కొన్ని చిన్న కథలు (ఇంటర్నెట్ నించి సంగ్రహించి అనువదించినది)
మీరు చదివే వుంటారు గాని ఇంకోసారి.
ఒకటి: గజం మిధ్య
మచ్చిక చేసిన గజరాజుల మందనొకదాన్ని చూశాడొక పెద్దాయన. ఆ గ్రావంబంతలేసి గజరాజులని బోనుల్లో పెట్టి గానీ గొలుసులతో కట్టి గానీ బంధించక సన్నని చిన్న తాళ్ళతో కట్టి నిలపడం ఆశ్చర్యమనిపించింది.
ఇంకా ఆశ్చర్యం, ఆ తాళ్ళ రెండో కొస దేనికీ కట్టి కూడా లేదు. మరింత ఆశ్చర్యంగా, ఈ బందిఖానా నించి తప్పుకొనేందుకు యేనుగులు కూడా తమ బలం చూపే ప్రయత్నం చెయ్యటంలేదు.దగ్గరనే వున్న మావటీని అడిగాడు - దేనికీ కట్టకున్నా ఆ కరిరాజులు ఇక్కడే పడున్నాయేమిటని.
మావటి చెప్పేడు: "అవి చిన్న పిల్లలుగా వున్నప్పుడు ఈ తాడునే ఒక కాలికి కట్టి రెండో కొస చెట్టుకు కట్టివుంచేవాళ్ళం. మొదట్లో విడిపించుకుందామని ప్రయత్నం చేసేవి కాని తమ పసిబలం చాలేది కాదు. రానురాను ఇక ప్రయోజనం లేదని పాపం ప్రయత్నమే వదులుకున్నాయి తరవాత వాటి వయసూ పరిమాణమూ బలమూ పెరిగినా, కాలికున్న ఒంటికొస తాటికీ దాన్ని తెంపటం అసంభవమనే ఊహకీ కట్టుబడి బతుకీడుస్తున్నాయి." అని.
అనుక్షణమూ సంభవించే మార్పే ప్రకృతి స్వభావం. దేహ మనో బుద్ధివిశేషాల్లో ఈ క్షణమున్నది మరుక్షణానికే మారిపోతుందే. అటువంటప్పుడు ఎన్నేళ్ళకిందటో నువ్వింతే అని ఎవరో అంటే అది ఇప్పుడు నిజమెలా అవుతుంది? కనుక చిన్నవయసులో లోకం మనమీద రుద్దిన పరిమితులే మన అసలు శక్తి అనుకొని కొత్త ఆలోచనలూ కొత్త ప్రయత్నాలూ మానుకుంటే ఎవరి అధీనంలోనో బానిస బతుకు ఈడవాల్సిందే.
రెండు: ఏ రాయైతేనేం
ఓ చిరువ్యాపారి అవసరపడినప్పుడల్లా చేబదులు తీసుకుని తీసుకుని ఓ కర్కోటకుడి వడ్డీ కోరల్లో చిక్కుకుపోయాడు. వృద్ధుడూ, అనాకారీ పేదల అవసరాలని సొమ్ముచేసుకుని విపరీతంగా కూడబెట్టిన ఈ ఋణదాత చిరువ్యాపారి కూతురైన చక్కని చుక్క మీద మనసు పడ్డాడు.
నా అప్పు తీర్చడం నీ వల్లయేది కాదుగానీ ఒక మధ్యేమార్గం చెప్పనా – నాకు నీ కూతుర్నిచ్చి పెళ్ళి చెయ్యి, అప్పంతా మాఫీ చేస్తా అని వాడు సలహా ఇచ్చాడు.
సహజంగానే ఆ బడుగు వర్తకుడితో పాటు ఇది విన్నవాళ్ళంతా ఋణాసురుడిని అసహ్యించుకున్నారు.
వాడు మళ్ళీ ఇలా అన్నాడు: “ఈ సంచీలో రెండు రాళ్ళు వేస్తాను. ఒకటి నల్లదీ ఇంకోటి తెల్లదీ. మీ అమ్మాయిని కళ్ళు మూసుకుని సంచీలో చెయ్యి పెట్టి ఒక రాయి తియ్యమనండి. నల్లరాయిని తీస్తే మీ బాకీ చెల్లు వేస్తా గానీ ఆమె నన్ను పెళ్ళాడాలి. తెల్లదైతే కనక, మీ బాకీ చెల్లువేస్తాను, మీ జోలికీ రాను. ఇంత న్యాయం మరెక్కడా వుండదు ఆలోచించుకోండి”.
వర్తకుడికీ అతని కూతురికీ సరేననక తప్పింది కాదు.
అయితే వడ్డీ వ్యాపారి వంగి రెండూ నల్ల రాళ్ళనే తీసి సంచిలో వేసుకోవడం గమనించింది అమ్మాయి.
ఆమె ఆలోచనలో పడింది: ఇప్పుడేం చెయ్యాలి? ఈ రాళ్ళ బాగోతం నాకు సమ్మతం కాదని తిరస్కరించాలి, కాదంటే రెండు నల్ల రాళ్ళనీ తీసి నలుగురికీ చూపించి వడ్డివ్యాపారి మోసాన్ని బట్టబయలు చెయ్యాలి, లేదా విధిలేక నల్లరాయిని తీసి వాడికి భార్యకావాలి. ఇవేనా తనముందున్న పరిష్కార మార్గాలు?.
అంతలోనే ఒక నిశ్చయానికి వచ్చి సంచిలో చెయ్యి పెట్టి ఒక రాయి తీసి అదే రంగుదో చుట్టుపక్కలవాళ్ళు చూసేంతలోనే చేజార్చి కింద పడేసింది. అది నేలమీది మిగతారాళ్ళతో కలిసిపోయింది.
అప్పుడు వడ్డీవ్యాపారితో, "అయ్యో పొరపాటుకి క్షమించండి చెయ్యి తడబడి నల్లదో తెల్లదో చూడకుండానే రాయి పడిపోయింది. అయినా ఫర్వాలేదు సంచీలో ఇంకో రాయి వుందిగా, అది నల్లదైతే నేను తీసింది తెల్లది, అది తెల్లదైతే నేను తీసింది నల్లదీ. తీసి చూపించండి" అందా తెలివైన పిల్ల.
వడ్డీ వ్యాపారికి తన మోసం బయటపడుతుందేమోనన్న భయం వేసింది. అతడు మేకపోతు గాంభీర్యం తెచ్చుకుని, "ఎందుకో నువ్వు తెల్లదే తీసుంటావనిపిస్తోందమ్మాయ్. నిన్ను నమ్ముతున్నాలే. మీ బాకీ రద్దు చేస్తున్నాను. నీకు నచ్చినవాణ్ణి పెళ్ళాడి సుఖంగా వుండు" అని నలుగురి ముందూ ప్రకటించి అక్కణ్ణుంచి జారుకున్నాడు.
పరిష్కారం లేని సమస్య వుండదు. ఉన్నమార్గాల్లో ఎదీ పనికిరాదని తేలితే పనికొచ్చేది ఇంకోటుందని అర్ధం. నమ్మకాన్ని సడలనివ్వకయోచన సాగిస్తే అది మెరుపులా స్ఫురిస్తుంది.
మూడు: బెకలు బెకలు చెవినిపెట్టక...
ఓ కప్పల గుంపు అడవినిబడి పోతూండగా వాటిలో రెండు ఓ నేల నుయ్యిలో పడిపోయేయి. మిగతావి పైనించి నూతిలోకి చూస్తే అది అడుగు కనిపించనంత పాతాళంలా అనిపించింది. అందులోంచి బైటపడ్డం అందులో పడ్డంత సులభం కాదని, అనవసరంగా పైకొచ్చే ప్రయత్నం చెయ్యక అందులోనే ఎదో విధంగా బతుకీడవ్వలసిందని కూడా ఓ ఉచిత సలహా పైనించే పడేశాయి.
పడ్డవి రెండూ ఈ సలహా పాటించక ఎలాగైనా పైకొద్దామని ఒక్కో చిట్టడుగూ పైకి వెయ్యనారంభించేయి.
పైనున్నవి తమ ఉపదేశాలు మానలేదు. పైకెలాగూ చేరడం జరగదనీ, సగం ఎక్కి అక్కడ్నించి పడితే దుర్మరణమని, లేనిపోని దుస్సాహసాలు చెయ్యక ఉన్న స్థితిలోనే పడుండడం ఉత్తమమనీ ఆ యిద్దరి ఆశలమీదా పైనుంచి నీళ్ళు జల్లుతూనే వున్నాయి.
అప్పటికే కొంత ఎత్తుకి చేరి రొప్పుతున్న ఆ రెంటిలో ఒకదానికి లోని ఆయాసమూ పైని శల్యసారధ్యమూ కలిసి ఉత్సాహమంతా ఇగిరిపోయింది. అంతమంది పెద్దలు చెవినిల్లుకట్టుకు పోరినా వినక ఈ స్థితి చేరేనని పశ్చాత్తాప పడింది. పట్టువదిలి అగాధంలో పడి చచ్చిపోయింది.
రెండోది ఉత్సాహం పెంచుకుంటూ ఒక్కో అడుగూ పైపైకొస్తోంది. తోటి కప్ప చావుని చూసికూడా పట్టు విడవని దాని మూర్ఖత్వానికి జాలీ కోపమూ పడుతూ పై కప్పలు ఉపదేశాలతో శాపనార్ధాలు కూడా పైనించి కురిపించసాగేయి.
ఆశ్చర్యం! బావి కప్ప ఆఖరి గెంతు గెంతి బయట పడింది!
తోటి కప్పలన్నీ దాని చుట్టు మూగి, "రాలేవూ నీవల్లయేపని కాదూ అని శత పోరేము కదే? మామాట పెడచెవిని పెట్టి ఎందుకింత సాహసం చేసేవు? అదృష్టం బాగుండి బయటపడ్డావు కానీ లేకుంటే సంధులు చిట్లి చచ్చేపరిస్థితే కద? " అని తలోరకంగా అన్నాయి.
"అయ్యో అలాగన్నారా? నాకేమో బ్రహ్మచెముడు, పైన మిమ్మల్ని చూసినప్పుడల్లా కేరింతలతో ఉత్సాహపరుస్తున్నారనుకుని ఆ ధైర్యంతో వచ్చేశాను!" అంది అది.
నూటికి తొంభైతొమ్మిదిమంది నువ్విది చెయ్యలేవని అంటూ, ఒక్కడు మాత్రం చెయ్యగలవంటే ఆ ఒక్కడి మాటే మనం పట్టించుకోవలసింది. నువ్వు చెయ్యలేవు అని చెప్పేవారు నిజానికి చెప్పాలనుకుంటున్నది నేను చెయ్యలేను అని. వారి పరిమితులు మనవి కావుగా. బయటి బెకబెకలు ఎన్నున్నా లోపలి ప్రబోధమే మనకి దారిచూపేది.
నాలుగు: రొట్టె కొలదీ వెన్న
ఒక రొట్టెల వ్యాపారి శేరు వెన్న కొనుగోలు చేశాడు. వెన్నాయన తనికి పాత మిత్రుడే. ఎన్నోయేళ్ళనించీ ఒకరివద్ద ఒకరు వస్తువులు కొనుకుంటున్నవారే.
అయితే స్నేహం స్నేహమే వ్యవహారం వ్యవహారమే. ఎందుకైనా మంచిదని రొట్టెలాయన ఈమారు వెన్నను తూకం వేశాడు. శేరుకి చాలా తక్కువే తూగింది.
అతను దేన్నయినా సహిస్తాడు కాని మోసాన్ని సహించడు. పోయి గ్రామ పెద్దకి ఫిర్యాదు చేశాడు.
గ్రామ పెద్ద వెన్నప్పని పిలిపించాడు.
"ఎన్నాళ్ళనించిరా ఈ మోసం? ఏదీ నీ శేరు తూకం రాయి? పట్రా" అన్నాడు గ్రామాధికారి.
"అయ్యా నా దగ్గర తూకం రాళ్ళు లేవండి." అన్నాడు వినయంతో వెన్నప్ప.
"అప్పుడు ఇతనికి నువ్వమ్మింది శేరు వెన్నని ఏమిటి నమ్మకం? "
"నమ్మాలండి. ఎప్పట్నుంచో అతని దగ్గర రొట్టెలు కొంటున్నాను. ఒకో రొట్టీ శేరు తూగుతుందని అతనే చెప్తాడు. ఆ మాటని బట్టే అతని రొట్టెతో శేరు వెన్న తూచాను" అన్నాడు వాడు.
తన రొట్టెలు శేరు తూగేమాట నిజమేనని రొట్టెలాయనకూడా ఒప్పుకున్నాడు. గ్రామాధికారి అతనికి చివాట్లూ జరిమానా వేసి కేసు కొట్టేశాడు.
మన వంచన నిప్పు. మన మాయ దాన్ని కప్పిన నివురు. ఒకనాటికి మననోటితో మనమే దాన్ని ఊది బట్టబయలు చేసుకుని నిర్లజ్జగా నించోవలసివస్తుంది. మోసం ఎన్నాళ్ళో సాగదు. మనం ఎవరిమీదో విసిరేసేమనుకున్నది ఒకనాటికి మన నెత్తినే పడుతుంది.
ఐదు: బాటలో బండరాయి.
ఒక రాజు నలుగురూ నడిచే రహదారి మధ్యలో ఓ రోజు ఒక బండరాయిని పడేయించి, కాస్త దూరంగా ఎవరికీ కనిపించని మాటు వెనక ఆ దారంట పోయేవారిని గమనిస్తూ కూర్చున్నాడు.
దారమ్మట పోయేవారిలో చాలామంది ధనికులూ, రాజోద్యోగులూ, రాజుకు తెలిసినవారూ కూడా ఉన్నారు. కొందరు ఆ బండని తప్పించుకు పోతున్నారు. నలుగురూ నడిచే దారిలో ఇంతంత రాళ్ళేమిటని, ఇంత అస్తవ్యస్త పాలన ఎక్కడా చూళ్ళేదని ఇంకొందరు ప్రభుత్వాన్ని బాహాటంగానే ఆక్షేపించారు.
అంతలో నెత్తిన కూరల తట్టతో ఓ రైతు అటుగా పోతూ రాయిని చూశాడు. వెంటనే తట్టని రోడ్డు పక్క చెట్టు నీడన పెట్టి, రాయిని తొలిగించేందుకు ప్రయత్నించాడు. పెద్ద రాయి కావడం మూలాన చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆఖరికి అది కదిలింది. దాన్ని దొర్లించి రోడ్డు పక్కకి చేర్చాడు.
తిరిగి కూరల తట్ట నెత్తినెత్తుకుని నడవబోతూ ఇంతకు ముందు రాయి ఉన్న చోటుని యథాలాపంగా చూశాడు. అక్కడో పట్టు సంచీ వుంది. దాన్ని తీసుకు చూస్తే అందులో బంగారు నాణేలూ, రాజు సంతకంతో వున్న ఒక కాగితమూ వున్నాయి. ఆ కాగితంలో "ఈ బండని రోడ్డునించి తొలగించినవారికి ఈ బహుమతి" అని రాసి వుంది.
అవరోధాలకు కారణాలు వెతుకుతూ ఎవరినో నిందిస్తూ కూర్చునే కన్న, నడుం బిగించి రంగంలోకి దిగి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకోసం చేసే ప్రతి పనీ తమను కూడా పరిరక్షిస్తుంది.
ఆరు: రెక్కాడాల్సిందే
సీతాకోకచిలగ్గా మారబోయే ప్యూపానొకదాన్ని ఒకతను రోజూ గమనిస్తున్నాడు. కొన్నాళ్ళకి దానిలో చిన్న పగులు ఏర్పడింది. అది కొద్దికొద్దిగా విచ్చుకోవడాన్ని కొంత దూరంలో నుంచుని చూస్తున్నాడు. చివరికి సీతాకోక చిలక కొద్దికొద్దిగా బయట పడేందుకు శ్రమిస్తుండటం కనబడింది.
అంతలోనే దాని కదలికలు ఆగిపోయేయి. తదేకంగా చూస్తున్నాడు కాని సీతాకోకచిలక కదలిక లేదు. ప్రాణంతోనే వుంది కాని చుట్టూ వున్న పెంకునుండి విడవడ లేకపోతోంది.
అతనికి జాలి అనిపించింది. ఇంటోంచి ఓ కత్తెర తీసుకొచ్చి దాని రెక్కలకి అంటుకున్న గుల్ల భాగాన్ని కత్తిరించి అది స్వేచ్ఛగా బయటికొచ్చేలా చేశాడు.
ఆ తరవాత దాన్ని ప్రతిరోజూ గమనిస్తూ వచ్చేడు. దాని రెక్కలు ఎదగలేదు. అది జీవిత కాలం పాటూ రెక్కల ఎదుగులేక, ఎగర లేక, కుంటుతూ పాకుతూ కొద్దికాలానికే ఆకలితో చచ్చిపోయింది.
ఆ దయార్ద్ర హృదయుడికి తెలియలేదు, సీతాకోకచిలక మనుగడకి ఆ ప్యూపా పెంకు దానిక్కలిగించే అవరోధం, దాన్నించి విడివడేందుకు అది పడాల్సిన శ్రమ ఎంతో అవసరం. ఈ ప్రారంభ పోరాటంలో అదెంత శ్రమిస్తే దాని జీవితం అంత సౌఖ్యంగా వుంటుంది. అది కష్టపడిపోతోందని తను కల్పించిన దగ్గరదారి దానికి శాశ్వత కష్టాన్ని మిగిల్చింది.
శ్రమ యోగం. దాని ఫలమే భోగం. శ్రమలేని ఫలం రోగం. శ్రమను తప్పించుకుంటే కలిగే సుఖం తాత్కాలికం. అవసరమైనప్పుడు శ్రమ పడాల్సిందే. సాకులూ దగ్గరి దార్లూ పనిచెయ్యవు.
ఏడు: కోపి గురుతులు
ఓ పిల్లాడికి ఊ అంటే కోపం ఆ అంటే కోపం. కోపంలో ఎవర్నో తిట్టడమో, వస్తువులు పగలగొట్టడమో చేస్తూండేవాడు.
వీణ్ణి చాలాకాలం గమనిస్తున్న వాళ్ళ నాన్న ఓ రోజో సంచీ నిండా మేకులు తెచ్చి వాడికిస్తూ, "చూడు చినబాబూ, ఈ సారి కోపమొచ్చినప్పుడల్లా ఇందులోంచి ఓ మేకు తీసి పెరటి తలుపుకి కొడుతూండు" అన్నాడు.
మొదటిరోజు వాడు ముప్ఫై యేడు మేకులు కొట్టాల్సి వచ్చింది. వాడికి గాభరా వేసింది.
మరసట్రోజు కొంచం జాగ్రత్తపడి కోపం తగ్గించేడు. ముప్ఫైయ్యేడు కాకపోయినా కొన్ని మేకులు మళ్ళీ తలుపులోకి దిగాయి. క్రమేపీ వాడిలో మార్పు వచ్చి దిగే మేకుల సంఖ్య తగ్గుతూ చివరికి ఆగిపోయింది.
మేకుని తలుపులో కొట్టటం కన్నా కోపాన్ని నిగ్రహించుకోవడమే సులభమనిపించింది వాడికి.
ఇప్పుడు వాడికి కోపమే రావడం లేదు. ఈ శుభవార్తని వాళ్ళ నాన్నతో పంచుకున్నాడు.
"ఇప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా వుండాలి. ఓ పని చెయ్యి. ఏరోజు పూర్తిగా కోపం రాకుండా వుంటుందో, ఆరోజు తలుపులోంచి ఓ మేకు పీకు." అని సలహా ఇచ్చాడు నాన్న.
అలా కొన్నాళ్ళకి మేకులన్నీ వూడొచ్చేశాయి.
ఆ తలుపుని చూపిస్తూ తండ్రి ఇలా అన్నాడు: "చూడు, నువు మేకులు కొట్టేవు, తీసేసేవు. కానీ ఈ తలుపుకి జరిగిన నష్టం శాశ్వతంగా ఉండిపోయింది. ఇంతకు ముందుండే మంచి తలుపుని ఇక మనం చూడలేము. కోపంలో నువ్వొకతన్ని చంపేస్తే తరవాత నీ పశ్చాత్తాపమూ ప్రాయశ్చిత్తాలూ అతన్ని వెనక్కి తీసుకురాగలవా? ఇది తెలుసుకుని ఆవేశాన్ని అదుపులో వుంచుకు బతుకు నాయనా." అని హితబోధ చేశాడు.
ఎనిమిది: ఎవరు అంధులు?
ఒక చక్కని పిల్ల. కాని పాపం పుట్టుకతోనే అంధురాలు. అందువల్ల ఆమె ప్రపంచాన్నీ జీవితాన్నీ అసహ్యించుకునేది.
ఇంత నైరాశ్యపు అంధకారంలోను తనను ఒక్క క్షణంకూడా వీడక గాఢంగా ప్రేమించే తన ప్రేమికుడే ఆమెకి ఆశాకిరణం. తనకే కళ్ళుండి ప్రపంచాన్ని చూడగలిగితే అతన్ని పెళ్ళాడి ఏలోటూ రాకుండా చూసుకోనా అని తరచూ వాపోయేది.
దేవుడు ఆలకించాడా అన్నట్టు, ఎవరో దయామయుడు దానం చేసిన కళ్ళు ఆమెకి అమర్చారు. ఆమెకి చూపొచ్చింది.
"ప్రపంచాన్ని చూడగలుగుతున్నావు కదా, మన పెళ్ళెప్పుడు?" అన్నాడు ప్రేమికుడు సంతోషంగా.
అతన్ని చూసిన ఆమె నిర్ఘాంతపోయింది. అతనూ అంధుడే. "ఇన్నాళ్ళూ గుడ్డి బతుకు బతికి తీరా కళ్ళొచ్చాక ఓ గుడ్డివాణ్ణా పెళ్ళాడ్డం? నీకు తగ్గదాన్నెవర్నన్నా చూసుకో నిన్ను పెళ్ళాడలేను" అని కుండ బద్దలుకొట్టింది.
అతనికి దుఃఖం వచ్చింది. ఒక కాగితం మీద ఎదో గిలికి ఆమె చేతిలో పెట్టి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఆ కాగితంలో ఇలా వుంది:
"కనీసం నా కళ్ళనైనా జాగ్రత్తగా చూసుకో నేస్తం."
పరిస్థితులు తారుమారైనప్పుడు కూడా మాట నిలుపుకున్నవారే కదా మహితాత్ములు. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకలా వాటినుంచి బయటపడినపుడు ఇంకోలా ప్రవర్తించేవారు దాలిగుంటలోf కుక్క చందం. పగలంతా ఇళ్ళలోకి చొరబడి నలుగురితోను తిట్లు తినే కుక్క రాత్రికి గుంటలో ముడుచుక్కూచుని ఇకపైన గౌరవంగా బతుకుతాననుకుంటుంది. తెల్లారితే షరా మామూలే.
తొమ్మిది: పసివాడి పెద్దమనసు
"కుక్క పిల్లలు అమ్మబడును" అని ఓ దుకాణం ముందు బోర్డూ, దానిలో ఓ బుజ్జి బుజ్జి కుక్క పిల్ల బొమ్మా వుంది.
అంతకి మించిన ఆకర్షణ ఏముంటుంది పిల్లలకి? మెరుస్తున్న కళ్ళతో ఓ చక్కని కుర్రాడు దుకాణంలోకి వచ్చాడు.
"కుక్క పిల్ల ఎంతంకుల్?" అని అడిగాడు.
"వందా రెండువందల మధ్యలో" అన్నాడు షాపువాడు.
కుర్రాడు జేబులోంచి కొంత చిల్లర తీసి, "నా దగ్గర పదిహేను రూపాయలుంది. ఓ సారి కుక్కపిల్లలని చూపిస్తారా" అన్నాడు.
కుక్కపిల్లలాయన చిరునవ్వు నవ్వి ఈల వేసేడు. పక్కనే వున్న బోనులోంచి బిలబిలామంటూ పది పన్నెండు బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు ఊలు బంతుల్లా దొర్లుకొచ్చేయి.
కుర్రాడు బోనులోకి చూశేడు. అందులో ఇంకా ఒకటుంది. కానీ అది నడవలేక దేక్కుంటూ వెనకబడి వుంది. "ఏమైంది దానికి" అని అడిగేడు.
పశువుల డాక్టర్ పరీక్షచేసి చెప్పిందాని ప్రకారం దానికి ఒక తొడ కీలు లేదని, అది జీవితాంతం కుంటుతూ దేకాల్సిందేనని దుకాణదారు చెప్పడు.
"అదెంతకమ్ముతారు?" అడిగేడు కుర్రాడు.
దుకాణదారు, "అదెవరు కొంటారు బాబూ, ఇంకో మంచిదాన్ని చూసుకో. కావస్తే దీన్ని ఉత్తినే పట్టుకుపో" అన్నాడు.
కుర్రాడు దిగాలుగా, దుకాణంవాడి కళ్ళల్లోకి చూస్తూ, దానివైపు వేలుచూపిస్తూ అన్నాడు: "నేను దాన్నే, మిగతావాటి ధరకే కొంటాను. ఉత్తినే తీసుకోను. ప్రస్తుతానికి ఈ పదిహేన్రూపాయలూ తీసుకుని దాన్ని నాకివ్వండి. నెల నెలా కొంత కొంత మిగతా ధరంతా చెల్లు వేస్తాను".
"అదేం చేసుకుంటావు బాబూ, ఆ కుంటిది నీతో సమానంగా పరిగెత్తగలదా దూకగలదా?" అని ఆశ్చర్యపోయాడు దుకాణదారు.
అప్పుడా కుర్రాడు తన పైజమా మోకాళ్ళవరకు ఎత్తాడు. ఒక కాలు మెలికపడి బలహీనమై, ఇనపచట్రపు ఊతం మీద బిగించి వుంది. "చూడండి, దానిలాగే నేనూ దూకలేను పరిగెత్తలేను. నాలాటి వాడే కద దాన్ని అర్ధం చేసుకొనగలిగేది." అని జవాబిచ్చేడు.
స్వచ్ఛమైన మనసు తనలో ఇతర జీవులనూ, వాటిలో తననూ చూడగలుగుతాయని కదా పెద్దల మాట.
ఇప్పుడు ఈ కథల సారం ఒకో వాక్యంలో:
ఒకటి: మార్పే ప్రపంచస్వభావం కనక నిన్నటి నీ బలహీనత నిన్నటికే పరిమితమనుకుని నేడు కొత్త యోచనలతో ముందుకు సాగాలి.
రెండు: సమస్యా పరిష్కారమూ అవిభాజ్యాలు కనక నిమ్మళంగా యోచిస్తే సరైన పరిష్కారం ఆ సమస్యలోనే లభించక మానదు.
మూడు: తమ బలహీనతలు ఎదటివారి బలహీనతలుగా ప్రకటించి నీరుగార్చడం లోక స్వభావం కనక దిగజార్చే మాట చెవిని పడినా దులిపేసుకునే స్వభావం అలవర్చుకుని ముందుకు సాగడం ఉత్తమం.
నాలుగు: రహస్యంగా చేస్తున్నామనుకునే మోసం రహస్యంగా ఆకాశాన్ని చూసి ఉమ్మేయడం వంటిది.
ఐదు: ప్రతిఫలానికి ఎదురుచూడకుండా చేసే మంచిపనుల ప్రయోజనం దక్కకుండా పోదు.
ఆరు: పనిలోని శ్రమని బట్టే దాని ఫలితపు ప్రయోజనమూ ఉంటుంది.
ఏడు: క్షణికావేశం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లాగ ఒక లిప్తపాటులోనే పూర్తయినా దాని దుష్పరిణామాలు సుదీర్ఘమూ శాశ్వతమూ.
ఎనిమిది: కష్టాల నిశిలో చేసిన బాసలు సుఖాల వెలుగులో నిలుపుకున్నపుడే వాటి సార్ధకత.
తొమ్మిది: ప్రబలులనూ దుర్బలులనూ కూడా చేసినది ఒకే సృష్టికర్త కనుక బలహీనులకు తోడ్పాటుగా చేయుతనిచ్చి సాటివారు సాగినప్పుడే సృష్టిలో సమతౌల్యం నిలుస్తుంది.
No comments:
Post a Comment