Friday, December 11, 2020

 







మనకి తెలీని మన మెదడు శక్తి

మూల రచయిత: బ్రూస్ బ్లివెన్ (రీడర్స్ డైజెస్ట్ పాత సంచిక వ్యాసానికి స్వేచ్ఛానువాదము)

మన మెదడు విశ్వంలోనే ఒక అద్భుతం.  చాలామంది అనుకున్నట్టు అది ఎంతో సున్నితమైందే; కాని అనుకున్నదానికన్న ఎక్కువ దృఢమైన దీ, నిలకడైనదీ కూడా.  

మెదడుని ఇంకా ఎక్కువ సమర్ధంగా ఉపయోగించుకునేందుకు ఏడు వాస్తవాలని ఇక్కడ పేర్కొంటాను.  కొన్ని ఈ మధ్యకాలం పరిశోధనల్లో తేలినవి.

ఒకటి: మెదడుకి అలసట లేదు:

కొందరు అనుకుంటారు ఎక్కువ సేపు మనసు కేంద్రీకరించి పనిచేస్తే మెదడుకి నిస్సత్తువ ఆవరిస్తుందని.  కాని శాస్త్రవేత్తలు పరిశోధించి కనుగొన్నదాని ప్రకారం అటువంటి స్థితి ఉండదు.  మన మెదడు ఇతర దేహ కండరాల్లా కాదు.  దాని పనితీరు కండరాల చలనాన్నిబట్టి కాక విద్యుత్- రసాయనిక చర్యతో జరుగుతుంది - యాసిడ్ ద్రావకాలతో నడిచే బ్యాటరీలా.    

మెదడుకి అలసట అని మనకనిపించినప్పుడు ఆ అలసట శరీరపు ఇతర భాగాల్లో తెలుస్తుంది - కళ్ళు, వెన్నెముక, మెడ - ఇలా.  తాను మటుకు మెదడు విశ్రాంతిని కోరక నిరంతరంగా పనిచేస్తూనే ఉండగలదు.

ఒక యువతి ప్రయోగాత్మకంగా రెండు నాలుగంకెల సంఖ్యల్ని అతివేగంగా గుణించే పని పెట్టుకుంది.  తడవకి రెండేసి సంఖ్యలు తీసుకుని అలా పన్నెండు గంటలు చేస్తూనే వుంది.  ఈ పన్నెండు గంటల్లోను ఒకట్రెండు సార్లు వేగం తగ్గడం, లెక్క తప్పడం జరిగేయి కానీ మెదడు మాత్రం నిర్విరామంగా పనిచేస్తూనే వుంది.  ఆ తరవాత శరీరపు బడలికవల్లా ఆకలివల్లా మాత్రమే తన ప్రయోగం ఆపాల్సివచ్చింది.

పని విసుగనిపించినప్పుడు మెదడు అలిసిపోయిందని అనుకుంటుంటాం.  ఓ పుస్తకం చదువుతున్నప్పుడు ఎలాగైనా చదివి పూర్తి చెయ్యడమా నచ్చలేదు కనక ఆపెయ్యడమా అనే రెంటి సంఘర్షణ వల్ల అలసట అనిపిస్తుంది.  ఎడ్గార్ స్విఫ్ట్ అనే మనస్తత్వ నిపుణుని ప్రకారం, మెదడుకి అలసట అనిపించిందంటే చేసే పని మీద ధ్యాసతగ్గిందనో ఇతర పరధ్యానపు ఆలోచనలు నియంత్రించలేకపోతున్నారనో గ్రహించాలి.  

రెండు : మెదడు శక్తి ఇంచుమించు అపరిమితం


మన ఆలోచనలనిమిత్తం, జ్ఞాపకాల నిమిత్తం, తెలివిలో ఉండి చేసే అన్నిపనుల నిమిత్తం ఉపయోగపడే మెదడు భాగంలో పది నుండి పన్నెండు వందల కోట్ల జీవాణువులు ఉంటాయి.  వీటికున్న సన్నని తీగెల గుండా విద్యుత్-రసాయన తరంగాలు ఒక అణువు నుండి వేరొకదానికి ప్రవహిస్తాయి.  ఆలోచనలకీ జ్ఞాపకాలకీ ఈ తరంగాల ప్రసారమే కారణం.  లోకంలోని అతి తెలివిమంతుడు కూడా మెదడు పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోలేడు.  మెదడు సామర్ధ్యంలో పది నుండి పదిహేను శాతం మాత్రమే అందరూ వాడేది.    

జ్ఞాపకాలను మెదడు ఎలా నిక్షిప్తంచేసుకుంటుందో ఇంతవరకు పూర్తిగా తెలియదు.  ఆ సన్నని తీగెలు కొన్ని కణాలను గుంపులుగా, అలాటి గుంపులను గొలుసుకట్టుగా కట్టి వుంచుతాయని, అలాటి గొలుసుల్లో జ్ఞాపకాలు భద్రంగా వుంటాయని కొందరు, జ్ఞాపకాల ముద్రలు ప్రతీ అణువు మీదా కానీ అణువుల గొలుసుకట్టులో కాని "ముద్రించి" వుంటాయని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం.  ప్రతి అనుభవమూ ఒక గంట వరకు మెదడులో "తేలుతూ", స్థిరంగా నమోదుకాదన్నది మనమెరిగినదే.   అందువల్లనే తలకి బలమైన దెబ్బ తగిలినవారికి అంతకు పది పదిహేను నిమిషాలక్రితం ఏమి జరిగిందో గుర్తుండదు.     

ఏది ఎలా వున్నా మనం భద్రపరచుకోగల జ్ఞాపకాల సంఖ్య మెదడులో ఉన్న అన్ని కణాల  సంఖ్యకన్నా చాలా ఎక్కువ.  డెబ్భై యేళ్ళు క్రియాశీలకంగా జీవించి యున్న వారి మెదడు నూట యాభై కోట్ల వేర్వేరు విషయాలను జ్ఞాపకం ఉంచుకోగలరని డాక్టర్ రాల్ఫ్ గెరార్డ్ అనే నాడీశాస్త్ర నిపుణుడు అభిప్రాయపడ్డాడు.  కనుక మన ధారణా నిక్షేపం పరిమాణమూ సామర్ధ్యమూ మన ఊహకందనంత గొప్పవి.  అయితే మనం తగు జ్ఞానానుభవాలతో దాన్ని పరిపూర్ణం చెయ్యక వృధాగా వదిలెయ్యడం దురదృష్టకరం.

మూడు: ప్రజ్ఞావిశేషం (ఐ క్యూ) మీరనుకుంటున్నంత ముఖ్యం కాదు.

చాలామంది తమ ప్రజ్ఞ సాటివారి ప్రజ్ఞతో పోలిస్తే తక్కువనుకున్నప్పుడు ఆత్మన్యూనతకి లోనవుతారు.  ప్రజ్ఞ, లేదా ఐ క్యూ, వంశపారంపర్యం; మీ జీవితాంతం మారదు; మారినా బహు స్వల్పం.  మనకి స్వాభావికంగా ఉండే ప్రజ్ఞ కన్న ఎక్కువ ప్రదర్శించగలగడం అసాధ్యం కానీ జబ్బు పడో మనఃక్లేశంలోనో మెదడు స్తబ్దుగా ఉన్నప్పుడు  ఉన్న తెలివి కన్న తక్కువ ప్రదర్శించడం సులభం.  కనుక ఎప్పుడైనా ఐక్యూ పరీక్షల్లో తక్కువ మార్కులొస్తే మీ కనీస ప్రజ్ఞావిశేషం అంతకి తగ్గదని సంతోషించండి.     

అయితే గొప్ప బుద్ధివిశేషానికి భౌతికమైన ప్రాతిపదిక ఏమిటి?   కొందరనుకున్నట్టు పెద్ద సైజు కపాలం మాత్రం కాదు.  పుర్రె పైభాగం లోపల ఎక్కువ మెలికలూ ఆవర్తనాలూ ఉండాలి.  బుద్ధికుశలురకి మస్తిష్కంలో ప్రాణవాయువుతో గ్లూకోజు మరియు ఇతర ముఖ్య రసాయనాలు కలిసిన రక్తప్రసారం ఎక్కువగా వుంటుంది.  ఒక ప్రత్యేక ప్రజ్ఞావిశేషం - అంటే గణితంలోనో సంగీతంలోనో విశేష ప్రతిభ ఉన్నవారి మస్తిష్కంలో ఒకే ప్రదేశంలో దట్టమైన చుట్టలుగా  నాడీ తంత్రులు ఉంటాయి.

అయితే మీ మెదడు యొక్క భౌతిక అమరిక కన్నా దాన్నుపయోగించి మీరేం చేస్తారన్నది ముఖ్యం.  సాధారణ తెలివితేటలున్నవాని మెదడులోని జీవకణాల సామర్ధ్యాన్ని గనక పూర్తిగా వినియోగిస్తే ప్రపంచంలో ఏ మేధావీ కనపరచని జ్ఞానం, ప్రతిభా పాటవాలు కనబరుస్తాడు.  సామాన్యమైన తెలివీ, కష్టపడే నైజం ఉన్నవ్యక్తి తన నిత్య జీవితం లోని అనుభవాలతో సంపాదించిన జ్ఞానం ముందు సోమరిగా తిరిగే అతి తెలివిమంతుడి బుద్ధి విశేషం ఎందుకూ కొరగాదు.  ప్రపంచ ప్రఖ్యాతినందిన గొప్పవారి తెలివితేటలు సామాన్యులకున్న స్థాయికన్న ఎక్కువేమీ కాదని పరిశోధకులు నిర్ధారించారు.   

అటువంటి గొప్పవారిలో క్రామ్వెల్, జాన్ ఆడమ్స్, లింకన్ వంటి రాజకీయవేత్తలు, డ్రేక్, నెపోలియన్, నెల్సన్ వంటి యుద్ధవిద్యావిశారదులు, గోల్డ్ స్మిత్, ఎమర్సన్ వంటి రచయితలు ఉన్నారు.  వీరి తెలివితేటలు సామాన్యుల తెలివితేటలకన్న అంత ఎక్కువేమీ కావు.  కానీ అత్యంత ప్రతిభాశాలురని కీర్తినందినవారికన్న కూడ అధిక మేధోసంపన్నులుగా గౌరవాన్నీ గుర్తింపునీ వీరు పొందారు.  అందుక్కారణం ఉన్నతమైన వారి నడవడి, అనుకున్నది సాధించేవరకు విశ్రమించని వారి పట్టుదల.  

నాలుగు: నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదు.

వయసు పెరిగేకొద్దీ మెదడు మొద్దుబారి ఇక విద్యా వ్యాసంగం అసంభవమైపోతుందనేది ఒక అపోహ.  ఈ అపోహలో ఉన్న నిజం శాతం మనం పట్టించుకోనవసరం లేనంత స్వల్పం.  

మన మెదడులో ఉండాల్సిన కణాలన్నీ మన పుట్టుకతోనే సమకూరుతాయి.  వయసు పెరిగే కొద్దీ వాటిలో కొన్ని నశించడం సాధారణం.  అయితే ఏదో పెద్ద జబ్బు కారణంగా మెదడు మొద్దుబారిపోతే తప్ప అలా నశించే కణాలగురించి పట్టించుకోనవసరం లేదు.

వృద్ధులు శారీరకంగా బలహీనపడడం నిజం, అలాగే మెదడుకి సంబంధించి కొంత మరుపూ చెరుపూ కూడా కలగడం సాధారణం.  ఒక శ్రేష్టమైన వైద్యపరమైన వివరణ ప్రకారం, మన శరీరమనే సంక్లిష్ట అద్భుత యంత్రానికి భౌతికంగాను మానసికంగాను అడపాదడపా చిన్న చిన్న ప్రమాదాలూ దెబ్బలూ తగులుతుంటాయి.  అప్పటికి అవి చిన్నగా అనిపించినా, ఒక వయసు వచ్చేసరికి, వాటన్నిటి ఉమ్మడి ఫలితం మాత్రం తీవ్రంగా ఉంటుంది.

వృద్ధాప్యంలో మెదడు బలహీనపడి మతిస్తిమితం లేకపోవడానికి కారణం మెదడులో రక్త ప్రసరణ తగ్గడం, ప్రసరించే రక్తంలో ఉపయుక్తమైన ఆక్సిజన్, గ్లూకోజు వంటి పోషకాలు లేకపోవడం.  ఒకవిధంగా వృద్ధులు ఇటీవలి కాలపు సంఘటనల కన్న వారి బాల్యం, యౌవనంలోని విషయాలు ఎక్కువ గుర్తుపెట్టుకుని ఉత్సాహంగా వర్ణించగలగడానికి కారణం ఇదే.  ఎందుకంటే బాల్య యౌవన జ్ఞాపకాలు రక్తప్రసరణ ఆరోగ్యమూ పుష్కలమూ అయి వున్నప్పటి అనుభవాలకు సంబంధించినవి.

వృద్ధాప్యంలో మతిస్థిమితం కోల్పోవడం కొందరిలోనే.  తొంభైయో పడిలో కూడా చురుగ్గా చలాకీగా ఉన్న వృద్ధులను చాలామంది చూసే వుంటారు.  అటువంటి వారి ఉనికి వల్లనే రుజువవుతుంది - మతి మందగింపుకు కారణం పెరిగిన వయసు కాదనీ, వేరే అనారోగ్యాలనీ.

డెబ్భైలు దాటినాకూడా యువకులతో పోటీపడి ప్రతిభాపాటవాలు ఎందుకు ప్రదర్శించలేరు అనేదానికి విజ్ఞానశాస్త్ర పరంగా ఏ కారణమూ లేదు.  అసలు పదవీ విరమణ పొందిన పెద్దవారు తిరిగి కాలేజీల్లోను యూనివర్సిటీల్లోను చేరి కొత్త నైపుణ్యాలను విద్యలను అభ్యసించడం అభిలషణీయం.  " ముసలాళ్ళకు దసరా పండుగులా" లాటి ఈసడింపులకు జంకి లక్షలాది ప్రతిభామూర్తులు లేని వృద్ధాప్యాన్ని నెత్తినెత్తుకుని భారంగా బతుకీడుస్తున్నారు.  ఇది కడు శోచనీయం.     

ఐదు: మానసిక శక్తులు వినియోగంతోనే వృద్ధిచెందుతాయి.

ఇతర దేహ కండరాల్లాగే మెదడు కూడా వాడకుండా వదిలెస్తే శిధిలమైపోతుంది, కఠిన పరిశ్రమతో పదునెక్కుతుంది.  దీనికి నిదర్శనం, ఎవరికైనా చిన్నతనంలో దెబ్బతగిలి కంటి నాడి పాడైపోతే, చూపుకు కారణమైన మెదటిభాగం కూడ వాడుక లేక ఎదుగుదల నిలిచిపోతుంది.

మెదడు వయసుతో పరిణతి చెందేకొద్దీ దానిలోని నాడీతంత్రుల చుట్టూ మైలిన్ అనే కొవ్వు పదార్ధం పేరుకొంటుంది.  అలా జరిగినప్పుడే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.  నవజాత శిశువుల మెదడులో ఈ మైలిన్ తగినంత ఉండదు.  అందుకే మనకు రెండు మూడేళ్ళకన్న తక్కువ వయసు బాల్యపు సంగతులేవీ గుర్తుండవు.  శరీరశాస్త్రనిపుణుల సలహా ప్రకారం మెదడులోని ఏ భాగానికి పదునుపెట్టే పరిశ్రమ చేసినా అది ఈ అతి ముఖ్యమైన మైలిన్ ఉత్పత్తిని మరింత పెంచి మెదడు మరింత పదునెక్కుతుంది.     

మెదడు ఉపయోగించి చేసే ఏ పనైనా దానికి వ్యాయామమే.  అయితే మెదడు వినియోగం తక్కువున్న సులభమైన పనుల కన్న అది ఎక్కువున్న కష్టమైన పనులు కఠిన వ్యాయామం.  తర్కించే అలవాటు ఎక్కువైన కోద్దీ కొత్త తర్కం సులభమై ప్రభావశీలమవుతుంది.  అలాగే జ్ఞాపకం పెట్టుకునే వ్యాయామం చేసేకొద్దీ జ్ఞాపకం పెట్టుకోవడంలో కొత్త మెళకువలు వశమవుతాయి.  అభ్యాసం చేసేకొద్ది జ్ఞాపకం పెట్టుకొనేందుకు వెచ్చించిన సమయం కొత్తలో కన్న మూడోవంతుకు తగ్గుతుందని ఆచార్య రాబర్ట్ వుడ్ వర్త్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు.  

మీ వ్యక్తిత్వంలోని ప్రతీ అంశమూ మీ మెదడులో వుంటుంది.  విల్ పవర్ అని మనం వ్యవహరించే సంకల్ప బలం కూడా ఇందులో ఒకటి.  అభ్యసించేకొద్దీ అది కూడా వృద్ధిచెందుతుంది.  ఇష్టంలేనిదీ కష్టమైనదీ అయిన ఏ పనినైనా సంకల్పించి పట్టుపట్టి పూర్తిచేస్తున్న ప్రతిసారీ రాబోయే కాలంలో మరెన్నో క్లిష్ట కార్యాలు చేపట్టి పూర్తి చేయగలిగే సంకల్పబలం మీలో పెరుగుతుంది. 

ఆరు: అద్భుతంలో అద్భుతం అంతశ్చేతన (unconscious mind)  

మెదడులో అత్యద్భుతమైన భాగం మీ స్మృతిలో లేనిది, జ్ఞాపకాలద్వారా వెలిబుచ్చలేనిది, నిద్రాణమై మెదటి ఇతర భాగాల కన్న విస్తృతమైనదీ అయిన అంతశ్చేతన (unconscious mind).   దాని గురించిన మన అవగాహన ఇప్పటికి పరిమితమైనా పరిశోధనల పుణ్యమాని రాబోయే కాలంలో అది మనకు పూర్తిగా అవగతమై, దాని శక్తులను వినియోగంలోకి తెచ్చుకొనే వీలుంది.  

మీ అంతశ్చేతనలో ఉండే జ్ఞానమూ జ్ఞాపకాల పరిమాణం ఊహకందనంత విస్తృతమైనది.  అందులోవుండే స్మృతులు మనవే అయినా మన మామూలు జ్ఞాపకశక్తికి చిక్కవు.  ఇప్పుడు వినూత్న వైద్య ఆవిష్కరణల సహాయంతో మనం పోయిందనుకున్న జ్ఞాపకాల భాండాగారాన్ని తెరవగలుగుతున్నాము.  వాటిలో ఒక పద్ధతి మనస్తత్వవేత్తలుపయోగించే "స్వేచ్ఛాకూటమి" (free association).  ఇందులో వైద్యుని సూచనల  మేరకు రోగి తన మనసును తన ఇష్టానుసారం సంచరించనిస్తూ స్మృతిపథంలో విహరిస్తూంటాడు.  దీనిని వైద్యుడు పర్యవేక్షిస్తూ అవసరమనిపించినచోట వాటిని మళ్ళిస్తూ వుంటాడు.  ఈ క్రమంలో రోగి తానింతకు ముందెన్నడూ స్మరించని, మరుగునపడివున్న తన పాత అనుభవాలను కొత్తగా కనుగొంటాడు.  తన జీవితంలో ఏదో దశలో మెరిసి మాయమైన ఊహాచమత్కారాలు, భయానక సంఘటనలు కళ్ళకి కట్టినట్టు ప్రత్యక్షమవుతాయి.  ఈ చికిత్సావిధానంలో కొన్ని మందుల వినియోగం కూడా పరిపాటి.  హిప్నాటిజం కూడా ఇలా విస్మృత మనో నిక్షేప అంతరాళాల శోధనకి పనికొస్తుంది.  

చాలామంది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం, ఈ విస్మృత బుద్ధి నిక్షేపాన్ని మనం రోజూ ఉపయోగించుకోవచ్చు.  తమ "అంతరంగంతో చర్చించి దాని ఆదేశానుసారం" ఫలానా పనిచేసి లాభపడినట్లు చాలామంది అంటుండటం మనకి తెలుసు.  తమను నియమబద్ధంగా సుప్రభాత వేళలో అదే మేల్కొలుపుతోందని ఇంకొందరు గుర్తిస్తారు.  ఇంకా రాత్రి నిద్రపోయేముందు "ఏదెలా వున్నా రేపంతా నేను ఉల్లాసంగా ఆనందంగా ప్రశాంతంగా వుండి తీరుతాను" అని మనఃస్ఫూర్తిగా సంకల్పించి నిద్రకుపక్రమిస్తే మరుసటి రోజంతా తప్పనిసరిగా ఉల్లాసంగా ఆనందంగా ప్రశాంతంగా గడుస్తుంది.   

ఏడు: పాతమెదడు, కొత్తమెదడు 

బహు స్థూలంగా చెప్పుకోవాలంటే మెదడులో మూడుభాగాలుంటాయి: పైది, మధ్యది, కిందిది.  కింది భాగం స్వయంచాలిత దేహవ్యవస్థల పనితీరును నియంత్రిస్తుంది - రక్తమూ ఊపిరితిత్తులూ వాటి పనితీరు వంటివి.  మధ్య మెదడు కూడా ఈ విధిలో పాలు పంచుకుంటూ పై భాగానికి సమాచారం అందించే వంతెనలా పనిచేస్తుంది.    

ఆదిలో జీవులకి పై మెదడు అనేది ఉండేది కాదు; ఉంటే ఉండీ లేనట్టుండేది.  పరిణామక్రమంలో అది పెరుగుతూ వచ్చింది.  అందుకే దానిని "కొత్త మెదడు" అంటారు.  జంతు ప్రపంచంలో మేధావులని చెప్పదగ్గ చింపాంజీ గొరిల్లాలకు కూడా మనిషి పై మెదటిలో మూడోవంతో అంతకన్న తక్కువో ఉంటుంది.

ఈ విధంగా మనం కొత్త మెదటిని వృద్ధి చేసుకుంటున్నా పాత దాని లక్షణాలను కోల్పోలేదు.  కపాలం లోపలి కొన్ని భాగాలను విద్యుత్తరంగాలతో ప్రేరేపిస్తే మనిషి జంతువుల్లా కరవడం, గోక్కోవడం లాటి జంతు చేష్టలు చేస్తాడు.  కొంతవరకు పాత మెదడు తీవ్రస్థాయి స్వార్ధపరత్వానికి కారణం అయితే, కొత్తది విశాల దృక్పథం, ఆత్మ గౌరవం, జాత్యభిమానం, లోకకల్యాణాభిలాష వంటి ఉదాత్త లక్షణాలకు మూలాధారమై ఉంటుంది.  ఎదగడం, పరిణతి చెందడం అంటే పాత మెదడు మీద కొత్తది విజయం సాధించడమే.    

పాత మెదడులోని తీవ్రమైన భావోద్వేగాలు కొత్త మెదడులోని హేతుబద్ధతను, దూరదృష్టినీ అణచివేస్తాయి.  స్వార్ధ ఉద్రేకాలతో హత్యచేసిన వ్యక్తి వెనువెంటనే కొత్త మెదడులోని హేతువుతో ఆలోచించినప్పుడు తాను పట్టుబడటం, శిక్షపడటం తలపులోకొచ్చి పశ్చాత్తాపం పొందుతాడు కాని ఆ భావన తాను నేరం చెయ్యడానికి ముందు స్ఫురణకు రాక, ఉద్రేకం చల్లారిపోయిన తరవాత మాత్రమే వస్తుంది.

అయితే మనం భావావేశాలను పక్కన పెట్టి కేవలం బుద్ధినీ హేతువునూ మాత్రమే విశ్వసించి జీవించకూడదు.  ఒక నిష్కళంక, స్వచ్చ భావావేశాన్ని అంతశ్చేతన లోకి నెట్టెస్తే అక్కడ అది వికృతంగా పెరగనారంభిస్తుంది.  ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి.  పాత కొత్త మెదళ్ళు సామరస్యంతో జతపడినప్పుడే జీవితం ఫలవంతమూ అర్ధవంతమూ అవుతుంది.  ఏ ఒక్కదాన్ని నెత్తికెక్కించుకుని రెండోదాన్ని నిరాదరించినా ఆ మనిషి జీవన సాఫల్యాన్ని పరిపూర్ణంగా పొందలేడు.     


No comments:

Post a Comment