సన్ జూ సమర శాస్త్రము
ప్రాచీన చైనా యుద్ధ విద్యా విశరదుడు, తాత్వికుడు, రచయిత సన్ జూ రాసిన సమర శాస్త్రం అప్పటి కాలపు యుద్ధ తంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినదైనా, దాని భావాన్ని కేవలం సరిహద్దు పోరాటాల్లోనే కాక నిత్య జీవితంలో జరిగే ఉద్యోగ తంత్రం, వ్యాపార తంత్రం, సామాజిక తంత్రం వంటి శాంతియుత ప్రయోజనాలకు కూడ అన్వయించుకుని ఆచరించవచ్చన్నది అనుభవజ్ఞుల అభిప్రాయం.
దానికి స్వేచ్ఛానువాదం వినండి. అనువదించి చదివినవారు M V Suryanarayana
సన్ జూ వాక్యం: యుద్ధ కౌశలం రాజ్యానికి అత్యవసరం.
జీవన్మరణాంశమైన అది రాజ్యాన్ని సురక్షణ దిశగాగాని వినాశనం దిశగా కానీ తోడ్కొని పోయే రహదారి. విస్మరింపజాలనట్టిది.
రణక్షేత్రంలో యుద్ధ కౌశలం అయిదు ముఖ్య ప్రాతిపదికలననుసరిస్తుంది.
అవి:
నీతి
నింగి
నేల
నేత
నియమం
విపత్తులకు వెరవక, అసువులకు లెక్కచెయ్యక, రాజ్యక్షేమానికి పాటుపడమని నీతి బోధిస్తుంది.
రేయింబవళ్ళు, శీతోష్ణములు, ఋతుకాల చక్రాలు నింగి అధీనాలు.
దూరమా సమీపమా, పదిలమా ప్రమాదమా, బహిరంగమా ప్రచ్ఛన్నమా, బతుకా చావా అని నేల వెల్లడిస్తుంది.
వివేకము, నిజాయితీ, దయా, ధైర్యం, నిశ్చయం నేత లక్షణాలు.
సైన్యపు నడక, నడత, సంక్షేమం, హోదాలూ, సరకులూ సంబారాల సర్దుబాట్ల నిర్వహణ నియమానికి అధీనం.
ప్రతి సేనానాయకునికీ వీటి అవగాహన ఉండాలి. ఇవి తెలిస్తే విజయం, మరిస్తే పతనం.
కనుక, సైనిక పరిస్థితులను సమీక్షించేటప్పుడు, ఈ విధంగా పోల్చుకోవాలి.
ఒకటి: ఇద్దరు సార్వభౌముల్లో ఎవరి నీతి ప్రశస్తం?
రెండు: ఇద్దరు సేనానాయకుల్లో ఎవరు సమర్ధులు?
మూడు: నింగి, నేల ఎవరి పక్షానికి అనుకూలమై ఉన్నాయి?
నాలుగు: ఏ పక్షంలో నియమం నిష్కర్షగా ఉంది?
ఐదు: శక్తివంతమైనది ఏ సేన?
ఆరు : ఏ పక్షపు అధికారులు సైనికులు ఎక్కువ శిక్షణ పొందారు?
ఏడు: ఏ సేనలో సన్మానాలు, దండనలూ క్రమమబద్ధంగా, నిలకడగా అమలవుతున్నవి?
ఈ యేడు అంశాలూ సమీక్షించి జయాపజయాల అవకాశాన్ని నెను బేరీజు వేస్తాను.
నా మంత్రాంగానికి సానుకూలుడైన దళవాయి జయిస్తాడు. సేనలు అతని అదుపాజ్ఞలకు లోబడి నడచుగాక! దీన్ని వ్యతిరేకించిన సేనాపతి ఓటమి పాలవుతాడు. అట్టి వారు బహిష్కరింపబడుదురు గాక!
నా సూచనల బలిమికి తోడుగా, అదనంగా ఎటువంటి అనుకూల పరిస్థితులు ఎదురైనా వాటి సహాయాన్ని కూడా తోడు తీసుకుపోవాలి.
పరిస్థితులకనుగుణంగా ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలి.
యుద్ధంలో వంచన, మాయ అనివార్యం.
కనుక, దెబ్బతీయగలిగినప్పుడు, నిస్సహాయంగా కనిపించాలి; లంఘించే తరుణంలో చేష్టలుడిగినట్లు చతికిలబడిపోయినట్లు కనిపించాలి; శత్రువుకి అతిచేరువలో ఉన్నప్పుడు ఎంతో దూరంలో ఉన్నట్టు అనిపించాలి. ఎంతో దూరంలో ఉన్నప్పుడు అతిచేరువలో ఉన్నట్టు నమ్మించాలి.
శతృవుకి ఆశచూపేందుకు ఎరలు సిద్ధంగా ఉంచుకోవాలి. మన సేనలో అభిప్రాయభేదాలు, అవ్యవస్థా ఉన్నట్టు నమ్మించి అదను చూసి నలిపెయ్యాలి.
అతడు అన్ని వైపులా సురక్షితుడై ఉంటే రెట్టింపు సంసిద్ధులమై ఉండాలి; అధిక శక్తిమంతుడైతే తప్పుకు పోవాలి.
ప్రత్యర్ధి ఆవేశపరుడూ కోపీ అయితే రెచ్చగొట్టాలి; అతని అహన్ని పెంచేందుకు బలహీనులుగా నటించాలి.
అతడు కాస్త సడలి నెమ్మదిస్తే విశ్రమించే విరామం ఇవ్వకూడదు. కలిస్సున్న అతని బలగాలను ఎలాగోలా అనిక్యపరిచి విడగొట్టాలి.
అతను సన్నద్ధంగా లేని చోట దెబ్బ కొట్టాలి; అతనూహించనిచోట ప్రత్యక్షమవాలి.
ఈ విజయ సైనిక వ్యూహాలు ముదే వెల్లడించకూడదు.
ఒక యుద్ధాన్ని గెలవబోయే ముందు సేనాధిపతి ఇలాటి ఎన్నో లెక్కలు తన మస్తిష్కంలో వేసుకుంటాడు. ఓడిపోబోయే దళపతి ఇన్ని లెక్కలు వేసుకోడు.
కనుక, యుద్ధానికి ముందు ఎత్తులూ పై యెత్తులూ వ్యూహ ప్రతివ్యూహాలు ఎక్కువ గణించిన వారికి జయం, తక్కువ గణించినవారికి పరాజయం. అసలు బుద్ధే వాడనివారి సంగతి అడిగే పనిలేదు.
ఈ అంశాలను పరీక్షించి నేను ఒక సేన గెలుస్తుందో లేదో చెప్పగలను.
యుద్ధం:
సన్ జూ చెబుతున్నాడు: యుద్ధ ప్రక్రియలో ఒక వెయ్యి తేలిక రధాలు, అంతే సంఖ్యలో భారీ రథాలు, కవచాలు ధరించిన లక్షమంది కాల్బలం, వీరందరినీ ఐదొందల మైళ్ళు కొనిపోయేందుకు, ఇంకా వారి సంసారాల కర్చులు, అతిథులూ అభ్యాగతులు, రథాల రంగుల్లాంటి ఇతర చిల్లర మల్లర నిర్వహణ కలుపుకుని రోజుకి రెండువేల అయిదొందల తులాల వెండి అవుతుంది - ఇది లక్షమంది సైనికుల రోజువారి కర్చు.
పోరాటంలో ఆయుధాలు మొద్దుబారడం, కవచాలు చివికిపోవడం జరుగుతుంది. ఒక పట్టణాన్ని అధీనంలో తెచ్చుకోవాలంటే ఈ బలగాన్నంతా వినియోగించాలి.
యుద్ధం కాల పరిమితి పెరిగితే అందుకయ్యే కర్చును ప్రభుత్వం ఇక ఏ మాత్రం భరించే స్థితిలో ఉండదు.
ఇలా ఆయుధాలు మొద్దుబారి కవచాలు చివికిపోయి భరించే స్తోమత సన్నగిల్లినప్పుడు వైరి పక్షం అదే అదునుగా విజృంభిస్తుంది. అటువంటప్పుడు ఎంత ప్రతిభావంతుడైన సేనానీ రాబోయే ప్రతికూలతను నివారించలేడు.
అందువల్ల, యుద్ధంలో తొందరపాటూ పొరపాటు తెలివి హీనమే గాని, ఎక్కువ కాలయాపనం తెలివైన వ్యూహమేమీ కాదు.
సమరాన్ని సాగదీసి లాభపడిన రాజ్యమెక్కడా లేదు.
యుద్ధపు అనర్ధాన్ని కూలంకషంగా అర్ధం చేసుకున్నవారే దాన్ని లాభసాటిగా నడిపించగలరు.
నేర్పరి ఐన సైనికుడు రెండో కేటాయింపు కోరడు; అతని వాహనంలో రెండు సార్లకు మించి ఆయుధాలు భర్తీ చేసే అవసరం ఉండదు.
యుద్ధ సంబారాలని ఇంటి నుంచి తెచ్చుకోవాలి, కాని అందినకాడికి శత్రువు నించి లాక్కు తినెయ్యాలి. అప్పుడే సేనకి నిలకడైన మనుగడ.
ప్రభుత్వ ఖజానా నీరసపడితే దూరంగా పోరాడే సేన కర్చును బయటి నుంచి సమకూర్చుకోవలసి ఉంటుంది. ప్రజలు పేదలై బలహీనులవుతారు.
సేనే కనక రాజ్య సమీపంలో ఉంటే ధరలకు రెక్కలొస్తాయి. పౌరుల దగ్గర ఉన్నది కాస్తా ఊడ్చుకుపోతుంది. బడుగు రైతులు అప్పుల పాలైపోతారు.
సామాన్యుల సంపాదనంతా హరించుకుపోయి వీధినపడతారు. అదే సమయంలో విరిగిపోయిన రధాల మరమ్మత్తులు, అలిసిపోయిన గుర్రాలను మార్పిడి, వక్ష స్త్రాణాలు, శిరస్త్రాణాలు, ధనువులు, శరాలు, బల్లేలు, డాళ్ళు, రక్షణ కవచాలు వంటివి సమకూర్చే పనిలో ప్రభుత్వం పడుతుంది.
అందువల్ల తెలివైన సైన్యాధ్యక్షుడు కర్చులన్నీ శత్రువునుంచి రబట్టుకోవాలి. శత్రువు నించి లాక్కున్న ఒక బండీ సరుకులు మన సొంత బండ్లు ఇరవైతో సమానం. ఒక లెక్క గ్రాసం మన ఇరవై లెక్కల గ్రాసంతో సమానం.
శత్రువును మట్టుబెట్టాలంటే మనవారిలో కోపం రగిలించాలి. శత్రుపరాజయం లాభసాటి అయితే సైనికులకు బహుమానాలివ్వాలి.
రథ యుద్ధంలో పది రధాలను శత్రువుల నుంచి లాక్కుంటే మొదటి రథాన్ని లాక్కున్న సైనికుడికి బహుమానం ఇవ్వాలి. శత్రువు జెండాల స్థానంలో మన కేతనాలు ఎగరాలి. ఆ రథాలను మన రథాలతో కలిపి పోరాడాలి. బందిలైన శత్రు సైనికుల పట్ల దయ, గౌరవం చూపి వారికి భద్రత కల్పించాలి.
ఈ విధంగా వైరి బందీలతో మన బలగం బలపడుతుంది.
సమరంలో సత్వర సాఫల్యమే మన సర్వస్వం కాని సాగతీత కాదు.
అందువల్లనే, తన రాజ్యానికి శాంతిని కానీ సంకటాన్ని కానీ సముపార్జించగల సమర్ధుడైన సేనా నాయకుని చేతిలో పౌరుల యోగక్షేమాలు ఉంటాయంటే అతిశయోక్తి లేదు.
వ్యూహత్మక దాడి
సన్ జూ అన్నాడు: సిసలైన యుద్ధ నైపుణ్యం అంటే శత్రుదేశాన్ని పూర్తిగాను, చెక్కుచెదరకుండాను స్వాధినం చేసుకోవడం; దాన్ని ఛిన్నాభిన్నమూ నాశనం చేస్తే ప్రయోజనం లేదు. శత్రు సైన్యం విషయమూ ఇంతే; ఏ మాత్రం విచ్ఛిన్నం చెయ్యకుండా సైన్యాన్నంతనూ స్వాధీనపర్చుకోవడం ప్రయోజనకరం. ఒక శిబిరానికీ, కూటమికీ కూడా ఇదే వర్తిస్తుంది.
కనుక పోరాడి శత్రువును జయించి పొందిన దాని కన్న పోరాడకనే వైరిని నీరుగార్చి కైగొన్న విజయమే ఘనమైనది.
కనుక వైరి పక్షపు ప్రణాళికలు తెలుసుకొని ధ్వంసం చెయ్యగల, తరువాత స్థానంలో శత్రు సైన్యం కదలికలు కట్టడిచెయ్యగల సైనికాధికారులే ఉత్తములు; సమర సీమలో బలగాలను నడిపే ప్రత్యక్స పోరాట యోధులది వీరి తరువాతి స్థానమే; ఆకర్న వచ్చేది ఎవరయ్యా అంటే, సర్వనాశనమైపోయిన పట్టణాలను స్వాధీనపర్చుకునే పేరుగొప్ప యోధులు.
కనుక ధ్వంసమైపోయిన పట్టణాలను స్వాధీనపరుచుకొనే ఆలోచన చెయ్యరాదు. వాటి పౌరల పునరావాసం, పోషణ వంటివాటికో మూణ్ణెల్లు, శిథిలాల కుప్పలు తొలగించేందుకు ఇంకో మూడు నెల్లూ పడుతుంది.
తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోలేకపోయిన సైన్యాధిపతి చీమల గుంపుల్లా తన బలగాలను ఉరికిస్తే, అందులో మూడో వంతు మంది చస్తారు, కానీ పట్టణం మాత్రం స్వాధీనంలోకి రాదు. పట్టణాలపై దాడి చేసి స్వాధీనంచేసుకునే ప్రక్రియలో సంభవించే విపత్తు ఇది.
తెలివైన నాయకుడు ఎక్కువ పోరాటమూ సైన్య నష్టమూ జరక్కుండా శత్రు సైన్యాన్ని లోబరచుకుంటాదు; ఎటువంటి భౌతిక దాడీ లేకుండా పట్టణాలను స్వాధీన పరుచుకుంటాడు. ఎక్కువ ప్రయాసా రణరంగమూ రక్తపాతమూ లేకుండా వైరి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాడు.
తన సైన్యమూ బలమూ చెక్కుదరక, అతడు శత్రు సార్వభౌమత్వాన్ని అదురూ బెదురూ లేకుండా ప్రశ్నిస్తాడు. తన పక్షమ్నుంచి ఎట్టి ప్రాణనష్టమూ లేకుండా శత్రు రాజ్యం తన సొంతమవుతుంది. ఇదే వ్యూహాత్మక దాడి.
యుద్ధంలో మన వైపు పది మందీ ప్రత్యర్ధి పక్షంలో ఒక్కరూ ఉంటే, అతడిని చుట్టుముట్టాలి; ఇటు ఐదూ అటు ఒకరూ అయితే దాడి చెయ్యాలి; మనకన్న రెట్టింపైతే మన సైన్యాన్ని రెండు దళాలుగా మార్చాలి.
రెండు వైపులా సమమే అయితే, ప్రతిఘటనకు సిద్ధమని సూచించాలి; మన వైపు కొద్దిగా తక్కువైతే ప్రతిఘటన నివారించే ప్రయత్నం చెయ్యాలి; బాగా తక్కువైతే పారిపోవాలి.
కనుక, యుద్ధ ప్రారంభం తక్కువ బలగాలతో అయినా, దాని ముగింపు ఎక్కువ బలగం ఉన్న వైపు మొగ్గుతుంది.
అందుకని సైన్యాధ్యక్షుడు రాజ్యానికి ప్రహరీ వంటివాడు. అతని సామర్ధ్యం మీదనె రాజ్యం బలపడినా బలహీనపడినా.
ఒక పాలకుడు మూడు విధాలుగా తన ప్రజకు దుఃఖాన్ని కలిగిస్తాడు.
ఒకటి: సైన్యం తన ఆదేశాన్ని పాటించగలిగే స్థితిలో ఉన్నదో లేదో గ్రహించలేక వారిని ముందుకు ఉరకమని గానీ వెనక్కి తగ్గమని కానీ శాసించడం. ఇది సైన్యానికి గందరగోళం కలిగిస్తుంది.
రెండు: పరిస్థితులలోని వైరుధ్యాన్ని గ్రహించక ప్రభుత్వాన్ని నడిపే తీరుగానే సైన్యాన్ని నడప ప్రయత్నించడం. ఇది సైనిక అశాంతిని కలిగిస్తుంది.
మూడు: సైనిక వ్యూహ నిబంధనలపై అవగాహన లేక తనకిష్టమైన వారిని సైనికాధికారులుగా మియమించడం. ఇది సైనికుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది.
ఎప్పుడైతే సైన్యం అలజడితోనూ అశాంతితోనూ రగిలిపోతుందో, అప్పుడు అదనుకై వేచియున్న సామంతులకు విజృంభించే అవకాశం కలుగుతుంది. దీంతో సైన్యంలో అరాచకం ప్రబలి రాజ్యం పరహస్తగతమవుతుంది.
కనుక విజయానికి అయిదు ఆవశ్యకాలను మనం తెలుసుకోవాలి:
ఒకటి: ఎప్పుడు పోరాడాలో, ఎప్పుడు కూడదో తెలిసి వ్యవహరించేవాడు జయిస్తాడు.
రెండు: ప్రత్యర్ధి బలవంతుడైతే ఎలా వ్యవహరించాలో, బలహీనుడైతే ఎలా వ్యవహరించాలో తెలిసినవాడు జయిస్తాడు.
మూడు: పెద్దా చిన్నా తారతమ్యం లేకుండా తన సైన్యం యావన్మంది లోను విజయకాంక్ష నిరంతరంగా రగిలించేవాడు జయిస్తాడు.
నాలుగు: తాను సర్వ సన్సిద్ధుడై ఉండి ప్రత్యర్ధి పరాకుపడే అదనుకోసం ఓపిగ్గా వేచియుండేవాడు జయిస్తాడు.
ఐదు: అనవసర ప్రభుత్వ జోక్యం లేకుండ తన సైన్యం పై సర్వ స్వతంత్ర నియంత్రణ ఉన్న దళపతి జయిస్తాడు.
అందుకే అంటారు:
తననూ వైరిని తెలిసినవారికి ప్రతి సమరమునందును జయమే జయము;
వైరిని తెలియక తననే తెలిసిన, జయాపజయములు సమముగ కలుగు;
తానేమో తన శత్రువులేమో తెలియని వారికి జయము పూజ్యము.
అని.
వ్యూహ విన్యాసాలు
సన్ జూ అంటున్నాడు: ప్రాచీన యోధులు శతృ దాడికి అవకాశంలేని స్థానాల్లో తాముండి అవకాశం దొరికిన తక్షణం ప్రత్యర్ధులపైకి లంఘించేవారు.
శత్రు దాడికి అందుబాటులో లేకుండా సురక్షితమైన స్థానంలో వేచి యుండే పని మనదయితే, మనం ఎదురుచూసిన విధంగా అందుబాటులోకి వచ్చి ఓటమి పాలయే పని శత్రువుది.
గొప్ప యోధునికి తన సురక్షిత స్థానం నిశ్చయమే కాని శత్రు రాక, ఓటమి నిశ్చయం కావు.
అందుకే అంటారు: ఏదెలా చెయ్యాలో తెలిసినా ఏదీ చెయ్యలేని పరిస్థితి అని.
ఆత్మరక్షణకైన నేర్పు ఓటమినించి మనకు రక్షణనిస్తే, అదను చూసి చేసిన దాడి ఓటమిని ప్రత్యర్ధికి ప్రసాదిస్తుంది.
ఆత్మరక్షణార్ధమైనది అసంపూర్ణ శక్తి స్వరూపం; లంఘించి చేసిన దాడి ప్రచండ శక్తి స్వరూపం.
ఆత్మరక్షణా కుశలుడైన సైన్యాధిపతి మంటి నిగూఢ గహ్వర రహస్యాల్లో అదృశ్యుడవగలిగినట్లు, ఆక్రమణా కుశలుడు మింటి తేజస్సులోంచి పిడుగులు వర్షించగలుగుతాడు.
ఒకరి చేతిలో మన రక్షణ భద్రమై ఉంటే, ఇంకొకరు ఆ భద్రతను జయప్రదంగా శాశ్వతం చేస్తారు.
అందరూ చూసి గుర్తించగలిగే సమీప దూరం నించే విజయాన్ని గుర్తించగలగుట ఘనత కాదు.
సర్వం ఒడ్డి పోరాడి జయించి ప్రపంచ ప్రశంసలు అందుకొనుట ఘనత కాదు.
సూర్య చంద్రులను చూడగలిగుట నిశిత దృష్టి కాదు; మేఘ గర్జనను ఆలకించగలుగుట గొప్ప వినికిడి కాదు;
అనాయాస విజయాన్ని అలవాటు చేసుకొన్న ఘనుని ప్రాచీనులు మహా యోధునిగ కీర్తించారు.
ఎన్ని విజయాలు సాధించినా, తానొక ప్రతిభావంతుడు, శౌర్యసంపన్నుడు అనే ప్రతిష్ట, గుర్తింపులను అతను గణింపడు.
సదా అప్రమత్తమైన మనశ్శరీరాలతో అతను పోరు సల్పి గెలుస్తాడు. ఏమరుపాటు లేక జాగరూకులై ఉన్నవారికే విజయం నిశ్చయమై ఉంటుంది, ఎందుకంటే అది అప్పటికే పరాజితుడైన ప్రత్యర్ధిని మన స్వాధీనునిగా స్థిరపరుస్తుంది.
కనుక సమర్ధుడైన యోధుడు తాన పరాజయాన్ని అసాధ్యం చేసుకొని ప్రత్యర్ధిని చిత్తుచేసే ఏ చిన్న అవకాశాన్నీ వృధాచెయ్యక సద్వినియోగపరచుకునేవాడు.
పరిపూర్ణ గుణసంపన్నుడైన నాయకునికి రణనీతి సహజ ప్రవృత్తి అయి, కౌశలమూ క్రమశిక్షణా నిత్య విధులై ఉంట చేత, విజయాన్ని విజయావకాశాల్ని సమర్ధంగా నియంత్రిస్తాడు.
సైనిక వ్యూహ రచనలో మొదటిది అంచనా; రెండవది బలగాల పరిమాణం; మూడవది పథక రచన; నాల్గవది అవకాశాల బేరీజు; ఐదవది, గెలుపు.
వీటిలో అంచనా మంటి (లేదా, భూమి) పరిస్థితులపై ఆధార పడి వుంటుంది; బలగాల పరిమాణం ఈ అంచనాను అనుసరించి వుంటుంది; పథక రచన బలగాల పరిమాణం పైన, అవకాశాల బేరీజు పథక రచన పైన, ఆఖరుగా గెలుపు అవకాశాల బేరీజు పైన ఆధారపడి వుంటాయి.
ఓటమిపాలైన సైన్యం త్రాసులో ఒక గింజ యెత్తైతే, గెలిచినది అంతకు వెయ్యింతలు.
జయించే బలగాల శౌర్యం వెయ్యి గజాల లోతునించి ఆకాశంలోకి ఉరకలు వేస్తూ చిమ్మే జలధార వంటిది.
శక్తి, సామర్ధ్యం
సన్ జూ అంటున్నాడు: సేన చిన్నదైనా పెద్దదైనా నియంత్రణకి ఒకటే సూత్రం: పెద్దగుంపుని తగినన్ని చిన్న గుంపులుగా విడగొట్టడం.
శత్రు సేన చిన్నదైనా పెద్దదైనా పోరాటానికి ఒకటే సూత్రం : చిహ్నాలు, గుర్తులు ఏర్పాటు చేసుకోవడం.
ప్రత్యర్ధి దాడి ఎంత తీవ్రమైనా మన పక్షం చెక్కుచెదరకుండా ఉంచేవి ప్రత్యక్ష ప్రచ్ఛన్న జిత్తులు, పన్నుగడలు కలిపిన మెరుపువంటి కదలికలు.
మనని ఢీకొన్న శత్రు పక్షం గుండ్రాతిని ఢీకొన్న గుడ్డు కావాలంటే ఇరువైపుల్లోను ప్రబలులెక్కడ దుర్బలులెక్కడ అన్న శాస్త్రోక్తమైన పరిజ్ఞానం కావాలి.
అన్ని యుద్ధాల్లోను దాడి ప్రక్రియలో ప్రత్యక్ష వ్యూహం, దాన్ని విజయం దిశగా మళ్ళించేందుకు పరోక్ష వ్యూహము అవలంబించాలి.
తెలివిగా ప్రయోగించిన పరోక్ష తంత్రాల సామర్ధ్యం భూమ్యాకాశాలవలె అపరిమితం, సతతమూ ప్రవహించే జీవనది వలె అవిచ్ఛిన్నం, మాయమైనట్టనిపించినా పునః ప్రత్యక్షమయే సూర్యచంద్రుల వలె నిత్య నూతనం; తిరిగొచ్చేందుకే వెళ్ళే ఋతుచక్రం వలె పునరావృతమూ.
స్వరాలు ఏడే. కాని వాటి ప్రస్తారంలో రూపుదిద్దుకునే రాగాలు లెక్కకందనన్ని.
రంగులు ఏడే. కాని వాటి కలయికలో ఆవిష్కృతమయే వర్ణాలు లెక్కకందనన్ని.
రుచులు ఆరే. కాని వాటి మిళాయింపులో ఘుమఘుమలాడే పరిమళాలు లెక్కకందనన్ని.
యుద్ధంలో ప్రత్యక్ష చర్య, పరోక్ష చర్య అని రెండే మార్గాలు. కాని వీటిని కలిపి పన్నిన వ్యూహ గతులు అనంతం.
ప్రత్యక్ష పరోక్ష వ్యూహాలు ఒకదాని వెన్నంటి మరోటి ఉంటాయి. చక్రభ్రమణం వలె వాటి గమనం అనంతం. వాటి కలయికలో జరిగే అద్భుతాలను సంపూర్ణంగా ఆవిష్కరించగలవారెవ్వరు?
కదిలే సైన్యపు వడి, తన దారిలోని రాళ్ళను కూడా నునుపు చేయ్యగల నదీ ప్రవాహమంత శక్తిమంతమైనది.
సమర సీమలో తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు తృటిలో గతిని మార్చి ఎరను పరిమార్చే డేగ కదలికలా అనూహ్యమూ నిశితమూ.
సిసలైన యోధుని భుజబలం ప్రబలమూ, బుద్ధికుశలత సమయోచితమూ.
శక్తి ఎక్కుపెట్టిన ధనువైతే యుక్తి, తృటిలో శరాన్ని వదిలే మీట.
యుద్ధపు కోలాహలం, గందరగోళాలు చూసినప్పుడు అక్కడో పద్ధతీ క్రమమూ లేక అస్తవస్తంగా అనిపించినా ఆ కనిపించే అవ్యవస్థ నిజం కాదు; ఆ హడావిడిలో చెల్లాచెదరిన సైన్యం దిశా దెసా లేనట్టనిపించినా అది పరాజయాన్ని నిరోధించే అడ్డుగోడ.
పథకం ప్రకారం ప్రదర్శించే కోలాహలం అత్యుత్తమ క్రమశిక్షణకి ప్రతిరూపం. అలాగే భయ ప్రదర్శన శౌర్య లక్షణం. బలహీనులా అనిపించే నటన లంఘించేందుకు సిద్ధంగా ఉన్న శక్తి మారు రూపం.
అందుకని క్రమశిక్షణకి గందరగోళపు ముసుగు తగల్చాలి. ధైర్య శౌర్యాలకు భయపు బురఖా దిగెయ్యాలి. శక్తిని బలహీనత పరదావెనక కమ్మి వుంచాలి.
శత్రువు ను ప్రలోభపెట్టేందుకు పన్నాగపు ముల్లుకు త్యాగపు ఎర తగిలించి అతడు దాన్ని కొరికేంతవరకు తక్కి తారి అప్పుడు బుట్టలోకి దించాలి.
అతణ్ణి అవిశ్రాంతంగా ఆడించేందుకు ఒకటి తరవాత ఒకటిగా టక్కు టమారపు ఎరలు చల్లుతూనే వుండాలి.
తెలివైన యోధుడు ఒకరిద్దరి ప్రయోజకత్వం పై కాక, మొత్తం సేన సమిష్టి సాఫల్యం పై దృష్టి పెడతాడు.
అతని దక్షత సమర్ధులను ఎంపిక చేసుకుని వారి వైయక్తిక శక్తిని కూడగట్టి సేన ఉమ్మడి శక్తిగా మార్చే తీరులో ఉంటుంది.
కలిసికట్టుగా ఉమ్మడి శక్తితో కదిలే పోరాట యోధులు అతివేగంతో కిందకి దొర్లే మహావృక్షపు దూలాలు, బండరాళ్ళవలె అనిరుద్ధులై దూసుకుపోతారు.
మహాశిలలు కొండకిందికి జారే కొద్దీ వాటి ధాటి నిలువరించలేనంత తీవ్రమైనట్టు, సమిష్టి శక్తితో సాగే సేన పరాక్రమం అంతకంతకు తీక్ష్ణమౌతూ అరివీర భయంకరమై తేజరిల్లుతుంది.
బలాలు బలహీనతలు
సన్ జూ అంటున్నాడు: సమరభూమికి ముందు చేరుకుని సన్నద్ధులై శత్రువుకై నిరీక్షించేవారికి యుద్ధ కీలకాలు అనుకూలిస్తాయి; ఆలస్యంగా వచ్చి హడావిడిగా ఆయుధాలు అందుకున్నవారు తడబడి అవకాశాలు చేజార్చుకుంటారు.
అందువల్ల ప్రజ్ఞావంతుడైన యోధుడు తన సంకల్పాన్ని శత్రువు ద్వారా నెరవేరుస్తాడు తప్ప శత్రు సంకల్పానికి ఎటువంటి అవకాశమూ ఇవ్వడు.
అన్ని అనుకూల్యతలను తన అధీనంలో ఉంచుకుని శత్రువే స్వయంగా తన సమీపానికి వచ్చేలా చూస్తాలి. లేదా, శత్రువు అడుగుతీసి అడుగు వెయ్యలేనంత గట్టి నష్టాన్ని కలిగిస్తాలి.
ఎక్కడ ప్రతిఘటించేందుకు శత్రువు తడబడతాడో, అక్కడ వేచి ఎదుర్కోవాలి. శత్రువు ఊహించని ప్రదేశంలో మెరుపులా ప్రత్యక్షమవాలి.
శత్రు జాడలేని దారిన సేనలు సుదీర్ఘ ప్రయాణాలు అనాయాసంగా చెయ్యగలవు.
కాపలా బలహీనంగా వున్న శత్రు స్థావరాలను గుర్తించగలిగి అక్కడ దెబ్బ తియ్యాలి. పటిష్ట రక్షణతో స్థావరాలను దుర్భేద్యం చేసుకొన్న మనం, ఆ రక్షణ చెక్కుచెదరకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
ఎదురుదాడినించి తప్పించుకొనే అవకాశమియ్యక, అదను దొరికినా ఎక్కడ ఎలా కొట్టాలో తెలీని అయోమయంలో శత్రువు పడేలా తన స్థానాన్ని దుర్భేద్యం చేసుకొన్న సేనాని సమరకుశలుడు.
గోప్యమూ కాపట్యమూ అనే దివ్య కౌశలాల ప్రభావమేమని చెప్పవచ్చును. వాటి సాయంతో మనం కనబడని, వినబడని వారమై శత్రువు జాతకాన్ని మన గుప్పిట్లో ఉంచుకోగలము.
వైరి పక్షం ఆయువుపట్లు తెలిస్తే మన ధాటికి అడ్డుండదు. మన కదలికలు ప్రత్యర్ధి కదలికల కన్న చురుకైతే విజయం త్వరగా కైవసమై అటుపై ఏ ప్రమాదమూ ప్రయాసా లేని ప్రశాంత జీవనంలో సేద తీరవచ్చు.
మనకి యుద్ధ కాంక్ష కలిగినప్పుడు, ఏ అపాయమూ లేని దుర్భేద్యమైన కోటలో హాయిగా విశ్రమించే శత్రువు తప్పనిసరిగా పోరుకి దిగేలా రెచ్చగొట్టాలి. అదెలా అంటే, వారి ఇంకో ముఖ్య స్థావరం మీద దాడి చేసి గాభరా పెట్టి అతను తన సురక్షిత ప్రాంతం నుండి కదలక తప్పని పరిస్థితి కలిగించడం ద్వారా.
మనకి యుద్ధకాంక్ష లేనప్పుడు, పగతో రగిలే శత్రువు మార్గంలో కొన్ని అప్రధానమైన తాయిలాలు ఒదిలెయ్యడం ద్వారా అతని దృష్టి మనపై పడకుండా మళ్ళించి యుద్ధాన్ని నివారించుకోవాలి.
వైరి సేనల అమరిక క్షుణ్ణంగా తెలిసి, ప్రచ్ఛన్న వ్యూహాలతో అదృశ్యులమైనప్పుడు మన బలగాలను కేంద్రీకరించుకుని విపక్షులను విడగొట్టగలుగుతాము.
అప్పుడు మనం కూడికతో ఒక్కటవగా, ప్రత్యర్ధులు అనేక భాగాలవుతారు.
ఏకమైన ఒక అఖండ శక్తి చీలికలైన ఇంకో అఖండ శక్తిని ఢీకొన్నప్పుడు చీలిన పక్షంలోని ప్రతి ఒక్క శకలానికీ ఒక్కొక్క అఖండ శక్తితో తలపడుతున్న అనుభవం కలుగుతుంది.
అంటే, ప్రతి శక్తిహీనుడూ ఒక్కొక్క మహా శక్తిమంతుని ఢీకొన్నట్టన్నమాట. పర్యవసానం ఓటమే కద.
మనం దాడిచెయ్యాలనుకున్న ప్రదెశం గోప్యంగా ఉంచాలి; అలా చేస్తే శత్రువుకి ఎక్కడ కొట్టాలో తెలియక చాలాచోట్ల ప్రయత్నించి బలహీనపడతాడు. చివరికి అసలు స్థానంలో మనని ఎదుర్కొనే సమయానికి వారి బలగం నీరసపడి యుంటుంది.
ఎందుకంటే శత్రువు తన దళం ముందు బలపరుచుకుంటే వెనకది బలహీన పరుచుకుంటాడు; అలాగే వెనకా ముందూ; కుడీ ఎడమ, ఎడమా కుడీ. సేననంతనూ బలపరిచే ప్రయత్నంలో అది మొత్తం బలహీనపడుతుంది.
సన్నద్ధంగాలేక పోరుకి దిగక తప్పనివారిపై ఎన్నో బలహీనతలు ఎదురౌతాయి; అదే సర్వ సన్నద్ధులమై ప్రత్యర్ధిని కవ్వించినప్పుడు ఎన్నెన్నో బలాలు మన పక్షానుంటాయి.
జరగబోయే పోరు స్థలమూ సమయమూ తెలిసినప్పుడు బహుదూరమ్నుంచే సేనను సమాయత్తపరిచి పైచేయి సాధిస్తాము.
కాని స్థలమూ సమయమూ తెలీనప్పుడు కుడివైపు వారు ఎడమవైపువారికీ ఎడమవైపువారు కుడివైపువారికీ సహాయపడలేక, ముందు వారు వెనకవారిని వెనకవారు ముందువారినీ ఆదుకోలేక అయోమయంలో పడతారు. ఒకట్రెండు మైళ్ళ పరిథిలో ఉన్న సేనకే ఇటువంటి పరిస్థితి అయితే పది మైళ్ళ మేర వ్యాపించి ఉన్నవారి అవస్థ అడగాలా.
వైరి సేనలు మనకన్న సంఖ్యలో అధికమైనా, వారి వ్యూహాలను విజయావకాశాలను పసిగట్టి ఎత్తుకు పైయెత్తులు వేస్తే వారు రణభూమిని వదలిపోవచ్చు.
కవ్వించి, బులిపించి, వారి కార్యాచరణ పథకాన్ని, కీలకాలను వారినోటనే పలికించాలి.
అప్పుడు మనను వారిని బేరీజు వేసి వారూ మనమూ ఎందులో అధికులము, ఎందులో బలహీనులము అని లెక్కవెయ్యాలి.
వ్యూహక్రమాల రచనలో అత్యున్నతమైనది వాటిని రహస్యంగా ఉంచడం; వాటి జాడ గూఢచారుల జిత్తులకు, వైరి మేధావుల కుతంత్రాలకు చిక్కకుండా వ్యూహాలనూ కదలికలనూ గుప్తంగా ఉంచాలి.
శత్రు వ్యూహ సహాయంతో మనకి జయమెలా సాధ్యం? అనేది చాలామందికి అర్ధం కానిది.
జయించేందుకు నేను చూపే మెళకువలు అందరికీ తెలిసేవే కాని జయాన్ని సాధ్యం చేసిన నా వ్యూహమేమో ఎవరికీ తెలీదు.
ఒక విజయాన్ని సంపాదించిపెట్టిన ఎత్తుగడలు ఇంకోమారు వాడకూడదు. మీ ఎత్తుగడలు మీ చుట్టూ సంభవించే అనేక పరిస్థితులకనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోవాలి.
నీటి ప్రవాహం తనను ఆటంకపెట్టే ఎత్తు వైపుకి కాక అనుమతించే పల్లంవైపుకి పారినట్టు, యుద్ధ తంత్రం వైరి పక్షంలోని సత్తువున్న దళాలను కాక దుర్బల లక్ష్యాలను ముందుగా ఛేదిస్తాయి.
తను పారే ప్రదేశానికనుగుణంగా నీరు దారిచేసుకుపోతుంది. అలాగే సైనికుడు ప్రత్యర్ధి స్పందనకనుగుణంగా తన శైలిని మార్చుకుంటూ పోవాలి.
కనుక ప్రవహించే నీటికి స్థిరమైన ఆకారం లేనట్టే, యుద్ధ తంత్రంలో స్థిరమైన వ్యూహమని ఏదీ ఉండదు.
శత్రువు ఎత్తులకనుగుణంగా తన పై ఎత్తులను నిరంతరమూ సర్దుబాటు చేసుకునేవాడే యోధాగ్రేసరుడు.
అయిదు మూల పదార్ధాలైన నీరు, నిప్పు, చెట్టు, ధాతువులు, భూసారాల ప్రాబల్యం సమానంగా ఏ ఋతువులోనూ ఉండదు. నాల్గు ఋతువులూ ఒకదానివెనక ఒకటి వీటిని పరిపుష్టం చేస్తుంటాయి. దివారాత్రాల నిడివి ఎప్పుడూ సమానంగా ఉండదు. పెరుగూ తరుగూ చంద్రునికి కూడా తప్పవు.
యుద్ధ తంత్రం
సన్ జూ చెప్పాడు: సైన్యాధ్యక్షుడికి యుద్ధపు ఆదేశాలు సార్వభౌముని నుంచి వస్తాయి.
ఒక సేనని సేకరించి సమీకరించిన అతడు, పటిష్టమైన దళ నిర్మాణానికై వివిధ పరికరాల, కౌశలాల కూర్పుకు శ్రీకారం చుడతాడు.
అటు పిమ్మట వ్యూహ రచన మొదలవుతుంది. యుద్ధ తంత్రంలో ఇది అతి క్లిష్టమైనది. దాని ప్రయాసంతా దళంలోని అవకతవకలు సరిచేసి దిశా నిర్దేశం చెయ్యడం, ప్రతి ప్రతికూలతనీ ప్రయోజనంగా మార్చడంలో వుంది.
ప్రత్యర్ధులు మనకన్నా ముందు బయలుదేరినా, వారిని తప్పుదారి పట్టించి అతి లాఘవంగాను అవలీలగాను వారికన్న ముందు ఒక సుదూర గమ్యాన్ని చేరుకోగలగడం ఓ విశేషమైన ఉల్లంఘన కళ.
ఏకమైన పెద్ద సేన చేసే తంత్రమూ మాయోపాయమూ ప్రయోజనకారులు; సేనలో క్రమశిక్షణ లోపిస్తే కనక, ప్రమాదకారులు.
అయితే సేనంతా అన్నీ సమకూర్చుకుని పటాటోపంతో లక్ష్యాల మీదకి దండెత్తాలంటే సకాలంలో చేరడం కష్టం. అలాగని సేననించి ఒక చిన్న దళాన్ని విడగొట్టి పంపితే వారు తమకు వలసిన సంబారాలూ సరంజామా ఇక్కడే వదలి వెళ్ళాల్సివస్తుంది.
సుదూరాన ఊరిస్తున్న ఒక ప్రయోజనం సాధించాలని చెప్పి సేనని చొక్కాలు మడతపెట్టి రెట్టింపు వేగంతో ఓ యాభయ్యో అంతకన్న ఎక్కువో ఉరకలెత్తిస్తే ఆ ఆరాటంలో కొందరు దళపతులను నష్టపోయే అవకాశం ఉంది.
బలహీనులు ఈడిగలబడుతూ అనుసరించగా బలశాలులు దూసుకు పోతారు. ఫలితంగా సేన మొత్తంలో ఓ పదో వంతు మాత్రం అనుకున్న చోటికి అనుకున్న సమయంలో చేరుకోవచ్చు.
ప్రత్యర్ధి మీద పైచేయికని అతనికన్న రెట్టింపు వేగంతో పోతే సగం మంది మాత్రమే గమ్యం చేరవచ్చు. ఈ ఉరకల్లో సంబారాలూ సరంజామా వెనకే ఉండిపోయి జరుగుబాటు కష్టమవుతుంది.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవలసింది ప్రత్యర్ధి మనసులో ఏముందో గ్రహించక వారితో పొత్తులు కూడదు.
భూతలం మీది కొండ కోనలు, వాగు వంకలు, మిట్ట పల్లాలు, చెట్టు చేమల పూర్తి అవగాహన లేకుండ సేనను నడిపించే ప్రయత్నం ప్రమాదకరం.
మనకి దారి చూపేందుకు స్థానికంగా ఎవరూ దొరకనప్పుడు ప్రకృతే మన మార్గదర్శి కావాలి. నేలమీద అంత అవగాహన ఉండాలి.
యుద్ధంలో కల్లా, కపటమూ మాత్రమే విజయాన్నిచ్చేవి.
సేనలను సమీకరించడమా విభజించడమా అనెది పరిస్థితులననుసరించి జరగాలి.
పొందిక చిట్టడవిలా చిక్కగా, కదలిక సుడిగాలిలా చురుగ్గా ఉండాలి.
అనలమై కమ్మాలి; అచలమై నిలవాలి.
కటిక చీకటి వలె చొరవీలులేని వ్యూహము, పిడుగుపాటువలె లేవవీలులేని ప్రహారమూ కావాలి.
దోచిన సంపద మందితో పంచుకోవాలి; ఆక్రమించిన భూమిలో సేనకోసం శిబిరాలు నిర్మించాలి.
ప్రతి కదలికా బాగా యోచించిన పిదపే జరగాలి.
ఊహించని కదలికల మెరుపువీరునికి విజయం అనుకూలిస్తుంది. తంత్ర విద్య అదే.
సేనా నిర్వహణ గ్రంథం ఇలా చెబుతుంది: సమరసీమలో మాట వినికిడి తగ్గుతుంది ; అందుకే భేరీ శంఖ మహానాదాలు; చూపు కూడా మసకబారుతుంది; అందుకే ధ్వజాలు, పతాకాలు, కేతనాలు.
భేరీ శంఖనాదాలు, ధ్వజ పతాకాలు సైనికుని గురిని నిర్దుష్ట లక్ష్యంపై కేంద్రీకరించే సాధనాలు.
అనేకం అలా ఏకమైతే, శూరుడి పరాక్రమమైనా భీరువు పలాయనమైనా ఒంటరిగా ఎలా సాధ్యం. ఇదే బహుళజన నిర్వహణా కౌశలం.
సైన్యం కళ్ళకు చెవులకు రాత్రి యుద్ధంలో అయితే నెగడు వెలుగులు ఢంకా ధ్వనులు, పగటి యుద్ధంలో అయితే ధ్వజాలు పతాకాలు లక్ష్యనిర్దేశం చెయ్యాలి.
ఒక సైన్యపు స్థైర్యం నీరుగారిపోవచ్చు; ఒక సేనానాయకుని ఏకాగ్రత చెదరిపోవచ్చు;
సైనికుని స్థైర్యం ఉదయాన్న ఉత్తేజభరితమై, మధ్యాహ్నానికి సడలి, సాయంత్రానికి శిబిరం చేరి విశ్రమించే ధ్యాసలో ఉంటుంది.
తెలివైన దళపతి, అందుకనే, సేన మహోత్సాహంలో ఉన్నప్పుడు పట్టించుకోక, అది తగ్గి ఇంటి బెంగలోకి దిగగానే రంగంలోకి దుమికి చైతన్యాన్నీ రణస్ఫూర్తినీ రగిలించ ఉద్యుక్తుడౌతాడు. ఇది చిత్తవృత్తులను అవగతం చేసుకునే కళ.
క్రమశిక్షణతో నిశ్చలుడై, ప్రశాంతుడై, ప్రత్యర్ధి సేనలో గలభా గందరగోళాల జాడ కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తూ, అది గమనించిన మరుక్షణం కొదమ సింహంలా లంఘించడం; ఇది ఆత్మ నియంత్రణా వైదుష్యం.
శత్రువుకన్న ముందు లక్ష్యానికి చేరువ కావడం, ఆపసోపాలుపడుతూ లేస్తూ అడుగులేస్తున్న శత్రువును విశ్రాంతంగా నిశ్చలంగా కన్నార్పకుండా గమనిస్తూండటం, శత్రువు మలమలమాడుతుంటే తాను మాత్రం తగినంత సుష్టుగా భుజించి యుద్ధ సన్నద్ధుడు కావడం - ఇది స్వకీయ బల పరిరక్షణా కౌశలం.
శత్రువు ధ్వజమూ పతాకమూ ఉన్నతంగా ఠీవిగా ఎగురుతున్నప్పుడు, శత్రు సైన్యం ఉమ్మడిగా క్రమశిక్షణతో ఆత్మవిశ్వాసంతో నడుస్తున్నప్పుదు వారిని ఎదుర్కొందామనే కోరికను అదుపులో పెట్టుకోవడం - ఇది పరిస్థితుల అవగతం చేసుకునే కళ.
శత్రుసైన్యం ఎత్తులో ఉన్నప్పుడు కిందనించి గాని, వారు కిందకి దిగుతున్నప్పుడు అడ్డుపడి కాని ఎదుర్కొనడం మంచిది కాదని యుద్ధ తంత్రం చెబుతుంది.
శత్రువు పారిపోజూస్తున్నట్టు అభినయించినా, ఆగ్రహావేశంలో ఉన్నా ముందుకురుకుట దుస్సాహసం.
శత్రువు ఆశ చూపించే ప్రలోభాలకూ ఎరలకూ పడరాదు; ఇంటికి తిరిగొస్తున్న సేనతో పెట్టుకోకూడదు.
ఒక సైన్యాన్ని చుట్టుముట్టిన పక్షంలో, ఒక బయటి దారి వదిలిపెట్టాలి.
తెగించిన ప్రత్యర్ధిని కవ్వించకూడదు.
ఇది సమరతంత్ర కౌశలం.
ఎత్తుగడల్లో భిన్నత్వం
సన్ జూ అంటున్నాడు: సేనాపతి యుద్ధపు ఆదేశాన్ని సార్వభౌముని నుంచి అందుకుని సేనను సరంజామాను సమీకరించుకుని కార్యాచరణ రూపొందిస్తాడు.
సత్సంబంధాలు లేని రాజ్యాల్లో శిబిరాలు లేపకూడదు. ఇతర ప్రాంతాలను కలిపే విశాల రహదారుల కూడళ్ళు ఉండే రాజ్యాలతో పొత్తు కలపాలి.
సేనకు దూరంగా, ఏకాంత పరిసరాల్లో ఎక్కువ సమయం గడపకూడదు.
మనతో స్నేహంలేని సేనలు చుట్టు ఆవరించినప్పుడు తెలివినీ పన్నుగడనీ ఆశ్రయించాలి. విధిలేని పరిస్థితుల్లో యుద్ధం చెయ్యాలి.
అనుసరించకూడని మార్గాలు, ఎదిరించకూడని సేనలు, ఆక్రమించకూడని నగరాలు, పోటిపడకూడని హోదాలు, పాటించకూడని రాజాజ్ఞలు ఉంటాయి.
సమయానుకూలంగా ఎత్తుగడలు మార్చుకుంటే కలిగే ప్రయోజనాలు క్షుణ్ణంగా తెలిసిన దళపతికి తన సేనని సమర్ధంగా ఎలా నడిపించాలో తెలుస్తుంది.
ఈ కౌశలం లేనప్పుడు అతనికి తన పరిసరాలమీద ఎంత పరిజ్ఞానమున్నా, దానిని కార్యాచరణకి ఎలా వినియోగించాలో తెలియక అవస్థ పడతాడు.
ఎత్తుగడలను సమయోచితంగా మార్చుకొలేని సమర శాస్త్ర విద్యార్ధి, ఇంతకు ముందు తెలిపిన అయిదు విజయావశ్యకాలు ఔపోసన పట్టినా, తన సేనలను సమర్ధంగా నడిపించలేడు.
కనుక, వివేకవంతుడైన నాయకుని వ్యూహాలలో అనుకూల ప్రతికూలతల నాణ్యమైన మేళవిపు ఉండాలి.
మన అనుకూలతలకు ఈ విధమైన మిళాయింపుతో పదును పెడితే మన ఆశయసాధన సంభవమవుతుంది.
అలా కాక, ఎటువంటి ప్రతికూలతల మధ్యా కూడా ఎదో ఒక ప్రయోజనాన్ని ఒడుపుగా చేజిక్కించుకోవాలనె మనస్తత్వం ఉంటే దురదృష్టం మనని అంటదు.
పెద్ద నష్టం కలిగించో, పోరాటం దుర్భరం గావించో, నిరంతరం శ్రమ కల్పించో, దుష్ట సేనానుల సంఖ్య తగ్గించాలి; అవసరమైతే ఎరలు, ప్రలోభాలు ఆశ చూపాలి; మనం అనుకున్నప్పుడు వాళ్ళు ఉరికేలా పరిస్థితులు కల్పించాలి.
శత్రువు రాడనే ధీమాపై కాక ఎవరెప్పుడొచ్చినా సిద్ధం అనే మన సన్నద్ధతపైన, ఒచ్చినా అతడేమీ చెయ్యలేడనే ఊహల కన్న ఎవరూ దెబ్బతియ్యలేనంత పటిష్టంగా మన స్థానాన్ని తయారుచేసుకునే మన కార్యదీక్షపైనే ఆధారపడాలని సమరశాస్త్రం బొధిస్తుంది.
సేనానాయకులు చేసే అయిదు అతి ప్రమాదకర తప్పిదాలు ఇవి:
ఒకటి : నిర్లక్ష్యం : ఇది వినాశనకారి
రెండు : పిరికితనం : ఇది పట్టిస్తుంది
మూడు: క్షణికావేశం : ఇది స్వల్పకారణానికే రెచ్చిపోయి చచ్చిపోయే తత్వం.
నాలుగు: విపరీత స్వాభిమానం: ఒక స్వల్ప నిందావాక్యానికే చావో రేవో అని ప్రేరేపిస్తుంది.
ఐదు: సేనల పట్ల అనవసర అనురక్తి: ఈ తత్వానికి చింత, కష్టం ప్రతిఫలాలు.
ఈ లక్షణాలూ ఉన్న సేనాపతి సేనను సక్రమంగా నడపలేడు.
ఏ సేనైతే తరిమికొట్టబడి దాని నాయకుడు మరణిస్తాడో, దాని వెనక కచ్చితంగా ఈ ఐదింటిలో ఎదో ఒక కారణం ఉండి తీరుతుంది. కనక వాటిని నిర్లక్ష్యం చెయ్యక నిరంతరం ఆత్మ పరిశీలన చేసుకుని బయటపదాలి.
కదిలే సైన్యం
సంజూ అంటున్నాడు: ఇప్పుడు మనం శిబిరాలు స్థాపించి శత్రువు జాడ కోసం ఎదురుచూచే ప్రక్రియలో ఉన్నాం.
కొండలూ ఎత్తులూ వడివడిగా దాటాలి; లోయల్లో మాటువెయ్యాలి.
ఎత్తైన స్థలాల్లో సూర్యునికభిముఖంగా శిబిరాలు ఏర్పాటు చేసుకోవాలి; కాని పోరుకోసం మాత్రం పర్వతాలనధిరోహించరాదు. ఇది పర్వత యుద్ధ తంత్రం.
ఒక నదిని దాటిన తరవాత అతి త్వరగా దానినుంచి వీలైనంత దూరం పోవాలి.
ప్రత్యర్ధి సైన్యం నది దాటుతూ పోయేటప్పుడు, వారిపై దాడిచేసేందుకు తొందరపడరాదు. సగం మందిని మనని దాటిపోనిచ్చి అప్పుడు దాడి ప్రారంభించాలి.
యుద్ధం చెయ్యాలని మీకు మరీ ఉబలాటం ఉన్నప్పుడు, నదిని దాటే తొందరలో ఉన్న ప్రత్యర్ధితో తలపడరాదు.
శత్రువునెదుర్కొనేందుకు, ప్రవాహంలో మీ నావ అతని నావకన్న ఎత్తులో ఉండాలి. తలపడేందుకు ఏటికెదురీది పోరాదు. ఇది నదీ యుద్ధ తంత్రం.
ఉప్పునీటి చిత్తడి నేలలో మీ లక్ష్యం ఒకటే కావాలి. దాన్నించి వీలైనంత త్వరగా బయటపడటం.
అటువంటి నేలల్లో పోరు సంభవిస్తే, మీకు సమీపంలో నిరు ఎత్తైన గడ్డీ ఉండాలి; వీపుకి వెనక దట్టమైన చెట్లు ఉండాలి. ఇది, ఉప్పునీటి చిత్తడి నేలల రణ తంత్రం.
పొడి నేలలు, మైదానాల్లో, సమరక్షేత్రాన్ని సులువుగ చేరుకునే మార్గాన్ని ఎంచుకోవాలి; మనకి కుడిపక్క, వెనకపక్క నేల ఎత్తుగా ఉండాలి. అప్పుడు ప్రమాదం ముందట, క్షేమం వెన్నంటి ఉంటాయి.
ఇది మైదాన రణక్షేత్రాల కిటుకు.
ఈ నాలుగు కీలకాలూ ఆకళింపుచేసుకుని ఎందరో ప్రాచీన సార్వభౌములు చాలా యేళ్ళపాటు అజేయులుగా నిలిచారు.
అన్ని సైన్యాలు పల్లం కన్న ఎత్తును, రాత్రికన్న పగటిని యుద్ధానికి ఇష్టపడతాయి.
కాని సేనను సమర్ధంగా నడపగలిగేవారికి అన్ని పరిస్థితులు దారి ఇచ్చి జయానికి దోహదపడతాయి.
ఒక మెట్ట మీద, లేక ఎత్తైన గట్టు మీద యుద్ధం సంభవిస్తే బాగా వెలుగు ప్రసరించేచోట, కుడి వైపు వెనగ్గా పల్లం వచ్చేలా సర్దుకోవాలి. అప్పుడు మీ సేనకి తమ శౌర్యంతోపాటు ప్రకృతి ప్రయోజనాలు కూడా సహకరిస్తాయి.
ఎగువన బాగా వర్షాలుపడిన కారణంగా మీరున్నవైపుకు నది నురగలు కక్కుతూ ఉరకలేస్తూ పారినప్పుడు, దాని ఉధృతి తగ్గే వరకు వేచి యుండాలి.
మధ్య వడిగా పారే నదీ ప్రవాహాలు కలిగిన ఏటవాలు కొండకొమ్ములు, లోయల అగాధాలు, ఇరుకు సందులు, దట్టంగా అల్లుకున్న పొదల డొంకలు, చితచితలాడే రొంపులు, బీటలు, వంటి వాటిని నివారించుకోవాలి; పొరపాటున అడుగుపెట్టినా అతి త్వరగా నిష్క్రమించాలి.
వాటినించి బయటపడి, శత్రువు అందులోకి చొరబడేలా యుక్తి పన్నాలి; వాటి సమీపంలో పోరు సల్పాల్సి వస్తే శత్రువు వీపు వైపు ఆ దిక్కుమాలిన పరిసరాలు వచ్చేలా అతణ్ణి నెట్టాలి.
మన శిబిర పరిసరాల్లో కొండ ప్రాంతాలు, దట్టంగా పెరిగిన గడ్డి నిండిన నీటి గుంటలు, రెల్లు చిక్కగా అల్లుకున్న మడుగులు, చిక్కని కలుపుతో నిండిన చిట్టడవుల వంటివి ఉంటే వాటినన్నిటినీ కూలంకషంగా గాలించాలి; ఎందుకంటే ఇవన్నీ కపట చార చోరులు సులభంగా నక్కే ప్రాంతాలు.
శత్రువుకి మనం అందుబాటులో ఉన్నా అతను ఏ చర్యకీ ఉపక్రమించటం లేదంటే దానర్ధం, అతడు తనుండిన స్థానబలానికి ప్రకృతి సహకారం తీసుకుంటున్నట్టు.
అతడు దూరానికి తొలిగి అక్కణ్ణించి కవ్విస్తున్నాడంటే అర్ధం, మననించి మొదటి ఎత్తుని కోరుకుంటున్నట్టు.
అతడు సులభంగా అందుబాటులోకి వచ్చి నిలిస్తే, ఏదో ఎరను మనకోసం పన్ని వుంచాడన్నట్టు.
అడవిలో చెట్ల కదలిక శత్రువు ఆగమనాన్ని సూచిస్తుంది; దట్టమైన గడ్డి మధ్య అవతలేదుందో కనబడని మరుగులూ ధూళి మేఘాలు శత్రువు మనకి అనుమానాన్నీ ఉత్కంఠనీ పెంచేందుకైన ఎత్తుగడలు.
ఎగిరే పక్షులు ఉన్నట్టుండి మరింత ఎత్తుకు ఎగరేయంటే కింద దొంగదెబ్బ కోసం మాటు వున్నట్టు.
వన్యప్రాణులు అటూ యిటూ పరుగులు తియ్యడం ఆకస్మిక దాడి జరగబోతోందని సూచన.
దూరాన ధూళి పైకి రేగిందంటే రథాలూ, పక్కలకి రేగితే కాల్బలమూ ఇటు వస్తున్నట్టు. అది అటో కొంత, ఇటో కొంత రేగితే ఏ వంట చెరకు కోసమో సైన్యం అటూ ఇటూ పోతున్నట్టు. పైకీ పక్కలకీ రేగుతూ తగ్గుతూ ఉంటే ఎవరో శిబిరాలు ఏర్పాటుచేసుకుంటున్నట్టు.
శత్రువు మాటలో మార్దవం, పనిలో చురుకుదనం ఉంటే మనమీద దాడి చెయ్యబోతున్నట్టు. పరుషపదజాలం, ఎగిరెగిరుపాటు అంటే పలాయనానికి సిద్ధమన్నట్టు.
తేలికపాటి రథాలు సేన ముందుకి, అటుపక్కా ఇటుపక్కా చేరి నిలిచేయంటే వారు యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టు.
ఎటువంటి ప్రమాణమూ ఒడంబడికా లేకుండా శాంతి ప్రతిపాదన వస్తే దానివెనక కుట్ర వున్నట్టు.
సేనలో అలజడి కలిగి సైనికులు వరసలు కడుతున్నారంటే వైరి సైన్యం ఆఖరి వ్యూహాస్త్రాన్ని అమల్లో పెట్టినట్టు.
కొందరు ముందుకొస్తూ కొందరు వెనక్కెళుతూ ఉంటే అది పన్నిన ఎత్తుగడ, విసిరిన ఎర.
సేనలు బల్లేల ఊతంతో నిలుచుంటే, వారు ఆకలితో నీరసించినట్టు.
నీరు తెచ్చేందుకు పురమాయించబడ్డ వారె నీరు తాగుతుంటే వారు దాహార్తితో బాధపడుతున్నట్టు.
అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు విముఖులైతే, వారు బాగా శోషించి ఉన్నట్టు.
శిబిర పరిసరాల్లో పక్షులు గుమిగూడితే, అది ఖాళీగా ఉన్నట్టు. రాత్రుళ్ళు కూతలు, కేకలు వినవస్తే పిరికితనం, నైరాశ్యం ఆవహించినట్టు.
శిబిరంలో అలజడీ, అల్లరీ వినవస్తే సేనాపతి నాయకత్వం బలహీనమన్నట్టు. జండాలు, ధ్వజాలూ తొలిగిపోతుంటే రాజద్రోహ కార్యకలాపాలు జరుగుతున్నట్టు.
అధికారులు ఆగ్రహంతో కేకలేస్తుంటే, సేన సోలిపోయి ఉన్నట్టు.
ఉన్న గుర్రాలు ధాన్యాన్ని మేస్తూ, సైనికుల ఆహారం కోసం మిగతా జంతువులు చంపబడుతూ, రగిలే నెగళ్ళపై వంటపాత్రలు కానరాక, సైనికులు శిబిరానికి మరలి వచ్చే సూచనలు లేవంటే అర్ధం, వారు వారి ఆఖరి పోరాటానికి సిద్ధపడ్డట్టు.
సేన ఒకరితో ఒకరు గుససలాడుకుంటూ, జట్లు కట్టుకుంటూ స్వరం తగ్గించి మాట్లాడుకుంటూంటే వారిలో ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లుతున్నట్టు.
బహుమతులు మరీ తరచుగా ఇచ్చుకుంటూంటే వారి వనరులు తగ్గిపోతున్నట్టు; శిక్షలు మరీ ఎక్కువైతే శిబిరం యావత్తూ దురవస్థలో ఉన్నట్టు.
బడాయిగా ఆరంభించినా, ఈవలి సేనను చూచినంతనే నీరుగారి బెదరిపోతే అవసరమైన బుద్ధి విశేషం లెనట్టు.
ప్రశంసలు, ప్రసన్న వచనాలతో దూతలు వస్తే శత్రువు సంధి కోరుకుంటున్నట్టు.
శత్రు సైనికులు మనదిశగా దూసుకు వచ్చి దీర్ఘ కాలంపాటు కోపంతో మనని చూస్తూ యుద్ధమూ చెయ్యక, అక్కణ్ణించీ వెనకడుగూ వెయ్యకుంటే మనం చాలా జాగరూకత, సావధానత కలిగియుండాలి.
మన బలగం అవతలి బలగం సరిసమానమైతే అది సముచితం. ప్రత్యక్ష యుద్ధానికి ఎవరూ పాల్పడకుండా అది కాచుతుంది. మనం చూసుకోవాల్సిందల్లా దాని రక్షణ, వివిధ దళాల పరస్పర సహకారం, వైరిపక్షం మీద ఏమరుపాటులేకుండా ఓ కన్నేసి వుంచడం.
వైరి పక్షాన్ని తక్కువ అంచనా వేసి తగినంత ముంచుచూపు కొరవడినవాడు వారికి చిక్కడం ఖాయం.
సేనకి మనతో బంధం బలపడక ముందే వారికి శిక్షలు విధిస్తే తరువాత వారికి నాయకత్వం పట్ల విధేయత ఉండదు; అవిధేయులు అప్రయోజకులు; అలాగే, విధేయులైన సైనికులకు అవసరాన్ని బట్టి తగిన శిక్షలు అమలు చెయ్యకనట్లైతే వారూ అంతే అప్రయోజకులవుతారు.
కనుక ఆరంభంలో సైనికుల పట్ల సౌమ్యంగా వ్యవహరిస్తూనే, కఠోర క్రమశిక్షణతో అదుపులో ఉంచాలి. ఇలా చేస్తే సైన్యానికి విజయం తథ్యం.
అసలు శిక్షణలో భాగంగా శాసన విధేయత కూడా సైనికులకు అలవాటు చేస్తే వారికి అలవడే క్రమశిక్షణ యోగ్యమూ శ్రేయస్కరమూ అవుతుంది. లేకుంటే లేదు.
సేనాపతి తన సైన్యం శక్తియుక్తులను పూర్తిగా విశ్వసిస్తూనే వారిని తన ఆజ్ఞానుసారం వర్తించే విధంగా దారిలో పెట్టగలిగితే అది తనకూ వారికీ కూడా ప్రయోజనకరం.
భూతలము:
సన్ జూ అంటున్నాడు: భూతలం ఆరు రకలుగ అనుకోవచ్చు.
ఒకటి సాపు మైదానం
రెండు చిక్కుల చిత్తడి
మూడు తరచు మారిపోయేది
నాలుగు కొండ కొమ్ములు
ఐదు శత్రువుకు బహు దూరమైనది
ఇరుపక్షాలూ సులభంగా చేరుకోగలిగేది సాపు మైదానం.
ఇటువంటి చోట శత్రువు కన్న ముందే చేరుకుని అందులో ఎత్తైన, కాంతి బాగా ఉండే చోటు ఎంచుకోవాలి. మీ సరుకులు సంబారాలు జాగ్రత్త పెట్టుకోవాలి.
ఒక సారి వదిలివెళితే తిరిగే ప్రవేశించవీలు లేనిది చిక్కుల చిత్తడి.
ఇటువంటి ప్రదేశంలో శత్రువు సిద్ధంగాలేనట్టైతే నిష్క్రమిస్తున్నట్టే నమ్మించి అకస్మాత్తుగా దాడి చేసి అతణ్ణి ఓడించవచ్చు. కాని శత్రువు కనక సంసిద్ధుడై మీ రాక కోసం వేచియున్నట్టైతే దుస్సాహసం పనికిరాదు. నిష్క్రమణ కష్టమై ఓటమి తప్పదు.
ఎప్పుడెలా వుంటుందో తెలియని పరిసరాల్లో మొదటి సారి చర్యకు ఎవరు ఉపక్రమించినా ఎవరికీ ప్రయోజనం ఉండదు.
ఇటువంటి చోట, అటునుంచి వచ్చే ఎటువంటి కవ్వింపుకీ కంగరాగ్దు. వీలైతే దాన్ని విస్మరించి వెనకడుగు వెయ్యడమే ఉత్తమం. మన వెనకంజ ధైర్యంతో వారి సేన కొంత మనని అనుసరిస్తుంది. అనుకూలమైన ప్రాంతం చేరేమని నమ్మకం కలగ్గానే దాడి మళ్ళీ ఆరంభించవచ్చు.
ఇరుకు సందుల్లో, మీరు కనక ముందు ప్రవేశించినట్టాయితే రక్షణ దండుని సిద్ధం చేసి శత్రువు రాకకోసం ఎదురు చూడాలి.
మార్గ మధ్యంలో శత్రువు మనని నిరోధిస్తే అతని రక్షణ ఏ పాటిదో ముందో అంచనా వేసి అప్పుడు దాడి గురించి నిర్ణయించుకోవలి.
కొండకొమ్ముల్లో, వైరి కన్న మీరు ముందు చేరుకున్నట్టైతే ఎత్తును ఆక్రమించుకుని కిందనించి వచ్చే శత్రువు కోసం ఎదురు చూడాలి.
శత్రువే కనక ముందు చేరుకున్నట్టైతే పలాయనం ఉత్తమం.
వైరి సుదూరంలో ఉండి, ఇరు బలాలు సమానమైనప్పుడు, వారిని రెచ్చగొట్టక, వారే ముందడుగు వేసినప్పుడు ప్రతిఘటించి గెలవ్వచ్చు.
నేలకి సంబంధించి ఇవి.
బాధ్యతలు తీసుకున్న సైన్యాధికారి జాగరూకతతో స్థల పరిశీలన చెయ్యాలి.
సైన్యానికి, ప్రకృతివల్ల కాక తమ నాయకుడివల్ల కలిగే సంకటాలు ఆరు:
ఒకటి పలాయనం
రెండు అవిధేయత
మూడు భంగపాటు
నాలుగు ధ్వస్తమైపోవడం
ఐదు క్రమభంగం
ఆరు ఘోర పరాజయం
మిగతా అన్ని పరిస్థితుతులూ సమానంగా ఉండే పక్షంలో, ఒక సేన తనకన్న పదింతలుండే సేనతో తలపడితే మొదతి సేన వెన్ను చూపడం ఖాయం.
సామాన్య సైనికులు బలిష్టులై అధికారులు బలహీనులైతే ఫలితం అవిధేయత.
నాయకులు శక్తిమంతులై సేనంతా బలహీనులైతే భంగపాటు తప్పదు.
పై అధికారులు కోపంతో ఎవరి మాటా వినని వారై, శత్రువు ఎదురుపడగానే తమ గెలుపు అవకాశాలు గణించకుండా కోపమొక్కటే ప్రాతిపదికగా దాడికి ఆదేశిస్తే, సేనంతా ధ్వస్తమైపోవడమే ఫలితం.
సేనాపతి బలహీనుడు, ఏ అధికారం లేనివాడు ఐ, అతని ఆదేశాలు అస్పష్టమై, కింది అధికారుల బాధ్యతలేవో తెలియక, దండు నిర్మాణం అప్పటికప్పుడు దైవాధీనం అన్నట్టు జరిగితే క్రమభంగమే ఫలితంగా దండు మొత్తం చిన్నాభిన్నమవుతుంది.
దళపతి శక్తిమంతమైన వరిపక్షం బలాన్ని పరిగణించక బలహీనమైన తమ పక్షాన్ని యుద్ధానికి ప్రోత్సహిస్తూ, శైన్య సామర్ధ్యాలను బట్టి ముందు వెనకల ఎటువంటి వారిని నియమించాలో తెలియనప్పుడు, ఘోర పరాజయం తప్పదు.
ఓటమిని ఆహ్వానించడం ఇలా. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సేనా నాయకుడు ఇది గుర్తుంచుకోవాలి.
ఒక రాజ్యపు భౌగోళిక అమరిక సహజంగా సైనికుడికి సహాయపడే అంశం. కాని వైరి పక్షాన్ని అంచనా వెయ్యటం, గెలుపు గుర్రాల నియంత్రణ, ప్రయాసలు, ప్రమాదాలు, పరిసరాల అగవాహన సేనాపతి బాధ్యత.
ఇవి తెలిసి ఆచరణలో పెట్టినవారికి జయమూ, తెలియని వారు, తెలిసీ ఆచరణలో పెట్టనివారికి అపజయమూ ఫలితాలు.
జయం నిశ్చయమనిపిస్తే, రాజ్యాధినేత ఆదేశానికది వ్యతిరేకమైనా, యుద్ధం చెయ్యాలి; ఆ నిశ్చయం లేనప్పుడు ప్రభుత్వాదేశమున్నా, యుద్ధం మానాలి.
పరిస్తితులనుకూలించి విజయపథంలో దూసుకుపోయేపుడు తనపై కురవబోయే సన్మానాలను కాని, అవి ప్రతికూలించి వెనుకంజ వేస్తే వచ్చే అవమానాన్ని కాని గణించక, సదా దేశ హితమే తన నిర్ణయాలకు పరమార్ధంగా భావించే సేనాపతి రాజ్యానికి మణిమకుటం వంటివాడు.
తమను తన సొంత బిడ్డల్లా భావించి ఆదరించే దళపతిని తమ ఆఖరి క్షణం వరకు సేన వెన్నంటి అండగా వుంటుంది.
కానీ మీరు అతిచనువిచ్చి అధికార దర్పం చూపక, ఆప్యాయత కురిపించి ఆదేశాలనివ్వలేక, అశాంతినీ అల్లర్లను అదుపులోపెట్టలేక అసమర్ధులై ఉన్నప్పుడు మీ సేన భ్రష్టు పట్టిన సంతానంలా తయారవుతుంది. వారి సాయంతో మీరు సాధించేది శూన్యం.
దెబ్బ తీసేందుకు మనం సంసిద్ధులమైనా దెబ్బ తినేందుకు వైరిపక్షం అందుబాటులో లేకపోతే మన జయావకాశాలు సగమేనని గ్రహించాలి.
అలాగే శత్రువు దెబ్బకి అందుబాట్లో వున్నా కొట్టేందుకు మనం సిద్ధంగా లేకున్నా కూడా జయావకాశం సగమే.
ఇంకా, శత్రువూ అందుబాట్లోకొచ్చి, మనమూ సిద్ధమైనా, ఆ ప్రాంతం పోరుకి అనుకూలంగా లేనప్పుడూ అంతే.
అనుభవజ్ఞుడైన సైనికుడు ఒకసారి అడుగు ముందుకేస్తే మరే సంశయాన్నీ మదిలోకి అనుమతించడు. శిబిరం నించి ఒకసారి బయటపడితే ఎటువంటి తలపునూ తన పూనికకి అడ్డుపడనివ్వడు.
యుద్ధతంత్రానికి సంబంధించి, నీవు నిన్నూ నీ పగవారినీ తెలుసుకున్నప్పుడు అసంపూర్ణమైన విజయావకాశం, నింగినీ నేలనూ కూడా తెలిసినప్పుడు సంపూర్ణమవుతుంది అని
నవ విధ స్థితిగతులు
సన్ జూ అంటున్నాడు: సమరశాస్త్రం తొమ్మిది రకాల నేలలపైని పోరులను గుర్తిస్తుంది.
మన గడ్డ మీదే సలపాల్సిన పోరు.
పరసీమలో మరీ లోపలికి పోకుండా జరిపేది.
వివాదాస్పదమై ఇరుపక్షాలకూ కూడా ప్రయోజనకరమనిపించే భూమిలో పోరు.
ఇరువురూ స్వేచ్ఛగా రాకపోకలు సాగించగలిగే నేలపైని పోరు.
మొదట ఆక్రమించినవారికి విజయాన్ని కట్టిపెట్టే రాజ్యరహదారుల కూడలిలో జరిగేది.
శత్రురాజ్యపు దుర్భేద్యమైన పట్టణాలను దాటుకుంటూ దాని హృదయస్థానం వరకూ చొచ్చుకుపోయి అక్కడ చేసే క్లిష్ట యుద్ధం.
పర్వతారణ్యాలు, దుర్గమ కోనలు, బురద పర్రలు దాటితేగాని చేరుఓలేని దుష్కర భూమిలోని పోరు.
స్వల్పమైన వైరిసేన మన పెద్ద బలగాన్ని మట్టుపెట్టగలిగే ఇరుకుసందుల పోరు.
క్షణం ఆలస్యం చెయ్యక పోరాడితే గాని బతికి బయటపడే అవకాశంలేని తెంపరినేలమీది పోరు.
వీటిలో, సొంతగడ్డ మీద పోరు సలపకూడదు. పరసీమలో మరీ లోపలకిపోకుండా తలపడేప్పుడు పోరు ఆపకూడదు. ఇరువురికీ సమాన విజయావకాశాలున్నప్పుడు మొదటి అడుగు వెయ్యకూడదు. ఇరువురి రాకపోకలకూ అనువైన నేలలో శత్రువును అడ్డగించకూడదు. రాజ్యాల కూడలి ప్రాంతంలో మిత్రుల సహకారం తీసుకోవాలి. పరసీమలో మరీలోతుకి చొచ్చుపుపోయినప్పుడు చేతికందినంత దోచి మూటగట్టుకోవాలి. కొండకోనల చిత్తడి చిక్కుల దుష్కర భూమిలో ప్రయాణం ఎక్కడా ఆగకూడదు. అటు ఇటూపోలేని ఇరుకు సందుల్లో ఎత్తులూ జిత్తులే మనకి రక్ష. పోరక తప్పనిచోట రెండో ఆలోచనలేకుండా పోరాడాలి.నవ విధ స్థితిగతులు
సన్ జూ అంటున్నాడు: సమరశాస్త్రం తొమ్మిది రకాల నేలలపైని పోరులను గుర్తిస్తుంది.
మన గడ్డ మీదే సలపాల్సిన పోరు.
పరసీమలో మరీ లోపలికి పోకుండా జరిపేది.
వివాదాస్పదమై ఇరుపక్షాలకూ కూడా ప్రయోజనకరమనిపించే భూమిలో పోరు.
ఇరువురూ స్వేచ్ఛగా రాకపోకలు సాగించగలిగే నేలపైని పోరు.
మొదట ఆక్రమించినవారికి విజయాన్ని కట్టిపెట్టే రాజ్యరహదారుల కూడలిలో జరిగేది.
శత్రురాజ్యపు దుర్భేద్యమైన పట్టణాలను దాటుకుంటూ దాని హృదయస్థానం వరకూ చొచ్చుకుపోయి అక్కడ చేసే క్లిష్ట యుద్ధం.
పర్వతారణ్యాలు, దుర్గమ కోనలు, బురద పర్రలు దాటితేగాని చేరుఓలేని దుష్కర భూమిలోని పోరు.
స్వల్పమైన వైరిసేన మన పెద్ద బలగాన్ని మట్టుపెట్టగలిగే ఇరుకుసందుల పోరు.
క్షణం ఆలస్యం చెయ్యక పోరాడితే గాని బతికి బయటపడే అవకాశంలేని తెంపరినేలమీది పోరు.
వీటిలో, సొంతగడ్డ మీద పోరు సలపకూడదు. పరసీమలో మరీ లోపలకిపోకుండా తలపడేప్పుడు పోరు ఆపకూడదు. ఇరువురికీ సమాన విజయావకాశాలున్నప్పుడు మొదటి అడుగు వెయ్యకూడదు. ఇరువురి రాకపోకలకూ అనువైన నేలలో శత్రువును అడ్డగించకూడదు. రాజ్యాల కూడలి ప్రాంతంలో మిత్రుల సహకారం తీసుకోవాలి. పరసీమలో మరీలోతుకి చొచ్చుపుపోయినప్పుడు చేతికందినంత దోచి మూటగట్టుకోవాలి. కొండకోనల చిత్తడి చిక్కుల దుష్కర భూమిలో ప్రయాణం ఎక్కడా ఆగకూడదు. అటు ఇటూపోలేని ఇరుకు సందుల్లో ఎత్తులూ జిత్తులే మనకి రక్ష. పోరక తప్పనిచోట రెండో ఆలోచనలేకుండా పోరాడాలి.
నేర్పరులైన ప్రాచీన సేనాపతులు శత్రుసేనని ఎటూ పోనివ్వకుండా దారుల్లో సీలలు కొట్టి దిగ్బంధం చెయ్యడం,; వారి సేనలోని బలవంతులనూ బలహీనులనూ కలవనివ్వకపోవడం; దుస్థితిలోని వారిని కాపాడే అవకాశం సమర్ధులకు కలగనివ్వకపోవడం, నాయకుల ఆదేశాలు సేనకు చేరకుండా చూడడం వంటి విద్యలలో ఆరితేరినవారు.
వైరిసైన్యం అన్ని పక్షాలూ కలిసున్నప్పుడు అక్కడ గలభా గందరగోళమూ సృష్టించి విడగొట్టేవారు.
అవకాశాలు తమవైపు మొగ్గినప్పుడు తొలి దెబ్బ కొట్టేవారు; కానప్పుడు కదలక నిలిచేవారు.
సుశిక్షితమైన ఒక పెద్ద శత్రుసైన్యాన్ని అదుపులో ఎలా ఉంచాలని నన్నడిగితే, వారు పదిలంగా ప్రాణప్రదంగా కాపాడుకునే దాన్ని ఒడుపుగా చేజిక్కించుకోవాలి. అప్పుడు వారి చేతలు మన కనుసన్నల్లో నడుస్తాయి.
ఒడుపూ వడీ పోరుకు కీలకం. వైరి ఏమరుపాటును వృధాపోనియ్యక, ఊహించని దారుల్లోంచి చొరబడి రక్షణలేని చోట్లు కనిపెట్టి దెబ్బతియ్యాలి.
మరియు దాడి చేసేపుడు ఈ కింది విషయాలు గుర్తుపెట్టుకోవాలి. శత్రురాజ్యపు ఎంత లోనికి చొచ్చుకుపోతే మీకు మీ సేన అండ అంత ఎక్కువ ఉంటుంది. మీ సేన ఉమ్మడి శక్తి ధాటికి శత్రువులు నిలవలేరు.
పరసీమ సుభిక్షమై అక్కడ పోరు జరిగేటప్పుడు అందినకాడికి దోచుకుని నిలవచేసుకుంటే సేన తిండీ తిప్పలకి ఢోకా వుండదు.
సేన సంక్షేమం చాలా ముఖ్యం. వారిని మరీ అరగ పామెయ్యకూడదు. శక్తులు కూడగట్టుకోవాలి, బలాలు కూడబెట్టుకోవాలి; సైన్యపు కదలిక ఆగకూడదు; ఎవరి ఊహకీ అందని పథకాలు రచించాలి.
పోరులో పారిపోయే అవకాశంలేని చోట్ల సేనలను నిలపాలి. అప్పుడు పలాయనం అంటే మరణమే. చావుకి సిద్ధపడ్డ సైన్యం సాధించలేనిది ఉండదు. సిపాయిలూ సేనాపతులూ కలిసికట్టుగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడతారు.
తెగించినవాడి మదిలో భయానికి చోటుండదు. దాగేందుకు ఏ తావులెనివాడు నిర్భీతిగా నిలిచి నిలవరిస్తాడు.
ఎటుచూసినా శత్రువులే నిండిన పర రాజ్యంలో పోరే సైన్యం మొక్కవోని సాహసం చూపుతుంది. ఏ సహాయమూ అందదని గ్రహించప్పుడు శౌర్యం ద్విగుణీకృతమవుతుంది.
అప్పుడు వారి విజృంభణకి వైరి కవ్వింపు కాని, వారి శౌర్యప్రదర్శనకి మీ సంకల్పం కాని, వారి విశ్వాసానికి నిబంధనా నియమావళి కాని, వారి విధేయతకి మీ ఆదేశాలు కానీ అక్కర్లేదు.
శకునాలను పట్టించుకోకండి; మూఢవిశ్వాసాలను పారద్రోలండి. అప్పుడు, ఒకే ఒకసారి వచ్చే చావు తప్ప మీ భయానికి ఇంకేకారణమూ ఉండదు.
సైనికులకు సంపదలు లేవంటే సిరి వారికి చేదనీ కాదు, వారి ఆయుఃపరిమితి తక్కువంటే వారికి జీవితేచ్ఛ లేదనీ కూడా కాదు.
యుద్ధ సన్నద్ధతకోసం ఆదేశాలందిన రోజున వారు వగవ్వచ్చు. కన్నీరు, కూర్చున్న వారి దుస్తులు తడపవచ్చు, పరుండినవారి చెంపలూ చెవుల మీదుగా జారవచ్చు. ఒకసారి ఇంటికి దూరమయారా, వారి విజృంభణ ఓ కిరీటినో రాణా ప్రతాపునో గుర్తుకు తేవాల్సిందే.
యుద్ధతంత్రనిపుణుడైన సైనికుడు చూంగ్ పర్వతాల్లో సంచరించే షువైజాన్ సర్పంతో పోల్చదగ్గవాడు. మీరు ఆ పాము తలపై కొడితే అది తోకతో మిమ్మల్ని బాదుతుంది; తోకమీద కొడితే పడగవిప్పి కాలకూటాన్ని మీపై చిమ్ముతుంది; నడిమిని కొడితే తలా తోకల రెంటి విజృంభణా చూస్తారు.
పూర్తి సేనంతా ఆ సర్ప తంత్రాన్ని అనుకరించాలా అనడిగితే, అవునంటాను. ఎందుకంటే, వూ సైన్యమూ, యువే సైన్యమూ బద్ధ శత్రువులు; కాని ఇరువురూ ఒకే పడవలో నదిని దాటుతూ అది సుడిలో చిక్కుకుపోతే విడివిడిగా ఉండే కుడి యెడమ చేతులు అవసరార్ధం కలుసుకున్నట్టు ప్రాణాలకు తెగించి ఒండొరులను కాపాడుకుంటారు.
అందుకని సమర తంత్రం అశ్వాలనూ రథాలనూ తయారుగా ఉంచ్కోవడమే కాక, సేన యావత్తుకూ అత్యున్నత ప్రమాణంలో ధైర్యాన్నీ శౌర్యాన్ని రగిలించేది కావాలి.
సేన బలమూ బలహీనతా కూడా ప్రయోజనకరం అవాలంటే పోరుజరిగే భూమిని సరిగా వినియోగించుకోవాలి.
యోగ్యుడైన సేనాపతి, సేనలో ఒక్కడే సైనికుడునప్పుడు ఎంత శ్రద్ధ చూపుతాడో, వేల సేనపై కూడా అదే శ్రద్ధ చూపి నడిపిస్తాడు.
సమర్ధ సేనాని, సేన గుట్టు మట్లను రట్టు కానివ్వని గాంభీర్యాన్నీ, దానిని ఒక్క తాటిపై ఒక్క మాటపై నడిపే నిబద్ధతనూ కలిగి యుంటాడు.
కొన్ని విషయాలు తన కింది అధికారులకూ సేనకూ కూడా తెలియకూడదని అనుకుంటే వారిని అజ్ఞానంలో ఉంచి తప్పుదోవ పట్టించే టక్కు టమార విద్యలూ అతని సొంతం.
అవతలి పక్షానికి ఏమీ అవగతం కాని విధంగా తరచూ తన సేన అమరికనూ వ్యూహాలనూ మారుస్తూనే ఉంటాడు.
శిబిరాలను తరచూ మారుస్తూ, సేనను అడ్డదారుల్లొ పోనిస్తూ అతడు వైరిని ఏమారుస్తాడు.
గోడనెక్కినవాడు ఎక్కిన నిచ్చెన తన్నేసినట్టు తన సేనని పూర్తిగా శత్రు స్థావర హృదయంలోనికి చొచ్చుకుపోనిచ్చి అక్కడ దాడికి పురిగొల్పుతాడు.
ఏరు దాటగానే తెప్పలు తగలెయ్యడం; తిండి కాగానే వండిన కుండలు పగలెయ్యడం; ఎటుపోతున్నామో తెలీని అవస్థలో సేనను అదిలియ్యడం; ప్రమాదంలో సేనను వదిలెయ్యడం. ఇదీ సేనాపతి వృత్తి.
నవవిధాలైన నేలలకూ తగిన విధానాలు రూపకల్పన చెయ్యడం; అవకాశాన్నిబట్టి ఆక్రమణ ఎప్పుడో ఆత్మరక్షణ ఎప్పుడో నిర్ణయించడం. సహజ మానవ నైజాన్ని పూర్తిగా ఎరిగి యుండటం; ఇవన్నీ సమర్ధ సేనాపతి పూర్తి అవగాహనలో యుండేవి.
శత్రురాజ్యంలో ఎక్కువదూరం చొరబడితే సేనలో కట్టు బలంగాను, తక్కువదూరంలో సరిహద్దు మట్టుకే ఐతే వదులుగాను వుంటుంది.
స్వదేశాన్ని వదిలి వైరి సీమలో లోతుగా సేనను నడవనిస్తే మీరు సంక్లిష్టభూమిలో ఉన్నట్టు.
ఉన్నచోటునించి నలు దిక్కులకూ సమాచారమూ సంచారమూ కుదిరినప్పుడు అది కూడలి భూమి.
మరీలోతుగా పరసీమలోకి చొచ్చుకుపోతే అది అపాయకర భూమి. కొద్ది దూరమే నడిచి ఉంటే అది తేలిక భూమి.
మన వెనక మోహరించిన శత్రుసేనలు ముందు సన్నటి దారులూ ఉంటే అది ఇరుకు సందుల భూమి. దాగేందుకు కొద్ది మాటుకూడాలేనిది పోరక తప్పని తెంపరి భూమి.
పరసీమలో మరీ లోతుకు చొచ్చుకుపోని నా సేనకు పోరు లక్ష్యాన్నీ ఐక్యతను ప్రబోధిస్తాను; ప్రవేశమూ నిర్గమమూ సుగమమైన భూమిలో సేన వివిధ భాగాలు సన్నిహితమయేలా చూస్తాను.
ఇరు బలగాలకూ సమానావకాశాలున్న చోట నా వెనక తగుపాటి సేనను సమాయత్తపరుస్తాను. మాటు లేని బహిరంగ ప్రదేశంలో నా సేన ఆత్మరక్షణ నా ప్రాథమ్యం. పలు రాజ్య రహదారుల కూడళ్ళలో పోరు అయితే నా హితుల సహకారాన్ని అర్ధిస్తాను. క్లిష్ట భూమిలో సేనకి అత్యవసర సంబారాల నిరంతర సరఫరాను కొనసాగిస్తాను. కొండకోనలు, చెట్లూ తుప్పల చిత్తడి నేలల్లో సైన్యపు సంచారం ఆగకుండా చూస్తాను. చుట్టూ వైరిపక్షమూ ఎదట ఇరుకుసందులలో వెనక్కి మళ్ళే మార్గాన్ని నా అధీనంలో ఉంచుకుని దుర్భేద్యం చేస్తాను. పోరక తప్పని తెంపరి భూమిలో తాడో పేడో తేల్చుకోవలసిన ఆవశ్యకతను సేనకు నూరిపోస్తాను.
ప్రత్యర్ధులు చుట్టూ మూగినప్పుడు ప్రతిఘటన, ఆత్మరక్షణ అసంభవమైనప్పుడు పరాక్రమం, పెను ప్రమాద నివారణకు లొంగుబాట సైనికుని కర్వత్యాలు.
పొరుగు రాజుల మదినెరుగక మైత్రి ఒడంబడికకు తొందరపడకూడదు. శత్రుసీమలోని కొండకోనలు, చిట్టడవులు చిత్తడి సరస్సులు, మిట్టపల్లాలు వంటి నైసర్గిక స్వభావమెరుగక సేనను దూకించకూడదు. స్థానికంగా దారిచూపేవారు లేనప్పుడు ప్రకృతిసిద్ధంగా ఒనగూడే ప్రయోజనాలు పొందవీలుపడదు.
ఒక సేనాపతి సమరోత్సాహంతో శక్తివంతమైన శత్రుదేశంపై దండెత్తినప్పుడు, ప్రత్యర్ధి సేన ఒకటిగా దగ్గరై బలపడకుండా నిరోధించడంలో అతని సేనాధిపతిత్వం ఋజువవుతుంది. అతని ఈ తంత్రనైపుణికి ఓ పక్క శత్రువు చకితుడవగా, అతనితో ఒడంబడిక చేసుకున్న మిత్ర సేనలు శత్రువుకు చేయందించలేక ఆపసోపాలు పడతాయి.
అట్టి సమర్ధుడైన సేనాపతి ప్రతివారి స్నేహ హస్తాన్నీ వారి బలాలనూ స్వీకరించక, తన రహస్య మంత్రాంగాన్ని పరిపుష్టం చేసుకుని దాంతో ప్రత్యర్ధులని పరుగులు పెట్టిస్తాడు.
నియమ నిబంధనలతో నిమిత్తంలేకుండా బహూకృతులు గాని, ఉత్తర్వులు గానీ ఇవ్వగలిగిన సేనాధిపతి ఒక్క సైనికుడిని పాలించగల నేర్పుతో సర్వ సైన్యాన్నీ నిర్వహించగలడు.
సేనకు కార్యనిర్దేశం మాత్రమే చెయ్యాలి; దానివెనక తన వ్యూహమేమిటో తెలియనివ్వరాదు; పరిస్థితులు ప్రోత్సాహకరమైతే ప్రగల్భంగా ప్రకటించాలి; నిరుత్సాహకరమైతే నిమ్మకు నీరెత్తినట్టు నిమ్మళంగా ఉండాలి.
సేనను పెను ప్రమాదంలో నిలిపితే ఎలాగోలా నిలదొక్కుకుంటుంది; మార్గాంతరంలేని తావుల్లోకి ఉరికిస్తే సురక్షితంగా తిరిగొస్తుంది.
ఎందుకంటే విపత్కర పరిస్థితులలోనే సేన సర్వశక్తులూ బయటికొస్తాయి.
శత్రువు ఉద్దేశ్యమేమిటో కనిపెడుతూ అందుకు తగిన విధంగా సర్దుబాట్లు చేసుకుని సలిపే పోరాటం జయిస్తుంది.
ఎదట నిలిచేందుకు అత్యుత్సాహ పడకుండా శత్రువుకు పక్కల నిలిచె పోరాడితే ఒకనాటికి వారి అధినేతను మట్టు పెట్టి విజయం దక్కించుకోవచ్చు.
వంచనతో చేసే పోరు వలని ప్రయోజనాలివి.
వైరి రాజ్యాన్ని స్వాధీన పరుచుకునేపుదు సరిహద్దులన్నీ మూసెయ్యాలి; అంతవరకు అమల్లో వున్న శాసనాలన్నిటినీ రద్దు చెయ్యాలి. చారుల కదలికలు నిషేధించాలి.
పరిస్థితి మన అదుపులో ఉండాలంటే సభ సమావేశాల్లో కాఠిన్యం అవలంబించాలి.
శత్రువు పొరపాటున ఒక తలుపు వేసుకోవడం మరిచిపోతే కాలయాపన చెయ్యక అందులో చొరబడాలి.
శత్రువుకు అతి ప్రియమైనదాన్ని చేజిక్కించుకుని అతణ్ణి ఉక్కిరిబిక్కిరి చెయ్యాలి; అప్పుడు మన అందుబాటులోకి అతడొచ్చేలా పావులు కదపాలి.
జయం చేకూర్చే ఆఖరి దెబ్బ తియ్యబోయే ముందు నిబంధనలు పాటిస్తూ శత్రువు అందుబాటులోకి మనం రావాలి. అప్పుడు, మొదట బిడియమూ, పేలవమూ ప్రదర్శించి శత్రువు నుంచి లభించబోయే అవకాశం కోసం కాచుకునుండాలి; అదను చూసి అనూహ్యంగా గతిమార్చి చెంగుమనే కుందేలులా కదిలి ఏం జరుగుతోందో అతనూహించేలోగానే పని కానిచ్చెయ్యాలి.
అగ్ని కాండ
యుద్ధంలో అగ్గిని ఐదు విధాలుగా వాడుతారు; శత్రు శిబిరాలకు నిప్పంటించి వారి సైనికులను దహనం చెయ్యడం; వారి సరకుల భాండాగారలను ఆహుతి చెయ్యడం; వారి రవాణా వ్యవస్థను బుగ్గి చెయ్యడం; వారి ఆయుధ సంపత్తిని పరశురామ ప్రీతి చెయ్యడం; నిప్పుల బంతులు వారి సేన మధ్యలో జారవిడవడం.
ఇటువంటి దాడికి కావలసిన సరంజామా ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.
కొన్ని ఋతువులూ, వాటిలోని కొన్ని రోజుల్లో మాత్రమే అగ్ని దేవుణ్ణి ఆహవంలోకి ఆహ్వానించాలి.
ఆ ఋతువు గ్రీష్మం; ఆ ప్రశస్త దినాలు పెనుగాలులు కలిగించే చంద్ర్-నక్షత్ర ప్రత్యేక కూటమి అమరిక ఉన్నవి.
అగ్ని దాడికి అయిదు సందర్భాలు.
విధివశాన శత్రు శిబిరంలో మంటలు లేస్తే అనూహ్యంగా ఆకస్మికంగా మన దాడి కూడా జరగాలి.
శత్రు శిబిరంలో జ్వాలలు రేగినా వారి శైన్యం ఎటువంటి హడావిడీ లేకుండా ఉన్నప్పుడు తొందరపడి దాడి చెయ్యరాదు. అదనుకై చూడాలి.
అవతలి మంటలు అదుపులేక ఆకసానికెగసినప్పుడు, అవకాశం ఉంటేనే మన దాడి కూడ జరగాలి; లేదంటే ఊరుకొనడం ఉత్తమం.
అనూహ్యంగా దాడి చెయ్యడం కుదరక, అవతల మంటలూ లేవక ఉన్నప్పుడు వాటికోసం ఎదురుచూడక ఒక నిర్ణీత సమాం అనుకుని నిప్పులు గుప్పించాలి.
అగ్ని దాడి గాలి వాలుతో పాటు ఉండాలి; ఎదురు గాలిలో కాదు.
పగటి గాలి ఎక్కువసేపుంటుంది; నిశి లోని మారుతం అంత సేపుండదు.
ప్రతి సేనా ఈ మంట లెక్కల కదలికలు, మింటి చుక్కల అమరికల ఎరుకను కలిగినవారై తగు తరుణంలో తేజరిల్లాలి.
దాడికి అగ్నిని వాడేవారికి జ్ఞానమూ, నీటిని వాడేవారికి శక్తీ ఆవశ్యకాలు.
నీటిలో శత్రువును ఎదుర్కోవచ్చు కానీ అతని సంపదను హరించడం కష్టం.
దురదృష్టవంతుడెవరంటే తగు సాహసమూ జ్ఞానమూ లేకుండా యుద్ధాలు చేసి జయం కోరుకునేవాడు; పర్యవసానం కాలం వృధా, ఆశాభంగమే కదా.
జ్ఞాని అయిన పాలకుడు ఎంతో ముందుచూపుతో తన పథకాలు రచిస్తాడు, సమర్ధుడైన సేనాపతి తన సేనని ఎప్పుడూ సర్వ సన్నద్ధంగా ఉంచుతాడు.
ప్రయోజనం ఉందన్న నిశ్చయంలేనప్పుడు అడుగు ముందుకెయ్యకూడదు; లాభకరం అనిపించనప్పుడు సేనను ఉరుకులెత్తించకూడదు. పరిస్థితి క్లిష్టంగా పరిణమిస్తే తప్ప పోరుకు దిగకూడదు.
పాలకుడూ సేనాపతీ తమ వ్యక్తిగత క్రోధ కార్పణ్యాలు చల్లబరిచేందుకని యుద్ధ సమాయత్తులై సేనలనురికించరాదు.
లాభసాటి అయితేనే ముందుకురకాలి; లేదంటే నిమ్మళంగా నిలిచే ఉండాలి.
ఒకప్పుడు క్రోధానికి పర్యవసానంగా సంతోషం లభించవచ్చు; నైరాశ్యానికి ప్రతిగా సంతృప్తీ కలుగవచ్చు.
కాని ఒకసారి నేలమట్టమైన రాజ్యానికి పునర్వైభవమూ, శవానికి జీవమూ లభించేది కల్ల.
ఇది దృష్టిలో పెట్టుకుని పాలకుడు వివేకవంతుని గాను సేనాపతి విచక్షణాయుతుని గాను భాసించాలి. అప్పుడే వారి రాజ్యప్రజకు శాంతీ వారి సేనకు భద్రతా లభించేది.
చారుల వినియోగం
ఒక లక్ష మంది సైన్యాన్ని సుదూర ప్రాంతంలో యుద్ధానికి తీసుకెళ్ళాలంటే అది వారి దేశ ప్రభుత్వానికీ ప్రజలకూ ఎంతో కర్చుతో కూడిన వ్యవహారం. రోజుకు రెండువేల ఐదువందల తులాల వెండి అవుతుంది. ఇది దేశంలోనూ వెలుపలా కూడా అలజడి కలిగించేది. సుదీర్ఘ ప్రయాణంలో రహదారులవెంబడి సైనికులు ప్రాణాలు కోల్పోతుండవచ్చు. ఏడు లక్షల కుటుంబాలు కష్టించి సంపాదించినది హరించుకుపోతుంది.
వీరోధి రాజ్య మహాసేనలు ఒక్కరోజులో నిర్ణయమయే విజయావకోసం యేళ్ళ పాటు ఎదురెదురుగా నిరీక్షిస్తారు. అయితే శత్రువు బలాబలాలు, స్థితిగతులు తెలుసుకోకుండా తన శౌర్యప్రదర్శనకు గాను తన ప్రభుత్వం ఇచ్చే పురస్కారాల కోసం సేననంతనూ ఎరగా నిలబెట్టడం అత్యంత అమానుషం.
అటువంటి వాడు తన సేనకు నాయకుడని కాని, తన రాజ్యానికి రక్షకుడని గానీ, గెలుపు నిర్ణేత అని కాని పిలువననర్హుడు.
అందువల్ల ఎవరి ఊహకూ అందనంత కౌశలంతో పోరు సల్పి విజయాధికారాలు చేజికించుకోగోరే వివేకి అయిన ప్రభువుకూ విచక్షణాపరుడైన సేనాపతికీ ఉండవలసిన ముఖ్య లక్షణం తన, పర బలాబలాల సంపూర్ణ ప్రజ్ఞ.
అట్టి దివ్యదృష్టి ఏ దేవతాశక్తులో ఇచ్చేది కాని, అనుభవం తోనూ శిక్షణతోనూ కాని, పరిశ్రమచేసి లెక్కలు గణించడం ద్వారా కాని ఒనగూడేది కాదు.
అది తమవంటి ఇతర మనుజుల సహకారంతోనే సాధ్యం.
అందుకే గూఢచారుల సహాయం అవసాం; వీరు ఐదు రకాలు.
స్థానిక చారులు
పైనుంచి వచ్చే చారులు
రాజ్య విధేయత మార్చుకున్న చారులు
కర్తవ్య నిర్వహణలో దెబ్బ తిన్న చారులు
బతికి బయటపడిన చారులు.
ఈ ఐదు రకాలనీ ఒకే మారు వినియోగించినపుడు మన పన్నుగడలేవో తెలుసుకొన ఎవరికీ సాధ్యం కాదు. ఇదో ఐదు పోగుల అపూర్వ అల్లిక. రాజ్యానికి ఉండాల్సిన విలక్షణ ప్రజ్ఞా విశేషం.
స్థానిక చారులు మన ప్రాంత పౌరులు.
పైనుంచి వచ్చే చారులు శత్రుపక్షం సమాచారం ఇవ్వగల వారు.
రాజ్యవిధేయత మార్చుకున్న చారులు సాధారణంగా రణంలో ఓడి మనకు బందీలైన శత్రుసైనికులు.
దెబ్బ తిన్న చారులు శత్రువుకు మన వాస్తవ స్థితి తెలియకుండా మభ్యపెట్టేందుకు పనికొస్తారు. వారిని వెంబడిస్తూ ఇతర చారులు చాపకింద నీరులా పనిచేసుకుపోతారు.
బతికి బయటపడిన చారుల ద్వారా అవతలి శిబిరపు అసలు సమాచారం మనకు అందుతుంది.
కనుక చారులకన్న అతి సన్నిహితులు నాయకత్వానికి వేరెవరూ ఉండరు. విలువైన పురస్కారాల అర్హత వారికన్న ఎవరికీ లేదు. ఈ విభాగంలోని గోప్యత మరే వ్యవహారంలోను ఉండదు.
ఒక నిశ్చితమైన సహజ జ్ఞానమూ చాతుర్యమూ లేక గూఢచారులను ప్రభావశీలంగా వినియోగించ వీలుండదు.
వ్యవహారంలో ధర్మబద్ధత, ముక్కుసూటితనమూ లేక వారిని సక్రమంగా నిర్వహించవీలుపడదు.
చారులు తెచ్చే సమాచార విశ్లేషణకు ఎంతో సూక్ష్మ బుద్ధి కుశలత కావాలి.
కుటిలత, నిగూఢత; ఇవి కలిగి మీ చారులను అన్ని వ్యవహారాల్లోను నియోగించాలి.
ఒక అతి ముఖ్య రహస్య సమాచారాన్ని నిర్ణీతకాలానికి ముందే ఒక చారుడు కనక ఇంకొకరికి వెల్లడి చేస్తే, ఇద్దరూ మరణ దండనకు అర్హులు.
ఒక సేనని మట్టుపెట్టాలన్నా, ఒక నగరాన్ని ముట్టడించాలన్నా, ఒక ప్రముఖుణ్ణి అంతమొందించాలన్నా, వారికి కాపలా ఉండేవారు, వారి అనుచరులు, ద్వారపాలకులు, అంగరక్షకుల వంటి వారి పూర్తి సమాచారం తెలిసి వుండాలి. వీటి సేకరణకు మన గూఢచారులు నియోగింపబడాలి.
శత్రు గూఢచారులు మన మధ్య తిరుగుతున్నట్టయితే వారిపై నిఘావేసి పట్టి లంచమిచ్చి అందరికీ దూరంగా సకల సౌకర్యాలూ కల్పించి ఉంచాలి. తదుపరి వారు రాజ్యవిధేయత మార్చుకుని మన పక్షాన పనిచేస్తారు.
వీరు తెచ్చే సమాచార సహాయంతో స్థానిక మరియు పై ప్రాంత గూఢచారుల ఎంపిక చేయవచ్చు. తిరిగి వారినే ఎరగా ప్రయోగించి శత్రువును మభ్యపెట్టవచ్చు, ఆఖరుగా బతికి బయటపడ్డ చారుల నియోగానికి అనువైన సమయాన్ని నిర్ణయించుకోవచ్చు.
ఇన్ని రకాల గూఢచర్యపు ముఖ్యోద్దేశమూ ఒకటే; శత్రువు స్థితిగతులు బలాబలాల పరిపూర్ణ అవగాహన. అది రాజ్యవిధేయత మార్చుకున్న చారుని సమాచారంతోనే సాధ్యం. అందువల్ల వారికి ఎక్కువ గౌరవాన్నీ స్వేచ్ఛనూ ఇవ్వాలి.
గతంలో ఎన్నో రాజ్యాలు ఇటువంటి చారులను ప్రోత్సహించి పోషించి లాభపడ్డాయి.
కనుక వివేకమూ విచక్షణా కుశాగ్రబుద్ధీ కలిగిన సారభౌముడు సేనా నాయకుడూ మాత్రమే గూఢచార్య విద్యలోని మర్మాలనెరిగి అందుకు తగిన చతురులైన చారులను వినియోగించి అద్భుత ఫలితాలు సాధిస్తారు.
No comments:
Post a Comment