లోకానికి దయాగుణాన్ని మన పిల్లలకు స్వేచ్ఛను ప్రసాదిద్దాం.
కైలాష్ సత్యార్ధి నార్వే రాజధాని ఓస్లోలొ నోబెల్ శాంతి బహుమతి గ్రహిస్తూ చేసిన ఉపన్యాసానికి స్వేచ్ఛానువాదం.
ప్రపంచంలోని నా ప్రియ బాలల్లారా
యేలిన వారు, రాజ ప్రముఖులు, రాజ శ్రేష్టులు, నార్వేజియన్ నోబెల్ కమిటీ విశిష్టాధికారులు, ప్రియ సోదరుడు టం హార్కిన్, సోదర సోదరీమణులు, నా ప్రియ పుత్రిక మలాలా:
శాంతి మానవతల ఈ గొప్ప వేదికనెక్కి ప్రాచీన వేద విజ్ఞానకోశం నుంచి ఒక మంత్రాన్ని మననం చేసే భాగ్యం నాకు లభించింది.
ఈ మంత్రం, మానవజాతిని తన స్వయంకృత సంక్షోభాలనుంచి విమోచనం చెయ్యగల ఒక ప్రార్ధన, ఒక ఆకాంక్ష, ఒక సంకల్పం.
మనమంతా కలిసి నడిచెదము గాక. విశ్వ కల్యాణసాధనలో ప్రపంచపు అన్ని దిక్కు లందు ఏ ఒక్కరు వదిలివేయబడకుందురు గాక.
మన మాటలు, మనసులు దగ్గరౌను గాక. మన పూర్వీకుల అనుభవసారంతో సర్వజన ప్రయోజనకరమగు జ్ఞాన సంపదను వృద్ధిచేసెదము గాక.
నా దివంగత మాతాపితరులకు, జన్మభూమి భారతదేశానికి, భూమాతకు నా ప్రణామములు.
బానిస సంకెలలనించి ఒక్కొక్క పసిజీవితమూ విడివడినప్పుడు అది నాకే లభించిన స్వేచ్ఛగా నేను పొందిన వేలకొలదీ ఉద్విగ్న భరిత జ్ఞాపకాలను తలచుకొన్నప్పుడల్లా పరవశం కలుగుతుంది. స్వతంత్రులైన మొదటిసారి ఆ పసివారి చిరునవ్వుల్లో నాకు దేవతల మందహాసం కనిపిస్తుంది.
నాకు దక్కిన ఈ గౌరవానికి బాధ్యులు, ఈ ఉద్యమంలో అహర్నిశలు శ్రమించి అసువులు బాసిన భారతీయులు కాలు కుమార్, ధూం దాస్, ఆదర్ష్ కిషోర్, పాకిస్తాన్ వాసి ఇక్బాల్ మాసీ. ఈ పురస్కారాన్ని అటువంటి అమరవీరులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా ఉద్యమ సహచరులు, ఇంకా నా దేశప్రజలందరి తరఫున వినమ్రంగా స్వీకరిస్తున్నాను
బుద్ధుడు, గురునానక్, మహాత్మా గాంధీలు ప్రభవించిన పవిత్రభూమి భారతదేశం నించి నార్వే వరకైన నా ప్రయాణం ప్రపంచశాంతి, సౌభాతృత్వాల రెండు కేంద్రాలను కలిపే వారధి; ఒకటి ప్రాచీనమూ ఒకటి ఆధునికమూ.
మిత్రులారా, నోబెల్ కమిటీ వారు ఔదార్యంతో ఇక్కడ ప్రసంగించమని ఆహ్వానించారు. అది నేను చెయ్యలేనని వినయపూర్వకంగా మనవిచేసుకుంటున్నాను.
మౌనపు మాటనై, అమాయికత్వపు గొంతు జీరనై, అదృశ్యపు ముఖాన్నై ఇక్కడ నేడు నిలుచున్నాను. మా పిల్లల స్వరాలను స్వప్నాలను మీతో పంచుకునేందుకు వచ్చాను. ఎందుకంటే వారు మనందరి బిడ్డలు.
భీతిల్లి నీరసించిన వారి కళ్ళల్లోకి చూశాను. వారు సంధించిన ప్రశ్నలు ఆలకించేను.
ఇరవయ్యేళ్ళ క్రితం, హిమాలయ పర్వతపాదాల్లో బక్కచిక్కిన ఓ చిన్న కుర్రాడిని కలిసాను. అతనడిగేడు: "నేనో గెడ్డపారనో తుపాకీనో చేతపట్టకుండా నా చేతిలొ ఓ బొమ్మనో పుస్తకాన్నో పెట్టలేనంత పేదదటండీ ఈ ప్రపంచం?" అని.
సూడాన్లో ఉగ్రవాదుల చేతిలో అపహరణకి గురైన బాలసైనికుడిచేత మొదటి శిక్షణలో భాగంగా భయపెట్టీ బలవంతపెట్టి తన మిత్రులనూ కుటుంబాన్నీ చంపించేశారు. "నేనేం తప్పు చేసేను" అన్నాడతను.
పన్నెండేళ్ళక్రితం, చేతులుమారి, చెరచబడి, చెరబట్టబడి తల్లైన ఓ బాలిక కొలంబియా వీధుల్లో నన్నిలా అడిగింది: "కలలనేవి లేకుండానే గడిచింది నా బతుకు; నా బిడ్డకేనా అవుంటాయా?" అని.
మన బిడ్డల స్వప్నాలను చిదిమెయ్యడంకన్న క్రౌర్యం వేరే లేదు.
నా జీవిత లక్ష్యం ఒకటే. అది: ప్రతి బిడ్డా
సుమధుర బాల్యానికి, క్రమబద్ధమైన పెరుగుదలకు, కడుపునిండా తిండికి, కంటినిండా నిదురకు, పగటి వెలుగుల్లో ఆటలాడేందుకు, గలగలా నవ్వేందుకు, వలవలా యేడ్చేందుకు, కేరింతలకు, విద్యలు నేర్చేందుకు, అన్నిటిని మించి కలలు కనేందుకు స్వతంత్రులై వుండాలి.
అన్ని గొప్ప మతధర్మాలూ పసివారి పరిరక్షణను ప్రబోధిస్తున్నాయి. జేసస్ వాక్యం: "పిల్లలను నా వద్దకు రానివ్వండి; అడ్డుచెప్పవద్దు; ఎందుకనగా భగవంతుని రాజ్యం పిల్లలకే చెందినది." అని. పవిత్ర ఖురాన్ వాక్యం: "పేదరికం కారణమని పిల్లలను చంపుకోకండి." అని.
మన దేవాలయాల్లోను మసీదుల్లోను చర్చిల్లోను మన బిడ్డల కలలకు ప్రవేశం లేదంటే నేనొప్పుకోను.
ప్రపంచం ఒక వారంపాటు యుద్ధబలగాల కోసం పెట్టే కర్చుతో ప్రపంచ బాలలందర్నీ బడికి పంపి చదివించుకోగలిగినప్పుడు, ప్రపంచం పేదదని వినిపించే సాకులను నేనొప్పుకోను.
మన న్యాయశాస్త్రాలు, రాజ్యాంగాలు, న్యాయమూర్తులు, రక్షకదళాలు పిల్లలకు రక్షణ కల్పించలేమంటే నేనొప్పుకోను.
స్వేచ్ఛాభిలాష కన్న బానిస సంకెళ్ళు బలమైనవంటే నేనొప్పుకోను.
నేనొప్పుకోను.
నాలాగే ఒప్పుకోని ఎందరో సాహసయోధుల సాహచర్యం కలగడం నా భాగ్యం. ఎట్టి బెదిరింపులకీ దాడులకీ మేము తలొగ్గింది లేదు; తలొగ్గేదీ లేదు. గడచిన దశాబ్దాలలో గణనీయమైన వృద్ద్ధి సాధించామని చెప్పేందుకు నాకే సందేహమూ లేదు. బడికిపోని పిల్లల సంఖ్య సగానికి పడిపోయింది. ఆయుఃప్రమాణం పెరిగి పోషకాహారలోపం తగ్గి కోట్లాది పసిమరణాలు నివారింపబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా బాలకార్మికుల సంఖ్య మూడోవంతు తగ్గింది. పొరబడకండి, పెనుసవాళ్ళు ఇంకా మిగిలున్నాయి.
మిత్రులారా, ఈనాడు మానవత్వం తలుపులు బాదుతున్న పెను సంక్షోభం అసహనం.
మన పిల్లలకు విద్యనివ్వడంలో మనం ఘోరంగా విఫలమయ్యాం. జీవితానికో అర్ధాన్నీ గమ్యాన్నీ, భద్రమైన భవిష్యతునీ ప్రసాదించే విద్యను. తామంతా ఒకే ప్రపంచానికి చెందిన పౌరులమనే స్పృహను వారిలో పెంపొందించే విద్యను. ఈ వైఫల్యం పెరిగి పెరిగి ప్రపంచం ఎన్నడూ చూడని హింసతో మానవజాతికి ఆత్మహత్యాసదృశంగా పరిణామం చెందే రోజు ఎంతో దూరంలో లేదని నా భయం.
అయినా, మలాలా వంటి పిల్లలు ప్రతిచోటా ఉదయిస్తూనే వున్నారు, సమరాన్ని కాదని సఖ్యతనూ, అతివాదాన్ని కాదని క్షమనూ, భయాన్ని కాదని ధైర్యాన్నీ చేబూని.
సమావేశాల చర్చోపచర్చల్లోనూ ఎడంగా నిలబడి చేసే శుష్కోపదేశాలలోనూ మాత్రమే పరిష్కారాలు లభించవు. ప్రపంచం దృష్టిలోకి వచ్చినా రాకున్నా, ప్రపంచమది పట్టించుకున్నా లేకున్నా, లెక్కచెయ్యక నిత్యం సమస్యలతో పోరాడే సూక్ష్మ సాధారణ స్థానిక బృందాలలో లభిస్తాయి.
పద్ధెనిమిది సంవత్సరాలక్రితం, నూట మూడు దేశాల్లోని కోట్లాది నా సోదర సోదరీమణులు ఎనభై వేల కిలోమీటర్లు పాదయాత్ర జరిపారు. బాల కార్మిక నిరోధక అంతర్జాతీయ చట్టం ఆవిర్భవించింది. అది మా ఘనత.
మీరు అడగొచ్చు : ఒక వ్యక్తి ఏం చెయ్యగలడు? అని. నా చిన్నతనంలో నే విన్న ఒక కథ చెప్తా వినండి: ఒక అడవిని భీకరమైన దావాగ్ని దహించసాగింది. మృగరాజైన సిమ్హంతో సహా అన్ని జంతువులూ పరుగులు మొదలెట్టేయి. ఉన్నట్టుండి సిమ్హం ఓ చిన్న పిట్టని చూసింది. అది అగ్ని దిశగా ఎగురుతూ పోతోంది. మృగరాజు పక్షిని అడిగాడు: "ఏం చేస్తున్నావ్?" అని. దనికి ఆశ్చర్యం గొలుపుతూ, పక్షి అంది: "మంటలనార్పుదామని" అని. సిమ్హం నవ్వి "ముక్కులో ఓ చుక్క నీరు పట్టి దాంతో మహాగ్నినినెలా ఆర్పుతావు? నేకేమైనా పిచ్చా?" అని. పక్షి తొణకాబెణక్కుండా చెప్పింది "నా ప్రయత్నం నేను చేస్తున్నాను" అని.
ప్రపంచీకరణ అతి వేగంగా విస్తరించే కాలంలో మీరూ నేనూ వున్నాం. హై స్పీడ్ ఇంటర్నెట్ మనందర్నీ కలుపుతోంది. ఒకే ఒక ప్రపంచ విపణిలో మనం వస్తువులనూ సేవలనూ ఇచ్చిపుచ్చుకుంటున్నాం. ప్రతిరోజూ వేలాది విమానాలు భూమి అన్ని మూలలనూ కలుపుతున్నాయి.
ఇంత గొప్ప సంబంధంలోను ఓ అగాధంలాంటి విభేదం ఉంది. అదే, దయారాహిత్యం.
ప్రతి ఒక్కరి వైయక్తిక దయాగుణమూ ప్రపంచస్థాయి ఉద్యమంగా పరివర్తన చెందేలా మనం చూడాలి. కారుణ్యం ప్రపంచవ్యాప్తం కావాలి. ఉత్తుత్తి నిస్సహాయపు జాలీ కరుణా కాక న్యాయం, సమానత్వం, స్వాతంత్రమూ పరిఢవిల్లే ప్రభావశీల దయాగుణం.
మహాత్మా గాంధీ మాటల్లో "మనం ప్రపంచంలో సుస్థిరమైన శాంతిని స్థాపించాలంటే అది పిల్లల నుండి ప్రారంభించాలి." నా వినయపూర్వక వాక్యాన్ని దీనికి జోడిస్తాను. మన బిడ్డలకోసం దయతో ప్రపంచాన్ని ఏకం చేద్దాం రండి అని.
తాము జీవితంలో ఆడకపోయినా ఫుట్ బాల్ ని కుట్టే కుర్రాళ్ళు ఎవరు? మన బిడ్డలు. గనుల్లో పాషాణాలనీ ఖనిజాలనీ తవ్విపోస్తున్నదెవరు? మన బిడ్డలు. చాక్ లెట్ కలలో కూడా రుచి చూసే అవకాశం రాకున్నా కోకా తోటల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న పిల్లలెవరు? మన బిడ్డలు.
భారతదేశానికి చెందిన దేవ్లీ, తరాలతరబడి పేరుకుపోయిన ఋణభారాన్ని నెత్తిమీద భరిస్తూ వెట్టిచాకిరీకి కుదురుకున్న కుటుంబంలో పుట్టింది. స్వేచ్ఛ పొంది నా కార్లో కూర్చొంటూ ఆ ఎనిమిదేళ్ళ అమ్మాయి అడిగింది. "ఇంతకు ముందే నువ్వెందుకు రాలేదు?" అని. ఆ పసిదాని కోపం తల్చుకుంటే ఇప్పటికీ నాకు వణుకే - ప్రపంచాన్నే వణికించే కోపమది. ఆ ప్రశ్న మనందరికీ వేసినది. మనం ముందే ఎందుకు రాలేదు? దేనికోసం మీనమేషాల్లెక్కెడుతూ కూర్చున్నాం? విడుదలకి నోచుకోక ఎంతమంది దేవ్లీలు బానిసత్వంలో మగ్గిపోవాలి? ఎందరు అపహరణకీ కట్టడికీ పరాభవాలకూ బలి కావాలి?
ప్రపంచవ్యాప్తంగా వున్న దేవ్లీ లాంటి అమ్మాయిలు మన చేతకానితనాన్ని ప్రశ్నిస్తూ మన చేతల్ని గమనిస్తున్నారు.
సత్వర ప్రాతిపదికన సంఘటిత కార్యాచరణ ఇప్పటి మన అవసరం. ప్రతీ నిమిషమూ, ప్రతీ చిన్నారీ, ప్రతీ బాల్యమూ ప్రధానమే.
పిల్లల పట్ల మన నిష్క్రియాపరత్వాన్నీ నిరాశావాదాన్నీ నేను సవాలు చేస్తున్నాను. ఈ నిశ్శబ్ద వైఖరిని, ఈ తటస్థ వైఖరినీ.
అందువల్ల నేను ప్రభుత్వాలనీ, అంతర్-ప్రభుత్వ సంస్థలనీ, వ్యాపారకూటములనీ, మతధర్మ ప్రబోధకులనీ, నాగరిక సమాజాన్నీ, మనలో ప్రతి ఒక్కరినీ, కోరుకుంటున్నాను. బాలలపట్ల జరిగే అన్ని రకాల దౌర్జన్యాలకూ అడ్డు కట్ట వెయ్యాలని.
బానిసత్వం, అక్రమ రవాణా, బాల్యవివాహాలు, పనిలోపెట్టడం, లైంగిక దురంతాలు, నిరక్షరాస్యత వంటి వాటికి ఏ నాగరిక సమాజంలోనూ చోటులేదు.
మిత్రులారా, మనమిది చెయ్యగలం.
ప్రభుత్వాలు బాలలకు అనుకూలమైన విధానాలు రూపొందించాలి; విద్య మీద, బాలల సంక్షేమం మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి.
వ్యాపార సంస్థలు మరింత బాధ్యతాయుతమై కొంగ్రొత్త భాగస్వామ్యాలకు ఆహ్వానంపలకాలి.
కార్యాచరణ త్వరగా, సమర్ధంగా జరిగేలా అధికార సంస్థలు పనిచెయ్యాలి.
ప్రపంచ పౌర సమాజం రోజువారీ వ్యాపకాలకూ వారి వారి స్వంత జాబితాలకూ అతీతంగా ఎదగాలి.
మతపెద్దలూ మత సంస్థలూ మనమందరమూ మన పిల్లల పక్షాన నిలవాలి.
మనం ధైర్యమూ ఉన్నతాదర్శాలూ సంకల్పబలమూ కలిగియుండాలి. చేసిన ప్రతిజ్ఞలకు కట్టుబడి వుండాలి.
ఏభై యేళ్ళక్రితం, అప్పుడే బడిలో చేరిన నేను, గేటు బయట బూట్లు పాలిష్ చేస్తున్న నా ఈడు కుర్రాణ్ణి చూసి నా టీచర్లను అడిగాను: "అతనెందుకు బయట పనిచేస్తున్నాడు? బడికెందుకు రాడు మాతో పాటు?" అని. వారి వద్ద సమాధానం లేదు. ఓ రోజు ధైర్యం తెచ్చుకుని ఆ కుర్రాడి తండ్రినడిగాను. అతనన్నాడు: "అయ్యా, అదెప్పుడూ నేను ఆలోచించలేదు. మేం పనికోసమే పుట్టేము." అని. నాకు కోపం వచ్చింది. ఇప్పటికీ కోపం వస్తూనే వుంటుంది. ఆరోజు దాన్ని సవాలు చేసేను, ఇప్పుడూ చేస్తున్నాను.
చిన్నతనంలో నాకు రేపనే రోజున ఇలా జరగాలి అని ఉండేది. ఆ చెప్పులు కుట్టే అబ్బాయి నాతో నా తరగతిలో కూర్చుని చదువుకుంటుంటాడు. ఇప్పుడా రేపు నేడయింది. నేను ఆ నేటిని. మీరు కూడా. నేడు, స్వతంత్ర జీవనం, ఆరోగ్యం, విద్య, భద్రత, పరువూ ప్రతిష్టా, సమానత, శాంతి ప్రతి ఒక్క బిడ్డ హక్కూ అయి తీరవలసిన సమయం.
నేడు, చీకటికి ఆవల, మెరిసే నక్షత్ర సమూహాల మధ్య మన బిడ్డల నవ్వుమొహాలు చూస్తున్నాను. నేడు ప్రతి సముద్రంలోని ప్రతి తరంగంలోను ఆడుతూ గంతులేసే పిల్లలను చూస్తున్నాను. నేడు, ప్రతి మొక్క, చెట్టు, కొండ గట్లమీద ఆ చెప్పులు కుట్టే అబ్బాయీ నేనూ క్లాసులో కూర్చుని చదువుకోవడం చూస్తున్నాను.
ఈ నేటిని మీరు కూడా మీలో దర్శించాలని నా కోరిక. ప్రియ సోదరీ సోదరులారా, ఒకసారి కళ్ళు మూసి చేతిని హృదయానికి దగ్గరగా పెట్టుకొమ్మని అడగచ్చా నేను? ఓ బిడ్డను చూడగలుగుతున్నారా? తన మాటలు కూడా వినండి.
మీరు వినగలరు.
వేలాది మహాత్మా గాంధీలూ, మార్టిన్ లూథర్ కింగ్ లూ, నెల్సన్ మండేలాలూ దారిచూపుతూ మనలను కూడా అనుసరించమని ఆదేశించడం నేడు నేను చూస్తున్నాను. బాల బాలికలందరూ అనుసరిస్తున్నారు. నేను కూడా. మిమ్ములను కూడా ఆహ్వానిస్తున్నాం.
జ్ఞానం ప్రజల పరం కావాలి.
న్యాయం వ్విశ్వవ్యాప్తం కావాలి.
కలిసికట్టుగా, దయాగుణం ప్రపంచ వ్యాప్తం కావాలి. మన బిడ్డల కోసం.
ఈ గదిలోని మీకూ బయటి ప్రపంచంలోని అందరికీ పిలుపునిస్తున్నాను.
దోపిడీలోంచి విద్యవైపు, లేమినించి సంపద ఉమ్మడి భోగానికీ, బానిసత్వాన్నించి స్వేచ్ఛా ప్రపంచంలోకి, హింస నించి శాంతిమార్గంలోకి రావలసిందిగా మీకు పిలుపునిస్తున్నాను.
అంధకారం లోంచి జ్ఞాన ప్రకాశంలోకి నడుద్దాం. నశ్వరత నించి అమృతత్వంలోనికి అడుగిడదాం.
రండి కలిసి సాగుదాం.
ఓస్లో, నార్వే
పరమదయాళుడు, అనుగ్రహప్రదాత అయిన భగవంతుని పేరిట,
యేలినవారు, రాజప్రముఖులు, ప్రముఖులు నార్వేజియన్ నోబెల్ కమిటీ సభ్యులు, నా సోదరీ సోదరులారా.
ఈ రోజు నాకు అత్యంత సంతోషకరమైనది. ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారానికి నన్నెంపిక చెసిన నోబెల్ కమిటీ వారి సహృదయతకు వినయపూర్వక కృతజ్ఞతలు.
మీ అందరి అండదండలకీ ప్రేమాభిమానాలకీ, ఇప్పటికీ ప్రపంచం నలుమూలలనించీ నాకు వస్తున్న ఉత్తరాలకూ కార్డులకు ధన్యవాదాలు. కారుణ్యమూ ప్రోత్సాహమూ నిండిన మీ పలుకులు నాకు శక్తినీ స్ఫూర్తినీ ప్రసాదిస్తాయి.
నాపై తమ పరిపూర్ణ ప్రేమాపేక్షలకు నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నాన్నగారు, నా రెక్కలు విరిచెయ్యకుండా నన్నెగరనిచ్చినందుకు మీకు, ఓరిమినీ సత్యదీక్షనూ విడువక జీవించమని ప్రబోధించిన ఇస్లాం సందేశాన్నే నీ మాటల్లో చెప్పి నాకు దిశానిర్దేశం చేసిన అమ్మా నీకు, నమస్కృతులు. ఇంకా నాలో నాకు విశ్వాసమూ ధైర్యమూ కలిగేలా ప్రబోధించిన నా గురువులకూ అనేక ధన్యవాదాలు.
నాకు గర్వంగా ఉంది, నిజానికి చాలా గర్వంగా ఉంది - అతి చిన్న వయస్సులోనే ఈ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరిస్తున్న మొదటి పష్టూన్, మొదటి పాకిస్తానీని నేనైనందుకు. పైగా, శాంతిబహుమతి వరిచినా ఇంకా తన తమ్ముళ్ళతో కలహిస్తున్న విజేతను కూడా నేనే కాబోలు. ఎల్లెడలా శాంతి నెలకొనాలన్నది నా ఆదర్శం. నేను నా తమ్ముళ్ళూ ఆ పనిమీదే వున్నాం.
ఎన్నో యేళ్ళుగా, ఇంకా చెప్పాలంటే నా ఇప్పటి జీవితకాలానికి రెట్టింపు కాలం, బాలల హక్కుల గురించి శ్రమిస్తున్న కైలాష్ సత్యార్ధి గారి తో పాటు ఈ బహుమానాన్ని స్వీకరించగలగడం నా భాగ్యం. బాలల హక్కులు వంటి ఉన్నతాదర్శాల సాధనకోసం భారతీయులూ పాకిస్తానీలూ ఒకటై సామరస్యంగా కలిసి పనిచేయగలరని తెలిసి ఇంకా ఎంతో గర్వంగా వుంది.
ప్రియ సోదర సోదరీమణులారా, మైవాండ్ కు చెందిన మలాలై మా పష్టూన్లకు జోన్ ఆఫ్ ఆర్క్ వలె జ్ఞాని, సాధువర్తని. ఆ పేరు నాకు పెట్టేరు. కాని మలాలా అంటే విచారగ్రస్తమనే అర్ధం కూడా వుండడంచేత, కొంతలో కొంత సంతోషం నాక్కలిగేందుకు, మా తాతయ్య నన్నెప్పుడూ మలాలా-ఆనంద హేలా, అని పిలిచేవారు. అది నిజమై ఈ నాడు ఒక ఉత్కృష్టమైన లక్ష్యం కోసం మీ అందరితో కలిసి పనిచెయ్యడం ఎంతో ఆనందంగా వుంది.
ఈ పురస్కారం నాకు మాత్రమే కాదు. చదువుకోసం పరితపిస్తూ, మన తలపుల్లోకే రాని బాలలకి. భయభ్రాంతులై దాక్కుని శాంతికోసం ఎదురుచూస్తున్న బాలలకి. పరిస్థితులెప్పటికి మారుతాయో అని పడిగాపులుకాస్తున్న బాలలకి.
వారి హక్కుల కోసం నిలబడి, వారి వాణిని వినిపించేందుకు నేడు నేనిక్కడ ఉన్నాను. వారిపై జాలిపడాల్సిన తరుణం కాదిది. జాలిపడాల్సిన తరుణం కాదిది. చదువుకు నోచుకోని ఒక బిడ్డను చూడడం ఇదే ఆఖరు సారి, ఇదే ఆఖరు సారి, ఇదే ఆఖరు సారి అనుకుని కార్యశూరులమై కదలాల్సిన తరుణం.
జనులు నన్ను రకరకాలుగా పిలుస్తుంటారు.
తాలిబాన్ వాళ్ళు షూట్ చేశారే, ఆ అమ్మాయి అని కొందరు.
తన హక్కులకోసం గొడవలు పడే అమ్మాయి అని కొందరు
నోబెల్ బహుమతి గ్రహీత అని కొందరు.
కానీ నా తమ్ముళ్ళు మాత్రం నన్నింకా తగువులమారి, పెత్తనాల పెద్దక్క అనే పిలుస్తారు. నా మటుకు నేను మాత్రం బాలలందరికీ సమాన విద్యాహక్కుకోసం, మహిళలందరికీ సమాన సామాజిక స్థాయికోసం, ప్రపంచం అడుగడుగునా శాంతి సామరస్యాలు వెల్లివెరిసే లక్ష్యంకోసం నిలిచి ఎదిరించే అమ్మాయిని.
చదువు జీవితానికో వరమూ, అవసరమూ. నా పదిహేడేళ్ళ జీవితంలో అనుభవమ్మీద గ్రహించినదది. స్వాట్ లో స్వర్గధామంలాటి నా ఇంట్లో కూర్చుని కొత్తవి చదవడం నేర్చుకోవడం ఎంతో ఆనందంగా ఉండేది. మా స్నేహితులందరమూ పండగలప్పుడు చేతికి హెన్నా దిద్దుకునేవాళ్ళం. కానీ పువ్వులూ లతలూ డిజైన్ లూ కాక గణిత సూత్రాలూ సమీకరణాలూ చిత్రించుకునేవారం.
మా విద్యాదాహం విపరీతంగా ఉండేది. తరగతి గదే మా భవిషత్తని మేము బలంగా నమ్మేం. కలిసి నేర్చుకొనేవాళ్ళం, పాఠాలు వల్లె వేసేవాళ్ళం. శుభ్రమైన బడి యూనీఫారాలతో, కళ్ళల్లో గొప్ప గొప్ప కలలతో గడిచేవి మా బడి రోజులు. మగపిల్లలకి మాత్రమే సాధ్యమని కొందరనుకునే పెద్ద పెద్ద చదువులూ ఉన్నత లక్ష్యాలూ మేమూ సాధించి మా తల్లిదండ్రులు గర్వపడేలా చెయ్యాలని ఉండెది.
అయితే అనుకున్నవి అనుకున్నట్టు జరగలేదు. ఆహ్లాదకర పర్యాటక ప్రదేశమైన స్వాట్ ఆందోళనకరమైన ఉగ్రవాద తండాగా మారిపోయింది. నాకు పదేళ్ళప్పుడు నాలుగు వందల స్కూళ్ళు నేలమట్టం చేశారు. మహిళలను కొరడాలతో బహిరంగంగా హింసించారు. ఎందరో జనులు హతులయ్యారు. మా కలలు కల్లలయ్యాయి.
మా అధికారమనుకున్న చదువు అపరాధమయింది.
ఆడపిల్లలు బడికి పోరాదన్నారు.
నా ప్రపంచమూ, దానితొ పాటు నా ప్రాథమ్యాలూ మారిపోయాయి.
నాకు రెండు మార్గాలు. ఒకటి, మౌనంగా వుండి చావుకి ఎదురుచూడ్డం. రెండు, మౌనం వీడి గొంతెత్తి చావడం.
నేను రెండోది యెంచుకున్నాను. గొంతెత్త దలచాను.
మా హక్కులని హరిస్తూ, ఇష్టారాజ్యంగా అమాయకులని చంపేస్తూ మాకు వారు చేస్తున్న అన్యాయాలని ఉగ్రవాదులు ఇస్లాముకి ఆపాదించి మతం పేరును దురుపయోగం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం మా వల్లనయింది కాదు. మేము వారికి చెప్పదలిచాము: మీరు నేర్చుకోలేదా ఒక వ్యక్తిని చంపితే అది మానవ జాతినే మట్టుపెట్టినంత మహాపాపం అన్న పవిత్ర ఖురాన్ లోని అల్లా వాక్యాన్ని? మీకు తెలియదా, నిన్ను నీవుగాని నీవు ఇతరులను గాని హింసించరాదన్న శాంతి ప్రవక్త మహమ్మద్ ఆదేశం?
మీకు తెలియదా, పవిత్ర ఖురానులోని మొట్టమొదటి పదం ఇక్రా అంటే చదవండి అని?
ఉగ్రవాదులు నన్ను, ఇక్కడున్న నా మిత్రులు కొందరిని ఆపే ప్రయత్నం చేశారు - 2012 లో మా స్కూల్ బస్ మీద ఆయుధాలతో దాడి చేసి. కాని వారి ఉద్దేశాలకూ తూటాలకూ అది సాధ్యపడలేదు.
మేం బయటపడ్డాం. ఆ రోజునించీ మా గొంతులు మరింత బిగ్గరగా స్పష్టంగా వినిపించసాగేయి.
ఇదంతా మీకు చెబుతున్నది, నా కథ అసాధారణమైనదనీ కాదు; అతి సాధారణమైనదని.
ఎందరో బాలికలదీ కథ.
వారి కథలూ వినిపిస్తానివాళ. నాతో పాటు, నాలాటి కథలే ఉన్న నా అక్కచెల్లెళ్ళు కొందర్ని పాకిస్తాన్ నించి, నైజీరియా నించి, సిరియా నించి, తీసుకొచ్చేను. అలాగే ఆ రోజు బస్సులు తూటా దెబ్బ తిని బతికిన నా వీరసోదరీమణులు షాజియా, కైనాత్. ఆ దాడి వల్ల వారి విద్యాలాలస పెరిగిందే కాని తగ్గలేదు. కైనాత్ అయితే ఇంకెన్నో అకృత్యాలనీ హింసనీ అనుభవించింది; సోదరుడినీ హింసాకాండలో పోగొట్టుకుంది. అయినా తలొగ్గలేదు.
ఇంకా నా మలాలా నిధి ప్రచారంలో నేను కలిసిన కొందరు అక్కాచెల్లెళ్ళు.
ధైర్య సాహసాలకి మారుపేరైన నా చెల్లి, సిరియాకి చెందిన పదహారేళ్ళ ముజూన్ ఇప్పుడు జోర్డాన్లో శరణార్ధి శిబిరాల్లో నివిసిస్తోంది. గుడారం గుడారానికీ తిరిగి బాల బాలికలను చదువుకొమ్మని ప్రోత్సహిస్తూ.
అలాగే ఇంకో చెల్లి నైజీరియా ఉత్తర ప్రాంతాన్నించి. అక్కడ కరడు కట్టిన బోకో హరాం ఉగ్రవాద ముఠా బాలికల అపహరణా అకృత్యాలకి పెట్టింది పేరు. ఆ బాలికల అపరాధమల్లా చదువుకోవాలనుకోవడమే.
చూసేందుకు నేనొక్క అమ్మాయినే కాని, చూసేందుకు నేనొక్క అమ్మాయినే కాని, ఒక వ్యక్తినే కాని, ఒక ఐదడుగుల రెండంగుళాల మనిషినే కాని, హైహీల్స్ తీసెస్తే ఐదడుగులే కాని, నా గొంతు ఒంటరిది కాదు. నా గొంతు ఒంటరిది కాదు. నేను ఎందరినో.
నేను మలాలాని. కాని నేను షాజియాని.
నేను కైనాత్ ని.
నేను కైనాత్ సూమ్రో ని.
నేను ముజూన్ ని.
నేను అమీనా ని.
నేను చదువుకి దూరం చెయ్యబడ్డ ఆ ఆరు కోట్ల ఆరు లక్షల మంది అమ్మాయిలని. ఇప్పుడు మీరు వినేది నా మాటలను కాదు. ఆ అరవయ్యారు మిలియన్ మంది అమ్మాయిలదీ.
సిరియా, గాజా, ఇరాQ లలో ఎంతో మంది శరణార్ధులుగా మారడం చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ లో కుటుంబాలు కుటుంబాలు ఆత్మాహుతి దళాల దాడుల్లోను, బాంబు ప్రేలుళ్ళలోను మరణించడం మేము చూస్తుంటాము.
ఆఫ్రికాలో పేదరికం కారణంగా ఎందరో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. నేనింతకు ముందే చెప్పినట్టు, ఉత్తర నైజీరియాలో ఇప్పటికీ ఆడపిల్లలకు బడికెళ్ళే స్వేచ్ఛ లేదు.
భారత పాకిస్తాన్ వంటి దేశాల్లో, కైలాష్ సత్యార్ధి గారు చెప్పినట్టుగా, రకరకాల సామాజిక పోకడల కారణంగా ఎందరో బాలలు విద్యకి దూరం చెయ్యబడుతున్నారు, బలాత్కారపు బాల్య వివాహాలు చేసుకుంటున్నారు, లేదా పనిలోకి నెట్టబడి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు.
బళ్ళో నా తోటి విద్యార్ధిని, నా యీడు ఒకమ్మాయి, ఎంతో ధైర్యంగా ఆత్మ విశ్వాసం తొణిమిసలాడుతూ, డాక్టర్ కావాలని కలలు కనేది. కాని అది కలగానే మిగిలిపోయింది. పన్నెండేళ్ళై ఆమెకి బలవంతంగా పెళ్ళి చేసేశారు. ఓ కొడుక్కి తల్లైంది. తనే ఒక ముక్కుపచ్చలారని పద్ధ్నాలుగేళ్ళ బాలిక, ఒక పిల్లవాడికి తల్లైపోయింది. ఎంతో గొప్ప డాక్టర్ కావలసినది. కాలేకపోయింది. ఆడపిల్ల అయిన పాపానికి.
ఆ అమ్మాయి కథే, ఈ నోబెల్ పురస్కారపు పారితోషికాన్ని నేను ప్రపంచవ్యాప్తంగా బాలికలకు నాణ్యమైన విద్యనిచ్చేందుకు, వారి వాణిని వినిపించేందుకు ఏర్పాటైన మలాలా నిధికి జమచేసేందుకు ప్రేరణ. ఈ నిధుల వినియోగం ప్రప్రథమంగా నా హృదయానికి చేరువైన పాకిస్తాన్, ముఖ్యంగా స్వాత్ షాంగ్లా లలో పాఠశాలలు నిర్మించడం.
నా గ్రామంలో ఇప్పటికీ ఆడపిల్లలకి ఉన్నత పాఠశాల లేదు. ఇప్పటి నా కోరిక, నా సంకల్పం, నా సవాలు అక్కడ బడిని నిర్మించి నా చెళ్ళేళ్ళందరికీ అక్కడ ఉత్తమ స్థాయి విద్య అందించి వారి కలలు సాకారమయ్యే అవకాశాన్ని కల్పించడం.
నా కార్యాచరణ అక్కడ ప్రారంభమవుతుంది; కాని అక్కడ ముగియదు. ప్రపంచంలో ప్రతి ఒక్క బాలిక, ప్రతి ఒక్క బాలిక, బడికెళ్ళేంతవరకు అది కొనసాగుతుంది.
ప్రాథమిక విద్య చాలని ప్రపంచం ఇంకేమాత్రం సరిపెట్టుకోలేదు. సరిపెట్టుకోలేదు.
ఎందుకని, అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకులు తమ పిల్లలు మాత్రం అల్జీబ్రా, గణిత శాస్త్రం, సైన్స్, భౌతిక శాస్త్రాలలో హోం వర్క్ చేస్తూంటే తమ దేశ పౌరులైన పిల్లలకు మాత్రం ప్రాథమిక విద్య ఉంటే చాలని సరిపెట్టుకుంటున్నారు?
నాయకులు త్వరగా స్పందించి తమ దేశాల్లోని ప్రతీ బిడ్డకి ఉచిత, నాణ్యమైన, ప్రాథమిక, మాధ్యమిక విద్యను అందుబాటులో వుంచి చదివించాలి.
కొందరంటారు, ఇది ఆచరణసాధ్యం కాదని, అధిక కర్చుతో కూడుకున్న వ్యవహారమని, కష్టసాధ్యమని, లేదా అసాధ్యమని.
ప్రపంచం తన ఆలోచనల పరిధిని పెంచుకోవాల్సిన సమయమిది.
సోదరీ సోదరులారా, బహుశః పెద్దవారికి అర్ధమవుతుందేమో కాని మన పిల్లలకి అర్ధం కానిదొక్కటే. ఎందుకని, శక్తిమంతమైన దెశాలని పిలవబడేవి యుద్ధాలు సృష్తించడంలో శక్తిని ప్రదర్శించి శాంతి సాధించడంలో చతికిలబడిపోతున్నాయి? ఎందుకని పుస్తకాలివ్వడం కన్న తుపాకులివ్వడం అంత సులభమైపోతోంది? ఎందుకని, ఎందుకని, యుద్ధ ట్యాంకులు చెయ్యడం అంత సులభమూ, స్కూల్ భవనాలు నిర్మించడం అంత కష్టమూ? ఓ పక్క మనం అత్యాధునికమైన ప్రపంచంలో నివశిస్తున్నాం, అసాధ్యమనేదే లేదని విశ్వశిస్తున్నాం. నలభై ఐదేళ్ళ క్రితం చంద్రమండలాన్ని అధిరోహించాం, అంగారకునిపై నేడో రేపో అడుగిడబోతున్నాం. ఇటువంటి ఇరవయ్యొకటవ శతాబ్దంలో ప్రతి బిడ్డకీ నాణ్యమైన విద్యనివ్వడం అంత కష్టమేం కాదే.
ప్రియ సోదరీ సోదరులారా, ప్రియ సహ బాలలారా, మనం పని చెయ్యాలి. వేచి చూడటం కాదు. రాజకీయవేత్తలూ ప్రపంచ నాయకులూ మాత్రమే కాదు, మనమందరమూ తలో చెయ్యీ వెయ్యాలి. నేను. మీరు. మనము. అది మన కర్తవ్యం. ఖాళీ తరగతి గదులని, చేజారిన బాల్యాన్ని, వ్యర్ధమైపోయిన సామర్ధ్యాలని చూచే ఆఖరి తరమూ, అలా చూడ సంకల్పించుకున్న మొదటి తరమూ మనది కావాలి.
ఒక బాలికా బాలుడూ ఫ్యాక్టరీలో తన బాల్యాన్ని గడపడం ఇదే ఆఖరుసారి కావాలి.
ఒక బాలిక బలాత్కార బాల్యవివాహం చేసుకోవడం ఇదే ఆఖరుసారి కావాలి.
ఒక బిడ్డ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం ఇదే ఆఖరుసారి కావాలి.
ఒక బిడ్డ చదువు పూర్తికాకుండానే బడిని విడిచిపెట్టడం ఇదే ఆఖరుసారి కావాలి.
మనతో ఇది ఆఖరు కావాలి.
ఈ ముగింపుకి మనం కలిసికట్టుగా, ఈ నాడు, ఇక్కడ, ఇప్పుడే, నాంది పలుకుదాం రండి. ఆ ముగింపుకి ఇది ఆరంభం కావాలి.
మీ అందరికీ చాలా ధన్యవాదాలు.
No comments:
Post a Comment