రచయిత ముందుమాట
ఈ పుస్తకం రాయమని నన్ను ప్రోత్సహించినవారు ఆండ్రూ కార్నెగీ. అతి సామాన్య స్థాయినించి ఒక బిలియనీర్ గా ఎదిగిన తన ప్రస్థానన్ని వివరిస్తూ, ఆ స్థాయికి చేరేందుకు తాను ఆచరించిన రహస్య సూత్రాన్ని నాకు చెప్పారు. ఇది లోకమంతకూ వెల్లడి చెయ్యదగ్గ రహస్యం.
దీనిని పుస్తకరూపంలో వివరించేందుకు ఎన్నో యేళ్ళు పట్టవచ్చు. అంత సమయమూ ధైర్యమూ నీకుంటే అది చేపట్టి అందరికీ అది చేరేలా చూడు అన్నారు. వారి స్ఫూర్తి, ప్రోత్సాహం, ఇంకా నా జీవితకాలంలో నాకు పరిచయమైన రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, కళాసంపన్నులు మొదలైన ఐదువందలమంది ప్రముఖుల అనుభవాలు ఈ పుస్తక రచనకి ప్రేరణ. సంపద కేవలం ధనరూపేణా మాత్రమే కాక బలపడిన స్నేహ సంబంధలు, నిలదొక్కుకున్న వ్యాపారం, ఆధ్యాత్మిక ఉన్నతి రూపంలో కూడా సాక్షాత్కరిస్తుందని పాఠకులు తెలుసుకుంటారు. ఈ పుస్తకంలోని విషయలన్నీ వాస్తవాలే; కల్పన కాదు. ఆఖరుగా ఒకటి చెప్పి ఆరంభిస్తాను. అన్ని సంపదలూ మన ఆలోచనలో జీవం పోసుకుంటాయి. దాన్ని మనం పెంచి తీర్చిదిద్దిన విధంగా అవి వాస్తవరూపం సంతరించుకుంటాయి. భావనలోనె భాగ్యములుండును.ఉపోద్ఘాతం
ప్రతి వస్తువు, ప్రతి సంఘటన తొలుత ఒక ఆలోచనే. ఆ ఆలోచనకి దాన్ని సాకారం చెయ్యాలన్న బలమైన కోరిక తోడయినప్పుడు ఆ బీజం అంకురించి వాస్తవరూపం దాల్చడం ఆరంభిస్తుంది.
ఎడ్విన్ సి బార్‌న్‌స్ ఒక చురుకైన సాధారణ యువ సేల్స్‌మన్. తనకాలంలో జగద్విఖ్యాతినందిన ప్రముఖ శాస్త్రవేత్త, విజ్ఞాన ఆవిష్కర్త థామస్ అల్వా ఎడిసన్ తయారు చేసిన పరికరాలు అమ్మిపెడుతూ ఎందరో మిలియన్లు ఆర్జిస్తున్నారు. అది తనకి నల్లేరుమీది నడక. కాని బార్‌న్‌స్ అలోచన ఇంకోలా ఉంది. అది, థామస్ ఎడిసన్ ఆవిష్కరణలు అమ్ముకుంటూ కాక అతనికే వ్యాపార భాగస్వామి కావాలని. అతని కోరిక ముఖ్య లక్షణం, అది అస్పష్టంగా కాక, నిర్దుష్టంగాను, స్పష్టంగాను ఉన్నట్టిది. ఓ పగటి కల కాదు. బలమైన ఆకాంక్ష. జరిగితీరాలి.
కాని స్థాయిపరంగా తను నేలమీదుంటే ఎడిసన్ అంతరిక్షంలోని వ్యక్తి. తనెంత ఎత్తుకి ఎగిరితే అక్కడికిచేరుకుని అతనికి వ్యాపార భాగస్వామి కాగలడు. అయితే తన సంకల్పం మహా శక్తివంతమైనది. తలచినదే తడవు, ఇంకే పరిమితులూ పరిస్థితులూ దానిని నీరుగార్చనివ్వకుండా చేత కాసైనా లేక గూడ్సు బండీలో నక్కి వందలమైళ్ళ దూరంలోని ఎడిసన్ ప్రయోగశాల ఉన్న ఊరికి చేరుతాడు.
ఎన్నో ప్రయత్నాలతరవాత ఎడిసన్ దర్శనం లభిస్తుంది. ఊరూపేరూ తెలియని ఆ యువకుడి కోరిక వినగానే "వీడెవడు తాడూ బొంగరమూ లేని ద్రిమ్మరిలాగున్నాడు నాతో భాగస్వామ్యమేమిటి పిచ్చి కాబోలు ననిపించింది. అతనేం మాట్లాడేడన్నది పక్కన పెడితే, అతని కళ్ళలో ఏదో ప్రపంచాతీతమైన సంకల్పమూ పట్టుదలా నాకు గోచరించేయి. ఎవరైతే ఒక లక్ష్యంకోసం జీవితాన్నంతనూ ధారపోసి దాని సాధనలో అహర్నిశలూ శ్రమిస్తారో అది వారికి లభిస్తుందని నాకు తెలుసు. అది ఎవరూ ఆపగలిగేది కాదు. అందుకని ఒక అవకాశం ఇద్దాం అని నిర్ణయించుకున్నాను. అది తప్పు కాదని చరిత్ర నిరూపించింది. " అన్నాడో సందర్భంలో థామస్ ఎడిసన్.
మాటలకన్న మనసు ప్రధానం. అదే సంకల్పానికి తోడైన బలమైన కోరిక ప్రభావం. దానికి అసాధ్యాలుండవు.
బార్‌న్‌స్ కి కొలువు అంత సులభంగ కుదరలేదు. తనకు మామూలుగా వచ్చే జీతంకన్న తక్కువకి ఎడిసన్ ప్రయోగశాలలో ఓ చిరుద్యోగిగా కుదురుకున్నాడు. అది తన కాబోయే వ్యాపార భాగస్వామి తననీ తన నైపుణ్యాలనీ దగ్గరగా చూచే అవకాశం కల్పించింది. అతనికి తెలుసు తన లక్ష్యసాధన మార్గంలో ఇదొక చిన్న మజిలీ మాత్రమె. ఇంకోటి గ్రహించాడు. లక్ష్యం మీద మనసు కేంద్రీకరించినకొద్దీ సంకల్పం బలపడుతోంది. సంకల్ప బలం ముందు ఎట్టి అవరోధాలూ వ్యతిరేకతలూ పనిచెయ్యవని అర్ధం చేసుకున్నాడు.
కొన్నేళ్ళకి మొదటి అవకాశం వచ్చింది. ఎడిగ్రాఫ్ పేరుతో ఎడిసన్ ఒక డిక్టాఫోన్ రూపొందిస్తే దాన్ని అమ్మే అవకాశం కలిగించమని అడిగాడు బార్‌న్‌స్. మొదటి యంత్రాన్ని అమ్మినాక మాటల్లో అతని కౌశలానికి ముగ్ధుడైన ఎడిసన్ దేశవ్యాప్తంగా వాటినమ్మే బాధ్యత అతనికిస్తాడు. క్రమక్రమంగా అతను అమ్మిన ప్రతి ఎడిగ్రాఫుకీ, నిర్మాణం ఎడిసన్, బిగింపు బార్‌న్‌స్ అని చెప్పుకునేంత ప్రజాదరణ సాధిస్తాడు. అటు తరవాత సుమారు ముప్ఫై యేళ్ళు వారిద్దరి వ్యాపార భాగస్వామ్యం కొనసాగింది.
బార్‌న్‌స్ ఒకటి నిరూపించాడు. సంకల్పానికి బలమైన కాంక్ష తోడై, దానికోసం శ్రమిస్తే అసాధ్యమనేది ఉండదని. తనకి డబ్బు లేదు, పెద్ద చదువు లేదు, ఉన్నదంతా గుండెలనిండా ఆత్మ విశ్వాసం, స్థిరమైన లక్ష్యం. ప్రత్యక్ష ప్రపంచంలో సాధ్యమయే ప్రతిదీ అగ్రాహ్యమూ అగోచరమూ అయిన ఆలోచన నుంచే ఉద్భవిస్తుందన్నది వాస్తవం.
అయితే కళ్ళెదట సంపదలు కనబడుతున్నా చేతికందేవేళకి చతికిలబడిపోయి చేజార్చుకున్న ఒకరిని ఇప్పుడు చూద్దాం.
బంగారానికి బారెడు దూరంలో
సుమారు నూటా యాభై యేళ్ళక్రితం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో బంగారు గనులు ఉండేవి. తమకున్న పరిజ్ఞానంతో జనులు వాటికోసం తవ్వుకునేవారు. భాగ్యశాలురకి బంగారం దొరికేది. అందరూ పలుగూ పారా పట్టుకు పరిగెత్తేవారు. అందుకని వాటిని గోల్డ్ రష్ అంటే పసిడికోసం పరుగుల రోజులు అంటారు.
ఈ పరుగులో డార్బీ అనే కుటుంబమూ ఉంది. డార్బీల బాబాయి ఒకాయన తన పరిజ్ఞానంతో పసిడి భూమిని కొలొరాడో ప్రాంతంలో గుర్తించి తవ్వకాలు ఆరంభించాడు. తవ్వగా తవ్వగా భూమి కఠినమై భారీ యంత్రాల సహాయం అవసరపడుతుంది. దానికోసం కుటుంబం యావన్మందీ చేతులు కలిపి నిధులు సమకూర్చుకుని పెట్టుబడే కదాని యంత్రాలు కొంటారు. యంత్రాలూ పని చేస్తాయి కాని బంగారం పడదు. అడుగూ అడుగూ యంత్రం ఉత్త మట్టిని తోడిపోస్తూ భూగర్భంలోకి పోయేకొద్దీ వీరి ఆశలు ఆకాశంలోకి ఆవిరయిపోవడం కొనసాగిస్తాయి. చివరికి నిస్పృహతో ప్రయత్నాన్ని వదిలి కొన్న యంత్రాలని కొనేందుకు ముందుకొచ్చిన తుక్కు వ్యాపారులకి అమ్మేస్తారు.
అయితే ఒక తుక్కు వ్యాపారి తను కొనుక్కున్న యంత్రాన్ని తీసుకుని డార్బీలు తవ్వి వదిలేసిన చోటికి ఒక భూగర్భశాస్త్ర నిపుణుణ్ణీ తీసుకెళ్ళి పరీక్ష చేయిస్తాడు. అతను మట్టి నమూనాలు తీసుకుని అంటాడు. "పాపం వాళ్ళకి భూగర్భపు పలక అమరిక తెలీదు. ఇంత శ్రమా పడి భాగ్యానికి బారెడు దూరంలో విరమించుకున్నారు. ఇదే ఇంకొంచం తవ్వు అని సూచిస్తాడు. తుక్కు వ్యాపారి తవ్వి అపార పసిడి నిల్వలు సొంతం చేసుకుంటాడు.
డార్బీల కుటుంబం కుదేలైపోయింది. ఒక అందులో ఆర్ యూ డార్బీ అందరికన్న చిన్న. బీమ యేజెంటుగా చేరి ఒక్కొక్కటిగా కుటుంబపు అప్పులన్నీ తీర్చుకుంటాడు. అయితే ఈ భంగపాటు వల్ల అతనికి ఒకటి తెలిసింది. స్వర్ణం భూమిలో కాదు బుర్రలో ఉంటుంది. డీలాపడక, పట్టువీడక సాధన సాగించినవారికి అది చేతికందుతుంది. భూమి తవ్వకంలో నేర్చిన ఈ పాఠం బీమా అమ్మకంలో అక్కరకొచ్చింది. తన వృత్తిలో ఎదురైన ప్రతి తిరస్కారమూ సంకల్పాన్ని దృఢం చేసింది.
యాభై సెంట్ల పట్టుదల
డార్బీ ఓ సారి పల్లెటూర్లో ఉన్న తన మేనమామ ఎస్టేటుకి వెళ్తాడు. మేనమామకి పెద్ద పొలమూ పుట్రా, మిల్లూ, పనిచేసేందుకు బోలెడుమంది నల్లజతి పెద్దా పిన్నా. అతను డార్బీని చూచి పలకరించి తన పని తాను చేసుకుంటూనే సంభాషణ సాగిస్తాడు. అప్పుడు మిల్లు తలుపు తెరుచుకిని ఓ చిన్న నల్ల అమ్మాయి లోనికొస్తుంది. మేనమామ చిరాకుపడి ఎందుకొచ్చేవని అడుగుతాడు. ఆ పిల్ల కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ మా అమ్మ ఓ యాభై సెంట్లు ఇవ్వమంది అంటుంది. సెంటూ లేదు బంటూ లేదు అవతలకి ఫో అని కసురుతాడు. యెస్సా అని ఆ పిల్ల అంగుళం కదలకుండా అక్కడే నించుంటుంది. మాటల్లో మునిగిన మేనమామ కాసేపటికి పిల్లని చూచి ఇంకా ఇక్కడే ఉన్నావేం, అని అడుగుతాడు. యాభై సెంట్లు అంటుంది. చెప్పేను కదా. పోతావా దీంతో ఒక్క పెట్టు పెట్టనా అని అక్కడున్న పారని ఎత్తుతాడు. డార్బ్బీకి భయమేస్తుంది. అవి బానిసలు యజమానులకి ఎదురుపడి మాట్లాడటం అపచారమన్న గడ్డురోజులు. అందులో చిన్న పిల్ల. మళ్ళీ యెస్సా అంటుందే కాని కదలదే. ఇంకాసేపటికి మేనమామ ఆగ్రహం కట్టలుతెంచుకుంటుంది. ఇంకా పోవూ చూడు నిన్నేంచేస్తానో అని పిల్ల మీదకెళతాడు. ఆ పిల్ల ఎత్తిన కన్ను దించకుండా, ఒక్క అంగుళం బెసక్కుండా, అతనంత తీవ్రంగానూ కీచుగొంతుతో అరుస్తుంది. "యాభై సెంట్లు కావాలి" అని ఒక్కొక్క అక్షరాన్నే వత్తి పలుకుతూ.
అమితాశ్చర్యకరంగా మేనమామ పలుకూ పౌరుషమూ పడిపోతాయి. మౌనంగా జేబులోంచి యాభై సెంట్లు తీసి ఆ పిల్ల చేతిలో పెడతాడు. అది అందుకుని పిల్ల వెనక్కి ఒకో అడుగూ వేసుకుంటూ వెళ్తుంది తను ఇప్పుడిప్పుడే జయించిన పెద్దమనిషిని రెప్పార్పకుండా చూస్తూ. ఆమె వెళ్ళిన పది పదిహేను నిమిషాల వరకు అటుగా శూన్యంలోకి చూస్తూ మేనమామ చతికిలబడతాడు.
డార్బీకి ఇది ఇంకో పాఠం. నల్లవారిమీద తెల్లవారి ఆధిపత్యం అంత బలంగానూ ఉన్న ఆ రోజుల్లో ఒక నల్లపిల్ల అవలీలగా తెల్ల యజమాని నోరు మూయించేసింది. ఏం జరిగింది. ఏమిటి కారణం. ఏమిటి ఆమె ఆయుధం. ఇది అని ఏమీ తెలియకున్నా తన వృత్తిలో సవాళ్ళు ఎదురైన ప్రతిసారీ ఈ పిల్లనీ, ఏమాత్రం కంగకుండా స్థిరంగాను స్పష్టంగాను యాభై సెంట్లు కావాలి అంటూ ఒక్కో మాటను ఒత్తిపలికిన ఆమెను గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా, తన మేనమామ ముందు ఆమె ఎంత? ఈ కస్టమరు ముందు తనెంత? అనే పోలిక వచ్చి తన ముందున్న సవాలు అతి సామాన్యం అనిపించేది. మనసులో "నేను నీకు పోలసీ చేసి తీరుతాను" అని ఆ పిల్లని అనుకరిస్తూ మననం చేసుకుని అన్నంత పనీ చేయగలుగుతాడు. అనతికాలం లోనే అమెరికాలో ప్రముఖ బీమా యేజెంట్లలో ఒకడై మిలియన్లు సంపాదించి జీవితంలో సమున్నతంగా సగర్వంగా నిలదొక్కుకున్నాడు.
అతి సామాన్యమైన రెండు వైఫల్యాలనించి ఒక ఆలోచనాపరుడు నేర్చుకున్న పాఠాలు అతని జీవితానికి అలా మార్గదర్శకమయాయి. డార్బీ వాటిని అలా విశ్లేషించుకోనట్టయితే అవి కలిగించిన తాత్కాలిక నష్టానికి కుంగిపోయి జీవితాన్ని వృధా చేసుకునుండేవాడు. కనుక భాగ్యం భావనలోనే ఉంటుంది; భూమిలోను మామ జేబులోను కాదు. సంఘటనను జరిగినది జరిగినట్టు చూచుకుని అదో ధన నష్టమనో అవమానమనో కుంగిపోయి రగిలిపోక స్తిమితంగా విశ్లేషించుకునేవారికి ప్రతి ప్రతికూలతా తనలో దాచుకున్న ప్రయోజనాలను అనుగ్రహిస్తుంది. విజయ స్పృహ ఉన్నవారికి విజయమూ, అపజయ స్పృహ ఉన్నవారికి అపజయమూ ఫలితాలు.
చాలా మంది విఫలులవడానికి కారణం, ప్రతి దాన్నీ తమ పరిమిత దృక్కోణ పరిధి నుంచే చూసి దాని గుణాగుణాలను తీర్మానిస్తారు. చికాగో యూనివర్సిటీలో విద్యార్ధులని పలకరిస్తూ ప్రధానాచార్యుడు హార్పర్ ఒక చైనా విద్యార్ధిని అడుగుతాడు ఇంతదూరం వచ్చి చదువుకుంటున్నావు ఇక్కడేమి నచ్చింది అని. ఇక్కడందరివీ పెద్ద పెద్ద కళ్ళండీ, వింతగా చూసేందుకు బాగుంటాయి అంటాడతను. అప్పటికి అతని పరిధి అంతే మరి.
ఒక పని అవుతుందనీ అవదనీ కూడా చాలామంది తమ పరిధినించే చెబుతారు. హెన్రీ ఫోర్డ్ ప్రఖ్యాతి చెందిన వీ-8 ఇంజన్ తయారు చెయ్యమని తన ఇంజనీర్లకి పురమాయిస్తాడు. కొన్ని వారాలు తర్జన భర్జనలు పడి అబ్బే అది అసాధ్యమండీ అని తేల్చేస్తారు. అన్నిపదాల్లోకీ ఫోర్డుకి నచ్చనిది అసాధ్యం. సరే. తయారీ ప్రారంభించండి. అని మళ్ళీ ఆదేశిస్తాడు. అవదని చెపినా మళ్ళీ అడుగుతాడే, ఏదో మరిచిపోయుంటామని మళ్ళీ ఇంజనీర్లందరూ ఇంకో రెండు వారాలు తర్జన భర్జనలు పడి మళ్ళీ అంటారు. కుదరదు సార్. వాహనల సాంకేతికతలో ఇటువంటిది అసాధ్యమని చెప్పేం కదా. అని. ఫోర్డ్ వైఖరి ఈ సారి తీక్ష్ణమవుతుంది. సరే రెండు సార్లు కుదరదని చెప్పేరు, విన్నాను. నాకు వీ-8 ఇంజను కావాలి. అదయే వరకు ప్లాంటులోనే వుండి పూర్తి చెయ్యండి. ఇంకే సాకులతోనూ నన్ను కలవద్దు. అని. అంతే వాహనరంగంలో ప్రపంచంలోని ఉత్తమ సాంకేతిక ఆవిష్కరణ అయిన వీ-8 ఇంజను రూపు దిద్దుకుంది. ముందు కుదరదన్న ఇంజనీర్లకే అది కుదిరింది. మొదట తమ పరిమిత పరిధిలో చూచినప్పుడు అసాధ్యమనిపించిన అది ఒక దార్శనికుడి విస్తృతమైన పరిధిలోంచి చూచినప్పుడు సుసాధ్యమయింది.
విజయస్పృహకి నిలువెత్తు నిదర్శనం హెన్రీ ఫోర్డ్. తనకేంకావాలో నిర్దుష్టంగా తెలిసినవాడు. తన సంకల్పబలమూ అది సాకారమవుతుందనే అపార విశ్వాసమూ అతని విజయ రహస్యాలు.
కంటికి కనిపించని ఏ ఈథర్ లో అయితే ఈ భూగోళం తేలియాడుతోందో, ఆ ఈథర్ ఒక అదృశ్య చైతన్య శక్తి. అది చొరని ప్రదేశం లేదు మనసుతో సహా. అన్ని ఆలోచనలూ దానితోపాటే తేలియాడుతూంటయి. ఆకాంక్ష బలం వాటికి జతపడినప్పుడు దానితో కలిసి అవి వాస్తవ రూపం దాలుస్తాయి. నిష్పక్షపాతి అయిన ఈథర్ కి మంచి తలపు, చెడు తలపు అని లేదు. దేన్నైనా సాకారం చెయ్యడమే దాని పని. అందువల్ల ఆలోచనలు చేసే విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలి. ఎటువంటి ఆలోచనలు చేస్తామో, ఎటువంటి కోరికలు కలిగియుంటామో, చుట్టూ జరిగే సంఘటనలనించి ఎటువంటి పాఠాలు నేర్చుకుంటామో అన్నది పూర్తిగా మన వ్యక్తిగతం. మన విధినీ భాగ్యాన్నీ లిఖించుకునేది మనమే.
దృఢమైన కాంక్ష ఉండాలి
బార్‌న్‌స్ ఉదంతం లో మనం గ్రహించినది, ఎడిసన్ కి వ్యాపార భాగస్వామి కావాలన్నది అతని కోరిక కాదు, ఆశ కాదు. బలమైన కాంక్ష. అతను అడిగి చూద్దాం, ఇస్తే చేద్దాం అనుకోలేదు; అనుకున్నది అనుకున్నట్టు జరక్కపోతే చేకాపుగా ఇంకో కొలువు చూసుకుందామన్న ఆలోచన లేదు. అంతగా అతను ఒప్పుకుంటే మూణ్ణాలుగు నెల్లు పనిచేద్దాం, నచ్చకపోతే ఆ అనుభవంతో ఇంకోటి అనుకోలేదు. ఒకటే ఒక్క బలమైన కాంక్ష. తను ఎడిసన్ కి వ్యాపార భాగస్వామి కావాలి. అంతే. కానీలు, కాకపోతేలు, కుదరనట్టయితేలు లేవు. దాటిన ప్రతి వంతెననీ కాల్చుకుపోయేడు. వెనక్కి దారీ లేదు. వెనకంజ మనసులోనూ లేదు. సఫలమో సర్వనాశనమో. అంతే.
అనుక్షణమూ అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో కొత్త సాంకేతికత, కొత్త నైపుణ్యాలు, కొత్త సదుపాయాలు, కొత్త రవాణా సౌకర్యాలు, సమాచార వ్యవస్థ ఇలా ఎన్నిటివో కొత్త అవసరాలు పుడుతూనే ఉంటాయి. మనిషి సాధారణ జీవితాన్ని సౌఖ్యవంతం చేసేందుకు నిరంతరం ఆలోచించే స్వాప్నికుల అవసరమూ దీనితోబాటు పెరుగుతూనే ఉంటుంది. ప్రతి కొత్త ఆవిష్కరణా తొలుత ఒక ఆలోచన. ఓరిమి, సంకల్పమూ కలిసిన ఒక స్పష్టమైన స్వప్నం. తనకి తెలీని ఒక కొత్త ప్రపంచాన్ని కనుగునేందుకు జీవితమంతా వెచ్చించిన కొలంబస్‌కి అమెరికా సాక్షాత్కరించింది. ఈ ప్రపంచానికావల ఇంకెన్ని ప్రపంచాలున్నాయోననే స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు ఖగోళ శాస్త్రజ్ఞుడు కోపర్నికస్. అబ్బే ఇవేం కలలురా బాబూ, అసాధ్యపు కలలు అని అనని వారూ లేకపోవచ్చు కాని అటువంటివి వారి నిశ్చయాన్ని మార్చలేదు. సరైనదని అనిపించిన ఏది సంకల్పించి పనిచేసినా అది సిద్ధించక తప్పదు. ఎందరో ఉద్దండులు అది ఆచరించి విజయులయారు. గుర్రాల సాయంలేకుండా నడిచే బండి కావాలనుకున్న హెన్రీ ఫోర్డ్, విద్యుత్తు వెలుగులతో ప్రపంచాన్ని ప్రకాశమానం చేసిన థామస్ అల్వా ఎడిసన్, నల్లజాతిని బానిసత్వం నించి విముక్తులను చేయ సంకల్పించిన అబ్రహాం లింకన్, పక్షిలా తామూ ఎగరాలని కలలు కన్న రైట్ సోదరులు, వార్తాహరుల సహకారం లేకుండ సందేశాలను అగ్రాహ్యమైన ఈథర్ గుండా సుదూర ప్రాంతాలకు వ్యాపింపజేసి ప్రపంచమంతా వినిపించగలిగిన మార్కొని వంటి మహనీయుల ఆవిష్కరణలన్నీ ఒకప్పుడు అదృశ్యాలు, ఎవరికైనా చెబితే హాస్యాస్పదాలు అనిపించిన స్వప్న సంకల్పాలే. కాని ప్రపంచం స్వాప్నికుల పక్షం. వారిని సమ్మానించేందుకు అది ఎదురు చూస్తుంటుంది. చెట్టు విత్తులోను, పక్షి గుడ్డులోను నిద్రించినట్టు వాస్తవం కలల్లో నిద్రిస్తూంటుంది. వాటిననుసరించి సాగే దీక్షాపరులకు ఎటు చూసినా అవకాశాలే.
అయితే అందరి ప్రయాణమూ నల్లేరుమీది నడక కాదు. దుస్సంఘటనలూ దుర్విధీ ప్రస్థానంలో పెనుసవాళ్ళై నిలుస్తాయి. చాలామందిని కుంగదీసే వాటిని ఆలోచనాపరులు అనుకూలంగా మలచుకుని శక్తిమంతులవుతారు. ఒక దశలో సర్వమూ పోగొట్టుకుని కారాగారబద్ధుడైన ఓ హెన్రీ జైల్లో రచయితగా రూపాంతరం చెందాడు. మిరుమిట్లు గొలిపే ఎడిసన్ విజయానికి ముందు గాఢాంధకారంలో వేలకొద్దీ వైఫల్యాలు. పోస్టరు అంటించుకుంటూ గాలివాటంగా తిరిగిన చార్లెస్ డికెన్స్ కి తన ప్రేమ భగ్నమైపోవడంతో అంతర్మధనం మొదలై అతణ్ణి ప్రముఖ రచయితను చేసింది. పుట్టుకతోనే అంధత్వం, బధిరత్వం, మూగతనం దాపురించిన హెలెన్ కెల్లర్ తన చరిత్రను ప్రపంచమంతా శ్లాఘించేలా సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. నల్లజాతి బానిస కుటుంబంలో దుర్హర జీవనం గడిపిన బుకర్ టి వాషింగ్టన్ ఓరిమీ పరిణతీ కలిగిన తన ఆలోచనావిధానంతో జాతి రత్నమై నిలిచాడు. బీథోవన్ కి చెముడు. మిల్టన్ అంధుడు. కాని వీరంతా బీడువంటి తమ దౌర్భాగ్య బంజరు జీవితాన్ని దాని మానానికి దాన్ని వదిలెయ్యక దున్ని సాగుచేసి సుసంపన్నం చేసుకున్నవారు. ఎమర్సన్ అన్నట్టు రచనకి సంకల్పిస్తే ప్రతి శబ్దమూ వాక్యమూ జాతీయమూ సామెతా ఎక్కడెక్కణ్ణించో నీ మదిలో ప్రవేశించి దాన్ని తేజోమయం చేస్తాయి. నీ హృదయంతో సారూప్యతకలిగిన స్నేహితులు సకాలంలో నీకు జతపడతారు. అయితే కోరుకోవడం, అనుకోవడాలతో సరిపెట్టుకోక స్వప్నం సఫలమయేలా సహనమూ స్పష్టతా కలిగి శ్రమించినవారికి అది కరతలామలకమవుతుంది.
ఈ సత్యానికి నిరూపణగా నెపోలియన్ హిల్ తన కుమారుడు బ్లెయిర్ హిల్ ని ప్రస్తావిస్తాడు. పుట్టుకతో బధిరుడైన అతడు జీవితమంతా వినలేడని తేలిచిన వైద్యుల అభిప్రాయంతో నిస్పృహ చెందక ఎలాగైనా అతనికి వినికిడి తెచ్చి ప్రయోజకుణ్ణి చేద్దామనే సత్సంకల్పంతో అన్వేషించి పరిశోధించి ఏ చిన్నపాటి సహకారాన్ని అశ్రద్ధ చెయ్యకుండా సద్వినియోగం చేసుకుంటూ సాగుతాడు. అతని సమస్యను తమ సవాలుగా స్వీకరించిన వినికిడి యంత్రపు సంస్థ తమ పరికరాన్ని అతని సహకారంతో మెరుగు పెట్టుకుని అతనికే అమర్చి అతనికి వినికిడి సాధ్యం చేస్తుంది. అతడు జన్మతః సంక్రమించిన బలహీనతను అధిగమించి తదుపరి స్వశక్తితో ప్రయోజకుడై తన ఉపన్యాసాలతో సమాజాన్ని స్ఫూర్తిమంతం చేస్తాడు.
షూమన్ హెయింక్ అనే గాయని తనకి అవకాశం ఇప్పించవలసిందని కోరితే వియన్నా ఓపెరా అధినేత ఆమె గొంతు విని అపహాస్యం చేసి నువెన్నటికీ గాయనివి కాలేవని, కుట్టు మిషను కొనుక్కుని జీవితం సాగించమనీ సలహా ఇస్తాడు. అయితే గాత్రంలోను రికార్డింగులోను మాత్రమే మెళకువలు తెలిసిన తను శ్రమించే స్వప్నమూ సంకల్పశక్తులు మనిషిని ఏ స్థాయికి చేరుస్తాయో అంచనా వెయ్యలేకపోయేనని, తన అజ్ఞానానికి అనతికాలంలోనే ప్రముఖ గాయనిగా పేరుతెచ్చుకున్న ఆమె ఖ్యాతిని ప్రత్యక్షంగా చూసినాక చింతిస్తాడు.
స్పష్టమూ నిర్దుష్టమూ అయిన స్వప్నం సంకల్పశక్తితోను శ్రమతోను సాకారమవుతుందనేందుకు ఈ ఉదాహరణలన్నీ నిరూపణ.
నమ్మకం
సంకల్పానికి ఆలోచన బీజం. సుక్షేత్రంలో సాగు చెయ్యబడ్డ విత్తనం వృద్ధినందినట్టు, ఒక స్పందనగా స్ఫురించిన ఆలోచన వాస్తవరూపంలో ప్రభవించేందుకు దానికి ముఖ్యమైన పోషకాలు అవసరం. అటువంటి ముఖ్యపోషకం, అది సాధ్యమేనన్న నమ్మకం. ఆలోచన బుద్ధికి సంబంధించినది. నమ్మకం హృదయానికి సంబంధించినది. ఐడియా వస్తే చాలదు. దాన్ని పెంచి పోషించేందుకు అది సాకారమవుతుందన్న నమ్మకం, లేదా విశ్వాసం పుష్కలంగా కావాలి. లేనప్పుడు మదిలోని ఆలోచన నీటిబుడగమాదిరి ఓ క్షణం ఉండి మాయమవుతుంది.
మదిలో కలిగిన ప్రతి తలపూ విశ్వంలోని అనంత మేధస్సు - ఇంఫినిట్ ఇంటెలిజెన్సు లోని మిగతావారి ఆలోచనలతో చేరుతుంది. ఇలా ఎప్పట్నించో నిరంతరంగా అందరూ చేస్తున్న ఆలోచనలతో నిండుకుండలా తొణికిసలాడుతున్న అనంత మేధోసంపత్తి లోకి ఇంకా కొత్త ఆలోచనలు చేరుతూనే ఉన్నాయి. అన్ని సమస్యలకీ పరిష్కారాలు ఇందులో ఉన్నాయి. నమ్మకంతో బలపడిన సంకల్పం తన సాఫల్యానికి ఈ ఖజానానించి అవసరమైన సమాధానాలు, విధానాలు, పరిష్కారాలు తనదిశగా ఆకర్షించుకుంటుంది. ఈ ఉమ్మడి శక్తి అంతవరకు అంతరంగమూ అదృశ్యమూ అయిన సంకల్పానికి బహిరంగమూ గోచరమూ అయిన వాస్తవ రూపాన్ని కల్పిస్తుంది.
ప్రార్ధనలోని శక్తి ఇదే. నిర్ణీత సమయంలో మతాతీతంగా అందరూ మౌన ధ్యానంతో చేసే ప్రార్ధనలు ఫలించేందుకు ఇదే కారణం. ధ్యానించే సమయంలో మనం ఒంటరివారమే అయినా మన ప్రార్ధన అప్పటికే అనంత మేధోసంపత్తిలో నినదిస్తున్న ఇతరుల ప్రార్ధనలతో కలిసి శక్తివంతమవుతుంది.
నమ్మకం, ప్రేమ, కామం - ఈ మూడు భావనల శక్తీ అపరిమితం. ప్రేమ, నమ్మకం మానసికం, కామం శారీరకం. తలచిన తలపు సాకారమయే క్రమంలో ఈ మూడు భావనల పాత్ర అమితం.
నమ్మకం ఎలా కలుగుతుంది
అసలే నమ్మకమూ లేనివార్కి కూడా నమ్మకం కలిగి బలపడ వచ్చు. అయితే ఇది ఎవరికి వారే కలిగించుకునేది. ఒక నిర్ణయం. ఒకటి నమ్ముదామనుకునే నిర్ణయం. ఇది ఊరికే అనుకోవడం కాదు. అది భావోద్వేగంతో కలవాలి. అంటే ఎమోషన్. మీ బిడ్డ లెక్కల్లో నూటికి నూరు సాధించినప్పుడు కలిగే అనుభూతి, పరాయి బిడ్డ సాధించినప్పుడు ఉండదు. అక్కడ ఈ భావోద్వేగం లేదు కనక. భావోద్వేగం హృదయానికి సంబంధించినది. అది బలంగా ఉన్నప్పుడు దానిముందు ఇంకే తర్కమూ పనిచెయ్యదు. భావోద్వేగం కలిగించిన ఆవేశానికి ప్రాణాలనూ లెక్కచెయ్యని తెగింపు ఉంటుంది. ఇది పశువుల్లోనూ చూస్తాం. తన దూడ క్షేమం కోసం ఎంత ప్రమాదాన్నైనా ఎదుర్కొనే ఆవులకి ప్రేరక శక్తి ఇదే. మనుషుల్లో అయితే ఈ భావోద్వేగం కలిగించుకోవడం కూడ ఒక నిర్ణయం. ఒక మతాన్ని, ఒక రాజకీయ పార్టీని, సినిమా నటుణ్ణి ఆరాధించి అభిమానించే నిర్ణయం తీసుకున్న వారు అందు కోసం అవసరమైతే ప్రాణాలు కూడా తీసేందుకు, ఇచ్చేందుకు సిద్ధపడతారు.
ఇక్కడికి మూడయ్యాయి. ఒకటి మదిలో కలిగిన తలపు, రెండు అది సాధ్యమేనన్న నమ్మకం, మూడు ఆ నమ్మకాన్ని పెంచి పోషించే భావోద్వేగం. అయితే ఇవి మూడూ కలిగితే సరిపోదు. ఈరోజు ఒకలా ఉన్నది రేపటికి మారిపోవచ్చు. బలహీన పడిపోవచ్చు. మతవిశ్వాసంలోను, రాజకీయంలోను మన భావోద్వేగాన్ని సజీవంగా ఉంచేందుకు ఎవరో ఒకరు ఉపదేశాలూ ఉపన్యాసాలూ ఇస్తూ మరుపురానివ్వరు కనుక అది నిలిచి ఉంటుంది. మన వ్యక్తిగత ఆశయాలకి అది ఉండదు. అదీ ఎవరికి వారు చేసుకోవలసినదే. అందుకు స్వయం సూచనలు - ఆటో సజెషన్ ని అభ్యసించాలి. ఆటో సజెషన్ అంటే మనకి మనం చేసుకునే హిప్నాటిజం. నిరంతరమూ మనకి మనం చేసుకునే సూచనలు ఒకనాటికి మన అంతశ్చేతన అంటే సబ్ కాన్షస్ లో నిక్షిప్తమైపోతాయి. ఇదీ మనకి అనుభవమే. వాహనం నేర్చుకునే కొత్తలో క్లచ్చు నొక్కడం, గేరు మార్చడం, గ్యాసు పెడల్ తొక్కడం, ఇండికేటర్ ఇవ్వడం, ఏదైనా అడ్డొస్తే బ్రేకు వెయ్యడం అన్నీ సంకల్పించి చేస్తాం. క్రమేపీ ఈ సూచనలు అంతశ్చేతన ఖజానాలో జమ అయిపోతాయి. అప్పట్నించి ఏ సూచనలూ అవసరంలేకుండానే, ఏవో పాటలూ వింటూ మాట్లాడుతూ కూడా ఇవన్నీ చేస్తాం. వింటున్న పాటలోను మాటలోను ఎంత లీనమైనప్పటికీ ఎదటి వాహనం నెమ్మదించినప్పుడు మనమూ వేగం తగ్గించడం, అందుకు అనుగుణంగా గేరు మార్చడం ఇండికేటర్ ఇవ్వడం చేస్తాం. ఈ సూచనలు వచ్చేది మన బుద్ధి పాటలూ మాటలు వింటున్న అర నించి కాక వేరే అరనించి. ఈ విధంగా ఎన్ని సూచనలనూ విశ్వాసాలనూ అంతశ్చేతనలో భద్రపరుచుకుంటామన్నదానికి పరిమితి లేదు.
కనుక సాధిద్దామనుకున్న ఆశయం సాకారం కావాలంటే అది సాధ్యమేనన్న బలమైన నమ్మకం, అందుకు ఏదైనా చేద్దామన్న తెగింపుకి అవసరమైన భావోద్వేగమూ నిరంతరం ఆరని జ్యోతిలా ప్రజ్వరిల్లుతూనే ఉండలి. ఇవి మరుపుకి రాకుండా అంతశ్చేతనలో వీటిని భద్రపరుచుకోవాలి. ఇందుకోసం స్వయం సూచన అంటే ఆటో సజెషన్ ను ప్రతిరోజూ నిర్ణిత సమయంలో అభ్యసించాలి. అందుకు మన ఆశయమూ అందుకు అవసరమైన కార్యాచరణా నిర్దుష్టంగా రాసుకోవాలి. అది హృదయస్థం అయేవరకు అనుదినమూ పారాయణ చేసుకుంటూ కార్యాచరణని అమల్లో పెట్టాలి. గాలివాటపు పగటికలలు సాకారం కావు. కలలకి నిర్దుష్టత ఉండాలి. అందుకే అది రాసుకుని అనుదినమూ చదువుకుని అవసరమైతే తగు మార్పులు చేసుకుంటూ ఆచరణ సాగించాలి.
తమ ఆశయం సాధ్యమన్న నమ్మకమూ భావోద్వేగమూ హృదయస్థమైనప్పుడు దాని సంభవాసంభవాలగురించిన సంశయాలుండవు.
ఆశయబలమే ఊతంగా మొదట అతి సామాన్యులుగా ఒంటరిగా ఉన్నవారు ఒక్కొక్కరిగా లోకులనందరినీ తమ మార్గంలోకి నడిపించి ప్రపంచంలో తమ చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. జీసస్, అబ్రహాం లింకన్, ప్రభృతులు.
మన కాలంలో ఈ సూత్రానికి సజీవ ఉదాహరణ మహాత్మాగాంధీ. అతడు శారీరకంగా బలవంతుడు కాడు. రాజ వంశీకుడు కాడు. విశేష మేధోసంపత్తి ఉన్నవాడు కాడు. అయినా ఒక శక్తివంతమైన దేశాన్ని ధిక్కరించి ఎదురు నిలిచాడు. ఇరవై కోట్లమంది భారతీయుల హృదయాల్లో (ఇది నెపోలియన్ హిల్ ఈ పుస్తకం రాసిన సమయానికి ఉన్న భారతదేశ జనాభా) స్వాతంత్ర్యం సాధ్యమన్న విశ్వాసాన్ని ప్రతిష్టించి అది సాధించేవరకు తనను అనుసరించేంతగా వారిని ప్రభావితం చెయ్యగలిగాడు.
మనపై మనకు ఉండాల్సిన నమ్మకాన్ని గురించి గుర్తుపెట్టుకోవలసిన సత్యాలు ఇవి.
సంకల్పానికి జీవం పోసే దివ్యామృతం నమ్మకం.
అన్ని సంపదల సముపార్జనకీ ఆరంభ స్థానం నమ్మకం.
విజ్ఞాన విశ్లేషణకి అతీతమైన అన్ని అద్భుతాలకూ రహస్యాలకూ మూలం నమ్మకం.
వైఫల్యానికి ఒకే ఒక విరుగుడు నమ్మకం.
ప్రార్ధన సమయంలో మనను అనంత మేధస్సుకు పరిచయంచేసి అన్ని పరిష్కారాలనూ సంభవం చేసే ఉత్ప్రేరకం నమ్మకం.
మనిషి మదిలో అతి సాధారణ తలపుగా స్ఫురించిన అలోచనకి దివ్యత్వాన్ని ప్రసాదించేది నమ్మకం.
అనంత మేధస్సు అద్భుత ప్రయోజనాలను సొంతం చేసుకొందుకు మనకున్న ఏకైక ఉపకరణం నమ్మకం.
ఇవన్నీ నిరూపణకి నిలిచేవే. మన కళ్ళెదుట కనబడే విజేతలు, విఫలుర ఆలోచనలు, వారి సంకల్పశక్తిపై వారికున్న, లేద లేని, నమ్మకమే వారి వాస్తవ స్థితికి కారణం. తమ సంకల్పం గొప్పదని, కార్యాచరణలో తమకు తగిలే ఎదురుదెబ్బలు ప్రకృతి తమను శక్తిమంతం చేసేందుకవసరమైన చిన్నపాటి పరీక్షలని, ప్రతి అవరోధమూ సూర్యుని కప్పే ప్రయత్నం చేసే చిన్న మబ్బు కన్న ఎక్కువ కాదని నమ్మి మరింత ఉత్సాహంతో దూసుకుపోయేవారు విజేతలైతే, తమ సంకల్పం ఒకవేళ తప్పేమోనని, తమ రాత ఇలా ఉందని, ప్రకృతికి తాము సఫలం కావడం ఇష్టం లేక ఈ అవరోధాలు కలిస్తోందని డీలాపడి ప్రయత్నాలు ఆపేసి చతికిలపడిపోయేవారు విఫలురు. ఈ విధంగా తమ సంకల్పాన్ని, బయటి పరిస్థితులను విశ్లేషించుకుని తమకు తాము చెప్పుకునే భాషణాలే ఆటో సజెషన్ - స్వయం సూచనలు. సంకల్పమూ నమ్మకమూ స్వయం సూచనలూ - వీటన్నిటి పరమార్ధమూ ఒకటే కావాలి. అప్పుడే సంకల్పం వాస్తవరూపం దాలుస్తుంది. అది తనకూ సమాజానికీ హితమైనా అహితమైనా.
అయితే వీటన్నిటినీ ఏకీకృతం చేగయగలిగేందుకు ఆత్మ విశ్వాసం అంటే మన సమర్ధ్యం మీద మనకి నమ్మకం ఉండలి. అదీ ఎవరికి వారే కలిగించుకుని పెంచుకోగలిగింది. ఒక జీవిత గమ్యాన్ని సంకల్పించుకున్నాక అది సాధించే ఆత్మ విశ్వాసం పెరిగేందుకు ప్రతి ప్రాతఃకాల సమయంలోనూ మననం చేసుకోదగిన కొన్ని స్వయం సూచనలు:
ఒకటి: నా సంకల్పాన్ని సాకారం చేసుకోగల శక్తి సామర్ధ్యాలు నాకున్నాయి. అవి పూర్తిగా వినియోగించుకునే విషయంలో ఎప్పుడూ డీలా పడను, ఎక్కడా రాజీ పడను.
రెండు: పరిపూర్ణ శ్రద్ధతో కేంద్రీకరించిన ఆలోచన నిజమయేందుకు దృఢమైన సంకల్పమే పునాది కనుక ఆ సంకల్పం బలపడేందుకు నా లక్ష్యాన్ని నేను ప్రతిరోజు కనీసం ఒక ముప్ఫై నిమిషాల పాటు మననం చేసుకుని అది నా హృదయస్థమయేలా అభ్యాసం చేస్తాను. అది సాధించిన విజయోత్సాహంతో సమున్నతంగా నిలిచిన నన్ను నేను అతి స్పష్టంగా చూడగలుగుతున్నాను.
మూడు: స్థిరంగా నిర్దుస్టంగా సంకల్పించినది తన సాధనకవసరమైన వస్తు విషయాలను ఆకర్షించుకోగల శక్తి సంపన్నం కనుక నా లక్ష్యాన్ని స్పష్టంగాను నిర్దుష్టంగాను అనుదినము కనీసం పది నిమిషాలు ధ్యానిస్తూ భావిస్తూ పరిస్థితులనూ సహకారులనూ నా వైపు ఆకర్షించుకుంటాను. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకుంటాను.
నాలుగు: నా లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దుష్టంగా రాసుకున్నాను. అనుదినమూ అది చదివి స్ఫూర్తిపొందుతూ దాన్ని సాధించే ప్రయత్నాన్ని ఏ రోజూ విడవక సాగిస్తాను.
ఐదు: నా లక్ష్య ప్రయోజనాలు శాశ్వతమై నిలిచేందుకు అది సత్యబద్ధమూ న్యాయ బద్ధమూ అయి ఉండాలి కనుక దాని సాధనలో నాకు సహకరించే ప్రతి ఒక్కరికీ అది ప్రయోజనకరం కావాలి. వారు నాకు సహకరించేందుకు నేఉ వారికి సహకరిస్తాను. అసూయ, ద్వేషం, స్వార్ధము, అపనమ్మకమూ మొదలైన అపాయకర ఆలోచనలు లక్ష్య సాధనకు విఘాతం కనుక ప్రేమ, సౌహార్దం, లోక కల్యాణం, స్నేహభావాలను పెంచుకుని పంచుకుని ఆచరిస్తాను. అందరూ నన్ను నమ్మేందుకు అందరినీ నేను నమ్ముతాను.
మనం రాసుకుంటున్న ఈ సూత్రాలు నిజానికి ప్రకృతి సిద్ధమైనవి. అంతశ్చేతన అంటే సబ్ కాన్షస్లో స్థిరంగా భద్రపడేలా క్రమబద్ధంగా అభ్యసించి ఆచరించిన స్వయంసూచన అద్భుతాలు విజ్ఞానశాస్త్ర విశ్లేషణకి అందనివి. నిష్పక్షపాతి అయిన దానికి సంకల్పం మంచిదనీ చెడ్డదనీ ఉండదు. దేన్నైనా సాకారం చేయ్యడమే దానికి తెలిసింది.
దెబ్బైపోతాననుకున్నప్పుడు దెబ్బైపోవుట ఖాయం
సాహసించలేననుకుంటే - సాహసించలేము
గెలుపుకు చేరువలోనే వున్నా - గెలవలేనని అనుకున్నప్పుడు - గెలుపుకు బారెడు దూరంలోనే చతికిలబడతాము
ఓడిపోతాము అనుకున్నప్పుడు - తప్పక ఓడిపోతాము
లోకం చాటే పరమ సత్యమిది - తలపులోనే మన గెలుపుంటుందని.
నిరాశ నిస్పృహ నీరసాలు వద్దనుకుంటే వద్దకు రావు
అంతరంగమే అసలు కీలకం. అక్కడ గట్టిగ అనుకున్నప్పుడు అసాధ్యమన్నది లేనేలేదు.
మనకి మనం విధించుకున్నవే మన పరిమితులు. కలిమీ లేమీ కలిగించేది మనసే.
స్వయం సూచన
స్వయం సూచన అంటే మనకి మనం చెప్పుకునే భాషణాలు అనుకున్నాం ఏదైనా ఆలోచన మన అంతశ్చేతనలో స్థిరంగా ముద్రపడాలంటే కలిగిన తలపు మరపుకి రాకముందే దానిని నమ్మకమూ భావోద్వేగాలతో పునశ్చరించుకుని వల్లె వేసుకుంటే అది అంతశ్చేతనలో భద్రపడుతుంది. ఇంతకు ముందు చెప్పినట్టు తలపులను సాగుచెయ్యాలి. ఏ పంట అయినా సాగుచేస్తే బలంగ పెరిగి ఫలసాయాన్నందిస్తుంది. అది కల్పవృక్షమైన విషవృక్షమైనా. ఈ సాగులో భాగమే స్వయం సూచన. ఇది ఎవరికి వారు చేసుకోవలసింది. "రోజు రోజుకీ నేను బాగుపడుతున్నాను" అని ఎమిలి కో అంటుంది. ఈ రోజువారి దినచర్యలో ముఖ్య వ్యాపకం సంకల్పాన్ని గాలికొదిలెయ్యకుండ సాకారం చేసుకునే సాగు. ఇది పరిశ్రమ అనుకుంటే పరిశ్రమే. అలవాటనుకుంటే అలవాటే. పొందాలనుకునేది సొంతం కావాలంటే ఖరీదు చెల్లించుకోవాల్సిందే. ఉచితంగా ఏదీ దఖలు పడదు.
ఇప్పుడు ఏకాగ్రత అని ఇంకో ముఖ్యాంశం అవసరం. స్వయంసూచనలోని సంకల్పం స్థిరంగా ఉండాలంటే ఏకాగ్రత అవసరం. ఇది నిలిచేందుకు మొక్కుబడిగా తలచుకోవడంతో కాక ఆ సంకల్పం నిజంగా సాకారమైనప్పటి స్థితిని ఊహించుకోవాలి. సంకల్పంలో ధనం ఉంటే ఆ డబ్బు సంపాదించేసినట్టు, ఇంకే కోరికైనా అదే విధంగా సిద్ధించినట్టు భావించాలి. ఏకాగ్రత చెదరకుండా దానికి ఊహ, సృజన కూడా జతచెయ్యాలి. ఇదంతా స్థిరమైన నమ్మకంతో జరగాలి. అవునా నిజమేనా అనే అపోహలకు తావులేదు.
అప్పుడప్పుడు కొన్ని ఐడియాలు తళుక్కున మెరుస్తాయి. వాటి స్వభావం మెరుపులానే ఉంటుంది. కనుక అవి ఎక్కువకాలం గుర్తుండవు. ఇవన్నీ మన సంకల్పం నించి కాక విశ్వమంతా ఆవరించి యున్న అనంత మేధస్సు నించి ఈధర్ ద్వారా వచ్చేవని గ్రహించాలి. ఇవి మెరిసిన క్షణమే అశ్రద్ధ చెయ్యకుండా వాటిని పట్టుకుని రాసుకుంటే వాటి ప్రకాశం శాశ్వతమై మన ఆశయ సాధనకి అవీ తోడ్పడతాయి.
అయితే సృజనతో ఏకాగ్రతతో స్వయంసూచనలు చేసుకునేటప్పుడు అనుకున్నది సాధించిన అనుభూతితో సరిపెట్టుకోక అందుకోసం మనం ఏమి చేస్తామో అదీ అంత నిర్దుష్టంగానూ అనుకోవాలి. ఈ చెయ్యాలనుకునేది మనం సాధించగోరేదానికి చెల్లించుకునే అనుగుణమైన నిర్దుష్టమైన ధర. ప్రకృతిలో ఉచిత పథకాలుండవని గ్రహించాలి.
ఇది అభ్యసించేకొద్దీ అనుమానాలూ అపోహలూ మాయమై స్థిరమైన నమ్మకం బలపడుతుంది.
ఎందరో పెద్దలు చెప్పారు మనిషి విధిని లిఖించుకునేది మనిషే అని. అయితే ఎలా అన్నది చాలామంది చెప్పలేదు. మనిషి తన విధికి అవసరమైన వనరులూ పరిస్థితులూ ఆకర్షించుకోగలిగేలా అంతశ్చేతననూ ఆలోచనాశక్తినీ కేంద్రీకరించుకోగల సమర్ధుడు కాబట్టే అతని విధి అతని అధీనమై ఉంటుందని వారు చెప్పదలచుకున్నారని మనం గ్రహించాలి.
అవసరమైన పరిజ్ఞానం
అన్నిటా పరిజ్ఞానం చాలా మందికి ఉండొచ్చు కానీ అవసరమైన పరిజ్ఞానం ముఖ్యం. ఈ పుస్తకం ముఖ్యాంశమైన సంపద సాధన కోరుకునేవారికి ఇంకా ముఖ్యం. హెన్రీఫోర్డుకి ప్రపంచ విషయాలలోను, ఆ మాటకొస్తే అందరికీ తెలిసిన సామాన్య విషయాల లోనూ ఉన్న పరిజ్ఞానం తక్కువ. ఒక పేపరువారు తనపై అనుచిత వ్యఖ్యలు చేసేరని వారిపై ఫోర్డు పరువు నష్టం దావా వేసేడు. కొన్ని ప్రశ్నలకి సమాధానమివ్వలెకపోవడం, నిరాకరించడం చూసి అవతలి న్యాయవాది అతనికి ప్రాధమిక విద్య పరిజ్ఞనమూ లేవని తేల్చేసేడు. అందులో ఒక ప్రశ్న: ఫలాన యుద్ధానికి బ్రిటన్ పంపిన సైనికుల సంఖ్య ఎంత అని. యుద్ధం నించి ఇంటికి తిరిగెళ్ళినవాళ్ళ కన్న ఎక్కువేనంటాడు ఫోర్డు. ఇటువంటి కొన్ని ప్రశ్నల తరవాత విసుగెత్తి ఫోర్డు అంటాడు. మీరడిగిన ప్రతీ ప్రశ్నకీ నా దగ్గర సమాధానం లేకపోవచ్చు కాని నీకన్న బాగా వాటి సమాధానం తెలిసినవాళ్ళను రప్పించి చెప్పించుకునే పుష్ బటన్లు నా టేబిల్ మీద ఉన్నాయి. అవి నొక్కి ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం రప్పించుకోగలను అని. ఫోర్డు దార్శనికుడు. అన్నిటా పరిజ్ఞానం కాదు అవసరమైనదే అసలు జ్ఞానం అన్నది తెలుసుకుని ఆచరించి సఫలుడయాడు. ఫోర్డు, స్టీలు దిగ్గజం అండ్రూ కార్నెగీ, థామస్ అల్వా ఎడిసన్ వంటి ఎందరో ప్రముఖులకి తాము దిగ్విజయంగా నిర్వహిస్తున్న వ్యాపారంలోని సూక్ష్మ సాంకేతిక అంశాలు తెలీదు. కాని అవసరమైనప్పుడు అవి ఎలా తెలుసుకోవాలన్నది వారు బాగా ఎరుగుదురు.
ఇందుకోసం వారు మాస్టర్ మైండ్ గ్రూపులు తయారుచేసుకున్నారు. అంటే తమ సంకల్పంతో సారూప్యం కలిగిన ఇతర మేధస్సుల సమూహం. మేధో నిధి. తనకి స్టీలు వ్యాపారం గురించి తెలిసింది అతి స్వల్పమైనా ఆ రంగంలో మకుటంలేని మహారాజుగా ఎదిగినది అందుకవసరమైన పరిష్కారాలూ సూచనలూ ఈ మేధో నిధి నించి లభించడంవల్లనే అంటారు ఆండ్రూ కార్నెగీ.
మనం ఏమి సాధించాలనుకుంటామో ఆ లక్ష్యమే మనకి ఏ పరిజ్ఞానం అవసరమో నిర్దేశిస్తుంది. అది సంపాదించాలి. దాని సాధనలో మట్టుకు అశ్రద్ధ కూడదు. అహరహం శ్రమించి అది సాధించాలి. కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్ధులకిచ్చిన ఉపన్యాసంలో రాబర్ట్ ప్ మూర్ అంటాడు: పుస్తకాలు చదివి సంపాదించిన మార్కులు కాదు సంస్థలు చూచేది. ఒక పరిశ్రమ నిర్వాహకులు నాకు ఇలా రాసేరు. గుణమూ తెలివితేటలూ వ్యక్తిత్వమూ ఉన్నవాళ్ళని పంపండి మార్కులతో నిమిత్తంలేకుండా. మాకు అవసరమైన విధంగా మేము తయారుచేసుకుంటాం అని. చదువైపోగానే ఎంచుకున్న రంగంలోని అవసరమైన పరిజ్ఞానానం నిమిత్తం విద్యార్ధులు ఆ రంగ నిపుణుల నాయకత్వంలో సహాయకులుగా ఒకట్రెండేళ్ళు పనిచెయ్యాలి జీతానికి ఆశించకుండా.
ఆశయసాధనకి పనికిరాని పరిజ్ఞానం వ్యర్ధం. పట్టభద్రులైతే సరిపోదు. పట్టాలు ప్రసాదించేది అవసరమైనది అభ్యసించేందుకు అవసరమైన అక్షరజ్ఞానాన్నే అని అర్ధం చేసుకుని అంతతో ఆపెయ్యకుండా ప్రత్యేక కౌశలాలు సాధించాలి. ఎంత వయసొచ్చేంతవరకు ఇలా అంటే, దీనికి వయసుతో నిమిత్తంలేదు. ఇంజనీర్లుగా ప్రఖ్యాతిచెంది బాగా ఆర్జించినాక వృత్తిలో ఉత్తేజం తగ్గిందని అనుకునేవారు న్యాయవాదాన్ని అభ్యసించి అందులో రాణించిన ఉదాహరణలు నాకు తెలుసు.
ప్రస్తుత స్థితి హీనమనిపిస్తే అందులోంచి ఉన్నత స్థితి చేరేందుకుకు అవకాశాలకై అన్నివైపులా వెదకాలి. ఇదే రాసిపెట్టివుంది, ఇంతకు మించి ఎదగలేననే నిస్పృహకి తావివ్వకూడదు. ప్రయత్నం ఆపక సంకల్పంతో కొనసాగిస్తే అవకాశాలు ఎదో రూపంలో వచ్చితీరతాయి. విడవక వెదికి అనుసరించే సంకల్పమే ముఖ్యం. ఎదిగే స్వభావమూ ఒక అలవాటే. అది చేసుకుంటే అలవాటవుతుంది.
ఊహ లేద కాల్పనిక శక్తి
మన కాల్పనిక శక్తికి పరిమితిలేదు. కల్పించినది ఏదైనా ఆలోచనలు కేంద్రీకరించి వాస్తవరూపంలో సాధించనూగలం. విజ్ఞానశాస్త్రపు ఎన్నో వినూత్నావిష్కరణలు ఊహా శక్తి చమత్కారాలే. వందేళ్ళక్రితం అసాధ్యాలూ మానవాతీతాలూ అనుకున్న అన్నీ ఇప్పుడు సాధ్యపడుతున్నాయి. మనిషి కల్పనకూ సృజనకూ అనుగుణంగా ప్రపంచం రూపుదిద్దుకుంటుంది. ఎవరికైనా ఏదైనా సాధ్యపడదనుకుంటే, దానిక్కారణం తమ కాల్పనికతకు వాస్తవరూపాన్నించ్చే ప్రయత్నం వారు చెయ్యకపోవడమే.
కాల్పనికత రెండు రకాలు. మొదటి రకం సమ్యోజకము, రెండోది సృజనాత్మకమూ. మొదటి కల్పనలో కొత్త సృష్టి ఉండదు. గతానుభవాలనూ వర్తమాన పరిస్థితులనూ అధ్యయనం చేసి కారణాలు విశ్లేషించుకుని అది అలా అయితే ఇది ఇలాగన్నమాట అని సూత్రీకరించటం సOయోజకం అంటే అన్ని ఉన్నవాటిని సంధానించి చేసే కల్పన. రెండోది అయిన సృజనాత్మక కల్పన అంతవరకు లేనిదాని సృష్టి. సాధారణంగా ఇవి ఐడియాల రుపంలో స్ఫురిస్తాయి. ఇవి అనంత మేధస్సులో ఉన్నవీ, మన తలపుల ప్రేరణతో మనకి ఆవిష్కృతమయేవీ. ఈ సృజనాత్మకత ఏ కొందరికో మాత్రమే అనుకోనక్కర్లేదు. అభ్యాసంతో అందరికీ సాధ్యపడేదే. అభ్యాసంతోను వినియోగంతోను బుద్ధికి ఈ స్వభావం అలవడి మెరుగవుతుంది. పేరు ప్రఖ్యాతులు సాధినిచిన కళాకారులు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ప్రజానాయకులు, సంఘసంస్కర్తలు మొదలైన అందరూ ఈ కౌశలాన్ని స్వయంకృషితో వృద్ధిచేసుకున్నవారే.
కనబడని కాంక్షని కనిపించే కాంచనంగా మార్చేది కాల్పనిక ఊహా శక్తే. అయితే సృజనాత్మకత అనుకున్నపుడు స్ఫురించదు. ఎంత ఎదురుచూసినా కూడా దొరక్కపోవచ్చు. అటువంటి ఎదురుచూపు నిష్ప్రయోజనం కనుక మొదటి తరహా ఊహ ప్రక్రియని అభ్యసించాలి. అంటే జరిగినవి, జరుగుతున్నవాటిని హేతుబద్ధంగా విశ్లేషించి అనుగుణమైన పథక రచన. దీనివల్ల మెదటికి స్థబ్ధు ఆవరించక చురుగ్గా ఉంటుంది. కొత్త స్ఫూర్తి, కొత్త సృజనలు గ్రహించేందుకు మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉండాలి.
అంతరిక్షంలోని గ్రహాల సముదాయం నించి నేలమీది ఒక అల్ప ప్రాణి వరకు ప్రతిదీ ఒకప్పుడు లేనిది, ఒకప్పుడు ఉన్నదీ. అంటే ఒకప్పుడు పదార్ధమై కనబడేవి ఇంకొకప్పుడు శక్తి రూపంలో కనబడకుండా ఉంటుంది.. స్థూలంగా ప్రకృతిలో ఉన్నవి శక్తీ పదార్ధమూ ఇవి రెండే. కాలానుగుణంగా ఒకటి ఇంకోదానిగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కనిపించేవన్నీ, మనతో సహా, ఒకప్పుడు అతి సూక్ష్మమూ అగోచరమూ అయిన ప్రాణశక్తి రూపంలోనో ఒక ఆలోచనలాగానో ఉన్నట్టివే. కనుక ఆలోచన సంపదను సృష్టించడం అసంభవమూ అసాధారణమూ కాదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
సుమారు నూరేళ్ళ క్రితం ఒక డాక్టరు కొన్ని వస్తువులు మేళవించి ఒక పానీయం చేసే సూత్రం రూపొందించాడు. అది వండేనుదుకు వీలైన ఇత్తడి పాత్రనీ రూపొందించాడు. ఏ కారణానికో ఇది అయే పని కాదని ఒక మందుల షాపు గుమాస్తాకి ఆ భాండాన్నీ ఫార్ములా కాగితాన్నీ ఐదువందల డాలర్లకి అమ్మేస్తాడు. ఆ డబ్బుతో డాక్టర్ అప్పులు తీర్చేసుకుని తెరిపిన పడతాడు కాని గుమాస్తాకి అది జీవితకాలపు పొదుపు. ఇదేం చేసుకోవడం అనుకోకుండా ఆ పానీయం తయారుచేసి దాని అమ్మకాలకి తన సృజన జోడించి దాని వినియోగాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ఆ గుమాస్తా పేరు అసా కాండ్లర్. ఆ పానీయం కోకా కోలా. స్థూలంగా చూస్తే దాని మేళవింపునీ, ఇత్తడి భాండాన్నీ రూపొందించిన డాక్టరు ఏ గుర్తింపుకీ నోచుకోక అతి సామాన్య జివితంతో సరిపెట్టుకుంటే, అతి సాధారణాన్ని అసాధారణం చేసిన గుమాస్తా సృజనాత్మక కల్పనాచాతుర్యం అతనికి ప్రపంచ ఖ్యాతినీ మహైశ్వర్యాన్నీ ప్రసాదించింది.
ఇంకో ఉదాహరణ.
చికాగోలోని ఒక చర్చి ఫాథర్ అయిన ఫ్రాంక్ గున్సాలెస్ విద్యాధికుడు, ఉన్నత భావాలు కలవాడు. స్థానిక కూటములలో మతబోధలు చేస్తూండేవాడు. ఒకనాడు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. విద్యార్ధులు పనిచేస్తూ చదువుకునే సదుపాయాలున్న ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యాసంస్థని స్థాపించి దాన్ని తన ఆశయాలకనుగుణంగా నిర్వహించి విద్యార్ధులకు దిశానిర్దేశం చెయ్యాలన్నది. అది సుమారు వందేళ్ళనాటి మాట. అప్పట్లోనే అందుకు మిలియన్ డాలర్లు కర్చవుతాయని తేలింది. ఆశయాలేతప్ప ఆస్తులున్నవాడు కాడు. ఎలా ఎలా అని రెండేళ్ళు తర్జన భర్జన పడ్డాడు. నిధుల సమీకరణ విషయం తేలింది కాదు. అయితే కాంక్ష బలమై దాన్ని నిరంతరంగా పునశ్చరించుకుని అది సాధిస్తే ఎలా ఉంటుంటుందన్నది నిర్దుష్టంగా చూచుకోగలిగినప్పుడు సృజన తళుక్కున మెరుస్తుంది. అదే జరిగింది. ఒక సాయంత్రం ఒక ఆలోచన వచ్చింది. ఆచరణ ఆలస్యం చెయ్యక పేపర్లో ప్రకటన ఇచ్చాడు. అది, ఈ ఆదివారం ఆసక్తి ఉన్నవారు ఫలానా చోటికి వస్తే ఒక మిలియన్ డాలర్లు ఉంటే తనేం చెయ్యగలడన్నదానిమీద ఉత్తేజభరిత ప్రసంగాన్ని చెయ్యగలనని. అందుకు అనుగుణంగా ఇవ్వ బోయే ఉపన్యాసాన్ని ఎన్నో మార్లు తనకే కాక భగవంతునికి కూడా వినిపించాడు. అద్భుతంగా ఉండబోతుందన్న ఉత్తేజంతో అన్ని సంశయాలూ పటాపంచలైపోయాయి. అనుకున్న రోజున అనుకున్నకన్న ఎక్కువమందే వచ్చారు. ఎక్కడా తొణక్కుండ అతి స్థిరమైన నిశ్చయంతో తన విద్యాలాలసనూ విద్యార్ధులకి దని ప్రయోజనలనూ ఎంతో ఉత్సాహంగా వివరించాడు. ఉపన్యాసం ముగియగానే ఒకాయన వచ్చి నిధులకోసం ఇంకెవర్నీ కలవాల్సిన అవసరం లేదనీ, మిలియన్ డాలర్లూ తనే భరిస్తాననీ మాట ఇస్తాడు. అతి ప్రతిస్టాత్మకమైన ఆర్మర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆవిర్భవించింది. రెండేళ్ళుగా అగమ్యగోచరమైన గున్సాలెస్ స్వప్నం ఒక సృజనాత్మక చమత్కారం స్ఫురించిన ముప్ఫైయారు గంటల్లోనే సాకారమై సమున్నతంగా నిలిచింది.
గున్సాలెస్ యువకుడు. అతనికి ముందూ ఇదే ఆలోచన చాలామందికి వచ్చింది కాని వారు ఇతనిలా ఆ మిలియన్ డాలర్లూ సమకూర్చుకోవాలన్న కాంక్షకి బలాన్నిచ్చే నిరంతర చింతనా అది జరిగితీరుతుందన్న నమ్మకమూ పెంపొందించుకోలేకపోయేరు కనుక వారి కల పగటికలలా మిగిలి పోయింది.
దైవ సహకారం కూడా ఆశయానికీ సంకల్పానికీ బద్ధులైనవారి పక్షాన్నే ఉంటుంది.
ఒక ప్రచురణకర్త తను అమ్మే పుస్తకాల్లో ఒకదానిలో విషయం మంచిదే అయినా అమ్మకాలు ఆశించినంత లేకపోయేసరికి డీలా పడ్డాడు. ఒక సాయంత్రం ఒక ఆలోచన స్ఫురించింది. అది, పాఠకులు కొనేముందు చూచేది పుస్తకం అట్టనీ దాని సీర్షికనీ కనుక ఆ రెంటినీ ఆకర్షణీయంగా మార్చి షెల్ఫులలో పెట్టేడు. అది ఫలించి అమ్మకాలు పెరిగేయి.
రేడియో ప్రాచుర్యంలోకి వచ్చిన కొత్తల్లో వినోద కళాకారులు ఎక్కువై వారి పారితోషికాలు ఒక సమస్యైపోయేవి. అప్పుడు ప్రాయోజకుల అలోచన కొందరికి వచ్చింది. దాంతో శ్రోతలు కాస్తా కొనుగోలుదారులైపోయేరు. విషయం ఉన్న కళాకారులకి వారి కళని ప్రసారంచేసే మాధ్యమాలకి డబ్బు సమస్య తీరిపోయింది.
అంతవరకు లేని, అప్పటికప్పుడు స్ఫురించే ఈ సృజనాత్మక శక్తి తీరుబడిగా కూర్చుంటే రాదు. కాంక్షా నమ్మకమూ కార్యాచరణల అలజడిలోంచి సృజన పుట్టుకొస్తుంది. ప్రతి స్ఫురణకీ ఒక ధర ఉంటుంది. అది చెల్లించేందుకు సిద్ధపడేవారికి అది దక్కుతుంది.
యాజమాన్యాలు తమకు స్ఫురించని ఆలోచనలను ఉద్యోగులనించి అహ్వానించి లాభపడతాయి. లక్ష్యమేమిటో చెప్పి ఊరుకుంటే చాలు తగినన్ని ఉపాయాలూ సూచనలూ వెల్లువెత్తుతాయి.
ఊహా ఉపాయమూ పుట్టిన మెదడు మట్టిలో కలిసిపోచ్చు కానీ వాటి ప్రభావం మాత్రం చిరంజీవమై నిలుస్తుంది.
సంఘటిత ప్రణాళికారచన
కార్యాచరణ ప్రణాళికతో ఆరంభమవాలి. ఎంత గొప్ప విజయం సాధించామన్నది ఎంత పకడ్బందీగా ప్రణాళిక రచిస్తామనన్న దానిపైన ఉంటుంది. మన ఆశయాలతో సారూప్యం ఉన్న వారితో సహకార బృందం నిర్మించుకోవాలి. సంఘటిత సహకారం ముందు ఒంటరి ప్రయాస ఎప్పుడూ తీసికట్టే. మన బృందంలోని వ్యక్తుల ఎంపిక మొదలుకుని మన ప్రతి ప్రణాళికనూ సమీక్షించుకోవాలి. ప్రణాళికల్లోని లోపాలే అన్ని వైఫల్యాలకీ మూలకారణం. వేసినదే ఫలితమియ్యకపోవచ్చు అందుకని సవరింపులు చేసుకుంటూ వెళ్ళాలి. అవసరమనిపిస్తే అప్పటివరకు ఆచరిస్తున్నది అవతలపడేసి కొత్త ప్రణాళిక రూపకల్పనకూ సన్నద్ధమై ఉండాలి. చరిత్ర అన్ని రంగాల్లోను ధ్రువతారలుగా వెలుగొందిన ఎందరో ప్రముఖులందరకూ ఇది అనుభవైకవేద్యమే.
నాయకత్వ ప్రముఖ లక్షణాల్లో ఇదీ ఒకటి. మిగతా లక్షణాలు:
పనిమంతులు నాయకులూ అనుయాయులూ అని రెండు రకాలు. అనుయాయులకు నాయకులననుసరించడం నాయకత్వ లక్షణాలు ఆకళింపు చేసుకోవడం విధులు. సమర్ధులైన నాయకులు తాము చెపట్టిన పనికీ తమను అనుసరించువారికీ కూడా ప్రయోజనం కలిగించేవారై ఉంటారు. నాయకులకీ పదకొండు లక్షణాలు నిర్దేశించారు.
ఒకటి: చెదరని ధైర్యం. అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడ వారి ధైర్యం చెదరదు. నిజమైన నాయకులు నీరుగారే సందర్భాలే ఉండవు.
రెండు: ఆత్మ నిగ్రహం: ఇతరులను నియంత్రించేముందు నాయకుడు తనను తాను నియంత్రించుకోగలగాలి. నిగ్రహం కలిగిన నాయకులను అనుచరులు వీడిపోరు, వారి ఆదేశాలను బేఖాతరు చెయ్యరు.
మూడు: న్యాయబద్ధత. నాయకులకు న్యాయాన్యాయాలు, విషయాల మంచిచెడ్డల విచక్షణ సంపూర్ణంగా ఉంటుంది. అదే వారి అనుచరులకు వారిపట్ల గల గౌరవాన్నీ విశ్వాసాన్నీ నిలిపుతుంది.
నాలుగు: స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. చెయ్యాలనుకున్నదీ చేస్తున్నదీ వాటి ప్రకారం అమలుచేసితీరుతారు.
ఐదు: పనిచేసి పథకం రచిస్తారు. పథకం ప్రకారం పనిచేస్తారు. గాలివాటంగా క్షణానికోలా ఉండే పేరుగొప్ప నాయకులు చెయ్యగలిగేది శూన్యం,
ఆరు: ఉప్పుకున్నదానికన ఎక్కువ పనిచేసే స్వభావం కలవారు. వారెప్పుడూ అనుకున్నదానికన్న ఎక్కువే పనిచేస్తారు. సాటి ఉద్యోగులు మొదలుకుని వీరితో వ్యవహరించె ప్రతి ఒక్కరికీ ఇది అర్ధమవుతుంది. ఒప్పందాలు, ప్రతిఫలాలు నిజమైన నాయకులకి లాంఛనప్రాయం. పనిలో నాణ్యత, దీర్ఘకాలిక ప్రయోజనాలే వారి ప్రాధమ్యం.
ఏడు: ఆకర్షక వ్యక్తిత్వం కలవారు. చూడగానే ఔరవించాలనిపిస్తుంది. వారి వ్యవహార శైలీ నడవడీ అలాటివి. లేకుంటే అనుచరులు లెక్క చెయ్యరు.
ఎనిమిది: సహానుభూతి కలవారు. ఎదటివారి కోణం నించి విషయాలను అర్ధం చేసుకునే స్వభావం కలవారు. తొందరపాటూ దురహంకారాలను దరిచేరనియ్యరు.
తొమ్మిది: దేన్నైన వివరణాత్మకంగా అర్ధంచేసుకుంటారు. పైపైనే చూచి తొందరపడకుండా. అందుకే వారి తీర్మానాలు నిష్పక్షపాతంగా వుండి సకలజనామోదం పొందుతాయి.
పది: పూర్తి బాధ్యత తీసుకుంటారు. చేపట్టిన పని నిర్వహణా, ఫలితాలకు పూర్తి పూచీ పైన వేసుకుంటారు. ఆ క్రమంలో ఎదురయే విమర్శలనూ సవాళ్ళనూ దీటుగా ఎదుర్కొని దారిచేసుకుంటూ ముందుకు పోతారు. పని విషయంలో ఇది నాది, ఇది అవతలివాడిది, అక్కడేమైనా అయితే నా పూచీ లేదు అనే స్వభావం ఉండదు.
పదకొండు: సహకారులు. సహోద్యోగులకు, పనిలో భాగమైన ప్రతి ఒక్కరికీ సహకారులై ఉంటారు. ఎవరికి నిర్దేశించిన పని వారు విజయవంతంగా పూర్తిచేయగలగాలనే సంకల్పంతో అందరికీ సయోధ్య, సహకారాలు పంచి వారి విజయాన్ని సుగమం చెయ్యడంద్వారా తమ విజయాన్ని స్థిరం చేసుకుంటారు.
నాయకత్వం రెండు రకాలు. అందరి అంగీకారంతోను నాయకులైనవారు కొందరైతే అణచివేతతో నాయకులైనవారు ఇంకొందరు. రెండో రకం విధ్వంసకరం. జన నాశనం, స్వవినాశనం దాని పర్యవసానాలు. నెపోలియన్, రష్యా జారు చక్రవర్తి, హిట్లర్ వంటి వారు ఈ రకం. జనాంగీకారంతో నాయకులైనవారికి పైన చెప్పిన లక్షణాలూ ఉంటాయి. అందువల్ల వారి నేతృత్వంలో అందరికీ ప్రయోజనం కలుగుతుంది. దాని ఫలాలు కలకాలం నిలిచి ఉంటాయి.
అయితే నాయకులందరూ విజేతలని చెప్ప వీలు లేదు. సాధారణంగ వారి వైఫల్యాలకు ఇవి కారణాలు కావచ్చు. అవి-
ఒక నిర్ణీత లక్ష్యం లేని జీవితం. అందరికీ లక్ష్యాలు ఉండలని లేదు కాని జీవితమంతా కాలక్షేపమూ యాంత్రికతే అయితే వారు సాధించేది శూన్యం.
నిగ్రహం లేకపోవడం. నిగ్రహానికి క్రమశిక్షణ పునాది. నిగ్రహం లేనివారు అన్నిటికీ అతిగా స్పందించి సుఖాలకి పొంగిపోయి కష్టాలకి కుంగిపోయి నిలకడ లేక అలజడితో జీవిస్తారు.
వాయిదాలు వేసే తత్వం. ఇప్పుడు కాదు రేపు చూదాం ఎల్లుండి చూదాం అనే సాగతీత స్వభావం. ప్రమాదాలస్య నిద్రాభిః అన్నట్టు పొరపాట్లూ, ఆలస్యం, బద్ధకం వీరిని వెన్నంటి ఉంటాయి.
పట్టుదల లేకపోవడం. అన్ని పనులూ అనుకున్నట్టు అనుకున్నంతలో జరగవు. అటువంటప్పుడు అసహనం కాక ఓరిమీ పట్టుదలా నిలకడా అవసరం. అంతా బాగా నడిచినప్పుడు ఉన్న హుషారు మందకొడి సమయంలో డీలాగా మారిపోతే మళ్ళీ దాన్ని ఉత్సాహంగా మార్చుకుని పని మీద దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది.
ఇలాగే సెక్సు కర్యకలాపాల్లో నియంత్రణ లేకపోవడం, అన్నిటా వ్యతిరేక భావనలు, ఏమీ ఇవ్వకుండా ఎదో ఒకటి అప్పనంగా పొందాలనే మనస్తత్వం, నిర్ణయం తిసుకోలేకపోవడం, తీసుకున్నా దానికి కట్టుబడలేకపోవడం, అతి జాగ్రత్తతో అన్ని అవకాశాలను జారవిడుచుకోవడం, సహచరుల ఎంపికలో తొందరపాట్లు, పొరపాట్లు, మూఢవిశ్వాసమూ అపనమ్మకాలు, పనిమీద శ్రద్ధ లేకపోవడం, ఉత్సాహం లేకపోవడం, ఓరిమి లేకపోవడం, నలుగురితో కలవలేని తత్వం, స్వశక్తితో కాక వచ్చిపడిన ధనాధికారాలు, వంచన, అసత్యం, ఇత్యాదులు.
కనుక వైఫల్యాలు విశ్లేషించుకునేవారు బయటికి కాక లోనికి చూడమని పెద్దలు చెప్పేరు. నిన్ను నీవు తెలుసుకో అని. ది స్పష్టంగా అర్ధమైతే ప్రతి అనుభవమూ విశదపడుతుంది. మన బలహీనతల గురించిన పుర్తి అవగాహన ఉండి, ఒకోటిగా అవి వదులుకుంటే అవే బలాలై ప్రతికూలతలను తారుమారు చేస్తాయి.
ఒక దేశం అభివృద్ధిచెందడమంటే అక్కడ సంపద స్వేఛ్ఛ, సంతోషం, సంక్షేమం ఉన్నట్టు. వీటిని సమకూర్చేది ప్రభుత్వమే అయినా, అది ఏక పక్షం అయిన పక్షంలో ఎంతో కాలం నిలవదు. ప్రజల సహకారమూ దానికుండాలి. శ్రమ విలువను అందరూ గుర్తించి పరస్పర సహకారంతో సృష్టించిన సంపదకి ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కొరత ఏర్పడదు.
ఎనిమిది : నిశ్చితం
నిశ్చితం, నిశ్చయబుద్ధీ నిర్ణయాలు తీసుకునే విషయానికి స్వభావానికి సంబంధించినవి. అధికంగా వైఫల్యాలు సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం, లేదా తొందరపాటు నిర్ణయాల వల్ల కలుగుతాయి. నిర్ణయం త్వరగా జరగాలి, అవసరమైతేనే వాటిని మార్చాలి, అదీ నిదానంగా ఉండలి. హెన్రీ ఫోర్డు మొదలైన ప్రముఖులు ఇది ఆచరించారు. వేసుకోవాల్సిన ప్రణాళిక అంతా నిర్ణయానికి ముందే జరగాలి. త్వరితంగా తీసుకునే నిర్ణయాలు, నిదానంగా యోచించి చేసే మార్పులూ చేర్పులు విజేతల స్వభావమైతే, జాప్యంచేసి తీసుకునే నిర్ణయాలు, తొందరపాటు మార్పులూ చేర్పులు విఫలుర స్వభావం.
యోచించి తీసుకునే నిర్ణయాలు ఇతరుల అభిప్రాయాలు, గాలివార్తలతో ప్రభావితం కారాదు. నిర్ణయంలో చేసుకునే మార్పులూ పూర్తి విశ్లేషణ చేసుకున్నాకే జరగాలి. అభిప్రాయాలు కారు చౌక. విరివిగా లభిస్తాయి. అన్నీ వినాలి, అన్నీ చూడాలి, కాని నిర్ణయం మనది కావాలి. చెప్పేదానికన్న ఎక్కువ చేసే స్వభావం అలవర్చుకోవాలి. మన ఆకాంక్ష, మన నిర్ణయాలు, మన కార్యాచరణ. చేతలు మాటలను మించాలి.
నల్లజాతివారి బానిసత్వ విముక్తిని కాంక్షించి దానికైన బిల్లును ప్రతిపాదిస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందని అబ్రహాం లింకన్ ఎరుగును. దాన్ని నివారించేందుకు ఎందరో తన నిర్ణయానికి మార్పులూ చేర్పులూ సూచించారు కాని అతడు లక్ష్యపెట్టలేదు. దాని అమలు కొన్ని ప్రాణాలను, ఆఖరుకి తన ప్రాణాన్నీ బలిగొంది. కాని మానవాళికే తలవంపు అయిన జాతి వివక్ష ఆ దేశంలో రూపు మాసింది.
మత పెద్దలు సోక్రటీసు చేతిలో విషపాత్ర ఉంచి నీ అభిప్రాయాలు మార్చుకుంటావా అది తాగుతావా అంటే అతను తాగి చనిపోయేందుకుకే నిశ్చయించుకున్నాడు కాని అభిప్రాయం మార్చుకోదలచుకోలేదు. లక్ష్యం కోసం తమ జీవితాలనూ లెక్కచెయ్యని ఇటువంటి ఎందరో నాయకుల అనుభవాలు, మనిషి ఆకాంక్షలకు ఆశయాలకు పరిమితులు ఉండవని మలి తరాలకి చాటి ఇంకెన్నో విప్లవాత్మక మార్పులు మానవసమాజం ఎదట ఆవిష్కరించాయి.
1776 లో జార్జి వాషింగ్టన్ తో పాటు అతని అనుచరులు యాభై ఎనిమిది మంది స్వాతంత్ర ప్రకటన మీద సంతకాలు పెట్టి అతి శక్తివంతమైన బ్రిటిష్ వారి పాలన నించి విముక్తిని ఆకాంక్షించారు. ఒకరకంగా అప్పటికి అది తమకు తాము లిఖించుకున్న మరణశాసనమే. కాని వారి ఆకాంక్ష, నమ్మకం, సంఘటిత ప్రణాళికల బలం ముందు బ్రిటిష్ వారు తలొంచక తప్పలేదు. అమెరికన్ స్వాతంత్ర్య పోరాట ఖ్యాతిని ప్రముఖంగా జార్జి వాషింగ్టంకే చరిత్ర పుస్తకాలు ఆపాదించినా మరుగున పడిన ఎందరో మహనీయుల పేర్లు, వారి నాయకత్వ పటిమ సాకారమైన ఈ అమెరికన్ కలకి స్ఫూర్తిప్రదాతలు అని చెప్పకతప్పదు.
ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగ నిలిచిపోయే ఈ దృష్టాంతాలన్నిటి వెనక వాటిని సాకారం చేసిన మహనీయుల నిశిత దృష్టీ నిశ్చితమైన సంకల్పమూ ఉన్నాయి. సామాన్యులకి తెగింపులా అగపడే వారి నిర్ణయానికి ముందు విస్తృతమైన విశ్లేషణ, ప్రణాళికలు, చెయ్యబోయేపని దాని పర్యవసానాల గురించిన స్పష్టతా ఉంటాయి. అయితే మహనీయుల సంకల్ప సిద్ధికి ఉపకరించిన ఈ ముఖ్య లక్షణం సామాన్యుల ప్రతి కాంక్షనూ అందివ్వగల సమర్ధమైనదే - ఆశయం ధనార్జనైనా, ప్రజానాయకత్వమైనా, సృజనాత్మ ఆవిష్కరణ అయినా ఉన్నతోద్యోగమైనా తెలిసిన కళలో కౌశలమైనా.
తొమ్మిది : నిలకడ లేకా పట్టుదల
పట్టుబట్టరాదు పట్టివిడువ రాదు అన్నారు. నిలకడ అంటే పట్టుదల. ఆరంభశూరత్వంతో పెట్టుకున్న ఆశయాల వేడి ఒకట్రెండు రోజులకి చల్లారిపోతుంది. మొదటినించి పని పూర్తయేవరకూ పట్టుదల నిలిచి యుండేందుకు విల్ పవర్ అంటే ధీశక్తి అవసరం. ఇదీ దానంత అది కలిగేది కాదు. పెంచుకోవాల్సిందే. పట్టుదల కలిగినవారిని మొండివాళ్ళని సమాజం అర్ధం చేసుకుంటుంది. అయితే ఒకరి నిలకడ పట్టుదలా మొండితనమా అన్నది వారు ఎంపిక చేసుకున్న లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. గాంధీ మహాత్ముడు, నెల్సన్ మండేలా వంటివారి పట్టుదలను మొండితనమనడం అసంబద్ధం.
ఆరంభంలోని స్ఫూర్తి తదుపరి తగ్గుతున్నట్టనిపించినప్పుడు ఒంటరిగా ఉంటే కుదరదు. అందుకోసం మేధో నిధి సహకారం అవసరం. మన యోచనలకనుగుణమైన గుంపును తయారుచేసుకోవడం అవసరమని ముందే చెప్పుకున్నాం. అటువంటి అండ ఉన్నప్పుడు గుంపులోని ఏ ఒక్కరు జారినట్టనిపించినా మిగతావారు చేయందించి నిలుపుతారు. వారి సహకారానికి తోడు క్రమం తప్పక చేసుకునే స్వయం సూచనలూ స్ఫూర్తినీ ఉత్సాహాన్నీ నిలుపుతాయి.
ఆశయ విరుద్ధ భావనలు మదిలో చొరనియ్యకూడదు. సిరి సంపదలే లక్ష్యమైతే పేదరికపు తలపులు కలగకూడదు. స్వేఛ్ఛాస్వాతంత్ర్యాలే ఆశయమైతే బానిసభావాలకు తావులేదు. అంతశ్చేతనకి మంచి తలపులనీ చెడ్డవనీ తేడా ఉండదనీ, వేటిని జపిస్తే అటే మనని లాక్కెళుతుందనీ కూడా ముందు అనుకున్నాం.
కనుక ఆశయానికే త్రికరణశుద్ధిగా అంకితమై సాధించదలచుకుంటే నిశ్చితమూ పట్టుదలా మన స్వభావం కావాలి. అటూ ఇటూ బెసగని నిలకడతత్వం అభ్యాసంతో అలవాటవుతుంది.
వివిధ రంగాల్లో తారాపథానికి చేరుకున్న ఎంతో మంది అవకాశాలకోసం, మొదటి పరిచయంకోసం, చిన్నపాటి గుర్తింపుకోసం యేళ్ళతరబడి వేచిచూచి తిరస్కారాలను కూడా పురస్కారాలుగా భావించి ప్రయత్నం విడువక సాధించినవారే. వారందరి సామాన్య స్వభావాన్ని నిర్వచించదలిస్తే టక్కున స్ఫురించే ఒకే ఒక్క పదం పట్టుదల.
పట్టుదలను పెంచేందుకు అవసరమయే నాలుగు అంశాలు:
ఒక స్థిరమైన లక్ష్యం, అది సాధించాలని నిరంతరం రగిలే బలమైన కాంక్ష.
నిర్దుష్టంగా రచించిన ప్రణాళిక, దానిని అనుసరిస్తూ సాగే క్రమశిక్షణాయుతమైన కార్యాచరణ.
లక్ష్యవిరుద్ధమైన ఎటువంటి వ్యతిరేక భావనలకూ చోటివ్వని ఉత్తేజము ఉత్సాహమూ నిండిన మనస్సు.
మనంత బలంగానూ మన ఆశయసాధనను కాంక్షించే మరొకరు లేదా మరికొంతమంది భావసారూప్య స్నేహబృంద సహకారం.
మహమ్మద్ ప్రవక్త గురించి ఆఖరి ప్రవక్త అన్న శీర్షిక కింద వెలువడ్డ రచనను థామస్ సుగ్రూ ఇలా సమీక్షించారు.
"మహమ్మద్ ఉపన్యాసాలూ అవీ అక్కడివారికి పరిచితమే కాని వారు పట్టించుకోలేదు. తన జీవితాదర్శం ఏమిటన్నది అతను నలభయ్యో ఏట నిర్ణయించుకున్నాడు. అక్కణ్ణించి పదేళ్ళ పాటు అతని మాటలను భగవత్తత్వాన్ని గురించిన అతని అభిప్రాయాలను అప్పటి సమాజం అవహేళన చేసింది. అతని కుటుంబాన్నీ అనుచరులనూ వెలివేసి కనీస జీవనవసతి లభించకుండా కట్టడి చేసింది. పదేళ్ళ తిరిగేసరికి అతను ప్రపంచ మార్గాల కూడలి అని చెప్పబడే మక్కాకి దైవ సందేశ ప్రచారక చక్రవర్తిగా ఒక కొత్త మతధర్మ స్థాపకునిగా ఎదిగాడు. తన మాటల బలం, తన ప్రార్ధన ప్రభావం, మనిషికి మహేశ్వరునితోగల అనుబంధమూ అతన్నీ ఈ అత్యున్నత స్థాననికి చేర్చేయి. అతడు ప్రవచించి ప్రకటించిన దైవ గ్రంథం ఖొరాను లోకోత్తరమూ మహాద్భుతమూ. కాని అతను విద్యాధికుడూ కాడు, సంపన్నుడూ కాడు, కవీ కాడు. కాని ఏర్చి కూర్చిన పదసంపదతో శోభిల్లే ఖొరాను కవిత్వం అతి సుందరమూ దివ్యమూ దైవానుగ్రహ సాధకమూ అని నేటికీ కోట్లాది భక్తులు ప్రస్తుతించి పారాయణం చేస్తున్నారు. మహమ్మద్ తనను తాను ఒక కొత్త మత సృష్టికర్తగా చెప్పుకోలేదు. భగవంతునికి మనుషులంతా ఒక్కటేనని, మానవులందరి భగవంతుడూ ఒక్కడేనని విశ్వసించే దైవభక్తులైన క్రైస్తవ యూదు సోదరులనూ తనతో కలవమని ఆహ్వానించాడు. తన సందేశమూ సౌహార్దమూ విశ్వాసాలే ఆయుధాలుగా అతని సైన్యం జెరూసలెంలో అడుగుపెట్టి సాధించిన విజయంలో ఒక్కరూ ప్రాణం కోల్పోలేదు. కాని అతని బోధనలు అపార్ధం చేసుకుని కత్తికట్టినవారు తరవాతికాలంలో క్రూసేడుల పేరుతో దాడులు చేసి ఎంతో మంది మహమ్మదీయులను సంహరించారు. కానీ కాలక్రమేణా మహమ్మద్ సందేశ ప్రభావం వారికి అవగతమైంది. జ్ఞాన నిక్షేపునిగ అతన్ని ప్రస్తుతించి అతను నడయాడిన ప్రదేశాన్ని విశ్వ జ్ఞాన కేంద్రంగా గుర్తించి అతని బోధనల సారాంశాన్ని శిరసావహించారు.
మేధో నిధి శక్తి
రచించుకున్న పథకాలు వాటికవి జడపదార్ధాలు. వాటిని కదిలించి కార్యాచరణలో పరుగులెత్తించే శక్తి కావాలి. సకల ఆశయాలూ శక్తితోనే సాధ్యం. ప్రణాళికాబద్ధంగా అమల్లోపెట్టబడిన జ్ఞానమే శక్తి. సంపదలు, ప్రజాదరణ, కళాకౌశలం ఇలా సాధించదలిచేది ఏదైనా శక్తిగా రూపాంతరంచెందిన జ్ఞానమే వాటికి సాధనం. అందుకని జ్ఞానమే శక్తి అన్నారు. అది మూడు విధాలుగ సముపార్జిస్తాం.
అనంత మేధస్సు: ఇంతకు ముందు అనుకున్నట్టు ప్రపంచంలోని అన్ని ఆలోచనల సమీకృత సంగ్రహమే అనంత మేధస్సు. అందరి ప్రార్ధనలూ కాంక్షలూ ఆలోచనలు కాలప్రదేశాల నిత్తంలేకుండా ఇందులో జమ అవుతుంటాయి. బలమైన కాంక్ష, నమ్మకం, సృజనాత్మక కాల్పనికతను అభ్యసించేవారికి దీని నించి కొత్త ఉపాయాలు స్ఫురిస్తాయి.
అనుభవ సారం: తొలి దశలో ఇది విద్యాబోధన నించి నేర్పబడుతుంది. అది ఉపయోగించి ఆచరించే క్రమంలో మనకు మనంగా నేర్చుకున్న పాఠాల అనుభవం దీనికి జతపడి మన గమనాన్ని నిర్దేశిస్తుంది.
శోధన: విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు నిరంతరంగా శోధించి చేసిన ప్రయోగాల ఫలితమే. అదే విధంగా వివిధ అభిప్రాయాలు, స్ఫురించిన ఉపాయాలు, అనుభవాలు, నేర్చుకున్న పాఠాల సమన్వయంతో నిరంతరం చేసే కొత్త ప్రయోగాలద్వారా కొత్త మార్గాల రూపకల్పన సాధ్యపడుతుంది.
ఇలా సముపార్జించిన జ్ఞానానికి ప్రణాళికను జోడించి కార్యాచరణలో పెట్టినప్పుడు అది శక్తిగా వ్యక్తమై విజయం దిశగా మనని తీసుకెళ్తుంది.
ఇప్పుడు మేధో నిధి లేదా మాస్టర్ మైండ్ ఏమిటో చూద్దాం. భావసారూప్యం కలిగిన ఇద్దరు లేదా ఎక్కువ మంది తమ భావనలు, జ్ఞానము, కార్యాచరణను ఒకటి చేసి దాని ప్రయోజనాలను అందరికీ పంచేదే మాస్టర్ మైండ్ గ్రూపు లేదా మేధో నిధి సమూహం. మేధస్సుల నిధి. సాధారణ ప్రయత్నాలు అసాధారణ ఫలితాలివ్వాలంటే ఇది ఆవశ్యకం. విద్యుత్తూ రేడియో తరంగాల్లా మనిషి ఆలోచనలూ అగోచరమైన శక్తి స్వరూపమే. రెండు శక్తులు ఏకమైతే వాటి ఉమ్మడి శక్తి కచ్చితంగా రెండింతలో అంతకన్న ఎక్కువో అయితీరుతుంది. మేధోనిధి కీలకం ఇదే. ఒక విద్యుత్ బేటరీ ఇచ్చే శక్తి కన్న కొన్నిటిని అనుసంధిస్తే ఉత్పన్నమయే విద్యుత్తు ఎలాగైతే ఎక్కువ ఉంటుందో, అదే విధంగా ఒకరి ఆలోచన కన్న ఇద్దరు లేదా ఎక్కువమంది భావ సారూప్యం కలిగిన వారి సమిష్టి ఆలోచన అధిక శక్తిదాయకమవుతుంది. ఆ ఉమ్మడి అధిక ప్రయోజనం గుంపులోని అందరికీ లభిస్తుంది. అంటే వైయక్తిక ప్రయత్నంతో ఒకరు పొందే ప్రయోజనం కన్న అదే ప్రయత్నాన్ని బృందంతో కలిసి ఆచరించినప్పుడు కలిగే ప్రయోజనం విస్తృతం. మహాత్మా గాంధీ వంటి ప్రపంచ నాయకులకు తమ ఆశయం ఒక సంకల్పంగా తమ వ్యక్తిగత స్థాయిలోనే జరిగినా క్రమక్రమంగా వారిని అనుసరించేవారి ఆలోచనల భావసారూప్యం గొప్ప గొప్ప మేధోనిధి బృందాల ఆవిర్భావానికి దోహదపడి ఆ సమిష్టిశక్తి కార్యసాధనను వారికి సుగమం చేస్తుంది. అలోచనలలోని సారూప్యం అన్నది గుర్తుంచుకోవలసినది. అంటే అందరి లక్ష్యమూ ఒకటే కావాలి. ఎటువంటి భిన్నతకూ తావుండరాదు. అప్పుడు సమిష్టి జ్ఞానశక్తి అందరకూ లభించి అనుకున్నది నెరవేరుస్తుంది.
కామశక్తి పరివర్తన రహస్యం
ఇంగ్లీషులో ట్రాన్స్ మ్యుటేషన్ ఆఫ్ సెక్స్ అని దీని మూలం. ట్రాన్స్మ్యుటేషన్ అంటే పరివర్తనం. ఒక పదార్ధం కానీ ఒక శక్తి కాని తన అసలు స్వభావాన్ని వదలి వేరే స్వభావానికి పరివర్తనం చెందడం అన్నమాట. సెక్స్ భావన కూడ ఒక శక్తే. స్థూలంగా దీని ప్రయోజనాలు ఇవి:
ఒకటి: జాతి వృద్ధి దీనితోనే జరుగుతుంది.
రెండు: బాధా నివారిణి. బాధనించి ఏ మందూ ఇయ్యని ఉపశమనం సెక్స్ ఇస్తుంది.
మూడు: దాని వ్యక్తీకరణ దిశను మార్చి పరివర్తన చేసినపక్షంలో ఇతర ఉపయోగకర వ్యాపకాలకు దోహదం చేస్తుంది.
ట్రాన్స్మ్యుటేషన్ లేదా పరివర్తన చెందించడం అంటే, సెక్సు కోరిక కలిగినప్పుడు దాని సహజ వ్యక్తీకరణ అయిన కలయికలో వృధా చెయ్యక, ఇంకో ఉపయోగకర వ్యాపకం మీదకి మళ్ళించాలి. అది ఒక సృజనాత్మ వ్యాపకమైనా ధనార్జన అయినా ఇంకే పనికొచ్చే వ్యాపకమైనా.
సెక్సు ఎంత బలమైన శక్తో మనకి అనుభవమే. కామతురాణాం నభయం నలజ్జా అని పెద్దలు అననే అన్నారు. కామవాంఛ తీర్చుకోవడంకోసం ప్రాణాలనూ పరువునూ ప్రమాదాన్నీ లెక్కచెయ్యక ఉరుకులు పరుగులు పెట్టేవారిని మనం చూస్తుంటాం. దాని శక్తి అటువంటిది. మనిషి బుద్ధిని ఇంతగా కేంద్రీకరించే భావోద్వేగం మరోటి లేదు. అందుకే ఇదో శక్తి స్వరూపం. ఎందరో జ్ఞానులు ఈ సంగతి గుర్తించి కామ వాంఛను భౌతిక దారులగుండా వ్యర్ధపుచ్చకుండా ఇతర కౌశలాలమీదికి మళ్ళిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజకీయ నాయకులు, కళాకారులు, శాస్త్రవేత్తలు ఎంతోమంది ఈ విధంగా కామ శక్తిని తమ రంగాల్లోకి మళ్ళించి వాటిని వృద్ధి చేసుకున్నవారే.
అయితే భౌతిక సంపర్కం కోరకుండా కామ వాంఛను తృప్తిపరచడం సులభం కాదు. దనికెంతో నిగ్రహమూ ధీశక్తీ అవసరం. ఆశయ సిద్ధికోసం, జీవిత లక్ష్యంకోసం కార్యోన్ముఖులయేవారు దీన్ని అభ్యసిస్తే వారి లక్ష్యసాధనకూ అదీ తనవంతు సహకారాన్నందిస్తుంది. కామం సహజ ప్రయోజనమైన సంతానోత్పత్తి విధిని నెరవేర్చిన తరవాత ఆ శక్తిని ఈ విధంగా వేరే ఉపయోగకర మార్గాల్లోకి మళ్ళించడమే ఆ శక్తిని మనకి ప్రసాదించిన ప్రకృతి పరమార్ధం.
ఆ లెక్కన విపరీత కామవాంఛలున్నవారు తలచుకుంటే ఏ ఆశయాన్నైనా సాధించగల శక్తిమంతులు - క్షణిక సుఖమే చాలునని దాన్ని వృధాచేసుకోకుండ ఉన్నట్టయితే. అయితే పునరుత్పత్తి తరవాత ఈ బాదరబందీ లేకుండా వాంఛలు ఆరిపోతే మంచిది కదా అని కొందరనవచ్చు. స్త్రీల విషయంలో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది కాని పురుషుల అభ్యున్నతికి కామవాంఛ కూడా అత్యావశ్యకం. అది లేని జీవితం నిస్సారమూ నిరాసక్తమూ అయిపోతుంది. ఉదాహరణకి జంతువుల్లో మగవాటికి పునరుత్పత్తి అవయవాలు తొలగించేస్తారు పనులకి ఆటంకమని. అలా చెయ్యబడ్డ ఎనుబోతులను ఎద్దులనూ చూడండి, పౌరుషరహితంగా, నిరాసక్తంగా వాటి ఆడ పశువులమాదిరి తయారవుతాయి. మనిషి ప్రకృతీ ఇందుకు భిన్నం కాదు. అందుకని మన అభ్యున్నతికి కామం అత్యావశ్యకం. దాన్ని ఎలా వినియోగిస్తున్నం అన్నదే ముఖ్యం.
మనసుకు అత్యంత ఉత్ప్రేరకాలైన పది భావోద్వేగాలు చెప్పబడ్డాయి. అవి,
సెక్సు, ప్రేమ, ధనమూ కీర్తీ అధికారాలకైన బలమైన కాంక్ష, సంగీతం, ఇరువురి మధ్యగల అనుబంధం, భావసారూప్యం కలిగిన మాస్టర్ మైండ్ బృంద స్ఫూర్తి, ఒకే కష్టానికి గురైన వారికి ఒకరిపట్ల ఒకరికిగల సహానుభూతి, స్వయం సూచనలు లేదా ఆటో సజెషన్, భయం, మాదకద్రవ్యాలు. వీటిలో ఆఖరు రెండూ హానికారమైనవి, మిగతావి ప్రయోజనకరమైనవి. జాబితాలో మొట్టమొదట ఉన్నది సెక్సు అని గమనించే ఉంటారు. అది సహజమూ వాస్తవమూ.
చరిత్రలో ఎంతో మంది ప్రముఖుల విజయ సాధనకి వెనక ప్రేమాస్పదులైన వారి భార్య కాని ప్రేయసి కాని ఉన్నది. నెపోలియన్ తన భార్య జోసెఫిన్ తో సఖ్యతగా ఉండినన్నాళ్ళు అతనికి ఎదురు లేకుండ పోయింది. అయితే ఒకసారి మాత్రం జోసెఫిన్ ను అశ్రద్ధ చేసి వేరే వారి మాటలు వినడం సెయింట్ హెలీనా వద్ద ఓటమి పాలవడం కేవలం యాదృఛ్ఛికం కాకపోవచ్చు. ఇలా మన్మధతాపాన్ని సాగుచేసుకుని ప్రతిష్ట గడించినవారిలో జార్జి వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, విలియం షేక్స్పియర్, ఎల్బర్ట్ హబ్బర్డ్, ఆస్కార్ వైల్డ్, అబ్రహాం లింకన్, వుడ్రో విల్సన్, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, ఆండ్రూ జాక్సన్ ప్రభృతులు ఉన్నారు.
జనులు విజేతలుగా నిలదొక్కుకునేది నలభయ్యోపడిలో పడినతరవాతే ఎందుకని పరిశోధనలు జరిగాయి. యుక్తవయసులో కామవాంఛలను అణచుకొనేందుకు భౌతిక మార్గాలనే ఆశ్రయించడం వల్ల నీరసపడి ధ్యాస మందగించడం, అదే నడివయసు వచ్చేసరికి పరిణతీ బాధ్యతలూ పెరిగి కోరిక కలిగినప్పుడు హడావిడిగా దులిపేసుకొనే ప్రయత్నం చెయ్యక మనసు మళ్ళించుకొనే నేర్పు కలగడంతో ఆ శక్తి ఇతర వృత్తి వ్యాపకాలలో శ్రద్ధ పెట్టేందుకు వినియోగపడటమే దీనిక్కారణం అని కనుగొన్నారు.
హెన్రీ ఫోర్డ్, ఆండ్రూ కార్నెగీ, జేంస్ హిల్ వంటి ప్రముఖులు తమ నలభయ్యో పడిలోనే స్థిరమైన విజయాలు సొంతం చేసుకుని నిలదొక్కుకున్నారు. ముప్ఫై ఐదూ నలభై మధ్యలో మనిషి తన సెక్స్ వాంఛలు తీర్చుకునే విషయంలో నిగ్రహమూ వాటిని వేరే ఉపయుక్త విషయాలమీదకి మళ్ళించడమూ అలవాటు చేసుకుంటాడు. ఇది ప్రకృతి సహజం. అయితే నిగ్రహం అభ్యాసం తోనే అలవడుతుంది. పరిణతి తెచ్చుకోక కుర్రతనపు ధోరణే కొనసాగిస్తే తోకతెగిన గాలిపటంలా దిశా దెసా లేని జీవితమే. సెక్సు ప్రేమ రెండు బలీయ మనఃస్థితులు. వాటి వ్యక్తీకరణల్లో ఉంటుంది తేడా. సెక్సు శారీరకం, విధ్వంసకరం. ప్రేమ మానసికం, ప్రయోజనకరం. సెక్సు శక్తి దులిపేసుకునే వ్యక్తీకరణతో నశించిపోతుంది. ప్రేమ శక్తి వ్యక్తీకరణతో బలపడుతుంది. సెక్సు ప్రదర్శన కొందరి వద్దనే చెయ్యవీలయేది. చెయ్యగానే ఆరిపోయేది. ప్రేమ ప్రదర్శన సకల ప్రపంచ వస్తు వ్యక్తులపైనా చెయ్యవీలయేది. చేసేకొద్దీ పెరిగేది, ఉపయుక్త వ్యాపకాలలో ధ్యాసను పెంచేది. అయితే సెక్సును ప్రేమగా రూపాంతరీకరిస్తే ఆ ప్రయోజనాలు అదీ కలిగిస్తుంది. ఏ శక్తి అయినా దానిని పెంచేది, ఇంకో రూపంలో వ్యక్తపరచగలిగేదే ఉత్తమమైనది. నిగ్రహమూ అభ్యాసాలే కీలకాలు. ఏ భావశక్తి అయినా తన ఆశయ సిద్ధిని బలపరుస్తోందా నీరసపరుస్తోందా అనేది వివేకంతో యోచించి తదనుగుణంగా అభ్యాసంతో అలవాటు చేసుకోవాలి.
అంతశ్చేతన
అంతశ్చేతన మన ఆలోచనల భాండాగారం. సబ్ కాన్షస్ మైండ్. ఇంద్రియగోచరమైన ప్రపంచానుభవంలో మనకి కలిగిన అలోచనలన్నీ ఇందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. కనబడకుండా కేవలం ఒక ఆలోచన అయిన సంకల్పాన్ని సాకారం చేసేందుకు అవసరమైన పరిష్కార సహకారాలను అనంత మేధస్సు నుంచి ఆకర్షించే వారధి అంతశ్చేతన. అంటే మన మనసుకీ అనంత మేధస్సుకు మధ్యవర్తి.
అయితే అలా అనంత మేధస్సునుంచి అవన్నీ మనకి అంది మన కాంక్ష వాస్తవరూపం దాల్చాలంటే ఆలోచన బలమైనదై ఉండాలి. అది ఇంతకుముందు చెప్పుకున్నట్టు బలమైన కాంక్ష అయి, అది సాకారమవుతుందన్న నమ్మకం ఉండి, దానికి భావొద్వేగం తొడై నిరంతరం స్వయంసూచనల తో మననం చేసుకుని హృదయస్థం చేసుకున్నప్పుడు అది అంతశ్చేతనలో భద్రమవుతుంది. అంతశ్చేతనకి మంచి తలపులనీ చెడు తలపులని భేదం ఉండనందున ఇందులో భద్రపరచుకునె ఆలోచనల విషయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయోజనకరమైన వాటినే పెంచుకుంటూ ఎటువంటి వ్యతిరేక భావనలకూ మనసులొ చోటులేకుండా చూసుకోవాలి.
ఈ అంతశ్చేతన ఖాళీగా ఉండటం జరగదు. మనం నిద్రిస్తున్నా దాని ఉనికి గురించిన స్పృహే లేకున్నా, దైనందిన జీవిత క్రమంలోనివే కొన్ని మంచివీ కొని చెడువీ అందులో జమ అవుతూనె ఉంటాయి.
ఇప్పుడు అందులో చెడువి చేరకుండా జాగ్రత్తపడాలి అనుకున్నాం. ఇదెలా అంటే, ఇంతకుముందే చెప్పుకున్నట్టు, ఒక ఆలోచన వాస్తవరూపం దాల్చాలంటే దనికి విశ్వాసాన్నీ భావోద్వేగాన్నీ అది సఫలమైనప్పటి స్థితిని ఊహించుకునే సృజననీ దానికి జతచెయ్యాలి. ఇవన్నీ మన అధీనంలోనివి, అనుకుంటే నియంత్రించుకోగలిగినవి.
"నీకు ఏది లభిస్తుంది? ప్రేమా లేక ద్వేషమా? అనేవిషయంలో సందేహము వలదు. దాని మూలం నీ మదిలోనే ఉంది. నీ ఆలోచనలు అదృశ్య శక్తులు. నీ తలపునుండి బయలువెడలిన తక్షణమె అవి రెక్కలు కట్టుకుని అనంత మేధస్సులోకి ఎగురుకుంటూ పోయి అక్కడ తమతో సారూప్యం కలిగిన వాస్తవ స్థితులను నీదగ్గరకి మోసుకొస్తాయి. నీకేది వచ్చిందన్నది నీనుంచి ఏది వెళ్ళిందన్నదాని ఫలితమే సుమా" అంటారు ఎల్లా వ్హీలర్ విల్కాక్స్.
ఆలోచన సాకారానికి భావోద్వేగమూ ఊహాశక్తీ కూద దానితో ఉండాలని అనుకున్నాం. మన భావోద్వేగాల్లో ఏడు మంచివీ, ఏడు చెడ్డవీ ఉన్నాయి.
ఏడు మంచివి: కాంక్ష, విశ్వాసం, ప్రేమ, సెక్సు, ఉత్సాహం, ప్రణయతాపం, ఆశయం.
యేడు చెడ్డ భావోద్వేగాలూ ఉన్నాయి. భయం, అసూయ, ద్వేషం, కక్ష, దురాశ, అంధవిశ్వాసం, కోపం.
అయితే మంచివీ చెడ్డవీ ఒకేమారు మదిని ఆక్రమించుకుని ఉండవు. ఒకటుంటే రెండోది ఉండదు. అందువల్ల మంచివే నిరంతరం మన మననంలో ఉండాలి. ఇది అభ్యసించాలి.
మనం గమనిస్తుంటాం. కొందరు పరిస్థితులు బాగులేనప్పుడు ప్రార్ధనలు అందుకుంటారు. ఫలితం ఉండదు. ప్రార్ధనా విధానమూ అభ్యాసమే. అదీ ఒక ఆశయమే. అయితే చాలా మటుకు అదో మొక్కుబడీ తతంగంగానే పూర్తవుతుంది. పరిస్థితులు బాగులేనప్పుడు దానికి భయ సందేహాలూ జోడిస్తాం. ఇవన్నిటినీ అంతశ్చేతన నిష్పక్షపాతంగా గ్రహించి అనుగుణమైన ఫలితాలు ఆకర్షించుకుంటుంది. ప్రార్ధనలు నిష్ప్రయోజనమనిపిస్తుంది.
అనుకున్నంతా అయింది, భయపడ్డంతా అయిందని మనం వింటూనే ఉంటాం కద. దాని అంతరార్ధం, అనుకోబట్టే అయింది; భయపడబట్టే అయింది అని. ఆ అనుకోలూ భయమూ మన సంకల్పాలూ ఆశయాలూ అనుకుంది మన అంతశ్చేతన. తదనుగుణమైన వాస్తవాన్ని ఆకర్షించుకుంది.
నన్నడిగితే ప్రార్ధన ఎలాచెయ్యాలని స్కూళ్ళలో నేర్పాలి కులమతాలకతీతంగా. అప్పుడు ప్రార్ధన విజ్ఞానమవుతుంది. పిల్లలు వయోజనులయాక వారి మనసుల్లోంచి భయమనేది లేకుండా పోతుంది. కొన్ని వందల యేళ్ళక్రితం ఉరుములకీ వానలకీ నిప్పుకీ మనిషి భయపడేవాడు. యోచనకి పదును పెట్టి అవి భయపెట్టేవి కావని, తన వినియోగం కోసం తపిస్తున్నాయని వాటి శక్తిని అర్ధం చేసుకుఇ మచ్చిక చేసుకున్నాడు. ఇప్పుడవంటే భయం పోయింది. అవంటే భయపడే అలవాటూ పోయింది. ఇలాగే సక్రమంగా చేసే ప్రార్ధనా, దీర్ఘ యోచన, అలోచనా విధానమూ వీటినీ స్కూళ్ళలో బోధిస్తే జీవితంలో తొంభైతొమ్మిదిశాతం భయాలు మటుమాయమవుతాయి. దానితోపాటే మన మనస్సు విశ్వమానవాళి మనస్సులతో అనుసంధించబడ్డదనీ, ప్రతి ఆశయ పరిష్కారమూ ఎక్కడో అక్కడా తగిన సమయంలో మనకి ఆవిష్కృతమయేందుకు ఎదురుచూస్తోందనే సత్యమూ అవగతమై కార్యాచరణ మొక్కుబడిగా కాక నిజాయితీతోనూ నిండు మనస్సుతోనూ సాగిస్తాం. ప్రార్ధనలు, ఆకాంక్షలు, ఆశయాలు సాకారమై తీరుతాయన్న విశ్వాసమే కీలకం. అప్పుడే అవి అంతశ్చేతనలో భద్రపడి వాటి పరిష్కారమార్గాలను అది అనంత మేధస్సునుంచి ఆకర్షించుకుంటుంది.
మన మెదడు ఒక అద్భుతం
మన మెదడు, లేదా మేధస్సు, ఒక రేడియో ప్రసార కేంద్రం లాటిది. అది మది నుండి తలపులను పైకి పంపేది, వాటికి తగిన సమాధానాలను అనంత మేధస్సు నుంచి ఆకర్షించుకునేది. ప్రసారకేంద్రంలో ప్రేషకమూ గ్రాహకమూ ఉంటాయన్నది మనకి తెలుసు. ప్రేషకం అంటే పంపేది, గ్రాహకం అంటే స్వీకరించేది. మన మెదటి ప్రేషక వ్యవస్థ మన అంతశ్చేతన. అంతశ్చేతన బయటికి మన ఆశయాలు ఆకాంక్షలు పంపుతుంది. అవి ఈథర్లో ప్రయాణించి అనంత మేధస్సు నించి అనుగుణమైన సమధానాలను మోసుకొస్తాయి. వీటిని మళ్ళీ మనకి చేర్చేది మన మెదటి కాల్పనిక సృజనాత్మక వ్యవస్థ. క్రియేటివ్ ఇమేజినేషన్. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు, కాల్పనిక సృజనాత్మకతకి మెదడు ఎంతో చురుగ్గాను ఉత్తేజం గాను ఉండలి. స్థబ్ధుగా కాదు. ఈ చురుకు ఉత్సాహభరితమైనా కావచ్చు, అలజడైనా కావచ్చు. అట్టి దశలో సృజనకి ప్రేరణ లభించి ఉపాయాలు సమాధానాలు పరిష్కారాలు మెరుపులా స్ఫురిస్తాయి. ఇది దానంత అది కలగదు. స్వయం సూచనలతో అంటే ఆటో సజెషన్‌తో తలపులు సమన్వయించి సంఘటితం చేసి మెదటికి చురుకు రగిలించాలి.
ప్రపంచ శక్తుల్లో అత్యంత ప్రభావవంతమైనవి మన పంచేంద్రియాలు అంటే చెవి ముక్కు నోరు కన్ను నాలుక కనిపెట్టలేనివే. చరాచర జగత్తును ఈ అగోచర శక్తులే నడిపిస్తున్నాయి. మానవాళికి ఈ శక్తుల కిటుకూ కీలకమూ ఇంకా తెలియదనే చెప్పుకోవలి. జరుగుతున్నవి ఎందుకు ఎల జరుగుతున్నాయో, ఏ ఫలితానికి ఏది కారణం అనే ప్రశ్నలు చాలా మటుకు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే మనిషి దృష్టి మెదడు మీదికి మళ్ళి పరిశోధనలు కొనసాగుతున్నాయి. (ఇది నెపోలియన్ హిల్ల్ ఈ పుస్తకం రాసిన ముప్ఫయ్యో దశకం నాటి సంగతి) ఆ పరిశోధనల్లో భాగంగానే మెదడు నిక్షిప్తం, విశ్లేషణ, వ్యక్తీకరణ వంటి ఎన్నో పనులకోసం కొన్ని బిలియన్లు కణజాలలు నాడీ తంత్రులు సంక్లిష్ట అమరికతో కూర్చబడి ఉంటాయని తెలుసుకుంటున్నారు.
ఈ అమరికలనుపయోగించి అనంత మేధస్సునుంచి అది సమాధానాలనెలా గ్రహిస్తుందన్నది తెలియాల్సి ఉంది.
దీనికి సంబంధించే డ్యూక్ విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ రైన్ ఎదట లేని వస్తువులనూ ఎదటివారి ఆలోచనలనూ తెలుసుకోగల సమర్ధమైనవని చెప్పబడే టెలిపతీ, క్లెయిర్‌వాయన్స్ ల మీద పరిశోధనలు, సుమారు లక్షవరకు ప్రయోగాలు చేశారు. ఇందులో భాగంగా ఒక పది పదిహేను మందిని ఒక చోట కూర్చుండపెట్టి అవతలి గదిలో ఉంచిన ఒక కార్దుల దస్త్రంలో ఉన్న కొన్ని కార్డుల మీద ఏమని రాసి వుందో అని అడిగితే అందులో ముగ్గురు నలుగురు కనీసం పదింట ఆరింటికి సరైన జవాబులు చెప్పేరు అంతకు ముందు ఈ కార్డుల గురించి వారికేమీ తెలియకున్నా. ఈ సూత్రమే మాస్టర్ మైండ్ సమూహాల్లో కూడా అక్కరకొస్తుంది. ఒక విషయాన్ని భావసారూప్యం కలిగిన బృందం చర్చిస్తూ విశ్లేషిస్తున్నప్పుడు అంతవరకు అందులో ఏ ఒక్కరికీ రాని కొత్త కొత్త పరిష్కారమార్గాలు బృంద చర్చల్లో స్ఫురిస్తాయి.
రైన్ గారి పరిశోధనలు విశ్లేషించి ఈ హెచ్ రైట్ చెప్పినదాని ప్రకారం, కనబడే శక్తులైన అగ్ని, కాంతి వంటి వాటి ప్రభావం వాటికి మనమున్న దూరపు వర్గానికి విలోమ అనుపాతంలో తగ్గుతూ పోతుంది. కాని టెలిపతీ క్లెయిర్ వాయన్స్ ల ప్రభావం ఈ సూత్రానికి వ్యతిరేకం. అయితే మనిషి ఈ విద్య ప్రదర్శించేందుకు అతను మేల్కొని ఉండాలి. ఉత్తేజంగా ఉండాలి. మాదక ద్రవ్యపు మత్తు పనిచెయ్యదు; ఉత్తేజం పెంచే ఉద్దీపన పదార్ధాలు పనిచేస్తాయి. రైట్ అభిప్రాయం ప్రకారం, చూడకుండానే కార్డులో ఏముందో తెలుసుకునే కౌశలమే ఎదటి మనసులో ఎముందో కూడా తెలుసుకుంటుందనేందుకు సందేహమక్కర్లేదు. అభ్యసించి మన మనసులను ఉత్తేజపరచి ఇంద్రియగోచరం కాని జ్ఞానప్రకాశం నించి తగిన సమాధానాలూ పరిష్కారమార్గాలూ గ్రహించవచ్చు.
అతీంద్రియ జ్ఞానం - సిక్స్త్ సెన్స్
మన అయిదు జ్ఞానేంద్రియాలకు అతీతమైన ఆరవ ఇంద్రియంగా చెప్పబడే అతీంద్రియ జ్ఞాన విశేషాన్ని ఇంగ్లీషులో సిక్స్త్ సెన్స్ అని వ్యవహరిస్తారు. మనిషి అయీదు ఇంద్రియాలకూ అగ్రాహ్యమైన కొన్ని స్ఫురణలు, ఉపాయాలు, పరిష్కార మార్గాలు అనంత మేధస్సు దీనిద్వారా అనుగ్రహిస్తుంది.
అంతశ్చేతనలో గ్రాహక విభాగమైన సృజనాత్మక కాల్పనిక శక్తే ఈ సిక్స్త్ సెన్సు లేదా అతీంద్రియ జ్ఞానం. ఇది ఎప్పుడెలా కలుగుతుందనేదానికి విజ్ఞానశాస్త్రపరమైన వివరణ యేదీ లేదు. కేంద్రీకరించిన ఆలోచన, ధ్యానం వంటి మనఃస్థితుల్లో ఇది గ్రాహ్యమవుతుంది. ఆ ప్రకారం ఇది కొంతవరకు మనస్సంబంధం, కొంత భగవత్సంబంధం. మనిషి విశ్వమేధస్సుతో సంప్రదించే చోటిది.
సహకరించబోయే అవకాశాలు, సంభవించబోయే ప్రమాదాలు మనకి ఈ జ్ఞానం ద్వారా గ్రాహ్యమై, దానికి అనుగుణమైన కార్యాచరణను మనం చేపట్ట వీలవుతుంది. ఇది మన ఆలోచనలతోను సంకల్పంతోను ప్రమేయం లేకుండ కలిగేది. అందుకే ఇంద్రియాతీతం.
అయితే ఇది అద్భుత మానవాతీత చమత్కారం అన్నది ఈ రచయిత ఉద్దేశ్యం కాదు. నిజానికి మానవప్రమేయంలేని అద్భుత శక్తులను నేను నమ్మను. కాని ఏదో శక్తి స్వరూపం సృష్టి క్రమాన్ని నిర్దేశిస్తున్నది. అదే, గుడ్డును పక్షిగాను, విత్తును మహావృక్షంగాను, గురుత్వాకర్షణై నీటిని పల్లపు దిశగా పారించేది ఇంకా ఎన్నేన్నో విశ్లేషణకి అందని ప్రాపంచిక చర్యా సమూహాన్ని కలిగిస్తోంది.
తనకర్ధమైనంతవరకు ఈ జ్ఞాన ప్రయోజనాన్ని గ్రహించిన రచయిత ఈ పుస్తకం ముద్రణ కావడానికి కొన్నాళ్ళ ముందు ఒక ప్రయోగం చేపట్టాడు. తన బుద్ధికి స్ఫురించని విషయ విశ్లేషణలకూ పరిష్కారాలకూ ఒక అదృశ్య మేధోనిధిని సృష్టించుకున్నాడు. ప్రతి రాత్రి నిద్రకుపక్రమించే ముందు తనకు ఆరాధ్యులైన ఎమర్సన్, పైనే, ఎడిసన్, డార్విన్, లింకన్, బర్బ్యాంక్, నెపోలియన్, ఫోర్డ్, కార్నెగీ ప్రభృతులతో తన ఊహాకల్పితమైన మాస్టర్ మైండు గ్రూపును సృష్తించుకుని వారి శైలినీ వ్యక్తిత్వాలనూ అనుకరిస్తూ ఆ రహస్య సమావేశాలకు తాను అధ్యక్షత వహించేవాడు. వీరందరి జీవిత చరిత్రలూ అప్పటికే కూలంకషంగా చదివి యుండడం వల్ల వారందరి ఉమ్మడి వ్యక్తిత్వమూ ఆలోచనాశైలీ తనకు లభించాలన్న స్థిరమైన కాంక్షతో చేపట్టిన కార్యాచరణ ఇది. ఒక్కొక్కరినీ పేరుపేరునా పిలుస్తూ వారితో మాట్టాడేవాడు. ఆ సంభాషణలు ఇలా ఉండేవి:
"ఎమర్సన్ మహాశయా, నాకు తెలిసి మీవలె ప్రకృతితో మకేకమై దానిని అవగాహన చేసుకున్నవారు లేరు. దయచేసి మీ అంత ప్రతిభావంతంగాను ప్రకృతిని అవగాహన చేసుకుని ప్రాపంచిక స్వభావాన్ని దానితో సమన్వయపరచి అర్ధంచేసుకునే కీలకమూ, దానికై నేను అనుసరించాల్సిన కార్యాచరణా నా అంతశ్చేతనకు బోధించండి. దానినించి నా అన్ని సందేహాలకూ సమాధానాలు స్వీకరిస్తాను."
"బర్బ్యాంక్ గారు, సృష్టికి ప్రతిసృష్టినె చేసిన వారు మీరు. మేము సమీపించేందుకే భయపడే బ్రహ్మజెముడు చెట్టు ముళ్ళను రాల్చి అహారంగా మారడం, అంతవరకు ఒక పోచకే పరిమితమైన గడ్డి మొక్కకి రెండు అంతకన్న ఎక్కువ పోచలు మొలవడం, వేరువేరు పువ్వుల రంగునూ పరిమళాన్నీ మిళాయించి మరింత వర్ణశోభితమూ సుగంధభరితమూ అయిన కొత్త పుష్పం వికసించడం వంటి ప్రతిసృష్టిని చేసి భూతల స్వరూపాన్నే మార్చేశారు. మీ సృజనాత్మక మెళకువలు నాకూ బోధించి పుణ్యం కట్టుకోండి బాబూ."
"నెపోలియన్ మహావీరా, ప్రజలను చైతన్యపరచి కార్యోన్ముఖులను చెయ్యడం, ఓటమి తప్పనిసరి అనిపించిన పరిస్థితులనూ తారుమారుచేసి విజయాన్ని కైవసం చేసుకోగల అకుంఠిత విశ్వాసాన్నీ నీ వద్దనే చూశాం. నీ వీరోచిత లక్షణాలను అనుసరించే విధంగా నన్ను అనుగ్రహించు ఓ విధివిధాతా, భాగ్య చక్రవర్తీ, విజయస్వరూపా. నీకివే నా వీర ప్రణామాలు."
"పైనే సార్, ఆలోచనల విస్తృతినీ, అభిప్రాయ స్వాతంత్ర్యాన్నీ నమ్మినది నిష్కర్షగా చాటగల ధైర్యాన్నీ అనుగ్రహించండి బాబూ."
"మిస్టర్ డార్విన్, కార్య కారణ అనుబంధాలను ఓపిగ్గా, ఎటూ మొగ్గకుండా నిష్పక్షపాతంగా విశ్లేషించి అవగాహన చేసుకుఇ లోకానికి వివరించిన ధన్యులు మీరు. ఆ వివేచనా శక్తిని నాకూ ప్రసాదిద్దురూ."
"అధ్యక్షా లింకన్ మహాశయా, మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన సమన్యాయం, క్షమ, హాస్యప్రియత్వం, మానవతావాదాలను నా వ్యక్తిత్వాన్నీ తీర్చిదిద్దనివ్వండి స్వామీ."
"అయ్యా కార్నెగీ గారు, మీరు నా జీవిత సాఫల్యానికై సూచించిన పుస్తక రచనకే మీకెంతో ఋణపడి ఉన్నాన్నేను. ఆ వ్యాసంగం నాకు అలౌకిక ప్రశాంతతనూ సంతృప్తినీ ప్రసాదిస్తోంది. కాని ఒక పారిశ్రామిక దిగ్గజమైన మీ నించి సంఘటిత ప్రణాళికా రచన, తదనుగుణమైన కార్యాచరణ, నాయకత్వ లక్షణాలూ నాకు దయచేద్దురూ మీ అడుగుజాడలననుసరించి విజేతనవుతాను."
"నాయన హెన్రీ ఫోర్డ్, నా పుస్తకంలో నీ ప్రస్తావనే అధికం. అంత ప్రభావశీలుడవు నీవు. నిన్ను సమున్నతంగా నిలిపిన పట్టుదల, దీక్ష, ఠీవి, ఆత్మవిశ్వాసం వంటి ఉన్నత లక్షణాలు ప్రదర్శించి పేదరికన్ని జయించి, నీ మాట శిరోధార్యంగ అమలుపరిచే శ్రామికజనానికి ప్రీతిపాత్రుడవై, వారిని సమీకరించి, మనిషికి తక్కువ శ్రమకు ఎక్కువ ప్రయోజనాలు కలిగించావు భేషనిపించుకున్నావు. నీ ప్రభావం నాపై కూడా ప్రసరిస్తే నేను మీ అడుగుజాడలలో పయనించి మరింతమందికి ప్రేరణ కలిగించగలను."
"నా పక్కనే కుడిపక్కన ఠీవిగా కూర్చున్న ఎడిసన్ గారు, జయాపజయాల స్వభావాన్ని పుర్తిగా అవగాహన చేసుకోవడం మీనించే నేర్చుకోవాలి. దృఢమైన మీ ఆత్మ విశ్వాసానికి ముచ్చట పడే కదా ముందు ఎన్నో సవాళ్ళుంచినా ఆహరికికి మీదే జయమని ప్రకృతి తన అనెక రహస్యాలను మీ ముందు పరచింది కదా. ఎటువంటి పరిస్థితులలోనూ విశ్వాసన్ని చెక్కుచెదరనియ్యని ధీశక్తిని నాకు అనుగ్రహించాలి మీరు."
ఈ రకమైన మేధోనిధి అదృశ్య సదస్సులు రోజూ నిర్వహిస్తుండేవాడు రచయిత. అప్పుదప్పుడు కొందరు ఆలస్యంగా రావడం, కొందరు చమత్కార బాణాలు వెయ్యడం, తాము ప్రస్తుతం చేస్తున్న ప్రయోగాల వివరాలు తెలియజెయ్యడమూ జరుగుతుండేవి. తన ప్రగాఢమైన సృజనతో ఇదంతా నిజమేనన్నంత బలంగా ఉండేది ఈ కల్పనాచమత్కృతి.
ఒకసారి ఆలస్యంగా వచ్చిన లింకన్ ఇలా అన్నాడు: "బాబూ నీ జీవితాశయాన్ని ముందుకు తీసుకుపోయెందుకు నీకు ఎంతో ధైర్యం అవసరం. కష్టాలు కమ్ముకున్నప్పుడు కలవరపడకు. అంతవరకు నువు అనుభూతి చెందని నీకే తెలియని జ్ఞాన ప్రకాశం అప్పుడు స్ఫురించి ఎలాగోలా వాటినించి తేలిగ్గా బయటపడతావు." అని.
ఇంకోసారి ఎడిసన్ అంటాడు: "నీకు తెలియకుండా ని చుట్టూ ఎన్నో జ్ఞాన దీపికలు సంచరిస్తున్నాయి. వాటి సంఖ్యకి మితిలేదు. అవి తేనెటీగలవలె గుంపులుగ ఉంటూ నీలా ఈ విధమైన సదస్సులు నిర్వహించుకోగలిగినవారికి ఎంతో ప్రయోజనన్ని పరిష్కారాలను సూచిస్తాయి. అవి నశించేవి కావు. నీ కాంక్ష, ఆశయం, సంకల్పమూ బలంగా ఉన్నప్పుడు ఈ శక్తుల బృందలు నీకు సహాయకారులై ప్రకాశిస్తాయి." అని.
రచయితకి ఒక్కోసారి భయమేసేది ఇదంతా అభూతకల్పనా పిచ్చి ధోరణీ ఏమోనని. కొన్ని నెలలు మానేసేక మళ్ళీ లింకన్ వచ్చి ఇది అసహజం కాదని జీవిత పర్మార్ధ సాఫల్యానికి తగిన జ్ఞానమూ శక్తీ అవసరమున్నందున ఇది కొనసాగించవలసిందని కలో నిజమో తెలీని స్థితిలో సలహా ఇస్తే మళ్ళి కొనసాగించి ఈ సారి మరింత మంది ప్రముఖులను అంటే జీసస్, సెయింట్ పాల్, గెలీలియో, కోపర్నికస్, అరిస్టాటిల్, ప్లేటో, ఇలా యాభైమందితో సదస్సులు కొనసాగిస్తాడు.
అయితే రచయిత చెప్పేది, తనదంతా భ్రమే; పాత్రలన్నీ గతించిన ప్రముఖులే కాని ఈ ప్రక్రియలో తనకి లభించిన బోధ సత్యం. అది ఎలా లభించినదన్నదానికి శాస్త్రీయపరమైన వివరణ లభించకున్నా. ఇంద్రియాలకు అగ్రాహ్యమైన ఈ బోధలూ స్ఫురణలూ పరిష్కార మార్గాలకు కారణం మన మెదటి అద్భుత చమత్కారాల్లో ఒకటైన ఈ అతీంద్రియ జ్ఞాన ప్రభావం కావచ్చు. ఆ అనుభూతికీ అనుభవానికీ ఆరంభం మదిలోని బలమైన కాంక్ష, అది సాధ్యమేనన్న దృఢ విశ్వాసం. అలా ఆరంభమైన ప్రస్థానం అన్ని దశలూ దాటి చివరికి మనకు ఆశయ సిద్ధి కలిగించి జ్ఞానానంద స్థితికి చేరుస్తుంది.
విశ్వాసానికి వ్యతిరేక భావన భయం. ఆరు భయాలు చెప్తారు; పేదరికం, అవమానం, అనారోగ్యం, అయినవారిని కోల్పోవడం, వృద్ధాప్యం, మరణం - సాధారణంగా భయకారణాలు ఇవి. అయితే భయం ఏదైనా అది బయటి పరిస్థితులతో నిమిత్తం లేని మానసిక స్థితే. కనుక దాని నిరోధం మన సంకల్పమే.
మరో పెద్ద ఇబ్బంది దుష్ప్రభావాలకు తేలిగ్గా ప్రభావితం కావడం. ఎంత ఘనమైన ఆశయం ఉన్నా అది త్వరలోనే ఆవిరైపోవడానిక్కారణం విల్ పవర్ ధీశక్తి లేకపోవడం. మన ఆలోచనలూ ఆశయాలు బయటి పరిస్థితులకు బయటివారి అభిప్రాయాలకూ అధినం చేసినంతకాలం మనం విఫలురజాబితాలోనే ఉంటాం. ఆలోచనలమీద నియంత్రణ మనకు దైవదత్తమైన శక్తి. అది సరిగా వినియోగించుకోనప్పుడే ఇటువంటి బలహీనతలకు బందీలవుతాం. ఆలోచనలను నియంత్రించుకోవడంద్వారా విధిని లిఖించుకొమ్మని దైవమే ఆదేశించినప్పుడు అది అశ్రద్ధ చేసి గాలివాటు జీవితం గడిపితే బతుకు పరాధీనం కాక తప్పదు. ఒకరి సందేహాలు మనవి కాకూడదు. ఒకరు సాధ్యం కాదన్నది మన కార్యాచరణను నీరుగార్చకూడదు. ధీశక్తీ ఆత్మవిశ్వాసాలను ఎట్టి పరిస్థితులలోను విడవక "చూస్తుండండి నాణ్యమైన నా కార్లతో భూమాతకి వడ్డాణం చేయిస్తాను" అని అన్నంత పనీ చేఇన హెన్రీ ఫోర్డు, "ఇటువంటిది ఎప్పుడూ ఎవరూ చెయ్యలేదు, చెయ్యలేరు" అన్న ప్రతి యీసడింపునీ ఒక సవాలుగా తీసుకుని, తలచి నమ్మి ఆచరిస్తే సాధించడం ఖాయం అని నిరూపించిన ఎడిసన్ వంటివారికి సాధ్యపడిన మనో నియంత్రణ అందర్కూ అందుబాటులో ఉన్నదే. మనసుకొక స్థిరమైన లక్ష్యాన్ని నిర్దేశించి విరామమివ్వక పనిలో ఉంచాలి. బుద్ధి పనిచేస్తూనే ఉండాలి. ఆశయాలకు నిర్దుష్ట ప్రణాళికలు తయారుచేసుకుని వాటి కార్యాచరణన విషయంలో ఎటువంటి రాజీ పడక కొనసాగిస్తే ప్రతివారు ఈ పుస్తకంలో ఉదహరించిన మహనీయులంతవారూ ఇంక గొప్ప వారూ కావచ్చు. వారికిచ్చిన సాధనాలనే ప్రకృతి మనకీ ఇచ్చింది. భాగ్య మహావృక్షానికి బీజం భావనలే.
No comments:
Post a Comment