Wednesday, January 6, 2021

రోజువారీ - ఒక జీవన విధానం











1849-1919 మధ్య జివించిన సర్ విలియం ఓస్లర్ కెనడాకి చెందిన ప్రముఖ వైద్యుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలకి ఆద్యుడు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ గా వైద్య ప్రపంచం ఆయన్ని పిలుస్తుంది. ఆయన జాన్ హాప్కిన్స్ అనే ప్రముఖ వైద్యాలయ స్థాపకుల్లో ఒకరు. ఆయన యేల్ మెడికల్ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగం ఏ వే ఆఫ్ లైఫ్ గా ప్రచురితమైంది. మంచి సందేశం ఉన్న ఆ ఉపన్యాసం తెలుగులో మీకోసం అనువదించి చదివినవారు 

రోజువారీ ఒక జివన విధానం.

సహ విద్యార్ధులారా,

మనదరమూ హేతువాదులం. మన హేతువాదం మన తలపుల్లో, మాటల్లో, చేతల్లో ప్రకటిస్తూ ఉంటాం. పండితులు ఠీవిగా ప్రకటిస్తే పామరులు డాబుగా ప్రకటిస్తారు. వయసు పెరిగే కొద్ది అది స్పష్టంగా అర్ధమవుతుంది. ఉడుకు రక్తం, మెరుపు కళ్ళు, నరాల బిగువు, ఉద్రేకం ఉన్న మీలాటి కుర్రాళ్ళకి తత్వమూ వేదాంతాలతో పని లేదు. ఈ మాట స్టాజిరీట్ అనే పెద్దాయన ఎప్పుడో చెప్పేడు. అయితే నువ్వేం చేస్తున్నట్టు అనవచ్చు. నేను మీకో సందేశం ఇచ్చి దిగిపోతాను. అది వేదాంతమని చెప్పను, తత్వమనీ చెప్పను, నీతి అని చెప్పను, మతం అని చెప్పను, కాని అన్నిటి మిళాయింపు అని చెప్పగలను. అదెంత సామాన్యంగా అనిపిస్తుందంటే, ఓస్ ఇంతేనా అని మీరు మొహం చిట్లించుకున్నంత. జోర్డాన్ నదిలో మునగవయ్యా నీ జబ్బు పోతుంది అంటే నామాన్ అనే ఆయన చిట్లించుకున్నట్టు. ఇదెలాటిదంటే, మనం ఆలిన్ వన్ అని కొనుక్కుని జేబులో పెట్టుకుంటుంటాం చూడండి, అదే స్క్రూ డ్రైవరు, అదే రెంచీ, అదే కత్తి, అదె నైల్ కట్టరు - అలాటిది. దాని తయారీలో పెద్ద పనివాడితనమున్నట్టు అనిపించదు కాని ఉపయోగాలు బోలెడు. 

**

ఒకటి 

చాన్నాళ్ళ క్రితం ఒక క్రిస్మస్ కార్డు మా చేతుల్లో చేతుల్లో తిరిగింది. దాని మీద "అతుకుమీద అతుకు. అదే కదా బతుకు" అనివుంది. మర్యాదగా చెప్పాలంటే, జీవితం అలవాట్ల సమాహారం. ఇది పరమ సత్యం. దీన్నే అరిస్టోటిల్ ఉత్తమ ఋజువర్తనం లేదా మోరల్ ఎక్సెలెన్స్ అన్నాడు. చేసిందే చేస్తూ చేసిందే చేస్తూ పోతూవుంటే అదే అలవాటు. ఆర్నెల్ల పసివాడినెత్తుకుని కింద నించోపెడితే ముక్కుమీద బోర్లా పడతాడు; రెండేళ్ళప్పుడైతే నించుని తప్పటడుగులు వేస్తాడు. ఏడేళ్ళప్పుడైతే దింపీ దింపగానే పరుగు లంకించుకుంటాడు. నాడులూ కండరాలూ క్రమేపీ అలవాటు పడి సాధించిన పరిపూర్ణత ఇది. అప్పుడే పుట్టిన పసిగుడ్డు నోట్లో వేలుపెట్టగానే పీల్చడం ప్రారంభిస్తాడు. క్షీరదాలు కోట్లాది సంవత్సరాలపాటు ఆచరించి చేసుకున్న అలవాటది. శరీరంలో ఏ భాగానికైనా కావాలనుకున్న రీతిలో అలవాటు చెయ్యచ్చు. కచేరీల్లో పియానోని అలవోకగా కళ్ళు మూసుకుని పలికించే సంగీత విద్వాంసుణ్ణి చూడండి. యేళ్ళపాటు చేసిన అభ్యాసం అలవాటుగా మారిన అద్భుత దృశ్యమది. అలాటి అలవాట్ల సమాహారమే ఒక వ్యక్తి నడవడి, కేరక్టర్, వ్యక్తిత్వము. పనిని అనుసరించి అలవాట్లు, వాటిననుసరించి వ్యక్తిత్వమూ నడవడీ. 

నేను మీకు బోధించే మార్గం ఏమిటంటే, పదే పదే క్రమం తప్పక ఒక పనిచేసి దాన్ని అలవాటుగా చేసుకోవాలని. ఒక పనంటే ఒక్కపనని కాదు. ఎన్ని అలవాట్లు చేసుకుందామనుకుంటే అన్నన్ని పనులూ క్రమం తప్పక ఆచరించమని. శ్రద్ధ ధ్యాస ఆ రోజు పనిమీదనే ఉండాలి. ఆ రోజు ఏమి చెయ్యాలనేదే లక్ష్యం. రోజువారీ డబ్బాల్లో - డే టైట్ కంపార్ట్మెంట్‌స్ లో జీవించడమన్న మాట. ఎయిర్ టైట్ అంటే గాలి చొరనిదని, వాటర్ టైట్ అంటే నీరు చొరనిదని తెలుసు కదా. డే టైట్ అంటే ఒక రోజు వ్యవహారంలోకి ఇంకో రోజును చొరనివ్వకపోవడం. అది ముందురోజైనా మరసటి రోజైనా. గతమైనా భవిష్యత్తైనా. ఏరోజు పనీ ప్రణాళికా ఆరోజుదే. మరేదీ దానిని ప్రభావితం చేసి పాడు చెయ్యకూడదు. 

కొన్ని యూనివర్సిటీల అధ్యక్షునిగా, కొన్ని గొప్ప పుస్తకాల రచయితగా, ఈ యేల్ విశ్వవిద్యాలయ ఆహ్వానితునిగా నాకు లభిస్తున్న ఇప్పటి గౌరవానికి నాకేవో ప్రత్యేక విద్యార్హతలూ పలుకుబడీ ఉండి ఉండాలని మీరనుకోవచ్చు. నా గురించిన తెలిసిన మిత్రులకి, నాకు నా వ్యవహార శైలి తెలిసినదే. అతి సామాన్య బుద్ధి విశేషం నాది. అయితే అలవాట్లని బట్టే గొప్పతనం అని నమ్మి ఆచరించి ఋజువు చేసుకున్నవాణ్ణి నేను. 

డాక్టర్ జాన్సన్ అంటాడు: ఉన్నట్టుండి గొప్పవాళ్ళైపోరు. మొదటిసారి చదివిన ఒక పుస్తకం, ఒకరితో చేసిన ఒక సంభాషణం వంటి అతి సాధారణంగా కనిపించే మన చేతలే అలవాట్లై మనని తీర్చి దిద్దుతాయి. 

నేను స్కూల్లో ఉన్నప్పుడు కార్లైల్ పుస్తకాన్నొకదాన్ని యధాలాపంగా తిరగేసి అందులో ఒక వాక్యానికి ముగ్ధుణ్ణై పుస్తకానికి అతుక్కుపోయేను. అది, "ఎప్పుడో భవిష్యత్తులో చెయ్యబోయేది కాదు; ఇప్పుడు చేతికందుబాటులో ఉన్న పనే మనకి ముఖ్యం." అన్నది.. 

***

రెండు:

క్రీస్తు ద్రాక్షతోటల్లో పనివారి నియామకం రోజువారీ పద్ధతిపైనే; మా రోజువారి రొట్టే మాకివ్వు ప్రభూ అని ప్రార్ధన; రేపటి ఆలోచన చెయ్యరాదనీ, నేటిపైనే ధ్యాస ఉండాలనీ .. ఇవన్నీ బైబిల్ వాక్యాలు. అన్ని ప్రపంచ మతాలూ రోజువారీ విధులే నియమబద్ధం చేశాయి. గతమూ భవిష్యత్తూ అనే జంట కళ్ళద్దాలనుంచి చూస్తే ఎప్పుడూ మసకే. వాటిని వర్తమానానికి సర్దుబాటు చేసుకుచూసినప్పుడే మార్గం స్పష్టమవుతుంది. పెద్ద పెద్ద నౌకల్లో వాటెర్ టైట్ కంపార్ట్మెంట్లు అంటారు. నీరు చొరని గదులు. ఒక మీట నొక్కితే చాలు వాటి తలుపులు తృటిలో మూసుకుపోయి పడవలోకి నీటి బొట్టు కూడా చొరదు. పడవ మునగకుండా ఈ ఏర్పాటు నిరోధిస్తుంది. ఈ ఏర్పాటే మనసుకూ ఉండాలి; 

అనుకున్నప్పుడు నిన్నటివీ రేపటివీ అయిన తలపులను రోజువారీ తలుపులు మూసి నిరోధించవచ్చు. అప్పుడు చేతిలో ఉన్న పనులు చెడవు. మన నేడు భద్రం. 

గతాన్ని గొయ్యితీసి కప్పెట్టమన్నారు. వినేందుకు సులువుగానే ఉంటుంది కాని ఆచరణ కష్టం. నీడలా వెన్నాడే దాన్ని విస్మరించడం కుదరనిపని. తాతయ్యలు, బామ్మలు, విధిలీల, కాలజ్ఞనం, రాత, ఇలాటివి ఒక్కసారి విదిలించుకోవడం కష్టం. అప్పుడప్పుడూ ఎదో లెక్కల బేరీజుకి తప్పిస్తే గతం వల్ల ప్రయోజనం సున్న. మన ప్రస్తుతాన్ని పాడుచేసే అవకాశం దానికివ్వకూడదు. ఎప్పటివో కోపతాపాలు, అలకలు, అవమానాలు, పొరపాట్లు, భంగపాట్లు, పాపాలు, తాపాలు, ఇవన్నిటినీ ఏరోజువి ఆరోజే రాత్రి పడుకోబోయే ముందే పాతిపెట్టాలి. ఒక పాత కవి వేడుకుంటాడు. భగవాన్! నా జ్ఞాపకాలమీద పెట్టేందుకో మూతనివ్వవా అని. జార్జి హెర్బర్ట్ అంటాడు. రాత్రయేసరికి నీ ఆత్మకున్న బట్టలు విప్పి అవతల పారెయ్ అని. అదీ వాటిని గుర్తు తెచ్చుకునో, విశ్లేషణలు చేసుకునో కాదు. ఉన్నదున్నట్టు దులిపేసుకొమ్మని. అప్పుడే నిన్నటి పొరపాట్లు అవి తలచుకుని కుంగుబాట్లు నేటి మాధుర్యాన్ని మలినపర్చకుండా ఉంటాయి. సెయింట్ పాల్ సూచించినట్టు, రాత్రి చనిపోయి ఉదయం పునర్జన్మ ఎత్తాలి.

మూడు:

నిన్నని వదిలించుకోవాలనుకున్నాం; అలాగే రేపటినీ తగిలించుకోకుడదు. దాని బరువు దీని బరువూ వర్తమానం నడ్డి విరుస్తాయి. కలలు, భవిష్యదర్శనాలు, గాలిమేడలు ఇలాటివన్నీ వదిలించుకోదగ్గవే. భవిష్యత్తు యువతదే అని వింటూంటాం. కాని ఆ భవిష్యత్తు వర్తమానం నించి పుట్టాలి. దానికోసం ఇది తగలేస్తే అదెలా బాగుంటుంది? భవిష్యత్తు నేడే. రేపనేది లేదు. మనిషి జీవిత పరమార్ధం నెరవేరేది ఈనాడే. ఈ రోజుని ఎంత నిజాయితీగా, శ్రద్ధగా నిమగ్నతతో నిర్వహిస్తామో అదే రేపటి ఫలాలు ప్రసాదిస్తుంది. కనక చేతిలో పని వదిలి రేపటిగురించిన కలలు ఆతృతలు అసంబద్ధం. మన కాల పరిధి ఇరవైనాలుగ్గంటలకే పరిమితం కావాలి. డెస్కార్టె సూచిస్తాడు: పని మానకు; ఆశ పెట్టుకోవడం మానడం నీ ఈష్టం అని. మొదటిది మనిషిచేతిలోనిది; రెండోది పరమాత్ముడిది. పని మాని ఆకాశం వంకా నేటిని విస్మరించి రేపటివంకా చూచేవారికి మిగిలేది విషాదమూ భంగపాటే. తమ కాళ్ళవద్ద పడున్న అనందాన్ని, సత్యాన్ని విస్మరించి భవిష్యత్తులోకి చూచేవారికి వాటి స్థానంలో మాయ, వంచన, బూటకమే పైనుంచి వచ్చిపడేది. 

గతం కాని, భవిష్యత్తు కాని వర్తమానాన్ని మెరుగుపరించేంతవరకే. అటుపైన మనకి వాటి అవసరం లేదు. కనుక మన పనులూ తలపులూ చేతలూ అన్నీ ఇవాల్టిరోజుకే అంకితం కావాలి. కష్టమే కాని సాధ్యం. అన్ని కొత్త అలవాట్లలాగే ఇదిన్నీ. అభ్యాసంతో సమకూడుతుంది. 

నాలుగు

సరే నిన్నటినీ రేపటిని వదిలేసి నేటిలో నిలుచున్నాం. ఎలా మొదలెట్టాలి? ఏమి చేసేదీ ఎలా చేసేదీ అంతా మన నిర్ణయమే కావాలి. ఎటువంటి బయటి సంప్రదింపూ సమాలోచనా అవసరంలేదు. చుట్టూ ఉన్న వేటినీ విస్మరించక, నేటి వాతావరనానికి, పరిస్థితులకి, కనబడే ప్రతి వస్తువుకి, వాటన్నిటి సహకారంతో మనక్కలిగే ఆనందానికి సంతృప్తులమై మనం దానిపైకురికి దాన్ని స్వాధీనం చేసుకునే నిమిత్తం నేడు అనే అద్భుతాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞులమై కార్య రంగంలోకి దిగాలి. బ్రౌనింగ్ అన్నట్టు, మనకోసం, మన స్వాధీనం కోసం, మన ఆనందంకోసం ఒక రోజు మనకై ఎదురుచుస్తోంది. ఉదయం కలిగే ఉత్తేజభావాల పరమార్ధం, అవి ఈ రోజు నడిచే బాటను సిద్ధం చేస్తాయి. అందుకనుగుణంగా మన వ్యావహారిక యంత్రాన్నీ సిద్ధం చేసుకోవాలి. ప్రాతః సమయాలు భారంగా అనిపించేయంటే వారు తమ యంత్రానికి తగిన ఇంధనం ఇవ్వటంలేదనో, లేక దాని శక్తికి మించిన నిన్నా రేపుల భారాన్ని దానిపై పడవేశారనో, లేక సంకల్పానికీ వివేకానికీ చురుకుదనానికీ మసిపట్టించే ధూమ మద్యపానాలవంటి దురభ్యాసాలకి దాసులయేరనో అర్ధం. ఆరోగ్యవంతమైన దృక్పథానికి ఆరోగ్యవంతమైన శరీరం కావాలి. మిమ్మల్ని చూస్తుంటే నాకావిషయంలో సందేహమేమీ లేదు. సోక్రటీసూ ప్లేటోలు చూచినా తరతరానికీ తేజస్సు పెంచుకుంటున్న యువశక్తికి గర్వించేవారు. వారు అనుసరించిన సూత్రమే మీదీ కావాలి. దేహారోగ్యాన్ని బట్టి మానసిక ఆరోగ్యం. రెండూ ఒకదానికింకొకటి ఆలంబన. వోల్టెయిర్ అంటాడు: అజీర్ణంతో బాధపడేవాడికి జీవితం పట్ల సదభిప్రాయం ఎలా వుంటుంది. బలహీనపడ్డ శరిరం మనసుని నిలకడగాను శ్రద్ధగాను ఎలా ఉంచగలదు. రోజులోని మొదటి రెండు మూడు గంటలు ఒళ్ళూ మనసు సరిగా ఉన్నాయో లేదో సీచిస్తాయి. శుభ్రమైన నోరు, నిర్మలమైన మనసు, మెరిసే కళ్ళు అనేవి ప్రతి రోజుయొక్క ప్రాథమిక హక్కు. ప్రొఫెసర్ మార్ష్ ఒక ఎముక పట్టుకుని ఆ జంతువు పూర్తి ఆరోగ్యాన్ని అంచనా వెయ్యగలిగినట్టు, రోజులోని మొదటి గంటనిబట్టి ఆ రొజెల వుండేది తెలుసుకోవచ్చు. ఆరంభమే అతి ప్రధనం. అది సరిగాఉండేందుకు ఆరోగ్యం ముఖ్యం. యువతలో ప్రాతఃకాలసమయాలు నిస్తేజంగా ఉండటానికి కారణం వారి ఆహారపుటలవాట్లు, దురలవాట్లు. ఆహారం ఆరోగ్యకరం కాకపోతే మనసు నిలకడగాను ప్రశాంతంగాను ఉండదు. నన్నడిగితే, ఆహారానికి నా దేహంలో ఆశ్రయమిస్తాను కనుక దాని ప్రవర్తన నా లోపల సక్రమంగా ఉండాలి. అలా ఉండని ఆహారాలకి నా ఒంట్లో స్థానమూ లేదు, అనుమతీ లేదు. 

ఇంకా, మద్యపానం యువతలో సాధారణమైపోయింది. మోతాదు మించకుంటే పర్వాలేదనేవారున్నారు కాని మోతాదు దాటినప్పుడు ఆపగలవారు లేరు కనక దాని విషయంలొ నిషేధమే ఉత్తమం. అలాగే ధూమపానం. మరోటి, జాతి వృద్ధికోసం ప్రకృతి కల్పించిన ఏర్పాటు దుర్వినియోగం. జీవిత అసలు లక్ష్యం గ్రహించుకుని ఈ అనవసర వ్యాపకాలు దూరంపెట్టాలి. కోరికల గుర్రాలకి వివేకపు కక్కుల కళ్ళెం తగిలించి వాటిని అదుపులోపెట్టాలి. 

ఒక తాజా, మనోహరమైన దేహం అన్ని బద్ధకాలనూ అనాసక్తులనూ దూరంచేసి రోజు ప్రారంభాన్ని ఉత్తేజభరితం చేస్తుంది. దాన్ననుసరించి రోజంతా నడుస్తుంది. మనసును నియంత్రించే ప్రతి ప్రయత్నం ఒక సంకల్పం, ఒక చేత. ఇటువంటి చేతల సమాహారమే ఇంద్రియ నిగ్రహం అనే అలవాటుగా రూపాంతరం చెందుతుంది. ఒక్కోటిగా వేసిన అడుగులతో గమ్యం చేరినట్టు. అది ప్రశాంతంగా క్రమబద్ధంగా ఆచరిస్తే సాధ్యపడేది కాని ఆదుర్దాతోను ఆందోళనతోనూ కాదు. రోజు నిడివి ఎంత వుందో, అందులో ఈ అభ్యాసానికి ఎన్ని గంటలున్నాయో, దాని ప్రకారం ఆచరణ ఆరంభించాలి. రోజులో పదహారు గంటలున్నాయనుకుంటె, అందులో మొదటి మూదు గంటలు ప్రశాంత స్థితిలో దేహాన్నీ మనసునూ ఉత్తేజభరితం చేసుకునేందుకు వినియోగించాలి. ఓపికతో కూడిన నిరంతర అభ్యాసమే కీలకం. దానితో ఉత్తమ ఫలితాలు సాధించలేని మొద్దులు ఎవరూ ఉండరు. 

యువత జీవితాన్ని ఆనందించలేరంటే హడావిడీ తొందరపాటు అన్నాడొకాయన. అంతేకాక పనిమీద ప్రశాంతంగా శ్రద్ధపెట్టలేకపోవడం వారిలో మానసిక ఆందోళనకి కారణం. పాపం పెరిగెడతారు కాని గమ్యం చేరుకోలేరు అంటాడు ప్లేటో. పనులూ వృత్తులూ పాడవడానికి కారణం, తొందరపాటూ ఆదరాబాదరా, మనసుకి శ్రద్ధలేకపోవడం. విలియం జేమ్‌స్ అనే ఆయన, పనులు చెడిపోవడానిక్కారణం అవి కష్టమనో అసాధ్యాలనో కాక, అవి చేసేటప్పుడు శ్రద్ధ, లగ్నత లేకపోవడం అంటాడు. మనసు ఒకలాగ చేత ఒకలాగ ఉన్నప్పుడు పని చెడిపోవడం ఆశ్చర్యం కాదుగా. అట్టి శ్రద్ధ అభ్యాసంతో పెంపొందాల్సిన విషయం. రోజంతా అక్కర్లేదు. రెండు మూడు గంటలు చేసే పనిమీద లగ్నం చేసే అభ్యాసం. కొన్ని నాళ్ళు చేస్తే చిన్నపిల్లలకి నడక అలవాటైనట్టు, సంగీతవిద్వాంసుడి చేతిలో పియానో పలికినట్టు పట్టుపడుతుంది. విజయాన్ని కోరే విద్యార్ధి ఇతరుల గోలనూ కవ్వింపునూ హడావిడినీ లక్ష్యపెట్టకుండా ఆచితూచి అడుగులూ మాటలూ కదలికలూ చూసుకోవాలంటాడు అరిస్టోటిల్. ఈ విధంగా ఎనిమిదిగంటల రోజువారీ గదికి పరిమితమై, ఆ సమయంలో చేసే ప్రతి పని మిదా పరిపూర్ణమైన శ్రద్ధ పెట్టి పూర్తి చేసినవారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోనవసరం లేదు. అయితే ఇది క్రమంగా అలవాటుచేసుకోవాలి. అభ్యాసమే కీలకం. 

పనిమీద మనసు లగ్నం, లేక కాన్సంట్రేషన్ అనేది మెల్లమెల్లగా సమకూరే కౌశలం. ఆహారం కడుపులోకి పోకముందు నోట్లోనే దాన్ని మెల్లమెల్లగా అరగదియ్యటంవల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగినట్టు, ప్రతి పనినీ ప్రశాంతంగా కొద్ది కొద్దిగా మనసు లగ్నం చేసి కొనసాగిస్తే మానసిక జీర్ణక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది అంటాడు లొవెల్ అనే రచయిత తన ఫేబుల్ ఫర్ క్రిటిక్స్ అనే రచనలో. మనకి నైపుణ్యం ఉందా లేదా అన్నది అప్రధానం. ఒకటి శ్రద్ధ, రెండు వదలక ప్రతి రోజు కొనసాగించడం. ఇవి ముఖ్యం. ప్రయోజకులై వెలుగులోకి వచ్చిన వారి రహస్యమిది. రోజులో నాలుగైదు గంటలు పెద్ద విషయం కాదు. కాని ఒకరోజు మరసటి రోజుకి, ఒక వారం మరసటి వారానికి, ఒక నెల మరసటి నెలకీ - ఇలా క్రమం విడవక అభ్యసించినవారికి సహజంగా నైపుణ్యం ఒకటుంటే పదింతలవుతుంది. 




క్రమక్రమంగా పెంపొందించుకున్న ఇట్టి అభ్యాసంతో యువతకి ప్రపంచం పట్ల తమ వైఖరి కూడా మెరుగుపడుతుంది. ప్రపంచ పోకడలూ వెతలూ స్పష్టపడతాయి. అదే అన్ని వస్తువులనూ బంగారంగా మార్చే మంత్రదండం అంటాడు జార్జి హెర్బర్ట్ అనే ఆయన. జీవితం అంటే ఏమిటి? అంటే, నా జీవన విధానమే జీవితం; నాకు సంశయాల్లేవు, నైరాశ్యం లేదు. నేనభ్యసించి సాధించిన మంత్రదండ సహాయంతో జ్ఞానం, అనుభవం, జాగరూకత, నిజాయితీల అత్యున్నత శిఖరాలనధిరోహిస్తాను. హొరేస్ అంటాడు: నేనొక ఆనంద యోగిని; ఏకాంతవిహార భోగిని; నేటిని పరిపూర్ణం చేసుకొనిన సిద్ధుడిని; రేపెటుపోయినా లెక్కచెయ్యని నిక్షేపరాయుడిని అని. 

నేను నమ్మిందీ ఆచరించిందీ మీకు చెబుతున్నాను. పాటించేది మానేది మీ యిష్టం. వాల్ట్ విట్‌మన్ గారికి నేను వైద్యునిగ చికిత్సలందించేను. తన పద్యాలు అతనెప్పుడూ వినిపించలేదుకాని ఉదయాన్నే పనిముట్లు చేబూని పనికి పోతున్న శ్రామికులని చూచి ఉప్పొంగిపోయేవాడు: ఆహా ఈ రోజు పని ఎంత ఘనమైనది! ప్రస్తుతమే సత్యమని సామాన్యులను కార్యోన్ముఖులను చేయు అపూర్వ శక్తి కదా అని.

ఈ విధానాన్ని ఆచరిస్తే మీరూ జీవన కదన రంగపు వ్యూహాలను సునాయాసంగా రచించుకుని సన్నద్ధులై విజయులవుతారు. 

ఐదు

దేహానికీ మనస్సుకూ ఈ విధమైన శిక్షణ ఇస్తున్నప్పుడు ఇక మీరు చెయ్యాల్సింది?

మతాచారాలూ సిద్ధంతాలు ఏవైనా జివితంలో ఉన్నత శిఖరాలనధిరోహించిన వారిలో ఒక సామ్యముంది. అది ప్రతి రోజునీ ప్రార్ధనతో ఆరంభించడం. ఒక ఇరవై ముప్ఫై నిమిషాలసేపు కనులు మూసుకుని అంతర్ముఖులై ప్రపంచంలో మీ ఆలోచనలతో సారూప్యత కలిగిన జ్ఞానసంపన్నుల సాహచర్యంలో సృష్టి సంక్షేమంకోసమైన ప్రార్ధన. సాధారణంగా అందరూ ఆచరించేదే అయినా కొత్తగా అలవాటు చేసుకున్న "రోజుచొరని రోజువారి" డే టైట్ కంపార్ట్మెంట్ కార్యాచరణకి ఇది మరింత ఉపయుక్తమూ ఉత్తేజభరితమూ అవుతుంది. ఆ రోజుకే అయిన ప్రార్ధన నిశితంగా స్పష్టంగా ఉంటుంది.

ఆఖరుగా విద్యార్ధులారా, మీరే ఉత్తమ విద్యార్ధులమనీ, మీదే ఉత్తమ విద్యాలయమనే స్థిరమైన నమ్మకంతో ఈ కొత్త జీవనవిధానానికి నడుంకట్టి సాగండి. మానవజాతి పురోగమిస్తూందేమో కాని మనిషి అన్నికాలాల్లోనూ స్థిరుడు. మానవజాతి ప్రత్యేక స్వభావాలైన ప్రేమ, ఆశ, భయం, విశ్వాసం, మరియు వాటి మూలాధారమైన మానవ హృదయం మార్పుచెందనిది. దేశకాలాలకు అతీతమైన ఈ భావనే ప్రపంచంలోని ఏ భాషా సాహిత్యానికైనా మూలసూత్రం. ఆ రోజుకి భౌతిక ప్రపంచంలోని మీ లావాదేవీల నిర్వహణకు అదే ప్రధానం కనుక అంతరంగ శుద్ధికోసం శక్తికోసం రోజులో కేటాయించిన ఆ కొద్ది నిముషాలు పూర్తి రోజుని ఉత్తేజభరితం చేయ సమర్ధమై ఉంటాయి. శుభమస్తు. 






















No comments:

Post a Comment