Saturday, February 6, 2021



సెప్టెంబెర్ పదకొండు, 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సు అహ్వానానికి స్వామి వివేకానంద ఉపన్యాస సారాంశము..


 

ఆత్మీయత, సౌహార్దం నిండిన మీ ఆహ్వానానికి స్పందించి నించుంటూంటే మాటల్లో వెల్లడించలేని ఆనందం హృదయంలో ఉప్పొంగుతోంది. ఇందుకు ప్రపంచంలోని అతి ప్రాచీన ఋషి సాంప్రదాయం పేరిట, ప్రపంచ మతాలకు మాతృసమానమైన మతధర్మం పేరిట, సర్వ హిందూ జనుల పేరిట మీకు నా ధన్యవాదాలు.  

సర్వమత సహనాన్ని ఆచరిస్తూ అన్ని మతాల అస్తిత్వాన్ని విశ్వసించే మతానికి చెందినవాడను నేను. స్వదేశాలలో ద్వేషాగ్నులకు తాళలేక శరణార్ధులుగా చేరే ఎందరికో నా దేశం ఆశ్రయాన్నిస్తోంది.  రోమన్ నిరకుశత్వం తమనూ తమ దేవాలయానూ నేలమట్టం గావిస్తుంటే పాలుపోని ఇజ్రేయిల్ పౌరులను నా దేశం అక్కున చేర్చుకుంది. జొరాష్ట్రియన్ మతావలంబకులకూ మాతృభూమి వెలపలి మాతృభూమి నాదేశమే.   యథా నద్యః స్యందమనాః సముద్రే - ప్రవహించు నదులన్నీ సాగరంలో ఐక్యమైనట్టు సకల మతవిశ్వాసాల పరమగమ్యమైన పరమాత్మ ఒక్కటే అని చిన్నప్పటినించి మేము అనుదినమూ వల్లించే  శ్లోకార్ధమే నా దేశ స్వభావమై భాసిస్తోంది సోదరీసోదరులారా. 

ఎవరెవరు ఏయే విధాలుగా నన్ను శరణు జొచ్చినా నా అనుగ్రహానికి పాత్రులే అన్న భగవద్గీతా వాక్యానికి ప్రత్యక్షనిదర్శనమై నిలిచింది, ఇప్పటివరకు నిర్వహించిన వాటన్నిటిలోను పవిత్రమైనదైన ఈనాటి సదస్సు.   

వేర్పాటు తత్వం, మతోన్మాదమూ ఈ భూమిని చాలాకాలం పట్టిపీడించి మానవరక్తాన్ని ఏరులైపారించి నాగరకతలను తుడిచిపెట్టేసి దేసాలను అయోమయంలోకి నెట్టేసేయి.  ఈ రాక్షసత్వం లేకుంటే కనక మానవజాతి మరింత పురోభివృద్ధి సాధించియుండేది.  మతంపేరిటి అన్నిరకాల రాక్షసకాండకు చరమగీతమే ఇప్పుడిక్కడ నినదిస్తున్నది. 

ఒక సోదర వక్త తన ఉపన్యాసానికి ముగింపుగా "ఒండొరులను ద్వేషించడానికిక స్వస్తి చెబుదాం" అన్నారు.  మా అక్కడ ప్రాచుర్యంలో ఒక కథ ఉంది.  బావి కప్ప ఒకటి అందులోని పురుగూ నాచూ తిని బాగా ఒళ్ళు చేసింది.  కొన్నాళ్ళకి సముద్రం కప్పొకటి అందులో చేరింది.  ఎక్కడనించి మిత్రమా అంటే సముద్రం నించి అంది.  సముద్రమేంటి? అంటే అది ఊహకందని వైశాల్యంతో ఉంటుంది అంటుంది కడలి కప్ప.  ఈ నుయ్యి కన్నానా అంటుంది బావి కప్ప.  రెంటిని ఎలా పోలుస్తావు?  విశాలం మాట అటుంచు పోలికకి కూడా ఈ నూతికి అర్హత లేదంటుంది రెండోది.  అబ్బే నీవన్నీ కోతలు ఈ నూతికన్న విశాలమైనది ఎక్కడా లేదు నా  చిన్నప్పట్నించి చూస్తున్నానంటుంది నూతి కప్ప.  

అన్ని మతాలదీ ఇప్పుడు ఇదే సమస్య.  ప్రతివారూ వారి మతమే గొప్పనుకుంటూ జీవిస్తున్నామిన్నాళ్ళూ.  అలా భావిస్తున్న అందరినీ నూతులనించి పైకి లాగి సముద్రపు ఒడ్డుకు చేర్చిన ఈ అమెరికావారికి కృతజ్ఞతలు.             

ఇతిహాసకాలం నాటి మూడు మతాలు మాదేశంలో స్థిరపడి వున్నాయి.  హిందూమతం, జొరాష్ట్రియన్ మతం, జుదాయిజం.  మూడూ సమానంగానే దీర్ఘకాలంపాటు దెబ్బలు తిన్నాయి కానీ తమ అంతశ్శక్తి వాటినింతవరకూ నిలిపివుంచింది.  మూడిటిలో జుదాయిజం తన పుత్రిక క్రైస్తవం ధాటికి తాళలేక స్వదేశం వదిలి ఇక్కడికొస్తే, పార్సీ మతం విస్తరించుకునే ప్రయత్నం చేయకున్నా తన ఘన చరిత్రను చాటేందుకని కాలానికీ కర్కశత్వానికీ ఎదురొడ్డి భద్రంగా నిలిచింది.  క్రౌర్యమూ అణచివేతలూ వేదప్రామాణికమైన హిందూ మత మూలాలనూ పెకలించే ప్రయత్నం చేసేయి కాని భూకంప కాలంలో తీరానికి దూరం జరిగిన సాగర కెరటంలా అది తగ్గిందే కాని తలొగ్గలేదు - ఈ తాత్కాలిక మతోన్మాదపు వేడి చల్లారినాక రెట్టించిన ధృతితో తన పూర్వ తేజోవైభవాలతో ప్రపంచాన్ని ప్రకాశమానమొనరించిన దాని చల్లని నీడన మిగతా రెండూ సేదదీరుతున్నాయి.

ఇప్పటి సైన్సు కాలంతో సమన్వయపడే అత్యున్నత జ్ఞానస్థితి అయిన వేదాంత తత్వము, జ్ఞానావసరంలేని విగ్రహారాధనం, పునర్జన్మ సిద్ధాంతాన్ని తోసిపుచ్చిన బౌద్ధము, నిరీశ్వరమైన జైనం వంటివాటికీ హిందూ మతంలో చోటున్నది.      

అయితే ఇన్ని విభిన్న మూలాలనించి ప్రసరించే కాంతికిరణాలకి కేంద్రకం ఏది? అది చెప్పే ప్రయత్నం చేస్తాను. 

హిందువులకు వేదాల ఉపదేశం ద్వారా మతావిష్కరణ జరిగింది.  వేదాలకు ఆదీ అంతమూ లేదని చెప్తారు.   ఇక్కడి వారికి హాస్యాస్పదంగా అనిపించవచ్చు.  పుస్తకానికి ఆదీ అంతమూ లేకపోవడమేమిటని.  అయితే వేదాలంటే పుస్తకాలు కావు.  అవి విభిన్న కాలాలలో విభిన్న వ్యక్తులకు ఆవిష్కృతమైన ఆధ్యాత్మిక సూత్రాల సంచయం.  మనం కనుగొనడానికి ముందే ఉన్నదీ, మనమందరమూ మరిచిపోయినా ఉండేదీ అయిన గురుత్వాకర్షణ సూత్రం ఎలాటిదో ఇవీ అలాటివి. మనిషి మనిషికీ, అలగే మనిషికీ పరమాత్మ తత్వానికీ ఉన్న కారణ కార్య సంబంధాల గురించినవి, మన ఆవిష్కరణతో నిమిత్తంలేక మనం మరిచిపోయినా ఎప్పుడూ ఉండేవి ఈ సూత్రాలు.   వీటిని కనుగొన్నవారు మహర్షులు.  పరిపూర్ణ మానవులుగా వారు ఆరాధ్యులు. వారిలో చాలామంది మహిళామతల్లులూ ఉన్నారని చెప్పేందుకు సంతోషిస్తున్నాను.  అయితే ఈ సూత్రాలకి అంతం లేకపోవచ్చు కాని ఆది ఉండి ఉండవచ్చు.  వేదాల ప్రకారం సృష్టికి ఆదీ అంతమూ లేదు.   విశ్వశక్తి అన్నికాలాలలోనూ సమానమేనని సైన్సు చెబుతుంది.  అది లేని కాలమొకటుందనుకుంటే, ఇప్పుడున్నది ఎప్పట్నించి ఉన్నట్టు?  అది పరమాత్మ రూపంలో నిగూఢమై ఉంటుందని కొందరి అభిప్రాయం.  అంటే పరమాత్మ స్థితి ఒకప్పుడు నిశ్చలమై ఇంకొకప్పుడు కదిలేదై ఉండి, మనలాగే దైవమూ మార్పుచెందే తత్వం కలిగి ఉండాలి.  మార్పులో మరణమూ ఒక దశ.  పరమాత్మునికి మరణాన్ని ఆరోపించుట అసంబద్ధం.  కనుక సృష్టిలేని కాలమెన్నడూ లేదు.   

సృష్టీ సృష్టికర్తా రెండు ఆదీ అంతమూ లేని సమాంతర రేఖలనుకుంటే,  వాటిలో సృష్టికర్త శక్తి అనంతం.  ఆదీ అంతమూ కల సృష్టిశక్తికి అది ఆధారం.  ఈ తత్వాన్నే మా బాలలు అనుదినమూ వల్లె వేస్తుంటారు.  తస్మాదగ్నిః సమిధో యస్య సూర్యః అని.  సృష్టికర్త అనంత శక్తినించే సూర్యచంద్రులవంటివి ఇంతకుముందూ ప్రభవించి ప్రకాశహీనమయేయని.    

ఇక్కడ నించుని "నేను, నేను, నేను" అని మాట్టాడుతున్నాను.  ఏమిటీ నేను? ఈ శరీరమా? నేనంటే ఈ అవయవాలూ వాటికి తొడుక్కున్న వేషభూషలూనా? కాదంటాయి వేదాలు.  నేను ఈ దేహంలో జీవించే చైతన్యాన్ని.  దేహాన్ని కాను.  దేహం నశిస్తుంది. నాకు నాశనం లేదు.  నాకో గతమూ ఉంది.  నిత్య చైతన్యస్వరూపమైన నా ఆత్మ సృష్టించబడ్డది కాదు.  ఏదైనా సృష్టించబడిందంటే అది కొన్ని పరిణామాల అనంతరం నశించాలి.  ప్రపంచంలో కొందరు ఆనందోత్సాహలతో హాయిగా ఉంటున్నారు.  కొందరు కష్టాల కడలినీదుతూ కడతేరుతున్నారు. బతుకీడుస్తున్నారు.  కొందరు జ్ఞానసంపన్నులై ప్రకాశిస్తున్నారు.  కొందరు మూర్ఖులై చివాట్లు తింటున్నారు.  అందరూ సృస్టించబడ్డవారైనప్పుడు ఒక కరుణాసింధువైన పరమాత్మ ఒకర్నొకలాగ వేరొకర్నింకోలాగ ఎందుకు తయారుచేస్తాడు?   

తరవాత, ఈ వ్యాఖ్యానం వల్ల సృష్టికర్త ఒక రాతిగుండెకలిగి ఇష్టానుసారం జీవులను సృష్టించే శక్తిస్వరూపమని అర్ధం వస్తోంది.  అది సమంజసం కాదు.  ఒక మనిషి సుఖ దుఃఖాలకి ఇతర కారణాలేవో ఉండి ఉండాలి.  అవే ఈ జన్మకు ముందు అతను ఆచరించిన కర్మలు.  

ఇక్కడికి మనస్సూ దేహమూ వేరు వేరుగా తేలుతున్నాయి.  రెండూ సమాంతర రేఖలు.  దేహమే అన్ని ప్రశ్నలకీ సమాధానమివ్వగలదైతే దానికి భిన్నమైన ఇంకో చైతన్యస్వరూపం అవసరం లేదు.  ఏ విధంగా చూసినా దేహం నించి మనస్సు జనించిందని నమ్మశక్యం కాదు.   

కొన్ని స్వభావాలు వారసత్వంగా సంక్రమిస్తాయి. వాటిని దేహంద్వార మనసు అమలుపరుస్తుంది.  ఇప్పటి అలవాట్లతో సంబంధంలేని ఇంకొన్ని స్వభావాలు ఉంటాయి.   స్వభావాలూ అలవాటుతోనే సంక్రమించేవని సైన్సు అంటుంది.  మళ్ళీ మళ్ళీ చేసే పనులే అలవాట్లు.  కనుక ఇప్పుడు వివరణకందని స్వభావాలు గత జన్మ కర్మలవల్ల సంక్రమించి ఉండాలి.    

అయితే, గత జన్మ జ్ఞాపకాలేవీ గుర్తుకు రావేం? అన్న ప్రశ్న రావచ్చు.   ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీషులో మాట్టాడుతున్నాను.  ఇది నా మాతృభాష కాదు.  మాతృభాషలో మాట్టాడాల్సి వస్తే ఆ భాష పదాలే అన్నీ దొర్లుతాయి.  అంటే నా జ్ఞాపకల మహాసాగరంలో అవీ ఉన్నాయి, ఇవీ ఉన్నాయి.  నా వివేకజ్ఞానం ఇప్పటి సందర్భానికవసరమైన వాటిని మాత్రం సంగ్రహించి మాట్టాడిస్తోంది.  పరిశ్రమ చేస్తే వివేకజ్ఞానంతో ఆ సాగరంలోంచి ఊహించనివెన్నో గతజన్మ స్మృతులనూ వెలికితీయవచ్చు.   

ఇదీ నిరూపణకు నిలిచే మా మహర్షుల సూత్రీకరణ.  ఆలోచనాంబుధిని అన్వేషిస్తే ఆవిష్కృతమయ్యే అద్భుతాలు అనంతం. గతజన్మ స్మృతులూ అందులో భాగమే.  

అందుకని హిందువు తాను దేహాన్ని కాననీ, ఆత్మననీ విశ్వసిస్తాడు.  ఆత్మను నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః.  శస్త్రాస్త్రములు చేదించలేవు, అగ్ని దహింపజాలదు.  ఆత్మ పరిధి విస్తృతి ఎంతో తెలీదు.  కానీ దాని కేంద్రస్థానం మాత్రం దేహం.  ఈ కేంద్రం తరచూ మారుతూంటుంది.  స్వభావ రీత్యా ఆత్మ దివ్యమూ స్వఛ్ఛమూ సర్వ స్వతంత్రమైనదైనా, అప్పటికి తాను పరిభ్రమిస్తున్న కేంద్రకమే తాను అని భ్రమిస్తుంది.  

అయితే ఈ స్వచ్ఛ స్వతంత్ర దివ్య స్వభావం తనను తనకన్న అల్పమైన పదార్ధస్వభావానికి అన్వయించుకుని అదే తానుగా ఎందుకుండాలి అని ఇంకో ప్రశ్న.  పరిపూర్ణమైన తాను అపరిపూర్ణమని ఎందుకనుకుంటున్నట్టు?  మాలో కొందరు దీనికి సమాధానాన్ని దాటవేస్తారు, ఇంకొందరు రెంటికీ మధ్య ఇంకో పాత్రని ప్రవేశపెట్టి దానికో పేరు పెడతారు.  అయితే వివరణంటే కొత్త పాత్రల పరిచయం కాదు.  అందుకనే మూల ప్రశ్న అలానే ఉండిపోతుంది.  కాని నిజాయితీపరుడైన హిందువు ఏదో చెప్పేందుకని గొప్ప గొప్ప పదాల ప్రయోగం చేసి ప్రజలను పక్కదారిపట్టించ నిచ్చగించక ధైర్యంగా ఒప్పేసుకుంటాడు "మంచి ప్రశ్నే కాని నాకూ తెలీదండీ.  స్వచ్ఛమూ సంపూర్ణమూ అయినది తాను అల్పమైనదని ఎందుకు భ్రమిస్తుందో" అని.  ప్రతివారు తామంటే ఈ శరీరమే అని ఎందుకనుకుంటారో చెప్పే ప్రయత్నం కూడా హిందువు చెయ్యడు.  "భగవల్లీల" అని కూడా అనడు.  "నాకు తెలీదన్న" ది మాత్రమే అతని ప్రకారం దీనికి జవాబు.    

సరే.  మనిషి ఆత్మ స్వతంత్రమూ శాశ్వతమూ అనశ్వరమూ.  చావు అంటే ఒక శరీరం నించి ఇంకోదానికైన దాని ప్రయాణం.  గత కర్మలు వర్తమానాన్ని, ఇప్పటి కర్మలు భవిష్యత్తును లిఖిస్తాయి.  వాటిననుసరించి ఆత్మ వివిధ శరీరాల్లో జననమరణాలు పొందుతూ ఉంటుంది.  అయితే మనిషి ఈ లీలని చూచి ఏమీ చెయ్యలేని నిస్సహాయుడా? ఇందరు విగతభర్తృకలు, అనాధపిల్లల వేదన అరణ్యరోదనమేనా? మనమందరం సృష్టిచక్రాలకింద నలిగిపోయేందుకని అసంకల్పితంగా పరుగులు తీసే పురుగులమా? ఇది హృదయాన్ని కలచివేచే సందేహం.  కాని అదే సృష్టి ధర్మం.  అంతేనా? ఇంకేమీ ఆశించలేమా? అధిగమించలేమా? అని యుగాలుగా మనిషి ఆక్రందనం సకలభువనాల్లోనూ ప్రతిధ్వనించగా అన్ని భయాలనూ పారద్రోలగల గంభీర వచనాలతో ఒక వేదర్షి ఇలా ప్రకటించారు: "శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః! అంటే అనంతానందామృతానికి వారసులైన విశ్వపు బిడ్డలారా.  అన్ని చీకట్లకూ అజ్ఞానానికీ ఆవల, ఎవరిని తెలుసుకుంటే మనమీ చావుపుటకల చక్రభ్రమణానించి రక్షింపబడతామో అట్టి అతి ప్రాచీన దివ్యజ్యోతిస్వరూపుని నేను దర్శించగలిగాను" అని.   

అనంతానందామృతానికి వారసులైన విశ్వపు బిడ్డలారా - ఎంత అమృతతుల్యమూ ఆశాజనకమూ అయిన సంబోధన.  ఇక్కడి నా సొదరీ సోదరులారా.  మిమ్ములనూ అదే విధంగా సంబోధిస్తున్నాను.  మీరంతా అనంతానందామృతానికి వారసులైన విశ్వపు బిడ్డలు.  హిందువు సంబోధన ఇలానే ఉంటుంది.  ఎవరినీ పాపులని సంబోధించేందుకతనిష్టపడడు. 

మనమందరమూ పవిత్రులమూ, పరిపూర్ణులమూ, అనంతానందామృతానికి వారసులమూ.  మీరా పాపులు.   అసలా భావనే పాపం.  మానవజాతికి పరువునష్టం.   రండి సిమ్హాల్లార.  మీరు గొర్రెలన్న భ్రమల జూలు విదిల్చి భూనభోంతరాళాలు దద్దరిల్లే విజయ గర్జన చెయ్యండి.  మీరు శాశ్వతాత్ములు.  స్వతంత్రాత్ములు.  అనుగ్రహపాత్రులు.  అనంతులు.  మీరంటే మీ శరీరాలు కాదు.  అవి మీ సేవకులు. మీరు వాటి సేవకులు కారు. 

అలా వేదాలు కఠిన కఠోర నియమాల ఉపదేశాలు కాక అన్ని సూత్రాలకూ నియమాలకూ మకుటమనదగ్గ విధంగా ప్రాణ పదార్ధాల ప్రతి అణువులోను "ఎవరి ఆజ్ఞానుసారం వాయువు వీచునో అగ్ని దహించునో మేఘాలు వర్షించునో మరణము సంభవించునో అట్టి పరంజ్యోతి స్థితుడై ఉండునని పేర్కొంటాయి.    

అతని స్వభావమేది?

అతను సర్వ వ్యాపకుడు; పవిత్రుడు, నిరాకారుడు. సర్వ శక్తిమంతుడు, కరుణాసింధువు.  త్వమేవ మాత చ పితా త్వమేవ. నేవే తండ్రివి, తల్లివి, సఖుడవు, జీవాధారమవు.  భవసాగర తరణానికి తగు శక్తి సామర్ధ్యాలను మాకు ప్రసాదించుము.  అని వేదర్షులు వేడుకొన్నారు.  అతనిని సేవించేదెలా? ప్రేమతో.  ఈ జన్మలోనే కాదు అన్ని జన్మలకీ నీవే నా ప్రేమాస్పద వ్యక్తివి అనుకునేవారిని ప్రేమించినకన్న మిక్కుటంగా అతడిని ప్రేమించాలి.   

వేదాలీవిధంగా చెప్పినదాన్ని భూమిమీద భగవదవతారమైన శ్రీకృష్ణులవారు సకలజనులకూ అర్ధమయేవిధంగా విపులీకరించారు.  నీటిలోనే పుట్టి పెరిగే తామరాకు ఎలా నీటిలో అంటీముట్టనివిధంగా ఉంటుందో, మనిషీ తన జరుగుబాటుకోసం కర్మలలో శ్రమిస్తూ లోకంలో చరిస్తున్నా చిత్తాన్ని మాత్రం భగవదర్పితం చేసి ఏ కర్మలకూ వాటి ఫలితాలకూ బద్ధుడు కాకుండా జీవించాలి.  

కోరికలున్నవారు దైవాన్ని ప్రేమించుట సహజమేకాని ఏ కోరికలూ లేక కేవలం ప్రేమకోసమే ప్రేమించుట ఉత్తమం.  అటువంటి ప్రార్ధన: "ఓ ప్రభూ సంపదల కోసం సంతానం కోసం శాస్త్ర పాండిత్యం కోసం ప్రార్ధించను.  నేను చావుపుటకల చక్రభ్రమణంలో తిరుగాడటమే నీ సంకల్పమైతే ఎన్ని జన్మలెత్తేందుకైనా సిద్ధం.  కాని నీ పై నాకుగల నితాంతాపార నిస్వార్ధ ప్రేమా భక్తీ చెక్కుచెదరనియ్యకు స్వామీ." అని.  

కృష్ణభక్తుడైన యుధిష్టిరుడు రాజ్యభ్రష్టుడై కుటుంబంతో హిమాలయ పర్వత సానువుల్లో విహరిస్తున్నప్పుడు ఒకసారి భార్య అడుగుతుంది.  ధర్మాత్ముడవు, భక్తుడవు నీకిదేం ప్రారబ్ధం రాజా అని.  అతనంటాడు: "దేవీ ఈ స్వర్ణరజత కాంతి ప్రకాశా శోభితమైన ఈ హిమాలయాలు చూడు.  ఇవి నాకిచ్చిందేమీ లేదు. కాని వాటి శోభకు, రాజసానికి, సమున్నతత్వానికి వాటిని చూసి నేను పరవశిస్తాను.  ప్రేమిస్తాను.  అది నా మటుకే.  ప్రతిఫలమాశించి కాదు.  ప్రేమ నా స్వభావం. పరిస్థితులు దాన్ని మార్చలేవు.  హిమాలయాల పట్ల గల నిస్వార్ధ ప్రేమానురక్తులు నాకు ఈ సుందర ప్రపంచాన్ని మనకై సృజించిన పరమేశ్వరుని పై అంతకన్న ఎక్కువ ఉన్నాయి కనుక నా స్థితిగతులతో నిమిత్తం లేకుండా అతనిని ప్రేమించడమే నా కర్తవ్యం. ఇందుకు ప్రతిగా నేనేమీ కోరను" అని.    

ఆత్మ నాశనం లేనిదని, నిత్యమని, దేహంపై మమకారం దానికి బంధమని, దానిన్నించి విడివడితే అజ్ఞానం, చావు పుటకల చక్రభ్రమణం నించి విముక్తి అని వేదాలు బోధిస్తాయి. 

ఈ బంధ విముక్తి దైవానుగ్రహంతోనే కలిగేది.  పరిశుద్ధాత్ములకే ఈ అనుగ్రహం కలిగేది.  పరిశుద్ధత దైవానుగ్రహ స్థితి.  అది కలిగినవారెలా ఉంటారు? అది కలిగిన స్వఛ్ఛాత్ములు ఈ జన్మలోనే భగవానుని దర్శించగలుగుతారు.  అట్టివారికి హృదయం కళంకరహితమై ఉంటుంది.  ఆ హృదయానికి ఎట్టి భయ సంశయాలూ ఉండవు.  అతనికి కారణ కార్యాల లంపటం ఉండదు.  ఇదే హిందూమత సారాంశం.   హిందువు ప్రబోధాలు, సిద్ధాంతాల వల్లెవేతతో సరిపెట్టుకోడు.  ఇంద్రియగోచరంకాని చైతన్య స్వరూపమొకటి ఉందంటే అతడు దానిని ముఖాముఖీ దర్శించాలి.  అతని శరీరం కన్న భిన్న ఆత్మస్వరూపమొకటుందని, కరుణాంతరంగమైన పరమత్మచైతన్యమొకటుందని అంటే అతను వాటిని కనుగొనాలి.  అలా చూచినప్పుడే అతని సంశయాలు తొలిగేది.  కనుక "నేను ఆత్మను దర్శించాను.  పరమాత్ముని దర్శించాను" అనేది ఒక హిందూ ఋషి ఆత్మనిరూపణ చేసే విధానం.  అదే పరిపూర్ణత.  హిందూ మత విధానమే అది - సూత్ర సిద్ధాంత నియమాలను విశ్వసించడంతో సరిపెట్టుకోకుండా శొధనతో సాధనతో సాక్షాత్కారాన్నందమని.  

కనుక యావఛ్ఛక్తినీ వినియోగించి పరిపూర్ణులమై, పవిత్రులమై పరమాత్మ స్వరూపులం కావడమే హిందూమతావలంబులకు లక్ష్యమై నిర్దేశించబడేది.   

అట్టి పరిపూర్ణత సిద్ధించినవారికి అలౌకిక అనంతానందం లభిస్తుంది.  పొందదగినవానిలోనే అత్యుత్కృష్టమైనదాని పొందినవారు తమ ఆనందాన్ని భగవంతునితో సరిసమానులై అనుభవిస్తారు.   

ఇంతవరకు హిందువులంతా అంగీకరిస్తారు.  అయితే పరిపూర్ణస్థితి అభిన్నం.  అది ఒకటే.  రెండు మూడు పరిపూర్నస్థితులుండవు.  దానిని వివరంచగలిగే లక్షణాలేవీ దానికుండవు.  అది విడిగా గోచరించదు.  కనుక పరిపూర్నమైన ఆత్మ ప్రబ్రహ్మంతో ఒకటవుతుంది.  ఆ పరభ్రహ్మన్నె పరిపుర్ణతగా, సత్యప్రకాశస్వరూపంగా, జ్ఞానతేజస్సంపన్నంగా, అనంతానందభావనగా  గ్రహిస్తుంది.  

అయితే ఇది స్పృహలేని స్థాణువులా గాయాల బాధ తెలీని దేహస్థితి వంటిది అని భ్రమపడరాదు.    ఇది దేహ సంబంధం కాదు.  దేహానికే పరిమితమై నేనంటే దేహమే అనుకుంటే అది విజ్ఞానశాస్త్ర పరంగానూ నిజం కాదు.  దేహం నిరంతరమూ మారుతూనే ఉంటుంది.  అప్పుడు నేనంటే ఇది అని చెప్పుకునే దేహస్థితి ఇప్పుడున్నది ఇంకోక్షణానికుండదు. అలా అనుకునేది సంకుచిత భావన.  ప్రాణచైతన్యంతో ఐక్యమైనప్పుడు చావు లేదు; ఆనందచైతన్యంతో ఐక్యమైనప్పుడు దుఃఖం లేదు; జ్ఞానచైతన్యంతో ఐక్యమైనప్పుడు దోషాలు లేవు;   మార్పే సృష్టి స్వభావం.  భౌతిక వస్తువుకు శాశ్వతత్వమూ ఏకత్వమూ ఉండవు.  కనుక మార్పుచెందే దేహన్ని మార్పుకి అతీతమైన ఆత్మచైతన్యంతో అనుసంధించినప్పుడు ఐక్యత సిద్ధిస్తుంది.  అదే, రెండు కానిది, ఒకటే అయినది, అద్వైతం. 

విజ్ఞానశాస్త్ర పరమార్ధం అన్నిటికీ ప్రాతినిధ్యం వహించే ఒక్కదాని ఆవిష్కరణ.  ఏ మూలకం నించి ఇతర అన్ని మూలకలనూ సృజించ వీలవుతుందో దాన్ని కనుగొన్నాక రసాయన శాస్త్ర శోధన ఆగిపోతుంది.  ఏ మూల శక్తికి మిగతా అన్ని రూపాల్లోని శక్తులూ వ్యక్తీకరణలో దాన్ని ఉత్పాదన చేశాక శక్తికైన భౌతిక శాస్త్ర పరిశోధన నిలిచిపోతుంది.  ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై ఎవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు అట్టి వానిని తెలుసుకున్నప్పుడు ప్రపంచ మతాలన్నిటి పనీ పరమార్ధమూ నెరవేరి ఇంకే గొడవలు ఉండవు.  సకల స్వభావాల భిన్నతనించి మూలస్వభావపు ఏకతను ఆవిష్కరించే దిశగానే సకల శాస్త్రాల పయనమూ సాగుతోంది.  ఒకనాటికి సైన్సు ఇట్టి  నిర్ధారణకు వస్తుంది.  అందుకే ఇప్పటిమట్టుకైన ఆవిష్కరణలన్నీ అసలైనదాని వ్యక్తీకరణలై, దానికైన అన్వేషణ ఇంకా కొనసాగుతోంది.  హిందువు మనసులో చిరకాలంగా ఉన్న  భావాలతో ఈ పోకడ సారూప్యం కలిగి ఉంది.      

ఇక్కణ్ణించి కిందకి దిగి పామరులు చేసే పూజలు చూద్దాం.  అందరూ అనుకున్నట్టు హిందువులు కోట్ల దేవుళ్ళను పూజించరు.  వారి ప్రార్ధనలను దగ్గరగా వింటే ఈ సంగతి బోధపడుతుంది. అందరి ప్రార్ధనలలోనూ భగవంతుని లక్షణాలు ఒకేవిధంగ కీర్తించబడతాయి.  సర్వాంతర్యామి అని, ఆర్త రక్షణ పరాయణుడని కోరిన వారి కొంగు బంగారమని- ఇలా.  ఎదటి బొమ్మ ఏదైతేనేం?  గులాబీని ఎన్ని భాషల్లో ఎలా పిలిచినా దాని సౌరభంలో తేడా ఉండదు కదా.  అలాగే హిందువు వల్లించే భగవన్నామాలూ రూపాలూ ఎన్నున్నా వాటి పారమార్ధిక చైతన్యస్వరూపం ఒక్కటే. పిలుచుకొందుకు పెట్టుకున్న పేర్లు నిజస్వభావ నిర్వచనాలుగా పొరబడరాదు.  

చెట్టు గుణం దాని ఫలాలబట్టి తెలుస్తుంది. నేనెంతోమంది విగ్రహారాధకులను కలిసి మాట్టాడాను.  నిరుపమానమైన వారి నిజాయితీ, నీతివర్తనం, సర్వమానవసౌభ్రాతృత్వం, భక్తిప్రపత్తులూ అబ్బురమనిపించేయి.  అంతరంగ వికాసమే కద అనుసరించే మార్గపు గుణదోషాలను ప్రకటించేది.  

అంధవిశ్వాసం మనిషికి శత్రువే కాని మతవైషమ్యం అంతకన్న చెడ్డది.  ఒక క్రైస్తవుడు చర్చికి ఎందుకు వెళతాడు? ప్రార్ధించేటప్ప్పుడు పైకి ఎందుకు చూడాలి. శిలువ గుర్తు ఎందుకని పవిత్ర భావన.  కేథలిక్ చర్చిలో అన్ని బొమ్మలు ఎందుకుంటాయి? ఎందుకని ప్రొటెస్టెంటులు ప్రార్ధించేటప్పుడు వారి మదిలో అన్నేసి ప్రతిమలు కదలాడతాయి? మదిలో ఊహించి రూపకల్పన చేసుకునే స్వభావం మనకు ఊపిరితీసుకోవడమంత సహజమైనది.  హిందువుల విగ్రహాల్లోని పరమార్ధమూ అంతే.  ఎదటి భౌతిక విగ్రహం సర్వాంతర్యామి కాడని భక్తుడూ ఎరుగును.  కాని మనసు కేంద్రీకరించేందుకు, కనులు మూసుకున్నప్పుడు భావించేందుకు ఒక మూర్తి ఉన్నప్పుడు మనసు అటూ ఇటూ పరిగెత్తకుండ నిలకడగా ఉంటుంది కనుక ఏదో ఒక మూర్తి.  ఆ మాటకొస్తే సర్వాంతర్యామి అనేది ఒక శబ్దం.  ఓ సర్వాంతర్యామీ అని ప్రార్ధించేటప్పుడు మదిలో ఏమని భావించాలి.  దానికి ఇదీ అని ఏ రూపమూ లేదు కనుక ఆ శబ్దం అన్నప్పుడూ విన్నప్పుడూ కళ్ళు మూసుకుంటే మనకి ఆకాశమూ శూన్యమూ మదిలో కదలాడతాయి.  కనుక ఎంత నిరాకారుడని అనుకుని కనులు మూసుకున్నా లోన లీలగా కదలాడేది ఏదో భౌతికరూపమే.     

ఇదే విధంగా మన మనసు కాల్పనికస్వభావాన్ననుసరించి అనంతమన్న భావనకి ఓ నీలాకాశం, శూన్యం, సముద్రం వంటి రూపాలు భావిస్తాము.  పవిత్రత అంటే కొందరికి చర్చి, కొందరికి మసీదు గుర్తుకొస్తాయి.  నిరంతరమైన ఆధ్యాత్మిక జీవనంతో పరిణతిచెందేకొద్దీ కొందరు తాము తరచూ దర్శించే ప్రార్ధనాస్థలాలకి అంటిపెట్టుకునుండిపోతే, ఇంకొందరు సేవామార్గం ఎంచుకుంటారు.  ఆరంభంలో అప్రధానమైన భౌతికరూప భావనలకన్న ఇది ఉన్నతం ఎందుకంటే నిరంతర అభ్యాసం మీద ఆ దశకొచ్చేరు కనక.  అలాగే నిరంతర విగ్రహారాధన అభ్యాసం చేసే హిందువుకు క్రమేపీ అలవడే ఉన్నత స్థితి జ్ఞానబోధ.  దివ్యమైనదాన్ని తెలుసుకోవడంతో మనిషికి దివ్యత్వం వస్తుంది.  విగ్రహాలు ప్రార్ధనాస్థలాలు ఇవన్నీ ఆ స్థితికోసం అయిన ప్రస్థానంలో ఉపకరించే సాధనాలే.  ఒకనాటికి ఈ  అధ్యాత్మిక బాల్యావస్థనొదిలేసి మనిషి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పైకి పోవాల్సిందే.

ఈ ప్రయాణం ఆగకూడదు.  హిందూ శాస్త్రాలు చెబుతాయి.  భౌతిక పూజలు అధమం.  ధ్యానరూపం మధ్యమం.  జ్ఞానప్రకాశావస్థే  ఉత్తమం, అత్యున్నతం అని. ఇవన్నీ ఒకదానితరవాత ఒకటి కలిగే దశలు.  ఇంకోటి.  ఒక విగ్రహం ముందు మోకరిల్లిన భక్తుడు కూడా ఎదటి మూర్తిని చూస్తూ "న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం - తారా సూర్యచంద్రాదులూ మేఘగర్జనలూ అతనిముందు తమ తేజాన్ని ప్రదర్శించజాలవు,  అతనిని వర్ణించ సమర్ధమూ కావు. వాటి ప్రకాశ ప్రజ్వల విద్యుఛ్ఛక్తులకు అతడే మూలాధారం."  అనే పరంజ్యోతినే స్మరించి ఆరాధిస్తాడు.  అయితే ఆ భౌతికావస్థ దాటిపోయాక కూడా ఆ విగ్రహన్ని  చిన్నచూపు చూడడు, దాని ఆరాధనను పాపమనుకోడు.  బాలుడు మనిషికి తండ్రి అని ఇంగ్లీషులో సామెత ఉంది.  వృద్ధుడు కావలంటే బాల్య యౌవన దశలు దాటాలి.  దాటాక బాల్యమూ యౌవనమూ పాపమని వృద్ధులనుకుంటే ఎలా.      

తన దివ్య ప్రకాశక దశను సధించే క్రమంలో హిందువు చేసే విగ్రహారాధనను పాపమని అనుకోవాలా?  దాన్ని దాటినా అది పాప దశని అతను భావించడు.  హిందువుకు తన ప్రస్థానం పాపం నించి సత్యం దిశగా కాక, సత్యం నించి సత్యానికి, సామన్య సత్యాన్నించి అత్యున్నత సత్యానికి సాగుతుంది.  ఈ ప్రస్థానంలో అనుసరించిన విధనాలూ ఆచరించిన కర్మకాండా ఆ మహోన్నత దశకి తనెక్కొచ్చిన మెట్లూ, ఎక్కుతున్నకొద్దీ తనను శక్తిమంతం చేసినవీ  కనక వాటిలో దేనిపట్లా అతనికి చిన్నచూపుండదు.      

భిన్నత్వంలో ఏకత్వ దర్శనం ప్రకృతి సుత్రం.  హిందువు దాన్ని గుర్తించాడు.  మిగతా మతధర్మాల వలె అతని మతం అతనికి కొన్ని సూత్రాలు నిర్దేశించి వాటికనుగుణంగానె నడుచుకొమ్మని, ఒకే కోటు కుట్టి అందర్నీ అదే తొడుక్కొమ్మని చెప్పదు. అలాచేస్తే కొందరికే కోటుంతుంది.  మిగతావారు అది లేకుండా తిరగాలి.  ఇల అందరికీ సమనంగా వర్తించెవి, అందరూ ఆచరినదగ్గవీ అయిన సుత్రాలు ఉండవని హిందువుకు తెలుసు. అందుకే పరమగమ్యాన్ని చేరే దశలోని ప్రతి చిన్న సంప్రదాయాన్నీ అతను గౌరవిస్తాడు.  

కాబట్టి విగ్రహారాధనను ఆక్షేపించనక్కర్లేదు.  అన్ని పాపాలకీ అది అమ్మమ్మ అని విమర్శించనక్కర్లేదు.  అయితే వారి పద్ధతుల్లో దోషాల్లేవని చెప్పను.  ఒకటి నిజం.  కడుపు మండిన హిందువు తనను తాను అంటించుకునో నదిలో దూకో చస్తాడు కాని పక్కవాణ్ణి చంపుదామని, చంపమని అనుకోడు.  తనననుసరించనివారిని తగలబెట్టే ఆలోచన అతను చెయ్యడు. ఏ మతమూ ఏ ఆచారమూ నిషిద్ధం కాదని, అందరి పరమార్ధమూ ఒకటే అని ప్రగాఢంగా విశ్వసిస్తాడు. 

ఒక కాంతికిరణ ప్రసార మార్గంలో ఉంచబడ్డ గాజు పలకల్లాటివీ వివిధ మార్గాలు.  అన్నిటిగుండా ప్రసరిస్తూ హృదయస్థమీ ఉండే చైతన్యస్వరూపం ఒక్కటే.  "పూసలన్నీ దారానికి అనుసంధించబడినట్టు అన్ని సాధనావిధానాలకు పరమగమ్యాన్ని నేను.  మనవాళిని పరిశుద్ధపరచే పవిత్రత నెలకొన్నచోటల్లా నేనుంటానని తెలుసుకో" అంటారు శ్రీకృష్ణులవారు.  ఇది ఒక మతానుయాయుల కే ప్రత్యేకమని ఎక్కడా చెప్పలేదు.  పైగ పరిపూర్ణతకూ పరిశుద్ధతకూ జాతి లింగ భేదాలుండవని వేదవ్యాసులవారే అన్నారు.  ఇంత ఆలొచనా విస్తృతి కలిగిన హిందువు మరే ఇతర ధర్మాచరణ చట్రంలోనూ బందీ అయేందుకిష్టపడడు. 

జైనబౌద్ధులకు దైవంతో నిమిత్తంలేదు.  కాని వారి మతధర్మ పరమార్ధమూ ఇతర ఆస్తికమతాల పరమార్ధంకన్న భిన్నం కాదు.  అది, వ్యక్తిత్వం దైవత్వంగా రూపాంతరం చెందాలని.  

సోదరీసోదరులారా, ఇది, హిందూమతం గురించి కొంత పరిచయం.  తన ధర్మాచరణను ప్రపంచవ్యాప్తం  చెయ్యడంలో హిందువు విఫలుడైతే అవును గాక.  కాని విశ్వమతమని ఒకటి ఆవిర్భవించడమంటు జరిగితే, అది కృష్ణభక్తులని క్రీస్తుభక్తులని, మునులని మూఢులని చూడక, తన జ్ఞాన చైతన్య ప్రకాశాన్ని అన్ని భిన్న మతావలంబకులపైనా సమానంగా ప్రసరింపచెయ్యాలి.  అది భౌగోళిక భాషా వర్గ భేదాలకతీతమై సమున్నతంగా నిలవాలి.  అసహనానికీ వైషమ్యానికీ దానిలో చోటుండకూడదు.  తన దీర్ఘ అమృతహస్తాలు చాచి అందరినీ అక్కున చేర్చుకుని ఇంకా ఎందరొచ్చినా ఆహ్వానిస్తూ ప్రపంచాన్ని జ్ఞానప్రకాశంచేసి మానవాళిని ఒక్కటిచేసి దైవసములను చెయ్యాలి.  

అటువంటి మతధర్మాన్ని ప్రతిపాదిస్తే ప్రపంచదేశాలు మిమ్ములను అనుసరిస్తాయి.  

హిందువులకు బ్రహ్మమై, జొరాష్ట్రియన్లకు ఆహుర మజ్దా అయి, బౌద్ధులకు తధాగతుడై, యూదులకు యెహొవా ఐ, క్రైస్తవులకు పరలోకప్రభువగు తండ్రి అయిన పరమేశ్వరుడు మీ దివ్యసంకల్పాన్ని ముందుకు తీసుకుపోగల శక్తిని మీకు అనుగ్రహించుగాక. 



No comments:

Post a Comment