స్వామి వివేకానంద ఉపన్యాసాలు : పని, దాని రహస్యం.
లాస్ ఏంజెల్స్ జనవరి నాలుగు, 1900
చెయ్యాల్సిన పనెంత ముఖ్యమో అది చేసే విధానమూ అంతే ముఖ్యమన్నది నేను నేర్చుకున్న ఉత్తమ పాఠాల్లో ఒకటి. బోధనలు కాక తన జీవితమే ఒక ఉదాహరణగా నాకు ఇది నేర్పి, దాని నుంచి ఇంకెన్నో నేర్చుకునేలా చేసేరు నా గురుదేవులు. పనెంత ముఖ్యమో విధానమూ అంతే ముఖ్యం.
అయితే పొందదగినదే మనసంతా నింపుకుని ఆ పరవశంలో అందుకనుసరించే మార్గాన్ని విస్మరిస్తాం. విశ్లేషించుకుంటే మన వైఫల్యాల్లో నూటికి తొంభైతొమ్మిదింటికి ఇదే కారణమని తెలుస్తుంది.
అందుకని, అనుసరించాల్సిన విధానం మీద, అందులోని ప్రతి చిన్న అంశం మీదా దృష్టిపెట్టాలి. ఏ చిన్న అంశాన్నీ విస్మరించకూడదు. దేనితరవాత ఏది చెయ్యాలన్న పనుల జాబితా రూపుద్దుకున్నాక చేసే పనినించి ఇంకేదీ మన దృష్టిని మరల్పకూడదు. మన అంతిమ లక్ష్యాన్ని మరిచిపోయినా పరవాలేదు. ఒక్కొక్కటిగా శ్రద్ధతో సర్వశక్తులూ కేంద్రీకరించి ఆచరించిన మన కార్యాచరణే దాన్ని మనకి సాధించి పెడుతుంది.
అలాగే, చేస్తున్నది నిష్ప్రయోజనమనిపించినప్పుడు ఒదిలేసుకునేందుకూ సిద్ధంగా ఉండాలి. చాలా సందర్భాల్లో మనకుగా మనం నిర్దేశించుకున్న లక్ష్యాలే పెనుభూతాలై మనని మింగేసే సందర్భాలూ చూస్తాం. ఒకటి చేపట్టి, సర్వ శక్తులూ ఒడ్డి, అది మన ఆరోగాన్నీ క్షేమన్నీ హరిస్తోందని తెలిసినా వదల్లేక అదే చేస్తూ చేస్తూ దాని మత్తులో చిక్కుకుపోయి నశిస్తాం. తేనె జుర్రుకుందామని వచ్చిన తేనెటీగ అందులో కాళ్ళు కూరుకుపోయి ఎగరలేక నశించినట్టు.
సాధారణంగా జరుగుతున్నదదే. మకరందం గ్రోలే పారవశ్యంలో దానిలో చిక్కుబడతాం; పట్టుకుందామనుకోటాం, పట్టుబడడతాం; దేన్నో వాడుకుని సుఖిద్దామనుకుంటాం, దాని సుఖానికి మనం దొరుకుతాం. పాలకులమవుదామనుకుంటాం. పాలితులమమవుతాం. పని చేయించుకుందామనుకుంటాం, చేసిపెడతాం. ప్రకృతిమీద అధిపత్యానికని ఉరకలేస్తాం. ప్రకృతి బాదుడికి నోట్లోంచి నురగలు కక్కుతాం. జీవితమంతా అదే జరుగుతోంది.
చేపట్టింది చెయ్యడం ఎంత ముఖ్యమో అది నిష్ఫలమూ నిష్ప్రయోజనకరమూ అనిపించినప్పుడు వదిలించుకోవడమూ అంతే ముఖ్యం. ఆశించినదానికి బందీలం కాకూడదు. బంధమే దు@ఖం. భగవద్గీత చెప్పేది ఇదే. పని చేస్తూనే ఉండు. అదే సర్వస్వం కావాలి. ఫలితం కాదు.
చేపట్టినది ఎంత ఘన కార్యమైనా కావచ్చు. దానిలో మీ నిమగ్నత ఎంత గాఢమైనా కావచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటపడే వెసులుబాటూ అవకాశమూ మీ అధినంలో ఉంచుకోవాలి. చేపట్టినా విదిచిపెట్టినా అది మీ సంకల్పంతోనే. అది లేనివారు బలహీనులు. బాధలూ బానిసత్వమూ బలహీనతవల్లే కలుగుతాయి. మన శరీరాన్ని ఆవరించుకుని ఆక్రమించుకుని ఎన్నెన్నో సూక్ష్మజీవులు ఆశ్రయం పొందుతున్నాయి. మనం ఏమాత్రం బలహీనమైనా అవి విజృంభించి ప్రాణాంతక వ్యాధులు కలిగిస్తాయి. మనం బలహీనులం కానంతవరకు అంతకు వెయ్యిరెట్లైనా మనకి కేశవాసి నష్టమూ కలిగంచలేవు. ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. బలమె జీవం, జీవనాధారం, జీవితం. బలహీనత బాధ, చావు.
మన సౌఖ్యాలకన్నిటికీ బంధమె మూలం. కుటుంబాం, వృత్తీ ప్రవృత్తీ మతధరమూ ఇలా మనకి ఆనందాన్నిచ్చే బంధాలెన్నో ఉన్నాయి. కొత్తవాటిమీద ఆసక్తిపెంచుకుని వటితో అనుబంధం పెంచుకోవడమూ సామన్యమే. ఇలా పెంచుకున్న బంధాలు వాటి విలువ తగ్గినప్పుడో, పోయినప్పుడో సౌఖ్యం బదులు దుఃఖాన్నిస్తాయి. పోనీ వదులుకుందామా అంటే, తగిలించుకున్నంత సులువుగా బంధాల ప్రభావం వదిలిపోదు. వివేకవంతులు ఈ విషయం మరువక, తమ స్వాధీనంలోని వ్యక్తులూ వస్తువులపట్ల పూర్తి అపేక్షను కలిగి యుంటూనే, వాటి నష్టం తమ జీవితాన్ని తలకిందులు చేసే పరిస్థితి తెచ్చుకోకుండా వ్యవహరిస్తారు. రెంటి సమతౌల్యమే మన పరమార్ధం కావాలి. అసలు కోరికలే లేకుండాను ఎవరిపైనా వేటిమీదా ఎట్టి అపేక్ష లేకుండాను ఉండమని కాదు. అలా వుంటే ఆ గోడకీ మనకీ తేడా ఉండదు. పోయినప్పటి బాధ తప్పుతుందని పొందినప్పటి సౌఖ్యాన్ని వద్దనుకోవడం వివేకహీనం.
ఇట్టి మమకారం, ప్రేమ, అనురాగం, బంధాలవల్లనే మనం పరుల శ్రేయం, సౌఖ్యాలకోసం సర్వశక్తులూ ధారపోసి శ్రమించి వారిని సంతృప్తులను చేస్తాం. ఇది భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవతల స్వభావం. మనమీ విధంగా దేవతలవలె ప్రేమస్వరూపులమై లోకకల్యాణానికి సహకరిస్తూనే, మమకారాపేక్షల బంధనాలలో చిక్కుపడని వారిమై దేవతలకన్న అధికులం కావాలి. పరిపూర్ణ మానవునికిది సాధ్యం. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
భిక్షగాడికి ఆనందం ఉండదు. దయామయులు కొంత విదిల్చినా అది ఆనందంతో కాక అసహ్యతతోనో జాలితోనో కాని భిక్షగానిపై గౌరవంతో కాదు.
అటునుంచి ఎంతో కొంత రాబట్టేందుకైన పనులన్నీ భిక్షాటనలే. లేదా వర్తకం. మన దయనీ ధర్మాన్నీ సుగుణాలనీ ఇచ్చి ఇంకేదో ఆశించడం.
ప్రపంచంలోని మన చర్యలన్నీ ఇటువంటి వర్తకమే అయితే వ్యాపారంలో ఉన్నట్టే ఇక్కడా లాభనష్టాలు పెట్టుబడి పోవడం వంటివి ఉంటాయి. పెట్టుబడికి ప్రతిగా ఏదో పొందాలనుకున్నప్పుడు ప్రతిసారీ లాభమే రావాలని లేదు. అనూహ్యమైన దెబ్బలకు సిద్ధపడాలి. ప్రేమ, దయ, కరుణల అమ్మకాలు, కొనుగోళ్ళు, ఇవ్వడాలు, పుచ్చుకోవడాలు.
అలా చిక్కుబడతాం. ఇవ్వడంద్వారా కాక, ప్రతిఫలం కోసం ఎదురుచూడ్డం ద్వారా. ప్రేమిస్తాం, బదులుగా ప్రేమని పొందలేకపోతే ఏడుస్తాం. ప్రేమించేవరకే పరిమితమై తిరిగి ఏమీ ఆశించకుంటే ఏ బాధా మనకి ఉండదు. ప్రతిఫలాపేక్ష దుఃఖానికి మూలం.
ప్రతిఫలాపేక్షా లేని కర్మాచరణమే సంతృప్తికర జీవన సాఫల్య రహస్యం. అలా చేస్తే లోకం మోసం చేస్తుంది కదా అంటారు. అవును. జీసస్ అలానే పనిచేసేడు. లోకం అతన్ని మోసం కాదు సిలువే వేసింది. జీసస్ కాలం నించి ఇప్పటివరకు కోట్లాదిమంది స్వార్ధపరులు పురుగుల్లా నశించి జాడ లేకుండా పోయారు. కాని ప్రపంచవ్యాప్తంగా జీసస్ వందలకోట్ల ప్రజల హృదయాల్లో ఆరాధ్యునిగా వెలుగుతున్నాడు. స్వార్ధపరిత్యాగపు శక్తి అది.
కనుక ఇవ్వండి. అడక్కండి. ఇచ్చినదానికి ప్రతిఫలం తప్పదు. కాని ప్రతిఫలం ఇచ్చే సంకల్పానికి కారణం కారాదు. అంతా ఇచ్చెయ్యవలసినదే. లోకంలో కళ్ళు విప్పిననాటినుంచి అదే పనిగా మూటలు కడుతూనే ఉంటాం. కానీ అదంతా తిరిగిచ్చెయ్యాలి. ఉహూ ఇవ్వను అని పిడికిలి బిగించుక్కూర్చుంటే ప్రకృతి పిడికిలి మన పీకచుట్టు బిగుస్తూ ఉంటుంది మనది వదులయేంత వరకు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండ వివేకంతో ఇవ్వడం ఉత్తమం. ఆశించలేదని ప్రతిఫలం రాకుండా పోదు. ఇచ్చినదానికి సమమైన ప్రతిఫలం వచ్చి తీరుతుంది. ఇచ్చింది మంచిదైనా చెడ్డదైనా. అది ప్రకృతి మూలసూత్రం. అడవుల నరికివేతకి ప్రతిఫలం మండే ఎండలూ ఉధృతమైన వరదలూ. ఆవిరైపోయిన సముద్రజలాలు వర్ష రూపంలో తిరిగి దాన్ని చేరుతాయి. గదిలోని గాలిని ఖళీ చేస్తూ పోతే కొత్తగాలితో అది నిండుతూ పోతుంది. వడివడిగా సముద్రంలోకీ పోతున్న నదీ జలాల స్థానంలో కొత్త నీరు నిండుతుంది. ఆ ప్రవాహన్ని నిరోధించడం ప్రాణాంతకం.
కనుక ప్రతిఫలాపేక్ష లేశమైనా లేక నిస్వార్ధపరులమై కర్మాచరణని కొనసాగించాలి. వేరే సంశయాలకు లెక్కలకు తావివ్వరాదు. ఇక్కడ కూర్చుని సుదూరాన ఉన్న ఉద్యానన్ని అంచనా వేసేకన్న నడిచి అక్కడికెళ్ళినప్పుడు దాని రూపలావణ్యం అనుభవైకవేద్యమవుతుంది. ఆ మార్గంలో ఎన్ని అవరోధాలూ ఆపదలూ ఎదురైనా వెరవక కొనసాగిస్తూనే ఉండాలి.
సరేనని తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలనుకుంటాం. పని చేస్తాం. కాని భంగపాటు కలిగితే మళ్ళీ కుంగుబాటు. ప్రతిరోజూ ఇదే తంతు. "ఇకపై నాకు నేనె యజమానిని. నా చేతలూ తలపులూ నావే. ఎట్టి పరిస్థితులూ వాటిని ప్రభావితం చెయ్యలేవు" అని ఎప్పటికప్పుడే సంకల్పం చెప్పుకుంటాం. వలలో కాళ్ళు చిక్కుబడ్డ పిట్టలా మళ్ళీ అయోమయం, గిలగిలా తన్నుకోవడం. ఇలా వుంటుంది జీవితం.
ఈ పరిస్థితి అధిగమించే క్రమంలోని కష్టాలు నాకు తెలుసు. కఠినమైనవే. తొOభైతొమ్మిది శాతం మంది అతి శీఘ్రంగా నిరుత్సాహులైపోతారు. ప్రేమ, దయ, కరున, సౌహార్దం వంటి భావనలు యుక్తవయసులో పుష్కలంగా ఉంటాయి. అవి పంచేందుకూ యువ హృదయాలు సిద్ధంగా ఉంటాయి. వయసు గడుస్తున్నకొద్దీ నిరాశ పెరుగుతుంది. కొన్నాళ్ళకి ఈ సద్భావనలన్నీ ఒక్కొక్కటిగా మాయమై పోతాయి. వృద్ధాప్యానికి వారు మనుషుల ముసుగులు తొడుకున్న మరలై సహజ స్వభావాన్ని కోల్పోతారు. కనీసం మాట్టాడితే కాస్త బరువు తగ్గుతుందనుకున్నా సుముఖతలేక మాట్టాడలేరు. తిట్టలేరు. ఆక్రోశించలేరు. ఆకృతి తప్ప మిగతా లక్షణాలన్నీ కోల్పోయి జీవం లేని కళ్ళతోను పాషాణమైపోయిన హృదయంతోను బతుకీడుస్తారు.
మానవ సహజమైన ఈ పరిస్థితి అధిగమించాలంటే మనకి మానవాతీతమైనది కాక దేవతాతీత శక్తి కావాలి. మనని ఈ చిక్కులనుండి గట్టెక్కించేందుకు, శరీరం చిద్రమైనా హృదయంలోని సద్భావనలు భద్రంగా ఉండేందుకు.
కష్టమే కాని అభ్యాసంతో సాధ్యం. ఇంతకు ముందు చెప్పినట్టుగా, మనం బలహీనులమై లొంగిపోతే తప్ప మనని లొంగదీసేదేదీ లేదు. ఇంకా, మన దుఃఖంలో మన ప్రమేయం ఉండకుండా ఉండదు. తగిలిన ప్రతి దెబ్బలో సగం బాధ్యత మనది, సగం బయటి ప్రపంచానిది. అది తప్పించుకునేందుకు బయటి ప్రపంచాన్ని మనమేమీ చెయ్యలేకున్నా మనవంతు సహకారాన్ని నిలిపివేస్తే ఆ దెబ్బ నుంచి తప్పించుకోవచ్చు, లేక దాని తీవ్రత తగ్గించుకోవచ్చు. కనుక నా దుఃఖాలకి నా వంతు సహకారాన్ని ఈ క్షణం నించే నిలిపేస్తానని సంకల్పించుకుని ఆచరిస్తే విజయం తథ్యం. పైగా మన దుఃఖాలకి ప్రపంచమే కారణమని అనుకుంటూ ప్రపంచాన్నేమీ చెయ్యలేక దుఃఖించే కన్న అందులో సగం మన వంతేనన్న సత్యాన్ని గ్రహించి సరిదిద్దుకుంటే ఉపశమనమూ లభిస్తుంది.
చిన్నప్పట్నుంచి మన ప్రతి కష్టానికి ప్రపంచాన్ని నిందించడం అలవాటుచేసుకుంటాం. పాడు లోకం అని, చెత్త మనుషులు అని. ప్రపంచమంతా పాడుది అయితే మనమూ ఆ ప్రపంచంలోని వారమె కదా మనం ఏ రంగా భిన్నం? అది ఆలోచించుకోవాలి.
మనం దేనికర్హులమో అదే మనకి లభిస్తుంది. ప్రపంచమంతా చెడ్డదీ మనమే మంచివారం అనే మన నమ్మకం మనతో మనం ఆడే అతి పెద్ద అబద్ధం.
ఈ మొదటి పాఠాన్ని బాగా అభ్యసించాలి. జరిగిన ప్రతిదానిని వివేకదృష్టితో చూచి పరిస్థితులనూ పైవారినీ నిందించని స్వభావం అలవర్చుకోవాలి. జరిగినదానిలో మీ పాత్రనే స్పష్టంగా చూచి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా మీమీద మీరు నియంత్రణ సాధించాలి.
ఒకపక్క మనం సర్వ సమర్ధులమని, దేవునికి ప్రతిరూపాలమని విర్రవీగుతాం. ఇంకోపక్క ఏ చిన్న కష్టం కలిగినా లొకన్ని సమాజన్ని నిందిస్తాం. నిజంగా మనం దేవుళ్ళము, సమర్ధులమే అయినప్పుడు, మనం ప్రతి సంఘటన యొక్క కారణ కార్యాల లంకెను స్పష్టంగా గ్రహించి, వాటి సంభవాసంభవాలను నిర్దేశించగలుగుతాం కదా, అప్పుడు ఎవరు మనకి కష్టం కలిగించగల సమర్ధులు? సర్వ శక్తిమంతులమనుకునే మీకు ఎవడో దారినపోయే దానయ్య కష్టం కలిగించేడనుకోవడం బుద్ధిశాలుర లక్షణమా? ఈ విధంగా మన జ్ఞాన ప్రకాశాన్ని మనమిదకే ప్రసరించి సరిదిద్దుకోవడం మొదటిపని. ఒక ఉన్నత లక్ష్యసాధనకు ఇది సాధనం. సాధనం దోషరహితమై పరిపూర్ణమైతే సాధన సుగమమవుతుంది. ప్రపంచ తత్వం మన తత్వానికనుగుణంగా మారుతుంది. కనుక అది మంచిది కావాలనుకుంటే మనం పరిశుద్ధులమూ నిష్కళంకులము కావలి. తద్వారా ప్రపంచాన్ని పరిశుద్ధమూ పరిపూర్ణమూ చెయ్యగలుగుతాము.
No comments:
Post a Comment