నీతివర్తనం (ఇంటెగ్రిటీ)
ఆర్థర్ గోర్డాన్, బ్రిటిష్ రచయిత
(మూలం రీడర్స్ డైజెస్ట్)
చదువు, నైపుణ్యం, సమయస్ఫూర్తి, దృక్పథమూ అన్ని ఉద్యోగాలకీ ముఖ్యార్హతలు. ఇవి చూసి తీసుకున్న ఉద్యోగులకి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించేముందు యాజమాన్యాలు చూచేది వారి నీతివర్తనం. ఇంగ్లీషులో ఇంటెగ్రిటీ. ఇది మిగతా అర్హతల ప్రయోజనాన్ని పదింతలు చేస్తుంది.
లెక్కల్లొ ఇంటీజర్ అంటే పూర్ణసంఖ్య. దాన్నుంచి ఇంటెగ్రిటీ పుట్టింది. పూర్ణసంఖ్య ఏవిధంగా పరిపూర్ణమో మనిషి నడవడీ అలానే ఉన్నప్పుడు అతను నమ్మకస్తుడవుతాడు. దీన్నే మనం త్రికరణశుద్ధి అంటాం. మనసు, మాట, చేత ఇవి మూడు ఒకే ఉద్దేశాన్ని ప్రకటించాలి. ఒకటనుకుని ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం కాదు.
నీతివర్తనుల లక్షణాలు కొన్ని :
ఒకటి: తమ పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించే విషయంలో రాజీ పడరు. కింద పడిన కష్టకాలంలో పైనించి హితుల సహకారహస్తాలు అందినా వాటితో కాక తమ స్వశక్తి తోనే తిరిగి పూర్వ స్థితికి చేరుకోనిచ్చగిస్తారు. ప్రముఖ రచయిత మార్క్ ట్వెయిన్ అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవితం దుర్భరమైపోయినప్పుడు అభిమానులూ పత్రికలూ ఆర్ధిక సహకారానికి చేతులు కలిపి నిధిని సమీకరించి అతని చేతిలో పెట్టేరు. ఒక్క క్షణం దాని వంక తేరిపార చూచి ఒక నిశ్చయానికి వచ్చినవాడై ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి తిరిగి రచనల మీదే దృష్టినిలిపి సఫలుడై అప్పులు తీర్చుకోగలిగేడు.
రెండు: ఋజువర్తనుడైన మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ తన సహజ స్వభావాన్ని వదలడు, తన గౌరవాన్ని తగ్గించుకోడు. ప్రఖ్యాత భవన శిల్పి ఫ్రాంక్ లాయిడ్ రైట్ మాటల్లో గౌరవమంటే నాణ్యత. నాణ్యమైన ఇటిక చెడు ఇటిక అవదు; నాణ్యమైన బల్ల చెడు బల్ల అవదు. వాటి తయారీ ప్రక్రియలోని గుణమే వాటిని నాణ్యం చేసింది, ఒకసారి తయారయేక నాశనం కావాలే కాని నాసి కావు. ఋజువర్తనులదీ అదే పంథా. ఒకసారి నాణ్యమైన మనుషులుగా పరిపూర్ణం అయాక గుణహీనులుగా మారి ప్రతిష్ట దిగజార్చుకోరు.
మూడు: మనస్సాక్షికి విధేయులై ఉంటారు. బయటి పరిస్థితులూ ఒత్తిళ్ళూ ఎన్ని ఉన్నా తమ అంతరంగ ప్రబొధమే వారిని నడిపించేది. నీ అభిప్రాయాలకి పూర్తి బాధ్యతవహిస్తున్నావా అని తనని లాక్కెళ్ళిన మృత్యువులాటి శత్రు సమూహం ముందు నించుని మార్టిన్ లూథర్ అంటాడు: "మనస్సాక్షికి విరుద్ధంగా చేసేది క్షేమమూ కాదు, వివేకమూ కాదు. ఇంకోలా నేను చెప్పలేను, చెయ్యలేను. ప్రభువే నాకు దిక్కు" అని.
నాలుగు: తాము నమ్మినదానికి కట్టుబడి ఉంటారు. తొణకరు, బెణకరు. ఆపరేషన్ థియేటర్లో శస్త్ర చికిత్స తరవాత రోగికి కుట్లు వెయ్యమని ఆదిగిన డాక్టర్తో కొత్త నర్సు అంటుంది. డాక్టర్ మనం పన్నెండు స్పాంజిలు ఉపయోగించాం. నాకు ఇక్కడ పదకొండే కనిపిస్తున్నాయి. కుట్లెలా వెయ్యమంటారు అని. డాక్టర్ అంటాడు ఏమైనా అయితే నాదే బాధ్యత; నీపని నువ్వు చెయ్యవమ్మా కుట్లు వెయ్యవమ్మా అని. కాని రోగి క్షేమం నా బాధ్యత డాక్టర్. పన్నెండోదాని లెక్క తేలేవరకు కుట్లు వెయ్యలేను అంటుంది ఆమె. డాక్టర్ నవ్వి కాలికింద తొక్కిపట్టిన పన్నెండో స్పాంజి చూపి అంటాడు - ఇప్పుడు వెయ్యి అని. ఆమె నీతివర్తనానికి ముచ్చటపడుతూ.
ఐదు: అమలుచెయ్య వీలులేని నియమాలకీ విధేయులై ఉంటారు. ఇదే కీలకం. తమని వెయ్యికళ్ళతో చూస్తున్న సమాజమూ నిఘా యంత్రాంగమూ, నియమోల్లంఘనని సహించని కఠోర కఠిన న్యాయవ్యవస్థలూ ఉన్నప్పుడు అందరూ ఋజువర్తనులే. వీటి భయంలేనప్పుడు అసలు రంగు బయటపడుతుంది. ఫలానాది చెయ్యమని ఎవరో ఏ పరిస్థితులో బలవంత పెడితే చెయ్యడం వేరు, అటువంటి బలవంతం ఏమీ లేకున్నా నిశ్చితాభిప్రాయం ప్రకారం చేసుకుపోవడం వేరు. మనస్సాక్షి అభిప్రాయాలనే అనుసరించే నీతివర్తనుల నియమమిది.
రెండో ప్రపంచ యుద్ధంలో ఒక కల్నలు జీపుని నడిపే సార్జెంటు తప్పు మలుపు తీసుకుని జర్మనీ సైన్యం సమీపానికి వచ్చేస్తారు. ప్రమాదం గ్రహించి జీపునించి దూకేసినప్పుడు సార్జెంటో గోతిలోను కల్నల్ ఒక తూములోను దాక్కుంటారు. సార్జెంటు శత్రువులకి చిక్కుతాడు. కల్నల్ తూములోనే మెదలకుండా నక్కి ఉంటే తప్పించుకోవచ్చు; కాని ముందుకురికి ఒక పిస్తోలుతో వందలాది తుపాకీలకీ ట్యాంకులకీ ఎదురు నిలిచి పోరాడి చనిపోతాడు. యుద్ధ ఖైదీగా చిక్కిన సార్జెంటు ఈ అనుభవాన్ని తరవాత వివరిస్తాడు. ఎందుకలా చేసు ఉంటాడని ఆలోచిస్తే, కల్నల్ మనస్సాక్షి నిర్దేశించిన కర్తవ్యం ముందు తన ఆత్మ రక్షణ అప్రధానమై ప్రమాదానికి అతణ్ణి ఎదురు నిలిపిందని అర్ధమవుతుంది.
ఆరు: నిర్భయులై ఉంటారు. అనుకున్న అన్ని అవకాశాలనీ సవాళ్ళనీ అంది పుచ్చుకుంటారు. మనస్సాక్షి సంకల్పిస్తే అపాయానికీ వెరవరు. తమ మీద తమకి పరిపూర్ణ విశ్వాసముంటుంది. ఒక నిర్ణయం తీసుకుంటే అది సరైనదేనా కాదా అనే మీమాంసకి తావుండదు వారికి. ఎలాటి తర్జనభర్జనైనా నిర్ణయానికి ముందే. తమ నిర్ణయమెప్పుడూ సరైనదే. సంశయానికి తావులేదు.
ఏడు: నిలకడ వీరి సహజ లక్షణం. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు అన్నదే వీరి అభిమతం. విన్స్టన్ చర్చిల్ 1941లో హారో స్కూల్లో ప్రసంగిస్తూ అంటాడు. ఎదటి సవాలు చిన్నదైనా పెద్దదైనా మీ ఆత్మగౌరవానికీ మనస్సాక్షికీ తప్ప ఎప్పుడూ ఎటువంటి సవాలు ముందూ తగ్గవద్దు; తలొగ్గవద్దు. అరికీ అధికారానికీ ఆయుధాలకీ అదరవద్దు, బెదరవద్దు. అని. అలాగే జీవించాడు కూడ.
ఎనిమిది: స్తిమితం ఎక్కువ. తమ గుండె నిబ్బరాన్ని కుదిపేసే పరిస్థితులేవీ నీతివర్తనులకుండవు. ఎప్పటికప్పుడే సర్దుబాటు చేసుకోగల ఒక తరహా స్థితప్రజ్ఞత ఉంటుందేమో లోపల. 1838 ఎన్నికల ఉపన్యాసంలో కొన్ని కొన్ని విషయాలు మాటాడొద్దని ప్రమాదమని అబ్రహాం లింకన్ కి శ్రేయోభిలాషులు సూచించారు కాని అతని స్థిరంగా అన్నాడు. సత్యానికి కట్టుబడే ఉంటాను. ఓటమే వస్తే రానీండి" అని. వారు భయపడ్డట్టే ఓడిపోయాడు కాని రెండేళ్ళ తరవాత విజయం సాధించాడు.
ఎదటివారిలో ఈ లక్షణాన్ని కొంత పరిశీలన మీదట మనుషులు ఇట్టే గ్రహించేస్తారు. అందుకే విరికి స్నేహం, నమ్మకం, ప్రశంస, గౌరవం అలవోకగా లభిస్తాయి. ఇది ఎలా అలవర్చుకోవాలీ అంటే, అది చిన్నప్పటినుండే నేర్పాలి. అబద్ధాలు, చాడీలు, దొరికితే ఒకలాగ దొరక్కపోతే ఒకలాగ ఉండే స్వభావాలు పిల్లలకి అలవాటు చెయ్యకూడదు. ఉన్నదున్నట్టు మాట్లాడే పిల్లలని చూచి అయ్యో అమాయకులని, మాయా మోసమే బతకనేర్చిన గుణాలనీ అనుకునే దృక్పథాన్ని వదులుకోవాలి. జాతిరత్నం ముందు రంగురాయి నిలవదు. నీతివర్తనులే అన్నిరంగాలలోనూ విజేతలు.
No comments:
Post a Comment