స్టీవ్ జాబ్స్, జూన్ 14 2005 స్టాన్ ఫోర్డ్
అత్త్యుత్తమ ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఇక్కడ మీ స్నాతకోత్సవానికి హాజరు కావడం నాకు దక్కిన గౌరవం. నాకు కాలేజీ పట్టా లేదు. నిజానికి ఒక కళాశాల పట్టాకి ఇంత చేరువయ్యింది ఇప్పుడే. ఈ రోజు నా జీవితానికి సంబంధించిన మూడు కథలు చెప్తాను. అంతే. ఎక్కువేం లేదు. మూడే కథలు.
మొదటి కథ, చుక్కల్ని కలపడం గురించి.
మొదటి ఆర్నెల్లలోనే నేను రీడ్ కాలేజీ చదువుకి ఎగనామం పెట్టేసేను కానీ పూర్తిగా బయటికొచ్చేంతరకు, కాలేజీని పట్టుకు ఇంకో పద్ధెనిమిది నెల్లల పాటు వేలాడేను. చదువుకు ఉద్వాసన ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే.
అది నేను పుట్టకముందే జరిగిందని చెప్పవచ్చు. నాకు జన్మనిచ్చిన తల్లి పెళ్ళికాని కాలేజీ విద్యార్ధిని. నేను పుట్టకముందే ఆమె నన్ను దత్తతకిచ్చేందూ నిశ్చయించుకుంది. తనకి, నన్ను పెంచుకునేవారు తప్పనిసరిగా కాలేజీ పట్టభద్రులై ఉండాలి. ఆ ప్రకారం నన్ను ఒక న్యాయవాదీ అతని భార్య సాకేందుకు ఏర్పాట్లు జరిగినై. అయితే నేను భూమ్మీద పడకముందే ఆ న్యాయవాదీ భార్యా మనసు మార్చుకుని ఆడపిల్లని పెంచుకుందామనుకున్నారు.. అందువల్ల నా అసలు తల్లిదండ్రులు వేచి యుండాల్సి వచ్చింది. నేను పుట్టాక వారు ఫోను చేసి "అనుకోకుండా మగబిడ్డ పుట్టాడు. మీక్కావాలా?" అని అడిగారు. "ఎంత మాటా? అలాగే" అన్నారు వారు. తరవాత ఈ కొత్త దంపతులిద్దరూ కూడా కాలేజీ పట్టభద్రులే కారని తెలిసి మా అమ్మ దత్తు కాగితాలమీద సంతకాలు పెట్టనంది. కొన్ని నెలల బెట్టు తరవాత నా కొత్త తల్లిదండ్రులు నన్నెలాగైనా కాలేజీ పట్టభద్రుణ్ణి చేస్తానని మాట ఇచ్చినమీదట ఆమె ఒప్పుకుంది.
పదిహేడేళ్ళ తరవాత నేను కాలేజీ మెట్టు ఎక్కనూ ఎక్కాను. కానీ తెలిసో తెలీకో నేనెంచుకున్న కాలేజీ ఈ స్టాన్ ఫర్డ్ అంత ఖరీదైనదై, శ్రమజీవులైన నా తల్లితండ్రుల సంపాదన యావత్తూ ట్యూషన్ ఫీజుకే సరిపోయేది. ఆర్నెల్ల తరవాత ఈ కర్చువల్ల ఉపయోగమేమీ నాకగపడలేదు. జీవితంలో ఏమి చెయ్యాలో, అందుకు ఈ కాలేజీ చదువు ఏవిధంగా ఉపకరిస్తుందో నాకైతే అంతు పట్టలేదు. ఇటు నా తల్లితండ్రులు జీవితకాలం పాటు రెక్కలు ముక్కలు చేసుకు వెనకేసిన నాలుగు డబ్బులూ ఈ విధంగా ధారపోస్తున్నాను. ఆలోచించి ఈ చదువుకి ఉద్వాసన పలికితే పెద్ద నష్టమేమీ ఉండదనీ నిర్ణయించుకున్నాను. అప్పటికి ఆ ఆలోచనలూ నిర్ణయమూ ఎంతో భయం కలిగించేయి గాని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం అది. కాలేజీ వదిలేసిన మరుక్షణం నాకేమాత్రం ఆసక్తి లేని క్లాసులు తీసుకోవడం మానేసి, ఇష్టమైన వాటిమీద శ్రద్ధ పెట్టడం ఆరంభించాను.
అయితే అది అంత అద్భుతంగా ఏమీ జరగలేదు. బసకో గది లేక, ఒక స్నేహితుడి గదిలో నేలమీద పడుకొనేవాణ్ణి. తాగిపారేసిన కోకు డబ్బాలు పోగుచేసుకుని అయిదేసి సెంట్లకు అమ్మి తిండి కర్చు నెట్టుకొచ్చేవాడిని. ప్రతీ ఆదివారం రాత్రి కృష్ణ చైతన్యమఠం వారు పెట్టే భోజనం కోసం ఊరు దాటి యేడు మైళ్ళు నడిచి వెళ్ళేవాడిని. అది చాలా బాగుండేది. అలా నేను ఉత్సుకతతో తప్పటడుగులు వేసిన చాలా వ్యాసంగాలు తరువాతి జీవితంలో వెలకట్టలేనంత గొప్పవయినై. ఒక ఉదాహరణ ఇస్తాను:
ఆ రోజుల్లో దస్తూరీ కళ (calligraphy) లో దేశంలోనే అత్యుత్తమ శిక్షణ ఇచ్చేదిగా రీడ్ కాలేజీకి పేరుండేది. కళాశాల ఆవరణలోని ప్రతి పోస్టరూ అక్కడి విద్యార్ధుల చేతివ్రాతతో, చిత్రణతో ఎంతో అందంగా ముచ్చటగొలుపుతూ తయారయేది. కాలేజీ విద్యలేనికారణంగా మరే తరగతుల్లోను చేర వీలుపడక, ఈ కళ నేర్చుకోవాలనుకున్నాను. శరీఫ్ సాన్స్ శరీఫ్ అక్షర ఖతుల్ని అభ్యసించేను - వివిధ అక్షరాల స్వరూపం, వాటి మధ్యని జాగా సవరణతో అందమైన టైపు ఖతులను ఇంకా అద్భుతంగా కనబరిచేలా. సైన్సు వివరణకందని ఆ నైపుణ్యం అతి సుందరమూ చారిత్రాత్మకమూ మనోహర కళాత్మకమూ అయి, నాకెంతో అబ్బురమనిపించింది.
జీవితంలో వీటి ఉపయోగం గురించిన లేశమెత్తు అవగాహనా నాకు లేదు. కాని పదేళ్ళ తరవాత, మేము మొదటి మకింతోష్ కంప్యూటర్ రూపొందిస్తున్నప్పుడు ఇవన్నీ అక్కరకొచ్చాయి. ఆ ప్రావీణ్యాన్నంతా మ్యాక్ లో పొందుపర్చాము. అది ప్రపంచంలోనే అతి సుందర అక్షరాలున్న మొదటి కంప్యూటరుగా రూపుదిద్దుకుంది. నేనే గనక మొదటికాలేజీలో నాకు సరిపడని ఆ క్లాసులకి ఉద్వాసన చెప్పియుండకపోతే మధ్య పొందికైన జాగాతో సుందరమైన బహు విధాలైన అక్షరాలు మ్యాక్ సొంతమయేవి కావు. ఇంకా, విండోస్ కూడా మ్యాక్ని కాపీ కొట్టింది కనక, ఏ కంప్యూటర్లోనూ అవి కనిపించేవి కావు. మొదటి కాలేజీని వదలకుంటే క్యాలిగ్రఫీ క్లాసుల్లో చేరేవాడినీ కాను, కంప్యూటర్లకు సుందరమైన అక్షర క్రమమూ వుండేది కాదు. నిజమే, కాలేజీలో ఆడుగుపెట్టిన మొదటిరోజు ఎదటి చుక్కల్ని కలుపుతూ రాబోయే మజిలీలు చూడడం అసంభవమయింది కాని పదేళ్ళ తరవాత వెనక్కి చూసి అవే చుక్కల్ని కలిపితే దృశ్యం సుస్పష్టంగా కనిపిస్తోంది.
మళ్ళీ - ముందున్న చుక్కల్ని కలిపితే దృశ్యం అస్పష్టం; వెనకున్న చుక్కల్ని కలిపితే సుస్పష్టం. కనుక ప్రతీ ఒక్క చుక్కా భవిష్యత్తులో ఎదోవిధంగా కలిసి మీ జీవన ప్రయాణపు అర్ధాన్ని సరిగా వివరిస్తుందని మీరు నమ్మాలి. దాని పేరేదైనా పెట్టండి - సాహసం, తలరాత, జీవితం, కర్మ, ఇంకేదైనా - దాన్ని విశ్వసించాలి. ఈ అవగాహనా మార్గమూ నన్నెన్నడూ నిరుత్సాహానికి గురి చెయ్యలేదు. నా జీవితానికి మార్గ నిర్దేశనం చేసింది.
నా రెండో కథ అనురాగాలూ అనర్ధాల గురించి
నేను ఇష్టపడిందే నాకు జీవితంలో లభించడం నా అదృష్టం. నేనూ వోజ్ మా తల్లిదండ్రుల గ్యారేజీలో యాపిల్ని ప్రారంభించినప్పుడు నాకు ఇరవై యేళ్ళు. మొదట్లో మేమిద్దరమే ఉన్న యాపిల్ తరువాతి పదేళ్ళలో మేము పడిన కష్టానికి ప్రతిఫలంగా రెండు బిలియన్ డాలర్ల, నాలుగువేల ఉద్యోగుల సంస్థగా యెదిగింది. కిందటేడాదే, నా ముప్ఫయ్యో యేట, మేము మా అద్భుత సృష్టి - మ్యాకింతోష్ ను ఆవిష్కరించాము. నన్ను ఉద్యోగంలోంచి తప్పించేశారు. మనం పెట్టిన కంపెనీనించే మన్ని తప్పించెయ్యడమేంటి? అంటే, యాపిల్ మంచి వృద్ధి లోకి వస్తోందని ఇంకా పైకి తీసుకురావడంలో నాతో సహరించేందుకు ఒక ప్రజ్ఞాశాలిని నియమించుకున్నాను. మొదటి సంవత్సరం బాగానే నడిచింది. క్రమక్రమంగా భవిష్యత్తు గురించిన మా ఇద్దరి దృక్పథాలూ వేరుపడసాగి, ఇద్దరం ఎడమొహం పెడమొహమై, ఒకరు బయటికి పోవాల్సిన అగత్యం కలిగింది. మా డైరెక్టర్లు అతని పక్షం వహించేరు. అంటే ముప్ఫైకి నాకు ఉద్వాసన. అదీ బాహాటంగా. జ్ఞానమొచ్చిన నాటినించి ఏదయితే నా సర్వశక్తులకూ శ్రద్ధాసక్తులకూ కేంద్రమై ఉందో, అది తృటికాలంలో మాయమైపోయింది. జీవితమే తల్లకిందులైనట్టనిపించింది..
కొన్ని మాసాలపాటు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. నేను ముందరితరం ఔత్సాహిక వ్యవస్థాపకులను నిరుత్సాహానికీ భంగపాటుకీ గురిచేసేనని, వారసత్వంగా వారు నా చేత ఉంచిన రాజదండాన్ని సంబాళించలేక నేలపడేసేనని బాధపడ్డాను. ఈ పనికిమాలిన నిర్వాకానికి నన్ను క్షమించమని డేవిడ్ ప్యాకార్డ్ నీ బాబ్ నోయిస్ నీ వేడుకున్నాను. ఇంత బహిరంగంగా విఫలమైన నేను సిలికాన్ వ్యాలీనించే పారిపోదామనుకున్నాను. కానీ ఆ అంధకారంలో చిన్న వెలుగు రేక - అదేమంటే, నా పనంటే నాకు వల్లమాలిన ప్రేమ. యాపిల్ లో జరిగిన సంఘటనలవల్ల అదే మాత్రం చెక్కుచెదరలేదు. నేను తిరస్కరింపబడ్డాను, కానీ నా ప్రేమ అలానే వుంది. అందువల్ల మళ్ళీ మొదట్నించీ ప్రారంభిద్దామని నిశ్చయించుకున్నాను.
అప్పుడనుకోలేదు కానీ, యాపిల్ నించి నా బహిష్కారం నాకు ఎంతో ప్రయోజనకారి అయింది. విజయ సాధకుడిగా నెత్తికెత్తుకున్న పెనుభారం దింపేసుకుని ఎప్పుడేది ఎలా మళ్ళుతుందో అవగాహన లేని విద్యార్ధినై, తేలికపడ్డాను. నా జీవితంలో అత్యంత సృజనాత్మక దశలోకి స్వేచ్ఛగా అడుగుపెట్టేందుకు అది దోహదపడింది.
తరవాత అయిదేళ్ళలో నెక్స్ట్, పిక్సార్ అని రెండు సంస్థలు స్థాపించేను. ఆ దశలోనే నా భార్య కాబోయే అద్భుత స్త్రీమూర్తి సాహచర్యం కూడా లభించింది. ఇప్పుడు ఎంతో విజయవంతమైన యానిమేషన్ స్టూడియోగా నిలదొక్కుకున్న పిక్సార్ కంపెనీ, ప్రపంచంలోని ప్రప్రథమ కంప్యూటర్ యానిమేషన్ చిత్రం టాయ్ స్టోరీని నిర్మించింది. కొన్ని నాటకీయ పరిమాణాల దరిమిలా, యాపిల్ నెక్స్ట్ ని సొంతం చేసుకుంది. నేను మళ్ళీ యాపిల్ లో పడ్డాను. యాపిల్ ఇప్పటి పునరుజ్జీవన వైభవానికి నెక్స్ట్ సాంకేతికతే ఆయువుపట్టు. లౌరీనూ నేను ఒక అపురూప వైవాహిక జీవనాన్ని ఆరంభించాము.
యాపిల్ సంస్థ ఆనాడు నన్ను ఉద్యోగంలోంచి తీసెయ్యనట్టైతే ఇదంతా జరిగి వుండేది కాదని కచ్చితంగా చెప్పగలను. చేదు మాత్రే, కాని రోగికి అది అత్యవసరం. అప్పుదప్పుడు జీవితం ఇటికతో నెత్తిన బాదుతుంది. విశ్వాసం మాత్రం సడలనియ్యకండి. ఇన్నేళ్ళు నెగ్గుకు రాగలగడానిక్కారణం, నా పనంటే నాకున్న ప్రేమ అని నా నమ్మకం. మీకేది ప్రియమో మీరు వెదుక్కోవాలి. పనికీ ప్రణయానికీ కూడా ఇదే సూత్రం. జీవితంలో సింహభాగం పనిలోనే గడవాలి కనక, మనం చేసేది అత్యుత్తమమూ ఉన్నతమూ అని నమ్మి లీనమై పని చేసినప్పుడే జీవితం సంతోషంగాను సంతృప్తికరంగాను సాగుతుంది. చేసే పనిని ప్రేమించినప్పుడే అది అత్యుత్తమమూ ఉన్నతమూ అవుతుంది. ఇంతవరకు మీకది దొరక్కపోతే, అన్వేషణ ఆపకుండా చూస్తూనే వుండండి. సర్దుకుపోయి స్థిరపడిపోకండి. మిగతా అన్ని హృదయస్పందనల్లాగే, దాన్ని మీరు కనుగొన్నప్పుడు మీకు తెలుస్తుంది. మిగతా అన్ని బంధాల లాగే, ఆ బంధం కూడా కాలగతిలో బలపడుతూ వుంటుంది. కనుక దొరికేవరకు అన్వేషిస్తూనే వుండండి. సర్దుకుపోయి స్థిరపడిపోకండి.
నా మూడో కథ, మరణాన్ని గురించి.
పదిహేడేళ్ళప్పుడు ఎక్కడో ఒక వాక్యం చదివేను: "ఈ రోజే నీ మరణమనుకుని ప్రతిరోజు జీవిస్తుంటే ఒకనాటికి నువ్వనుకున్నది అయితీరుతుంది" అని. అది నా మనోఫలకం మీద చెదరని ముద్రవేసి, అప్పట్నించి, గత ముప్ఫై మూడేళ్ళుగా, ప్రతి ఉదయం అద్దంలోకి చూసుకుని ప్రశ్నించుకుంటుంటాను: "ఇది నా జీవితానికి ఆఖరి రోజైతే నేను చెయ్యాలనుకున్నది ఇప్పుడు నేను చేస్తున్నదేనా? " అని. ఎప్పుడైతే దానికి సమాధానం "కాదు" అని వరసగా కొన్ని రోజులపాటు వచ్చిందో, నేను దేనినో మార్చుకోవాలని నాకు తెలుస్తుంది.
సంవత్సరం క్రితం, నాకు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఉదయం యేడున్నరకి స్కానింగ్ లో క్లోమ గ్రంధిలో కణితిని కనుగొన్నారు. క్లోమమంటే యేమిటో కూడా నాకు తెలీదు. ఇది నయమవదని, మహా అయితే మూడు నించి ఆరు నెల్లు బతకొచ్చని డాక్టర్లు చెప్పేరు. మా డాక్టరయితే ఇంటికి పోయి నా వ్యవహారాలు చక్కదిద్దుకోమని సలహా ఇచ్చాడు; డాక్టర్ల పరిభాషలో దానర్ధం చావుకి సిద్ధపడమని. అంటే రాబోయే పదేళ్ళలో నా పిల్లలు ఏం చెయ్యాలో నేను రెండు మూడు నెలల్లో చెప్పేందుకు ప్రయత్నించాలి. నా తదనంతరం నా కుటుంబ సభ్యుల జీవితం వీలయినంత సాఫీగా జరిగేలా యేర్పాట్లు చెయ్యాలి. తుది వీడ్కోళ్ళు చెప్పుకోవడం ప్రారంభించాలి.
పరీక్షలూ సూచనలతో ఒక రోజంతా గడిచింది. ఆ సాయంత్రం ఒక జీవాణుపరీక్ష (బయాప్సీ) కోసం నా గొంతులోంచి పొట్ట ద్వారా పేగుల్లోకి ఎండోస్కోప్ సాయంతో ఒక సూదిని పంపి క్లోమగ్రంధి కంతి నించి కొన్ని కణాలు తీసేరు. నేను మత్తులో వున్నాను కాని తరవాత పక్కనే ఉన్న నా భార్య చెప్పింది - ఆ కణాలని మైక్రోస్కోప్ లో చూసి అది అరుదుగా వచ్చే క్లోమ క్యాన్సర్ అని, సులభ శస్త్ర చికిత్స తో నయం చెయ్యవచ్చని తెలిసి డాక్టర్లు ఆనందంతో యేడ్చారుట.
నాకు శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడు బాగానే ఉన్నాను.
చావుకి అతి దగ్గరగా నేను వచ్చిన సందర్భమిది. రాబోయే కొన్ని దశాబ్దాలవరకు ఇదే అతి చేరువైన సందర్భం అనుకుంటున్నాను. మరణం బుద్ధివిశేషానికి సంబంధించిన సహజ భావన అని ఇంతకు ముందు అనుకున్న నేను, ఇప్పుడు ఈ విధంగా దాన్ని అధిగమించిన అనుభవంతో ఇంకొంచం కచ్చితంగా ఇలా చెప్పగలను:
ఎవరూ మరణించాలనుకోరు. స్వర్గాన్ని కోరుకునేవారైనా దానికోసం చద్దామనుకోరు. అయినా సరే మరణం మనందరి ఉమ్మడి గమ్యం. దాన్నించి తప్పించుకున్నవారెవరూ లేరు. అదలాగే ఉండాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ దాన్ని కనుగొంటారు. జీవితంలో మార్పుకు చావే కర్త. అది పాతని తుడిచి కొత్తకి దారి యేర్పరుస్తుంది. ఈ నాడు మీరంతా కొత్త, కాని ఒకనాడు, అనతి కాలంలోనే, మీరూ పాతై పోయి తుదిచివెయ్యబడతారు. నాటకీయంగా ఉంటే క్షమించండి, కాని ఇది కఠోర వాస్తవం. మీకున్న సమయం పరిమితం కనుక ఇంకొకరి ప్రకారం జీవించి దానిని వృధా చేసుకోకండి. పడికట్టు సిద్ధాంతాల్లో చిక్కుకోకండి. అలా చేస్తే మీ ఆలోచనలు మీవి కాక వేరేవారివని అర్ధం. బయటివారి అభిప్రాయాల రొదలో మీ అంతః స్వరం మునిగిపోనివ్వకండి. మరీ ముఖ్యంగా, మీ మనసునూ స్వభావాన్నీ అనుసరించి పోయే ధైర్యం కలిగియుండండి. మీరెలా తయారవ్వాలని కలగంటున్నారో వాటికి మాత్రమే తెలుస్తుంది. ఇది తప్ప మిగిలినవన్నీ రెండో పక్షమే.
నా చిన్నతనంలో, సంపూర్ణ భూగోళ పట్టిక (The Whole Earth Catalogue) అనే పత్రిక వచ్చేది. మా తరం వారికి అది బైబిల్ లాంటిది. దాని రూపకర్త ఇక్కడి దగ్గర్లోనే ఉన్న మెన్లో పార్క్ నివాసి స్టీవర్ట్ బ్రాండ్. కవితాత్మకంగా అతను విషయాలను వర్ణించినప్పుడు అవి ప్రాణంపోసుకుని చదువరుల ముందు నడయాడేవి. ఇది 1960 ప్రాంతాల్లో, అంటే కంప్యూటర్లూ డీటీపీ సౌకర్యమూ రాకముందు. పత్రిక రూపకల్పనలో టైప్ రైటరు, కత్తెరలు, పోలరాయిడ్ కెమెరాలూ మాత్రమే వాడేవారు. ఇప్పటి గూగుల్ కి అది పుస్తక రూపమన్నమాట. గూగుల్ పుట్టుకకి ముప్ఫై ఐదేళ్ళ క్రితం ప్రాచుర్యంలోకి వచ్చినది. ఆ ఆదర్శపూర్వక పత్రికా ప్రయోగాన్ని అందుబాటులో ఉన్న సులభ ఉపకరణాలూ ఉన్నత భావాలతో రూపొందించేవారు.
స్టీవర్ట్ అతని బృందం సంపూర్ణ భూగోళ పట్టిక చాలా సంచికలు ప్రచురించారు. కొన్నాళ్ళకి దాని కాలం సమీపించి చివరి సంచిక విడుదల చేశారు. అది డెబ్భైల మధ్య కాలం, నేను మీ వయసులో ఉన్నాను. ఆ సంచిక వెనక అట్ట మీద ఒక ఫొటో - ప్రాతఃకాలంలో పల్లె బాట - మీరు సాహస యాత్రలు చేసినప్పుడు సాధారణంగా కనిపించే దృశ్యమది. దాని కింద ఇలా రాశారు: "ఆకొని యుండండి, మూర్ఖంగా ఉండండి " ( ) అని. పత్రిక మూసేస్తూ పంచుకొన్న వారి ఆఖరి మాటలవి. ఆకలితో వుండండి. అవివేకులై వుండండి. ఎప్పుడూ నేను అలాగే ఉండాలని నా కోరిక. మీరుకూడ పట్టభద్రులై జీవితాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మీకు చెప్పేదీ అదే. ఆకలితో వుండండి. అవివేకులై వుండండి.
మీ అందరికీ నా ధన్యవాదాలు.
No comments:
Post a Comment