Thursday, December 3, 2020

ప్రకృతి ("Nature" by Ralph Waldo Emerson)

 



ఇది వెనక చూపుల యుగం. పూర్వుల స్మారకాలు నిర్మించుకుంటూ, వారి కథలూ, చరిత్రలూ, విమర్శలూ రాసుకునే పనిలో వుంది. పూర్వులు సృష్టినీ సృష్టికర్తనీ స్వయంగా దర్శిస్తే, మనం ఆ పనికి వారి కళ్ళనే ఎరువు తెచ్చుకుంటున్నాం. సృష్టిని ఉన్నదున్నట్టు వారిలాగే మనమూ ఎందుకని ఆనందించకూడదు? మన సృజన ఆచారమూ అనువంశీకమూ కాక అంతరంగపు తాజాదనంతో ఎందుకు ప్రకాశించకూడదు? మన మతమూ ధర్మమూ పూర్వ చరిత్రల నించి అర్ధంచేసుకున్నది కాక స్వయంగా మనకే ఎందుకు ఆవిష్కృతం కాకూడదు? క్రమబద్ధమైన ఋతు చక్రాన్ని ఆవిష్కరిస్తూ, తన జీవచైతన్యంతో మన దేహాలను ఉత్తేజ పరుస్తూ, వాటి శక్తులను మనకు దఖలు పరుస్తూ, సృష్టి వర్తమానంలో దానితో సమంగా నర్తించగల మనం, ఎందుకని శిధిలమైన దని గతాన్ని తవ్వి ఎండిపోయిన బొమికల్ని ఎక్కఆగి కళ్ళకద్దుకుంటూ నవ చైతన్యంతో తొణికిసలాడే ఇప్పటి తరాన్ని పాడు పడ్డ పాత బీరువాల అరల్లోకి నెట్టెయ్యడం? అదే సూర్యుడు అప్పట్లాగే ఇప్పుడూ ప్రకాశిస్తున్నాడు; అప్పటికన్న ఎక్కువ తిండీ బట్టా ఇప్పుడు ఉన్నాయి; కొత్త ప్రాంతాలు, కొత్త మనుషులు, కొంగ్రొత్త ఆలోచనలు ప్రభవిస్తున్నాయి. మన శ్రమకూ వివేకానికీ సరిపడే న్యాయసూత్రాలనూ ధర్మాచరణనూ నిర్మించుకోవడం మన హక్కు.

సమాధానాల్లేని ప్రశ్నలు మన దగ్గర లేవు; ఇది నిర్వివాదాంశం. దాని క్రమాన్ని గురించిన మన మదిలోని జిజ్ఞాసకు అనుగుణంగా ఆవిష్కృతమవుతున్న ఈ సృష్టి పై మనకు అపార విశ్వాసముండాలి. ప్రతి వ్యక్తి యొక్క నిరంతర చింతనా తన పరిస్థితుల రూపంలో నిగూఢంగా ఫలిస్తోంది. ఆ సత్యం అవగతమయేంతవరకు దానిని జీవితంగా భావించి అతడు ప్రవర్తిస్తున్నాడు. అదే విధంగా సృష్టి కూడా తన స్వరుప స్వభావాల ద్వారా తన ఉద్దేశ్యాన్ని ప్రకటిస్తోంది. మన చుట్టూ వెలుగొందుతున్న ఇంత ప్రశాంత తత్వాన్ని, దాని ముఖ్యోద్దేశాన్ని తెలుసుకుందాం.

అన్ని శాస్త్రాలదీ ఒకటే లక్ష్యం - ఈ సృష్టిని అర్ధం చేసుకోవాలని. జాతులు, తెగలు, సంప్రదాయాలమీద బోలెడు సిద్ధాంతాలున్నాయి కాని సృష్టిపై తక్కువ. మత గురువులు చీకట్లో తడుములాడుతూ ఒకర్నొకరు తిట్టిపోసుకునేంతగా, భవిష్యకారులు మతిలేనివారు, అప్రయోజకులు అనుకునేంతగా, సత్యం నించి దూరం జరిగిపోయాం మనం. కాని నిశితంగా నిర్ణయించాల్సొస్తే, సత్యం ఎంత సరళంగా సంక్షేపంగా ఉంటే అంత ఆచరణ సాధ్యం. సత్యమైన సిద్ధాంతం తనను తానే నిరూపించుకుంటుంది. సంభవించే ప్రతి విషయాన్నీ వివరిస్తోందా లేదా అన్నడే దానికి గీటురాయి. కానీ ఈనాడు ఎన్నో సూత్రాలూ వాదాలూ దురవగాహాలుగానే ఉండిపోయాయి : భాష, నిద్ర, ఉన్మాదం, స్వప్నాలు, మృగాలు, లైంగిక ప్రవర్తన - ఇలా.

వేదాంతపరంగా చూస్తే, విశ్వం ప్రకృతి, ఆత్మల కలయిక. అందువల్ల, మన నించి భిన్నమైన, స్వాభావికంగా కాని శాస్త్రీయంగా కాని వేదాంత శాస్త్రం మనం కాదు అని చెప్పిన ప్రతీదీ ప్రకృతి అనే అనుకోవాలి. ప్రకృతిలోని ఒక్కొక్క విశేషన్నీ వాటి సముదాయాన్నీ విశ్లేషించినప్పుడు దాని సామాన్య మరియు వేదాంతార్ధాల్లో ఇదే పేరుని నేను వాడుతాను. ఈనాటి మన తత్వశోధనల దృష్ట్యా చూస్తే ఈ రెండు అర్ధాలమధ్య కల భేదం అంత ముఖ్యం కాదు. దాని సామాన్య అర్ధంలో, మనిషి మార్చలేనిది ప్రఋతి. ఆకాశం, గాలి, నది, ఆకు .. ఇలా. ఇవే ప్రాకృతిక వస్తువులకి తన కళని జోడిస్తే రూపుదిద్దుకునేవి ఒక ఇల్లు, ఒక కాలువ, ఒక విగ్రహం, ఒక చిత్రం. కానీ ఈ చెక్కుళ్ళు, తవ్వకాలు, వంటలు, అతుకులు, పూతలు మనిషి దృష్టిలో ఒకోటీ ఒక గొప్ప కళేమో కానీ సృష్టి మహా వైచిత్రి వైదగ్ధ్యాల ముందు ఇవన్నీ అతి స్వల్పాలై, సృష్టి స్వరూప స్వభావాలను ఏవిధంగాను ప్రభావితం చెయ్యజాలనట్టివి.

ఒకటో అధ్యాయం : ప్రకృతి

ఏకాంతం లోకి పోగోరే మనిషి, సమాజం నించే కాక తన వ్యాపకం నుంచి కూడా బయటపడాలి. నేను చదువుతూనో రాస్తూనో ఉంటే ఏకాంతంగా ఉన్నట్టు కాదు - ఎవరూ పక్కన లేకున్నా. ఏకాంతంగా ఉండగోరే వ్యక్తి నక్షత్రాల వంక తేరిపార చూస్తూ మైమరుస్తాడు. ఆ దివ్య తేజోమూర్తుల కిరణాలు తనపైన, తన పనులపైన విడివిడిగా పడతాయి. అంతరిక్ష లొకపు అబ్బురాలు ప్రసాదించే ఈ దివ్యానుభూతికోసమేనేమో వాతావరణం పారదర్శకంగా సృజించబడిందని అనిపించడం కూడా కద్దు. మన వీధుల్లో నడుస్తూ కూడా చూడండి, ఎంత తేజోసంపన్నంగా కన్నులపండువు చేస్తాయో! అటువంటి అనుభూతి వెయ్యేళ్ళకొక్కసారే కనక కలిగితే మనిషికి అది భగవంతుని దివ్యప్రకటనంగా తరతరాలపాటు గుర్తుపెట్టుకు మురిసిపోయి ఉండేవాడు; అటువంటిది, ప్రతి రాత్రి ఈ దేవ దూతలు తమ సౌందర్యాతిశయంతోను చిరునవ్వుల ప్రకాశంతోను విశ్వంలో తేజస్సులు గుమ్మరిస్తున్నాయే.

తారల పట్ల మన ఆరాధనాభావానికి ఒక కారణం, వాటి అందం దృగ్గోచరమైనా అవి మాత్రం అందరానివి. ఇవేకాదు, మనసును వాటి ప్రభావాన్ని గ్రహించేందుగ్గాను తెరచి ఉంచితే కనక, మనపై పడే ప్రకృతిలోని ప్రతి వస్తువు ముద్రలోనూ ఒక విధమైన సారూప్యమూ సాదృశ్యమూ గోచరిస్తాయి. ప్రకృతి సాక్షాత్కారం ఎప్పుడూ సామాన్యంగా ఉండదు. ఎంత గొప్ప మేధావీ దాని రహస్యాన్ని వెల్లడించలేడు; దాని రహస్యాల పట్ల తన ఉత్సాహం పూర్తిగా తీరిపోయేంత, ఇంకేదీ తెలుసుకోనక్కరలేనంత సమగ్రంగా దానిని అధ్యయనం చెయ్యనూ లేడు. ప్రకృతి ఎప్పుడూ ఒక జ్ఞాని చేతిలో ఆట వస్తువుగా ఒదిగి ఉండదు. ప్రకృతి ప్రసాదాలైన పుష్పాలు, జంతువులు, పర్వతాల గురించిన అవగాహనతో అతడు పులకిస్తే, అతని బాల్యావస్థ సరళత్వాన్ని అమాయకత్వాన్ని అవి ఆనందిస్తాయి.

ప్రకృతి గురించి ఇలా అనుకుంటుంటే ఎదో కవితా ధోరణి మదిని ఆవరించుకుంటుంది. నే చెప్పేది ప్రకృతి ప్రసాదాలైన అసంఖ్యాక వస్తుసముదాయాన్ని గురించి. అదే వడ్రంగి చేతిలోని చెక్కని కవికి స్ఫూర్తినిచ్చిన చెట్టు నుంచి వేరుచేస్తుంది. సుదూరానికి వ్యాపించి ఈ ఉదయం నేను చూసి మైమరచిన ఆకుపచ్చని మైదానం లౌక్య పరిభాషలో ఇరవయ్యో ముప్ఫయ్యో ఎవరివో పొలాలు. ఈ ముక్క మిల్లర్ దొరగారిది, అదేమో లాకే అయ్య గారిది, అటు పైన అంతవరకు మ్యానింగ్ బాబు గారిది అని. కాని అందరి భూములనీ భూమ్యాకాశాలు కలిసినట్టున్నవరకు దృష్టిని పరపి ఏకీకృతం చేయ్యగలిగేది కవి హృదయమే. ఈ భూకామందుల స్థిరాస్తి పత్రాలు ఇవ్వలేని అత్యుత్తమ ఫలసాయం ఇది.

వాస్తవానికి వయోజనుల్లో బహుకొద్ది మంది మాత్రమే ప్రకృతిని ఈ విధంగా దర్శించగలరు. అసలు చాలా మంది సూర్యోదయాన్నే చూడరు. చూసినా అది యథాలాపంగా చూడటమే. సూర్యుడు పెద్దల కళ్ళల్లో మాత్రమే ప్రకాశిస్తాడు కాని పసివారి కళ్ళనూ హృదయాలనూ కూడా తేజోమయం చేస్తాడు. వయసు పెరిగినా బాల్యపు శుద్ధ చైతన్యాన్ని వదులుకోక తన బహిరంతరింద్రియ తత్వాల మధ్య సామరస్యం కలిగినవాడు ప్రకృతి ప్రేమికుడు. ఇహపరాలు, భూమ్యాకాశాల సమన్వయం అతని ప్రతి దైనందిన చర్యలోను ప్రతిఫలిస్తుంది. ఈతి బాధలెన్నున్నా, ప్రకృతి ఒడిలో అతనికి ఏదో ప్రశాంతత, ఉత్తేజమూ లభిస్తాయి. ప్రకృతి పలుకుతుంది - అతను నా మనిషి; అతని బాధలేవైనా నా సాహచర్యంలోని అతని ఆనందం మటుకు అక్షయం అని.

ఏ వసంత చంద్రోదయమో గ్రీష్మ భాను ప్రకాశమో అనికాక ప్రకృతి ప్రసాదితమగు ప్రతి ఋతువూ, ప్రతి గడియా కూడా ఉత్తేజభరితమే; ఎందుకంటే నిరంతరం మారే ప్రతిక్షణమూ ఒక వినూత్న మానసికావస్థను సృజిస్తుంది - మిట్ట మధ్యాహ్నమైనా నట్ట నడిరేయైనా. మనిషి జీవితంలోని సుఖావస్థకీ దుఃఖావస్థకీ కూడా అనుగుణంగా సర్దుకునేది ప్రకృతే. ఆరోగ్యం తొణికిసలాడుతున్నప్పుడు చుట్టూ వీచే గాలిలో ఒక విధమైన ధార్మికతా శక్తీ కలిసి వీస్తూంటాయి. ఓ పచ్చిక దారిలో ఓ మంచు నీటి గుంటలో కాళ్ళు తడుపుకుంటూ గోధూళివేళ నడుచుకుంటూ పోయే నేను, ఏ భోగభాగ్యాల, ధన ధాన్యాల తలపులు మదిలో రాకుండానే, ఎంతో ఉల్లాసాన్ని ఉత్తేజాన్నీ పొందుతాను. నా ఆనందానికి నాకు భయమేస్తుంది. అడవిలో చెట్ల కిందుగా నడిచే మనిషి పాము కుబుసాన్ని వదిలేసుకున్నట్టు తనకి వయోభారాన్ని కలిగించిన సంవత్సరాలను దులిపేసుకుని చిన్న పిల్లాడై పోతాడు. అంతులేని యౌవనానికి అందమైన అడవులు ఆలవాలం. సృష్టికర్త నాటిన ఈ తోటలు ఒక ఠీవితో పవిత్రతతో భాసిస్తాయి; వినూత్న ఉత్సవ శోభను ధరిస్తాయి; వాటి అతిథులకి వెయ్యేళ్ళున్నా విసుగు రాదు. వాటి మధ్య మనం మళ్ళీ హేతువుకీ విశ్వాసానికి దగ్గరవుతాము. అక్కడున్నంతసేపు నా జీవితానికి ఢోకా లేదని, ఈ ప్రకృతి పరిష్కరించలేని ఎటువంటి పరాభవమూ ప్రమాదమూ (నా కళ్ళు మాత్రం భద్రంగా ఉండుగాక) నన్ను బాధించనేరవనీ అనుకుంటాను. ఆహ్లాదకరమైన మలయమారుతం నా తలను స్పృశిస్తుండగా, వట్టి నేలమీద నిటారుగా నించుని అనంతాకాశంలోకి చూస్తున్న నాలో అహం మాయమవుతుంది. నేనో పారదర్శకమైన కనుగుడ్డుని; నేనో శూన్యాన్ని; అన్నిటినీ చూడగలను; విశ్వవ్యాపకుని మహిమాన్విత ప్రభావ తరంగాలు నా గుండా ప్రవహిస్తాయి; భగవంతునిలో నేనూ ఒక భాగం. ఆ సమయంలో సుపరిచితుడైన నా ప్రియ స్నేహితుని పేరు కూడా అన్యమే; అపరిచితమే. సోదరులుగ, పరిచయస్తులుగ, యజమానిగ, బంటుగ - ఇలాటి అన్ని సంబంధ బాంధవ్యాలూ కలత, కల్ల, విసుగు ఇప్పుడు నేను ఏ బంధనాలూ లేని నిత్య నూత్న ప్రేమలోకంలో ఉన్నాను. వీధులూ ఊర్లూ ఇవ్వని ఆప్యాయత వనసీమలిస్తాయి. విశాలమైన మైదానాల చివర భూమ్యాకాశాలు కలిసేచోట మనిషి అతి సుందరమైన తన సహజ స్వభావాన్నే ఇంచుమించుగా దర్శిస్తాడు.

పంటచేలు పచ్చని చెట్ల మధ్య మనకి కలిగే ఆహ్లాదం మనకీ వృక్షజాతికీ ఒక అవినాభావ సంబంధం ఉందని సూచిస్తుంది. వాటి మధ్య నేను ఒంటరిని కాను. అవీ నేనూ ఒకరికొకరం తలూపుకుంటాము. తుపానులో ఊగే కొమ్మల నాట్యం కొత్తదే కాని ఎరిగినదే; ఆశ్చర్యకరమే, కాని సుపరిచితమే. దాని విన్యాసం నాలో కలిగించేది నా మదిలోని ఉన్నతమైన తలపు, భావన, లేక ఆచరించిన సత్కార్యం నాకు కలిగించే అనుభూతికి సమానమైనది. అయితే ఈ తాదాత్మ్యాన్ని ప్రసాదించే శక్తి ప్రకృతిది కాక, ఆ భావుకత కలిగిన మనిషిది, లేక ఇరువురి మధ్య బలపడిన సామరస్యానిది. ఈ తన్మయత్వాన్నందేవారికి ఎంతో నిగ్రహం అవసరం. ఎందుకంటే ప్రకృతి ఒడి ఎప్పుడూ సెలవుల విడిది కాదు. నిన్న దివ్య గంధర్వకాంతల మధురగానాన్ని ఆలపించిన అవే పరిసరాలు నేడు చావు బాజాని వాయించేందుకు వెనకాడవు. మన ఆత్మ తొడుకున్న వేషభూషలనే ప్రకృతీ ధరిస్తుంది. ఈతి బాధల భారాన్ని అతి కష్టం మీద మోస్తున్న వ్యక్తి దుఃఖం తన వెన్నంటే వుంటుంది. ఒక సన్నిహిత బంధువుని కోల్పోయి పరితాపంలో ఉన్న వ్యక్తికి పరిసరాలూ తనతోపాటు ఏడుస్తున్నట్టే అనిపిస్తాయి. ఉన్నతుల ముందు శోభస్కరంగా భాసించే అంతరిక్ష యవనిక సామాన్యులకు వెలిసిపోయిన చీర మాదిరే కనిపిస్తుంది.




రెండు : వస్తువు

ప్రపంచ పరమ గమ్యమేమిటో వివేచన చేసేవారు ఆ క్రమంలో లభించే ఎన్నో ప్రయోజనాలను గుర్తించగలుగుతారు. అవన్నిటినీ ఈ విధంగా వర్గీకరించవచ్చు; వస్తువు, సౌందర్యము, భాష, నియమము.

ప్రకృతిని నించి మనం పొందే ప్రయోజనాలన్నిటినీ వస్తువుగా పేర్కొంటాను. ఆత్మ సాక్షాత్కారం వలె అంతిమం కాక, ఇదొక మధ్యస్థ ప్రయోజనం. కాని దాని పరిధిలో అది పరిపూర్ణము, ఉన్నతమూ. ప్రకృతి నించి పొందగలిగేది ఇదే అని ప్రజ అంతా భావించేది. అంతరిక్షంలో అలవోకగా తేలే ఈ ఆకుపచ్చ బంతిమీద నలుసంత ఉండే మనిషి దుఃఖాలు చాలా మటుకు పసివారి అలకలంత అప్రధానమైనవి. ఇన్ని సౌకర్యాలతో, ఇంత ప్రాణ శక్తితో, ఇన్ని జీవ జలాలతో ఈ చిరుగోళాన్ని అలంకరించిన దేవతా మూర్తులెవరో కదా. పైన నిరంతరమూ తళుకులీనే గ్రహ రాశులూ, వాటి కింద పరచిన మేఘ గుడారాలూ, ఇంకా కింద అడుగడుక్కూ మారే శీతోష్ణపు చారల చొక్కా తొడుక్కున్న వాతావరణమూ, ఠంచనుగా సంభవించే నాల్గు ఋతువులూ? ఈ ఘన వ్యవస్థ కింద మన మనుగడకోసం పశువూ పక్షీ నిప్పూ నీరు రాయీ రప్పా తిండీ తిప్పా. ఇది మనిషి ఇల్లు; ఆట విడుపు; కార్ఖానా; ఉద్యానవనం; ఊయలమంచం.




"నీ జీతగాళ్ళె కారు సుమా ఉన్నది నీ సేవకొరకు అడుగడుగున నలుదిక్కుల వేచియుందురింకెందరొ "

అయితే ప్రకృతి వనరుల నించే కాక ప్రకృతిసిద్ధమైన ప్రయాస, ఫలితాలు కూడా మనిషికి ప్రయోజనకరమే. ఇవన్నీ చేతులు కలిపి మరీ మనిషి మనుగడకోసం పాటుపడుతాయి. గాలి విత్తును నాటుతుంది; సూర్యుడు సాగరాన్ని ఆవిరి చేస్తాడు; గాలి దాన్ని పొలాలమీదికి మోసుకెళ్తుంది; ఇంకో దిక్కున మంచు దీనిలోకి వానని నింపుతుంది; అది తాగి పంటలు పండుతాయి; జంతుజాలానికి అవి ఆహారమవుతాయి.

దైవదత్తమై సతతమూ సాగే ఈ పరిభ్రమణం ఈ విధంగా మనిషిని పోషిస్తోంది. తన సృజనకు పదును పెట్టి మనిషి ప్రదర్శించే కళారూపాల్లో లోక కల్యాణకరమని అనిపించేవన్నీ ప్రకృతి విన్యాసానికి అనుకరణలో, అనుసరణలో. తన పడవని ముందుకు తోసేందుకు అతను అనుకూల పవనాల రాకకై వేచి యుండక, ఒక ఇనప కుండలో నీటిని వేడిచేసి పయనానికి అవసరమైన గాలిపాతాన్ని అందులో కూడబెడతాడు. ఘర్షణ తగ్గించేందుకు రహదారులని ఇనుముతోనూ రాయితోను నిర్మించుకుంటాడు. ఎందరో మనుషులను జంతువులను నింపిన బళ్ళలో అనాయాసంగా అతి వేగంతో ఒక డేగలా, చక్రవాకంలా, రివ్వున ఊర్లు దాటుకుంటూ పోతాడు. ఈ ప్రతిసృష్టితో ప్రపంచ ముఖ చిత్రం ఎంత మారిపోయింది! నోవా నించి నెపోలియన్ వరకూ!. సామాన్యుని సేవకై నగరాలు, వాహనాలు, కాల్వలు, వారధులు. అతనో పోస్టాఫీసుకి పోతే నించుని సేవలు అందించే సిబ్బంది; పుస్తకాల కొట్టుకి వెళితే విశ్వంలోని విషయాలన్నీ పూసగుచ్చినట్టు విడమరిచే ప్రపంచ ప్రఖ్యాత రచయితలూ కవులూ; న్యాయస్థానానికి పోతే తన తప్పులనూ నడవడినీ మరమ్మత్తు చేసే ప్రభుత్వం; నివాసానికని ఒక చోట ఇల్లు కట్టుకుంటే ఒక్కొక్కటిగా దాని వరకు రహదారులు, చెప్పులు కుట్టే చర్మకారులు, చెత్తనెత్తే కర్మచారులు,. ఇలా ఒకొక్కటీ చెప్పుకుంటూ పోతే ఉదాహరణల జాబితా అనంతం. పాఠకుని ఊహే దాని కొలత. చివరిగా ఒక్కటి గుర్తుంచుకోవాలి: క్రమబద్ధమైన ఈ అమరిక వెనక ఒక మహోన్నత లక్ష్యముంది. అది, మనిషి కడుపు నిండా తినాలి; అది అరిగేలా కష్టించి పనిచేసేందుకు.

మూడు : సౌందర్యం

మనిషి ఒక ఉదాత్తమైన కోరికను ప్రకృతి నెరవేరుస్తుంది అది, సౌందర్యారాధన. ప్రాచీన గ్రీకులు ప్రపంచాన్ని కాస్మోస్, అంటే సౌందర్యం అని వ్యవహరించేవారు. ప్రాకృతిక వస్తు సంపదే అటువంటిది కావచ్చు లేక ఆ సృజనాత్మకత మానవుని కళ్ళలో వుండి వుండవచ్చు - ఆకాశం, పర్వతం, చెట్టు, జంతువు ఇవన్నీ తమ ఉనికిని తాము ఆనందిస్తూ మనవంటి చూపరులకి కూడా ఆనందం కలిగిస్తాయి; ఆకృతిలో, రంగుల్లో, చలనంలో, గుంపుల్లో - ఇలా. కొంతవరకు గోచరించే ఈ సౌందర్యం చూచే కళ్ళలో ఉంటుంది. కన్ను ఒక గొప్ప కళాకారిణి. దాని స్వాభావిక నిర్మాణం, దానిపై ప్రసరించే కాంతి కిరణాల సమన్వయంతో దర్శన శక్తి సంతరించుకుని, దాన్ని బయటి వస్తు సంచయం మీదికి పరపి, వాటిని వాటి వాటి బహిర్లక్షణాలన్నిటితోను మేళవించి తన స్వరూపమైన గోళాకృతిలో ఒదిగేలా రూపొందిస్తుంది. కన్ను ఏ విధంగా గొప్ప రూప శిల్పో, కాంతి ఒక గొప్ప వర్ణ చిత్రకారిణి. తీక్ష్ణ కాంతి ప్రకాశంలో సౌందర్య శోభితం కాని అథమ వస్తువేదీ లేదు. పైగా అది కలిగించే చైతన్య స్ఫూర్తి, స్థల కాల పరిధుల్లో ఒదగని దాని అనంతత్వం, ప్రతి వస్తువును ఉత్తేజపరుస్తుంది. శవానిక్కూడా దాని సౌందర్యం దానికుంది. అయితే ప్రకృతిపై పరుచుకున్న ఈ శోభతో పాటు, గోచరమయే ప్రతీ ఆకారమూ కళ్ళకి ఇంపుగానే వుంటుంది. అందుకనే కద ఒక జొన్న కంకి, ఒక ద్రాక్ష గుత్తి, శంకు చెట్టు, గోధుమ పైరు, గుడ్డు, పక్షుల వింత వింత రెక్కలు, పులిగోరు, పాము పడగ, సీతాకోక చిలక, సముద్రపు గవ్వలు, రేగే మంటలు, పూమొగ్గలు, ఆకులు, తాటి వంటి వివిధ చెట్ల ఆకృతులు - ఇలా ప్రకృతిలో మనిషి అనుకరించని ఆకారమే లేదు.

సరైన అవగాహనకి, సౌందర్య లక్షణాలను మనం మూడు విధాలుగా విభజించవచ్చు.

ఒకటి: అసలు అవున్న స్థితిలోని ప్రాకృతిక స్వరూపాలే కన్నుల పండుగ. మనిషిపై వాటి వివిధ ఆకారాలూ పనితీరుల ప్రభావం ఎందుకవసరం అంటే, ఒక రకంగా అవి అతనికి అత్యావశ్యకాలైన వస్తువు, సౌందర్యాల నిర్వచనంలోకి వస్తాయి. జనసమ్మర్దం మధ్య శ్రమతో సడలి వదులైపోయిన దేహపటుత్వానికి పూర్వపు బిగి తెచ్చేందుకు ప్రకృతే ఔషధం. ఒక వర్తకుడు, వకీలు, ఊపిరిసలుపనివ్వని లావాదేవీలనుంచి ఒక సారి బయటపడి చెట్లవైపు చుక్కలవైపు కాసేపు తన్మయులైచూస్తే మళ్ళీ పుంజుకుని మామూలు మనుషులవుతారు. వాటి అలౌకిక ప్రశాంతతలో మనిషి తనను తాను కనుగొంటాడు. సుదూరమూ సువిశాలమూ అయిన దిఙ్మండలంలోకి దృష్టిని సారిస్తే కంటికి విశ్రాంతీ, ఆరోగ్యం. మనం అలా చూడగలిగినంతసేపు అలసట దరిజేరదు.

మిగతా సమయాల్లో ప్రత్యేకించి ఏ ఇంద్రియ స్పర్శా అనిపించకపోయినా, కేవలం తన లావణ్య మనోహరత్వంతో ప్రకృతి మనని అలరిస్తుంది. నా ఇంటికెదురుగా సుదూరాన కనిపించే కొండ వెనక ప్రభవించే ప్రభాత బాలసూర్యుని తేజం తీక్ష్ణమయేంతవరకు రెప్పార్పకుండా చూసినప్పుడు నా మదిలోని భావాలు దేవతలతో పంచుకోదగినంత ఉన్నతమై ఉంటాయి. ఆ కాంతితో మెరిసిపోయే మేఘాల చారికలు ఆకాశ సముద్రంలో ఈదే చేపపిల్లల్లా కదులుతాయి. ఒడ్డున నుంచుని ఆ అంతులేని నిశ్శబ్ద సాగరంలోకి చూస్తున్న నాకు వాటిలో ఒకటై క్షణక్షణానికీ కొత్త ఆకారాలు సంతరించుకుని తేలుతున్నట్టనిపిస్తుంది. వాటినుంచి కొంత చైతన్యాన్ని సంగ్రహించి నా పాంచభౌతిక ఉనికితో సమన్వయించుకుని ప్రభాత దివ్య సమీరంతో నా ఆలోచనలు పంచుకుంటాను. ఏ ఆర్భాటమూ లేకుండా అతి సామాన్యంగా వ్యవహరిస్తూ ప్రకృతి మనని ఎంత ప్రభావితం చేస్తుంది! నాకు ఆరోగ్యాన్నీ ఒక రోజునీ ఇవ్వండి, నేను సార్వభౌముల రాజ దర్పాన్ని తోసిరాజనగలుగుతాను. ప్రభాతం లో అస్సీరియానూ, సూర్యాస్తమయ చంద్రోదయాల్లో పాఫోసూ చుట్టుపక్కలి అన్ని రాజ్యాలనూ, మిట్ట మధ్యాహ్నం ఇంగ్లాండునూ ఆవాహనం చేసి పాలిస్తాను; చిక్కటి నిశిలో నా ఆధ్యాత్మిక తత్వమూ స్వప్న ప్రపంచమూ జర్మనీలో రాజ్యమేలుతాయి.

ఆ స్థాయికి ఏమి తగ్గక, కొద్దిపాటి మధ్యాహ్నపు ఎండ ప్రచండతని మినహాయిస్తే, నిన్నటి రోజు ఎంత మనోహరంగా ఉంది. ఒకటి రెండై రెండు నాలుగై అలా అనంతాలై ఒకోటీ ఒకో రంగుతో మెత్తని దూదిపింజల్లా తేలిన పడమటి మేఘాలు; సృష్టిలోని జీవాన్నీ మాధుర్యాన్నీ నింపుకుని నన్నావరించిన మలయ సమీరం; ఇంటి నాలుగ్గోడల మధ్యకీ రావాలంటేనే మనసొప్పని మధురానుభవమది.

ప్రకృతి ఏమి చెప్పాలని ప్రయత్నిస్తోంది? ఆ పిండి మర వెనక సజీవంగా దర్పంగా ఉన్న పచ్చని మైదానమూ లోయలూ గుట్టలూ ఏమి చెప్పాలనుకుంటున్నాయో. ఒక హోమరో షేక్స్పియరో వివరించి యుండేవారేమో. అపరాహ్ణంలో ఆకులన్నీ ఊడిపోయిన మోడు గోధూళి భాను ప్రకాశంలో ఎగిసే అగ్నికీలై, నీలపు తూరుపు వెనక తెరై మిణుకులీనే తారలు పూరేకలై, దాని ప్రతీ ఎండు చితుకూ కురిసే మంచు ముత్యాలు ధరించి, ఒక్కక్కటిగా సంధ్యా నిశ్శబ్ద సంగీత కచేరీకి తమవంతు వాద్య సహకారాన్నందిస్తాయి.

సంవత్సరంలో సగమే ఆహ్లాదకరమని పట్నవాసుల అభిప్రాయం. నాకు మటుకు అన్ని కాలాలూ ఉచితరీతిని ఆహ్లాదం పంచేవే. నిశితంగా చూచే కంటికి ఏ క్షణానికదే అపురూపం; అదే పొలాన్ని గంటక్రితం ఒకలా ఇప్పుడొకలా, గంట తర్వాత ఒకలాగ దర్శిస్తుంది. అంతరిక్షంలోని దివ్య లోకాలు క్షణ క్షణానికీ మారుతూ, తదనుగుణమైన ఉత్తేజాన్నో నిస్తేజాన్నో కింది మైదానాలమీద గుమ్మరిస్తుంటాయి. చుట్టు పట్ల పొలాల్లోని పంట చేలు వార వారానికీ అవి ఆవరించిన భూమి ముఖచిత్రానికి కొత్త రంగులద్దుతూ వుంటాయి. రహదారులకు అటూ ఇటూ దట్టంగా పెరిగిన దేశవాళీ పిచ్చి మొక్కలైతే కాలాన్ని కొలుస్తున్నట్టు గంట గంటకూ ఓ వింత సోయగాన్ని చూడగలిగే చురుకైన కళ్ళకి వడ్డిస్తాయి. పక్షి కీటక ప్రపంచంలోనూ ఇదే తరహా సోయగాల సొంపు గోచరిస్తుంది. కాలంలో ఇలా అన్నిటికీ చోటుంటుంది. వీటి మధ్య జలధారలూ నీటిపాయలూ కూడా ఉన్నట్టయితే ఆ వైదగ్ధ్యం బహు ప్రశస్తం. వేసవి చివరలో లోతు తక్కువ చెరువులు నీలి నాచుని తివాచీలా పరిచి వేలాది రంగు రంగుల సీతాకోక చిలకలని ఆహ్వానిస్తాయి. పారే ఏరు సౌందర్య ప్రదర్శన నిరంతరం, నిత్య నూతనం. రోజుకో సరికొత్త సొంపుతో వయ్యారాలు పోతుంది.

అయితే ఈ విధంగా చూచి అనుభూతి చెందే సౌందర్య విశేషం అధమ పక్షం. రోజూ సంభవించే పగలు, మంచులో తడిసిన ఉదయం, హరివిల్లు, కొండకోనలు, పూచిన పండ్లతోటలు, నక్షత్రాలు, చంద్రకాంతి, నిశ్చలసరస్సు నీటిలోని నీడ, అదే పనిగా చూస్తూ పోతే మొక్కుబడి ప్రదర్శనలై, ఇట్టే కనబడి అట్టే మాయమవుతూ వాటి అనిత్యత్వంతో మనని వెక్కిరిస్తుంటయి. ఆరుబయటకొచ్చి యధాలాపంగా చూసినప్పుడు తోమిన తగరం పళ్ళెంలా కనబడినప్పటికన్న మీరో ముఖ్యమైన పనిమీద పోతున్నప్పుడు తన కాంతిని మీ దారిలో పరిచి మార్గ నిర్దేశనం చేసినప్పుడు పూర్ణచంద్రుడు ఎక్కువ ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. ఓ అక్టోబర్ మధ్యాహ్నం బంగారు కుమ్మరించే సూర్యకాంతిని ఎవరు పట్టగలరు? తేరిపార చూద్దామని వెళ్ళబోతే అది మారిపోతుంది. శ్రద్ధగా పరికిస్తే మనం వెంబడించేవి ఎండమావులే కదా.

రెండు: దీని లౌకిక సౌరభానికి పారలౌకిక తేజస్సు తోడయినప్పుడు అది పరిపూర్ణమవుతుంది. మానవ సంకల్పంతో పరిపుష్టమైన దివ్య సౌందర్యం మాత్రమే ఎట్టి బెరుకూ లేని ప్రేమకి అర్హము. సౌందర్యం సన్మార్గానికి సృష్టికర్త దిద్దిన తిలకం. సహజ సిద్ధంగా చేసే ప్రతి పనిలోనూ ఒక రాజసం ఉంటుంది. అలాగే ప్రతి సాహసకార్యమూ ఉదాత్తమై చూపరులనూ చుట్టు పట్లనూ తేజోమయం చేస్తుంది..

ఇప్పుడు మనని అబ్బుర పరిస్తూ సమున్నతంగా నిలిచిన ఎందరివో ఎన్నెన్నో గొప్ప గొప్ప చేతలు, ఈ విశ్వం ప్రతి ఒక్కరి సొంతం అని బోధిస్తాయి. ప్రతి బుద్ధిశాలికీ ప్రకృతి దేవుడు దఖలు పరిచిన ఆస్తి, అరణం. అనుకుంటే అది అతనిదైపొతుంది. దాన్ని ఇంకోరికిచ్చి చేతులు దులుపుకున్నా చాలా మంది చేస్తున్నట్టు తన మిగతా వ్యాపకాలని పక్కనపెట్టి దాన్లో ఓ మూల కూర్చున్నా, అది స్వతస్సిద్ధంగా అతనిది. తన శక్తీ సంకల్పాల మేరకు అతను ప్రపంచాన్ని తనలోకి ఆహ్వానిస్తాడు. బతుకు తెరువుకై చేసే ప్రతి పనీ ధర్మబద్ధమే అంటాడు సల్లుస్ట్. సమర్ధుడైన నావికునికి గాలీ సముద్ర కెరటాలూ ఎప్పుడూ అనుకూలమే అంటాడు గిబ్బన్. సూర్య చంద్రులు, అంతరిక్ష లోకమూ అంతే.

చారిత్రక మహా యోధులు మహా యుద్ధాల్లో అమరులయే దినాన రక్త తప్తమైన యుద్ధభూమిని విషణ్ణవదనాలతో పైనించి చూస్తారు సూర్య చంద్రులు. రాజ్య సంక్షేమం కోసం అసువులను లెక్కచెయ్యక మహాశౌర్య ప్రదర్శనతో శతృవీరులను సైతం మరిపించే యోధాగ్రేసరుల సాహసం అతి సుందరమనేందుకేమి సందేహం? అమెరికా తీరాన్ని కొలంబస్ సమీపిస్తున్నప్పుడు తమ పాకలూ తొర్రలనించి వేలాదిగా తరలివచ్చి ఒడ్డున నిలిచిన ఆటవికులు, అనంతమైన నీల సాగరం వెనుక, ఇంకో వైపు వివిధ తెగల ద్వీప సమూహాలు - ఇటువంటి సజీవ చిత్ర సౌందర్యం నించి మనిషిని ఎలా వేరుచెయ్యగలం. నూత్న ప్రపంచం అతని స్వరూపాన్ని తాటితోపులు, పచ్చిక బయళ్ళతో అతి సహజంగా అలంకరిస్తుంది కదా. మహోన్నత కార్యాలన్నీ సహజ సౌందర్య అలంకృతాలే. మరణ శిక్ష పడిన హ్యారీ వేన్ అనే ఉత్తముడు బలిపీఠమెక్కి నిలుచున్నప్పుడు వేలాది అభిమానుల్లో ఒకరు అరిచేరు : "ఇంత విఖ్యాతమైన పీఠాన్ని నువ్వెన్నడూ అధిరోహించలేదు" అని. రెండో చార్లెస్ లండన్ వాసులను భయపెట్టేందుకు వారు ఆరాధించే దేశభక్తుడు లార్డ్ రసెల్ని బంధించి బహిరంగంగా నగర ప్రధాన వీధుల్లో ఊరేగించేడు. "కాని నగరవాసులు మాత్రం రెండో చార్లెస్ స్వేచ్ఛనీ ధర్మాన్నీ పక్కన నిలిపి ఊరేగుతున్నట్టనుకున్నారని" అని రసెల్ జీవిత చరిత్రకారుడు రాశాడు. ఎవరూ చూడని క్షుద్ర పరిసరాల్లొ సంభవించే సత్య శౌర్య ప్రదర్శనని సూర్యదీపం సహాయంతో అంతరిక్షమే తన ఆలయంలోకి కొనిపోతుంది. తన ఔన్నత్యానికి దీటైన తలపులూ సంకల్పమూ కలిగిన అందరినీ హృదయానికి హత్తుకునేందుకు ప్రకృతి సంసిద్ధంగా ఉంటుంది. ఆప్యాయతతో వారి అడుగడుగునూ అనుసరిస్తూ తన తేజో సౌరభాలతో తన ప్రియ సంతాన శోభకు నగిషీలు చెక్కుతుంది. మన ఆలోచనల స్థాయి తన గాంభీర్యతకు దీటుగా ఎదిగితే చాలు పటం సిద్ధమైనట్టే; మిగతా చిత్రాన్ని తను పూర్తి చేస్తుంది. ధర్మవర్తనుల నడవడి ప్రకృతి గతికి దీటుగా ఉండి అంత దర్పంతోనూ ప్రకాశిస్తారు. హోమర్, పిండార్, సోక్రటీస్, ఫోసియన్ వంటి ధీమంతుల ప్రస్తావన వచ్చినప్పుడు వారిని తీర్చిదిద్దిన గ్రీసు దేశపు భౌగోళిక స్వరూపం గుర్తుకు రాకమానదు. కంటికి కనిపించే భూమ్యాకాశాలు క్రీస్తుకు బాసటగా నిలిచాయి. సామాన్య జీవితంలో, శక్తి సామర్ధ్యాలూ సుఖ శాంతులు ప్రజ్ఞాపాటవాలతో శోభిల్లేవారిన చూసినవారికి వారి సాఫల్యానికి తోటి ప్రజలు, వారి అభిప్రాయాలు, ఇంకా ప్రకృతి సహకారమూ తప్పక ఉండి వుంటుందనే నమ్ముతారు.

మూడు: ప్రపంచ సౌందర్యాన్ని చూడగలిగే ఇంకో దృష్టి కోణం, దాని జ్ఞాన స్వరూపంలో.

ధార్మికత లాగే విషయాలకు వివేకజ్ఞాన సంబంధం కూడా వుంటుంది. జ్ఞానం, విషయాలనించి రాగ ద్వేషాలను వేరుచేసి, నిష్పాక్షికంగా సృష్టికర్త చూచినట్టే చూస్తుంది. జ్ఞాన శక్తీ కార్య కుశలతా ఒకదానినొకటి అనుసరిస్తూ, వానిలో ఒకదానిలో చేసిన విశేష పరిశ్రమ రెండోదానికి ప్రోద్బలమిస్తుంది.

మూడు: ప్రపంచ సౌందర్యాన్ని చూడగలిగే ఇంకో దృష్టి కోణం, దాని జ్ఞాన స్వరూపంలో.

విషయాలకు ధార్మికత లాగే వివేకజ్ఞాన సంబంధం కూడా వుంటుంది. జ్ఞానం, విషయాలనించి రాగ ద్వేషాలను వేరుచేసి, నిష్పాక్షికంగా సృష్టికర్త చూచినట్టే చూస్తుంది. జ్ఞాన శక్తీ కార్య కుశలతా పరస్పర ఆధారితాలు. ఒకదానిలో చేసిన విశేష పరిశ్రమ రెండోదానికి ప్రోద్బలమిస్తుంది. రెంటికీ కొంత విరోధమున్నా అది పశువుల మేత సమయం పని సమయాల వంటిది. ఒక దానిలోని నిమగ్నత రెండో దానికి సన్నద్ధత అయి, ఇది అవగానే అది మొదలవుతుంది. కనుక మన పనుల్లోని సౌందర్యం మనమూహించని విధంగా వానిలో ప్రవేశించి దానిని మనం తెలుసుకునే జ్ఞానోదయమయేవరకు ఉంటుంది; ఈ జ్ఞానసౌందర్యం తదుపరి మరల కార్యసౌందర్యమవుతుంది. దివ్యమైనది నశింపదు. ధర్మబద్ధమైనది పునర్జీవం పొందుతుంది. ప్రకృతి సౌందర్యం బుద్ధిని ప్రభావితం చేసి నూతన సృజనకు దోహదపడుతుంది. ప్రపంచ ముఖచిత్రం అందరినీ ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది; కొందరిలో అది అధికమై ఉల్లాస కారణమవుతుంది. ఈ సౌందర్యేచ్ఛే అభిరుచి. కొందరిలో ఇది ఎక్కువై, దానిని ప్రశంసతో సరిపెట్టుకోకుండా ఇతర రూపాల్లో వ్యక్తపరుస్తారు. అదే కళ అని పిలువబడే సౌందర్య పునఃసృష్టి. కళాసృష్టి మానవత్వ రహస్యాలపై పరిపే కాంతి ప్రకాశం. ప్రపంచ తత్వానికి సంక్షేప రూపం. ప్రకృతి భావవ్యక్తీకరణ యొక్క సూక్ష్మ రూపం. ఎందుకంటే, కళాకృతులు అనేకమూ విభిన్నమూ అయినా, వాటి పరమార్ధమూ వ్యక్తీకరణా ఒకటే. ప్రకృతి ఒకేతరహా వస్తువుల మహా సాగరం. ఒక ఆకు, సూర్యకిరణం, పచ్చిక బయలు, సరస్సు వంటివన్నీ మదిలో కలిగించే భావన ఒకేలా ఉంటుంది. వాటన్నిటిలోను ఉండే సామాన్య లక్షణం - వాటి పరిపూర్ణతా సామరస్యమూ - అదే - సౌందర్యం. అందువలన ప్రపంచం ఆత్మ యొక్క సౌందర్య పిపాసను తీర్చేందుకోసం ఉంది. ఈ భావననే నేను దాని పరమార్ధంగా పిలుస్తాను. అయితే అత్మయొక్క సౌందర్య కాంక్షకు కారణం లేదు. ఒక స్థూల, గంభీర భావనలో విశ్వానికి మరో వ్యక్తీకరణే సౌందర్యం. సృష్టికర్త సర్వ సముడు. సత్యము, ధర్మము, సౌందర్యము - ఇవి మూడు ఒకే దివ్య తత్వపు మూడు ముఖాలు. కాని ప్రకృతిలోని సౌందర్యం అంతిమం కాదు. అది అంతరంగంలోని శాశ్వతమైన సౌందర్యపు దూత వంటిదే కాని తానొంటిగా స్థిరమూ సంతృప్తికరమూ యోగ్యమూ కాదు. అదొక్కటే అయితే ప్రకృతి పరమార్ధ వ్యక్తీకరణను పరిపూర్ణంగా చేయజాలదు.

నాలుగు : భాష

ప్రకృతి మనిషికి అందించే ఇంకో సేవ భాష. అది ఈ సేవను మూడు దశల్లో అందిస్తుంది.

ప్రకృతి లోని సామాన్య విషయాలకు భాషలోని సామాన్య పదాలు ప్రతీకలు

నిగూఢ ప్రకృతి రహస్యాలు నిగూఢ ధార్మిక భావనలకు ప్రతీకలు.

అసలు ప్రకృతియే ఆత్మకు ప్రతీక.

ఒకటి: మాటలు ప్రకృతి విశేషాల గుర్తులు. లోక చరిత్రనుపయోగించుకుని లోకాతీత చరిత్ర అధ్యయనం : అంటే ఊర్థ్వ లోకాల అవగాహన, దాని అధ్యయనానికి అవసరమైన పదాల రూపకల్పన చేయ వీలవుతుంది. ఒక నైతిక లేదా జ్ఞాన విశేషాన్ని వర్ణించే మాటల మూలాలు వెదుకుతూ పోతే, అవి అతి సామాన్య ప్రాకృతిక పదాల ఆధారంగా రూపొందినవేనని అర్ధం చేసుకుంటాం. ఒప్పు అంటే తిన్నన; తప్పు అంటే వంకర. ప్రాథమికార్ధంలో ఆత్మ అంటే గాలి; ఉల్లంఘనానికి సామాన్యార్ధం గీత దాటడం. గర్వాతిశయం అనే పెద్ద మాటకి, లేచిన కనుబొమలు వాడుక మాట. అలాగే అంతరంగం అంటే లోపల. యోచన అంటే బుర్ర. ఈ యోచనా అంతరంగమూ అనేవి అతి సామాన్య వ్యావహారికం నుంచి అరువు తెచ్చుకుని ఆధ్యాత్మికానికి అన్వయించినవి. ఈ పరివర్తన ప్రక్రియ చాలావరకు మన నించి దాచబడింది భాషా రూపకల్పన జరుగుతున్న సమయంలో. పరికించి చూస్తే ఈ నైజం చిన్నపిల్లల్లో చూస్తాం. చిన్నపిల్లలు, ఆటవికులు పొడి పొడి పేర్లే పలుకుతారు. వాటినే క్రియలుగా మార్చుకుని పనులు కానిచ్చుకుంటారు.

రెండు: అయితే ఉన్నత ఆధ్యాత్మిక భావాల రూపకల్పనకు గాను తన అతి సామాన్య పదాలను వాడుకోనిచ్చినందుకు ప్రకృతికి మనం పెద్దగా ఋణపడినట్ట్లు భావించనక్కరలేదు. ప్రతీకాత్మకం పదాలే కాదు; విషయాలు కూడ. ప్రకృతిలోని ప్రతి విషయమూ ఒక ఆధ్యాత్మికాంశానికి ప్రతీక. ఎదట కనిపించే ప్రతిదీ మదిలోని ఒక భావనతో పోల్చదగ్గదై, ఆ భావనను సరిగా వ్యక్తపరిచేందుకు మళ్ళీ ఆ సంఘటననే ఉదహరించాలి. క్రోధాగ్నితో రగిలిపోయేవాడు ఆకొన్న సింహం; మోసగాడు గుంటనక్క; బెదరనివాడు బండరాయి; తెలిసినవాడు కాగడా. మేకపిల్ల అమాయకత్వం; సర్పం కార్పణ్యం; పుష్పాలు ఆహ్లాదం. వెలుతురూ చీకటీ జ్ఞాన అజ్ఞాన దశలకు ప్రతీకలని తెలిసినదే; వెచ్చదనం ప్రేమ. గుర్తున్నది ఎదట, ఆశించేది దూరాన.

ధ్యాన దశలో గంభీరంగా పారే ఏరుని చూస్తున్నప్పుడు మదిలో తమను గురించి ప్రపంచాన్ని గురించీ పరిపూర్ణ సింహావలోకనం చేసుకోనివారెవ్వరు. ఆ నిశ్చలత్వం మధ్యకి ఒక రాయిని విసిరితే అది మదిని కుదిపి చూచే వలయాలు వాస్తవికతకూ మరిన్ని ఉద్రేక భావనలకూ దారిస్తాయి. మనిషికి తన సామాన్య ఉనికితో బాటు అతీతంగా ఒక విశ్వాత్మ కూడా తోడున్నదని, ఒక మహా తేజోమండలంలో ఉండుండి మెరిసే కాంతి పుంజాలవలె ధర్మం, సత్యం, ప్రేమ, స్వేచ్ఛ వంటి స్వచ్ఛభావాలు తనమదిలో తేజరిల్లటం దాని ప్రభావమేనని తెలుసు. ఈ విశ్వాత్మను జ్ఞానంగా అతడు పేర్కొంటాడు; అది నాదీ కాదు, నీదీ కాదు, ఎవరిదీ కాదు; మనమే దానివారము; దాని ఆస్తి, ఆశ్రితులం. తన అతి నిర్మల గంభీర క్షేత్ర వర్తులాల్లో ఈ చిన్న భూగోళీ కాయ వంటివాటినెన్నిటినో గుప్పిట పట్టిన అంతరిక్షమండలమే ఈ జ్ఞానం. జ్ఞానానికి ప్రాకృతిక సమానార్ధకం ఆత్మ, లేక సృష్టికర్త. ఆత్మకి కూడా జీవ చైతన్యం ఉంటుంది. దీనినే అన్ని కాలాలలోను అన్ని దేశాలలోను "దేవుడు, జగత్పిత" అని వ్యవహరిస్తూ వచ్చారు. ఈ పోలికలలో యాదృచ్ఛికత కానీ నమ్మరానిదికానీ ఏదీ లేదు; కాని అవి స్థిరమూ సత్యమూ అయి, ప్రకృతి అంతకూ వర్తించేవై ఉన్నాయని సులభంగా గ్రహించవచ్చు. ఇవి ఏ కవులో వేదాంతులో సృజించిన శబ్దాలు కావు; సహజంగానే మనిషి సాదృశ్యకారుడు. అన్ని వస్తు విషయాల్లోనూ సాదృశ్యాన్ని సామ్యాన్ని చూడగలడు. ప్రకృతి తన వస్తు విషయ సంచయం మధ్యలో అతణ్ణి నిలిపింది. అతను ఒకో వస్తువూ విషయమ్మీద దృష్టి పరపగానే సాదృశ్య కిరణాలు వాటిని పోలిన వేరేవాటిమీదికి ప్రసరించి ఒండొరులను కలుపుతూ పోతాయి. ఈ వస్తు విషయాల సహకారం లేక మనిషిని కానీ, మనిషి సహకారం లేక ఈ వస్తువిషయాలను కానీ అర్ధం చేసుకోలేము. ప్రకృతి చరిత్రలో ఈ వస్తు విషయాలన్ని ఉన్నాయంటే ఉన్నాయి కానీ వాటికే విలువాలేక బంజరు పర్రల్లా మిగిలిపోయేయి ఏక లింగ సదృశంగా. మానవ చరిత్రతో కలయిక దానికి జవజీవాలనిచ్చింది.

లిన్నేయస్, బఫన్ వంటి వారు రాసిన వట్టి పేలవ విషయాల జాబితాల్లాంటి పుస్తకాలనించి ఒక మొక్క అలవాట్లు, జీర్ణ విసర్జకావయవాల అమరిక, కీటకాల పనులు, శబ్దాలు మొదలైనవాటిని చదువరులు గ్రహించి మానవ ప్రకృతికిని అన్వయించగలిగినప్పుడే ఆ రచనలు జీవాన్నీ జనామోదాన్నీ సంతరించుకున్నది. విత్తనం అనే చిన్న శబ్దాన్ని తీసుకోండి - చిన్నా చితకా ప్రవచనకారులనుంచి, "ప్రాకృతిక దేహంలో నాటినది ఆధ్యాత్మిక దేహంగా ఎదిగినది" అని ఒక జీవం లేని మానవ కళేబరాన్ని చూచి వక్కాణించిన పాల్ ఋషి వరకూ దాన్ని మానవ ప్రకృతి లోని ఎంతెంత గంభీరావస్థలలో పోలికకి వాడారు.

తన అక్షం చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూమి మనకు రేయింబవళ్ళూ ఋతుచక్రాలద్వారా కాంతి, ఉష్ణ శీతలాల్లోని వ్యత్యాసాలను కలిగిస్తోంది. కాని మానవ జీవితానికీ ఋతువులకూ పోలిక లేదా? దానివల్లనే కద అతి సాధారణమైన ఋతువులకు ఘనత సిద్ధిస్తున్నది? ఒక చీమ దినచర్య అతి సాధారణం - దాని పరంగా చూస్తే; కాని దాన్ని చూసిన మానవుడు చీమ శరీర పరిమాణాన్నీ అతి నెత్తుకెత్తుకున్న కార్యాల ఘనతనీ వాటిలో వాటికున్న ఐక్యతనీ కఠోర శ్రమనీ సంకల్పశక్తినీ ఆకళింపుచేసుకుని తన స్వభావానికి అన్వయించుకుని ఆచరించినప్పుడు కదా ఆ అల్పప్రాణి జీవన విధానం ప్రసిద్ధినందేది. ఈ నేర్పు సాధించిన ఆటవికులు తమకవసరమైనంతవరకు మాటల అవసరం లేకుండా ఆకృతులూ చిత్రాలతో సంభాషించేవారు.

మనం చరిత్రలో మరీ వెనక్క్తి వెళితే, తన శైశవదశలో భాష కవిత్వమై, అన్ని విషయాలూ ప్రకృతి చిహ్నాలై ఉండేవి. అవే చిహ్నాలు ప్రపంచ భాషలన్నిటి మూలలై ఉన్నాయి. ఇంకా గమనించాల్సింది, అన్ని ప్రపంచ భాషా ప్రయోగాల్లోను ప్రముఖంగా వినిపించే సామెతల్లో ఒక సారూప్యం ఉంది. ఇదే మొదటి భాష, ఇదే చివరిదీను. ఇంత సహజంగా ప్రకృతిపై ఆధారపడి, మన ప్రతి మాటను చేతను దానితో అనుసంధించుకోవడం, ఇది ప్రకృతీ మనిషీ ఉన్నంతవరకు కొనసాగేదే. ఎటువంటి కృత్రిమత్వమూ లేక ప్రకృతితో మమేకమైన రైతులూ పల్లెపనివాళ్ళ భాషలోని సరసతకు ఇదే కారణం; వారి మాటతీరుకి సరదా పడనివారుండరు.

ఆలోచనకు ప్రకృతి చిహ్నాన్ని జతపరచి పలికిన మనిషి మాట యొక్క శక్తి, అతని గుణంలోని నిరాడంబరత, సత్య సంధత మరియు భాష కారణంగా భావం ఇసుమంతైనా నష్టపోకూడదనే సంకల్పం మీద ఆధారపడి వుంటుంది. మనిషి చెడిన దరిమిలా అతని భాష కూడా చెడుతుంది.

ఎప్పుడైతే గుణంలో సారళ్యమూ తలపులపై సార్వభౌమత్వమూ ఐశ్వర్యం, భోగం, అధికారం, స్తోత్రపాఠాల వంటి క్షుద్రకోరికలతో భగ్నమై - సరళతా సత్యసంధతల స్థానంలోకి వంచన, ద్రోహాలు వచ్చి చేరతాయో, ప్రకృతికి మన అంతరంగాన్ని ఆవిష్కరించగల శక్తి చాలా మేర సన్నగిల్లుతుంది; భావాలకనుగుణమైన చిహ్నాలు, చిత్రాల సృష్టి ఆగిపోతుంది; పాతమాటలు కృత్రిమమైన కొత్త విషయాలను వ్యక్తీకరించలేక వెలవెలాబోతాయి. బొక్కసంలో బంగారం నిండుకుని కాగితాల కట్టలు చలామణీలోకి దిగుతాయి.

అనతికాలంలోనే వంచన బట్టబయలై విషయంలోని అర్ధాన్నీ భావాన్నీ ఆవిష్కరించే శక్తిని మాట కోల్పోతుంది. సుదీర్ఘ నాగరికతలో వందలాది రచయితలు పుట్టుకొచ్చి పరమ సత్యాన్ని ఆవిష్కరిస్తున్నామని నమ్ముతూ నమ్మబలుకుతూ, ఒక్క మాటలోకూడ సత్య ప్రకటన చెయ్యలేక, పరాన్న జీవులై ప్రకృతి మాత ముద్దుబిడ్డలైన తొలితరం రచయితల మాటలనే ఉటంకిస్తూ ఉదహరిస్తూ నెట్టుకొస్తున్నారు. కాని జ్ఞానులు ఈ కుళ్ళిపోయిన పలుకుబడిని చించి ఎదట కానవచ్చే సహజ ప్రాకృతిక విషయ వస్తు సంచయానికి తగిన మాటలు జోడిస్తారు; ఆ విధంగా సత్యానికీ సృష్టికర్తకూ సహచరులైన వారి ప్రతి అక్షరమూ తమ స్వాధీనమూ సత్యప్రకాశకమూ అయి, బహు సుందరమైన భాషను ఆవిష్కరిస్తాయి.

ఎప్పుడైతే మన భాషణం నేల విడిచి సాము చేసి తెలిసిన వస్తువునీ విషయాన్నీ విడిచి తలపులనావరించిన క్షుద్ర వాంఛలననుసరించిపోతుందో, అప్పుడు అసంబద్ధతా అభూతకల్పనలే వినవస్తాయి.

నిజాయితీగా పలికే వ్యక్తి తన ఆలోచనాసరళిని పరీక్షించుకుంటే, ప్రభవించే ప్రతి తలపుకూ అన్వయపడదగిన ప్రకృతి విశేషం అస్పష్టంగానైనా సుస్పష్టంగానైనా మదిలో మెదిలి ఆ తలపుకు జతకలిసి నిక్కచ్చి అయిన భావప్రకటనను కలిగిస్తున్నదని తెలుసుకుంటాడు.

కనుక మంచి రచన, యోగ్యమైన భాషణలు రూపకాలంకార సహితాలై ఉంటాయి. సందర్భానికి తగిన భావ చిత్రాలు యధేచ్ఛగా వారి మదిలో ప్రవహిస్తుంటాయి. ఇది అనుభవాన్ని ప్రస్తుత సందర్భానికీ సంభాషణకీ సమన్వయపరిచే అపూర్వ కౌశలం. అదే అసలైన సృజన. అదే సృష్టికర్త తాను రూపొందించిన పాత్రలద్వారా ప్రవచించే వైనం.

దీనివల్ల, ప్రకృతి ఒడిలో పరవశించే పల్లె మనస్తత్వం కృతకమూ ఉత్సాహరహితమూ అయిన నగర మనఃస్థితి కన్న స్వచ్ఛమూ శక్తిమంతమూ అయి వుంటుందని మనకి తెలుస్తుంది. ప్రకృతి సంభాషణనే కాక అనేక ఇతర ప్రతిభావిశేషాలను పరిపుష్టం చేస్తుంది. అది మదినెంత ప్రభావితం చేస్తుందీ అంటే, ఆ తన్మయత్వంలో దాని ఉనికినే మనం విస్మరిస్తాం. వనసీమల పోషణలో ప్రభవించి ఎటువంటి ఆర్భాటమూ లేకుండా క్రమబద్ధంగా వచ్చి పోయే ఋతువుల ప్రత్యేక సౌరభాలనాస్వాదిస్తూ మేధను పదునుపెట్టుకున్న కవి, వక్త పట్నవాసులైనా అక్కడి గందరగోళంతో తమ సహజ కౌశలం ఏమాత్రం చెక్కుచెదరకుండా చూచుకున్నప్పుడే వారి కళకు శాశ్వతత్వం.

ఇకమీదట, రాజకీయ సమావేశాలు, ఉద్యమాలు, ఉగ్రవాదాలు, విప్లవాల మధ్యన సతమతమయేవారు - మారే పరిస్థితులు, చోటుచేసుకునే పరిణామాలు తమను ఉత్తేజితంచేసినప్పుడు ప్రభాత ఉషస్సులలో తమ యోచనల ఔన్నత్యానికి దీటుగా తాము చూస్తూ పెరిగిన గంభీర చిత్రాలు అందుబాటులోకి వచ్చి దిశా నిర్దేశం చెయ్యాలి. ఒక ఉన్నత భావవృత్తికి అనుగుణంగా తమ చిన్నతనపు మధురస్మృతుల్లోని వనసీమలు తలలు పంకిస్తాయి; చెట్లు ఒండొరులతో గుసగుసలాడుతాయి; నదులు కాంతులు చిమ్ముతూ ఉరకలేస్తాయి; పశుసంపద పచ్చిక మధ్య తలలు దూర్చి మేతలో నిమగ్నమవుతుంది; ఒక తలపుతో తమ మదినిండిన ఇంత ప్రకృతిని ఆవాహన చేసుకున్న వారి చేతుల్లో అధికారమూ సామర్ధ్యమూ భద్రంగా ఉంచబడతాయి.

మూడు: ఈ విధంగా ప్రకృతిలోని వస్తు విషయాల సహకారంతో మనం నిర్దుష్ట భావాల వ్యక్తీకరణ చెయ్యగలుగుతున్నాం. కానీ ఎంత స్వల్ప భావాలకై ఎంత ఉన్నత భాష వాడుతున్నాం! మనిషి రోజువారి దేశవాళీ మాటల సరఫరా కోసం ఇన్ని ప్రాణి జాతులు, ఇన్ని విభిన్న స్వరూపాలు, ఇన్ని దిఙ్మండలాల సహకారం అవసరమా! ఓ పక్క ఇంత భారీ పద సంపద మన కుండా పొయ్యీ వ్యవహారానికై నియోగించబడి వుండగా, దానిని దాని స్థాయికి తగిన ఉద్దేశాలకు ఉపయోగించలేకపోతున్నామని ఇంకోపక్క విచారపడుతున్నాం. జ్వాలాముఖి మహాగ్ని జ్వాలలను పప్పుకుండ కింద మంట కోసం వాడుకున్నట్టుంది మన పరిస్థితి. మన ఏ భావానికైనా మాటలందించడానికి అది సమున్నతంగా నిలిచినా, ఒక ప్రశ్న మాత్రం తలెత్తటం మానదు. ఆ వస్తువులు కేవలం ప్రతీకాత్మకమేనా, వాటి గొప్పదనమేమీ లేదా అని. పర్వతాలకు, కడలి కెరటాలకు, అంతరిక్ష లోకానికి మన భావాలకు మాటలు సరఫరా చేసే ప్రయోజనమే కాని వేరు లేదా?

అసలు ప్రపంచమే ప్రతీకాత్మకం. మన భాష ఉపమానాలూ ఉత్ప్రేక్షలతో నిండిన అలంకారయుక్తం; ఎందుకంటే మానవ మేధస్సే ప్రకృతికి ప్రతీక. నైతిక ధర్మయుక్త సూత్రాలకు యథా తథంగా సరిపోలదగ్గ ప్రకృతి సూత్రాలు ఉన్నాయి. తనలోని ఒకో విడిభాగంతో కనబడే దృగ్గోచర ప్రపంచానికున్న సంబంధమే దానితో కనబడని అగోచర ప్రపంచానికి వుంది. భౌతిక శాస్త్ర సూత్రాలు నైతిక సూత్రాలుగా చెలామణీ అవుతాయి. అందుకే "భాగం కన్న పూర్ణం ఘనం"; "ప్రతిక్రియ క్రియకు సమానం", "అతి చిన్న బరువుతో పెద్ద బరువును ఎత్తవచ్చు; బరువులోని లాభనష్టాలకు కాలంలోని నష్టలాభాలకు సరి" వంటి అనేక సూత్రాలు భౌతిక శాస్త్రానికీ నైతిక శాస్త్రానికీ కూడా అన్వయించదగ్గవి. వాటిని వాటి సాంకేతికార్ధంలో కాకుండా మానవ జీవితానికి అమరిస్తే వాటి విస్తృతి విశ్వజనీనమవుతుంది.

అదే విధంగా చరిత్రలో గుర్తుపెట్టుకోదగ్గ వాక్యాలు, జాతీయాలు, సామెతలు మొదలైనవి ఒక నీతి సూత్రాన్ని ప్రకృతికి అన్వయించి పలికిన సార్వజనీన భావ వ్యక్తీకరణలు.

కనుక: దొర్లుడు రాయికేమీ అంటదు; పొదలోని రెంటి కన్న చేతిలో ఉన్న ఒక పిట్టే ఎక్కువ; బుద్ధిలేని పరుగువీరుణ్ణి బుద్ధున్న కుంటివాడు గెలుస్తాడు; దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి; తొండ ముదిరితే ఊసరవెల్లి; కొండలు మోసిన ఒంటె ఆఖరి తులానికి చచ్చింది; వేరు పెంచుకున్న చెట్టు వెయ్యేళ్ళు బతుకుతుంది. - ఇలాటి జాతీయాలు ప్రభవించాయి. వాటి ప్రాథమికార్ధంలో ఇవన్నీ ఇతి సరళాలు, సామాన్యాలు కాని అవి చిరంజీవులై వేల యేళ్ళుగా చలామణీలో వున్నాయి వాటి అలంకారిక వైశిష్ట్యం వల్ల. సామెతల వలె అన్ని పిట్ట కథలు, నీతి కథలకూ ఇది వర్తిస్తుంది.

బుద్ధికీ ప్రకృతికీ ఉన్న ఈ సంబంధం ఏ కవి పుంగవుడో ఊహించి వ్రాసినది కాదు. అది సృష్టికర్త తీర్మానం. కనుక అందరికీ అందుబాటులో ఉండేది. తెలుసుకోదగ్గది. మనిషికి ఇది తెలిసి ఉండవచ్చూ తెలియకపోనూ వచ్చు. ప్రశాంతత చిక్కినప్పుడు లోతుగా యోచిస్తే, వివేక జ్ఞానికి ఒక సందేహం కలుగుతుంది - "ఈ అద్భుతములు గ్రీష్మ మేఘంవలె అంత తాత్కాలికమా? నేను అంధుడనూ బధిరుడనూ అయితే తప్ప అనుక్షణమూ విస్మయమూ తన్మయత్వమూ కలుగవలె కద?"

ఎందుకంటే పారదర్శకత విశ్వ స్వభావం. దానికన్న ఉన్నతమైన ప్రకృతిసూత్రాలు దాని గుండా ప్రసరించి దానిని ప్రకాశమానం చేస్తాయి. అదే, ప్రపంచం పుట్టిన కాణ్ణించి ప్రతి కాలంలోనూ ప్రభవించిన మేధో సంపన్నులను ఆశ్చర్యానికి అన్వేషణకు పురిగొల్పింది. ఈజిప్షియన్ల నించి బ్రాహ్మణుల వరకు, అటు పైన పైతాగరస్, ప్లేటో, బేకన్, స్వీడన్‌బోర్గ్ ఇత్యాదులు. ప్రతికాలంలోను రహదారిపక్కన ఒక సిమ్హిక కూర్చుని, వచ్చి పోయే ప్రతి ప్రవక్తనూ గమనిస్తూంటుంది. దానిచేతిలోని అతని జాతకం ప్రకారం తన పాత్రను ప్రపంచంలో పోషించి నిష్క్రమిస్తాడతను.

పరికిస్తే విశ్వాత్మ అవసరమైనప్పుడు భౌతిక రూపాన్ని ధరించడం అవసరమే; అందుకనుగుణంగా, సృష్టికర్త మదిలోని యోచనల ననుసరించి, రేయింబవళ్ళు, నదులూ ఉప్పెనలు, జంతువులూ పక్షులు, ఆమ్లాలు క్షారాలు ఇవన్నీ ఆ ఆలోచనల భౌతికరూపాల్లో అవతరించేది. ఒక యోచన అంతిమ స్వరూపం వాస్తవంగా పరిణమిస్తుంది. కనిపించే ప్రపంచం కనిపించని దాని తలపుల ఆఖరు మజిలీ.

సృష్టికర్త ఆలోచనలను పుటం పెడితే కొలిమిలో మిగిలే చిట్టెం ప్రాపంచిక వస్తువుల రూపంలో ప్రత్యక్షమవుతుంది. కనుక కనిపించే ప్రతి భౌతిక వస్తువుకు కనబడని నైతిక యోచన, సంకల్పాలతో సంబంధముంటుంది అంటాడు ఒక ఫ్రెంచ్ తత్వవేత్త.

ఒక వస్త్రం, అద్దం, పుత్తడి ఇలా మనమిష్టపడే ప్రాపంచిక వస్తువు ఏదైనా దాని రహస్యాన్ని తెలుసుకోగోరితే దాని నిర్మాత మనసు తెలుసుకోవాలి. ప్రతి శాస్త్రవిషయాన్నీ అలాగే తరచి తరచి చూడాలి. అదే విమర్శనాత్మక అధ్యయనం. ప్రకృతి, సత్యం, ధర్మాలను తమ జీవనంతో సమన్వయించిన వారి దృష్టి దోషాలు తొలిగిపోయి భౌతిక నైతిక సూక్ష్మాలను సుస్పష్టంగా గ్రహించే కౌశలం అలవడుతుంది. అంచెలంచెలుగా ప్రకృతిలోని ప్రతి వస్తువిషయాల పరమార్ధం అవగతమై గోచర కార్యాలకు అగోచర కారణాలతో ఉన్న లంకె దొరుకుతుంది.

ఒక కొత్త విషయం ఆసక్తి గొలుపుతుంది; కాని పైన తెలిపిన కారణ కార్యాన్వేషణ భీతి గొలుపుతుంది; ఏ వస్తువును సరిగా చూచినా ఆత్మ తత్వపు ఇంకో కోణం ఆవిష్కృతమవుతుంది. ఒకప్పుడు అచేతన దశలో ఉన్న సత్య స్వరూపం, వస్తు విషయాలతో అన్వయం చేసి అవగతం చేసుకున్నప్పుడు ఒక కొత్త విషయాన్ని గురించిన జ్ఞానాన్ని కలిగిస్తుంది. జ్ఞానమే శక్తి.

అయిదో అధ్యాయం : క్రమశిక్షణ

ప్రకృతి ప్రాధాన్యాన్ని ఈ విధంగా గ్రహించిన మనకి, దాని మరో పేరు క్రమశిక్షణ అనే కొత్త విషయం అర్ధమవుతుంది. ఇంతకు ముందు మనం చూసినవి ఈ ప్రయోజనంలో భాగాలు.

స్థలం, సమయం, సమాజం, శ్రమ, శీతోష్ణస్థితి, ఆహారం, చలనం, జంతుజాలం, యంత్రశక్తులు - ఇవన్నీ మనకి అనుదినమూ నేర్పే పాఠాల పరమార్ధం మితిలేనిది. వాటి బోధ మన విజ్ఞానానికీ జ్ఞానానికీ కూడా ప్రయోజనకారి. ఆ మాటకొస్తే ప్రకృతిలోని ప్రతి వస్తువూ ఒక పాఠశాల. దాని ఘనత్వం, జడత్వం, వ్యాపకత్వం, స్వరూపం, విభాజ్యత. ఆ జ్ఞానం, ఈ అద్భుత దృశ్యంలో దాని ఉనికికి సంబంధించిన అన్ని విషయాలను కలిపేందుకు విభజించేందుకు, జోడించేందుకు, కొలిచేందుకు అవసరమైన సంబారాలు సమకూరుస్తుంది. ఈ పాఠాలను వివేకం తన యోచనా ప్రపంచంలోకి బదలాయించి పదార్ధ ప్రాణశక్తుల ప్రణయ సంబంధాన్ని ఆకళింపు చేసుకుంటుంది.

ఒకటి: జ్ఞాన సంబంధమైన పరమ సత్యాల అధ్యయనమే ప్రకృతి. అతి సామాన్య వస్తువులతో మనం వ్యవహరించే తీరు వ్యత్యాసం, ఇష్టం, క్రమం, ఉనికి మరియు గోచరము, అమరిక; ప్రత్యేకం నించి సామాన్యం వరకైన ఆరోహణం; కలిపే మరియు విడదీసే శక్తుల అవగాహన వంటి పాఠాలను మనకు బోధిస్తుంది.

తయారయే వస్తువు సంక్లిష్టత, ప్రాధాన్యతలకనుగుణంగా ఈ బోధన కూడా ఉంటుంది. అన్నిటా ఒకేలా ఉండక. ప్రతి రోజు, ప్రతి యేడు, ఇలా అంతనేది లేక నిరంతరమూ నెరపే ఈ అభ్యాస ఫలితమే మన లోక జ్ఞానం. మళ్ళీ మళ్ళీ వస్తుండే చీకాకులు, ఇబ్బందులు, సంకటావస్థలు; కొనే దగ్గర బేరసారాలు వడ్డీ లెక్కలు -- ఇవన్నీ ఆ జ్ఞానానికి పదునుపెడుతూనే, ఆచరణలో పెట్టనంతవరకు మంచి ఆలోచనలు మంచి పగటికలలు మాత్రమేనని గుర్తు చేస్తుంటాయి.

ఇదే పనిని మన నిత్య జీవితపు ఆస్తి లావాదేవీలు జమాకర్చుల నిర్వహణా కూడా చేస్తుంటాయి. ఋణబాధ దారుణం; విగత భర్తృక, అనాధ, లేక మేధావులూ గొప్పవారి వారసులు కూడా రాకూడదనుకునే పరిస్థితి ఇది. ఈ బాధ పరిష్కారానికి సుదీర్ఘ సమయం పడుతుంది; ఆ క్రమంలో ఎటువంటి ధీమంతులూ నీరుగారి తమ దశను అధమాధమంగా తలచి వగుస్తారు; కాని దాని బాధన, బారిన పడేవారికి మాత్రం అది నేర్పే పాఠాలు ఎంతో అమూల్యం, ఆవశ్యకం. మరోటి, సిరిసంపదలు. దాన్ని మంచుతో పోల్చారు. నేడు దట్టంగా నేలంతా అదే, రేపీపాటికి కరిగి ఆవిరై గాలిలో అని. లోపలి యాంత్రిక చలనానికి గడియారపు ముళ్ళు సూచికలైనట్టు, ఇవన్నీ కనబడని నిగూఢ యంత్రాంగానికి బాహ్య రూపాలు. ఇప్పటి అనుభవాలైన ఈ పిల్లిమొగ్గలు, తేనెపట్టులో మకరందంలా జీవాత్మ ఎరుకలో నిగూఢ న్యాయసూత్రాల అవగాహన రూపంలో ఎప్పట్నించో ఉంటున్నవే.

ప్రకృతిలోని వస్తు విషయ సముదాయాన్ని, తన జీవితంలో వాటి ప్రభావాన్ని ఎంత అలవోకగా అర్ధంచేసుకుంటాడనే అంశం మీద ఆ మనిషి తత్వమూ భాగ్యమూ ఆధారపడుంటాయి. ఉదాహరణకి అంతరాలనీ వ్యత్యాసాలనీ అంచనా వెయ్యగలగడం; అందుకోసమే, విషయాలు ఎవరో తొక్కి కుక్కిన గందరగోళపు వుండ కాదనీ, దేనికదే పరస్పర సామరస్యంతో కలిసిన అల్లిక అని నేర్చుకునేందుకు ప్రకృతి మనకి ప్రదేశాన్నీ కాలాన్నీ ప్రసాదించింది.

ఒక గంట ఒక నాగలి దేని ప్రయోజనం దానిదే. ఒకటి రెండోదాని పని చెయ్యలేదు. నీటిని తాగాలి; బొగ్గుకు నిప్పెట్టాలి; ఊలును తొడగాలి; అంతే కాని ఊలును తాగలేము, నీటిని అల్లలేము, బొగ్గును తినలేము. వివేకవంతుడు తన విజ్ఞానాన్ని వస్తువుల తారతమ్యాన్ని క్రమాన్ని గ్రహించేందుకు వినియోగిస్తాడు; అతని దృష్టిలో ప్రయోజనకర వస్తువులూ విషయాల విస్తృతి ప్రకృతి అంత ఘనమైనది. వివేకహీనులకీ తెలివిడి కొరవడి మనుషులంతా ఒకే మూస అనుకుంటారు; వారి దృష్టికి మంచిది అనిపించనిదల్లా చెడ్డది; వారు ద్వేషించని ప్రతిదీ ఉత్తమమైనది. కాని ప్రకృతి మనకి నేర్పే పాఠాలు ఎంత సమున్నతమైనవి! ఏ తప్పులనూ అది క్షమించదు. తన అవును అవునే; కాదు కాదే.

వ్యవసాయ, ఖగోళ, జంతు శాస్త్రాల ఆచరణలో మొదటి అడుగులు వేసేవారు - అంటే ఒక రైతు, ఒక విలుకాడు, నావికుడు వగైరాలు - నేర్పేది, ప్రకృతి చేతిలోని పాచికలు చక్కగా అమర్చబడి, ఎప్పుడెన్ని కళ్ళు పడాలో నిర్ణీతమై ఉంటాయని, తన చెత్తకుప్పల కింద ఎన్నెన్నో ప్రయోజనకర ఫలితాలు కప్పెట్టబడి వున్నాయని.

ఎంత నిమ్మళంగా ఉల్లాసంగా మనసు ప్రకృతి సూత్రాలను ఆకళింపు చేసుకుంటుంది! ఎంత గంభీర భావోద్వేగాన్ని సువిశాల ప్రకృతి మధ్యన నిలిచి ఆ క్షణాన్ని ఆనందించగల ఉనికి తను కలిగినందుకు గర్వపడే మానవుడు పొందుతాడు! అతని ఆత్మావలోకనమే అతనిని పరిశుద్ధపరుస్తుంటుంది. ప్రకృతి సౌందర్యమంతా అతని హృదయంలోనే తొణికిసలాడుతుంటుంది. ఈ అనుభూతి చెందగల మనిషే గొప్పవాడు; కానీ అది కలిగించిన సృష్టి కాదు; ఎందుకంటే ప్రకృతి సూత్రాలను అవగాహన చేసుకున్నవారి ఎదట దేశ కాల సంబంధాలు కనుమరుగైపోతాయి.

ఇక్కడకూడా మనం అన్వేషించగగిన విశ్వపు పరిమాణం కొంత కలవరం కలిగిస్తుంది. "తెలియనిదేదో తెలిసికొనుటయే తెలియుట" కదా. ఈ మధ్యకాలపు సైన్సు పత్రికేదైనా తిరగేసి అందులో కాంతి, ఉష్ణం, విద్యుత్తు, అయస్కాంత తత్వం, దేహధర్మ సూత్రాలు, భూగర్భ సూత్రాలు అన్నీ చదివినమీదట ప్రకృతిశాస్త్రంలో ఎన్నో వంతు తెలుసుకున్నామో ఇంకా ఎంత మిగిలుందో మననం చేసుకుంటే అర్ధమవుతుంది ఇంకా ఎంత తెలిస్తే తెలిసినట్టో.

ప్రకృతి అధ్యయనంలో రెండు ముఖ్యాంశాలు విస్మరించజాలనట్టివి.

సంకల్పమూ మరియు శక్తిని గురించి ప్రతి సంఘటనా బోధిస్తుంది. పుట్టినప్పుడు అతి దుర్బలుడైన శిశువు క్రమక్రమంగా తన మనశ్శరీరాలను శక్తివంతం చేసుకుంటూ ఒకనాటికి "అభీష్ట సిద్ధిరస్తు" అని దీవించగలిగే స్థాయికి చేరుకున్నప్పుడు తాను ఈ ప్రపంచ విశ్వవిద్యాలయంలొ తనకే పరిమితమైన సామాన్య పాఠాలనే కాకుండా విధినే పునర్లిఖించగల మహోన్నత శక్తులను కూడా శాసించగల సంకల్ప సామర్ధ్యాలను సముపార్జించానని, అవన్నీ తన తత్వంలో అతి వినయంగా ఒదిగి ఉన్నాయని గ్రహిస్తాడు.

ప్రకృతిదెప్పుడూ మధ్యవర్తి పాత్రే. అది మన సేవకై నియోగింపబడింది. మనిషి ఆధిపత్యాన్ని అది చాకిమూటలు మోసే గార్దభంలా మోస్తుంది. తన రాజ్యాలనూ సంపదలనూ మనిషి పరం చేసి వాటితో అతను తన సౌకర్య సౌలభ్యాలను సృష్టించుకునే వెసులుబాటు కలిగిస్తుంది. దాని సంపదను కర్చుపెట్టడం అతనికి విసుగు రాని పని. అతి సూక్ష్మమూ కోమలమూ అయిన దాని గాలిని తీసుకుని తన వివేకాన్నీ స్వరజ్ఞానాన్నీ చేర్చి కూర్చిన మాటల మాలికలు మంత్రాలై ఉపదేశాలై దేవదూతలవుతున్నాయి. ఒకటొకటిగా ప్రపంచాధిపత్య పగ్గాలను విజయవంతంగా గుప్పిట్లోకి తీసుకుంటున్న అతని ఆలోచనల కనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ప్రపంచం అతి త్వరలోనే అతనికి ప్రతిరూపమయే దిశగా కదలుతోంది.

రెండు: చైతన్యశీలమైన వస్తు విషయాలు వివేకజ్ఞానపు అంచనాలకనుగుణంగా సంభవిస్తూ ఆ జ్ఞానాన్ని ప్రతిఫలిస్తాయి. అన్ని విషయాలు నైతికమే; మితిలేని ఎన్నో విధాలుగా రూపాంతరం చెందే అవి వాటి ఆధ్యాత్మిక స్వభావాన్నీ ప్రకటిస్తాయి. అందువల్ల ఎన్నో రూపాలు, వర్ణాలు, పదవిన్యాసాలతో ప్రకృతి ఇతర దివ్యలోకాలకు తీసిపోని శోభను కలిగి వుంది.

మట్టిలో పడున్న ఉప్పురాయి నించి అత్యున్నత జీవన సత్యాలవరకైన రసాయనిక పరివర్తన; ఒక మొలక తలెత్తిన క్షణం నించి మహారణ్యాభివృద్ధి వరకైన వృక్ష చైతన్య విన్యాసం; ఒక ఏకకణ అనాది జీవి మొదలుకుని హెర్క్యులిస్ వంటి పరిపూర్ణ మానవుని వరకైన జంతులోక వికాసం - ఇత్యాదులు, మనిషికి అతి స్పష్టంగా తప్పేదో ఒప్పేదో దశ దైవ శాసనాలవలె ఘోషిస్తాయి.

అందువలన, ప్రకృతి సదా మతధర్మానికి సహకారి. తన వైభవాన్నీ సిరులను ధర్మ ప్రతిష్ఠాపన కోసం నియోగిస్తుంది. ప్రవక్త, ఆచార్యులు, దావీదు, ఏసయ్య, జీసస్ - వీరందరూ ఆ వైభవామృతాన్ని గ్రోలినవారే. ఈ ధార్మిక స్వభావానికి ప్రకృతి తోడ్పాటు అతి సహజమూ అస్థిగతమూ అయి, అదే దాని ఉనికికి పరమార్ధమా అనిపిస్తుంది.

ఏ వస్తువైనా, పూర్తిగా గాని దానిలో కొంత భాగం కాని ఒక అతి సామాన్య అవసరాన్ని తీర్చగలిగితే, అది ఉమ్మడిదీ, విశ్వజనీనమూ అయి అందరి వినియోగానికి అందుబాటులో ఉంటుంది. ప్రకృతి వనరు ఒక సారి వాడకంతో హరించుకుపోయేది కాదు. అల కాక దాన్ని పరిపూర్ణంగా ఏ ప్రయోజనంలోనైనా వాడుకోవడం జరిగితే, అప్పుడు ఆ ఫలితానికి ఇంకో కొత్త లక్ష్యం తయారుగా ఉంటుంది. సృష్టిలో ప్రతి ముగింపూ ఒక ప్రారంభానికి నాంది.

కనుక ఏదైనా వస్తు ప్రయోజనం, అది తీర్చిన కోరికే అనుకుంటే అది అధమమూ, నీచము. అయితే అట్టి భావన ఈ ప్రయోజన ప్రక్రియలో వారు నేర్చిన పాఠం - వస్తువు మంచితనం అది తీర్చే కోరికని బట్టి ఉంటుంది అని, ఒంటిగా గాని సమిష్టిగా కాని వస్తువులు మనకి లాభాన్నివ్వాలి అని. ఈ సత్యపు మొదటి మరియు స్థూల వ్యక్తీకరణకి ఆధారం, మన దృష్టిలో విలువ అంటే కడుపు నింపేది అనే భావన.

ప్రకృతిలో సంభవించే ప్రతిదీ ఒక నీతి వాక్యమని ఇంతకుముందు అనుకున్నాము. దాని కేంద్రస్థానంలోని ధర్మ కిరణాలు ప్రకృతి ఉపరితలం మీదికి ప్రసరిస్తుంటాయి. ప్రతి వస్తువు, ప్రతి విషయము ప్రతి సంబంధమూ దీనిననుసరించి నడుస్తాయి.

మన ప్రతి చేతనించి మనకి ఓ బోధ లభిస్తుంది. ఒక సామాన్యమైన పంటపొలాన్ని చూడండి, అది ఒక ప్రవచనమే కద. పొల్లు, ధాన్యం, కలుపు, పంట, చీడ, వాన, పురుగు, సూర్యుడు -- ఏరువాక నించి పంటకోత వరకైన ప్రతి క్షణమూ ఒక పవిత్ర నిగూఢార్ధానికి సూచికే. ఒక నావికుడు, పశులకాపరి, గని కార్మికుడు, వర్తకుడు - వ్యాపారం ఏదైనప్పటికీ వీరందరికి లభించే బోధ ఒకదానితో ఒకటి సమాంతరం, సమానం. అన్ని వ్యాపారాల నడకా ఒకటే.

అదే విధంగా గాలిలో ప్రసరించి, విత్తులో వృద్ధినంది, నదీజలాలకు జవజీవాలనిచ్చే ఈ ధర్మ సూత్రం మనిషి దృష్టిలో పడి అతని ఆత్మలో లీనమవుతుందన్నది కూడా నిస్సందేహం. ఒక మనిషి ప్రకృతినించి ఈ ప్రబోధ ఎంత స్వీకరిస్తాడో, అంత మేరకు దానిచే ప్రభావితుడౌతాడు.

అయితే ఎవరు దీనిని అంచనా వెయ్యగలరు? కెరటాల తాకిడిని లెక్కచెయ్యక సమున్నతంగా సాగరంలో నిలిచిన రాతికొండ ఒక మత్స్యకారునికి ఎంత నిశ్చలత్వాన్ని బోధించిందో ఎవరెరుగుదురు?

తన యవనికపై దిగంతాలు దద్దరిల్లే కాటుక మేఘాలు కరాళ నృత్యం చేసి వెళ్ళిపోయినా ఒక జాడ కానీ మరక గానీ లేకుండా ఆహ్లాదకరంగా నిలిచే నీలాంబర అనంతాకాశం తనను చూసి ఆశ్చర్యపోతున్న మనిషికి ఎటువంటి హృదయనైర్మల్యాన్ని కలిగించిందో; లంఘించబోయే ముందు అడుగులో అడుగేసుకుంటూ తక్కుతూ తారుతూ క్రూరమృగం తన మూకాభినయం నించి ఎటువంటి శ్రమ, అదృష్టం, స్నేహభావాలు నేర్పిస్తుందో; ఆరోగ్య మహాభాగ్యం పెరుగూ తరుగులకు కారణాన్ని తెలుసుకునే ప్రక్రియ ఎంత నియతేంద్రియత్వాన్ని ప్రబోధిస్తుందో కదా.

ఇక్కడే ప్రకృతిలోని అన్ని సంఘటనల సామ్యమూ ప్రస్ఫుటమయేది. వైవిధ్యంలో ఐక్యత. అంత వైవిధ్యం కలిగిన అన్ని సంఘటనలూ ఒకే తరహా ప్రబోధ చేస్తాయి.

జినోఫేన్స్ అనే ఆయన తన వృద్ధాప్యంలో, వెనక్కి చూసుకుంటే, జరిగిన అన్ని సంగతుల్లోనూ ఒకే ఐక్య భావన కలిగి, అన్నిటా ఒకదాన్నే చూడటం విసుగనిపించేదిట. ప్రోటియస్ నీతికథలో ఒక మైత్రీపూర్వక సత్యం ఉంటుంది. ఒక అకు, నీటి బిందువు, స్ఫటికం, కాలలోని ఒక క్షణం - ఇవన్నీ ఒకే పరిపూర్ణతతో సందానం కలిగి, దానినించి తమకు వలసినంత పూర్ణతను స్వీకరిస్తాయని. ప్రతి అణువూ ఒక సూక్ష్మ ప్రపంచమై, అనంత సృష్టిని అనుసరిస్తుందని.

దగ్గర పోలికలున్న వస్తువుల మధ్య ఉండే సామ్యమే కాక అసలు పోల్చే వీలే లేనట్టున్న వాటికి కూడ సారూప్యం ఉంది. శిల్పకళను ఘనీభవించిన సంగీతం అన్నాడు గొయథె. శిల్పి సంగీతజ్ఞుడై ఉంటాడంటాడు విట్రూవియస్. మతానికి శిలారూపమే గోథిక్ చర్చి అంటాడు కాల్‌రిడ్జి. మైకేలాంజిలో ప్రకారం, శిల్పికి మానవశరీర శాస్త్రం తెలిసుండాల. స్వర శిల్పి హేడెన్ సంగీత రూపకంలోని రాగతాళాల విన్యాసం పాము మెలికలనూ, లేడి గంతులనూ, గజగమనాన్నే కాక పచ్చని పచ్చిక బయళ్ళంటూ రంగుల్నీ ఆవిష్కరిస్తుంది. సంగీత ప్రపంచంలోని స్వరాల మేళన వైచిత్రి చిత్ర ప్రపంచంలోని రంగుల సమ్మేళన లో కూడా కానవస్తుంది.

నల్ల శేనాపరాయికీ దాన్ని కరిగిస్తూ పారే నదికీ కూడా సామ్యమే; వస్తువు వేడిమిలో హెచ్చుతగ్గులు తప్పిస్తే. అలాగే పారే నదికి దాని కన్న ఎత్తుగా వీచే గాలితో; గాలికి, దానిపై స్వారీ చేస్తూ శూన్యంగుండా ప్రసరించే కాంతికిరణాలకూ కూడా సామ్యమే. ప్రతి సృష్టీ సవరించిన ఇంకో ప్రతి సృష్టి. వాటి మథ్య గల భేదం కన్న సామ్యం హెచ్చు. నిగూఢార్ధం అయితే ఒకటే. ఒక శాస్త్రాన్ని, లేదా వ్యాపారాన్ని నడిపే సూత్రం అన్నిటికీ వర్తించేదే. ఈ అన్యోన్యత ఎంత దగ్గరంటే, దాన్ని సులంభంగా గ్రహించవచ్చు; అది ప్రకృతి లోపల ధరించిన దుస్తు వంటిదై, తన విశ్వ్యవ్యాపకత్వం లో తన మూల స్వభావాన్ని మరుగుపరుస్తుంది, చూచేవారి బుద్ధినీ ఆవరిస్తుంది కనక. మనం మాటల్లో వ్యక్తపరిచే ప్రతి విశ్వజనీన సత్యమూ ఇతర సత్యాలను కూడా వ్యక్తపరుస్తుంది. ఓమ్నే వెరుం వెరో కన్సొనాట్ - అంటే ప్రతి నిజమూ ఇతర నిజాలను అంగీకరిస్తుంది. మహాగోళం చుట్టు గీసిన పెద్ద వృత్తంలో ఇతర చిన్న వృత్తాలన్నీ ఇమిడిపోయినట్టు. అటువంటి ప్రతీ సత్యమూ పరమ సత్యమే. కానీ దానికింకెన్నో ముఖాలుండవచ్చు.



చేతల్లో ఈ ఐక్యత ఇంకా స్పష్టం. గూఢమైన అంతరంగపు బాహ్యప్రకటనమే మాట. దాని విస్తృతిని అవి ఆవిష్కరింపజాలవు. వ్యక్తంలో ఛిన్నమై చిన్నవై అసంపూర్ణంగా చూపుతాయి. కాని చేత సంపూర్ణ మనఃస్థితిని ప్రకటించేది. ఒక మంచిపని కంటికింపైనది, సృష్టి విలాసానికి దీటైనది. వివేకవంతుడు ఒకటి చేస్తే అన్నీ చేసినట్టే. అతడు సరిగా చేసిన ఒక పని, సరిగా చెయ్యగల అన్నిపనులకూ సమానం.

No comments:

Post a Comment