Wednesday, April 7, 2021


దైవ భావన - ఒక తత్వవేత్త అభిప్రాయం 

 

డాక్టర్ హ్యారీ ఎమర్సన్ ఫాస్డిక్ తో నార్డీ కేంపియన్ ఇంటర్వ్యూ సారాంశం.  ఇది రీడర్సు డైజేస్త్టు పాత సంచికలోనిది. 

ఈ శతాబ్దంలో అమెరికన్ ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రభావితం చేసినవారిలో హ్యారీ ఎమెర్సన్ ఫాస్డిక్ అగ్రగణ్యులు.  న్యూయార్కులో తాను ప్రాతినిధ్యం వహించే రివర్ సైడ్ చర్చినుంచి చేసిన ప్రసంగాలు, ప్రబోధలు, రాసిన పుస్తకలు, అన్నిటిని మించి మానవతత్వం దైవతత్వాల సమన్వయంలో తన జీవితాన్నే వెచ్చించిన అతను కోట్లాది మందికి ఆరాధ్యుడు.  1920-30 ప్రాంతాల్లో అతని హేతుబద్ధ భావనలకి వ్యతిరేకంగా అతనిపైన చాందసులు ఎన్నోరకాల విమర్శలూ భౌతిక దాడులూ చేసేరు కాని అవన్నీ తట్టుకుని తాను నమ్మిన విశ్వాసానికి కట్టుబడి జీవితాన్ని సార్ధకం చేసుకున్నాడు.

ఇప్పుడు తన ఎనభై ఎనిమిదో యేట న్యూయార్కు శివారలలోని కుటీరం లాటి తన యింట్లో ప్రశాంత జీవనం గడుపుతూ ప్రపంచపోకడలను తన దృష్టికోణం నించి నిశ్శబ్దంగా అవలోకిస్తున్నాడు.  అతనిని స్నేహితుడని పిలుచుకోవడం, తరచుగా అతని సలహాలు స్వీకరినడం నా భాగ్యం.  

ఈ మధ్య నేనో వ్యాసం చదివి మనసు వ్యాకులమై అది చర్చించేందుకు అతనిని కలిశాను.  ఈ ఆధునిక జీవనానికి దేవుడు అవసరం లేదని, దేముని పని అయ్పోయినట్టేనని దాని భావం.

ఒకప్పుడు దేవుడుండేవాడు కాని, ఇప్పుడు లేడని, అతని పని అయిపోయినట్టేనని, ఈ కఠోర వాస్తవాన్ని జీర్ణించుకుని ఆస్తుకులు సరిపెట్టుకోవలసిందని దాని రచయిత అభిప్రాయపడ్డాడు.   ఆ వ్యాసం శీర్షిక దేముడు చనిపోయాడా? అని.  అదే ఫాస్డిక్ గారిని అడిగాను.  

అతనన్నారు:  దేముడు లేడన్నది ఒప్పుకోను కాని దేమునికి ఆపాదించిన కొన్ని భావనలకి కాలం చెల్లిందని నేనంటాను.  తన ప్రస్తావన జనాలని నిద్రపుచ్చేదీ భయపెట్టేదీ అయిన దేముడిప్పుడు లేడు. అతణ్ణి జనం వదిలించుకోవచ్చు.  చలా యేళ్ళపాటు మనం ఆనుకుందుకు ఒక తలగడగా దేవుని వాడుకుంటూ.  అతనే అన్నీ చూసుకుంటాడని భావిస్తూ వచ్చాం.  అయితే మన బుద్ధులు పరిణతిచెందుతున్నకొద్దీ దేవుని గురించిన మన ఆలోచనా మారాలి.  నేను పాస్తార్ గా ఉన్న రోజుల్లో ఒక యూనివర్సిటీ స్టూడెంటు వచ్చేడు.  ఎంతో ఆతృత, ఆందోళనలతో ఉన్న అతను వస్తూ వస్తూనే "నేను దేవుణ్ణి నమ్మను సార్" అన్నాడు.  నేనన్నాను. "అయితే నీవు నాస్తికునివన్నమాట.  నువ్వు నమ్మని దేవుని లక్షణాలు కొన్ని నాకు చెబుదూ.  అని.

"అదేనండీ అందరి కన్న గొప్పవాడిననుకుంటూ, ఒక పుస్తకం పట్టుక్కూర్చుని ప్రతివారు చేసేవీ అందులో రాసుకుంటూ అనుగ్రహాలూ ఆగ్రహాలూ కురిపించే రకం దేవుడూ" అన్నాడతను.  నేను నవ్వి అన్నాను.  నిజమేనయ్యో నీకు తోడు ఇప్పుడు నేనూ ఉన్నాను.  అటువంటి దేముడు ఉన్నాడంటే నేనూ నమ్మను.  

ఇంకా, మనలాటి వాడు, మనంత వాడు, అదనపు వేషభూషలు ధరించి బంగారపు సింహాసనం మీద కూర్చుని విశ్వాన్ని పరిపాలించేవాడు, అందమైన ఉద్యానాల్లో సంచరించే దేముడిప్పుడు లేనట్టే.  అలాగే ఏదెందుకు జరుగుతోందో తెలీని అయోమయంలో మనిషి ఉన్నపుడు అది నా గొప్పేనని, పైగా వారో రకం వీరోకం అంటూ కేటాయింపులు చేసే తారతమ్యాల దేముడూ ఇప్పుడు లేడు.  

ఈ ఆధునిక యుగంలో మన పక్షానే వ్యవహరించే దేముడూ పోవాల్సిందే.  అలాగే యుద్ధోన్మాదీ, తన ప్రీతి కోసం మనం చావాలని చెప్పే దేముడూను.  ఈ బాంబుల యుగంలో అటువంటి వాని అవసరం లేదు.  

అయితే వివేకప్రదాతా లోక కల్యాణకారకుడూ అయిన దేముని అంత సులభంగా అటకెక్కించెయ్యలేము.  

అప్పుడు దేముని ఏ విధంగా మనం భావించాలి అని నేనడిగేను. 

డాక్టర్ ఫాస్డిక్ ఇలా అన్నారు.  దేవుని భావించే విషయంలో ఒకరి అభిప్రాయనికీ ఇంకోరి అభిప్రాయనికీ ఎప్పుడూ చుక్కెదురు.  ఎంత వర్ణించినా మన అనుభవాలు దాటి వర్ణించలేము.  భగవంతుడిని ఎవరైనా పూర్తిగా వర్ణించగలరా?   కుదరదు. సముద్రాన్నించి నీరు తేవడమూ భగవత్తత్వాన్ని భావించి వివరించడమూ ఒకే రకం ప్రయత్నం.  దాని పరిమితి అతి స్వల్పం.  అయితే సముద్రం నించి సంగ్రహించిన నీరు ఒక కప్పుడైనా ఆ కొద్ది మొత్తమూ సముద్ర తత్వాన్ని పరిపూర్ణంగా వివరించగలదు.   

సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు నన్ను నేను మరచిపోతాను.  సాగరం అనంతం.  అదెంత లోతో ఎంత విశాలమో నాకు అవగాహన లేదు.  కాని నాకు పరిచయమున్న సముద్రతీరం బాగా తెలుసు.  అక్కడి అలలు, వాటినించి వచ్చే చల్లని గాలి,  ఒడ్డునున్న చెట్లు, ఇసుక, ఇవి.  ఆ మలయమారుత స్పర్శతో, ఆ అలల సంగీతంలో నేను పరవశించి నిద్రిస్తాను. 

నా ఈ అనుభవం సముద్రాన్ని గ్రహించే సమీప బిందువు.  భగవత్తత్వమూ అంతే.  అతని వ్యాప్తీ అనంతమే.  అంత విస్తృతిని ఎవరూ గ్రహించలేరు, భావించలేరు.  కాని అతడు మన ఆలోచనల పరిధిలో ఒదిగేంత చిన్నగా కూడా తనను తాను వ్యక్తీకరించుకోగలడు.  అది భగవత్తత్వాన్ని గురించి అందరి అందుబాటులో ఉన్న సమీప బిందువు.  కనుక దేవుని గురించి మనం  చెప్పగలిగేది మన సమీప బిందువు గ్రహించినమట్టుకే.  విశ్వజనీన భావనలైన సౌందర్యం, నీతివర్తనం, ప్రేమ, సత్యమూ అందరికీ అందుబాటులో ఉన్న భగవత్త్వపు సమీప బిందువులు.  ఎవరైనా దైవ తత్త్వాన్ని భావించేందుకు ఆకాశం వంకా నక్షత్రాలవంకా చూస్తారు కాని వారి దృష్టిని పరుపవలసింది తమ అంతరంగం లోపలికి.  భగవంతుడు అంటే ప్రేమ.  ప్రేమతత్వాన్ని కలిగిన ఏ మనిషిలోనైనా భగవంతుడు ఉన్నట్టే.  ప్రేమతత్వం జీవితాన్ని ప్రకాశమానం చేసిన ప్రతిచోటా దైవ తత్వం ఉంటుంది. 

నా రెండో ప్రశ్న.  దేవుని దర్శిద్దామని దర్శించలేని సామాన్యుల సంగతేమిటి? 

డాక్టర్ ఫాస్డిక్: ఎవరూ భగవంతుని పరిపూర్ణత్వాన్ని విశ్వసించలేరు. మహా అయితే తమ పరిపూర్ణత్వం మేరకే విశ్వసించగలరు.  అలా ఆరంభించాలి.  తమ తమ రంగంలో సుప్రసిద్ధులైన వారి కళారూపాలను ఆస్వాదించడం అలవాటుచేసుకోవాలి.  అంటే బీథోవెన్ సంగీతం, షెల్లీ కవిత్వం.  ప్రకృతి ఒడిలో స్వేఛ్ఛగా ఎగురుతూ గానం చేసే కోయిల గానం ఇటువంటివి ఆనందించాలి.  సృష్టి క్రమమూ దాని స్వరూప సౌష్టవ సౌందర్యాలు కేవలం యాదృఛ్ఛికమూ యథాలాపమూ అనగలమా?  అలాగే సృష్టిక్రమంలోని గణితాన్ని చూడండి.  యూక్లిడ్, న్యూటన్, ఐన్‌స్టీన్ మొదలైనవారు గణిత సమీకరణాలను సృష్టించలేదు. సృష్టిలో ఉన్నవాటిని కనుగొన్నారు.  అలాగే ఎందరో మహానుభావులు తమ ఆవిష్కరణలతోను సేవా తత్పరతతోను ఈ ప్రపంచపు దు@ఖాన్ని తగ్గించి దాన్ని వాసయోగ్యం చేసేరు.  వీరంతా భగవత్తత్వానికి సమీప బిందు సమానులు.  

న్ ప్రశ్న: అయితే ఇవన్నీ కాక భగవంతునే నిర్వచించడం పొరపాటా?

జవాబు: మీ నిర్వచనంలోకి ఒదిగిపోయే దేవుడు అతి చిన్నవాడని అర్ధం.  నిర్వచనానికి అందే భగవత్తత్వపు పరిధి నిర్వచించేవారి స్థాయిలోనే ఉంటుంది.. 

ప్రశ్న: ఆధునిక జీవితం నించి దేవుడు మాయమైపోయేడన్న దానికి మీ సమాధానం?

జవాబు: అది కేవలం మాటలవరకే అని నేననుకుంటాను.  దైవతత్వాన్ని నిరసించేవారు కూడా ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలను విశ్వసిస్తారు. ఆధ్యాత్మిక విలువలు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అవసరమే.  మీరన్నట్టు భగవద్ భావనకి ఇప్పుడు పట్టిన గ్రహణానికి అర్ధం, ప్రపంచం ఎదిగేందుకు నొప్పులుపడుతోంది.  దైవ వాక్యం మనిషికి తన హృదయాంతరాళాల లోంచి కాక గోడమీద అదృశ్యహస్తం రాయడంవల్లో చెక్కుడు రాళ్ళనించో ఆవిష్కృతమైందంటే నమ్మలేము.  

ఓ సారొక కుర్రాడికి ఆకాశం అనేది తను అనుకుంటున్నట్టు ఒక పెద్ద నీలం రంగు గుడారం కాదని, అక్కడేమీ లేదని క్లాసులో చెప్పేరు. తనెళ్ళి మిత్రుడితో ఇదే చెప్పేడు.  ఆకాశమనేది లేదుట.  అని.  మిత్రుడంటాడు సరే లేదు కాని పైకి చూస్తే కనిపిస్తున్న అదేమిటి? అని.  అలాగే ఈ విషయమూనూ.  అక్కడేదో ఉంది.  అదేమిటో దేముడనేవాడు లేడనేవారు చెప్పాలి.  

ఇవన్నీ దేముడి పనులు అని నెట్టేసి చేతులు దులిపేసుకుందుకు అలవాటుపడిన మనకి, నిజానికి అవి మనం చెయ్యాల్సిన పనులని బాధ్యత తీసుకొని చెయ్యమని దేవుడు చెబితే ఒప్పుకుందుకు  కష్టమే మరి.   అలాగే అతడు నిర్దేశించించేడని ఎప్పటినించో మనం నమ్ముతూ వస్తున్న మంచీ చెడులను ప్రశ్నించాల్సి రావడమూ కష్టమే.  ప్రపంచ జనుల మధ్య శాంతీ సామరస్యాలు నెలకొనేలా శ్రమించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పే చెప్పే దేవుడినీ పైకి పంపించెస్తే మంచిదని ఇంకొందరి అభిప్రాయం. వారి ప్రకారం దేవుడి పాత్ర మనం చేసే పూజాపురస్కారమూ పుచ్చుకుని మూసుక్కూచునేంతవరకే కాని మన బాధ్యతనీ కర్తవ్యాన్నీ శ్రమనీ బోధించే విప్లవాత్మకైనది కారాదు.    

అసలు దేవుడనే భావనే అక్కర్లేదనుకుందాం.  అప్పుడు మిగిలేది? ఈ జరిగేవాటికి ఎదో కొన్ని ఎలక్ట్రాన్లూ ప్రోటాన్ల యాదృఛ్ఛిక కలయికే తప్ప ఇంకే ఇతర కారణ కార్యాలూ పరమార్ధమూ లేదనే భ్రాంతే కద.  భావనో భ్రాంతో ఎదో ఒకటే ఉండాలి.  అయితే విశ్వ భ్రమణం ఒక క్రమమూ తీరూ తెన్నూ లేని ప్రమాదమని అనుకోగలమా?  అలా అనుకోవడమంటే అక్షరాలు అలా అలా ఎగిరొచ్చి యాదృఛ్ఛికంగా కలిసి షేక్స్పియర్ రచనలైపోయేయనుకున్నట్టే.  నా వరకు, నా మటుకు సృష్టికి ఒక ప్రాతిపదికా క్రమమూ అర్ధమూ పరమార్ధమూ ఉన్నాయి.   ఇది అంగీకరిస్తే దేవుని అస్తిత్వాన్ని అంగీకరించినట్టు.  లేకుంటే డ్రైవరూ బ్రేకులూ లేక పల్లంలో పోయే వాహనానికీ ఈ సృష్టి క్రమానికీ ఏమీ భేదం లేదని భావించినట్టు.  

అయితే డాక్టర్ ఫాస్డిక్, ఈ నాటి మన సమాజంలో ఒక క్రమమూ న్యాయమూ నీతీ ఉన్నాయంటారా?  

డాక్టర్ ఫాస్డిక్:  ఎప్పుడూ ఉన్నట్టే ఇప్పుడూ ఉన్నాయి.  గతము ఘనమని లేదు.  మనిషి హృదయపు స్థితి సృష్ట్యాదినించి అలాగే ఉంది. అలాగే దైవ తత్వాన్ని సృష్టి క్రమానికి అన్వయించేందుకు తిరస్కరించే అతని మనస్సంఘర్షణాను.  భౌతిక ఫలితాలకు భౌతిక సన్నద్ధత, ఆధ్యాత్మిక ఫలితాలకు ఆధ్యాత్మిక సన్నద్ధతా అవసరం.  దైవ తత్వాన్ని గ్రహించేందుకు దేవుని మార్గంలో నడిచి అతని పనులు చేసిపెట్టడమని ఆధునిక మతం బోధిస్తుంది.  ఆరోగ్యాన్ని కాంక్షిస్తే దేహమూ మనసూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏది సాగుచేస్తే అదే పండుతుంది.  స్నేహానికి స్నేహం. నిస్వార్ధపరత్వానికి సౌహార్దం లభిస్తాయి. లోక కల్యాణానికి పాటుపడితే మన సంతానానికి మంచి ప్రపంచం దొరుకుతుంది.  సంకుచితంకాని పరిపూర్ణ హృదయంతో నిరంతరం చేసిన ప్రార్ధనకి అనుగుణంగా ప్రపంచమూ పరిస్థితులూ స్నేహశీలంగాను అనుకూలంగాను రూపుదిద్దుకుంటాయి.  



No comments:

Post a Comment