమయిపోయి, తన చేతిలో పెట్టిన విజయాన్ని కూడా జారవిడుచుకునే వాడిని నాకు చూపండి, నేను మీకు మనసునిండా కుత్సితత్వం స్వార్ధపరత్వం నింపుకుని నిరంతరం విశ్వశక్తికి వ్యతిరేకంగా నడుచుకునే వాడిని చూపుతాను.

విజయమూ శక్తియుక్తులూ తలుపును అదేపనిగా తడుతూన్నా స్పందించక, నిరంతరం సంశయాల బురదలో పొర్లాడుతూ, భయాల ఊబిలో కూరుకుపోతూ, ఆతృత ఈదురుగాలులు ఎటు కొడితే అటు ఎగురుతూ పోవటమే బానిసత్వం, బానిసగా బ్రతకటం.  ఆత్మవిశ్వాసమూ ఆత్మనియంత్రణా లేని అట్టి వారు తన వ్యవహారాలను సక్రమంగా నిర్వహించుకొనలేక, పరిస్థితులకు, వాస్తవానికి తమకు తామే, బానిసగా మారిపోతారు.  అంతిమంగా వీరికి దుఃఖానుభవాలే పాఠాలై, వాటి ఆటుపోట్లకు తప్పనిసరి పరిస్థితులలో అన్ని బలహీనతలను విదల్చుకొని బలవంతులవక తప్పదు.  జీవితానికి ఆత్మవిశ్వాసమూ దృఢనిశ్చయాలే ప్రేరణాశక్తి.

దృఢవిశ్వాసమూ  స్థిరసంకల్పమూ సాధించలేనిదేదీ లేదు. నిత్యమూ విశ్వాసాన్ని విడువక నిశ్శబ్దంగా అభ్యసిస్తూంటే, ఆలోచనాశక్తులన్నీ కూడుకొని, దానికి తోడుగా అభ్యసించే నిశ్శబ్ద సంకల్ప సహాయంతో శక్తులన్నీ కార్యసాఫల్య దిశగా పరుగులుతీస్తాయి.

జీవితంలో మీరుండిన స్థితి ఏదైనప్పటికీ, సంకల్పించుకున్న విజయసాధన, ఉపయుక్తత, శక్తియుక్తులూ ఏపాటివైనప్పటివైనా, మున్ముందుగా నిశ్చలత, ప్రశాంతతల సహకారంతో మీ ఆలోచనాశక్తిని వాటిపైన కేంద్రీకరించడం అభ్యసించాలి.  మీరొక వ్యాపారవేత్త కావచ్చు, హటాత్తుగా చిక్కుల్లోపడి వ్యాపారం మూతపడే దశకి రావచ్చు.  అప్పుడు భయమూ ఆతృతా మిమ్ములనావహించి, డీలాపడిపోతారు.

అటువంటి మానసికావస్థలో కొనసాగడం ప్రాణాంతకమని తెలుసుకోండి; దిగులు ప్రవేశించినక్షణంనుంచే వివేకజ్ఞానం మదినివీడిపోతుంది. అప్పుడు మీరు, ప్రాతఃకాలం లేదా సాయంకాలపు ప్రశాంతతనుండి ఒక గంటను ఏకాంతానికి కేటాయించి, నిశ్చల నిశ్శబ్ద స్థితిలో సుఖాసీనులై, మిమ్ము వేధించే దిగులునుండి మనసును మరల్చి మీ జీవితంలోని ఏదైనా మనోహర  మంగళకర మధురక్షణాల తలపులలో నిమగ్నంచేస్తే నిశ్చలమైన ఉపశమనమూ మనోబలమూ సమకూడి దిగులు మాయమవుతుంది.   

మనస్సు చింతయొక్క చీకటిలోతుల్లోకి జారిపోతున్నప్పుడల్లా, దానిని దిశను బలమూ, ప్రశాంతతల వైపు మళ్ళించడంద్వారా సరిదిద్దుతూండండి.

ఈ విధమైన నియంత్రణను సాధించినప్పుడు, మిమ్మల్ని వేధించే సమస్య యొక్క పరిష్కారంపై మనసును కేంద్రీకరించగలుతారు; మునపటి వ్యాకులతలో సంక్లిష్టమూ అగమ్యమూ అనిపించినది సరళమూ సులభసాధ్యమూ అనిపించి, ప్రశాంతమూ అసంశయమూ అయిన మనసుకు మాత్రమే సాధ్యమగు స్పష్టమైన దృష్టీ నిశ్చితమైన వివేకమూ కలిగి, పరిష్కారం దిశగా సాగేందుకనువైన మార్గం మీముందు పరచుకుంటుంది. 

మనసును పరిపూర్ణంగా ప్రశాంతపరచుకొనగలిగేందుకు రోజులతరబడి మీరు అభ్యాసం చేయవలసిరావచ్చు, కాని పట్టువీడక సాధనచేసినపక్షంలో అది సులభసాధ్యమే.  ఏకాంతపు అట్టి ప్రశాంతతలో మనసుకు లభించిన బోధను మాత్రం మరపులేకుండా ఆచరించితీరాలి.

ఇటువంటి సాధనసమయంలో మీరు మళ్ళీ దైనందినవ్యవహారాల్లో మునిగిపోవడం, చింతలొక్కొక్కటిగా మళ్ళీ  చుట్టుముట్టడం కూడా జరిగి మీకు ఇప్పుడిప్పుడే అనుసరిస్తున్న కొత్తమార్గం తప్పుగాను మూర్ఖంగాను తోచడంకూడా సహజం; అయితే అట్టి సంకేతాలను పట్టించుకోకండి.

ప్రశాంతతలో గోచరమయ్యే భావనాశక్తియొక్క ప్రకాశాన్నే కాని ఎట్టి పరిస్థితులలోనూ వ్యాకులతలో ముసురుకొనే మబ్బుల చీకటిననుసరించి పోకండి.  నిర్మల ప్రశాంతసమయమే జ్ఞానప్రకాశం మరియు యదార్ధమైన వివేకశక్తులు ప్రభవించే సమయం.  

అట్టి మానసిక క్రమశిక్షణతోనే, చెల్లాచెదరైన ఆలోచనాశక్తులు పునరేకీకృతమై, చిమ్మచీకటిలో దారిచూపే దీపకిరణాల్లా మీ ముందున్న సమస్యమీద కేంద్రీకృతమై, చీకటి విడిపోయి సమస్య తేలిపోతుంది.  

ప్రశాంతమూ పరమతీక్ష్ణమూ అయిన ఆలోచనముందు తలవంచని కష్టమంటూ ఏదీ లేదు, అలాగే మనఃశక్తులను వివేకవంతంగా కేంద్రీకరించినప్పుడు ఛేదించలేని ధర్మబద్ధమైన లక్ష్యమూ ఉండబోదు.

మీ అంతఃస్వభావంలోనికి దృష్టినిబరపి ప్రగాఢశోధన చేసి అక్కడ పొంచి ఉండిన అనేక శత్రువులమీద సంపూర్ణ విజయం సాధించేంతవరకు మీకు సూక్ష్మతమమైనట్టి ఆలోచన అపరిమిత శక్తినిగురించి, బయటి పరిస్థితులనుండి వేరుచెయ్యలేని దాని ప్రభావంగురించి, సక్రమంగా నిలిపినప్పుడూ నిర్దేశించినప్పుడూ జీవితావస్థలను సరిదిద్ది పరివర్తన తీసుకురావటంలో దానికిగల అద్భుతమైన సామర్ధ్యం గురించిన అవగాహన కలుగదు.  

మీరుచేసే ప్రతి ఆలోచనా బయటికి పంపిన ఒక శక్తిస్వరూపం; దాని స్వభావం, తీక్ష్ణతలబట్టి అది దానితో సారూప్యం కలిగిన మనసులలో స్వీకృతినంది తదనుగుణంగా మంచిదో చెడుదో అయిన ప్రతిక్రియను మీకు తిప్పికొడుతుంది.  

సారూప్యత కలిగిన మనసుల మధ్య ఈ విధంగా అలోచనల బట్వాడా ప్రక్రియ నిర్విరామంగా జరుగుతూ, ఆలోచనాశక్తులను ఇచ్చిపుచ్చుకోవడం నిరవధికంగా కొనసాగుతూంటుంది.  స్వార్ధపూరిత, వ్యాకులభరిత ఆలోచనలు ప్రాణాంతక, వినాశకర శక్తులై, పాపసందేశాన్ని ఇతరులమనసులలోకి నిశ్శబ్దంగా మోసుకుపోతూ అక్కడ  మరిన్ని దుష్టచింతనలనతో కూడి రెంటి ఉమ్మడి హానికారకశక్తినీ మీదిశగా పంపిస్తాయి.

అలా ఉండగా ప్రశాంత, పవిత్ర, నిస్వార్ధమైన ఆలోచనలు ఆరోగ్యం, స్వస్థత, ఆనందాలను తమ రెక్కలపై  ప్రపంచంలోకి మోసుకుపోయే దేవదూతలై, హానికారకశక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తూదుఃఖవ్యాకులపూరితకలుషితజలాలను ఆనందోత్సాహాలతో శుద్ధిపరచి ముక్కలైన హృదయాలకు వాటి సహజస్వభావమగు శాశ్వతానందాన్ని కలుగజేస్తాయి.     

ఆలోచనలను పరిశుద్ధంగా, ప్రయోజనకరంగా ఉంచుకోండి, అవి సత్వరమే మెరుగుపడిన మీ జీవనవిధానం రూపంలో బహిర్గతమవుతాయి.  మీ అంతఃశక్తులను నియంత్రించుకోండి, మీ జీవితం మీరు కోరుకున్న విధంగా రూపుదిద్దుకుంటుంది.  సజ్జనుడికీ దుర్జనుడికీ ఉన్న భేదమల్లా, అంతరంగాన్ని ఒకరు జయించి నియంత్రణలో ఉంచుకుంటే, ఇంకొకరిని అది జయించి తన నియంత్రణలో ఉంచుకుంటుంది.

ఆత్మను నియంత్రించి, పరిపాలించి, పరిశుద్ధపర్చుకొనడం కంటే నిజమైన శక్తికీ శాశ్వతమైన శాంతికీ మార్గాంతరం లేదు.  అది నడిపించినట్టల్లా పోవటమంటే నీరసపడి నీతిచెడి ఎందుకూ కొరగాని బతుకునీడ్చడమే.

ఇంచుమించుగా అందరిజీవితాల్లోను సాధారణమూ, క్షుద్రమూ, చపలమూ అయిన ఇష్టాయిష్టాలు, ప్రియాప్రియాలు, కోపావేశాలు, భయసంశయాలు, ఈర్ష్యాద్వేషాలు వంటి క్షణక్షణానికి మారిపోయే మనఃస్థితులపై పరిపూర్ణ నియంత్రణమే, బతుకుగూటిని ఆనందసౌభాగ్యాలనే బంగారు దారాలతో అల్లుకోవాలని అభిలషించేవారి ముందున్న గురుతర బాధ్యత. 

ఇట్టి చంచల మనోవికారాలకు బానిసలుగాఉన్నంతకాలం, మీ జీవితగమనానికై మీరు ఇతరులమీద, పరిస్థితులమీద, ఇతర బాహ్య సాధనాలమీద ఆధారపడాల్సిందే.  

మీ అడుగులు స్థిరంగానూ భద్రంగానూ పడుతూ, ఎటువంటి పరమార్ధాన్ని మీరు సాధించాలనుకున్నాసరే, మీరు అంతరంగంలోని ఈ వైకల్యాలను అధిగమించి వాటిని అధీనంలో ఉంచుకోవాలి.

"ఏకాకీ యతచిత్తాత్మా" అని చెప్పినవిధంగా ఏకాంతంలో మనసును విశ్రాంతిలో ఉంచే అభ్యాసాన్ని ప్రతిరోజు ఆచరిస్తే, అంతరంగంలోని  సంక్షోభానికి బదులు శాంతి, నిస్సత్తువకు బదులు శక్తి లభిస్తాయి.

ఈ మానసిక స్థితి సాధనలో సఫలులు కాలేనప్పుడుమీ మనఃశక్తులను మిమ్ము వేధించే సమస్యలపైనా, పొందగోరు ఉన్నత జీవితాశయాలపైన లగ్నం చేయటం సాధ్యపడదు.  అస్తవ్యస్తంగా అన్నిదిశల్లోను చెల్లాచెదరైన బలాలను ఒక శక్తివంతమైన మార్గంలోకి మళ్ళించడమే అట్టి సాధనకు పరమావధి.

పనికిరాని మురుగుగుంటలో అధికంగా వచ్చిపడే నీటిని అవసరమయినంతగా కాల్వల్లో మళ్ళించినప్పుడు బంగారు పంటనెలా పండించవీలవుతుందో, ప్రశాంతతను సాధించి ఆలోచనల ప్రవాహాన్ని అదుపుచేసి సరైన దిశలో మళ్ళించసమర్ధులైనవారు వారి ఆత్మను పరిరక్షించుకోని హృదయ పరిశుద్ధితో జీవితాన్ని సఫలం చేసుకుంటారు. 

ఉద్వేగాలపైన యోచనలపైన మీరు పైచేయి సాధించేకొద్దీ, క్రమక్రమంగా అంతరంగంలో ఒక నిశ్శబ్ద శక్తి వృద్ధినంది, చెదరని చిత్తశాంతిని, ఆత్మశక్తినీ మీరు సాధిస్తారు.   

మీలో నిద్రాణమై ఉన్న మనఃశ్శక్తులు ఒక్కొక్కటిగా వెల్లడి అయి, ఇంతకుముందటి మీ కార్యాచరణలో నిర్బల నిష్ప్రయోజకులుగా ఉన్న మీరు, కొత్తగా మీ సొంతమైన నిశ్శబ్ద విశ్వాసం వెన్నుదన్నై నిలువగా, ధృత్యున్నతోత్సాహాలతో పనిచేసి విజయాన్ని పాదాలవద్దకు రప్పించగలుగుతారు.  

కొత్తగా సొంతమైన ఈ బలోద్ధతులకు తోడుగా, అంతరంగంలోని మీ సహజ జ్ఞానం కూడా దివ్యతేజస్సుతో ప్రకాశిస్తుంటే, ఇక ఏమాత్రం అనుమానాంధకారాలలో శ్రమించే అవసరంలేని మీరు, నిశ్చయప్రకాశాలతో వ్యవహరిస్తారు.

ఈ విధమైన ఆత్మదృష్టి వికసించినప్పుడు వివేచన, బుద్ధిసూక్ష్మత మిక్కుటంగా వృద్ధినంది, మీరొక దివ్యజ్ఞానస్వరూపమై, అట్టి శక్తితో భవిష్యత్తును కూడా దర్శించగలగడమే కాక మీరొనరించే క్రియల అంతిమ ఫలితాలేమిటన్నదాన్ని నిర్దుష్టంగా ఊహించగలుగుతారు.  

ఇంకా అంతఃస్వభావాన్ని మీరు మార్పుచేసుకున్నకొద్దీ జీవితం పట్ల మీ దృక్పథం కూడా మారుతుంది; అలాగే  ఇతరులపట్ల మీ వైఖరి అంతరంగంలో ఎలా ఉంటుందో, బయటిప్రపంచంలోని వారి వైఖరి కూడా తదనుగుణంగా మీ పట్ల మారుతుంది.  

నీచ, బలహీన, వినాశకరపు ఆలోచనాశక్తుల ఆవరణాన్ని దాటి క్రమక్రమంగా మీరు పైకి చేరుకున్నప్పుడు, అక్కడ బలోద్ధతీ శుద్ధతా పవిత్రతా కలిగిన మనస్సులనుండి ప్రసరించు ఆలోచనాశక్తుల ఆశావహ, శక్తికారక, నిర్మాణాత్మక తరంగాలు మిమ్ము సాదరంగా పలకరించి తమతో తోడ్కొని వెళతాయి.   అప్పుడు మీ ఆనందం అపరిమితోధృతినంది, మీరు ఆత్మపైని విజయం వలన కలిగే శాశ్వతములైన శక్తిసామర్ధ్యాలను సొంతం చేసుకుంటారు.

ఈ ఆనందం, శక్తిసామర్ధ్యాలు నిరంతరంగా మీనుంచి ప్రసరిస్తూనే ఉంటాయి, మరియు మీ ప్రయత్నమేమీ లేకుండానే, పైగా మీ ఎరుక లేకుండానే, గొప్ప గొప్ప వారు మీ సన్నిధికి చేరుతారు; అధికారం మీ చేతుల్లో ఉంచబడుతుంది, ఇంకా అంతరంగంలో మీ తలపులకు, దృక్పథానికి అనుగుణంగా ప్రపంచమూ పరిస్థితులూ మారుతూనే ఉంటాయి.

మనిషికి శత్రువులంటూ ఉంటే అవి అతని లోపల ఉన్నట్టివే.  ప్రయోజనకారిగ, శక్తిమంతునిగ, ఆనందంతో ఉండాలని అభిలషించేవారు నైరాశ్య, యాచక, అపవిత్ర భావనలను మదిలో ప్రవేశింపనీయరాదు; సమర్ధుడైన యజమాని తన ఇంట్లోని పనివారినీ అతిథులనూ సముచితరీతిన నియంత్రించినట్లు, మనసులోని క్షుద్రతలపులను కోరికలను వశంలో ఉంచుకొని, తన హృదయమందిరంలో ప్రవేశానికి అర్హమైన ఆలోచనల విషయంలో సంపూర్ణమైన అధికారం, అదుపూ కలిగియుండాలి.  

ఈ దిశగా లేశమాత్రపు పాక్షిక విజయం కూడా వ్యక్తి వికాసానికి శక్తినొసగి దోహదపడుతుంది; ఈ దివ్యసిద్ధిని శ్రమించి సాధించినవారు, తామెన్నడూ ఊహించియుండని జ్ఞానసంపదనుధృతిశ్శౌచాలతో పరిపూర్ణతనందిన అంతరంగాన్ని కలిగినవారై, విశ్వశక్తులన్నీ ఆత్మను స్వాధీనపరచుకొన్నవారికి సహాయసహకారాలనందించి అడుగడుగునా పరిరక్షిస్తుంటాయన్న సత్యాన్ని అవగతం చేసుకుంటారు.


5.  ఆరోగ్యము, విజయము, సమర్ధతల రహస్యం

చిన్నతనంలో  జానపదసాహసగాధలు వింటూ ఎంత ఉప్పొంగిపోయేవారమో అందరికీ గుర్తుండే ఉంటుంది.  కథలోని  మంచి బాలుడూ, లేదా బాలికనుతమకు హానిచేయచూసే మంత్రగత్తెలు, రాక్షసులు, దుష్టబుద్ధిగల రాజు మొదలైనవారి కుయుక్తులనుంచి ఆఖరిక్షణంలో అదృశ్యదైవశక్తులు ఎలా రక్షిస్తాయో అని ఆసక్తితో ఎదురుచూసేవాళ్ళం.  

అయితే నాయికానాయకుల క్షేమంగురించి మన హృదయాలకి ఏవిధమైన తొట్రుపాటూ కాని, చివర్లో  వారు శతృవులనందరినీ మట్టుపెట్టి విజయులౌతారనడంలో సందేహం కానీ ఉండేవి కావు, ఎందుకంటే అదృశ్యదైవశక్తులు సజ్జనులనూ సత్యవంతులనూ ఎట్టిపరిస్థితులలోనూ కష్టాలకి వదలి పోవన్నది ఈ కథల ద్వారా మనం గ్రహించిన సత్యం.

సరిగ్గా పరిస్థితి చెయ్యిదాటిపోతోందనే సమయానికి కథలోని గంధర్వస్త్రీ ప్రత్యక్షమై, తన మాయాశక్తితో అప్పటివరకు ఆవరించిన అంధకారాన్నీ ఆపదనీ పటాపంచలు చేసి సజ్జనుల ఆకాంక్షలనన్నిటినీ సఫలం చేయగా, అప్పటినించి వారు కలకాలం సుఖసంతోషాలతో జీవించారు అని విన్నప్పుడు మన ఆనందానికి అవధులే ఉండేవి కావు. 

అయితే ఏళ్ళు గడిచి, వాస్తవజీవితం అని మనం చెప్పుకునే బాదరబందీని నెత్తుకెత్తుకుంటున్నకొద్దీమనకి  అత్యంత ప్రియంగా ఉన్నట్టి సాహసగాథాప్రపంచం మసకబారిపోయి, దానిలోని అద్భుత పాత్రధారులను అస్పష్టమూ అవాస్తవికమూ అనిపించే జ్ఞాపకాల భాండాగారపు అటకెక్కించేశాము.

ఇంకా, బాల్యపు అట్టి మధురస్మృతులను శాశ్వతంగా వదిలించుకోవడంతో మనం వివేకవంతులమూ శక్తివంతులమూ అయ్యామని కూడా భావించుకున్నాముకాని ఒక్కసారి చిన్నపిల్లలమైపోయి ఆ అద్భుత జ్ఞాన ప్రపంచంలో మళ్ళీ అడుగుపెట్టగలిగితే కనకబాల్యంలో అత్యంత స్ఫూర్తినిచ్చిన నాటి అనుభవాలు కేవలం స్వప్నాలు కావనీ, వాస్తవాలనీ అర్ధంచేసుకొని మరీ వాస్తవంలోకి తిరిగొస్తాము.

సకలవిజయప్రదాయకమైన మంత్రశక్తిని కలిగి, సజ్జనులపై ఆయురారోగ్యైశ్వర్యానందాలను, వాటితో పాటు ప్రకృతిసిద్ధసంపదలనూ కూడా కుంభవృష్టిగా వర్షించసమర్ధులయిన ఆ కథాలోకంలోని పాత్రధారులు, కథాకాలానికి హ్రస్వరూపులుగనో సర్వసాధారణంగా అదృశ్యరూపులుగనో ఉండినా, తరువాతికాలంలో, వివేకజ్ఞానసంపన్నులై, ఆలోచనాశక్తుల, అంతరంగప్రపంచపాలక న్యాయసూత్రాలగురించిన, పరిపూర్ణ అవగాహన కలిగినవారి ఆత్మలలో శాశ్వతంగా కొలువైఉండి, మునపటిమాదిరే సజ్జనరక్షణను కొనసాగిస్తున్నారు.

అట్టివారి విషయంలో ఆ కథాగంధర్వులు ఇప్పుడు కూడా లోకకల్యాణంతో సామరస్యం కలిగిన ఆలోచనారూపులుగ, ఆలోచనావాహులుగ, ఆలోచనాశక్తులుగ, కొనసాగుతునే ఉన్నారు. ఇంకా ఎవరైనా, అనుదినమూ తమ హృదయాలను లోకకల్యాణంతో సమన్వయపరచి అంతరంగశుద్ధినందినప్పుడు, వారికి కూడా నిశ్చయమైన ఆయురారోగ్యైశ్వర్యానందాలను అనుగ్రహిస్తున్నారు.

మంచితనాన్ని మించిన రక్షణ మరేదీ లేదు; మంచితనమంటే కేవలం బాహాటంగా నైతిక సూత్రాలననుసరించి జీవించడమని కాక, స్వచ్ఛమైన ఆలోచనలు, ఉదాత్తమైన జీవితాశయాలు, స్వార్ధరహితమైన ప్రేమ, కృతకమైన ప్రతిష్టకైన వెంపర్లాట లేకపోవడం అని.

నిరంతరం మంచి ఆలోచనలలో నిమగ్నమవటమంటే, సమీపానికి వచ్చిన ప్రతివారిపైన దాని సత్ప్రభావం ప్రసరించేలా, తమచుట్టూ ఒక మనోహరమూ శక్తివంతమూ అయిన మనోవాతావరణాన్ని సృష్టించుకొనియుండటం.

నింగికెగబ్రాకే సూర్యుడు నిస్సహాయాలైన మేఘాల నీడను పటాపంచలుచేసినట్లు, పరిశుద్ధమూ దృఢవిశ్వాసయుక్తమైన హృదయం నుండి ప్రకాశించే ఆశావహ, లోకకల్యాణయుత ఆలోచనాకిరణాల నైశిత్యపు ధాటికి చెడుయొక్క నిర్వీర్యశక్తులు పలాయనం చిత్తగించాల్సిందే.

నిలువెత్తు ఆత్మవిశ్వాసం, రాజీలేని చిత్తశుద్ధీ ఉన్నచోట ఆరోగ్యమూ, విజయమూ, శక్తీ ఉంటాయి. అవి ఉన్నచోట రోగం, వైఫల్యం, వినాశనం వంటివి ఆశ్రయం పొందజాలవు, ఎందుకంటే తిని పెరిగేందుకు వాటికక్కడ ఏదీ లభించదు.

శారీరక స్వభావం చాలామటుకు మనఃస్వభావాన్ననుసరించే ఉంటుందన్న సత్యానికి వైజ్ఞానికప్రపంచం కూడా క్రమక్రమంగా చేరువవుతోంది.

మనిషి మనుగడ తన దేహం అనుమతించినంతమేరకేనన్న పాత భౌతిక విశ్వాసం వడివడిగా కనుమరుగవుతూ, దానిస్థానంలో, అతడు తన దేహంకన్నా అత్యున్నతుడనీ, ఆలోచనాశక్తికనుగుణంగా దానిని రూపొందించుకోగలడనే స్ఫూర్తిమంతమైన విశ్వాసం  పాదుకుంటోంది.

వదలని అజీర్ణపు జబ్బువల్ల మనోవ్యాధితో మంచం పడుతున్నారని నమ్మినవారు అది నిజం కాదని, పెంపుచేసుకున్న మనోవ్యాధికారణంవల్లనే అజీర్ణపు జబ్బు పట్టివిడవకుంటోందని నమ్ముతున్నారుసమీప భవిష్యత్తులో, మనసే అన్ని జబ్బులకీ మూలమన్న సాధారణ సత్యం అందరి ఎరికలోకి వస్తుంది.

తన మూలాన్ని మనస్సులో కలిగియుండని చెడు అంటూ విశ్వంలో ఏదీ లేదువాస్తవానికి అపరాధం, అనారోగ్యం, అనుతాపం, అనర్ధం అనేవి విశ్వక్రమానికి కాని విషయప్రకృతులకు కాని చెందినట్టివి కాక, విషయాల పరస్పర సంబంధాలను గురించిన మన అజ్ఞానానికి ప్రత్యక్ష పర్యవసానమైనట్టివి.

పరంపరగా చెప్పుకునేదాని ప్రకారంభారతదేశంలో ఒకప్పుడొక తత్వవిదుల మఠంలో ఉన్నవారందరి దినచర్య ఎంత నిర్మలమూ నిరాడంబరమూ అంటే, ఇంచుమించుగా ఎవరి జీవనప్రమాణమూ నూటఏభైసంవత్సరాలకు తగ్గేదికాదుఆ లోపల జబ్బుపడటాన్ని క్షంతవ్యంకాని అగౌరవంగా భావించి, అట్టివారిని గర్హించేవారుఎందుకంటే జబ్బు న్యాయవిరుద్ధ జీవన ఫలితం కనుక.

అనారోగ్యమనేది ఒకానొక దేవతపట్ల మనమొనరించిన అపచారమో, విధిపెట్టిన పరీక్షో అనికాక మన స్వయంకృత తప్పిదమూ అపరాధమూ అని మనం ఎంత త్వరగా గ్రహిస్తే, అంత త్వరగా పరిపూర్ణారోగ్యపు బాటను పడతాము.

వ్యాధి, తననాకర్షించినవారివద్దకీ, తనను గ్రహించుకోగలిగే మనశ్శరీరాలవద్దకే చేరుతూ, స్వఛ్ఛమైన ఆలోచనావరణలో ఉత్పన్నమయే శక్తిపరిశుద్ధతల ప్రాణాధార ప్రవాహ ధాటికి తోకముడిచి పారిపోతుంది.

మనసులో ద్వేషం, క్రోధం, దిగులు, అసూయ, అత్యాశ వంటి వైకల్యాలకి ఆశ్రయమిస్తూ పరిపూర్ణారోగ్యంతో ఉందామనుకుంటే, మీది దుస్సాధ్యమైన కోరికేఎందుకంటే మదిలో నిరంతరం వ్యాధి బీజాలు చల్లుకుంటూ పోతున్నవారికి ఆరోగ్యం ఎలా సాధ్యం.

వివేకులు ఇటువంటి మానసిక దౌర్బల్యాలను దరికి రానీరు, ఎందుకంటే మనసులోని కల్మషం ఇంటిముందటి మురుక్కాలవకన్నా, అంటువ్యాధిగ్రస్త నివాసం కన్నా కూడా ప్రమాదకరమని వారికి తెలుసు.

అన్ని శారీరక నొప్పులు, సలుపుల నుండి విమోచన లభించి చక్కని దేహారోగ్యాన్ని ఆనందించాలంటే, ముందు మనసును సరిదిద్దుకోండి, ఆలోచనలను ఆరోగ్యవంతం చేసుకోండి.  ఉల్లాసకరమైన, ప్రేమాస్పదమైన తలపులనే మదినిండా ఎల్లప్పుడూ నింపుకోండి; వాటి సౌహార్దపు అమృతప్రవాహం శరీరమంతటా ప్రవహించినప్పుడు మీకు మరే ఔషధాల అవసరమూ ఉండదు.  అసూయలు, అనుమానాలు, ఆవేదనలు, ద్వేషాలు, భోగలాలసతలు మదిని వదిలిపోయినప్పుడు, అజీర్ణం, పైత్యప్రకోపం, నరాలబలహీనత, కీళ్ళనొప్పులూ వగైరాలు దేహాన్ని వదలిపోతాయి.

అయితే దుర్బల దుర్నీతి కారకాలైన అలవాట్లను మదిలో ఉంచుకోవడానికే మీరు నిశ్చయించుకున్నప్పుడు, దేహానికి ఏ జబ్బుచేసి మంచంపట్టాల్సి వచ్చినా దానిగురించి నోరెత్తకండి. మనసు తాలూకు అలవాట్లతో దేహ ఆరోగ్యావస్థకి ఎలాంటి సంబంధమో తెలుసుకోవడానికి ఈ కథ వినండి:

ఒక వ్యక్తికి బాధాకరమైన ఒక జబ్బు చేసింది; ఒకరు తర్వాత ఒకరుగా అతను చాలామంది వైద్యవరులను సంప్రదించినా ఫలితం లేకపోయింది.  అప్పుడు స్వస్థజలాశయాలకు పేరుగాంచిన తీర్థాలు తిరిగి అన్నింటా మునకలు వేశాడు.  బాధ తీవ్రత పెరిగిందే కాని తగ్గలేదు.

ఒక రాత్రి నిద్రిస్తున్నప్పుడు కలలో ఒకస్వరూపం కనబడి, "సోదరా, రోగనిదానానికి అన్ని ప్రయత్నాలూ చేసినట్టేనా?" అనడిగితే అతడు, "అన్నీ అయినట్టే" అన్నాడు.  "లేదు.  నువు మరచిపోయిన స్వస్థస్నానకుండం ఇంకా ఒకటి మిగిలిపోయింది, నాతో రా" అన్నదా స్వరూపం.

జబ్బుమనిషి అనుసరించగా, ఆ స్వరూపం స్వచ్ఛమైన ఒక నీటిమడుగువద్దకి తీసుకుపోయి చెప్పింది, "ఇందులో మునిగి లే, నీకు నయమయి తీరుతుంది", అని అంతర్ధానమైపోయింది.

అతడలాగే మునిగి లేచాడు; అద్భుతం! అతడి రోగం అతడినొదిలిపోయింది.  అదే సమయంలో మడుగు గోడ ఒకదాని మీద ఇలారాసి ఉన్నదాన్ని చదివాడు: "త్యజించు" అని.  అతడు మేలుకొని స్వప్నాన్ని అవలోకనం చేసుకొనేసరికి దాని అంతరార్ధం మదిలో మెరుపులా మెరిసింది; దాని ప్రభావంతో అంతరంగాన్ని పరీక్షించుకున్న అతడిది గ్రహించాడు: ఇంతకాలం తాను కొన్ని పాపభూయిష్టమైన విషయభోగాలకి దాసుడై వాటి బాధితుడుగా ఉంటూ వస్తున్నాడు; ఇకపై ఆ జోలికి పోననీ, క్షణంనుంచే వాటిని  పరిత్యజించేందుకు సంకల్పించుకున్నాడు.

తన సంకల్పాన్ని కొనసాగించిన మరునాటినుంచే అతడికి పట్టిన జబ్బు కొద్దికొద్దిగా వదిలిపోతూ, అనతికాలంలోనే పోయిందనుకున్న పూర్ణారోగ్యం తిరిగి అతడి సొంతమయింది. చాలామంది పనెక్కువైపోవడంవల్ల తమ ఆరోగ్యం సర్వనాశనమైపోయిందని వాపోతూంటారు. అటువంటి వారిలో చాలామటుకు ఆరోగ్యనాశనం మూర్ఖంగా కాలాన్ని వృధాచేసుకోవడంవల్లనే జరుగుతుంది.  ఆరోగ్యాన్ని అభిలషిస్తే ఏ సంఘర్షణా లేకుండా పనిచేయడం నేర్చుకోవాలి.  ఆదుర్దా, ఆవేశం, లేదా అక్కరలేని చిన్నచిన్న విషయాలపట్ల దిగాలు పడిపోవడమే ఆరోగ్యశైధిల్యానికి మూలం.

దేహానికైనా, మనస్సుకైనా, పని ఎప్పుడూ ప్రయోజనకరమూ ఆరోగ్యదాయకమే; ఆందోళనా దిగులూవంటివాటినుండి విముక్తుడై, చేస్తున్నపని మీద తప్ప మరే ఇతరవిషయపు ఉనికికూడా తెలియనంతటి దీక్షతో ప్రశాంతంగా నిలకడగా పనిచేసుకునేవారు తొందరపాటూ ఆందోళనాపడే సహచరులకంటే ఎక్కువదీ నాణ్యమైనదీ అయిన పనిని అందించడమే కాక, ఇతరులు చేజేతులా జారవిడుచుకుంటున్న ఆరోగ్యాన్నీ నిలుపుకోగలుగుతారు కూడా. 

నిజమైన ఆరోగ్యం, నిజమైన విజయం కలిసి నడుస్తాయి; కారణం, రెంటి మూలాలు మనఃప్రపంచంలో విడదీయరానంతగా పెనవేసుకుని ఉంటాయి.  ఆలోచనల్లో సామరస్యం కలిగిన మనసే శరీరారోగ్యాన్ని కలిగిస్తున్నందున, దాని సహాయంతో ఎట్టి ప్రణాళికనైనా సమర్ధంగా రచించి సక్రమంగా అమలుచేయగలుగుతారు.  

ఆలోచనలను సరైన మార్గంలో పెడితే జీవితం సరైన మార్గంలో నడుస్తుంది.  దురావేశ దుర్భ్రమలనే  ఉప్పెనలు లేచినప్పుడల్లా, ప్రశాంతత అనే తైలాన్ని గుమ్మరిస్తే, అది మీ జీవనసాగరంగుండా నిరంతరం ప్రవహిస్తూ, మీ ఆత్మస్థైర్యాన్ని మొక్కవోనివ్వజాలక, దురదృష్టమనే తుపానులను, అవి ఎన్నివిధాల మిమ్ము భయపెట్ట యత్నించినప్పటికీవాటిని నిర్వీర్యపరుస్తుంది.  

అలాసాగే జీవననౌకను నడిపేందుకు చెక్కుచెదరని ఉల్లాసభరితమైన ఆత్మవిశ్వాసం కూడా తోడైతేఅది లేని పక్షంలో మీతో ఢీకొన సాహసించే  ఇతర రకాలైన విపత్తులు కూడా చచ్చుబడిపోయి, వాటిగుండా మీ నౌకయానం ఏ ఒడుదుడుకులూ లేకుండా మరింత నిర్దుష్టంగాను, స్థిరంగాను సాగుతుంది.    

పరిపూర్ణ విశ్వాసపు శక్తితో సాధించినదేదైనా కలకాలం నిలుస్తుంది.  సర్వోత్కృష్టమగు విశ్వశక్తిని విశ్వసించండి; అందరికీ వర్తించే విశ్వన్యాయాన్ని విశ్వసించండి; మీరు చేసే పనేదైనా దానిని, దానిని సాధించుటలో మీ సామర్ధ్యాన్నీ విశ్వసించండి.  శాశ్వత సత్కీర్తిని నిర్మించాలన్నా, అడుగు బెసగకుండా దృఢంగా నిలదొక్కుకోవాలన్నా విశ్వాసమనే కఠినశిలపైనే సాధ్యం.

అంతరంగంలోంచి లభించే అత్యున్నత బోధననుసరించిపోవడం, దివ్యాత్మశక్తిని నిజాయితీగా నమ్మడం; అంతరంగంలో లభించే ప్రకాశాన్ని, మీకే వినబడే దాని వాక్కును స్వీకరిస్తూ, నిర్భయంగాను హృదయప్రశాంతతతోను అనుకున్న లక్ష్యం దిశగా స్థిరంగా సాగిపోతూ, మీ ప్రతి ఆలోచన, ప్రయత్నాలకు అనుగుణమైన సత్ఫలితాన్ని భవిష్యత్తు తప్పక ప్రసాదించగలదనే దృఢమగు నమ్మికను కలిగియుండి; విశ్వన్యాయసూత్రాలెన్నడూ విఫలం కాబోవనే ఎరికతో, మీ అంతరంగమే లెక్కతప్పని కచ్చితత్వంతో బహిరంగమై మీకు లభిస్తుందనే అవగాహనతో ఉండటం - విశ్వాసమనగాను, అది కలిగి జీవించడమనగాను ఇది. 

విశ్వాస దివ్యప్రభావంతో అనిశ్చితమనే కడలి చీలి దారి ఇవ్వగా, కష్టాల పర్వతాలు నేలమట్టమై పోగా, విశ్వసించే ఆత్మ వాటిమధ్యనుంచి అనాయాసంగా సాగిపోతుంది.

కనుక చదువరీ! మిగతావాటన్నింటికన్న మిక్కుటంగా ఈ భయరహితమైన ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే అభిలషించండి; అది సహనంతోకూడిన వేదనకంటే ఉన్నతమైనది, ఆనందానికి, విజయానికి, శాంతికి, శక్తికి, ఇంకా జీవితానికి శ్రేష్టతను కలిగించేదీ.

అట్టి విశ్వాసంతో చేపట్టేదేమైనా శాశ్వతమైనిలిచియుంటుంది; అట్టి శాశ్వతత్వాన్ని కలిగిన సామగ్రితో మీరు నిర్మించిన భవంతి, చివరికి బుగ్గిగామారే మీరుకూడబెట్టిన ఇతర భవనవస్తుసంచయానికతీతంగా ఎన్నడూ శిధిలమవక నిలిచియుంటుంది.  

మీరు దుఃఖపు లోతుల్లోకి తోసివెయ్యబడ్డా, ఆనందశిఖరాలమీదికి ఎత్తివేయబడ్డా, విశ్వాసాన్ని సడలనీయకండి; ఆ రక్షణ శిబిరంకిందకే మళ్ళీ మళ్ళీ తిరిగివస్తూ, దాని శాశ్వతదివ్య తలం మీద మోపిన మీ పాదాలనెన్నడూ బెసగనీయక స్థిరంగా ఉంచుకోండి.

అట్టి విశ్వాసం మధ్యలో స్థితులై ఉన్న మీకు, గాజుబొమ్మల్నిచేసినట్లు మిమ్మల్ని గురిచేసుకున్న అన్ని దుష్టశక్తులను ఛిన్నభిన్నం చేయగలిగే ఆధ్యాత్మిక శక్తి సొంతమై, ప్రాపంచిక భోగాలవెంబడి పరుగులెత్తే ఇతరులు కలల్లో కూడా ఊహించలేనటువంటి ఉత్కృష్టమైన విజయశిఖరాలనధిరోహిస్తారు.  "భయసందేహవిముక్తుడై నరుడు విశ్వాసమే శ్వాసగా, లేలే లేచి యుదధిన్ పడుమని పూనికతో యానతిచ్చిన పర్వతములైనను ఆతని యాజ్ఞను మీరజాలునే? కడలిని దూకకుండునే?"

ఈనాడు, రక్తమాంసాదుల దేహపుగుడారంలో ఆశ్రయాన్నందిన స్త్రీపురుషులు, విశ్వాసపు ప్రాముఖ్యాన్నెరిగి, దానిని అనుదినమూ సాధనచేయడంద్వారా, అన్నిరకాల జీవిత పరీక్షలకు దానిని గురిచేసి అన్నింటిలో విజయాన్నందుతూండే దాని ఉత్కృష్టతనూ శాంతినీ ప్రత్యక్షంగా అవగతం చేసుకొనుగలుగుతున్నారు.

అట్టివారి శాసనవాక్యమొక్కటిచాలు పర్వతసమానాలైన దుఃఖనైరాశ్యాలను, మనసు బడలికను, శారీరక క్లేశాలను వారి జీవితాలనుండి తీసివేసి మరి తిరిగిరానివిధంగా అంతులేని సాగరాగాథంలోకి విసిరికొట్టేందుకు.   మీరుకూడా ఇట్టి విశ్వాసాన్ని సొంతంచేసుకొని తదాదేశానుసారం వర్తించినప్పుడు జయాపజయాల చింతయే మీకుండదు.  ఉండేదల్లా నిశ్చయమగు జయమే.

మీరు ఫలితాన్నిగురించిన ఆతృత ఏమాత్రం లేకుండా, హర్షోల్లాసాలు, ప్రశాంతతలతో పనిచేసుకుంటూ సాగుతారు, సదా సక్రమంగా చేసే ఆలోచనలు, ప్రయత్నాలు తప్పక సక్రమఫలితాలనే ప్రసాదిస్తాయన్న సత్యమగు నమ్మికతో.

ఆనందసంతృప్తికరమధురానుభవాలను తన జీవితకాలంలో అనేకం చూసిన ఒక తెలిసిన స్త్రీని చూసి స్నేహితురాలొకామె ఆశ్చర్యపోయింది - "ఎంత అదృష్టవంతురాలవమ్మా! తలచినదే తడవుగా నువుకోరుకున్నవి నీకు లభిస్తున్నాయి." అని.  పైకి అది అలా అనిపించేదే అయినా వాస్తవంలో, ఆమె జీవితాన్ని సుసంపన్నం చేస్తున్న అనుగ్రహకటాక్షం తన జీవితం యావత్తు ఆమె అభ్యసిస్తున్న పరిశుద్ధత, నిర్మలత్వం, విశ్వాసాల ఫలితమే.

ఊరికే కోరుకునే కోరికలు మిగిల్చేది నైరాశ్యాన్నే; వాటి సాఫల్యాన్ని నిర్దేశించేది మన జీవనవిధానమే.

మూర్ఖులు కోరికలు కోరుకోవడానికే పరిమితమై అశాంతితో సణుగుడు ప్రారంభిస్తారు; వివేకులు, తమపని పూర్తిచేసి ఓరిమితో వేచియుంటారు. పైన చెప్పిన స్త్రీమూర్తి, అదే చేసింది; బహిరంగంలోను, అంతరంగంలోను కూడా తాను చేసుకుపోతున్న పని యొక్క నాణ్యతపైనే పూర్తి శ్రద్ధపెట్టి; మరీ ముఖ్యంగా హృదయాన్నీ ఆత్మనూ చేసేపనికే అంకితంచేస్తూ; ఆత్మయొక్క అదృశ్యహస్తాలతో, విశ్వాసం, ఆశావహదృక్పథం, ఆనందం, శ్రద్ధ, ప్రేమ వంటి మేలుజాతి రాళ్ళతో, శుభప్రదమగు దివ్యప్రకాశం తననెల్లప్పుడూ ఆవరించియుండే విధంగా ఒక మహోన్నతమైన జ్యోతిర్మందిరాన్ని ఆమె నిర్మించుకుంది.

ఆమె కళ్ళలో తళుకుమని; వైఖరిలో తళతళలాడి; కంఠస్వరంతో ప్రకంపించిన దాని దివ్యప్రభావంవలన ఆమె సన్నిధిలో ఉన్నవారందరూ మనోహరమగు దాని వశీకరణను అనుభూతిచెందారు.  

మీరుకూడా ఆమెకంటే భిన్నంకారు. మీ జయాపజయాలు, జనబాహుళ్యంపైని ప్రాబల్యం, జీవనసాఫల్యం మొదలైనవాటిని మీతోబాటే మీరు మోసుకువెళ్తూంటారు, కారణం, మీ ఆలోచనలలోని ప్రబలమైన ధోరణులే మీ జీవనగమ్య నిర్దేశకాలు.  

ప్రేమాస్పద, నిష్కళంక, ఉల్లాసకర ఆలోచనలనే మదినుండి వెలువడనిచ్చినప్పుడు, అనుగ్రహాశీర్వాదాలు మీ చేతుల్లో పడుతుంటాయిశాంతి అనే స్వచ్ఛమైన పాలనురుగులాంటి వస్త్రం మీ బల్లపై పరుచుకుంటుంది.

ద్వేషపూరిత, అపవిత్ర, నిరాశాయుత ఆలోచనలు మీనుండి బయల్వెడలినప్పుడు, ప్రతిగా శాపాలు మీమీద కుంభవృష్టిగా కురుస్తాయి, భయం, ఆశాంతులు మీ తలగడకింద నక్కియుంటాయి. బేషరతుగా మీ విధికి కర్తలు మీరే, అది ఎట్టి విధి అయినాసరే.  మీ జీవితాన్ని ఉత్కృష్టమో నికృష్టమో చెయ్యగల ఆలోచనలు అనుక్షణం మీ మదినుండి వెలువడుతూ ఉంటాయి.  ప్రేమ, నిస్వార్ధతలతో హృదయాన్ని పెరగనీయండి, తద్వారా సంపాదించిన ధనం స్వల్పమే అయినప్పటికీమీరు సాధించిన విజయమూ ప్రాబల్యమూ కలకాలం నిలిచియుంటాయి. 

అదే హృదయాన్ని సంకుచితం చేసుకుని స్వప్రయోజనమే పరమావధిగా జీవించినప్పుడు, ఏదోలాగ కొన్ని కోట్లు కూడబెట్టినా, ఆఖరుకి మీ విజయ ప్రాబల్యాలు నామమాత్రమై, ధనరాశులు చిల్లపెంకుల కుప్పల్లా ఎందుకూ కొరగానివైపోతాయి.  అందుకే అభ్యసించి అంతరంగాన్ని నిర్మలమూ నిస్వార్ధమూ చేసుకొని, దానికి పవిత్రతనూ విశ్వాసాన్నీ నిష్కపటమగు పరమావధినీ కూడా జతచేర్చినప్పుడు మీరు మీ మూలతత్వాన్నించే ఎదుగుదల ప్రారంభించి, తరగని ఆరోగ్యసంపదనే కాక శాశ్వతంగా నిలిచే విజయాలను, ఘనతను, శక్తియుక్తులను సొంతం చేసుకుంటారు.

మీ ప్రస్తుత స్థితి మీకు వెగటుగా ఉన్నా, మీ హృదయం చేసే పనిలో నిమగ్నం కాకున్నా సరే, చేసే పనిని మాత్రం విద్యుక్త ధర్మంగా భావించి అకుంఠితమైన శ్రద్ధతో నిర్వర్తిస్తూ, ప్రశాంత మనంతో మెరుగైన స్థితి, విస్తారమైన అవకాశాలూ మీగురించి వేచిచూస్తున్నట్లుగా భావిస్తూ, కొత్త అవకాశాలకై మనఃశరీరాలనెల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకొన్నప్పుడు, సరైన క్షణం ఆసన్నమైనంతనే, మానసిక క్రమశిక్షణ వలన లభించిన సునిశిత బుద్ధీ, దూరదృష్టుల సహాయంతో మీకన్నివిధాలా యోగ్యమైన నూతనావకాశం మీకు తారసపడగా, పరిపూర్ణ మానసిక సంసిద్ధతతో మీరు దానినందిపుచ్చుకుంటారు. 

నిర్వహించేది ఎటువంటి కార్యమైనా, మనస్సునంతా దానిపైనే లగ్నం చెయ్యండి, మీ సర్వశక్తులనూ దాని నిర్వహణకే వినియోగించండి. నిర్దోషమైన చిన్నచిన్నపనుల నిర్వహణే గొప్పగొప్ప కార్యాల నిర్వహణకు దారులు తెరుస్తుంది.  ప్రతి స్వల్పకార్యనిర్వహణలోను మీరు ఎదిగేవిధంగా జాగ్రత్తవహిస్తే మీ అడుగులు ఎన్నడూ తడబడకుండా ఉంటాయి.  సత్యమైన శక్తియుక్తుల రహస్యమిదే.

నిరంతర సాధన ద్వారా మీ వనరుల సక్రమ నిర్వహణను అభ్యసించి అవసరం కలిగినంతనే వాటినన్నింటినీ లక్ష్యకార్యం మీద కేంద్రీకరించండి.  మూర్ఖులు తమ మానసిక, ఆధ్యాత్మిక శక్తిని నిరర్ధక చేష్టలు, ఉబుసుపోక, స్వార్ధపూరిత వాదాలు వంటివాటికై ఖర్చుచేస్తారువిషయభోగాలకుగాను వృధా చేసే దేహశక్తి గురించి చెప్పనే అక్కర్లేదు.

సర్వజనవశీకరణశక్తిని సాధించాలంటే మీకు ద్వంద్వాతీత సహనం, తాలిమి అవసరం.  ఒంటరిగానే నిలిచేందుకు సిద్ధపడండి. స్థిరత్వంలోనే శక్తి చేరి ఉంటుంది.  స్థిరమైన పర్వతం, సమున్నత గిరిశృంగం, తుపానుల ఝంఝాటాలను ఏళ్ళతరబడి భరించి నిలదొక్కుకున్న వృక్షరాజం, అన్నీ తమ స్థిరత్వమూ ఏకాంతమూ చిరకాలంగా రాశీభూతంచేసిన మహోన్నతమైన శోభతోను, అచంచలములై దేనికీ తలవంచని గర్వాతిశయంతోను నిలువెత్తు నిలిచి వాని శక్తిని  రాజసపు ఠీవితో వెల్లడిస్తూండగా,  చిరుగాలికే దొర్లుకుంటూపోయే ఇసుకరేణువు, చిరుస్పర్శకే విరిగిపోయే చితుకు పుల్ల, నిలకడలేక ఊగిసలాడే రెల్లుమొక్కవంటివి అస్థిరమూ ప్రతిఘటనారహితమూ అయిన వాటి స్వభావం కారణంగా, బలహీనతకి ప్రతీకలై, తమ సహచరుల నుండి వేరుపడినప్పుడు నామరూపాల్లేకుండా పోతాయి.

తన తోటివారందరూ మోహావేశాలవంటి బలహీనతలకారణంగా ఊగిసలాడే స్వభావం కలిగినవారైనప్పటికీ, అట్టి అన్ని సందర్భాలలోనూ స్థిరుడై ప్రశాంతచిత్తుడైనవాడే శక్తిమంతుడు.  తన అధీనమూ నియంత్రణలో తానున్నవాడే ఇతరులను పాలింపగలడు, నియంత్రించగలడు.

వెర్రి ఆవేశపరులు, భయస్తులు, ఆలోచనారహితులు మరియు చపలులను సాహచర్యానికై వెంపర్లాడనివ్వండి, లేకుంటే ఊతంలేక వారు నేలరాలిపోతారు; కాని ప్రశాంతులు, నిర్భయులు మరియు ఆలోచనాపరులను అరణ్యపు, నిర్జనపు, పర్వతాగ్రపు ఏకాంతాన్నే అభిలషించనివ్వండి; వారి శక్తికి మరిన్ని శక్తులు తోడవుతాయి, మానవాళిని లుంగలుచుట్టే మానసిక సుడిగుండాలను వారు నివారించగలుగుతారు.

ఆవేశం దుర్వినియోగమైన, చెల్లాచెదరైన శక్తికే నిదర్శనం కాని శక్తియొక్క యదార్ధ ప్రకటనం కాదు. ఆవేశం అదేపనిగా మహోన్నతమైన పర్వతసానువులను అశాంతితో ఢీకొంటున్న జలప్రవాహంవంటిదైతే, శక్తి అట్టి అన్ని చికాకుల మధ్య నిశ్చలమూ నిశ్శబ్దమూ అయి నిలిచిన పర్వతం వంటిది.

మార్టిన్ లూథర్ మతగురువుల ఆదేశం మేరకి రోము పట్టణమైన వార్మ్స్ కి ప్రయాణం కట్టినప్పుడు అతని క్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని సన్నిహితులందరూ శతవిధాల వారించారు, ప్రాధేయపడ్డారు; అయినా అతడు పట్టువీడక ఒంటరిగానే వెళ్ళటానికి నిశ్చయించుకుని వారితో అన్నాడు - "వార్మ్ స్ లో ఈ ఇంటిమీది పెంకులంతమంది రాక్షసులున్నా సరే వారందరిముందూ ఒంటిగా నిలిచేందుకు నేను సిద్ధం" అని.  శక్తి ప్రకటన అంటే ఇట్టిది.

అలాగే బెంజమిన్ డిస్రేలీ, తన ప్రప్రధమ పార్లమెంటు ఉపన్యాసంలో ఘోరంగా విఫలుడైనప్పుడు, సభ్యులందరూ అవహేళన చేస్తూండగా, విశ్వాసపు శక్తిని సముజ్వలంగా ప్రకటించి ఇలా అన్నాడు: "నేను చెప్పేది వినడమే మహద్భాగ్యమని మీరు భావించుకునే రోజు తప్పకవస్తుంది" అని.

నాకు తెలిసిన యువకుడొకడు చేస్తున్న ప్రయత్నాలన్నీ నిష్ఫలాలై కష్టదశలో ఉన్నప్పుడు మిత్రులందరూ ఇదే విధంగా వేళాకోళం చేసి ఇక ప్రయత్నించడం మానుకొమ్మని అతడికి సలహా ఇచ్చినప్పుడు అతడు వారితో అన్నాడు, "మిత్రులారా, నా భాగ్యాన్నీ సాఫల్యాన్నీ చూసి మీరు నోరువెళ్ళబెట్టే సమయం ఎంతో దూరంలో లేదు సుమీ" అని. అన్నట్టుగానే ఇన్ని కష్టాలలోనూ తనకు తోడై ఉండి తనలోని నిగూఢమైన నిశ్శబ్దమూ అప్రతిహతమూ అయిన తన అంతఃశక్తి తన జీవితానికి విజయకిరీటాన్ని అలంకరించడాన్ని వారికి త్వరలోనే కళ్ళారా చూపాడు.

ఈ శక్తి మీవద్ద లేకపోతే, అభ్యాసం చేత దానిని మీరు సాధించవచ్చు, మరియు శక్తి సాధన ప్రారంభం కూడా జ్ఞానసాధన ఆరంభదశలాగే ఉంటుంది.  మీరు ఇంతవరకు కావాలని వాటి బాధితులైనట్టి నిష్ప్రయోజన, అప్రధాన కాలహరణ కార్యాలను తక్షణమే విడిచిపెట్టటంతో ఈ సాధన ఆరంభమవుతుంది.

ఆపుకోలేని బిగ్గర నవ్వు, వెటకారం, పనిలేనిదే మాట్లాడటం, నవ్వుకోసమే ఆడే ఎకసక్కెం, ఇలాటివాటినన్నిటినీ విలువైన శక్తి దురుపయోగంగా భావించి పక్కకి నెట్టాలి.

ఎఫీసియన్ల మూర్ఖపు అతివాగుడు, వృధాగా చేసే సోమరి కాలక్షేపాలను ఉద్దేశించి పాల్ ఋషి "ఇటువంటి కాలహరణం అలవాటుగా మారితే అది ఆధ్యాత్మిక శక్తినీ జీవితాన్నీ కూడా సర్వనాశనం చేస్తుంది" అని చేసిన హెచ్చరికను మించి, మానవాళి అభ్యుదయ కారకాలగు నిగూఢ సూత్రాలపై తనకున్న అద్భుతమైన అవగాహనను వ్యక్తీకరించిన సందర్భం మరొకటి లేదనే చెప్పాలి.

మనసును వివిధ దిశల్లోకి చెల్లాచెదరుచేసుకునే అటువంటి కాలక్షేపాలపట్ల మీరు విముఖతనూ మూకీభావాన్నీ చూపడంలో కృతకృత్యులయ్యేకొద్దీ నిజమైన శక్తి అంటే మీకు అర్ధమయి, దానిని మీ వశంకానీయక అడ్డుపడి మిమ్ము తమ స్వాధీనంలో ఇన్నాళ్ళూ ఉంచుకున్న ఇతర బలీయమైన కోరికల బంధనాలనుండి కూడా విడివడటం ఆరంభించి, అభివృద్ధి దిశగా మిమ్ము తీసుకెళ్ళే బాట స్పష్టంగా అగపడుతుంది.

అన్నిటికన్న ముఖ్యంగా, ఏకైక లక్ష్యాన్ని కలిగియుండండి; ఒక న్యాయబద్ధ, ప్రయోజనకరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాని సాధనకే పూర్తిగా అంకితం కండి.  మరిదేనినీ ఆ మహోన్నత లక్ష్యం నుండి మిమ్ము వేరుచేయనివ్వకండి.  చపలచిత్తుడు అన్నిమార్గాలలోనూ తడబడుతూ దేన్నీ పొందలేడని జ్ఞాపకం పెట్టుకోండి.  

నేర్చుకోవడానికి ముందువరసలోను, యాచనకి వెనకవరసలోను ఉండండి.  మీరు చేసే పనిపట్ల పూర్తి అవగాహన కలిగియుండి, దానిని మీ స్వంతం చేసుకోండి; మీరు ఆ దిశగా, పొరపాటుకు వీలులేని అంతరంగ ప్రబోధానుసారం సాగుతూ ఉంటే, ఒక విజయం తరవాత ఇంకో విజయం లభిస్తూ, ఒక ఉన్నత స్థానం నుండి వేరొకదానిని అధిరోహించి సేదతీరగలిగినప్పుడు అతి విస్తృతమైన మీ దృక్పథం మీకు జీవితపు సౌందర్యాన్నీ పరమార్ధాన్నీ మీకు తేటతెల్లం చేస్తుంది.

ఆత్మశుద్ధితో ఆరోగ్యం మీ సొంతమవుతుంది; ఆత్మవిశ్వాసపు రక్షణతో, విజయం మీదవుతుంది; ఆత్మనియంత్రణతో శక్తి మీ వశమవుతుంది; మీరు చేపట్టే ప్రతి కార్యమూ అభివృద్ధినందుతుందికారణం, ఇన్నాళ్ళూ ఆత్మకు బానిసైన మీరు, క్రమక్రమంగా దానిపై పట్టు సాధించి సర్వోత్కృష్ట విశ్వన్యాయంతో సామరస్యం సాధిస్తారు; ఇన్నాళ్ళూ విశ్వజీవనచైతన్యానికీ, శాశ్వతమగు యోగ్యతకీ ఎదురీదిన మీరు ఇకపై వానితోబాటే పయనిస్తారు.

ఆవిధంగా సాధించిన ఆరోగ్యం మీతోనే కలకాలం ఉంటుంది; అలా సొంతమైన విజయాలు ఇతరుల అంచనాలకి అందనంత ఉన్నతమైనవై, వీగిపోక నిలుస్తాయి; ఆ మార్గంద్వారా చెలాయించిన అధికారమూ ప్రాబల్యమూ యుగయుగాలతరబడి మీకే దఖలుపడతాయి, ఎందుకంటే ఇవన్నీ విశ్వానికంతకూ వర్తించే న్యాయసూత్రాలకనుగుణంగా సముపార్జించినవి కనుక.

ఆరోగ్య రహస్యమిదే: నిర్మలమైన హృదయం, నియంత్రణలో ఉన్నట్టి మనస్సు; విజయ రహస్యమిదే: తొట్రుపాటులేని ఆత్మ విశ్వాసం, వివేకంతో నిర్దేశించుకున్న లక్ష్యం; మరియు, శక్తి రహస్యమిదేకోర్కెలనే జవనాశ్వాలను అచంచలచిత్తమనే కళ్ళెంతో అదుపుచేయగలగడం.

6. అవధుల్లేని ఆనందపు రహస్యం

ఆనందానికైన తృష్ణ బహు దొడ్డది, దాన్ని అందుకోలేకపోవడమనే పరిస్థితి అంతే దొడ్డది. లేమిలో ఉన్న అనేకులు సంపదలనాశిస్తారు, అవి లభిస్తే తమకు సర్వోత్కృష్టమైన, శాశ్వతమైన ఆనందం సొంతమవుతుందని నమ్ముతూ.

ధనికులనేకులు, ప్రతి కోరికా చాపల్యమూ తీర్చుకున్నవారై, అన్నింటి పరిపూర్తి తెచ్చిన శూన్యతా నిరుత్సాహాలతో, అత్యంత రిక్తులకు లభించిన కొద్దిపాటి ఆనందం కూడా దూరమై బాధపడుతూంటారు.

ఈ వాస్తవాల మీద కొద్దిపాటి చింత చేస్తే అది చివరికి, వస్తుసంపదలున్నంతమాత్రాన ఆనందం కానీ, అవి లేనంతమాత్రాన దుఃఖం కానీ, కలగదనే అతి ముఖ్యమైన అవగాహన దిశగా మనను తీసుకువెళ్తుంది; లేకుంటే నిరుపేదలెప్పుడూ దుఃఖభాగులై, సంపన్నులెప్పుడూ మహదానందభరితులై ఉండేవారు కదాకాని తద్విర్దుద్ధంగా ఉండడం చూస్తున్నాము.

అతి నికృష్టులు, దుఃఖభాజనులు అయి కూడా లెక్కకందని సంపదలతో తులతూగే పేరుగొప్ప సంపన్నులను, అలాగే ఎప్పుడూ కళకళలాడుతూ నిత్యసంతృప్తులై కూడా ఒకపూట తింటే రెండో పూటకి వెతుక్కోవలసిన పేదరికంలో జీవించేవారిని కూడా నేనెరుగుదును.

ఇట్టివారిలో సంపన్నులబాపతులోకి వచ్చేవారు అంగీకరించినదేమంటే, విషయభోగేచ్ఛే పరమావధిగా ధనరాశులు కూడబెట్టుకోవడంవల్లనే తమ సంపన్న జీవితంలోనుంచి మాధుర్యం ఆర్చుకుపోయిందనీ, అవి కూడబేట్టుకోవడానికి ముందు  తాము అనుభవిస్తూ వుండిన కొద్దిపాటి సంతోషమూ తృప్తీ కూడా ఇక తిరిగిరావని.

అప్పుడు ఆనందం అంటే ఏమిటి, మరియు దానిని పొందేదెలాలేక అది ఒక కట్టుకధ, మరీచికాను, బాధలే శాశ్వతమూనాచిత్తశుద్ధితో పరిశీలించి చింతచేసి మనం తెలుసుకోగలిగేది ఏమంటే, పరిపూర్ణ వివేకజ్ఞానం కలిగినవారు మినహా మిగతా అందరూ ఆనందమంటే తృష్ణను తృప్తిపరచుకోవడమేనని నమ్ముతారు.

ఈ నమ్మకం అజ్ఞానక్షేత్రంలో పాదుకొని, నిరంతర స్వార్ధపూరిత వాంఛలనీటిని గ్రహించి పెరుగుతూ, ప్రపంచానికి క్లేశాలను ఫలాలుగా ప్రసాదిస్తోంది.

వాంఛలను శారిరక విషయభోగలాలసతకే నేను పరిమితం చెయ్యను; అవి ఇంకో మెట్టెక్కి మనస్తత్వాన్నావరించి అక్కడ ఇంకా శక్తిమంతమూ సూక్షమూ అయిన కుటిలత్వంతో  బుద్ధిమంతులనూ పరిశుద్ధులనూ తమ బందీలుగా చేసుకొని వారి సౌందర్యాన్నీ సామరస్యాన్నీ ఆత్మశుద్ధినీ వారికి దూరంచేయడంద్వారా ఆ శుభలక్షణాల  ప్రకటనస్వభావమైన ఆనందాన్ని కూడా వారికి లేకుండా చేస్తున్నాయి.

ప్రపంచంలోని చింతకంతకూ స్వార్ధపరత్వమే కారణమని అందరూ అంగీకరిస్తారు కాని, వారి అభిప్రాయంలో అది తమదికాక ఇతరుల స్వార్ధపరత్వం అనే ఆత్మవినాశకర మిధ్యాభావన.  

మీ బాధకి కారణం మీ స్వార్ధమే అని అంగీకరించేందుకు కనక మీరు సిద్ధపడితే, మీరు స్వర్గతుల్యమగు జీవితానికి ఎంతోదూరంలో లేనట్టే; కాని మీ సంతోషాన్ని హరిస్తున్నది ఇతరుల స్వార్ధపరత్వమని నిశ్చయంగా నమ్ముతున్నంత కాలం, ఆ స్వయంకల్పిత ప్రాయశ్చిత్త విధికి మీరు బానిసలుగా ఉండకతప్పదు.

ఉత్సాహోల్లాసాలూ శాంతీ నిండిన అంతరంగపు పరిపూర్ణ సంతృప్తస్థితియే ఆనందం, మరియు దానిలో తృష్ణకు తావుండదు.  కోరిక తీరినప్పుడు కలిగే సంతృప్తి స్వల్పకాలం నిలిచే మైకం మాత్రమే; దాన్ని పొందిన ప్రతిసారీ  మరింత అనుభూతికోసం వెంపర్లాట తప్పదు.

సముద్రంవలె ఇక చాలనేది లేని తృష్ణ, తాను తృప్తినందుతున్న కొద్దీ గొంతుపెంచి మరిన్ని కోరికల జాబితాను సిద్ధంచేసి తీర్చమని దబాయిస్తూనే ఉంటుంది.  తన మాయలోపడిన దాసులదగ్గర దాని జులుం మరీ ఎక్కువై, చివరికి వారు భౌతిక మానసిక ఆందోళనతో నిర్వీర్యులై శిధిలమైపోయి కష్టాలజ్వాలలో పడి అక్కడ శుద్ధిచేయబడతారు.  తృష్ణాశ్రితమైన అధోలోకంలో అన్ని వ్యధలూ చుట్టలుచుట్టుకుని పొంచి ఉంటాయి.    

స్వర్గనరకాలు మానసికావస్థలు. తన స్వార్ధము, దాని వాంఛలతృప్తిలోనే మునిగిఉన్నవాడు నరకకూపంలో మునిగియున్నట్లు; స్వార్ధాన్ని అధిగమించి తనను పూర్తిగా మరిచేట్టి జ్ఞానసంపార్జననందినప్పుడు స్వర్గంలోకి ప్రవేశించినట్లు.

స్వార్ధం గుడ్డిది, విచక్షణ లేనట్టిది, సత్యమగు జ్ఞానం లోపించినది, నిరంతరం బాధకు గురయ్యేది.  కచ్చితమగు భావనాశక్తి, నిష్పాక్షికత మరియు సత్యమగు జ్ఞానము దైవత్వ స్థితిలోనే సాధ్యం, మరియు అట్టి దైవత్వ స్థితిని సాధించేంతవరకు నిజమైన ఆనందాన్ని సొంతం చేసుకొనలేరు.

స్వకీయానందమే లక్ష్యంగా స్వార్ధంతో శ్రమించినంతకాలం కోరుకున్న ఆనందం చిక్కకపోగా, అలా కొనసాగినంతకాలం రాబోయే దుర్దశకై విత్తనాలు మీరు జల్లుకుంటూపోతున్నారని గ్రహించాలి.

ఇతరుల సేవలో మిమ్ముమీరు మరచినప్పుడు, ఆమేరకు ఆనందం మీ స్వంతమై, భాగ్యదశ పంటగా చేతికొస్తుంది.

స్వార్ధానికే అంటిపెట్టుకుంటే బాధనంటిపెట్టుకున్నట్టే; స్వార్ధాన్ని పరిత్యజిస్తే శాంతిసామ్రాజ్యంలో అడుగిడినట్లే.  స్వార్ధం వలన ఆనందాన్ని కోల్పోవడమే కాదు, ఆనందదాయకమని మనమనుకుంటున్నవాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది.  విపరీతంగా తినే తిండిపోతు, చచ్చిన తన ఆకలిని రాజేసేందుకు కొంగ్రొత్త రుచులను కోరుకుంటాడు; చివరికి కడుపుబ్బరం, భారం, వ్యాధి పీడితుడై ఎంత రుచ్యమైన పదార్ధాన్ని కూడా తాకలేని పరిస్థితిలో పడతాడు.

అలాకాక తన తిండియావను అదుపులో ఉంచుకొన్నవ్యక్తి మృష్టాన్నభోజనాన్ని ఆశింపకపోవడమే కాక, అది అతని తలపులలో కూడా చేరక, లభించిన కొద్దిపాటి మితాహారాన్నీ భుజించడంలోనే అమితానందాన్ని పొందుతాడు.  మానవులు తమ స్వార్ధపరత్వ వాంఛలు తీరినప్పుడు భావించుకునే ఆనందపు ప్రేమస్వరూపాన్ని, దరిచేరినంతనే క్లేశపు కంకాళంగా గ్రహిస్తారు.  నిజంగానే, ఎవరికైనా తమ జీవితమూ దాని బాగూ పట్టించుకున్నంతసేపు వదిలిపోతాయి, వదిలేస్తే పట్టుచిక్కుతాయి.

స్వార్ధపు కాపీనంతో స్వీయసౌఖ్యానికి అంటిపెట్టుకోవడం మాని దాన్ని తృణీకరించినప్పుడే శాశ్వతమైన ఆనందం లభిస్తుంది.  ఎంతో ప్రేమతో అంటిపెట్టుకున్న అశాశ్వతమైన మీ ప్రియవస్తువును, ఎలాగూ మీ అంటిపెట్టుకోవడంతో నిమిత్తంలేకుండా ఒకనాడది మీకు దూరమవడం ఖాయమే కాబట్టి, ఏ సంకోచమూ లేకుండా వదులుకోడానికి సంసిద్ధులైనప్పుడు, దాని ఎడబాటువలని దుఃఖం లేకపోవడమే కాక, ఆ పరిత్యాగం ప్రయోజనకరమై ప్రకాశిస్తుంది. 

స్వార్ధప్రయోజనం కోసమైన పరిత్యాగం భ్రమ, దుఃఖకారకమూనూ;   బాధననుభవించేందుకు, తలవంచేందుకు సంసిద్ధులై ఉండటమే, జీవన మార్గం.   

తమ స్వభావరీత్యా నశ్వరాలై మనను వీడిపోయే వాటి చుట్టూ మనం పరిభ్రమించినప్పుడు  శాశ్వతానందం ఎలా సాధ్యంశాశ్వతవస్తువులచుట్టూ మన జీవనం కేంద్రీకృతమైనప్పుడే అది సాధ్యం.    

కనుక అశాశ్వతమగు వస్తువులకై తపించడం అంటిపెట్టుకోవడమనే స్వభావాలనుండి ఎదిగినప్పుడు స్వార్ధపరత్వాన్ని అధిగమించి శాశ్వతమైన జ్ఞానావరణంలోకి ప్రవేస్తారు; మరియు ఆత్మశుద్ధి, స్వార్ధపరిత్యాగం, విశ్వజనీనప్రేమతత్వం అధికమవుతూన్నకొద్దీ, మీరా జ్ఞానసిద్ధిలో పరిపూర్ణులై, నిజమైన ఆనందం ప్రతిక్రియారహితమనీ, మీ నుంచి వేరుచేయ సాధ్యం కానిదనీ గ్రహిస్తారు. 

తనను మరచి ఎదుటివారిప్రేమకే అంకితమైన హృదయం అపరిమితానందాన్ని పొందటమే కాక, అనశ్వరం కూడా అవుతుంది, ఎందుకంటే అది దైవత్వాన్ని గ్రహించినది కనుక.  

ఒక్కసారి, గడచిన మీ జీవితంలోని అనుభవాలను అవలోకనం చేసుకుంటే, మీకు అమితానందాన్ని కలిగించిన మధురక్షణాలు ప్రేమ, దయలతో పవిత్రమైన మీ పలుకులు, పనుల వలన సమకూడినవే. ఆధ్యాత్మికంగా చెప్పాల్సివస్తే, సంతోషమూ సామరస్యమూ ఒకదానికొకటి పర్యాయపదాలు.

ప్రేమను తన అధ్యాత్మిక ప్రకటనగా కలిగిన సామరస్యం, విశ్వన్యాయంలోని ఒక దశ.  అన్నిరకాల స్వార్ధపరత్వమూ జీవన అపశృతికే సంకేతం, మరియు స్వార్ధపూరిత జీవనం దైవ శాసనవిరుద్ధమైనది.

సార్వజనీన ప్రేమతత్వం స్వార్ధతత్వానికి విరుద్ధమని గ్రహించినప్పుడు, మనం విశ్వన్యాయపు దివ్యసంగీతపు శ్రావ్యతకనుగుణమైన స్వరసమ్మేళనం చేసినట్టుఅట్టి సుమధురసంగీతఝరియే మన సొంతం కాగల నిజమైన ఆనందామృతం.

ఆనందంకోసం స్త్రీలూ పురుషులూ గుడ్డితోపుగా అటూ ఇటూ పరుగులుపెడుతున్నారే కానీ వారికది లభించడం లేదు; తమ ఉరుకులూ పరుగులు కొనసాగినంతకాలం విశ్వాన్నంతను ఆవరించిన దివ్యానందం తమలోను, తమచుట్టూనే ఉన్నదనీ, తమ స్వార్ధపరత్వం వల్ల అట్టి ఆనందం తమకు లభించకున్నదనీ, వారు గ్రహించజాలరు.

వ్యక్తిగతమూ క్షణభంగురమూ అయినవాటిని విడిచివేసినప్పుడు నిరపేక్షమూ శాశ్వతమూ అయినవాటి దిశగా ఎదుగుతారు.  అన్ని విషయాలనూ తన క్షుద్ర ప్రయోజనాలకోసం నిర్వీర్యం చేసే సంకుచితపు స్వార్ధ స్వభావాన్ని పరిత్యజించండి, తద్వారా మీరు దేవతల సాన్నిహిత్యంతో, విశ్వప్రేమసారాన్ని నింపుకున్న ప్రతి హృదయంలోను ప్రవేశిస్తారు.

ఇతరుల బాధానివారణలోను, సేవలోను మిమ్ము మీరు మరచినప్పుడు, దివ్యమైన ఆనందం లభించి మీ స్వకీయ దుఃఖాలనుంచి విముక్తి కలిగిస్తుంది.

సద్భావము, సచ్ఛబ్దము, సత్కార్యములనెడి మూడు అంగలలో చేరుకొంటి స్వర్గమునిలలో!”  అన్న విధంగా, మీ అడుగులు అవే అయితే మీరుకూడా స్వర్గధామాన్ని ఆవిష్కరించుకోవచ్చు.  అదెక్కడో ఆకాశానికావలలేదు, ఇక్కడే ఉంది. స్వార్ధపరిత్యాగులకు అందుబాటులో.  

దాని పరిపూర్ణతను పరిశుద్ధ హృదయులు మాత్రమే కనుగొనగలరు.   అవధుల్లేని ఇట్టి ఆనందాన్ని ఇప్పటికే గ్రహించలేని పక్షంలో, నిస్వార్ధప్రేమ అనే ఒకే ఒక జీవితలక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనదిశగా నిజాయితీతో కొనసాగినప్పుడు దానిని పొందగలుగుతారు.

అభిలాష, ప్రార్ధన రెండూ పైకి పరపిన కోరిక రూపాలు.  అది, శాశ్వతమైన సంతృప్తి లభించే ఏకైక దిశ అయిన తన దివ్య మూలాలదిశగా ఆత్మ  తన చూపునిలపడం.  క్షుద్రవాంఛ పవిత్రమగు అభిలాషగా మారినప్పుడు దాని వినాశకర శక్తులు సర్వరక్షకమైన దివ్యశక్తిగా రూపాంతరం చెందుతాయి.

అభిలషించడమంటే వాంఛ వలతాళ్ళను విదిలించుకొన యత్నించడం; అది, ఒక ద్రిమ్మరి తన ఏకాంతమూ పడిన వేదనా కలిగించిన వివేకంతో తండ్రి సౌధాన్ని తిరిగి  చేరినట్లు.  

క్షుద్రమగు స్వార్ధాన్ని అధిగమించినప్పుడు; ఒకదాని తర్వాత ఒకటిగ మిమ్ము బంధించిన స్వార్ధపు సంకెలలను ఛేదించినప్పుడు, మీరు పోగుచేసుకుని పొదివిపట్టుకుని పోతుందేమోనని పొందే పొగులు కన్న భిన్నమైనదైన ఇచ్చుటలోని ఆనందాన్ని అనుభూతి చెందుతారు; ఇవ్వడమంటే ధనాన్ని, బుద్ధికుశలతను; అంతరంగంలో విస్తరిస్తున్న ప్రేమజ్యోతిని ఇతరులకై పంచిపెట్టడం.

అప్పుడు మీకు అర్ధమవుతుంది - పుచ్చుకోవడంకన్న ఇవ్వడమే నిజానికి మహద్భాగ్యమని.  కాని ఆ ఇవ్వడం ఏ స్వార్ధపు మకిలీ అంటని, ఎట్టి ప్రతిఫలాన్నీ ఆశించని పరిశుద్ధ హృదయంతోనే జరగాలి.  పరిశుద్ధమైన ప్రేమ కానుకకు ఎల్లప్పుడూ మహదానందం వెన్నంటి ఉంటుంది.  ఇచ్చిన తరవాత మీకు కృతజ్ఞతలు లభించలేదని కాని, మీ పేరు పత్రికలలో పడలేదని కాని మనసులో ఏ మూలనో మీకుంటే, అప్పుడు మీరిచ్చిన కానుక పేరుకోసమే కాని ప్రేమతో కాదని, మీరిచ్చేది మరేదో పొందేందుకని, మరియు అది ఇవ్వడం కాక లాక్కోవడం అని తెలుసుకోవాలి.

ఇతరుల సంక్షేమంలో మిమ్ము గురించిన స్పృహే లేక యుండండి; చేసే ప్రతిపనిలో మీమ్ము మీరు మరచిపోండి; ఇదీ సమృద్ధి అయిన ఆనందానికి రహస్యం.

ఎప్పుడూ స్వార్ధపరత్వం పైన ఒక కన్నేసి ఉంచండి, అంతరంగ స్వార్ధపరిత్యాగ దివ్య పాఠాన్ని విశ్వాసంతో అభ్యసించండి; అప్పుడు మీరు అత్యున్నతమగు ఆనందపుటెత్తులనధిరోహిస్తారు, ఎన్నడూ మేఘావృతంకాని విశ్వోల్లాసపు సూర్యకాంతిలో ప్రకాశిస్తారు, శాశ్వతత్వపు దీప్తిమంతమగు వస్త్రాలలో శోభిస్తారు.

మీరు తరగని ఆనందంకోసం వెదుకుతున్నారా? మీరు ప్రతిదినమూ జీవనోత్సాహాన్నీ పొందుతూ, ఏ ఒక్కరోజూ వ్యాకులతనందనిచ్చగించకున్నారా? మీరు ప్రేమ, జీవితం, శాంతి అనే సెలయేళ్ళకోసం పరుగులిడి అలిసిపోతున్నారా? అయితే మదిలోని అన్ని క్షుద్రకోరికలను బయటికితోలి, స్వార్ధలాంపట్యాన్ని నశింపనివ్వండి.


మీరు బాధనిండిన మార్గాల్లో విషాదం వెన్నంటిరాగా, క్షతగాత్రుల్లా గింజుకుంటున్నారామీరు మీ పాదాలకు తగ్గని నొప్పిని నిరంతరంగా కలిగించే బాటలో తిరుగాడుతున్నారా? మీరు కన్నీళ్ళూ క్లేశాలూ లేని విశ్రాంతిస్థలం లభించక ఉసూరుమంటున్నారా? అయితే మీ స్వార్ధభరిత హృదయాన్ని త్యజించి శాంతియుక్త హృదయాన్ని కనుగొనండి.

7. భాగ్యానుభవము

భాగ్యాన్ని వాస్తవంగా అనుభవించేది నిజాయితీ, విశ్వసనీయత, దాతృత్వం, ప్రేమ లను పుష్కలంగా కలిగిన హృదయమేనన్నది సుస్పష్టం.  ఈ లక్షణాలు లేని హృదయానికి భాగ్యమంటే ఏమిటో తెలియదు, ఎందుకంటే ఆనందం వలెనే భాగ్యం కూడా బహిరంగ వస్తుసంగ్రహం కాక, అంతరంగ జ్ఞానసిద్ధి.

దురాశాపరుడు కోటీశ్వరుడైనప్పటికీ, హీనుడై, నీచుడై, దీనుడై, తనను మించిన సంపన్నుడొకరిని గురించి తెలిసినప్పుడు బయట కూడా తాను దరిద్రుడననే భావిస్తాడు; అదే నిజాయితీపరుడు, దాత, ప్రేమాస్పదుడు ఎప్పుడూ భాగ్యానుభవంలోనె తరిస్తూంటాడు, అతను పోగుచేసుకున్న ఆర్భాటపు సంపదలు రాశిలో తక్కువైనా.

నిత్య అసంతృప్తుడు దరిద్రుడు; కలిగినదానితో తృప్తినందినవాడు సంపన్నుడు, తనకున్నదానితో దాతృత్వం  కలిగియుండేవాడు అధిక సంపన్నుడు.

విశ్వం అనేక వస్తు మరియు ఆధ్యాత్మిక యోగ్యతమ వస్తువులను కలిగియున్నదనే సత్యాన్ని గురించి యోచిస్తూ, దానితో, కొన్ని బంగారుకాసులకోసం, కొన్ని ఎకరాల మట్టికోసం మనిషి పడే అంధత్వపుటారాటాన్ని పోల్చిచూసుకున్నప్పుడు స్వార్ధం ఎట్టి అజ్ఞానమూ మూర్ఖమో అవగతమవుతుందిఅప్పుడే స్వార్ధ స్వలాభాపేక్ష స్వవినాశకరమన్న జ్ఞానం కూడా కలుగుతుంది. 

ఎట్టి మినహాయింపులూ లేకుండా అందరికీ ఇచ్చే ప్రకృతి దేనినీ కోల్పోదుఅదంతా గ్రహించి పోగుచేసుకున్న మనిషి మాత్రం దేనినీ మిగుల్చుకోలేడు.

నిజమైన భాగ్యానుభవం కలగాలంటే, చాలామంది చేస్తున్నట్లు, "మంచికిపోతే చెడు" అన్న నానుడిని అనుసరిస్తూ చతికిలబడిపోకండి.  "స్పర్ధ" అన్న పదం అత్యుకృష్ట ధార్మికతపట్ల మీకు గల విశ్వాసాన్ని చెదరనీయకుండా జాగ్రత్తపడండి.

స్పర్ధలు, పోటిల గురించిన న్యాయసూత్రాలగురించి ఇతరులు చెప్పేదేనితోను నాకు పనిలేదు, ఎందుకంటే మార్పుకులోనుకాని విశ్వన్యాయం అట్టి సిద్ధాంతాలనన్నిటినీ ఒకనాటికి తోసిరాజనగలదని, ఇంకా చెప్పాలంటే, హృదయపరిశుద్ధికలిగిన ధార్మికుని విషయంలో అది ఇప్పటికే వమ్మైందనీ నాకు తెలియదా?

ఇది తెలిసిన నేను కాపట్యాన్ని మోసాన్ని చెదరని శాంతితో అవలోకనం చేసుకుంటాను, ఎందుకంటే నిశ్చితమైన వినాశనం వాటికోసం ఎదురుచూస్తూంటుందని నాకు తెలుసు.  అన్ని పరిస్థితులలోను, సక్రమమని మీరు నమ్మేదాన్ని ఆచరించండి, విశ్వన్యాయాన్ని విశ్వసించండి; విశ్వంలో నిగూఢంగా ఉన్న దైవశక్తిని నమ్ముతూ, అది మిమ్ము ఎన్నడూ వీడిపోదని, మీరు సదా దాని రక్షణలోనే ఉంటున్నారనే ప్రగాఢ నమ్మిక కలిగియుండండి.

అట్టి విశ్వాసం వలన మీరు కోల్పోయినది తిరిగి పొందగలరు, మిమ్ము భయపెట్టిన శాపాలు వరాలుగా రూపాంతరం చెందుతాయి.  ఎట్టి పరిస్థితులలోను నిజాయితీ, దాతృత్వం, ప్రేమలను విడవకండి, ఈ గుణాలను ఉత్సాహంతో ఆచరిస్తే అవి మిమ్మల్ని శాశ్వతమగు భాగ్యదశలో నిలబెడతాయి.

ముందు మనం, తరవాతే మిగతావారు అని చెప్పే సంఘపు సూచనను పట్టించుకోకండి.  ఇతరులెవ్వరినీ పట్టించుకోక తమ స్వసౌఖ్యాన్నే కాంక్షించే వారిని ఒకనాటికి అందరూ విడిచిపెట్టిపోయే రోజొస్తుంది, అప్పుడు తమ ఒంటరితనంలో తననాదుకొనేవారెవరూ లేరని ఏడవాల్సి వస్తుంది.  ఇతరులకన్నా ముందు స్వకీయ సౌలభ్యం చూసుకొనడమంటే కలగబోయే ఘనమైన దైవిక ప్రేరణను కలగనియ్యకుండా మనకు మనమే అడ్డంకులూ మలుపులూ ఆటంకాలు సృష్టించుకుంటున్నట్టు.

మీ ఆత్మను విస్తరించనివ్వండి, ఆత్మీయతనిండిన దానశీలమగు హృదయాన్ని ఇతరుల బాగుకై చేరువకానివ్వండి, అప్పుడు మీ సంతోషం ఉత్కృష్టమైనదీ, శాశ్వతమైనదీ అయి, సకల భాగ్యాలు మీ దరిచేరతాయి.  ధార్మికత పరచిన రాజమార్గాన్ని వదిలి చరించేవారు స్పర్ధలనుంచి, పోటిలనుంచి తమను తాము కాపాడుకొనేందుకు ఆయాసపడాల్సివస్తుంది; సన్మార్గాన్ననుసరించేవారికి అట్టి ఆత్మరక్షక ప్రయత్నాల అవసరం ఉండదు.

ఇది నిరర్ధకమైన ప్రకటనం కాదు; ఈరోజు ఎందరో, నిజాయితీ మరియు విశ్వాసాల అమోఘ శక్తితో అన్ని రకాల పోటీలను, ప్రతికూలతలను అధిగమించగలుగుతున్నారు; తమ బాటనుండి పక్కదారిపట్టకుండా ఉన్న అట్టి వారు, పోటీ ఎదురైనప్పుడు స్థిరంగా దానిని ఎదుర్కొని అభ్యుదయాన్ని సొంతం చేసుకుంటారు, వారిని తక్కువ అంచనావేసి తలపడేవారు వారికి తలొగ్గుతారు.

అంతరంగంలో ఇట్టి సద్గుణసంపదను కలిగియున్నవారు మంచికి ప్రతినిధులై, చెడుయొక్క దుష్టశక్తులకు దుర్భేద్యమగు కవచాన్ని నిర్మించుకొని, ఎదురయ్యే ప్రతి ప్రతికూలతనుండి రక్షణపొందుతారు; అట్టి గుణసంపదతో తమ వ్యక్తిత్వాన్ని నిర్మించుకొనేవారు ఎట్టిపరిస్థితులలోను తొణకని విజయసాఫల్యాన్ని పొందినవారై, శాశ్వతాభ్యుదయంతో పరిపూర్ణమైన జీవనాన్ని సాగిస్తారు.


     


No comments:

Post a Comment