అనగనగా ఒక రాజు తన మంత్రిమండలిని సమావేశపరిచి, సచివోత్తములారా. మనమెవరం ఉన్నన్ని నాళ్ళు ఉండం. తోచిన పనులేవో చేస్తున్నాం. కాని శాశ్వతంగా నిలిచేదేదో చెయ్యలేకపోతున్నామే అనిపిస్తోంది. మీకో పని అప్పజెప్తాను. మీ మేధాశక్తిని రంగరించి అందరికీ పనికొచ్చే లోకజ్ఞాన సారాన్ని గ్రంథస్తం చేసుకు రండి. భావితరాలు అది చదువుకు బాగుపడతారు. వెళ్ళి రండి అన్నాడు.
చిత్తం అని సచివులు వెళ్ళి చాలా నెలలు పరిశ్రమించి ఒకోటీ వెయ్యి పేజీలున్న పన్నెండు సంపుటాల గ్రంథాన్ని బళ్ళమీద మోసుకొచ్చి రాజుకి చూపారు.
రాజు గారది చూచి, చూడ్డానికి బానే ఉన్నా మన పిల్లలకి ఇది చదివే తీరికెక్కడుంటుందయ్యా? ఇంకా సారం తీసి దీన్ని చిన్నది చేసుకు రండి అని పంపేశాడు.
మంత్రిమండలి మళ్ళీ మేధో మధనం చేసి పన్నెండు సంపుటాలని ఒక సంపుటానికి కుదించింది. రాజుగారు అబ్బే ఇదీ చేటభారతమేనయ్యా అన్నాడు.
ఇలా ఇంకో రెండుసార్లు జరిగింది కాని రాజు గారి ఒప్పుదలకి తూగేంత చిన్నది అవలేదు గ్రంథం.
ఆఖరికి మంత్రులు యావన్మందీ మరింత సమయం తీసుకుని ఏడాదికో ఏణ్ణర్ధానికో నవ్వుమొహాలతో వచ్చి రాజుగారిని కలిసేరు.
నవ్వులు సరేనయ్యా నా గ్రంథం ఏది? అన్నాడు రాజు.
ప్రభూ బళ్ళకొద్దీ ఉన్న లోకజ్ఞాన సారాన్ని వడపోసి రంగరించి పుటం పెట్టి ఒక రసగుళిక లాటి వాక్యం తయారు చేసేం. అది తెలిస్తే చాలు లోకజ్ఞానం వంటపట్టినట్టే. ఆ వాక్యం, "ఉచిత భోజనం ఉచితం కాదు" అని. అన్నారు.
రాజుగారు ఒక్క తృటికాలం ఆలోచించి మొహం ఇంత చేసుకుని అద్ది... నా మంత్రులనిపించేరు. పరమ సత్యాన్ని ప్రకటించారు. ఎదీ ఆ వాక్యం "ఉచిత భోజనం ఉచితం కాదు" వహవా వహవా అని పొంగిపోయేడు.
సచివులు చెప్పింది సరైనదే. అది అర్ధం చేసుకున్నవారికి సమస్యలుండవు. ఏ శ్రమా లేకుండా సంపాదిద్దామనుకోవడం ఎండమావి వెంట పరుగులాటిది. ఏదీ ఉత్తినే రాదని ఓ పక్క ఒప్పుకుంటూనే, పేకాడి రేసులాడి పందేలు కాసి జాక్పాటూ కుంభస్థలాలూ కొట్టేద్దామనుకునేవారు చాలా మందే ఉన్నారు. అదేంటి నానగారు చెప్పేదొకటీ చేసేదొకటిగా ఉందే అని ఆశ్చర్యపోతారు పిల్లలు.
తగు శ్రమ లేక ఏదీ వచ్చి చేరదు. వచ్చినా నిలవదు. విజయవంతమైన కుటుంబానికి శ్రమ తండ్రి, క్రమశిక్షణ తల్లి. ఈ తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటే మిగతా కుటుంబసభ్యులతో సామరస్యం ఉంటుంది.
శ్రమ వ్యాపారాలకు పునాది; సంపదలకు మూలం; జ్ఞానప్రదాత. పిల్లలకి తమ తల్లిదండ్రుల వారసత్వం కన్ని అధిక సంపదను శ్రమ కట్టబెడుతుంది. రసహీనమైన జీవితాన్ని షడ్రసోపేతం చేసేది; అయితే తన ఫలాలను పొందగోరేవారు తనను మిక్కుటంగా ప్రేమించాలని అది కోరుకుంటుంది. తనను ప్రేమించేవారి జీవితాలకు అది మాధుర్యాన్నీ అర్ధాన్నీ పరమార్ధాన్ని ప్రసాదిస్తుంది.
****
ఒక గొప్ప వక్త మనకి జీవిత పరమార్ధమూ లక్ష్యాలూ ఒక ఆశావాద దృక్పథం సంకల్పమూ ఇటువంటి ఉన్నతమైన ఆదర్శాలను హత్తుకునేలా బోధిస్తాడు. సుఖంగా కూర్చుని వినేందుకు ఎంతో ఆసక్తికరంగా ఉన్న అతడు చెప్పినది ఆచరణలో ఆవిరైపోతుంది. మనం పనిచెయ్యనప్పుడు ప్రపంచంలోని ఎంత గొప్ప తత్వమూ మనకి పనిచెయ్యదు. విద్యాభ్యాసం ఎంత విశాల భూభాగం మీదనైనా చక్కర్లు కొట్టేందుకే కాని ఒక్క అంగుళాన్నీ సాగుచేసేందుకు మాత్రం పనికిరాదు అని ఒక జ్ఞాని అంటాడు.
దురదృష్టవశాత్తు పనికోసం తపించినవారు ఎందరో అది దొరికి జీతపురాళ్ళు చేతిలో పడడం మొదలుకాగానే పని ఆపేస్తారు. శ్రద్ధగా పనిచేసుకుంటున్న ఒకణ్ణి ఎవరో అడిగేరు ఇంత దీక్షగా పనిచేస్తున్నావు ఎన్నేళ్ళనించి చేస్తున్నావు నాయనా అంటే "వాళ్ళు నన్ను పీకెస్తామని బెదిరించినప్పణ్ణించి సార్ అన్నాట్ట. ఒక యజమనిని ఇంకెవరో అడిగేరు మీ సంస్థలో ఎంతమంది పనిచేస్తారండీ అని. ఆ.. సగం మందో మూడో వంతో నండి. అని నిట్టూర్చాడతను.
విజయానికి మనం చెల్లిస్తూ కూడా ఆనందించే ధర శ్రమ. ఉన్న చొక్కా ఊడిపోకుండా ఉంచుకునే ఉపాయం, దాని చేతులు పైకి మడిచి పనిచేయటమే. ఓడించినవాడిదే కద గెలుపు. ఏమిటి ఓడించడం? చెమట ఓడించడం.
పనిని ఉల్లాసంగా చెయ్యాలి. విల్ రోజర్స్ మాటల్లో, విజయం సాధించాలంటే, చేసే పనిని తెలిసిఉండాలి; ప్రేమించాలి. విశ్వసించాలి.
పని తక్కువని ఆనందించే వారిని చూస్తే బాధ కలుగుతుంది. పనెలా ఉందయ్యా అంటే, ఇవాళ సోమవారం కదా, పెద్ద ఉండదు లెండి అనో, శుక్రవారం కదా ఈ వారానికి చాలు అనో వింటుంటాం.
ఆఫీసుల్లో గోడగడియారాలు పని ఎప్పుడు ఆపెయ్యాలో తెలిపేందుకే అంటే అతిశయోక్తికాదు. లాస్ వేగాస్ లో ఒక కేసినో ఉంది. అది రెండు ఫుట్బాల్ గ్రవుండ్లంత విశాలమైనది. మసిపూసి మారేడుకాయచేసి డబ్బులు లాగేసేందుకు ఎన్నో మెషిన్లు. పగలూ రాత్రీ అని లేకుండా ఆడుతూనే ఉంటారు వందలాదిమంది. ఇంత పెద్ద కేసినోలోను, మిగతా జూదగృహాల్లోలాగే టైం ఎంతైందని చూసుకుందుకు ఒక్క గడియారమూ కనబడదు. జూదగాడి ఆటకి జేబే గడియారం. ఉన్నదంతా తిరుక్షవరమైపోయినప్పుడే లేచేది. అంత దీక్షా పట్టుదలా పనిలో చూపితే ఎంతబాగుణ్ణు.
పని ఒక స్వభావం. జీవితంలో పైకొచ్చిన వారు కొందరు మాట్ట్డుతూ ఎన్నో కష్టనష్టాలకోర్చి పనిచేసి ఇంతవారమయేమంటారు. కాని అది నిజం కాదు. విజయం మెట్లెక్కేవారికి కష్టమూ నష్టమూ ఉండవు. అందబోయే విజయపు నిచ్చెన మీద మెట్టు మెట్టుకీ ఉల్లాసమే. అలా లేకుంటే తరవాతి మెట్టు ఎక్కలేము. పనంటే వ్యామోహం, ప్రేమ, పనిలో తమనే మరిచిపోయేంత నిమగ్నత ఉన్నవారినే విజయం వరించేది. వారికి పనున్నట్టు కాదు. పనికోసమే వారున్నట్టు. ఆ మనస్తత్వమే వెట్టీని వినోదంగా మారుస్తుంది. చేసే పనేదైనా చేసేవారి మనస్తత్వమే దాని నాణ్యతనీ ఫలితాన్నీ నిర్ణయించేది.
పియరీ అగస్ట్ రెనాయర్ ప్రఖ్యాత ఫ్రెంచి పెయింటరు. కీళ్ళవాతం వచ్చి చేతులు వంకర్లు తిరిగిపోయి బ్రష్షు పట్టుకొంటే మహా నరకవేదన కలిగేది. అతని దీనావస్థలో ధైర్యం నింపేందుకని ఇంకో పెయింటర్ మిత్రుడు రోజూ వచ్చిపోతుండేవాడు. పడిపోతున్న బ్రష్షును వేళ్ళ మధ్య నిలిపేందుకు నరక యాతన పడుతూనే రెనాయర్ పెయింటింగు వేసేవాడు. ఇంత అవస్థ పడుతూ ఎందుకయ్యా వెయ్యడం అనేవాడు మిత్రుడు. సలుపు క్షణికమయ్యా సౌందర్యం శాశ్వతం కదా అనేవాడు రెనాయర్ పని నించి దృష్టి మరల్చకుండా.
ఆండర్సన్ గారని.. ఒక పెద్ద వ్యాపారి. అతని షాపుకి ఎదర ఇంకో దుకాణంలో పనిచేసే చార్లెస్ అనే కుర్రాడు ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు. వాడికి అలుపన్నది లేదన్నట్టు పరుగులు పెడుతూనే ఉండేవాడు. ఆండర్సన్‌గారితో రోజూ బాతాఖానీ వేసే అతని స్నేహితుని కొడుకు అడుగుతాడు. అంకుల్, ఈ చార్లెస్‌కి ఇల్లూ వాకిలీ నిద్రా నీరసమూ ఉండవా క్షణం తీరికలేకుండా పనిలో పరుగులు పెడుతూనే ఉంటాడు? అని. ఆండర్సన్ గారు అంటాడు. వాడు చాన్నాళ్ళనించి జీతం పెరుగుతుందనే ఆశతో పనిచేస్తున్నాడు బాబూ. చూస్తాను చూస్తాను వాడి యజమాని ఇచ్చేడా సరి. లేదా రెట్టింపు జీతంతో నేను పనిలోకి తీసుకుంటాను అని. అంటే చేసేచోట గుర్తింపు రానంత మాత్రాన శ్రమ వృధా అయినట్టు కాదు. దాని ఫలాలు ఇంకెక్కడో మనకోసం ఎదురుచూస్తుంటాయి. సరైన తరుణంలో సమకూరుతాయి.
ఉచిత భోజనాలు ఉచితం కాదు
ఒక పల్లెకి అడవి పందుల తలనొప్పి వచ్చి పట్టుకుంది. వాటినెలాగైన పట్టుకుని మట్టుపెట్టాలని ఊరంతా కలిస్ వ్యూహాలు పన్ని మెరికల్లాటి వాటగాళ్ళనూ నియమించాయి కాని ఎవరూ ఏమీ చెయ్యలేకపోయేరు. ఉండుండి అవి ఊరిమీదా పంటల మీదా మెరుపుదాడి చేసి నష్టపరచి అడవిలోకి పారిపోయేవి.
ఇలా ఉండగా గాడిదనొకదాన్ని లాక్కుంటూ ఒక ముసలాయన ఆ వూరికొస్తాడు. ఏమిటి పెద్దాయనా ఏం కావాలని ఊరివారడిగితే, మీ పని చేసిపెడతాను తరవాత తోచినదివ్వండి అంటాడు. ఏమిటి నువ్వు చేసే పని అంటే, మీ వూరికి అడవిపందుల బెడద లేకుండా చేస్తానంటాడు.
అంతా నవ్వుకుంటారు. సాయుధులూ సమర్ధులూ అయిన తమ వేటగాళ్ళు చెయ్యలేనిది ఈ ముసలాడా చేసేది అనుకుని వెటకారం చేసి పొమ్మంటరు.
అయితే అలాగే అని వృద్ధుడు తనదారిన తాను పోతాడు. మళ్ళీ రెండు నెల్లకి వచ్చి, అడవి పందులు ఊరవతల కంచెలో ఉన్నాయి పోయి తెచ్చుకోండి అంటాడు. పోయి చూస్తే నిజంగానే చుట్టూ బలలతో కట్టిన కంచే, దాని లోపల తప్పించుకుందామనుకుంటూ తప్పించుకోలేక ఘుర్ఘురుమనే వరాహాల మందా కనిపిస్తుంది.
అదేమిటి ఎలా చేసేవు అనడుగుతారు వాళ్ళు.
అదా. ఒక రోజు కొన్ని కుళ్ళిపోయిన పళ్ళూ దుంపలూ తీసికెళ్ళి ఒక చోట కుప్పగా పోసి కూర్చున్నాను. అటుగా పోతున్న పంది ఒకటి చూచి ఇక్కడెవరు చెప్మా భోజనం సిద్ధం చేసింది అని ఆశ్చర్యపడింది కాని దగ్గరికి రాలేదు. మర్నాడు మరి కొన్ని తీసికెళ్ళి పోసేను. ఇలా ఒక వారానికి అక్కడ బోలెడంత తిండి అక్కడ కూడింది. నేను తలొంచుకు పనిచేసుకుంటున్నందున ఒక పందొచ్చి కొంత తింది. నేనేమీ అనలేదు. మర్నాడు ఇంకోదానితో వచ్చి మరి కొంత తింది. నేను రోజు రోజుకీ కొంత కొంతా తిండి కుప్ప పోస్తున్నాను. కొన్నాళ్ళకి ఉచిత భోజనానికి అలవాటు పడ్డ మందంతా ధీమాగా ఒచ్చి తిని పోవడం అలవాటు చేసుకున్నాయి. ఒకరోజు పనిలో పనిగా ఒక మూల రాట కొట్టేను. అవి తలెత్తి చూసి మళ్ళీ తిండి సాగించేయి. ఇలా నేను ప్రతిరోజూ కొడుతున్న రాటలు ఒక్కొక్కటే కంచెగా అవుతూన్నా వాటికి అనుమానం రాలేదు. చివరికి మిగిలిన దారంతా కంచె పడి తిండి తినేందుకు నేనొదిలి పెట్టిన సన్నని దారిగుండానే లోపలికి రావలసొచ్చేది. ఆఖరి రోజున అన్ని పందులూ లోపల ఉన్నాయని చూచుకుని ఆఖరి బల్లని దారికడ్డంగా కొట్టేను. అవి బయటికొద్దామనుకుంటున్నాయి కాని రాలేవు. ఇక మీదే ఆలస్యం అని.
ఒక జంతువుని తిండికి మన మీద ఆధారపడేలా అలవాటు చేస్తే సహజంగా ఉండే దాని ఆహార సంపాదన కౌశలమూ మెళకువలూ నశించిపోతాయి. ఇదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది. ఒకరిని కుంటివారిగా చెయ్యాలనుకుంటే రెండు క్రచెస్ ఇచ్చి వాటితోనే నడవమనొచ్చు, లేదా కొన్ని నెల్ల పాటు ఏ పనీ చెయ్యనివ్వకుండా ముప్పొద్దులా మేపితే సరి. తన సహజ జ్ఞానాన్నీ సమర్ధతనూ శ్రమనూ మరిచిపోయి ఎందుకూ కొరగాకుండా పోతాడు.
ఒక్క కుదుపు
చాలామంది చెడినవారు, నాకెంతో ఒద్దు ఇప్పటికి అవసరమైనంతా ఇస్తే చాలు నేను మళ్ళీ బాగుపడిపోతాను అనడం వింటుంటాం. అవసరంలో ఉన్నవారికి సహాహం చెయ్యడం మంచిదే కాని అది వివేకంతో చెయ్యాలి. శ్రమ అలవాటు తప్పిపోయి ఎవరో తననుద్ధరిస్తారని ఎదురుచూచే ఇటువంటి వారికి గుమ్మరించే ఉద్దీపన ప్యాకేజీ చేతిలో పడగానే నెళ్ళాళ్ళు తిరక్కుండా వెచ్చబెట్టేసి మళ్ళీ యథా స్థితికి వచ్చేస్తాడు. ఎంతో తెలివైన కొందరు క్విజ్ షోలలో లక్ష డాలర్ల వరకూ సంపాదించుకుంటారు. అయితే ఒకరో ఇద్దరో తప్ప ఏ ఒక్క విజేతా అది గెలిచిన ఏడాది తరవాత అది గెలిచే ముందుకన్న ధనవంతునిగా అగపడలేదు. ఎలా వచ్చింది అలా పోయింది. లాట్రీల్లో కోట్లు కొట్టినవారు, రేసుల్లో జాక్పాట్లు కొట్టేవారిదీ ఇదే పరిస్థితి. అనాయాసంగా దక్కిన సంపద నిలవదని అన్ని సందర్భాల్లోనూ చెప్పేందుకు లేదు కాని అది నిలుపుకుందుకు చాలా శ్రమనే పడాలి. వ్యాపారంలోనో ఇంకేవిధంగానో పెట్టుబడి పెట్టి ఆర్ధిక క్రమశిక్షణ ఆచరించడం ద్వారానో.
ఉచితంగా వచ్చిపడే నడమంత్రపు సిరీ ఉచిత భోజనాలు దుర్వ్యసనాలకు చెడిపోయిన కుటుంబ సామాజిక సంబంధాలకూ కారణాలైన సందర్భాలూ కోకొల్లలు.
మనం పనివారం మనకిది పనివారం
బాగానే ఉన్న ఒకరి బాగోగులు ఇంకోరు చూచుకుంటే ఏమి జరుగుతుందో అమెరికన్ ఆదివాసులను చూస్తే అర్ధమవుతుంది. మీ విల్లంబులూ ఆయుధాలూ పక్కన పడేసి కిమ్మనకుండా కూచోండి, అమెరికా ప్రభుత్వమే అన్నీ చూచుకుంటుందని రాజకీయనాయకులు వారితో ఒప్పందాలు చేసుకున్నారు. సహజ వీరులైన ఆటవికులు తమ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి సరేనన్నరు. కష్టపడగలవారిపై కాసులు కురిపించి వారి పరువు తీసి భవిష్యత్తును అగమ్యగోచరం చేసేయి ప్రభుత్వాలు. ఇప్పటికీ వాషింగ్టన్ ప్రభుత్వం ఎన్నో ఉచితాలను మనందరికోసమూ ప్రకటిస్తూనే ఉంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ ఉచితాల మూల్యాన్ని చెల్లించుకోవలసిందే.
ఒకవైపు వారానికి ముప్ఫై గంటలు పని చేస్తే సరిపోతుందని ఇప్పుడున్న నలభై ఐదు గంటల వారం భారం గా ఉందని కొందరు కోరుతున్నారు, ప్రభుత్వమూ సరేననేలాగే ఉంది. పనెక్కువైన వారికన్న పనెగ్గొట్టినవారే జబ్బులబారిన పడే అవకాశమెక్కువ, మనిషిని పని అరగ్గొట్టదు, మెరుగుపెడుతుంది
బతికేందుకు పని
రచయిత తన సెమినార్లలో తరచూ అడిగే ప్రశ్న, మీరు కోరుకున్వాటి వాటి జాబితాలో అన్నిటికన్నా పైనున్నదేది అంటే, ఎక్కువగా వచ్చే సమాధానం, భద్రత. పనే కద ప్రతిష్టనూ ఆరోగ్యాన్నీ భద్రతనూ కలిగించేది అని నేనంటే, అది కాదు అని వారిచ్చిన ఉదాహరణలు వేరు. ఎందరో, మనమూ స్వీడన్‌లా ఉండాలన్నారు. ఏమిటాని చూసుకుంటే, స్వీడిష్ ప్రభుత్వం తన పౌరులు జన్మించిన నాటినించి జీవితాంతమూ చూసుకుంటానని భరోసా ఇస్తుంది. పనిచెయ్యనివానికి తినే హక్కులేదన్న బైబిలుపై ఓ పక్క విశ్వాసం ప్రకటిస్తూనే, ఎంతో మంది స్వీడ్లు తమ బతుకు భారం ప్రభుత్వానిదేనన్న ధీమాతో ఉన్నారు. ప్రభుత్వమూ అదే చేస్తోంది. పౌరుడు ఎప్పుడైనా డాక్టర్ వద్దకీ హాస్పిటల్ కీ వెళితే బిల్లులన్నీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. కొత్తగా బిడ్డ జన్మించినప్పుడు ప్రసూతి కర్చులు ప్రబుత్వమే భరించి, తల్లీ బిడ్డల జీవనానికి తగినంత ధనాన్ని ముట్టజెబుతుంది. ఒక పౌరుడి వేతనం అక్కడి కనీస జీవన ప్రమాణానికి దిగువన ఉంటే, ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేస్తుంది. దూరం నించి చూస్తే అదో భోలోక స్వర్గమని మనకి అనిపించవచ్చు. కానీ రాను రాను అక్కడ బాల్య నేరాలు, విడాకులు, మత్తు పదార్ధ వినియోగం, చర్చిపట్ల విముఖత వంటి అవలక్షణాలు పొడసూపుతున్నాయి. రిటైరైపోయిన వృద్ధుల పరిస్థితి ఇంకా దారుణం. వారిలో మానసిక కుంగుబాటూ ఆత్మహత్యలూ అధికమవుతున్నాయి.
పని చెయ్యగలిగేవారు ఎవరి భద్రతను వారు నిర్మించుకోవలసిందే కాని ఎవరో చేస్తారని ఎదురుచూస్తే భంగపాటు తప్పదు. భద్రతా బతుకుతెరువూ ఆర్జించుకోవలసినవి కాని అయాచితంగా వచ్చిపడేవి కావు.
చేతల్లోకి దిగడం, చెయ్యగలిగినంత చెయ్యడం
రెండో ప్రపంచ యుద్ధం తరవాత అమెరికన్లకి తీరిక వేళలు పెరిగాయి. ఆశ్చర్యకరంగా ఈ సమయంలోనే నేరాలు, మానసిక కుంగుబాట్లు, ఆత్మహత్యలూ వంటివి పెరిగేయి. ఒకప్పుడు కొన్ని నియమాలు అతిక్రమించకూడదని ఉండెది. ఇప్పుడు బతికేందుకు తగినంత సంపాదించుకుంటే ఎలా బతికినా పర్వాలేదనే విశృంఖలత హెచ్చుతోంది.
పనిపట్ల గౌరవ భావం తగ్గితే పని మొక్కుబడి అవుతుంది. దానివల్ల తయారయే వస్తువుల నాణ్యత తగ్గుతుంది. అందరికీ నాణ్యమైన వస్తువులే కావాలి కనక మనం చేసినవి ఎవరూ కొనేందుకు ఇష్టపడక దిగుమతులు పెరుగుతాయి. దేశీ ఉత్పత్తిదారులు కుదేలైపోతారు.
కనుక, ఏరోజు వేతనాన్ని ఆరోజుకి నిజాయితీతో పనిచేసి ఆర్జించాలనే మన పూర్వుల సూత్రాన్ని మనమూ ఆచరించాలి. నిజమే మన బతుకు తెరువుకి ఈ ప్రపంచం భరోసా ఇవ్వాల్సిందే కాని అందుకు మనం నిజాయితీగా శ్రమించాలి. వస్తు నాణ్యత పెరగాలంటే పని నాణ్యత పెరగాలి. తక్కువ చేసి ఎక్కువ లాగే మనస్తత్వం మార్చుకోవాలి. నాణ్యమైన పనిలో కలిగేది అలసట కాదు ఆనందం.
వార్నర్ అండ్ స్వాసీ ప్రకటన ఇలా ఉంటుంది: తెల్ల చొక్కాల కూటమి: అని. ఇది విలియం అంద్ మేరీ అనే కాలేజీ వారిది. వారి వార్షికోత్సవంలో కొందరు గవర్నర్లూ పారిశ్రామికవేత్తలూ వ్యాపార ప్రముఖులూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులూ తెల్ల చొక్కాలేసుకుని ఆవరణంతా కలయతిరుగుతూ ఏమి కావాలి ఏం కావాలని అడిగి సప్ప్లై చేస్తుంటారు. ఈ అపురూప దృశ్యం వెనకున్న కథ ఒకటే. వీరంతా కాలేజీ కర్చు అంతానో, కొంతమట్టుకో వెయిటర్లుగా పనిచేసి సంపాదించుకున్నారని. వారి శ్రమ వృధాకాలేదని ఇప్పటి వారి స్థితిని బట్టి తెలుస్తుంది. తెల్లచొక్కాల కూటమి ప్రతిష్టాత్మకమైన వార్షికోత్సవాల్లో ఒకటి.
భద్రత అంటే భయ సంశయాల నించీ అపాయ అనిశ్చితుల నించీ లభించే స్వేఛ్ఛ అని నిఘంటువులు అంటే, జెనెరల్ డగ్లస్ మెకార్థర్ టూకీగా ఈ నిర్వచనం ఇచ్చారు: పనిచెయ్యగలగడమే భద్రత అని. ఇది నిజమే. తమ బతుకుతెరువు తాము పనిచేసి సంపాదించుకునేవారికి అది ఇంకెవరి బాధ్యతో అని చాపుక్కూర్చున్నవారికన్న భద్రత ఎక్కువ. పని జీవనోపాధినే కాదు జీవితాన్నే ఇస్తుంది. స్త్రీ అయినా పురుషుడైనా తమ ఉపాధి తాము చూచుకుంటూ ఇతరులకూ సహాయపడినప్పుడే వారికి వారికి జీవితంలో సంతృప్తీ ఆనందమూను.
అందువల్ల ఏదో పనిలో ఎలాగోలా ప్రవేశించి లీనమై పనిచెయ్యడమే మన కర్తవ్యం. తీరుబాటును పెంచుకోకూడదు. తీరుబాటు ఎక్కువయేకొద్దీ పని అవకాశాలు సన్నగిల్లుతాయని గుర్తుంచుకోవాలి. స్విమ్మింగ్ పూల్ లో మొదటిసారి దూకేవారు అన్నిటికన్న ఎత్తైన బల్ల మీద నించుని ఎలావుంటుంది చెప్మా అని కిందకి చూసినట్టవుతుంది పరిస్థితి. తాత్సారం ఎక్కువైతే దూకినాక పరిస్థితి దేవుడెరుగు దూకడమే జరగదు.
No comments:
Post a Comment