Monday, June 17, 2019

సైంటిస్టులై ఉండి దేవుణ్ణెందుకు నమ్ముతారు? ("Why do scientists believe in God?" Article from Reader's Digest)








సైంటిస్టులై ఉండి దేవుణ్ణెందుకు నమ్ముతారు? ఏడు కారణాలు:
(రీడర్స్ డైజెస్ట్ జనవరి 1948 సంచిక లో ప్రచురితమైన వ్యాసానికి స్వేచ్ఛానువాదము)
మూల రచయిత: ఏ క్రెసీ మోరిసన్ (న్యూ యార్క్ ఎకాడెమీ ఆఫ్ సైన్సెస్ పూర్వాధ్యక్షులు)
సైన్సు మహాయుగానికి ఇప్పటి కాలం ఇంకా తెల్లవారుజాము. ఇప్పుడిప్పుడే పొద్దెక్కుతూ, కొత్త కొత్తగా ప్రసరించే ప్రతీ ఒక్క కిరణమూ ఒకో అద్భుతాన్ని చూపుతూ, వీటన్నిటికీ వెనక ఎదో మహా చైతన్యపు బుద్ధికుశలత ఉండి వుండాలని ప్రకటిస్తోంది. డార్విన్ గతించిన నాటి నించి ఈ తొంభైయేళ్ళలో మనమెన్నో మహాద్భుతాలను ఆవిష్కరించుకున్నాం; శాస్త్రజ్ఞానమూ విశ్వాసమూ ప్రసాదించిన వినయవిధేయతలతో మనం సృష్టికర్తను తెలుసుకునే దిశగా కూడా అడుగులేస్తున్నాము.

శాస్త్రవేత్తనైన నేను, నా విశ్వాసానికి ఏడు కారణాలు ఉదహరిస్తాను:

ఒకటి: ఒక నిశ్చితమైన గణిత సూత్రం ద్వారా ఈ విశ్వం ఒక మహా సాంకేతిక బుద్ధినైశిత్యంతో నిర్మించబడిందని తెలుస్తుంది:

ఉదాహరణకి, పది నాణేలు మీ జేబులో వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక నాణేన్ని బైటికి తీసి మళ్ళీ దాన్ని జేబులో వేసి బాగా కలిపి ఈ సారి రెంటిని తీసి జేబులో వేసి బాగాకలిపి మూడింటిని తీసి.. ఇలా పదింటికీ చెయ్యండి. మళ్ళీ ప్రయత్నించినప్పుడు అదే మొదటి నాణేన్ని తీసే సంభావ్యత పదింట ఒకటి, మొదటి రెండింటినే తీసే సంభావ్యత నూరింట ఒకటి, మొదటి మూడింటినే తీసే సంభావ్యత వెయ్యింట ఒకటి, అనే లెక్క మనమెరిగినదే. ఆ లెక్కన పదింటినీ మొదటి క్రమంలోనే తియ్యాలంటే దాని సంభావ్యత నమ్మశక్యంకానంతగా పదివేల మిలియన్లలో ఒకటి.

ఇదే మాదిరి, భూమ్మీద ప్రాణికోటి మనుగడ ఒక లెక్క ప్రకారం అమరిన పరిస్థితుల కారణంగా జరుగుతున్నదే గాని ఎదో ప్రమాదవశాత్తూ నడిచిపోవడంలేదు. భూమి తన అక్షంపై గంటకి వెయ్యిమైళ్ళ వేగంతో తిరుగుతుంది. ఈ వేగం వంద మైళ్ళు గాని అయుంటే మన రాత్రులూ పగళ్ళూ ఇప్పుడున్నవాటికన్న పదిరెట్లు ఎక్కువ నిడివి కలవై, పగలంతా ప్రకాశించే సూర్యకిరణ తేజో ధాటికి మొక్కన్నది లేకుండా మాడిపోయి దాన్ని తప్పించుకున్న ఒకటో అరో మొలకలు గడ్డకట్టించే రాత్రిలో నశించిపోయుండేవి.

ఇంకా, మన ప్రాణాధారమైన సూర్యుని ఉపరితల తాపం పన్నెండు వేల ఫారన్ హీట్ డిగ్రీలుండగా, మన భూమి అతని నుండి సరిగా తనకి కావలసినంత వేడీ వెచ్చదనమూ మాత్రమే తీసుకోగలిగిన దూరంలో పరిభ్రమిస్తోంది. సూర్యునితాపమే కనక ఇప్పుడున్నదాని కంటె సగం తక్కువై ఉండుంటే మనం మంచై పోయుండేవాళ్ళం; ఎక్కువై ఉండుంటే మసై పోయుండేవాళ్ళం.

భూమి సరీగ్గా ఇరవై మూడు డిగ్రీలు వాలుగా ఉండటంవల్ల మనకి ఋతువులు సంభవిస్తున్నాయి. ఆ వాలుగాని లేకుంటే సముద్రం నుంచి ఆవిర్లు ఉత్తర దక్షిణాలకి యధేచ్ఛగా ప్రయాణించి చల్లబడి మనమీద పెద్ద పెద్ద దేశాల పరిమాణంలో మంచుగడ్డలను ద్రిమ్మరించేవి. చంద్రుడు ఇప్పుడున్నట్టు కాక యాభైవేల మైళ్ళ దూరంలో మాత్రమే ఉండుంటే రోజుకి రెండుసార్లు ఖండాలన్నీ పూర్తిగా మునిగిపోతూండేవి; పర్వతాలు నేలమట్టమైపోయుండేవి. భూమి ఉపరితలపు పెచ్చు ఇప్పుడున్నదానికంటె పదడుగులు మందంగా ఉండుంటే ఆక్సిజన్ అన్నది లేకుండా పోయి ప్రాణికోటి నశించిపోయేది. సముద్రం మరికొన్ని అడుగులు లోతై ఉండుంటే కార్బన్ డయాక్సైడూ ఆక్సిజనూ హరించుకుపోయి మొక్కన్నది లేకుండా పొయ్యేవి. మన వాతావరణపు పొర మరి కాస్త పలచనై ఉండుంటే ఇప్పుడు ఆకాశంలో తమ పతనమార్గంలోనే మండిపోతుండే ఉల్క కోటులు మహాగ్నిజ్వాలా సహితంగా భూమిని అన్నివైపులా ఎడాపెడా బాదేస్తుండేవి.

ఇలాటివి, ఇంకా మరెన్నో క్రమబద్ధమైన అమరికలు ఈ భూమ్మీద ప్రాణి మనుగడ కేవలం యాదృచ్ఛికం కాదని ప్రకటిస్తాయి.

రెండు: ప్రాణుల్లో అనుకున్నది సాధించాలన్న ఉత్సాహానికి, సర్వత్రా వ్యాపించియున్న మహా మేధస్సే కారణం.

అసలు ప్రాణమంటే ఏమిటో ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయేరు. దానికి కొలతలూ బరువూ లేవుగానీ శక్తి వుంది; విత్తులోని అంకురం మెల్ల మెల్లగా కఠిన శిలను సైతం ఛేదించుకుని బయటికొస్తుంది. ప్రాణశక్తి నీటినీ నేలనూ నింగినీ జయించింది; సకల పదార్ధ ప్రపంచమూ దానికి అధీనమై దాని అవసరాలకు తగిన విధంగా తమ స్వభావాలు మార్చుకోవడామో, ఒకదానితో ఒకటి కలిసి కొత్త వాటిని సృష్టించడమో చేస్తున్నాయి.

ప్రాణశక్తి సకల జీవులకూ స్వరూపాలనిచ్చే శిల్పి; వృక్షప్రపంచంలో ప్రతి ఆకుకూ పుష్పానికీ చిత్ర విచిత్ర ఆకృతులనూ రంగులనూ అద్దే చిత్రకర్త; పక్షులకు పాటలనూ, కీటకాలు తమలో తాము సంభాషించుకొనేందుకు కీచులనూ నేర్పిన సంగీతకర్త; పండ్లకూ ఓషధులకూ పూలకూ పరిమళాన్నీ సుగంధాన్నీ రుచినీ, నియమిత పాళ్ళలో కార్బోనిక్ యాసిడ్ నీ నీటినీ కలిపి చక్కెరనూ చెక్కనూ నిర్మిస్తూ తద్వారా జీవకోటికి ప్రాణవాయువును వెలువరించే రసాయనకర్త.

పారదర్శకంగా స్వఛ్చమైన గాజులా వుండే ప్రోటోప్లాజం బిందువు కంటికి కనిపించనంత చిన్నదైనా, అది సూర్య శక్తిని గ్రహించి చలనశక్తిని పొందుతుంది. అతి సూక్ష్మతరమూ మంచులా కనిపించే దీన్లో నిండిన ప్రాణశక్తి బహుధా విస్తరించి చిన్నా పెద్దా జీవజాలాలను వృద్ధి చేస్తుంది. ఈ సూక్ష్మ బిందువు శక్తి సృష్టిలోని వృక్ష జంతుప్రపంచపు శక్తి కన్నా గొప్పది - వాటన్నిటి మూలాధారమైన ప్రాణం దానిలోంచే వచ్చింది కనక. ప్రకృతి ప్రాణిని సృజించలేదు; దానిలోని అగ్ని శిలలూ సముద్ర జలాలూ ప్రాణ సృష్టికి అనువు కావు.

మరి దానినక్కడ ఎవరుంచినట్టు?

మూడు: నిస్సహాయాలైన మూగజీవులు కనబరిచే సహజ జ్ఞానాన్ని దయార్ద్ర హృదయుడైన సృష్టికర్త వాటి మనుగడను దృష్టిలో పెట్టుకుని ప్రసాదించి యుండాలి.

చిరు సాల్మన్ చేప సముద్రంలో కొన్ని సంవత్సరాల ప్రయాణం చేసి చేసి తననందులోకి తీసుకొచ్చిన నదీ సంగమం గుండా ఆ నదికి ఎదురీది చివరికి ఆ నదిలో కలిసే వేల ఉపనదుల్లో సరిగ్గా తన జన్మ స్థానమైన పిల్లకాల్వ లోకి చేరుతుంది. అంత కచ్చితంగా దాన్నక్కడికి ఎవరు చేర్చేరు? మీరు దాన్ని తీసి బలవంతంగా ఇంకెక్కడో పడెస్తే అది తన ప్రాంతం కాదని తెలుసుకుని తిరిగి తన పోరాటాన్ని కొనసాగించి తన మూల స్థానానికి చేరుకునేవరకూ విశ్రమించదు.

ఈల్ చేపల ప్రవర్తన ఇంకా విచిత్రం. ప్రపంచంలోని అన్ని మూలలలోని సరస్సులూ కుంటలూ నదులలోను ప్రభవించే ఈ అద్భుత ప్రాణులు ఈదుకుని ఈదుకుని చివరికి బెర్ముడా ప్రాంతంలోని ఒక అగాధానికి చేరుకుంటాయి. అక్కడ సంతానోత్పత్తి చేసి చనిపోతాయి. అలా పుట్టిన నవజాత చేప పిల్లలకి ఏం తెలుసు తామున్నది అంతు కానరాని అపరిచిత అగాధమన్నది తప్ప. కాని చూడండి అవి ఈది యీది తమ తల్లిదండ్రులు ఏ కుంటనుండి ఏ సరస్సు నుండి ఏ నది నుండి తమ సుదీర్ఘ ప్రయాణం మొదలెట్టారో అక్కడికి చేరుకుని ప్రతీ జలాశయంలోను తాము దర్శనమిచ్చేవిధంగా సర్దుకుంటాయి. అమెరికా ఈల్ చేప ఐరోపాలో కాని, ఐరోపా ఈల్ చేప అమెరికాలో గాని పట్టుబడదు. ఈల్ చేపల ప్రయాణం గురించి ఎరిగున్న ప్రకృతి కూడా, అవి తమ గమ్యం చేరేవరకు వాటి జీవన ప్రమాణాన్ని సర్దుబాటు చేస్తుంది. జీవనిర్జీవ జాలానికి ఇంత కచ్చితత్వంతో మార్గనిర్దేశనం చేస్తున్నదెవరు?

కందిరీగ మిడతని యుద్ధంలో ఓడించి సజీవంగా బంధించి నేలలో ఓ కన్నం చేసి అందులో వుంచుతుంది. అప్పుడు దాన్ని తన విషపు కొండెంతో కుడుతుంది. ఎక్కడ, ఎంత మోతాదు విషంతో అంటే, ఆ కాటుకి మిడత చనిపోగూడదు. తాను అనుకున్నంతకాలం వరకు బతికుండి నిలవ చేసుకున్న మాంసంలా అపస్మారకంగా పడుండాలి. అప్పుడది మిడతకి చేరువగా గుడ్లు పెడుతుంది. పుడుతూనే అవి మిడతని కొరకడం ఆరంభిస్తాయి. అప్పుడు కూడా అది చనిపోకూడదు. చచ్చిన కళేబర మాంసం వాటికి ప్రాణాంతకం. తల్లి అప్పుడు ఎగిరిపోయి ఎక్కడో చచ్చిపోతుంది. దానికి తన బిడ్డలు పెరిగి పెద్దవడం చూసుకునే భాగ్యం ఉండదు. ఈ ప్రక్రియని తరతరాలుగా ప్రతి కందిరీగా ఎక్కడా తప్పటడుగు పడకుండా జరుపుతూ వస్తోంది. లేకుంటే కందిరీగలిప్పుడు కనబడేవి కాదు. ఇటువంటి నైపుణ్యాలు పరిణామ క్రమంలో అలవాటు చేసుకుంటే వచ్చేవి కావు. వాటినెవరో అనుగ్రహించి ఉండుండాలి.

నాలుగు: మనిషికి జంతువుల కన్న అధికంగా ఒక విశేష ప్రజ్ఞ లభించింది - అదే తార్కిక జ్ఞానం.

మనిషి తప్ప మరే జంతువూ పది వరకు లెక్కపెట్ట లేదు, అసలు పదంటే ఏమిటో వాటికి తెలీదు. జన్మతః లభించిన వాటి సహజ జ్ఞానం, వేణువులో శ్రావ్యమే గాని పరిమితమైన ఒక స్వరం అనుకుంటే, మనిషి మెదడు వాద్యబృందపు అన్ని వాద్యాలలోని అన్ని స్వరాలనూ నిక్షిప్తం చేసుకున్నటువంటిది. ఈ నాలుగో కారణాన్ని అధికంగా విశ్లేషించనక్కరలేదనుకుంటాను. మానవ మేధ పుణ్యమాని మనమెవ్వరమో మన జీవన గమ్యమేమిటో అన్న ప్రశ్నలకి లభించే సమాధానాలు అనంతమైన విశ్వ జ్ఞాన కిరణాలు ఒకటో అరో మనమీద ప్రసరించిన కారణంగానే అని బోధపడుతుంది.

ఐదు: డార్విన్ మేధస్సుకే అందని మూలకణాలు, వాటిలో నిక్షిప్తమై వున్న జీవకోటి రహస్యాలూ వంటి నూత్నాంశాలు మనకి తెలుసు.

జీవకణాలు ఎంత చిన్నవంటే, ప్రపంచ జీవరాశులన్నిటి మూలమూ అయిన వాటిని సేకరించి భద్రపరిస్తే అవి ఒక వేలిగోటిలో ఇమిడిపోతాయి. ప్రపంచంలోని సకల జీవరాశుల ప్రవర్తనా గుణసంపదల మూలాలు అతి సూక్ష్మతరమైన ఈ కణాల్లో ఒదిగి వుంటాయి. కొండంత సృష్టిలోని ప్రాణికోటి గుణగణాలూ నడవడి సర్వస్వమూ ఇమిడిపోయే ప్రదేశం గోరంత! పైగా అవి దాచుకున్నవి ఇప్పుడు జీవించియున్న జీవుల లక్షణాలే కాదు - వారి పితామహ ప్రపితామహుల మనస్తత్వాలనూ లక్షణాలను. ఎలా సాధ్యం.

జీవపరిణామ క్రమం నిజంగా ప్రారంభమయేది ఇక్కడే - ఈ సూక్ష్మ కణంలో. ఒక సూక్ష్మతర అమరిక కొన్ని కోట్ల పరమాణువులను తనలో ఇముడ్చుకుని భూమ్మీది జీవకోటిని శాసించగలుగుతోందంటే ఆ అమరికను నిర్మించిన హస్తలాఘవం అసామాన్యమైన ఒక మహా మేధో సృజనశీలునిదై యుండాలి. మరే తర్కానికీ అది అందదు.

ఆరు: సృష్టి బహు విశాలమైనదైనా దానిలోని సకల జీవరాశులూ బతికేందుకు ఎంత అవసరమో అంత మొత్తంలో ప్రకృతి వనరులు సమకూర్చిపెట్టడం ఎవరికీ అందని పొందికైన లెక్క.

చాలా యేళ్ళ క్రితం ఆస్ట్రేలియాలో ఓ స్థలం చుట్టూ రక్షణ కంచెలా ఒక రకం బొమ్మ జెముడు పాతేరు. ఏ కీటక బాధా లేని ఆ బొమ్మ జెముడు తంపరగా ఎదిగింది. విపరీతంగా పెరిగి పెరిగి ఇంగ్లాండ్ దేశపు పరిమాణంలో విస్తరించిన దాని దెబ్బకి ఇతర పంటలు నాశనమైపోయి ఊళ్ళకి ఊళ్ళు కాళీ చేసి పోయేరు. ఈ విపత్తును దాటించేందుకు శాస్త్రవేత్తలు శోధించి శోధించి బొమ్మజెముడు తప్ప మరేదీ తినని ఓ కీటకాన్ని సృష్టించేరు. ఆ కీటకం తననుండి తానే పునరుత్పత్తి చేసుకోగలదు. ఆస్ట్రేలియాలో దానికి శత్రువన్నది లేదు. ఈ విధంగా వృక్షం మీద జంతువు ఆధిపత్యం కొనసాగి బొమ్మజెముడు కట్టడి జరిగింది. కొద్ది కొద్దిగా దాని విస్తీర్ణం తగ్గుతూ, దాంతో పాటే దాన్ని తినే కీటక సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు రెండు ప్రమాదం కానంత అదుపులో వున్నాయి.

ఈ రకమైన ఎత్తులకి పై యెత్తులు, అపాయాలకి ఉపాయాలు విశ్వవ్యాప్తంగా ఏర్పాటు చెయ్యబడ్డాయి. తంపలు తంపలుగా వృద్ధినందగల కీటక జాతి భూమిని ఎందుకు జయించలేకపోయింది? ఎందుకంటే మనుషుల్లా వాటికి ఊపిరితిత్తులుండవు; గొట్టాలతో శ్వాసిస్తాయి. కీటకాల పరిమాణం పెరిగినప్పుడు అదే అనుపాతంలో వాటి గాలిగొట్టాలు పెరగవు. అందువల్లనే కీటకాల పరిమాణం పరిమితం. అంతకన్నా అవి పెద్దవి కాలేవు. ఎదుగుదలలోని ఈ పరిమితే వాటిని కట్టడిలో ఉంచింది.

ఇతర జీవజాలానికున్న ఇటువంటి పరిమితులే మానవ మనుగడకు శ్రీరామరక్ష. సింహమంత కందిరీగ ఎదురుపడితే ఎలావుంటుందో ఊహించండి.

ఏడు: మనిషికి దేవుని గురించిన చింతన కలగడమే ఇంకో నిదర్శనం.

మనిషిలో ఆధ్యాత్మిక భావనలు బయటి ప్రపంచంతో అతడు పంచుకోని భగవత్తత్వం సహాయంతో కలుగుతాయి. ఆ తత్వమే సృజన. ఈ శక్తిని కలిగిన కారణంగా మనిషి, మనిషి మాత్రమే, కంటికి కానరాని విషయాల ఉనికిని కనుగొంటాడు. సృజనాత్మక భావనాశక్తి చెయ్యగల ఆవిష్కరణలకి మితి లేదు. నిజానికి సృజనలో పరిపూర్ణత సాధించిన మనిషి ఆధ్యాత్మిక జ్ఞానసిద్ధినంది సృష్టిలోని ప్రతి విషయపు కారణ కార్యాలను విశ్లేషించ సమర్ధుడై, స్వర్గం ఎక్కడనో కాక అన్నిచోట్లనూ ఉంటుందనీ, భగవంతుడు కూడా ఎక్కడో కాక అందరిలోనూ ఉంటాడని, ఇంకా ముఖ్యంగా మనకి అతి చేరువలో మన హృదయంలోనే ఉంటాడని గ్రహిస్తాడు.

శాస్త్రపరంగానైనా విశ్వాసపరంగానైనా ఇది నిజం. కీర్తనకారుడు పాడినట్టు, “విశ్వరూపుని దివ్య మహిమము దిక్కులన్నియు కలిసి పాడగ విశ్వమాతని చేతి చలువను రూపు బడసెను, జగము మురిసెను ”.

No comments:

Post a Comment