Thursday, December 31, 2020

















స్వర్ణయోగి

(Summarized translation of Paulo Coelho's "Alchemist")

ఇది శాంటియాగో అనే గొర్రెల కాపరి కుర్రాడి కథ. కథా ప్రారంభ సమయానికి ప్రతి సాయంత్రం లాగే తన మందని తెచ్చి స్పెయిన్ లోని ఆ పాడు పడ్డ చర్చీ, దాని గోడల్ని బీటలు వారుస్తూ దట్టంగా పెరిగిన రావి మొక్కా ఉన్నచోట ఆ రాత్రి తలదాచుకునేందుకు నిశ్చయించుకుంటాడు. సంచీలో ఉన్న పెద్ద పుస్తకాన్ని తలకింద పెట్టుకు పడుకుంటాదు. పెద్ద పుస్తకం చదవగలగడం గొప్ప; పైగా అది మంచి తలగడ కూడా.



ఈ రాత్రన్న కాస్త ఎక్కువసేపు పడుకోవాలనుకుంటాడు కాని అంతకు ముందొచ్చిన కల మళ్ళీ వచ్చి తెలివొచ్చేస్తుంది. అదేమిటో తనెప్పుడు లేస్తే తన గొర్రెలూ అప్పుడే లేచిపోతాయి. ఈ రెండేళ్ళ తన కాపులో అవి తన దినచర్యకి పూర్తిగా అలవాటుపడిపోయాయి. లేక తనే వాటికి దినచర్యకి అలవాటుపడిపోయాడా?

వాటితో తను మాట్లాడతాడు; చూసొచ్చిన చోట్ల విషయాలు వివరిస్తాడు. ఈ మధ్య తనకి ఓ వర్తకుడి కూతురు చక్కని చుక్కతో చేసిన సంభాషణ గురించి ఎక్కువ వివరిస్తున్నాడు. ఆ వర్తకుడికి ఉన్ని అమ్మే సందర్భంలో చోటుచేసుకున్న సంభాషణ అది. మాటల సందర్భంలో ఆ పిల్ల అడిగిందిట గొర్రెల కాపర్లకి చదువురాదుకదా అంత పుస్తకం పట్టుకు తిరుగుతున్నావేమిటని.

దానికి సమాధానంగా, "పుస్తకాలకన్న ఎక్కువ నా గొర్రెలనించే నేనెక్కువ నేర్చుకుంటాను" అంటాదు. ఇంకా సంచారంలో తన అనుభవాలూ గొప్పలూ అవీ చెబ్తున్నప్పుడు కళ్ళు పెద్దవిచేసుకు చూసిన ఆమె చక్కదనం అతని మదిలో ముద్రించుకుపోతుంది. అతనికీ అనుభవం కొత్త. తన సంచారంలో ఇంతగా కట్టిపడేసినవాళ్ళు ఇంతవరకూ లేరు. ఆ రోజు ముగియకుండా ఉండిపోతే బాగనిపించింది ఆ అమ్మాయి సమక్షంలో. కానీ లావాదేవీ ముగిసి అక్కణ్ణించి లేచాడు. నావికులూ గొర్రెలకాపరులూ వృత్తిరీత్యా నిత్య సంచారులైనా వారిని స్థిరంగా కట్టి వుంచే చోటు ఎక్కడో అక్కడ వుంటుందని తనెక్కడో విన్నాడు. తనది ఇదేనా అనిపిస్తుంది.

ఇవన్నీ తన గొర్రెలకి అక్కర్లేదు. వాటిక్కావలసింది తను పెట్టే మేత, నీరు, నీడ. ప్రతిఫలంగా తమ ఉన్నినీ కొండొకచో మాంసాన్ని అతనికివ్వాలి. అంతే. ఒకవేళ తనో రాక్షసుడైపోయి ఒకొక్కటిగా వాటిని చంపేస్తూ పోతే, తన వంతు వచ్చే వరకు ఏ గొర్రెకీ తనెంత ప్రమాదంలో ఉన్నదీ తెలియదు. ఏ శ్రమ లేక దొరికే తిండీ తిప్పల వల్లనే నేమో వాటికీ నిశ్చింత.

ఈ రాక్షస ఆలోచనలేమిటా అనుకుంటే ఈ పాడుపడ్డ చర్చిలో దెయ్యాలున్నాయేమో అనిపిస్తుంది. పైగా, అతనికో కల మళ్ళీ మళ్ళీ వస్తోంది. ఇంకోచోటికి పోదామని సరంజామా సర్దుకుంటాడు. లోపల గొంగళీ బరువు చేతులు లేగేసి వదిలెద్దామా అనుకుంటాడు. కాని తను చలితో చావకుండా ఉన్నాడంటే అది ఆ గొంగళీ చలవే. దేని ప్రయోజనం దానిది.

తన ప్రయోజనం తనది.

అసలు తనో చర్చిలో అర్చకుడు కావలని తన తండ్రి కోరిక. కాని ఎక్కడెక్కణ్ణించో తమ ప్రాంతానికి వచ్చి ఆ శోభలు చూసి మురిసిపోయేవారి వేషభాషలు చూసి వాళ్ళ ఊర్లూ అక్కడి మనుషులూ ఎలా వుంటారని తనకి ఆసక్తి కలిగి తనూ వాళ్ళలాగే అన్నీ తిరగాలని ఉంటుందన్నాడు. ఆ కోరిక తీరాలంటే బోలెడు డబ్బైనా వుండాలి, లేక నువ్వో మందల్ని నడుపుతో పోయే గొర్రెలకాపరివైన కావాలని తండ్రి అంటాడు. అయితే గొర్రెల కాపరినే అవుతానని నిశ్చయించుకుని చదువుకి స్వస్తి చెప్పేస్తాడు. చేసేదేమీ లేక తండ్రి మూడు బంగారు నాణేలు చేతికిచ్చి, "ఇవో రోజు పొలంలో దొరికేయి; ఇవి నా వారసత్వమనుకుని వీటితో ఓ మంద కొనుక్కుని నీ ఆశ తీర్చుకో; ఒకనాటికి మనదే స్వర్గసీమనీ, మన ఆడపిల్లలే చక్కని చుక్కలంటున్న ఆ పర్యాటకుల మాటలు నిజమనిపించి తిరిగొస్తావు" అని సాగనంపుతాడు.

సెలవు తీసుకుని బయలుదేరుతూ తండ్రి కళ్ళలోకి చూసినప్పుడు అతనికి, తండ్రికి కూడా తనలాగే లోకసంచారం చేసి వింతలూ విశేషాలూ చూడాలనే కోరిక వుందనీ, కానీ నెత్తిన పడిన కుటుంబ పోషణ భారం యేటికేడు పేరుకుపోయి దాన్ని కప్పెట్టేసిందనీ లీలగా గోచరిస్తుంది.

తన నిర్ణయం తప్పనిపించలేదు. ఈ రెండేళ్ళలో ఎన్నో విశేషాలు చూసేడు. అతనికి సంతృప్తి కలిగించినది, కలను కలగానే మిగలనియ్యక, వాయిదాలు వెయ్యక దాన్ని సాకారం చేసుకుందామన్న తన సంకల్పం. ఇన్నేళ్ళు గొర్రెలనించి సహజ జ్ఞానమూ మనుషులతో లావాదేవీలనించి లోక జ్ఞానమూ సంపాదించాడు. ఈ పరిజ్ఞానంతో ఓ రోజు మందని అమ్మేసి సముద్ర తీరాలు దర్శించుకోవచ్చు. అది విసుగనిపిస్తే తను సంతృప్తిగా ఉండందుకు తగినన్ని ఊర్లూ మనుషుల పరిచయం దొరకనే దొరికింది. ఈ అనుభవాలను కాదని తండ్రి కోరిక ప్రకారం పూజారి అయి ఆ పీఠాన్నే నమ్ముకునుంటే ఈ సరికి దేవ దర్శనం మాత్రం దొరికిండేది కాదు.

అయితే ఈ కొత్త ఉత్తేజం తనదే. తన మందది కాదు. కావలసినప్పుడో కొత్త దారి పట్టుకుని నడిపిస్తే చాలు. అవి ఎక్కడెక్కడికో తనని తీసుకుపోతాయి. వాటికి కొత్త దారనీ, కొత్త మైదానమనీ పట్టింపు ఉండదు. మేతకీ నీటికీ ఢోకాలేనప్పుడింతే కామోసు. బహుశ మనమంతా అంతే కావచ్చు. ఆ వర్తకుడి కూతురు పరిచయమైనప్పట్నించి ఇంకే అమ్మాయిల వంకా తనూ చూడటం లేదుగా.

ఆ రోజు ఆ అమ్మాయి ఊరు తరీఫాకి వెళ్ళేందుకు నిశ్చయించుకుని నీటుగా ముస్తాబవుతాడు. ఇంకో పెద్ద మంద గొర్రెల కాపరి ఆమెని ఆకర్షించకుండా తను తొందరపడాలి.

ఆ వూర్లో ఒక మంత్రగత్తె వుందని గుర్తుకొస్తుంది. వాళ్ళు తనలా సంచారులే కాని మోసగాళ్ళూ పిల్లలనెత్తుకుపోయేవాళ్ళు అని వాళ్ళకి చెడ్డపేరుంది. అందుకని మొదట సంశయిస్తాడు. నీ కలలకి అర్ధమేమిటో తెలుసుకుందుకు ఒచ్చేవని తెలుసయ్యా అంటుందామె. ఆశ్చర్యపోతాడు. ఆమె అంటుంది: కలలు దేవుని భాష. అతను మన భాషలో చెబితే నేను వివరించగలను కానీ ఆత్మ భాషలో చెబితే ఆ ఆత్మకే అది అర్ధమయేది. సరే నీ కలేమిటో చెప్పు అంటుంది.

నా కలలో ఓ బాలుడు నా గొర్రెల దగ్గరకొస్తాడు. దూరంగా పొమ్మని, కొత్తవాళ్ళంటే గొర్రెలు బెదురుతాయని నేను వారిస్తాను. వినకుండా అతను వాటితో ఆడుతాడు; అవీ ఆడుతాయి అదురూ బెదురూ లేకుండా. ఏ హానీ తలపెట్టని పసివారిని అవెలా గుర్తిస్తాయో నాకింకా అశ్చర్యమే. ఉన్నట్టుండి నా రెండు చేతులూ తీసుకుని నన్ను ఈజిప్టులో పిరమిడ్ల వద్దకి చేర్చి అక్కడ ఒక నిధి వుందని చెప్పి, అదెక్కడుందో చూపే లోగానె తెలివొచ్చేసింది. రెండు సార్లూ అంతే. " అంటాడు.

నిధొచ్చాక అందులో పదోవంతు నాకిస్తానంటే చెబుతాను నా రుసుము ఇప్పుడివక్కర్లేదు. అంటుంది మంత్రగత్తె.

అతడికి నవ్వొచ్చింది. ఎదో గుప్తనిధిని కల్లో చూచినందుకు ఇప్పుడు స్వల్ప ధనలాభం.

కలలో పసివారెదైనా చెబితే అది నిజమన్నమాట. నువ్వు సంపన్నుడివౌతావు. అని ఆమె కల మీద వ్యాఖ్యానిస్తుంది.

ఈ మాత్రం నాకు తెలీదనా? అనడుగుతాడు.

తనకొచ్చినది క్లిష్టమైన కల అని, దాన్ని వ్యాఖ్యానించే విద్య తనవద్ద లేనందుకే హస్త సాముద్రికం వంటివి నేర్చుకున్నానని అంటుంది.

అసలు నేను ఈజిప్టుకే పోకపోతే? అనడుగుతాడు.

అప్పుడు నా రుసుమూ పోయినట్టే. ఇది నాకు కొత్త కాదులే ఇంక బయల్దేరు అని తలుపేసుకుంటుంది.

అతనలా వచ్చి ఒక కూడలిలో దుకాణాల మధ్య అరుగుమీద కూర్చుని, జనాలని గమనిస్తుంటాడు. కొందరు పలకరించేరు.

సంచారులకి ఇదో లాభం. ఎందరో మిత్రులవుతారు. కాని వారితో శాశ్వత బంధాలుండక్కర్లేదు.

కొందరు ఇతరెలా ఉండాలో ఉపదేశాలిస్తున్నారు. ఇదో వింత తరహా. అందరికీ అవతలివారు మారాలనే అభిలాషే కాని తామెందుకు మారకూడదని అనిపించదు.

సాయంత్రం కాగానే మందని మేతకి మళ్ళించాలి. మూడ్రోల తరవాత వ్యాపారి కూతుర్ని కలవాలని నిర్ణయం.

తోచక పుస్తకం తెరుస్తాడు. ఎదో అంత్యక్రియల వర్ణనతో మొదలవుతుంది. అదెంతమందో పాత్రలు, పేర్లు. ఇదేం పిచ్చో, నేను పుస్తకం రాస్తే ఒక ఒక అంకానికి ఒక పాత్రనే ప్రవేశపెడతాను పేర్ల గుంపుతో పాఠకుల బుర్రలు తినెయ్యకుండా. అనిపిస్తుంది.

అపుడో వృద్ధుడు తారసపడతాడు. ఆమాటా ఈమాటా చెప్పి మాట కలుపుదామనుకుంటాడు కాని తనకి ఆసక్తి లేదు. చదువుకుంటున్నట్టు నటిస్తాడు. ఆఖరికి, అదేం పుస్తకం? అనడుగుతాడు పెద్దాయన.

జవాబుగా పుస్తకాన్ని అతని చేతికిస్తాడు. దాని పేరు తనకీ తెలీదు, పైగా వృద్ధుడికి చదువొచ్చినట్టు కూడా లేదు. ఎలాగో వదిలించుకోవాలని.

తీసుకుని కొన్ని పుటలు తిప్పి, ఇదా? మంచి పుస్తకమే కాని అన్ని పుస్తకాల్లోలాగే ఒక పెద్ద అబద్ధం ఇందులో కూడా ఉంది. అంటాడు.

ఏమిటా అబద్ధం? అనడిగితే, "జనులు తమ గమ్యాన్ని ఎంచుకోలేరనీ, ఒకనాటికి నిస్సహాయులై విధిని ప్రార్ధించాలని. ఇది పెద్ద అబద్ధం కదా." అంటాడు వృద్ధుడ్డు.

"నా విషయం వేరు లెండి. నన్ను పూజారిని చెయ్యాలని మావాళ్ళనుకుంటే నేను సంచారాన్ని ఎంచుకుని దాన్నే అనుసరిస్తున్నాను" అంటాడు.

"ఎందుకంటే ప్రయాణాలు నీకిష్టం కాబట్టి" అంటాడు వృద్ధుడు.

తనగురించి ఎలా తెలిసిందో అనుకుని. "మీరెక్కణ్ణించి?" అనడుగుతాడు.

తను సలేం అనే దేశానికి రాజునని, తనపేరు మెల్చిజెడెక్ అంటాడు వృద్ధుడు.

తరవాత అడుగుతాడు.

"నీ దగ్గర ఎన్ని గొర్రెలుంటాయి"

"కావలసినన్ని"

"అబ్బో కావలసినన్నైతే ఇబ్బందే."

"చాలు. నా పుస్తకమిస్తే పోతా"

"అందులో పదోవంతు ఇవ్వు, నీ నిధికి దారి చెబుతా" అంటాడు వృద్ధుడు.

నిధి ప్రస్తావన ఇతడికెలా తెలిసింది? ఇతను ఆ మంత్రగత్తె సంబంధీకుడై ఉండాలి.

అంతలో వృద్ధుడు నేలవైపు వంగుతాడు. అతని చొక్కాలోపల చాతిమీద కళ్ళు మిరుముట్లుగొలిపే బంగారు కవచం కనిపిస్తుంది. వృద్ధుడు అలాగే వంగి ఇసకలో బాలుడు చిన్నప్పుడు చదివిన బడిపేరు, తండ్రిపేరు, వర్తకుడి కూతురు పేరూ కూడ రాసి అతడికి అమితాశ్చర్యం కలిగిస్తాడు.

అయితే ఒక రాజువై ఉండి ఒక గొర్రెలకాపరినైన నాతో ఇంత సేపు మాట్లాడుతున్నావెందుకు? అని అడిగితే, వృద్ధుడు ఇలా చెప్పుకొస్తాడు.

ఎందుకంటే, నీ జీవిత గమ్యమేమిటో నువ్వు గ్రహించావు. ఏది సాధించాలని మనం బలంగా కోరుకుంటామో అదే మన జీవిత గమ్యం. చాలామందికి యుక్తవయసులో ఇది స్పష్టంగా ఉంటుంది. అది ప్రతిదీ సాధ్యమేననుకునే వయసు, కలలు కనేందుకు భయపడని వయసు. కొన్నాళ్ళకి ఎదో అదృశ్య శక్తి వారినావహించి అది కష్టమనీ, అసాధ్యమనీ నమ్మించి నీరుగారుస్తుంది.

మిగతాది అర్ధం కాలేదు కాని ఆ అదృశ్యశక్తి ఏమిటని అడిగాడు. వ్యాపారి కూతురుతో గొప్పగా చెప్పుకోవచ్చు.

వృద్ధుడిలా చెప్పేడు:

"ఆ అదృశ్య శక్తి నీరుగార్చేస్తుంది కాని, అనుకున్నది సాధించేందుకు అది అవసరం. అది సంకల్పానికి పదునుపెట్టి సన్నద్ధం చేస్తుంది. ఈ సందర్భంగా ఒక గొప్ప ప్రపంచ సత్యాన్ని నీకు చెప్పాలి. మన మనసులో కలిగిన బలమైన కోరిక వాస్తవానికి ఈ విశ్వపు హృదయంలో మొదట కలిగి, మన జీవిత లక్ష్యంగా ఉద్దేశింపబడేది."

"ఎటువంటి కోరికైనా అంటే? సంచారం చేదామనుకోవడం, ఒక వ్యాపారి కూతురుని పెళ్ళాడటం కూడానా?"

"అవును. ఒక నిధికోసం వెదకడం కూడా. ఈ విశ్వపు ఆత్మ మనుగడకి జనుల ఆనందాలే కాక వారి విషాదాలు, ఈర్ష్యాసూయలు కూడా పోషకాలు. తమ జీవన గమ్యమేమిటో తెలుసుకోవడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం. అన్నీ ఒకటే.

"ఇంకా, బలంగా కోరుకున్నది చేతికందేలా విశ్వం కుట్రపనుతుంది. సరే, నువ్వెందుకు గొర్రెలు మేపుకుంటున్నావు?

"ఎందుకంటే నాకు సంచారమూ కొత్త కొత్త పరిచయాలూ ఇష్టం.

అప్పుడు వృద్ధుడన్నాడు.

"అదిగో అక్కడ బేకరీ నడిపే ఆయన్ని చూడు. ఆఫ్రికా చూడాలని ఎన్నో యేళ్ళుగా అతని కోరిక. దానికోసం నెలనెలా డబ్బూ పోగేస్తున్నాడు. ముసలితనంలో తన కోరిక తీర్చుకోవాలని అతని యోచన. ప్రజలెప్పుడుపడితే అప్పుడు తమ కోరిక సఫలం చేసుకోగల సమర్ధులని అతను గ్రహించినట్టు లేడు."

"అప్పుడతను గొర్రెల కాపరే కావచ్చు కదా"

"కావచ్చు కాని ఆడ పిల్లల్నిచ్చేవాళ్ళు గొర్రెల కాపర్ల కన్న రొట్టెలమ్ముకునే వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తారు" అన్నాడు వృద్ధుడు.

కుర్రాడికి ఎక్కడో కలుక్కుమంటుంది.

"నాకే ఇవన్నీ ఎందుకు చెబుతున్నావు" అనడుగుతాడు.

"ఎందుకంటే నీ లక్ష్యాన్ని నువ్వు కనుగొని అది సాధించే క్రమంలో నిరుత్సాహివై ఆగిపోయావు. అందుకని."

"అంటే ఇలాటి అన్ని సందర్భాల్లోనూ నువ్వొస్తుంటావా?"

"అవును. కానీ ఇలా కాదు. కొన్ని సార్లు ఉపాయం రూపంలో, కొన్ని సార్లు, పరిస్థితి చెయిదాటిపోయిందనుకునేవారికి ఓ ఆశాకిరణం రూపంలో, ఇలా ఎలాగోల వాళ్ళ పనులు నెరవేరుస్తాను. కాని వారికది తెలియదు."

వృద్ధుడు గతవారం ఒక గని కార్మికుడి విషయం ప్రస్తావించేడు. అతడు మరకత మణి సాధించాలనే ఉద్దేశంతో ఎన్నెన్నో పరిశోధనలు చేసి తవ్వటం కొనసాగిస్తాడు కానీ మణి లభించలేదు. దాని సాధనే అతని జీవిత లక్ష్యమై ఉంది, అలిసిపోయి ఇక తవ్వకం ఆపెద్దామనుకున్నాడు. నాకు తెలుసు అతని కాలికింద ఉన్న బండని తొలగిస్తే మణి అక్కడే ఉంది. కానీ ఎలా? అప్పుడు నేనో బండరాయినై దొర్లుకుంటు పోయి అతని కాలికి తగిలేను. ఇన్నేళ్ళ శ్రమా వృధా అయిపోయి భంగపాటుతో కుంగిపోయున్న కార్మికుడు కోపోద్రిక్తుడై ఆ రాయిని నేలకేసి కొట్టేసరికి బండపగిలి మణి లభిస్తుంది.

"జనులకు తమ గమ్యమేమిటన్నది మరీ చిన్నతనంలోనే వెల్లడి ఆవటంవల్లనో యేమో, ఓ వయసు వచ్చేసరి చల్లారిపోయి నీరసపడతారు. అదంతే. "

నిధి గురించి మాట్లాడరేం అనడుగుతాడు బాలుడు.

"ఏ నదీ కెరటాలైతే నిధిని బహిర్గతపరుస్తాయో, అవే కెరటాలు దాన్ని కప్పి కూడ వుంచుతాయి. నాకు నీ మందలో పదో వంతిస్తే చెబ్తాను" అంటాడు వృద్ధుడు.

"నా నిధిలోనే పదోవంతు తీసుకోవచ్చుగా?" అంటాడు బాలుడు.

వృద్ధుడు నిరుత్సాహంగా, "చేతిలో పడనిదాన్ని వాగ్దానాలు చేసే వాళ్ళు అది చేజిక్కేందుకు శ్రద్ధ పెట్టరు.”

కానీ మంత్రగత్తె దానికొప్పుకుందే. అంటాడు బాలుడు.

"వాళ్ళ పనే అది. ఏదేమైనా జీవితంలో ప్రతిదానికి దాని రుసుము దానికుంటుందని గ్రహించావు. మంచిది. రేపీసరికి అనుకున్నప్రకారం మందలో పదో వంతు తీసుకుని ఇక్కడికిరా. అన్నీ చెబుతాను. అని వృద్ధుడు సెలవుతీసుకుంటాడు.

తరవాత ఊర్లో తిరుగుతూ ఆలోచిస్తాడు. ఒక గొర్రెనమ్మితే ఈజిప్టు టికట్టు కొనుక్కోవచ్చు. కానీ అమ్మెయ్యడం బాధనిపించిది. మంద, తల్లిదండ్రులు, వర్తకుడి కూతురు. వారందరికీ దూరం కావాలి. అయితే తల్లితండ్రులు ఈ సరికి తన ఎడబాటుకు అలవాటుపడ్డారు. తన యావే కాని వర్తకుడి కూతురు తనని పట్టించుకున్నట్టు లేదు. వారెవరూ తనపై ఆధారపడ లేదు. అయితే గొర్రెలు తనకి ఎంతో అలవాటుపడ్డాయి. తన ఆలనా పాలనలో అవి పెరిగాయి. తన ఎడబాటు వాటికెంతో బాధాకరం.

గాలి రివ్వున వీస్తోంది. ఎంత స్వేఛ్చ దానిది. ఎక్కడా ఎవరినీ అంటిపెట్టుకోనుండదు. అంత స్వేఛ్ఛ తనకే ఉంటే! అసూయ కలిగింది. మళ్ళీ తన స్థితి ఆలోచించాడు. అసలు తన జీవిత లక్ష్యానికి అడ్డు పడేవారు ఈ మంద, తల్లిదండ్రులు, ఆ పిల్లా? లేక లేనిదాన్ని ఊహించుకుని అడుగు ముందుకెయ్యలేకపోతున్న తనేనా? రెండోదే నిజం. తన లక్ష్యానికి తనే అడ్డుపడుతున్నాడు. మిగతా వారంతా ఈ ఆశయసాధనకి సోపానాలు. ఇలా అలోచించి కొన్ని గొర్రెలని తీసుకుని మర్నాడు వృద్ధుడి వద్దకి బయలుదేరతాడు.

గొర్రెల్ని వృద్ధుడికిస్తూ అంటాడు: నా మిత్రుడు మిగతా మందనంతా కొనుక్కుపోయాడు. తనకి గొర్రెలకాపరి కావాలని ఇలా అనిపించిందో లేదో నేనలా కనిపించేనట, ఇలా జరగడం శుభశకునమట. అని.

"ఆవును అదే అనుకూల సిద్ధాంతం. మొదట వరించే అదృష్టం. కొత్తగా పేకాటాడేవాళ్ళు సామాన్యంగా ముందు ఒకటో రెండో ఆటలు గెలుస్తారు. అదొక ప్రేరక శక్తి. జనులు తమ లక్ష్యం నించి వెనుదిరక్కుండా ప్రోత్సహించే తొలి విజయం."

"అస్సరే, ఎక్కడ నా నిధి?" అంటాడు బాలుడు.

"అది ఈజిప్టులో పిరమిడ్ల దగ్గర ఉంది" అంటాడు వృద్ధుడు.

అతడు నిర్ఘాంత పోయాడు. మంత్రగత్తే ఇదే చెప్పింది కాని ఏమీ తీసుకోలేదు. అదే చెప్పి ఇన్ని గొర్రెలు ఇతడు లాక్కున్నాడే.

"నిధి కనుగునేందుకు మార్గంలో కనబడే శకునాల గుర్తులను అనుసరిస్తూ పో. సృష్టికర్త అందరి దారినీ తయారుగా ఉంచాడు. నీ గుర్తులననుసరించి నువ్వు సాగిపోవడమే"

అప్పుడు ఒక సీతాకోక చిలక వారి మధ్యనుండి ఎగురుతుంది. సీతాకోక చిలకలు శుభశకునమని తన తాత చిన్నప్పుడెప్పుడో చెప్పిన సంగతి బాలుడికి గుర్తొస్తుంది. అలాగే చిమ్మటలు, నాలుగాకుల రెమ్మలు.

"అవును మీ తాతగారు చెప్పినట్టు సీతాకోక చిలకలు మంచి శకునం". అంటాడు వృద్ధుడు.

అంటూ చొక్కా విప్పుతాడు. అతని వక్షానికి ధగద్ధగాయమానమై, విలువైన రాళ్ళు పొదిగి కళ్ళు జిగేలుమనే కవచం దర్శనమిస్తుంది. ఇతడు నిజంగా రాజే. దొంగల భయంతో పాత చొక్కా తొడుక్కున్నాడు.

వృద్ధుడా కవచం నించి రెండు రాళ్ళు పీకి బాలుడి చేతికిచ్చి, ఇవుంచుకో. ఒకటి యూరిం, ఇంకోటి తుమ్మిం. నల్లది అవుననీ, తెల్లది కాదని. శకునాలు నీ వివరణకి అందనప్పుడు ఇవి సహాయపడతాయి. కాని వీలయినంతవరకు నీ నిర్ణయాలు నువ్వే తీసుకో. నీకు నిధెక్కడుందో చెప్పేను. కాని నిన్ను సిద్ధం చేసినందుకు కొంత రుసుము తీసుకోవాల్సి వచ్చింది." బాలుడు రాళ్ళు తీసుకుంటాడు. ఇప్పట్నించి తన నిర్ణయాలు తనవే.

ఆఖరుగా వృద్ధుడు అంటాడు: "ఏది చేసినా లక్ష్యమొక్కటే అని మరవకు. శకునాలూ గుర్తుల భాషని అనుసరిస్తూ పో. చేపట్టినది ముగించేవరకు ఆపకు. వెళ్ళేముందు నీకో కథ చెప్పాలి. "

ఒక వర్తకుడు తన కొడుకుని ఆనంద రహస్యం తెలుసుకు రమ్మని ఒక కొండకొమ్మన ఉండే జ్ఞాని ఆశ్రమానికి పంపుతాడు. అక్కడికి వెళ్ళిన బాలుడికి ప్రశాంతత, వైరాగ్యాలకి బదులు వ్యావహారిక జీవనంలోని హడావిడంతా కనిపిస్తుంది. తన కోరిక చెప్పగానే బాలుడికి జ్ఞాని ఓ చెంచాలో నూనెవేసి ఇచ్చి ఇది పట్టుకుని భవనమంతా చూసి రా. నూని ఒలికిపోకుండా చూసుకో. అని పురమాయిస్తాడు. బాలుడు తిరిగి తిరిగొచ్చి నూనె చెంచా అతని చేతిలో పెడతాడు.

"సరే చెప్పు" ఫలానా మందిరంలో గోడ మీద శిల్ప సంపద గురించి నీ అభిప్రాయం?" అనడుగుతాడు జ్ఞాని. అబ్బే అది చూళ్ళేదండీ అంటాడు బాలుడు.

"పోనీ ఫలాని సభామందిరంలోని కుడ్య చిత్రాల గురించి నీ వ్యాఖ్యానం?" అంతే, అబ్బే ఏదీ చూళ్ళేదండీ, నా ధ్యాసంతా నూనె ఒలికిపోకుండా చూడ్డంతోనే సరిపోయింది.అంటాడు బాలుడు.

సరే మళ్ళీ నూనె ఇంద. ఈ సారి పోయి చూసిరా. అంటే మళ్ళీ వెళ్ళీ అన్నీ చూసొచ్చి వాటి వివరాలు కళ్ళక్కట్టినట్టు చెబుతాడు బాలుడు. సర్లేవయ్యా చెంచాలో నూనేదీ? అనడిగితే, అప్పుడు తెలుస్తుంది ఈ హడావిడిలో నూనె కారిపోయిందని.

ఇప్పుడు ఆనంద రహస్యం విను. నూనె ఒలకబోసుకుండా కళ్ళు పెద్దవి చేసుకుని అన్ని వింతలూ చూడటమే ఆనందం. ఇక పోయిరా."

ఈ కథలో కళా సంపద తన సంచారాభిలాషనీ, నూనె తన గొర్రెలనీ రెంటినీ నిలబెట్టుకోవాలనీ బాలుడికి బోధపడుతుంది.

తరవాత వృద్ధుడు బాలుడికేసీ ఆకాశంకేసీ మార్చి మార్చి చూస్తూ ఎదో వల్లించుకుని నిష్క్రమిస్తాడు.

మెల్చిజెడెక్ అనే ఆ సలేం రాజు తరీఫా నగరంలోని అత్యున్నత రాజ ప్రాసాద గవాక్షం నించి సుదూరంగా కనిపించే ఆఫ్రిక వంక చూస్తూ నిల్చుంటాడు. కింద గొర్రెలు కొత్త యజమానికి అలవాటు పడేందుకు అరుస్తున్నాయి.

ఆ బాలుడు తనకిక కనిపించడు. అదంతే. తన వాటా పదో వంతు తీసుకున్నాక తనెవరికీ కనిపించడు. కాని ఎందుకనో ఆ బాలుడు విజయం సాధించాలని, అవసరమైనప్పుడు తనని స్మరించాలనీ అనిపిస్తోంది. తన పేరు గుర్తుండేది కాదు; నాలుగైదు సార్లు వల్లె వేయించి ఉండాల్సింది.

అయితే తాను అనుగ్రహప్రదాత, కోరికలేవీ ఉండరాదు. జీవిత లక్ష్యమంటూ ఏదీ లేదు కనక. "కానీ సేలం వృద్ధ రాజుగా ఉన్న మానవమాత్రుడికి ఈ మాత్రం కోరిక తప్పులేదు విధాతా" అని ఆకాశంలోకి చూసి అనుకుంటాడు.

**

ఆఫ్రికా చేరిన బాలుడికి వారి ఆచార వ్యవహారాలు కొత్తనిపిస్తాయి. తాము మతభ్రష్టం అనుకునే పనులు వీళ్ళు చేస్తున్నారు. తమలా వైన్ కాక చేదు టీ తాగుతున్నారు. భాషా కొత్త. స్పానిష్ కాక అరబిక్. ఒంటరి తనం అనిపించినా, గొర్రెలనమ్మిన డబ్బు లోపల చిన్న సంచీ నిండా వుంది. డబ్బుంటే ఒంటరితనం బాధించదు. అది కొంత నయం.

వృద్ధుడు గుర్తులనీ శకునాలనీ అనుసరించాలనీ చెప్పేడు. గొర్రెలతో తన సాహచర్యంలో అదీ తెలిదింది. ఆకాశాన్నీ భూమినీ అటూ ఇటూ చూచి పరిస్థితిని అంచనా వెయ్యచ్చు. ఒక రకం పక్షి పైనుంటే కిందెక్కడో పామున్నట్టు. ఒక రకం తుప్పుంటే కింద నీరున్నట్టు. ఇవన్నీ గొర్రెలు తనకి నేర్పేయి.

గొర్రెలకే అన్ని నేర్పిన దేవుడు మనిషైన తనకి నేర్పకపోడు. ఆ తలపుకి టీ చేదు కొంచెం తగ్గినట్టనిపించింది.

ఎవరు నువ్వు? అన్న ప్రశ్న స్పానిష్‌లో వినిపించింది.

ప్రాణం లేచొచ్చింది. శకునాల గురించి ఆలోచిస్తూండగా కలిగిన శుభ శకునం.

అతని డాబూ దర్పమూ చూస్తే పట్నవాసం వాడిలా ఉన్నాడు. "బాబ్బాబు మనకి చెరో గ్లాసూ వైను తెప్పిద్దూ ఈ చేదు టీ తాగలేను" అన్నాడు.

"వీరి మతంలో వైన్ నిషేధం" అన్నాడతను.

తాను పిరమిడ్ల వద్దకు పోతున్న సంగతి అతనితో పంచుకుంటాడు. కాని నిధిగురించి చెప్పడు ఇతనూ వాటా అడుగుతాడని. అయిన చేతిలో లేనిదాన్ని వాగ్దానం చెయ్యొద్దని కద వృద్ధుని సలహా.

"అక్కడికెలా వెళ్ళలో చెప్పగలరా?" అనడుగుతాడు.

ఓ చెవి ఇటు పడేసి ఆ హొటల్ యజమాని వీళ్ళ మాటలు వింటున్నట్టున్నాడు. బాలుడికది నచ్చలేదు.

"చెప్పగలను కాని కర్చుతో కూడినది. ఏమాత్రం వుంది నీదగ్గర?"

ఈ ప్రశ్న కాస్త వింతనిపిస్తుంది బాలుడికి.

సంచీ చూసి చూపిస్తాడు. యజమానీ వెనక్కొచ్చి చూస్తాడు. పక్కనున్నాయన అతనూ అరబిక్ లో ఎడో మాట్టాడుకుంటారు.

"మననిక్కడ్నించి పొమ్మంటున్నాడు పద పోదాం" అని కొత్త వ్యక్తి అంటాడు, ఇద్దరూ అక్కణ్ణించి లేస్తారు.

యజమాని టీ డబ్బులు తీసుకుని కోపంతో బాలుడి చెయ్యి పట్టుకు లాగి అరబిక్‌లో ఏదో అంటున్నాడు. కొత్త మనిషి గొంతు పెంచి కళ్ళెర్ర చేసి బాలుణ్ణి విడిపిస్తాడు. "వాడికి నువ్విచ్చిన డబ్బు సరిపోలేదట. అంతా లాక్కుందామని చూస్తున్నాడు. ఇది నువు చూసిన తరీఫా లా కాదు. ఓడరేవు. అన్ని ఓడరేవులూ దొంగలకి నిలయాలు. పద" అని దారితీస్తాడు.

రెండు ఒంటెలు కొనాల్సుంటుందని చెప్పి డబ్బు లెక్కపెట్టి పట్టుకుంటాడు కొత్త వ్యక్తి. నా డబ్బు నేనే పట్టుకుంటానని అడగాలనిపించినా నమ్మదగిన స్నేహితుడే కదాని అడగడు. బజార్లో విపరీత జన సమూహం. అక్కడో దుకాణంలో అత్యంత ఆకర్షణీయంగా కనిపించిన కత్తి కుర్రాడి దృష్టిని మళ్ళించిన లిప్తపాటులో కొత్త వ్యక్తి జనాల్లో కలిసిపోతాడు. వాడు తన డబ్బుతో ఉడాయించేడని గ్రహించడానికి ఎంతో సేపు పట్టదు. సూర్యోదయ కాలానికి తెలిసిన దేశంలో ఒక గొర్రెల మంద, తెలిసిన భాష, పరిసరాలు, ఆత్మ విశ్వాసం, వర్తకుడి చక్కని కూతురు. సూర్యాస్తమయ సమయానికి కొత్త దేశం, కొత్త భాష; పరిచయాల్లేవు, గొర్రెల్లేవు, వాటినమ్మిన డబ్బూ పోయింది. సర్వనాశనమైపోయింది.

సిగ్గుతో ఏడుపు తన్నుకొస్తుంది. తన గొర్రెలముందెన్నడూ ఏడవలేదు. ఇప్పుడు ప్రార్ధనాకాలమని నిర్మానుష్యమైపోయిన ఈ వీధిలో ఏడ్చాడు. తమ కలలు సాకారం చేసుకుందామని ప్రయాస పడేవారికి దేవుడిచ్చే బహుమానం ఇదా అని దుఃఖం పొంగుకొస్తుంది.

నా గొర్రెలున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. చుట్టూ ఉన్నవారినీ ప్రేమించాను. ఇప్పుడు కోపంగా ఉంది. ఒక్కడు చేసిన పనికి లోకం మీద కోపం. నిధులను సాధించినవారంటే ఇంకా కోపం. నాది చెయిజారిపోయింది కనక. చేత చిల్లిగవ్వ లేదు. నేను ప్రపంచాన్నీ విధినీ ఎదిరించేదేమిటి. అల్పుడిని, అప్రయోజకుడిని.

సంచీ వెదుకుతాడు. ఏముంది నిన్న సగం తిని వదిలేసిన రొట్టెముక్క, తలగడ పుస్తకం, పెద్దాయన ఇచ్చిన రెండు రాళ్ళు.

ఆ రాళ్ళు చూస్తే కొంత ఉపశమనం కలిగింది. ఆరు గొర్రెలిచ్చి రెండు రాళ్ళు కొనుక్కున్నాడు. బంగారపు తాపడం నించి తీసినవి కనక విలువైనవే అయుండాలి. ఇవమ్ముకుని తిరుగు టపా టికెట్టు కొనుక్కోవాలి. కనీసం ఈసారైనా మోసపోకుండా జాగ్రత్త పడాలి. ఈ కొత్త వాడి స్నేహంలో తనకి కలిగిన ప్రయోజనమల్లా ఇక్కడ చుట్టూ దొంగలేనన్న విషయం తెలియడం.

హోటల్ యజమాని గుర్తొచ్చాడు. పాపం అతగాడు వీడిని నమ్మొద్దనీ తన భాషలో చెబుతున్నాడు. అందుకే అక్కణ్ణించి పారిపోయేందుకు వీడు అంత తొందర పడ్డాడు. నేను వీడిని నమ్మేను. అందరూ ఇంతే. ప్రపంచాన్ని అదున్న స్థితిలో కాక ఎలా ఉండాలని తామూహించుకుంటారో ఆ స్థితిలో చూచేందుకే ఇష్టపడతారు.

సంచీలోని ఉరిం నీ తుమ్మిం ని తడిమాడు. పెద్దాయన మాటలు గుర్తొచ్చాయి. బలంగా కోరుకున్నది చేతికందేలా విశ్వం కుట్రపన్నుతుందన్నాదు. ఆ మాటల అర్ధమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అన్నీ పోయినా అవి మిగులున్నాయి. తనగురించి తెలిసిన ఒక రాజు తనకి తెలుసు. ఆ రాళ్ళనడిగితే సమాధానాలు దొరుకుతాయని కూడ చెప్పేడు. అందుకని అడిగేడు: ఆ వృద్ధుని అనుగ్రహం తనపై ఇంకా ఉన్నదా లేదా అని. బయటికి "అవును" అనే రాయి వచ్చినిది. నాకు నిధి లభిస్తుందా అన్న ప్రశ్న వేసి సంచిలో చెయ్యిపెట్టి తీసేసరికి రెండురాళ్ళూ కిందపడిపొతాయి. అప్పుడు తెలుస్తుంది సంచీకి కన్నముందని. అవి తీసుకుని మళ్ళీ సంచీలో వేసుకోబోతుండగ, వృద్ధుని ఇంకో వాక్యం "శకునాలూ గుర్తులూ చూచుకుని అనుసరించు" అన్నది గుర్తొస్తుంది.

చిరునవ్వు నవ్వి వాటిని మళ్ళీ సంచీలో వేసుకుంటాడు సంచీ కన్నాన్ని పట్టించుకోకుండా. ఎందుకంటే లక్ష్యం వైపు తన ప్రయాణాన్ని ప్రభావితం చేసే ప్రశ్నలు వేసుకోకుండా, సొంత నిర్ణయాలపైనే ఆధారపడాలి అని కదా నేర్చుకున్నది.

కాని వృద్ధుని సహకారం ఇంకా ఉన్నదని రాళ్ళు చెప్పినాక విశ్వాసం పెరిగింది. తనిప్పుడున్నది కొత్తదే కాని పరిచయం లేనిది కాదని అనిపిస్తుంది.

సంచారంలో కొత్త ప్రదేశాలు చూడాలని కద తన లక్ష్యం. అదెప్పుడో నెరవేరింది. మరే గొర్రెలకాపరీ చూడనంత ప్రపంచాన్ని తాను చూచాడు. జరిగిన వాటిని మననం చేసుకుంటే కత్తి విషయం, తనకి జరిగిన విషయమూ గుర్తుకొచ్చి మళ్ళీ బెంగ కలుగుతుంది. తానిప్పుడు దొంగని నమ్మి అన్నీ పోగొట్టుకున్న దీనుడా గుప్త నిధిని సొంతంచేసుకోబోయే ధీరుడా, అనుకుంటే, తను ధీరుడినే అని నచ్చచెప్పుకున్నాడు.

***

కాసేపలా కునుకులోకి జారుకుని ఎవరో కుదిపినట్టు గబుక్కున నిద్ర లేస్తాడు. కళ్ళు గొర్రెలకోసం వెదుకుతాయి. లేవన్న సంగతి గుర్తొస్తుంది. కాని ఇప్పుడు విచారం కాక సంతోషంగా వుంది. వాటి పాలన బాదరబందీ లేనందుకు. చేతిలో చిల్లిగవ్వ లేదుకాని గుండెల్నిండా ఆత్మవిశ్వాసం ఉంది.

వీధిలో దుకాణాలు లేపుతున్నవాళ్ళలో ఒక మిఠాయి కొట్టాయనకి సహాయం చేస్తాడు. కృతజ్ఞతగా అతను మొదటి మిఠాయి ఇస్తే స్వీకరిస్తాడు. ఇద్దరూ చెరో భాషలోను చాలా సేపు మాట్టాడుకుంటారు. ఒకరి భాష ఒకరికి అర్ధం కాకపోయినా సంభాషణ సజావుగా జరిగిపోతుంది. పదాలూ వాక్యాల అవసరంలేని భాష ప్రపంచంలో ఒకటి ఉంటుందని అతనికి ముందే తెలుసు. తన గొర్రెలతో ఆ విధంగానే సంభాషించేవాడు. ఇప్పుడిక్కడి మనుషులతోనూ అంతే.

కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. భాష రాకుండా సంభాషించే తనకు ప్రపంచ తత్వాన్ని అర్ధం చేసుకోవడం కష్టం కాదనిపిస్తుంది.

అతి నెమ్మదిగా వీధిలో నడుస్తుంటాడు. అప్పుడే శకునాల గుర్తింపు సులభం. అయితే దానికి చాలా ఓరిమి కావాలి. ఓరిమిలో గొర్రెలకాపరుల తరవాతే ఎవరైనా. అది తన స్వానుభవంలోనిదే. ముక్కూ మొహమూ తెలీని కొత్త ప్రపంచంలో తనకుపయోగపడుతున్నవి పూర్వం తన గొర్రెలు తనకు నేర్పిన పాఠాలే.

అన్నీ ఒకటే అనికదా పెద్దాయన వాక్యం.

***

కాస్త దూరంలో ఒక స్ఫటిక పాత్రల దుకాణముంటుంది. మొదట్లో బాగా గడించినా పోటీలో చితికిపోయి దుకాణాన్ని మొక్కుబడిగా తెరుస్తూ బేరాల్లేక కాలక్షేపం చేస్తుంటాడా దుకాణదారు. దుకాణం అద్దాల్లో పాత్రలూ దుమ్ము పట్టేసి కళా విహీనంగా కనబడతాయి. తినడానికేదైనా పెడితే అవి శుభ్రం చేస్తానని చెప్పి వాటిని శుభ్రం చేస్తాడు బాలుడు. ఆ సమయంలోనే ఒకట్రెండు బేరాలూ వస్తాయి. అయిపోయేక "పద భోంచేద్దాం" అని, "నువ్వు శుభ్రం చేసేవని కాదు, ఆకొన్నవాడికి అన్నంపెట్టమని ఖురాన్ వాక్యం" అంటాడు దుకాణదారు.

మరెందుకు శుభ్రం చేయించుకున్నావు? అనడిగితే, "ఎలాగూ పాత్రలు మసిపట్టేసున్నాయి. వాటిని రుద్దే క్రమంలో వాటి మసితోపాటు మన తలపులకి పట్టిన మసీ వదులుతుంది. వస్తు శుద్ధితో ఆత్మ శుద్ధి జరుగుతుంది." అంటాడు దుకాణదారు.

తినడం అయాక, "నా దుకాణంలొ పనిచెయ్యి. ఈరోజు నువ్వు పనిచేస్తుంటే రెండు బేరాలొచ్చేయి. ఇది మంచి శకునం అంటాడు దుకాణదారు.

అందరూ శకునాలగురించి మాట్టాడుతున్నారే. కాని ఎవరికీ ఆ మాటల భావం తెలీదు. తనక్కూడా ఇప్పుడే కద తెలిసింది ఇన్నాళ్ళూ భాష అవసరం లేకుండా గొర్రెలతో సంభాషించగలుగుతున్నా.

పనిచేస్తాను కాని ఈ ఒక్కరోజే. మీ అంత సామాన్నీ శుభ్రం చేస్తాను. నాకు ఇజిప్టు టిక్కట్టు డబ్బులివ్వండి అంటాడు బాలుడు.

దుకాణదారు నవ్వి, "వెర్రివాడా, ఒక రోజు కాదు సంవత్సరమంతా పనిచేసినా అంత డబ్బు కూడదు. వేలమైళ్ళ ఎడారి వుంది అక్కడికీ ఇక్కడికీ మధ్య. వెళ్ళడం కుదిరేపని కాదు అంటాడు.

బాలుడికి ఒక్కసారి ప్రపంచం శూన్యమూ నిశ్శబ్దమూ అయిపోతుంది. చుట్టు పక్కల శబ్దాలేవీ వినిపించవు. మాట పెగలదు.

దుకాణదారది చూసి, పోనీ మీ వూరి టికట్టుకు సరిపడా ఇస్తాలే బాబూ అంటాడు.

"సరే ఇక్కడే పనిచేస్తా లెండి. నాకు గొర్రెలమంద కొనుక్కొనేందుకు డబ్బు కూడే వరకు" అంటాడు ఒక నిశ్చయానికొచ్చి.

రెండో భాగం

అతడు పనిలో చేరి నెల్లాళ్ళయింది. అప్పుడప్పుడూ చెప్పే జాగ్రత్తల నస తప్ప దుకాణదారు అమ్మిన ప్రతి వస్తువు మీద కమీషను బానే ఇస్తున్నాడు. ఇంకో సంవత్సరానికి కొన్ని గొర్రెలు కొనుక్కోవచ్చునని లెక్క తేలింది.

ఓ రోజు, ఇక్కడిలాగ ఒక అద్దాల పెట్టి నిలబెట్టి దాంట్లో కొంత సామాను పెడదామండీ అన్నాడు కుర్రాడు.

అబ్బబ్బే జనాలు తన్నుకు పడిపోతారు, అవన్నీ విరిగి పోతాయి అంటాడు దుకాణదారు.

ఆరు బయట పాములు కుడతాయని చెప్పి మందని మేపడం మానేస్తాముటండీ, నేను గొర్రెలకాపరిని, నాకీ లెక్కలు తెలుసునంటాడు కుర్రాడు.

అతనొచ్చాక వ్యాపారం బాగా పెరిగింది. తను అమ్మే విధానం కూడా దుకాణదారుకి నచ్చింది. చాలా తెలివిగా మాట్టాడుతూ ఎక్కువ అమ్మకాలు చేస్తున్నాడు. దుకాణదారుకీ బాగుంది. ఒప్పుకున్న దానికన్న ఎక్కువ కమీషనే చెల్లిస్తున్నాడు.

"ఇలాగైతే తొరలోనే నీ గొర్రెలు కొనుకోవచ్చు. అంతవరకు బానె వుంది కానీ ఈజిప్టు ఎందుకు వెళ్ళడం" అంటాడు.

"నేను పిరమిడ్లు చూడాలి." అంటాడు బాలుడు.

"అవేం పెద్ద గొప్ప కాదు, రాళ్ళ కుప్పలు, మీ పెరట్లో నువ్వే కట్టించుకోవచ్చు అంటాడు వ్యాపారి.

"సంచారమూ ప్రయాణమూ మీ కలల్లోకొచ్చుండదు లెండి" అని కుర్రాడు ఓ కొత్త ఖాతాదారుతో మాట్టాడేందుకు తిరుగుతాడు.

"ఆ అద్దాల పెట్టె ఎదో అన్నావు దాని సంగతి. నాకు స్వతహాగా మార్పంటే సంశయం. ఇంతకీ ఎందుకది?" అనడుగుతాడు వ్యాపారి.

"బేరాలు బాగున్నాయి. ఇప్పుడె వీలయినంత విస్తరిస్తే మంచిది. దీన్ని ఆరంభంలో అదృష్టం అంటారు. అనుకున్నది సాధించే ప్రయాణంలో ఉత్సాహం కలిగేందుకు ప్రోత్సాహం."

అప్పుడు వ్యాపారి అంటాడు: "ప్రవక్త ప్రసాదించిన ఖురాన్ ప్రకారం మాకు ఐదు ముఖ్య విధులు. వాటిలో అతి ముఖ్యమైనది భగవంతుడొక్కడే అన్న పరిపూర్ణ విశ్వాసం, రోజూ నిర్ణీత సమయాల్లో ఐదు సార్లు నమాజు, రమదాన్ మాసంలో ఉపవాసం, పేదసాదలపట్ల కరుణ కలిగియుండటం."

అక్కడే అపెయ్యడం చూసి, "అయిదోది చెప్పరేం" అనడిగాడు బాలుడు.

"నిన్నో మాట అన్నావు. సంచారమూ ప్రయాణమూ నా కల్లోకొచ్చుండదని. నాకది లేదని లేదు. ముఖ్య విధి కూడా. అది, జీవితంలో ఒక్కసారైనా మక్కా ప్రయాణం. మక్కా ఈజిప్టుకు దగ్గరే. ఆ ప్రయాణమే నా జీవిత లక్ష్యం, పరమార్ధం. ఇప్పుడే గనక అది పూర్తి చేస్తే మరే లక్ష్యమూ లేక జీవితం మీద ఆసక్తి పోయి నిస్సారమయిపోతుందని భయం. అందరికీ ఆ దర్శనం లక్ష్యమయితే ఆ దివ్యానుభూతిని గూర్చి కలలు కనడం నా లక్ష్యం" అన్నాడు వ్యాపారి.

మర్నాడే బాలుడు చెప్పిన విధంగా అద్దాల పెట్టె కట్టిస్తాడు. అనుకున్నవి అనుకున్నట్టు ఇలా అందరికీ జరగవు.

***

బాలుడి సహకారంతో వ్యాపారం బాగాసాగుతోంది. ఇంతకు ముందున్నవాటికన్న ఎక్కువ గొర్రెలు కొనుకోవచ్చు కూడా. ఈ అరబ్బులతో కూడా లావాదేవీలు చెయ్యచ్చు ఎందుకంటే తను వారి భాష కూడ నేర్చుకున్నాడు. ఈ మధ్య యురిం, తుమ్మిం లు వాడే అవసరం కూడా పడలేదు. ఎందుకంటే తన నిధి కల, దుకాణదారు మక్కా యాత్ర కలా ఒకటే ఇప్పుడు.

ఓ సారి కొండనెక్కిన యాత్రికుడొకడు తాగేందుకు ఏమీ లేదని సణిగితే స్ఫటిక గ్లాసుల్లో టీ కూడా అమ్ముదామని బాలుడు దుకాణదారుకి సలహా ఇస్తాడు. ఎప్పట్లాగే వర్తకుడికి భయం. అతనంటాడు: "ఈ సలహా కూడా తప్పక విజయవంతమవుతుంది. కానీ కొన్నేళ్ళుగా జీవితమింతే అనే ఒక రకం స్థబ్ధుకి అలవాటు పడిపోయున్నాను. ఇటువంటి ఒక్కొక్క విజయమూ నేనెంత సాధించగలనో చూపిస్తూనే, ఇంకా ఎంతెంత సాధించే అవకాశముందో కూడా చూపిస్తాయి. అనంతమైన ఆ విస్తృతిని తలచుకుంటే భయం. అవకాశాలున్నా ఉపయోగించి ఎదిగే రకం కాను. కాని దైవానుగ్రహం వల్ల నువ్వు నాకు లభించావు. నీ సలహాలను నిర్లక్ష్యం చేసే సాహసం చెయ్యలేను. తృణీకరించబడిన ఆశీర్వాదాలు శాపాలవుతాయి."

అలా వారు హుక్కా తాగుతూ అరబీలోనే మాట్టాడుకుంటారు. బాలుడికి తన గురించి గర్వం కలుగుతుంది. బహుశ తన నిధి అంటే పరాయి దేశం రావడం, దొంగకి దొరికి మోసపోవడం, ఇక్కడ పనిచేసి సంపాదించడం కావచ్చు. ఇప్పుడు తనకి స్ఫటిక పాత్రల గురించి కూడా కూలంకషంగా తెలుసు. అరబీ తెలుసు. తన గొర్రెలూ తనకి కొన్ని నేర్పేయి కాని ఈ విద్యలనవి నేర్పి యుండేవి కావు. అవెప్పుడూ మేతా నీరూ చూసుకున్నవే కనక అవి నేర్పేయనడం కన్నా తను నేర్చుకున్నాడనం సమంజసం.

అప్పుడు వర్తకుడన్నాడు: "మక్తూబ్" అని.

అంటే? అనడుగుతాడు బాలుడు.

నువ్విక్కడే పుట్టి పెరిగుంటే బాగా అర్ధమయేది కాని అనువాదం చెయ్యమంటే మీ భాషలో "రాసిపెట్టి ఉన్నది" అని అర్ధం. అంటాడు వర్తకుడు.

అంటూ, "రేపట్నించి స్ఫటికపాత్రల్లో టీ అమ్ముదాం" అనికూడా అంటాడు. ఉరకలెత్తే నదీప్రవాహాన్ని నిరోధించడం ఎవరితరం.

***

అలా అలా అక్కడ స్ఫటిక పాత్రల్లో టీ తాగేవాళ్ళు పాత్రలు కూడా కొనుకుంటున్నారు. స్ఫటిక గ్లాసులో టీ తాగితే పరిమళం కోల్పోదని, తూర్పు ప్రాఅంతాల్లో అది దైవకార్యాలకు వాడతారని, వాటిలో ఇస్తే తన అతిధులు ఎంతో ఆనందించేరని ఒక్కొక్కరూ చెప్పుకున్నారు. వ్యాపారం మూడు గ్లాసులూ ఆరు టీలుగా విలసిల్లింది. ఇంకో ఇద్దరు పనివారు కుదిరారు. వ్యాపారి ఎక్కడెక్కణ్ణించో సరుకు పురమాయించి తెప్పిస్తున్నాడు.

అలా నెలలు గడుస్తున్నాయి.

***

తన మేడమీద గదిలో నిద్రలేచాడు బాలుడు. టీ కాచుకుని స్ఫటికపాత్రలో వంపుకుని సేవిస్తూ ఆలోచిస్తూ నాలుగైదు గుక్కలు హుక్క పీల్చేడు. అప్పుడు సంచీలో చెయ్యి పెట్టి ఒకటి పైకి తీసేడు. అది డబ్బు కట్ట.

దీనితో నూటా ఇరవై గొర్రెల మంద వస్తుంది. ఆఫ్రికా నించి సరుకులు తన దేశానికి దిగుమతి చేసుకునే లైసెన్సు వస్తుంది. తిరుగుప్రయాణపు టిక్కట్టూ వస్తుంది.

వర్తకుడు లేచే దాక వేచి "ఇక నేను బయలుదేరే సమయమైంది. మీ మేలు మరువలేనిది. మీదగ్గర కూడబెట్టిన సొమ్ముతో నూట ఇరవై గొర్రెలు కొనుకోవచ్చు. మీరూ సంపాదించారు. దానితో మక్కా యాత్ర చేయవచ్చు. నన్ను ఆశీర్వదించండి" అన్నాడు.

వ్యాపారి అన్నాడు. "నేను మక్కా యాత్రకి పోననీ నీకు తెలుసు. నువ్వు గొర్రెలు కొనవనీ నాకూ తెలుసు."

"అదెవరు చెప్పారు?" అన్నాడు బాలుడు.

"మక్తూబ్" అన్నాడు వ్యాపారి.

అప్పుడు తన ఆశీర్వాదమిచ్చి పంపుతాడు.

నేను తిరిగి వెళ్ళిపోయి మందని కొనుక్కుని స్థిరపడిపోతాను ఇదే నా నిశ్చయం అనుకుంటాడు. గొర్రెల కాపలా నాకు బాగా తెలిసిన విద్యే కదా.

కాని ఈ నిర్ణయం సంతృప్తి గా లేదు. ఒక లక్ష్యం కోసం సంవత్సర కాలం కష్టించి పనిచేసి సాధన సమయానికి పలాయనమా. అక్కర్లేదనుకుంటున్నాడంటే అది అది సిసలైన లక్ష్యం కాదేమో.

ఆ నిర్ణయం తీసుకునే సమయానికి తన సొంత వూరు రెండు గంటల దూరంలో తెలిసిన మార్గం, లక్స్యం రెండ్రొజుల దూరంలో తెలియని భయంకరమైన ఎడారి.

గొర్రెలు నా స్నేహితులని నాకు తెలుసు. ఎడారి కాదేమో కదా.

కనుక తను మళ్ళీ గొర్రెలకాపరి కాగలడు. ఇంటికి దగ్గరగా కోరిన వస్తు వ్యక్తులతో కాలక్షేపం చెయ్యవచ్చు. ప్రపంచంలో గుప్త నిధులుంటే ఉండవచ్చు గాక.

కాని తనొక రాజుని కలిసి మాట్టాడాడు. ఈ భాగ్యం ఎంతమందికి కలుగుతుంది.

ఇవన్నీ సరే. ఎప్పుడైనా చెయ్యగలడు. కానీ ఆ నిధి నిజంగా అంత దూరమూ ఉందా. ఎవర్నినైనా కనుకుందామా. ఒక ఆఖరిసారి. లక్ష్యసాధకులకి సమీపంలోనే ఎదో రూపంలో ఉంటానని కదా రాజు అన్నాడు.

***

అప్పుడు కథలోకి ఒక ఆంగ్లేయుడు ప్రవేశిస్తాడు. అతను విద్యాధికుడు. చాలా శాస్త్రాలు చదువుతాడు. అన్ని మతాల సారమూ తెలుసుకుంటాడు. కానీ సంజ్ఞలు శకునాల మీద ఆసక్తి. అవి రసవాదులకి అధినంలో ఉంటాయని ఎవరో అంటే, వారి అన్వేషణలో బయలుదేరుతాడు. రసవాదులనే పరుసవేదులని పిలుస్తారు. దేన్నైనా బంగారంగా మార్చగల నిపుణులుగా వారికి పేరు. ఒక అరబ్ దేశంలో రెండువందల సంవత్సరాల రసవాది ఇందులో నిష్ణాతుడని వారూ వీరూ చెప్పగా విని, అతన్ని వెదుక్కుంటూ వచ్చి అతని పశువుల శాలలో పడిగాపులు కాస్తుంటాడు. అక్కడికే మన బాలుడు కూడా వచ్చి మొదటి మాట కలుపుతాడు.

ఆ పశుల శాలలో ఎడంగా కూర్చున్న బాలుడు ఇంతకీ తన నిర్ణయం సరైనదేనా? అన్న సందేహం కలుగుతుంది. విషయాలన్నిటికీ నిర్ణయమే మొదటి అడుగు. అది శక్తిమంతమైన ప్రవాహంలో అడుగుపెట్టడం వంటిది. అక్కణ్ణించి అదెటు లాగితే అటు పోవడమే మన పని. నిర్ణయం తీసుకునే సమయంలో మన ఊహలకందని కొత్త కొత్త ప్రదేశాలకి అవి మనని లాక్కెళతాయి. తను మొదటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నో మలుపులు తీసుకుని ఒక స్ఫటిక వ్యాపారి వద్ద పనిచేస్తానని అనుకోలేదు. ఇప్పుడు ఈ ఒంటెల బిడారుతో పోయే నిర్ణయమే తనది. పోయేదెటో తనకి తెలీదు.

ఇంగ్లీషు మనిషితో మాట కలుపుదామంటే అతను ముభావంగా చిరాగ్గా ఉన్నాడు. తోచక సంచీలో చెయ్యిపెట్టి రెండు రాళ్ళనీ తీసుకు చూస్తుంటాడు.

"యూరిం తుమ్మిం " అని ఆశ్చర్యంతో అరుస్తాడు ఇంగ్లీషాయన.

"ఇవి నాకో రాజిచ్చాడు. రాజులు నావంటి గొర్రెలకాపర్లతో మాట్టాడారంటే నువ్వు నమ్మకపోవచ్చు" అని బాలుడంటే, "నమ్మకపోవడమేమిటి, రాజులు చిరకాలం నుంచి మొదట మాట్టాడుతున్నది గొర్రెలకాపర్లతోనే. బైబిల్ కాలం నుంచి ఉన్నదది. ఇ రెండు రాళ్ళ గొప్పదనమూ అందులోనే ఉంది. వాటి ప్రాముఖ్యత తెలిసే మతాధికారులు వాటిని వక్షకవచాల్లో పొదుగుకుని గర్వపడతారు. ఇదీ ఒక సంజ్ఞ, శకునం కావచ్చు " అంటాడు ఇంగ్లీషాయన.

శకునాలగురించి నీకు తెలుసా అంటే, వాటిని తెలుసుకునేందుకే ప్రపంచయానం చేస్తున్నానంటాడు ఇంగ్లీషాయన. అందరూ అర్ధంచేసుకునే విశ్వ భాష ఒకటుందనీ, కాని మనుషులు దాన్ని మర్చిపోయేరు. కాకతాళీయం వేరు, అదృష్టం వేరని, సంజ్ఞా శాస్త్రం వాటిని వివరిస్తుందనీ కూడా అంటాడు.

ఆ మాటల సందర్భంగా ఒకరు స్వర్ణయోగి అన్వేషణలోను, ఇంకొకరు గుప్త నిధి అన్వేషణలోను ఉన్నట్టు ఇద్దరూ తెలుసుకుంటారు.

***

బయలుదేరే ముందు బిడారు నాయకుడు అందరి బతుకు చావులు తన చేతిలో ఉన్నాయనీ, ఎడారి చంచల స్వభావపు స్త్రీలా మనుషుల కళ్ళు బైర్లు కమ్మించగలదనీ; తన దైవమైన అల్లా మీద తను ప్రమాణం చేసినట్టే అందరూ తమ దైవాల మీద ప్రమాణం చేసి తన ఆజ్ఞ మీరక నడుచుకోవాలని, ఎడారిలో అవిధేయత చావుతో సమానమని తన పరిచయవాక్యాల్లో పలుకుతాడు.

***

పక్క పక్క ఒంటెల మీద కూర్చున్న ఆంగ్లేయుడు బాలుడు ఇందాక వదిలిన సంభాషణ కొనసాగించే క్రమంలో ఆంగ్లేయుడంటాడు: "కాకతాళీయం, యాదృఛ్ఛికం అని మనమనుకునేది నిజం కాదు. ఇప్పుడు నేనిక్కడ ఉన్నానంటే కారణం ఒక అరబ్బు.." అని బిడారపు హోరు వల్ల ఆపెస్తాడు.

బాలుడికి కూడా తోస్తుంది: ప్రతిదీ ఊహించనివిధంగా మలుపులు తిరుగుతోందనుకున్నా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతిదానికీ వేరోదానితో లంకె ఉందనీ, ఆ లంకెలే తను గొర్రెలకాపరి అయేలా, ఒక కల పదే పదే వచ్చేలా, ఆఫ్రికా కి వచ్చేలా, ఒక రాజు పరిచయమయేలా, ఒక దొంగ తనను దోచేలా, ఒక స్ఫటిక వర్తకుని వద్ద పనిచేసేలా ఇంకా...ఇలా.

తన లక్ష్యానికి చేరువయే కొద్దీ ఆ లక్ష్యమే జీవితానికి అసలు పరమార్ధమన్నది స్పష్టపడుతుందని అర్ధం అవుతోంది.

బిడారు ఎడారిలో ముందుకు పోయేకొద్దీ గందరగోళమూ గజిబిజీ సమసి గంభీరమైన ఎడారి గాలీ పశువుల పాద ధ్వనీ తప్ప మరే శబ్దమూ వినబడదు. తరచూ ప్రయాణించే ఒక యాత్రికుడు, ఎడారి అనంత వైశాల్యంలోకి అడుగుపెట్టిన మనిషికి దానిముందు తనెంత అల్పుడో తెలిసి అదే అతని మౌనానికి కారణమని వివరిస్తాడు.

బాలుడికి కూడా తనో సముద్రాన్ని, మహాగ్ని జ్వాలని చూసినప్పుడూ ఆ ప్రాకృతిక ప్రచండత ముందు తనూ మౌనమే వహించినది జ్ఞాపకం వస్తుంది. తను పశువులనించి పాఠాలు నేర్చుకున్నాడు; స్ఫటికం నుంచి నేర్చుకున్నాడు. అతి ప్రాచీనమూ జ్ఞాన పరిపూర్ణమూ అయిన ఈ ఎడారినించి కూడా నేర్చుకుంటాడు.

ఎడారి గాలి తన స్వస్థలమైన అండలూసియాలో తనను స్పృశించిన గాలిని తలపించి గొర్రెలూ తన దినచర్యా గుర్తుకొస్తాయి. కానీ అది గతించినది. పట్టించుకు పాకులాడవలసినది కాదు. అవిప్పుడు తన గొర్రెలు కాదు. కొత్త యజమానికి అలవాటు పడుంటాయి. అదే మంచిది.

పరిస్థితులకనుగుణంగా సర్దుకుపోయే తత్వాన్ని, సర్దుకుపోవలసిన ఆవశ్యకతని మనిషి గొర్రెలవంటి పశువులనుంచే నేర్చుకుంటాడు.

వర్తకుడి కూతురికీసరికి పెళ్ళైపోయుంటుంది. ఒక రొట్టెలాయనతోనో ఒక గొర్రెలకాపరితోనో. తనలాగే వాళ్ళూ కొత్త కొత్తవి ఆమెకి చెప్తూంటారు. తనొక్కడే కాదుగా.

యోచన చేసేకొద్దీ మనుషుల భూత వర్తమానాల కారణ కార్యాల లంకెలు స్పష్టపరచే విశ్వ భాష తనకీ అర్ధమవుతున్నట్టు తోచింది. అందరి చరిత్రలూ తనలో కలిగున్న విశ్వపు జీవచైతన్య ప్రవాహంలో ఆత్మ ప్రవేశిస్తే అన్నీ ఇలాగే బోధపరిచే జ్ఞానం కలుగుతుందేమో. అన్నీ అక్కడ రాసి ఉన్నవే కదా. అప్రయత్నంగా మక్తూబ్ అంటాడు స్ఫటిక వర్తకుణ్ణి తలచుకుని.

ఎడారి ప్రయాణంలో ఎన్నెన్నో పక్క దారులు పట్టాల్సి వస్తోంది. అంతా ఇసక, అక్కడక్కడా రాతి కొండలు. కొండలదగ్గర చుట్టు తిరిగి పోతున్నారు. ఎత్తు ప్రదేశాల్లో ఒంటెలు మొరాయిస్తే బరువు తాము మోస్తున్నారు. ఒంటెల పాదాలు కూరుకుపొయే మరీ సన్నని ఇసకలో సుగమ మార్గాలు వెతుకుతున్నారు. ఎన్ని దారులు మారినా తెల్లారేసరికి దారితప్పక పోవలసిన మార్గంలోనే పోతున్నారు. ఆకాశంలో చుక్కలనే దిక్సూచిగా చేసుకుని. ఒక్కరు తప్ప అందరూ ఇది తెలుసుకుంటున్నారు. ఆంగ్లేయుడు తప్ప. అతనో పుస్తకంలో తలదూర్చి అందులో మునిగిపోయేడు. బాలుడు తన పుస్తకం తెరుస్తాడు కాని ఎప్పట్లాగే రెండు పేజీలు దాటి ముందుకు పోలేడు. అంతకన్నా తన ఒంటె నించే ఎక్కువ జ్ఞానం లభిస్తోంది. అయితే పుస్తకం తెరిచిన ప్రతిసారీ ఎదో కొత్త సంగతి జరుగుతుందనే మూఢ నమ్మకం బానే వున్నా, అదొ అనవసర భారం అనుకుని పుస్తకాన్ని గిరాటేస్తాడు.

ఆ క్రమంలో ఒంటె తోలే ఆయనతో పరిచయమవుతుంది. అతను కైరో నివాసి. కుటుంబమూ వ్యవసాయమూ ఉంటాయి. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే మక్కా యాత్ర విధిని కూడా నెరవేర్చుకుని సంతృప్తితో జీవించే సమయంలో నైలు నది ఉప్పెన కలుగుతుంది. భగవదనుగ్రహమున్న తనకేమీ కాదనుకున్న అతని ధీమాను పటాపంచలు చేస్తూ అతని ఇళ్ళూ పొలాలూ కూడ నాశనమైపోయి ఈ ఒంటె నడిపే పనికి కుదురుకోవలసివస్తుంది.

"అయితే త్వరగా తేరుకుని జీవిత పగ్గాలు అందుకున్న వారికి బతుకు తెరువు అసాధ్యం కాదు. ఉన్నదంతా పోయినప్పుడు ఇప్పుడెలా అనే అనిశ్చితి కలిగించిన భయం సహజం కాని అన్ని ఉత్పాతాలనూ ప్రపంచ చరిత్రనూ లిఖించిన హస్తమే మన రాతనూ రచిస్తుంది. అన్నిటి లంకెలూ నిర్ణయించిన ఆ దివ్య హస్తం గూర్చిన ఎరుక అన్ని భయాలను పోగొడుతుంది" అంటాడతను.

మార్గమధ్యంలో వేరే బిడారులు ఎదురవుతాయి. ఇరు పక్షాలూ తమ వద్ద లేనిది అవతలివారిని సంప్రదించి తీసుకుంటారు. అదీ ముందే రాసిపెట్టినట్టు.

అప్పుడప్పుడు కళ్ళు మాత్రమే కనిపించేలా నల్లదుస్తులేసుకున్న ద్రిమ్మరులు ఎడారి సమాచారమిచ్చేరు. ఎడారి తెగల మధ్య యుద్ధవాతావరణమున్నదని. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ గంభీర నిశ్శబ్దం ఏం చెబుతోందో బాలుడికి అర్ధమవుతుంది. మాటలక్కర్లేని విశ్వభాష. వెనక్కి పోవాలా అన్న ప్రశ్నకి బిడారు నావికుడంటాడు - ఎడారిలో వెనక్కి పోవడమని ఉండదు. గతి మార్చి ఇంకో దారమ్మట పోయినా అది గమ్యంవైపే కాని వెనక్కి కాదు. అల్లాయే అన్నీ నిర్ణయించేది. విపత్తులతో సహా. మక్తూబ్. అని.

ఓ రాత్రి ఆంగ్లేయుడికి నిద్ర పట్టక బాలుడితొ మాటామంతీ కలుపుతాడు. బాలుడి చరిత్రలో ఆ స్ఫటికవ్యాపారాన్ని బాగుచేసే ఘట్టం అతడికి నచ్చుతుంది. స్వర్ణయోగ ప్రక్రియలో దానినే విశ్వాత్మగా పిలుస్తారని, మన సంకల్పానికున్న బలమే మనను విశ్వాత్మకు చేరువచేసి దాని సాధనను సుగమం చేసే ప్రేరక శక్తి అనీ వివరిస్తాడు.

ఇంకా అంటాడు: సృష్టిలో ప్రతిదీ అనుక్షణమూ మారుతుంది. ఎందుకంటే భూమి సజీవమైనదీ, దానికీ ఆత్మ వున్నదీ కనక. ఆ ఆత్మలో మనమూ భాగమే. అది మనకోసం పనిచేస్తోందని గ్రహించుకోలేం. కాని నీ అనుభవంవల్ల నువ్వది తెలుసుకుని ఉంటావు- నీ విజయానికి స్ఫటిక పాత్రలు కూడా సహాయపడ్డాయి కదా.

అప్పుడు బాలుడంటాడు. ఈ బిడారూ ఎడారీ కూడా అలాగే ఒకదాని మనసు ఒకటి తెలుసుకుని సహకరించుకుంటున్నాయని నేనూ గ్రహించేను. బిడారుల మార్గంలో సవాళ్ళుంచి వాటి ప్రతి కదలికనూ గమనిస్తూ, నిబ్బరంగా అధిగమించిన వాటికి ఒయాసిస్సులనూ గమ్యాలనూ బహూకరిస్తుంది ఎడారి. ఈ మౌన భాషని అర్ధం చేసుకోకుండా సొంత బలాన్నే నమ్ముకుని ఎడారిలో అడుగిడితే ప్రయాణం అతి కష్టమయేది. అని.

ఇకపై నేనూ బిడారుని గమనిస్తాను అని ఆంగ్లేయుడంటే, ఇకపై నేనూ నీ పుస్తకాలు చదువుతానని బాలుడంటాడు.

ఆంగ్లేయుడి స్వర్ణయోగ పుసకాల్లో ఏమేమో ఎన్నెన్నో విశేషాలు అతి విస్తరంగా ఉన్నాయి. అయితే అతడు గ్రహించినది, అసలైన స్వర్ణయోగం అతి సరళమూ సూక్ష్మమూ అయి, ఒక మరకతమణి మీద రాసి వున్నదని. దానినే పచ్చ మాత్ర అంటారని ఆంగ్లేయుడు సంతోషంగా ప్రకటిస్తాడు.

అంత చిన్నదైతే ఇన్ని పుస్తకాలెందుకని అతనికి సందేహపడుతూ, చదవడం కొనసాగిస్తాడు. ఆ యోగప్రక్రియలో భాగంగా ఏ లోహాన్నైనా తదేకంగా వేడిచేస్తూ పోతే కొన్నాళ్ళకి దాని స్వాభావిక లక్షణాలు ఒక్కొక్కటిగా రూపుమాసిపోయి ఆఖరుకు మిగిలే సారమే విశ్వాత్మ. ఈ విశ్వాత్మ దర్శనం కలిగినవారికి సకల ప్రపంచమూ వ్యవహరించుకునే విశ్వభాష అవగతమవుతుంది. సిద్ధక్రియగా స్వర్ణయోగులు అభివర్ణించే ఇది కొంత ఘన స్థితిలోను, కొంత ద్రవ స్థితిలోను ఉంటుంది.

అందులో ఇంకా ఇలా వుంది. ఆ ద్రవ స్థితి సర్వరోగ నివారిణి. స్వర్ణయోగులకు ముదిమి రాకుండా చూస్తుంది. అది జీవామృతమనీ, ఘన స్థితి జ్ఞాన రత్నమనీ ప్రతీతి. అయితే జ్ఞానరత్న సాధన అంత సులభం కాదు. అందుకోసం సిద్ధులు ఎంతో శ్రమించి కొలిమి దగ్గర కూర్చోవాలి. కొలిమిలో శుద్ధ తత్వం నుంచి లోహ మాలిన్యాన్ని వేరుచేసే సిద్ధులకు క్రమక్రమంగా ప్రపంచ విషయాలపట్ల అన్ని ఆసక్తులూ లయిస్తాయి. లోహ శుద్ధితో ఆత్మ శుద్ధి జరుగుతుంది.

పాత్ర శుద్ధితో ఆత్మ శుద్ధి జరుగుతుంది అన్న స్ఫటిక వర్తకుడి మాటలు బాలుడికి గుర్తొస్తాయి.

ఆ జ్ఞానరత్నపు స్పర్శతో ఎంత పరిమాణపు లోహాలూ బంగారమవుతాయంటాడు ఆంగ్లేయుడు. అతని మాటలు వింటుంటే బాలుడిక్కూడా స్వర్ణయోగం మీద ఆసక్తి కలిగింది. అతని పుస్తకాల్లోని స్వర్ణయోగుల చరిత్రలూ ఆకర్షించేయి. వారు లక్ష్యసిద్ధికోసం జీవితాలు ధారపోసి, శ్రమించి, సంచారంచేసి, పెద్దలను సంప్రదించి ఆ జీవామృతాన్ని జ్ఞానరత్నాన్ని సాధించినట్టు రాసి వుంది.

***

రానురాను తెగల పోరు భోగట్టాలతో ఒక ఒంటె గుర్రుకు కూడా భయపడే గంభీరస్థితిలో ఉంటుంది బిడారు యావత్తూ. ఆ ఆందోళనలో కూడా తన ఒంటె నడిపేవ్యక్తి నిశ్చింతగా ఉండడం చూసి నీకు భయం వెయ్యటం లేదా అంటే అతనంటాడు: "రాత్రి తినేందుకు ఖర్జూరాలు దొరికేయి. ఇప్పుడు ఉదయాన్నే లేచి నీతో మాట్టాడుతున్నాను. రేపు చావాల్సి వస్తే చావుకి అదే మంచిముహూర్తం అనుకుని హాయిగా చస్తాను. భూత భవిష్యత్తుల కన్న వర్తమానమే నాకు ముఖ్యం. వర్తమానంలో జీవించే వారికి ప్రతిక్షణమూ సంబరమే." అంటాడు.

ఆ సాయంత్రం తలపైకెత్తి గంభీర నిశిలో చుక్కల్ని చూసి పరవశిస్తున్న బాలుడికి అదే చుక్కలు నేలమీద కూడా కనిపిస్తాయి. తామో ఒయాసిస్సు చేరుకున్నామని బిడారు నాయకుడు ప్రకటిస్తాడు.

మరసటి ఉదయం ఒయాసిస్సు అందాలు వీక్షిస్తూ బాలుడు అనుకుంటాడు: "ఈ క్షణంలో చూచే ఈ సుందర దృశ్యం రేపటికి మిగతా జ్ఞాపకాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. ఒంటె సరంగు చెప్పినట్టు ఇది ఈ క్షణపు సంబరం. తనకి నిన్నటి పాఠాలూ రేపటి స్వప్నాలూ ఎంత అపురూపమో ప్రస్తుత క్షణమూ అంతే అపురూపం. ప్రతి అనుభవమూ ఒక సూచిక. ఒక ఒంటె గురక ప్రమాదాన్ని ప్రకటించింది, అలవోకగా ఊగే ఈ చెట్టు మట్టలు ఇంకే అద్భుతానికి సంకేతాలో. సృష్టి భాషలెన్నో కద. "అని.

బిడారు నాయకుడు అందరికీ ఒయాసిస్సు నిబంధనలు వివరిస్తాడు. ఆతిథ్య ధర్మానుసారం స్థానికులు యాత్రికులకు మంచి వసతి కల్పిస్తారని, యుద్ధ ధర్మానుసారం యాత్రికులు తమ ఆయుధాలన్నీ స్థానిక ముఖ్యుడికి అందజెయ్యాల్సిందిగా ఆదేశిస్తాడు. ఎడారిలో కొట్టుకు తిరిగే తెగలు ఒయాసిస్సులకు మాత్రం సేద తీరేందుకే వస్తారని, ఒయాసిస్సులు కయ్యాలను అనుమతించవనీ కూడా అంటాడు. ఆంగ్లేయుడు కూడా లోపలినించి తుపాకీతీసి ముఖ్యుడికి ఇవ్వడం బాలుడికి ఆశ్చర్యమనిపించి, మీకు అదెందుకండోయి అంటే, "ఇది చేతనుంటే మనుషులని ఇంకా ఎక్కువ నమ్మొచ్చు" అని ఆంగ్లేయుడు సమాధానమిస్తాడు.

బాలుడికి తన లక్ష్యం చేరువయేకొద్దీ ప్రతిబంధకాలు ఎక్కువవుతున్నట్టనిపిస్తోంది. బహుశః రాజు చెప్పిన ఆరంభపు అదృష్టం ఆవిరైపోయినట్టుంది. అయితే గమనంలో ఎదురయే అవరోధాలవల్లనే తన అడుగులు ఆచితూచి పడుతున్నాయని, లేనట్టైతే లొడిబిడితో అడుగులు తడబడి విఫలమయేవాడిననీ, అంతే కాక భగవంతుని సంజ్ఞలూ సంకేతాలు సరిగా అర్ధంచేసుకునే అవకాశం కలిగేది కాదని కూడా గ్రహించాడు. ఈ అవరోధాలన్నీ భగవంతుని నిర్ణయమే అనిపించినప్పుడు తన పరిణతికి తనకే ఆశ్చర్యం వేసింది. ఇంతవరకు అవన్నీ ప్రకృతిసహజమే అనుకున్నాడు - నిత్యకృత్యాలు, ప్రేమలో పడటం, పని వెదుక్కోవడం - ఇలా. కాని అవన్నీ తనకి దారిచూపే భగవంతుని మాటలని ఇప్పుడు బోధపడుతోంది. తొందరపడకు; ఒంటె సరంగు చెప్పినట్టు తినాల్సినప్పుడు తిను; సాగాల్సినప్పుడు సాగు.

బాలుడికి ఇంకో ఐదుగురున్న గుడారంలో వసతి. పద స్వర్ణయోగిని వెదుకుదాం అంటాడు ఆంగ్లేయుడు. ఇతరులకన్న విలక్షణ జీవనవిధానమూ మండే కొలిమి ఉన్న ప్రకాశవంతమైన గుడారాలకోసం వెదకడం ఆరంభిస్తారు.

ఒక స్త్రీని అడిగితే, నాకు తెలీదని, నల్ల దుస్తుల్లో ఉన్న ఆడవారితో సంభాషణ అక్కడి కట్టుబాటు ప్రకారం నిషేధమనీ చెబుతుంది. మిత్రులిద్దరికీ విచారం పట్టుకుంటుంది.

"అందరి రోగాలూ నయం చేసే వ్యక్తులెవరైనా ఉన్నారా" అనడుగుతారు కనీసం ఆ విధంగానైన కొంత ఆచూకి దొరుకుతుందని. అన్ని రోగాలూ నయం చేసేది అల్లాయేనని, మనుషుల్లో అటువంటివారిని భూతవైద్యులంటారని ఇంకో పెద్దాయన బదులిస్తాడు.

అయితే అటువంటి శక్తిసంపన్నుడొకడున్నాడని, అతన్ని కలిసేందుకు వారు పోరు సద్దుమణీగేంతవరకు వేచియుండాలని ఇంకొకతను వెల్లడిస్తాడు. ఒక ఆశాకిరణంలా.

అప్పుడు నల్లవి కాని దుస్తులను, తలపై సంప్రదాయపు ముసుగును ధరించిన ఒక చక్కని చుక్క తారసపడుతుంది. ఆమె ముగ్ధమోహన రూపం ఏ మాటల అవసరమూ లేని భాషను పలికే కళ్ళతో బాలుడిని చూస్తుంది. అదే, మనిషి కన్న, ఎడారికన్న ప్రాచీనమైన ప్రేమ భాష.

బాలుడి తల్లిదండ్రులూ తాతా కూడా చెబుతుండేవారు వివాహానికి ముందు కాబోయే జీవిత భాగస్వామితో ముఖాముఖి చాలాసార్లు మాట్లాడి తనగురించి పూర్తిగా తెలుసుకోవాలని. అయితే దేవుని భాషారూపమైన సంకేతాలు అర్ధం చేసుకున్నవారికి ఇది అవసరమని అతనికనిపించలేదు. తను తరీఫాలో మోసపోయిన సందర్భంలో తన ముఖాన్ని స్పృశించిన చిరుగాలి చెప్పింది తన జీవిత లక్ష్యాన్ననుసరించి తను సాగాలని. అదే తన జీవిత భాగస్వామి కాగోరిన వ్యక్తి హృదయాన్ని తన హృదయానికి సన్నిహితం చేసి జతపరిచింది. తరువాత తనకు నచ్చినదీ నచ్చనిదీ అయిన ప్రతి సంఘటనా తనను తన ప్రియ వస్తువు సముఖానికి చేరేవిధంగా ప్రోత్సహించింది. అది ఈనాడు సాకారమైంది. ఇదే తన జీవిత లక్ష్యం. ఎన్ని ధనరాశులూ భోగానుభవాలూ దీనికి సాటిరావు. తను తన గమ్యాన్ని చేరుకున్నాడు.

మాటల్లో తనపేరు ఫాతిమా అని చెబుతుంది.

అవునవును మా అక్కడ కూడా ఫాతిమా పేరు కొందరికుంది అంటూ తన సంచార విశేషాలు చెప్పుకొస్తాడు.

ఫాతిమా ప్రవక్త కుమార్తె పేరని, ఇక్కడి స్థానికమైన దానిని తమ ఆక్రమణవీరులు ప్రపంచ ప్రసిద్ధిచేశారని గర్వంగా చెబుతుంది. మనం పెళ్ళి చేసుకుందామని అతనంటే, దానికి ఈ తెగలపోరు ముగిసేంతవరకు వేచి వుండాలంటుంది. అయితే సరే, అని అతనంటే, అప్పుడు చెప్తుంది.

ఈ పోరు మిగతా యుద్ధాల్లా అంత త్వరగా సమసిపోయేది కాదు. ఎందుకంటే ఇది చెడు మీద మంచి జరిపేది కాక, ఒక శక్తికీ ఇంకో శక్తికీ మధ్య ప్రాబల్యాన్ని నిరూపించుకునేందుకు జరుగుతున్నది. దీని నిడివి సుదీర్ఘం ఎందుకంటే అల్లా సహకారం ఇరుపుపక్షాలకూ సమానంగా వుంది.

వివాహం విషయమంటావా, నీ హృదయానికి నన్ను సన్నిహితం చేసిన క్షణంలోనే మన వివాహం జరిగి ఒకటయాం. నన్నే కనిపెట్టుకునుండక, నీ నిధి అన్వేషణలో నువు సాగిపోవాల్సిందని నా సలహా. నేను ఎడారి మహిళను. ఇక్కడి మహిళల భర్తలను ఎడారి కోరుకుంటుంది. దానిననుసరించి వారూ పోతారు. విశ్వాత్మలో భాగమవుతారు. కొందరు తిరిగొస్తారు, కొందరెప్పటికీ రారు. తిరిగొచ్చినవారి భార్యలది ఒక సంబరమైతే, రానివారి భార్యలది ఇంకో సంబరం. అలా రానివారు మేఘాలై, పశుగ్రాసమై, మేసే పశువులై, పక్షులై తమ చుట్టూనే ఉంటు తమను కాపాడుతుంటారని ఆ వివాహితల నమ్మకం. వారి సంబరాలు చూచి ఇన్నేళ్ళూ అసూయపడేదాన్ని కాని నీ ధర్మమాని ఇప్పుడు నాకూ ఆ భాగ్యం కలిగింది. ఒక ఎడారి మహిళగా నా భర్త కూడా ఎడారి ఇసుకతిన్నెల రూపురేఖలు తీర్చిదిద్దుతూనో, తప్పనిసరి అయినప్పుడు మేఘాలు, పచ్చికబయళ్ళు, పశుసంపదల మధ్యనో నిత్య సంచారి అయి ఉండాలన్నదే నా అభిలాష కూడా.

ఆంగ్లేయుడు తన గుడారం బయట ఒక కొలిమి ఏర్పాటుచేసుకుని కరిగించడం ప్రారంభిస్తాడు. "ముందు గంధకాన్ని విడగొట్టాలి. ఈ పని చాలా శ్రద్ధతో చెయ్యాలి. అపజయాన్నిగురించిన భయం పనిని చెడగొడుతుంది; కనుక ఆ తలపే మదిలో చొరనియ్యకూడదు." అంటూ.

బాలుడు అక్కడ నిలవక ఎడారిలో సంధ్యా సూర్యకాంతిలో ఎర్రగా ప్రకాశించే ఇసుకతిన్నెలు చూస్తూ నడక కొనసాగిస్తాడు. సుదూరానికి వ్యాపించిన భూతలం మదికి ప్రసాదించే నిశ్చలత్వాన్ని ఆస్వాదిస్తూ. కాళ్ళకింద ఇసుక, గులకరాళ్ళతో పాటు ఆల్చిప్ప పెంకులూ తగులుతున్నాయి కొన్ని లక్షల యేళ్ళనాడు అక్కడున్న సముద్రానికి గుర్తులుగా.

ఫాతిమా మాటలు గుర్తొస్తున్నాయి. ప్రేమించే వస్తువుని దూరంపెట్టి ప్రేమించడం అనే భావన అసాధ్యంగా కనిపిస్తోంది. ఆ పిల్లకి సాధ్యమని ఎలా అనిపించినట్టు? ఎడారి మనిషి కాబట్టి కాబోలు. కనుక తన ప్రశ్నలకి సమాధానాలు ఎడారిలోనే వెదుక్కోవాలి.

ఒక ఎత్తైన తిన్నె మీద కూచుని ఆకాశం లోకి చూస్తే రెండు గద్దలు పైన వలయంగా ఎగురుతూ కనిపిస్తాయి. ఇదే సంకేతమో అనుకునేలోపల ఒకటి బాణంలా రెండోదానిని ఢీకొడుతుంది. అతడికి కళ్ళెదుట మసకమసగ్గా వైరిపక్షాలు యుద్ధం చేసుకుంటూ ఇటు వచ్చినట్టు లీలగా అనిపిస్తుంది.

మళ్ళీ ఒకసారి కళ్ళు నులుముకు చూస్తే ఎక్కడా ఏ జాడా ఉండదు.

తరవాత తన ఒంటె సరంగుని కలిసి "వైరి పక్షాలు పోరుతూ ఇటే వస్తున్న దృశ్యం నాక్కనిపించింది" అంటాడు.

"ఎడారి స్వభావమే అంత. మిధ్యా దృశ్యాలు ఎండమావులు ఇక్కడ కొత్త కాదులే" అంటాడు సరంగు.

"కాని నేను రెండు గద్దల్ని గమనించేను. వాటి గతి నా ఊహని ధృవపరుస్తోంది" అంటాడు బాలుదు.

సరంగు ఆలోచనలో పడతాడు. చిరకాలంపాటు ఎడారి సంచారంలో గడిపినవారికి ప్రపంచ భాషా సంజ్ఞలూ అలవాటై వాటిని సంఘటనలకి అన్వయించే విద్య పట్టుబడుతుంది. వారిని ద్రష్టలని పిలుస్తూ కొందరు జనం తమ భవిష్యత్తు గురించి అడుగుతుంటారు. అయితే ఎడారిలో యోధులు ఇలా భవిష్యత్తు తెలుసుకునేందుకు వ్యతిరేకం. కారణం, జయావకాశాలు ఎటున్నాయో తెలీని దశలో చేతికందే జయం ఇచ్చే ఆనందం మిక్కుటం; నిశ్చితమని తెలిసిన అపజయం అది తెలిసిన క్షణం నించి కూడా కలిగించే ఆందోళన దుర్భరం. దేవుడే జయాపజయాల నిర్ణేత అని, రెంటిలో ఏది ప్రసాదించినా అది తమ మంచికోసమేనని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకని వారు రెండో ఆలోచనలేక వర్తమానంలోనే పూర్తిగా జీవిస్తారు.

అయితే తను యోధుడు కాడు కనుక ఒకసారి ఒక వృద్ధుడైన ద్రష్టని కలిసి తన భవిష్యత్తు చెప్పమన్నాడు. భవిష్యత్తు దేవునిదనీ, తాను వర్తమానాన్నే వివరించగలననీ వృద్ధుడంటాడు. కాని తాను మనిషిని కనక భవిష్యత్తు ముందే తెలిస్తే సరిదిద్దుకుని ఇంకా జాగరూకుణ్ణై ఉంటానని తనంటాడు. దానికి వృద్ధుడంటాడు. అప్పుడు నువ్వు సరిదిద్దుకున్న భవిష్యత్తే నీకు రాసివున్నది. దేవుడు భవిష్యత్తును తనవద్ద ఉంచుకుని వర్తమానాన్ని మనిషికి ప్రసాదించాడు. చూడగలిగినవారికి వర్తమానంలోనే తమ భవిష్యత్తు కనిపిస్తుంది. వృధా కానీక వర్తమానాన్ని శ్రద్ధాసక్తులతో చక్కదిద్దుకున్నవారి భవిష్యత్తు కూడా దానంతట అదే చక్కబడుతుంది. అని.

అతనీ ఆలోచనల్లోంచి తెప్పరిల్లి, "నువు చూసిన గుర్తులు నిజమే కావచ్చు. పోయి ఈ సంగతి స్థానిక నాయకులకి చెప్పు" అంటాడు.

వాటి విశ్లేషణ వారికీ తెలిసినదే కదా, అంటే,

ఒకోరూ ఒకోరకంగా గుర్తులు అవగతం చేసుకుంటారు. నీ విషయంలో అది గద్ద అయితే, వారి విషయంలో అది నువ్వు. అంటాడు. బాలుడు పెద్దలను కలవ నిశ్చయించుకుంటాడు.

స్థానిక పెద్దల గుడారం లోపల కళ్ళు జిగేలుమనే వస్తు సంపద వుంటుంది. అక్కడి ఖరీదైన తివాచీలు, పాత్ర సామాను, అక్కడి అగరు ధూమపు సుమధుర పరిమళం, బంగారు నగిషీ పాత్ర సామాన్లు అతడి కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. బాలుడి వర్తమానం వినగానే ఒక యువ అరబ్బు అడుగుతాడు: స్థానికంగా ఇన్నేళ్ళనించి మాకు చెప్పని గుర్తులు ఈ ఎడారి నీకు చెప్పిందంటే ఎలా నమ్మమంటావు? అని.

దానికి అతనంటాడు: అలవాటు పడ్డ కళ్ళు సంజ్ఞలు విస్మరిస్తాయి. నేను కొత్తవాణ్ణి కనక ఏ చిన్న సంకేతమూ నా దృష్టిని తప్పించుకోలేదు. అని.

కొంతసేపు వారంతా తర్జన భర్జన పడినాక వారిలో వయోవృద్ధుడైన యోధుడు ఇలా అంటాడు: నీ మాటలు కొట్టిపారెయ్యవీలులేదు. రెండువేల సంవత్సరాలక్రితం నీ వంటి యువకుడే ఈజిప్టును మహాక్షామం నించి రక్షించాడు. అతని పేరు జోసఫ్. ఇంచుమించు నీ వయసే. నీ మాటలు నమ్ముతున్నాం. ముందు జాగ్రత్తగా ఎవరి వద్దా ఆయుధాలుండకూడదనే నిబంధన ఉపసంహరిస్తాం. శత్రువులు వచ్చే పక్షంలో శాయశక్తులా పోరాడతాం. దూసిన మా కత్తుల వాడికి తెగిపడిన ప్రతీ పదిమంది శత్రువు తలలకీ ఒక బంగారునాణెం చొప్పున నీకు బహుమానం. ఒకటి గుర్తుంచుకో. దూసిన ఖడ్గానికి యుద్ధం జరిగితీరాలి. లేనిపక్షంలో రేపు సాయంత్రానికి తెగిపడేది నీ తలే. వెళ్ళిరా. అని.

గందరగోళపడ్డ మనసుతో నడుస్తున్న బాలుడిదారికడ్డంగా సుడిగాలి పరవళ్ళు లేచి అది సద్దుమణిగాక ఒక ఉన్నతాశ్వాన్ని అధిరోహించి బారెడు ఖడ్గాన్ని ధరించి తేజస్సంపన్నుడైన మహావీరుడు కనిపిస్తాడు..

"ఇక్కడి గద్దల సూచనలు వివరించే సాహం ఎవరిది?" అని పిడుగుపాటువంటి కంఠస్వరంతో ప్రశ్నిస్తాడు.

బాలుడు తొణకా బెణక్కుండా, "ఆ సాహసిని నేనే". అని బదులిస్తాడు.

వీరుడు తన పదునైన ఖడ్గాన్ని బాలుడివైపు దూస్తాడు. స్థానిక పెద్దల వల్లగాని ఈ మహావీరుని వల్లగాని తనకి మరణం తప్పనట్టుంది. సరే కానీ. ఒంటె సరంగు చెప్పినట్టు అదే దైవ నిర్ణయమైతే అలాగే అవును గాక. రాక తప్పని చావు ముహూర్తం ఇంకెప్పుడో వస్తే మంచిదయిందా, ఇప్పుడొస్తే కాకపోయిందా. తను ఫాతిమా కోసం మరణిస్తాడు. ఇతర గొర్రెలకాపర్ల వలెకాక తన లక్ష్యసాధనలో ఎంతో ప్రపంచాన్ని చూశాడు.

కాని వీరుడు దూసిన కత్తిని బాలుడి నుదిటికి ఆనించి ఒక రక్తపు బొట్టు లాగుతాడు.

బాలుడు అతడినే చూస్తూ, "నేనే ఆ సాహసిని" అంటాడు మళ్ళీ. "పక్షి గమన సూచనని అర్ధంచేసుకునే కౌశలం అల్లా నాకిచ్చాడు. సకల సంఘటనల గతినీ లిఖించేది ఆ హస్తమే కదా."

"నీ మిధ్యాకాలజ్ఞానంతో జాగ్రత్త. రాసివున్నది ఎవరూ మార్చలేరు. " అంటాడు వీరుడు.

"సైన్యాలొస్తున్నాయనే నేను వివరించేను కాని ఎవరు జయిస్తారనో అని కాదు కదా. అదీ మీ జాగ్రత్తకోసమే. ఒయాసిస్సులో మీకన్న ఎక్కువే యోధులున్నారు కనక జయించేదేవరో ఊహించడం కష్టం కాదు" అంటాడు బాలుడు. ఈ వీరుడినించి పారిపోయే ప్రయత్నమే చెయ్యటంలేదతను. రాసిపెట్టివుంటే ఈరోజు తను విశ్వాత్మలో కలిసిపోతాడు. రేపో ఇంకోనాడో ఈ వీరుడూ అంతే కద.

అయినా నీవంటి కొత్తవాడికి ఇక్కడేం పని అని వీరుడంటే, నేను నా లక్ష్యాన్నీ విధినీ అనుసరిస్తూ ఇక్కడికొచ్చేను అంటాడు.

వీరుడు కత్తిని వెనక్కి లాక్కుంటూ, నీ సాహసాన్ని పరీక్షించాను. నెగ్గావు. ప్రపంచ భాష అర్ధంచేసుకునేందుకు సాహసమే మొదటి అర్హత. లక్ష్యం నించి నీ దృష్టి మరలరాదు. ఎడారి కపటి. అది ఎన్నో పరీక్షలూ అవరోధాలూ సృష్టించి ఏమారినవారిని సంహరిస్తుంది. రేపు సాయంత్రం ఇదేవేళకి నువ్వింకా బతికుంటే నన్ను కలు. నేనుండేది అక్కడ అని దక్షిణం వైపు చెయ్యి చాచి చూపించి గుర్రాన్ని దౌడాయిస్తాడు వీరుడు.

అటు వంక చూస్తూ అనుకుంటాడు బాలుడు. తను స్వర్ణయోగిని కలిసాడు.

****************

మర్నాటి ఉదయమే స్థానిక యోధనాయకులు యుద్ధసన్నద్ధులై వ్యూహాత్మకంగా ఒయాసిస్సుకి ఒకవైపు మోహరిస్తారు. మధ్యాహ్నానికి ఇంకోవైపునించి ఐదువందలమంది శత్రుసైనికులొచ్చి నాయకుల ఖాళీ గుడారాన్ని ముట్టడిస్తే, స్థానికనాయకులు ఇంకోవైపునుంచి దాడిచేసి శత్రుసేనాపతి తప్ప మిగతావారినందరినీ మట్టుపెడతారు. స్థానిక స్త్రీలకి, బాలలకి అసలేమీ తెలియనంత సులువుగా జరిగిపోతుందిది. శత్రునాయకుడు ఒయాసిస్సులపై దాడిచెయ్యకూడదనే నిబంధనను ఉల్లంఘించినందుకు అతడికి మరణశిక్షవిధించి ఉరితీస్తారు. బాలుడిని పిలిపించి యాభై బంగారునాణేలు బహూకరించి, ఇకపై తమ అల్ ఫయూం ఒయాసిస్సుకు సలహాదారుగా ఉండమని కోరతారు.

*****

మర్నాడు వీరుడు సూచించినవైపు పోయి ఒక ఒంటరి గుడారాన్ని చేరుకుంటాడు. కాసేపటికి అతనొస్తాడు. చేతిలో రెండు చచ్చిన గద్దలతో. నన్నెందుకు చూడాలనుకున్నావు? అనడిగితే, ఆ సంకేతాన్ని నేను గాలి నుంచి అర్ధం చేసుకున్నాను అంటాడు యోధుడు. అయితే అది నేను కాదేమో, నిన్ను కలవాలనుకుంటున్నది ఆంగ్లేయుడు అంటే, అతనివంతు ఇంకా రాలేదు కాని అతనిప్పుడు సరిన మార్గంలోనే వెళుతున్నాడంటాడు.

నాసంగతేమిటని బాలుడంటే, తమ కలలు సాకారం చేసుకునేవారికి విశ్వం కుట్రచేసి మరీ సహకరిస్తుందంటాడు వీరుడు వృద్ధ రాజు చెప్పినట్టే.

తరవాత పక్షుల మాంసాన్ని, కొంత రుచికరమైన మద్యాన్ని బాలుడికిచ్చి, సేవించు అంటాడు. కాని ఇక్కడ మద్యం నిషేధం కదా అంటే, మంచిచెడ్డలు నోట్లోకెళ్ళేదానిక్కాదు నోటినించి వచ్చేదానికి. నీ లక్ష్యం ఆ దిక్కునున్నది సాగిపో” అంటాడు వీరుడు.

అప్పుడు బాలుడు "ఇప్పుడు నావద్ద ఒక ఒంటె ఉంది. అనుభవమూ యాభై బంగారు కాసులూ ఉన్నాయి. మా దేశపు లెక్కల ప్రకారం ధనవంతుడిని. ఇంకా నాకు ఫాతిమా ఉంది". అంటే, వీరుడు, "కానీ ఇవేవీ పిరమిడ్ల వద్ద లభించినవి కాదు. కడుపునిండా తిని హాయిగా నిద్రపో. రేపు యుద్ధమన్నంత సిద్ధంగా వుండు. నీ హృదయమెక్కడుంటుందో అక్కడే నిధి ఉంటుంది. దాన్ననుసరించి నీ గమనం సాగాలి. ఆరంభించిన ప్రయాణం అపక గమ్యాన్ని చేరుకుంటే అప్పుడు ఈ యాత్రమొత్తంలో జరిగిన ప్రతి సంఘటన అర్ధమూ అవగతమవుతుంది. నీ ఒంటె బదులు గుర్రాన్ని కొనుక్కో. ఒంటెను నమ్మలేం. అది చచ్చేవరకు పనిచేస్తూ ఉన్నట్టుండి పడిపోతుంది. గుర్రం అలా కాక కొద్ది కొద్దిగా బలహీనపడుతూ ఎప్పుడు మార్చుకోవాలో సంకేతాలిస్తుంది." అని సలహా ఇస్తాడు.

***

పిరమిడ్లు చేరేవరకు బాలుని తోడుగా ఉంటానంటాడు వీరుడు.

కాని బాలుడంటాడు : "నేను ఫాతిమాను ఈ ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఎటువంటి నిధీ ఇవ్వలేని సంతోషాన్ని అవిస్తాయి. ఇక్కడే ఉండిపోతాను నష్టమేమిటి" అని.

దానికి వీరుడు: "ఒక యేడు బాగుంటుంది; రెండేళ్ళు నీ లక్ష్యం గురించి కొంత ఆలోచన చేసి ఊరుకుంటావు. ఫాతిమా విషయానికొస్తే, తన భర్త లక్ష్య సాధనలో విశ్వాత్మలో ఒకడై నిత్య సంచారి అయి ఉండాలన్నది ఆమె అభిమతం. తన నిధి అమెకు దక్కనే దక్కింది నీ రూపంలో. కాని నీ నిధికే తను అడ్డంపడ్డానని ఆమె ఆవేదన చెందుతుంది. ఇన్నేళ్ళూ సృష్టి గుర్తులను ప్రపంచ భాషనూ అందరి ప్రయోజనార్ధం విశ్లేషించి వివరించగలగటానికి కారణం నీ లక్ష్యసాధనకైన నీ సంకల్పబలం. దాన్ని గాలికొదిలి స్థిరపడితే ఆ కౌశలం కనుమరుగై ఇక్కడి నాయకులకి నీ ఉపయోగమేమీ కనబడక ఉన్న పదవి ఊడుతుంది. కానీ డబ్బు ఉన్నది కనక బతుక్కి ఢోకా లేకున్నా జీవితంలో సాధించలేనిదొకటి ఉండిపోయిందె అని విచారిస్తూ గడుపుతావు." అంటాడు.

బాలుడికి సంపద వున్నా మక్కా యాత్ర లక్ష్యాన్ని నెరవేర్చుకోలేని స్ఫటిక వర్తకుడు గుర్తొస్తాడు.

వీరుడు కొనసాగిస్తాడు: "నిజమైన ప్రేమ లక్ష్యసాధనకు అడ్డంపడదు. పడితే అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమకే ప్రపంచ భాష, దాని సంకేతాలు అవగాహనా సాధ్యం. లేకుంటే లేదు." అని.

బాలుడు అతణ్ణి అనుసరించేందుకు నిశ్చయించుకుంటాడు. బరువెక్కిన హృదయంతో ఫాతిమానించి సెలవుతిసుకుంటాడు.

***

ఫాతిమాకిక ఒయాసిస్సు సోయగాలకన్న ఎదటి ఎడారీ పైని ఆకాశమే కాలక్షేపం. ఇకపై తన ముద్దులు గొప్ప లక్ష్యసాధనలో నిమగ్నుడైన తన భర్తకు చేర్చేందుకు ఎడారి గాలి, అతని మార్గ నిర్దేశనానం చేసే తారల మిణుకులే ఆమె నేస్తాలు. అతని రాకకైన నిరీక్షణే ఆమె జీవితపరమార్ధం.

***

బాలుడి ఉదాసీనత గమనించిన స్వర్ణయోగి అంటాడు: "విడిచిపెట్టినవాటికై వెనక్కి చూడకూడదు. స్వచ్ఛమైనది చెడిపోదు. సొంతదారు చెయిదాటిపోదు. పైపైమెరుగులైతే మాత్రం తనకూ సొంతదారుకూ కూడా చెందక కనుమరుగవుతుంది." అని. అతడు స్వర్ణక్రియ పరంగా చెబుతున్నా అది ఫాతిమా గురించి అని బాలుడికి అర్ధమవుతుంది.

సుమారు వారం రోజులు రోజువారీ దినచర్యతోనే గడవడం చూసి బాలుడు అంటాడు: "నువ్వు నాకు బోధించడం మానేసావేం" అని. దానికి అతనంటాడు: "గురువు బోధకన్న అనుభవమూ కార్యాచరణా మిన్న. అలా అవసరమైనంత మట్టుకు నువ్విదివరకే నేర్చుకుని నీ లక్ష్యానికి అతి చేరువకి చేరుకున్నావు. నువు తెలీదనుకుంటున్న ఈ స్వర్ణక్రియ రహస్యం ఆదిని ఒక మరకతమణి మీద ఇమిడిపోయేంత సూక్ష్మమూ సరళమూ. కాని సుదీర్ఘ వ్యాఖ్యానాలూ వివరణలకి అలవాటుపడ్డ సాధకులు దీన్ని చేటభారతం చేశారు. నీ విషయానికొస్తే, నీ జ్ఞానార్జన ప్రయోగశాలలోనిది కాక, ఎడారిలోనిది కావడంవల్ల, లోహమిశ్రమాలతో మేము చేసేది ఎడారిని నిశితంగా పరిశీలించి నువ్వు సాధిస్తావు. ఈ భౌతిక సృష్టి స్వర్గానికి నమూనా. ఈ ప్రపంచపు ఉనికి ఇంతకన్న మెరుగైనదాని ఉనికిని ధృవపరిచేది. తన భౌతిక సృష్టిలోని వస్తు విషయాలను పరిశీలించి దానినించి తన పారమార్ధిక తత్వాన్ని లోకులు గ్రహించే విధంగా సృష్టికర్త ఈ ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. ఒక ఇసకరేణువును నిశితంగా పరిశీలించి ఒక ఎడారి స్వభావాన్ని అవగతం చేసుకొన వీలుంది. ఈ ఎడారే నీ జ్ఞాన భాండారం. అందులోనే లీనమవు. విశ్వాత్మనించి ఆవిర్భవించి తిరిగి విశ్వాత్మలో లీనమయే నీ హృదయంలోనే విశ్వరహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. దాని వాణిని శ్రద్ధగా ఆలకించి తదనుసారం సాగిపో." అంటాడు.

***

నడుస్తూ నడుస్తూ తన హృదయవాణిని వినే ప్రయత్నం చేశ్తాడు బాలుడు. ఒకసారి అది ముందుకు పొమ్మంటుంది; ఇంకో సారి ప్రేయసిని వదలి వచ్చినందుకు ఖేదపడుతుంది; మరోసారి ఉన్నది చాలు వెనక్కిపో అంటుంది.

"అది ద్రోహిలాగుంది. ఒకోసారి ఒకోటి చెబుతోంది. ఐనా హృదయం చెప్పేది మనమెందుకు వినాలి?" అనడుగుతాడు బాలుడు.

"ఎందుకంటే హృదయమున్నచోటే నిధి కూడా ఉండేది. అది ఎన్ని విభిన్న రసాలు ఒలకపోస్తున్నా దాన్ని వినడం, సంప్రదించడం మానకు. ఆ అలజడి అది చైతన్యవంతమై ఉన్నదనడానికి ప్రతీక.. తమ సొంతదారులు లక్ష్యసాధనలో అంతా పోగొట్టుకుంటారని హృదయాల భయం. అందుకని అవి అప్పుడప్పుడూ వెనకంజకు ప్రోత్సహిస్తాయి. ద్రోహఫలం ఆకస్మికంగా సంభవించేది. నీ హృదయం అందుకు పాల్పడకుండా నువ్వు దాన్ని నిరంతర సంభాషణలోను సంప్రదింపులోను ఉంచాలి. అది నీలో ఉన్నది, నువ్వు తప్పించుకొనలేనిది కనక ఇదే నీకు ఉత్తమం." అంటాడు వీరుడు.

అప్పట్నించి బాలుడూ తన హృదయమూ సమాలోచనలూ అభిప్రాయాలూ ఒండొరులకు చెప్పుకుంటూ ఉంటారు.

"మీరు దుష్కరమైన లక్ష్యాలు నిర్దేశించుకుని అనుసరించేటప్పుడు అది సాధించలేమనో క్లిష్టమనో లేక వాటికి అర్హులము కామో అన్న భావనలతో వేదన చెందుతారు. ఇంకోటి, లక్ష్యంకోసం తమవారినీ తమవాటినీ వదిలిపెట్టిన ధైర్యవంతులకూ వారి ఆప్తులకూ వెదనే కలుగుతుంది. సొంతదారు వేదన మా హృదయాలకు దుస్సహం." అంటుంది హృదయం.

"వేదనలు తలుచుకుంటే నా హృదయానికి భయమట " అంటాడు బాలుడు.

"చెప్పు దానికి అసలు వేదన కన్న అది ఊహించుకుని పడే భయమే ఎక్కువ బాధాకరమని. తమ స్వప్నాల సాకారానికోసం హృదయాన్ని సంప్రదించి చేసే అన్వేషణలో ఏ హృదయమూ వేదన పొందినట్టు లేదు. ఎందుకంటే అటువంటి అన్వేషణలో గడిపిన ప్రతిక్షణమూ సృష్టికర్తతో గడిపినట్టే." అంటాడు వీరుడు.

"హృదయంలో చేసే లక్ష్యాన్వేషణలో గడిపిన ప్రతి క్షణమూ సృష్టికర్తతో సంభాషించినట్టే." అంటాడు బాలుడు హృదయంతో. "నాకే కనక ఈ లక్ష్యమూ గమ్యమూ లేనట్టైతే ఏం జరిగుండేది? అవి సాధించే క్రమంలో ఇన్ని అనుభవాలూ జ్ఞానమూ లభించేవి కావు. మిగతా గొర్రెలకాపర్లవలె వేసినచోటే గొంగడి చందమయేది నా బతుకు." అంటాడు బాలుడు. హృదయం మౌనంగా వింటుంది.

మర్నాడు అతను నిద్రలేచినప్పుడు హృదయం అంటుంది. "విశ్వాత్మ నించి విన్నవి నీకు చెబుతున్నాను. ఆనందంగా ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ భగవంతుడు ఉంటాడు. చూడగలిగేవారికి ఒక ఇసుక రేణువు పరిశీలనలోనూ ఆనందం లభిస్తుంది. అనంతకోటి సంవత్సరాల సృష్టి కాలచక్రం చిన్న చిన్న సూక్ష్మ క్షణాల సమూహమైన విధంగా నీ చేతిలోని ఇసక రేణువుల కూడిక అనంత సృష్టికి ఆధారం. సృష్టిలోని ప్రతి ఒక్కరికోసమూ ఒక నిధి వేచి వుంటుంది. కాని మా సొంతదారులకు అవి చెబితే తాము వాటికి అర్హులం కాము, దుస్సాధ్యం వంటి సాకులతో నిర్లిప్తతా నైరాశ్యాలతో బాధపడతారని భయపడి మేము ఇటువంటి ఊగులాటలేని పసివయసులో ఉన్నవారికే ఎక్కువ చెబుతాం. సంకల్పసిద్ధులు వాటిననుసరించి విజయులైతే, మిగతావారు బతుకుబండిని లాగే గానుగెద్దులుగా మిగిలిపోతారు."

అయితే తనెప్పుడు ఏకారణానికి లక్ష్యాన్నించి దూరం జరిగినా పట్టించుకోవద్దనీ, తనని ప్రోత్సహిస్తూనే ఉండమనీ బాలుడు హృదయానికి స్పష్టమైన ఆడేశమిస్తాడు.

వీరుడంటాడు: "నువు నీ హృదయం సూంచించట్టు పిరమిడ్ల దిశగా పోవడం నా సలహా. అయితే స్వప్నాన్ని సాకారమొనర్చుకోవడమే కాక ఆ క్రమంలో నేర్చుకున్న అనుభవాల పాఠాలు చక్కగా ఒంటబట్టడం కోసం విశ్వాత్మ మరింత కఠిన పరీక్షలు పెడుతుంది. వాటికి నిలిచిన ధీమంతులకు లక్ష్య సాధనతో పాటు అంతవరకు సముపార్జించిన జ్ఞాన సంపద కూడా దఖలుపడుతుంది. అలా నిలవలేనివారూ ఉంటారు. అటువంటి వారిని గురించే ఈ ప్రాంతాల్లో ఓ సామెత ఉంది. "నీటికోసం అంతవరకూ పరిగెత్తినవాడు నీటి చెలమకి రెండుబారల దూరంలో చనిపోయాడు" అని. ప్రతి అన్వేషణా ఆరంభకుడి అదృష్టంతో మొదలై, అతి తీక్ష్ణమయిన పరీక్షలతో ముగుస్తుంది.

"వేకువకి ముందు జాము చీకటి అతి చిక్కన" అనే తమ ప్రాంతపు సామెత బాలుడికి గుర్తొస్తుంది.

***

త్వరలోనే వారు రణభూమికి చేరువయేరన్నందుకు నిదర్శనంగా కొందరు యోధులు వారిని అడ్డగించి ప్రశ్నిస్తారు.

స్వర్ణయోగి తన గురించి చెప్పుకుని తనవద్దనున్న జ్ఞానరత్నాన్నీ జీవామృతాన్నీ ప్రదర్శించి వాటి గొప్పదనం వివరించినప్పుడు వారంతా పరిహాసంగా నవ్వుతారు.

బాలుడిని, ఇంత డబ్బు ఎందుకు తీసుకెళుతున్నావని అడిగితే, నేను పిరమిడ్లవద్దకు పోవాలని అంటాడు. యోధులు తమదారిన తాము పోగానే బాలుడడుగుతాడు. నీకేమైనా పిచ్చా అంత నిగూఢ రహస్యాన్ని వారికి చూపావు? అంటే అతనంటాడు. ఒక ప్రపంచ సత్యం నీకర్ధమవాలని అలా చేసేను. అతి ఘనమైనవీ నిగూఢమైనవీ ఉన్నవున్నట్టు చెబితే ఎవరూ నమ్మరు. అది లోకపు తీరు. అని.

బాలుడికీ తన హృదయానికీ ఈ సరికి సయోధ్యకుదిరింది. అది ప్రశాంతమై అతనితోపాటు విశ్వాత్మ అనుగ్రహాన్ని ఆస్వాదిస్తున్నది. మునపటి చెల్లాచెదరు పీకులాటలు సమసిపోయాయి. బాలునికి పూర్తి సహకారి అయింది. ఒకేరకపు ఎడారి విస్తృతి ఎప్పుడైనా అతనికి విసుగు కలిగిస్తున్నదనిపించినప్పుడు ఉత్తేజ పరిచే తలపులను అతని ఉల్లాసం కోసం, స్ఫూర్తి కోసం కలిగిస్తోంది. గతంలో కొన్నిసార్లు అతన్ని రక్షించిన వైనం కూడా చెప్పుకొచ్చింది. చిన్నతనాన తండ్రివద్ద అతను దొంగలించిన తుపాకీ పేలి అతను గాయపడకుండా దాన్ని పెట్టిన చోటు మరిచిపోయేలా చేయ్యడం, ఇంకోసారి అతణ్ణి చంపి మందను కాజేద్దామనుకున్న దొంగలబారినుంచి కాపాడేందుకు కడుపులో వికారం కలిగించి వాంతులతో నీరసిల్లి నిద్రపోయి దొంగలు మాటువేసి వున్న వైపుకు పోకుండా చెయ్యడం, ఇలా.

అయితే గుండె కలిగించే నిబ్బరానికి పరిమితి ఉంటుందనీ, ఎడారి వంటి చోటుల్లోని ప్రమాదాలు గుండె పరిధికి అందవనీ అంటాడతను.

అది బలపరుస్తున్నట్టుగా ఇంకొందరు యోధులు పదునైన ఆయుధాలతో వారిని అడ్డగిస్తారు. ప్రాంతం తమదైనా, బలగాలు తమకున్నా, తమకి సమాధానమిస్తున్నప్పుడు అతని చూపులోని తీక్ష్ణతకి మారు మాటలేక వారు వెళ్ళిపోవడం బాలుడికి అబ్బురమనిపిస్తుంది. ఏమిటీ రహస్యం అనడిగితే, ఆంతరంగిక శక్తి చూపులో ప్రకటితమవుతుందని అతను బదులిస్తాడు.

తాము ఇంకో రెండురోజుల్లో పిరమిడ్ల వద్దకు చేరుకోగలమని తెలిసి బాలుడంటాడు: "మనం దారులు వేరై విడిపోయేముందే మీరు నాకు తగరాన్ని బంగారం చేసే స్వర్ణయోగం నేర్పాలి" అని.

దానికతను బదులిస్తాడు: "బంగారం ఒక పరిణామ క్రమపు పరిపూర్ణతకు ప్రతీక. దాని తయారీలో నిమగ్న్లులైన సిద్ధులూ దానిలాగే పరిణామం చెందుతారు. అటువంటివారే సిద్ధించిన స్వర్ణానికి అర్హులు. అలవోకగా వచ్చిపడే స్వర్ణం అది పొందినవారికి ఒనగూర్చే ప్రయోజనం శూన్యం. శ్రమ, సాధన లేకుండా దాన్ని ఆశించేవారికి ఇనుము, రాగి, తగరం వంటి ఇతర ధాతువుల స్వభావం అవగతం కాదు. సృష్టిలోని ప్రతి వస్తువుకూ ఒక పరమార్ధం ఉన్నది. ఈ శంఖం చూడు. ఇది చెవిలోపెట్టుకుంటే సముద్రపు హోరు వింటావు. ఇప్పటికి ఇక్కడ కనుమరుగైన సముద్రం ఈ శంఖంలో ఒదిగి నినదిస్తోంది. ఒకనాటికి ఇదంతా మళ్ళీ జలమయినప్పుడు సముద్ర పరమార్ధమూ నెరవేరుతుంది."

మరికొంత దూరప్రయాణం తరవాత ఇంకొత మంది యోధులు చుట్టుముడతారు. కళ్ళు మాత్రమే కనబడే దుస్తుల్లో ఉన్న వారి చూపుల తీక్ష్ణత ఇంతకు మునుపు బాలుడు నేర్చుకున్న విధంగా అంతరంగపు తీక్ష్ణతను ప్రకటిస్తున్నది. అందులో చావు స్ఫురిస్తోంది.

వారు వీరిని స్వాధీనంలోకి తీసుకుని తమ నాయకులముందుంచుతారు. తానో స్వర్ణయోగిననీ, ఈ బాలుడు ఇంకో స్వర్ణయోగి అనీ, ఇతనికి అతీంద్రియ శక్తులున్నవనీ, తలచుకుంటే గాలిగా మారి సర్వనాశనం చెయ్యగలడనీ, మూడురోజులు గడువిస్తే అది చూపగలడనీ, అంతవరకు ఇది సమర్పించుకుంటున్నాం అని బాలుడి బంగారునాణేల సంచీని వారికి ఇచ్చేస్తాడు.

చూపలేకపోతే? అనడుగుతాడు యోధుల నాయకుడు.

అప్పుడు మా ప్రాణాలు మీ కర్పిస్తాం అంటాడు స్వర్ణయోగి.

వెర్రివాడా ఇప్పటికే నాదైనది మళ్ళీ నాకు నువ్వర్పించేదేమిటి అంటూ వారినో కంటకనిపెట్టే ఏర్పాటు మీద మూడ్రోజులు గడువిస్తాడు నాయకుడు.

దారిలో బాలుడికి ఉక్రోషం తన్నుకొస్తుంది. "నువ్వు నాకున్నదంతా వాళ్ళ పరం చేశావు. జీవితం మళ్ళీ మొదటికొచ్చింది. నేను స్వర్ణయోగినేమిటి, గాలిగా మారడమేమిటి?" అని.

దానికి అతనంటాడు: "ఫర్వాలేదు. నీ బంగారం ఈ నాడు మన ప్రాణాలు కాపాడింది. ఎప్పుడో అరుదుగా తప్పిస్తే ప్రాణాలు కాపాడే శక్తి బంగారానికి వుండదు. అంతగా నీవా మహిమ చూపలేకపోతే మరణిస్తావు. ఒక లక్ష్యమూ పరమార్ధమూ లేక అనామకుల్లా మరణించే చాలామందికన్న స్వప్నం సాకారం చేసుకునే క్రమంలో సంభవించే నీ మరణం మహత్తరమైనది. ఏమో ఇంకా మూడ్రోజులుందిగా. ప్రాణం మీదికొచ్చినప్పుడు మనిషి ఏదైనా చెయ్యొచ్చు. లక్ష్య సాధనలో శ్రమించే వారికి అసాధ్యం వుండదు. ఉంటే గింటే అది వైఫల్యం గురించిన భయంవల్లనే. "

***

యుద్ధం తీవ్రగా వుంది. చనిపోయిన యోధుల స్థానంలో కొత్తవారు పోతున్నారు. చావు అతి సాధారణ విషయంగా కనిపిస్తోంది బాలుడికి. ఓ పక్క తీరిగ్గా తన డేగకి ఆహారం పెడుతున్న స్వర్ణయోగిని అడుగుతాడు. నేను గాలిగా ఎలా మారుతాను అని.

అతనంటాడు: ప్రపంచం భగవంతుని దృశ్యరూపం. స్వర్ణయోగం ప్రాకృతిక వస్తువులకు పారమార్ధిక చైతన్యాన్ని జోడించే ప్రక్రియ. అని.

ఇంకో రోజులో మరణిస్తాం, ఇప్పుడీ డేగకి భోజన కార్యక్రమం అంత ముఖ్యమా అంటే, చావు నీది బాబూ, గాలిగా మారడం నాకు తెలిసిన విద్యే అని ఆశ్చర్యపరుస్తాడతడు.

**

రెండోరోజు బాలుడు ఒంటరిగా నడుచుకుంటూ ఒక ఇసుక తిన్నె పైకి చేరుకుంటాడు. దారిలో పహరాయోధులు అడ్డగించరు. "తలచుకుంటే దుమారమై దుమ్ము రేపే బాల బాబాగారు" అని వారికి నిన్న తెలిసింది మరి.

తిన్నె పై నుంచుని భూమ్యాకాశాలు కలిసే సుదూరం వరకున్న భూతలాన్ని పరికిస్తూ నించుంటాడు. ఇప్పుడు తనతోబాటున్నది ప్రపంచ భాష తెలిసిన తను, తన హృదయము, ఎడారీ - ఈ ముగ్గురే. ఎడారికి తన భయం తెలిసి తనతో విశ్వ భాషలో మాట్టాడుతుంది.

***

మూడోరోజు యోధనాయకుని ఆదేశాల మేరకు బాలుని ప్రదర్శనకి అంతా సిద్ధమవుతారు. అందర్నీ కూచోమని, దీనికి కొంత సమయం పడుతుందని అతనంటే, ఫర్వాలేదు తాము ఓపికగల ఎడారి వారమని నాయకుండంటాడు.

తిన్నెనెక్కిన బాలుడు ఎదటంతా దృష్టి పరపి సుదూరాన కనబడే తిన్నెలు, రాతిగుట్టలు, ఎడారిలో కుదరదని తెలిసినా బతికి తీరాలనే పట్టుదలతో మొలిచి నిలిచిన చిన్న చిన్న మొక్కలనూ చూస్తాడు.

ఎడారి అడుగుతుంది. "నిన్నంతా చూసేవు తనివితీరలేదా? చెప్పు ఏం కావాలి?" అని.

అతనంటాడు: "ఇన్నాళ్ళూ నీలో సంచరిస్తూ నిన్నర్ధం చేసుకునే పనిలో ఉన్నాను. నీలో ఒకవైపు ఇక్కడ నేను, నీలోనే ఇంకోవైపు నా ప్రేమ రసాధిదేవత, నా రాకకోసం ఎదురుచూస్తున్న నా జీవిత భాగస్వామి. ఆమె వద్దకు పోవాలని నాకూ కోరికగా ఉంది. ఇక్కణ్ణించి పోవాలంటే నేను గాలిగా మారే విద్య ప్రదర్శించాలి. అందుకు నీ సహకారాన్ని అబ్యర్ధిస్తున్నాను."

"ప్రేమన్నావు ఏమిటి అది?" అంటుంది ఎడారి.

"అది ఆకాశంలో డేగల సంచారం. గాలిలో ఎగిరే వాటికి ఎక్కడో నీలో దాగున్న ఒక జీవిని ప్రసాదిస్తావు. అది తిన్న డేగలు మనిషి ఆహారానికి సహకరిస్తాయి. అది తిన్న మనిషి ఒకనాటికి ఎడారిలో కలిసిపోతాడు. అందరికీ ఒండొరులపై కల ప్రేమే ఈ జీవచక్రానికి ఇరుసు." అంటాడు బాలుడు.

అయితే గాలిగా మారేందుకు తన స్నేహితుడు వాయువు సహకారాన్ని అర్ధించాల్సిందని ఎడారి సూచిస్తుంది.

ఒక సన్నని గాలితెర అందర్నీ స్పృశిస్తుంది. ప్రేక్షకుల్లో ఒకడైన స్వర్ణయోగి మందహాసం చేస్తాడు.

వాయుదేవా నీవే నాకు రక్ష. తొలిసారి నా ప్రియతమురాలి హృదయరాగాన్ని నాకు పరిచయం చేసినది నీవే కద." అని ప్రాధేయపడతాడు.

"ఈ విశ్వభాష నీకెవరు నేర్పేరు?" అని అడుగుతుంది వాయువు. తరువాత, "నీవు గాలిగా మారలేవు; మనిద్దరం వేరువేరు" అంటుంది.

కాని బాలుడంటాడు: "స్వర్ణయోగినుంచి తాను నేర్చుకున్న ప్రకారం, సృష్టిలోని ప్రతిదీ ఒకే హస్తం నుంచి సృజించబడింది. అందరికీ వర్తించే విశ్వభాష ఒకటే. నాలో ప్రపంచపు సముద్రాలూ, నక్షత్ర మండలాలతో సహా సృష్టిలొని ప్రతి వస్తు విశేషమూ ఒదిగి ఉంది. నేను నీలా మారి నా ప్రేయసి భావాలను కొనిపోగల వీలూ ఉన్నది. కొద్ది నిముషాలపాటు నీలా మారే సులువు నేర్పు. ప్రజలూ ప్రచండ మారుతమూ సాధించగలిగేది ప్రదర్శిద్దాం." అని.

గాలికి ఆసక్తి కలిగింది. ఇది తనకి కొత్త విషయం. ఇంతవరకు తనెన్నెన్ని చేసిందని; భారీనౌకలను ముంచింది; మహావృక్షలను నెలకూల్చింది; నగర భవనలసందుల్లో వీస్తూ రకరకల ధ్వనులను వినిపించింది. తనకి సాధ్యం కనిదేమీ లేదనుకుంటే ఇప్పుడీ కొత్తబాలుడు తను చెయ్యాల్సిందింకా ఉన్నదని అంటాడు.

బాలుడు "అదే ప్రేమ ప్రభావం. అది కలిగినవారికి అసాధ్యలుండవు" అంటాడు.

వాయువుకు చికాకు కలిగి ప్రచండత పెంచింది. భూమ్యాకాశాలు ఏకంచేస్తూ దుమ్ము సుడులు తిరుగుతుంది. శిబిరాలూ ఆయుధసంపత్తీ గుర్రాలు వంటివి నేలమీద నిలవక కకావికలైపోతాయి. అయితే వాయువు ఆలోచనలో పడుతుంది. తన గమనంలో ప్రేమ గురించి వినడం అయితే విన్నది కాని ఆ భావన అనుభవంలోకి రాలేదు. అది అనుభవించవారందరూ ఆకాశానికేసి చూస్తూ నిట్టూరుస్తుంటారని గుర్తుకొచ్చి సూర్యుని సహాయం కోరమని బాలుడికి సూచిస్తుంది.

ఆసరికి వీచిన గాలి ప్రచండతకి యుద్ధ శిబిరాలు చెల్లాచెదరు కావడం చూచి నాయకుడు, "ఒప్పుకున్నాం. ఇక చాలని చెప్పండి" అని అదేశిస్తాడు ఈ ప్రచండతతకి భయపడ్డ తమ యోధుల్లో ఇద్దరి పేర్లు గుర్తు పెట్టుకుని. వారిని కొలువులోంచి తొలగించాలి. ఎడారి యోధునికి పిరికితనం పనికిరాదు.

ఆకాశంవంక చూచిన బాలుడు సూర్యునితో సంభాషిస్తాడు. తనకు ప్రేమ గురించి తెలుసనీ, ఇంత పైన తనున్నా తను ప్రకాశవంతం చేసినవాటన్నిటినీ ప్రేమిస్తానని, తనేమాత్రం కిందకి కాని పైకి గాని జరిగినా వారి జీవితం దుర్భరమవుతుందనే అపేక్షతోనే ఈ కక్ష్యకి కట్టుబడి వున్నానని అంటాడు సూర్యుడు.

బాలుడు సూర్యునికి ప్రేమ ప్రాముఖ్యతను స్వర్ణయోగానికి అన్వయిస్తూ అంటాడు: సృష్టిలోని ప్రతి వస్తువుకూ దాని ప్రయోజనం దానికున్నది. తగరం స్వర్ణమయేవరకు దాని పాత్రా ప్రాముఖ్యతా దానివి; స్వర్ణప్రక్రియలో తనపాత్ర తాను పోషించి లయిస్తుంది. ప్రేమ ప్రక్రియ అంతిమ ఫలితాన్నే కాక సాధకులను కూడా తీర్చిదిద్దుతుంది.

బాలుని వాక్యాలకు సూర్య భగవానుడు ముచ్చట పడినా అతడిని గాలిగా మార్చే విద్య తనవద్ద లేదనీ, విశ్వచరిత్రను లిఖించే పరమ హస్తమే అందుకు సమర్ధమ్ణీ వెల్లడిస్తాడు.

బాలుడు ఆ దివ్య హస్త దిశను కనుగొనలేక కళ్ళు మూసుకుంటాడు. ప్రపంచమంతా నిశ్శబ్దమై తన హృదయం కోరికని కాక ప్రార్ధనని వెల్లడిస్తుంది. అది తనింతముందు చేసిన ప్రార్ధనల వంటిది కాదు. ఆ మహా నిశ్శబ్దంలో అతనికి సృష్టిలోని ప్రతి వస్తువుకూ తనకంటూ ఏ పరమార్ధమూ ఉండదనీ, వాటి సృజనకు కారణమూ వాటి పరమార్ధమూ తెలిసి వాటిని నడిపించేది ఆ పరమహస్తమేనని అవగతమవుతుంది. సమస్త వస్తు చయమూ వాటి కారణ కార్యాల బాదరాయణ సంబంధాల పథక రచన జరిగిన పిమ్మట సృష్ట్యాదిని రూపుదిద్దుకున్న ప్రపంచమే భగవంతుని పరమక్రియగా వ్యవహరించబడుతుందని, విశ్వాత్మ పరమాత్మలో భాగమని, ఆ పరమాత్మ తనలో కూడా ఉన్నదని, అందువల్ల తనవంటి బాలురు కూడా అద్భుతాలు ప్రదర్శించగలరనీ తెలుస్తుంది.

***

ఆ తరవాత చాలాకాలం అక్కడి అరబ్బులు ప్రచండ మారుతంగా మారి మహాయోధులనే గడగడలాడించిన బాలుడి గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు.




అయితే అంత ధాటిలోను అందరు అల్లల్లాడగా ఇద్దరే మందహాసం చేశ్తారు. తనకో ఉత్తముడైన శిష్యుడు లభించినందుకు స్వర్ణయోగి, ఆ శిష్యుడు దైవలీలను తమముందు అద్భుతంగా ఆవిష్కరించేడని సేనానాయకుడు.

తరవాత వారిద్దరినీ తోడిచ్చి సాదరంగా సాగనంపుతాడు నాయకుడు.

***

కొంత దూరం తరవాత స్వర్ణయోగి అంటాడు: ఇటుపైన నువ్వు ఒంటరిగా సాగాల్సి ఉంటుంది.. పిరమిడ్లు ఇక కొద్ది దూరమే అని.

నాకు ప్రపంచ భాష నేర్పినందుకు కృతజ్ఞతలు అంటాడు బాలుడు.

కొత్తగా నేర్పిందేమీ లేదు. నీకు తెలిసినదాన్నే నేను ఆవాహన చేసి పలికించేను. అంటాడు స్వర్ణయోగి.

వారు ఒక సాధువు ఆశ్రమం చేరుతారు. అతడి వంటశాలలో స్వర్ణయోగి కొంత తగరాన్ని కరిగించి తన వద్దనున్న పచ్చని గుడ్డునించి వెంట్రుకవాసిని గీకి మైనంలో కలిపి ఆ లోహ ద్రవంలో వెయ్యగానే అది ఎరుపుకు మారి క్రమంగా కళ్ళుమిరుమిట్లు గొలిపే బంగారమవుతుంది.

ఇది నాకూ నేర్పాలి అని బాలుడంటే, ఇది నా లక్ష్యం. నీది కాదు. నేను నీకు ఋజువు చెయ్యాలనుకున్నదల్లా ఇది సాధ్యమని చేప్పేందుకు మాత్రమే.

బంగారాన్ని నాల్గు భాగాలు చేసి సాధువుకిస్తూ, "ఇది నీ సహాయానికి" అంటాడు. "నా సహాయానికి ఇది చాలా ఎక్కువ." అంటాడు సాధువు. "అలా అనకు. జీవ చైతన్యం అందరి మాటలూ వింటుంది. నువ్విలా అన్నది గుర్తుపెట్టుకుని ఈమారు తక్కువ ఇవ్వగలదు జాగ్రత్త."

బాలుడికి కొంత భాగమిస్తే బాలుడూ అదే అనబోయి తమాయించుకుని స్వీకరిస్తాడు.

మూడోది తను తీసుకుంటూ, ఇది నాభాగం. ఎడారివాసులకు తిరిగివ్వాల్సింది. అని నాలుగోది బాలుడికోసం ఉంచమని సాధువుకిచ్చినప్పుడు బాలుడంటాడు. నాకు నా నిధి ఉంది. ఇంకేం అక్కర్లేదంటే అతనంటాడు. నేనో ముసలి అరబ్బుని. మాకో సామెత ఉంది. ఒకసారి జరిగింది ఇంకోసారి జరక్కపోవచ్చు కాని రెండుసార్లు జరిగింది మూడోసారి జరగొచ్చు. నువ్వు రెండుసార్లు నీకున్నది పోగొట్టుకున్నావు. ఉంచు. అని.

మళ్ళీ ప్రయాణం లో బాలుడికి ఒక కథ చెబుతాడు. ఒక రోము దేశీయుడికి ఇద్దరు కొడుకులు. ఒకడు కవి, ఒకడు సైనికుడు. ధార్మికుడైన అతను తన కొడుకు మాటలు తరతరాల పాటు నిలవాలని కోరుకుంటాడు. స్వర్గస్తుడైన తరవాత దేవదూత అతని కోరిక ఎలా తీరిందో చూపించినప్పుడు తన కవి కుమారుడి మాటలు అతనికాలంలోనే ప్రాచుర్యం కోల్పోయని, సైనుకుడి మాటలే నిలిచేయని తెలుస్తుంది. కారణం, సైనికుడు తన బంటు ప్రాణంకోసం మతం మార్చుకుని దేవుని కుమారుడిగా చెప్పబడే మతాచార్యుడి ఇంటి ముందు నిలిచి, "స్వామీ నీ రాకతో పవిత్రమయే అర్హత నా గృహానికి లేకపోవచ్చుకాని చావుబతుకుల్లో ఉన్న నా సేవకుడు బతికేందుకు ఒక్క మాట అనండి చాలు" అంటాడు. ఈ కథ చెబుతూ, తమకి తెలిసినా తెలీకున్నా, సృష్టిలో ప్రతి ఒక్కరి వల్లా ఎదో ఒక ప్రయోజనం ఉంటుందని ముగిస్తాడు స్వర్ణయోగి.

బాలుడు చిరునవ్వు నవ్వుతాడు. ఒక గొర్రెలకాపరి అయిన తనకు జీవిత పాఠాలు ఇంత ముఖ్యమని ఎన్నడూ తను అనుకోలేదు.

తరవాత వీడ్కోలు చెప్పుకుని ఇద్దరూ వేరుపడతారు.

***

హృదయం ఉన్నచోటే నిధీ ఉంటుందన్న స్వర్ణయోగి మాటలు బాలుడికి ఇంకా గుర్తున్నాయి. అతను ఏకాంతంగా అలా సాగుతున్నప్పుడు హృదయం అంటుంది. ఎక్కడ నీ భావోద్వేగపు కన్నీటి బొట్లు పడతాయో అక్కడే నిధి వున్నట్టు కనక అక్కడ తవ్వు. అని. అలా అలా ఒక ఎత్తైన ఇసుకతిన్నె పైకెక్కినప్పుడు ఒక్కసారిగా ఎదట పిరమిడ్లు దర్శనమిస్తాయి. ఆ అద్భుత దృశ్యానికి అతని హృదయం ఉప్పొంగి ఇన్నేళ్ళ ప్రయాసా అన్వేషణా ఫలించేయని ఉద్విగ్నతతో కన్నీరు విడుస్తూ మోకాళ్ళపై కూలబడాతాడు.

విపరీతంగా శ్రమించి గొయ్యి తవ్వినా ఏదీ తగలదు కానీ కొందరు ఆగంతకులు తాము యుద్ధ శరణార్ధులమని, తమకు డబ్బు కావాలని అడుగుతారు. పట్టించుకోక పనిచేసుకుంటున్న బాలుడిని ఎందుకు తవ్వుతున్నావని దౌర్జన్యం చేసి అతణ్ణి తీవ్రంగా కొట్టడంతో అతను తన కల గురించి, నిధి అన్వేషణ గురించి నిజం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు నవ్వి విడెవడో బికారిలా వున్నాడని అతని సంచీ వెదికి బంగారాన్ని కనుగొని అది దొంగ సొత్తై ఉంటుందని ఇంకా కొట్టి కాజేస్తారు.

బాలుడు తన దుస్థితికి కుమిలి కుమిలి ఏడుస్తూ గోతిలో కూలబడతాడు. అతణ్ణి వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళలో ఒకడు వెనకొచ్చి ఇలా అంటాడు: "ఒరే వెర్రి వాడా! సరిగా నువు నిల్చున్నచోట గతంలో నాకు ఒక కల పదే పదే వచ్చింది. ఆ కలలో నాకు స్పెయిన్ లో ఒక పాడు పడ్డ చర్చీ, దాని గోడల్ని బీటలు వారుస్తూ దట్టంగా పెరిగిన రాగి మొక్కా వున్నాయని, ఆ మొక్క మొదట్లో నిధి దొరుకుతుందని ఎవరో అంటారు. పిచ్చి వాళ్ళు కాకపోతే ఒక కల పదే పదే వచ్చిందని ఎడారంతా దాటుకుని దేశం కాని దేశంలో అటువంటి ప్రదేశం కనుక్కుని నిధి వెతికేవాళ్ళుంటారా? అని.

బాలుడికి నిధెక్కడుందో తెలిసింది. తిరుగుబాట పడతాడు.

కథకి ఉపసమ్హారంలో ఆ బాలుడు సాధువు వద్దనించి తన బంగారం తీసుకుని తన ప్రస్థానం ప్రారంభించిన ప్రదేశంలోని రావి చెట్టు కింద తవ్వితే విలువైన నిధి దొరుకుతుంది. అందులో పదో వంతు మంత్రగత్తెకి ఇచ్చేందుకు నిశ్చయించుకుని సన్నద్ధమవుతుండగా మనోహరమైన తూర్పుగాలి తన ప్రేయసి మొదటి ముద్దును అతని పెదాలకు చేరుస్తుంది. వస్తున్నా ఫాతిమా అని బయలుదేరతాడు.



























1 comment:

  1. ప్రపంచం లో ప్రజాదరణ పొందిన సాహిత్యాల్ని, వ్యాసాల్ని మాతృ భాషలోకి అనువాదం చేయడం ద్వారా అనేక మందికి ఆ సాహిత్యం పరిచయం అవడమే కాకుండా, వారి ఆలోచన విస్తృతి కాడానికి దోహదం అవుతుంది. మీ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ.... మీ ఉదయ కుమార్

    ReplyDelete