ఒక మంచి నాటకాన్నో సినిమానో చూస్తున్నంతసేపు వాటిలోని ఉత్సాహ ఉద్వేగాలతో మనసు పొంగిపోయి మన జీవితంకన్న అవే వాస్తవమన్న అనుభూతిని కలిగిస్తాయి కద. ఒక చిన్న వేదిక, చిన్ని తెరల మీద చూపిన నటనే అంత ప్రభావవంతమైనప్పుడు అదే నటనని అంతకన్న పెద్ద వేదిక, పెద్ద తెర, మరింత ఉత్సాహభరితమూ ఉద్వేగభరితమూ అయిన జీవిత రంగం మీద విజయవంతంగా ప్రదర్శించడం ఎందుకు సాధ్యం కాదు? సాధ్యమేననిపిస్తుంది. వృత్తిరీత్యా నట శిక్షకుడినైన నేను వేదికమీదా వెండితెరమీదా ప్రతిభ చూపగోరిన ఎందరికో నటనా సూత్రాలని బోధించేను. బోధిస్తున్నకొద్దీ అవే సూత్రాలు నిత్యజీవనరంగానికీ వర్తించి పనికొస్తాయనే నమ్మిక కలిగింది. అయితే కపటవేషాలు కాక, నిజాయితీకలిగిన భావాల రూపకల్పనా, వాటి వ్యక్తీకరణలనలవర్చుకోవలసినదన్నది నా అభిప్రాయం.
ఒక విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ పేరొందిన ఒక నట శిక్షకురాలిని రప్పించి తన విద్యార్ధినులకు నటనలో శిక్షణనివ్వమని చెప్పి అన్నాడు: వారిని మీరు తారామణులుగా చెయ్యక్కర్లేదు, తమ భావోద్వేగాలని ఎలా అదుపులో పెట్టుకోవాలో నేర్పండి చాలు అని.
నిత్యజీవన్నాటకంలోని విభిన్న అంకాల్లో మన పాత్రలను మనసుపెట్టి శ్రద్ధగా సందర్భోచితంగా పోషిస్తే ఎంత సంతృప్తిగా వుంటుందో మనలో చాలా కొద్ది మందే గ్రహిస్తారు. సర్వ సాధారణంగా మనం ఒక అంకంలోని వడిని తీరునూ మార్చుకోకుండానే ఇంకో అంకం లోకి ప్రవేశించి దాన్ని అభాసుచేస్తాం. లేక, పోలిసంటే అతనేరా అని పేరుతెచ్చుకుని ఆ చట్రం నుండి బయటపడనిచ్చగించక అన్ని పాత్రలకీ పోలిసు నటనే చేసే నటుడిలా రసభేదం లేని నీరస ప్రదర్శన చేస్తాం.
ఆఫీసులో అందర్ని గడగడలాడించే సమర్ధుడైన అధికారి ఇంటికొచ్చినా ఆ చండశాసనపు వేషాన్ని తియ్యక భార్యాబిడ్డలమీద ఆ హుంకరింపు కొనసాగిస్తాడు. రంగమూ మారింది, పరిసరాలూ మారేయి కాని తన నటన తీరు మారదు. ఆఫీసు మీటింగులో కురవాల్సిన ఉరుములూ పిడుగులూ ఇంట్లో భార్య చక్కగా అమర్చిపెట్టిన భోజనం బల్లమీద కురుస్తాయి. తనకోసం ఇంట్లోవారు పడ్డ శ్రమని ఆప్యాయంగా హృదయపూర్వకంగా ప్రశంసించినప్పుడు ఆ మధుర సంసారంలో వెల్లివిరిసే ఆనందోత్సాహాలనూ అవి కలిగించే సాంత్వననూ అతను ఆ విధంగా చేజార్చుకుంటాడు.
అలా కాక గృహాంక రస సిద్ధికోసం ఆఫీసుకన్న విభిన్నమైన హావభావాలూ నటచమత్కృతీ ప్రకటించాలన్న స్పృహ అతనికుంటే కనక, ముందటి అంకంలోని కఠిన కఠోర ప్రవృత్తిని అక్కడే విడిచిపెట్టి సందర్భోచితమైన మృదు మధుర సంభాషణలూ ముఖకవళికలూ ఆహార్యమూ ధరించి తదనుగుణమైన ప్రదర్శన చేస్తే తనతో పాటు సహపాత్రధారులైన ఇల్లాలూ బిడ్డలూ కూడా స్పందిస్తారు, గృహమే స్వర్గసీమ అవుతుంది.
పరిస్థితి ఎటువంటిదైనా, దానిపట్ల తన కర్తవ్యం, పరిణామాలు క్షుణ్ణంగా బేరీజు వేసుకుని స్థిరంగా వ్యవహరించిన వారికి ఆ పరిస్థితి కలిగించే అనుభవం నిర్దుష్టం గాను మార్గదర్శకంగాను ఉంటుంది. గాలివాటుతో యధాలాపంగా అక్కడో అడుగేసి అక్కడేంచెయ్యాలో పాలుపోక ఉన్న అయోమయానికి మరింత గందరగోళం జోడించుకుని పోయే వాళ్ళతో పోలిస్తే.
రంగంలో ప్రవేశించే నటుడు ఆ అంకానికి సంబంధించినంతవరకు మాత్రమే తన పాత్రను పరిమితం చేసుకుని, దానికి సంబంధించని ఇతరవిషయాలన్నిటినీ మదిలోకి రానివ్వడు. జీవితంలో ఇది అలవడితే కృత్రిమమైన హడావిడీ, వ్యర్ధమైన చికాకులూ లేక, మనం ప్రదర్శించే అనురక్తిలో గాని అసహనంలో గాని నిజాయితీ వుంటుంది. అవి ప్రదర్శించేందుకు నటించనవసరం లేదు.
ముఖ్యమైన వ్యాపార నిర్వహణలో ఇంటి ఈతిబాధలు గుర్తొచ్చి మనసు లగ్నం తప్పినప్పుడు పైన అనుకున్న నటుడి ఏకాగ్రతని అవలంబిస్తే ప్రస్తుతం ఆవశ్యకంగా చేతిలో వున్న పనిమీదనే బుద్ధి నిలిచి వృద్ధికి దోహదపడుతుంది. ఈ అభ్యాసం వల్ల తెలుసుకునేది, మన పూర్తి వ్యక్తినీ వ్యక్తిత్వాన్నీ చేతిలో వున్న పనిమీదనే లగ్నం చేస్తే మరే యితర అసంబద్ధతలూ అప్రధాన విషయాలూ మనని చికాకుపెట్టవని.
అతిథి సత్కార భాగ్యం ప్రతి గృహిణికీ లభించే బంగరు అవకాశం. సమర్ధంగా అభినయిస్తే ఆ పాత్ర ఆకర్షణీయమైనదే. అయినా దాన్నించి మనసు మళ్ళించే వ్యాపకాలు ఎన్నింటినో పెట్టుకునే మహిళామూర్తులు కొందరుంటారు. ప్రణాళికకోసం వంటకోసం శక్తిని వెచ్చించి ఆతిథ్యం దగ్గర నీరసపడినవారు, అభ్యాగతులనుంచి ఎక్కువ మార్కులు కొట్టేసేందుకు అతి ప్రయాస పడేవారు, సంభాషణలోని పడికట్టు మాటలనీ సంప్రదాయ చిహ్నాలనీ మాత్రమే గుర్తుంచుకుని ఆతిథ్యపు అంతరార్ధాన్ని విస్మరించినవారు - ఇలా.
ప్రముఖ బ్రిటిష్ నటి డేం సిబిల్ మాటల్లో, రంగస్థలం ఎందుకు గొప్పదంటే, నిత్యజీవితంలోని ప్రతి చిన్న చర్యా వేదికమీద ఒక ప్రతీకగా రూపుదిద్దుకుంటుంది. కప్పుల్లో టీ పోసుకు తాగడమనే సాధారణ క్రియ స్నేహ రసపానంగా, ఆత్మీయ ఆతిధ్య ఆస్వాదనగా అభినయించబడుతుంది. రంగస్థలంలో ప్రకాశించే ఈ ప్రతీకాత్మతని జీవనరంగానికి అన్వయించి అభినయిస్తే లభించే ప్రతిఫలం అపారం.
అంతరంగంలో ఆవాహన చేసుకున్న ఇష్టమైన పాత్ర మన బయటి నడవడిలో తీసుకొచ్చే కొత్తదనం ఆశ్చర్యం గొలుపుతుంది.
నాకు బాగా గుర్తు, ఓసారి ఒక పార్టీకి నాకు ఆహ్వానం అందింది. సందర్భానికి అనువైన సూటు నా దగ్గర లేక వెళ్ళడం మానుకుందామనుకున్నాను. అంతలో నాలోని నటుడికి జ్ఞానోదయమై పైపై వేషం ఎలావుంటేనేం మనసుని కళాత్మకంగా అలంకరించుకుని ఆ రోజు నేను పోషించవలసిన అతిథి పాత్రని అత్యంత సమర్ధవంతంగా పోషిద్దామని నిర్ణయించుకున్నాను. అతిథేయుల నించీ ఇతర అతిథులనించీ నాకు లభించే ప్రశంసల గురించి ఆలోచించకుండా పాత్రని శ్రద్ధగా పోషించేను. ఆశ్చర్యం, అంతా ముగిసేసరికి అందరూ మెచ్చుకున్నది దేన్నో తెలుసా? నేను తొడుక్కున్న సూటుని.
సందర్భోచితమైన డాబుసరి దుస్తులకన్న సందర్భానుసారం ప్రదర్శించే అభినయమే ఉచితమూ ఉన్నతమూ.
ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్న చాలామంది అమ్మాయిలలో చూసేను, వారి శ్రద్ధంతా తమ దుస్తులమీదా అలంకరణలమీదా పెడతారు. నాకు చెప్పాలనిపిస్తుంది: "తల్లీ మీ ఇష్టం వచ్చిన డ్రస్సులు వేసుకోండి. అయితే ముఖ్యమైనది మీ పై వున్న దుస్తుల కన్న ఆ దుస్తుల్లో వున్న మీరు ఆశిస్తున్న ఉద్యోగానికి తగినట్టు వున్నారా లేదా అన్నది. అందుకోసం మీరేమిస్తారో మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసి స్పష్టంగా చెప్పండి - నైపుణ్యం, అనుభవం, విజ్ఞానం, అన్నిటిని మించి ఆ ఉద్యోగంపట్ల మీకుగల ఆసక్తి - ఇలా - ప్రతి మాటలోను శ్రద్ధనూ నాణ్యతనూ జోడించి - అపరాధభావన, అహంభావమూ లేకుండా.
పొందేందుకు ఎటువంటి లాభమూ లేని సందర్భాల్లో అయితే, నిత్యజీవితంలో చేసే నటప్రదర్శన ఒక ఉపయోగకరమైన వైరాగ్యభావనని కలిగిస్తుంది. మనసుపెట్టి చేసే నటన పక్షపాతరహితమై, సమభావమూ సరితూకమూ స్వీయనియంత్రణా ప్రకటించే మనం అన్ని పరిస్థితుల్లోను భాగస్వామిగా వుంటూనే, వాటినుంచి అటువైపు జరిగి చూడగలిగే సాక్షులుగా ఉండగలుగుతాం. పిచ్చాపాటీ బాతాఖానీలైనా, కుటుంబ సంభాషణలైనా వ్యాపార సమావేశాలైనా నిష్పాక్షికంగా మాటాడేవారికే పూర్తి స్వాధీనంలో వుంటాయి.
లగ్నంపెట్టి చేసే ఇట్టి నటనలోని నిస్వార్ధత ఏదైతే వుందో, అది రంగంలోని ఇతర పాత్రలను క్షుణ్ణంగా అర్ధంచేసుకొనేందుకు ఉపకరిస్తుంది. మనవరకే పరిమితం కాక ఇతర నట భాగస్వాముల పాత్రస్వభావాన్ని కూడా అర్ధంచేసుకుని ప్రదర్శించేదే నాణ్యమైన నటన. సహనటుల పాత్రస్వభావాన్ని అర్ధంచేసుకుని నటించడం అనే ఈ ప్రక్రియని అలవాటుగా మార్చుకోగలిగితే ప్రతిదినమూ నవవసంతమవుతుంది.
అబ్బే ఇవన్నీ కృతకాలు, అసహజాలు అని నిరసించేవారికి నా మనవి, అసలు మన జీవితమే కృతకము, అసహజమూ అని. మాట్లాడగలిగిన సామర్ధ్యం మనకి ప్రకృతిసిద్ధంగా వచ్చినది కాదు. అటువంటప్పుడు సందర్భోచితంగాను సమీచీనంగాను మాట్లాడటం అసహజమెలా అవుతుంది?
అలా మాట్లాడటం ఎవరినో అనుకరించడం అనుకోకండి. ఒక ప్రసిద్ధ నటి యొక్క రాజసం, లాలిత్యం, వర్చస్సు, సౌందర్యం ఆమె ప్రకటించే హావభావాల్లో ఉన్నాయనుకుని ఆ హావభావలే మనమూ అనుసరిద్దామనుకుంటే పొరపాటు. మన సహజ స్వభావాన్నే మన చేష్టలు మరింత మెరుగ్గా ఆకర్షణీయంగా ప్రకటించాలి.
అసలు ప్రక్రియ బయటి పాత్ర స్వభావాన్ని ధరించడంలో కాక లోని స్వభావాన్ని ఆవిష్కరించడంలో ఉంది. నిత్యం మనం చేసే భాషణలు, సంభాషణలు, నడత, సైగలు, రీతులు, ఆలోచనలు మరియు అనుభూతుల సరళి, ఇత్యాదులు మన అంతఃస్వభావాన్ని ఆకర్షణీయంగా వెల్లడిచేసే సాధనాలు కావాలి.
ఈ విధంగా జీవితంలో మీ పాత్రను సత్యం తోను, నిబద్ధతతోను, సమగ్రంగాను, నమ్మికతోను పోషించినప్పుడు మీ కంఠస్వరం, వాక్కు, నడకా, నిలబడేతీరు, సభ్యత, ముఖకవళికలు వంటివి మరింత మెరుగుపడి మీకు మరింత శోభను కలిగిస్తాయి.
పిగ్మేలియన్ అనే బెర్నార్డ్ షా రచనలో ఇట్టి ప్రక్రియకి వున్న పరివర్తన సామర్ధ్యం గురించిన ఈ విధంగా ప్రస్తావించారు: మీ వ్యక్తి మెరుగుపడకుండా మీ వాక్కు మెరుగుపడదు అని, భావ ప్రకటన మాటలద్వారానే కాక మరెన్నో ఇతరవిధాలుగా కూడా చెయ్యవచ్చనీ.
ఉదాహరణకి శరీర భంగిమ ఒక్కటే ప్రకటించగలదు - నేను అలిసి వున్నాను; నేను నిరుత్సాహంగా ఉన్నాను; నాకు ఎవరి ఖాతరీ లేదు; నేను చురుగ్గాను అప్రమత్తంగాను ఉన్నాను; నన్ను పిరికితనం ఆవరించింది; నేను అద్భుతంగా వున్నాను – అని.
నడక ప్రకటిస్తుంది: నా అడుగులతో భూమి దద్దరిల్లుతుంది; భూమి నా ఆటస్థలం; ఎదటి దారంతా సుదీర్ఘమూ కఠినమూ; దారిలోని అద్భుతాలనూ కళ్ళారా చూచే ఏ ఒక్క అవకాశాన్నీ నేను వదులుకోకూడదు.
ముఖం ప్రకటిస్తుంది: నేను డీలాపడిపోయేను; నీమీద నాకు ఆసక్తి వుంది; దిగాలు నా స్వభావం; నేను హాస్యాన్ని అభిమానిస్తాను - అని.
కంఠ స్వరం ప్రకటిస్తుంది: నాకు నోటి దురుసు; నేనో యేడుపుగొట్టుని; నాటొ మాట్టాడితే మీకెంతో భరోసా; నేనో చుంచుని; నేనో సింహాన్ని - అని.
ఈ జాబితాలలోని ఉన్నత లక్షణాలను ప్రకటించుకుంటూ ఆ ఆచరణలో మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకుని ఎదగడమా తద్వ్యతిరేకమైనవి ప్రదర్శిస్తూ తరగడమా అన్నది మన ఎంపిక. ఒక సందర్భోచితమైన పదమో వాక్యమో ఉపయోగించి వాతావరణాన్ని మెరుగుపరిచినంత ప్రభావవంతంగానూ, ఒకానొక భంగిమలో కూర్చుని మనం కోరుకున్న మనః స్థితిని పొందవచ్చు.
నటన సరళంగా ఉండాలి; అంటే చులాగ్గా తేలిపోయినట్టు కాదు. సరళతలో స్పష్టత, సంయమనము ఉంటాయి. జ్ఞానసంపన్నుని సంభాషణ సరళంగా ఉంటుంది; ధన సంపన్నుని వేషధారణ సామాన్యంగా ఉంటుంది; పేరొందిన వక్త మాట సాదాసీదాగా ఉంటుంది. పరిణతినందిన నటుని అభినయం సహజంగా నిష్కపటంగా ఉంటుంది. ఈ కౌశలం అతనికి శ్రమ, నిజాయితీల వల్ల లభించినది. అప్పటికప్పుడు తగిలించుకొన్నది కాదు. టక్కరితనం కాదు. మనలోని యదార్ధ వ్యక్తి యొక్క ఆవిష్కరణ అది.
అనుదినజీవితం మనచేత ఆడించే ప్రతి అంకంలోను ఈ సూత్రాలను అమలుచేయవచ్చు. అయితే ఆ అమలు సమర్ధమా తూతూ మంత్రమా, మనం పాత అలవాట్లు మనకి దారాలు కట్టి ఎలా ఆడిస్తే అలా ఆడే బొమ్మలమౌతామా, వివేకవంతులమై ప్రతి కొత్త దృశ్యాన్నీ సహపాత్రధారులను అర్ధంచేసుకుని తగినట్టు స్వంతంగా సమర్ధంగా అభినయించే నటసార్వభౌములమౌతామా అన్నదే ప్రశ్న.
మన భావాలు, ప్రతిస్పందనలు, తలపులు, అభిలాషలు నిర్మలంగాను హితకరంగాను ఆవిష్కరించే విధంగా మన సహజ తత్వపు అభివ్యక్తిని రూపుదిద్దుకొనడం మన లక్ష్యం కావాలి.
No comments:
Post a Comment