Sunday, January 17, 2021

 

ఆనందమార్గం 



ముందుమాట 

చాలామటుకు, లోకపుతీరు గురించిన అవగాహనాలెమి, పొరపాటుగ అర్ధం చేసుకున్న నైతిక నియమాలు, కట్టుబాట్లు వంటివి, మనుషులకైనా జంతువులకైనా అనందానికి ఏదైతే ముఖ్యమో దాని పట్ల పెంపొందాల్సిన అభిరుచిని నాశనం చేసి ఖిన్నతనూ విషాదాన్ని మిగులుస్తాయని నేను నమ్ముతాను.   ఇవన్నీ వ్యక్తి స్వాధీనంలో ఉండేవే.  మరియు, సగటు జీవనాదాయానికి ఢోకాలేని పక్షంలో, వ్యక్తి సంతోష సాధనకి ఏది అవసరమో అది సూచించే ప్రయత్నం  చేస్తాను.

బహుశా నేను ప్రతిపాదించే తత్వానికి పూర్వపీఠికగా నా స్వీయచరిత్రనించి రెండు ముక్కలు.   పుట్టినప్పుడు నాకు సంతోషంలేదు.  బాల్యంలో నేర్చుకున్న ప్రార్ఢనలో నాకు నచ్చిన వాక్యం, "లోకంతో విసిగిపోయాను పాపంతో వంగిపోయాను".  నాకప్పుడు ఐదేళ్ళుంటాయి.  డెబ్భై ఏళ్ళు బతుకుతానని అనుకున్నా అందులో పధ్నాలుగోవంతు మాత్రమే ఈ మాదిరి ఈడ్చుకొస్తే ఇక రాబోయే భావి జీవితం ఎంత దుర్భరంగా ఉండబోతొందో ఊహించుకుంటేనే గుండే గుభేలుమనేది.   కౌమారదశ అంతా జీవితంపట్ల విరక్తితో ఆత్మహత్య చేసుకుందామనుకున్న నేను, గణితశాస్త్రం మీది ఆసక్తితో ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

గతానికి భిన్నంగా ఇప్పుడు జీవన మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాను.  గడుస్తున్న ప్రతి సంవత్సరంతోనూ నా సంతోషం వృద్ధినందుతోందని కూడా చెప్పగలను.  కొంతవరకు దీనికి కారణం, నాకు కావాలనుకున్నవేమిటో తెలుసుకోగలగటమూ, క్రమక్రమంగా వాటినన్నిటినీ సొంతం చేసుకోవడమూ.   ఇంకొంతవరకు నాకు కావాలనుకున్న మరికొన్నింటిని వదులుకోవడం - ఉదాహరణకి ఒక విషయంలో బహుముఖ ప్రజ్ఞ కుదరనప్పుడు అది సాధించదగినది కాదనుకోవడం.    ముఖ్యంగా నాతో నేను, నాలో నేను గడిపే సమయాన్ని చాలామటుకు తగ్గించుకోవడం.   

చాలామంది మిగతా ఆధ్యాత్మిక విద్యార్ధుల లాగా నాక్కూడా నేనొనరించిన తప్పులు, పాపాలు, లోపాల గురించి నిరంతరం ఆలోచించే అలవాటే ఉండేది.  తత్ఫలితంగా నేనో వ్యర్ధజీవిననే నమ్మకం బలపడనారంభించేది.  

క్రమక్రమంగా నన్ను గురించి నా లోపాలగురించి ఉదాశీనంగా ఉండటం,  ధ్యాసను బయటి విషయాలమీద లగ్నం చెయ్యడం నేర్చుకున్నాను - ప్రస్తుత ప్రపంచ స్థితి, వివిధ రంగాల గురించిన అవగాహన, నేనభిమానించే మిత్రుల యోగక్షేమాలూ - ఇలాగ.  అయితే బయటి వ్యాసంగాలు వాటి తాలూకు కొన్ని తలనొప్పులు తెస్తాయి కాదనను - ప్రపంచం యుద్ధాగ్ని జ్వాలలకు ఆహుతికావచ్చు, ఆశించిన పరిజ్ఞానం ఎంత కష్టపడ్డా బుర్రకెక్కకపోవచ్చు, ఆత్మీయులు చనిపోవచ్చు.     అయితే ఈ బాధలేవీ, నిరంతర చింతతో మనమీద మనకి పెరిగే ఏవగింపు చేసినట్టు, మన జీవన ధర్మాన్నీ నాణ్యతనూ నాశనంచెయ్యవు.  బయటి విషయాలమీద ఏర్పరచుకునే ప్రతీ కొత్త శ్రద్ధా, ఆ శ్రద్ధను సజీవంగా ఉంచుకున్నంతవరకు, నిరుత్సాహాన్నీ నైరాశ్యాన్ని దరికి చెరనియ్యదు.    ఇందుకు భిన్నంగా మనమీదనే నిలిపిన మన ధ్యాస మాత్రం, ఎటువంటి ప్రయోజనకర కార్యానికీ మనని పురిగొల్పదు.  మహా అయితే ఒక డైరీ రాయిస్తుంది, ఆలోచనల అధ్యయనం చేయిస్తుంది, లేక ఒక సన్యాసిగా మారుస్తుంది.   అయితే సన్యాసి కూడా ప్రశాంతంగాను ఆనందంగాను ఉండేది తన గురించిన చింతనవల్ల కాక మఠం నియమాలననుసరించి నిర్వర్తించే దినచర్యలోనే.  మతానికి ఆపాదించి అతడు చెప్పుకునే ఆనందం అతనికి మఠ పరిసరాల్ని చిమ్మడం వలన కూడా లభిస్తుంది - ఆపని అతనికి నిర్దేశించినదయితే.  అంతరంగపు అలజడితో సతమతమయే దురదృష్టవంతులకి బహిరంగ కర్మాచరణమూ క్రమశిక్షణే మార్గాంతరం.  

అనురక్తి 

ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా వుండే చాలామందిలోని ఒక ముఖ్య లక్షణాన్ని ఈ అధ్యాయంలో నేను ప్రస్తావిస్తాను. అదే అనురక్తి.

ఉదాహరణకి భోజనానికి కూర్చునే కొందరి ప్రవర్తనని గమనించండి.  భోజనం ఎంత రుచికరంగా ఉన్నా కొందరి మొహంలో ఎదో విసుగు, అనాసక్తి.  బహుశ అంతవరకు తాము తిన్న ప్రతీ భోజనమూ ఇంతకన్న మధురమూ రుచ్యమూ అయి వుండాలి.  ఆకలి వారి అనుభవంలో లేదు.  సమాజం నిర్దేశించిన వందలాది రోజువారీ విధుల్లో భోజనం కూడా ఒకటి వారికి.  మిగతావాటిలాగే భోజనం కూడా విసుగు, పైగా ఆయాసమూ కానీ ఎలాగోలా ముగించాలి తప్పదు మిగతావేమాత్రం ఇంతకన్న మెరుగని.  ఇంకొందరు రోగులు.  భోజనం వల్ల శక్తి కలుగుతుందని, ఎంతో కొంత ఎలాగోలా కడుపులో పడెతే మంచిదని వైద్యులు చెప్పేరు కనక వారు భోంచేస్తున్నారు.  పాకశాస్త్ర నిపుణులైతే ఎలావండినా నచ్చక అసంతృప్తులై ఎదో కానిచ్చేమనిపిస్తారు.  తరవాత తిండిపోతులు.  రేపన్నది లేనట్టు, క్షణం ఆలస్యమైతే పాత్రలు ఖాళీ అయిపోతాయన్నట్టూ వండినవన్నీ కొసరి కొసరి పీకలమొయ్యా కుక్కుకుని తరవాత గంటలతరబడి ఆపసోపాలు పడతారు.   ఆఖరుగా ఆకలిగొని ఉన్నవారు.  వంట లోని రుచిని పూర్తిగా ఆస్వాదిస్తూ తిన్నప్పుడూ తిన్నతరవాతా కూడా హాయిగా ఉండేలా తిని లేచేవారు.  

జీవితమనే విస్తరి ముందు కూర్చున్నవారు కూడా ఇటువంటి అనేక రకాల మనః స్వభావాలతో కూర్చుంటారు.  అందరిలోకీ సంతోషంగా ఉన్నవాడు ఇంతకు ముందు పేరాలో ఆఖర్న కూర్చున్నవాడన్నమాట.  ఆకలి భోజనానికెలాగో, అభిరుచి జీవనానికలాగ.  భోజనం విసుగనిపించిందంటే అతను బైరన్ తరహా చింతాక్రాంతుడన్నమాత.  అదో కర్తవ్యంగా ముక్కుబడిగా తిన్నవాడు సన్యాసితోనూ, తిండిపోతు ఇంద్రియలోలునితోనూ పోల్చదగ్గవారు.  వంట తెలిసిన భోజనప్రియుడు అన్నిటికీ వంకలు పెట్టి ప్రపంచమిచ్చే సంతోషంలో సగానికి పైగా ఎందుకూ కొరగాని పిప్పి అనుకునే రకం.  విచారించాల్సిందేమంటే, తిండిపోతు తప్ప ఇ గుంపులోని మిగతావాళ్ళందరూ జీవితం పట్ల అసంతృప్తులూ, ఆ నైరాశ్యమూ నిర్వేదమూ కలిగిన శుభలక్షణసంపన్నులైన తాము, జీవితాన్ని సంతృప్తితో ఆస్వాదిస్తున్నవానికంటే ఉత్తములమనే భ్రమలో జీవించేవాళ్ళు.   భోజనం నచ్చి తృప్తిగా తినడం, జీవన ప్రయాణంలోని ప్రతి మజిలీని ఆసక్తీతోను అనురక్తితోను ఆనందించడం వారిదృష్టిలో క్షుద్రమూ నీచమూ.  వారి భ్రాంతి కిటికీలకు భ్రమల పరదాలు తగుల్చుకుని బయట కేరింతలతో ఉత్సాహజీవనం సాగించేవాళ్ళని అయ్యయ్యో చేజేతులా నాశనం చేసుకుంటున్నాడే అని వాపోతారు వీరు.  ఈ రకం వారిమీద నాకేమీ జాలి లేదు.  కాని ఇదో జబ్బనీ, ఇటువంటి మౌఢ్యం కొన్ని పరిస్థితుల కారణంగా పేరుకొంటుందని, అది వుందని గ్రహించిన తక్షణమే వీలైనంత త్వరఘా నివారించాలి తప్ప అదో ఘనతనో జ్ఞానమనో మురిసిపోకూడదని నా అభిప్రాయం.  

ఉదాహరణకి ఒకరికి స్ట్రాబెరీస్ అంటే ఇష్టం, ఇంకొకరికి ఇష్టం లేదు; ఇష్టంలేనివాడు ఏవిధంగా గొప్ప? స్ట్రాబెరీలు గొప్పవని కానీ కావని కానీ చెప్పేందుకు స్పష్టమైన, వ్యక్తి నిరపేక్ష సూత్రం ఎక్కడైనా ఉన్నదా?  అవి ఇష్టమున్నవానికి అవి గొప్ప; లేనివానికి కాదు.  కాని దాన్నిష్టపడేవాడికి అవి తిన్న ఆనందం తప్పక దొరుకుతుంది.  రెండోవాడికి దొరకదు.  ఇద్దరికీ సమాన పరిమాణంలోనే లభించిన  జీవితంలో అంత మేరకు మొదటివాడు ఎక్కువ సంతోషి, జివితంతో సామరస్యంగా ఉండేందుకవసరైన మార్గాల్లో ఒకటి ఎక్కువకలిగినవాడూ.  ఈ చిన్న విషయంలో నిజమైనది అన్ని పెద్ద విషయాల్లో కుడా నిజమైనదే.  ఆ లెక్కన ఫుట్ బాల్ ని ఇష్టపడే వారు ఇష్టపడనివారికంటే అంత మేరకు గొప్ప.  పుస్తక పఠనం అంటే అభిరుచి ఉన్నవారు అది లేనివారికంటే ఇంకా అధికులు.  ఎందుకంటే చదువుకొందుకు పుస్తకాలు దొరికినంత సులభంగా చూసేందుకు ఫుట్ బాల్ ఆట దొరకదు.  ఒకరికి ఎన్ని విషయాల్లో ఆసక్తి ఉంటుందో అనందానికి అన్ని అవకాశాలు లభించి విధీ తలరాతా వంటి ఊహల మీద ఆధారపడే అవసరం అంత తక్కువ ఉంటుంది.  ఒకటి చేజారిపోతే చేపట్టేందుకు ఇంకొకటి సిద్ధంగా వుంటుంది.  అయితే ప్రతి విషయం మీదా ఆసక్తి పెంచుకొందుకు జీవితం అంత సుదీర్ఘమైనది కాదు.  మన రోజుల్లో ఉత్సాహం నింపేందుకు అవసరమైనన్ని చాలు.  క్రియాశూన్యంగా ఎప్పుడూ ఎదో చింతలో లీనమై సర్వ వర్ణ సుశోభితమైన ప్రపంచాన్ని కాదని తనలోని శూన్యం లొకే చూసుకుంటూ రోజులు వెళ్ళపుచ్చే రకాలు మనకి తగులుతూనే ఉంటారు.  మనం గుర్తుంచుకోవలసిందల్లా వారి చింత, శూన్యవాదమూ ఏమంత ఘనమూ దివ్యమూ కావనేది మాత్రం.

రెండు సాసేజ్ చేసే మెషిన్లు ఉండేవి.  రెండూ నాణ్యమైన సాంకేతికతతో తయారైనవి - పందితో రుచికరమైన సాసేజులు చేసేందుకు.  ఒకటి తన అనురక్తిని జారిపోనివ్వకుండ ఎంతో ఉత్సాహంతో పనిచేసి లెక్కలేనన్ని సాసేజ్ లని చేసింది; రెండోది అంది కదా - చ చ పందేమిటి అసయ్యంగా?  అంతకన్న ఉత్తమమైన కాలక్షేపాలు నాకున్నాయి.' అంటూ అది పందిని నిరాకరించి తనలోకి తాను చూసుకుంటూ ఆనందిస్తున్నాననుకుంది.  అయితే ప్రకృతి సిద్ధంగా పడాల్సిన తిండి లోపల పడకపోయేసరికి అది నీరసించింది.  నీరసమెక్కువయే కొద్దీ తన శూన్యవాదం ఎంత మూర్ఖత్వమో అన్న అభిప్రాయం బలపడసాగింది.  అత్యుత్తమ సాంకేతికతతోను నైపుణ్యంతోను నిర్మించిన తన శరీరోపకరణాన్ని నిరుపయోగపరిచి దాని సహజ కౌశలన్ని మరుగు పర్చి దాంతో ఏమి చెయ్యవచ్చో మరిచిపోయింది.  ఈ రెండో యంత్రం అనురక్తినీ ఆసక్తినీ కోల్పోయిన వాని వంటిది కాగా, మొదటిది అవి నిలబెట్టుకున్న వాని వంటిది.  మన మెదడు దానికి మనం నివేదించిన విషయాలను మన ఊహకందనన్ని విధాలుగా కలిపి కొత్త విషయ సృష్టి చెయ్యగల సంక్లిష్ట యంత్ర విశేషం.  అయితే బయటి విషయాలు అందని పక్షంలో అది రెండో సాసేజ్ యంత్రంలాగే చతికిలపడి మొద్దుబారిపోతుంది.   అయితే తేడా, సాసేజీ సరంజామాను ఆ యంత్రానికి ఎవరో అందిస్తే, మెదడు మాత్రం తన సరంజామా బయటినించి తనే సమకూర్చుకోవలసి ఉంటుంది.  మనకున్న ఆసక్తి, అభిరుచుల మేరకే బయటి సంఘటనలు ప్రభావశీలమైన అనుభవాలుగా మారుతాయి.  మనకి ఆసక్తి కలిగించని వాటినించి ఏమీ తయారవదు.    నిరంతరం తనలోని శూన్యాన్నే చూసుకునే వారికి చెప్పుకోదగ్గ ప్రయోజనమేమీ కలగక పోగా, కళ్ళు తెరిచి ప్రపంచాన్ని పరికిస్తూ అందులో లీనమై జీవించేవార్కి ఒంటరితనంలో తనలోకి తాను చూసుకున్నప్పుడు తాను చూసిన అనేకానేక ప్రాపంచికానుభూతుల్లో తనకి ఆసక్తి కలిగించినవాటిని తగురీతిని మిళాయించి జీవితాన్ని మరింత సుసంపన్నం చేసే నూతన ప్రవృత్తుల సృష్టి సాధ్యపడుతుంది.  

అనురక్తి అనేక విధాలు.  షెర్లాక్ హోమెస్ రోడ్డు మీద పడ్డ టోపీని చేతుల్లోకి తీసుకుంటాడు. కొంత పరిశీలనగా చూసి అది పోగొట్టుకున్న వ్యక్తి తాగుడుకి బానిసై భ్రష్టుడైపోయేడని, అతని భార్యకి అతని పట్ల అంతకు ముందున్నంత అపేక్ష లేదని, తెలుసుకుంటాడు.  అతి సామాన్య వస్తువులు సంఘటనల నించి ఇంత పుష్కలమైన ఆసక్తిని పొందేవారికి జీవితం ఎప్పుడూ నిరుత్సాహంగానూ రసహీనంగానూ అనిపించదు.  ఊరి శివార్లో సాయంత్రంపూట నడుస్తుండే మనం చూచే విషయాలు ఎన్నుంటాయో ఆలోచించండి.  పక్షులు కొందరికి, పచ్చదనం కొందరికి, పృథివి కొందరికి, పంటలు కొందరికీ ఆసక్తి కలిగించొచ్చు.  ఇటువంటి వేటిలో ఆసక్తి కలిగినవారైనా దాన్ని పెంచుకుని అందరికీ సమానంగానే దఖలుపడిన ఈ ప్రకృతితో సామరస్యాన్ని పెంచుకుని ఏ ఆసక్తీ లేనివారికన్న సుసంపన్నమైన జీవనం గడిపే అవకాశం ఉంటుంది.      

మళ్ళి, సమాజంలో ఒకరి పట్ల ఒకరి నడవడి ఎన్ని రకాలుగాను విభిన్నంగాను ఉంటుందొ చూడండి.   ఒక సుదూర రైలు ప్రయాణంలో ఒకరికి తనలాగే ఎంతో మంది ప్రయాణిస్తున్నారన్న స్పృహే ఉండదు, వేరొకరు ప్రయాణీకులందర్ని నఖశిఖపర్యంతమూ శోధించి వారి తత్వాలనూ వ్యక్తిత్వాలనూ ఇంకా వారి గుట్టు మట్టులనూ కూడ అంచనా వేస్తారు.  తమ గురించిన తమ అభిప్రాయాల్లో ఎంత వైరుధ్యముంటుందో ఇతరులపై తమ అభిప్రాయం కూడా అంతే వైరుధ్యం కనపరుస్తారు.  కొందరికి ఎటువంటి వారి సామీప్యమూ విసుగే; ఇంకొందరు స్వల్పపరిచయంతో అల్లుకుపోయి సన్నిహితులౌతారు.    కొందరు చాలా దేశాలు తిరుగుతారు, ఖరీదైన హోటల్లలో దిగుతారు, ఇంటి భోజనం వంటిదే వండించుకు తింటారు, ఇంట్లో భోజనాలప్పుడు చేసే సంభాషణే నెరుపుతారు.  ఇల్లు చేరగానే ఈ సంచారపు బడలికా విసుగూ నించి ఎంతో ఉపశమనమూ ఊరటా పొందుతారు.  ఇంకొందరు, వెళ్ళిన ప్రతి చోటా, అక్కడ ఏది ప్రత్యేకమని చూస్తారు.  స్థానికులకు సన్నిహితులై కొత్త ప్రవృత్తులను గ్రహించి చారిత్రకంగా సామాజికంగా తమకి ఆసక్తి కలిగించే అంశాలు సేకరించుకుని, స్థానిక రుచులు ఆస్వాదించి అక్కడి కట్టూ బొట్టూ పలుకూ పాటా మూటగట్టుకుని ఎంతో సంతృప్తితో ఇల్లు చేరుతారు - రాబోయే రోజులను మరింత ప్రకాశవంతం చేసుకునేందుకు.     

ఇటువంటి అన్ని విభిన్న పరిస్థితుల్లోను ఆసక్తీ అనురక్తీ ఎక్కువ కలిగినవారు అవిలేనివారికన్న ఉత్తమమైన స్థితిలో ఉంటారని చెప్ప సందేహం అక్కర్లేదు.  వారికి ప్రతికూల పరిస్థితులూ ప్రయోజనకారులౌతాయి.   ఓ సారి ఓ చైనా గుంపులోను ఇంకోసారి సిసిలీ గ్రామంలోను గడిపిన అనుభవం నాకు గుర్తుంది - అప్పటికి పెద్దగా ఆనందం అనిపించకపోయినా.   సాహసికులు పడవప్రమాదాలు, తిరుగుబాట్లు, భూకంపలు, ఉత్పాతాలవంటి భీభత్సాలను ఆనందిస్తారు - తమ ఆరోగ్యానికి ఢోకా లేనంత మట్టుకు.  "ఓహో భూకంపమంటే ఇదన్నమాటా" అనుకునే ఆ కొత్త అనుభవం ఆ మేరకి వారి జ్ఞానాన్ని పెంచినందుకు ఆనందపడుతూ.  అయితే వారు విధికి అతీతులు కారని చెప్పను.  అటువంటి అనుభవం వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే దానిమీది ఆసక్తి పోతుంది.  నాకు తెలిసిన కొందరు జీవిత చరమాంకంలో లేవలేని పరిస్థితిలో కూడ ఆసక్తినీ ఉత్సాహాన్ని కలిగుండటం చూసాను.   కొన్ని జబ్బులు ఆసక్తినీ అనురక్తినీ నాశనంచేస్తే, కొన్ని నిలుపుతాయి.  ఎటువంటివి ఎలా చేస్తాయో వైద్యనిపుణులు తెలిపితే బాగుణ్ణు.  బహుశః వైద్యశాస్త్రం ఇంకా అభివృద్ధి చెందితే మనం కొన్ని మాత్రలు వేసుకుని కావలసిన విషయాలపట్ల ఆసక్తిని పెంచుకోగలమేమో.  కాని అంతవరకు మటుకు మనం మన లోకపు తీరును పరిశీలించే జ్ఞానాన్నే నమ్ముకుని ఏవి ఎవరిలో ఆసక్తి కలిగిస్తున్నాయో, ఇంకొందరిలో ఏ స్పందనా కలిగించలేకపోతున్నాయో తెలుసుకోవలసిందే.  

అనురక్తి కొండొకచో సామాన్యమూ, ఇంకొండొకచో ప్రత్యేకమూ.  మరీ ప్రత్యేకం కూడా కావచ్చు.  బోరో అనే కథలో ముఖ్య పాత్రధారి తాను అమితంగా ప్రేమించే భార్యని పోగొట్టుకుంటాడు. లోకం ఎడారిలా అనిపిస్తుంది. అలా అలా యథాలాపంగా పింగాణీ పాత్రలమీదున్న చైనా అక్షరాలు చదువుతూ ఆ భాష మీద మక్కువ పెంచుకుంటాడు.  కాని ఆ భాష నేర్పే పండితుడు ఫ్రెంచిలోనే చెప్పగలడు. అందుకని ఇతను ఫ్రెంచి కూడా నేర్చుకుని ఆ మాధ్యమంతో చైనీస్ కూడా అధ్యయనం చేస్తాడు.  విశేషమేమంటే, ఈ కొత్త పాండిత్యం అతనికి జీవితంలో మరింకెందుకూ ఉపయోగపడలేదు.   కాని జీవితాంతం అదో ఉల్లాసకర వ్యాపకమై సాఫీగా నడిచింది.  ఈ మాదిరే కొందరు వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఇంకొందరు మనిషికి అక్షర పరిచయం అయినకాణ్ణించి వెలువడ్డ గ్రంథాలను సేకరించే పనిలో నిమగ్నమయారు.  ఎవరికి దేనిలో ఆసక్తో మొదట చెప్పడం కష్టం కాని, ప్రతివారూ తాము లీనమయేంత ఆసక్తి ఎదో ఒకదానిలో కలిగియుంటారని చెప్పవచ్చు.  ఆ ప్రేరణ గాని లభిస్తే, జీవితం నుంచి విసుగూ స్థబ్ధతా మాయమవుతాయి.  అసలు జీవితాన్నే ఆసక్తికరంగా గడిపేవారికన్న ఎదో ఒక వ్యాపకంలో మాత్రమే ఆసక్తి కలిగినవారికి లభించే సంతృప్తి పరిమితం.  ఎందుకంటే అది వారి కాలాన్ని పూర్తిగా భర్తీ చెయ్యలేదు, ఇంకా ఒకనాటికి అందులో నేర్చుకునేది ఇంకేదీ లేదని గ్రహిస్తే మళ్ళీ శూన్యమూ నిరుత్సాహమే.  

ఈ అధ్యాయం మొదట్లో మనం చూసిన భోజనశాలలోని ఒకడైన తిండిపోతుని మెచ్చుకొనేవారెవరు.  అత్యంత అనురక్తులను చూసి మెచ్చుకునేవారు వారికీ తిండిపోతుకీ నిర్వచనంలో పెద్ద వ్యత్యసమెం లేదని గ్రహించాలి.  ఇప్పుడు నిర్వచనాన్ని మరింత విశ్లేషించి తేడాలు చూద్దాం.

ప్రాచీనులు యుక్తాహారమూ యుక్త కర్మా అని అన్నిటా మితాన్ని బోధించారు.   ఫ్రెంచి విప్లవం దరిమిలా కాల్పనికవాదం ఆవిర్భవించి కోరికల నియంత్రణే పరమార్ధమన్నారు. దీని ప్రకారం బైరన్ రచనల్లోని నాయకులూ సంఘవిద్రోహకులయ్యారు.   

అయితే ప్రాచీనుల ఉపదేశమే సరైనది.  సంతృప్తికరమైన జీవనానికి అవసరమైన కార్యకలాపాలు సరితూకంలో ఉండలి.  ఇంకోటి కష్టమయేంత అతిగా దేనికీ అలుసివ్వకూడదు.  పాపం తిండిపోతు తిండికోసం మిగతావన్నీ త్యజిస్తాడు.  దానివల్ల జీవితంలో సంతోషం మృగ్యమవుతుంది.  తిండే కాదు ఇతర మోహాల తంతూ ఇదే.  జోసెఫిన్  అనే సామ్రాజ్ఞికి దుస్తుల పిచ్చి.  భర్త నెపోలియన్ ఆరంభంలో ఆమె బట్టల బిల్లులు మామూలుగానే చెల్లిస్తూ వచ్చినా అవి రానురాను అధికం కావడంతో ఆమెకి యుక్తజీవనాన్ని బోధించి ఇకపైన తను సబబనుకున్నంత మట్టుకే చెల్లిస్తానని గట్టిగా చెప్పేడు.  తరవాత ఒచ్చిన బిల్లులు చూసి ఆమెకి మొహం తిరిగింది; తర్జన భర్జన పడి ఒక పథకం వేసింది.  భర్తకింద పనిచేసే సైన్యాధ్యక్షుడిని రక్షణ నిధుల నుంచి అ కర్చు భర్తీ చెయ్యమంది.  ఆమెకి కోపం వస్తే కొలువుకి  ఉద్వాసన ఖాయమని గ్రహించిన అతడు వాటిని చెల్లిస్తూ వచ్చేడు.  ఇదెంతవరకు పోయిందంటే సరైన నిధుల్లేక ఫ్రెంచి సైన్యం తరవాత జరిగిన జెనోవా యుద్ధంలో చిత్తుగా ఓడిపోయింది.  ఇది కొన్ని పుస్తకాల నుంచి గ్రహించి ఉటంకించినది.   నిజమెంతో నాకు తెలీదు.    అది నిజమైనా అభూత కల్పనైనా, మితిమీరిన మోహావేశాన్ని సంతృప్తి పరుచుకోవడం కోసం మనిషి ఎంత దూరం పోతాడో అన్నదానికి మాత్రం ఇదో మంచి ఉదాహరణ. 

తాగుడు పిచ్చివారూ  మదపిచ్చివారూ కూడా ఈ ఉదాహరణకి సరిపోతారు.  అన్నిటా గుర్తుంచుకోదగిన సామాన్య సూత్రం ఒకటే.  ఏ విశేష అనురక్తీ సామాన్య జీవన నిర్వహణకి అవరోధం కాకూడదు.  

వాటినించి ఆనందం లభిస్తున్నట్టైతే దానివల్ల మన ఆరోగ్యానికి కాని, కుటుంబ సభ్యుల అభిమానానికి కాని, సమాజంలోని మన ఆదరణకి కానీ ఎటువంటి భంగమూ వాటిల్లరాదు.  ఈ పరిధులకు కట్టుబడే అన్ని వ్యసనాలూ ఆమోదయోగ్యమే.  మిగతావి కావు. 

ఒక బ్రహ్మచారి మిగతా జీవన విధానంతో జోక్యం లేనంతవరకు తన చదరంగ క్రీడా వ్యాసంగాన్ని ఎన్నిగంటలైనా కొనసాగించవచ్చు.  భార్య బిడ్డలూ ప్రవేశించి, ఈ వ్యాసంగం వల్ల కాలక్షేపం మాత్రమే ఫలితం అయితే దానికి భారీ కోత విధించాలి.  

తాగుబోతూ తిండిపోతులకు కుటుంబమూ సమాజాలతో ఏ నిమిత్తం లేకున్నా, ఆరోగ్యనష్టం కనక, నిమిషాల సుఖానికి యేళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం అవివేకం.  

అందరికీ కూడా, ఏ అలవాటైనా కొన్ని ముఖ్యాంశాల చట్రంలో ఇబ్బందిపెట్టక ఇమిడిపోగలగాలి.  అవి, ఆరోగ్యం, అభ్యాసంతో పెంచుకున్న ఉపాధి కౌశలం, కుటుంబపోషణకు తగినంత ఆదాయం,  అన్నిటికన్న అతిముఖ్యమైన భార్యా బిడ్డల సంక్షేమం వంటి సామాజిక బాధ్యతలు.  చదరంగంకోసం వీటిని అశ్రద్ధ చేసినవాడు తాగుడుకు బానిసైన భ్రష్టుడూ ఒకటే.  అయితే ఇతడి పట్ల చూపినంత అసహ్యం అతడిపై చూపం; ఎందుకంటే అటువంటి వారు అరుదు.  అటువంటి ప్రావీణ్యానికి కొంత బుద్ధివిశేషమూ అవసరం.

భగవద్గీతా గ్రీకుల మిత సిద్ధాంతమూ దీనినే వివరిస్తాయి.  

ఒక వ్యక్తి సాయంతం ఆడబోయే చదరంగాన్ని తలుచుకుని ఉల్లాసంతో రోజంతా మిగతా వ్యాపకాలు శ్రద్ధగా నిర్వహించుకున్నట్టైతే భాగ్యశాలి; దినచర్యను పక్కన పడేసి అదే వ్యాపకంలో మునిగిపోయేవాడు అందుకు వ్యతిరేకి. ఎందుకంటే ఇతగాడు యుక్తచేష్టస్య కర్మసు అన్న సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకోలేక జీవితాన్ని వృధాచేసుకుంటున్నాడు.  

ప్రముఖ రచయిత, తత్వవేత్త టాల్‌స్టాయ్ తన అపరిపక్వపు బాల్యదశలొ చూపిన ధైర్య సాహసాలకు గాను ప్రభుతం అతనికి వీరోచిత సైనిక పురస్కారాన్ని ప్రకటించింది.  అయితే దానిని అందుకోవలసిన రోజున అతడు చదరంగం ఆటలో నిమగ్నమైపోయి అది మానుకోలేక పురస్కారం వద్దనుకుంటాడు.  అయితే టాల్‌స్టాయ్ వంటి మహనీయునిలో ఇట్టి చాపల్యాన్ని తప్పు పట్టం కాని కూడూ గుడ్డా పెట్టని ఈ వ్యర్ధ వ్యాసంగానికి ఇంకో సామాన్యుడికైతే అంతా పెట్టిన చివాట్లతో తలవాచేది.

ఈ సిద్ధాంతానికి కొన్ని మినహాయింపులున్నాయి.  కొన్ని అత్యున్నత వ్యాసంగాల కోసం అన్నీ విడిచిపెట్టవచ్చు.  అందర్నీ విడిచిపెట్టి దేశంకోసం పోరాడి అసువులు బాసిన అమర వీరుడు, అతని నిష్క్రమణతో కుటుంబానికి ఆసరా పోయినా, అతడు నిందకు కాక స్తుతికర్హుడు.  అదే విధంగా ఒక మహోన్నత ఆవిష్కరణ కోసం ప్రయోగ శాలలో రోజులతరబడి పరిశోధించిన శాస్త్రవేత్త కుటుంబం ఇబ్బందులు పడినా అంతిమంగా అతనివల్ల జరగబోయే లోక కల్యాణం దృష్ట్యా అతని వ్యాపకమూ శ్లాఘ్యమే.  అయితే కర్మంచాలక అతడు విఫలుడైనప్పుడు నిందించుట అధర్మం.  అన్నివేళలా విజయాన్ని ముదస్తుగా అంచనా వెయ్యడం దుర్లభం. 

ఇంకో సంగతి - క్రీస్తు శకారంభ దినాల్లో సంసారాన్ని త్యజించి సన్యాసాశ్రమం పుచ్చుకున్నవారు ఆ రోజుల్లో కీర్తింపబడ్డారు.  ఇప్పుడైతే కుటుంబానికో దారి చూపి వెళ్ళాల్సింది అంటారు.  

అయితే ఇటువంటి విశేషానురక్తులకూ యావతో ఇంద్రియభోగాల వెంటపడేవారికీ మనస్త్వపరంగా కొన్ని వ్యత్యాసాలుంటాయని నాకనిపిస్తుంది.  అన్నిటినీ అశ్రద్ధ చేసే అమిత భోగేఛ్ఛకి కారణం పైకి కనబడని ఎదో కలత కావచ్చు.  తాగుబోతుల్లో ఇది ఇంచుమించు నిజం.  సాధారణంగా మనుషులు మరిచిపోయేందుకు తాగుతారు.  జీవితమంతా నిరాసక్తీ నిర్వేదమే అనిపించినవారు, ఉన్న తెలివితో ఏం చెయ్యాలో తెలియక, మత్తే ఉత్తమమనుకుంటారు.  

ఒక చైనా వేదాంతి అంటాడు: 'Me no drinkee for drinkee, me drinkee for drunkee.' నా మమకారం మందుమీద కాదు, మైకం మీద అని.  దుర్వ్యసనపరులందరికీ కూడా పదార్ధం మీద కాక అది కలిగించే భ్రాంతిపైనే మోహం.  

అయితే ఒక పని చేశాక ఎక్కే మత్తు కన్న పనే మత్తు అయితే ప్రయోజనకరం.  బొరో కథలోని మిత్రుడు తన భార్యవియోగాన్ని మరిపించే మత్తు కోసం చేపట్టిన వ్యాపకమే ఎటువంటి దుష్ఫలితాలూ లేని మత్తులా పనిచేసి జీవితంలోని నిస్సారాన్ని హరించి అతని మేధోకౌశలాన్ని పరిపుష్టం కూడా చేసింది.   

ఇంకో రకం ఉంది.  ఒకడు జీవితంలో ఉల్లాసం కరవైందని చెప్పి విమానాల పైనెక్కి నిలబడటం, పర్వతాగ్రాలనించి దూకటం వంటి వ్యసనాలు అలవాటు చేసుకున్నాడు.  వీటివల్ల ఎవరికీ ఏ ప్రయోజనమూ లేదు కనక ఇతడూ ఒక జూదగాడు, మందుభాగ్యునితో సమమే. 

పైన చెప్పినట్టు మత్తుకోసమూ మరుపుకోసమూ బలవంతంగా ఎక్కించుకునేవి కాక, సిసలైన అనురక్తీ ఆసక్తులు మానవజాతిని అభివృద్ధి చేసే సహజ సాధనాలు.   

చిన్న పిల్లలు వారు చూచే, వినే, ప్రతి దానిపైనా విశేష ఆసక్తి చూపుతారు; వారికి ప్రపంచమంతా వింతలే; వారు అనుక్షణమూ జ్ఞానార్జనలో నిమగ్నమవుతారు - అది విశ్వవిద్యాలయాల్లో నేర్పేది కాక, చుట్టు ఉన్న ప్రపంచం తో సన్నిహితత్వమూ సమన్వయమూ కలిగి వుండేందుకు అన్ని వస్తువులనూ, అన్ని సంఘటనలనూ అత్యుత్సాహంగా పరిశీలిస్తే వచ్చేది.   

పశువులయితే, పెరిగి పెద్దవయినా, ఆరోగ్యంగా ఉండాలే కాని అన్నిటా ఆసక్తిని నిలుపుకుంటాయి.  ఒక పిల్లి, తాను ఇంతకు ముందు చూడని గదిలో మొదటిసారి ప్రవేశించినప్పుదు ఓసారి అన్ని మూలలనూ అన్వేషిస్తుంది - మూషిక పరిచయం కోసం.  

మామూలు మనిషి, విధివశాన దెబ్బతిన్న పరిస్థితుల్లో తప్ప బయటి ప్రపంచం పట్ల అంతో ఇంతో ఆసక్తి ప్రదర్శిస్తాడు.  ఆ ఆసక్తి ఉన్నంతవరకు జీవితం ఉల్లాసకరమవుతుంది - అతని స్వేఛ్ఛ అతనికుండాలే కాని.  

నాగరిక సమాజంలో జనాలకు ఆసక్తీ అనురక్తీ లేవంటే కారణం వారి స్వేఛ్ఛపై విధించబడ్డ ఆంక్షలే.  

ఒక ఆటవికుడు ఆకలెయ్యగానే వేటకి బయలుదేరుతాడు. ఇది ఒక ప్రేరణననుసరించి పోయే తక్షణ స్పందన. రోజూ వేళకి పనిలోకి పోయేవాడు కూడా, బతుకు తెరువు అనే ప్రేరణననుసరిస్తాడు; కాని ఇతని విషయంలో ఆ ప్రేరణ ప్రత్యక్షమైనదీ, అనుకున్నప్పుడు చేసేదీ కాదు; అది కొన్ని ఇతర కారణాలు, విశ్వాసాలు, నిబంధనలకూ అనుగుణంగా కలిగేది. అతడు పనిలో పోయే సమయానికి ఆటవికునికి వలె ఆకలి లేదు. అప్పుడప్పుడే పలహారం కానిచ్చేడు కనక.  కాని ఆకలి మళ్ళీ వస్తుందని, దాన్ని ఎదుర్కొనేందుకు ఈ సన్నాహమనీ అతడెరుగును.    

ఆకస్మిక ప్రేరణలు నాగరిక సమాజంలో అరుదు; కానీ ఇక్కడ అలవాట్లుంటాయి; అవి నియతంగ పాటించాలి.  

ఆటవికుల్లో అయితే, ఒంటిగానైన గుంపుగానైనా, అది ప్రత్యక్షమూ, ఆకస్మికమూ.  ఒక తెగ డప్పులూ ఢంకాలూ మోగిస్తూ దాడికి బయల్దేరినప్పుడు గుంపు అందరిలోనూ ఆవేశం ఆవహించి అంతకంతకూ పెరుగుతుంది.  అయితే ఆధునిక వ్యాపారవ్యవస్థలు ఇలా పనిచెయ్యలేవు.  ఒక రైలు ఒక సమయానికి బయలుదేరాలంటే కూలీలనీ, గేటు కాపలాదార్లనీ డ్రైవర్లనీ ఇలా డప్పులవీ కొట్టి క్షణాల్లో సన్నద్ధం చెయ్యడం కుదరని పని.  వారందరూ తమకు తాముగా చేసుకున్న అలవాటు ప్రకారం చెయ్యాల్సిన పని అది.  అందుకని వారి ప్రేరణ పరోక్షం.   చెయ్యాల్సిన పని గురించిన ఆకస్మిక ప్రేరణేదీ వారికి లేదు; కాని అందరి వైయక్తిక విధులూ సమన్వయపడి సాధించుకునే ఏకైక లక్ష్యం వారి ముందు ఉంది. ప్రతి సామాజిక వ్యవస్థా ఇంతే.  మనుషులు ఒండొరులతో మాటాడుతారు.  మాటాడాలన్న కోరికతో కాదు సంస్కారమూ సహకారమూ పరస్పర ప్రయోజనానికి పనికొస్తాయనే ఆశతో.

నాగరీకులకి అనుదినమూ తక్షణ స్పందనలు ఎలా నిగ్రహించుకోవాలన్నదే నేర్పబడుతుంది.  లోపల ఆనందం పెల్లుబికితే, గొంతెత్తి పాడటం, గెంతులెయ్యటం, అనాగరికం. విచారంగా ఉండి రహదారి పక్క గెడ్డం కింద చెయ్యి పెట్టుక్కూర్చుంటే వచ్చీపోయేవారికి ఆటంకం.  

వారి స్వేఛ్ఛకి చదువుకున్నప్పుడు బడిలోను, శేషజీవితమంతా పనిలోను, సమాజంలోను అవరోధమూ నియంత్రణా అమలవుతాయి. 

ఆంక్షల నీడన ఆసక్తీ అనురక్తి ఎక్కువసేపు నిలవవు.  నిరంతర నియంత్రణకి  నీరసమూ నిరాశే ఫలితం. 

అయితే నాగరిక సమాజంలో ఆంక్షలు లేకుంటే అది కుక్కలు చింపిన విస్తరే.  ఎందుకంటే తక్షణ స్పందన సాధించేది అధమ, స్వల్ప, తాత్కాలిక ఫలితం.  సామాజిక సహకారంతో సమున్నత లక్ష్యాల సాధనకోసం కొన్ని నిబంధనలూ ఆంక్షలూ అవసరం. 

ఇన్ని పరిమితుల మధ్య తమ ఆసక్తిని అనురక్తిని నిలుపుకోవాలంటే వారికి ఆరోగ్యమూ శక్తీ అవసరం.   ఆరోగ్య భాగ్యశాలులకు ప్రపంచం పట్ల ఆసక్తి అలవోకగా కలుగుతుంది. 

అయితే ఆరోగ్య సూచీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందన్నది వాస్తవం, అది ముదావహం; కానీ మనుషులలో శక్తీ ఆసక్తులు పూర్వతరాల వారికి వలె ఉన్నాయా, అసలవి ఆరోగ్యానికనుగుణంగా పెరుగుతున్నవా లేవా, అన్న సూచీని రూపొందించాల్సి ఉందనిపిస్తుంది. 

ఇక్కడ సమస్య కొంత వరకు సామాజికమూ, ఇంకొంతవరకు వ్యక్తిగతమూ.  కొందరికెన్ని అవాంతరాలూ అవరోధాలు ఆందోళనలూ కలిగినా ఆసక్తిని నిలుపుకుంతారు; అందరూ అలా చెయ్యచ్చు.  తామ శక్తిలో ఎక్కువభాగాన్ని హరించే అంతస్సంఘర్షణని విడిచిపెట్టాల్సుంటుంది - ప్రతిదానికీ బుర్ర పాడుచేసుకోకుండా.  జీవితంపట్ల ఆసక్తి నిలిచేందుకు మనిషికి తాను రోజువారి పనుల్లో వెచ్చించినదనికన్న ఎక్కువ అవసరం.  దీనికోసం వారి మానసిక యత్రాంగం సాఫీగా నడవాలి.  అదెలాగో ఇంకో అధ్యాయంలో వివరిస్తాను.  

స్త్రీలకు విధించిన కట్టుబాట్ల సంగతి చెప్పక్కర్లేదు. గౌరవమూ మర్యాదల ముసుగులో.  స్త్రీ తన ఆనందాన్నీ విషాదాన్నీ పురుషులకన్నా ఎక్కువ కప్పిపుచ్చుకుని కుమిలిపోవాలి.  ఎవరినీ దేనినీ ఆసక్తిగా చూడకూడదనే నియమాలవంటివి వారి ఆసక్తిని అన్నిటా అణిచివేసేయి.   దేనికీ స్పందించినట్టు అనిపించకూడదనే నియమం ఇంచుమించుగా వారికి దేనిపట్లా ఆసక్తి ఉండకూడదనే అర్ధానికి దిగిపోయింది.  ముడుచుక్కూర్చొమ్మని, తలొంచుకు బతకమని బోధించడమంటే వారు నిరాసక్తులై బతుకు వెళ్ళపోయాలి.  స్త్రీలను గౌరవించే సమాజ సాంప్రదాయం కాదు ఇది.    ఈ బంధనాల కారణంగా క్రీడలంటే వారికి ఆసక్తి లేదు; రాజకీయరంగం వర్జనీయం; పురుషులెదురుపడితే తొలగిపోవాలి;   నిరక్షరాస్యులైన మహిళల్లో అయితే ఈ ప్రవర్తనే ప్రశంసించదగ్గదై, వారికి అలా ఉండని స్త్రీలపట్ల ఏహ్యభావమూ కద్దు.    నేనేమిటో, నా ఇల్లేమిటో; నాకెవరి జోలీ అక్కర్లేదు అంటే అది సౌశీల్యానికి పరమావధి.  అయితే అది వారి తప్పు కాదు.  వేల సంవత్సరాలుగా జరిగిన నైతిక బోధ ఫలితం అది.  తమది తప్పని తమ చుట్టూ గిరిగీసిన సమాజానిదే అసలు తప్పని వారు ఇంతవరకు ఊహించలేకపోయేరు.   అదృష్టవశాత్తు ఈ తరహా ఆలోచన, ఆచరణ తగ్గుతూ వస్తున్నాయి స్త్రీ స్వాతంత్య్రోద్యమాల పుణ్యమాని. ఆఖరుగా, జీవితంపట్ల ఆసక్తీ అనురక్తీ స్త్రీపురుషులిద్దరకూ సమానంగానే ఉండాలి.  అలా అంగీకరించేదే సత్సంప్రదాయం.  అదే సమాజ సంతోష సౌభాగ్యాల రహస్యం.  



No comments:

Post a Comment