రచయిత ముందుమాట
Try giving yourself away అన్న పేరుతో రీడర్స్ డైజెస్ట్లో ప్రచురితమైన చిన్న వ్యాసాన్ని పుస్తకరూపంలో విస్తరించి అందించమనే సంపాదకుల సూచననుసరించి ఈ పుస్తకరచన చేశాను. Try giving yourself away అంటే నిన్ను నీవు ఇచ్చుకొందుకు యత్నించు అని. ఇచ్చే ధర్మాన్ని అన్ని మతాలూ ప్రబోధించాయి. ప్రపంచం లో మనిషికీ మనిషికీ మధ్య ఇచ్చిపుచ్చుకోవడం అనే సంస్కారం వ్యక్తిస్థాయిలోనే కాని ప్రభుత్వాలూ నాయకులూ చెయ్యలేరు. మనబోటి సాధారణపౌరులే ఈ సంప్రదాయాన్ని పెంచి పరస్పర సహకారపు విలువను గ్రహించుకోవాలి.
ఒక ధార్మిక కార్యక్రమంగానో సామాజిక సేవగానో కాక కేవలం ఒక హాబీగా ఇది ఎలా ఆచరించవచ్చో చూద్దాం.
*****
అందరిలాగే నేనూ జీవితం నించి వీలైనంత ఎక్కువ పొందాలి, రాబట్టాలి అనే నేర్చుకున్నాను. పుచ్చుకున్నదే మనదని, ఇచ్చింది కాదనేది కూడా నమ్మేను. అయితే ఒక రైలు ప్రయాణంలో స్ఫురించిన చిన్న ఆలోచన నా జీవిత పరమార్ధాన్ని నిర్దేశించిందని చెప్పగలను.
ఓ రోజు చికాగొ నించి కాలిఫోర్నియా కి ట్వెంటీయత్ సెంచరీ వారి సెంచరీ ఎక్స్ప్రెస్స్ లో ప్రయాణిస్తున్నాను. ఇదే రైలు ఇట్నుంచి వెళ్ళేది, అట్నుంచి వచ్చేది ఎక్కడ కలుస్తాయి? ఆ దృస్యాన్ని ఫోటో మంచి శీర్షిక పెట్టి రైల్వేవారి ప్రకటనల్లో వేసుకోవచ్చు కద.
దానికోసం రాస్తే రైల్వే వారు వెంటనే ఆ వివరాలిచ్చారు. వెంటనే నా మదిలో మెరిసిన భావాన్ని వారికి రాస్తే, వారు తక్షణమే స్పందించి నన్ను మెచ్చుకుని పరిశీలిస్తామన్నారు. తరవాత కొద్ది రోజులకి నేను చెప్పిన శీర్షికతో "రెండు సెంచరీలు కలిసే చోటు" అనే రంగురంగుల పోస్టర్లు రైల్వే శ్టేషన్లలో వెలిసాయి. చూసినవారు ఆ ఊహని ప్రశంసించారు. ఇందులో నాకు ఎటువంటి ధనలాభమూ లేదు. అది నాకూ, రైల్వే వారికీ, ఇంకొవైపు ప్రయాణీకులకీ కూడా ఆహ్లాదం కలిగించింది. రైల్వే వారి కళ్ళలోను, పోస్టర్లు చూచిన ప్రయాణీకుల కళ్ళల్లోను మెరిచిన మెరుపులు నాకో కొత్త స్ఫూర్తిని కలిగించాయి.
అప్పట్నించి నేను ఇటువంటి మెరుపులు సేకరించే హాబీ పెట్టుకున్నాను. ఆనందాన్ని పంచుకునే ఇది స్టాంపుల సేకరణ, నాణేల సేకరణ లాటి హాబీలకన్న ఉత్తమమూ, లోక కల్యాణకరమూ అని నా అభిప్రాయం. ఈ సేకరణ దాచుకోవడానికి ఏర్పాట్లక్కర్లేదు; ఎవరూ తీసుకుపోరు. మన వైపు పెట్టుబడల్లా, ఏదో ఒక అవకాశం కల్పించుకుని ఏదో ఒకటి ఇవ్వడం. అది ఓ చురునవ్వైనా, ఒక సేవైనా, సలహా ఐనా - అది ఇచ్చే మనకీ అవతలివారికీ కూడా ఉల్లాసం పంచేది.
ఒక ఆనందకర జీవితానికి ఇంతకన్న ఉత్తమైన వ్యాపకం ఇంకేముంటుంది.
****
అదృష్టవశాత్తు ప్రతి ఒక్కరికీ ఇచ్చే అర్హత వుంది. ప్రతి ఒక్కరి వద్ద అవతలివారికిచ్చేందుకు టైము, సలహా, నాయకత్వం, మాటసాయం, లేక ఉన్నదున్నట్టు అభిప్రాయం చెప్పే నిజాయితీ, ఒక ప్రత్యేక విద్యలో కౌశలమూ వంటి లక్షణాలు ఉంటాయి. ఒకసారి రోడ్డు మీద పోతూ ఒక దుకాణపు ప్రవేశద్వారం ఎంతొ ముచ్చటగా అలంకరించడం చూసేను. అంత అందంగా అలంకరించింది ఒకరు చూచి మెచ్చేందుకే కద. నచ్చినవారు మెచ్చుకోవడం ధర్మం కనుక ఆ దుకాణ మేనేజరును కలిసి ఆ అలంకరణ ఎంతో బాగుందని, మీ ఉత్తమాభిరుచికి అభినందనలు అన్నాను. పులకించిన మేనెజరు ఆ అలంకరణ చేసిన ఉద్యోగితో ఈ ప్రశంసలు పంచుకుని అతనికి ప్రోత్సాహకంగా జీతం పెంచారు.
*****
నాకో పుస్తకం నచ్చితే ఆ రచయితను మెచ్చుకుంటూ ఉత్తరం రాయడం కూడా అలవాటు. చాలా సార్లు జవాబు రాదు; మరెం పరవాలేదు. నా "ఇచ్చే యంత్రం" మంచి కండిషన్లో ఉంచుకునేంతున్న సంతృప్తి నాది.
***
ఇంకో ఒక ఐడియా ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ వారికి ఉపయోగపడుతుందని అనిపించి వారికి రాసేను.
అలవాటుప్రకారం "ఎటువంటి మొహమాటాలూ అక్కర్లేదు" అన్న వాక్యాన్ని కూడా జతచేసాను. కని వారు సహృదయంతో నా సూచనని ఆనందంగా అమల్లో పెట్టేరు. నాకో పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ ఫ్రెండుగా దొరికింది.
***
మనసులో ఒక కొత్త ఐడియా వస్తే, అది పనికొస్తుందనుకున్న మతపెద్దకో, డాక్టరుకో, ఒక స్నేహితుడికో, లేక ఆమాత్రం ఈ మాత్రం పరిచయం ఉన్న ఎవరికైనా రాస్తాను.
****
ఇంకో సారి ఇద్దరు పేద పిల్లలు పాప్కార్న్ బండీ దగ్గర ఆశగ చూస్తూ నించోడం చూసి, వారు గమనించకుండా రెండు పొట్లాలు కట్టి నేనని తెలీకుండా వారికివ్వమన్నాను. ముందు ఆశ్చర్యపోయిన పాప్కార్న్ ఆయనకి కూడా సరదా అనిపించి అదనపు రుచి కోసం మరిన్ని దినుసులు అలంకరించి మరీ ఇచ్చేడు. ముగ్గురమూ ఆనందించాము.
***
ఇంకో సారి ఒక పేపరులో ఒక ప్రకటన ఎంతో నచ్చింది. వంటనే పేపర్ వారికి రాసేను. నాకు అ ప్రకటనతో వ్యాపారపరమైన ఉపయోగమేమీ లేకున్నా, అది ఎంతో సృజనాత్మకంగా ఉన్నదని, తయారుచేసినవారికి అభినందనలు అందజెయ్యమని పత్రికవారికి రాశాను. ఆశ్చర్యంగా కొది రోజుల తరవాత ఆ ప్రకటన తయారు చేసిన రచయిత ఎంతో పొంగిపోతూ, నా ప్రశంస అతని సృజనకు మరింత స్ఫూర్తినిచ్చిందనీ ఇంకా మంచి మంచి ప్రకటనలు చేసి మెప్పిస్తానని ఆనందపడ్డాడు. తరవాత చాలారోజులపాటు తన కాల్పనిక చమత్కారంతో మంచి మంచి ఉత్తరాలు రాస్తుండేవాడు.
***
ఇంకో సారి ఇలాగే ఒక హొటల్లో భోంచేసి వస్తూ ప్రత్యేకంగా ఆర్కెష్ట్రా స్టేజీ వద్దకి వెళ్ళి వారిని అభినందిస్తే వారూ ఎంతో ఆనందించేరు. నేనూ ఉల్లాసంగా ఇంటిమొహం పట్టాను.
***
ఇంకో సాయంత్రం ఒక ముసలాయన గుర్తొచ్చారు. అతను జబ్బుపడి మంచం మీద ఉన్నారు. చాలరోజులైంది అతన్ని పలకరించి. ఫోన్ చేసి అతనికి సంతోషం కలిగేట్టు పావు గంట మాట్టాడాను. మర్నాడు అతని భార్య నన్ను ఎంతో మెచ్చుకుంటూ ఫోన్ చేసేరు. ఎవరూ పలకరించక ముసలాయన దిగులుగా ఉన్న సమయంలో నేను చేసిన ఫోను అతను తీసుకునే టానిక్కు కన్నా బాగా పనిచేసిందిట.
***
ఇవన్నీ చిన్న చిన్న ఘట్టాలే. కాని ఇచ్చే సేకరణలో ఉన్న నాకు ప్రతిదీ స్ఫూర్తిమంతమే. ఇది మనం అతి సహజంగా చేసుకోగలిగే అలవాటు. జీవితానికో మంచి అర్ధాన్నీ ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది - మనం ఎంత ఇస్తామనేదాన్ని బట్టి.
****
మానవ ప్రకృతిని ఔపోసనపట్టిన ప్రఖ్యాత రచయిత రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అంటాడు: నగలూ కానుకలూ బహుమతులు కావు; అవి బహుమతులకు క్షమాపణల్లాటివి; నీలో కొంత భాగాన్ని ఇవ్వడమే ఇవ్వడం" అని.
డబ్బుతో ఏదైన కొనవచ్చు. హృదయపు కరుణ, సౌహార్ద భావాల్ని కొనలేం. కనుక అవే ఇవ్వాలి. ఇచ్చేవారికీ పుచ్చుకునే వారికీ వాటి విలువ అపారం.
చాలా మంది, తామేమివ్వగలమని, అంత గొప్పవారం కామని అంటారు. పైగా నేను చెపినట్టు చేస్తే జనాలు నవ్వుతారేమోనని భయం కూడా ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోవాలి. అవతలివారు నవ్వినా అసలు పట్టించుకోకున్నా, మనమిచ్చినది అంతమేరకు ప్రపంచపు ఆనందానికి జమ అయిందని ఆనందపడాలి. ప్రపంచపు ఆనందపు ఖజానా ఖాళీ అయిపోతున్న సమయంలో దానిలో ఎంత జమ అయినా మంచిదే.
నీలో కొంత భాగం ఇవ్వడం అంటే ఆ ఇచ్చేది హృదయం నించి రావాలి అని అర్ధం. సరుకు కన్న సారాంశము ఆత్మీయత మిన్న.
లాంగ్ఫెలో అనే కవి అన్నట్టు, ఇద్దామనుకున్నది ఇచెయ్యండి: అవతలివారికి దాని అవసరం మీరూహించినకన్న ఎక్కువే కావచ్చు.
ధనరూపేణా దానం అథమం అన్నారు యునామునో అంటాడు: నేనిచ్చే షిల్లింగు అసలు విలువ దానికున్న నా చేతి వెచ్చదనమే అని. ఇంకో ఇంగ్లీషాయన అంటాడు: చేత చిల్లిగవ్వలేదుకాని నేను చాలా ఇవ్వగలను అని.
అలా ఇచ్చిందే అనతికాలంలో పెట్టుబడిగా రూపొందుతుంది.
ఒకామె నన్ను తిడుతూ ఉత్తరం రాసింది తన భర్త నా రాతలు చదివి ఉన్నదంతా దోచిపెడుతున్నాడని. ఉన్నదంతా ఊడ్చి ధారపొయ్యమని నేనెప్పుడూ చెప్పను. ఆమాటకొస్తే ఒక వ్యక్తి సంపాదన అతని భర్యా పిల్లలది. వారిది మీరెలా దానమిస్తారు. ఈ పుస్తకం పేరే గివింగ్ యువర్సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరిచ్చుకోవడం. ఇంటోవారిది దోచిపెట్టడం కాదు.
మీలోని కొంత ఇవ్వడమంటే ఇచ్చే ఆనందాన్ని గుక్క గుక్కా ఆస్వాదించాలని గంగాళాన్ని ఒకేమారు నోట్లోకి ఒంపుకుని పారబోసుకుని ఆపసోపాలు పడమని కాదు. అప్పుడే ఇచ్చేది కర్చుగా కాక పెట్టుబడిగా మారుతుంది.
***
ఇద్దామనే తలపు కలిగిన తక్షణమే అది అమలు జరగాలి. లెక్కలు వేసుకుని తర్జన భర్జన పడ్డాక కాదు. ఆలస్యమయేకొద్దీ అది చల్లారి చప్పబడిపోతుంది. తక్షణ స్పందనగా ఇచ్చినప్పుడు కలిగే ఉల్లాసమూ తాజాగా మనసుకి కొన్ని గంటల పాటు ఉత్తేజం కలిగితుంది.
ఇలా ఇచ్చినప్పుడు కొత్త స్నేహమూ లభించవచ్చు. ఓ సారి కారు నడుపుకుంటూ మెల్లగా పోతున్న నాకు ఒకావిడ బరువైన సంచీలు మోసుకుంటూ కనబడింది. ఆపి లిఫ్టు ఇద్దామా అనుకున్నాను; ఆమె ఇల్లు అక్కడే అయుంటుందిలే పోదాం పద అంది నా పీకులాట మనసు. కాని బరువు మోసుకుంటున్న ఆడకూతురికి చెయ్యందించడానికి తర్జన భర్జనేమిటని ఇచ్చే మనసు చికాకుపడింది. కారాపి అమ్మా ఎక్కడికి వెళ్ళాలి లిఫ్టు కావాలా అన్నాను. ఆమె ఆనందంగా సరేనంది. రెండుబేగులూ ఆమెనీ ఎక్కించుకున్నాను. తరవాత తెలిసింది వాళ్ళు మా ఇంటికి రెండిళ్ళ అవతలే కొత్తగా దిగేరని. మాకో మంచి పొరుగూ దొరికింది.
***
ఇంకోసారి రైల్లో భోజనం చేస్తున్నాను. వాళ్ళిచ్చిన మష్రూం సూపు ఎంతో రుచిగా ఉంది. ఆమాటే వెయిటర్ తో చెప్పి మీ షెఫ్ కి ధన్యవాదాలు అని చెప్పమన్నాను. అతను చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోయేడు. తరవాత నేను ఆర్డర్ ఇచ్చిన వెనిల్లా ఐస్ క్రీం మీద తురిమిన స్ట్రాబెరీలూ చెర్రీలూ అలంకరించి ఇచ్చారు వాస్తవానికి మెనూలో అటువంటిదేమీ లేకపోయినా. బహుశః నా ప్రశంసకి షెఫ్ గారు కూడా తన హృదయస్పందనను తక్షణం అమలు చేసి ఉండాలి. ఇవ్వడమే మన వంతు కాని అది తెచ్చేదేదో ఎవరికెరుక.
***
కొందరడుగుతారు: ఇలా తక్షణ స్పందన మీకే ఇబ్బందులూ తెచ్చిపెట్టలేదా అని. ఎందుకు పెట్టలేదూ, పెట్టేయి. జీవిత రసాస్వాదనలో అప్పుడప్పుడూ మధురసం మధ్య మిరెపుగింజలూ తగలడం సహజం. అయితే అనుకున్న వెంటనే ఇవ్వలేకపోయ్యేనే అన్న విచారం కన్న ఒకటీ అరా శృంగభంగాలే నయం కద.
***
అనుకున్న వెంటనే ఇచ్చే ఈ అలవాటు అప్పుడప్పుడు అద్భుతాలూ చేసింది. ఒకసారి మా వీధిలో దంత వైద్యుడు ప్రాక్టీసు పెట్టి బేరాల్లేక మూసేసి ఊరు పోదామని నైరాశ్యంలో కూరుకుపోయేడు. ఒక ఉదయం చర్చి దగ్గర అతని దిగాలు మొహం చూసి ఓ సారి మీ క్లినిక్కు చూపిస్తారా అన్నా. అతను చూపించిన ఖరీదైన పరికరాలు చూసి, అప్రయత్నంగానే అన్నాను : కిటికీలన్నీ బార్లా తెరవండి. సూర్యకాంతి పడనివ్వండి. తొందరపడి వెళ్ళిపోకండి. మీకు మంచి పేరు వస్తుంది. గుడ్ లక్ అని. అతను ఉపశమించినట్టు నీరసంగా చిరునవ్వు నవ్వాడు. ఆ మధ్యాహ్నం ఒక గొప్పింటావిడ ఎవరో మీ పేరు చెప్పేరని చెప్పి ఖరీదైన దంత వైద్యం చేయించుకుని మూడువందల డాలర్ల బిల్లు చెల్లించింది. క్రమేపీ ఆవిడ సిఫారసుతో మరికొందరు ఖాతాదారులూ లభించి అతను ఆ ప్రాంతంలోనే మంచి దంతవైద్యునిగా పేరు తెచ్చుకున్నాడు. ఏమో గాని ఆ దిగాలుపడ్డ ఉదయం నేనతనితో మాట్టాడిన నాలుగు మాటలు నన్ను నిరాశపరచలేదని మాత్రం చెప్పగలను.
***
ఇంకో సారి ఇంగ్లాండు నుంచి ఒక లేఖ వచ్చింది. నేను రీడర్స్ డైజెస్టులో ట్రై గివింగ్ యువర్సెల్ఫ్ అవే మిమ్మల్ని మీరు ఇచ్చుకోండి అనే వ్యాసం చదివానని, అప్పట్లో డీల పడ్డ తన మనసుకు ఎంతో సాంత్వనమూ ఆనందమూ కలిగించిందని, ఈ విషయం పొద్దున్నే రాద్దామనుకుని మళ్ళీ పొద్దున్నకి ఎలా వుంటుందోని ఇప్పుడే రాస్తున్నానని, మీ వ్యాసం ద్వారా ఇవ్వడం అనేది దాతృత్వం అనే కన్నా ఒక ఉత్తమ జీవనవిధానమని తెలుసుకున్నానని, నేనూ ఆచరించి ధన్యురాలనవుతానని. నిజానికి అప్పుడు నేనూ ఏదో కారణానికి కాస్త డీలాగా ఉన్నాను. ఈ ఉత్తరం నా ఉత్సాహాన్ని నాకు తిరిగి తెచ్చిపెట్టింది.
***
జార్జి ఆడంస్ అనే ఆయన, వారంలో ఒకరోజు ఒక మంచిపనితో ఎవరినైన సంభ్రమపరచమని సలహా ఇస్తాడు. నేనంటాను ఒకరోజే ఏం? ప్రతిరోజూ అలాగే చెయ్యవచ్చు. ఇచ్చేదేమిటో తెలిసిపోతే ఇచ్చేవారికీ పుచ్చుకునేవారికీ కూడ అందులో ఉల్లాసం ఏమీ మిగలదు. అలా కాక అనుకున్నదే తడవుగా ఇచ్చి ఆశ్చర్యపరిస్తే ఆ సంభ్రమమూ ఉల్లాసమూ ఇద్దరివీ కదా.
***
ఇచ్చేవారు కొందరు నిస్వార్ధపరులై ఇస్తారు; ఇంకొందరు ఆత్మ ప్రబోధంతో ఇస్తారు; మరికొందరు వారి మతాచారం అనుసరించి ఇస్తారు.
అందరూ నాకు గౌరవనీయులే. అయితే నాకు ప్రేరణ ఇవేవీ కాక, నేనెందుకిస్తున్నానంటే అది నాకో మంచి కాలక్షేపం. పైగా జీవితానికో పరమార్ధాన్నీ ఉత్తేజాన్ని కలిగించి ఎందరో మిత్రులను సంపాదించిపెట్టింది కనక.
నిస్వార్ధం మంచిదన్నంత వరకు నాకు అవగాహన ఉంది. అటుపైన లేదు. కాని దాని వ్యతిరేకం స్వార్ధాన్ని తీసుకుంటే, అది అతి ప్రమాదకరమన్నది రూఢిగా తెలుసు. మత్తు పదార్ధాల సేవనంలో వచ్చే కిక్కు కిక్కుకీ సేవించే డోసులు ఎలా పెంచుకుంటూ పోతారో, స్వార్ధపరత్వమూ అంతే. దాన్ని సంతృప్తిపరచడం దుస్సాధ్యం. ఒకనాటికి మనిషిని సర్వనాశనం చేసి వదుల్తుందది. దాన్నెంచుకుని మట్టిలో కలిసిపోయిన వారి ఎందరివో జీవిత చరిత్రలే దీనికి సాక్ష్యం.
నేనో నిస్వార్ధపరుడని, ధార్మికుడని, దాత అని కాక ఒక మంచి హాబీ కలిగిన వ్యాపారవేత్త అనే గుర్తింపే నాకిష్టం.
****
ఈ ఉదాత్త వ్యాపకాన్ని ప్రారంభించే వారికి రెండు సూచనలు: ఒకటి: అనుకున్నదే తడవుగా ఇచ్చే విషయంలో ఆ సహాయం చిన్నదని ఉదాసీనత వద్దు. పెద్ద సహాయానికి ఎంత ఉత్సాహపడతారో చిన్నదానికీ అంతే. అప్పుడే ఇచ్చే అవకాశాలు ఎక్కువై, ఇదో స్థిరమైన అలవాటుగా మారే ప్రక్రియ సులువవుతుంది. రెండు: ఇచ్చే పనిని బారెడు పొద్దెక్కేక మొదలెట్టక వేకువనించే ప్రారంభించండి. రోజుళ్లో కలం గడుస్తున్నకొద్దీ మన ఉత్తేజమూ ఉత్షాహమూ తగ్గుముఖం పడతాయి. కనుక అవి పుష్కలంగా ఉండే ప్రాతహః సమయాల్లోనే ప్రారంభిస్తే రాత్రి అలిసిపోయ్ పడుకునేవేళకి బోలెడంత సంతృప్తీ ఆనందమూ మీ సొంతం.
***
ఒకటి చెప్పాలి. ఇచ్చే వ్యాపకాన్ని అలవాటుగా చేసుకున్నవారు ఇచ్చిందానికన్న ఎక్కువ ప్రతిఫలం స్వీకరించక తప్పదు. కాని ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రతిఫలమూ ఆశించకూడదు. సెనెకా అనె రోమన్ తత్వవేత్త అంటాడు: వేళ్ళకింకా కొంత అంటుకుని మిగిలిపోతే ఆ ఇవ్వడంలోని రాజసం మటుమాయమవుతుంది అని.
***
ఈ ప్రతిఫలాలూ రిటర్న్ గిఫ్టులూ వెంటనే రాకపోవచ్చు. ఆ సరికి అది దేనికి ప్రతిఫలమో మనకి గురుండకపోవచ్చు. ఒకసారి న ఆఫీసు అడ్రస్ కి వచ్చిన్ అ ఉత్తరాన్ని ఆఫీసుకి సెలవు కావడం వల్ల ఇంటికొచ్చి ఇచ్చారు. వారి డిపార్టుమెంటు నిబద్ధతని మెచ్చుకుంటూ పోస్టు మాస్టర్ గారికి లేఖ రాశాను. తరవాత మర్చిపోయేను.
ఇది జరిగిన కొన్నాళ్ళకి నేనో కొత్త సంస్థ స్థాపించి దనికోసం పోస్టుబాక్స్ ఏర్పాటుచేసుకోవలసి వచ్చింది. విజ్ఞాపన పట్టుకుని పోస్టాఫీసుకి వెళితే అక్కడి ఉద్యోగులు వాళ్ళు బాక్సులు లేవు, నీ పేరు వెయిటింగ్ లిస్టులో ఉంది అని చెప్పేరు. సరేనని నెను బయటికొస్తుంటే ద్వారంలో పోస్టు మేస్టర్ గారు నుంచున్నారు. డేవిడ్ డన్ అంటే, ఆ మధ్య ఆఫీసు ఉత్తరం ఇంటికి డెలివరీ చేసినందుకు మమ్మల్ని మెచ్చుకుంటూ రాసేరు వారేనా? అని. అవునన్నాను.
అయ్యా క్షమించండి. మా డిపార్టుమెంటుకి తిట్లె కాని ప్రశంసలు చాలా తక్కువ. మీ ఉత్తరానికి మేమంతా ఎంత సంతోషించామో. మీ పోస్టు బాక్స్ సత్వరమే ఏర్పాటు చేయించే పుచి నాది అని మాట నిలుపుకున్నారు.
***
వర్జీనియాలో ఒక మహిళ, ఎటువంటి ప్రతిఫలాపెక్ష లేకుండా ఇచ్చేందుకు నిశ్చయించుకుంది. ఓ బాలిక మీజిల్స్ తో బాధపడుతూ మంచం మీద వుంటే ఆమె ఉల్లాసం కోసం సుసీ కుకుంబర్ అనే పేరుతో రోజుకో ఉత్తరం రాసింది. వాటిలో చక్కచక్కని కబుర్లూ బొమ్మలూ కూడ జోడించి. ఇవిచ్చిన ఆనందంతో బాలిక త్వరగా కోలుకుంది. కోలుకున్నాక ఈ సుసీ కుకుంబర్ గురించి తన మిత్రులతో గొప్పగా చెప్పింది. త్వరలోనే పదుల సంఖ్యలో తల్లిదండ్రులు సుసీ కుకుంబర్ గారిని ఉత్తరాలు పంపమని డబ్బు పంపి అభ్యర్ధించారు. అనతికాలంలోనే అమె ఉత్తరాయణం విస్తృతినంది ఏడాదికి లక్షకి తక్కువ లేకుండా ఉత్తరాలు రాసి ఖ్యాతిని ధనాన్నీ ఆనందాన్నీ ఆర్జించింది. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిన సాయం పెట్టుబడి వంటిదే కద.
***
ఒకసారి రీడర్స్ డైజెస్టుకి ఒకరు రాసేరు. తను ప్రయాణించిన బస్ కండక్టరు ప్రయాణీకులతో ఎంతో మర్యాదగా స్నేహపాత్రంగా వ్యవహరించడం చూసి అందరూ దిగిపోయాక ఆయన్ని మెచ్చుకుంటాడు. అప్పుడా కండక్టర్ అంటాడు. ఆ మధ్య పేపర్లో చదివేనండీ, ఒకాయన మర్యాదకి మెచ్చి ఒక కోటీశ్వరుడు తన సంపదని ఆయన పేర విల్లు రాసేసేట్ట. అది చూసి నాకూ ఎవరో అలా రాయకపోతారా అని ఆశతో ప్రవర్తనని మార్చుకున్నాను. అయితే ఇప్పుడిది అలవాటైపోయింది. ఇప్పుడు నాకు డబ్బొచ్చినా రాకపోయినా పెద్ద పట్టింపులేదు. ఈ ఆనందం ముందు డబ్బు తెచ్చే ఆనందం ఎందుకు పనికొస్తుంది అని.
ఇతరుల జీవితాలు సవ్యంగా గడిచేందుకు తోడ్పడితే మనవీ సజావుగా నడుస్తాయి. స్నేహితులు పెరుగుతారు. ప్రకృతి, ఇచ్చేవారి ఖాతాలను సకాలంలో సర్దుబాటు చేస్తుంది - ఇస్తూ పోతూ ప్రతిఫలానికి చేతులు చాచి మనం దేబిరించనంతవరకు.
***
థామస్ డ్రైయర్ అనే ఆయన తన పొరుగింటి ఎనభై యేళ్ళ వృద్ధుడు వీలు దొరికినప్పుడల్లా పీచు మొక్కలు నాటుతుండటం చూసి అడుగుతాడు: తాతా పీచు పళ్ళు తినెద్దామనే? అని. పెద్దాయనంటాడు: జీవితంలో ఎన్నో పీచు పళ్ళు తిన్నాను. ఒక్కటీ నేను నాటిన మొక్కవి కావు. ఎవరో ధర్మాత్ములు ఎప్పుడో నాటిపోయేరు. వారాపని చెయ్యకపోతే నేను తినేవాణ్ణి కాను. ఇప్పుడు నేను వారి ఋణాన్ని ఎదో ఈ మాత్రం తిర్చుకుంటున్నా. అని.
ప్రతిఫలాన్నాశించకుండా సేవనందించేవారికి ప్రతిఫలం తప్పక లభిస్తుంది. ఎవరి పుణ్యమో మనకి ఫలిస్తే మన పుణ్యం ఇంకెవరికో, ఎప్పుడో ఫలిస్తుంది.
అదే కద ఈ ఇచ్చే యజ్ఞంలోని చమత్కారం.
***
వ్యాపారంలో ఇన్ కైండ్ అని వాడతారు. నగదు కాక ఇంకో రూపంలో అని. ఒక రైతు తను కొనుగోలు చేసిన సరుకులకు బదులుగా తన ఫలసాయాన్నో శ్రమనో ఇవ్వడం దీనికి ఉదాహరణ.
ఇలా ఇచ్చేందుకు అందరివద్దా ఎదో ఒకటి ఉండనే ఉంటుంది. హస్తనైపుణ్యం, రాజకీయ చాతుర్యం, నిర్వహణ సమర్ధత, నాయకత్వం, కొంత మిగులు సమయం ఇలా. అవి కలిగినవారికి అవంటే పెద్ద విలువలేకపోవచ్చు కాని ఇంకొకరికి వాటి అవసరం ఉండవచ్చు.
ఇవేవీ లేనప్పుడైతే, కొంచెం ఆత్మీయత, అనునయం. ఇవి హృదయంలోంచి వచ్చేవి. పర్సులోంచి తీసి డబ్బిస్తూ పోతే పర్సు ఖాళీ అయిపోవచ్చు కాని ఈ భావనలు ఇస్తున్నకొద్దీ పెరుగుతూనే ఉంటాయి. "ఇన్ కైండ్" అనే మాట అక్షరాలా వర్తించే సందర్భమిది. అదివ్వడమంటే మిమ్మల్ని మిరు ఇచ్చుకోవడమే.
*****
ఓ క్రిస్మస్ పండుక్కి మాకో పెట్టె, దానిలో చక్కగా అమర్చి పన్నెండు సీసాలు, ప్రతి సిసామీద ముత్యాల్లాటి అక్షరాలతో లోపలి వస్తువు పేరు. వారి పొలంలో పండే లేత కూరలు, తేనె, పాలు ఇలా. ఇన్నాళ్ళు నగరాల్లో కృతకమైన బహుమతులే తెలిసిన మాకు ఈ రైతు దంపతుల సౌజన్యం మా పండగ సంబరాన్ని పదింతలు చేసింది.
****
ఏ ఈ షా అనే ఆయనకి ఓహియో లో న్యాయమూర్తుల కర్ర సుత్తెలు ఇంగ్లీషులో గావెల్ అంటారు - తయారీ వ్యాపారం. ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి వారి సభకి అతను వెళ్ళడం జరిగింది. అధ్యక్షులవారు ఎదో సందర్భంలో తన చెక్క సుత్తెని మూడు సార్లు కొట్టారు. ఆ చెక్క శబ్దానికి అలవాటు పడిన షా మొదటి దెబ్బ బానే ఉన్నా తరవాతి రెండూ బోలుగా మాధుర్యం లోపించిన చప్పుడు చేసేయని గ్రహించాడు. అధ్యక్షులవారి సెలవైతే చక్కని గావెల్ ని సమర్పించుకోవచ్చునా అని అడిగేడు. అనుమతి వచ్చింది. తన కౌశలాన్నంతా ఉపయోగించి ఐక్యరాజ్య సమితి వారికి వస్తు రూపేణా చక్కని బహుమతి ప్రసాదించాడు.
*****
చాలా మంది పేరెన్నిక గన్న వైద్యులు ఇవ్వగలిగినవారివద్ద భారీగానే పిండినా, అవకాశం కల్పించుకుని మరీ ఇవ్వలెనివారికి ఉచిత సేవలందిస్తారు. నా దృష్టిలో ఇది ఉత్తమం. తీసుకున్నదాన్ని తిరిగివ్వడం. ఇదే వైద్యులు వస్తు రూపేణా ఇవ్వడం.
ఎమర్సన్ వస్తు రూపేణా ఇచ్చేవి ఇల ప్రస్తావిస్తాడు: : "అందుకే ఒక కవి పద్యాన్ని, రైతు పంటని, గొర్రెలకాపరి గొర్రె పిల్లని, గని కార్మికుడు మణిని, నావికుడు ఆల్చిప్పలని, పసి బాలిక తాను స్వయంగా కుట్టిన చేతి రుమాలును బహూకరిస్తారని".
తమ కౌశలం నిండినది కక వస్తురూపేణా ఇంకేముంటుంది.
కోరిన్ యు వెల్స్ అనే రచయిత అంటాడు: "ఇవ్వడానికి నువ్వు ధనవంతుడివై ఉండక్కర్లేదు. ఇచ్చే హృదయముంటే కనక, బికారి కూడా రాజు మాదిరి ఇవ్వగలడు" అని.
అల మనమందరమూ ఇవ్వగలవి ఎదో ఒకటి మనకుండనే ఉన్నాయి. అవే మన చుట్టూ ఉండే చిన్న ప్రపంచాన్ని, అవన్నీ కలిసి మన పెద్ద ప్రపంచాన్ని, సుమధుర వాస యోగ్యం చేసేవి.
****
అందరికీ సమానంగా రోజుకి ఇరవైనాలుగ్గంటలు ఉన్నాయి. గొప్ప బీదా తారతమ్యంలెకుండా. అందులో ఎంతో కొంత ఇచ్చే పనికి కేటాయించవచ్చు.
ఒక బోస్టన్ వర్తక ప్రముఖుడు తన వ్యాపార రద్దీ మధ వారానికి ఓ గంట ఎలాగోల మిగుల్చుకుంటున్నాడు. ఆ సమయంలో అతనో అనథాశ్రమనికి వెళ్ళి పిల్లలకి కలక్షేప చెయించేందుకు ఒప్పుకున్నాడు. అ గంట సేపూ ఆశ్రమ ఉద్యోగులు కొంత తెరపి దొరికిందని సంతోషించారు.
అతను ప్రతి వారం ఆ గంటా పిల్లలదగ్గరికి వెళ్ళడం, జేబునిండా తెచ్చిన చాక్లేట్లు రంగురంగుల బొమ్మల కార్డులు వాళ్ళకి పంచిపెట్టడం, అపుడో కథ అందుకోవడం.
తనపేరు బిగ్ మ్యాన్ అనిఏ పిలలకి చెప్పమంటాడు. తన సంస్థలో ఉద్యోగులకి తెలియకుండా జాగత్త పడి. ప్రతివారం ఒచ్చి తమకి వినోదమూ కాలక్ష్పమూ పంచె ఈ పెద్దాయన పిల్లలకి ఎంతో ప్రీతిపాత్రుడైపోయేడు. ఆశ్రమ నిర్వాహకులు అతనొస్తే మాకెంతో సంతోషం, విశ్రాంతి అనేవారు. అసలు ఆనందం నాది అనేవాడు పెద్దాయన.
కొన్నాళ్ళకి అతను కాలం చేశాడు కాని బిగ్ మ్యన్ పిల్లలకి చాలాకలం పాటు మధుర జ్ఞాపకంగా గుర్తుండిపోయేడు.
***
పదవీ విరమణ తరవాత ఒక రైల్వే ఉద్యోగీ ఇటువంటిదే ఇచ్చే పని చేసేవాడు. భర్త అకల మరణంతో ఇద్దరు పిల్లల్నీ సాకుతూ ఒక చిన్న పచారీ కొట్ట్ నిర్వహించుకునే మహిళకి మధ్యాహ్నం వంట సమయంలో గంటసేపు ఆమె పిల్లల్నీ కొట్టునూ చూసిపెట్టగలనని కుదురుకుంటాడు. కొన్నాళ్ళకి ఆనందంగా అంటాడు: "ఈ వ్యాపకం తరవాత ఇంటికెళితే నా లంచి కూడా ఎంతో రుచిగా అనిపించి సంతృప్తిగా వుంది" అని. ఎందుకుండదూ లంచికి సౌహార్దపు ఘుమఘుమలు జోడిస్తే.
***
ఒక పెద్దావిడ ప్రతి సాయంత్రము ఇంటెదురుగా ఉన్న పార్కుకి వెళ్ళి అక్కడికి చక్రాల బళ్ళలో పిల్లల్ని తెచ్చుకుని షాపింగ్ కి ఆపసోపాలు పడే తల్లులకి రెండు మూడు గంటలు హామీ ఇచ్చి పిల్లలనాడించిపెట్టేది. వారి షాపింగులో పార్లర్ తంతులూ సజావుగా జరిగేవి.
ఇంకొకావిడ ఒక రోగి అయిన వృద్ధురాలిని దత్తత తీసుకుని ఆమెకి సపర్యలు చేసి ఏ లోటూ రాకుండా చూసుకునేది.
***
హేజెల్ డనెకెర్ రిడర్స్ డైజెస్ట్లో ఇలా రాసింది. ఒకసారి సిన్సినాటి స్టేషన్లో రైలు కోసం ఎక్కువ సమయం వేచియుండాల్సి వచ్చింది. దూరంగా ఒక తల్లి అలిసిపోయి ఇద్దరు పిల్లలతో సతమతమవుతోంది. అక్కడికో పదేళ్ళ అమ్మాయి వచ్చి మీరు రెస్టు తీసుకోండమ్మా పిల్లల్ని నేను ఆడిస్తాను అని వాళ్ళని ఆడిస్తూ ఆ తల్లికి విశ్రాంతి ప్రసాదించి వాళ్ళని రైలెక్కిస్తుంది. ఇల నలుగురైదుగురు తల్లులకి చెయ్యడం చూసి నేనడిగాను: నువ్వే రైలుకి వెళ్ళాలి పాపా అని; ఆమె అంది. మా ఇల్లు పక్కనేనండి. ఐదుగురం పిల్లలం; నాన్నగారు యుద్ధంలో పోయేరు; అమ్మ ఎంతో అలిసిపోయింది. ఈ పిల్లల నెవరిన సంబాళిస్తే బాగుండు అనుకునేది. అమ్మ గత నెలే పోయింది అప్పణ్ణించి అమ్మల పిల్లల్ని సంబాళిస్తున్నా అని.
***
ఇలాగే ఇంకొకామె బ్యాగు నిండా కవర్లూ పెన్నులూ పెట్టుకుని సమర సీమకి తరలివెళ్ళిన సైనికులకి తమ ప్రాంత భోగట్టాలను రాసేదు. "మొదట న రాతలు వాళ్ళకి ఆసక్తి ఉండవనుకున్న కని వారి వద్ద నుండి వచ్చే జవాబులు నా ఉత్సాహాన్ని పెంచేవి" అందామె.
ఇచ్చేందుకు సంశయమక్కరలేదనేందుకు ఇది ఉదాహరణ. మన పరంగా ప్రారంభించడమే. అవతలివారి స్పందన మన ఊహకే అందనంత ఉల్లాసకరం కావచ్చు.
****
ఒక మేనేజరు తన ఆఫీసు ఉత్తరాలు స్టెనోకి చెబ్తూ ఆఫీసుకి సంబంధం లేని ఉభయకుశలోపరి వంటి పేరా ఒకటి జతచేసి ఉద్యోగుల బాధ్యతలను తేలిక పరచేవాడు. ఎప్పటికప్పుడే ఒక కొత్త సృజనాత్మక పేరా కారులోనే కల్పించి సమయం వృధాకాకుండా తన సౌజన్య వ్యాపకాన్ని దిగ్విజయంగా కొనసాగించేవాడు.
***
గమ్మత్తుగా, ఖాళీ సమయం ఆట్టే ఉండని బిజీ బిజీ వ్యక్తులే ఇలా తలచినదే తడవుగా ఇచ్చే పని త్వరగా పూర్తి చేసుకుని తిరిగి తమ వ్యాపారంలోకి పోతారు. అదే ఖాళీ సమాం ఎక్కువ ఉన్నవాళ్ళు ఇప్పుడా అప్పుడా ఇవ్వాలా వద్దా అనే మీమంస నివృత్తి చేసుకునేసరికి పుణ్యకాలం కాస్త దాటిపోతుంది.
***
బిజీగా ఉండడం వేరు, బిజినెస్ వేరు. చలామంది తమ వృత్తిపరంగాను ఉద్యోగానికిగాను విచ్చించగా చల సమయం మిగిలిపోతుంది. ఇతరుల స్వేఛ్ఛకు భంగం రాకుండా ఉన్న ఖాళీ సమయాన్ని మన ఆనందం కోసం వినియోగించుకోవడం మన అందరి ప్రాథమిక హక్కు. ఆనందాన్వేషణంటే తెగిన గాలిపటంలా ఒక గమ్యం లేకుండా తిరగడం కాక, ఒండొరులకు సహకారంగా ఇచ్చి పుచ్చుకొనే ప్రక్రియలో సార్ధకం చేసుకుంటే మెరుగైన సమాజం మన చేతుల మీదుగా ఆవిష్కృతమవుతుంది.
***
తొమ్మిది
ఇచ్చేదాన్ని మూడు పెట్టి గుణించండి
ఏమిటా మూడూ? ఒకటి : సుహృద్భావం. ఇచ్చేటప్పుడు ఆత్మీయత ఉండాలి. ఏమిస్తామన్నది రెండో పక్షం. ఒక ప్రశంస, ఓ అరగంట సమయం, లేదా ఇంట్లో పూసిన పూలు. ఏవైన ఇచ్చే మనసే ఇచ్చే దాని విలువను పెంచినా తగ్గించినా.
రెండోది సమయోచితం. పరిస్థితిని బట్టి ఇవ్వాలనిపించినప్పుడు వేరే ఆలోచన ఆ సంకల్పాన్ని గండికొట్టించక మునుపే ఇచ్చే ప్రక్రియ జరిగిపోవాలి. తలచిన తడవుగా ఇవ్వడంలోని శోభ ఇదే.
మూడవది, అతి ముఖ్యమైనది, ఉత్సాహం. అసలు స్వభావరీత్యా ఉత్సాహమే వాతావరణాన్ని ప్రకాశవంతం చేసి మనసులను తేలికపరుస్తుంది. ఉత్సాహవంతులు తమతో పాటు ఇతరులనూ ఉత్సాహపరుస్తారు. అసలు అదే ఒక విధమైన "ఇవ్వడం". అటువంటి ఉత్సాహం ఇచ్చే ప్రక్రియలో చూపినప్పుడు వాటి ఉమ్మడి ప్రభావం బహూళ ప్రయోజనకారి. ఉత్సాహించేందుకు సందర్భం కోసం వేచియుండక్కర్లేదు. ఆవహింపజేసుకుంటే అదే ఆవహిస్తుంది. అయితే మనలో చాలా మందికి "వీడో అతి గాడ్రా" అని జనులు అనుకునిపోతారేమోననే సంశయంతో ముడుచుకునే స్వభావం ఉంటుంది. అందువల్లనే ప్రశంసకి అర్హమైన వాటిని ప్రశంసించేందుకూ తటపటాయింపే. పొగడ్తకర్హమైనదాన్ని సమయోచితంగా పొగడటం అతి కాదు సరికదా, ఆవశ్యకం.
***
నా పరిచయస్తుల్లో ఒకాయన ఈ విషయంలో తన అనుభవం పంచుకున్నాడు. ఎవరినైనా మెచ్చుకోదగినప్పుడు మనసులోనే మెచ్చుకుంటుంటాను అది బాహాటంగానే చెయ్యక్కర్లేదు, అసలు వారికి తెలియాల్సిన పనేలేదనేది అతని స్వభావం. ఒకసారి తన తోటి ఉద్యోగులకి పదోన్నతులూ లభిస్తుండటం, తనకు రాకపోవడం ఏమిటాని ఆశ్చర్యపడి ఆరా తీస్తేడు. "సంస్థకి పనికొచ్చే ఎన్నెన్నో మంచి మంచిపనులు మన సాటి ఉద్యోగులు చేసేరు. మేము గమనించినదాని ప్రకారం, నువ్వు ఎప్పుడూ ఒకరిని మెచ్చుకొనిందీ లేదు, ప్రోత్సహించిందీ లేదు. ఇతరుల్లోని మంచిని గుర్తించని వాడు నాయకుడు కాలేడు. నీకు పదోన్నతి అవసరమని మేమనుకోవట్లేదు." అని. ముభావమూ ఉదాశీనతా వదులుకోదగిన గుణాలని అప్పటికి అతనికి అర్ధమయింది.
సౌహార్దం - సమయోచితం - ఉత్సాహం. ఇవి వితరణకి వన్నె తెచ్చే గుణిజాలు.
పది
కొనలేని బహుమానాలు
సౌహార్దం, దయ, ప్రేమ, ధైర్యం, ఇతరులను అర్ధం చెసుకోవడం, మంచి నడవడి ఇవన్నీ డబ్బుతో కొనలేని బహుమానాలు.
ఒక సారి ఓ పడవ హోబోకెన్ అనే రేవు దగ్గర ఇంజను చెడి నిలిచిపోయింది. తమ క్షేమం కోసం అందరూ దిగిపోవాలని సరంగు సూచిస్తాడు. ఒక్కొక్కరూ దిగిపోతున్నారు. ఒకడు మాత్రం తాగిన మత్తులో అక్కడే ఓ మూల అపస్మారకంలో ఉన్నాడు. ఎవరూ అతన్ని పట్టించుకోవట్లేదు. దిగేవారిలో ఒక ముసలాయన అతని భుజం తట్టి "హోబోకెన్ బాబూ హోబోకెన్" అని మెల్లగా కుదిపాడు. తాగుబోతుకి తెలివొచ్చి లేచి దిగిపోతాడు.
మిగతావారు ఆ పెద్దాయన్ని గుర్తుపట్టి సాటి మనిషిని హెచ్చరించక అలా వదిలేసినందుకు తమ ప్రవర్తనకి సిగ్గు పడతారు. ఆ పెద్దాయన థామస్ అల్వా ఎడిసన్.
ఇచ్చే స్వభావానికి దయని జోడిస్తే ఫలితం దివ్యం. అది హృదయం నించి హృదయానికి చేరేది కనక.
పది
కొనలేని బహుమానాలు
సౌహార్దం, దయ, ప్రేమ, ధైర్యం, ఇతరులను అర్ధం చెసుకోవడం, వివేకం, మంచి నడవడి ఇవన్నీ డబ్బుతో కొనలేని బహుమానాలు.
ఒక సారి ఓ పడవ హోబోకెన్ అనే రేవు దగ్గర ఇంజను చెడి నిలిచిపోయింది. తమ క్షేమం కోసం అందరూ దిగిపోవాలని సరంగు సూచిస్తాడు. ఒక్కొక్కరూ దిగిపోతున్నారు. ఒకడు మాత్రం తాగిన మత్తులో అక్కడే ఓ మూల అపస్మారకంలో ఉన్నాడు. ఎవరూ అతన్ని పట్టించుకోవట్లేదు. దిగేవారిలో ఒక ముసలాయన అతని భుజం తట్టి "హోబోకెన్ బాబూ హోబోకెన్" అని మెల్లగా కుదిపాడు. తాగుబోతుకి తెలివొచ్చి లేచి దిగిపోతాడు.
మిగతావారు ఆ పెద్దాయన్ని గుర్తుపట్టి సాటి మనిషిని హెచ్చరించక అలా వదిలేసినందుకు తమ ప్రవర్తనకి సిగ్గు పడతారు. ఆ పెద్దాయన థామస్ అల్వా ఎడిసన్.
ఇచ్చే స్వభావానికి దయని జోడిస్తే ఫలితం దివ్యం. అది హృదయం నించి హృదయానికి చేరేది కనక.
***
ఇతరులను అర్ధం చేసుకోవడం విషయానికొస్తే, నా మటుకి నేను ఇతరులను అర్ధం చేసుకుంటాను. అయితే ఎంత అర్ధం చేసుకుంటాం అది ఎంతవరకు ప్రదర్శిస్తాం అనేది ప్రధానం. ముగ్గురికి చోటున్న రైలు సీటు మీద పక్కన రెండు సంచీలు పెట్టుకుని చాపుక్కూర్చోక తన మట్టుకే కూర్చుని అవతలి రెండూ ఖాళీ అని ఆహ్వానించినట్టు కూర్చుంటే ఆ నిశ్శబ్దమైన మర్యాద ఈ లక్షణాన్ని ప్రకటిస్తుంది.
***
ఒక తెగవారి ప్రార్ధన ఇలా ఉంటుంది: "దేవుడా, వారితో ఒక రెండు నెల్లు కలిసి పనిచేసేంతవరకు వారి గుణాలను విమర్శించే అవకాశం నాకివ్వకు" అని. దగ్గరనించి చూస్తే కాని ఎవరి నిజస్వభావమేమిటో చెప్పలేం. అయితే దురదృష్టవశాత్తు సరదాగా నడిచే చాలా సంభాషణల్లో అక్కడ లేనివారిని విమర్శించడం, వెటకారం చెయ్యడమే ప్రధాన ఆకర్షణలు. చాలామటుకు గుంపు పోకడని వ్యతిరేకించే సాహసం లేకనో, ఉదాశినతతోనో మనం మౌనం దాలుస్తాం. కాని మౌనం వీడి ఒకటి రెండు మంచి మాటలు వారి గురించి చెప్పడమంటూ జరిగితే, గుపులోని కొద్దిమందైనా మన పక్షం చేరడానికి సిద్ధంగా ఉంటారు. గమనించాల్సిందేమంటే, వారిని విమర్శించి అవహేళన చేస్తున్నప్పుడు కాక వారి గురించి మంచిగా మాట్లాడినప్పుడే గుంపు వాతావరణం ఆరోగ్యవంతంగా ఉంటుందని అందరూ గ్రహిస్తారు.
విమర్శకి విమర్శ, ఖండనకి ఖండన, క్షమకి క్షమ మనకి లభిస్తాయని కద బైబిల్ వాక్యం.
***
కృతజ్ఞతల శాతం తగ్గుతోందా?
కృతజ్ఞతలు కూడా ఇచ్చిపుచ్చుకునే బహుమానమే. నా అనుభవంలో నాకు లభించిన కృతజ్ఞతలు కొన్ని కన్నీళ్ళు తెప్పించాయి; రోమాంచం చేశాయి. అప్పుడే తెలిసింది. అతి సామాన్యమైన ఆ స్పందన ఎంత ప్రభావశీలమో.
అయితే నేను ఎంతమంది అర్హులకి కృతజ్ఞతలు చెబుతున్నాను. అందరమూ ఇదే ప్రశ్న వేసుకుంటే ఎంత మందికి చెప్పకుండా తప్పించుకుంటున్నాము.
సమయోచితంగా చెప్పవలసినప్పుడు కృతజ్ఞతలు చెప్పని ఉదాశీనపు కాలమిది అని భావించేవారికి క్రీస్తుకాలంలోని ఒక ఘట్టాన్ని ప్రస్తావిస్తాను.
ఓ సారి క్రీస్తు మార్గంలో పది మంది కుష్టు రోగులు ఏడుస్తూ తమను కాపాడమని వేడుకుంటారు. క్రీస్తు కరుణించి చేరువలోని దేవాలయానికి వెళ్ళమంటారు. వారు వెళితే అక్కడి పూజారులు వారిని స్వస్థ పరుస్తారు.
క్రీస్తు పయనం అలా సాగుతుండగా గుంపులోంచి ఒకతనొచ్చి అతని కాళ్ళపై పడి తనను బాగు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. బాగుపడింది పది మంది కదా ఒక్కడివే వచ్చేవేం అని అడుగుతాడు క్రీస్తు. అంటే అప్పటికే పదింట ఒకరే కృతజ్ఞతల సంప్రదాయం ఆచరిస్తున్నారన్నమాట. ఇప్పుడు అంతకన్న తక్కువ ఆశ్చర్యం లేదు. అయితే ఆ సంఖ్యని పెంచడం కష్టం కాదు మనలో మార్పురావాలేకాని.
***
ప్రశంసలోని నిజాయితీ దాని లోతునుబట్టి ఉంటుంది. బాగాపాడేరండీ అనే దానికి, చక్కని గానం అండీ, ముఖ్యంగా ఆ శంకరాభరన వర్ణం అనే దానికి; బాగా రాశేరండీ అనే దానికి, మంచి పుస్తకం ముఖ్యంగా సభనించి వస్తున్న నాయకుడి అంతర్మథనం మంచి ఆర్ద్రంగా ఉంది అనేదానికి; వంట బాగుందయ్యా అనే దానికి, బ్రహ్మాండమైన వంట; ఆనపకాయ పప్పు రెండుసార్లు వేయించుకున్నాను అనే దానికి. మొదటిది మొక్కుబడైతే రెండవది నిజమూ నిజాయితీ నిండినది.
మంచిపేరు తెచ్చుకున్న ఒక రచయిత్రికి తన రచనను ఎదైనా పత్రిక ప్రచురించిన వెంటనే ఒక ఉత్తరం వచ్చేది. ఆమె రచనను మెచ్చుకుంటూ ఆ లేఖరి రాసే తీరు లోతైన ప్రశంసకి అద్దం పట్టేది. ఉదాహరణకి, కథలో ఒకరి తరవాత పాత్రల పరిచయం నన్ను కట్టిపడేసింది. అలాగే ఒకరినొకరితో కలిపే ఘట్టాలు, ముఖ్యంగా మీరు ప్రకృతిని వర్ణించిన తీరు...." ఇలా ఉండేది. విచిత్రంగా ఈ ఉత్తరం ఇచ్చిన తపాలా వారే ఇంకో పత్రికవారు తిప్పిపంపిన ఆమె ఇంకోరచన తిరుగుటపానూ డెలివరీ చేసేవారు. మొదట విచారించినా, ఎదో స్ఫురించి మొదటి ఉత్తరాన్నీ తిరిగొచ్చిన రచననీ పోల్చుకుంటే ఉత్తరంలో ఏవైతే బాగున్నాయని రాసేరో, సరిగ్గా అవే అంశాలు తిరిగొచ్చిన కథలో లోపించేయని సరిదిద్దు కుని సఫలమవుతుంది.
వివరణాత్మకంగాను లోతుగాను చేసే ప్రశంసలు ఇచ్చేవారికి అవతలివారిపట్ల ఔదార్యాన్ని వెల్లడిస్తూనే, స్వీకరించేవారికి తమ కౌశలాలను మెరుగుపరుచుకునే అవకాశాన్నీ కలిగిస్తాయి.
***
ఆసక్తి చూపడమూ బహుమానమే
ఒకసారి ఓ మిత్రుడు డిన్నర్కి ఆహ్వానించాడు. భోజనాలయాక రండి నా స్టాంప్ కలక్షన్ చూద్దురు అని మేడ మీది గదికి తీసికెళ్ళాడు. నాకు గుండెలో రాయిపడింది. ఎందుకంటే నాకు స్టాంపు కలక్షన్లంటే బోరు. ఆ క్షణంలోనే ఒక నిర్ణయానికి వచ్చి అతనికి ఉత్సాహ భంగం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాను. తనెంత్ నిజాయితీతో ఒక్కొక్క స్టాంపునీ చూపించి మురిసిపోయాడో అంత ఉత్సాహమూ శ్రద్ధలతో నేనూ ప్రతి స్టాంపునీ దగ్గరగా పరిశీలించి కొన్ని ప్రశ్నలు కూడా అడిగి అతడు ఒళ్ళు మరిచిపోయి వివరిస్తూంటే ఆ జోరు తగ్గనీక ప్రతి వివరణకీ సందర్భోచితమైన ప్రశ్నలడుగుతూ ఆ స్టాంపుల ప్రదర్శన విజయవంతం చేశాను. అతనూ ఎంతో సంతృప్తి పొందాడు.
అప్పుడనిపించింది. మన అభిరుచులూ ఆసక్తులే గొప్పలు, ఒప్పులు, అవలివారివి తప్పులు అనేది ఒక సంకుచిత స్వభావమని, మనం ఒక గిరి గీసుకుని అందులోంచి బయటపడే సాహసం చెయ్యలేక ఇటువంటి అభిప్రాయాలు పెంచుకుంటామని, అనుకుంటే ఆసక్తి దేనిలోనైనా పెంచుకోవచ్చునని. అవతలివారి అభిరుచులపట్ల నిజాయితీ కలిగిన ఆసక్తి ప్రకటించడం కూడా ఒక మంచి ఇచ్చే ప్రక్రియ.
***
ఇంకోసారి రైల్లో ఎదో నవల చదువుకుంటున్నాను కాని అది ముందుకి కదలట్లేదు. ఎదటి బెర్తు మీద ఉన్నాయన దిగులుగా కూర్చున్నాడు. నిస్పృహ అతని కళ్ళల్లో కనిపిస్తోంది.
మాట కలిపి, "మీకు ఈ ప్రయాణం ఇష్టం లేనట్టుంది. మరోలా అనుకోకపోతే ఎందుకో చెప్పగలరా?" అని అడిగేను.
తనో రైల్వే ఇంజనీరునని, సాంకేతిక సమస్యలు బాగుచేస్తానని అతనన్నాడు.
నా స్మృతిలో ఇంకా మా స్టాంపు సేకరణ మిత్రుడి ఉదంతం మెదులుతూనే ఉంది. అప్పటి ధైర్యంతోనే ఇతన్నీ ఒక పది పదిహేను ప్రశ్నలడిగేను. సాంకెతిక అంటే ఎలాటి సాంకేతిక, సుమారు ఎంత సమయం తీసుకుంటుంది, రైళ్ళు మళ్ళించిన సందర్భాలున్నాయా, సిగ్నల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఇలాటివి. ప్రశ్న ప్రశ్నకీ నా ఆసక్తీ పెంచేను, అతను వివరించే ఉత్సాహమూ పెరిగింది. మా సంభాషణ ముగిసేప్పటికి అతని ముఖంలో మునపటి విసుగు లేదు. ఎంతో తేలిక పడ్డట్టు కనిపించేడు. ఇకపైన విధి నిర్వహణలో కూడా ఈ ఉత్సాహం చూపగలడని తోచింది. నిజాయితీగా మనం చూపే ఆసక్తి ఒక మంచి ప్రేరకశక్తి అని గ్రహించాను.
***
సంపన్నుల పేదరికం
కూడబెట్టిన సంపద ఒక విధమైన పేదరికాన్ని కలిగిస్తుంది - దాని సొంతదారులను మానవ సహజ ప్రకృతికి దూరం చెయ్యడం ద్వారా. సంపదే సర్వస్వమై అది లేనివారు దానిమీద కన్నేసి కాజేసే ఆలోచనలో ఉన్నారనిపించినప్పుడు సంపన్నులు ఇతరులను దూరం పెట్టి తమ సహజ స్వభావానికి దూరమై ఒంటరులవుతారు.
కాని సంపదను సమాజాన్నీ విడివిడిగా చూసి రెంటి విలువ దానిదేనని, సంపదకి సమాజ సహకారమే ఆధారమని నమ్మినవారికి ఈ ఒంటరితనం ఉండదు.
నేనూ ఒక గొప్ప ధనవంతుడూ నగర వీధివెంబడి నడుచుకు వెళుతున్నాను. మేమెవరమో తెలియని ఒక సామాన్య అపరిచితుడు ఆ సంపన్నుని చేతిలో ఒక పిట్ట కూతలు కూసే బూరా చేతిలో పెట్టి ఉంచుకోండి అని నవ్వుతూ వెళిపోయేడు. ఈ సంపన్నుడు కూడా ఏ భేషజమూ లేకుండా అది పాడైపోయేంతవరకు నడక దారంతా ఊదుతూనే ఉన్నాడు. ఊదిన ప్రతిసారి దాని కూతని పిల్లలూ పెద్దలూ కళ్ళు పెద్దవి చేసుకుని పెద్దాయన పిల్లచేష్టని నవ్వుతూ చూసేరు. అది పట్టుకుని ఆడుకున్న సంపన్నుడికి ఇటువంటి సరదా తన సంపద ఇచ్చి వుండదు.
***
ప్రశంసలూ అభినందనల విషయనికొస్తే, పాపం రాజకీయనాయకులు అనిపిస్తుంది. రాజకీయాలు రొచ్చు అన్నది విశ్వజనీన అభిప్రాయమైపోయింది. కొందరు నీచులైతే కావచ్చు గాక కాని మిగతావారి సత్కార్యాలను సదుద్దేశాలను గుతించి ప్రశంసిస్తున్నవారెందరు. తమ విధానం మంచిదో కాదో తరవాత ఎప్పుడో వచ్చే ఎలక్షన్లో వోటు వేసే జనాలే నిర్ణయిస్తారని ఎదురు చూస్తారు వారు.
నాకైతే నచ్చిన పనికి తక్షణమే దాని విధానకర్త అయిన రాజకీయ్నాయకునికి ధన్యవాదాలు సూచనలు నాగరీకులందరూ చెయ్యడం ఉత్తమం.
అబ్రహాం లింకన్ జెట్టిస్బర్గ్ లో వీరుల సమాధి వద్ద అమరవీరుల కుటుంబాలనుద్దేశించి ప్రసంగిస్తాడు. అతని కన్న ముందు ఎడ్వర్డ్ ఎవరెట్ అనే ఆయన ఉపన్యాసమవుతుంది. అది ముగియగానే జనులు చప్పట్లతో పరిసరాలు దద్దరిల్లిపోయేయి. తరవాత విన్న లింకన్ ఉపన్యాసానికి మాత్రం ఒక్క కరతాళమూ పడదు. ఎంతటి ధీరుడైనా ముందు వక్తకీ తనకీ వచ్చిన స్పందనలోని వైరుధ్యానికి ఆ అనుభవం అవమానకరం అనిపించిందేమో లింకన్‌కి.
ఇప్పుడనిపిస్తుంది అ జనాల్లోంచి ఒక స్త్రీమూర్తి వచ్చి లింకన్ చెయ్యి పట్టుకుని అనునయిస్తే బాగుణ్ణు. "బాబూ లింకన్. ఇంకోలా భావించకు. ముందటి ఉపన్యాసానికి మా చప్పట్లూ, నీ సందేశానికి మా మౌనమూ - దాని అర్ధం ఇది: నీ భావ గంభీర్యపు పవిత్రతకి చప్పట్లు అపచారమని అంతా మౌనంగా ఉన్నారు. నీ ముందటాయన ఉపన్యాసం ఇక్కణ్ణించి వెళ్ళగానే మర్చిపోగలిగేది; నీ సందేశం నీ తరువాత కూడా తరతరాల పాటు పిల్లలు పాఠంగా చదువుకోబోయేది. నీ విగ్రహరూపాలు చూసిన జనులెల్లరూ చదువుకునేలా కాంస్యఫలకాలమీద శాశ్వతంగా చెక్కబడేది. ఈ యుద్ధంలో కొడుకును పోగొట్టుకుని గాయపడిన నా హృదయనికి నీ మాటలు ఔషధమై సాంత్వననిచ్చేయని." అయితే అది ఉదాశీనత కారణంగా సమయోచితంగా వెలిబుచ్చలేని ప్రశంసగా హృదయాల్లొనే సమాధైపోయింది అప్పటిమట్టుకి.
మంచిపనిని రాజకీయాలకతీతంగా అసూయలు పక్కన పెట్టి ప్రశంసించడం వ్యక్తి ఔన్నత్యాన్ని చాటుతుంది. "అది పుచ్చుకునేవారికన్న ఇచ్చేవారికే శోభాయమానం. సంపన్నులకూ సామ్రాజ్యాధినేతలకూ సాధ్యం కానిది, సామన్యులే చేయగలదీ." అంటాడు జార్జి మేథ్యూ ఆడమ్‌స్.
***
అన్ని రోజులూ ఉల్లాసంగా ఉండవు. కొన్ని ఏకారణానికో తడిసిన గోనెగుడ్డకప్పుకున్నంత భారంగా అనిపిస్తాయి. అటువంటప్పుడు ఒకరికి గోల్ఫు ఆడితే ఉత్తేజం. ఇంకొకరికి గొప్పులు తవ్వితే ఆనందం. మరొకరికి చేపలు పడితే ఉల్లాసం. వేరొకరికి గుడికెళితే పరవశం.
ఇచ్చే అలవాటు పెట్టుకున్న నాకైతే ఇవ్వడమే ఇటువంటి మసిపట్టిన మనఃస్థితికి మందు. ఓసారి అలానే జరిగింది. బోస్టన్లో యేదో సభకి పోవాలి నేను. కాని ఎందుకనో మనసంతా ఉదయం నించే చికాకు. ఏదో చేసి ఉత్తేజం పొందకుంటే ఇవాళ శృంగభంగమే అనిపించింది. ఉదయం హొటలు డైనింగు హాల్లో ఓ మూల కూర్చుని పలహారం చేస్తున్నాను. అక్కడక్కడా ఇంకా ఎవరో తింటున్నారు. బ్రెడ్లూ గుడ్లూ చూస్తే ఎవరో కుటుంబ పరిచయస్తురాలు అన్న మాటలు గుర్తొచ్చాయి. "మా ఆయనకి నేనంటే ప్రేమే కాని సాల్టు పెప్పరు సీసా ఇటు తొయ్యమంటే తొయ్యడండీ ఎప్పుడూ మరుపే" అని. యథాలాపంగా చూసుకుంటే నా ముందు సాల్టూ పెప్పరూ ఉంది, మిగతా చోట్ల లేదు. అంతే ఇచ్చేవీరుడు జూలు విదిల్చేడు. నా ఆమ్‌లెట్టు మీద జల్లుకుని, సీసాని అది లేని ఒకరికి ఇచ్చి జల్లుకోండి మీదైనాక ఇంకొకరికి పాస్ చెయ్యచ్చు అన్నాను. అతను చిరునవ్వు నవ్వాడు. నా మబ్బు తేలిపోయింది. తరవాత మాట కలిపేను. అందరమూ ఓ ఇరవై నిమిషలు మాట్టాడుకున్నాం. బోస్టన్ సదస్సు విజయవంతమైందని వేరే చెప్పాలా.
***
ఇంకోసారీ ఇలాటి పరిస్థితిలో చికాగ్గా మొహం పెట్టి అరుగుమీద కూచున్న ఒక చిన్న పాపకి తన గౌను ఎంత బాగుందో అన్నాను. తను నవ్వింది. కొంతదూరం నడుచుకుంటూ పోయేక "హేయ్ అంకుల్ థేంక్ యూ బై" అంది. నా కో చిన్న మిత్రలాభం.
శాస్త్రీయంగా అవుననేవారు లేకపోవచ్చు కాని ఈ అలవాటు గుండె ఆరోగ్యానికీ మంచిదని నా అభిప్రాయం.
***
ఒక మిత్రుడు తరచూ పార్టీల్లో తను చేసేపని చెప్పినప్పుడు ముచ్చటనిపించింది. జనాలందరూ కూడినచోట నలుదిక్కులా బాగా చూసి యథాలాపంగా చేసినట్టు ఒక పనికొచ్చే చిన్న పని చెయ్యడం. ఉదాహరణకి ఒక బృందం మాట్టాడుకుంటున్నప్పుడు ఒకరి మొహం మీద కిటికీలోంచి ఎండపది వాళ్ళు మొహం చిట్లించుకుంటుంటే వారికోసమన్నట్టు కాక వెళ్ళి కిటికీ కర్టెన్ ని కొంత సర్దుబాటు చేసి వారి మొహాన్ని సూర్యకిరణాలనుంచి తప్పించడం. లేదా అడ్డంగా ఉన్న కుర్చీలు పక్కకి లాగి వచ్చీ పోయేవారికి దారి సుగమం చెయ్యడం. ఒక వాడక పడివున్న యాష్ట్రేని ఒక పొగతాగే బృందం మధ్య ఉంచడం, చెయ్యి తగిలి పడిపోయే అవకాశమున్న గ్లాసులు సురక్షిత ప్రదేశంలో పెట్టడం ఇలాటి ఇరవై ముప్ఫై చిన్నపనుల లిస్టుంది అతగాడి దగ్గర. ఎంత అక్కర్లేదనుకున్నా అప్పుడప్పుడూ ఒకట్రెండు చిరునవ్వులూ ధన్యవాదాలూ ఒస్తుంటాయండోయ్ అని మురిసిపోతాడతను.
***
పౌరులుగ
మా వీధిలోంచి భారీ వాహనాలు పోతుంటాయి. స్పీడు తగ్గించేందుకని ఒక ఇంటి ముందు హంపు లేపేరు. అయితే అక్కడున్న ఇంటో ఆవిడ కాన్సరు రోగి. వాహనాలు హంపుదగ్గర ఆగి పుంజుకునేటప్పుడు వచ్చే శబ్దమూ అదురూ ఆమెకి ప్రాణాంతకంగా తయారయాయి. తెలిసి పోలీసు ఉన్నతాధికారులకి రెండు ఉత్తరాలు రాసేను. వారు సహృదయతో స్పందించి ఆ హంపుని ఏ ఇంటికీ ఇబ్బంది లేనిచోటికి జరిపేరు.
ఒక జంక్షన్లో ఆకుపచ్చ సిగ్నలు మరీ తొందరగా మారిపోవడంతో వరసలోని నాలుగోవాహనం కూడా పూర్తిగా పోయేది కాదు. గమనించి సంబంధిత పోలీసువారికి రాస్తే వారు దాని నిడివి పెంచారు.
పాత సామెతొకటుంది. అందరిదీ అయినది ఎవరిదీ కాదని. క్రమక్రమంగా అందరిదీ అయినది నాది అనే తత్వం పెట్టుకున్నాను. ఇప్పుడు చేతినిండా పని. చేతనైనంతమట్టుకూ నాదృష్టికి వచ్చినవి అధికారుల దృష్టికి చేర్చే పని పెట్టుకున్నాను సంతృప్తీ ఉత్తేజమూ పెంపొందాయి.
***
ఇంకోసారి రోడ్డుమీద పడున్న సూదిమేకుని వెనక్కి డ్రైవ్ చేసుకొచ్చి మరీ అవతలపడేసాను. అది చూసిన ఒక మోటారు సైక్లిస్టు మీరు నాలా ఒదిలెయ్యకుండా పౌర స్పృహ చూపారు. ఇకనించి నేనూ మిమ్మల్ని అనుసరిస్తాను అని వెళ్ళిపోయాడు. ఇది ఇచ్చుటలో ఇంకో ప్రయోజనం ఇంకోరిలో ఉత్తేజం కలిగిస్తుంది.
ఇంకోసారి మా ఫ్రెండు చేస్తున్నాడని నేనూ రోడ్డుపక్క కాగితాలూ సీసాలూ ఏరి డస్టుబిన్నులో పడేసే వ్యాపకం కూడ మొదలెట్టాను.
అయితే ఇవన్నీ చెడ్డ ఉదాహరణలు. ఎంచుకుందుకు మంచివీ ఉంటాయి.
ఒకసారి ఒక ప్రింటర్ కి తన చుట్టుపక్కల షాపుల మీద "బుధవారం సెలవు" అని చేత్తో వంకరటింకరగా రాసున్న అట్ట బోర్డులు చూసి చిర్రెత్తుకొచ్చింది. ఏమిటండీ ఈ వంకర టింకర? కాలనీ పరువుపోతోంది. అంటే ఎవరో సలహా ఇచ్చేరు నువ్వు ప్రింటు చేసి అతికించు, కావస్తే కింద నీ ప్రెస్సు అడ్రస్సు కూడా వేసుకో అని. తక్షణమే అతను అమలు చేసేడు. అయితే కింద అడ్రస్సు వేసుకోలేదు. ఇప్పుడు బోర్డులు చూడముచ్చటగా ఉన్నాయి. ప్రింటరు ఎవరైతే ఎవరిక్కావాలి. మా ఏరియా షాపులవి అందమైన బుధవారం బోర్డులు. ఈ సంతృప్తి చాలు అని.
తరవాత దీన్ని అతను పట్నంలోని మిగతా ప్రాంతాలకీ విస్తరించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ సరికి అమలు జరిపే ఉండాలి. ఇచ్చే వ్యాపకం పెట్టుకోవాలే కాని వెదకబోయిన అవకాశాలు కాలికితగిలే సందర్భాలు కోకొల్లలు కద.
*****
ఒకావిడ దృష్టికి ఒక సమస్య వచ్చింది. తన కాలనీలోఇ కొత్తగా చేరుతున్న కుటుంబాల గురించీ ఎవరికీ తెలీటం లేదు. ఎవరి పరిచయమూ లేక కొత్తవారికీ కొత్తదనం బెరుకు పోవట్లేదు. ఒక ఆలోచన చేసింది. స్థానిక న్యూసుపేపర్ వారిని కలిసి "ఫలానా కాలనీలో కొత్త స్నేహితులు" అనే శీర్షిక పెట్టి శనివారం అనుబంధంలో వెయ్యమంది. విచిత్రంగా ఎడిటర్ గారూ సరేనన్నారు. క్రమేపీ శెనివారం అనుబంధంలో ఈ కాలం ఎక్కువ పాఠకులని సంపాదించిపెట్టింది.
***
ఒక పరిచయస్తునితో మట్టాడుతూ ఒకటి గమనించాను. అతనికి ఊర్ళో తెలీనివాళ్ళు లేనట్టుంది. అందరినీ పలకరిస్తునండు; అందరూ అతన్ని పలకరిస్తున్నారు.
ఇదేలా సాధ్యమండోయ్ అంటే, కొన్నేళ్ళ క్రితం అతను కొత్త మొహం కనిపించినప్పుడల్లా గుడ్ మార్నింగ్ చెప్పడం మొదలెట్టేట్టా. కొత్త ప్రాంతంలో కొత్త సంప్రదాయమని మెచ్చుకుంటూ వారూ అదే విధంగా స్పందించేరుట. ఇప్పుడు నాకూ మా ఆవిడకి బోలెడంతమంది ఫ్రెండ్సు అన్నాడతను.
స్నేహితులంటే నువ్వు నీకిచ్చుకునే బహుమానం అని కదా అన్నాడు రాబర్టు లూయీస్ స్టీవెన్సన్.
***
ఓ సాయంత్రం నాకూ మా ఆవిడకి మహా బోరు కొట్టింది. ఎవరినైనా పిలుద్దామా అంటే ఎందుకు లెద్దూ వాళ్ళింకేదో ప్రోగ్రాములో ఉంటారంది ఆమె. ట్రై చెయ్యనీ అని ఒక స్నేహితుడికి ఫోను చేసేను. సాయంత్రం ఏమిటి మీ ఫ్యామిలీ ప్రోగ్రాం అని. ఏమీ లేదు ఖాళీయే. బోరుగా వుంది అన్నాడతను. అయితే మాయింటికొస్తారా మమ్మల్ని రమ్మంటారా అనడిగేను. ఆ సాయంత్రం ఇద్దరి ఫ్యామిలీలకూ ఎంతో ఉల్లాసంగా గడిచింది.
బోరుకొట్టిన ఇళ్ళలో ఒక నీలం లైటు సాయంత్రాలు వెలిగితే బాగుణ్ణు. మేము ఖాళీ వస్తారా రావాలా అని సూచిస్తూ.
***
జానీ ఏపిల్ సీడ్ అనే ఆయన జేబులో ఏపిల్ విత్తనాలు ఓసుకుని దారిలో చెట్లకి అనువైన చోట్లల్లా పాతుకుంటూ పోయేవాడు. అతనికాలంలోనే అవి ఏడంగుళాల లావు చెట్లై పెరిగేయి. కొన్ని కాయడమూ ఆరంభించేయి. అంతే కదా. ఇప్పుడు మనం అనుభవించే చెట్ల ఫలసాయమో ఎవరిదో ఎప్పటిదో శ్రమే కద.
సమాజానికివ్వడం అనే కోవకి చెందే ఈ ఉదాహరణలు కొన్నే. తలచుకుంటే ఎన్నెన్నో అవకాశాలు ఎదురై వాటిని వదులుకోక వాడుకున్నవారి సౌజన్యంతో మరింత మెరుగైన సమాజ జీవనాన్ని అందిస్తాయి.
***
క్రెడిట్ ఇవ్వడం
మా స్నేహితుడొకాయన ఎవరి క్రెడిట్ వారికివ్వడంలో నిపుణుడు. పై అధికార్లు మెచ్చుకుంటే అది చేసినది నేను కాదండి, ఫలాన అనో, వంట బాగుందంటే వంటామె గొప్పదనం అనో ఇల్లు చూడముచ్చటగా ఉంటే నా శ్రీమతి అభిరుచి అనో ఇలా. అదీ బాహాటంగా నలుగుర్లోను క్రెడిట్ ఇచ్చేవాడు.
ఓ సారి అడిగేను. ఇంట్లో వారికి సరే పనిలో కూడా ఇలా ఇస్తే వాళ్ళకి కొమ్ములొస్తాయేమో కదా అంటే. అవునవును. యాభైలో ఒకరికి ఒస్తాయి. వాటిసంగతి కాలం చూసుకుంటుంది. నా దృష్టి మిగతా నలభై తొమ్మిది మంది మీదా అని. ఇప్పుడు క్రెడిట్ ఇవ్వడం కూడా నా జాబితాలోకి చేరింది.
***
మిగులు పంచుకోవడం
ఇంతవరకు ఇచ్చింది కాణీ కర్చులేని వ్యవహారం. ఇప్పుడు కొంత కర్చే కాని మంచి కర్చు. అది, మిగులు పంపకం. మన దగ్గర మిగిలిపోయిన పాత చెక్కపెట్టె, టైర్లు, వాడని పాత్రలు ఏవైనా కావచ్చు. అన దగ్గర నిరుపయోగంగా పడివున్న వాటి ఉపయోగం ఇంకొకరికుండచ్చు.
ఒక క్రిస్మస్ రోజు పై ఊరికి పోయిన నేను అక్కడో బ్రహ్మచారి మితృడి ఇంట్లో ఉన్నాను. ఉదయాన్నే అతనికో పార్సెల్ వచ్చింది. అందులో చూడ ముచ్చటైన పన్నెండు బంగారపు పూత ఉన్న వెండి చెంచాలు ఉన్నాయి. వాళ్ళక్క పంపిందిట. వెంటనే వంటింటి అలమరా తీసి ఇలాటి పాతవో పన్నెండు చెంచాలు తీసి అపార్టుమెంటు వాచ్ మన్ కి ఫోను చేసేడు. ఎవరినన్నా పైకి పంపమని. వాచ్ మన్ భార్యొచ్చింది. ఆమెకీ పాత పన్నెండు స్పూనులో ఇచ్చేశాడు. ఎంతో ముచ్చటపడి తీసుకుంది. "ఇవి నాకవసరమే కాని కొత్తవొచ్చేయిగా ఇప్పుడు లేదు" అన్నాడు నాతో ఉత్సాహంగా.
అతది ఉత్సాహం చూసి నా కళ్ళు తెరుచుకున్నాయి. మనం జీవించేది ఈ నాటిలో. రేపట్లో కాదు. ఇప్పటి మిగుళ్ళు పంచుకుంటే రేపటి తగుళ్ళ సరఫరా ఎదోలా సర్దుబాటవుతుంది.
మన అటకల మీద, పెరటికొట్లో, స్టోర్రూములో, బేస్మెంట్లలో, ఎన్నోరకాల వస్తువులు వృధాగా పడుంటాయి. వాటి అవసరం ఎక్కడో తప్పనిసరిగా ఉండే ఉంటుంది.
ఒకావిడ తనింట్లో మిగిలనవాటిని రోజూ శుభ్రం చేయించి పక్కన పెట్టేది. ఏ కుటుంబానికైనా అవసరమనిపించినప్పుడు అతి మర్యాదగా, "మా కొళాయి ప్లాస్టిక్కు గొట్టం అనవసరంగా పడివుంది అటూ ఇటూ వెళ్తున్నప్పుడు కాళ్ళకడ్డం పడ్డమే కాని మరో వినియోగం లేదు. మీరేమీ అనుకోకపోతే వాడుకోండి. ఉచితంగా ఇస్తున్నాననుకోకండి. మీరు దాన్నుపయోగించడమే నాకు ఆనందం." అనేది. చుట్టుపట్లవారిలో పెద్ద దిక్కుగా మంచి పేరుతెచ్చుకుంది.
***
ఎడ్ అని మా మావయ్య ఉండేవాడు. అతని దగ్గర ఒక అపురూపమైన పింగాణీ కప్పు ఉండేది. దాని ఉపయోగం అతనికి లేదు. అలమరలో అందరికీ కనిపించేల ఉంచేవాడు. ఇటువంటి అపురూప వస్తువులు సేకరించే ఒకాయనకీ కప్పు నచ్చింది. అతనిచ్చే ధర మా మావయ్య ఒప్పుకోడు. కేవలం వ్యక్తిగత అభిరుచితోనే సేకరించే అతను మా మావయ్య అడిగిన ధర చెల్లించలేడు. చాలా యేళ్ళ పీకులాట అయింది కాని మావయ్య కప్పు అమ్మేడు కాదు. చివర్రోజుల్లో మంచమ్మీద ఉన్న మావయ్య అన్నాదు. నువ్వు ఇచ్చీమన్నప్పుడే ఇచ్చీ వలసిందిరా అబ్బాయ్. డబ్బు డబ్బు అని దేవుళ్ళాడేను. ఇప్పుడది నేను పట్టుకుపోతున్ననా ఏం. అతణ్ణి పిలిపించి ఊరికే ఇచ్చేయ్ అని.
యాక్సెల్ ముంథే అనే ఆయన వాక్యం నాకు గుర్తొచ్చింది: "నువ్వుంచుకున్నది కాదు ఇచ్చిందే కలకాలం నిలుస్తుంది" అని.
***
మరో ఉదాత్తమైన మిగులు - నైపుణ్యం. మా చుట్టం ఒకాయన మంచి రచయిత. ఒకసారి ఏదో శ్రద్ధగా రాస్తూంటే ఏమిటని అడిగేను. మా కజిన్ కోసం ఒక రచన. నా రచనల నుంచి కుటుంబానికి సరిపడినన సంపాయించేను. రాసే తెలివి ఇంకా ఉంది. అడిగినవాళ్ళకి రాసిపెడుతున్నాను అని. పూర్తయేవరకు తనకి చెప్పేవు సుమా. సస్పెన్సు. అని నవ్వేడు.
***
నా మట్టుకి నేను, మిగులు పుస్తకాలు ఇస్తూంటాను. పుస్తకాలు ఉంచుకోదగ్గ సంపద. ఉపయోగపడేవి, స్ఫూర్తినిచ్చే పుస్తకాలైతే అవసరపడినప్పుడు, కొంచెం డీలా అనిపించినప్పుడు తెరిచి చదువుకోవచ్చు. ఇలా అందరికీ అనిపించేదే కదా.
అందుకని పుస్తకాల నించి నేను పొందాల్సిన స్ఫూర్తి పొందేననిపించినప్పుడు కావలసినవారికి ఇచ్చెస్తాను. అరువివ్వడం కన్నా అసలిచ్చెయ్యడమే నాకు అలవాటు. తెలిసినవారికే కాకుండా కొత్తగా పరిచయమై ఒక విషయంలో ఆసక్తి ఉన్నవారైతే, దానికి సంబంధిన పుస్తకాన్ని వారికివ్వడమూ నాకిష్టం.
నార్మా ఎస్ షాల్ అనే ఆమె ఇలా అంటారు: "మన వద్దనున్న ప్రతిదీ మనకి చేబదులే. ఏదీ తీసుకుపోలేము. అవసరమైనదే ఉంచుకుని అక్కర్లేనిది ఇచ్చెయ్యడమే ఉత్తమం - ఇప్పుడే."
***
పుచ్చుకొనుటలో రాజసం
అన్నె మారో లిండ్బెర్గ్ రీడర్స్ డైజెస్టులో ఒకసారి, ఎడ్వర్డ్ షెల్డన్ అనే ఆయన గొప్పదనం గురించి ఇలా రాసింది. "ఎవరిచ్చినదాన్నైనా అతనెంత దయతో అనుగ్రహంతో స్వీకరిస్తాడంటే అతని చేతిలో పడ్డ వస్తువు విలువ దానితో పెరుగుతుంది. అతనికివ్వడమే ఒక అపూర్వానుభూతి" అని.
ఇవ్వడమెంత సౌజన్యమో పుచ్చుకోవడమూ అంతే. లీ హంట్ నూరేళ్ళ క్రితం రాశాడు : "సహృదయంతో సుహృద్భావంతో స్వీకరించడం తిరిగిచ్చేందుకు అసలేమీలేకున్నా ఎంతో ఇచ్చినంత గొప్పది" అని.
మనం ఏదైనా ఇచ్చినప్పుడు అవతలివారు మొహం చిట్లించుకునో, అనుమానిస్తేనో ఎలా వుంటుంది? అవతలివారిచ్చినప్పుడూ అంతే. ఇచ్చే ప్రక్రియ ఓ నిప్పు రవ్వ అయితే ఉత్సుకత, ఔదార్యాలతో పుచ్చుకునే ప్రక్రియ ఆ రవ్వను ఇరు హృదయాలను ప్రకాశమానం చేసే స్నేహ జ్యోతిగా మారుస్తుంది. తిరస్కారమూ అనుమానమూ దానిపైన నీరు చల్లి నిరుత్సాహపరుస్తాయి.
ఎవరైనా నిజయితీగా ప్రశంసించినప్పుడు వాటిని అంతే నిజాయితీతో స్వీకరించాలి. మ మేనకోడలు తనకొచ్చిన బహుమతి, ప్రశంస ఏదైనా ఎంతో ఉత్సాహంతో స్వీకరించి అందుకు కృతజ్ఞతలూ అంతే ఉత్సాహంగా చెబుతుంది. అందుకే తనకేదైనా ఇవ్వడం, మెచ్చుకోవడం మా అందరికీ సరదా. తన వివరణలు మొక్కుబడిగ అనిపించవు. ఈ గౌను బాగుందమ్మ అంటే అమ్మె ఎంచింది అంటుంది; ఇంటి డెకరేషను ఎంతా బాగుందో అంటే ఫలానావారు ఫలానా పుస్తకంలో రాసింది చదివి చేసేను బాబాయ్ అంటుంది. తనకి ప్రశంసలు ఇష్టమే అయినా అవి చెందాల్సిన అసలువారిని మర్చిపోను అంటుంది. తరవాత ఆమె స్పందన తీసుకున్న క్షణంలోనే హడావిడిగా కాక, అప్పటికి తగినంత సంతోషాన్ని ప్రదర్శించి తగిన అవకాశం వచ్చినప్పుడు ఇంత ఉత్సాహంతోను తన బాకీ చెల్లించుకుంటుంది. ఇలా ఆమె కృతజ్ఞతల ఖాతా ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటుంది.
ఇవ్వడమంత బాధ్యతాయుతంగాను ఉండాలి పుచ్చుకోవడం. ఎంత ఆప్తులనుంచైనా ఎటువంటి బహుమతీ విషయంలోను ఆ ఎవడికోసం వస్తుందిలే అన్నట్టు వ్యవహరించకూడదు. ఆఖరికి భార్యా భర్తల మధ్య కూడా ఇచ్చిపుచ్చుకునే కళలో హుందాతనమూ ఉత్సాహమూ నిజాయితీ ప్రస్ఫుటమవాలి.
***
మాకు తెలిసిన ఒక పెద్దాయన భార్య చాలా కాలం పాటు మంచం పట్టింది. అయినా క్రమం తప్పక అతను తోటలో అటూ ఇటూ తిరుగుతూ కొత్తగా విచ్చుకున్న పువ్వేదైన కోసి ఆమెకి బహూకరించేవాడు. ఆమె నిండు మనసుతో నవ్వి దాన్ని చూసుకునేది.
***
అప్పుడప్పుడు ఒక ధన్యవాదం సరిపోదు. నాదగ్గరున్న లోహశాస్త్రం పుస్తకం మా మేనల్లుడికిచ్చేను. థాంక్యూ మావయ్యా అన్నాడు అప్పటికి. రెణ్ణెల్లతరవాత మూడు పేజీల ఉత్తరం రాసేడు. సరైన సమయంలో అవసరమనిపించినప్పుడు దొరికిన ఆ పుస్తకం తనకెంత ఉపయోగపడిందో వివరిస్తూ.
***
మాట సాయం
ఒక చర్చి ఫాదర్ గారు చెప్పినట్టు మనందరికి మనమనుకున్నదానికన్న ఎక్కువ పలుకుబడి ఉంటుంది. అదుపయోగించి మాటసాయం చెయ్యొచ్చు. ఎలిహూ రూత్ అనే ఆయన అంటారు: మందిలో ఉన్నప్పుడు పైకి రావడం రెండు రకాలు. పైకెక్కుతున్నవాళ్ళ కాళ్ళు లాగి మనం పైకిపోవడం, పక్కవాళ్ళని పైకి లాగుతూ వాళ్ళతో కలిసి పైకి పోవడం. వివేకులు పక్కవాళ్ళని తొక్కి పైకెళ్ళే నీచానికి దిగరు.
మాటసాయమూ పలుకుబడుల సాయానికి ప్రాతిపదిక మన స్నేహ పరిధి విస్తరించుకోవడం, మన ఎదుగుదలనూ చూసుకోవడం. అందర్నీ ముందుకుతోసే చాకిరీ వీరుళ్ళా కాక పరస్పరం భావయంతం అని భగవద్గీతలో చెప్పినట్టు ఒకరికొకరి సహకారంతో ముందుకు నడవడం.
***
భంగపాట్లూ అవీ
పుచ్చుకునేటప్పుడు బతుకు తెరువుకోసం ఎన్నెన్నో అవమానాలని చిన్నతనాలని భరిస్తుంటాం, ఇచ్చేటప్పుడూ అంతే కనక నిరుత్సాహపడరాదు.
ఒకాయన నాకు రాసేడు: "మొదట్లో మీ ప్రవృత్తి చూసి దీని వెనక ఏదో స్వార్ధం ఉందనుకున్నాను. వీలు దొరికినప్పుడల్లా అవమానించాను. కాని నిలకడ మీద మీ నిజాయితీ అర్ధమయింది. సిగ్గుపడుతున్నాను. మీ స్ఫూర్తితో నేనూ నాకు తోచింది చేస్తాను" అని.
ఇచ్చే సంకల్పం బలంగా ఉన్నప్పుడు తిరస్కారాలూ అనుమానాలూ అవమానాలూ ఉంటయనుకునే సిద్ధపడాలి. ముందటి పెద్దాయన రాసినట్టు నిలకడ అలవాటును బలపరుస్తుంది.
ఒకావిడ రచన బాగున్నదని ఒక రచయితకి రాస్తే అతను బదులివ్వలేదని కుంగిపోయింది. నాపుస్తకాన్ని చదివినాక కుదుటపడింది. అప్పట్నించి అటువంటి తిరస్కారాలు ఎదురైనప్పుడు తలమీంచి కొంత చుండ్రు రాలిపోయిందనుకుని ముందుకు సాగిపోవడం అలవాటు చేసుకుంది. అయితే ఎదో తిరిగి పొందాలి అని ఇచ్చినప్పుడు ఇటువంటి అలజడి సహజం. రచయితలు సంగీతకారులు వంటి సృజనశీలురు ప్రపంచాన్ని ఆహ్లాదమయం చేసేవారు. వారి కాల్పనిక కౌశలాగ్నికి మన ప్రశంసలే ఆజ్యం. కనుక మన ఉత్తరాలకీ అభినందనలకీ అటునుంచి ఏమీ రాకపోయినా మనది లోకోపకారమే - వారిని మరింత కళాసృష్టికి ప్రోత్సహిస్తుంది కనక.
ముగింపు
ఈ ఇచ్చే ప్రవృత్తిని మరీ సీరియస్ గా తీసుకోకండి. అప్పుడే లోకమూ లోకులూ లోకంపోకడ మన ఉత్తేజాన్ని భంగపరచకుండా ఉంటాయి. ఇచ్చే సంకల్పం మీకున్నప్పుడు దానిని నీరుగార్చే అవకాశం లోకానికివ్వకండి. మీలోని హాస్యప్రియత్వాన్ని వదులుకోకండి. మీ లక్ష్యం సమాజాన్ని వాసయోగ్యం చేసేందుకు నిజాయితీ గల మీవంతు తోడ్పాటే కాని లోకాన్ని ప్రసన్నం చేసుకోవడం కాదు. ఇంకా ఇదో సేకరణ హాబీ. నాణేలూ స్టాంపులూ సేకరించి భద్రపరుచుకుంటే కొందరు నవ్వుతారు. హాబీ ఒదులుకుంటున్నామా? ఇదీ అంతే.
ఎక్కువగా ఒచ్చే వెటకారాలు బాగా బేరాలాడగలిగినవాళ్ళు, తిమ్మిని బమ్మి చేసి పైకి పోయేవాళ్ళు, నేనే ముఖ్యం ఎవరెటుపోయినా అనే తరహా "పుచ్చుకునే" మనస్తత్వాల నించి వస్తాయి. పుచ్చుకోవడమే ఆదర్శమైనప్పుడు ఇవ్వడం హాస్యాస్పదం అనిపించడం సహజం. ఇవన్నీ గుర్తుంచుకుని స్థిరంగా సాగే ఉద్దేశమున్నప్పుడే ఈ ప్రవృత్తి ఎంచుకోవలని నా సలహా.
ఆఖరుగా, ఎప్పుడో ఆనందం కలుగుతుందని చేసేపనుల కన్న చేసే పనే ఆనందమయినపుడు ప్రతి క్షణమూ ఉత్తేజభరితమవుతుంది. ఆనందం జీవనవిధానం. లక్ష్యం కాదు.
No comments:
Post a Comment