మనకి తెలీని మనిషి
అలెక్సిస్ కారెల్, MD నోబెల్ బహుమతి గ్రహీత
మనిషి ఆకృతి నడకా ముఖమూ అతను ఏమిటన్నది వెల్లడిస్తాయి. అతని ఆకారం అతని దేహ మనస్స్వభావాలనీ శక్తులనూ ప్రకటిస్తుంది.
అనుక్షణమూ ప్రమాదమూ విపత్తుల మధ్యనే జీవిస్తూ గెలీలియో వలె అద్భుతావిష్కరణలనూ డా వించీ వలే అపురూప కళాస్ర్ష్టినీ చెయ్యగలిగిన సృజనశీలుడైన మన పూర్వీకునికి ఎప్పుడూ యేసీ గదుల్లో విశ్రమిస్తూ రేడియో వింటూ చెత్త సినిమాలు చూస్తూ గోల్ఫూ బ్రిడ్జీ ఆడుకుంటూ కాలంగడుప్తున్న ఇప్పటి మనిషితో పోలికే లేదు. ప్రతి కొత్తదనమూ తనదైన ముద్రను మనిషి మీద విడిచిపెడుతుంది. ఆవిధంగా మోటారు బళ్ళు, రేడియోలూ టెలివిజనూ ఉబుసుపోకకి ఆడే ఆటల తరం ఎటువంటిదో ఇప్పుడు గమనిస్తున్నాం.మన ఆలవాట్లూ ఆలోచనలు మన ఆకృతిని మలుస్తాయి. ముఖమూ మూతుల వంకరలు అక్కడి కండరాలకి చేసిన అలవాట్లప్రకారం కలుగుతాయి. ఈ కండరాల స్థితి మనఃస్థితిని అనుసరిస్తుంది. మనకి తెలీకుండానే మన ఆలోచనలూ ఆకాంక్షలూ మన ముఖస్వరూపాన్ని తయారుచేస్తాయి. తెరిచిన పుస్తకంలాటి ఒకరి ముఖంలో అతని గుణాలూ దోషాలూ, విజ్ఞతా అజ్ఞతలతో పాతు, అతను ఎవరికీ తెలీకుండా దాచుకుంటున్నాననుకుంటున్న అతని వ్యక్తిగత అలవాట్లనూ, అతను ఏపాటి ఆరోగ్యవంతుడో ఎటువంటి శారీరక మానసిక వ్యాధులబారిన పడేవీలున్నవాడో తెలుసుకోవచ్చు. యౌవన శోభ యుక్తవయస్కుల ముఖం మీది రేఖల తీరులోను వృద్ధులకైతే అంతరంగ పరిపూర్ణతలోనూ తొణికిసలాడుతుంది. ఆకృతినిచ్చే ఎముకలు, చర్మం, మాంసము, వెంట్రుకల ఆరోగ్యం లోని కణజాలానికి అందే పోషకాలని బట్టి ఉంటుంది. రక్తంలోని ప్లాస్మా అంటే బ్లడ్ ప్లాస్మా కణజాలాలకందే పోషకాలును నియంత్రిస్తుంది. ఇది లోని వివిధ గ్రంధులూ జీర్ణవ్యవస్థల పనితీరుకు అనుగుణంగా జరుగుతుంది. లోపలి ఎండోక్రిన్ గ్రంధులు, జీర్ణకోశం, ప్రేవులు, నాడీవ్యవస్థల పనితీరును చర్మం ప్రకటిస్తుంది. సన్నగా పొడవుగాను, లావుగా పొట్టిగానూ ఉండే వారి లోపలి వ్యవస్థ పనితీరుల్లో చాలా వైరుధ్యాలుంటాయి. సన్నని పొడవైనవారికి క్షయ చిత్తచాంచల్యము, పొట్టివారిలో కీళ్ళనొప్పులు, కీళ్లవాతం, చక్కెరవంటివి వచ్చే అవకాశాలెక్కువ ఉంటాయి. ప్రాచీన వైద్యులు వ్యక్తి ప్రవర్తన, కోపతాపాలు, హాస్యప్రియత్వం ఇత్యాదులకు ఆ వ్యక్తికి సంక్రమించిన రోగనిర్ధారణలో అధిక ప్రాధాన్యం ఇచ్చేవార్. ప్రతి వ్యక్తి ముఖమూ అతని శరీరాన్నీ ఆత్మనూ వెల్లడిస్తూ ఉంటుంది.
చర్మం ఒక సంక్లిష్ట వ్యవస్థకు రక్షణగా కప్పి వుండిన కవచం. తనమీద వృద్ధినందే హానికారక అతిసూక్ష్మజీవులు అంటే మైక్రోబ్‌లను తననుండి వెలువడే స్రావాల సహకారంతో మట్టుపెడుతుంది. నీరూ గాలీ లోనికి చొరబడకుండా నిరోధిస్తుంది. బయటినించి దాడిచేసే అతి సూక్ష్మ ప్రాణాంతక క్రిములయిన వైరస్‌లతో యుద్ధం చేస్తుంది. దాని బహిర్ముఖం భౌతికప్రపంచంలోని వాయుతేజాలూ తడీపొడీ ఉష్ణమూ శీతమూ వంటి శక్తుల నిరంతర స్పర్శలో ఉంటే, లోపలి ముఖం జలచరాల వలె జీవకణజాలం సంచరిస్తుండే వెచ్చని, వెలుతురులేని, జీవద్రవాలలో తడిసి ఉంటుంది. అది ఎన్నో యేళ్ళు మన్నికగా ఉండేందుక్కారణం దాని కింది కణజాలం పొరలు పొరలుగా ఉంటుంది. ఈ కణాలు అతి నెమ్మదిగాను నిరంతరంగాను వృద్ధిచెందుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని నశించినా, అవి బాగా ఉన్నవాటికి అతుక్కునే ఉంటాయి. ఇంటిమీది పెంకులు పేర్చినట్టు. చర్మమంతా వ్యాపించి వున్న స్పర్శాణువులకి ఒత్తిడీ, నొప్పీ వేడీ చల్లదనమూ గ్రహించే సున్నితత్వం ఉంటుంది. నాలికలో ఉండేవాటికి రుచీ ఉష్ణమూ తెలుస్తాయి. చెవిలోని సంక్లిష్ట వ్యవస్థ అతి సున్నితమైన గాలి ప్రకంపనలకు అనుగుణంగా స్పందిస్తుంది. ముక్కులోపలి ఘ్రాణాణువులు వాసనను పసిగడతాయి. ఈ విధంగా తన ఉపరితలం మీది ప్రేరకాలకు స్పందించే తీరునుబట్టి ఒక వ్యక్తి స్థితి కొంతవరకు తెలుస్తుంది. ఎందుకంటే బయటి ప్రపంచం నించి నిరంతరంగా తనకందే సమాచారానికనుగుణంగా మెదడు మార్పుచెందుతూంటుంది. అందుకని మన బయటి ఆవరణను అనాలోచితంగా చేసుకున్న కొత్త కొత్త అలవాట్లతో ఇష్టానుసారం మార్చుకునేముందు జాగరూకతతో వహించాలి. ఉదాహరణకి, సూర్యకిరణాలు మన శరీరంపై చూపే ప్రభావం ఎటువంటిదో ఇంకా పూర్తిగా తెలీదు కనక గంటలతరబడి ఎర్రని ఎండలో పడుకుంటే మంచిదన్న సూచనని గుడ్డిగా ఆచరణలో పెట్టకూడదు.
శవాలను అధ్యయనం చేసి ప్రాణులను అర్ధం చేసుకోలేము. కారణం, మృతదేహంలోని కణజాలానికి ప్రసరించె రక్తం అందించే పోషకాల సరఫరా నిలిచిపోతుంది. ఏ అంగమైనా తనకి పోషకాన్నిచ్చే మూలస్థానం నించి వేరుపడితే అది నశిస్తుంది. ప్రాణంతో ఉన్నప్పుడు ప్రసరించే రక్తం జీవకణజాలాన్ని లింఫ్ అనబడే శోషరసంలో నిరంతరమూ తడుపుతూ ఉంటుంది. శస్త్ర చికిత్స చేస్తున్నప్పుడు బతికున్న దశలో అవయవాల పనితీరును బాగా అధ్యయనం చెయ్య వీలవుతుంది మృతకళేబరాలకన్నా. జీవకణాల అధ్యయనం వాటిని సజీవంగా ఉంచిన మాధ్యమంతో కలిపి చెయ్యాలి కాని దానినించి వేరుచేసి కాదు. మాధ్యమం వల్ల అవీ మారుతూంటాయి, వాటివల్ల మాధ్యమమూ మారుతూనే ఉంటుంది. కణజాలమూ మాధ్యమమూ వేరుపడి మనలేవు.
రక్తంలో వేల బిల్ల్యన్ల ఎర్ర రక్తకణాలూ తెల్ల రక్తకణాలూ ఉంటాయి. ఇవన్నీ ప్లాస్మా అనే ద్రవంలో తేలియాడుతూంటాయి. రక్తం ప్రతి జీవాణువుకూ అవసరమైన పోషకాలనూ, అదే సమయంలో అవి వదలిన వ్యర్ధాలను తీసుకుపోయే వాహకంగా ఉంటుంది. ఇంకా దానిలో పాడైన కణజలాన్ని బాగుచేసేందుకవసరమైన రసాయనాలూ ప్రవహిస్తుంటాయి. ఈ లక్షణాలు వింతగొలుపుతాయి. ఈ విధులు నెరవేరుస్తున్న రక్తప్రసారం, తన ప్రవాహంలో పడిపోయిన చెట్టుచేమలను తనతో తోడుకుపోతూ అక్కడక్కడా కోతపడిన గట్లనూ ఇళ్ళనూ రిపేరు చేసే వరదప్రవాహాన్ని తలపిస్తుంది. ప్రొటీనులు, చక్కెరలు, ఆమ్లాలు, కొవ్వే కాకుండా అన్ని గ్రంధుల, కణజాలాల స్రావాలను కలిగియుండే బ్లడ్ ప్లాస్మా, మనమనుకున్నదానికన్న సారవంతమైనది. చాలా మటుకు ఈ పదార్ధాలగురించీ వాటి సంక్లిష్టతగురించీ అవి చేసే పనులగురించి మనకి తెలిసినది తక్కువనే చెప్పలి. జీవకణాలమీద హానికారక మైక్రోబులు దాడి చేసినప్పుడు ప్రతిఘటించి కణజాలాన్ని రక్షించే యాంటీబాడీలనూ రక్తం తోడ్కొనివెళుతుంది. వంటికి గాయమైనప్పుడు ఎక్కువ రక్తం పోకుండా గడ్డకట్టించి దాని ప్రసరణ నిలుపుదల చేసి ప్రమాదాన్ని నివారించె ఫైబ్రిన్ అనే ప్రొటీన్ కూడా బ్లడ్ ప్లాస్మాలో ఉంటుంది. ఇటువంటి బహుళప్రయోజనకారకాలైన పదార్ధాలు దేఅమంతటా నిరంతరము రక్తంగుండా ప్రసరిస్తూనే ఉంటాయి.
పొరలు పొరలుగా పేర్చబడ్డ జీర్ణకోశంలోని అమరికలు అన్నసారాన్ని వడకట్టే ఏర్పాటే కాక ఒక రసాయనాల ఫ్యాక్టరీ అని చెప్పుకోవచ్చు. వాటిలోని కణజాలం జీర్ణమైన అన్నసారాన్ని శరీరం లోనికి అనుమతిస్తూనే, దానితోపాటు అక్కడున్న హానికారక బాక్టీరియా లోనికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంటుంది. ఈ శతృమూకతో ఎప్పుడూ ఉపద్రవమే. వైరస్‌లు ముక్కు, గొంతుల్లో తిష్టవేసుకునుంటాయి. ప్రమాదరహితాలూ, ప్రమాదకారకాలూ అయిన స్ట్రెప్టోకాసీ, మరియు దిఫ్తీరియాను కలగజేసే మైక్రోబ్‌లు గొంతులోని టోన్సిల్స్‌లోను; టైఫాయిడ్ జ్వరాన్నీ అజీర్తినీ కలిగించే బాసిలీ అనే బాక్టీరియా పేగుల్లో సునాయాసంగా పెరుగుతుంది. జీర్ణకోశ శ్వాసకోశాల్లోని పొరల అమరిక అంటే మెంబ్రేన్‌ల పనితీరునుబట్టి వ్యాధినిరోధకత్వమూ మిగతా దేహవిధులలో వాటి ప్రయోజకత్వమూ ఉంటుంది.
జననేంద్రియ గ్రంధులు అన్ని దేహ, మనో, బుద్ధి విశేష కార్యకలాపాలను తీవ్రతరం చేస్తాయి. నపుంసకులు దేశాధినేతలైనట్టో తతవేత్తలైనట్టో ఆఖరికి తెలివిగా నేరమాచరించినట్టో ఎక్కడా లేదు. మనం చేసే పనులకు ఇటువంటి వైశిష్ట్యాన్ని కలుగజేసే ప్రత్యేకస్రావాలను వృషణాలు, అండాశయాలు రక్తంలోకి విడుదల చేస్తుంటాయి. ఒక దుక్కిటెద్దులో లేని పౌరుషమూ హింసా క్రౌర్యప్రవృత్తులను ఒక పోట్లగిత్తకి కలిగించినవి దాని వృషణాలే. అటువంటి భేదమే అండాశయాన్ని కలిగిన స్త్రీలకూ అవిలేని స్త్రీలకూ మధ్య ఉంటుంది.
వేరుచేసి ఫ్లాస్కులో ఉంచిన ఒక జీవకణజాలంలోని జీవం నిలిచి అది తాను విసర్జించే విషపూరిత వ్యర్ధాలకారణంగా నశించకుండా ఉండాలంటే దాని పరిమాణానికి రెండువేల రెట్లు పోషకపూర్ణమైన ద్రవంలో ఉంచాలి. అదేవిధంగా మానవశరీరాన్నే పోలిన కణజాలం - టిష్యూ ని అభివృద్ధిచెయ్యాలంటే తయారైన పరిమాణానికి రెండులక్షల రెట్లు పోషకపూర్ణమైన ద్రావకంలో దాన్ని ఉంచాలి. అయితే రక్త ప్రసారానికీ, కణజాలాలు అందులో విసర్జించే వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తోడి పోస్తూ దాన్ని పరిశుద్ధంగా ఉంచేందుకూ నిరంతరంగా పనిచేస్తున్న సంక్లిష్ట యంత్రాంగం పుణ్యమాని మన కణజాలం రెండులక్షల రెట్ల ద్రావకాన్ని కోరక అతి తక్కువ, అంటే కేవలం ఏడు రెట్ల ద్రావకంతోనే సరిపెట్టుకుని ప్రాణాలు నిలుపుతున్నాయి.
కండరాలనించీ ఇంద్రియాలనించీ తిరిగొచ్చిన రక్తాన్ని శక్తిమంతమైన గుండె పంపు వ్యవస్థ ఊపిరితిత్తుల్లోకి మళ్ళిస్తుంది. అక్కడ అందులోని ఎర్ర రక్తకణాలకు బయటి వాతావరణమ్నించి పీల్చుకున్న ఆక్సిజన్ అందుతుంది. అదే సమయంలో శ్వాసప్రక్రియద్వారా కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విసర్జించబడుతుంది. రక్తశుద్ధి ప్రక్రియ మూత్రపిండాలలో ముగిసి అందులోని వ్యర్ధాలు అక్కణ్ణించి మూత్రంద్వారా బయటికి పంపబడుతాయి. అవి ప్లాస్మాకి అవసరమైన లవణాల పరిమాణాన్నీ నియంత్రిస్తాయి.
మూత్రపిండాలూ ఊపిరితిత్తులూ నిర్విరామంగా పనిచెయ్యడంవల్లనే జీవకణాలు అతి తక్కువ పోషకద్రవాలతో చైతన్యంగా ఉంటూ, మానవశరీరమూ అందుకు తగ్గట్టే పరిమితంగా నిర్మితమై అమితమైన శక్తిసామర్ధ్యాలను అందిపుచ్చుకుంది.
వాతావరణంలోని ఆక్సిజెన్ మరియు జీర్ణప్రక్రియ యొక్క ఉత్పత్తులే కాక ఎండోక్రిన్ వ్యవస్థలోని పినియల్ గ్రంధి, పిట్యూటరీ గ్రంధి, క్లోమగ్రంధి,అండాశయం, వృషణాలు, థైరాయిడ్ గ్రంధి, పారా థైరాయిడ్ గ్రంధి, హైపోథాలమస్ మరియు అడ్రినల్ గ్రంధుల స్రావాలు కూడా రక్తంలోని పోషకాలకు అదనంగా చేరుతాయి; థైరోక్సిన్, అడ్రినలిన్, ఇన్సులిన్ వంటివి. ఇవి రక్తంలో అప్పటికే ఉన్న రసాయన మిశ్రమాలతో కలిసి కొత్త రసాయన మిశ్రమాలు తయారుచేసుకొని ఎన్నో కణజాలాలకూ అవయవాలకూ పోషకమై, దేహ మనస్సంబంధమైన ఎన్నో విధులు సక్రమంగా జరిగేలా చూస్తాయి. అంటే ఒకవస్తువు తనను వాడుకుని తననే కొత్తగా సృజించుకుని వృద్ధిచెందడం అన్నమాట. సంకల్పబలాన్ని ఉపయోగించుకుని సంకల్పబలాన్నిపెంచుకున్నట్టు. ఇంధనంతో నడిచే యంత్రంలో కదిలే భాగాలు కొత్త ఇంధనాన్ని తయారుచేసినట్టు, దానివల్ల మిగతా భాగాలు పనిచేసి ఇవన్నీ కలిసి తయారుచేసిన సరికొత్త ఇంధనం మునపటి ఇంధనంలో కలిసి దాన్ని మరింత శక్తిమంతం చేస్తూ, అదే సమయంలో యంత్రాన్ని నదిపేవారి బుద్ధి కుశలతను పెంచినట్టు. దేహము నిలిచేందుకు, దాని అన్ని ప్రక్రియలూ సక్రమంగా జరగడానికీ ఈ గ్రంధుల పనితీరే కారణం.
సూక్ష్మావయవాల పనితీరుకు దీటుగా వాటిని కలిగియున్న స్థూలావయవాలదీ ఉంటుంది. ఉదాహరణకి అస్థిపంజరం శరీరానికి ఆకృతినిచ్చేందుకే కాదు. రక్త ప్రసార క్రియ, శ్వాస క్రియ, జీర్ణక్రియలకు అనుబంధంగా తన ఎముకల్లోని మూలుగ అంటే బోన్ మారో సహాయంతో అది లూకోసైట్లనూ ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. కాలేయం అంటే లివర్, బైల్ అంటే పైత్య రసాన్ని విడుదల చేస్తూ మిక్రోబ్‌లను విషపదార్ధాలనూ సంహరిస్తుంది; గ్లైకోజెన్ ను నిలవచేసుకుని దేహమంతటా జీవక్రియకవసరమైన చక్కెర నిల్వలు తగుమోతాదులో ఉండేలా నియంత్రిస్తుంది; రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించే హెపారిన్ ను తయారుచేస్తుంది. ఇదే విధంగా క్లోమ గ్రంధి అంటే పాంక్రియాస్, సుప్రా రీనల్ లేదా అడ్రినల్ గ్రంధులు, పొట్ట భాగానికి దగ్గరగా ఉండే స్ప్లీను ఒక్క పనికే పరిమితం కాక బహుళ విధులను నెరవేరుస్తూ జీవక్రియ క్రమబద్ధతకు పాటు పడతాయి. ఇంకోటి, ఒక అవయవపు పని పరిధి అదున్నచోటుకే పరిమితం కాదు. అది వెలువరించే జీవస్రావాలు ఎంతదూరం ప్రయాణిస్తాయో అంతదూరమూ దాని పరిధిలో ఉన్నట్టే. ఆ లెక్కన ప్రతి అవయవం పరిధీ దేహమంతా విస్తరించి ఉంటుంది. వృషణాలు రక్తంలోకి వదిలే స్రావాలు నీలిరంగులో ఉంటే అవి కలిగిన పురుషుడూ నీలిరంగులో ఉండాలి. అయితే దేహమంతా ప్రసరించే వాటిని స్వీకరించిన కణజాలాలు వీటిని హరాయించుకుని సమతౌల్యం సాధిస్తాయి. .
అవయవాలు వేటికవే తయారవుతాయి. వీటి నిర్మాణమూ పెరుగుదలా అయితే ఒక ఊహాతీత ప్రక్రియే. ఇటిక ఇటికా పేర్చి ఇల్లు కట్టినట్టే కణమూ కణము కూడి అవయవాన్ని నిర్మించుకుంటాయి. తేడా అల్లా, ఈ ఇటికలు అద్భుత శక్తులు కలిగి ఒకటి మరికొన్నిటిని సృష్టించుకుని అవసరమైన నిర్మాణ పోషకాలను బ్లడ్ ప్లాస్మా నించి సంగ్రహించి వాటితోనే అవయవ భవనాన్ని లేపేస్తాయి. ఆ క్రమంలోనే కొన్ని కిటికీలైపోతాయి. కొన్ని భోజనశాలలైపోతాయి. కొన్ని శుద్ధిచేసే యంత్రాలైపోతాయి. కొన్ని మురుగుగొట్టాలైపోతాయి. తయారీకి ముందు నమూనా వేసుకోవడం, ప్రతి దశలోను దాన్ని చూసి కట్టడం సరిగా ఒస్తోందా లేదా అని లెక్కలేసుకోవడం ఉండదు. అన్ని నిర్ణయాలూ ఇటికలవే. శక్తిసమన్వితాలైన జీవకణ ఇటికలు.
మన దేహం మహా దృఢమైనది. అది తనను తాను ఆర్కిటిక్ లోని మంచుకీ ఉష్ణమండలాల వేడికీ కూడా ఓర్చుకోగలదు. అవసరమైనప్పుడు ఆకలిని, నీరసాన్ని, వాతావరణ మార్పులను తట్టుకు నిలబడగలదు. అన్ని జంతువులలోకీ మనిషి గట్టివాడనడం సమంజసం. తరచూ మనం శరీరాన్ని యంత్రంతో పోలుస్తాం. యంత్రపు దార్ఢ్యం దాన్ని తయారుచేసిన లోహపు గట్టిదనాన్ని బట్టి ఉంటుంది. మనిషి దార్ఢ్యమూ ఓర్చుకునే తత్వమూ తన జీవకణాల స్థితిస్థాపకశక్తీ, చురుకుదదనం, మార్పుకనుగుణంగా సర్దుబాటు చేసుకునే స్వభావాల బట్టి ఉంటుంది. వినియోగంతో యంత్రం అరిగిపోతుంది కాని జీవకణాలకి అరుగూ తరుగూ ఉండదు. పైగా వినియోగంతోను కాలానుగుణంగాను కొన్ని నశించినా ఉన్నవి కాని కొత్తవాటిని తయారుచేసుకుని కాని వాటి లోటును భర్తీ చేస్తూనే ఉంటాయి.
వ్యాధులను దరిచేరనియ్యక కష్టనష్టాలకు కుంగక, శ్రమకూ ప్రయాసకూ వెరవక ధైర్యస్థైర్యాలూ స్థితప్రజ్ఞతా కలిగినవారిని మానవుల్లో శక్తిమంతులుగా గుర్తిస్తారు. ఇవి వారసత్వంగా సంక్రమించే లక్షణాలే అయినా, చాలా దేశాల్లో తరతరానికీ ఇవి కనుమరుగు కావడం కనిపిస్తోంది. పూర్వనాగరకతలను గమనిస్తే అటువంటి విపత్తు సంభవమేనని అర్ధమవుతుంది. ఒక గొప్ప జాతిలో జన్మించినవాడు భ్రష్టుడైపోతే తప్ప తనపూర్వీకుల్లాగే భయమూ బలహీనతా అంటే ఏమిటో ఎరుగని శక్తిస్వరూపుడై నిలుస్తాడు. తన ఆరోగ్యం గురించిన ఆలోచనే అతనికుండదు. డాక్టర్ల అవసరం అతనికి పడదు. పోరాటం, ప్రేమ, వివేకం, విజయం అతనికి స్వభావ సిద్ధాలు. క్రూరమృగం వేటమీద లంఘించినంత సునాయాసంగా అతను ఎటువంటి పరిస్థితుల్లోకి జంకూ గొంకూలేకుండా దూకి లక్ష్యాన్ని సాధిస్తాడు. కృరమృగానికి తన అవయవాలు ఎంత పదునో తన దృష్టి ఎంత నిశితమో తన గురి ఎంత కచ్చితమో అన్న స్పృహే ఉండనట్టు ఇతనికీ తన శక్తిసామర్ధాలగురించిన స్పృహే అవసరం ఉండదు. అవి అతి సహజంగా తనవి. ఇంకోపక్క చాలా మంది, జబ్బుపడ్డ్ట్టు చెప్పలేం కాని ఆరోగ్యం సరిగా ఉండదు. వారి జీవకణాల్లో కొన్నిటి పనితీరులో నాణ్యంగా లేకపోవచ్చు. వారిదేహంలోని కొన్ని గ్రంధులు అవసరమైనన్ని జీవద్రవాలను విడుదలచేస్తుండకపోవచ్చు; లేదా అతిగా చేస్తుండవచ్చు; వారి నాడీవ్యవస్థ అవసరమైనదానికన్న అధికంగా శ్రమిస్తుండవచ్చు. లేదా వారి జీవకణజాలం తగినంతగా వ్యాధికారకాలతో పోరాటం చెయ్యలేకపోతుండవచ్చు. వారిలోని ఇటువంటి లోపాలు వారికి దుఃఖ కారకాలవుతాయి. భవిష్యత్తులో ఎప్పటికైనా దేహంలోని జీవకణజాలమూ అవయవాల పనితీరులో సమతౌల్యం సాధించే ఆవిష్కరణ చేసిన శాస్త్రవేత్తలు పాశ్చర్ కన్న ఎక్కువ లోకకల్యాణం చేసినవారవుతారు. జబ్బుపడ్డప్పుడూ ఆరోగ్యంగా ఉన్నప్పుడూ కూడా దేహావయవాల ఐకమత్యం ఒకేవిధంగా ఉంటుంది. సుస్తీ అంటే దేహమంతా సుస్తీ అన్నట్టు. అనారోగ్యం ఏదో ఒక్క అవయవానికి పరిమితం కాదు. శరీర నిర్మాణానికి సంబంధించిన కొన్ని పాత సిద్ధాంతాలను పట్టుకుని ఇప్పటి వైద్యులు దేహాన్ని భాగాలుగా వేరుచేసి ఒకో భాగానికీ ఒకో వైద్య విభాగాన్ని తయారుచేసుకున్నారు. కాని దేహమంతనూ, అలాగే ఒకో భాగాన్నీ పరిపూర్ణంగా తెలిసి అర్ధంచేసుకోగల వైద్యులే చికిత్స చేయగల సమర్ధులు.
దేహమంతనూ అన్ని గ్రంధులూ కోశాలు స్రవించిన జీవస్రావాలను మెదడు కేంద్రస్థానం అంటే సెరెబ్రల్ సెంటర్ కలిగియుంటుంది. ఆ విధంగా ప్రతి అవయవమూ సెరెబ్రల్ కార్టెక్స్ అని పిలువబడే పెద్దమెదటి నియంత్రణలో ఉన్నట్టు. మెదటిని చేరే రక్తానికీ దానిలోని లింఫుకీ ఎడ్రినల్ గ్రంధులు విడుదలచేసిన స్రావాలు కలియకుంటే ఆ మనిషి డిప్రెషన్ అంటే స్తబ్ధతనూ వ్యాకులతనూ చెందుతాడు. ఒకరి వ్యక్తిత్వాన్ని అతని జీర్ణాశయం, కాలేయం, ప్రేవులకు సంబంధించిన వ్యాధులు ఏరకంగా కుంగదీస్తాయో అందరికీ తెలిసినదే. అంటే మెదడుకు ప్రసరించే పౌష్టిక రసాల్లోకి అదనంగా వివిధ కోశాలు విడుదలచేసే స్రావాలే మనిషి బుద్ధి కుశలతనూ వివేకాన్ని ప్రభావితం చేస్తాయి.
వృషణాలు మనిషి బుద్ధివిశేషానికి చురుకుపుట్టించే జీవరసాలు సరఫరా చేస్తాయి. పేరొందిన ఎందరో కవులు, ఋషులు, కళాకారులు, పరాక్రమవంతులు విపరీతమైన సెక్స్ ఆసక్తిని కలిగినవారే. పునరుత్పత్తి అవయవాలను తొలగించినప్పుడు అది బుద్ధివిశేషం మీదా ప్రభావం చూపుతుంది. ఉత్తేజమూ స్ఫూర్తీ లైంగిక గ్రంధుల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. నెరవేరని గాఢమైన ప్రేమ బుద్ధికి ప్రేరణ కలిగిస్తుంది. సుప్రసిద్ధ రచయిత డాంటేకి తన ప్రేయసి బియాట్రిస్ దక్కి వుంటే డివైన్ కామెడీ అనే రచన వచ్చివుండేది కాదు. లైంగికాసక్తి ఎక్కువైతే మెదటి చురుకుదనమూ ఎక్కువవుతుంది. అయితే మనశ్శక్తి తీక్ష్ణం కావాలంటే విపరీతమైన లైంగిక ఆసక్తి ఉండాలి, అది తీర్చుకోకుండా అణచుకోవాలి.
అసూయ, ద్వేషం, భయం ఇవి మన నడవడిలో భాగమై అలవాటైపోయినప్పుడు అవి దేహసంబంధమైన ఎన్నో వ్యాధులను కలిగిస్తాయి. నైతిక పతనం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దిగులును నియంత్రించుకోలేని వ్యాపారస్థులు చిన్నవయసులోనే మరణిస్తారు. భావావేశం మజ్జా తంతువులు, ధమనులని కుచించి రక్తప్రసానికి అవరోధం కలిగించగలదు. ఆందోళన, ఆవేశం వంటివి రక్తపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులను తెచ్చిపెడతాయి. ఉల్లాసంలో ముఖ వర్చస్సు తేజరిల్లుతుంది. భయంలో పాలిపోతుంది. మన మదిలోని భావనలకనుగుణంగా వివిధ అవయవాల స్రావాలు హెచ్చటమో తగ్గడమో, పూర్తిగా నిలిచిపోవడమో జరుగుతుంది. దిగ్భ్రమలూ దిగ్భ్రాంతులూ రక్తప్రసారంలో మార్పులు తెస్తాయి. కొన్ని రకాల ఆలోచనలు ఇంద్రియాలను దెబ్బతీసేవిగా ఉంటాయి. నిలకడలేని ఆధునిక జీవనపు ఒత్తిడి, అలజడులతో మనం చేసే ఆలోచనల వల్ల నాడీ, జీర్ణ వ్యవస్థల పనితీరును చెడి పోషకాల తయారీ నిలిచిపోయి పేగుల్లో హానికారక మైక్రోబులు రక్తప్రసారంలో కలుస్తాయి. మూత్రపిండాలు, కోశాలలో ఇంఫెక్షన్లకు మానసిక, నైతిక అసమతౌల్యం కారణం అవుతున్నాయి. జీవన విధానం ఇంత సంక్లిష్టంగా లేని పాత రోజుల్లో ఇటువంటి సమస్యలే ఎరుగరు. ఇంత అలజడిలోను ప్రశాంతంగా ఉండగలిగినవారిని నాడీ ఇంద్రియ వ్యవస్థల రుగ్మతలు దరిజేరవు. మన ఆవిష్కరణలు, ఆందోళనలు, ఆరాధనలు, ఆపేక్షలు జనించేది కేవలం మెదడు నించే కాక పూర్తి దేహం నుంచేనని గుర్తుపెట్టుకోవాలి.
మానసిక స్థితి అభ్యాసంతో మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమూ హేతుబద్ధమూ అయిన ఆలోచనలు అలవాటుచేసుకుని వివేకజ్ఞానాన్ని సరైన మార్గంలో నడపాలి. పుట్టినప్పుడు అందరి బుద్ధివిశేషమూ ఒకే స్థాయిలో ఉండదు. అయితే అది ఎంత ఉన్నా కార్యకుశలత సాధించాలంటే దానికి నిరంతరం వ్యాయామం ఉండాల్సిందే. ఆలోచనల్లో హేతుబద్ధత, తర్కజ్ఞాన అభ్యాసం, తలపుల్లో క్రమశిక్షణ, వస్తువుల నిశిత పరిశీలన ఇతువంటివి మనశ్శక్తిని వృద్ధి చేస్తాయి. దీనికి వ్యతిరేకమైన ఊహాజనితమైన పరిశీలనలు, ఇష్టానుసారం మార్చుకునే అభిప్రాయాలు, నియంత్రణలేని ఆలోచనలు బుద్ధి మాంద్యానికి కారణమవుతాయి.
జీవనశైలి, ఆహార విహారాదుల్లోని కొన్ని అలవట్లు కూడా మానసికాభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. అధికమైన తిండీ శారీరక శ్రమా దాన్ని దిగజారుస్తాయి. విపరీతంగా శ్రమించే ఆటగాళ్ళకు తెలివితేటలు తక్కువుంటాయి.
మనిషి మేధోశక్తి తన అత్యున్నత దశకి చేరేందుకు బహుశ అన్ని పరిస్తితులూ అనుకూలించే ముహూర్తపు గడియలు కొన్నే ఉండి ఉండవచ్చు. నాగరికత వెల్లివిరిసి చరిత్రలో నిలిచిపోయే అధ్బుతమైన ఆవిష్కరణలు జరిగిన కాలానికి మనిషి ఆహారపుటలవాట్లు, జీవన విధానమూ ఎలా వుండేవో? అసలు మనం మనిషి బుద్ధివిశేషం ఎప్పుడు ఎలా ఆరంభమయేది, ఎలా పెరిగేది అనే దాని గురినిచి పట్టించుకోవటంలేదనిపిస్తుంది. పిల్లలని స్కూళ్ళలో వేసి కొన్ని పుస్తకాలు చదివించీ మెదడుకు మేతలిస్తే వారి బుద్ధి పదునెక్కుతుందనుకుటున్నాం. గొప్ప మేధో సంపన్నులకు విషయ పరిశీలనాశక్తి, గ్రహణశక్తులతో పాటు సృజనాత్మకత అంటే క్రియేటివ్ ఇమేజినేసన్, సహజ లోక జ్ఞానం అంటే ఇంట్యూషన్ వంటి కొన్ని అదనపు గుణాలూ కలిగియుంటారు. ఇతరులు గ్రహించలేనివి సహజ జ్ఞానం ఉన్నవారు గ్రహించగలుగుతారు. అసలైన నాయకుడు తన కింది ఉద్యోగులను ఎంపికచేసుకునేప్పుడు వారికి మానసిక సంబంధ పరీక్షలేవీ నిర్వహించనక్కర్లేదు. ఒక చూపులోను మాటలోను ఎదటి మనిషి విలువ, గుణదోషాలు వారికి తెలిసిపోతాయి. గొప్ప శాస్త్రవేత్త అసంకల్పితంగా అతి మామూలుగా వేసిన అడుగుతో ఒక గొప్ప ఆవిష్కరణ జరుగుతుంది. గొప్ప గొప్ప వైద్యులు తమ పేషంట్లను చూచీ చూడటంతోనే వారి రుగ్మత ఏమిటన్నది చెప్పగలగటం ఇటువంటి కౌశలమే. దీనినే ప్రేరణ అని వ్యవహరించేవారు.
నాగరీకంగా బాగా అభివృద్ధిచెందిన ప్రాణుల్లో సంకల్ప బలమూ బుద్ధి బలమూ ఒకటే. అన్ని నైతిక విలువలూ సంకల్పమూ మరియు బుద్ధి విశేషాలనుంచే జనిస్తాయి. ప్రతివారూ ఏదో ఒక విషయంలో మంచి, మధ్యస్థ, చెడ్డవారుగా జన్మిస్తారు. అయితే విద్య, క్రమశిక్షణ, సంకల్పాలతో మేధస్సు ఎలా మెరుగుపడుతుందో, నైతికతా అలానే మెరుగుపడుతుంది. న్యాయబద్ధత, దాతృత్వం, సౌందర్యమూ మంచికి సమానార్ధకాలైతే స్వార్ధం, లోభం, వికారం అనేవి చెడుకి.
మానసిక, శారీరక ఆరోగ్యాల సమతౌల్యం అభిలషించేవారు తమకు తాము కొన్ని నియమాలను విధించుకుని అవి తప్పకుండా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఆ నియమాల ఉల్లంఘన చెయ్యబోమని విధేయులమై నడుచుకుంటామనే సంకల్పాన్ని కలిగియుండాలి. బుద్ధికుశలత, సంకల్పబలం, నీతివర్తనం ఇవి మూటికీ అతి దగ్గరి సంబంధం ఉంది. అయితే బుద్ధికుశలతా నీతివర్తనాలలో రెండోదే ముఖ్యం. నైతికత మాయమైన దేశంలో సమాజం శిధిలమై మట్టికొట్టుకుపోతుంది.
అయితే నీతివర్తనం అంత ప్రధానమని మనం అనుకుంటున్నట్టు లేదు. బుద్ధికుశలతను భావించినంత శ్రద్ధతోను నీతివర్తనాన్నీ భావించి అధ్యయనం చెయ్యాలి. అయితే ఇది ప్రయోగశాలల్లో జరిగేది కాదు. జనంలోకి పోవాలి. నైతికత కూడా ఒక శాస్త్రం, విజ్ఞానశాస్త్ర పరిధిలో అభ్యసించి ఆచరించాల్సిన ముఖ్యమైన శాస్త్రం. నీతి నియమ బద్ధుడైన ఒక సజ్జనుడు మనతో అతి మామూలుగా మాట్టాడినా, ఎవరూ చెప్పకుండానే అతని సంస్కారమూ సజ్జనత్వమూ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నైతిక సౌందర్యం సూర్యకాంతిలాగా కప్పిపుచ్చలేనంత ప్రకాశమానం. అది అనుభవమైనవారికది ఎప్పటికీ మరపురాదు. ప్రకృతి సౌందర్యం కన్న శోభాయమానమైనది. తనను కలిగినవారికి అది అద్భుతమైన దివ్యశక్తులను ప్రసాదిస్తుంది. అది మేధోశక్తిని పెంచుతుంది. జనుల్లో శాంతి సామరస్యాలను నెలకొల్పుతుంది. విజ్ఞానశాస్త్రం, కళలు, మతాచారాలకన్నా నైతిక సౌందర్యమే నాగరకతకు మూలాధారం.
ఆటవికుడైనా ఆధునికుడైనా మనిషి సౌందర్యారాధకుడు. చేసే పని ఏదైనా దానికి కొంత కళాత్మకతను జోడిస్తేనే అతనికి తృప్తి. జిలేబీలు చుట్టడమైనా, వాకిలి గ్రిల్లుకు వంకీలు అతకడమైనా, చెప్పులు కుట్టడమైనా యంత్రాన్ని బాగుచెయ్యడమైనా తనకు తోచిన విధంగా దానికి నగిషీలద్ది శోభాయమానం చేసేందుకు ఇష్టపడతాడు. విఖ్యాత కళాకారులైన శిల్పులు చిత్రకారులు కవులకు తమ కళాసృష్టిలో కలిగిన సంతృప్తినే తను చేసే అతి సామాన్యమైనపనిలోనూ అతను పొందుతాడు.
అయితే ఆధునిక యాంత్రీకరణ నేపధ్యంలో ప్రతి కార్మికుడూ ఒక వస్తువును పూర్తిగా సృజనను జోడించి కళాత్మకంగా తయారు చేసే స్వేఛ్ఛ లేక తనకప్పజెప్పిన దానిలోని ఒక ముక్కను మాత్రం చేసి తన కళా పిపాసను లోలోపల అణచుకుంటున్నాడు. ఈ విధంగా మనసును అణచుకుని మరలాగా నడవమని మనిషికి నేర్పిన ఆధునిక పారిశ్రామిక సమాజం ఒక పెద్ద తప్పునే చేస్తోంది. ఎందుకంటే ఇది సహజమేనని ఆధునిక జీవన శైలిలోని గజిబిజికి అలవాటు పడ్డట్టే కర్మాగారాల్లో యంత్రాలమధ్య యంత్రాల్లా నెట్టుకొచ్చేందుకు అలవాటుపడి ఎవరూ దీనిని వ్యతిరేకించటం లేదు.
ఈ పరిస్థితుల్లోనూ ఏ లేశమాత్రమో కళాపిపాసను నిలుపుకుని చేస్తున్న గొడ్డుచాకిరీలోను ఎంతో కొంత సృజనను జోడించి తృప్తిపడేవారు కేవలం తిండి సంపాదించుకుందుకే పనిచేసే మరమనుషుల కన్న కాస్త ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు.
ఆధునిక జీవనశైలిలో ఆధ్యాత్మిక, పారమార్ధిక దృష్టికోణం మసకబారిపోయింది. చాలా మందికి చర్చి అంటే చనిపోయినవారి జ్ఞాపకాలను భద్రపరచే మ్యూజియం అయిపోయింది. మనముండే ప్రపంచాన్ని చల్లగా చూడమని కనబడని ఓ దివ్యశక్తిని నిజాయితీతో చేతులు జోడించి వేడుకునేది మత ధర్మం. అంతశ్శక్తిని, అవర్ణ్యతేజాన్ని అలౌకిక ప్రశాంతతను ప్రసాదించే దాని అవసరం మనిషికి ఎంతో వుంది.
తన దేహాన్ని నిర్మించిన పదార్ధాలతో పోలిస్తే మనిషి ఎక్కువకాలం బతుకుతాడు. మనిషి దేహం క్షణక్షణానికీ మారిపోతూ విఛ్ఛిన్నమైపోతున్న అతి మృదువైన కణపదార్ధంతో నిర్మితమై ఉంటుంది. అయినా తనను ఉక్కుతో నిర్మించినప్పటికన్న ఎక్కువ మన్నిక కలిగి ఉంటాడు. పైగా మరి ఏ ఇతర జాతి జంతువులూ సర్దుకోలేని విధంగా అన్ని భౌతిక, ఆర్ధిక, సామాజిక ఒడుదుడుకులకు తట్టుకుంటాడు, సర్దుకుంటాడు. ఈ మన్నికకి కారణం జీవకణజాలపు పనితీరు, మన మానసిక సమతౌల్యము. అరుగూ తరుగూ కాక మార్పూ సర్దుబాటు మన దేహ స్వభావం.
బయటి పరిస్థితులలోని మార్పులకనుగుణంగా తామూ మారుతూ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొందుకు సిద్ధంగా తమను తాము మెరుగుపర్చుకుంటూ ఉంటాయి మన అవయవాలు, ఇంద్రియాలు. థైరాయిడ్ గ్రంధిలో సగభాగాన్ని తొలగిస్తే మిగతా సగమూ తొలగించినదానికన్నా ఎక్కువే పెరుగనారంభిస్తుంది. అదే విధంగా మూత్రపిండం. పైగా రెండోది మొదటి దాని పని కూడా చేసి మూత్ర విసర్జనకు ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకుంటుంది. ఈ మాదిరే ఏదైనా గ్రంధి తగినంత జీవద్రవాలను విడుదల చెయ్యలేకుంటే మిగతా గ్రంధులు అందుకు నడుం కట్టి ఆ లోటు భర్తీ చేస్తాయి. మూత్ర పిండాలు చెడి సరిగా పనిచెయ్యలేనప్పుడు ధమనుల ఒత్తిడి పెరిగి అధిక పరిమాణంలో రక్తాన్ని వడపోతకోసం అందిస్తుంది.
దేహంలోని ప్రతి విభాగమూ తనదే కాక ఇతర విభాగాల విధులనూ ఎరిగి ఉంటుంది. అంతే కాక ఇప్పటి విభాగం భవిష్యత్తులో ఏకారణంచేతనైనా విఫలమైతే వ్యవస్థ కుప్పకూలకుండా సమర్ధవంతంగా ఎలా నిర్వహించాలో కూడా వాటికి తెలుసు. అందుకని దేహానికి తన వర్తమానమూ తెలుసు, భవితవ్యమూ తెలుసు. గర్భధారణ పూర్తయి నెలలు నిడుతాయనే సమయానికి జననావయవాల్లో స్రావాలు అధికమవుతాయి. త్వరలో బయటపడబోయే బిడ్డ మార్గాన్ని సుగమం చేసేందుకు. అదే సమయంలో క్షీర గ్రంధుల్లోని పాల ఉత్పత్తీ పుంజుకుంటుంది బిడ్డ పోషణకి ఏ లోపమూ లేకుండా. త్వరలో జరగబోయే సంబరానికి నిశ్శబ్దంగా జరిరిపోయే ముందస్తు ఏర్పాట్లు ఇవన్నీ. గర్భంలోని పిండం ఎదుగుదలకనుగుణంగా జీవకణాలూ అవయవాలూ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేస్తాయి. ఉదాహరణకి కంటిలోని వివిధ భాగాలు భవిష్యత్తు అవసరాలకనుగుణంగా ముందు నించే రూపుదిద్దుకుంటాయి. మెదడు తనలో ఒకభాగాన్ని దృశ్యనాడి, రెటీనాగా బయటికి పంపుతుంది. రెటీనాను ఆవరించుకున్న చర్మం పారదర్శకమైపోయి కార్నియానూ స్ఫటిక కటకాన్నీ రూపొందించి ఇవన్నిటి అమరికతో మనం కన్ను అని వ్యవహరించే ఒక మహాద్భుత దృశ్య యంత్రాన్ని నిర్మిస్తాయి. రెటీనా ఈ విధంగా చర్మాన్ని కటకంగా తయారు చేసి బాహ్యవస్తువుల ప్రతిబింబాలను కంటినాడుల మీద ముద్రించే ప్రక్రియ ఏమిటో; కటకానికి ముందున్న ఐరిస్ ఎదటి వస్తువు తీక్షణతని బట్టి విస్తార సంకోచాలు అయే సామర్ధ్యమున్న డయాఫ్రంగా ఎలా రూపాంతరం చెందుతుందో. ఇంకా కంటికీ వస్తువుకూ ఉన్న దూరాన్ని బట్టి కటకం తన స్వరూపాన్ని ఏవిధంగా సర్దుబాటు చేసుకుంటుందో.. ఈ వివిధ ప్రక్రియల అన్యోన్యసంబంధం వివరించవీల్లేనిది.
దెబ్బ తగిలి రక్త స్రావం జరుగుతున్నప్పుడు వివిధ అవయవాల మధ్య సహకార వ్యవస్థ మనకి తెలుస్తుంది. ముందుగా రక్తం కారే చోట నాళికలన్నీ సంకోచిస్తాయి. కారి వృధా అయిపోయిన రక్త పరిమాణం భర్తీ అయేలా రక్తోత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా రక్త ప్రసారం మునపటి ఒత్తిడిని తిరిగి పొందుతుంది. జీవకణ స్రావాలూ దీనికి సమంగా ఉత్తెజంతో విడుదల అయి ప్రసారంలో కలుస్తాయి. బాధితుడికి విపరీతమైన దాహం వేస్తుంది. జీర్ణకోశంలోకి ప్రవహించే పోషకద్రవాలనుంచి పోగొట్టుకున్నంత పరిమాణాన్ని రక్తం గ్రహించి సాధారణ స్థితిని సాధిస్తుంది. వివిధ అవయవయాల్లోని మిగులు రక్తకణాలు గాయంద్వారా కలిగిన లోటును భర్తీ చేస్తాయి. ఇలా కర్చైపోయిన వాటిని ఎముకల్లోని మూలుగ మళ్ళీ తయారుచేసి ఎక్కడి నిల్వలను అక్కడ మళ్ళీ ఉంచుతాయి. తద్వారా గాయం వల్ల నష్టపోయిన రక్తమూ దాని అనుబంధ వ్యవస్థలూ ఓ పద్ధతి ప్రకారం అదుపులోకి వస్తాయి. ఇలా అన్ని అవయవాలూ ఒక గాయం చేసిన నష్టాన్ని పూడ్చేందుకు నడుం కట్టి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తాయి.
చర్మానికి గానీ ఎముకలకి గానీ కండరాలకి గానీ రక్తనాళాలకి గానీ గాయం తగిలితే ఇంతకు ముందు లాగే అవసరమైన అన్ని అవయవాలనూ కూడబలుకున్నట్టు ఒకదానితో ఒకటి సహరించుకుని నష్టం పెద్దది కాకుండా చకచకా పనిచేసుకుపోతాయి.
ఒక రక్తనాళం తెగిపోతుంది. రక్తం ధారగా కారిపోతుంటుంది. తగ్గిపోయిన రక్తానికి అనుగుణంగా రక్తప్రసారపు ఒత్తిడి తగ్గిపోతుంది. బాధితునికి స్పృహకోల్పోతున్నట్టనిపిస్తుంది. రక్తం కారడం తగ్గనారంభిస్తుంది. గాయం తగిలినచోట ఫైబ్రిన్ తయారవుతుంది. అది రక్తస్రావాన్ని అరికడుతుంది. తరవాతి రోజుల్లో లూకోసైట్లూ జీవకణాలూ కలిసి ఫైబ్రిన్ ఉన్న భాగం మీద దాడిచేసి తెగిన ప్రాంతంలో కొత్త చర్మాన్ని తయారుచేస్తాయి.
ఏ అవయవమైనా విరిగిపోయినప్పుడు అక్కడ విరిగిపోయిన ఎముకల సూది మొనలు కండరాలనీ రక్తనాళాలనీ తెగ్గొడతాయి. వాటి చుట్టు ఫైబ్రిన్ పేరుకోవడం ఆరంభిస్తుంది. రక్త ప్రసారం పుంజుకుని మామూలు స్థికి చేరుకుంటుంది. విరిగిన ప్రాంతం వాచిపోతుంది. తెగిపోయి నష్టపోయిన భాగాన్ని భర్తి చేసేందుకు అవసరమైన పోషక జీవకణ వనరుల సమీకరణం మొదలవుతుంది. అన్ని వ్యవస్థలూ మరమ్మత్తు ప్రక్రియలో నిమగ్నమవుతాయి. జీవకణాలు అవసరమైన రూపం ధరించేందుకు తయారుగా ఉంటాయి. ఉదాహరణకి గాయం ప్రాంతంలోని కొంత మాంసం కార్టిలేజ్ అంటే మృదులాస్థి గా రూపొందుతుంది. ఈ కార్టిలేజ్ క్రమక్రమంగా గట్టిపడి ఎముకగా మారుతుంది. ఈ పరివర్తన ప్రక్రియలో ఎన్నో రసాయనిక, ప్రసార, నిర్మాణ వ్యవస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తాయి. ఈ విధంగా గాయమైన చోట పైకి పోయే రక్తం ఈ విధమైన పునర్నిమాణ కార్యాచరణని కలిగిస్తుంది - ప్రతి ప్రక్రియా దాని ముందటి ప్రక్రియను అనుసరిస్తూ.
ఈ స్వస్థత ప్రక్రియల జ్ఞానంతో ఆధునిక చికిత్సావిధానం అభివృద్ధి అయింది. లోపలి సర్దుబాట్లు అవగాహన లేకుంటే సర్జన్లు గాయాలను నయం చేయగలిగేవారు కారు, వారి చికిత్సలూ శరీరమ్మీద ఏ ప్రభావము చూపించేవి కావు. తమ ప్రమేయం లేకున్నా లోపల ఎదో విధంగా జరిగే సర్దుబాట్లతోనే తృప్తిపడాల్సి వచ్చేది.
అయితే కొన్ని వ్యాధికారకాలు లోపలి మార్పులకి అనుగుణంగా సర్దుబాటు కావు. వాటిలో ఒకటి, సిఫిలిస్. దాన్నలా ఒదిలేస్తే కొన్నాళ్ళకి తన బాధితుడుని విడిచిపెట్టేది కాదు. అది చర్మంలోను, రక్తనాళాల్లోను, ఎముకల్లోను తిష్టవేసుకునుంటుంది. జీవకణజాలమూ అనుబంధ సహజ ప్రక్రియలూ దాన్ని తరిమికొట్టలేవు. దీర్ఘకాల చికిత్సతోనే అది ఒదిలిపోయేది. అలాగే లోని అవయవ యంత్రాంగమూ సహజ ప్రక్రియలూ క్యాన్సర్ మీద కూడా ఏ ప్రభావమూ కలిగించలేవు. ట్యూమర్లు అనబడే కణుతులు మిగతా జీవకణాల్లాగే ఉండి అవి కలిగినప్పుడు జీవ ప్రక్రియకి ఏమీ తెలియదు. అవి పెరుగుతున్నప్పుడూ మనమధ్య ఎవరీ కొత్తవారు అన్న అనుమానం వాటికి రాదు. బాగా పెరిగి ఏ రక్తనాళాన్నో నరాన్నో సంకోచింపచెయ్యడమో జీవకణాలనో ఒక ఉపయుక్తమైన అవయవాన్నో నాశనం చేసినప్పుడో వాటి లక్షణాలు బయటపడాతాయి.
ఒకప్పుడు లోపలి సర్దుబాటు స్వస్థత ప్రక్రియలు సవ్యంగా ఉండి ఢక్కా మొక్కీలు తినే సామర్ధ్యం ఉన్నవారే బతికి బట్టకట్టేవారు. కాని ఆధునిక నాగరిక సమాజపు పరిశుభ్ర వాతావరణం, ఆరోగ్యకర జీవన విధానం, హాస్పిటళ్ళు, డాక్టర్లు, నర్సులు, మందుల సహాయంతో అతి బలహీనులుకూడా ధీమాగా బతగ్గలుగుతున్నారు. ఈ దుర్బలులు, వారి వారసులతో ఒక బలహీనమైన జాతి వృద్ధినందుతోంది. మనం ఈ విధంగా కృత్రిమ ఆరోగ్య విధానాలకి స్వస్తి చెప్పి ప్రకృతితో సామరస్యం కలిగిన ఆరోగ్య విధానాన్నే అనుసరించడం మంచిది.
దేహంలోని సహజంగా సజావుగా జరిగే జీవ ప్రక్రియలు అన్ని భాగాల పనితీరునూ సరిగా జరిగే విధంగా ప్రేరేపిస్తాయని నా అభిప్రాయం. మనిషి అత్యున్నతమైన అభివృద్ధి సాధించాలంటే అతను ఎండలో ఎండాలి. వానలో తడియాలి. చలికి వణకాలి. సుష్టుగా మెక్కాలి; ఆకలితో నకనకలాడాలి. కూడూ గూడూ తన రెక్కల కష్టంతో సంపాదించుకోవాలి. శరీరానికి అలసట, విశ్రాంతి, కష్టం, సుఖం, ప్రేమ, ద్వేషం వంటి ద్వంద్వాలను మనస్ఫూర్తిగా అనుభవించే శిక్షణ ఇవ్వాలి. విపరీతంగా అలిసిపోవాలి; విలాసంగా విశ్రమించాలి. ఎప్పుడూ శ్రమతో కూడిన పోటీ పడుతూనే ఉండాలి. సాటివారితోనైనా తనతోనైనా. అటువంటి జీవితంకోసమే అతను సృష్టించబడ్డాడు. లోపల పడే దేన్నైనా అరగగొట్టేందుకే జీర్ణాశయం సృష్టించబడ్డట్టు.
పరిస్థితులకనుగుణంగా సర్దుబాటు చేసుకుపోయే లోపలి వ్యవస్థ ఎంత చురుగ్గా ఉంటే మనిషి అంత ఉత్సాహవంతుడై ఉంటాడు. ఆధునిక మానవుడి చర్మానికి ప్రచండమైన గాలి దెబ్బ ఏమిటో తెలీదు. అది తనని తాను మంచు నించి, వాన నించి, ఎండ నించి కాపాడుకునే ప్రయత్నమెప్పుడూ చెయ్యలేదు. అదే పూర్వకాలపు మనిషికైతే రక్తమూ ఇతర దేహరసాల ప్రసార వ్యవస్థకి బయటి ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గులకి తగినట్టు స్పందించే పని చేతినిండా వుండేది. ఇప్పుడు అవన్నీ పని మానేసి విశ్రాంతి తీసుకుంటున్నాయి. గడ్డు పరిస్థితులు, బాధ్యతల బరువులతో మనిషి ఆత్మ బలం పెరిగి అతను నీతిమంతుడూ సాహసవంతుడుగా ఎదుగుతాడు. బడికెళ్ళే పిల్లలకి కూడా ఎక్కడకందిపోతారోనని అవసరాన్ని మించిన సదుపాయాలు అమర్చిపెట్టకుండా సుఖపడాలంటే కష్టపడాల్సిందేనని తెలియచెప్పాలి. క్రమశిక్షణ అలవాటైన పిల్లల నాడీ వ్యవస్త్య, ఎండోక్రిన్ గ్రంధులు, మెదడు చురుగ్గా పనిచేస్తాయి. దీనివల్ల దేహంలోని అన్ని ఇంద్రియాల మధ్య సహకారమూ పెంపొంది ఆ పిల్లలు ఎటువంటి సవాళ్ళనైనా ఎదురుకునే శక్తి సామర్ధ్యఆలతో పెరుగుతారు.
తిండి, సెక్సు, మద్యపానం, బద్ధకం, నిద్ర వంటి కోరికలు తీర్చుకునే తహతహ మనిషికెక్కువ ఉంటుంది. అయితే అవి నిశ్శేషంగా తీరిపోతే అతను పతనమైనట్టే. ఈ ఇంద్రియ భోగాలన్నిటినీ జయించాలి; వాటిపై తన సంకల్పానిది పైచెయ్యి కావాలి; అవి కావాలనిపించినప్పుడు తను ఒద్దనాలి.
పేదరికం మనిషినీ జాతినీ నిర్వీర్యపరుస్తుంది; మిక్కుటమైన సంపద కూడా అంతే. రాజుకైనా పేదకైనా ఖాళీ సమయం ఎక్కువైతే పతనం మొదలైనట్టే. కూర్చుని ఆనందించే సినిమాలు, రేడియో, క్రీడలు వంటివేవీ దేహానికీ మెదడుకూ చురుకునిచ్చేవి కావు.
మనిషి అభివృద్ధికి రెండు పరిస్థితులు ముఖ్యం. ఒకటి ఏకాంతం, క్రమశిక్షణ. ఓ సినిమా చూడటం, ఓ టీవీ కార్యక్రమం చూడటం, కొన్ని రకాల పుస్తకాలూ వార్తలూ చదవంటి వంటి కోరికలు కలిగినప్పుడు వాటినించి మనసు తిప్పుకోవాలి. ముఖ్యంగా నడివయస్సులోను వృద్ధాప్యంలోను మానసిక, నైతిక నియంత్రణ, మందితో పాటు పరుగులు తీసే స్వభావమూ వదులుకోవడం ఆవశ్యకం. శరీరమూ మనసూ శ్రమిస్తున్నంతవరకు ముసలితనం దరిజేరదు. దిగులులోనూ వ్యాకులం లోనూ ఆల్కహాలూ ఇతర మత్తు పదార్ధాలకన్న పని ఎక్కువ ప్రభావవంతం. నిష్క్రియగా కూర్చోవడం అన్ని రుగ్మతలకీ మూలం. నిరంతరమూ చేసిన దేహ బుద్ధి పరిశ్రమలే మనిషిని తీర్చిదిద్దుతాయి. పనే అన్ని దేహ మానసిక వ్యవస్థల పనితీరునీ సక్రమంగా నడిపేది.
No comments:
Post a Comment